నేడే ఆఖరు..
వ్యూహాలకు పదును
మున్సిపాలిటీలు, పార్టీల వారీగా దాఖలైన నామినేషన్లు (రెండు రోజుల్లో..)
● రెండో రోజు భారీగా దాఖలు
● ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు.. అంతకంటే ఎక్కువ
● పోటాపోటీగా జన సమీకరణ
సాయంత్రంతో ముగియనున్న నామినేషన్ల పర్వం
వికారాబాద్: జిల్లాలోని నాలుగు పురపాలికల్లో రెండో రోజు గురువారం నామినేషన్లు ఊపందుకున్నాయి. ప్రధాన పార్టీలు తమ బలం నిరూపించుకునేందుకు పోటీ పడ్డాయి. నామినేషన్లకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. దీంతో కేంద్రాలు జనంతో కిక్కిరిసి పోతున్నాయి. నేటితో నామినేషన్ల పర్వం ముగియనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ ఇప్పటికే దాఖలు చేశారు. చివరి రోజు శుక్రవారం భారీగా వచ్చే అవకాశం ఉంది. ముందుగా నామినేషన్ పత్రాలకు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించి అధికారులకు అందజేస్తున్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో పోటీ రసవత్తరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. కొందరు పూర్తి స్థాయి నామినేషన్లు వేయగా మరికొందరు డమ్మి సెట్లు వేశారు. పరిగి, తాండూరులో బీఆర్‌ఎస్ చైర్మన్ అభ్యర్థులు ఎవరనే దానిపై స్పష్టత రాగా కొడంగల్, వికారాబాద్‌లో ప్రకటించలేదు. కాంగ్రెస్ తరఫున వికారాబాద్‌లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థి ఎవరనేది తెలిసింది. పరిగి, కొడంగల్, తాండూరులో స్పష్టత రావాల్సి ఉంది. వికారాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున స్పీకర్ ప్రసాద్‌కుమార్ కుమార్తె గడ్డం అనణ్య నామినేషన్ దాఖలు చేశారు. పరిగిలో బీఆర్‌ఎస్ తరఫున పార్టీ సీనియర్ నాయకుడు శివన్నొళ్ల భాస్కర్ సతీమణి చైర్‌పర్సన్ అభ్యర్థిగా రంగంలోకి దింపగా గురువారం నామినేషన్ వేశారు. తాండూరులో బీఆర్‌ఎస్ చైర్మన్ అభ్యర్థిగా మున్సిపల్ మాజీ వైస్ చైర్‌పర్సన భర్త నర్సింహులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
నామినేషన్లు వేసే విషయంలో పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఒక్కో వార్డులో రెండు అంతకంటే ఎక్కువ దాఖలు చేస్తున్నారు. ఒకవేళ అభ్యర్థి వేరే పార్టీల ప్రలోభాలకు లోనైతే మరో వ్యక్తిని పోటీలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు ఏ వార్డూ ఏకగ్రీవం కాకుండా చూసుకుంటున్నారు. వికారాబాద్‌లో మొదటి రోజు 12 నామినేషన్లు దాఖలు కాగా రెండో రోజు 83 వచ్చాయి. పరిగిలో మొదటి రోజు రెండు, రెండో రోజు 41 దాఖలయ్యాయి. తాండూరులో మొదటి రోజు 12, రెండో 97, కొడంగల్‌లో మొదటి రోజు జీరో కాగా రెండో రోజు 20 నామినేషన్లు వచ్చాయి. ఇప్పటి వరకు నాలుగు మున్సిపాలిటీల్లో 100 వార్డులకు 265 నామినేషన్లు వేశారు.
మున్సిపాలిటీ వార్డులు కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ ఎంఐఎం స్వతంత్ర మొత్తం
వికారాబాద్ 34 43 29 15 05 03 95
తాండూరు 36 37 37 18 08 08 108
పరిగి 18 12 18 08 – 05 43
కొడంగల్ 12 04 09 02 02 03 20
మొత్తం 100 96 93 43 15 18 266


