రోహిత్‌రెడ్డీ.. డ్రామాలు మానుకో!
తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆరోపణలు రుజువు చేయాలని సవాల్
తాండూరు: రెండేళ్ల తర్వాత తాండూరుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి రాజకీయ డ్రామాలకు తెర లేపారని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో కలిసి నామినేషన్ సెంటర్‌కు వెళ్లారు. 36 మందితో నామినేషన్ వేయించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. తాండూరు మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. రోహిత్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆ పార్టీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక ప్రజలు ప్రశాంత జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి విషయం కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందని, ఈ విషయంలో బీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మానుకోవాలని హితవు పలికారు. 36 వార్డుల్లో 30కి పైగా కై వసం చేసుకుంటామన్నారు. రోహిత్‌రెడ్డికి మతిభ్రమించి మాట్లాడుతున్నాడని ఆరోపించారు. 4వ వార్డుకు చెందిన అంజద్‌ఖాన్‌ను కిడ్నాప్ చేశామనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. తాము రూ.40 లక్షలు ఇచ్చి పార్టీలో చేర్చుకున్నట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆధారాలు ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు.


