పనుల్లో వేగం పెంచండి
ఆ కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలి
● పంచాయతీ, అంగన్‌వాడీ భవనాలను పూర్తి చేయండి
● కలెక్టర్ ప్రతీక్ జైన్
అనంతగిరి: జిల్లాలో పెండింగ్ పనులను సత్వరం పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అన్ని మండలాల ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణ దశలో ఉన్న పంచాయతీ, అంగన్‌వాడీ, మండల సమాఖ్య భవనాలను, పాఠశాలల ప్రహరీ పనుల్లో వేగం పెంచి వెంటనే పూర్తి చేయాలన్నారు. నాణ్యత ఉండాలన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా వసూలైన డబ్బులను దుర్వి నియోగం చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీఆర్‌డీఓ శ్రీనివాస్, పంచాయతీ రాజ్ ఈఈ ఉమేష్ కుమార్, అడిషనల్ డీఆర్‌డీఓ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
ఇష్టంతో చదవాలి
పరిగి: ఇష్టంతో చదివినప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయని కలెక్టర్ ప్రతీక్‌జైన్ విద్యార్థులకు సూచించారు. శనివారం పరిగి పట్టణం తుంకుల్‌గడ్డలోని గిరిజన బాలికల గురుకుల కళాశాలలో మహిళా శిశుసంక్షేమ శాఖ, మహిళా సాధికారత, బేటీ బచావో బేటీ పడావో ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే వివిధ భాషలపై పట్టు సారించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి, ప్రిన్సిపాల్ సుజాత, అధికారులు కాంతారావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్
అనంతగిరి: కొడంగల్ మండలంలో గుర్తించిన 1,204 నిరుపేద కుటుంబాలకు తెలంగాణ సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్.. కలెక్టర్ ప్రతీక్‌జైన్‌ను ఆదేశించారు. శనివారం నగరం నుంచి వికారాబాద్, నారాయణపేట్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొడంగల్ మండలంలో పలువురు పేదలకు నేటికీ ఆధార్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు లేవని వారికి ఆయా పథకాలను అమలు చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. కొడంగల్ మండలంలో ఎంపిక చేసిన 18 గ్రామాల్లోని నిరుపేద కుటుంబాలకు అన్ని పథకాలు అమలయ్యేలా చూస్తామన్నారు. ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీఆర్‌డీఓ శ్రీనివాస్, కో ఆర్డినేటర్ రవి, ఈడీఎం మహమూద్ తదితరులు పాల్గొన్నారు.


