ఊపందుకున్న నామినేషన్లు
అనంతగిరి: జిల్లాలోని నాలుగు పురపాలికల్లో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. మొదటి రోజు మొత్తం 25 దాఖలు కాగా గురువారం భారీగా వచ్చాయి. వికారాబాద్ మున్సిపాలిటీ 17వ వార్డుకు స్పీకర్ ప్రసాద్‌కుమార్ కుమార్తె అనన్య కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మాజీ కౌన్సిలర్లు లంకా లక్ష్మికాంత్‌రెడ్డి, కిరణ్ పటేల్, ప్రవళిక, కొండేటి కృష్ణ, శ్రీదేవి సదానంద్‌రెడ్డి, రమేష్‌గౌడ్, నేనావత్ జమునాబాయి, స్వరూప తోపాటు ఆయా పార్టీలకు చెందిన పలువురు నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు నామినేషన్లు వేశారు. నేటితో గడువు ముగియనుండటంతో భారీగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది. వికారాబాద్ నామినేషన్ సెంటర్‌ను అడిషనల్ కలెక్టర్ సుధీర్ సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రం సింహారెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ రఘు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పరిగి మున్సిపాలిటీలో..
పరిగి: పరిగి మున్సిపాలిటీలో రెండో రోజు భారీ నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో రోజు 38 మంది 41 సెట్ల నామినేషన్లు వేశారు. బీఆర్‌ఎస్ నుంచి 18 మంది, కాంగ్రెస్ నుంచి 13 మంది, బీజేపీ నుంచి 8 మంది, స్వతంత్ర అభ్యర్థులు నలుగురు.. మొత్తం 43 మంది నామినేషన్లు వేశారు. ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులతో నామినేషన్ వేయించారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులతో నామినేషన్ వేయించారు.
తాండూరులో భారీగా..
తాండూరు: తాండూరులో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. 36 వార్డులకు గాను 12 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పార్టీలకు చెందిన 108 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మొదటి రోజు 25 దాఖలు కాగా, రెండో రోజు 97 వేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 37 మంది, బీఆర్‌ఎస్ తరఫున 37 మంది, బీజేపీ నుంచి 18 మంది, ఎంఐఎం తరఫున 8 మంది, ఇతర పార్టీలకు చెందిన నలుగురు అభ్యర్థులు, మరో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.
రెండోరోజు తాండూరులో 97,
పరిగిలో 38
చివరి రోజు భారీగా వచ్చే అవకాశం
కేంద్రాల వద్ద నేతల హడావుడి
పరిశీలించిన అధికారులు


