స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం
● రన్నింగ్‌లో ఊడిపోయిన స్టీరింగ్ రాడ్డు
● డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ముప్పు
మహేశ్వరం: విద్యార్థులను దింపి, తిరిగి వెళ్తున్న స్కూల్ బస్సు స్టీరింగ్ రాడ్డు ఊడిపోయిన ఘటనలో పెను ప్రమాదమే తప్పింది. ఈ సమయంలో బస్సులో ఇద్దరు విద్యార్థులే ఉండటం, ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటన మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహేశ్వరానికి చెందిన శ్రీచైతన్య స్కూల్ బస్ విద్యార్థులను తీసుకుని బయల్దేరింది. విద్యార్థులను దింపి తిరిగి వస్తున్న క్రమంలో మహేశ్వరం సెంట్రల్‌లో బొడ్రాయి వద్ద స్టీరింగ్ రాడ్డు ఊడిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపేశాడు. ఊరి మధ్యలో ఈ ఘటన జరగడంతో వాహనం నెమ్మదిగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. వారిని పక్కనే ఉన్న ఇళ్లకు పంపించారు. స్కూల్ బస్సులకు సరైన ఫిట్‌నెస్ పరీక్షలు చేయకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


