నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా సాగాలి
● తప్పులకు ఆస్కారం ఇవ్వొద్దు
● అడిషనల్ కలెక్టర్ సుధీర్
పరిగి: మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్ సూచించారు. బుధవారం పరిగి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలన్నారు. అవసరానికి అనుగుణంగా సిబ్బందిని పెంచుకోవాలని సూచించారు. అభ్యర్థులకు కావాల్సిన ధ్రువపత్రాలు అందజేయాలని తెలిపారు. నామినేషన్ పత్రాలను ఆర్‌ఓలు జాగ్రత్తగా పరిశీలించి తిరస్కరణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక వార్డుల్లో పోలీసుల పర్యవేక్షణ ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.


