‘వీబీ జీ రామ్ జీ’తో గ్రామ స్వరాజ్యం
తాండూరు రూరల్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టంతో మహాత్మాగాంఽఽధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు మండలం వీర్‌శెట్టిపల్లిలో సర్పంచ్ లక్ష్మి అధ్యక్షతన వీబీ జీ రామ్ జీ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ స్వరాజ్యానికి జీవం పోసే సంస్కరణ, అవినీతికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ కొత్త చట్టం తెచ్చారని తెలిపారు. ప్రజాధనం ప్రజల చేతుల్లోకి చేరేలా చేసే బలమైన మార్గమన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గతంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు బిహార్‌లో రూ.5 వేల కోట్లు, ఉత్తర్‌ప్రదేశ్‌లో రూ.10 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
నిధుల వినియోగంలో సర్పంచులే కీలకం
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఉపాధి హామీ పథకానికి ఆధార్‌తో అనుసంధానం చేసినట్లు తెలిపారు. తద్వారా నకిలీ లబ్ధిదారులకు చెక్ పెట్టామన్నారు. కొత్త చట్టం ద్వారా వంద రోజుల పనిదినాలను 125 రోజులకు పెంచామని పేర్కొన్నారు. గ్రామాల్లో శాశ్వత ఆస్తులు సృష్టించాలనే ఉద్దేశంతోనే ఈ చట్టం తెచ్చామని తెలిపారు. నిధులపై తుది నిర్ణయం ఢిల్లీది కాదని.. క్షేత్రస్థాయిలో ఉండే సర్పంచ్‌లదే అన్నారు. పని చేసిన 15 రోజుల్లో కూలీల ఖాతాల్లో నగదు జమ అవుతుందన్నారు. గతంలో పోలిస్తే ఉపాధి హామీ పథకం కింద రూ.86 వేల కోట్ల నుంచి రూ.లక్ష 51 వేల కోట్ల నిధులు అధికంగా వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.07లక్షలు ఇస్తోందన్నారు. ఈ నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని ఇచ్చి కాంగ్రెస్ కార్యకర్తలకు లబ్ధి చేకూరుస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో రూ.38 వేల కోట్లతో వడ్లను కొనుగోలు చేశామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నారని.. కానీ ఇందులో రూ.34 వేల కోట్లు కేంద్రం ఇచ్చినవేనని గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం ఒక్కో రైతు కుటుంబానికి ఏడాదికి రూ.1.20 లక్షల వరకు లాభం చేకూరుస్తోందన్నారు. 90 శాతం సబ్సిడీతో యూరియా ఇస్తున్నట్లు చెప్పారు. కేంద్రం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం బైక్‌పై పాత తాండూరు – వీర్‌శెట్టిపల్లి రోడ్డును పరిశీలించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఎన్నికల ఇన్‌చార్జ్ బాలేశ్వర్ గుప్తా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేశ్‌కుమార్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, మండల అధ్యక్షుడు విజయ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సంజీవ్‌రెడ్డి, ఉప సర్పంచ్ జర్నప్ప తదితరులు పాల్గొన్నారు.
గాంధీ ఆశయాలను నెరవేరుస్తున్న ప్రధాని మోదీ
సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రానిది
మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి


