దరఖాస్తు చేసుకోండి
మోమిన్‌పేట: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొంటున్న ఎస్సీ విద్యార్థులు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని మర్పల్లి ఎస్సీ హాస్టల్ వార్డెన్ తుల్జారాం గౌడ్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మోమిన్‌పేట, మర్పల్లి, బంట్వారం, కోట్‌పల్లి మండలాల ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ విద్యార్థులు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మల్లేశం, హెచ్‌ఎం శ్రీనివాస్‌రెడ్డి, మోమిన్‌పేట ఎస్సీ హాస్టల్ వార్టెన్ జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా
ఎస్పీ స్నేహ మెహ్ర
అనంతగిరి: మున్సి పల్ ఎన్నికలు స్వేచ్ఛగా.. నిష్పక్షపాతంగా.. శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని విధాలా కృషి చేస్తోందని ఎస్పీ స్నేహ మెహ్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారం, అవాస్తవాల వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా.. తప్పుడు సమాచారం చేరవేసినా, రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికలు విజయవంతం చేయడంలో ప్రతి పౌరుడి పాత్ర కీలకమన్నారు. యువత, సోషల్ మీడియా గ్రూపుల అడ్మిన్లు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు పోలీసులకు సహకరించాలని కోరారు.
పశువైద్య శిబిరాలను
సద్వినియోగం చేసుకోవాలి
బొంరాస్‌పేట: ఉచిత పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశువైద్యాధికారి సదానందం అన్నారు. శుక్రవారం మండలంలోని దుప్‌చర్లలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువులకు కృత్రిమ గర్భధారణ చేయించడం మేలన్నారు. పశువులకు సోకే వ్యాధులు, మందుల వాడకంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి ప్రమీల, సర్పంచ్ పట్లోళ్ల మల్‌రెడ్డి, ఉపసర్పంచ్ దానని గోపాల్, సూపర్‌వైజర్ కేశవులు, గోపాల మిత్రలు విశ్వనాథం, బాల్‌రాజ్‌గౌడ్, మహేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికలు
ప్రశాంతంగా జరగాలి
పరిగి: మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు రవి సూచించారు. శుక్రవారం పరిగి మున్సిపల్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సాయంత్రం 5గంటల లోపు వచ్చిన అభ్యర్థులకు టోకెన్లు ఇచ్చి నామినేషన్లు స్వీకరించాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వరాదని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సుధీర్, మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, తహసీల్దార్ వెంకటేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తు చేసుకోండి
దరఖాస్తు చేసుకోండి
దరఖాస్తు చేసుకోండి


