కంది కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
అనంతగిరి: జిల్లాలో కంది కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ తహిమీనా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాఫెడ్ ఆధ్వర్యంలో ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కొడంగల్, మర్పల్లి, తాండూరు, పరిగి, వికారాబాద్, ధారూర్, పూడూరులోని పీఏసీఎస్, డీసీఎంఎస్‌లలో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్వింటాలుకు రూ.8 వేలు కనీస మద్దతు ధర చెల్లించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దళారులకు కందులు విక్రయించి మోసపోరాదన్నారు.
తాండూరు రూరల్: మండలంలోని కరన్‌కోట్ గ్రామానికి చెందిన నితిన్‌గౌడ్ జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో బంగారం, సిల్వర్ పతకాలు సాధించారు. ఈ నెల 23న నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జాతీయస్థాయిలో పోటీలు నిర్వహించారు. నితిన్‌గౌడ్ సీనియర్ విభాగంలో సిల్వర్, జూనియర్ కేటగిరిలో బంగారం పతకం సాధించారు. వికారాబాద్‌లోని అలీ ఫిట్‌నెస్ జోన్ ట్రైనర్ సద్దాం ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నట్లు నితిన్‌గౌడ్ తెలిపారు. తనను ప్రోత్సహించిన శ్రీనివాస్‌గౌడ్, సచిన్, భరత్, పవన్, సాయిమణికి కృతజ్ఞతలు తెలిపారు.
నేడు, రేపు జాతీయ సదస్సు
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధ, గురువారాల్లో జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రాధిక, సదస్సు కన్వీనర్ రమేశ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వికసిత్ భారత్–2047 డిజిటల్ ఇండియా, పరివర్తన, సాధికారిత వైపు ఒక చొరవ అనే అంశంపై సదస్సు ఉంటుందున్నారు. దేశంలోని వివిధ వర్సిటీల నుంచి నిష్ణాతులైన అధ్యాపకులు, ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు హాజరై పరిశోధన పత్రాలను సమర్పిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డితో పలువురు ప్రముఖులు హాజరవుతున్నట్లు చెప్పారు.
టీఎస్‌డీడీసీఎఫ్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డికి పాడిరైతుల వినతి
కడ్తాల్: పాడి రైతుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని వివిధ గ్రామాల విజయ డెయిరీ సొసైటీ చైర్మన్లు, పాడి రైతులు కోరారు. మంగళవారం వారు హైదరాబాద్‌లోని తెలంగాణ పాడి పారిశ్రామాభివృద్ధి సహకార సమాఖ్య(టీఎస్‌డీడీసీఎఫ్) చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, సంస్థ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్లు మాట్లాడుతూ.. ఎస్‌ఎన్‌ఎఫ్ డిటెక్షన్‌ను తీసివేయాలని కోరారు. పాడిరైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని పాలసేకరణ ధరలను పెంచాలని కోరారు. సకాలంలో పాలబిల్లులు అందించాలని, సబ్సిడీపై దాణ, మినరల్ మిక్చర్ పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్‌గుప్తా, పాడి రైతులు, సొసైటీ చైర్మన్లు కడారి రామకృష్ణ, రంగయ్య, శ్రీకాంత్‌రెడ్డి, నర్సింహారెడ్డి, జితేందర్‌రెడ్డి, కృష్ణయ్య, రంగనాయక్, హరి ప్రవీన్‌యాదవ్, నర్సింలు, దశరథ్, బాలాచారి, దుర్గేశ్, శంకర్‌నాయక్ తదితరులు ఉన్నారు.
కొందుర్గు: గ్రామంలో బెల్ట్‌షాపులు నిర్వహిస్తే సహించేది లేదని కొందుర్గు సర్పంచ్ ప్రభాకర్ హెచ్చరించారు. భగత్‌సింగ్, ఛత్రపతి శివాజీ యువజన సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను విప్పి, పారబోశారు. గ్రామంలో మరోసారి మద్యం విక్రయించినట్లు తెలిస్తే స్థానికులతో కలిసి పోలీసులు, ఎకై ్సజ్ అధికారులకు పట్టించడంతో పాటు కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు.


