breaking news
Opinion
-
అధికారం మారితే ప్రమాణం మారేనా?
ఎన్నికల సంఘం సాధారణ ప్రభుత్వ విభాగం కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కింద ఎన్నికల నిర్వహణకు సర్వా ధికారం కలిగిన రాజ్యాంగ సంస్థ. అందువల్ల దాని నిర్ణయాలపై ప్రజలకు విశ్వాసం ఉండటం ప్రజాస్వామ్యానికి అత్యవసరం. ఇటీవల ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు కొన్ని నిర్ణయాలు, విధానాలపై అంతర్గతంగా అభ్యంతరాలు వ్యక్తం చేసి నట్లు వచ్చిన వార్తలను ఈ నేపథ్యంలోనే పరిశీలించాలి. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వెల్లడించిన వివరాల ప్రకారం, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి దాదాపు పది నెలల వ్యవధిలో అనేక సందర్భాల్లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్), ఫారం–6, ఓటర్ల డేటాబేస్ కేంద్రీకరణ, సాంకేతిక వ్యవస్థ, అప్పీళ్ల వంటి అంశాలపై అభ్యంతరాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫారం–6లో సర్‌కు సంబంధించిన ప్రశ్నలను చేర్చడంపై చట్టపరమైన అభ్యంతరాలు వ్యక్తమైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక్కడ అసలు ప్రశ్న భిన్నాభిప్రాయం ఉన్నదా లేదా అన్నది కాదు. ఆ చర్యకు చట్టబద్ధమైన అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? అనేదే.సమస్య ‘మెజారిటీ’ కాదు!ఎన్నికల సంఘం తన చర్యలన్నీ చట్టం, నిబంధనలకు అను గుణంగానే జరిగాయనీ, పది నెలల కాలంలోని కొన్ని అంతర్గత నోట్లను మాత్రమే చూపడం ద్వారా మొత్తం వ్యవహారంలో ఒక భాగాన్ని మాత్రమే చూపుతున్నారనీ చెబుతోంది. అంతర్గత చర్చలో భిన్నాభిప్రాయాలు ఉండటం అసాధారణం కాదు. ఒక కమిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారనే కారణంతో ఆ నిర్ణయం వెంటనే చట్టవిరుద్ధం కాదు. అయితే దీనికి మరో వైపు కూడా ఉంది. ‘తుది నిర్ణయాలు ఏకగ్రీవంగానే జరిగాయి’ అనే ప్రకటన ఒక్కటే, ప్రతి చర్యకు చట్టబద్ధమైన అధికారం ఉందని నిరూపించదు. అందుకే మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు ఎస్.వై. ఖురేషీ, ఓ.పి. రావత్ సూచించినట్లు, ముఖ్యమైన నిర్ణయాలకు సంబంధించిన రికార్డు లను– ఎవరు ఏమి ప్రతిపాదించారు, ఎవరు అభ్యంతరం తెలి పారు, తుది నిర్ణయం ఏమిటి, అది ఏకగ్రీవమా లేక మెజారిటీ తోనా– ప్రజలకు అందు బాటులో ఉంచడం మంచిది. ఇక్కడ ఒక చట్టపరమైన స్పష్టత అవసరం. ప్రతి నిర్ణయం ఏకగ్రీవంగా ఉండాల్సిందేనని చెప్పడం సరైంది కాదు. వర్తించే చట్టపరమైన విధానాన్ని అనుసరించి అవసరమైనప్పుడు మెజా రిటీతో నిర్ణయం తీసుకోవచ్చు. కాబట్టి ప్రశ్న ‘అందరూ అంగీకరించారా?’ అనేది మాత్రమే కాదు; ‘చట్టబద్ధమైన విధానాన్ని అనుస రించి నిర్ణయం తీసుకున్నారా?’ అనేదే.ఇంకా తీవ్రమైన ప్రశ్న ఓటర్ల డేటాబేస్ కేంద్రీకరణకు సంబంధించినది. ఎన్నికల నమోదు అధికారులకు చట్టం ఇచ్చిన అధికా రాలను ఏదైనా కేంద్ర సాంకేతిక వ్యవస్థ అధిగమిస్తే, అది కేవలం సాంకేతిక సమస్య కాదు; అది చట్టపరమైన సమస్య. సాఫ్ట్‌వేర్‌కు స్వయంగా చట్టబద్ధమైన అధికారం ఉండదు. అది చట్టబద్ధమైన అధికారికి సహాయపడాలి కానీ అతని స్థానాన్ని ఆక్రమించకూడదు. అందువల్ల ఓటర్ల డేటాబేస్‌పై స్వతంత్ర సాంకేతిక ఆడిట్ అవసరం. ఎవరు డేటాను మార్చగలరు? ఏ అధికారి ఆదేశంతో మార్పు జరుగుతుంది? స్థానిక ఎన్నికల నమోదు అధికారి నిర్ణయాన్ని కేంద్ర వ్యవస్థ మార్చగలదా? ప్రతి మార్పుకు డిజిటల్ రికార్డు ఉందా? వంటి ప్రశ్నలకు సమాధానాలు రావాలి.నిష్పాక్షికంగా ఉండటమే కాదు, కనిపించాలి!పశ్చిమ బెంగాల్లో తొలగించిన ఓటర్లకు సంబంధించిన భారీ సంఖ్యలో అప్పీళ్ల విషయంలో కూడా ఇదే పారదర్శకత అవసరం. ఎన్నికల సంఘం తరఫున అప్పీళ్లు దాఖలు చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? ఏ చట్టం కింద ఇచ్చారు? ఆ నిర్ణయాన్ని ఎవరు అమలు చేశారు? అన్నది రికార్డులతో స్పష్టమవ్వాలి. ఈ వివాదానికి మరో రాజ్యాంగపరమైన నేపథ్యం ఉంది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 చట్టం– ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ప్రధానమంత్రి నియమించే కేంద్ర కేబినెట్ మంత్రిని ఉంచింది. ఇటీవల జస్టిస్ దీపాంకర్ దత్తా ఈ మార్పు కేంద్ర ప్రభుత్వానికి ప్రభావవంతమైన వీటో లభించే పరిస్థితిని సృష్టిస్తుందనీ, ఇది ‘పర్సెప్షన్ టెస్ట్’ పరంగా ప్రశ్నలు లేవ నెత్తుతుందనీ వ్యాఖ్యానించారు. ప్రజల దృష్టిలో ఎన్నికల సంఘం స్వతంత్రంగా కనిపించాల్సిన అవసరాన్ని ఈ వ్యాఖ్య స్పష్టం చేస్తుంది. ఇక్కడే నవీన్ చావ్లా వ్యవహారం గుర్తుకు వస్తుంది.కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు, 2006లో ఎన్డీఏ 205 మంది ఎంపీల సంతకాలతో రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌కు వినతిపత్రం సమర్పించి, ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లాను తొలగించాలని కోరింది. ఆయనకు కాంగ్రెస్ నాయకులతో రాజకీయ, వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయనీ, అవి ఎన్నికల కమిష నర్ నిష్పాక్షికతపై సందేహాలు కలిగిస్తున్నాయనీ ఎన్ డీఏ ఆరోపించింది. ఆ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఆ సమయంలో బీజేపీ ముందుకు తెచ్చిన ప్రధాన సూత్రం– ఎన్నికల కమిషనర్ నిష్పాక్షికంగా ఉండటమే కాకుండా, ఉన్నట్టు కనిపించాలి కూడా.అధికారంలోనూ, ప్రతిపక్షంలోనూ2006 పరిస్థితిని 2026 పరిస్థితితో పూర్తిగా సమానం చేయడం సరైంది కాదు. అప్పటి ఆరోపణలు ఒక కమిషనర్ రాజకీయ సంబంధాలపై ఉండగా, ఇప్పుడు ఎన్నికల నిర్వహణ విధానాలు, ఫారాలు, డేటాబేస్, అంతర్గత నిర్ణయ ప్రక్రియపై కమిషనర్ల అభ్యంతరాలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ రాజ్యాంగ సూత్రం మాత్రం ఒకటే– ఎన్నికల సంఘంపై ప్రజలకు విశ్వాసం ఉండాలి. 2006లో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రపతి, పార్లమెంటు, న్యాయస్థానం వంటి సంస్థాగత మార్గాలను ఉపయోగించింది. నేడు ప్రతిపక్ష పార్టీలూ అదేస్థాయి ఆధారాలతో ముందుకు రావాలనుకుంటే, కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా అధికారిక రికార్డులు కోరాలి, నిర్దిష్ట చర్యలను న్యాయపరంగా సవాలు చేయాలి, అవసరమైతే స్వతంత్ర ఆడిట్ కోరాలి.మరి బీజేపీ ఏం చేయాలి? 2006లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోరిన అదే ప్రమాణాన్ని ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా పాటించాలి. ఎన్నికల సంఘంపై వచ్చిన ఆరోపణలను రాజకీయ దాడిగా కొట్టిపారేయకుండా రికార్డులను బహిర్గతం చేయాలి. చట్టబద్ధమైన అధికారం లేకుండా ఏదైనా చర్య జరిగినట్లు నిర్ధారణ అయితే దానిని సరిచేయాలి. ఓటర్ల హక్కులకు నష్టం జరిగితే పరిహార మార్గం కల్పించాలి. తప్పు చేసిన వ్యక్తి ఎవరు అనేకంటే, తప్పు ఎలా జరిగింది, దాన్ని ఎలా నిరోధించాలి అన్నది చూడాలి. ఇది బీజేపీకే కాదు, కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలకూ వర్తించే ప్రమాణం కావాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ప్రమాణం, అధికా రంలో ఉన్నప్పుడు మరో ప్రమాణం ప్రజాస్వామ్య సంస్థలకు ప్రమాదకరం. ఎన్నికల సంఘం బీజేపీ వైపుందా, కాంగ్రెస్ వైపుందా అనేది ప్రశ్న కాదు. ఎన్నికల సంఘం రాజ్యాంగం వైపు ఉందని ప్రజ లకు స్పష్టంగా కనిపించేలా పనిచేస్తున్నదా? అదే అసలు పరీక్ష. గెలిచినవారికీ, ఓడిపోయినవారికీ ఎన్నికల ఫలితాన్ని అంగీకరించేంత విశ్వాసం కలిగించగలిగితేనే ఎన్నికల సంఘం తన రాజ్యాంగ బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తించినట్లవుతుంది.ఆచార్య మాడభూషి శ్రీధర్వ్యాసకర్త కేంద్ర సమాచార సంఘం మాజీ కమిషనర్ -
సోషల్ మీడియా 'సొంత డబ్బా' కోసమేనా?
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ‘సోషల్ మీడియా వార్’కు తెర లేపింది. నిజానికి మీడియాను వాడుకోవడంలో ఆయనను మించిన రాజకీయ నాయకుడు భారత దేశంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో... సోషల్ మీడియాను ప్రభుత్వ పథకాల ప్రచారానికి వాడుకోవాలని బాబు ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలించాల్సి ఉంటుంది! ప్రభుత్వాలు తమ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రచార సాధనాలను ఉపయోగించు కోవడం కొత్తేమీ కాదు. అయితే సోషల్ మీడియా యుగంలో ఆ ప్రచారానికి కొత్త రూపం వచ్చింది. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి వేదికల ద్వారా ప్రజలను చేరుకోగలిగేఇన్ ఫ్లుయెన్సర్లను అధికారికంగా ఎంప్యానెల్ చేసి, వారికి పారితో షికం చెల్లించే విధానాన్ని ప్రభుత్వం తాజాగా కేబినెట్ ఆమోదంతో ముందుకు తీసుకువచ్చింది.ప్రభుత్వ వివరణ ప్రకారం సంక్షేమ పథకాలు, మౌలిక వస తులు, అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే దీని ఉద్దేశం. యువత ఎక్కువగా ఉపయోగించే డిజిటల్ వేదికల ద్వారా ప్రభుత్వ సేవలు, పథకాల సమాచారం ప్రజలకు చేరడం ప్రయోజనకరమే కావచ్చు. కానీ ప్రజాధనంతో ఏర్పడే ఏ ప్రచార వ్యవస్థకైనా పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరి. ఎందుకంటే ఇక్కడే ఒక సున్నితమైన రేఖ ఉంది. అది ప్రభుత్వ సమాచార ప్రచారానికి– అధికార పార్టీ రాజకీయ ప్రచారానికీ మధ్య రేఖ. ఆ రేఖ చెరిగిపోకుండా చూడటం ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత. ప్రచార మాధ్యమం రాజకీయ పరిణామాలను ప్రభావితం చేయగల మహత్తర శక్తి.పారదర్శకత ముఖ్యంఒక యూట్యూబ్ వీడియో, ఒక రీల్, ఒక వైరల్ పోస్టు కొన్ని గంటల్లోనే లక్షల మందిని చేరగలదు. అందుకే నేటి రాజకీయ ప్రచా రంలో సోషల్ మీడియా అత్యంత ప్రభావశీలమైన సాధనాల్లో ఒకటిగా మారింది. అందుకే పారదర్శకంగా ప్రభుత్వం ఇన్‌ఫ్లుయెన్స ర్లను అధికారికంగా ఎంప్యానెల్ చేయాలి. ఎవరెవరిని ఎంపిక చేశారు? ఎంతమంది ఉన్నారు? వారి ఛానళ్లు, ఫాలోవర్ల సంఖ్య ఎంత? ఏ కేటగిరీలో ఎంపిక చేశారు? ఎంత పారితోషికం నిర్ణయించారు? ఏ ప్రభుత్వ కార్యక్రమం కోసం ఎంత చెల్లించారు?– ఈ వివరాలన్నీ ప్రజల ముందుంచాలి. ప్రభుత్వం ఒక పబ్లిక్ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ రిజిస్ట్రీ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అది ముఖ్యమంత్రి వ్యక్తిగత డబ్బు కాదు, ఆయన డబ్బా కొట్టడానికి... అది ప్రజల డబ్బు. ప్రజల కోసమే వెచ్చించాలి. ప్రస్తుతం ప్రకటించిన విధానంలో ఫాలోవర్ల స్థాయిని బట్టి వేర్వేరు కేటగిరీలకు చెల్లింపులు నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది.ప్రచారంలో పారదర్శకత ముఖ్యం. ప్రజలు, జర్నలిస్టులు, ప్రతి పక్షాలు, పౌరసమాజం ఆ వ్యవస్థను పరిశీలించాలి. ప్రభుత్వ పథ కాల ప్రచారం ఎక్కడితో ముగుస్తోంది? రాజకీయ ప్రచారం ఎక్కడ మొదలవుతోంది? అన్నది ప్రశ్నించగలగాలి. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు దీనిని ఒక అధికారిక విధానంగా, ఎంప్యానెల్మెంట్, చెల్లింపుల వ్యవస్థతో ముందుకు తీసుకురావడం వల్ల పారదర్శకతపై చర్చ మరింత అవసరమైంది. ప్రభుత్వానికి ప్రచారం అవసరం. ప్రజలకు సమాచారం అవసరం. కానీ ప్రజాస్వామ్యానికి అంతకంటే ఎక్కువగా పారదర్శ కత అవసరం. సోషల్ మీడియా నేటి రాజకీయ బ్రహ్మాస్త్రమైతే, దాన్ని ప్రయోగించే వ్యవస్థకు ప్రజాస్వామ్య నియంత్రణ కూడా ఉండాలి. అందుకే ప్రశ్న ఒక్కటే... ఇన్ ఫ్లుయెన్సర్లను ఎవరు ప్రభావితం చేస్తున్నారు? ఇన్ ఫ్లుయెన్సర్లకే ‘ఇన్ ఫ్లుయెన్సర్’ ఎవరు?– వీరేంద్ర కాపర్తి ‘ సీనియర్ జర్నలిస్ట్ -
ప్రశాంతయానానికి మరో పొడిగింపు
అమెరికా, చైనాల దీర్ఘకాలిక ప్రత్యర్థిత్వం ఎట్లున్నా, ప్రస్తుతానికి నదిని ప్రశాంతంగా ఉంచి అందులో పడవ ప్రయాణం ప్రశాంతంగా సాగించాలన్నది ఇరువురి వ్యూహం. రెండు దేశాల అధ్యక్షులు గత మే నెలలో బీజింగ్‌లో సమావేశమై నప్పుడు చూపిన ఈ వైఖరులే గత వారాంతంలో వాషింగ్టన్లో కూడా కనిపించాయి. సారాంశంలో అంతకుమించిన కొత్తదన మేమీ లేదు. దాని అర్థం ఈ రెండు శిఖరాగ్ర సమావేశాలు నిష్ఫలమైనవని కాదు. వాటికి అనేక ఫలితాలు వర్తమానంలో ఉండటమే కాదు. భవిష్యత్తులోనూ ఉంటాయి.పోరు నష్టం పొందు లాభంఇటువంటి దృక్పథానికి చొరవ తీసుకుని అమెరికా అధ్యక్షునికి ప్రతిపాదిస్తున్నది చైనా అధ్యక్షుడు కాగా, అందుకు ట్రంప్ బీజింగ్‌లో అర్ధాంగీకారం తెలిపి ఇపుడు వాషింగ్టన్ చర్చలలో పూర్తిగా సమ్మతించినట్లు కనిపిస్తున్నది. ఆ మేరకు పత్రాలు అయితే ఏమీ రాసుకోలేదు గానీ, ఇరువురి వ్యాఖ్యలను పరిశీలించినపుడు అందులో సందేహ మేమీ తోచటం లేదు. మనం సహకరించుకుంటే ఇద్దరమూ లాభ పడతామని జిన్‌పింగ్ గత మే నెలలో వలెనే ఈసారి కూడా సూచించారు. ఘర్షణ పడితే ఉభయులమూ నష్టపోగలమని హెచ్చరించారు. అందుకు ట్రంప్ స్పందన గమనించదగ్గది. చారిత్రకంగా అమెరికా, చైనాలు రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రత్యర్థులను ఓడించాయనీ, అదే విధమైన పరస్పర సహకారంతో ముందుకు సాగి అభివృద్ధి సాధించగలమనీ అన్నారాయన. రెండు దేశాలు కూడా ఆ విధంగా తమ ప్రజల మేలుకు, ప్రపంచం బాగుకు కృషి చేయ వచ్చునని ఇరువురూ అభిప్రాయపడ్డారు.ఇవి సంబంధాలను స్థూలంగా నిర్దేశించే మౌలిక వైఖరులు. తక్కిన పలు విధాలైన మాటలన్నీ ఈ పరిధిలోకి ఒదిగిపోయేవే. ఉదాహరణకు, మనం అభివృద్ధిలో పోటీదార్లమే గానీ శత్రువులం కాము, మన మధ్య నిర్మాణాత్మకమైన, వ్యూహాత్మకమైన సుస్థిరత అవసరం. లేనట్లయితే విస్ఫోటనాత్మకమైన ఘర్షణ తలెత్తుతుంది వంటివి. అయితే, ఇటువంటి సామరస్యతను చూపుతూనే చైనా అధ్యక్షుడు, ఆయన సీనియర్ అధికారులు అమెరికాకు కొన్ని హెచ్చరికలను సూటిగా చేశారు. గతం నుంచి చేస్తూ వచ్చినవే ఇపుడు మరొకసారి చేశారు. వాటిని వారు ‘రెడ్ లైన్స్’ అంటున్నారు. రెడ్ లైన్స్వాటిలో అన్నింటికన్న మొదటిది తైవాన్. ఆ విషయంలో తేడాలు వస్తే అమెరికాతో ‘ఏ యుద్ధానికైనా సిద్ధ’మని జిన్‌పింగ్ గత బీజింగ్ సమావేశంలోనే ట్రంప్‌కు స్పష్టం చేయటం తెలిసిందే. అందువల్లనే ట్రంప్ స్వదేశానికి తిరిగి వెళుతూ, తాము అమెరికా నుంచి 9,500 మైళ్లు ప్రయాణించి చైనాతో యుద్ధం చేయలేమ న్నారు. తైవాన్‌కు 14 బిలియన్ డాలర్ల ఆయుధాల విక్రయాన్ని రద్దు చేయలేదు గానీ నిరవధికంగా నిలిపి వేశారు. తైవాన్ స్వాతంత్య్రాన్ని బలపరచబోమని మరొకమారు సూచించారు. అయితే వాషింగ్టన్ శిఖరాగ్రంలో చైనా అధ్యక్షుడు కోరింది, స్వాతంత్య్రాన్ని కేవలం బలపరచకపోవటం కాదు వ్యతిరేకించాలని. ఆయుధ విక్రయాలను రద్దు చేయాలని. ఇందుకు ట్రంప్ స్పందన తెలియదుగానీ, చైనాతో బేరసారాలకు ఇదొక కార్డుగా ఉపయోగపడుతుందన్నారు.ఇరువురు నేతల మధ్య వాషింగ్టన్లో గత మే నెల కన్నాభిన్నంగా చర్చకు వచ్చిన అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఒక్కటే. ఈ విషయమై రెండు దేశాల వైఖరులు పూర్తి భిన్నంగా ఉన్నట్లు ముందునుంచే స్పష్టమైంది. ఇపుడు ఏకాభిప్రాయం రాగలదని ఎవరూ ఆశించలేదు. రాలేదు కూడా. రాగల కాలంలో ఏఐ వల్ల అనూహ్యమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, కనుక అందులో పైచేయి సాధించాలి తప్ప ఎటువంటి నియంత్రణలకు అంగీకరించరాదన్నది ట్రంప్ ప్రభుత్వ విధానం. నియంత్రణలు లేని ఏఐ వల్ల పొంచి ఉన్న ప్రమాదాలు కూడా అనూహ్యమైనవేనని సాక్షాత్తూ అమెరికన్ నిపుణులు, ఏఐ సంస్థలు హెచ్చరిస్తున్నా, ఆధిపత్య అన్వేషణలో మంచి చెడులను ఆలోచించని ఆయన దేనినీ లెక్క చేయటం లేదు. ఏఐ అభివృద్ధిలో చైనాతో ఏర్పడిన గట్టి పోటీ అందుకు తోడవుతున్నది. ఏఐతో అందరం లాభపడాలని, అదే సమ యంలో నష్టాల నివారణకు ఉమ్మడి నియంత్రణలు అవసరమన్న చైనా అధ్యక్షుని ప్రతిపాదనను ట్రంప్ ప్రస్తుత చర్చలలో అంగీకరించక పోవటానికి కారణం కూడా అదే. వైట్ హౌస్ విందుకు హాజరైన టెక్ దిగ్గజాలు రాగల రోజులలో తీసుకోగల వైఖరి ఏమిటన్నది ప్రపంచం తగినంత ఆందోళనతోనే ఎదురుచూస్తుందనాలి.జీ–2ఇతర విషయాలకు వస్తే, రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధ మంటున్న దానికి బీజింగ్‌లో కుదిరిన యుద్ధ విరామం ఈ నవంబర్‌లో ముగియనుండగా దానిని మరో నెలలు జనవరి వరకు పొడి గించుకున్నారు. ఇందులో పెద్ద విశేషం లేదు. అమెరికా తీవ్రమైన వాణిజ్య లోటులో ఉన్నందున దానిని భర్తీ చేసుకునేందుకని చెప్తూ, చైనా సహా అన్ని దేశాలపై యథేచ్ఛగా సుంకాల పెంపు, అందుకు ఎదురు వ్యూహంగా చైనా ప్రభుత్వం తన సుంకాలు పెంచటం, అమెరికా నుంచి కొనుగోళ్లు తగ్గించటం, ముఖ్యంగా అతి కీలకమైన ఖనిజాల ఎగుమతిని నియంత్రించటం వంటి చర్యలు తెలిసినవే. చర్చల ద్వారా ఇందులో చేసుకుంటూ వస్తున్న సర్దుబాట్లను ఇపుడు రెండు నెలలు పొడిగించుకున్నారు. అంతకన్న గత్యంతరం లేదు కూడా. తమ ప్రయోజనాల కోసం ఇతర దేశాలను చతురోపాయాల ద్వారా లొంగదీసుకునే కాలం అమెరికా సహా పాశ్చాత్య కూటమికంతా మెల్లగా గతించిపోతున్నది. చైనా వంటి ‘సమ ఉజ్జీ’ (ఇది పాశ్చాత్యుల పద ప్రయోగమే)తోనైతే వీలు పడేదే కాదు. చివరిగా రెండు ముఖ్య విషయాలు చెప్పుకోవాలి. ఒకటి, ఈ విధమైన ప్రశాంత ప్రయాణం అమెరికా కన్న చైనాకు ఎక్కువ అవ సరం. పాశ్చాత్య దేశాలకు ఆధిపత్య సాధనలు, యుద్ధాలు, నష్టాలు, తిరిగి కోలుకోవటాలు చరిత్ర పొడవునా ఉన్నవే. అదే క్రమంలో వారు వర్తమానంలోనూ యుద్ధాలు సాగిస్తున్నారు. మునుముందు కూడా చేస్తారు. అందుకు చైనా, రష్యాలు మినహాయింపు కాగలవని ఎవరూ శిలాక్షరాలు రాయలేరు. చైనా పరిస్థితి అది కాదు. నల్ల మందు యుద్ధాల (1839) కాలం నుంచి విప్లవం (1949) వరకు వందేళ్లపాటు విదేశీ ఆక్రమణలకు, తీవ్ర నష్టాలకు గురైనందున ఇక మీదట అటువంటి పరిస్థితులు ఎదురు కాకుండా కేవలం అభివృద్ధి పైన దృష్టిని కేంద్రీకరించాలన్నది వారి ఆలోచన. అందుకోసం అమె రికా అనే గాక సాధారణ రూపంలోనే ప్రశాంతమైన నది, ప్రశాంత మైన పడవ ప్రయాణం వారి ప్రణాళిక. ఇది ఒక విషయం కాగా రెండవది, అమెరికా చైనాల శాంతియుత సహజీవన ప్రభావాలు వారిద్దరిపైనే గాక ప్రపంచ వ్యాప్తంగా, ఆసియా, పసిఫిక్ సహా అనేక ప్రాంతాలపై గణనీయంగా ఉండనున్నాయి. ఆ విధంగా వారి సంబంధం అధికారికంగా జీ–2గా మారకపోయినా, అనధికారికంగా అదే పాత్ర నిర్వహిస్తుంది.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
కోతులకంటే 'మనిషి ఎందుకు భిన్నం?'
ముందుగా, ఈ రోజు పట్టభద్రులవుతున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు. 1900లో క్యోటో యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు 2,31,573 మంది విద్యార్థులు ఇక్కడి నుంచి డిగ్రీ పట్టాలు పొందారు. మీరు ఈ స్థాయికి చేరుకోవడం వెనుక మీ కృషి మాత్రమే కాదు– మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహి తులు, మీకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరి ప్రేమ, ప్రోత్సాహం ఉన్నాయి. మీ విజయాన్ని చూసి వారంతా ఎంత గర్వపడుతున్నారో నేను ఊహించగలను. వారందరికీ కూడా నా కృతజ్ఞతలు, అభినందనలు. ముఖాముఖి సంభాషణ విలువమనమంతా ఇప్పుడు ఒక సమాచార సమాజంలో జీవిస్తున్నాం. మీరు విశ్వవిద్యాలయంలో చేరడానికి ముందు కోవిడ్ మహమ్మారి వచ్చింది. ఆ సమయంలో తరగతులు ఆన్లైన్లో జరిగాయి. స్నేహితులతో ముచ్చట్లు కూడా ఆన్లైన్లోనే. ఆ అనుభవం తర్వాత ప్రత్యక్షంగా మాట్లాడటంలోని విలువ మీకు మరింత అర్థమై ఉండవచ్చు. ముఖాముఖి మాట్లాడుతున్నప్పుడు మాటలను మాత్రమే వినం. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశీలిస్తాం. ఎదుటివారి ముఖాన్ని చూస్తాం. వారి గొంతులోని మార్పును గమనిస్తాం. వారి కళ్లను, హావభావాలను చూస్తాం. పంచేంద్రియాల ద్వారా ఎన్నో విషయాలను తెలియకుండానే గ్రహిస్తాం. ఆ అనుభూతులన్నీ కలిస్తేనే నిజమైన మానవ సంభా షణ అవుతుంది. చెప్పని భావాలను సైతం గుర్తించడం, ఎదుటి వారిని గౌరవించడం ప్రత్యక్ష సంభాషణ ద్వారానే సాధ్యం. డచ్ చరిత్రకారుడు రట్గర్ బ్రెగ్మన్ తన హ్యూమన్ కైండ్: ఎ హోప్‌ఫుల్ హిస్టరీ పుస్తకంలో ‘మనిషిని మనిషిగా మార్చేది ఏమిటి?’ అనే ప్రశ్నకు సంబంధించి ఆసక్తికరమైన పరిశోధనలను ప్రస్తావించారు. జర్మనీకి చెందిన పరిశోధకులు చిన్న పిల్లలు, ఒరాంగుటాన్లు, చింపాంజీలపై కొన్ని ప్రయోగాలు చేశారు. స్థలాన్ని గుర్తించే సామర్థ్యం, సంఖ్యలను అర్థం చేసుకోవడం వంటి విషయాలను పరీక్షించారు. మూడు గుంపులూ దాదాపు సమానమైన సామర్థ్యాన్ని చూపించాయి. జ్ఞాపకశక్తి, సమాచారాన్ని అర్థం చేసుకోవడం వంటి విషయాల్లో మనుషులకు, కోతులకు పెద్దగా తేడా కనిపించలేదు. కానీ ఇతరుల నుంచి నేర్చుకోవడం అనే అంశంపై నిర్వహించిన పరీక్షలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కోతులు సున్నా స్థాయి ఫలితాలు సాధించాయి. చిన్న పిల్లల్లో చాలామంది పూర్తి మార్కులు సాధించారు. ఇక్కడ ఇతరుల నుంచి నేర్చుకోవడం అంటే... ఇతరులను గమనించడం, వారి ప్రవర్తనను అర్థం చేసుకోవడం, వారితో సంబంధం ఏర్పరచుకోవడం, వారి అనుభవం నుంచి నేర్చుకోవడం. ఇదే మనిషి ప్రత్యేకతని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయి. మనిషి గొప్పతనం కేవలం అతని మెదడులోనే లేదు, ఇతర మనుషు లతో కలిసి జీవించే సామర్థ్యంలో కూడా ఉంది.ముఖం ఎందుకు ఎర్రబడుతుంది?మనిషి సిగ్గుపడినప్పుడు ముఖం ఎర్రబడుతుంది. ఇలా జరిగే జీవి మనిషి మాత్రమే. జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చార్లెస్ డార్విన్... ముఖం ఎర్రబడటాన్ని చాలా ప్రత్యేకమైన మానవ లక్షణంగా పేర్కొన్నారు. మనం ఎందుకు సిగ్గుపడతాం? ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని మనం ఎక్కువగా పట్టించుకుంటాం. ఎదుటివారి అభిప్రాయం మనకు చాలా ముఖ్యం. ముఖం ఎర్రబడటం ఒక రకమైన సామాజిక భావ వ్యక్తీకరణ. మనిషి ఒంటరి జీవి కాదు. మనకు ఇతరులు కావాలి. వారి నమ్మకం, సహకారం అవసరం. వారితో సంబంధాలు ముఖ్యం. మనిషి శరీరంలో మరో ఆసక్తికరమైన లక్షణం కళ్లలోని తెల్లటి భాగం. మన కంటి మధ్యలో కనుపాప ఉంటుంది. ఈ తెల్లటి భాగం స్పష్టంగా కనిపిస్తుంది. మనం కళ్లను కొద్దిగా కదిపినా, మనం ఎటువైపు చూస్తున్నామో ఎదుటివారికి అర్థమవుతుంది. మీరు ఎవరితో నైనా మాట్లాడుతున్నప్పుడు... వారు మీ వైపు చూస్తున్నారా లేదా అనేది వెంటనే గుర్తించ గలరు. అందుకే ‘కళ్లు నోటి కంటే ఎక్కువగా మాట్లాడతాయి’ అంటారు. మాటలతో చెప్పలేని భావా లను కూడా కళ్ల ద్వారా పలికించవచ్చు. దాదాపు 200లకు పైగా క్షీరద జాతులుండగా, మనిషికి మాత్రమే ఈ స్పష్టమైన ‘కంటి తెలుపు’ ప్రత్యేకత ఉంది. టొరంటో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా ఉన్న చరిత్ర కారుడు టిమోతీ స్నైడర్ నేటి ఇంటర్నెట్ యువతకు ఒక సలహా ఇస్తున్నారు. ‘కళ్లలోకి చూడండి, తక్కువగా మాట్లాడండి’ అంటు న్నారు. ‘కంప్యూటర్ మన కళ్లలోకి చూసి మన భావాలను అర్థం చేసుకోలేదు. కానీ మనిషి మాత్రం చూపును పట్టించుకోకుండా ఉండలేడు. మీరు ఇప్పుడు విశ్వవిద్యాలయం అనే చిన్న ప్రపంచం నుంచి బయటకు వచ్చి పెద్ద సమాజంలోకి అడుగుపెట్టబోతున్నారు. అక్కడ మీ అభిప్రాయాలకు పూర్తిగా భిన్నమైన అభిప్రా యాలు ఉన్నవారిని కలుస్తారు. మీతో ఏకీభవించని వ్యక్తులతో మాట్లాడాల్సి వస్తుంది. అలాంటి సమయంలో వారి కళ్లలోకి చూస్తూ, ప్రశాంతంగా మాట్లాడగలగడం ఎంతో ముఖ్యం. కొత్త ఆలోచనలకు తలుపులు తెరవండి!నాలుగు సంవత్సరాల క్రితం, మీరు క్యోటో విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టినప్పుడు, ‘మిమ్మల్ని మీరు తెలుసుకునే’ ఒక పెద్ద ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారని చెప్పాను. ఈ నాలు గేళ్లలో మీరు ఎంతోమంది కొత్త వ్యక్తులను కలుసుకున్నారు. కొత్త స్నేహితులను సంపాదించారు. మీ మనసును మార్చిన పుస్తకాలను చదివారు. మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటనలను అనుభవించారు. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఈ పరిచయాలన్నీ మీ గురించి మీకు ఏదైనా కొత్త విషయం నేర్పించాయా? అమెరికాలో విశ్వవిద్యాలయాల గ్రాడ్యుయేషన్ కార్యక్రమా లను ‘కమెన్స్మెంట్’ అంటారు. ఆ పదానికి అసలు అర్థం ‘ప్రారంభం’. గ్రాడ్యుయేషన్ డే అంటే చదువు ముగిసిన రోజు మాత్రమే కాదు, అది జీవితంలోని కొత్త ప్రయాణానికి తొలి రోజు కూడా. ఈ రోజు మీరు ఒక దశను పూర్తి చేసుకున్నారు, అదే సమయంలో మరో దశను ప్రారంభించనున్నారు. మీ గురించి మీరు తెలుసుకునే ప్రయాణం కూడా ఇక్కడితో ముగియదు. అది జీవితాంతం కొనసాగుతుంది. కాబట్టి కొత్త పరిచయాలకు మీ మనసును ఎల్లప్పుడూ తెరిచి ఉంచండి. కొత్త అనుభవాలను స్వీకరించడానికి వెనుకాడకండి. మనలో దాగి ఉన్న ప్రతిభను మనం గుర్తించలేకపోవచ్చు. కానీ ఒక కొత్త వ్యక్తి, ఒక కొత్త పుస్తకం, ఒక కొత్త ప్రయాణం లేదా ఒక అనుకోని సంఘటన మనలోని ఆ సామర్థ్యాన్ని బయటకు తీసుకురావచ్చు. అలా మళ్లీ మళ్లీ మనల్ని మనం తెలుసుకుంటాం. మన జీవితానికి మనమే కొత్త అర్థాన్ని ఇస్తాం. అలా అనుకోకుండా వరించిన అదృష్టాన్ని ‘సెరెండిపిటీ’ అంటారు. అయితే అలాంటి అవకాశాలను గుర్తించడానికి మన మనసు సిద్ధంగా ఉండాలి. మనసు తలుపులు మూసేసి ఉంటే, మన ముందున్న మంచి అవకాశాన్ని కూడా మనం గుర్తించలేము. కాబట్టి మీ హృదయాన్ని, మీ మనసును కొత్త అనుభవాలకు ఎప్పుడూ తెరిచి ఉంచండి. మీ జీవిత రహదారిలో వచ్చే ప్రతి మలుపును భయపడకుండా స్వీకరించండి. -
జ్ఞానేశ్ కుమార్ (చీఫ్ ఎలక్షన్ కమిషనర్) రాయని డైరీ
టీ కప్పులోని తుఫాన్‌ను తీరం దాటించేందుకు ‘కశ్మీర్ కావా’ టీ అమోఘంగా పని చేస్తుంది. ఆ సువాసన మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. అది తుఫాను ముందరి ప్రశాంతత కాదు, తుఫాను తర్వాతి ప్రశాంతతా కాదు. సరిగ్గా తుఫాను మధ్యలోని ప్రశాంతత. ‘కశ్మీర్ కావా’ మహత్తును నేను 2019లో ఆర్టికల్ 370 రద్దుకు నార్త్ బ్లాక్‌లో నా టీమ్‌తో కలిసి సుదీర్ఘమైన లీగల్ డ్రాఫ్టింగ్ చేస్తున్న సమయంలో కనిపెట్టాను! ‘‘ప్రతి పదాన్నీ చెక్ చేయండి. ఇది చట్టం మాత్రమే కాదు, కాబోయే చరిత్ర కూడా...’’ అని నేను హెచ్చరించిన ప్రతిసారీ డ్రాఫ్టింగ్ పనిలో ఉన్న అధికారులలో తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరిగి, ‘కశ్మీర్ కావా’ అవసరం అయ్యేది. ఒక కప్పు కశ్మీర్ కావా టీ తాగి, మళ్లీ తుఫాను మధ్యలో ప్రశాంతంగా కూర్చొనేవారు!అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, రామాలయ నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి 2020 జనవరిలో నార్త్ బ్లాక్‌లోనే ప్రత్యేకంగా ఏర్పాటైన ‘అయోధ్య డెస్క్’కు నేను చీఫ్‌గా ఉన్నప్పుడు కూడా నా టీమ్‌కు అనేక కప్పుల ‘కశ్మీర్ కావా’ అక్కరకొచ్చింది. అంతగా ఏముంటుంది ‘కావా’ టీ లో?! రెండు కప్పుల నీళ్లుండేవి. ఇప్పుడైతే ‘నిర్వాచన్ సదన్’లో నాతో పాటు, మరో ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఉంటారు కనుక మా ముగ్గురికీ మూడు కప్పుల నీళ్లు పడతాయి.మూడు కప్పుల నీళ్లకు 1.5 టీస్పూన్ల కశ్మీరీ గ్రీన్ టీ ఆకులు, 10–12 రేకుల కుంకుమ పువ్వు, 1 పెద్ద ముక్క, లేదా 2 చిన్న ముక్కల దాల్చిన చెక్క, తేలిగ్గా దంచిన 3 యాలకులు, 6–7 సన్నగా తరిగిన బాదం పప్పులు, కప్పుకు ఒక స్పూన్ చొప్పున తేనె లేదా చక్కెర. నీటిని మరిగించటం, కుంకుమ పువ్వు కలపటం, గ్రీన్ టీ ఆకులు వేసి 2 నుండి 3 నిముషాల పాటు అలాగే వదిలేయటం, వడకట్టటం, చివరిగా కలపటం, వెచ్చగా ఒక సిప్ వేయటం. అంతే! ఒత్తిడి, అలసట టీ కప్పు పొగలతో కలిసిపోయి, పైలోకాలకు చేరేవి.గత 10 నెలల్లో 14 సార్లు నేనే స్వయంగా ‘కశ్మీరీ కావా గ్రీన్ టీ’ని కాచి, సుఖ్బీర్ సింగ్ సంధుకూ, వివేక్ జోషీకీ నా స్వహస్తాలతో అందించాను. ‘టీ’ని ట్రేతో అందించటంలో పద్ధతి ఉంటుంది. కానీ టీ కప్పుని నేరుగా టీమ్మేట్స్ చేతికి ఇవ్వటంలో... పద్ధతితో పనిలేని టీమ్ స్పిరిట్ ఉంటుంది. ‘‘... కానీ సంధూ, జోషీ ఆ స్పిరిట్‌ని కోరుకోలేదు. పైగా ఆ 14 సార్లూ ఆ 14 కప్పుల టీమ్ స్పిరిట్‌ని తిరస్కరిస్తూనే వచ్చారు’ అని హఠాత్తుగా సెప్టెంబర్ 23 తెల్లారే, మీడియాలో పెను తుఫాను!! ‘సర్’ జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులలో సంధూ–జోషీలకు; నాకు మధ్య 10 నెలల్లో 14 సార్లు భేదాభిప్రాయాలు వచ్చాయన్నది ఆ తుఫాను కథనం!ఉన్న ముగ్గురు ఎలక్షన్ కమిషనర్లలో ఇద్దరు కమిషనర్ల అంగీకారం లేకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ రాజీనామా చేయాలి... జ్ఞానేశ్‌ను ఇంపీచ్ చేయాలి... జ్ఞానేశ్‌ను అరెస్ట్ చేయాలి... జ్ఞానేశ్‌కు శిక్ష విధించాలి... అని రెండు రోజులుగా దట్టంగా సైక్లోన్ మబ్బులు! ‘‘ఎలక్షన్ కమిషన్ డూప్లికేట్లను తొలగించ టానికే పని చేస్తుంది కానీ ఓట్లను తొలగించ టానికి కాదు’’ అని నేనిప్పుడు వాదించి, వివరణ ఇచ్చి చేయగలిగిందీ లేదు, చేయవలసిందీ లేదు. నాపై ఆరోపణలకు, విమర్శలకు కారణమైన నా నిర్ణయాలే... ఆ ఆరోపణలకు, విమర్శలకు సమాధానాలు కూడా. మాట్లాడేందుకేం లేదు. వెళ్లేందుకు మాత్రం మైళ్లకు మైళ్లు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్ధాఖ్‌లలో కూడా ‘సర్’ పూర్తయ్యే వరకూ... మైల్స్ టు గో అండ్ స్టార్మ్స్ టు కమ్. ఎన్ని తుఫాన్లు వస్తే ఏంటి? గుప్పెడు టీ ఆకులు, కుంకుమ రేకులు, దాల్చిన చెక్క, దంచిన యాలకులు... తెరిపిన పడేయవా?! -
ఇంకా ప్రపంచానిది ఆటవిక న్యాయమేనా?
ఐక్యరాజ్య సమితి (ఐరాస) సర్వ ప్రతి నిధి సభలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 22న ఒక సంచలన ప్రకటన చేశారు. ఆ వేదికపై సాగే ప్రసంగాల ప్రమాణాల ప్రకారం చూసినా కూడా అది అసాధారణమైనదే. ఇరాన్‌తో ఫిబ్రవరిలో మొదలైన యుద్ధం గురించి అందరూ అనుకున్నట్లు గానే ఆయన ప్రస్తావించారు. ఒప్పందం కుదుర్చుకుంటే పునర్నిర్మాణానికి తెహ్రాన్‌కు అవకాశం చిక్కుతుంది; లేకపోతే ‘నన్ను ఇరాన్‌ను సర్వనాశనం చేయమంటారా? ప్రజల ప్రాణాలు హరించే, దేశాలను ధ్వంసం చేసే అవకాశం దానికి ఎన్న టికీ ఇవ్వకుండా వేగంగా ఆ పనిని పూర్తి చేసేయమంటారా?’ అని ట్రంప్ ప్రశ్నించారు. ‘బతికి బట్ట కట్టనివ్వకుండా దాన్ని నరకంలోని నెట్టేయమంటారా?’ అని కూడా హూంకరించారు. ‘అణ్వస్త్రం’ అనే మాటను ట్రంప్ నేరుగా చెప్పకపోయి ఉండవచ్చుకానీ, ఇరాన్‌ను రూపుమాపుతామని ఆయన చేసిన హెచ్చరిక అసాధారణమైంది. ఇరాన్ తప్పించి, మరి ఏ ఇతర దేశమూ ఇవెక్కడి అనాగరికపు మాటలని ప్రశ్నించకపోవడం మరింత నిర్ఘాంతపరచేదిగా ఉంది. ఆఫ్రికాకు ఇప్పటికీ స్థానం లేదా?ట్రంప్ హెచ్చరిక శూన్యంలోంచి పుట్టుకొచ్చింది కాదు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరెస్ తన ప్రసంగంలో ఈ చర్చకు తెర లేపారు. దీన్ని ఆయన కడపటి ఉన్నత స్థాయి ప్రసంగంగా చెప్పుకోవచ్చు. ఆయన రెండవ విడత పదవీ కాలం ఈ డిసెంబర్ 31తో ముగుస్తోంది. ఆయన వాషింగ్టన్ పేరును నేరుగా ప్రస్తా వించలేదుకానీ, ‘మన ప్రపంచంలో అభిప్రాయభేదాలు తీవ్రతర మవుతున్నాయి. బీటలు అగాథంగా పరిణమిస్తున్నాయి’ అని అన్నారు. ప్రపంచం పాలనా వ్యవస్థలు ఇప్పటికీ ‘బలాధిక్య వాస్తవి తకతలను, చాలావరకు గతించిన శకానికి చెందిన ప్రయోజనాలను ప్రతిబింబిస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు. భద్రతా మండలిలో సంస్కరణలు తప్పనిసరిగా తేవాలనీ, అది ఏ ప్రపంచాన్ని శాసించాలనుకుంటోందో, దానికి తగ్గ రూపంలో ఎంతమాత్రం లేదనీ కూడా కుండ బద్దలుకొట్టారు. ఆయన సునిశితమైన రీతిలో లేవ నెత్తిని సంస్థాగత అంశానికి కరతాళ ధ్వనులతో ప్రతిస్పందన లభించింది. ‘ఆఫ్రికాయే ఇందుకు తిరుగులేని ఉదాహరణ. ఐరాస ఏర్పడి నపుడు, ఆఫ్రికాలో చాలాభాగం వలస పాలనలో ఉంది. ఆఫ్రికాకు నేటికీ మండలిలో శాశ్వత ప్రాతినిధ్యం లేదు. ఆఫ్రికాకు శాశ్వత స్థానాలు లేకుండా 21వ శతాబ్దపు భద్రతా మండలి కొనసాగడం అసమంజసం, నిర్హేతుకం’ అని ఆయన అన్నారు. ఐరాసను ‘గొప్ప, గొప్ప సామర్థ్యం’ ఉన్న సంస్థగా ట్రంప్ అభివర్ణించారు. ‘గ్లోబలిస్టు బ్యురోక్రాట్ల తీవ్ర వామపక్ష అజెండాను రుద్దే పనిని’ అది మానుకోవాలని అన్నారు. గాజా ప్రణాళిక–శాంతి బోర్డునకు ఆమోదం తెలిపినందుకు భద్రతా మండలికి కృతజ్ఞతలు తెలిపారు. అంతవరకు ఆయన ఐరాస స్థానంలో ఈ బోర్డు ‘పనిచేస్తే చేయవచ్చనే’ ధోరణిని ప్రధర్శించారు.ఫ్రాన్స్ సముచిత వైఖరిఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ పదవీకాలం 2027తో ముగుస్తుంది కనుక, ఈ తడవ మాక్రాన్ చేసిన ప్రసంగాన్ని ఆయన చివరి ఐరాస సర్వ ప్రతినిధి సభ ప్రసంగంగా భావించాలి. ఆయన హార్మూజ్ పైకన్నా గాజాపై ఎక్కువ దృష్టి పెట్టారు. ‘ఏదో శాంతి కుదిర్చినట్లుగా కొందరు డప్పు కొట్టుకుంటున్నారు. కానీ, ఆ శాంతి ఒక్క క్షణం కూడా మానవతావాద సాయం అందేందుకు తలుపులు తెరిచింది లేదు’ అని ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించ కుండానే చురకలంటించారు. దేశాలు ‘ఆటవిక న్యాయానికి తిరిగి వెళ్ళాలని కోరుకుంటున్నాయా లేక నాగరిక అంతర్జాతీయ సమాజం దిశగానా?’ అని అడిగారు. ఇజ్రాయెల్ భద్రతను ఒక సాకుగా చేసు కుని, పొరుగు దేశాల సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించేందుకు దాన్ని ఒక ‘లైసెన్సు’గా మలచుకోవడం ‘వినాశకర’ తప్పిదమవు తుందని ఆయన అన్నారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశంగా ఫ్రాన్స్ బహుళపక్షీయతకు, మానవతా కారిడార్లకుఎంతో అవసరమైన మద్దతును అలా వ్యక్తపరచిందని చెప్పవచ్చు. శాశ్వత సభ్యత్వం ఉన్న మిగిలిన దేశాల నుంచి స్పందన ఒకే రీతిగాకన్నా అసంపూర్ణంగా ఉందనే భావించాలి. ఇజ్రాయెల్– పాలస్తీనా రెండు దేశాలుగా ఉండాలనే పరిష్కారానికి మద్దతును బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్ పునరుద్ఘాటించారు. చైనా అధ్య క్షుడు షీ జిన్‌పింగ్ సెప్టెంబర్ 24న శ్వేత సౌధంలో శిఖరాగ్ర సమా వేశం ఉన్న దృష్ట్యా సర్వ ప్రతినిధి సభకు హాజరు కాలేదు. జిన్‌పింగ్ బదులు చైనా ఉపాధ్యక్షుడు హ్యాన్ జెంగ్ హాజరయ్యారు. ఇరాన్ లేదా గాజాల పేరును నేరుగా ప్రస్తావించకుండా, నిర్నిరోధ బల ప్రయోగాన్ని చైనా వ్యతిరేకించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ సమావేశాలకు హాజరు కాలేదు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవరోవ్ ఆ దేశ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తూ, ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా విరామం ఇవ్వదలచు కోలేదని స్పష్టం చేశారు. చర్చలకు సిద్ధమేనంటూ, ఇతర మార్గాల ద్వారా యుద్ధం కొనసాగుతుందని తేల్చేశారు.ఇండియా ఆచితూచి...భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న ఐదు దేశాలు(పీ5) ఒకే వైఖరితో లేవని తేటతెల్లమైంది. భారతదేశానికి భద్రతా మండ లిలో శాశ్వత సభ్యత్వం లేదు. వీటో చేయగలిగిన అధికారం చలా యించగలిగినదిగా మండలిలో సభ్యత్వం చేజిక్కించుకోవాలని భారత్ ఉబలాటపడుతోంది. జిన్‌పింగ్, పుతిన్ మాదిరిగానే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సమావేశాలకు హాజరు కాలేదు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించారు. ‘సంస్కరణాయుత బహుళ పక్ష వాదానికి’ జై శంకర్ పిలుపునిచ్చారు. బడుగు దేశాలు వాటి ప్రమేయం లేని, అవి ఏ పాపం ఎరుగని సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయని ఆయన వాదించారు. పశ్చిమాసియాలో సాగర మార్గాలకు భద్రత కల్పించా లనీ, అంతర్జాతీయ చట్టాలను పాటించాలనీ కోరారు. ఇరాన్‌ను ‘రూపుమాపుతా’మని వచ్చిన హెచ్చరికపై భారత్ ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు. అమెరికా, రష్యా, ఇరాన్‌లతో సంబంధాలను కాపాడుకుంటోంది. అమెరికావి అనాగరికపు మాటలని అన లేదు. ఐరాస భద్రతా మండలిని సంస్కరించాలని కోరింది. సభ్యత్వం పొందేందుకు భారత్‌కు ఉన్న హక్కును చాటుకుంది. పాలస్తీనా ఓట్లు, ఇంధన భద్రత, శక్తిమంతమైన దేశాల నుంచి దెబ్బ తినకుండా కంచె ఏర్పరుచుకోవడం అనే అంశాలను భారత్ ఏనాటి నుంచో మిళితం చేసుకుంటూ వస్తోంది. ఇపుడు అమెరికా నుంచిరెండవ విడత సుంకాల విధింపు బెడద నేపథ్యంలో, ఐరాస 81వ సర్వ ప్రతినిధి సభ సమావేశాల్లోనూ అదే వైఖరిని కొనసాగించింది. విభేదాల బదులు పరస్పరం ఆధారపడటం నేర్చుకోండని గుటెరస్ కోరారు. లొంగదీసుకునేందుకు ఒక మార్గంగా విధ్వంసాన్ని ట్రంప్ ఎంచుకున్నారు. తుది గడువును ఆయనే విధిస్తు న్నారు. ఓ మోస్తరు శక్తి కలిగిన దేశాలు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోరుకుంటున్నాయికానీ, నియమ నిబంధనలను పాటించి తీరాలనీ, అంతర్జాతీయ సూత్రాలకు కట్టుబడి ఉండాలనీ ధైర్యంగా చెప్పలేకపోతున్నాయి. హాజరు పట్టీలకు పరిమితమైతే ప్రయోజనం ఏముంది? ఈ సమస్య భారతదేశానిది మాత్రమే కాదు. ఐరాస ఎదుర్కొంటున్న, ఇంకా జవాబు దొరకని ప్రశ్న.-వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్, న్యూఢిల్లీ- సి. ఉదయ్ భాస్కర్ -
సంక్షుభిత క్యూబా 'ఆత్మగౌరవ పతాక'
క్యూబాకు వెళ్లడం నాకు కేవలం ఒక విదేశీ పర్యటన కాదు– అది ఒక రాజకీయ అధ్యయన యాత్ర. ఫిడెల్ కాస్ట్రో శత జయంతి సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ చర్చల్లో పాల్గొనడానికి, క్యూబా ప్రజల జీవనాన్ని ప్రత్యక్షంగా అర్థం చేసుకోవడానికి లభించిన అరుదైన అవకాశం. దశాబ్దాలుగా కొనసాగుతున్న సామ్రాజ్యవాద దిగ్బంధనం మధ్య కూడా ఒక చిన్న దేశం తన సార్వభౌమత్వాన్నీ, సోషలిస్టు వ్యవస్థనూ ఎలా కాపాడుకుంటుందో తెలుసుకోవడమే ఈ ప్రయాణ ముఖ్యోద్దేశం. 2026 ఆగస్టు 10 నుండి 13 వరకు హవానాలో జరిగిన ‘ఫిడెల్ లెగసీ అండ్ ఫ్యూచర్’ అంతర్జాతీయ కొలోక్వియంలో, ఏడుగురు సభ్యుల భారత ప్రతినిధి బృందంలో భాగస్వామిగా నేనూ పాల్గొ న్నాను. ఈ కొలోక్వియంలో జరిగిన విస్తృత చర్చలతో పాటు, ఫిడెల్ కాస్ట్రో రుజ్ సెంటర్, విప్లవ చరిత్రతో ముడిపడిన చారిత్రక ప్రదేశాలు, చే గువేరా జ్ఞాపకాలు, మ్యూజియాలు, ఆసుపత్రులు, హవానా పాత నగరం తదితర ప్రాంతాలను సందర్శించాం. వీటి ద్వారా క్యూబాను దాని చరిత్ర, విప్లవం, సోషలిజం, ప్రజల జీవన విధానం వంటి వివిధ కోణాల్లో కొంతన్నా అర్థం చేసుకునే అవకాశం మాకు దక్కింది.ఆ నేలపై అడుగిడిన వేళ...ఫిడెల్, చే, గ్రాన్మా, మోంకాడా, సియెర్రా మాస్ట్రా... ఇంతకాలం పుస్తకాల్లో చదివిన ఈ చారిత్రక పేర్లన్నీ మేము నిలబడిన ఆ నేలపై సజీవంగా కనిపించాయి. హవానాలో అడుగుపెట్టగానే మాకు కనిపించింది కేవలం పుస్తకాల్లోని విప్లవం గానీ, పర్యాటక క్యూబా అందాలు గానీ కాదు. అక్కడ మాకు స్వాగతం పలికిన వాస్తవాలు: తీవ్రమైన విద్యుత్ కోతలు, తాగునీటి కొరత, ఇంధన సంక్షోభం, చీకట్లో మునిగిన నగర వీధులు. ఒకప్పుడు ఉచిత విద్య, సార్వత్రిక వైద్యం, శాస్త్ర–సాంకేతిక రంగాల్లో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన క్యూబా నేడు ఇంతటి ఇంధన, ఔషధాల కొరతను ఎందుకు ఎదుర్కొంటోంది?కొలోక్వియం ప్రారంభ ఉపన్యాసంలో క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్–కానెల్ కూడా దేశం ఎదుర్కొంటున్న ఈ సంక్షోభ తీవ్రతను దాచకుండా వివరించారు. థర్మల్ విద్యుత్ సామర్థ్యంలో సుమారు 1,400 మెగావాట్లను పునరుద్ధరించినప్పటికీ, తీవ్రమైన ఇంధన కొరత కారణంగా విద్యుత్ కోతలు తప్పడం లేదని తెలిపారు. వైద్య రంగంలో ఉన్న పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందన్నారు. ప్రాథమిక మందులలో కేవలం 30 శాతం మాత్రమే అందుబాటులో ఉన్నాయని వివరించారు. దేశ అధ్యక్షుడు స్వయంగా ఈ ఇంధన, ఆరోగ్య సంక్షోభాలను ప్రజల ముందు ఉంచి, లోపాలను అంగీకరించారు. సంక్షోభాలను ధైర్యంగా అంగీకరించి, దానిపై పోరాడటం క్యూబా నైజం. విజయాలను అభినందిస్తూ, లోపాలను సమీక్షించుకుంటూ, సంక్షోభ కారణాలను శాస్త్రీయంగా విశ్లేషిస్తూ... క్యూబాను క్యూబాగానే అర్థం చేసుకోవాలి అని దేశాధ్యక్షుడే స్వయంగా చెప్పారు.విప్లవం–అమెరికాతో వైరందాదాపు 380 ఏళ్లు స్పానిష్ వలస పాలనలో క్యూబా ప్రజల శ్రమను, సహజ వనరులను నిలువునా పిండి పిప్పి చేశారు. వలస పాలన అంతమైనా స్వేచ్ఛ మాత్రం లభించలేదు. 1953 జూలై 26న మోంకాడా బ్యారక్స్‌పై విప్లవ సింహాలు విరుచుకుపడ్డాయి. 1956లో ‘గ్రాన్మా’ పడవలో 82 మంది విప్లవకారులు మృత్యువుతో చెలగాట మాడుతూ బయలుదేరారు. సియెర్రా మాస్ట్రా పర్వతాలను అడ్డాగా చేసుకుని ప్రజలకు చేరువయ్యారు. గెరిల్లా పోరాటంతో అమెరికా అనుకూల బాటిస్టా మూలాలను కదిలించారు. 1959 జనవరి 1న బాటిస్టా పారిపోవడంతో, క్యూబా నేలపై విప్లవ విజయ పతాక ఎగిరింది! 1961 ‘బే ఆఫ్ పిగ్స్’ దాడిలో అమెరికా పంపిన అద్దె సైనికులను క్యూబా ప్రజలు మట్టికరిపించారు. అమెరికా రాక్షస ఆర్థిక దిగ్బంధనం, దుర్మార్గమైన ఆంక్షలను ధీటుగా ఎదుర్కొంటూ, 1959 విప్లవం తర్వాత క్యూబా ప్రపంచా నికే ఆదర్శవంతమైన విజయాలను సాధించింది. 100% అక్షరాస్యత సాధించి, విద్యను ఉచితంగా ప్రతి ఇంటా నింపింది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఉచిత వైద్య వ్యవస్థను నిర్మించింది. 1963 అల్జీరియా మిషన్ మొదలుకొని 2005లో స్థాపించిన ‘హెన్రీ రీవ్’ అత్యవసర వైద్య బృందం ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఉచిత వైద్య సేవలు అందించింది. నేడు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నా, విదేశీ విద్యార్థులకు తమ మెడికల్ కాలేజీల్లో ఉచిత వైద్య విద్యనందిస్తూ అంతర్జా తీయ మానవత్వానికి మహోన్నత ప్రతీకగా నిలిచింది.ఆర్థిక సంక్షోభంలోకి...అయితే 1991లో సోవియట్ యూనియన్ పతనం క్యూబాను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. క్యూబాను పస్తులు ఉంచిచంపాలని అమెరికా రాక్షస ఆర్థిక దిగ్బంధనాన్ని బిగించింది. ఉన్నదానితోనే బతకడం, ఉన్న కొద్దిపాటి వనరులను అందరూ సమానంగా పంచుకోవడం క్యూబా సంస్కృతి అయింది. నాయ కులు సైతం ప్రజలతో పాటు క్యూలలో నిలబడ్డారు. స్వయంగా పొలంపనుల్లో పాల్గొని కష్టాలను పంచుకున్నారు. ఎంతటి కరువు వచ్చినా విద్య, వైద్యం, సామాజిక రక్షణ అనే విప్లవ సాధనాలను విడిచిపెట్టలేదు. హవానాలోని గ్రాన్మా విప్లవ మ్యూజియంలో అడుగు పెట్టి నప్పుడు చరిత్ర కళ్లముందు సాక్షాత్కరించినట్లనిపించింది. ఫిడెల్ కాస్ట్రో రుజ్ సెంటర్లో ప్రతి ఘట్టం ఫిడెల్ జీవితాన్ని మాత్రమే కాదు, ఒక విప్లవకారుడి బాధ్యతను గుర్తుచేస్తుంది. చిన్న వయస్సు నుంచే తమ దేశ చరిత్రను, విప్లవ వీరుల త్యాగాలను తెలుసుకునేలా చేయడం అక్కడి సామాజిక జీవితంలో భాగంగా కనిపిస్తుంది. చే గువేరా జ్ఞాపకాలను చూడటం మరొక ప్రత్యేక అనుభవం. గొప్ప నాయకుల గొప్పతనం వారి మాటల్లో మాత్రమే కాదు... వారి నిరాడంబర జీవితం, ప్రజల కోసం చేసిన త్యాగాల్లో ఉంటుంది. శాంటా క్లారాలో చే గువేరా భారీ విగ్రహం, ఆయన పోరాటం, త్యాగం వంటివాటిని గుర్తుచేసే ప్రతి చిహ్నం నేటి తరానికి ఒక ప్రశ్న వేస్తున్నట్టుగా ఉంటుంది: ‘వారు తమ కాలంలో ఇంతటి త్యాగాలు చేశారు. మరి మన కాలంలో మన కర్తవ్యం ఏమిటి?’ క్యూబా పర్యటనలో మేము క్యాన్సర్, కార్డియాలజీ విభాగా లను సందర్శించాము. అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ వైద్య సిబ్బంది చిరునవ్వుతో చిన్నారులకు చికిత్స అందించడం చూశాం. హవానాలోని ‘ఓపెన్ ఫ్యునరల్ మ్యూజియం’లో మత విశ్వాసాలు కలిగినవారి అంతిమ జ్ఞాపకాలను కూడా ఎంతో గౌరవంగా కాపాడుతున్న తీరు మమ్మల్ని ఆలోచింపజేసింది. మతం ఉన్నా లేకపోయినా మనిషిని మనిషిగా గౌరవించడం, సమానత్వం, మానవత్వం, సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకెళ్లడమే క్యూబా నేర్పిన పాఠం. విప్లవం అంటే కేవలం అధికార మార్పు కాదు– మనిషి గౌరవాన్ని కాపాడటం, సమానత్వాన్ని నిర్మించడం, ప్రజల కష్టాలను మన కష్టాలుగా భావించడం, అలాగే సామ్రాజ్యవాదానికి తలవంచకుండా నిలబడటం. క్యూబా ప్రజలకు విప్లవ జేజేలు!బి. వెంకట్వ్యాసకర్త అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘంప్రధాన కార్యదర్శి -
ప్రచార మాయాజాలం 'నెట్ జీరో'
రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి నీరో ఫిడేలు వాయించాడని చరిత్ర చెబుతుంది. వాతావరణ సంక్షోభం ప్రాణా లను, ఆస్తులను హరిస్తూ, జీవి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న ఈ కాలంలో, మనకూ చాలామంది ఆధునిక నీరోలు కనిపిస్తున్నారు. 2021 నవంబర్‌లో గ్లాస్గో (స్కాట్ లాండ్)లో జరిగిన కాప్26 సదస్సు చాలా ఆశలు రేకెత్తించింది. ఆ సదస్సు నుంచి బయటకు వచ్చిన ప్రముఖ మాట ‘నెట్ జీరో’. చాలామంది నెట్ జీరో అంటే సున్నా అనుకుంటారు. కానీ కాదు. నెట్ జీరో అనేది చాలా విషయాలను దాచిపెట్టే, గందరగోళపరిచే లక్ష్యం.లక్ష్యం కాదు, ఒక సమీకరణంనెట్ జీరో అనేది యథాతథ స్థితిని కొనసాగించే లక్ష్యం. పైకి మాత్రం పెద్ద ముందడుగులా కనిపిస్తుంది. దీని నిర్వచనం ప్రకారం, వాతావరణంలోకి వెళ్ళే గ్రీన్ హౌస్ వాయువులకు, వాటిని ‘తొలగించే’ ప్రక్రియకు మధ్య సమతుల్యత సాధించడమే నెట్ జీరో. అంటే ఉద్గారాలు కొనసాగుతూనే ఉంటాయి, దృష్టి మాత్రం తొలగింపుపై పెడతారు. పది రెట్లు వెలువడితే, అంతే తొలగించాలన్నది వాగ్దానం. కానీ ఆ తొలగింపు సాంకేతికత ఇంకా పెద్ద స్థాయిలో రుజువు కాలేదు. ఇది వర్తమానంలో ఉద్గారాలు విడుదల చేసేవారి మీద ఒత్తిడిని తగ్గించి, ప్రపంచాన్ని ఒక తప్పుడు నిశ్చింతలో పడే స్తుంది. ఉద్గారాలకు అత్యధిక బాధ్యులైన ప్రభుత్వాలు, కార్పొరేట్లే దీన్ని ప్రచారం చేయడం సమస్య తీవ్రతను గుర్తించడంలో వైఫ ల్యాన్ని సూచిస్తుంది. పైగా అన్ని ఉద్గారాలు కార్బన్ మాత్రమే కాదు. చాలా విష వాయువులు మరింత ప్రమాదకరమైనవి. కానీ నెట్ జీరో చట్రం కార్బన్ కే పరిమితం; గాలి, నీరు, నేలలను దెబ్బతీసే వేలాది ఇతర ఉద్గారాలు దీని లెక్కల్లోకి రావు. కార్బన్ క్యాప్చర్, కార్బన్ ట్రేడింగ్లనే ప్రధాన సాధనాలుగా ఆధారపడటం వల్ల, ‘కాలుష్యం కలిగించినవాడే మూల్యం చెల్లించాలి’ అనే సూత్రాన్ని నెట్ జీరో కప్పిపెడుతుంది. పర్యావరణ కాలుష్య నేరస్థులు మూల్యం చెల్లిస్తారు గానీ, స్థానిక బాధితులకు కాదు, కాగితాలపై మరెక్కడో. అంతర్జాతీయ చట్టపరమైన కట్టడి లేకపోవడం వల్ల, కార్బన్ ట్రేడింగ్, కార్బన్ క్యాప్చర్ మోసాలుగా మారుతున్నాయని విమర్శలు పెరుగుతున్నాయి.గ్లాస్గో నుంచి గుంటూరు దాకా...అంతర్జాతీయ వాతావరణ దౌత్యంలోనే నెట్ జీరో ఇంత అస్పష్టంగా ఉంటే, భారత రాష్ట్ర ప్రభుత్వాల స్థాయికి వచ్చేసరికి ఇది ఒక లెక్కల చట్రంగా కాక, ఫ్యాషన్ ప్రకటనగా మారింది. కార్బన్ ట్రేడింగ్ లేకుండా సూత్రప్రాయంగా నెట్ జీరో నిలబడలేదు. ‘తొల గింపు’ అనేది క్రెడిట్లు, రిజిస్ట్రీలు, ధ్రువీకరణ వ్యవస్థల ద్వారానే రుజువవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్థాయిలో ఈ సంబంధమే పూర్తిగా కనిపించదు. గ్రామాలు, కాలేజీలు, వ్యర్థాల ప్రాజెక్టులు, ఒక పూర్తి కొత్త నగరం కూడా ఎలాంటి క్రెడిట్, రిజిస్ట్రీ, ధ్రువీకరణ ప్రస్తావన లేకుండానే ‘నెట్ జీరో’గా ప్రకటించబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో ‘నెట్ జీరో’ను ప్రస్తావించారు. కుప్పం నియోజకవర్గంలోని నలగాంపల్లె గ్రామాన్ని రాష్ట్రానికే ‘నెట్ జీరో మోడల్’గా విస్తరించాలని అధికారులను ఆదేశించారు. సౌర విద్యుత్, వర్షపు నీటి సంరక్షణ, ఎలక్ట్రిక్ వాహనాలను ఇందులో చేర్చారు. ఆంధ్రా యూనివర్సిటీని ‘నమూనా నెట్ జీరో క్యాంపస్’గా మార్చాలని పిలుపునిచ్చారు– ప్రతి సందర్భంలోనూ బేస్‌లైన్, హద్దు, పర్యవేక్షణ విధానం ఏదీ ప్రకటించకుండానే.తెలంగాణలో ఇదే పోకడ ఒక అధికారిక ఉత్తర్వులో నమోదైంది. మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ శాఖ జారీ చేసిన జి.ఓ.ఆర్టీ నెంబర్ 641 (02–07–2026), రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో 86 ఎకరాల భూమిని ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రం కోసం జీహెచ్ఎంసీకి బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వు. జపాన్ లోని కితక్యుషు నగరంతో తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న స్నేహ ఒప్పందం కింద, ‘వృత్తాకార ఆర్థిక వ్యవస్థను, నెట్ జీరో లక్ష్యాలను సాధించే ఉద్దేశంతో’ ఎకో–టౌన్ ఏర్పాటుకు ఈ భూమి కేటాయించినట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ ఒక్క వాక్యాన్ని పక్కనపెడితే, మిగతా ఉత్తర్వు కేవలం ఒక వ్యర్థాల కేంద్రా నికి భూమి బదిలీ, లైసెన్సు ఆమోదం మాత్రమే. ఇక్కడ ‘నెట్ జీరో’ అంటే ఏమిటో, హద్దు ఏమిటో, బేస్‌లైన్ ఏమిటో, ఎవరు ధ్రువీక రిస్తారో ఎక్కడా నిర్వచించలేదు. జపాన్ లో ‘ఎకో–టౌన్’ అంటే పరిశ్రమల వ్యర్థాలను రీసైకిల్ చేసే మూసిన లూప్ వ్యవస్థలు; కానీ ఇక్కడ ఆమోదమైంది మామూలు మున్సిపల్ వ్యర్థాల కేంద్రమే. దానికి ఎకో–టౌన్, నెట్ జీరో పేర్లు మాత్రమే అదనం.నగర స్థాయిలో ఇదే ధోరణి తెలంగాణ ‘ఫ్యూచర్ సిటీ’ (భారత్ ఫ్యూచర్ సిటీ, ‘నాలుగో నగరం’)లో కనిపిస్తుంది. శ్రీశైలం, నాగా ర్జునసాగర్ రహదారుల మధ్య 30,000 ఎకరాల్లో నిర్మించే ఈ నగరాన్ని 2025 మార్చిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ ఆమోదించింది; దీని కోసం కొత్తగా ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. హెచ్ఎండీఏ పరిధిలోని 36 గ్రామాలను దీనికి బదిలీ చేశారు. మొత్తం 30,000 ఎకరాల్లో 13,973 ఎకరాలు గతంలో హైదరాబాద్ ఫార్మా సిటీ కోసం కేటా యించినవే. అంటే ‘భారతదేశపు తొలి నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ’ అని పిలుస్తున్న దీనిలో సగానికి పైగా భూమి, అంతకన్నా ఎక్కువ ఉద్గారాలు వెలువడే పరిశ్రమల కోసం కేటాయించినదే. ఇప్పటికే స్థలాల అమ్మకపు ప్రకటనల్లో హెచ్ఎండీఏ, రెరా అనుమ తులతో పాటు ‘నెట్ జీరో’ హోదాను ఒక ఆకర్షణగా వాడుతున్నారు.కార్బన్ మార్కెటే లేదు!ఇరు రాష్ట్రాల ప్రకటనలన్నింటిలోనూ కార్బన్ ట్రేడింగ్ ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. సూత్రప్రాయంగా కార్బన్ ట్రేడింగ్ లేకుండా నెట్ జీరో నిలబడదు. ‘తొలగింపు’ క్రెడిట్లు, రిజిస్ట్రీలు, ఆడిట్ చేసిన ఆఫ్సెట్ల ద్వారానే అది రుజువవుతుంది. ఏ సంవ త్సరపు ఉద్గారాలతో పోల్చి నెట్ జీరో అంటున్నారో చెప్పకపోతే, ఈ దావాను నిర్ధారించలేం. కానీ భారత్ సొంతంగా నిర్మించదల్చుకున్న ఆ వ్యవస్థ – ఒక కేంద్ర మంత్రిత్వ శాఖ రూపొందించిన కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ (సీసీటీఎస్) ముసాయిదా ఇంకా అస్పష్టంగానే ఉంది. ‘కార్బన్ క్రెడిట్’ అంటే ఏమిటో నిర్వచించకుండానే డానికి మార్కెట్ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. ఒక మంత్రిత్వ శాఖ తన ప్రధాన ఉత్పత్తినే నిర్వచించకుండా కార్బన్ మార్కెట్ రూపొందిస్తే, రాష్ట్రాలు ఆ మార్కెట్నైనా, మరే యంత్రాంగాన్నైనా ప్రస్తావించకుండానే నెట్ జీరో ప్రకటనలు చేస్తున్నాయి. ఇదే వీటిని లెక్కల వ్యవస్థలుగా కాక, కేవలం ప్రచార కార్యక్రమాలుగా చూపిస్తుంది. రోమ్ తగలబడుతున్నప్పుడు నీరో ఫిడేలు వాయించాడు. ఎందుకంటే మంటల తీవ్రతను అతను చూడలేకపోయాడు, లేదా చూడదలచుకోలేదు. భారత వాతావరణ పాలన కూడా అంతే. పద జాలంతో ఫిడేలు వాయిస్తున్నారే తప్ప, పారదర్శకత, జవాబుదారీ తనం వంటివి లేనేలేవు.డా‘‘ దొంతి నరసింహారెడ్డివ్యాసకర్త విధాన–వ్యవసాయ రంగ నిపుణులు -
హౌతీల దాడులతో మారిన యుద్ధక్షేత్రం
ఈ సెప్టెంబరు నెలలో ఇరాన్ యుద్ధ క్షేత్రం హార్మూజ్ జలసంధి నుంచి సౌదీ అరేబియా, యెమెన్లకు మారింది. గాజా –ఇజ్రాయెల్ యుద్ధం తరువాత మళ్లీ ఒక్కసారిగా హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్ మధ్య, దక్షిణ ప్రాంతాలలోనికి చొచ్చుకుపోయారు. ఎర్రసముద్రాన్ని, బాబెల్ మాండెబ్ జలసంధిని దాదాపుగా తమ నియంత్రణలోనికి తీసుకొని నేరుగా సౌదీ అరేబియాపై భీకర దాడులు ప్రారంభించటం ద్వారా సౌదీ– అమెరికా–ఇజ్రాయెల్‌లకు హౌతీలు సవాలు విసిరినట్లయింది. ఎవరీ హౌతీలు?ఉత్తర యెమెన్‌లోని సాదా పర్వత ప్రాంతాలలో నివసించే షియా ఇస్లాంకు చెందిన ‘జ్యాదీ’ తెగ ప్రజలనే ‘హౌతీ’లుగా పిలుస్తారు. గత వెయ్యేళ్లుగా ఉత్తర యెమెన్ ప్రాంతాన్ని జ్యాదీ తెగకు చెందిన ఇమామ్‌లు పాలించారు. 1962లో ఇమామ్‌ల పాలనను కూలదోసి ఉత్తర యెమెన్ రిపబ్లిక్ ఏర్పడింది. 1990వ దశకంలో ఉత్తర–దక్షిణ యెమెన్ల విలీనంతో సానా రాజధానిగా యెమెన్ ఏర్పడింది. జ్యాదీ తెగకే చెందిన అలీ అబ్దుల్లా సాలే యెమెన్‌ను పరిపాలిస్తూ సౌదీ అనుకూల సలాఫి మదరసాలను ప్రోత్సహించాడు. దీన్ని తమ సంస్కృతిని నిర్మూలించే ప్రక్రియగా భావించిన జ్యాదీలు తిరుగుబాటు ప్రారంభించారు. హుస్సేన్ అల్ హౌతీ నాయకత్వంలో ఈ తిరుగుబాటు మొదలైంది. 2004–10 కాలంలో అబ్దుల్లా ప్రభుత్వానికీ, హౌతీలకూ మధ్య ఆరు యుద్ధాలు జరి గాయి. సానాలోని యెమెన్ ప్రభుత్వానికి సౌదీ అరేబియా మద్దతు నివ్వటంతో అది హౌతీలకు శత్రువయింది.2011లో ఉత్తర ఆఫ్రికాలో ప్రారంభమైన అరబ్ స్ప్రింగ్ నిరసనలు యెమెన్కూ వ్యాపించాయి. 2012లో అబ్దుల్లా సాలే రాజీ నామాతో సౌదీ సహాయంతో మన్సూర్ హాదీ అధ్యక్షుడిగా మరో ప్రభుత్వం ఏర్పడింది. అందులో హౌతీలకూ స్థానం కల్పించారు. కానీ చమురు నిల్వలున్న దక్షిణ–మధ్య యెమెన్‌లతో పోలిస్తే జ్యాదీల (హౌతీల) ఉత్తర యెమెన్‌లో పేదరికం అధికం. 2014లో చమురు సబ్సిడీలను ఎత్తివేయటంతో హౌతీలు తిరుగుబాటు ప్రారంభించారు. దీనితో హాదీ ప్రభుత్వం కూలిపోయింది. సౌదీ అరేబియా జోక్యంతో 2015–22 మధ్య హౌతీలకూ, సౌదీ మద్దతున్న యెమెనీ ప్రభుత్వానికి మధ్య తీవ్ర యుద్ధం జరిగింది. 2022లో యునైటెడ్ నేషన్స్ చొరవతో కొంతమేరకు శాంతిస్థాపన జరిగింది. ఇదే సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మద్దతుతో కొన్ని స్థానిక తెగలు దక్షిణ యెమెన్‌లోని కొన్ని ప్రాంతాలను తమ అధీనంలోనికి తీసుకున్నాయి. ఇప్పుడు యెమెన్‌లో సుమారు 30 శాతం ప్రాంతం హౌతీల అధీనంలో ఉండగా, మిగిలిన ప్రాంతం సౌదీ మద్దతున్న ఇంటర్నే షనల్లీ రికగ్నయిజ్డ్ గవర్నమెంట్, యూఏఈ మద్దతున్న సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ అధీనంలో ఉన్నాయి. 80 శాతం ప్రజలు హౌతీల అధీనంలోని ఉత్తర యెమెన్‌లో నివసిస్తున్నారు.సంకటంలో సౌదీ అరేబియాఇరాన్ మతగురువు అయతుల్లా ఖమేని అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తున్న హౌతీ నాయకుల ఇరానియన్ విమానం యెమెన్ రాజధాని సానాలో ల్యాండ్ అవకుండా సౌదీ అరేబియా విమానాశ్రయ రన్‌వేను ధ్వంసం చేయటంతో జూలై 2026లో అప్ప టివరకు ఉన్న కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం రద్దయ్యాయి. హార్మూజ్ జలసంధిపై అమెరికా తన పట్టు బిగించటంతో హౌతీలు ఎర్ర సముద్రంలో పెరిమ్, అల్ హయిదా దీవులను వశం చేసుకున్నారు. కీలకమైన మోకా రేవు పట్టణాన్ని అదుపులోనికి తీసు కోవటంతో బాబెల్ మాండెబ్ జలసంధిని నియంత్రిస్తున్నారు. ఎర్ర సముద్రం నుండి సౌదీ నౌకలపై నిషేధం విధించారు. హార్మూజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా సౌదీ అరేబియా అబాకిక్ చమురు క్షేత్రాన్ని ఎర్ర సముద్ర తీరంలోని యాన్బూ రేవు పట్టణంతో కలిపే 1,200 కిలోమీటర్ల తూర్పు–పశ్చిమ పైప్‌లైన్ గుండా ప్రతిరోజూ 7 మిలియన్ బ్యారెల్స్ చమురును ఎగుమతి చేస్తున్నది. సౌదీ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఈ పైప్‌లైన్‌పై హౌతీలు దాడి చేశారు. అంతటితో ఆగకుండా అరామ్కో కంపెనీకి చెందిన చమురుశుద్ధి కర్మాగారాలు, చమురు టర్మినల్స్పై కూడా డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడి జరిగింది. తాయిఫ్, ఆభా, రియాద్, జీజన్, నజ్రాన్లపై దాడితో సౌదీ సంకట స్థితిలో పడింది.సాలీనా 83 బిలియన్ డాలర్ల రక్షణ వ్యయంతో సౌదీ అరేబియా ప్రపంచంలో ఎనిమిదవ స్థానంలో ఉన్నది. అమెరికన్ ఎఫ్–15 యుద్ధ విమానాలు, పేట్రియాట్, థాడ్ మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థలు కలిగి ఉన్న సౌదీ అరేబియాలో విధ్వంసం సృష్టించటంతో హౌతీల సైనిక శక్తి అందరి దృష్టిని ఆకర్షించింది. హిజ్బుల్లా మాదిరిగా హౌతీలను ఇరానియన్ ప్రాక్సీలుగా పరిగణిస్తారు. హౌతీలకు క్రూయిజ్, బాలాస్టిక్ మిస్సైల్స్, డ్రోన్ టెక్నాలజీని, ఆర్థిక సహా యాన్ని ఇరాన్ అందించటంలో సందేహం లేదు. అయినా హౌతీల గెరిల్లా పోరాట పటిమను తక్కువ అంచనా వేయకూడదు. వారు ఇరాన్‌తో మైత్రీ బంధాన్ని కలిగి ఉన్నప్పటికీ, పూర్తిగా ఇరాన్‌పై ఆధారపడటం లేదు. ఇరాన్ ప్రయోజనాలను కాపాడినప్పటికీ, తమ ప్రాంతీయ లక్ష్యాల విషయంలో రాజీపడరు. ఇరాన్‌కు ప్రధాన శత్రు వులు యూఎస్ఏ, ఇజ్రాయెల్. కానీ హౌతీల శత్రువు సౌదీ. రాజీ కుదిరేనా?వైమానిక దాడులలో హౌతీలను లొంగదీసుకోవడం సాధ్యం కాదని సౌదీకి తేటతెల్లమైంది. దిక్కుతోచని పరిస్థితులలో మళ్లీ ట్రంప్ సహాయాన్ని అర్థించింది. కానీ ట్రంప్ తెలివిగా హౌతీలపై ప్రత్యక్ష దాడులకు నిరాకరించాడు. ఇజ్రాయెల్ సహాయాన్ని కూడా సౌదీ అర్థించినట్లుగా వార్తలొస్తున్నాయి. సైనికపరంగా హౌతీలను ఎదుర్కొనలేమని దౌత్యమార్గంలో సంప్రదింపులకు తలుపులు తెరి చింది. ఒమన్, ఈజిప్టు మధ్యవర్తులుగా ఇరాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నది. ఇరాన్ ద్వారా హౌతీలతో ఒప్పందం కుదుర్చుకొని ప్రస్తుత యుద్ధాన్ని తన నుండి ప్రక్కకు మరల్చటానికి తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నది. ప్రపంచ మార్కెట్లలో క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైకి చేరటం భారత్ ఆర్థిక వ్యవస్థకు అశనిపాతం. భారత్ చమురును రష్యా నుండి బాబెల్ మాండెబ్ ద్వారానే దిగుమతి చేసుకుంటున్నది. ఈ ప్రాంతంలో అనిశ్చిత పరిస్థితి సహజంగానే ఆందోళన కలిగించే అంశం. ఇరాన్, ఒమన్‌లతో మనకున్న సత్సంబంధాలను ఉపయోగించి బాబెల్ మాండెబ్ ద్వారా మన చమురు దిగుమతు లకు ఆటంకం లేకుండా చేయటానికి దౌత్య ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. ఇదే సమయంలో సౌదీతో సంబంధాలు చెడిపోకుండా చూసుకోవాలి. ఇది కత్తిమీద సామే.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
మంత్రుల ఆదాయ పన్ను ప్రజలెందుకు చెల్లించాలి?
ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. దురదృష్టవశాత్తు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేని కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ డబ్బులు, వారికి బాకీ ఉన్న డీఏలు చెల్లించడంలో సమస్యలు ఎదుర్కొంటోంది. ప్రతి నెల ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కష్టపడాల్సి వస్తోంది. ఫీజ్ రియింబర్స్‌మెంట్ చెల్లింపుల సమస్యపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదాయానికి సంబంధించి అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రుల, మంత్రుల హోదా కలిగిన వారి ఆదాయ పన్నును చెల్లించడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు.తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించక ముందు నుండి ఈ విధానం అమలులో ఉంది. వేతనాల చెల్లింపు చట్టం 1953లోని సెక్షన్ 3 (4) ప్రకారం క్యాబినెట్ హోదా కలిగిన మంత్రుల ఆదాయం పన్నును ప్రభుత్వం చెల్లిస్తుంది. వీరితోపాటు క్యాబినెట్ హోదా కలిగిన ప్రభుత్వ సలహాదారుల, కార్పొరేషన్ చైర్మన్ల ఆదాయం పన్నును కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. మంత్రులు వారి సేవలకు గాను ఆదాయం పొందుతున్నారు. ఇది వ్యక్తిగత ఆదాయం కిందకు వస్తున్నందునమంత్రులు వారి ఆదాయం పన్నును వారే చెల్లించాలి.వీరి ఆదాయ పన్నును ప్రభుత్వం చెల్లించడం చట్టం ముందు అందరూ సమానమే అన్న రాజ్యాంగ మూల సూత్రం ఆర్టికల్ 14కు వ్యతిరేకం. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి ఆదాయ పన్నును వారే చెల్లి స్తారు. ఈ కారణంగా ప్రభుత్వం వారి ఆదాయం పన్నును చెల్లించడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు. ఇప్పటికే ఈ విధానాన్ని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, హరియాణా వంటి రాష్ట్రాలు రద్దు చేశాయి. తెలంగాణ కూడా వారి బాటలో పయనించడం మంచిది.ఇదీ చదవండి: వరదలకు జనాభా కారణమా?ప్రభుత్వం చెల్లిస్తున్న మంత్రుల ఆదాయం పన్ను చెల్లింపుదారులది. అంటే ప్రజలది. ప్రజాధనాన్ని ప్రభుత్వం ఏ రకంగా ఖర్చు చేస్తున్నదో తెలుసుకునే అధి కారం 2005 సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రజలకు ఉంది. ఈ అంశాన్ని రాష్ట్ర గవర్నర్ దృష్టికి కూడా తేవడం జరిగింది. మంత్రులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న ఆదాయం పన్ను వివరాలను ప్రభుత్వం తన వెబ్సైట్లో ఉంచాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం పారదర్శకంగా పనిచేయాలి. ఈ అంశం దేశభద్రతకు లేదా విచారణలో ఉన్న నేరాలకు, విదేశీ సంబంధాలకు సంబంధించినది కాదు.– డాక్టర్ పి. మోహన్ రావు మెంబర్, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ -
వరదలకు, జనాభా పెరుగుదలకు సంబంధం ఉందా?
హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోంది. జనాభా కూడా వేగంగా పెరుగుతోంది. ఉపాధి, విద్య, వైద్యం, రవాణా వంటి అవకాశాల కోసం ప్రజలు హైదరాబాద్ ప్రాంతానికి చేరుతున్నారు. ఈ మార్పులు నగర రూపంపై మాత్రమే కాకుండా సహజ జల మార్గాలు, చెరువులు, నాలాలు, బహిరంగ ప్రదేశాలు, వరద మైదా నాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో వేగంగా విస్తరిస్తున్న హైదరాబాదుకు ఎదురవుతున్న ముఖ్యమైన సవాళ్లలో పట్టణ వరద ముప్పు ప్రధానమైనది.గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాదులో ఐటీ రంగం, ఉపాధి అవకాశాలు, రియల్ ఎస్టేట్, రవాణా సదుపాయాలు, ఇతర ఆర్థిక కార్యకలాపాలు నగర విస్తరణకు ఊతమిచ్చాయి. ఈ విస్తరణ సహజ జల వ్యవస్థల సామర్థ్యాన్ని తగ్గించే విధంగా సాగితే... అదే అభివృద్ధి భవిష్యత్తులో కొత్త ప్రమాదాలకు కారణమవుతుంది. మూసీని కేవలం ఒక నదిగా చూడటం సరికాదు; అది హైదరాబాదు నగరంలోని విస్తృత జల పారుదల వ్యవస్థలో కీలక భాగం. మూసీకి అనుసంధానమైన నాలాలు, చెరువులు, కాలువలు, వరద మైదానాలు కలిసి ఒక పెద్ద సహజ జల వ్యవస్థగా పనిచేస్తాయి. అందువల్ల మూసీ వరద ముప్పును అర్థం చేసుకోవాలంటే కేవలం నది ఒడ్డున ఉన్న ప్రాంతాలను మాత్రమే కాకుండా మొత్తం నగరంలోని నీటి ప్రవాహ వ్యవస్థను పరిశీలించాల్సిన అవసరం ఉంది.వేసుకోవాల్సిన అసలు ప్రశ్నలుహైదరాబాదు వరద చరిత్రలో 1908 సెప్టెంబర్ 28 ఒక విషాదకరమైన రోజు. మూసీ నదికి వచ్చిన భారీ వరద నగరాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. అయితే వరద ముప్పు అక్కడితో ముగియ లేదు; 2020 అక్టోబర్‌లో హైదరాబాద్ మరో తీవ్రమైన వరద పరిస్థితిని ఎదుర్కొన్నది. 1908తో పోలిస్తే నేటి నగరంలో జనాభా, నివాస ప్రాంతాలు, మౌలిక సదుపాయాలు విస్తృతంగా పెరిగాయి. అందుకే నేటి పట్టణ వరద ముప్పును కేవలం ‘ఎంత వర్షం పడింది?’ అనే ప్రశ్నతో మాత్రమే అర్థం చేసుకోలేం.జనాభా పెరుగుదల నేరుగా వరదలకు కారణం కాదు. ఈ క్రమంలో సహజ నీటి మార్గాలు, వరద మైదానాలు, చెరువుల పరిసరాలు నిర్మాణాల పరిధిలోకి వస్తే సమస్య తీవ్రమవుతుంది. కాంక్రీట్, తారు వంటి నీరు చొరబడని ఉపరితలాలు పెరగడంతో వర్షపు నీరు నేలలోకి ఇంకే సామర్థ్యం తగ్గి, ఫలితంగా నీరు వేగంగా ఉపరితలంపై ప్రవహిస్తుంది. జనాభా ఎక్కడ నివసిస్తుంది, సహజ నీటి మార్గాలు ఎక్కడ ఉన్నాయి, వర్షపు నీరు ఎక్కడికి వెళ్తుంది అనేవి ఈ సందర్భంగా గమనించాల్సిన ముఖ్యమైన ప్రశ్నలు. నిజానికి సమస్య జనాభా పెరుగుదలలో లేదు. జనాభా పెరుగుదలను నగర భౌగోళిక వ్యవస్థతో ఎలా సమన్వయం చేస్తున్నా మన్నదే ఇక్కడ కీలకమైన అంశం.ఇదీ చదవండి: 'నాజూకు ఫోన్లతో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు'1908 మూసీ వరద మనకు చరిత్రను గుర్తుచేస్తే... 2020 వరద వర్తమాన ప్రమాదాన్ని గుర్తుచేసింది. భవిష్యత్తులో ఎంత భారీ వర్షం పడుతుందో మన చేతుల్లో ఉండకపోవచ్చు. కానీ జనాభా ఎక్కడ పెరగాలి, సహజ నీటి మార్గాలను ఎలా రక్షించాలి, భూ వినియోగాన్ని ఎలా ప్రణాళికాబద్ధం చేయాలి అనే నిర్ణయాలు మాత్రం మన చేతుల్లోనే ఉన్నాయి. నగరం పెరగడం అనివార్యం, కానీ అది పెరిగే విధానం మాత్రం మన ఎంపిక. ఆ ఎంపికే రేపటి హైదరాబాదును వరదలను ఎదుర్కొనే సురక్షిత నగరంగా నిలబెడుతుందా లేక వరదలకు మరింతగా గురయ్యే నగరంగా మారుస్తుందా అని నిర్ణయిస్తుంది.– డాక్టర్ రామకృష్ణ మనిమద్దెఎర్త్ సైంటిస్ట్ – నదీ వ్యవస్థల పరిశోధకులు -
బ్రిక్స్: కొన్ని శేష సంభాషణలు
బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు ఒక బృహత్తరమైన విషయం అయినందున అందు గురించి చర్చించుకోవలసినవి అనేకంఉంటూనే ఉంటాయి. అందులోనూ ఆ సంస్థ కజాన్‌తో ఆరంభించి రియో డి జనేరో మీదుగా ఢిల్లీ వరకు ఒక కొత్త దశలోకి ప్రయాణిస్తూ వచ్చినపుడు. ఇటు వంటి దశలో మార్గ నిర్దేశనాలను స్థూలమైన రీతిలో ఎన్ని చేసుకున్నా, ప్రశ్నలూ సందేహాలూ కూడా అంతగా మిగిలే ఉండటం సహజం. ఐక్యత సాధ్యమేనా?వాటిలో అన్నింటికన్న ప్రధానమైనది బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ఐక్యత ప్రశ్న. ఇందుకు రెండు కోణాలున్నాయి. ఒకటి, ఆ దేశాల మధ్య ఏకాభిప్రాయాలు. రెండు, వారికి బ్రిక్స్ బయటి దేశాలతో గల సంబంధాలు. ఈ విషయాన్ని కొంత సూటిగా చెప్పుకుందాము. ఢిల్లీ సమావేశాలకు ముందూ, ఆ తర్వాతా పాశ్చాత్య మీడియా, పరిశీల కులతో పాటు ఇక్కడ కూడా పలువురు బ్రిక్స్‌లోని భిన్నత్వాలను చాలా ఎత్తి చూపారు. ఆ కారణంగా ఐక్యత సందేహాస్పదమన్నారు. వారు ఉదాహరించిన వాటిలో ముఖ్యమైనవి భారత–చైనా, ఇరాన్ –అరబ్ రాజ్యాల వివాదాలు.ఇవి ముఖ్యమైనవనటంలో సందేహం లేదు. అయితే, అవి ఉన్నప్పటికీ అందరూ ఒక చోట చేరటం, ఏకగ్రీవ ప్రకటనను విడుదల చేయటాన్ని కూడా విమర్శకులు అదే సమయంలో గుర్తించారు. అట్లా జరగటంలో భారతదేశపు దౌత్యనీతి కొంత పనిచేసిన మాట నిజమే అయినా, అంతకుమించిన మౌలిక కారణాలు ఉన్నాయనేది గమనించాలి. మొదటిది, పరస్పర సమస్యలు ఉన్న బ్రిక్స్ దేశాలకు కూడా బయటి శక్తుల నుంచి అంతకన్న పెద్ద సమస్యలు ఎదురవుతున్నాయి. పరస్పర సమస్యల పరిష్కారం కన్నా బయటి సమస్యల పరిష్కారం పెద్ద సవాలు అవుతున్నది. మొదట 2006లో ‘బ్రిక్’ ఏర్పడినా, 2010లో ‘బ్రిక్స్’గా మారినా, ఇపుడు 2026లో మరింత విస్తరించినా సభ్య దేశాల మధ్య కొన్ని సమస్యలు ఎప్పుడూ ఉన్నవే. ఉదాహరణకు ఇండియా–చైనా వివాదం. అది 2006 నాటికి కొన్ని దశాబ్దాలుగా ఉంది. ఒక యుద్ధం, కొన్ని ఘర్షణలు జరిగాయి. అయినప్పటికీ బ్రిక్స్లోనే గాక షాంఘై సహకార సంస్థ తదితరాలలోనూ చైనాతో పాటు సభ్య దేశంగా ఉండేందుకు భారత్ ఎందుకు అంగీకరించినట్లు?మూడు ముఖ్య దేశాలుపైన వేసుకున్న ప్రశ్నకు సమాధానం ఇందులోనే లభిస్తుంది. సభ్య దేశాలకు పరస్పర సమస్యలకన్న బయటి శక్తుల నుంచి ఎదు రవుతున్న సమస్యలు పెద్ద సవాళ్లవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే, బయటి శక్తుల నుంచి సమస్యలన్నవి వందల సంవత్సరాల వలస పాలనలతో మొదలై, సామ్రాజ్యవాదపు వివిధ చర్యల రూపంలో నేటికీ కొనసాగుతున్నాయి. అందుకే వీరు ఒకటి అవుతుండటమే గాక, బ్రిక్స్ పట్ల అన్ని ఖండాల దేశాలలో ఆకర్షణలు పెరుగు తున్నాయి. కనుక, ఈ విస్తృత చిత్రాన్ని గమనించినప్పుడు, పరస్పర సమస్యలన్నవి భూతద్దంలో చూడవలసినవిగా తోచదు. అయితే, ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ మధ్య సమావేశంలో ‘భిన్నాభిప్రాయాలు విభేదాలుగా మారకూడ’దన్న మాట ఒకటి వచ్చింది. అందులోని రెండు పదాలకు చాలా అర్థం ఉంది. అది ఇక్కడ చర్చించలేము. కానీ, వారు అదే అవగాహనతో ముందుకు సాగుతుండటం మాత్రం గమనించదగ్గది. అందులో పరస్పర ప్రయోజనాలతో పాటు బ్రిక్స్ స్ఫూర్తి ఉంది. బ్రిక్స్‌ను చైనా హైజాక్ చేస్తుందా అనే ప్రశ్న ఒకటి ఉన్నది గానీ అది వేరే వివరమైన చర్చ.ఇందుకు పొడిగింపుగా చెప్పుకోవలసింది ఒకటున్నది. బ్రిక్స్‌లో వేర్వేరు ఖండాల నుంచి ప్రధానమైన దేశాలు ఉన్నప్పటికీ, సంస్థకు వెన్నుదన్ను అనదగ్గవి ఇండియా, చైనా, రష్యాలే. ఈ మూడూ ఆర్థికంగా, శాస్త్ర సాంకేతికపరంగా, సైనికంగా, భౌగోళిక వైశాల్య పరంగా, జనాభా రీత్యా శక్తిమంతమైనవి. రాజకీయంగా చూసి నపుడు భారత్ ప్రజాస్వామికమైనది కాగా, తక్కిన రెండు స్థిరమైన వ్యవస్థలు. ఈ ముగ్గురికి కూడా వలస పాలనల కాలం నుంచి, ఆ తర్వాత వర్తమానంలోనూ వర్ధమాన దేశాలతో వెన్నంటి నిలిచిన పేరున్నది. బ్రిక్స్ పునాదులు కూడా 2006 నుంచి ఈ 2026 వరకు అవే. వర్ధమాన దేశాలకు బయటి శక్తులతో రాగల కాలంలో ఘర్షణాత్మక స్థితి ఏర్పడే కొద్దీ ఈ సంస్థకు నాయకత్వం వహించి నిలబెట్ట గలది, ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందించగలది, ఇపుడున్న అంతర్జాతీయ సంస్థలను సంస్కరించి వర్ధమాన దేశాలకు అవకా శాలు కల్పించేట్లు చేయగలది ఈ ముగ్గురి నాయకత్వమే. ఇదే సంద ర్భంలో మరొకటి కూడా చెప్పాలి. వర్ధమాన దేశాలకు బయటి శక్తు లతో రక్షణపరమైన సమస్యలు తలెత్తితే, ఈ ముగ్గురిలో ఇండియా, చైనాలు కాదు గానీ తమ సైన్యాలను పంపి ఆదుకునేందుకు సైతం రష్యా సిద్ధమే. ఇటీవల పశ్చిమ ఆఫ్రికాలో అదే జరుగుతున్నది.భారత ప్రభుత్వం గురించి దాపరికం లేకుండా మాట్లాడుకోవ లసిన విషయం ఒకటున్నది. ఇండియా బ్రిక్స్‌లో చేరింది కాంగ్రెస్ అధికారంలో ఉండిన 2006లో కాగా, బీజేపీ గెలిచిన 2014 నుంచి మోదీ ప్రభుత్వ వైఖరి బయటి ప్రపంచపు దృష్టిలో అనుమానా స్పదంగా మారింది. వైఖరిలో మార్పునకు కారణం దేశ ప్రయోజ నాలు అని చెప్పేవి అయితే కావచ్చు గాక, కానీ అనుమానాస్పదంగా మారింది నిజం. వర్ధమాన దేశాలకు హాని కలిగే విధంగా బయటి శక్తులకు సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నిస్తూ పోయారన్న మాటలు ఇంటాబయటా వినిపించాయి. గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం, వెస్ట్ బ్యాంక్ ఆక్రమణలు, వెనిజులా అధ్యక్షుని అపహరణ, ఇరాన్‌పై దాడుల సందర్భాలలో ప్రభుత్వ వైఖరులతో అనుమానాలు మరింత పెరిగాయి. ఇపుడు ఢిల్లీలో వైఖరి కొంత మారుతున్న సూచనలు కన్పించినందున, ఇది ఇక స్థిరపడుతూ పోగలదేమో చూడాలి. బయటి శక్తులతో ఇండియాకు సమస్యలు క్రమంగా పెరుగుతున్నందున అందుకు అవకాశాలైతే ఉన్నాయి. అసలు ఆయుధీకరణచివరగా చర్చించవలసినవి రెండున్నాయి. స్వేచ్ఛా నౌకా యాన ప్రశ్న, వనరుల ఆయుధీకరణ ప్రశ్న. ఈ రెండూ ఢిల్లీ సమావేశాల సందర్భంగా మరొకమారు ప్రస్తావనకు వచ్చాయి. స్వేచ్ఛాయానం హార్మూజ్ దిగ్బంధం నుంచీ, ఆయుధీకరణ అమెరికా అధ్యక్షుని ట్యారిఫ్ వార్‌తోనూ మొదలయ్యాయి. హార్మూజ్‌ను ఇరాన్ మూసి వేసింది శత్రు దాడుల నుంచి ఆత్మరక్షణకే తప్ప అంతకు ముందు ఎటువంటి మూసివేతలూ లేవు. దాడులు ఆగకుండా హార్మూజ్‌ను తెరవాలని ఒత్తిడి చేయడమంటే తమ ఆత్మరక్షణ సాధనాన్ని వదలుకుని లొంగిపోవలసిందిగా కోరటమే. స్వేచ్ఛాయానమన్న మాట దక్షిణ చైనా సముద్రం విషయంలోనూ ఉన్నా, బ్రిక్స్ చర్చల సంద ర్భం అది కాదు. పోతే, స్వేచ్ఛా యానాన్ని అమెరికా అట్లాంటిక్, పసిఫిక్లలో తమ ప్రత్యర్థులకు అనుమతించక పోవటాన్ని ఏమంటాం?అమెరికా అధ్యక్షుడు ట్యారిఫ్లను, సాంకేతిక పరికరాల ఎగుమతిని ఆయుధాలుగా మార్చటం మొదలు పెట్టినందునే చైనా, కెనడా, యూరప్ వంటివి ఎదురు ట్యారిఫ్‌లతో, కీలకమైన వనరుల ఎగుమతిపై ఆంక్షలతో ఆత్మరక్షణ వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. దీనంతటిలో ఏది ఆయుధీకరణ అవుతుంది, ఏది కాదు? అందు వల్ల, సమస్యకు గల కారణాలను వదలి సమస్యల గురించి మాత్రమే మాట్లాడటంతో పరిష్కారం లభించదు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
కావాల్సింది... 'ఇంటిగ్రేటివ్ ఇంటెలిజెన్స్'!
ఈ రోజు ఇక్కడికి రావడం నాకు ఎంతో గౌరవంగా ఉంది. యాభై ఏళ్ల క్రితం 1975లో ఇక్కడే పీజీపీ చదివిన నేను, మీలానే నేను కూడా ఆ రోజు ఇక్కడ గర్వంగా నిలబడ్డాను. అప్పుడు నా మనసులో ఎన్నో ప్రశ్నలు. మా కాలంలో మేము వరదలను తట్టుకోవాల్సి వచ్చింది. మీరు మాత్రం సునామీలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది కృత్రిమ మేధ యుగం. ఈ కొత్త ప్రపంచంలో మన ప్రయాణం ఎలా ఉండాలి? నేను నాలుగు ముఖ్యమైన విషయాలను మీతో పంచుకోవాలను కుంటున్నాను: అవి: ఇన్సైట్, ఇంటెన్షన్, ఇన్నర్ స్టిల్నెస్, ఇంపాక్ట్. ఈ నాలుగింటిని కలిపి ఇంటిగ్రేటివ్ ఇంటెలిజెన్స్ (సమగ్ర ప్రజ్ఞ) అంటాను. దీన్ని అనుసరించడం నా జీవితాన్ని మార్చింది. ఇన్సైట్ (లోతైన అవగాహన)ఒక్క దారిలోనే నడవడం కాకుండా, సుదూర ప్రపంచంలోని వివిధ విషయాలను తెలుసుకోండి! మీకు తెలిసిన పరిమితమైన ప్రపంచం నుంచి బయటకు రావాలి. మీ ఆలోచనల చిన్న పరిధి లోనే చిక్కుకుపోకండి. నా ఐఐఎం అహ్మదాబాద్ డిగ్రీ ఆధారంగా నేను న్యూయార్క్‌లోని మెక్న్సీ సంస్థలో చేరాను. నా చుట్టూ ఉన్న వాళ్లు తెలివైనవారు. వారిలో చాలామంది హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదివినవారు. అప్పటివరకు నేను కారు కూడా నడప లేదు. నా అసలైన గుర్తింపు– నా పనిలో నేను అత్యుత్తమంగా ఉండాలి. అందుకోసం ఎంతో కష్టపడ్డాను.ఇటీవల నేను ఒక నోబెల్ బహుమతి విజేతను కలిశాను. ఆయనకు ఇమ్యూనోథెరపీ రంగంలో నోబెల్ వచ్చింది. ఏ రంగంలో పరిశోధన ఎక్కువగా ఉపయోగపడిందని అడిగాను. ఆయన వెంటనే కంప్యుటేషనల్ బయాలజీ అన్నారు. కొన్నేళ్ల క్రితం వరకు ఆ రంగం గురించి తక్కువ మందికే తెలుసు. సంప్రదాయ పరిశ్రమలు కూడా మనం ఊహించలేనంత వేగంగా మారిపోతున్నాయి. ఉదాహ రణకు సంగీత పరిశ్రమను చూడండి. సీడీల నుంచి సునో వంటి ఏఐ సాధనాల వరకు వచ్చింది. అందువల్ల సృజనాత్మక రంగంలో ఉన్న వారు కూడా సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలి. మనలో చాలా మంది ఒక ప్రత్యేక రంగంలో నైపుణ్యం సంపాదించడానికి బిజినెస్ స్కూల్‌కు వస్తాం. కానీ మీకున్న ఆ రంగ జ్ఞానాన్ని ఏఐ మించిపోతుంది. అందుకే మీ ప్రత్యేకత ‘ఇన్సైట్’ కావాలి. మీ దృష్టి... కాలం, ప్రదేశం రెండింటినీ దాటిపోవాలి. మీ ఆలోచన ఎన్ని విభిన్న కోణాల్లో ఉంటే, కొత్త అవకాశాలను గుర్తించే అవకాశం అంత ఎక్కువగా లభిస్తుంది. వివిధ ఆలోచనల సంగమంతోనే గొప్ప ఆవిష్కరణలు సాధ్యమవుతాయి.ఇంటెన్షన్ (సంకల్పం)ఇన్సైట్ ప్రపంచాన్ని చూడటానికి మీకు సహాయపడుతుంది. కానీ మీరు ఏ దారిని ఎంచుకోవాలో, ఎంత కష్టమైనా దానిపై ఎలా నిలబడాలో నిర్ణయించడానికి ఇంటెన్షన్ అవసరం. సుమారు 25 సంవత్సరాల క్రితం విమానంలో నేను ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి’ పుస్తకం చదవడం ప్రారంభించాను. నా మనసులో ఎన్నో ప్రశ్నలు... విజయం అంటే ఏమిటి? ఎంత డబ్బుంటే సరిపోతుంది? నా జీవితంలో నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిన క్షణాలు ఏవి? అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. నేను జీవితంలో ఏ పని చేసినా, సంగీతానికి నా జీవితంలో మరింత ముఖ్యమైన స్థానం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. మార్పులు చాలా క్లిష్టమైనవి. కానీ మన కాళ్ల కింద నేలే మారి పోతే! 18 నెలల క్రితం మేము ఒక పెద్ద విజువల్ యానిమేషన్ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాం. రెండేళ్ల పని. వేల డాలర్ల ఖర్చు. ప్రాజెక్ట్ సగం పూర్తయ్యే సమయానికి ఏఐ అన్నింటినీ మార్చేసింది. ఏఐ ద్వారా తయారైన చిత్రాలు మరింత బాగున్నాయి, వేగంగా తయా రవుతున్నాయి, ఖర్చు కూడా తక్కువ. ఇది అమెరికా పశ్చిమ తీరానికి చెందిన ఇద్దరు పీహెచ్డీ విద్యార్థుల పని. ఇది కేవలం సాంకేతికత సమస్యే కాదు. మనుషుల సమస్య కూడా. ఏళ్లుగా పని చేసిన కొంత మంది ఉద్యోగుల నైపుణ్యాలు ఒక్కసారిగా అవసరం లేనివిగా మారిపోయాయి. కొత్త ప్రపంచంలో విశ్లేషణ చేయగలిగితే సరిపోదు, ఊహాశక్తి అవసరం. ఒకే సమయంలో విభిన్న రంగాల గురించి ఆలోచించగల వ్యక్తులకే భవిష్యత్‌లో అవకాశాలు ఎక్కువ. ఇన్నర్ స్టిల్నెస్ (అంతర్గత ప్రశాంతత)ఇంతకుముందు బిజినెస్ స్కూల్స్‌లో మనస్సును ఎలా నిర్వ హించుకోవాలనే విషయం గురించి మాట్లాడేవారు కాదు. అది వ్యక్తి గత విషయం అని భావించేవారు. కానీ ఇప్పుడు ప్రతి రంగంలోనూ మానసిక ఆరోగ్యం, ప్రశాంతత, మనిషి సంపూర్ణ వికాసం... ముఖ్యమైన విషయాలుగా మారాయి. సంగీతంపై ఇష్టం నాకు ధ్యానం వైపు దారి చూపించింది. నా జీవితంలో సమస్యలు లేవని కాదు. కానీ వాటికి నేను స్పందించే విధానం మారిపోయింది. ప్రశాంతతతో నా ఆలోచనల్లో స్పష్టత వచ్చింది. ముఖ్యంగా, నాకు ఇతరుల పట్ల కరుణ, నా మీద నాకు నమ్మకం, ప్రపంచంలోని ప్రతి జీవితో అనుబంధం అనే భావన బలపడింది. ‘వసుధైవ కుటుంబకం’ అంటే ఏమిటో ప్రత్యక్షంగా అనుభవించినట్టు అనిపించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఇంటిగ్రేటివ్ ఇంటెలిజెన్స్ అంటే మనిషిగా మన సంపూర్ణ తను కాపాడుకోవడం.ఇంపాక్ట్ (ప్రపంచంపై ప్రభావం)మీరు నివసిస్తున్న ప్రపంచంలోని చిన్న భాగాన్ని అయినా మీరు ఇంతకంటే మెరుగైన ప్రదేశంగా మార్చాలి. సంగీతం నన్ను లోతుగా స్వస్థపరిచింది. అందుకే ఆ అనుభవాన్ని ఇతరులతో పంచుకోవా లనుకున్నాను. దీంతో నేను సంస్కృత గ్రంథాలపై పరిశోధన ప్రారంభించాను. ముఖ్యమైన గ్రంథాల అసలు భావాలను తీసుకుని, ప్రపంచంలోని ఆధునిక కళాకారులతో కలిసి అందరూ పాడగలిగే సంగీతాన్ని రూపొందిస్తున్నాను. నాకు గ్రామీ అవార్డు కూడా ఈ రంగంలోనే వచ్చింది. విద్యార్థుల్లారా... సేవ చేయడానికి సిద్ధమవండి. పెద్ద స్థాయి లోనే ప్రారంభించాల్సిన అవసరం లేదు. మీ పాఠశాల నుంచి మొదలుపెట్టండి. మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. మీరు చేయగలిగేది ఒక్కటే... మీ జీవితమనే పడవను సిద్ధం చేసుకోండి. స్వచ్ఛమైన జ్ఞానం మీకు ప్రతిరోజూ మార్గదర్శనం చేయాలి. -
జిన్‌పింగ్ (చైనా అధ్యక్షుడు) రాయని డైరీ
నిజాన్ని ఎంత లోతుకు పాతి పెట్టినా ఏదో ఒకనాటికైనా అది మొలకెత్తకుండా ఉండ లేదు. చేవ లేని అబద్ధపు చెట్టును మోసుకొచ్చి ఎంత సారవంతమైన భూమిలో నాటినా, ఏనాటికీ అది చిన్న చిగురైనా వేయలేదు. నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, ఇండియాలో బ్రిక్స్ సదస్సులో ప్రసంగిస్తున్న ప్పుడు నాకు తీవ్రాతి తీవ్రంగా ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చిందని, అందుకే నేను ఇండియా ఏర్పాటు చేసిన అధికారిక విందులో కనిపించలేదని, ఇండియా నుంచి అర్ధంతరంగా చైనాకు తిరిగి వచ్చాక, అత్యవసర చికిత్స కోసం హుటాహుటిన నన్ను బీజింగ్‌లోని చైనీస్ పీపుల్స్ ఆర్మీ జనరల్ హాస్పిటల్‌కు తరలించా రని... వాంజున్ జియ్ అనే మనిషి గత వారంరోజులుగా ప్రపంచం అంతటా ప్రధాన కూడళ్లలో అబద్ధపు చెట్లను నాటే పనిలో ఉన్నాడు. ‘చైనా డెమోక్రసీ పార్టీ’ నాయకుడినని చెప్పుకుంటూ అమెరికాలో ఉంటున్న వాంజున్ జియ్ తనకై తనే ఒక పెద్ద అబద్ధం. చైనాలో అతడి ‘చైనా డెమోక్రసీ పార్టీ’ చట్ట విరుద్ధం. తియానన్మెన్ స్క్వేర్ నిరసనకారుడు అతడు. 25 ఏళ్ల క్రితమే చైనా నుంచి పారిపోయిన వాడు. పారిపోయి, ‘జోంగ్నాన్హాయ్’పై రోజుకో అసత్యాన్ని రాయిలా విసురుతున్నవాడు.‘జోంగ్నాన్హాయ్’... చైనా కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కార్యాలయం. వాంజున్ జియ్ చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వ వ్యతిరేకి. ‘‘ఈ డెమోక్రాటిక్ గుడ్లగూబను ఏం చేద్దాం కామ్రేడ్?’’ అని అడిగాను వాంగ్ని. ‘‘కొన్ని సందర్భాలలో ఏమీ చెయ్యకుండా ఉండటమే ఏదైనా చెయ్యటం అవుతుంది మిస్టర్ ప్రెసిడెంట్’’ అన్నారు వాంగ్! వాంగ్ విదేశాంగ మంత్రి. ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ సీనియర్ దౌత్యవేత్త. అంతకన్నా కూడా నాకు నమ్మకస్థుడు. బ్రిక్స్ డిన్నర్లో నేను లేకపోవటానికి కారణం... హోటల్ గదిలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని నా మనసు కోరుకోవటం తప్ప మరింకేమీ కాదు. గ్లాసులు పైకెత్తి ‘టోస్ట్’ చెప్పుకునే సందడి కంటే కూడా, కొన్నిసార్లు నాకు నిశ్శబ్దమే తృప్తికరమైన డిన్నర్లా ఉంటుంది. సెప్టెంబర్ 24న వైట్ హౌస్‌లో ట్రంప్‌తో సమావేశం. ఆ వివరాలు చెబుతున్నారు వాంగ్.‘‘వైట్ హౌస్‌లో ఆరోజు అధికారిక ‘స్టేట్ డిన్నర్’ ఉంటుంది మిస్టర్ ప్రెసిడెంట్. డిన్నర్లో మీతో పాటు టెక్ టైకూన్ లు... టిమ్ కుక్, సామ్ ఆల్ట్మాన్, జెన్సన్ హువాంగ్ ఉంటారు. ఇక, ట్రంప్ మీకు గ్రాండ్ వెల్కమ్ చెప్పటానికి వైట్ హౌస్ లాన్ లో మీ కోసమే ప్రత్యేకంగా కొత్త హెలిప్యాడ్‌ను కట్టించారు... ’’ అని చెప్పారు వాంగ్ యీ! వాంగ్ సాధారణంగా ముఖ్యమైన వివరాలను మాత్రమే నాకు చెబుతారు. మిగతావన్నీ తనే చూసుకుంటారు. నిజానికి డిన్నర్ కంటే ముఖ్యంగా... వాషింగ్టన్లో నేను మాట్లాడవలసినవి చాలానే ఉన్నాయి. వాణిజ్య సుంకాల ఇష్యూ ఉంది. ఏఐ నియంత్రణల ఒప్పందాలు ఉన్నాయి. రక్షణ, వ్యాపార రంగాలలో ఇచ్చిపుచుకోవడం ఉంది. రేర్ ఎర్త్ ఖనిజాలపై కీలక చర్చలు ఉన్నాయి. తైవాన్ కు అమెరికా ఆయుధాల సరఫరా జరగకుండా ఆపటమూ ఉంది. ఇన్ని ముఖ్యమైన వాటిని వాంగ్ తను చూసుకోగలనని అనుకుంటున్నారంటే... వైట్ హౌస్ స్టేట్ డిన్నర్ ఇంకెంత ముఖ్యమైనదో ఆయనకు క్లారిటీ ఉన్నట్లుంది. ‘‘మిస్టర్ ప్రెసిడెంట్, సెప్టెంబర్ 12న ఇండియాలో మీరు డిన్నర్ చేయకుండా, సెప్టెంబర్ 24న వైట్ హౌస్‌లో డిన్నర్ చేశారంటే... ఇండియాలోని చైనీయులు, చైనాలోని ఇండియన్లు ఏమీ అనుకోరు. కానీ ఇండియాలో డిన్నర్ చేయలేదు కనుక, వైట్ హౌస్‌లోనూ డిన్నర్ చేయకుండా ఉన్నారంటే... అమెరికాలోని చైనీస్ డెమొక్రాట్లు, చైనాలోని అమెరికన్ డెమొక్రాట్లు మళ్లీ మీ ఆరోగ్యం గురించి ఎవరికి తోచిన హెల్త్ బులెటిన్లు వాళ్లు విడుదల చేసే అవకాశం ఉంది’’అన్నారు వాంగ్. ఆయనేమీ నవ్వుతూ ఆ మాట అనలేదు. -
రైట్‌కు మొగ్గుతున్న యూరప్?
ఈ నెల సెప్టెంబర్‌లో జర్మనీ, స్వీడన్లలో జరిగిన ఎన్నికల ఫలితాలు యూరప్‌లో జాతీయవాద రైట్‌వింగ్ పార్టీలు యూరప్ రాజకీయాలను శాసించబోతున్నాయనే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. తూర్పు జర్మనీలోని సాక్సోని– ఆన్హాల్త్ రాష్ట్రంలో ‘ఆల్టర్నేటివ్ ఫ్యూఆర్ డోయిచ్లాంట్’ (ఏఎఫ్‌డీ) పార్టీ ఘన విజయం పరిశీలకులను దిగ్భ్రమకు గురి చేసింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీలో మొట్టమొదటి సారి ఒక రాష్ట్రంలో రైట్‌వింగ్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. సెప్టెంబర్ 13న స్వీడన్లో జరిగిన జాతీయ పార్లమెంటరీ ఎన్నిక లలో ప్రాథమిక ఫలితాల ప్రకారం రైట్‌వింగ్ కూటమికీ, వామపక్ష సెంట్రిస్ట్ కూటమికీ మధ్య హోరాహోరీ పోరాటం జరిగింది. కేపిటలిస్ట్ పంథా వైపు...ఒకప్పుడు రైట్‌వింగ్ పక్షాలను దూరంగా ఉంచిన సెంట్రిస్ట్, వామపక్ష పాలక వర్గాలు వాటితో చేతులు కలిపి ఎన్నికలలో పాల్గొ నటానికి, ప్రభుత్వాలను ఏర్పాటు చేయటానికి సిద్ధమవుతున్నాయి. కొన్ని దేశాలలో రైట్‌వింగ్ పొలిటికల్ పార్టీలు ఇప్పటికే అధికారంలోనికి వచ్చాయి. ఇటలీలో మెలోని నాయకత్వంలో రైట్‌వింగ్ ‘బ్రదర్స్ ఆఫ్ ఇటలీ’ పార్టీ ఇప్పటికే అధికారంలోకి వచ్చింది. ఫిన్లాండ్, క్రొయేషియా, స్లొవేకియా, చెక్ రిపబ్లిక్లలో ప్రభుత్వాలు రైట్‌వింగ్ పార్టీల మద్దతుపై ఆధారపడుతున్నాయి. యూరోపియన్ పార్లమెంటులో రైట్‌వింగ్ పార్టీల కూటమి రెండవ అతిపెద్ద కూట మిగా ఏర్పడింది. ఫ్రాన్స్‌లో రీఅసెంబెల్మెంట్ నేషనల్ పార్టీ, నెదర్లాండ్స్‌లో పార్టీ ఫర్ ఫ్రీడమ్, యూకేలో రీఫార్మ్ యూకే పార్టీ, ఆస్ట్రియాలో ఫ్రీడమ్ పార్టీ, అర్జెంటీనాలో లాలిర్టడ్ అవంజా వంటివి ఐరోపా, లాటిన్ అమెరికాలలో రైట్‌వింగ్ భావజాలానికి ప్రతీకలు. 1990వ దశకపు గ్లోబలైజేషన్ నేపథ్యంలో ఐరోపా, లాటిన్ అమెరికాలలోని వామపక్ష పార్టీలు కూడా క్రమంగా పెట్టుబడిదారీ (కేపిటలిస్ట్) పంథా వైపు మరలాయి. 2010 సంవత్సరంకల్లా లాటిన్ అమెరికాలో తీవ్ర ద్రవ్యోల్బణం ఏర్పడి ఆహారం వంటి కనీస వస్తు వులకు కొరత ఏర్పడి ఉచిత సంక్షేమ పథకాల ప్రాతిపదికన ఏర్పడిన ప్రభుత్వాలు సంక్షోభంలోనికి నెట్టబడ్డాయి. రైట్‌వింగ్ ఎదుగుతున్న తీరుఅగ్నికి ఆజ్యం తోడయినట్లు ఐరోపాలో ఆర్థిక సమస్యలకు వలసలు, వలసదారుల ప్రేరేపిత ఉగ్రవాద చర్యలు, ఉనికి (ఐడెంటిటీ) భయాలు రైట్‌వింగ్ పార్టీలు, జాతీయ భావజాలానికి దోహద పడ్డాయి. మితవాద, వామపక్ష ప్రభుత్వాలు ఐరోపాలోకి విచక్షణా రహితంగా ఆసియా–ఆఫ్రికాల నుండి వలసలను అనుమతించాయి. రాడికల్ ఇస్లామిక్ భావజాలం వేళ్లూనుకున్న సిరియా, జోర్డాన్, లెబనాన్, పాలస్తీనా, అఫ్గానిస్తాన్, అల్జీరియా, మొరాకో, నైజీరియా వంటి దేశాల నుండి వచ్చిన వలసదారుల పాత్రలో గ్యాంగ్ వార్లు, మెట్రోస్టేషన్లో పబ్లిక్ ప్రదేశాలలో బాంబు బ్లాస్టులు భద్రతా భయా లను లేవనెత్తాయి. వలస ప్రజలు యూరప్ నగరాలలో కొన్ని ప్రాంతాలలో కేంద్రీకృతమై సమాంతర సంస్కృతులను, సమాజా లను ఏర్పరచుకోవటం; కొన్ని సందర్భాలలో షరియాను పాటించటం, ప్రభుత్వాలకు సవాలుగా తయారయ్యాయి. వలస వచ్చిన వారు ఐరోపా సంస్కృతిలో సమ్మిళితమవకుండా తమ సంస్కృతి చిహ్నాలను బాహాటంగా ప్రదర్శించటం స్థానికులలో తమ సంస్కృతి ఉనికిపై సందేహాలు, అనుమానాలను లేవనెత్తాయి. ఈ నేపథ్యంలో వలసలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, స్థానిక సంస్కృతుల పరిరక్షణ, జాతీయ ప్రయోజనాలు ప్రథమ కర్తవ్యమనే అజెండాతో వచ్చిన రైట్ వింగ్ రాజకీయ పక్షాలు ప్రజలను ఆకర్షించాయి. మితవాద, లిబ రల్, వామపక్ష పార్టీలలో వలస సంతతి పౌరులు కీలక స్థానాలను ఆక్రమించారు. స్థానిక సంస్కృతి అంతరించి పోతుందనే రైట్‌వింగ్ నినాదం స్థానిక సంతతి ప్రజలను చైతన్యపరిచింది. ఐరోపాలోని అనేక దేశాల వామపక్ష, లిబరల్ ప్రభుత్వాలు ఈ ప్రమాద ఘంటిక లను పసిగట్టి కొంత వరకు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాయి.2021లో సామ్‌సల్ పాటీ అనే ఉపాధ్యాయుడి తలను ఇస్లామిక్ ఉగ్రవాది నరికి వేసిన సంఘటన తరువాత ఫ్రాన్స్ వేర్పాటువాద వ్యతిరేక చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం ద్వారా ప్రార్థనా స్థలాలు, మత సంబంధిత పాఠశాలలు, మతప్రవచనాలు, మత సంస్థలకు విదేశీ నిధులపై నియంత్రణ, ఆంక్షలను విధించింది. బహిరంగ ప్రదేశా లలో ముఖాలపై ముసుగును నిషేధించింది. 2018లో డెన్మార్క్‌లో కూడా ముఖాలపై బహిరంగ ప్రదేశాలలో ముసుగును నిషేధించారు. జర్మనీ, ఆస్ట్రియా, స్వీడన్, నెదర్లాండ్స్, బెల్జియం వంటి దేశా లలో కూడా మత సంస్థలు, మత ప్రవచనాలు, మత సంప్రదాయా లను నియంత్రిస్తూ అనేక చర్యలను తీసుకున్నాయి. రైట్‌వింగ్ జాతీయవాద భావజాల వృద్ధి ఐరోపా విధానాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నది. వలస, ఆర్థిక, విదేశాంగ, పర్యావ రణ, సాంస్కృతిక విధానాలలో పెను మార్పులు చోటు చేసుకుంటు న్నాయి. ఇటలీ వలస శరణార్థులను ఆల్బేనియాకు పంపించే ప్రయ త్నాలు చేస్తున్నది. టిడో ఒప్పందం కింద స్వీడన్, పౌరసత్వం, డీపోర్టేషన్ నిబంధనలను కఠినతరం చేసింది. అర్జెంటీనాలో మీలి ప్రభుత్వం సబ్సిడీలను తగ్గించి పలు ఆర్థిక మదుపు చర్యలను చేపట్టింది. ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, జర్మనీలు యూరోపియన్ యూనియన్ను సంస్కరించాలని పట్టుబడుతున్నాయి. రష్యాపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలను ఆస్ట్రియా వ్యతిరేకిస్తున్నది. రైట్‌వింగ్ పార్టీలు ‘గ్రీన్ ఎనర్జీ’ సిద్ధాంతాన్ని ఆమో దించటం లేదు. కర్బన ఉద్గారాలను నియంత్రించే చర్యలను సమ ర్థించటం లేదు. జర్మనీ, నెదర్లాండ్స్, ఇటలీ, పోలండ్లు ఇప్పటికే రెన్యువబుల్ ఎనర్జీ లక్ష్యాల నుండి పక్కకు వచ్చి బొగ్గు, సహజ వాయువు, చమురు వంటి శిలాజ ఇంధనాలు, అణు ఇంధ నాలవైపు మొగ్గు చూపుతున్నాయి. ఎల్జీబీటీ, సరోగసీ, అబార్షన్ వంటి సున్నిత సామాజిక అంశాలలో రైట్‌వింగ్ భావజాల ఒత్తిడితో హంగరీ, ఇటలీ, పోలండ్ వంటి దేశాలు కఠిన చట్టాలు, నిబంధన లను తీసుకుని వచ్చాయి. భారత్‌పై ప్రభావం ఏమిటి?ఐరోపాలో రైట్‌వింగ్ భావజాలం వల్ల భారతదేశంపై పడే ప్రభావాన్ని నిశితంగా పరిశీలించాలి. దౌత్యపరంగా ఇది భారత్‌కు ఒక రకంగా స్వాగతించదగిన అంశం. దశాబ్దాలుగా ఐరోపా దేశాలు, యూఎస్ఏ... భారత్ అంతర్గత విషయాలైన మైనారిటీ హక్కులు, మత అంశాలు, మానవ హక్కులపై మనకు ఉపన్యా సాలు, ప్రవచనాలు వినిపించేవారు. తమదాకా వచ్చేదాకా తెలియ దన్నట్లు ఐరోపాకు ఇప్పుడు తత్వం బోధపడుతున్నది. ఈ అంశా లలో భారత్‌పై ప్రపంచ స్థాయిలో ఒత్తిడి తగ్గే అవకాశం ఉన్నది. రైట్‌వింగ్ పార్టీలు ఐరోపా పర్యావరణ సుంకాలను వ్యతిరేకించటం కూడా మనకు కలిసివచ్చే అంశం. ఉదాహరణకు ఐరోపా అవలంబిస్తున్న ‘కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం (సీబీఏఎమ్) తొలగిస్తే ఉక్కు, అల్యూమినియం వంటి భారత ఎగుమతులకు మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉన్నది. అయితే ఐరోపా– భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై నీలినీడలు కమ్ముకోవచ్చు. కఠిన వలస విధానం వల్ల భారత విద్యార్థులు, ఐటీ నిపుణులు ఐరోపాలోకి ప్రవేశించటం కష్టమయ్యే అవకాశం ఉన్నది.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
నాజూకు ఫోన్లతో పెరుగుతున్న రోగాలు!
మన దేశంలో రోగాలు ఎక్కువ. ప్రపంచ జనాభాలో 17 శాతం గల మనం 20 శాతం ప్రపంచ రోగాల భారాన్ని మోస్తున్నాం. 60 శాతం రోగాలు జీవనశైలితో కొనుక్కున్నవే. మన శారీరక రోగాలకు, మానసిక రోగాలు, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక రుగ్మతలు, పాలకవర్గ విధాన లోపాలు, ప్రజల ఆలోచనా దారిద్య్రం ఎప్పుడో తోడయ్యాయి. సాంకేతిక పరికరాల, ఉపకరణాల అతిక్రియాశీలతలు మన ఆరోగ్య వ్యవస్థలో మనకు తెలియకుండానే చొర బడ్డాయి. మొన్నటి టెలివిజన్లకు, సంగణిక యంత్రాల (కంప్యూటర్ల)కు నేటి నాజూకు (స్మార్టు) ఫోన్లు అదనపు రాచపుండ్లు (క్యాన్సర్లు).నిద్రపోయేటప్పుడు తప్ప మిగతా సమయాల్లో, శిశువుల నుండి వృద్ధుల దాకా, సెల్ ఫోన్లలో దూరే ఉంటారు. సెల్ఫోన్ల అతివినియోగం అనేక ప్రధాన శారీరక, మానసిక, సామాజిక నష్టాలు కలిగిస్తుంది. సాంఘిక నైపుణ్యతలు, ఆలోచనశక్తి, సృజనాత్మకత మాయమవుతాయి. సెల్ఫోన్ల అతివాడకం వల్ల ఒంటరి తనంతో ఏ విషయం మీద దృష్టి కేంద్రీకరించలేము. చిరాకు, అసహనం, అసంతృప్తి, కోపం పెరుగుతాయి. మొత్తంగా మనుష్య సంబంధాలు దెబ్బతింటాయి. మన దేశంలో మానసిక రుగ్మతలు ఎక్కువ. 92 శాతం మంది మానసిక రోగులు సమయానికి చికిత్స తీసుకోరు. గ్రామాల కంటే పట్టణాలలో మానసిక రోగాలు ఎక్కువ. సిగ్గు, అజ్ఞానం, స్వీయ విశ్వాసాలతో, దీన్ని రోగంగా పరిగణించక ఈ మానసిక రోగానికి చికిత్స చేయించుకోరు.ప్రత్యేక వైద్యశాస్త్రంనేటి నాజూకు ఫోన్ల నేపథ్యంలో మానసిక విభాగ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల అవసరం పెరుగుతోంది. ఇందులో సెల్‌ఫోన్ వినియోగ బాధితులకు ప్రత్యేక చికిత్సా విభాగం ఉండాల్సివచ్చేలా ఉంది. అందులో సెల్‌ఫోన్ ఉపయోగ దుష్పరిణామాల వైద్యం అతిప్రత్యేక అధ్యయన వైద్యశాస్త్రం కాగలదు. అలాగే ఇవాళ ప్రపంచంలో మితవాద పాలన పెరుగుతోంది. ప్రత్యేకించి మన దేశంలో నేటి పాలకులు కార్పొరేట్ మతవాదపు కొత్త సామాజిక రోగాన్ని రాజకీయంగా ప్రారంభించారు.ఇదీ చదవండి: సోషల్ మీడియా ఉచ్చులో పిల్లలు చిక్కుకోకుండా ఉండాలంటే..?ఆంధ్రప్రదేశ్ కూటమి పాలనలో ఈ మత కుల వివక్షలతో సమాజ విభజన, ప్రజల చీలిక కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ కుల, మతపిచ్చి చికిత్సకు కూడా అతిప్రత్యేకతల రాజకీయ సామాజిక ఆస్పత్రుల అవసరం పెరిగింది. పాలకుల రాజ్యాంగ, ప్రజాస్వామ్య, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను రాజకీయంగా, సామాజికంగా చైతన్యపరచడం, నిరసనలు, పోరాటాలు నిర్వహించడం, అదునుచూసి ప్రభుత్వాలను దింపడం మాత్రమే పరిష్కారం.- సంగిరెడ్డి హనుమంతరెడ్డి ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి, ప్రొద్దుటూరు -
అంచులే కేంద్రంగా మారుతున్న కాలం
మోదీ శకంలో చిరకాలం నిలిచిపోయే గొప్ప విజయం ఏదైనా ఒక రహదారి, పథకం, సంస్కరణ లేదా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో కనిపించకపోవచ్చు. అంతకంటే లోతైన అంశంలో అది ఉంది. భారత ప్రధాన స్రవంతి విస్తరించటమే ఆ విజయం. నేను భారత రాష్ట్రపతిగా ఉన్న కాలంలో 2017 నుంచి 2022 వరకు ఐదేళ్ల పాటు ఆయనను ప్రధానమంత్రిగా దగ్గరగా గమనించాను. ఆ అనుభవంతో పాటు ప్రజా జీవితంలో ఆయనతో నాకున్న అనుబంధం ఆధారంగా, ఆయన జన్మదినం సందర్భంగా కొన్ని ఆలోచనలు పంచుకోవాలనుకుంటున్నాను. 2001 అక్టోబర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదలై, 2014 నుంచి ప్రధానమంత్రి కార్యాలయం వరకు ఎన్నికైన ప్రభుత్వానికి 25 ఏళ్లపాటు నాయకత్వం వహించిన ప్రధాని మోదీ... ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనే సరళమైన, పరివర్తనాత్మక ఆలోచనను నిరంతరం ముందుకు తీసుకెళ్లారు. ఆయన సమ్మిళిత రాజకీయాలకు నిర్వచనంగా మారిన మరో భావన దీనికి కేంద్రం: ‘జిస్కో కిసీ నే నహీ పూఛా, ఉస్కో మోదీ నే పూజా’. అంటే ఎవరూ పట్టించుకోని వారికి మోదీ ప్రాధాన్యం ఇచ్చారు. చివరి అంచె వరకు అభివృద్ధిని తీసుకెళ్లటమే కాకుండా, ఆ అంచుల్లో ఉన్నవారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకు రావటం మోదీ శకంలో అత్యంత ప్రభావవంతమైన మార్పు కావచ్చు.మారిన ఈశాన్య కథస్వాతంత్య్రం తర్వాత దశాబ్దాలపాటు భారత అభివృద్ధి ఆలోచనలో ఒక కేంద్రం, దానికి వెలుపల పరిధి ఉన్నట్లు భావించేవారు. కొన్ని ఆకాంక్షలకు జాతీయ చర్చలో అసలు చోటే దక్కలేదు. ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిందా అన్నది ఇప్పుడు ప్రశ్న కాదు. దాని ప్రయోజనం పొందే అవకాశం చివరి వ్యక్తికి నిజంగా చేరిందా లేదా అన్నదే అసలు ప్రశ్న. ఈ మార్పును ఈశాన్య ప్రాంతం కంటే మెరుగ్గా వివరించే ఉదాహరణలు చాలా తక్కువ. దశాబ్దాలపాటు ఈశాన్య ప్రాంతాన్ని భారతదేశానికి దూరంగా ఉన్న సరిహద్దు ప్రాంతంగానే ఎక్కువగా భావించారు. మోదీ నాయకత్వంలో అది భారత్ ముఖంగా, ఆగ్నేయాసియాకు ప్రవేశ ద్వారంగా క్రమంగా గుర్తింపు పొందింది. 2014 నవంబర్ నుంచి ప్రధాని మోదీ 83 సార్లకు పైగా ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ ప్రాంతంలో 12 ప్రధాన శాంతి ఒప్పందాలు కుదిరాయి. అంతకుముందు దశాబ్దంలో దాదాపు రూ.1.4 లక్షల కోట్లు కేటాయించగా, 2014–15 నుంచి 2025–26 మధ్య అభివృద్ధికి రూ. 7 లక్షల కోట్లకు పైగా కేటాయించారు. బోగీబీల్ వంతెన, సెలా సొరంగం... కఠినమైన భౌగోళిక అడ్డంకులను అధిగమించాయి. బైరాబీ–సైరాంగ్ రైలు మార్గం ప్రారంభంతో మిజోరాంకు దేశంలోని మిగిలిన ప్రాంతాలతో తొలిసారి నేరుగా రైలు అనుసంధానం లభించింది. స్వాతంత్య్రం తర్వాత నాగాలాండ్‌కు తొలి రైల్వే స్టేషన్ వచ్చింది. గువాహటి ఎయిమ్స్ ఈశాన్య ప్రాంతంలో తొలి ఎయిమ్స్‌గా నిలిచింది. అసోంలోని సెమీకండక్టర్ కేంద్రం పూర్తిగా భిన్నమైన ఆకాంక్షకు ప్రతీక. ఒకప్పుడు ప్రధానంగా భౌగోళికంగా మారుమూల ప్రాంతంగా భావించిన చోట భారత్‌లోని అత్యాధునిక సాంకేతిక పరిశ్రమల్లో ఒకటి ఆవిర్భవించగలదన్న ఆలోచనకు ఇది రూపమిస్తోంది.‘చివరి గ్రామాల’ నుంచి ‘తొలి గ్రామాల’ వరకుఇదే మార్పు భారత సరిహద్దుల వెంబడి కూడా కనిపిస్తోంది. ఏళ్ల తరబడి మారుమూల జనావాసాలను సాధారణంగా దేశంలోని ‘చివరి గ్రామాలు’గా పేర్కొన్నారు. కానీ వైబ్రెంట్ విలేజెస్ కార్య క్రమం మారుమూల సరిహద్దు ప్రాంతాల్లో రహదారులు, అనుసంధానం, పర్యాటకం, జీవనోపాధి, అత్యవసర సేవల ద్వారా ఈ ఆలోచనకు సంస్థాగత రూపం ఇస్తోంది. ఆకాంక్షిత జిల్లాల కార్య క్రమం ద్వారా ఇదే సూత్రం దేశ అంతర్భాగానికీ విస్తరించింది. చరిత్రాత్మకంగా వెనుకబడిన 112 జిల్లాలు శాశ్వతంగా వెనుకంజ లోనే ఉంటాయని అంగీకరించకుండా... ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, జీవనోపాధిలో పురోగతిని వేగవంతం చేసేందుకు స్పష్టమైన ఫలితాలు, పథకాల సమన్వయం, పోటీతత్వ అభివృద్ధిని ఈ కార్యక్రమం ప్రవేశపెట్టింది. 2023లో 329 జిల్లాల్లోని 500 బ్లాకు లను ‘ఆకాంక్షిత బ్లాకుల కార్యక్రమం’ పరిధిలోకి తీసుకు రావడం ద్వారా ఈ విధానాన్ని మరింత లోతుగా తీసుకెళ్లారు. గత దశాబ్దంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ బడ్జెట్ 243 శాతం పెరిగింది. మొత్తం 75 ప్రత్యేకంగా బలహీన గిరిజన సమూహాలను పీఎం–జన్ మన్ పరిధిలోకి తీసుకొచ్చారు. గిరిజనులు అధికంగా నివసించే గ్రామాలు, పీవీటీజీ ఆవాసాల్లో దీర్ఘకాలంగా ఉన్న లోపాలను సమన్వయ ప్రభుత్వ చర్యల ద్వారా పరిష్కరిస్తూ ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ ఈ విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తోంది. 59 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు గతంలో అధికారిక ఆర్థిక వ్యవస్థకు వెలుపల ఉన్న కుటుంబాలను అందులో భాగం చేశాయి. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా ప్రభుత్వ సాయం లబ్ధిదారులకు నేరుగా చేరుతోంది. లీకేజీలను అరికట్టడం ద్వారా రూ. 5.14 లక్షల కోట్లకు పైగా మొత్తం ఆదాకు ఇది దోహదం చేసింది. సౌభాగ్య పథకం గ్రామీణ విద్యుదీకరణలో 100 శాతం లక్ష్యాన్ని సాధించింది. ఉజ్వల పథకం 10 కోట్లకు పైగా కుటుంబా లకు స్వచ్ఛ వంట ఇంధనాన్ని అందించింది. జల్ జీవన్ మిషన్ 13 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లను విస్తరించింది.‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అంటే...మహిళల గౌరవం, భద్రత, ఆరోగ్యంతో అత్యంత సన్నిహిత సంబంధం ఉన్న అంశాన్ని స్వచ్ఛ భారత్ మిషన్ పరిష్కరించింది. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో మహిళలు ఔత్సాహిక పారిశ్రామిక రంగంలో పాల్గొనేందుకు ‘ముద్ర’ పథకం వీలు కల్పించింది. మొత్తం ముద్ర రుణాల్లో మహిళల వాటా 68 శాతం. పీఎం స్వనిధి లబ్ధిదారుల్లోనూ మహిళలు 46 శాతం ఉన్నారు. గ్రామీణ పరివర్తనలో మహిళల ఆర్థిక సాధికారతకు లఖ్పతి దీదీ కార్యక్రమం కేంద్ర స్థానం కల్పిస్తోంది. విడివిడిగా చూస్తే ఈశాన్య ప్రాంతం, గిరిజన సమాజాలు, సరిహద్దు గ్రామాలు, మహిళలు, గ్రామీణ కుటుంబాలు, ఆర్థిక వ్యవస్థకు వెలుపల ఉన్న పౌరులు వేర్వేరు సవాళ్లుగా కనిపిస్తారు. అన్నింటినీ కలిపి చూస్తే మోదీ ప్రభుత్వ పాలనా తత్వంలోని విస్తృత నిర్మాణం స్పష్టమవుతుంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం దిశగా దేశం అడుగులు వేస్తున్న వేళ కేవలం పెద్ద ఆర్థిక వ్యవస్థ, బలమైన మౌలిక సదుపాయాల నెట్వర్క్ లేదా మరింత సమర్థమైన ప్రభుత్వ వ్యవస్థను నిర్మించటమే ఆకాంక్ష కాదు. భారత అభివృద్ధి గాథలో ఒకప్పుడు అతి తక్కువగా కనిపించిన వారికి కూడా సమాన భాగస్వామ్యం ఉండేలా చూడటం లక్ష్యం.రామ్‌నాథ్ కోవింద్వ్యాసకర్త భారత మాజీ రాష్ట్రపతి -
'అత్యధిక ప్రపంచానికి' అసలైన ప్రాతినిధ్యం
ఢిల్లీలో జరిగిన ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశాలు ఏ విధంగా చూసినా ఘన విజయమే. ఈ మాట అనేందుకు గల కారణాన్ని ఒకే ఒక మాటలో చెప్పాలంటే, 20 ఏళ్ల క్రితం స్థాపితమై ఈసారితో కలిపి 18 శిఖరాగ్ర సమావేశాలు జరుపుకొన్న ఈ సంస్థ, తన ప్రకటిత లక్ష్యాల దిశగా ఇంతవరకెన్నడూ లేనంత పట్టుదలగా, ధైర్యంగా ముందడుగులు వేసింది. అందుకు కారణాలు రెండు: ఒకటి, వర్ధమాన దేశాలలో చైతన్యాలు, ఆత్మవిశ్వాసాలు, ఐక్యతలు పెరుగుతుండటం. రెండు, ప్రపంచంపై దశాబ్దాల పాటు ఆధిపత్యం సాగించిన అమెరికా నాయకత్వపు పాశ్చాత్య కూటమి క్రమంగా బలహీనపడుతుండటం.ముఖ్యమైన ముందడుగులు‘బ్రిక్స్’ వ్యవహరణలో ఈ మార్పు కనిపించటం రష్యాలోని కజాన్ నగరంలో జరిగిన 16వ సమావేశాల (2024)లోనే మొదలై, బ్రెజిల్‌లోని రియో డి జనేరో (2025)లో కొనసాగింది. ఈ రెండింటికి మధ్య అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ తిరిగి బాధ్యతలు చేపట్టారు. తన కన్న ముందు జో బైడెన్ హయాంలోనే ఎదురవుతుండిన సమస్యల దృష్ట్యా ‘బ్రిక్స్’ నాయకులు కజాన్‌లో కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ప్రధానమైనవి బహుళ ధ్రువ ప్రపంచాన్ని బలోపేతం చేయబూనటం, ఐక్యరాజ్య సమితిని, ప్రపంచ బ్యాంకును, ఐఎంఎఫ్‌ను ప్రజాస్వామీకరించా లనే డిమాండ్, ‘బ్రిక్స్’ దేశాల మధ్య వాణిజ్యం డాలర్లకు బదులు స్థానిక కరెన్సీలలో జరగాలనే ప్రతిపాదన. వీటిలో ముఖ్యంగా చివరి అంశం అపుడు పాశ్చాత్య లోకంలో ఆర్థికంగా, రాజకీయంగా కూడా పెద్ద కలకలాన్ని సృష్టించింది. అమెరికా ఆధిపత్యానికి ఆయువుపట్లలో ఒకటైన డాలర్ రాజ్యం దెబ్బ తింటే మొదటికే మోసం రాగలదనుకున్న ట్రంప్, ‘బ్రిక్స్’ దేశాలు అటువంటి పని చేసినా, ప్రత్యామ్నాయ కరెన్సీని సృష్టించినా అందరిపై 100 శాతం సుంకాలంటూ హెచ్చరించారు. నిజానికి డీ– డాలరైజేషన్, ప్రత్యామ్నాయ కరెన్సీ ఆలోచనలు అపుడెంత మాత్రం లేవు. అది తేలికైన పని కాదు కూడా. అదే సమయంలో ఒక స్పష్టత అవసరం. డాలర్‌కు బదులు స్థానిక కరెన్సీలు అంతర్జాతీయ చెల్లింపుల కోసం అమెరికా నియంత్రణంలో గల ‘స్విఫ్ట్’ వ్యవస్థకు బదులు మరొకటి ఏర్పాటు చేసే యోచన, రిజర్వ్ కరెన్సీగా డాలర్‌కు బదులు చైనీస్ యువాన్‌ను ముందుకు తెచ్చే ప్రయత్నాలు మొద లైనవి క్రమంగా ముందుకు సాగిన కొద్దీ డాలర్ బలహీన పడుతుంది. వీటిలో స్థానిక కరెన్సీల ఉపయోగం ఇప్పటికే విస్తరిస్తూ డాలర్‌పై ప్రభావాన్ని చూపుతున్నది కూడా. అనగా, క్రమంగా డాలర్ బలహీనపడటమే పరోక్ష రీతిలో డీడాలరైజేషన్ జరగడ మన్నమాట. తక్కిన వాటిలో అదీ ఒక కరెన్సీగా మిగులుతుంది.ఆకాశంలో సగంఢిల్లీ ‘బ్రిక్స్’ సందర్భంగా ఈ నేపథ్యాన్నంతా రాయటం ఎందు కంటే, కజాన్ నుంచే ఆరంభించి అమెరికా వైపు నుంచి ఎన్నెన్ని ఒత్తిడులు వచ్చినా, సంస్థ నాయకత్వం ఎంత మాత్రం జంకలేదు. సరికదా, స్థానిక కరెన్సీల చెల్లింపులను మరింత విస్తరించాలని ఢిల్లీ డిక్లరేషన్‌లో స్పష్టంగా తీర్మానించింది. బహుళ ధ్రువ ప్రపంచానికి తప్పనిసరి అవసరాలు మరికొన్ని కూడా ఉన్నాయిగాని, ధనం మూలం మిదం జగత్ అన్నట్లు బండికి ఆర్థికమే ఇరుసు గనుక, ‘బ్రిక్స్’ వైఖరిలోని ఈ కీలకాన్ని అర్థం చేసుకోవాలి. వార్తలకు అంతగా ఎక్కలేదు గానీ, ఢిల్లీ సమావేశాలకు ముందు రోజున ‘బ్రిక్స్’ దేశాల ఆర్థిక మంత్రులు, రిజర్వ్ బ్యాంకుల గవర్నర్లు ముంబైలో సమావేశమై, స్థానిక కరెన్సీలతో పాటు పలు ఇతర నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వాటిలో దేశాల మధ్య చెల్లింపులకు ప్రత్యేక వ్యవస్థ (స్విఫ్ట్‌కు ప్రత్యామ్నాయమనాలి) ఒకటి. అదిగాక, విచ్చలవిడి ట్యారిఫ్లను, డబ్ల్యూటీవోకు విరుద్ధమైన వాణిజ్య ఒప్పంద ధోరణులను, ధనిక దేశాల ప్రొటెక్షనిజాన్ని, ప్రపంచ బ్యాంకుపైన, ఐఎంఎఫ్పైన ఏకపక్ష నియంత్రణను తీవ్రంగా వ్యతిరే కించారు. తాము ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న న్యూ డెవలప్మెంట్ బ్యాంకును మరింత బలోపేతం చేసుకోవాలనుకున్నారు.చివరగా ఢిల్లీ డిక్లరేషన్ సరేసరి. సమావేశాలలో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కొన్ని గణాంకాలను పేర్కొనటాన్ని కూడా ఈ ఆర్థిక సందర్భంలో గమనించాలి. బ్రిక్స్ దేశాల జనాభా ఇపుడు ప్రపంచ జనాభాలో సగమనీ, ప్రపంచ జీడీపీలో పాశ్చాత్య కూటమి జీ–7 వాటా 29 శాతం కాగా, ‘బ్రిక్స్’ది 40 శాతం అనీ, ‘బ్రిక్స్’ ఏర్పడిన గత రెండు దశాబ్దాలలో ఆ సంస్థ సభ్యుల జీడీపీ 4.5 రెట్లు పెరగగా, ప్రపంచానిది 2 రెట్లు మాత్రమేననీ చెప్పారు. అట్లా గుర్తు చేయటం పాశ్చాత్య దేశాలకేనని వేరే చెప్పనక్కర లేదు. గుర్తు చేయటం ఎందుకో కూడా అర్థం చేసుకోగలదే. సినిమా పరిభాషలో చెప్పాలంటే, ‘వస్తున్నాం కాస్కో, ఇకనైనా దారికి రా’ అనడమన్న మాట!అందరితో కలిసి నడుస్తూ...యథాతథంగానే ఒక స్థాయికి అభివృద్ధి చెందిన బ్రిక్స్ దేశాలకు, పాశ్చాత్య కూటమికి ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు ఈ పరిణామాలు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నాయి. దీనికి తగినట్లు, కజాన్, రియో, ఢిల్లీ డిక్లరేషన్లలో దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా ఖండా లతో పాటు విశాల సముద్రాలలో గల చిన్న దేశాలు, పేద దేశాల సమస్యలు, అవసరాలు, ప్రాతినిధ్యాల గురించిన ప్రస్తావనలు అనేకం ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, అత్యధిక దేశాలు, అత్యధిక జనాభాతో కూడిన లోకానికి ‘బ్రిక్స్’ ప్రజాస్వామికమైన రీతిలో ప్రాతినిధ్యం వహించనున్నదని చెప్పడమన్నమాట. ఈ రహస్యం ఆ యా దేశాలకు ఇప్పటికే చేరిపోయింది. కనుకనే ‘బ్రిక్స్’ పట్ల ఆసక్తి, అందులో చేరాలనే కోరిక, కజాన్ నుంచి పెరగగా, ఇపుడు ఢిల్లీ తర్వాత ఊపందుకోగలవని భావించవచ్చు.ఇతర అంశాలలో వివిధ అంతర్జాతీయ సంస్థల సంస్కరణలు, బహుళ ధ్రువ ప్రపంచ లక్ష్యాల కోసం ‘బ్రిక్స్’ డిమాండ్లు కజాన్ కన్న ఢిల్లీలో పదునెక్కాయి. ఆర్థిక, వాణిజ్య, రాజకీయ, సైనిక రంగాలలో అంతర్జాతీయ నియమ నిబంధనల ఉల్లంఘనను మరింత తీవ్రంగా ఆక్షేపించారు. ఇరాన్, పాలస్తీనా, సిరియా, క్యూబా, జెరూసలేం స్వయంప్రతిపత్తి, శాంతియుత అణుపరిశోధనలకు మరింతగా మద్దతు ప్రకటించారు. మొదట అనుకున్నట్లు, బ్రిక్స్ శక్తిమంతమవుతుండటానికి గల రెండు కారణాలలో, ట్రంప్, ఆయనతోపాటు పాశ్చాత్య ప్రపంచం బలహీనపడుతుండటం ఒకటి. ఇంతకాలం లోకాన్ని ఏలినవారు, తిరుగు లేదన్నట్లు వీస్తున్న కొత్త గాలులను ఇప్పటికైనా గుర్తించి తమ ధోరణిని మార్చుకుంటూ తక్కిన ప్రపంచంతో సమానులుగా, సఖ్యతతో జీవించటం అందరికీ మేలు చేస్తుంది. లేని పక్షంలో, బ్రిక్స్ సమావేశాలు జరుగుతూ పోయినకొద్దీ అనివార్యపు మార్పులు తప్పవనాలి.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఆధార్ లేకపోతే.. పరిష్కారం ఇలా!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం, నీలాద్రిపేటకు చెందిన 29 ఏళ్ల ఆదివాసీ మహిళ మడివి ఉంగమ్మ ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సమయంలో పౌష్టికాహారం, ఆరోగ్య సంరక్షణ ఎంతో అవసరం. కానీ ఉంగమ్మకు బర్త్ సర్టిఫికేట్ లేదు. ఆధార్ కార్డు లేదు. చిన్నతనంలో జనన నమోదు జరగకపోవడంతో ఏర్పడిన ఈ పత్రాల సమస్య ఇప్పుడు ఆమె గర్భధారణ సమయంలో అంగన్వాడీ సేవలకూ అడ్డంకిగా మారింది. ఫలితంగా పౌష్టికాహారం అందడం లేదు. ఈ ఒక్క ఘటన వెనుక మారుమూల ఆదివాసీ ప్రాంతాల్లోని పౌర పత్రాల సమస్య ఎంత లోతుగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం, పినపాక మండలాల్లోని 16 గిరిజన అవాసాల్లో సుమారు 450 కుటుంబాలు, 2,500 మంది ప్రజలు నివసిస్తున్నారు. అంగేరిగూడెం, నీలాద్రిపేట, తీర్లాపురం, టేకులగూడెం, అశ్వాపురం పాడు వంటి గ్రామాల్లో నివసిస్తున్న వీరి సమస్యలు కొత్తవి కావు.గర్భిణీ స్త్రీల నుండి పుట్టిన బిడ్డల వరకు ఆధార్ లేకపోవడం అనేక సమస్యలకు మూలంగా మారుతోంది. ఆధార్ లేకపోవడంతో అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు సమస్యతోపాటు ప్రాథమిక పాఠశా లల్లో ఆన్లైన్ నమోదు సమస్య కూడా ఏర్పడుతోంది. ఇది విద్యార్థి గుర్తింపునకు, పోషకాహారానికి, వైద్య సేవలకు, సంక్షేమ పథకాలకు అడ్డంకిగా మారుతోంది. ఒక గుర్తింపు పత్రం లేకపోవడంతో ఒక కుటుంబాన్ని ప్రభుత్వ వ్యవస్థ సంక్షేమ చట్రం నుంచి నెట్టేస్తోంది. ఆధార్ కార్డులు లేని కారణంగా కుటుంబాలు రేషన్ కార్డులు పొందలేకపోతున్నాయి. ఫలితంగా ఆహార భద్రతకు వారు దూరమవుతున్నారు.‘అడవిలో నివసించే ఒక కుటుంబానికి మార్కెట్ ధరలకు ఆహారం కొనడం ఎంత కష్టం?’ అంటున్నారు సామాజిక కార్యకర్త తోలెం రమేష్. ఇది భద్రాచలం మన్యం కథ మాత్రమే కాదు, ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో నివసిస్తున్న ఆదివాసీల సమస్య కూడా. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, అరకు ప్రాంతాల్లో ఆధార్ కార్డులు లేక వందలాది గిరిజనులు భూమిపత్రాలు, ఇతర సంక్షేమ పథకాలు అందుకోలేక పోతున్నారు.‘ఆధార్ లేక వృద్ధులకు పెన్షన్లు కూడా రావడం లేదు’ అంటారు పనసపుట్టు ఆవాసానికి చెందిన పాడి రాధ. మరింత విషాదకరమైన విషయం ఏమిటంటే, కమ్యూనిటీ గుర్తింపు పత్రాలు లేక కొందరు పిల్లలు పై చదువులకు వెళ్ల లేక, చదువు మధ్యలోనే ఆపి కూలీ పనులకు వెళ్తున్నారు.పరిష్కార మార్గాలు ప్రతి గిరిజన గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీ, వైద్య ఆరోగ్య శాఖ, జనన–మరణాల నమోదు అధికారులు కలిసి ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలి. అక్కడే పాత జనన రికార్డులు పరిశీలించి, రికార్డులు లేని వారిని గుర్తించి, ఆలస్యంగా జనన నమోదు చేసుకునేందుకు దరఖాస్తులు స్వీకరించాలి. ఆధార్ నమోదు, రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పింఛను తదితర సమస్య లను గుర్తించి పరిష్కరించాలి. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పడం కాదు, ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వెళ్లాలి.ఇదీ చదవండి: వందేమాతరం.. అసలు అర్థం ఇదే!‘పత్రాలు లేవు కాబట్టి వెళ్లండి’ అని చెప్పడం కాకుండా, ‘మీ దగ్గర ఏ పత్రం లేదు? దాన్ని ఎలా పొందాలో మేము మీకు సహాయం చేస్తాం’ అనే విధానం ఉండాలి. ఒక గ్రామానికి లేదా కొన్ని గ్రామాల సమూహానికి ఒక బాధ్యతగల అధికారిని నియమించి, ప్రజలకు అవసరమైన పత్రాలన్నీ పొందేలా సహాయం చేయాలి. మారుమూల గిరిజన ప్రాంతంలో నివసించే వ్యక్తిని ఒక సర్టిఫికేట్ కోసం 30 నుండి 50 కిలోమీటర్లు ప్రయాణించమని చెప్పడం సులభం. కానీ అతని దగ్గర ప్రయాణ ఖర్చు ఉందా? రోజు వారీ కూలిపోతే కుటుంబం ఎలా నడుస్తుంది? ఒక వృద్ధ మహిళ నాలుగు కార్యాలయాలు తిరగగలదా? అందుకే పత్రాలు లేని ప్రజలకు ప్రభుత్వమే పత్రాలు అందించే వ్యవస్థ కావాలి. దశాబ్దాలుగా పత్రాలు లేకుండా జీవించిన ఆదివాసీ కుటుంబాల కోసం ప్రభుత్వం ప్రత్యేక పరిష్కారం రూపొందించాలి. ప్రభుత్వ పథకాల జాబితాలో వారి పేర్లు ఉండటం మాత్రమే కాదు... ఆ పథకాల వెలుగు వారి జీవితాల్లోకి చేరాలి; అదే నిజమైన అభివృద్ధి.– శ్యామ్ మోహన్ ఆదివాసీ జీవితాలపై పరిశోధన చేస్తున్న జర్నలిస్ట్ -
కొన్నిసార్లు 'తగ్గి ఉండటమే మంచిది'!
అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 2026 బ్యాచ్ పట్టభద్రులను ఉద్దేశించి కామెడీ లెజెండ్ కోనన్ ఓబ్రెయిన్ చేసిన స్నాతకోత్సవ ప్రసంగ సంక్షిప్త పాఠం: అందరికీ స్వాగతం. రేపటి గొప్ప మేధావులైన మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. హార్వర్డ్ అమెరికాలో అత్యంత పురాతనమైన, ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యానిలయం. నేను 40 సంవత్సరాల క్రితం ఇక్కడే డిగ్రీ పూర్తి చేశాను. ఈ రోజు మీరు 375వ గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్. 1642లో మొదటి గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్‌లో విద్యార్థుల సంఖ్య కేవలం తొమ్మిది మంది. అమెరికాలోని ఏ యూనివర్సిటీ కూడా హార్వర్డ్ కంటే ఎక్కువ మంది నోబెల్ విజేతలను గానీ, లేదా వైట్–కాలర్ నేరస్థులను గానీ తయారు చేయలేదు. కాబట్టి మీరు మంచి మార్గాన్ని ఎంచుకున్నా లేదా చెడు మార్గాన్ని అనుసరించినా... మీరు అత్యుత్తమ వ్యక్తుల మధ్య ఉన్నారని గుర్తుంచుకోండి. అనేకమంది కలిస్తేనే పనినేను ఈ హార్వర్డ్ యూనివర్సిటీని ఎందుకు ప్రేమిస్తున్నాను? నిజంగా నాకు ఈ కాలేజీ అంటే చాలా ఇష్టం. ఇది నా జీవితాన్ని మార్చేసింది. నాకు హార్వర్డ్‌లో సీటు వచ్చిందని మంచానికే పరిమితమైన నా నానమ్మకు చెప్పిన రోజు... అసలు కాలేజీ ముఖమే చూడని ఆమె కళ్ల వెంబడి నీళ్లు తిరిగాయి. నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజుల్లో అదొకటి. 1985లో నా గ్రాడ్యుయేషన్ రోజున ఇక్కడ కూర్చున్నప్పుడు నేను కూడా ఎంతో సంతోషపడ్డాను. మీరందరూ ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో నేను నిజంగా అర్థం చేసుకోగలను. నేను లేట్ నైట్ టాక్ షో హోస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించి నప్పుడు ఇంటర్నెట్ లేదు. మీడియాకు కోనన్ ఓబ్రెయిన్ గురించి తెలిసిన ఏకైక విషయం అతడు హార్వర్డ్‌లో చదువుకున్నాడని మాత్రమే. ఒకవేళ నేను ఒక తత్వవేత్తనో లేదా భౌతిక శాస్త్రవేత్తనో అయి ఉంటే హార్వర్డ్ నాకు బాగా ఉపయోగపడేదేమో. కానీ ఒక కమెడియన్‌కి అది మరణశాసనం లాంటిది. ఇన్ని సంవత్సరాల తర్వాత, నా పేరు వినగానే ప్రజలకు గుర్తుకొచ్చే మొదటి విషయం హార్వర్డ్ ఎంతమాత్రం కాదు. నేను పదివేల గంటల కంటెంట్ తయారు చేశాను. అందులో ఏ ఒక్కదానికీ హార్వర్డ్ చదువుతో సంబంధం లేదు. కానీ ఏ ఒక్క పనినీ నేను ఒంటరిగా పూర్తి చేయలేదని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. ప్రముఖ అమెరికన్ కవి, రచయిత, జర్నలిస్టు వాల్ట్ విట్మాన్ ‘నాలో అనేకమంది ఉన్నారు’ అని రాశారు. అలాగే నేనూ ఏది సాధించినా, నా వెనుక ఉన్న అనంతమైన వ్యక్తుల సహాయంతోనే సాధించాను. ఈ రోజు మీ ముందు ప్రసంగించడానికి నా విజయానికి కారణమైన ప్రతి ఒక్కరినీ(బతికున్నవారైనా, చనిపోయినవారైనా) నేను ఆహ్వానించగలిగితే... హార్వర్డ్ మొత్తం, అలాగే నా స్నేహి తులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, రచయితలు, నిర్మాతలు, నన్ను ద్వేషించేవారు, అభిమానులు, అనుకోకుండా కలిసిన వేలాది మందితో కిక్కిరిసిపోతుంది. నా విజయాలు కేవలం నావి మాత్రమే కావని గుర్తించడం వల్ల, నా జీవితంలో అవసరమైన సమతుల్యత వచ్చింది. మార్గాన్ని మార్చుకున్నాను!నన్ను పదే పదే కాపాడిన మరొక విషయం... మార్గాన్ని మార్చుకోవడం. నా కెరీర్లో నేను ఎన్నోసార్లు నా దారిని మార్చు కోవాల్సి వచ్చింది. దానివల్ల నా మార్గం ఒక వంకర టింకర గీతలా మారిపోయింది. ప్రాణంగా భావించిన ఉద్యోగాన్ని కోల్పోయాను. ఆ తర్వాత కొన్నేళ్లకు నా కెరీర్‌ను అంకితం చేసిన లేట్ నైట్ టెలివిజన్ ఫార్మాట్ కనుమరుగవ్వడం చూశాను. దాంతో ఒక తెలివైన స్నేహితుడి సలహాతో ఒక పాడ్‌కాస్ట్ ప్రారంభించాను. మొదట్లో నాకా ప్రాజెక్ట్ అంటే నచ్చేది కాదు. కానీ జనం నా లేట్ నైట్ షో కంటే ఎక్కువగా ప్రేమించేలా నేను దాన్ని సృష్టించగలిగాను. నేను ఈ విధంగా అనేకసార్లు దారి మార్చుకున్నాను. ఇప్పుడు నాకు ఆ మార్పులంటే చాలా ఇష్టం. నా సంభాషణల్లో, మలుపు అనే పదాన్ని అవసరానికి మించి వాడుతుంటాను. ఎందుకంటే జీవితంలో అనేక మలుపులు ఉంటాయి. నా జీవితంలో అదృష్టం గొప్ప పాత్రను నేను ఎల్లప్పుడూ గుర్తిస్తాను. ఒకరి విజయంలో అదృష్టం పాత్రను చూడకపోవడం అజ్ఞానమే అవుతుంది. చాలామంది తమకు దక్కిన అదృష్టాన్ని తమ సొంత తెలివితేటలుగా పొరబడతారు. ఆ మానవ సహజమైన ఆలోచనను నిరోధించడం వల్లే నేను స్థిరంగా ఉండగలిగాను. సమాజం, సహజత్వం, వినయం, పని పట్ల నిజమైన అంకితభావం... అర్థవంతమైన గొప్ప జీవితాన్ని నిర్మించుకోవడానికి నాకు సహాయపడ్డాయని నమ్ముతున్నా. ఇక్కడ నా ఉద్దేశం విజయాలను వదులుకోవాలని కాదు, వాటిని ఒంటబట్టించుకోకపోవడమే మంచిది. మీరు మీ విజయాలను తేలికగా తీసుకున్నప్పుడు... దయ, సృజనాత్మకత, ధైర్యం, హాస్యం, మానవత్వం వంటి ఇతర గుణాలు బయటకు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రయాణాల ద్వారా నేర్చుకున్న పాఠాలుబహుశా నేను జీవితంలో నేర్చుకున్న అతిపెద్ద పాఠాలు నా ట్రావెల్ షోల ద్వారానే అయ్యుండవచ్చు. క్యూబా, ఘనా, కొరియా, అర్మేనియా, ఐరోపాలో సగం భాగాలు, అర్జెంటీనా, థాయిలాండ్, మెక్సికో, గ్రీన్ ల్యాండ్లలో నన్ను నేను తగ్గించుకున్నాను. నన్ను నేను తగ్గించుకోవడం వల్ల హెచ్చింపబడ్డాను. నేను వేరే దేశానికి వెళ్లినప్పుడు, నేను మాట్లాడిన ప్రతి మాట... అక్కడి సమాజం, పరిస్థితులకు అనుగుణంగా మారడం... ఇవన్నీ చాలా అవసరం. మీకు అక్కడి భాష రానప్పుడు, మీరు ఏ కాలేజీలో చదివారనేది అనవసరం. అప్పుడు స్నేహం చేయడం తప్ప మీకు వేరే మార్గం లేదు. ఆ ప్రయాణాల్లోనే నేను ఒక గొప్ప పాఠం నేర్చు కున్నాను. కొన్ని విషయాల్లో తగ్గి ఉండటమే మంచిది. మా తాతయ్య పేరు ‘హుఫర్’. ఆయన తన తల్లిదండ్రులను పోషించడానికి ఏడో తరగతిలోనే చదువు ఆపేసి... వర్సెస్టర్, మాసాచుసెట్స్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేశారు. ఆయనో మాట చెప్పేవారు: ‘ఏది దొరికితే అది తీసుకో.. ఆపై ఇంకా కావా లని అడుగు’. చాలా తెలివైన వ్యక్తి! నా జీవితంలో హుఫర్ చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆయన గౌరవార్థం, నేను ఈ యూనివర్సిటీ ఇవ్వజూపిన డాక్టరేట్‌ను తీసుకుంటాను, ఆ తర్వాత నగదు బహు మతి ఏమైనా ఇస్తారా అని కూడా అడుగుతా! నా కోరిక ఏమిటంటే... హార్వర్డ్ అనేది మీ గురించి ప్రజలకు తెలిసే విషయాల్లో అత్యంత తక్కువ ప్రాధాన్యత ఉన్నదిగా మారాలి. ఎందుకంటే, మీ అసలైన చదువు ఇప్పటి నుంచే మొదలవుతుంది. మీ కష్టం, పట్టుదల, మానవత్వం, మీరు నిర్మించబోయే సరిహద్దులు లేని సమాజం కోసం... నా హృదయపూర్వక అభినందనలు! -
అమితాబ్ బచ్చన్ (బాలీవుడ్ దిగ్గజం) రాయని డైరీ
రాత్రి 2.34. ఎంతకూ మెలకువ రావటం లేదు! మెలకువ రావటం లేదంటే నిద్రలో ఉన్నట్లనేనా?! నేను కోరుకుంటున్న మెలకువ... నిద్రాణంగా ఉన్న నా జీవితపు మలుపుల్లోంచి నిస్త్రాణగా పడి ఉన్న నా నిరాలోచనల ఏకాంతంలోకి. పాతవన్నీ ప్రవాహంలా మనసులోకి వచ్చి చేరుతున్నాయంటే... బిందెడు తులసి నీళ్లను మంచం పక్కన సిద్ధంగా ఉంచుకోవటమేనా? గొంతెండి ఉన్న దారులను తీర్థపు గుక్కిళ్లతో ఆరారగా తడుపుకుంటూ జీవనావస్థలోకి మళ్లీ మళ్లీ ప్రయాణించి వస్తుండటమేనా? ప్రయాసగా పక్కకు ఒత్తిగిలాను. నీలం రంగు మసక వెలుతురు... తీరని అలసటలా మనసును పూర్తిగా కమ్మేసి ఉంది. వలదనుకోలేని జ్ఞాపకాలు. అంతమూ పొంతనా లేని తలపులు. ఏ జాము అయిందో తెలియదు, మనిషి జీవితకాల జాముల గురించి ఆలోచిస్తున్నాను! అరవై ఏళ్లు రాగానే మనిషిని మనుషులు ఎందుకు ఆనవాలు పట్టటం మానేస్తారు! డెబ్బై దాటగానే ఎందుకు చూపులు చిట్లిస్తారు! ఎనభైల్లో ఎదురుపడితే ఎదురైంది మనిషే కానట్లు ఎందుకు దాటుకుని పోతారు! మనుషులిలా తప్పుకుని పోతున్నప్పుడే తొంభై ఏళ్లు, నూట తొంభై ఏళ్లు బతికి, మనుషులతో మాట కలపాలనిపిస్తుంది నాకు. కోవిడ్‌తో నేను ముంబై నానావతి ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఉన్నప్పుడు ఒక అజ్ఞాత వ్యక్తి నా మరణాన్ని తీవ్రంగా కాంక్షిస్తూ, ‘‘కనీసం ఈ కోవిడ్తోనైనా నువ్వు చనిపోవాలని కోరుకుంటున్నాను’’ అని సోషల్ మీడియాలో ఒక సంక్షిప్త సందేశం పోస్ట్ చేశాడు! పట్టలేనంత కోపం వచ్చింది నాకు.ఆ వెంటనే ఆలోచిస్తే... కోపం వచ్చినందుకు నవ్వొచ్చింది. నేను చనిపోవాలని కోరుకుంటు న్నాడంటే... నేను బతికున్నానని అతడు అనుకుంటున్నట్లే! అది కదా దీర్ఘాయుష్షు... మనిషి మనసులో మనిషి ఉండటం! ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సెట్స్‌లో ఒకసారి ప్రీతి జింతాను అడిగేశాను... ‘‘నేను ప్రతి సంవత్సరం జనవరి 31న మీకు బర్త్‌డే విషెస్ చెప్తాను, కానీ మీరు ఒక్కసారి కూడా నాకు రిప్లయ్ ఇవ్వలేదు’’ అని. ‘‘సారీ బచ్చన్ జీ. నంబర్ మారిపోయింది’’ అన్నారు ప్రీతి జింతా! ఒక ఏడాది మే 1న అనుష్క శర్మను ట్విట్టర్లో బహిరంగంగానే అడిగాను, ‘‘మీకు ఎస్ఎంఎస్లో శుభాకాంక్షలు పంపాను. కానీ ఎలాంటి స్పందనా లేదు’’ అని. ‘‘సారీ సర్... చూసుకోలేదు’’ అన్నారు అనుష్క! ‘‘ పర్వాలేదు. నిన్న రాత్రి ఐపీఎల్ గేమ్‌లో మీరు చాలా కాంతిమంతంగా కనిపించారు’’ అని మళ్లీ శుభాకాంక్షలు పంపాను. సోనమ్ కపూర్ కూడా నన్ను పట్టించు కోలేదు! ‘‘సారూ... నేను అమితాబ్ బచ్చన్ ని. జూన్ 9న నీ పుట్టినరోజుకు విష్ చేశాను. రిప్లయ్ లేదు, కాల్ కూడా చేయలేదు... వెరీ బ్యాడ్!’’ అని మెసేజ్ పెట్టాను. ‘‘సారీ అంకుల్, మీ ఎస్ఎంఎస్ నాకు రీచ్ అయినట్లు లేదు’’ అన్నారు సోనమ్!రణ్వీర్ సింగ్‌ని, ‘‘హేయ్... అందరికీ థ్యాంక్స్ చెబుతున్నావ్. మరి నేను పంపిన విషెస్ సంగతి ఏంటి? రిప్లయ్ ఎందుకు ఇవ్వలేదు?’’ అని అడిగాను. ‘‘సారీ అమితాబ్ జీ, మీక్కూడా థ్యాంక్యూ చెప్పానే!! మీకు ఆ థ్యాంక్యూ చేరలేదంటే... ఏదో టెక్నికల్ గ్లిచ్ అయుంటుంది’’ అన్నారు రణ్వీర్! సమాధానం సంతృప్తికరంగా ఉండక పోవచ్చు. అసలు ప్రశ్నే సరైనది కాకపోవచ్చు. కానీ, ప్రశ్నలు సమాధానాలు ఉండటమే జీవితం. అడగాల్సిన ప్రశ్నలు, చెప్పాల్సిన సమాధానాలు లేకుండా... నిండు నూరేళ్ల జీవితం కూడా సంపూర్ణం కాలేదు. ప్రశ్న, సమాధానం నిశ్శేషం కానంత వరకు జీవితకాలం అసలు పూరై్తనట్లే కాదు. ‘‘మేల్కొన్నారా?’’ – తెల్లవారు జామునెప్పుడో జయ అడుగుతోంది. ‘‘ఇది కోటి రూపాయల ప్రశ్న దేవీజీ... ఆలోచించాల్సిందే’’ అన్నాను, నిట్టూర్పుగా. -
ఆరోగ్యకరమైన నేలే మనిషి ఆరోగ్యానికి మూలం
నీరు, గాలి, వాతావరణ నాణ్యత క్షీణించడానికి నిస్సారమైన మట్టి దారితీస్తుంది. నేల ఆరోగ్యం క్షీణించడం వల్ల మొక్కలు, జంతు వులు, మానవుల ఆరోగ్యం దెబ్బతింటుంది. నేల స్వయంగా ఒక జీవ వ్యవస్థ. అలాగే ఇతర జీవరాశులకు ఆధారభూతమైనది కూడా. నేల, మొక్కలు, జంతువులు, మానవులు, పర్యావరణ వ్యవస్థ, భూగ్రహం ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడివడి విడదీయలేని ‘ఏకైక ఆరోగ్యం’ (వన్ హెల్త్)గా ఉంటాయి.‘ఆరోగ్యమైన నేల– ఆరోగ్యమైన మొక్క– ఆరోగ్యమైనజంతువు– ఆరోగ్యమైన మనిషి’ అనే భావనే వన్ హెల్త్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మనుషులు, జంతువులు, మొక్కలు, పర్యా వరణం పరస్పరం అనుసంధానమై ఉంటాయి. ఈ నాలుగు ఆరో గ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ‘ఏకైక ఆరోగ్యం’ భావనను, భారతదేశంలో జరిగిన జీ–20 సమావేశాలలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒక టీ స్పూన్ ఆరోగ్యకరమైన నేలలో కోట్ల నుండి వందల కోట్ల వరకు సూక్ష్మజీవులు ఉంటాయి. వీటిలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు (ఫంగి), యాక్టినోమైసెట్స్, ప్రోటో జోవా, నులిపురుగులు (నీమటోడ్లు), వానపాములు వంటి జీవులు ప్రధానమైనవి. ఈ సూక్ష్మజీవులు, నేల జీవులు కలిసి సేంద్రియ పదార్థాలను కుళ్లించి మొక్కలకు అవసరమైన పోషకాలను అందుబాటులోకి తెస్తాయి. నేలలో ఉండే ఖనిజాలు (జింక్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సల్ఫర్ వంటివి) మొక్కల వేర్ల ద్వారా గ్రహించబడి ధాన్యాలు, కూర గాయలు, పండ్లు ఇతర ఆహార పంటలలో నిల్వ అవుతాయి. ఈ పంటలను మనం ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆ ఖనిజాలు, పోషకాలు మన శరీరానికి అందుతాయి. ‘నేలలో పోష కాలు సమృద్ధిగా ఉంటేనే ఆహారం పోషకవంతంగా ఉంటుంది; ఆహారం పోషకవంతంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.’నేల ఆరోగ్యాన్ని కాపాడే పద్ధతులుసేంద్రియ పదార్థాల వినియోగం నేల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పశువుల ఎరువు, కంపోస్ట్, వర్మీకంపోస్ట్, గ్రీన్ మెన్యూర్, బయోచార్ వంటి సేంద్రియ పదార్థాలు నేలలో సేంద్రియ కార్బన్‌ను పెంచి, నేల సారాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి నేలలో ఉపయోగకరమైన సూక్ష్మజీవుల వృద్ధిని ప్రోత్సహించి, మొక్కలకు అవసరమైన పోషకాలను క్రమంగా అందుబాటులోకి తీసుకు వస్తాయి. పంటల మార్పిడి మరో పద్ధతి. ఒకే భూమిలో ఒకేపంటను వరుసగా సాగు చేయకుండా, వివిధ రకాల పంటలను క్రమపద్ధతిలో సాగు చేయాలి. పప్పు ధాన్యాలైన శనగ, పెసర, మినుము, కంది, అలసంద వంటివాటి వేర్లపై ఉండే రైజోబియం అనే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని గ్రహించి, మొక్కలు ఉపయోగించుకునే రూపంలో నేలలో స్థిరీకరిస్తాయి.మరీ ముఖ్యంగా పంట అవశే షాలను కాల్చకూడదు. కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ కార్బన్, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు పోష కాలు నష్టపోతాయి. పంట అవశేషాలను మల్చింగ్ చేయడం ద్వారా నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండి, కలుపు మొక్కల పెరుగు దల తగ్గుతుంది. అవసరానికి మించి తరచుగా దుక్కి దున్నడం వల్ల నేల సహజ నిర్మాణం దెబ్బతింటుంది. నేలలో నిల్వ ఉన్న సేంద్రియ కార్బన్ వేగంగా విచ్ఛిన్నమైపోతుంది. అతి దుక్కిని నివారించాలి. ‘ఏకైక ఆరోగ్యం’ భావన విజయవంతం కావడంలో రైతు పాత్ర కీలకం. రైతు అనుసరించే వ్యవసాయ పద్ధతులే నేల, మొక్కలు, పశువులు, పర్యావరణం, చివరకు మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. నేల ఆరోగ్యాన్ని కాపాడటం అనేది రైతు పొలం దిగుబడికే కాదు, సమాజ ఆరోగ్యానికి, ఆహార భద్రతకు భవిష్యత్ తరాలకు చేసే గొప్ప పెట్టుబడి.– డా‘‘ కె. తేజస్వరరావు, డా‘‘ ఎం.ఎం.వి. శ్రీనివాసరావు, డా‘‘ బి. సహదేవ రెడ్డి ‘ సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు -
డ్రాగన్–ఎలిఫెంట్ నృత్యం... వినోద క్రీడేనా?
డ్రాగన్ గాలిలోకి ఎగిరే భీకర జంతువే కాని వాస్తవంగా లేని మిథ్యామృగం. భూగోళంపై అతిపెద్ద బలమైన జంతువైన ఏనుగు మృదుస్వభావి. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను డ్రాగన్‌గా, మన భారతీయ ప్రజాస్యామ్య దేశాన్ని ఏనుగుగా పోల్చడం సహజంగా మీడియా చేస్తుంటుంది. ‘టాంగో’ అనేది స్పానిష్ నృత్య సంబంధిత పదం. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో, అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్ ఆతిథ్యంలో న్యూఢిల్లీలో జరిగే రెండ్రోజుల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరుకానుండటం ప్రాధాన్యతసంతరించుకుంది. చివరిదాకా ఆయన పర్యటనపై స్పష్టతనివ్వని చైనా ఎట్టకేలకు 67 మంది సభ్యుల ప్రాతినిధ్య బృందంతో రావడం ఇరుదేశాల సంబంధాల్లో సానుకూలతను సూచిస్తోంది.దగ్గరకు చేర్చిన అమెరికాకమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నిర్దేశించిన సూచనలపై ఇటీవల చైనా 15వ పంచవర్ష ప్రణాళిక (2026–2030)కు శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోని 150 దేశాలు, ప్రాంతాలతో వాణిజ్య భాగస్వామ్యం కలిగిన చైనా, ప్రపంచ ద్వితీయ భారీ ఆర్థిక వ్యవస్థగా అమెరికాకు సవాలు విసురుతోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారత్ దిగుమతులపై ఆగస్ట్ 2025 నుంచి అదనంగా 25 శాతం ట్యారిఫ్ విధింపు ప్రభావం, భారత్ – చైనాల మధ్య వాణిజ్య సయోధ్యకు దారి తీసింది. 2025 ఆగస్ట్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిఇండియా రాక సందర్భంలో అయిదు సంవత్సరాల క్రితం ఆగి పోయిన బోర్టర్ ట్రేడ్ ఇటీవలే మళ్ళీ ప్రారంభమైంది. భారత్, చైనా ఆర్థిక వాణిజ్య బాంధవ్యం రెండు దేశాల 280 కోట్ల జనావళి దృష్ట్యా పటిష్ట మవుతున్నాయి. భారత్–చైనా మధ్య సుదీర్ఘ కాలం నుంచి అత్యంత క్లిష్టమైన భౌగోళిక సరిహద్దు వివాదా లున్నప్పటికీ, వాటిని పక్కకు పెట్టి, వరస్పర ప్రయోజనాల దృష్ట్యా, ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేసుకొనే సత్కృషి ప్రారంభమైంది. 2017లో భారత్ అధికార యుతంగా షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ)లో చేరింది. 2024 నాటికి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అర్థిక సర్వేలోనూ, నీతి ఆయోగ్ నివేదికలోనూ చైనా పెట్టుబడులను దేశంలోకి ఆహ్వానించాలనే సానుకూల ప్రతిపాదన లున్నాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, మన విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో 2025 అగస్టు 18న జరిపిన న్యూఢిల్లీ సమావేశం కొత్త వాకిళ్ళు తెరిచింది. దానికి తోడు రెండు దేశాల మధ్య 2021 నాటి 125.6 బిలియన్ యూఎస్ డాలర్ల వాణిజ్యం, 2024 నాటికి 138.5కు పెరిగింది.షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) బిష్కెక్ శిఖరాగ్ర సమావేశం; యూఎస్, ఇజ్రాయిల్‌లు అంతర్జాతీయ చట్టం, యూఎన్ ఛార్టర్ ప్రాథమిక సూత్ర నియమావళిని ఉల్లంఘించే దుర్నీతిని దుయ్యపట్టడం భారత్, చైనాల సయోధ్యను మరింత బలపరిచాయి. ట్రంప్ శిక్షగా విధించే సుంకాలు, అస్థిర వైఖరి కారణంగా భారత్ యిప్పటికే చైనాతో చేతులు కలుపుతోంది.సంబంధాల్లో ముల్లుకానీ పాకిస్తాన్ పట్ల చైనా అనుకూల వైఖరి భారత్‌కు ఇబ్బంది కలిగించే అంశంగా మారుతోంది. ఉగ్ర, వేర్పాటు, తీవ్రవాదాలుసృష్టిస్తున్న యుద్ధ ప్రజ్వలనంలో భాగస్వామ్యమైన పాకిస్తాన్‌ను చైనా వెనకేసుకు రావటం, పైగా పాకిస్తాన్ ఛైర్‌గా రానున్న ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి వేదిక కావటం, భారత్‌కు మింగుడుపడని సమస్య అవుతోంది. దానికి తోడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా స్టేట్ కౌన్సిల్‌కు చెందిన సెంట్రల్ కమిటీ, ‘యూనియన్ టెర్రిటరీ ఆఫ్ లదాఖ్’లో వున్న నిర్దిష్ట జిల్లాలను హియాన్, హికాంగ్ పేర్లతో రెండు కొత్త కౌంటీలుగా ప్రకటించడానికి అనుమతించింది. అదీగాక టిబెట్‌లో పుట్టిన బ్రహ్మపుత్ర నదిని అక్కడ యార్లుంగ్ సాంగ్పో అంటారు. అరుణాచలప్రదేశ్‌లోని మనదేశ సరిహద్దుల సమీపంలో మిడాన్ ప్రాంతంలో కొండవాగు కనుమలలో చైనా నిర్మించనున్న సూపర్ జలవిద్యుత్ కేంద్రం వల్ల ప్రవాహం దిగువలో ఉన్న ఇండియా, బంగ్లాదేశ్‌లకు బ్రహ్మపుత్ర నదీ జలాల వినియోగానికి అవరోధమని భారత్ హెచ్చరిస్తున్నా చైనా పట్టించు కోవడం లేదు. 70 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించే లక్ష్యంగా ఈ ‘ప్రాజెక్ట్ ఆఫ్ ద సెంచరీ’ని చైనా ప్రభుత్వం ప్రస్తుత 2026 నుంచి ప్రారంభించనున్న 15వ పంచవర్ష ప్రణాళికలో చేర్చింది. గతేడాది జూలైలో ఈ భారీ విద్యుత్ పునరుత్పాదన కేంద్రాన్ని ప్రాధాన్యతా పరంగా కమ్యూ నిస్ట్ చైనా రెండవ అగ్రశ్రేణి నేత, ప్రధాని లిక్వియంగ్ టిబెట్‌లోని నియింగ్చి వద్ద ప్రారంభించారు. 1.2 ట్రిలియన్ యువాన్లతో (సుమారు రూ. 14 లక్షల కోట్లు) అయిదు పవర్ స్టేషన్ల నిర్మాణం జరగనుంది. జంగ్ము వద్ద చైనా ఇప్పటికే భారీ జలాశయం నిర్మించింది. ఇండియా–చైనాల మధ్య ట్రాన్స్ బోర్టర్ నదీ జలాలపై నిపుణుల స్థాయి సమావేశం జరగవలసి ఉంది.పర్యావరణ విధ్వంసం కారణంగా హిమాలయాల మహోన్నత శిఖరాల నుంచి ప్రకృతి ప్రళయాలు అనుభవిస్తూనే ఉన్నాం. జల విద్యుత్ ఉత్పాదన కోసం నిర్మిస్తున్న జలాశయాలు ప్రవాహ అవరో ధాలకు కారణం అవుతున్నాయి. ప్రకృతి కన్నెర్ర చేస్తున్నా, నేపాల్ చైనా సరిహద్దులలో ఈ మానవ విధ్వంసం ఆగేటట్టు లేదు. ప్రపంచ అగ్రరాజ్యాలలో ప్రప్రథమ స్థానాన్ని పొందాలనే కమ్యూనిస్ట్ చైనా డ్రాగన్ విజృంభిస్తోంది. ప్రస్తుతం ట్రంప్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తలక్రిందులు చేస్తున్న ఈ తరుణంలో ‘డ్రాగన్ – ఎలిఫెంట్టాంగో’... వినోదం అవుతుందా? రణక్రీడ కానుందా?-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్-జయసూర్య -
మక్కా కూటమిని ఎలా చూడాలి?
పాకిస్తాన్ చొరవతో పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా సభ్యులుగా గత నెలలో మక్కాలో ఒక కొత్త సైనిక కూటమికి అంకురార్పణ జరిగింది. ఈ కూటమిని ‘ఇస్లామిక్ నాటో’ అని కూడా అభివర్ణిస్తు న్నారు. నెల తిరగకుండానే, ఈ నెల మొదటి తారీఖున మళ్లీ ఈ మూడు దేశాల రక్షణ మంత్రులు, సైన్యాధ్యక్షులు సమావే శమై కూటమి సెక్రటేరియట్, విధివిధా నాల మీద చర్చించారు. ఉమ్మడి భద్రత లక్ష్యంగా ఏర్పడిన ఈ సైనిక కూటమిని నాటో తరహాలో రూపొందించటానికి ప్రయత్నం జరుగుతున్నది. నాటో కూటమి ఒప్పందం ఆర్టికల్ ‘5’ ప్రకారం, కూటమి ఏ ఒక్క సభ్య దేశంపైన దాడి జరిగినా దాన్ని మొత్తం కూటమిపై దాడిగా పరిగణించి సైనిక కూటమి తన పూర్తి శక్తితో ప్రతిస్పందిస్తుంది. మక్కా ఒప్పందంలో కూడా ఈ తరహా క్లాజును పొందుపరచటం విశేషం. కారణాలేమిటి?స్థూలంగా పరిశీలిస్తే ఈ కూటమి ఏర్పాటుకు ఇరాన్ యుద్ధంలో సౌదీ, కువైట్, బెహ్రయిన్, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడుల వలన జరిగిన నష్టం ప్రథమ కారణంగా కన్పడు తున్నది. పర్షియా సింధు శాఖలోని రియాద్, ఫుజేరా, కువైట్, దుబాయ్ వంటి నగరాలు; చమురు శుద్ధి కేంద్రాలు, డీసాలినేషన్ ప్లాంట్లు ఇరాన్ మిస్సైల్స్, డ్రోనుల దాడి నుండి తప్పించుకోలేక పోయాయి. సౌదీ, యూఏఈ, బెహ్రయిన్ దేశాలలోని నాటో సైనిక స్థావరాలు కూడా దెబ్బతిన్నాయి. యూఎస్ఏ ఏర్పాటు చేసిన మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థలు ఈ దేశాలకు పూర్తి రక్షణను కల్పించ లేకపోయాయి. అమెరికన్ సైనిక స్థావరాలుండటమే, ఈ దేశాలపై ఇరాన్ దాడి చేయటానికి కారణం. యుద్ధం ఇరాన్–అమెరికా/ ఇజ్రా యెల్ మధ్య జరుగుతున్నప్పటికీ, గల్ఫ్ దేశాలు అడకత్తెరలో పోక చెక్కలా చిక్కుకుపోయాయి. ఇరాన్‌ను నేరుగా ఎదుర్కొనే సైనికశక్తి ఈ దేశాలకు లేదు. అమెరికన్ భద్రతా గొడుగు నుండి బయటకు వచ్చి స్వతంత్రంగా తమకొక ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటానికి జరుగుతున్న ప్రయత్నంగా ఇది కనబడుతోంది. అయితే సౌదీపై హౌతీల దాడులు జరిగినప్పటికీ ఆర్టికల్ 5ని ఆచరణలోకి తేలేదు. అది అంత సులభం కాదు.ఈ కూటమి కేవలం అమెరికన్ నాయకత్వంలోని నాటోకు ప్రత్యామ్నాయంగా ఏర్పడిన ప్రాంతీయ కూటమి కాకపోవచ్చు. పాకిస్తాన్, టర్కీ పర్షియా సింధు శాఖలోని దేశాలు కాదు. ఈ మూడు దేశాలు సున్నీ ముస్లిమ్ దేశాలు. ఇరాన్, ఇరాక్ షియా ముస్లిం దేశాలు. పర్షియా సింధుశాఖలోని యూఏఈ ఈ కూటమిలో ప్రస్తుతానికి లేదు. సౌదీ, యూఏఈలకు వ్యూహాత్మక లక్ష్యాలలో వైరుధ్యం ఉన్నది. ఈ రెండు దేశాలు యెమెన్‌లో రెండు సైనిక గ్రూపులను సమర్థిస్తున్నాయి. పాలస్తీనా సమస్యలో ఈ రెండు దేశాల వైఖరిలో అంతరమున్నది. యూఏఈ అబ్రహాం ఒప్పందంపై సంతకం చేసి ఇజ్రాయెల్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవ టానికి మొగ్గు చూపుతున్నది. సౌదీ అరేబియా సంతకాలకు నిరాక రిస్తున్నది. ఈ మూడూ అమెరికాకు నమ్మకమయిన స్నేహితులు.ఉమ్మడి శత్రువు లేని కూటమిపాకిస్తాన్కు సుశిక్షితమైన విస్తృత సైనిక బలగం ఉన్నది. ఇప్ప టికే పాక్ సైనికులు సౌదీలో విధులు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్‌కు అణ్వస్త్ర సామర్థ్యం ఉన్నది. గల్ఫ్ దేశాలకు ఇజ్రాయెల్ అణ్వస్త్ర ముప్పును ఎదుర్కోవటానికి అణ్వస్త్రాల సహాయం అవసరం. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగానే అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నది. అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై దాడికి అణుబూచినే ముందు ఉంచుతున్నారు. టర్కీ వద్ద సైనిక విమానాలు, డ్రోన్లు, మందుగుండు సామగ్రి తయారీ సామర్థ్యం విస్తృతంగా ఉన్నది. నాటో సభ్యదేశం కావటంతో ఆధునిక యుద్ధ రీతులు, యుద్ధతంత్రాలు టర్కీకి సుపరిచితం. సౌదీ అరేబియా వద్ద పుష్కలంగా పెట్టుబడి సామర్థ్యం ఉన్నది. కీలకమైన చమురు, సహజ వాయువు నిల్వలున్నాయి. ఈ మూడు దేశాలు చేతులు కలపటంతో బలమైన సైనిక శక్తి ఆవిర్భవించే అవకాశమున్నది.అయితే, లక్ష్యాలపరంగా కూటమిలోని మూడు దేశాల మధ్య వైరుధ్యం స్పష్టంగా కనబడుతోంది. సైనిక కూటములకు సహజంగా ఉమ్మడి శత్రువులుంటారు. ఉదాహరణకు నాటో కూటమికి బద్ధ శత్రువు పూర్వపు సోవియట్ యూనియన్, తరువాత రష్యా. కానీ మక్కా కూటమిలోని సౌదీ అరేబియాకు ఇరాన్, ఇజ్రాయెల్ ప్రథమ శత్రువులు. సౌదీ దృష్టంతా పర్షియా సింధుశాఖ, ఎర్ర సముద్రాల పైన ఉంటుంది. టర్కీకి ఇజ్రాయెల్ ప్రధాన శత్రువు. టర్కీ తన శక్తియుక్తులను తూర్పు మద్యధరా సముద్రం, సిరియా, జోర్డాన్, లెబనాన్లపైన కేంద్రీకరిస్తుంది. పాక్‌కు మధ్యప్రాచ్యంలో ప్రత్యేకంగా శత్రువులెవరూ లేరు. ఇరాన్‌తో కూడా మిత్రత్వ వైఖరినే అవలంబిస్తుంది. ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించినప్పటికీ, శత్రువుగా చూడదు. పాకిస్తాన్‌కు భారతదేశమే లక్ష్యం, శత్రువు. కచ్చితమైన ఉమ్మడి శత్రువు లేకపోవటం కూటమికి పెద్ద బలహీనత.భారత్‌కు సవాలుఅమెరికన్ భద్రతా ఛత్రానికి ప్రత్యామ్నాయంగా ప్రాంతీయంగా గల్ఫ్ దేశాలు తమకంటూ ప్రత్యేకంగా ఒక సైనిక కూటమిని ఏర్పరచుకోవటం స్వాగతించదగినదే. కానీ పర్షియన్ సింధుశాఖ ప్రాంతానికి సంబంధం లేని ప్రాంతీయేతర శక్తులు ఇరాన్‌కు వ్యతి రేకంగా సైనిక కూటమిని ఏర్పాటు చేయటం, దానికి పాకిస్తాన్, టర్కీ పునాదిరాళ్లు కావటం భారత్ ప్రయోజనాలకు ప్రమాదకరం. ఇటీవలి ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్–టర్కీ రెండూ జతకట్టి భారత్‌పై దాడి చేశాయి. టర్కీ ఐక్యరాజ్యసమితిలో పలుమార్లు కశ్మీర్ విషయంలో భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శించింది. ఆప రేషన్ సిందూర్‌లో పాక్‌కు పెద్ద మొత్తంలో డ్రోన్లను, మొబైల్ కమాండ్ సెంటర్లను, కౌంటర్ డ్రోన్ టెక్నాలజీని సమకూర్చింది.మక్కా కూటమి మత ప్రాతిపదికన ఏర్పడటం భారత్‌కు తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఈ కూటమిని ఇస్లామిక్ నాటో లేదా సున్నీ నాటోగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. మతఛాందస ఇస్లా మిక్ టెర్రరిజం భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద భద్రతా ప్రమాదం. కానీ ఈ సైనిక కూటమిని అమెరికా సమర్థించటం కొసమెరుపు. ఇటీవల జరిగిన కూటమి సమావేశంలో కూటమిని విస్తరించ టానికి సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈజిప్ట్, ఖతార్, బంగ్లాదేశ్ ఈ కూటమిలో చేరటానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా వార్త లొస్తున్నాయి. బంగ్లాదేశ్ ఈ కూటమిలో చేరటం సమస్యను మరింత జటిలం చేస్తుంది. ఇప్పటికే బంగ్లాదేశ్ నూతన ప్రభుత్వం పాక్, చైనాలకు స్వాగత తోరణాలు ఏర్పాటు చేసింది. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సౌదీ, టర్కీలు భారత్‌కు వ్యతిరేకంగా చేతులు కలిపే దుశ్శకునాలు కన్పడుతున్నాయి. జియోపాలిటిక్స్‌లో ఏదైనా జరగ వచ్చు. ఈ నేపథ్యంలో భారత్ ఈ కూటమి అడుగులను నిశితంగా పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలి. ఈ కూటమికి ప్రతిగా భారత్ చొరవ తీసుకొని యూఏఈ, ఇజ్రాయెల్, జపాన్‌లతో చేయికలిపి ప్రత్యామ్నాయ ఏర్పాటుకు ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
ఇరవై ట్రిలియన్ల వ్యవస్థ కాగలమా?
ఇటీవలి ఈక్విరస్ ‘వృద్ధి విధాన నివేదిక’ 2036 నాటికి 20 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపొందాలంటే నామినల్ రూపాయి వృద్ధి 14.2 శాతంగానూ, సాంవత్సరిక రూపాయి అప్రిషియేషన్ 3–3.6 శాతం అవసరమనీ పేర్కొనడం చర్చనీయాంశంగా నిలిచింది. రాబోవు పదేళ్ల కాలంలో జీడీపీలో 5 రెట్లు పెరుగు దల ఉండాలంటే, దానికి అవసరమైన సగటు వార్షిక డాలర్ – ఆధారిత నామినల్ జీడీపీ వృద్ధిని 15.9 శాతంగా నివేదిక అంచనా వేసింది. వివిధ రంగాలలో ఉత్పాదకత వృద్ధి తక్కువగా ఉండటం, స్థూల స్థిర మూలధన కల్పన జీడీపీలో 30 శాతానికి పరిమితం కావడం, సంఘటిత రంగంలో ఉపాధి తక్కువగా ఉండటం, ఇంధన ధరలలో పెరుగుదల కారణంగా అధిక ద్రవ్యోల్బణం, మానవాభివృద్ధిపై పెట్టుబడులు తక్కువగా ఉండటం, ద్రవ్యలోటు పెరుగుదల, సామర్థ్యానికి తగినట్లు ఎగుమతు లలో వృద్ధి లేకపోవడం లాంటి అంశాలు నామినల్ జీడీపీ వృద్ధిలో అనూహ్య పెరుగుదలకు అవరోధాలుగా నిలిచే అవకాశం ఉంది. భారత్ వాస్తవిక జీడీపీ వృద్ధిని 2026–27లో 6.3 శాతంగా, 2027–28లో 6.4 శాతంగా ఓఈసీడీ అంచనా వేస్తుండగా, ప్రపంచ బ్యాంకు 6.6 శాతంగా అంచనా వేసింది. నామినల్ వార్షిక జీడీపీ వృద్ధిని 15.9 శాతంగా రాబోవు పది సంవత్సరాల కాలంలో నిర్వ హించాలంటే సాంప్రదాయ కోశ విధానం, విత్త మద్దతుతో పాటు భారత ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పు అవసరం. అభివృద్ధి దేశాల వృద్ధి నమూనాప్రస్తుతం భారత్ జీడీపీ 3.96 ట్రిలియన్ డాలర్లు కాగా 2036 నాటికి 20 ట్రిలియన్ డాలర్లకు చేరుకొనే క్రమంలో ప్రపంచంలో అధిక ఆదాయ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా రూపొంద డానికి ఎంత సమయం తీసుకున్నాయి, ఏ అభివృద్ధి వ్యూహాలను అవలంభించాయో పరిశీలించాలి. అధిక ఆదాయ దేశాలుగా రూపొందడానికి అమెరికాకు (వందకు మించిన సంవత్సరాలు), యూకే (100 సం‘‘లు), జర్మనీ (50–100 సం‘‘లు), జపాన్ (50–100 సం‘‘లు), కెనడా (75–100 సం‘‘లు), దక్షిణ కొరియా (30–40 సం‘‘లు) సమయం తీసుకోగా, ప్రపంచ బ్యాంకు నిర్వచనం ప్రకారం ఎగువ మధ్య ఆదాయ దేశమైన చైనాలో 1978 తర్వాతి కాలంలో వృద్ధి వేగవంతమై 2026 నాటికి ఐఎంఎఫ్ అంచనా ప్రకారం 20.85 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందింది. చైనా, దక్షిణ కొరియాతో పోల్చినప్పుడు అధిక ఆదాయ దేశంగా రూపొందడానికి అమెరికా అధిక సమయం తీసుకొంది. అతిపెద్ద ఏకీకృత స్వదేశీ మార్కెట్, ప్రైవేటును ప్రోత్సహించడం, మౌలిక సౌకర్యాలపై అధిక పెట్టుబడులు, పటిష్టమైన మూలధన మార్కెట్, ప్రఖ్యాత విద్య, పరిశోధనా సంస్థలు, సాంకేతిక నవకల్ప నలు అమెరికాకు సానుకూలంగా పనిచేశాయి. మొదటి పారిశ్రామిక విప్లవం వలన బ్రిటన్; భారీ పరిశ్రమలు, రసాయనాలు, మెషినరీ, తయారీ రంగం అభివృద్ధి కారణంగా జర్మనీ; పారిశ్రామికీకరణ, ఎగుమతులు, సాంకేతికత కారణంగా జపాన్; ఎగుమతులపై దృష్టి కేంద్రీకరించి తయారీ రంగ అభివృద్ధి, విద్య, పారిశ్రామిక విధానం ద్వారా దక్షిణ కొరియా అధిక ఆదాయ దేశాలుగా రూపొందాయి.వివిధ రంగాలలో ఏం మారాలి?20 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపొందాలంటే వ్యవసాయం, తయారీ, సేవలు, శక్తి, మానవ మూలధనం, సాంకే తిక రంగాలలో అభివృద్ధిని వేగవంతం చేయడానికి చర్యలు అవ సరం. ఐఎంఎఫ్ అభిప్రాయంలో భారత్ ఉత్పాదకత పెంపు, నైపు ణ్యత, శ్రామిక మార్కెట్ సరళత, నియంత్రణల సడలింపు, వాణిజ్యం అనుసంధానంపై దృష్టి సారించాలి. పట్టణీకరణ వేగవంతమవుతున్న కారణంగా ప్రస్తుతం జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 17 శాతం నుండి రాబోవు కాలంలో తగ్గే సూచనలున్నాయి. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంపు, సప్లయ్ చెయిన్‌ను మెరుగుపరచడం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని విస్తరణ, నిల్వ సౌకర్యం, లాజిస్టిక్స్ అభివృద్ధికి చర్యలు అవసరం. నశ్వర ఉత్పత్తులైన పండ్లు, కూరగాయల మొత్తం ఉత్పత్తిలో 4 శాతంకు మాత్రమే రిఫ్రిజిరేటెడ్ రవాణా సౌకర్యం ఉంది. కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు సంబంధించి పది సంవత్సరాల పన్ను విరామాన్ని ప్రకటించాలి. తయారీ రంగంలో అతిపెద్ద నిర్మాణాత్మక మార్పులు అవసరం. జీడీపీలో తయారీ రంగం వాటా ప్రస్తుతం 12.9 శాతం కాగా 2035 నాటికి 25 శాతానికి పెంచాలని జాతీయ తయారీ విధానం లక్ష్యంగా తీసుకుంది. తయారీ రంగంలో చిన్న సంస్థలు, పెద్ద సంస్థ లుగా మారే క్రమంలో చెప్పుకోదగిన ప్రగతి లేదు. ఆగస్ట్ 2026 నాటికి భారత ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఉద్యమ్ పోర్టల్‌లో సూక్ష్మ సంస్థలు (9.24 కోట్లు), చిన్న సంస్థలు (5.42 లక్షలు), మధ్య తరహా సంస్థలు (41,775) నమోదయ్యాయి. సంస్థలు చిన్న స్థాయిలో ఉంటే నైపుణ్యత కల్గిన శ్రామికుల లభ్యత, సంస్థాపరమైన పరపతి, సప్లయ్ చెయిన్‌కు అనుసంధానపరచడం, సాంకేతికత లభ్యత క్లిష్టతరమవుతుంది. సక్రమంగా నడుస్తున్న చిన్న సంస్థలకు ఈక్విటీ మార్కెట్లో ప్రవేశం కల్పించి పెద్ద మొత్తంలో నిధులు సేకరించుకొనే అవకాశం కల్పించాలి. కార్పొరేట్ బాండ్లను జారీ చేసే స్వేచ్ఛను కంపెనీలకు ఇవ్వాలి. జీడీపీలో కార్పొరేట్ బాండ్ మార్కెట్ విలువ భారత్‌లో 15–16 శాతం కాగా, చైనాలో 38 శాతం, మలేషి యాలో 54 శాతం, దక్షిణ కొరియాలో 79 శాతం. అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సహించాలి. జీసీసీలు అధిక విలువ కల్గిన కార్య కలాపాలను నిర్వహిస్తున్నందువలన, ఈ రంగాన్ని విస్తరిస్తే భారత్ జీడీపీలో పెరుగుదల ఏర్పడుతుంది. ఉత్పాదక శ్రామికులుగా మార్చాలి!భారత్‌లో తాత్కాలిక కార్మికులు 2029–30 నాటికి 2.35 కోట్లుగా ఉండగలరని అంచనా. ప్రత్యేకమైన శ్రామిక ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం ద్వారా శ్రామిక వివాదాలను పరిష్కరించాలి. 2036 నాటికి శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 70 శాతం, మొత్తం శ్రామిక శక్తిలో మహిళల వాటా 50 శాతం, సంఘటిత రంగంలో ఉపాధి విస్తరణ, అప్రెంటిషిప్స్ ఏడాదికి కోటికి పైగా ఉండేలా తగిన విధానాలను రూపొందించుకోవాలి. పనిచేసే వయో వర్గ జనాభాను అధిక వేతనంతో కూడిన ఉత్పాదక శ్రామికులుగా మార్చడం శ్రామిక మార్కెట్ సంస్కరణలలో కేంద్ర బిందువుగా ఉండాలి. దేశంలో 37 కోట్లకు పైగా ఉన్న యువతకు వ్యవసాయేతర రంగాలలో ఉపాధి అవకాశాలు కల్పించాలి. పరిశోధన, అభివృద్ధి వ్యయం జీడీపీలో 0.6–0.7 శాతంగా ఉండటం వలన ఉత్పాదకత పెంపు, సాంకేతిక ఆధారిత అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతున్నందువలన ఈ వ్యయాన్ని పెంచాలి. భారత్ అంతర్జాతీయ కంపెనీలకు తక్కువ వ్యయంతో సేవలను అందించేకన్నా ‘ప్రపంచ నవకల్పన, అధిక విలువతో కూడిన సేవల హబ్’గా రూపొందాలి. డా‘‘ తమ్మా కోటిరెడ్డివ్యాసకర్త ఆర్థికరంగ నిపుణులు -
రూపాయి అంతర్జాతీయీకరణ దిశగా...
హిందూ మహాసముద్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ద్వీపదేశం మాల్దీవుల్లో జూలై 30న ప్రారంభమైన ఒక కొత్త చెల్లింపు సదుపాయం, భారత రూపాయి అంతర్జాతీయీకరణ దిశగా జరిగిన మరో చిరు ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. మాల్దీవుల మానిటరీ అథారిటీ నిర్వహించే తక్షణ చెల్లింపుల వ్యవస్థ ‘ఫవారా’ను భారతదేశపు యూపీఐతో అనుసంధానించారు. తొలిదశలో మాల్దీవుల్లోని బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్, మాల్దీవ్స్ ఇస్లామిక్ బ్యాంక్ ఖాతాదారులకు భారత్‌లోని యూపీఐ అనుసంధాన ఖాతాలకు నేరుగా డబ్బు పంపే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మాల్దీవుల రుఫియాలో ప్రారంభించిన లావాదేవీ భారత్‌లోని ఖాతాలో రూపాయల్లో జమ అవ్వడంతో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ సదుపాయం మాల్దీవుల నుంచి భారత్‌కు జరిగే వ్యక్తిగత బదిలీలకు మాత్రమే పరిమితమైంది. తదుపరి దశల్లో ద్విముఖ, క్యూఆర్ ఆధారిత వాణిజ్య లావాదేవీలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.ఎందుకు ప్రాధాన్యత?భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంతో ముడిపడుతున్న కొద్దీ అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులు, రెమిటెన్సులు, ఇతర సరిహద్దు లావాదేవీల పరిమాణం పెరుగుతోంది. ఆర్బీఐ అంచనా ప్రకారం, 2023–24లో భారత వస్తు, సేవల వాణిజ్యం, పెట్టు బడులు, రెమిటెన్సులకు సంబంధించిన సరిహద్దు లావాదేవీల విలువ 1.9 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇంత భారీ స్థాయి లావాదేవీల్లో రూపాయి వినియోగం పెరిగిన కొద్దీ, భారతీయ సంస్థలకు మారకపు రిస్క్, లావాదేవీ వ్యయాలను కొంతవరకు తగ్గించుకునే వెసులుబాటు కలుగుతుంది. విదేశీ భారతీయ బ్యాంకుల్లో ‘వోస్ట్రో’ ఖాతాను నిర్వహించుకునే సౌలభ్యం ఎప్పటినుంచో ఉంది. అయితే, అంతర్జాతీయ వాణి జ్యాన్ని రూపాయల్లో ఇన్వాయిస్ చేయడం, చెల్లించడం, సెటిల్ చేసుకోవడం కోసం ఆర్బీఐ 2022 జూలైలో స్పెషల్ రూపీ వోస్ట్రో అకౌంట్ (ఎస్‌ఆర్‌వీఏ) సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. రూపాయి అంతర్జాతీయీకరణ దిశలో దీనిని కీలకమైన అడుగుగా పేర్కొన వచ్చు. భారత దిగుమతిదారు రూపాయల్లో చెల్లించిన మొత్తం, ఎగుమతిదారు బ్యాంకు భారత్‌లో నిర్వహించే ఎస్ఆర్వీఏలో జమ అవుతుంది. ఆ నిల్వలను భారత ఎగుమతిదారులకు చెల్లింపులతో పాటు, ఆర్బీఐ అనుమతించిన ఇతర లావాదేవీలకు కూడా ఉపయో గించవచ్చు. నిబంధనల మేరకు దేశీయ ప్రాజెక్టులు, ప్రభుత్వ ఋణపత్రాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా ఉంది. ఇది ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ సెటిల్మెంట్ మార్గాలకు అదనం.స్థానిక కరెన్సీల్లో సెటిల్మెంట్లురూపాయి అంతర్జాతీయీకరణ దిశలో మరో అడుగు ద్వైపాక్షిక లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ (ఎల్సీఎస్) వ్యవస్థ. 2023లో భారత్, యూఏఈ రూపాయి–దిర్హామ్‌లో ద్వైపాక్షిక లావాదేవీలను ప్రోత్స హించేందుకు ఎల్సీఎస్ ఒప్పందం చేసుకున్నాయి. ఆ తర్వాత ఇండోనేషియా, మాల్దీవులు, మారిషస్లతోనూ భారత్ ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంది. వీటి ద్వారా ఇరు దేశాలు డాలరు వంటి అంత ర్జాతీయ కరెన్సీపై అతిగా ఆధారపడకుండా, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని తమతమ స్థానిక కరెన్సీల్లో ఇన్వాయిస్ చేసి, సెటిల్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.అయితే ఈ విధానంలో ఒక ఆచరణాత్మక సవాలు ఉంది. ద్వైపాక్షిక వాణిజ్యం సమతుల్యంగా లేకపోతే ఒక దేశం వద్ద మరొక దేశ కరెన్సీ నిల్వలు పెరిగిపోవచ్చు. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ నుంచి ముడిచమురును రూపాయల్లో కొనుగోలు చేసిన సందర్భంలో ఇరాన్‌కు ఇదే సమస్య ఎదురైంది. అలా పేరుకున్న రూపాయి నిల్వలను భారత్ నుంచి వస్తువులు, సేవలు కొనుగోలు చేయడానికి లేదా అనుమతించిన పెట్టుబడుల్లో వినియోగించుకునే అవకాశాలు కూడా సమృద్ధిగా ఉండాలి. అంతర్జాతీయ వాణిజ్యంలో రూపాయి వినియోగం పరిమితంగా ఉంటే, అలాంటి నిల్వలను వినియోగించుకునే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఇప్పటివరకు రూపాయిలో జరిగే అంతర్జాతీయ వాణిజ్య పరిమాణం, భారతదేశం మొత్తం సరిహద్దు లావాదేవీలతో పోలిస్తే చాలా పరిమితంగానే ఉంది. విధానపరమైన ప్రయత్నాలు ముమ్మరమైనప్పటికీ, అంత ర్జాతీయ వాణిజ్యంలో రూపాయి వినియోగం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నట్లు ఈ ఒరవడి సూచిస్తోంది.దశాబ్దాలుగా, బెల్జియం కేంద్రంగా ఉన్న స్విఫ్ట్ నెట్వర్క్అంతర్జాతీయ బ్యాంకింగ్‌లో కీలకమైన ఆర్థిక సమాచార మౌలిక వసతిగా ఉంది. బ్యాంకుల మధ్య చెల్లింపు ఆదేశాలను ఈ నెట్వర్క్ సురక్షితంగా చేరవేస్తుంది. అసలు నిధుల బదిలీ మాత్రం కరెస్పాండెంట్ బ్యాంకులు, సంబంధిత చెల్లింపు వ్యవస్థల ద్వారా జరుగు తుంది. లావాదేవీలో పాల్గొనే మధ్యంతర బ్యాంకుల సంఖ్య, కరెన్సీ స్వభావం వంటి అంశాలపై బదిలీకి అయ్యే ఖర్చు, అంతిమ లబ్ధిదారుడికి డబ్బు చేరే సమయం ఆధారపడి ఉంటాయి. దీనికి భిన్నంగా, ఫవారా–యూపీఐ వంటి ఏర్పాట్లలో రెండు దేశాల దేశీయ తక్షణ చెల్లింపు వ్యవస్థలు పరస్పరం నేరుగా అనుసంధా నమవుతాయి. ఫలితంగా ద్వైపాక్షిక చెల్లింపులను వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించే అవకాశం ఏర్పడుతుంది. ఈ పరిణామం రూపాయి అంతర్జాతీయీకరణకు కూడా తోడ్పడుతుంది. భారత్ ఇప్పటికే సింగపూర్ ‘పేనౌ’తో సహా పలు దేశాల తక్షణ చెల్లింపు వ్యవస్థలతో యూపీఐని అనుసంధానించింది.2024లో భారత్ ‘ప్రాజెక్ట్ నెక్సస్’లో చేరింది. భారత్, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్ దేశాల తక్షణ చెల్లింపు వ్యవస్థలను అనుసంధానించడం ప్రాజెక్టు లక్ష్యం. ఈ నాలుగు దేశాలతో భారత్ జరిపే లావాదేవీల విలువ... ఆసియాన్ దేశాలు భారత్‌తో జరిపే మొత్తం ప్రవాహాల్లో మూడింట రెండొంతు లకు పైగా ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది.ప్రధాన అవరోధంచెల్లింపుల సదుపాయాలు విస్తరించడం ఒక్కటే రూపాయి అంతర్జాతీయీకరణకు సరిపోదు. విదేశీ సంస్థలు రూపాయి ఆధారిత ఆర్థిక ఆస్తులను సులభంగా కొనుగోలు చేయడానికి, వాటిని నిర్వహించడానికి, అవసరమైనప్పుడు ఇతర కరెన్సీల్లోకి మార్చుకోవడానికి అనువైన లోతైన ఆర్థిక మార్కెట్లు కూడా అవసరం. ఈ ఆస్తులను స్వేచ్ఛగా ఇతర కరెన్సీల్లోకి మార్చుకునే అవకాశం లేకపోతే, రూపాయి ఆస్తులను పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవడానికి విదేశీ సంస్థలకు ప్రోత్సాహం తగ్గుతుంది. భారత్‌లో మూలధన ఖాతా ఇంకా పూర్తి పరివర్తనీయంగా లేకపోవడం రూపాయి అంతర్జాతీయీకరణకు ప్రధాన అవరోధాల్లో ఒకటి. అందువల్ల, విదేశీ సంస్థలకు అవసరమైనప్పుడు రూపాయి ఆస్తులను ఇతర కరెన్సీల్లోకి సులభంగా మార్చుకునే స్వేచ్ఛతో పాటు, పూర్తి పరివర్తనీయత కలిగిన రూపాయి, లోతైన ద్రవ్య మార్కెట్లు అవసరం. ఈ దిశగా భారత్ మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నంలో బ్రిక్స్ వేదిక కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించిన వివరాల ప్రకారం, బ్రిక్స్ దేశాలు తమ తక్షణ చెల్లింపు వ్యవస్థలు, కేంద్ర బ్యాంకుల డిజిటల్ కరెన్సీలను పరస్పరం అనుసంధానించే అవకా శాలపై చర్చిస్తున్నాయి. అంతర్జాతీయ చెల్లింపుల వ్యయాన్ని తగ్గించడం ఈ ప్రయత్నం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. రూపాయి అంత ర్జాతీయీకరణ దిశగా ఇప్పటివరకు ఏర్పడిన ప్రతి కొత్త అనుసంధానం ఒక అవకాశాన్ని సృష్టిస్తోంది. మాల్దీవుల ఫవారా–యూపీఐ అనుసంధానం ఆ సుదీర్ఘ ప్రయాణంలో మరో ముందడుగు.కృష్ణ బాలాజి పల్లపోతువ్యాసకర్త విశ్రాంత ఉన్నతాధికారి, ఎస్.బి.ఐ. -
విద్వేషాల లోకంలో వివేకపు మట్టివాసన
ప్రముఖ అమెరికన్ రైతు–తాత్వికుడు, పర్యావరణ ఉద్యమకారుడు వెండెల్ బెర్రీ (92) మరణంతో ప్రపంచం ఒక గొప్ప శాంతి స్వరాన్ని కోల్పోయింది. కెంటకీ రాష్ట్రంలోని హెన్రీ కౌంటీకి చెందిన ఆయన గొప్ప సమగ్ర మానవుడిగా ప్రసిద్ధి గాంచారు. మరణం గురించి ఆయన ఒకసారి ఇలా రాశారు: ‘దీర్ఘాయువు అనే యంత్రాంగం విష యంలో జాగ్రత్త వహించండి. ఒక మనిషి జీవితం ముగిసినప్పుడు, అతను మరణించటమే సరైన పని. అడవి కూడా మరణం నుంచి తనను తాను కాపాడుకోదు’.హెన్రీ కౌంటీలో ఆయన కుటుంబం 200 ఏళ్లకు పైగా వ్యవ సాయం చేస్తోంది. 1934లో వర్జీనియా ఎర్డ్మన్, న్యాయవాది జాన్ మార్షల్ బెర్రీ దంపతులకు జన్మించిన వెండల్ బెర్రీ డజన్ల కొద్దీ పుస్తకాలు రాశారు. భూమిని పరిరక్షించటం, భూమిని నైతికంగా ఉపయోగించవలసిన ఆవశ్యకత గురించి తన కవిత్వంలో, కాల్పని కేతర సాహిత్యంలో నిండుగా రాశారు. ఇంగ్లిష్‌లో మాస్టర్ డిగ్రీ పొందిన బెర్రీ అనేక విశ్వవిద్యాలయాల్లో బోధించారు. అయినా, మట్టిని గాఢంగా ప్రేమించారు. ఆ గాఢతతోనే తన ఉద్యోగ జీవితా నికి స్వస్తి పలుకుతూ న్యూయార్క్ నగరాన్ని విడిచిపెట్టి శాశ్వతంగా తన సొంత ఊరు వెళ్లిపోయారు. చివరికి అక్కడే మొన్న ఆగస్ట్ 31న కన్నుమూశారు.యుద్ధం–పర్యావరణ విధ్వంసంతన సామానంతటినీ ఒక వోక్స్వ్యాగన్ బీటిల్ కారులో సర్దు కుని, ఇంటికి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఆయన ఒక పత్రి కతో ఇలా చెప్పారు: ‘కొంత భయం, వణుకుతో పాటూ సరైన పని చేస్తున్నాననే భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు గొప్ప, గాఢమైన ఉపశమనం కలిగింది. చివరికి నేను నా నిజమైన మార్గాన్ని అనుసరిస్తున్నట్లుగా అనిపించింది’. భూమిని సంరక్షించటం మానవ ప్రాథమిక బాధ్యతల్లో ఒకటని ఆసాంతం ఆయన భావించారు.యుద్ధాలు, వాతావరణ సంక్షోభం చుట్టుముట్టిన నేటి తరుణంలో ఆయన ప్రబోధించిన ‘న్యాయంతో కూడిన శాంతి’ సిద్ధాంతం ఎప్పటికీ ప్రాసంగికమే. ప్రకృతిని గౌరవిస్తూ మమేకమై జీవించటం, స్థానిక సమాజాల తరఫున నిలబడటం ద్వారానే శాశ్వత శాంతి, సామాజిక న్యాయం సాధ్యమని ఆయన తన జీవితం ద్వారా చాటిచెప్పారు.మనిషి ప్రకృతిపై సాగిస్తున్న దాడికి, తోటి మనుషులపై చేస్తున్న యుద్ధాలకు మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని బెర్రీ ఎత్తి చూపారు. ఆయుధాలతో రక్తపాతం సృష్టించటం ఎంతటి హింసో... కార్పొరేట్ అత్యాశతో నేలను, నీటిని, అడవులను కొల్ల గొట్టటం కూడా అంతే తీవ్రమైన హింస అని ఎలుగెత్తారు. ప్రకృతిని దోచుకునే సమాజం తోటి మానవుల పట్ల శాంతియుతంగా ఉండలేదని హెచ్చరించారు. భూమికి జరుగుతున్న అన్యాయం అంతిమంగా మానవాళి వినాశనానికే దారితీస్తుందన్నది ఆయన ఆలోచనల మూలసూత్రం.చదవండి: వందేమాతరం అసలు అర్థం ఇదే!చాలా సందర్భాల్లో శాంతి అంటే కేవలం తుపాకుల మోత ఆగ టమో లేదా రెండు దేశాల మధ్య తాత్కాలిక ఒప్పందమో అనుకుంటారు. కానీ బెర్రీ దృష్టిలో ‘న్యాయం లేని శాంతి’ నిలబడదు. వనరుల అసమాన పంపిణీ, అట్టడుగు వర్గాల ఆర్థిక దోపిడీ, బల హీనులను అణచివేసే వ్యవస్థలు కొనసాగినంత కాలం నిజమైన శాంతి సాధించలేం. యుద్ధ యంత్రాలు, ఆయుధ సంపత్తిని పోగెయ్యటం మాని... ఆకలి నిర్మూలన, నేల పునరుజ్జీవనం, పేదల హక్కుల పరిరక్షణవైపు మళ్లించినప్పుడే శాశ్వత శాంతి నెలకొంటుందనేది ఆయన నిశ్చితాభిప్రాయం.చిన్న రైతుల సేద్యమే...ప్రపంచీకరణ తెచ్చిన విచ్చలవిడి వినియోగ సంస్కృతికి ప్రత్యామ్నాయంగా ‘స్థానిక సమాజాలు, స్వయంసమృద్ధి’ భావనలను బెర్రీ సమర్థించారు. బహుళజాతి సంస్థల గుత్తాధిపత్య వ్యవసాయం కంటే, స్థానిక నేలను అర్థం చేసుకునే చిన్న రైతుల వ్యవసాయమే భూమిని కాపాడుతుందన్నారు. సమాజాలు స్వయంసమృద్ధిని కోల్పోయి, అపరిమిత లాభాల వెంట పరుగులెత్తినప్పుడే వనరుల కోసం అంతర్జాతీయ యుద్ధాలు పుడతాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థలను, పొరుగు వారితో ప్రేమానుబంధాలను బలోపేతం చేయటమే హింసను అడ్డుకునే మొదటి మార్గం అంటారాయన. అధికారం, యుద్ధోన్మాదంతో రగిలిపోతున్న నేటి ప్రపంచానికి ఆయన బోధించిన వినయం, ప్రకృతితో సహజీవనం, నైతిక బాధ్యతలే నిజమైన సంజీవని.– పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు -
దక్షిణ అమెరికాలో కొత్త క్రీడలు
పశ్చిమాసియా, పసిఫిక్, యూరప్, కెనడాలలో తన వ్యూహాలు అనుకున్న విధంగా సాగకపోతుండటంతో యూఎస్ఏ అధ్యక్షుడు ట్రంప్ దృష్టి దక్షిణ అమెరికా వైపు ఎక్కువగా మళ్లుతున్నట్లు కనిపిస్తున్నది. అట్లాగని ఈ దృష్టి లోగడ లేదని కాదు. ఆ ప్రాంతాన్ని వారు శతాబ్దాల క్రితమే తమ జమీందారీగా ప్రకటించి బయటివారెవరూ అటు కన్నెత్తి చూడరాదన్నారు. అటువంటి మన్రో డాక్ట్రిన్ (1828)ను డోన్రో డాక్ట్రిన్ (2026)గా మార్చి ట్రంప్ మరింత తీవ్రతనైతే తెచ్చారుగానీ, పైన అనుకున్న ప్రతికూలతల దృష్ట్యా దక్షిణ అమెరికాపై పట్టును మరింత బిగించటం అవసరమనుకుంటున్నట్లున్నారు.అమెరికా జమీందారీ...పనామా కాలువ ఉదంతం తర్వాత వెనిజులా అధ్యక్షుని అపహరణ తెలిసిందే. అయితే, ఈ రెండు కూడా పైన పేర్కొన్న కొత్త వ్యూహాలకన్న ముందే చోటు చేసుకున్నాయి. కాలువ గురించి ఆయన తాను అధికారానికి వచ్చిన కొత్తలోనే మాట్లాడగా, మదురో అపహరణ తొమ్మిది నెలల క్రితం జనవరిలో జరిగింది. ఆ తర్వాతి కాలంలో ఇదే విధమైన పరిణామాలు మరికొన్ని కనిపిస్తున్నాయి. వాటిలో అన్నింటికన్న ముఖ్యంగా పేర్కొనవలసింది క్యూబా విషయం. అక్కడ ఫిడెల్ కాస్ట్రో నాయకత్వాన 1959లో జరిగింది సాధారణ నియంతృత్వాలపై జరిగే ప్రజాస్వామిక తిరుగుబాటు వంటిది కాదు. అది స్పష్టమైన కమ్యూనిస్టు తిరుగుబాటు. కమ్యూనిజానికి సైద్ధాంతిక బద్ధశత్రువైన అమెరికాకు అటువంటి పరిణామమే సరిపడనిది కాగా, తమ జమీందారీలో చోటు చేసు కోవటం ఎట్లుండేదీ చెప్పనక్కర లేదు.అటువంటి క్యూబన్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు గత 66 సంవత్సరాలుగా విఫల ప్రయత్నాలు చేస్తున్న యూఎస్ఏ, ఇపుడు ట్రంప్ ఆధ్వర్యాన భిన్నమైన వ్యూహాన్ని అమలుకు తెస్తున్నది. అది కాస్ట్రో హత్యకు నమ్మశక్యం కాని రీతిలో 638 సార్లు ప్రయత్నించటం వంటిదో, వెనిజులా అధ్యక్షుడిని అపహరించటం వంటిదో కాదు. ఒక వ్యక్తిగా ప్రస్తుత అధ్యక్షుడు మిగ్వేల్ దియాజ్ భద్రంగానే ఉన్నారు. కానీ, క్యూబాను ఆర్థికంగా ధ్వంసం చేసి, అక్కడి ప్రజలు పూర్తి పేదరికంలోకి జారుకుని, తమ ప్రభుత్వంపై తిరగబడేటట్లు చేయాలన్నది పథకం. ఇది ఎవరో ఊహిస్తున్నది కాదు. యూఎస్ఏ విదేశాంగ మంత్రి మార్కో రూబియో బాహాటంగా ప్రకటిస్తున్న మాట. తన పూర్వీకులు క్యూబన్లు అయిన ఆయన, అక్కడి ప్రభు త్వాన్ని పడగొట్టి, అక్కడి నుంచి యూఎస్‌కు వలస వచ్చిన వారిలో ఒకరిని కొత్త అధ్యక్షుడు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అక్కడి మీడియాయే రాస్తున్నది. ఇది సరిగా ట్రంప్, నెతన్యాహూ ఇరాన్లో అనుసరించబూనిన వ్యూహాన్ని గుర్తుకు తెస్తుంది.ద్విముఖ వ్యూహంఇరాన్లో విఫలమైన వ్యూహం క్యూబాలో విజయవంతమవు తుందా అన్నది వేరే ప్రశ్న. అయితే రెండింటి మధ్య మరొక పోలిక కనిపిస్తున్నది. ఇరాన్‌తో చర్చలు అనటం, అవి సంతృప్తికరంగా సాగుతూ ఒక కొలిక్కి వస్తుండగానే మధ్యలో ఆకస్మికంగా దాడులు జరపటం తెలిసిందే. ఇరాన్ వలెనే క్యూబాను లొంగదీసేందుకంటూ ఆంక్షలు ప్రకటించటం కమ్యూనిస్టు విప్లవం జరిగిన 1958లోనే మొదలై నేటికీ సాగుతున్నదే. ఆ స్థితిని ఇరాన్ వలెనే క్యూబా కూడా తట్టుకుంటూ వస్తున్నది. ఇరాన్‌ను ఆర్థికంగా మొత్తం ప్రపంచమే ‘వెలివేసేట్లు’ చేయగలనని ప్రకటించిన తరహాలో, క్యూబాను ఆర్థి కంగా అష్ట దిగ్బంధనం చేసే వ్యూహాన్ని ట్రంప్ ఎంచుకున్నారు. ఆ వ్యూహాన్ని ఇపుడు ద్విముఖంగా అమలుపరుస్తున్నారు. ముందుగా ఆర్థిక ఆంక్షలు ప్రకటించారు. వాటిని సడలించాలంటే ప్రైవేట్ రంగానికి, విదేశీ పెట్టుబడులకు, వాణిజ్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. పరిస్థితులు క్లిష్టంగా మారుతుండటంతో అందుకు ప్రభుత్వం ఒక మేర అంగీకరించగా, అది బాగున్నది గాని ఇంకా చేయాలన్నారు. ఇది కెనడా ప్రధాని మైక్ కార్నీ ఇటీవల ఎత్తి చూపినటువంటి ఎత్తుగడ. తాము అంగీకరించినకొద్దీ కొత్త షర తులు పెడుతున్నారని అన్నారాయన. అది చెల్లదని విమర్శించిన ఆయన అసలు చర్చలనుంచే వైదొలిగారు. ఇదే తరహా ఉపాయా లను అమెరికన్లు ఇండియాతో జరుగుతున్న వాణిజ్య చర్చలలోనూ ప్రయోగిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అనేక ఇతర దేశాలతో. లొంగినకొద్దీ మరింతగా లొంగదీసుకోవాలన్నది వారి వ్యూహం. ఆ విషయం అట్లుంచితే, ఈ నెల 3వ తేదీన క్యూబన్ చమురు కంపెనీలతో సహా మరికొన్ని సంస్థలపై మరిన్ని ఆంక్షలు ప్రకటించారు. గమనించదగినదేమంటే, సరిగా అవే రోజులలో క్యూబన్ ప్రభుత్వం ఆర్థిక విధానాల సరళీకరణ దిశగా 176 కొత్త సంస్కరణ లను ఆమోదించింది. ఇది గతంలో ఎన్నడూ జరగనిది. క్యూబాలో తీవ్రమైన ఇంధన కొరతలు, విద్యుత్ సమస్యలతో ఆర్థిక రంగం, ప్రజా జీవితం ఇప్పటికే సంక్షోభానికి గురవుతున్నాయి. ధరలు, నిరుద్యోగం పెరుగుతున్నాయి. ఇరాన్లో వలెనే అక్కడి ప్రజల లోనూ దేశభక్తి స్ఫూర్తి, యూఎస్ఏ పట్ల వ్యతిరేకత బలంగా ఉన్నందున పరిస్థితులను తట్టుకుని నిలబడుతున్నారుగానీ, లేనట్లయితే రెండు చోట్లా తిరుగుబాట్లు రావలసింది! పశ్చిమార్ధం మాదే!మిగిలిన దక్షిణ అమెరికా దేశాలలో మితవాద పార్టీలు, ప్రగతి శీల పార్టీలు అధికారానికి రావటం, పోవటం జరుగుతుండేదే గనుక చింతించనక్కర లేదు. చిలీలో ఏర్పడిన స్పష్టమైన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని 1973లో కూలదోశారు. ఇక మిగిలిన ఏకైక ప్రభుత్వం క్యూబాది. అది కూడా పోతే తప్ప పశ్చిమార్ధంపై తిరుగులేని భరోసా ఏర్పడదు. మదురో నిజానికి సోషలిస్టే తప్ప సైద్ధాంతి కమైన కమ్యూనిస్టు కాదు. అయినా అక్కడి చమురు నిల్వల ఆకర్షణ అన్నిటికి మించినది గనుక, తనకు ఆ ముద్ర వేసి అపహరించిన ట్రంప్, ‘ఇకపైన లాటిన్ అమెరికా వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూడజాల’రని హెచ్చరించారు. ట్రంప్ వ్యూహంలో ఇది ఒక భాగం మాత్రమే. ఇదిగాక ఆయన అక్కడి దేశాల ఎన్నికలలో మితవాద పార్టీలు గెలిచేందుకు ఆర్థిక సహాయాలు చేస్తున్నారు. ఎన్నికలలో పరోక్ష జోక్యాన్ని సీఐఏ యథాప్రకారం కొనసాగిస్తున్నది. బ్రెజిల్, మెక్సికో వంటి బలమైన దేశాలలో గల నేరస్థ సంస్థలను ‘టెర్రరిస్టు’ సంస్థలుగా ప్రకటించి, వాటి చర్యల వల్ల అమెరికా భద్రతకు ముప్పు కలుగుతున్నదనే విచిత్రమైన వాదనలను తయారు చేస్తున్నాయి. ఈక్వెడార్ వంటి దేశాలకు ఇటీవలనే సైన్యాన్ని పంపి, మెక్సికోకు కూడా పంప జూస్తున్నారు. అదనపు ట్యారిఫ్‌లు, బలవంతపు వాణిజ్య ఒప్పందా లతో స్వపర భేదాలు లేకుండా అందరినీ నియంత్రించజూడటం ఇతరత్రానూ జరుగుతున్నదే.మొత్తంమీద ట్రంప్ లక్ష్యం, ఇతర ప్రాంతాలలో ఆశించిన ప్రకారం సాగ కున్నా, కనీసం తమ పశ్చిమార్ధ రాజ్యంలో ఎదురులేక పోవటం. ముఖ్యమైన విషయం ఒకటి చెప్పుకోవాలి. దక్షిణ అమెరికాలో 16వ శతాబ్దంలోనే మొదలైన బానిసల తిరుగుబాట్లు, ఆ తర్వాత కాలంలో రైతుల తిరుగుబాట్లు, వలస పాలనపై తిరుగుబాట్లు, క్యూబన్ విప్లవం స్ఫూర్తితో వామపక్ష భావజాలాలు చిరకాలంగా వ్యాపించి ఉన్నాయి. అక్కడి సంపదలు పాశ్చాత్య దేశాల పాలవు తుండటంతో పేదరికం తొలగకుండా ఉంది. అందువల్లనే ప్రగతిశీల పార్టీలు తరచూ గెలుస్తూనే ఉన్నాయి. ఈ రోజునే లెక్కగట్టినా మితవాద ప్రభుత్వాలు 8 దేశాలలో ఉండగా, ప్రగతివాదులు 7 చోట్ల పాలిస్తున్నారు. మిగిలినవి తటస్థం. అనగా, ఈ ప్రాంతమైనా ఇక శాశ్వతంగా తమ స్వాధీనమయేందుకు యూఎస్ఏ ఏ వ్యూహాలూ పనిచేయగల అవకాశం లేదన్నమాట. అయినా ట్రంప్ వంటి నాయకుని ప్రయత్నాలు ఆగవు గదా!టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
వందేమాతరం.. అసలు అర్థం ఇదే!
‘వందేమాతరం’ అనగానే మనలో గర్వం ఉప్పొంగుతుంది. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో, మన జాతీయ చైతన్యంలో ఈ గేయానికి ప్రత్యేక స్థానం ఉంది. దాని 150వ వార్షికోత్సవాన్ని గర్వంగా జరుపుకోవడం సముచితమే. ఆ గేయం మనకు చూపించిన మాతృభూమి స్వరూపాన్ని నేటి పరిస్థితుల్లో మరోసారి అర్థం చేసుకోవడానికి కూడా ఇది ఒక అవకాశం.బంకించంద్ర ఛటోపాధ్యాయ మాతృభూమిని కేవలం భౌగోళిక సరిహద్దులుగా ఊహించలేదు. సుజలాం– సమృద్ధిగా జలాలు కలది. సుఫలాం– ఫలసంపదతో నిండినది. సస్య శ్యామలాం– పచ్చని పంటలతో కళ కళలాడేది. అంటే ‘వందేమాతరం’లోని మాతృభూమి కేవలం భూభాగం కాదు. మనిషి, నేల, నీరు, వ్యవసాయం, ప్రకృతి పరస్పరం ఆధారపడిన ఒక సజీవ వ్యవస్థ. వందే మాతరం మన గర్వానికి ప్రతీక అయితే, ఆ మాతృభూమిని కాపాడటం మన బాధ్యత.స్వాతంత్య్ర ఉద్యమం నుంచి నేటి భారతదేశం వరకు మన జాతీయ ఆలోచనా రూపకల్పనలో ఎన్నో శక్తిమంతమైన భావనలు రూపుదిద్దుకున్నాయి– భారతమాత, గ్రామ స్వరాజ్యం, స్వదేశీ, సర్వోదయం నుంచి బేటీ బచావో బేటీ పఢావో, వికసిత భారత్ వరకు ఎన్నో. ఇవి కేవలం నినాదాలు కావు. మాతృభూమిని ‘సుజలాం’ అని కీర్తిస్తే మన నీటి నాణ్యత, జలవనరుల స్థిరత్వం ముఖ్యం. ‘సస్య శ్యామలాం’ అని పాడితే నేల ఆరోగ్యం, వ్యవసాయం, పర్యావరణం ముఖ్యం. ‘గ్రామ స్వరాజ్యం’ అంటుంటే గ్రామాలకు తమ వనరులను సంరక్షించుకునే సామర్థ్యం ఉండాలి. ‘సర్వోదయం’ అంటుంటే అభివృద్ధి అట్టడుగు వర్గాల వరకు చేరాలి. ‘బేటీ పఢావో’ అంటుంటే ప్రతి బాలిక పాఠశాలలో గౌరవంగా చదువుకోగలగాలి.కేవలం నినాదాలా?ఒక గ్రామ పాఠశాలను ఊహించుకుందాం. ఉదయం పిల్లలు కలిసి ‘వందేమాతరం’ ఆలపిస్తారు. కానీ పాఠశాల పైకప్పు సురక్షితంగా ఉందా? మరుగుదొడ్లు పనిచేస్తున్నాయా? బాలికలు వాటిని గోప్యతతో, గౌరవంగా ఉపయోగించగలుగుతున్నారా? ఉపాధ్యాయులు ఉన్నారా? పిల్లలు నిజంగా నేర్చుకుంటున్నారా? అని పరిశీలించాలి. ఇవి దేశభక్తికి వ్యతిరే కమైన ప్రశ్నలు కావు. పాఠశాలలో కుళాయి ఉండటం మాత్రమే కాదు– పిల్లలకు సురక్షితమైన తాగునీరు అందడం ముఖ్యం. మరుగుదొడ్డి ఉండటం మాత్రమే కాదు– అది పరిశుభ్రంగా, ఉపయోగించడానికి అనువుగా ఉండటం ముఖ్యం. బాలికను బడికి పంపించడంతోనే మన బాధ్యత తీరిపోదు. ఆమె ఎలాంటి ఇబ్బంది, భయం, అవమానం లేకుండా గౌరవంగా చదువు కొనసాగించగల వాతావరణం కూడా కల్పించాలి.ఇదీ చదవండి: ఉపాధ్యాయుడికి ఏఐ ప్రత్యామ్నాయం కాదు!నీటి భద్రత, నేల క్షీణత, కాలుష్యం, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం, సహజ పర్యావరణ వ్యవస్థలపై పెరుగుతున్న ఒత్తిడి వంటి సవాళ్ల సమయంలో ‘వందేమాతరం’లోని ప్రకృతి దృశ్యానికి కొత్త ప్రాసంగికత ఉంది. బంకించంద్రుడు మనం ఏమి కాపాడాలో చెప్పారు. గాంధీజీ ఆ బాధ్యత ఎక్కడ (గ్రామస్వరాజ్యం) మొదలవ్వాలో చూపించారు. ఇప్పుడు ఆ రెండింటినీ కలిపి సుస్థిరమైన వికసిత భారత్‌ను నిర్మించడం మన ముందున్న సవాలు.- డాక్టర్ రఘు చలిగంటి అగ్రికల్చరల్ ఎకానమిస్ట్, పాలసీ రిసెర్చర్, జర్మనీ -
పెద్ద కలలతోనే 'పెద్ద మార్పులు'
నేడు పట్టభద్రులవుతున్న మీ అందరికీ ప్రత్యేక అభినందనలు. ఈ రోజు మీ ముందుకు వచ్చి కొన్ని ఆలోచనలు పంచుకోవడం నాకు నిజంగా గొప్ప గౌరవం. పెద్దవాళ్లు జీవితంలో తాము నేర్చుకున్న విషయాలను పిల్లలకు చెప్పాలని కోరుకుంటారు. ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రుల కోరిక ఒకటే. తమ పిల్లలు మంచి మనుషులుగా ఎదగాలి. సంతోషంగా జీవించాలి. స్వతంత్రంగా నిలబడాలి. సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మారాలి. ముఖ్యంగా పిల్లలకు ఎదురయ్యే బాధలు, నిరాశలు, కష్టాలు వీలైనంత వరకు రాకుండా కాపాడాలని తల్లిదండ్రులు ఆరాటపడతారు. సలహాలు ఇవ్వడం సులభం కాదు!జీవితంలో మంచి ఉద్యోగం వస్తుందని... మంచి ప్రేమ దొరుకుతుందని... మీరు కోరుకున్న ప్రతిదీ సాధిస్తారని నేను హామీ ఇవ్వలేను. అలా చెప్పగల శక్తి ఎవరికీ లేదు. ఈ రోజుల్లో ప్రపంచం చాలా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ఇతరు లకు సలహాలు ఇవ్వడం అంత సులభం కాదు. నేను ఒక నటిని. ఒక తల్లిని. ఒక వ్యాపారవేత్తను. అన్నిటికంటే... నాకు ఎంతో ఇష్టమైన పనిని జీవితాంతం చేయగలిగిన అదృష్టవంతురాలిని. అందుకే నా అనుభవాల నుంచి నేర్చుకున్న కొన్ని విషయాలను మీకు చెప్పాలను కుంటున్నా. మీరు మీ గురించి ఏమనుకుంటున్నారో అదే ముఖ్యమని గుర్తించండి. మీ కుటుంబం, ఉపాధ్యాయులు, స్నేహితులు మీకు సహాయం చేసి ఉండొచ్చు. కానీ చివరికి పరీక్షలు మీరు రాశారు. భయాలను మీరు ఎదుర్కొన్నారు. సందేహాలను మీరు జయించారు. ఇకపై కూడా ఇతరుల మాటలు వినండి. వారి అనుభవాల నుంచి నేర్చుకోండి. కానీ, మీ జీవితాన్ని ఇతరులు రాయకూడదు. మీ కథను మీరు రాయాలి. మీరు ఎవరో, మీ విలువలు ఏమిటో, మీ కలలు ఏమిటో... వాటిని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎందుకంటే... ప్రపంచానికి మరో కాపీ అవసరం లేదు. ప్రపంచానికి అవసరమైంది... మీ కొత్త ఆలోచనలు. మీ సృజనాత్మకత. మీ భిన్నమైన దృష్టికోణం. ఇవే భవిష్యత్తును మార్చగలవు. ‘ఒకవేళ ఇలా జరిగితే?’నటనా ప్రపంచంలో ఒక గొప్ప ప్రశ్న ఉంటుంది: ‘వాట్ ఇఫ్’? ‘ఒకవేళ ఇలా జరిగితే?’, ‘ఒకవేళ ఇలా చేస్తే ఎలా ఉంటుంది?’... ఈ ప్రశ్నే కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. ఇప్పుడు నా మొదటి ‘వాట్ ఇఫ్’?... ఒకవేళ, మీరు మీ కుతూహలం(క్యూరియాసిటీ) ఎప్పటికీ కోల్పోకపోతే? ఆసక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకునేలా చేస్తుంది. కొత్త మనుషులను కలిసేలా చేస్తుంది. కొత్త ప్రపంచాలను చూపిస్తుంది. నిజంగా జీవితం మారేది... మనకు తెలిసిన ప్రపంచంలో కాదు. మనకు తెలియని ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడే. అక్కడే కొత్త ఆలోచ నలు పుడతాయి. అక్కడే మనం నిజంగా ఎదుగుతాం. అందుకే, ఎప్పుడైనా జీవితంలో దారి కనిపించకపోతే... ప్రశ్నలు అడగండి. తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీరు కొత్త విషయం నేర్చు కున్నప్పుడు, మీ జీవితంలో ఒక కొత్త తలుపు తెరుచుకుంటుంది. నేను మిమ్మల్ని అడగాలనుకునే మరో ‘వాట్ ఇఫ్ ప్రశ్న’... ఒకవేళ మీరు నేర్చుకోవడాన్ని జీవితాంతం కొనసాగిస్తే? అప్పుడు, మీ జీవితం ఎప్పటికీ ఒకే చోట నిలిచిపోదు. మీరు మారుతారు. ప్రపంచాన్ని చూసే మీ దృష్టి మారుతుంది. అదే నిజమైన విజయం. మా కుటుంబం ఆర్థికంగా చాలా సాధారణంగా ఉండేది. ఎనిమిది మంది పిల్లల్లో నేను ఒకరిని. మాకు అవసరమైనవి ఉండేవి. కానీ, కోరుకున్నది మాత్రం దొరికేది కాదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే... అదే నా జీవితంలో ఒక గొప్ప వరం అనిపిస్తోంది. ఎందుకంటే, అది నాలో ఆకలిని పెంచింది. కష్టపడే అలవాటును నేర్పింది. ఈ రోజు నేను సాధించిన ప్రతి విజయానికి ఆ రోజులే పునాది. ఎప్పుడూ కొత్త లక్ష్యాలు పెట్టుకోండి. కొత్త ఆశలు కలిగి ఉండండి. కొత్త కలల కోసం ప్రయాణం కొనసాగించండి. కలలు లేని జీవితం, ముందుకు సాగని నది లాంటిది. పెద్ద కలలు కనేవారే పెద్ద మార్పులు తీసు కొస్తారు. కల అంటే... కేవలం ఊహ కాదు. అది ఒక దిశ. ఒక లక్ష్యం. ఒక భవిష్యత్తు. విజయం అంటే ఏమిటి?ఈ రోజుల్లో చాలామంది... ఎక్కువ డబ్బు సంపాదించడం, పెద్ద పదవి పొందడం, పేరు సంపాదించడం... ఇవే విజయమని భావిస్తున్నారు. కానీ నా దృష్టిలో నిజమైన విజయం వేరు. విజయం అంటే... ఒక మంచి స్నేహితుడిగా ఉండడం. నమ్మకమైన భాగస్వా మిగా మెలగడం. ఇతరులకు తోడుగా నిలవడం. మంచి మనిషిగా జీవించడం. దయ, నిజాయితీ, మానవత్వం, సహానుభూతి... ఇవి ఎప్పటికీ పాతబడని విలువలు. ఒకప్పుడు... లింగం, కులం, జాతి, వర్గం, లేదా మన నేపథ్యం ఆధారంగా మనిషిని విలువను నిర్ణయించేవారు. అలాంటి నియమాలు తప్పు. వాటిని మార్చాల్సిందే. కానీ కొన్ని విలువలు మాత్రం ఎప్పటికీ మార కూడదు. వాటిలో నాకు అత్యంత ఇష్టమైనది... నువ్వు ఇతరులు నీతో ఎలా ప్రవర్తించాలని కోరుకుంటావో, నువ్వూ వారితో అలాగే ప్రవర్తించు. దీనినే ‘గోల్డెన్ రూల్’ అంటారు. ఇది చాలా సులభంగా అనిపిస్తుంది. కానీ దీన్ని ప్రతిరోజూ పాటించడం అంత సులభం కాదు. అయినా ఇదే జీవితానికి దారి చూపే దిక్సూచి.నా చివరి ‘వాట్ ఇఫ్’. ఒకవేళ, మీరు నిరాశకు లొంగిపోకుండా ముందుకు సాగితే? ఒకవేళ, మీరు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ జీవిస్తే? ఒకవేళ, మీరు కలిసి మెలిసి పనిచేస్తే? అప్పుడు మీరు ఊహించలేని అద్భుతాలను సృష్టించగలరు. కొత్త ప్రపంచాన్ని నిర్మించగలరు. గాయాలను మాన్పగలరు. ప్రజల జీవితాల్లో ఆశలు నింపగలరు. ఈ రోజు మీ చేతిలో డిగ్రీ ఉంది. రేపు మీ చేతిలో సంస్థలు ఉంటాయి. పరిశోధనలు ఉంటాయి. పాఠశాలలు ఉంటాయి. వ్యాపారాలు ఉంటాయి. ప్రభుత్వ బాధ్యతలుండొచ్చు. కుటుంబాలు ఉంటాయి. అంటే... మీ నిర్ణయాలు వేలాదిమంది జీవితాలను ప్రభావితం చేస్తాయి. అందుకే, ఎల్లప్పుడూ దయతో ఉండండి. నిజాయితీని ఎంచుకోండి. మానవత్వాన్ని పంచుకోండి. -
జార్జియా మెలోని (ఇటలీ ప్రధాని) రాయని డైరీ
కష్టాలను దాటుకుని ఎంత గొప్పగా లక్ష్యాన్ని చేరుకున్నా, ఆ వచ్చిన దారిని ఎప్పుడైనా తలచుకున్నప్పుడు... లక్ష్యాన్ని చేరుకోవటంకంటే కూడా కష్టాలను గట్టెక్కుతూ రావటమే గొప్ప విజయంలా అనిపిస్తుంటుంది నాకు! స్త్రీ జీవితంలోని అతి పెద్ద కష్టం... పురుషుడు! నా జీవితంలో ఆ అతి పెద్ద కష్టం నా జీవన సహచరుడు ఆండ్రియా, నా తండ్రి ఫ్రాన్సిస్కో. ఇంకా, నా రాజకీయ జీవితంలోని అనేకానేక మంది ఆండ్రియాలు, ఫ్రాన్సిస్కోలు. ఇటలీలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి పెద్ద వార్త... ప్రధానిగా నేను రికార్డ్ బ్రేక్ చేయటం! వెల్, మీడియా చేసే ‘అతి’ తప్ప, ఏదీ కూడా ఎప్పుడూ అతి పెద్ద వార్త కాదు నా దృష్టిలో. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, గత 80 ఏళ్లలో 2001–2005 మధ్య మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ సృష్టించిన 1,412 రోజుల పాలన రికార్డును నేను సెప్టెంబర్ 3న బ్రేక్ చేశానట! ఆ రోజుతో ప్రధానిగా నేను 1,413 రోజులు పూర్తి చేసుకున్నానట! బెర్లుస్కోనీ బ్రేకులు బ్రేకులుగా 9 ఏళ్లు పాలించినా...మెలోని ఒక్క బ్రేక్ కూడా లేకుండా తన 3 సంవత్సరాల 316 రోజుల పాలనతో ఆయన్ని వెనక్కి నెట్టేశారనీ పత్రికలు రాస్తున్నాయి. స్త్రీ ఎవర్నీ వెనక్కు నెట్టేయదు. తనుముందుకు వెళ్లటం మాత్రమే చేస్తుంది. ప్రధానిగా నా రికార్డుదేముంది కానీ... రాజకీయాల్లోంచి నాకై నేను పారిపోయేలా చేసేందుకు ఎవరెన్ని మాటలు అన్నారో అవన్నీ కదా అసలైన రికార్డులు! ముప్పై ఏళ్ల వయసులో తొలిసారి నేను మంత్రినైనప్పుడు... ‘‘అనుభవం లేని ఈ ‘పొట్టి పిల్ల’ మంత్రిగా ఏం చేస్తుంది?’’ అని సీనియర్ నాయకులు ఫక్కున నవ్వారు! 5 అడుగుల 3 అంగుళాల ఎత్తు అన్నది ‘పొట్టి’ కిందకే రావచ్చు. కానీ ఆ మాట అన్న పొడగరులు ఆ ఒక్క మాటతో ఎంత ఎత్తు నుండి పడిపోయారో గ్రహించన్నా గ్రహించి ఉంటారా! సాటి ప్రజా ప్రతినిధిని పట్టుకుని ‘పిల్ల’ అని అనటంలోనే వాళ్లెంత పెద్దమనుషులో తేలిపోలేదా? నన్ను ‘గార్బటెల్లా గర్ల్’ అని అన్నారు. వీధి బాలికననీ, రోడ్డు పక్కన పెరిగిన అమ్మాయిననీ వాళ్ల చిన్నచూపు.రోమ్‌లోని నిరుపేదలు, కార్మికులు ఉండే ప్రాంతం గార్బటెల్లా నుంచి వచ్చానని నా భాషను కూడా వాళ్లు... ‘జానపద నగర మాండలికం’ అని గేలి చేశారు. నా దుస్తుల్ని గార్బటెల్లా ఫ్యాషన్ అన్నారు! ప్యాంటు, టీ షర్ట్ తొడుక్కోవటం తప్ప ఇటాలియన్ ఫ్యాషన్ సెన్ ్స లేదు అన్నారు. నన్ను ‘లావు’ అన్నారు, ‘ఆవు’ అన్నారు. నేను దేనికీ తల దించకపోవటం చూసి, నన్ను కించపరచటానికి నా తండ్రి గతాన్ని తవ్వి తీశారు. ‘‘ఈమె ఎవరో కాదు, డ్రగ్స్ కేసులో జైలు శిక్ష అనుభవించిన ఫ్రాన్సిస్కో అనే ఒక నేరస్థుడి కూతురు’’ అన్నారు. నేను కొన్నాళ్లు కలిసి జీవించిన ఆండ్రియా మాట తెచ్చి... ‘‘సంప్రదాయాలు, కుటుంబ విలువల గురించి మాట్లాడే ఈమె... పెళ్లి చేసుకోకుండానే కూతుర్ని కనింది’’ అన్నారు. ఇంట్లోని మగవాళ్లు బయటి మగవాళ్లకు ఆయుధాలుగా మారినప్పుడు స్త్రీ మరింత గట్టిగా అరచి తన కోసం తను పోరాటం చేయవలసి వస్తుంది.మగ మాటలతో, మగ చూపులతో తలపడి నిలబడిన ప్రతి క్షణమూ నేను విజయవంతంగా పూర్తి చేసిన ఐదేళ్ల పాలనా కాలంతో నాకు సమానం అయినప్పుడు... సిల్వియో బెర్లుస్కోనీ, మారియో డ్రాఘి, జ్యుసేప్ జానార్డెల్లి, మట్టెయో రెంజీ, జియోవన్నీ లాంజా... ఎంత మంది ఇటలీ ప్రధానుల పదవీ కాలాలు నా వల్ల బ్రేక్ అయితే మాత్రం నాకు గొప్పౌతుంది?! నిత్యం మగాళ్లతో ఇంట్లో, బయటా అవస్థలు, అవమానాలు పడుతున్న సాధారణ స్త్రీల అనుక్షణ జీవిత కాలం ముందు ప్రధానిగా నా ఎన్నేళ్ల నిరవధిక పదవీ కాలమైనా ఏం లెక్కౌతుంది?! -
భూమి దున్నేవారు లెక్కలోకి రారా?
రంగారెడ్డి జిల్లాలో ఒక రైతు పదేళ్లుగా ఐదెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తు న్నాడు. విత్తనం కొనేది అతడే. ఎరువులు వేసేది అతడే. పంట ఎండిపోతే నష్టం భరించేదీ అతడే. కానీ ప్రభుత్వ రికార్డులో ఆ భూమి సాగు చేసే రైతు అతడు కాదు. అందుకే బ్యాంకు రుణం రాదు, పంటల బీమా రాదు, పెట్టుబడి సాయం రాదు, కరవు వచ్చినప్పుడు పరిహారమూ రాదు. దశాబ్దాలుగా మన కౌలు రైతుల కథ ఇదే. ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న ఒక్కటే– దేశం మొత్తాన్ని డిజిటల్‌గా మారుస్తున్న కొత్త వ్యవస్థ ఈ కథను మారుస్తుందా?అగ్రిస్టాక్ అంటే ఏమిటి?కేంద్ర ప్రభుత్వం రూ. 2,817 కోట్లతో అగ్రిస్టాక్ అనే డిజిటల్ వ్యవస్థను నిర్మిస్తోంది. దేశంలోని 14 కోట్ల వ్యవసాయ కమతాలకూ, ప్రతి రైతుకూ ఆధార్‌తో ముడిపడిన ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇస్తారు. భూమి వివరాలు, ఏ పంట వేశారు, ఎంత దిగుబడివచ్చింది– అన్నీ ఉపగ్రహ చిత్రాలతో కలిపి ఒకచోట పెడతారు. దీని ఆధారంగా రాయితీలు, బీమా, రుణాలు, సలహాలు అన్నీ వేగంగా అందుతాయని చెబుతున్నారు. పంటల బీమా క్లెయిము రావడానికి ఇప్పుడు ఏళ్లు పడుతోంది. ఉపగ్రహ చిత్రాలతో పంట నష్టాన్నివెంటనే గుర్తిస్తే రైతుకు నిజంగానే మేలు జరుగుతుంది. కానీ ఒక్క ప్రశ్న. మన వ్యవసాయ సమస్య నిజంగా సమాచారం లేక పోవడమేనా? దేశంలో ఇప్పటికే 22 కోట్ల భూసార కార్డులు ఇచ్చారు. కేంద్ర భూగర్భ జల మండలి 25 వేల బావులను ఏటా కొలుస్తోంది. వ్యవసాయ ఖర్చులను 1970ల నుంచీ ప్రతి ఏటా లెక్కిస్తున్నారు. రైతు ఆత్మహత్యల సంఖ్యను 1995 నుంచీ నమోదు చేస్తున్నారు. వాతావరణ శాఖకు 730 కేంద్రాలున్నాయి. మరి ఫలితం? నేలలో సేంద్రియ కర్బనం తగ్గుతూనే ఉంది. భూగర్భ జలం అడుగంటుతూనే ఉంది. రైతుల అప్పులు పెరుగు తూనే ఉన్నాయి. సమాచారం లేకపోవడమే అసలు అడ్డంకి అయితే ఈ సమస్యలు ఎప్పుడో తీరిపోయేవి.ఎరువుల విషయమే చూడండి: నత్రజని తగ్గించమని భూసార కార్డు చెబుతుంది. కానీ యూరియా బస్తా ధర 85% రాయితీతోఅందుతుంది. నేల ఏం చెప్పినా, మార్కెట్లో అన్నింటికంటే చౌక అదే. అందుకే రైతు దాన్నే వాడతాడు. కంప్యూటర్ ఎంత తెలివైనదైనా ఈ లెక్క మార్చదు.అసలు లోపం ఎక్కడుంది?దేశంలో దాదాపు 40 శాతం వ్యవసాయ కుటుంబాలు తమవి కాని భూముల్ని సాగు చేస్తున్నాయి. వ్యవసాయ పనుల్లో 60 నుంచి 80 శాతం చేసేది మహిళలు; కానీ భూమి ఉన్నది కేవలం 13.9 శాతం మందికే. అటవీ హక్కుల పత్రాలు రాని ఆదివాసీలు, భూమిలేని కూలీలు, వలస వెళ్లి కౌలుకు చేసేవాళ్లు– వీళ్లెవరూ భూ రికార్డులో కనిపించరు.తెలంగాణ రైతు భరోసా అనుభవం మన కళ్ల ముందే ఉంది. అది భూ రికార్డులతో ముడిపెట్టిన పథకం. అందుకే లక్షలాది కౌలు రైతులు దాని పరిధిలోకి రాలేదు. ఇప్పుడు అదే లోపాన్ని దేశమంతటికీ, డిజిటల్ రూపంలో, శాశ్వతంగా అమర్చుతున్నాం. కాగితపు రికార్డును అప్పుడప్పుడూ సరిదిద్దుకోవచ్చు. కంప్యూటర్లో ఒకసారి నమోదైన తప్పును కదిలించడం చాలా కష్టం. తెలంగాణలో భూభారతి, ఆంధ్రాలో వెబ్ ల్యాండ్. దాని మీద అగ్రిస్టాక్. దాని మీద కృషి విస్తార్ అనే సలహాల వ్యవస్థ. కింది అంతస్తులో ఉన్న పగుళ్లు పైకి ఎక్కుతూ పెద్దవవుతాయి. రైతు అనుమతితోనే సమాచారం పంచుకుంటామని చెబు తున్నారు. కానీ పీఎం–కిసాన్ డబ్బు, పంటల బీమా, కిసాన్ క్రెడిట్ కార్డు– ఇవన్నీ ఆ నమోదుతోనే ముడిపడితే, రైతుకు వద్దనే స్వేచ్ఛ ఎక్కడ? విత్తనం కొనడానికి డబ్బు కావాల్సిన రైతు ‘అంగీకరిస్తున్నా’ అని నొక్కడం సమ్మతి కాదు, తప్పనిసరి.ఆ సమాచారం చిన్నదేమీ కాదు. ఏ పంట వేశాడు, ఏ ఎరువు కొన్నాడు, ఎంత అప్పు ఉంది, ఎప్పుడు కట్టాడు– ఇదంతా ఎరువుల కంపెనీలకూ, రుణ సంస్థలకూ బంగారం లాంటిది. ఉపగ్రహ చిత్రంలో పంట ఎండినట్టు కనిపించిన మరుక్షణం రుణం వసూలుకు ఒత్తిడి మొదలవ్వొచ్చు.ఇది ఊహాజనిత భయం కాదు. ప్రపంచంలో ఇలాగే జరిగింది. వాతావరణ సమాచారం ఇచ్చే ఒక చిన్న కంపెనీని మాన్ శాంటో వేల కోట్లు పెట్టి కొనుక్కుంది. ఆ తర్వాత అది రైతుల పొలాల సమాచా రాన్నంతా సేకరించే పెద్ద వేదికగా మారింది. ప్రజా ప్రయోజనం పేరుతో మొదలైన వ్యవస్థలు చివరికి వ్యాపార వేదికలుగా మారడం చాలాసార్లు చూశాం.కృత్రిమ మేధతో సలహాలు ఇస్తామంటున్నారు. మన దగ్గర ఒక వ్యవసాయ అధికారికి వెయ్యి మంది రైతులు. ఇది సాంకేతిక లోపం కాదు, పెట్టుబడి లోపం. యాప్ ఉంది కదా అని సిబ్బందిని నియమించడం మానేస్తే, రైతుకు మిగిలేది పొలానికి రాని సలహా. పైగా ఆ సలహా ఇచ్చే వేదికలు ఎరువులు, పురుగుమందులు అమ్మే కంపెనీలతో కలిసి పనిచేస్తే– రసాయనాలు తక్కువ వాడమని అది ఎందుకు చెబుతుంది?మరేం చేయాలి?అగ్రిస్టాక్‌ను ఆపమని ఎవరూ అనడం లేదు. రైతు ప్రయోజ నాల చుట్టూ దాన్ని నిర్మించాలి. మొదటిది– భూమి యజమానిని కాక సాగు చేసేవారిని రైతుగా గుర్తించాలి. గ్రామసభ ధ్రువీకరణతో కౌలుదారుల పేర్లు నమోదు చేయాలి. ఒడిశా, కేరళ ఇలాంటి ప్రయత్నాలు చేశాయి. రెండోది– మహిళల పేర్లు తప్పనిసరిగా నమోదు కావాలి. కుటుంబంలో సాగుచేసే అందరికీ గుర్తింపు ఇవ్వాలి. మూడోది– సమాచారంపై బేరసారాలు ఒక్కో రైతు ఒంట రిగా చేయలేడు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు, సహకార సంఘా లకు ఆ అధికారం ఇవ్వాలి. నాలుగోది– సలహాలు ఇచ్చే కంప్యూటర్ కార్యక్రమాలు బహిరంగంగా ఉండాలి. అవి ఎలా పనిచేస్తున్నాయో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రజలు పరిశీలించగలగాలి. సలహాలు ఇచ్చే కంపెనీలు బాధ్యత వహించాలి. ఐదోది– ఎవరైనా అన్యాయంగా జాబితా నుంచి తప్పిపోతే, వారం రోజుల్లో సరిదిద్దే వ్యవస్థ ఉండాలి. కంప్యూటర్ క్షణంలో పేరు తీసేస్తే, దాన్ని తిరిగి చేర్చడానికి ఏళ్లు పడితే ఆ సీజన్ పంట పోతుంది.ఇవేమీ కొత్త ఆలోచనలు కావు. సేంద్రియ ధ్రువీకరణ కోసం మన దేశంలో ఇప్పటికే రైతులే పరస్పరం తనిఖీ చేసుకునే పద్ధతి నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసా యానికి మారింది యాప్‌ల వల్ల కాదు, గ్రామంలోని ఒక రైతు మరో రైతుకు నేర్పడం వల్ల. సాంకేతికత ఈ మానవ వ్యవస్థలకు తోడుగా రావాలే తప్ప, వాటి స్థానంలో కూర్చోకూడదు. మన వ్యవసాయ సంక్షోభం సమాచార సమస్య కాదు, పాలన సమస్య. భూమి పత్రం ఏం చెబుతుందో కాదు, పొలంలో ఎవరు చమట చిందిస్తున్నారో చూసే వ్యవస్థ కావాలి.-వ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త,‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-డా‘‘ జి.వి.రామాంజనేయులు -
సముద్ర రవాణా ఇక ఆర్కిటిక్ వైపు?
ప్రపంచ సగటుతో పోలిస్తే వేగంగా పెరుగుతున్న ఆర్కిటిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, గ్రీన్ లాండ్‌ను వశం చేసుకుంటామనే ట్రంప్ బెదిరింపులు, అసాధారణ స్థాయిలో కరిగిపోతున్న మంచు; రష్యా, ఇరాన్లపైన అమెరికా ఆర్థిక యుద్ధం క్రమంగా ప్రపంచ దేశాలను ఆర్కిటిక్ సముద్ర జలాల వైపు నడిపిస్తున్నాయి. అమెరికా నాయకత్వంలోని పాశ్చాత్య దేశాల అదుపాజ్ఞలలో ఉన్న హార్మూజ్, బాబెల్ మాండెబ్, సూయెజ్, మలక్కా జలసంధుల నుండి దూరంగా సురక్షిత ఆర్కి టిక్ సముద్ర మార్గం గుండా సరకుల రవాణాకు రష్యా, చైనా పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నాయి. ఆసియా, ఐరోపాలను కలిపే కేప్ ఆఫ్ గుడ్‌హోప్, సూయెజ్ కాలువ మార్గాలలో అశాంతి, అనిశ్చిత స్థితి వలన అందరి చూపు ఆర్కిటిక్ వైపు మళ్లింది. ప్రపంచ సగటుతో పోల్చితే ఆర్కిటిక్ సముద్రంలో ఉష్ణోగ్రతలు మూడు నుండి నాలుగు రెట్లు వేగంగా పెరుగుతున్నాయి. దీనినే పర్యావరణ శాస్త్రజ్ఞులు ‘ఆర్కిటిక్ ఆంప్లిఫికేషన్ ’గా అభివర్ణిస్తున్నారు. పారిశ్రామిక విప్లవానికి ముందు ఉష్ణోగ్రతల కంటే ఐరోపాలో 2.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగితే ఆర్కిటిక్ సముద్రంలో 3.3. డిగ్రీల సెల్సియస్ పెరిగింది. గత సంవత్సరంలో అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఆర్కిటిక్‌లో 5.8 శాతం మంచుపొర క్షీణించింది. వేగంగా క్షీణిస్తున్న మంచుపొర ఆర్కిటిక్ జలాలను నౌకాయానానికి మరింత అనుకూలంగా చేస్తున్నది. రష్యాకు సానుకూలంఆర్కిటిక్ జలాలలో మూడు ప్రధాన నౌకా మార్గాలున్నాయి. అవి. 1. నైరుతి మార్గం 2. వాయవ్య మార్గం 3. ధ్రువ ప్రాంతం మీదుగా వెళ్లే (ట్రాన్స్ పోలార్) మార్గం. కెనడా తీరంలోని వాయవ్య మార్గంలో అనువైన రేవు పట్టణాలు లేవు. అందువలదన ఈ ప్రాంతంలో కేవలం విహార యాత్రికుల క్రూయిజ్ షిప్పులు, పరిశోధనా నౌకలు మాత్రమే సంచరిస్తున్నాయి. ఉత్తర ధ్రువాన్ని ఆనుకుని ఉన్న ట్రాన్స్పోలార్ మార్గం పూర్తిగా మంచుతో కప్పబడి నౌకాయానానికి ఏ మాత్రం వీలుగా లేదు. ప్రస్తుత ప్రపంచ దృష్టి అంతా రష్యా తీరంలోని నైరుతి ఆర్కిటిక్ సముద్ర మార్గంపైననే ఉన్నది. రష్యా తీరంలో ముర్మన్స్క్నుండి వ్లాదివోస్తోక్ మధ్యలో 70కి పైగా రేవు పట్టణాలు ఉన్నాయి. ముర్మన్స్క్ రేవు పట్టణం సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటుంది. రష్యన్ న్యూక్లియర్ ఐస్ బ్రేకర్ నౌకాదళ ప్రధాన కార్యాలయం ఇక్కడనే ఉన్నది. 2025లో ఈ ఆర్కిటిక్ సముద్ర మార్గం గుండా 37 మిలియన్ టన్నులుగా ఉన్న రవాణా 2026లో ఇప్పటికే 40 మిలియన్ టన్నులకు చేరింది. ఈ రవాణా ప్రధానంగా రష్యన్ చమురు, గ్యాస్ ఎగుమతుల రూపంలో ఉన్నది. యామాల్ ద్వీపకల్పంలోని నోవాటెక్ చమురు క్షేత్రాలలో ఉత్పత్తి అవుతున్న చమురు, సహజవాయువులను ఈ మార్గం గుండా చైనాకు ఎగుమతి చేస్తున్నారు. రష్యా–చైనా మధ్య గత సంవత్సరం 103 నౌకలు ఈ మార్గంలో ప్రయాణించాయి. ఈ మార్గంలో చమురు ట్యాంకర్లే కాకుండా క్రమంగా సరకుల రవాణా చేసే భారీ కంటెయినర్ కార్గో షిప్పుల ప్రయాణం కూడా ప్రారంభమైంది. 2023లో 7 కంటెయినర్ షిప్పులు ప్రయాణిస్తే ఈ సంవత్సరం ఇప్పటికే 30 కంటెయినర్ షిప్పులు ప్రయాణించాయి.చైనా వడి వడి అడుగులుచైనా వ్యూహాత్మకంగా ఆర్కిటిక్ సముద్ర మార్గంపై అమితా సక్తిని చూపిస్తున్నది. చైనాకు ఆర్కిటిక్ తీరం లేదు. 2013లో ఆర్కిటిక్ కౌన్సిల్లో అబ్జర్వర్‌గా చేరింది. 2017లో చైనా తన ప్రతిష్ఠాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) పథకాన్ని ఆర్కిటిక్‌కు విస్తరిస్తూ ‘పోలార్ సిల్క్ రోడ్’ను ప్రతిపాదించింది. 2018లో ఆర్కిటిక్ విధాన శ్వేతపత్రంలో చైనా తనను తాను ‘నియర్ ఆర్కిటిక్ స్టేట్’గా అభివర్ణించుకున్నది. ఆర్కిటిక్ సముద్ర జల మార్గంలో 2024లో 15 చైనా నౌకలు ప్రయాణించగా, వాటి సంఖ్య 2026 నాటికి 30కి పైగా చేరింది. చైనాలో నింగ్బో నుండి కంటె యినర్ షిప్పులు సూయెజ్ కాలువ గుండా ప్రయాణిస్తే యూకేలోని అతిపెద్ద కంటెయినర్ టర్మినల్ ఫీలిక్స్స్టోవే చేరటానికి 40 రోజులు పడుతుంది. ఆర్కిటిక్ సముద్ర మార్గంలో నింగ్బో నుండి ఫీలిక్స్ స్టోవేకు 20 రోజుల్లో చేరుతున్నారు. చైనాకు చెందిన సీవోఎస్సీవో (కాస్కో) ఈ మార్గంలో కంటెయినర్ రవాణాను చేపట్టింది. నౌకల రవాణాను సుగమం చేయటానికి చైనా ఆర్కిటెక్ జలాలలోకి గ్జ్యూ లాంగ్, గ్జ్యూ లాంగ్–2 ఐస్‌బ్రేకర్ షిప్పులను ప్రవేశపెట్టింది. 2025లో రష్యా, చైనా ఆర్కిటిక్ సముద్ర రవాణాలో పరస్పరం సహకరించుకోవటానికి ఒప్పందం కుదుర్చుకొన్నాయి.అంతర్జాతీయంగా రష్యన్ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయటానికి రష్యాపై అమెరికా తీవ్ర ఆంక్షలను విధించింది. అంతర్జాతీయ నెఫ్ట్ చెల్లింపుల వ్యవస్థ నుండి రష్యాను బహిష్కరించింది. అయి నప్పటికీ చైనా, భారత్, ఇరాన్ వంటి దేశాలతో లావాదేవీల ద్వారా రష్యా తన వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నది. ఆర్కిటిక్ జలాలలో రష్యా–చైనా వ్యూహాలను అమెరికా, ఐరోపాలు నిశితంగా గమనిస్తున్నాయి. ప్రస్తుతం రష్యన్ ఆర్కిటిక్ ఎకానమీ, రష్యన్ జీడీపీలో పది శాతం కంటే తక్కువగానే ఉన్నది. కానీ రానున్న 20 సంవత్సరాలలో ఇది 60 శాతానికి చేరినా ఆశ్చర్యపడనవసరం లేదు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ గ్రీన్ లాండ్ వివాదాన్ని భుజాలకెత్తుకున్నాడు. ఆర్కిటిక్ జలాలలో రష్యా–చైనా లపై నిఘా వేయటానికి గ్రీన్ లాండ్ కీలకం. అందుకే గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో అంతర్భాగం చేయాలని పట్టు బడుతున్నాడు. 2026 ఫిబ్రవరిలో నాటో ‘ఆపరేషన్ ఆర్కిటిక్ సెంట్రీ’ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆర్కిటిక్ జలా లపై నాటో బలగాలు గట్టి నిఘాను పెడుతున్నాయి. అయితే ఆర్కిటిక్ రష్యాను ఎదుర్కొనే నౌకాశక్తిగానీ, ఐస్ బ్రేకింగ్ షిప్పుల సామ ర్థ్యాలుగానీ, యూఎస్, నాటోలకు లేవు. అదే రకంగా రష్యాకూ పరిమితులున్నాయి. రష్యా మీద ఆంక్షల వలన పాశ్చాత్య షిప్పింగ్ కంపెనీలు, బీమా కంపెనీలు ముందుకు రాకపోవడంతో ఆర్కిటిక్ ప్రపంచ రవాణా మార్గంగా అభివృద్ధి చెందటం కష్టం.భారత్ కార్యకలాపాలు1920 స్వాల్బార్డ్ ఒప్పందంపై సంతకం చేయటం ద్వారా భారత్ ఆర్కిటిక్ వైపు అడుగులు వేసింది. 2007లో తన మొదటి పరిశోధనా/ అన్వేషణ నౌకను ఆర్కిటిక్‌కు పంపించింది. 2013లో ఆర్కిటిక్ కౌన్సిల్లో అబ్జర్వర్‌గా చేరింది. 2022లో ఆర్కిటిక్ పాలసీని ప్రకటించింది. శాస్త్ర–వైజ్ఞానిక అంశాల లక్ష్యంగా ఉన్న ఆర్కిటిక్ సముద్ర జలాలను భారత్ 2022 తర్వాత వనరులు, ఆర్థిక లక్ష్యాలు, వ్యూహాత్మక కోణంలో నుండి పరిశీలించటం ప్రారంభించింది. 2024లో చెన్నై–వ్లాదివోస్తోక్ మార్గాన్ని ‘ఈస్టర్న్ మారిటైమ్ కారిడార్’గా అభివృద్ధి చేయటానికి రష్యాతో ఒప్పందం కుదుర్చు కున్నది. రష్యన్ ఆర్కిటిక్ తీరంలో ప్రాజెక్టుల అభివృద్ధికి ఒక బిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్‌ను ఏర్పాటు చేసింది. వచ్చే సంవ త్సరం (2027)లో మొట్టమొదటి భారతీయ రవాణా నౌక ఆర్కిటిక్ జలాలలో ప్రయాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గురజాల శ్రీనివాసరావు వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
శాస్త్రీయతలేని విధానాలతోనే విపత్తులు
హిమాలయాలు ఒకదాని తర్వాత ఒకటిగా హెచ్చరికలు చేస్తూనే వస్తున్నాయి. ఆకస్మిక వరదలు, హిమ పాతాలు, హిమానీనద సరస్సులకు గండి పడటంతో ముంచెత్తుతున్న వరదలు, మేఘ విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడటం, తీవ్రంగా భూమి కుంగిపోవడం వంటివి వాటి కోవలోకి వస్తాయి. కేదార్నాథ్, ధౌళిగంగ, జోషీమఠ్, సిక్కిం, ఇపుడు నేపాల్‌లోకి సరిహద్దులు దాటి వచ్చిన వరదలు అలాంటివే. అటువంటి ప్రతి ఉత్పాతంలోనూ వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అపారమైన విధ్వంసం కనుల ఎదుట నిలుస్తోంది. హిమాలయాలలో సంభవిస్తున్న విపత్తులను ఎదుర్కొనేందుకు బహుముఖ వ్యూహం అవసరం. శాస్త్రీయ పరిశోధనలు సాగించడం, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేసే యంత్రాంగాలను తయారు చేసుకోవడం, ప్రజా చైతన్యం తీసుకు రావడం, సమాజాలను కూడా ఈ కృషిలో భాగస్వాములుగా చేయడం వంటివి చేపట్టక తప్పదు. నివేదికలు వెల్లడిస్తున్న వాస్తవాలువాతావరణ మార్పుపై ఏర్పడిన వివిధ ప్రభుత్వాల ప్యానెల్ అంతర్జాతీయ స్థాయిలో వివిధ నివేదికలను ప్రచురించింది. గ్లేసియర్లు, పర్వత ప్రాంతాలలోని జీవావరణ వ్యవస్థల గురించి వివిధ దేశాలు వాటి పరిశోధనల్లో కనుగొన్న అంశాలకు ఒక సమగ్ర రూపం ఇచ్చింది. మన దేశంలోనూ రిమోట్ సెన్సింగ్ సెంటర్ రిమోట్ సెన్సింగ్ ఇమేజరీని ఉపయోగించి (మొత్తం 28,000లలో) 7,500లకు పైగా గ్లేసియల్ సరస్సుల మ్యాప్‌ను రూపొందించింది. హై–రిస్క్ గ్లేసియల్ సరస్సులకు సంబంధించి అది వరద ముప్పుల మ్యాప్‌ను కూడా తయారు చేసింది. ఐసు గడ్డలు, బండరాళ్ళు కట్టలుగా ఉన్న సరస్సులు ఒక్కసారి తెగిపడితే రాగల వరదలు, వాటివల్ల దిగువ పరీవాహక ప్రాంతాల్లోనున్న జనావాసాలకు వాటిల్లగల నష్టాల గురించి కూడా అది తెలియజేసింది. కాఠ్మాండూకు చెందిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటెగ్రే టెడ్ మౌంటైన్ డెవలప్మెంట్(ఐసీఐఎంఓడీ) మొన్నీమధ్య అంటే 2026 మార్చిలో కూడా రెండు గణనీయమైన నివేదికలను ప్రచురించింది. వాటిలో ఒకటి హిందూ కుష్ హిమాలయ ప్రాంతంలో 1990 నుంచి 2020ల వరకు మారుతున్న గ్లేసియర్ల గతిశీలతలను వివరించింది. మరోటి 2026 నాటికి ఉన్న హిందూ కుష్ హిమాలయ గ్లేసి యర్ల స్థూల స్వరూప స్వభావాలను వెల్లడించింది. ఈ నివేదికలు వెల్లడిస్తున్న అంశాలు ఆందోళన రేపేవిగా ఉన్నాయి. మొదటి నివేదిక 55 వేలకు పైగా చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హిందూ కుష్ ప్రాంతమంతటానున్న 63,761 గ్లేసియర్ల డేటాను ఆధారం చేసుకుని రూపొందింది. వాటిలో 5,700 క్యూబిక్ కిలోమీటర్ల మేర ఐసు నిల్వలున్నాయి. నలుచెరగులా ఉన్న ఈ గ్లేసి యర్లు 1990ల ఆరంభం నుంచి స్థిరంగా కరిగిపోతూ వస్తున్నా యని ఆ విశ్లేషణ తెలిపింది. మొత్తం గ్లేసియర్ ప్రాంతంలో 12 శాతం తరిగిపోయింది. అంచనా వేసిన హిమ నిల్వలలో 9 శాతం క్షీణత కనిపించింది. గ్లేసియర్లు అలా కుంచించుకుపోవడం 2010 నుంచి 2020 మధ్య కాలంలో మరీ కొట్టొచ్చినట్లు కనిపించింది. సింధు నదీ పరీవాహక ప్రాంతం 6 శాతం గ్లేసియర్ ప్రాంతాన్ని కోల్పోయింది. గంగా నది 21 శాతం, బ్రహ్మపుత్ర 16 శాతం తరుగుదలను నమోదు చేశాయి. హిమం గడ్డకట్టిన ప్రాంతాలు కుంచించుకు పోవడం వల్ల వర్షాకాలం మినహా ఇతర కాలాల్లో నీటి లభ్యత తగ్గి పోతోంది. రెండవ నివేదిక 38 గ్లేసియర్ల సన్నిహిత పరిశీలనతో తయారైంది. హిమాలయాల్లో హిమం గడ్డకట్టిన భూభాగాల్లో కొన్ని పాతరూపును పూర్తిగా కోల్పోయే స్థితికి చేరుకున్నట్లుగా కనిపిస్తున్నా యని ఈ నివేదిక వెల్లడించింది. ‘‘ఇది ఎక్కడో సుదూరంలో ఉన్న సమస్య కాదు. నేటి కాలంలో ఆవిష్కృతమవుతున్న సంక్షోభం. ప్రతి వేసవిలోను, వర్షాకాలంలోను కొత్త ఉపద్రవాలను చూస్తున్నాం. హిమాన్ని కోల్పోతున్న రేట్లు ఈ శతాబ్దంలో రెండింతలైన వాస్తవ మైనా కనీసం మన కళ్లు తెరిపించాలి’’ అని ఐసీఐఎంఓడీ డైరెక్టర్ జనరల్ పెమా గ్యాంషో అన్నారు. నేపాల్‌లో ఇటీవల చూసిన వరదలు గ్యాంషో హెచ్చరికలోని వాస్తవాన్ని ఎత్తి చూపాయి. ఇది గ్లేసియర్ గతిశీలతల సైన్స్, ఉపగ్రహాల విశ్లేషణ, 1974 నుంచి క్షేత్ర స్థాయిలో సేకరిస్తూ వస్తున్న డేటాను ఆధారం చేసుకుని చేసిన స్పష్టమైన హెచ్చరికగా భావించవచ్చు. రుణాలు ఎలా ఇస్తున్నారు?డేటాను విశ్లేషించడం ద్వారా, నిష్క్రియాపరత్వం వల్ల కలిగే ప్రమాదకర పర్యవసానాలను తెలుపడం ద్వారా సైంటిస్టులు తమ వంతు కృషి చేస్తున్నారు. కానీ, విధాన నిర్ణేతల స్పందనే మంద కొడిగా ఉంది. అంతర్జాతీయంగా కూడా, వివిధ దేశాల ప్యానెళ్ళ నివేదికలపై స్పందన లోపభూయిష్టంగా ఉంది. ముఖ్యంగా, పుడమి తాపాన్ని తగ్గించేందుకు ఉద్గారాలను తగ్గించు కోవాల్సిన అంశంపై వాటి కార్యాచరణ పేలవంగా ఉంది. దాని ప్రత్యక్ష ఫలితం హిమా లయాలపై పడుతోంది. ప్రాంతీయ స్థాయిలో హిమాలయ ప్రాంతంలోని దేశాల మధ్య సహకారం బొత్తిగా లేదనే చెప్పాలి. ప్రాంతాల మధ్య రాజకీయ సరిహద్దులను ప్రకృతి ఉత్పాతాలు, వాతావరణం గుర్తించవు కనుక ఈ ప్రాంతంలోని దేశాలు సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుని తీరాలి. సింధు, గంగ, బ్రహ్మపుత్ర, మెకాంగ్ వంటి పెద్ద నదులన్నీ హిమాల యాలలోనే పుడుతున్నాయి. వివిధ దేశాలను దాటి ప్రవహిస్తు న్నాయి. కనుక, ఒక దేశంలో ఆ నదిలోకి కొండ చరియలు విరిగి పడితే, అది మరో దేశంలో వినాశకర వరదలకు కారణంగా పరిణ మించవచ్చు. లిహెండే ఖోలా నదిలో గత ఏడాది జూలైలో సంభవించిన విపత్తు అదే రసూవా, నువాకోట్ ప్రాంతంలోని కనీసం అర డజను జల విద్యుదుత్పాదన ప్రాజెక్టులకు నష్టం కలిగించింది. ఇపుడు వార్తలకెక్కిన ప్రాంతం అప్పుడూ ఇంచుమించుగా ఇవే కారణాలపై వార్తలకెక్కింది. త్రిశూలి పరీవాహక ప్రాంతంలో దాదాపు 36 జల విద్యుదుత్పాదన ప్రాజెక్టులు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. బహుళ జాతీయ రుణ సంస్థలు కూడా ఆయా అంశాలు వేటినీ లెక్కలోకి తీసుకోకుండా రుణాలు ఇస్తూనే ఉన్నాయి. ఆనకట్టలు, నదులు, ప్రజానీకంపై అధ్యయనం చేసిన సౌత్ ఏషియా నెట్వర్క్ విశ్లేషణలో ఆ అంశాలు వెలుగు చూశాయి. భారతదేశంలో కూడా ప్రకృతి ఉత్పాతాలు, హిమ పాతాలు సంభవించే, శిథిల ప్రవాహాలుసాగే ప్రాంతాల్లో జల విద్యుదుత్పాదన ప్రాజెక్టులు చురుకుగా సాగుతున్నాయి. రెండూ సాగవు!హిమాలయాల్లో జీవావరణ పరంగా సున్నితమైన ప్రాంతాలు రాజకీయంగా కూడా సున్నితమైనవి. అవి భారత్, చైనా, నేపాల్ సరిహద్దుల గుండా వ్యాపించి ఉన్నాయి. వ్యూహాత్మక ప్రయోజనాల రీత్యా మౌలిక వసతులను పెద్దయెత్తున అభివృద్ధి చేస్తున్నాయి. పైగా, సామూహిక యాత్రలను, వాణిజ్యపరమైన పర్వత ప్రాంత టూరిజాన్ని అవి ఇతోధికంగా ప్రోత్సహిస్తున్నాయి. కానీ, పర్యావరణపరంగా పెళుసైన ప్రాంతాల్లో నిర్నిరోధ అభి వృద్ధి, కమర్షియల్ టూరిజం చెట్టపట్టాలేసుకుని సాగలేవని గ్రహించాలి. శాస్త్రీయ ఆధారాలు, విధాన నిర్ణయాల మధ్య అగాథాన్ని భర్తీ చేయడం ద్వారా పర్వత ప్రాంతాల్లో సంభవించగల విపత్తుల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
ప్రజల హృదయాల్లో చెరగని సంతకం
ప్రజల జీవితాలను మార్చిన నాయకులు ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోతారు. అలాంటి అరుదైన ప్రజా నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల మూడు నెలల స్వల్ప కాలంలోనే సంక్షేమం, వ్యవసాయం, సాగు నీరు, విద్య, వైద్యం, మౌలిక వసతుల రంగాల్లో తీసుకున్న నిర్ణయాలు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక చరిత్రను మార్చేశాయి. వైఎస్సార్ పాలనకు అసలు బలం ఆయన అధికారంలోకి రావడానికి ముందే పాదయాత్ర చేసి ప్రజలతో మమేకవడమే. 2003లో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు 1,470 కిలోమీటర్లకు పైగా సాగిన ఆయన ప్రజా ప్రస్థానం కేవలం ఒక రాజకీయ పాదయాత్ర కాదు. అది గ్రామీణఆంధ్రప్రదేశ్ వాస్తవ పరిస్థితులను స్వయంగా తెలుసుకున్న ఒక నాయకుడి సామాజిక అధ్య యనం. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ‘ప్రజలు’ కేంద్ర బిందువుగా పలు చారి త్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.రైతు సంక్షేమానికి వైఎస్సార్ ఇచ్చిన ప్రాధాన్యం ఆయన పాలనా తత్వానికి అద్దం పడుతుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించే నిర్ణయంపై తొలి సంతకం చేయడం ఒక సాధారణ ప్రభుత్వ ఉత్తర్వు కాదు. విద్యుత్ బకాయిల రద్దు, వ్యవసాయానికి ప్రోత్సాహం, సాగునీటి విస్తరణ వంటి చర్యలతో రైతాంగానికి ఆయన ఒక కొత్త భరోసాను కల్పించారు. అదే సమయంలో కరవుతో అలమటిస్తున్న ప్రాంతా లను శాశ్వతంగా మార్చాలన్న సంకల్పంతో ‘జలయజ్ఞం’కు శ్రీకారం చుట్టారు. పోలవరం, ప్రాణహిత–చేవెళ్ల, దేవాదుల, నెట్టెంపాడు, కల్వకుర్తి, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ వంటి అనేక ప్రాజెక్టులు ఆయన కాలంలోనే రూపుదిద్దుకున్నాయి.స్వయంగా వైద్యుడైన వైఎస్సార్ పేదలకు వైద్యం భారం కాకూడదనే గొప్ప ఆలోచనతో ఆరోగ్యశ్రీ, ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడేందుకు 108, గ్రామీణ ప్రజలకు వైద్య సేవలను చేరువ చేసేందుకు 104 వంటి కార్య క్రమాలు తీసుకొచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్యను చేరువ చేశారు. ఇంది రమ్మ ఇళ్లు, పావలా వడ్డీ రుణాలు, పింఛన్ల పెంపు వంటి చర్యలు... సంక్షేమాన్ని వైఎస్సార్ ప్రభుత్వ విధానంలో అంతర్భాగంగా మార్చాయి.హైదరాబాద్ అభివృద్ధిలోనూ వైఎస్సార్ దూరదృష్టి స్పష్టంగా కనిపిం చింది. ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైల్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ఆయన పాలనలోనే తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్ గ్రేటర్ నగరం విస్తరణకు పునాదులు వేశాయి. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా రైతు పొలంలో, పేదవాడి ఇంటిలో, విద్యార్థి కలలో, రోగి చికిత్సలో, సాగునీటి ప్రాజెక్టుల్లో ఆయన పరిపాలనా ముద్ర కనిపిస్తూనే ఉంటుంది.చదవండి: మానవతా మహర్షి...బి. మహేశ్ కుమార్ గౌడ్ వ్యాసకర్త ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు -
నిక్కమైన రైతు బాంధవులు
ఎంఎస్ స్వామినాథన్‌కూ, వైఎస్ రాజ శేఖరరెడ్డికీ మధ్యన పోలికేంటి? వారిద్దరూ ఎక్కడైనా, ఎప్పుడైనా కలసి పనిచేశారా? లేదు. వారిద్దరూ నడిచిన బాటలు వేరే అయినప్పటికీ గమ్యం ఒక్కటే. అదే రైతు సంక్షేమం. స్వామినాథన్ ప్రముఖ శాస్త్ర వేత్త. భారత దేశంలో హరిత విప్లవానికి పితామహుడు. 1971 వరకూ ఇండియా ఆహార కోరతతో, పీఎల్ 420 పేరిట అమె రికా పంపుతున్న గోధుమల సాయంతో భారంగా బండినీడ్చుకుంటూ వస్తున్న దేశం. స్వామినాథన్ సృజన, పరిశ్రమ, దూరదృష్టితో దేశంలో ఆహార కొరతను అధిగమించాం. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. ఉత్పత్తి ఖర్చులు కూడా పెరిగాయి. రైతు పరిస్థితి మాత్రం అధ్వాన్నమైంది. ఈ దశలో రైతును ఆదుకునే రాజకీయ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మనసున్న మహారాజుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అవతరించారు. స్వామినాథన్ శాస్త్రీయ దృక్పథం, వైఎస్ రైతుబాంధవ్యం కలసి రైతులను ఆదుకున్నాయి.హరిత విప్లవానికి కొనసాగింపు...‘ఎవర్ గ్రీన్ రివల్యూషన్’ అనే మాటను సృష్టించిన వ్యక్తి ‘భారతరత్న’ స్వామినాథన్. గ్రీన్ రివల్యూషన్ తాత్కాలికమైనది కాదనీ, అది ఎప్పటికీ పురోభివృద్ధి చెందుతూ ఉండాలనీ ఆయన ఉద్దేశం. పంట దిగుబడి పెంచడం ఒక ఎత్తయితే, రైతుకు నష్టం లేకుండా చూడటం మరో ఎత్తు. స్వామినాథన్ పంట దిగుబడిని పెంచగలిగాడు కానీ ఉత్పత్తిదారులు అంటే రైతులు సంతోషంగా, సుఖంగా జీవించే విధంగా వారి జీవితాలను మార్చలేకపోయారు. ఇది శాస్త్రవేత్తల వల్ల అయ్యే పనికాదు. ఇందుకు అంకితభావం కలి గిన రాజనీతిజ్ఞుడు అవసరం. రాజశేఖరరెడ్డి వంటి నాయకుడు, పల్లెలు, రైతుల జీవితాలు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కావాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయాన్ని శాస్త్రవేత్త కోణంలో చూడ లేదు. రాజకీయవేత్తగా చూశారు. 2004లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడానికి మూడున్నర దశాబ్దాల కిందటి నుంచి గ్రామాలు గురించీ, రైతుల గురించీ, రైతులు ఎదుర్కొనే కష్టాల గురించీ అవగాహన పెంచుకున్న రాజకీయ నాయకుడు ఆయన. కడపలో వైద్యుడిగా పని చేసిన రోజుల నుంచి 1978లో శాసన సభకు ఎన్నికైన తర్వాత ఓటమి ఎరుగకుండా అసెంబ్లీలోనో, పార్ల మెంటులోనో ప్రజాప్రతినిధిగా కొనసాగుతూ ప్రజాసమస్యలను అవగాహన చేసుకున్న ప్రజల మనిషి ఆయన. 2003లో సుమారు పదిహేను వందల కిలోమీటర్లు రంగారెడ్డి జిల్లా వికారాబాద్ నుంచి శ్రీకాకుళం వరకూ పల్లెలనూ, పొలాలనూ, చిన్నపట్టణాలనూ దాటుకుంటూ, రకరకాల వ్యక్తులతో మాట్లాడుతూ, వారి సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేసిన ప్రజానాయకుడు. ఆ పాద యాత్రలో అవగతమైన అంశాలే ముఖ్యమంత్రిగా తాను రూపొందించిన విధానాలకు ప్రాతిపదికలైనాయి.రైతులు ఎదుర్కొంటున్నది ఒక సమస్య కాదు. మంచి వంగడం దొరికితే నీరు అందదు. నీరు అందుబాటులో ఉన్నప్పటికీ తక్కువ వడ్డీకి రుణాలు లభించవు. ఇవన్నీ ఉన్నప్పటికీ సకాలంలో వానలు కురియవు. అన్నీ సవ్యంగా ఉండి పంట దిగుబడి అధికంగా వచ్చి నప్పటికీ మార్కెట్లో పంటకు తగిన ధర పలకదు. ఈ కష్టాలన్నీ వైఎస్‌కు కరతలామలకం కనుకనే ఆయన ప్రభుత్వం చేపట్టిన పథకాలూ, కార్యక్రమాలూ అన్ని సమస్యలకూ సమాధానాలు అందించాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నచ్చజెప్పి రెండు లక్షల వరకూ రైతుల రుణాలను మాఫీ చేయించారు. ఇది దేశంలో మరో ముఖ్యమంత్రి ఎవ్వరూ చేయని సాహసం. నీరు అందించడం కోసం జలయజ్ఞం పేరిట నీటి ప్రాజెక్టుల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టారు. ఇది చాలా ఖర్చుతో కూడిన పని అయినప్పటికీ రైతుల ఆత్మహత్యలను నివారించడానికీ, రైతుల గుండెలలో ధైర్యం నింపడానికీ అవసరమైన చర్య. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత విస్తృతంగా జలవనరుల అభివృద్ధికి చొరవ తీసుకోలేదు. వ్యవసాయదారులకు కరెంటు ఉచితంగా సరఫరా చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజులలోనే (2004 మేలోనే) ఈ సంస్కరణ ప్రవేశపెట్టారు. రైతులకు ఆరోగ్య బీమా ప్రవేశ పెట్టారు. ఒక సమగ్రమైన రైతు సంక్షేమ పథకాల ప్రణాళికను వైఎస్ తన ప్రభుత్వంలో ఆవిష్కరించడానికి ప్రధాన కారణం ఆయనకు రైతుల ఖర్చుల పట్ల, కష్టాల పట్ల పరిపూర్ణమైన అవగాహన ఉండటమే.సరిగ్గా ఇక్కడే స్వామినాథన్, వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితాలని తరచి చూడాలి. స్వామినాథన్ సైన్సుద్వారా కృషి చేశారు. రాజ శేఖరరెడ్డి పరిపాలన ద్వారా రైతు జీవితాలలో ఆనందం తొంగి చూసేందుకు సహకరించారు. సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం, గిట్టు బాటు ధరల ద్వారా రైతుల దిగుబడి పెంచి, వారికి గిట్టుబాటు ధర లభించడం ఎట్లాగా అన్న ప్రశ్నలకు సమాధానాలను స్వామినాథన్ అన్వేషించారు. వ్యవసాయపు ఖర్చుల భారాన్ని రైతుల భుజాలపై నుంచి తప్పించేందుకు ప్రభుత్వం ఏమి చేయగలదో రాజశేఖరరెడ్డి ఆలోచించారు. ఒకరు వ్యవసాయానికి శాస్త్రీయ పునాదులు వేస్తే, మరొకరు వ్యవసాయం గిట్టుబాటు కావడానికి అవసరమైన రైతు సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇద్దరూ కలసి ఎవరి దారిలో వారు చొరవ తీసుకున్నప్పుడే వ్యవసాయం బాగుంటుంది. రైతుల జీవితాలు గౌరవప్రదంగా ఉంటాయి. అందుకే, ‘డాక్టర్ వైఎస్ రాజ శేఖర రెడ్డి అవార్డు– 2026’ను నేడు దిల్లీలో జరిగే సభలో స్వామి నాథన్ ఫౌండేషన్‌కు ఇవ్వడం, అవార్డును ఎం.ఎస్. స్వామినాథన్ కుమార్తె డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ స్వీకరిస్తుండటం సముచితం.ఉండవల్లి అరుణ్కుమార్వ్యాసకర్త లోక్‌సభ మాజీ సభ్యులు -
మానవతా మహర్షి...
జననం వల్ల వంశగౌరవం తెలుస్తుందేమో గానీ, మరణం వల్ల ఆ మనిషి ప్రపంచం మీద చూపిన ప్రభావం, ప్రజల మీద వేసిన ప్రత్యేక ఆత్మీయ ముద్ర, చెలిమితో చేసిన పని, గుండెల్ని తట్టిలేపి అందులో వికసిత సితవదన రాజశేఖరమై వెలుగొందడం తెలుస్తుంది. ఇది అక్షరాలా ఉభయ తెలుగు రాష్ట్రాల మాజీ దివంగత ముఖ్యమంత్రి డా‘‘ వై.ఎస్. రాజశేఖరరెడ్డికి వర్తిస్తుంది. మహాత్ములకు మరణం ఉండదు. వారు భౌతికంగా మనకు కనిపించకపోవచ్చు కానీ కొన్ని తరాల వరకు వారి జ్ఞాపకాలు నిత్య హరితంగా, నిత్యస్మరితంగా మనవెంట ఉంటాయి. వారు చేసిన మంచి పనులు మనసుకు కనిపిస్తూ వారి కీర్తి స్ఫూర్తి కాయాన్ని కళ్ళముందు నిలిపి కన్నులు చెమ్మగిల్లేలా చేస్తాయి. రాజన్న శరీరం మనల్ని వదలి ఇన్ని సంవత్సరాలు గడిచినా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయనను నిత్యం తలచుకుంటున్నారు అంటే ఆశ్చర్యం, ఆనందం. ప్రజలను ఆయన తన గుండెలా చూసుకుంటే, ఆయనకు ప్రజలు తమ గుండెల్లో గుడి కట్టారు. మానుషరూప దైవం ఆయనే అన్నట్లు తమ పూజా మందిరాలలో ఆయన చిత్ర పటాన్ని ఉంచారు. అంత గొప్ప స్థానం దక్కించుకోవడం ఎవరికి సాధ్యమౌతుంది, అసాధ్యాలను సాధ్యాలు చేసిన రాజశేఖరరెడ్డికి తప్ప.ఇచ్చుటలో ఉన్న హాయి...కొందరు కారణం లేకుండా సమాజంతో, పరిస్థితులతో రాజీపడరు. సేవ చేయటానికి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి నిరంతరం పోరాడుతూనే ఉంటారు. అధికారం ఉన్నా, లేకున్నా. అదీ రాజశేఖరరెడ్డి. అందుకే ఆకాశ మంత ప్రేమ ఆయనంటే అందరికీ. అప్పట్లో వెనుకబడిన పేదరిక ప్రాంతం కడప జిల్లాలో జన్మించి గడపగడపలో ఆయన చిత్ర పటాన్ని పెట్టుకునే స్థాయికి ఎదగడం సామాన్యం కాదు. బాల్యం నుంచే భిన్నంగా ఆలోచించడం, చుట్టూ ఉన్న పేదరికానికి చలించి వారికి ఏదో చేయాలి అని తపించడం వల్లే అది సాధ్యమైంది. నేర్చుకునే గుణాన్ని ఆయన ఆఖరి క్షణం వరకు వదలలేదు. ‘తీసుకోవడం కాదు ఇవ్వడం వల్ల ప్రేమ రెట్టింపు అవుతుంది’ అనేవాడు. ఇవ్వడంలో ఉన్న హాయి ఆయన తెలుసుకోవడమే గాక అందరికీ తెలియచెప్పాడు. చెప్పడమే కాదు ఆచరించాడు. ఆ గుణం వల్లే దేశంలోని ఏ ముఖ్యమంత్రీ ఇవ్వలేనన్ని వరాలు, సౌకర్యాలు, పథకాలు ఆయన ఉభయ రాష్ట్రాల తెలుగువారికి అందించాడు. కడపజిల్లా మట్టి వాసన పీల్చిన మొరటు మొండితనం, తప్పునకు ఏమాత్రం తలవంచక నిలబడి కలబడటం, వైద్యం చదివినందువల్ల మనసంతా కరుణ, ఎదుటివారి ప్రాణం ఎలాగైనా కాపాడి తీరాలన్న తపన, మాట ఇస్తే అందుకోసం ఎందాకా అయిన నిలబడి తీరాలన్న నిజాయితీ, అందిన అధికారాన్ని సేవకోసం మాత్రమే ఉపయోగించాలన్న ఆశయం– ఇవన్నీ సాకార ఆకారమై ముందు నిలిస్తే అది వైఎస్ రాజశేఖరరెడ్డి! ఆయన వ్యక్తిత్వం గురించి, మంచితనం గురించి ఎంత చెప్పినా ఏదో మిగిలే ఉంటుంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్న కాలంలోనూ, ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న కాలంలోనూ ఎందరికో సహాయం చేశాడు. బహిరంగంగా ఆయనను తిట్టినవాళ్ళు, రాజకీయంగా విమర్శించినవాళ్ళు సైతం ఆయన సహాయాన్ని పొందారన్నది పచ్చినిజం. ‘సహాయం చేయడంలో రాజకీయాలు, పార్టీలు ఎందుకు? మనం మనుషులం. ఎంతో నమ్మకంతో మన దగ్గరికి వచ్చి అడిగినపుడు, మనం చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు చేసి తీరాలి’ అనేవాడు.ప్రజారోగ్యాన్ని నెత్తికెత్తుకొని...మానవీయ విలువల మహోన్నత వికాస మానసం ఆయనది. ప్రజల ఆరోగ్య బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్న ఆలోచన ఎంత గొప్పది! ఈ రోజు రాజశేఖరరెడ్డి కారణంగా కొన్ని లక్షల ప్రాణాలు నిలిచాయి. ఆ కుటుంబాలు చితికిపోకుండా చిగురు వేశాయి. వారందరికీ ఆయన ప్రాణదాత, విధాత, విధి రాతను తిరిగి రాసిన నేత అన్నది సర్వాంగీకార సత్యం. జనం కోసం, రైతుకోసం, నీటికోసం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా సొంత పార్టీవారితో పోరాటం చేశాడు. పదవులు, పార్టీల కన్నా ప్రజలు, వారి అవసరాలు ముఖ్యం అని నిలబడ్డాడు. కుటుంబానికి పరిమి తమైన విద్యార్థి ‘రాజా’, ‘డాక్టరు రాజా’ అయ్యాడు. పేదల వైద్యుడిగా, ప్రజా వైద్యుడిగా ప్రయాణిస్తూ మరింత సేవ చేసేందుకు రాజకీయ రంగ ప్రవేశం చేసి ‘రాజన్న’ అయ్యాడు. సమస్యను తక్షణం పరిష్కరించడం ఆయన ప్రత్యేకత. చూద్దాం, చేద్దాం అన్న మాట ఆయన నోట వినలేదు. ఎప్పుడూ అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేసేవాడు. ఎండిన పొలాలు, మండుతున్న రైతు గుండెల్ని చూసి... పొలం గట్టు మీద కూర్చొని మథనపడేవాడు. ఒక్క ఎకరా కూడా నీరు లేకుండా ఎండకూడదు, అలా చేయటానికే అధికారంలోనికి రావాలి అనుకున్నాడు. ఇతరులు అధికారం పొంది ధనయజ్ఞం చేస్తే, రాజన్న జలయజ్ఞం చేశాడు. అందుకే ఆయన దేవుడయ్యాడు. ఎందరు కాదన్నా పట్టుదలతో రైతులకు ఉచిత విద్యుత్తు అందించాడు.రాజన్న తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన అనేక పథకాలను వివిధ రాష్ట్రాలు అనుసరించాయి. ప్రజల హృద యాలను, అవసరాలను, పేదరికపు వ్యథా భరిత జీవితాలను ఎంత చదివాడో, ఎంతగా ఆయన లోలో నలిగాడో గానీ... ఆయన ప్రవేశపెట్టిన ప్రజారోగ్య, విద్యా పథకాలను కాదని ఏ ప్రభు త్వమూ మనుగడ సాగించలేదు. పల్లె పల్లెలో, వీధి వీధిలో ఆయన విగ్రహాలు వెలిశాయి అంటే అందుకు కారణం ఇదే. చెప్పుకోవడం కాదు, చేతల్లో ఎలా ఉన్నాం, చేతనంలో ఎలా ఉన్నాం అన్నది మౌనంగా గ్రహిస్తారు ప్రజలు. వారికి తెలియ దనుకోవడం అమాయకత్వం. రాజశేఖరుని ఆంతర్యం ఆసాంతం అందరు గ్రహించారు. కాబట్టి ఆ విగ్రహాలు ఎవరికి వారు స్వచ్ఛందంగా వారి వారి ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవడం చరిత్రలో అసాధారణం, అసామాన్యం కదా! ఎంతమంది నాయకులు లేరు! ఆయన కన్నా ముందు ఎందరు పరిపాలించలేదు! ఎవ్వరికీ దక్కని కీర్తి ప్రతిష్ఠలు రాజశేఖరరెడ్డికే దక్కడం ఆయన అదృష్టం కాదు. ఆయన చేసిన కృషి, సేవ అందుకు కారణం. ఆగ్రహంతో అడవులలో ఆయుధా లతో తిరిగే అన్నలతో సైతం శాంతి చర్చలు జరిపాడే... అది చాలదా ఆయన శాంతి కామన ఆరాధన. ఎంతటి వారికైనా మరణం అనివార్యం. మరణం అంటే మనిషి లేకపోవడం. కానీ రాజశేఖరరెడ్డి జ్ఞాపకాలు, కీర్తి, చేసిన పనులు, వారి నుండి సహాయం పొందిన వ్యక్తులు, వ్యవస్థలు అన్నీ ఉన్నాయి. ఆయన మనమధ్యే ఉన్నారు, మనతో ఉన్నారు. నిత్య స్మరణలో ఉన్న మనిషికి మరణం ఉంటుందా! కొందరు సమాజాన్ని మార్చటానికే జన్మిస్తారట. అలాంటి సార్థక ధన్యజన్మ ఆయనది. అతి కొద్ది పరిపాలన కాలంలోనే, తిరుమల తిరుపతి దేవస్థానాలతో సహా రాష్ట్రంలోని అన్ని విభా గాలను ప్రక్షాళితం, ప్రజ్వలితం చేయగలిగాడు. రైతులు, ఉద్యో గులు, విద్యార్థులు, కార్మికులు అందరి ముఖాలలోను చిరునవ్వులు వెలిగించాడు. ఆయనతో కలిసి నడిచిన వ్యక్తిగా, ఆత్మబంధువుగా ఆయనను ఈ రోజు స్మరించుకోవడం నా భాగ్యం, నా ధర్మం, నా కర్తవ్యం. రామాలయం లేని గ్రామం ఉండవచ్చు కానీ రాజన్న జ్ఞాపక చిత్రం లేని ఒక్క హృదయాలయమూ ఉండదని గుర్తు చేస్తూ...భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త తిరుపతి మాజీ శాసనసభ్యులు -
‘కాక్రోచ్’ పార్టీ సిద్ధాంతాలు ఏమిటి?!
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అనేది నిజానికి ఒక రాజకీయ పార్టీ కాదు. అట్లా మారే ఆలోచన కూడా లేదని, సమాజాన్ని వేధిస్తున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలపై ఒత్తిడిని సృష్టించే ఉద్యమంగా మాత్రమే కొనసాగదలచుకున్నామని ఆ సంస్థ నిర్వాహకులు పదేపదే స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ సిద్ధాంతాలు ఏమిటనే ప్రశ్న ముందుకు వస్తూనే ఉండటం గమనార్హం. ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు. సిద్ధాంతా లనేవి పార్టీలకు మాత్రమే ఉండాలా? సీజేపీ వంటి ఉద్యమాలకు ఉండవా? ఉండకూడదని, ఉండవని ఎవరైనా సూత్రీకరిస్తే అది పొరపాటు అవుతుంది. ఈ మాట అనుకున్న తర్వాత రెండు ప్రశ్నలకు జవా బులు చెప్పుకోవాలి. ఒకటి, అసలు సిద్ధాంతాలు అంటే ఏమిటి? రెండు, ఆ ప్రకారం సీజేపీకి సిద్ధాంతాలు అనదగ్గవి ఉన్నాయా, ఉంటే ఏమిటవి? అదే విధంగా ఈ తరహా ప్రశ్నలు ఎదురైనప్పుడు సీజేపీ నిర్వాహకులు ఇస్తున్న సమాధాన మేమిటి? సిద్ధాంతం అనే మాటకు స్థూలమైన నిర్వచనం ఏమంటే ఒక వ్యక్తికి, లేదా పార్టీకి, లేదా సంస్థకు సమాజం పట్ల, సామాజిక సమస్యల పట్ల, అందుకు పరిష్కారాల పట్ల, భవిష్యత్తు పట్ల, దాని కోసం ఏమి చేయాలనే విషయమై తనదైన అవగాహన, కార్యాచరణ మార్గం ఉండటం. సిద్ధాంతం అనేది ఏ రంగం విషయంలోనైనా ఉంటుంది. ఇక్కడ సందర్భం సీజేపీ అయినందున సామాజిక రంగం గురించి చెప్పుకుంటున్నాము. సిద్ధాంతాలన్నవి రాజకీయ పార్టీలకే పరిమితం కానక్కర లేదని, సంస్థలకు కూడా ఉండవచ్చు నని, ఉండాలి కూడానని అనుకుంటున్నాము గనుక, ఇపుడు సీజేపీ గురించి విచారిద్దాము.ప్రకటన, పత్రం కనిపించని పోరాటంకొద్దిరోజుల క్రితం ఒక ఛానల్ ఇంటర్వ్యూలో సీజేపీ నిర్వాహకులు ఈ ప్రశ్నకు స్వయంగా చెప్పిన సమాధానం ఈ విధంగా ఉంది. ప్రశ్న: మీ సిద్ధాంతం మితవాదమా, మధ్యే మార్గమా, లేక వామపక్షమా? జవాబు: మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని మొదటి నుంచి చెబుతున్నాం. ప్రశ్న: రాజ్యాంగానిది మధ్యే మార్గమంటారు కదా? జవాబు: ఏదైనా కావచ్చు. కానీ మాది రాజ్యాంగ మార్గం. సమానత్వ హక్కులు, భావప్రకటనా స్వాతంత్య్రం, విద్యాహక్కులు, శాంతియుతంగా నిరసన ప్రకటించే హక్కు వగైరాలు. ఇటువంటివి అనేకం రాజ్యాంగంలో ఉన్నాయి. వాటిని సరిగా పాటించినట్లయితే మన దేశం చాలా ముందుకు పోతుంది. మేము సెక్యులర్. మావి ప్రజాస్వామిక విలువలు. ఛానల్ చర్చ ఒకే ప్రశ్నతో క్లుప్తంగా ముగిసినందున సీజేపీ ఆలోచనలు పూర్తి రూపంలో వెల్లడి కాలేదనాలి. ఇతరత్రా కూడా వారు దీనిపై ఒక ప్రకటనగాని, పత్రంగానీ విడుదల చేయలేదు. సంస్థ ఆరంభమైన మొదటి రోజు నుంచే వారు కార్యక్రమాలలో తలమునకలుగా ఉండటం అందుకు కారణం కావచ్చు. ప్రస్తుతం ఉద్యమం వేడిలో నిర్వాహకులు చెప్పే కొద్ది మాటలు, చేసే కొద్ది కార్యక్రమాలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. ముందుకు సాగిన కొద్దీ, ఇతర సామాజిక అంశాలపైనా దృష్టి పెట్టగలమంటున్నందున వాటి గురించి కూడా పలు ప్రశ్నలు ముందుకు వస్తాయి. అందువల్ల సీజేపీ, రాగల రోజులలో ఈ ప్రశ్నలపై దృష్టి పెట్టడం అవసరం అవుతుంది. సంస్థ నాయకుల నుంచి ఇంతవరకు వినవచ్చిన మాటలను, వారి కార్యక్రమాలను గమనించినపుడు వారి ఆలోచనలు, లేదా స్థూలమైన రీతిలో సిద్ధాంతాలు అనదగ్గ వాటిపై కొన్ని అంచనాలు ఏర్పడుతున్నాయి. సీజేపీ వ్యవస్థాపకుడు, కన్వీనర్ అయిన అభిజీత్ దీప్కే అమెరికా నుంచి వచ్చి విమానాశ్రయం నుంచే భారత రాజ్యాంగాన్ని పైకెత్తి చూపటం చేశారు. జంతర్ మంతర్ ఆందోళన పొడవునా తనతోపాటు పలువురు ఇతర ఆందోళనకారులు అదే పని చేశారు. ఇదే ధోరణి ఇతర రాష్ట్రాలలోనూ కనిపించింది. ఈ స్ఫూర్తి ఎంతగా వ్యాపించిందంటే, ఇటీవల పట్నాలో పోలీసులు అదుపు లోకి తీసుకున్న ఆరేళ్ల పేద పిల్లవాడు ఆదిత్య రాజ్యాంగం గురించి, అంబేడ్కర్ గురించి మాట్లాడటం విన్నాము.రాష్ట్రాలకూ వ్యాపిస్తున్న ఆందోళనలుమొదటి రోజు నుంచే అభిజీత్ అనేకమార్లు గాంధీ, అంబేడ్కర్, నెహ్రూ, భగత్‌సింగ్‌ల ప్రస్తావనలు, కొద్దిసార్లు సుభాష్ బోస్ ప్రస్తా వన చేస్తున్నారు. వారి మార్గాన్ని అనుసరిస్తామన్నారు. ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలిచ్చారు. రైతాంగానికి సంఘీభావం ప్రకటించి వారిని తమకు మద్దతు తెలుపవలసిందిగా ఆహ్వానించటంతో పాటు, అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల వ్యవసాయ రంగానికి కలిగే నష్టాలపై వారు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలిపేందుకు ప్రతినిధులను పంపారు. సీజేపీ మొదటినుంచే లేవనెత్తిన అంశాలలో మత రాజకీయాల పట్ల కూడా నిరసనలు కనిపించాయి. ఇపుడు పైన ప్రస్తావించిన ఛానల్ ఇంటర్వ్యూలోనూ అభిజీత్ తాము సెక్యులర్ వాదులమని ప్రకటించారు. ఈ అంశాలకే పరిమితం కాని నిర్వాహకులు పలు ప్రజాస్వామ్య సంబంధమైన సమస్యలను కూడా లేవనెత్తారు. అవి కోర్టులు, ఎన్నికల సంఘం సవ్యంగా పనిచేయక పోవటం, పార్టీ ఫిరాయింపులు, ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వాలకు జవాబుదారీతనం, పారదర్శకత లేకపోవటం, ప్రశ్నిస్తే ముద్రలు వేసి అణచివేయటం, అవినీతి, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, ధనిక– పేద తారతమ్యాలు మొదలైనవి అందులో ఉన్నాయి. ఈ ఉద్యమ వాతావరణం క్రమంగా ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించింది.శూన్యాన్ని పూరించే శక్తి కాగలదా? ఇవన్నీ గమనించినపుడు సీజేపీది ఏ సిద్ధాంతమని భావించ వలసి ఉంటుంది? మితవాదమా, మధ్యేవాదమా, వామపక్ష వాదమా, లేక అసలు ఏ వాదమూ లేనిదనా? వారు తమది రాజ్యాంగ వాదమన్నారనుకోవాలి. ఇక్కడ చూడవలసిన ముఖ్యమైన విషయాలు రెండు న్నాయి. సీజేపీ నాయకులను ప్రశ్నించిన ఛానల్ యాంకర్ అన్నట్లు భారత రాజ్యాంగం మధ్యేమార్గానిది ఎంతమాత్రం కాదు. అంబేడ్కర్, నెహ్రూలు సారథ్యం వహించిన ఆ గ్రంథం సోషలిస్టు, లేదా వామపక్షపు మొగ్గు గల మధ్యేమార్గ లక్షణాలు కలది. ఇపుడు సీజేపీ నిర్వాహకులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు అన్నీ అవే లక్షణాలతో ఉన్నాయి. ఇది మొదటి విషయం కాగా, స్వాతంత్య్రా నంతరం అందుకు వారసత్వం తీసు కున్నామన్న కాంగ్రెస్ ఆచరణలో విఫలమైంది. ఆ పార్టీ స్థానంలో అదే వారసత్వాన్ని కొనసాగిస్తామన్న జనతా పార్టీ, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్లు కూడా విఫలమయ్యాయి. ఆ శూన్యంలోకి బీజేపీ అనే మితవాద పార్టీ ప్రవేశించింది. ప్రస్తుతం అది కూడా ప్రజాదరణను క్రమంగా కోల్పోతున్నది. భారతదేశపు వర్తమాన సమాజం ప్రగతిశీలమైన సమ్మిళిత వ్యవస్థను కోరుతోంది. అదే ఆ సమాజపు అవసరం, సహజ స్వభావం. అటువంటి స్థితిలో దేశం ఎదుర్కొంటున్న శూన్యాల మధ్య, సీజేపీ వంటిది ఆ శూన్యాన్ని పూరించగల శక్తిగా ఎదగగలదా, ఎదిగితే బాగుండుననే ఆలోచనలు ఒక చిన్న స్థాయిలో మొదలవుతున్నాయి.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఏఐ యుగంలో గొప్ప ఆయుధం... విచక్షణ
అందరికీ శుభోదయం. ఈ రోజు మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. ఇలాంటి ముఖ్యమైన రోజున మీతో మాట్లాడ టానికి వచ్చిన నేను... మెదిపిన బంగాళాదుంపల (స్మాష్డ్ పొటా టోస్) గురించి మాట్లాడబోతున్నాను! ఎందుకో తెలుసుకోవాలంటే మనం 50 ఏళ్ల వెనక్కి వెళ్లాలి. 1970లలో నేను కొలంబస్లో పెరిగాను. ఆ రోజుల్లో పరిస్థితులు ఇప్పటితో పోలిస్తే చాలా భిన్నంగా ఉండేవి. అమెరికాలో అధిక ద్రవ్యోల్బణం, ఉద్యోగాలపై ఆందోళన, పెరుగుతున్న పెట్రోల్ ధరలు వంటి సమస్యలు ఉండేవి.మెదిపిన బంగాళాదుంపల కథచిన్నప్పుడు నేను... మా అమ్మ, నాన్న, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లతో కలిసి రోజూ భోజనం చేసేవాడిని. మా ఇంట్లో భోజనం చాలా సాధారణంగా ఉండేది. హాట్ డాగ్స్, ట్యూనా క్యాసరోల్, మీట్ లోఫ్ వంటివి ఉండేవి. అయితే మా భోజనంలో తరచుగా కనిపించేది మెదిపిన బంగాళాదుంపలు. తొమ్మిదేళ్ల వయసులో నేను ఓ రోజు మా వృద్ధ బంధువు ఇంటికి వెళ్లాను. ఆమె నాకు మెదిపిన బంగాళాదుంపలు వడ్డించింది. అవి నేను అప్పటివరకు తిన్న వాటిలో అత్యంత రుచికరమైనవి. అవి మెత్తగా రుచిగా ఉన్నాయి. వాటిని ఎలా తయారుచేశారో తెలుసుకోవాలనే ఆసక్తితో వంటగది లోకి వెళ్లాను. అక్కడ నాకు ఆశ్చర్యం కలిగింది. అవి ప్యాకెట్ నుంచి వచ్చినవి కావు. ఆమె సహజమైన బంగాళాదుంప లను ఉడికించి, వాటిని మెదిపి... వెన్న, ఉప్పు కలిపి తయారు చేసింది. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. నాకు మంచి రుచి ఏదో తెలుసు. నాకు నా సొంత అభిరుచి ఉంది. అంటే కేవలం రుచి చూసే నాలుక ఉందని కాదు. ఏది మంచిదో, ఏది అంత మంచిది కాదో గుర్తించే సొంత అభిప్రాయం నాకు ఉందని అర్థం. గత నాలుగేళ్లలో మీరు ఇక్కడ యానిమేషన్ , ఫ్యాషన్ , సినిమా, ఫొటోగ్రఫీ, గ్రాఫిక్ డిజైన్ , గేమ్స్, ఫైన్ ఆర్ట్ వంటి ఎన్నో విషయాల్లో నైపుణ్యం సంపాదించారు. మీరు కష్టమైన ప్రాజెక్టులు పూర్తి చేశారు. మంచి ఇంటర్న్‌షిప్‌లు పొందారు. జీవితాంతం గుర్తుండిపోయే స్నేహా లను ఏర్పరచుకున్నారు. కానీ వీటన్నింటికంటే ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. మీరు మీ సొంత అభిరుచిని, కళాత్మక దృష్టిని,సొంత ఆలోచనా విధానాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఏది మంచిదో, ఏది గొప్పదో, ఏది మెరుగుపరచాలో గుర్తించే శక్తిని పొందారు. ఇప్పుడు మనం కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో ఉన్నాం. ఈ కాలంలో మీ సొంత అభిరుచి మిమ్మల్ని ఇతరుల నుంచి ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఏఐ మీకు ఎన్నో ఎంపికలు ఇవ్వగలదు. ఒక చిన్న సూచన ఇస్తే చాట్‌జీపీటీ, క్లాడ్ వంటి ఏఐ సాధనాలు డజన్ల కొద్దీ, వందల కొద్దీ ఆలోచనలు ఇవ్వగలవు. కానీ వాటిలో ఏది అద్భుత మైనది? ఏది సాధారణమైనది? ఏది వినియోగదారుడికి ఉపయోగ పడుతుంది? ఏది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది? అనేది మీరు నిర్ణయించాలి. ఏఐకి సొంత అభిరుచి, సొంత అభిప్రాయం ఉండదు. మీకు సొంత అభిరుచి ఉంది. సొంతం అభిప్రాయం ఉంది. అందుకే భవిష్యత్తులో ఏఐకి మీలాంటి మనుషులు మరింత అవసరం అవుతారు. కృత్రిమ మేధ యుగంలో మీ గొప్ప ఆయుధం... మీ సొంత అభిరుచి. మీ సొంత విచక్షణ!మంచి పనిని గుర్తించే అభిరుచిచాలా కాలం వరకు మనుషులు గొప్ప ఆలోచనలు చేయ గలిగేవారు. కానీ వాటిని నిజంగా రూపొందించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సాధనాలు అందరికీ ఉండేవి కావు. ఏఐ ఈ పరిస్థితిని పూర్తిగా మార్చింది. ఇప్పుడు దాదాపు ఎవరైనా దాదాపు ఏదైనా తయారు చేయగలరు. అందువల్ల భవిష్యత్తులో అరుదైన నైపుణ్యం పని చేయడం మాత్రమే కాదు; మంచి పనిని గుర్తించడం. దీనినే విచక్షణ అంటాం. ఉదాహరణకు పుస్తక ప్రచురణ రంగంలో ఏఐ కారణంగా పుస్తకాలు రాయడం సులభమైంది. పుస్తకాల సంఖ్య పెరిగింది. పరిమాణం పెరిగింది. కానీ వాటి సగటు నాణ్యత తగ్గింది. ఈ పరిస్థితిలో మంచి పనిని గుర్తించే అభిరుచే అత్యంత కీలక నైపుణ్యంగా మారనుంది. మన అభిరుచి ఇతరుల పనిని చూడటం వల్ల అభివృద్ధి చెందదు. మనమే ఏదైనా సృష్టించినప్పుడు మన అభిరుచి మరింత పెరుగుతుంది. మీరు చేసిన ప్రతి ప్రాజెక్టు, ఎదుర్కొన్న ప్రతి విమర్శ, వదిలేయాలని అనిపించిన ప్రతి పని.. ఇవన్నీ మీ అభి రుచిని పెంచుతాయి. కళ, డిజైన్ , సంగీతం, సినిమాలు, సాహిత్యం వంటి వాటిని ఆస్వాదించండి. కానీ ఇతరుల పనిని చూడటంకంటే... మీరు స్వయంగా సృష్టించే పనికి ఎక్కువ సమయం కేటాయించండి. అభిరుచి అంటే మనకు నచ్చినది చెప్పడం మాత్రమే కాదు. నచ్చనప్పుడు ‘లేదు’ అని చెప్పే ధైర్యం కూడా. ‘ఇది సరి పోదు.’ ‘ఇది నాకు నచ్చలేదు.’ ‘ఇది ఇంకా మెరుగ్గా ఉండాలి’ అని నిర్మొహమాటంగా చెప్పగలగాలి. ఇతరులందరూ ఒక పనికి ‘అవును’ అని చెప్పినప్పటికీ... అది సరైనది కాదని మీకు అనిపిస్తే ‘నో’ అని చెప్పే ధైర్యం ఉండాలి. ఇదే నిపుణుడికి, సాధారణ వ్యక్తికి మధ్య ఉన్న తేడా! అభిరుచి మారాలి!మీ అభిరుచులు ఎప్పటికీ ఒకేలా ఉంటే మీరు ఎదగడం లేదని అర్థం. మీరు ఈ కాలేజీలో చేరిన రోజు ఉన్న వ్యక్తి ఇప్పుడు లేరు. మీ ఆలోచనలు మారాయి. మీ అనుభవాలు పెరిగాయి. మీ దృష్టి మారింది.ఇది భయపడాల్సిన విషయం కాదు. ఇది ఎదుగుదలకు సంకేతం. నాలుగేళ్ల తర్వాత, పదేళ్ల తర్వాత కూడా మీరు మారు తూనే ఉండాలి. విజయవంతమైన సృష్టికర్తలు జీవితాంతం ఒకే విధానంలో చిక్కుకుపోరు. వారు కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొత్త ఆలోచ నలను స్వీకరిస్తారు. తమ అభిరుచిని నిరంతరం అభివృద్ధి చేసుకుంటారు. అందుకే మూడు విషయాలు గుర్తుంచుకోండి: ఎక్కువగా సృష్టించడంపై దృష్టిపెట్టండి. అవసరమైనప్పుడు ‘నో’ చెప్పండి. ఎప్పటి కప్పుడు మారుతూ ఉండండి. చివరగా ఒక చిన్న సలహా: ఓ ఆన్లైన్ వేదికలో బంగాళా దుంపల గురించి ప్రత్యేకంగా చర్చించే ఒక సమూహం ఉంది. అక్కడ మెదిపిన బంగాళాదుంపల గురించి కూడా చర్చ జరిగింది. కొంతమంది వాటిని ఇష్టపడలేదు. మరికొందరు వాటిని సమర్థించారు. అందులో ఒక వ్యక్తి చెప్పిన నాలుగు పదాల సలహా నాకు చాలా నచ్చింది: ‘‘విమర్శలను పట్టించుకోకండి. మీ ఆనందాన్ని ఆస్వాదించండి’’. ఇది సృజనాత్మక జీవితానికి కూడా గొప్ప సలహా.మీరు అడుగుపెడుతున్న ప్రపంచంలో మనుషులు చూడగలి గిన దానికంటే ఎక్కువ సమాచారం ఉంటుంది. అనంతమైన చిత్రాలు. అసంఖ్యాకమైన ఎంపికలు. ఎప్పటికీ ఆగని సమాచార ప్రవాహం. అలాంటి ప్రపంచంలో ఏది నిజమైనది? ఏది అందమై నది? ఏది విలువైనది? ఏది సృష్టించదగినది? అని గుర్తించగలిగిన వారిదే భవిష్యత్తు. చివరగా నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఒక్కటే: విమర్శలను పట్టించుకోకుండా, మీ జీవితాన్ని ఆనందంగా ఆస్వా దిస్తూ ముందుకు సాగండి. మీ అందరికీ అభినందనలు! -
జెలెన్స్కీ (ఉక్రెయిన్ ప్రెసిడెంట్) రాయని డైరీ
యుద్ధం మన జీవిత భాగస్వామి అయినప్పుడు ప్రతి ఉదయం ఒకే మంచం మీద బతుకు తెల్లారుతూ ఉంటుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో అధ్యక్ష కార్యాలయం నుంచి కాక, భూగర్భ బంకర్ల నుంచి నేను నా దేశాన్ని నాలుగున్నర ఏళ్లుగా ఏ రాత్రికి ఆ రాత్రి, ఏ పగలుకు ఆ పగలు కాపు కాసుకుంటూ వస్తున్నాను. ఇక ఇప్పుడైతే ఏ నిమిషానికి ఆ నిమిషం! ఒకప్పటి తమ అభిమాన హాస్య నటుడు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా నేటి నిజ జీవిత విషాద సన్నివేశాలకు ఎందుకు ఇంతగా కొనసాగింపును ఇవ్వవలసి వస్తున్నదో అర్థం చేసుకోగలిగినవారు అయినందువల్లనే ఉక్రెయిన్ ప్రజలు ఈ యుద్ధకాలంలో నాకు గొప్ప బలగంగా ఉన్నారు. రాత్రి 2:14 అయింది. టీవీ కాంతిలో మెరుస్తున్న ఈ చీకటి గదిలో కొన్నిసార్లు ఒలెనా, అలెక్సాండ్రా, కిరిలో... కళ్లలో మెదులుతుంటారు. నేను వారి జీవితంలో ఒక నిశ్శబ్ద ఛాయలా మాత్రమే మిగిలిపోతున్నానా... వారి నవ్వులు వినక, వారిని హృదయానికి హత్తుకోక!! యుద్ధం మొదలయ్యే సమయానికి నా కూతురు అలెక్సాండ్రా టీనేజ్‌లో ఉంది. తను ఇప్పుడు ఉన్నత చదువులకు వచ్చింది. కిరిలో అప్పుడు 9 ఏళ్లవాడు. ఆ వయసుకే వాడొక ఉక్రెయిన్ సైనికుడిలా కనిపించేవాడు నాకు!ఒలెనా... నా సహచరి. నేను బంకర్ల నుంచి శత్రువుతో పోరాడుతుంటే, తను బయటి నుంచి ఉక్రెయిన్ ప్రజల కోసం ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతోంది. ఉక్రెయిన్ మహిళలు, చిన్నారుల కోసం ‘‘హౌ ఆర్ యు?’’ అనే ప్రాజెక్టు నడుపుతోంది. అదే మాటను కాస్త తగ్గించిన స్వరంతో, ప్రేమగా ఎప్పుడైనా నన్ను అడుగుతుంది: ‘‘యాక్ స్ప్రావి వోలోద్యా?’’ అని. కొన్నిసార్లయితే ‘‘యాక్ స్ప్రావి మిస్టర్ ప్రెసిడెంట్?’’ అంటుంది నవ్వుతూ.ఆమె గొంతు విని, డీజిల్ వాసన కొట్టే బంకర్ ఒక్కసారిగా గుబాళిస్తుంది. ఒలెనా, నేను ఒకే స్కూల్లో, ఒకే కాలేజ్‌లో చదువుకున్నాం. క్రివీ రిహ్ నేషనల్ యూనివర్సిటీ ప్రాంగణంలోని చెర్రీ బ్లోసమ్, మాగ్నోలియా పూల చెట్ల కింద మా చేతులు కలిసి నడిచాయి. రాత్రి 2.43కి బంకర్లోకి కాల్! ‘‘మన సైన్యం శత్రువును గట్టిగా తిప్పి కొట్టింది మిస్టర్ ప్రెసిడెంట్. మన భూభాగాన్ని తిరిగి సాధించాం...’’ అని గర్వంగా చెబుతున్నారు కమాండర్లు. తిరిగి స్వాధీనం చేసుకునే ప్రతి చదరపు కిలోమీటరు వెనుక సైనికుల ప్రాణత్యాగం ఉంటుంది. సైరన్లు ఆగిన ప్రతిసారీ ఆ కాసేపటి శూన్యంలో, అమరవీరుల జ్ఞాపకాలతో నా గుండె బరువెక్కుతుంది.ఉక్రేనియన్లు, రష్యన్లు ఒకరే అంటాడు పుతిన్ . నవ్వొస్తుంది నాకు. ఆ వెంటనే రష్యన్ రొమాంటిక్ కామెడీ ‘8 ఫస్ట్ డేట్స్’ గుర్తొస్తుంది. అందులో హీరోగా నటించింది నేనే. అకిన్షినా అనే అమ్మాయి హీరోయిన్ . సినిమాలో ఆమె పేరు వీరా. నా పేరు నికిత. వీరాకు, నికితకు వేరే వేరే వాళ్లతో పెళ్లయి ఉంటుంది. కానీ ఉదయాన్నే లేచి చూస్తే ఇద్దరూ ఒకే మంచం మీద ఉంటుంటారు! అలా ప్రతిరోజూ ఒకే మంచంపై మెలకువ రావడం అనేది యాదృచ్ఛికం కాదనీ, తమ ఇద్దరినీ కలపటానికి ఏదో అదృశ్య శక్తి ప్రయత్నిస్తోందనీ అనుకుంటారు. పైకి పర్ఫెక్ట్గా కనిపించే దంపతుల కంటే– మనో భావాలను, లోపాలను అర్థం చేసుకునేవారే నిజమైన జీవిత భాగస్వాములు అని తీర్మానించుకుంటారు. పాత పెళ్లిళ్లు రద్దు చేసుకొని ఇద్దరూ ఒకటవుతారు! బహుశా పుతిన్ కూడా రోజూ ఉదయం నిద్రలేవగానే తన మంచం మీద ఉక్రెయిన్ ఉండాలని కోరుకుంటూ ఉండి ఉండొచ్చు. కానీ అది ఎప్పటికీ జరగదు. ‘8 ఫస్ట్ డేట్స్’లో ప్రేక్షకులకు నచ్చేలా స్క్రిప్ట్‌ను దిద్దిన నేను... రష్యా ఇప్పుడు రాస్తున్న బాధ్యతారహితమైన స్క్రిప్టుకు, ఉక్రెయిన్ ప్రజలు కోరుకుంటున్న ముగింపును ఇవ్వలేనా?! -
నేడు నేపాల్... రేపు ఇండియా?
హిమాలయాలు కోట్లాది ప్రజలకు జీవనాధారమైన నదులకు పుట్టినిల్లు. భారత ఉపఖండ వాతావరణం, వ్యవసాయం, జీవ వైవిధ్యం, ఆధ్యాత్మికతతో వాటికి విడదీయరాని సంబంధం ఉంది. కానీ నేడు మనిషి హిమాలయాలను ప్రకృతి వరంగా కాకుండా పర్యాటక కేంద్రంగా, రహదారి కారిడార్‌గా, విద్యుత్ ప్రాజెక్టుల ప్రాంతంగా, నిర్మాణాలకు అనువైన భూమిగా చూడటం మొదలు పెట్టాడు. మరోవైపు వాతావరణ మార్పుల ప్రభావం కూడా పెరుగు తోంది. ఫలితంగా నేపాల్–టిబెట్ సరిహద్దు హిమాలయప్రాంతంలో ఆగస్టు 26 లాంటి ఘోరవిపత్తులు సంభవిస్తున్నాయి. అభివృద్ధి కావాలి. కానీ హిమాలయాల మూల్యంతో కాదు. దేశ భద్రతకు రహదారులు అవసరం. స్థానిక ప్రజల ఆర్థికాభివృద్ధికి పర్యాటకం అవసరం. కానీ హిమాలయాలను మైదాన ప్రాంతాల మాదిరిగా చూస్తూ అభివృద్ధి చేయడం ప్రమాదకరం. కొండను తొలిచి రోడ్డు వేస్తాం. తవ్విన మట్టి, రాళ్లను పక్కనే వేస్తాం. నదీ తీరంలో హోటల్ కడతాం. పార్కింగ్ కోసం నదినే పూడ్చివేస్తాం. వాగులపై నిర్మాణాలు చేపడతాం. సహజ డ్రైనేజీలను మూసేస్తాం. ఆ తర్వాత భారీ వర్షం వస్తే మాత్రం దాన్ని ‘అనూహ్య ప్రకృతి విపత్తు’గా పేర్కొంటాం. ప్రకృతి అనూహ్యంగా ప్రవర్తించిందా? లేక ప్రకృతి హెచ్చరికలను మనమే పట్టించుకోలేదా?హిమాలయంలో రహదారి నిర్మాణం అంటే కేవలం కొండను తవ్వడం కాదు. కొండ స్థిరత్వం, నీటి సహజ ప్రవాహం, వర్షపు నీటి డ్రైనేజీ, దిగువ ప్రాంతాల భద్రత అన్నింటిపైనా ప్రభావంఉంటుంది. అందుకే ‘ఎన్ని కిలోమీటర్ల రోడ్డు నిర్మించాం?’ అన్నదే కాకుండా ‘ఎంత భూభాగం అస్థిరమైంది?’ అని కూడా ప్రశ్నించాలి. రోడ్డు ‘ఆల్ వెదర్’ కావచ్చు... హిమాలయం మాత్రం ‘ఆల్ వెదర్’ కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి.కేదార్నాథ్ నుంచి జోషిమఠ్ వరకు...2013 కేదార్నాథ్ విషాదం హిమాలయాల సున్నితత్వాన్ని దేశా నికి స్పష్టంగా చూపించింది. నదీ లోయలు, వరద మైదానాలు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో నిర్మాణాలపై హెచ్చరికలు వచ్చాయి. 2023లో జోషిమఠ్ భూమి కుంగుబాటు మరోసారి హెచ్చరించింది.హిమాలయాల్లో మరో పెద్ద సమస్య నదీ తీరాలు, వరద మైదానాల్లో పెరుగుతున్న నిర్మాణాలు. సహజ నదీ ప్రవాహప్రాంతం క్రమంగా కుంచించుకు పోతోంది. సాధారణ రోజుల్లో నది ప్రశాంతంగా ఉంటుంది. కానీ అసాధారణ వర్షం వచ్చినప్పుడు దాని పాత ప్రవాహ మార్గాలు తిరిగి జీవం పొందుతాయి. నది తన దారిని తిరిగి వెతుక్కుంటుంది. అందుకే నదీ గర్భం, వరద మైదా నాల్లో నిర్మాణాలకు కఠినమైన జోనింగ్ నిబంధనలు అవసరం.హిమాలయాలను రక్షించాలంటే అభివృద్ధిని పూర్తిగా ఆపాల్సిన అవసరం లేదు. అభివృద్ధి విధానాన్ని మార్చాలి. ప్రతి ప్రధాన తీర్థ, పర్యాటక ప్రాంతానికి శాస్త్రీయ క్యారీయింగ్ కెపాసిటీని నిర్ణయించాలి. నదుల వెంట, సహజ డ్రైనేజీలలో నిర్మాణాలను కఠినంగా నియంత్రించాలి. భారీ రోడ్డు, టన్నెల్, విద్యుత్ ప్రాజెక్టులకు పర్యా వరణ ముప్పు మదింపును తప్పనిసరి చేయాలి. కొండ తవ్వకాల వ్యర్థం నదుల్లోకి చేరకుండా పటిష్ట పర్యవేక్షణ ఉండాలి. స్థానిక ప్రజల అనుభవం, సంప్రదాయ జ్ఞానాన్ని విపత్తు నిర్వహణలో భాగం చేయాలి.హిమాలయాలను జయించలేం, గౌరవించాలి. ఎంత పెద్ద రోడ్డు వేసినా, ఎన్ని టన్నెళ్లు తవ్వినా, ఎన్ని హోటళ్లు కట్టినా, ఒక విరిగిన భారీ కొండచరియ ముందు మనిషి ఎంత చిన్నవాడోప్రకృతి నిరూపిస్తూనే ఉంటుంది. హిమాలయాలను మన అవసరా లకు తగ్గట్టు మార్చడం కాదు. మన అవసరాలను హిమాలయాల పరిమితులకు తగ్గట్టు మార్చుకోవాలి. అదే నిజమైన అభివృద్ధి.– శ్రీకాంత్ బందు ‘ సీనియర్ జర్నలిస్ట్ -
ఘర్షణ లేదు... పురోగతీ లేదు!
భారత్ ప్రస్తుతం దౌత్య వ్యవహారాల్లో తలమునకలై ఉంది. కిర్గిజ్స్తాన్లోని బిష్కెక్లో ఆగస్టు 31 నుంచి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) శిఖ రాగ్ర సమావేశాలు మొదలవుతున్నాయి. తర్వాత, ఢిల్లీలో సెప్టెంబర్ 12 నుంచి ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశాలు జరగ నున్నాయి.మన జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్ ఆగస్టు 25న చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్, విదేశాంగ మంత్రి వాంగ్ యితో బీజింగ్‌లో చర్చలు జరిపారు. భారత్–చైనా సరిహద్దు వివాదంపై రెండు దేశాల ప్రత్యేక ప్రతి నిధుల 25వ దఫా సమావేశాలు చైనాలో జరిగాయి. రెండు దేశాలు మొదటి రోజున విడివిడిగా ప్రకటనలు చేశాయి. దాంతో ఏకాభి ప్రాయం కుదరనట్లుగా కనిపించింది. కానీ, ఆగస్టు 26న, ఎనిమిది అంశాలతో ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఏకీభావం ఎందులో?ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరింపజేసుకోవడం, స్థిరత్వాన్ని కొనసాగించడం, శాంతి, ప్రశాంతతలకు భంగం వాటిల్లకుండా చూసుకొనే దిశగా ముందడుగు వేయాలని స్థూలంగా ఒక అభిప్రా యానికి వచ్చారు. సరిహద్దుల పునర్విభజనపై ‘వీలైనంత త్వరగా, గణనీయమైన ఫలితాలు’ సాధించేలా చర్చలు జరపాలనే సంకల్పం గురించి ప్రత్యేకించి పేర్కొన్నారు. సరిహద్దుకు రెండు వైపుల ప్రవహి స్తున్న నదుల గురించి సెప్టెంబర్‌లో మాట్లాడుకోవాలని నిర్ణయాని కొచ్చారు. సరిహద్దు గుండా సాగే వర్తకానికి వెసులుబాటు కల్పించు కోవాలనీ, సరిహద్దులో అదనంగా సమావేశ ప్రాంతాలు, హాట్ లైన్స్ ఏర్పాటు చేసుకోవాలనీ నిర్ణయించారు.భారత్–చైనా మధ్యనున్న 3,488 కిలోమీటర్ల నిడివి గల వాస్తవాధీన రేఖలో పునర్విభజనకు ఏయే రంగాలను ఎంచుకున్నదీ రెండు పక్షాలు వెల్లడించలేదు. భారత్–చైనా ప్రత్యేక ప్రతినిధుల తదుపరి దఫా సమావేశం మన దేశంలో 2027లో జరుగనుంది. గల్వాన్ ఘర్షణ (2020) తర్వాత, స్నేహ సంబంధాలను పటిష్ట పరచుకునేందుకు ఆమధ్య కాలంలో సాగిన ప్రయత్నాలకు కొనసాగింపుగా ఈ చర్చలు జరిగాయని భావించవచ్చు. కూటముల భిన్న లక్ష్యాలుభారత్ విషయానికొస్తే, ‘ఎస్సీఓ’, ‘బ్రిక్స్’ నెరవేర్చగల ప్రయోజనాలు భిన్నమైనవి. షాంఘై సహకార సంస్థలో భారత్– చైనాలతోపాటు రష్యా, పాకిస్తాన్, కజికిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, బెలారస్ ఉన్నాయి. ఇది మొదట్లో ప్రాంతీయ భద్రత, కౌంటర్–టెర్రరిజంపైనే దృష్టి పెట్టింది. తర్వాత, ఆయా దేశాల మధ్య కనెక్టివిటీ, వాణిజ్య సంబంధాలకు విస్తరించి నప్పటికీ, ఈ సంస్థకు ఇప్పటికీ భద్రతే మూల బిందువు.బిష్కెక్ సమావేశంలో మనం సీమాంతర తీవ్రవాదం గురించి లేవనెత్తే అవకాశం ఉంది. సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించేదిగా ఉన్న చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్లపై వెనక్కి తగ్గాలని కోరవచ్చు. మధ్య ఆసియా, రష్యా, చైనాలతో కలసి పనిచేయగల మార్గాలను అన్వేషించవచ్చు. ‘బ్రిక్స్’కు విస్తృత భౌగోళిక రాజకీయ ప్రాధాన్యం ఉంది. ప్రస్తుత అధ్యక్ష హోదాలో ‘బ్రిక్స్’ కూటమి నాయకుల 18వ శిఖరాగ్ర సమావేశాలకు మనమే ఆతిథేయిగా ఉన్నాం. ‘స్థితిస్థాపకత, నవీ కరణ, సహకారం, సుస్థిరత’లను ప్రధాన భావనగా చేసుకుని ఈ సమావేశాలు సెప్టెంబర్ 12–13 తేదీలలో జరుగనున్నాయి. రెండు వారాల వ్యవధి మాత్రమే ఉన్నప్పటికీ ఢిల్లీ సదస్సుకు జిన్‌పింగ్ హాజరవుతారని బీజింగ్ ఇంకా అధికారికంగా ప్రకటించ లేదు. కానీ, భారత్ ‘విజయవంతంగా’ ‘బ్రిక్స్’ సమావేశాలు నిర్వహించేందుకు అండగా ఉంటామని చైనా చెబుతోంది. బ్రెజిల్ శిఖరాగ్ర సదస్సుకు జిన్‌పింగ్ హాజరవబోవడం లేదని బీజింగ్ 2025 మొదట్లోనే ప్రక టించేసింది. ఇది నిష్క్రియాపరత్వం కాదు. ఆచితూచి వ్యవహరించే ధోరణి. హాజరయ్యే అంశాన్ని నాన్చడం వల్ల సరిహద్దు పునర్విభజన, వాణిజ్యం అంశాలపై బేరసారాలాడేందుకు బీజింగ్‌కు అవకాశం చిక్కుతుంది.పాతుకుపోయిన అపనమ్మకంబీజింగ్ రెండు నాల్కల ధోరణి ఢిల్లీని కలవరపరుస్తోంది. అది ఒక పక్క, ద్వైపాక్షిక సంబంధాలను ‘వ్యూహాత్మక, దీర్ఘకాలికదృక్పథం’తో చూస్తున్నామని చెబుతోంది. మరోపక్క, అరుణాచల్ ప్రదేశ్‌కు సంబంధించి కొత్త మ్యాప్‌లు విడుదల చేస్తోంది. వాస్తవాధీన రేఖపై అస్పష్టతను కొనసాగిస్తోంది. ఉగ్ర జాబితాలో చేర్చే విషయంలో ఐక్యరాజ్య సమితిలో మనకు అడ్డంపడుతోంది.ఢిల్లీ కూడా రెండు మార్గాల వైఖరిని కనబరుస్తోందని బీజింగ్ భావిస్తోంది. ‘క్వాడ్’ (ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అమెరికా)తో సంబంధాలు బలపరచుకోవాలని చూస్తోంది. భారత్‌లో చైనాసంస్థల పెట్టుబడుల విషయంలో సవాలక్ష నిబంధనలనుముందుకు తెస్తోంది. భారత్ ఇలా సంశయించడానికి ఆర్థికఅంశాలు కారణమవుతున్నాయి. మన్మోహన్ సింగ్ ప్రధాని అయినపుడు 2003–04లో భారత్–చైనా వాణిజ్య లోటు కేవలం 1.1 బిలియన్ డాలర్లు. మొత్తం వాణిజ్యం 14 బిలియన్ డాలర్లకన్నా తక్కువే. చైనా 2008 నాటికి భారత్‌కు పెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. రెండు దేశాల మధ్య వాణిజ్యం సుమారుగా 38 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అది 2023–24 నాటికి 118.4 బిలియన్ డాలర్లను మించిపోయింది. 2024–25 నాటికి 127.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. చైనాతో వాణిజ్యం మాదిరిగానే దాని నుంచి దిగుమతులు కూడా మనకు ఎక్కువ అవుతున్నాయి. ఈ వాణిజ్య లోటు 2003–04లో 1 బిలియన్ డాలర్లుగా ఉండేది. అది 2023–24 నాటికి 85.07 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఒక్క ఏడాదిలోనే 17% పెరుగుదలను కనబరుస్తూ 2024–25లో 99.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారతదేశపు మొత్తం వాణిజ్య అసమతుల్యతలో చైనా వాటాయే ఇపుడు 35%. చైనా నుంచి మరో పెద్ద అలను తట్టుకోగల స్థితిలో భారత్ లేదు. చైనా వస్తువులపై అమెరికా సుంకాలు 245% ఉన్నాయి. దాంతో చైనా వస్తువులు మన దేశంలోకి మరింతగా వచ్చిపడే ప్రమాదం ఉంది. పైగా, అమెరికాతో వాణిజ్యాన్ని పెంపొందించుకుని, దాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు చేర్చేందుకు ఢిల్లీ–వాషింగ్టన్ మధ్య చర్చలు సాగుతున్నాయి. భారత్ ఆత్మరక్షణ ధోరణిలో ఉంది. కనుక, ఎంతో యుక్తిని ప్రదర్శించవలసి ఉంటుంది. షాంఘై సంస్థలో సరిహద్దు, భద్రతా సమస్యలను లేవనెత్తాలి. ప్రపంచ బడుగు దేశాల వేదికగా ‘బ్రిక్స్’ను సజీవంగా ఉంచాలి. అదే సమయంలో, ఆర్థిక సంబంధాలు తెగి పోకుండా చూసుకోవాలి. ట్రంప్ 2026లో సృష్టించిన సంక్షోభం భారత్–చైనాలను ఎడమొహం పెడమొహం కాకుండా చేస్తోంది. అందుకనే, భారత్–చైనా ముంగిట ‘చారిత్రక అవకాశం’ ఉందని డోభాల్ వ్యాఖ్యానించారు. ఇతర విషయాల్లో ప్రగతిని సాధించే ముందు ‘సరిహద్దు సమస్యను సరైన విధంగా పరిష్కరించుకునేందుకు’ భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. చైనా విదేశాంగ మంత్రి యాంగ్ యి కూడా గత ఏడాదిగా రెండు పక్షాలు ‘క్షేత్ర స్థాయిలో ఫలితాలు చూపేందుకు కృషి చేశాయి. మంచి ప్రగతిని కనబరి చాయి’ అని వ్యాఖ్యానించారు. ప్రగతిని కనబరిచాయి అన్నారేగానీ, పురోగతి అనే పదాన్ని ఉపయోగించలేదు. సంపూర్ణ నమ్మకం లేక పోవడం వల్లనే పదాలను ఆచితూచి ప్రయోగిస్తున్నారు. రెండు దేశాలు ఘర్షణను కోరుకోవడం లేదు. గొప్పగా బేర సారాలు సాగించాలనే కోరిక ఇరువైపులా లేదు. పోటీని కొనసా గిస్తూ రావడమే ప్రస్తుతానికి చేయగలిగిన పని. రక్షణను చూసుకుంటూనే మిగిలిన పనులను చక్కబెట్టుకోవడం. ఇదీ భారత్–చైనా మధ్య సంబంధాల ప్రస్తుత స్థితి. రెండూ పరస్పర మిత్రదేశాలు కాదు. శత్రువులూ కాదు. ఒకరిని చూసి ఒకరు శాశ్వతంగా జంకే శక్తిమంతమైన దేశాలు. తదుపరి సంక్షోభం సంభవించకుండా నివారించడానికి చర్చలు జరుపుతూ ఉంటాయి. -వ్యాసకర్త రక్షణ వ్యవహారాల నిపుణుడు;‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్’-సి. ఉదయ్ భాస్కర్ -
మూడో ప్రపంచ యుద్ధ ముప్పున్నదా?
ఒకవైపు ఉక్రెయిన్–రష్యా యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుండగానే అనూహ్యంగా కొత్త సంక్షోభాలు ప్రారంభమయ్యాయి. హార్మూజ్ జలసంధి ప్రాంతంలో శాంతి ఎండమావిగా తోస్తున్నది. ఇజ్రాయెల్ అనూహ్యంగా సిరియాను, తద్వారా టర్కీని కూడా యుద్ధంలోనికి లాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌పై సైనిక దాడికి దిగిన ట్రంప్ సరికొత్తగా ఆ దేశంపై ఆర్థిక యుద్ధం పల్లవి అందుకున్నాడు. ఇరాన్‌తో వాణిజ్య, ఆర్థిక లావాదేవీలు జరుపుతున్న దేశాలపై ఆంక్షలు విధించాలన్న ట్రంప్ విధానం అమలైతే తీవ్రంగా నష్టపోయేది చైనా. ఇరాన్ చమురులో 90 శాతం చైనా కొనుగోలు చేస్తున్నది. ఈ రకంగా ఇరాన్ యుద్ధంలోనికి ప్రత్యక్షంగా చైనాను లాగటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే సందేహం కలుగుతున్నది. మరొకవైపు ఇజ్రాయెల్ ప్రధాని, ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ పల్లవిని అందుకున్నాడు. ఇంకొకవైపు సౌదీ– పాకిస్తాన్–టర్కీ ‘మక్కా ఒప్పందం’తో నాటో తరహా సైనిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. బంగ్లాదేశ్ ప్రధాని మక్కా ఒప్పందంలోనికి చేరటానికి సంకేతాలివ్వటం భారత్‌ను ఒత్తిడిలోనికి నెట్టింది. వేగంగా మారుతున్న సమీకరణాలు ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధంవైపు తీసుకెళ్తున్నాయా అనే సందేహాన్ని కలిగించక మానవు.ప్రపంచ యుద్ధాల నేపథ్యంమొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఐరోపా రెండు రాజకీయ /సైనిక కూటములుగా చీలిపోయింది. బ్రిటన్ ఆధిపత్యాన్ని జర్మనీ సవాలు చేసింది. పాన్ జర్మనిక్, పాన్ స్లావిక్, బాల్కన్ జాతీయవాద ధోరణులు బలంగా వ్యాపించి ఉన్నాయి. జూన్ 1914లో ఆస్ట్రియా– హంగరీ సామ్రాజ్య వారసుడు ఫ్రాంక్ ఫెర్డినాండ్ హత్యతో సెర్బియాపై ఆస్ట్రియా యుద్ధాన్ని ప్రకటించింది. కూటమి ధర్మంలో భాగంగా సెర్బియాకు మద్దతుగా రష్యా, ఆస్ట్రియాకు మద్దతుగా జర్మనీ యుద్ధంలో చేరాయి. జర్మన్ సైనికాధికారి ‘షెఫర్’ యుద్ధ తంత్రంలో భాగంగా తటస్థ దేశమైన బెల్జియంపై దాడి చేయాల్సి వచ్చింది. ఈ రకంగా యుద్ధం ఐరోపా మొత్తం విస్తరించింది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత కుదిరిన వెర్సెయిల్స్ ఒప్పందంలో భాగంగా జర్మనీపై విధించిన యుద్ధనష్ట పరిహారం, ఇతర అంశాలను అమలు చేసే యంత్రాంగం లేకపోవడం, ఆర్థిక మాంద్యం (గ్రేట్ డిప్రెషన్), పునరుత్థానం చెందుతున్న జర్మనీ/ జపాన్ వంటి దేశాలు తమ ఆధిపత్యాన్ని పునఃస్థాపించటానికి సరి హద్దుల వ్యాప్తి (లెబెన్స్రామ్), లీగ్ ఆఫ్ నేషన్స్ వైఫల్యం రెండో ప్రపంచ యుద్ధానికి దారితీశాయి. ఫాసిజం, కమ్యూనిజం, లిబరల్ డెమోక్రసీ వంటి సిద్ధాంతాల వైరుధ్యం అగ్నికి ఆజ్యంపోశాయి.ఈ సందర్భంలో ‘తూసిడైడీస్ ట్రాప్’ సిద్ధాంతాన్ని చర్చించు కోవాలి. ప్రాచీన చరిత్రకారుడైన తూసిడైడీస్... ఒక కొత్త రాజకీయ శక్తి ఎదుగుదల ప్రస్తుత రాజకీయ శక్తిలో సందేహాన్ని, భయాన్ని కలిగించినప్పుడు... ఇరు శక్తులు ఆయుధ సమీకరణ చేస్తాయనీ, అప్పుడు యుద్ధం అనివార్యమనీ సిద్ధాంతీకరించాడు. ప్రాచీన గ్రీక్ ప్రాంతంలో ఏథెన్స్ ఎదుగుదల స్పార్టాలో భయానికి కారణమై యుద్ధానికి దారితీసింది. 2017లో రాజకీయ శాస్త్రజ్ఞుడు గ్రాహమ్ ఆలిసన్ తన ‘డెస్టైన్డ్ ఫర్ వార్: కెన్ అమెరికా అండ్ చైనా ఎస్కేప్ తూసిడైడీస్స్ ట్రాప్?’ గ్రంథంలో ఈ సిద్ధాంతాన్ని విస్తృతంగా పరిశీ లించాడు. గత 500 ఏళ్ల చరిత్రలో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించిన 16 సందర్భాల్లో 12 సార్లు యుద్ధం జరిగిందని పేర్కొన్నాడు. మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందా?1914, 1939 సంవత్సరాలలో మాదిరిగానే ఇప్పుడూ ఒక కొత్త రాజకీయ శక్తి చైనా ప్రపంచ ఆధిపత్య రేసులోనికి వచ్చింది. ట్రంప్ ట్యారిఫ్ వార్‌లో చైనా, అమెరికాపై ప్రతిసుంకాలను విధించింది. ఇటీవల ట్రంప్ బీజింగ్ పర్యటన సందర్భంగా తైవాన్ విషయంలో అమెరికా జోక్యాన్ని సహించేది లేదని జిన్‌పింగ్ హెచ్చరించాడు. సెమికండక్టర్స్, చిప్స్, కృత్రిమ మేధ, క్రిటికల్ మినరల్స్ రంగాలలో అమెరికాకు, ఐరోపాకు చైనా నేరుగా సవాలు విసిరింది. 2020 నుండి రష్యా తిరిగి బలం పుంజుకొని నాటో ఆధిప త్యాన్ని సవాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే ఉక్రెయిన్‌పై ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. ఐక్యరాజ్యసమితి బలహీనపడటంతో మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల సమయంలో మాదిరిగా ఇప్పుడు కూడా యుద్ధాన్ని నిలువరించే వ్యవస్థలు లేవు. కోవిడ్ అనంతరం ప్రపంచ ఆర్థికాభివృద్ధి మందగించడం, గల్ఫ్ యుద్ధం, వాతావరణ మార్పుల వంటి వాటివల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది.రెండవ ప్రపంచ యుద్ధం తరువాత యుద్ధరంగంలోనికి అణ్వస్త్రాలు వచ్చి చేరాయి. ప్రధాన రాజకీయ శక్తులన్నీ అణ్వస్త్ర దేశాలే. వీటిమధ్య ప్రత్యక్ష యుద్ధం సంభవిస్తే, పరస్పర వినాశం అనివార్యం. అందువలన ఏ అణ్వస్త్ర దేశం ఇంకో అణ్వస్త్ర దేశంపైన దాడికి సాహసించే అవకాశం లేదు. ప్రస్తుత ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకదానికొకటి పెనవేసుకొని ఉన్నాయి. అందువలన మూడవ ప్రపంచ యుద్ధం సంభవిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. ఏ రాజకీయ శక్తి కూడా ఈ దుస్సాహసానికి పాల్పడలేదు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల సమయంలో మాదిరిగా ఇప్పుడు స్పష్టమైన పరస్పర, వైరుధ్య శత్రు కూటములు కూడా లేవు. కొత్త కూటములుఅయితే కూటములు ఏర్పడే అవకాశాలూ కనపడుతున్నాయి. చైనా, రష్యా, ఇరాన్, నార్త్ కొరియా (క్రింక్) ఒక కొత్త సైనిక కూట మిగా ఏర్పడి నాటోను నేరుగా సవాలు చేయవచ్చు. మక్కా ఒప్పందంతో సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ కొత్త సైనిక కూటమిగా ఇప్పటికే ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో భారత్ వంటి దేశాలు ప్రత్యామ్నాయాలను వెదకాల్సి వస్తుంది. బహుశా దీనికి విరుగు డుగా భారత్–యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ – ఇజ్రాయెల్ – జపాన్ కూటమి అవతరించినా ఆశ్చర్యపోనవసరం లేదు. గ్రేటర్ ఇజ్రాయెల్‌లో భాగంగా నైలు నది నుండి యూఫ్రటీస్ నది వరకు లేదా, కనీసం జోర్డాన్ నది నుండి మద్యధరా సముద్రం వరకు ఇజ్రాయెల్ విస్తరణకు పూనుకుంటే గల్ఫ్ యుద్ధక్షేత్రం మరింత విస్తరిస్తుంది. ఇరాన్‌పై అమెరికా ఆర్థిక యుద్ధాన్ని తీవ్ర తరం చేస్తే నష్టపోయే చైనా... ఇరాన్‌కు ప్రత్యక్షంగా మద్దతు తెలప వచ్చు. దీంతో ఇరాన్... ఐరోపా దేశాలపై దాడులు చేయవచ్చు. ఇదే అదనుగా రష్యా ఇతర ఐరోపా దేశాలపై (ముఖ్యంగా బాల్టిక్ దేశాలపై) దాడులు చేసి ఉక్రెయిన్ యుద్ధాన్ని విస్తరించవచ్చు. శత్రువును నిలువరించటానికి ఇదే అనువైన సమయంగా భావించి తైవాన్ను చైనా స్వాధీనం చేసుకోవటానికి ఉపక్రమించవచ్చు. రష్యా, చైనాలకు మద్దతుగా దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా దాడి ప్రారంభించవచ్చు. ఇదే అదనుగా పాక్–చైనా కలిపి భారత్‌పై దాడి చేయవచ్చు. ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు. అయితే మూడవ ప్రపంచ యుద్ధం... దేశాలను, భూభాగాలను ఆక్రమించుకోవటానికి కాకుండా శత్రుదేశాల సామర్థ్యాన్ని ధ్వంసం చేసే దిశగా ఉంటుంది. నగరాలు, పౌరులు లక్ష్యంగా ఉండదు. రేవుల దిగ్బంధనం, రవాణా మార్గాల దిగ్బంధనం, ఆర్థిక విధ్వంసం, సైబర్, అంతరిక్ష దాడులు, ప్రాక్సీ వార్ఫేర్ రూపంలో ఉండవచ్చు. గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
విషపూరిత ఆహారానికి విరుగుడేది?
2026 ఆగస్టు 11న లోక్‌సభలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఒక లెక్క చెప్పింది: 2023 నుండి 2026 మధ్య దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి సేకరించిన 70,652 పండ్లు, కూరగాయల నమూనా లను పరీక్షించారు. వాటిలో 2,223 నమూనాల్లో, అంటే 3.15 శాతంలో పురుగుమందుల అవశేషాలు భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిర్ణయించిన గరిష్ఠ అవశేష పరిమితి (ఎంఆర్ఎల్– మ్యాగ్జిమమ్ రెసిడ్యూ లిమిట్) కంటే ఎక్కువగా కనిపించాయి. జాతీయ సగటుగా చూస్తే ఇది చిన్న సంఖ్యే. కానీ తెలుగు రాష్ట్రాల దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి వేరు.తెలుగు రాష్ట్రాలు ఆందోళనకరంతెలంగాణలో 8,198 నమూనాల్లో 486 నమూనాలు, అంటే 5.93 శాతం (జాతీయ స్థాయిలో మూడో స్థానం) పరిమితి దాటాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2,104 నమూనాల్లో 134, అంటే 6.37 శాతం (జాతీయ స్థాయిలో రెండో స్థానం) పరిమితి దాటాయి. రెండూ దేశ సగటు కంటే దాదాపు రెట్టింపు. మరో విధంగా చెప్పాలంటే, దేశంలో పరిమితి దాటిన మొత్తం నమూనాల్లో దాదాపు 28 శాతం ఈ రెండు రాష్ట్రాల నుండే వచ్చాయి. కానీ పరీక్షించిన మొత్తం నమూనాల్లో ఈ రెండు రాష్ట్రాల వాటా 15 శాతమే. 2004–2010 మధ్యలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో సగానికి పైగా తగ్గిన పురుగు మందుల వినియోగం అ తర్వాత విపరీతంగా పెరిగింది అని అర్థం అవుతోంది. వినియోగంతో పాటు అవశేషాలు కూడా పెరుగుతున్నాయి. మోతాదుకి మించి అవశేషాలు ఉండ టాన్ని వినియోగదారులుగా మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎంఆర్ఎల్ అంటే ‘సురక్షితం – అసురక్షితం’ అనే గీత కాదు. ఇక్కడో ముఖ్యమైన అపార్థం ఉంది. ఎంఆర్ఎల్ అనేది ఆరోగ్య కోణంలో ‘ఇంతకు మించితే విషం’ అనే గీత కాదు. సిఫారసు చేసిన పంటపై, సిఫారసు చేసిన మోతాదులో, సిఫారసు చేసినన్నిసార్లు మాత్రమే పిచికారీ చేసి, కోతకు ముందు నిర్ణీత విరామం పాటించి నప్పుడు పంటలో మిగిలే గరిష్ఠ అవశేషం అది. అంటే అది ముఖ్యంగా ‘మందును సరిగ్గా వాడారా?’ అని చెప్పే కొలమానం. అయితే ఇక్కడ రెండు ‘నిజాలను’ గుర్తించాలి. 1. ఎంఆర్ఎల్ దాటిందంటే ఆ కూరగాయ తినగానే హాని జరుగుతుందని కాదు. ఈ పరిమితులను చాలా కింది స్థాయిలో పెడతారు. 2. ఎంఆర్ఎల్ లోపల ఉందంటే సురక్షితమని కూడా కాదు.పంట వేరు, భోజనం వేరు ప్రయోగశాల టమాటాను విడిగా, మిర్చిని విడిగా పరీక్షిస్తుంది. కానీ ఇంట్లో మనిషి టమాటా, మిర్చి, ఆకుకూర, బియ్యం, పప్పు, పండ్లు– అన్నీ కలిపి తింటాడు. ప్రతీ పదార్థం దాని సొంత ఎంఆర్ఎల్ లోపలే ఉండవచ్చు. కానీ ఒకే మందు నాలుగైదు పదార్థాల ద్వారా శరీరంలోకి వెళ్ళవచ్చు. ప్రపంచంలో ఇందుకోసం రెండు కొలమానాలు ఉన్నాయి. మొదటిది ఏడీఐ (యాక్సెప్టబుల్ డెయిలీ ఇన్‌టేక్)– కిలో శరీర బరు వుకు, రోజుకు, జీవితాంతం తీసుకున్నా ఇబ్బంది లేని మోతాదు. రెండోది ఏఆర్ఎఫ్డీ (అక్యూట్ రిఫరెన్స్ డోస్)– ఒక్క పూటలో లేదా ఒక్క రోజులో తీసుకోదగిన మోతాదు. రెండూ శరీర బరువుకు అనుగుణంగా లెక్కగట్టేవి. అందుకే అదే కూర 60 కిలోల బరువున్న పెద్దవాడికంటే 15 కిలోల పిల్లవాడికి ఎక్కువ ప్రమాదం అవుతుంది. ఒకే నమూనాలో రెండు, మూడు, నాలుగు రకాల మందుల అవశేషాలు కనిపించడం అసాధారణం కాదు. ప్రతీ మందూ దాని సొంత పరిమితి లోపలే ఉండవచ్చు. కానీ ఒకే రకమైన ప్రభావం చూపే మందులు కలిసినప్పుడు మొత్తం ప్రభావం ఎంత అనేది వేరే ప్రశ్న. యూరప్ ఆహార భద్రతా సంస్థ (ఈఎఫ్ఎస్ఏ) ఈ దిశగా పని మొదలుపెట్టింది. మనం కనీసం ఏ నమూనాలో ఎన్ని మందులు కలిసి ఉన్నాయో నమోదు చేసి, ప్రచురించడం నుండి మొదలుపెట్టాలి.ఎంఆర్ఎల్ దాటడం అనేది కేవలం ప్రయోగశాల ఫలితం కాదు– అది పొలంలో జరిగిన దాని సంకేతం. కారణాలు రైతులకు కొత్తవేమీ కాదు: ఆ పంటకు అనుమతి లేని మందు వాడకం,లేబుల్ కంటే ఎక్కువ మోతాదు, అవసరం లేకుండా మళ్ళీ మళ్ళీ పిచికారీ, మూడు నాలుగు మందుల అనవసర మిశ్రమాలు, పురుగు కనిపించకపోయినా క్యాలెండర్ ప్రకారం పిచికారీ, పంట కోత విరామం పాటించకపోవడం, పిచికారీ చేసిన వెంటనే కోయడం. మిర్చి, టమాటా, బెండ, వంకాయ, ద్రాక్ష– తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా సాగేవి, ఎక్కువ పిచికారీలు అవసరమయ్యేవి. అయితే గణాంకాల నుండి కారణం ఏదని నేరుగా చెప్పలేం. అది పొలాల్లో విచారణ చేసినప్పుడే తెలుస్తుంది.ఒక సంగతి: ఈ పట్టికను రాష్ట్రాల ర్యాంకింగ్‌గా చదవకూడదు. ఛత్తీస్‌గఢ్‌లో పరీక్షించినవి 29 నమూనాలే; ఒక్కటీ పరిమితి దాట లేదు. అయినా అక్కడ సమస్య లేదని అర్థం కాదు. ఎక్కడ సేకరించారు, ఏ పంటలు, ఏ కాలంలో, ఎన్ని మందుల కోసం చూశారు– ఇవన్నీ సంఖ్యను మార్చేస్తాయి.కూరగాయలు మానేయకండి!చివరగా ఒక ముఖ్యమైన మాట: ఈ కథనం చదివి కూర గాయలు, పండ్లు తినడం తగ్గించవద్దు. ఐసీఎంఆర్– జాతీయ పోషకాహార సంస్థ రోజుకు 400 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల పండ్లు తినాలని సిఫారసు చేస్తోంది. మనం అంతకంటే చాలా తక్కువ తింటున్నాం. కూరగాయలు తక్కువ తినడం వల్ల కలిగే గుండె, మధుమేహ, క్యాన్సర్ ముప్పు... అవశేషాల ముప్పు కంటే చాలా పెద్దది. కడగడం, తొక్క తీయడం, వండటం వంటివి అవశేషాలను గణనీయంగా తగ్గిస్తాయి. కానీ మొత్తం బాధ్యతను వినియోగ దారుడిపై నెట్టడం సరైనది కాదు. అవశేషం పుట్టేది ఇంట్లో కాదు, పొలంలో. అందుకే పరిష్కారం అక్కడే జరగాలి. పురుగుమందుల అవసరం తగ్గించడమే సమస్యకు అసలైన పరిష్కారం. ఎర పంటలు వేయడం, ఫెరమోన్ ట్రాప్‌లు పెట్టడం, మిత్రపురుగుల పరిరక్షణ, పంట వైవిధ్యం, ఆర్థిక నష్టస్థాయి దాటినప్పుడే చర్య తీసుకోవడం, రైతు క్షేత్ర పాఠశాలల ఏర్పాటు వంటివి అవసరం. తెలుగు రాష్ట్రాలకు ఈ అనుభవం ఇప్పటికే ఉంది.డా‘‘ జి.వి.రామాంజనేయులువ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త,‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
అతడు సముద్రాలను కొలిచేశాడు!
1768 ఆగస్టులో ఇంగ్లాండ్ నుంచి ఎండీవర్ అనే చిన్న నౌక సముద్రంలోకి బయలుదేరింది. దానికి నాయకత్వం వహించిన కెప్టెన్ జేమ్స్ కుక్కు సముద్రాలను కొలవాలి, తెలియని భూభాగా లను పటాల్లో నమోదు చేయాలి. కుక్ 1728లో వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించాడు. చిన్న వయసులోనే వ్యాపార నౌకల్లో పనిచేస్తూ సముద్ర ప్రయాణం నేర్చుకున్నాడు. బ్రిటిష్ నౌకాదళంలో చేరి కెనడాలోని సెయింట్ లారెన్స్ నది, న్యూఫౌండ్లాండ్ తీరాన్ని సర్వే చేయడం ద్వారా మ్యాపుల తయారీలో నైపుణ్యాన్ని చాటాడు. 18వ శతాబ్దంలో భూమి నుంచి సూర్యుడి దూరం ఎంత అనే ప్రశ్న ఖగోళ శాస్త్రవేత్తలను వేధించేది. 1769లో జరిగే వీనస్ ట్రాన్సిట్ను ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పరిశీలించడం ద్వారా ఈ దూరాన్ని అంచనా వేయాలని భావించారు. అందుకే ఎండీవర్‌లో శాస్త్రీయ పరికరాలతో ఖగోళ శాస్త్రవేత్తలూ బయలుదేరారు. యువ ప్రకృతి శాస్త్రవేత్త జోసెఫ్ బ్యాంక్స్, స్వీడిష్ వృక్షశాస్త్రవేత్త డానియల్ సోలాండర్ కూడా ఈ యాత్రలో భాగం అయ్యారు.ఎండీవర్ యాత్ర అధికారికంగా తాహితీలో శుక్రగ్రహం సూర్యుడి ముందు నుంచి దాటుతున్నట్లు కనిపించే వీనస్ ట్రాన్సిట్ను పరిశీలించడానికి బయలుదేరింది. కానీ కుక్కు మరో రహస్య ఆదేశం కూడా ఉంది: తెలియని దక్షిణ భూభాగం– టెర్రా ఆస్ట్రాలిస్ ఇన్ కాగ్నిటా– ఉందా లేదా పరిశీలించాలి; కనిపిస్తే బ్రిటన్ తరఫున దానిపై హక్కు ప్రకటించే అవకాశాన్ని పరిశీలించాలి. ఫలితంగా రాయల్ సొసైటీ పరిశోధన, బ్రిటిష్ అడ్మిరాల్టీ వ్యూహం ఒకే నౌకలో ప్రయాణించాయి.1769 జూన్ 3న తాహితీలో అంతరిక్షంలో వీనస్ ట్రాన్సిట్ను పరిశీలించారు. తరువాత కుక్ న్యూజిలాండ్‌కు చేరుకుని దాని తీరప్రాంతాన్ని శాస్త్రీయంగా సర్వే చేశాడు. న్యూజిలాండ్ ఒక భారీ దక్షిణ ఖండంలో భాగం కాదని స్పష్టం చేయడంలో అతని మ్యాపులు కీలకమయ్యాయి. 1770 నాటికి కుక్ ఆస్ట్రేలియా తూర్పు తీరానికి చేరుకుని దానిని మ్యాపుల్లో నమోదు చేశాడు. బోటనీ బేలో బ్యాంక్స్, సోలాండర్ వివిధ మొక్కల నమూనాలను సేకరించారు. గ్రేట్ బ్యారియర్ రీఫ్ వద్ద ఎండీవర్ ప్రమాదంలో పడినా నౌకను మరమ్మతు చేసి ప్రయాణాన్ని కొనసాగించారు. తుదకు 1771లో ఇంగ్లాండ్‌కు తిరిగి చేరుకున్నారు.కుక్ ఆస్ట్రేలియాను కనిపెట్టలేదు!అయితే కుక్ ఆస్ట్రేలియాను ‘కనుగొన్నాడు’ అని చెప్పడం తప్పుదారి పట్టించే మాట. ఆ ఖండంలో వేల సంవత్సరాలుగా ఆదివాసీ సమాజాలు నివసిస్తున్నాయి. కుక్ చేసింది కేవలం ఆస్ట్రేలియా తూర్పు తీరాన్ని... యూరోపియన్ నౌకాయానాన్ని సులభతరం చేస్తూ ఓ పద్ధతి ప్రకారం మ్యాప్ చేయడం, బ్రిటిష్ సింహాసనం తరఫున హక్కు ప్రకటించడం మాత్రమే.ఇదీ చదవండి: జపాన్ అణ్వస్త్ర డైలమాబ్యాంక్స్, సోలాండర్ సేకరించిన మొక్కల నమూనాలు యూరోపియన్ శాస్త్ర ప్రపంచానికి కొత్త ప్రకృతి వైవిధ్యాన్ని పరిచయం చేశాయి. ఆ కాలంలో సముద్రంపై పయనించే యాత్రికులు స్కర్వీ వ్యాధితో చనిపోతూ ఉండేవారు. కుక్ యాత్రలో స్కర్వీ నివారణకు తగిన చర్యలు తీసుకున్నారు. ఆహారంపై శ్రద్ధ పెట్టారు. అతడి సముద్రయానం సముద్ర నావిగేషన్‌ను మరింత కచ్చితంగా చేసింది. అదే సమయంలో సైన్స్, మ్యాపింగ్, అన్వేషణలు సామ్రాజ్య విస్తరణకు కూడా ఉపయోగపడ్డాయి.అందుకే కుక్‌ను దేవుడిలా పొగడటం సరైంది కాదు, అలాగే అతడిని కేవలం వలసవాద ప్రతినిధిగా కొట్టిపారేయడం కూడా సరికాదు. అతను తన కాలంలోని సైన్స్, నౌకాయానం, సామ్రాజ్యవాద రాజకీయాలు కలిసిన ప్రపంచానికి ప్రతినిధి. శాస్త్రం, సాంకేతికత, పరిశీలన, పటాల తయారీ, వివిధ రంగాల నిపుణుల సహకారం కలిసినప్పుడే ఒక యాత్ర విజ్ఞానయుతంగా మారుతుంది అని కుక్ ప్రయాణం నిరూపించింది. ఆనాడు కుక్ తన బృందంలో వివిధ రంగాల నిపుణులను చేర్చుకున్న పద్ధతినే ఇప్పుడు అంతరిక్ష యాత్రలకు వెళ్లే బృందాల్లోనూ అనుసరించడం గమనార్హం. ఎడిటోరియల్ టీమ్ -
కష్టాల కావడి మోస్తున్న కౌలురైతు
రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయాన్ని బతికిస్తున్న కౌలురైతుల బతుకులు దుర్భరమవుతున్నాయి. సొంతగా భూమి సాగుచేసే రైతు కన్నా ఇతరుల భూమి కౌలుకు తీసుకొని సాగుచేస్తున్న రైతు మరిన్ని కష్టాల్లో కూరుకుపోతున్నాడు. ప్రభుత్వ పథకాలు, విత్తన–ఎరువుల సబ్సిడీలు, బ్యాంకు రుణాలు, నష్టపరిహారాలు, రుణమాఫీలు, మద్దతు ధర, బోనస్.... ఇటువంటివేవీ నేరుగా కౌలురైతులకు అందటం లేదు. ఎన్నికల హామీలతో ఊదరగొట్టి గద్దెనెక్కిన పార్టీలు, కౌలు రైతాంగానికిచ్చిన మాట తప్పిన ఫలితమే ఈ దుఃస్థితి!పెద్ద ఎత్తున ప్రజాధనం వెచ్చించి వ్యవసాయానికి మద్దతుగా నిర్వహిస్తున్న ప్రభుత్వ వివిధ పథకాల లబ్ధి కౌలురైతులకు అందడం లేదు. నిజానికి క్షేత్రంలో ఉండి, పెట్టుబడి పెట్టి, పరి స్థితుల్ని ఎదుర్కొని సాగుచేసేది కౌలు రైతు. కానీ, వారిని గుర్తించి, ఆ మేరకు ప్రయోజనాలు కల్పించడానికి ప్రభుత్వాలు జంకుతున్నాయి. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి! అన్ని బాధలూ వారివే! సర్కారు లెక్కల ప్రకారం తెలంగాణలో కోటిన్నర ఎకరాల వ్యవసాయ భూమి సాగులో ఉంది. చిన్న, మధ్యతరహా, పెద్ద...అంతా కలిపి సుమారు 70 లక్షల మంది రైతులుగా నమోదై పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఉన్నారు. వారంతా రైతు భరోసా (ఇదివరకటి రైతుబంధు) లబ్ధిదారులు. అందులోనే కొందరు, తమ భూమికి తోడు ఇతరుల భూమి తీసుకొని కౌలు చేస్తున్నారు. మరికొందరు, సొంత భూమే లేకున్నా ఇతరుల భూమి కౌలుకు చేస్తున్నారు. తెలంగాణలో 36 శాతం మంది కౌలురైతులున్నట్టు 2022లో ‘రైతు స్వరాజ్య వేదిక’ (ఆరెస్వీ) జరిపిన సర్వే లెక్కలు చెబుతున్నాయి. సబ్సిడీ విత్తనాలు, సబ్సిడీ ఎరువులు, పంట రుణాలు, రుణమాఫీ లబ్ధి, రైతు భరోసా, పంట బీమా/పంట నష్ట పరిహారం, మద్దతు ధర, అదనపు బోనస్... ఇటువంటి ప్రయో జనం ఏదీ నేరుగా కౌలురైతుకు అందటం లేదు. ప్రభుత్వం, అనుబంధ విభాగాలు వ్యవసాయ రంగంలో ఆధు నిక సాంకేతికతను వినియోగించడం మొదలెట్టాక ‘యాప్’లతో భూయజమానుల మొబైల్, పాస్‌పుస్తకాలు లింక్ చేయడం, ‘ఓటీపీ’లు వారికే రావడం, ఎరువుల సమాచారమైనా, ధాన్యం విక్రయ వివరాలైనా నేరుగా వారి మొబైల్‌కు, బ్యాంకు ఖాతాలకే చేరుతోంది. కౌలు డబ్బు, పెట్టుబడి వ్యయం పెరిగి, మద్దతు ధర కూడా లభించక కౌలురైతు రెండింతలు నష్టపోతున్నాడు. ప్రభుత్వ సహాయమూ అందక మూడు రకాల భారం మోయాల్సివస్తోంది.కష్టాన్ని కళ్లకు కడుతున్న సర్వేలుతెలంగాణ గ్రామీణ జనాభాలో దాదాపు సగం మందికి సెంటు భూమి కూడా లేదు. ముఖ్యంగా వెనుకబడిన, దళిత, మైనారిటీ, గిరిజన వర్గాలవారిలో అత్యధికులకు భూమి లేదు, ఉన్నా ఒకటీ, అర ఎకరాలు మాత్రమే! ఇటీవల ‘కౌలురైతుల గుర్తింపు సాధన కమిటి’ వారు కూడా తెలంగాణలో సర్వే నిర్వహించారు. 22 జిల్లాలు, 47 మండలాలు, 57 గ్రామాల్లోని 1,836 మంది కౌలు రైతులను ‘ప్రాతినిధ్య నమూనా’లుగా ఎంపిక చేశారు. ప్రధానంగా వ్యక్తి గత ఇంటర్వ్యూ పద్ధతిలో సమాచారం రాబట్టారు. ఏపీలో ‘ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం’తో కలిసి ‘పీపుల్స్ పల్స్’ సర్వే నిర్వహించింది. మొత్తం 26 జిల్లాల్లో జిల్లాకు సగటున 100 నుంచి 125 ‘నమూనా’ల చొప్పున మొత్తం 3000 శాంపిల్స్‌తో నెల రోజుల పాటు ఈ సర్వే జరిగింది. కౌలురైతులకు ఏపీలో అరకొరగా గుర్తింపుకార్డు లిచ్చారు. 12.3 శాతం మంది తమకు లభించాయని చెబితే, కార్డు లేవీ అందలేదని 87.7 శాతం మంది వెల్లడించారు. 70 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల వారే ఏపీలో కౌలురైతులు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీరేట్లు, యంత్రాల అద్దెలు అసాధారణంగా పెరిగాయని 67.2 శాతం రైతులు చెబితే, కౌలు డబ్బు/ధాన్యం పెరగటం వల్ల ఇబ్బందులని 12.5 శాతం మంది, గిట్టుబాటు ధరలు లేక కష్టాలు పెరిగాయిని 10.8 శాతం మంది, అధిక వడ్డీల ప్రయి వేటు అప్పుల భారమనీ, మార్కెట్ సమస్యలనీ మరో పది శాతం మంది చెప్పారు. కొన్ని చోట్ల కౌలు రేట్లు యేటా ఎకరాకు 53 వేల రూపాయల వరకు చేరాయని, సగటున 14,936గా చెల్లిస్తున్నామని తెలంగాణ కౌలురైతులు చెప్పారు. చిన్న కమతాల్లో కౌలు గిట్టుబాటు కాక ఎక్కువ ఎకరాల్లో కౌలు చేయాల్సి వస్తోందని, ఇదివరకు సగటున రైతుకు 5 ఎకరాలున్న కౌలుసాగు ఇప్పుడు 6.7 ఎకరాలకు పెరిగిందని వారంటున్నారు. 5కు పైగా ఎకరాలు కౌలుసాగు చేస్తున్న రైతుల సంఖ్య 31 నుంచి 42 శాతానికి పెరిగింది. మాట తప్పిన ‘రాజకీయాలు’కౌలురైతులకు గుర్తింపు కార్డులిచ్చి, అన్ని సంక్షేమ పథకాలతో పాటు బీమాను వారికే వర్తింపజేస్తామని ఏపీలో తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ‘ప్రజాగళం’ పేరిట ప్రకటించిన ఎన్నికల మాని ఫెస్టోలో చెప్పింది. అధికారంలోకి వచ్చాక ఏడాదిలోపు కౌలు రైతు లకు ప్రత్యేకచట్టం తెస్తామన్న మాట కూడా గాలికిపోయింది. కూటమి భాగస్వామి, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (జనసేన) ఎన్నికల ముందు ఉత్తర కోస్తా, మధ్య కోస్తా, రాయలసీమ... ఎక్కడి కక్కడ కౌలురైతుల సమావేశాలు పెట్టి, వారికి ఆర్థిక సహాయం అందించి నానా హడావుడి చేశారు. ఇప్పుడు కిమ్మనటం లేదు. తెలంగాణ ఏర్పడ్డాక పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కౌలురైతుల పట్ల కక్ష కట్టినట్టే వ్యవహరించింది. 2016 వరకు తెలంగాణలోని రెవెన్యూ రికార్డుల్లో ప్రతిసీజన్ భూయజమానితో పాటు వాస్తవ సాగులో ఉన్న (కౌలు రైతు) పేరు విడిగా నమోదు చేసే అవకాశం ఉండేది. అలా నమోదు కోసం ఉన్న సాగు కాలమ్‌ను 2017లో ఒక చట్ట సవరణ ద్వారా తొలగించింది. కౌలురైతుల్ని గుర్తించడానికి, వారికి గుర్తింపు కార్డుల ద్వారా ఎంతోకొంత ప్రయో జనం కల్పించడానికి వీలు కల్పించే ‘భూ అధీకృత సాగుదారుల చట్టం–2011’ అమలును 2015 నుంచి దాదాపు నిలిపివేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు, నాటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘2023 సెప్టెంబర్’లో కౌలురైతు లకు బహిరంగ లేఖ రాస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కౌలు రైతులకు అన్యాయం జరిగిందనీ, తాము అధికారంలోకి రాగానే 2011 చట్టాన్ని అమలు చేయడమే కాకుండా అన్ని ప్రభుత్వ పథ కాలు వారికి వర్తించేలా చర్యలు తీసుకుంటామనీ పేర్కొన్నారు. గద్దెనెక్కి రెండున్నరేళ్లు దాటినా నేటికి అతీగతీ లేదు. ఏ రకంగా చూసినా కౌలురైతు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నష్టపోతున్నాడు. రెండింతల కష్టాల కావడి మోస్తున్నాడు.దిలీప్ రెడ్డివ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రిసెర్చి సంస్థ డైరెక్టర్ -
జపాన్ అణ్వస్త్ర డైలమా
కొన్ని విషయాలు వినేందుకు విచిత్రంగా తోస్తాయి. ప్రపంచంలో అణ్వస్త్రాలంటూ తయారైన తర్వాత వాటి దాడికి 1945లో మొట్టమొదట గురైన దేశం జపాన్. అప్పటినుంచి 81 సంవత్సరాలు గడిచినా మరెవరూ ఎవరిపై ఆ దాడులు చేయ లేదు. అనగా ఆ ఊహాతీత వినాశనానికి గురైన ఏకైక దేశం జపాన్. ఆ దుష్ఫలితాలను వారు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. అయినప్పటికీ అక్కడ ఇటీవల తాము కూడా అణ్వాయుధాలు తయారు చేయాలా, లేదా కనీసం తమ దేశంలో అణ్వస్త్ర స్థావరాల ఏర్పాటుకు అనుమతించాలా అనే చర్చ జరుగుతున్నది.ఇప్పటికే వ్యతిరేకతే1945 ఆగస్టు నెలలో హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణ్వస్త్రాలను ప్రయోగించింది. ఆ సందర్భంగా ఆ రెండు నగరాలలో అక్కడి మునిసిపల్ కార్పొరేషన్ల ఆధ్వర్యాన ప్రతి సంవ త్సరం విస్తృత స్థాయిలో సంతాప సభలు జరిగినట్లే ఈసారి కూడా 81వ సంవత్సర సభలు జరిగాయి. మునిసిపల్ మేయర్ల అధ్యక్షతన జరిగిన ఆ కార్యక్రమాలలో ప్రధానమంత్రి సనాయే తకాయిచీ కూడా సభికులలో ఒకరిగా కూర్చుని పాల్గొన్నారు. అణ్వస్త్రాలకు వ్యతిరేకంగా రెండు నగరాల మేయర్లు ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. జపాన్ నగరాలన్నిటా భారీ ప్రదర్శనలు జరిగాయి. దేశ వ్యాప్తంగా జరిగిన వేర్వేరు ప్రజాభిప్రాయ సేకరణలలో సగటున 70 శాతానికి పైగా ప్రజలు అణ్వస్త్రాలకు వ్యతిరేకంగా ఓటు చేయగా, మరొక 10 శాతం వరకు తటస్థంగా ఉండిపోయారు.దీనంతటి మధ్య గమనించదగినదేమంటే, 1971 నాటి అణ్వస్త్ర విధానాన్ని తీవ్ర మితవాద తకాయిచీ ప్రభుత్వం అధికారికంగానైతే ఏమీ మార్చలేదు. కానీ దానిని సవరించాలంటూ జరుగుతున్న చర్చను అనధికారికంగా ప్రోత్సహిస్తున్నది. అప్పటి విధానం ప్రకారం జపాన్ స్వయంగా అణ్వాయుధాలను తయారు చేయ రాదు, ఇతర దేశాల నుంచి స్వీకరించి నిల్వ చేయరాదు, ఇతరులు తమ అణ్వాస్త్రాలను జపాన్ భూభాగంపై మోహరించేందుకు అంగీ కరించరాదు. ఇపుడు జరుగుతున్న చర్చ ఇందులో మొదటి రెండు నిబంధనలు యథాతథంగా కొనసాగాలనీ, మూడవ దానిని మాత్రం సడలించాలనే ధోరణిలో సాగుతున్నది. అనగా జపాన్‌లో ఇతర దేశాల అణుస్థావరాలకు అవకాశం ఇవ్వటం. ఇతర దేశాల న్నవి తమపై 1945లో అణుదాడి చేసిన అమెరికాయే అవుతుందని వేరే చెప్పనక్కర లేదు. రెండు దేశాల మధ్య ఇప్పటికే పూర్తిస్థాయి రక్షణ ఒప్పందం ఉంది. జపాన్‌కు అణ్వస్త్ర స్థాయి రక్షణ కల్పించటం అందులోని అంశాలలో ఒకటి. జపాన్‌లోని ఒకినావా దీవిపై గల విస్తారమైన రక్షణ స్థావరాలు గాక దేశవ్యాప్తంగా 80కి పైగా సైనిక సదుపాయాలున్నాయి. పసిఫిక్ ప్రాంతంలో ఇరువురి ప్రయోజ నాలు, వ్యూహాలు ఒకటే. ఇటువంటి రక్షణ ఏర్పాట్లు ఉన్నపుడు, జపాన్‌కు స్వయంగా అణ్వస్త్రాలు ఉత్పత్తి చేసుకోవలసిన అవసరం ఏమిటి? లేదా ఇతరుల అణ్వస్త్ర స్థావరాలకు చోటివ్వటం ఏమిటి?మారుతున్న అమెరికా వైఖరిమొదట ఒక మాటగా అనుకోవాలంటే, పసిఫిక్ ప్రాంతంలో అమెరికా వ్యూహాలు మారు తున్నాయనే అంచనా. చైనాను ప్రపంచంలో తమ పోటీదారు, పసిఫిక్ ప్రాంతంలో తమకు సవాలు అంటూ వచ్చిన అమెరికా, ఇటీవల జి–2 ఫ్రేమ్‌వర్క్ పద్ధతిలో వారితో సహకారానికి సిద్ధ పడటం. ఇదే సంవత్సరం ఆరంభంలో ‘ఇండో–పసిఫిక్ వ్యూహ పత్రం’ ప్రకటించిన ట్రంప్ ప్రభుత్వం, పసిఫిక్ నుంచి ఉపసంహరించుకున్నట్లయితే ప్రకటించలేదుగానీ (ఆ పని ఎన్నటికీ చేయరు), ఆ ప్రాంతంలోని తమ మిత్ర దేశాలు ఇక నుంచి తమ రక్షణ భారాన్ని చాలావరకు తామే మోయాలని స్పష్టం చేసింది. ఇదిగాక, దక్షిణ కొరియాను ఉపేక్షించి ఉత్తర కొరియాతో మైత్రికి ప్రయత్నించటం, జపాన్‌పై రకరకాల ఒత్తిడులు సృష్టించటం వంటివి జరుగుతున్నాయి.ట్రంప్ ఇదే విధంగా ఇచ్చిన స్పష్టతలతో యూరప్‌పై ఒత్తిడులు పెరిగినట్లు, పసిఫిక్ ప్రాంతంలోనూ అదే జరుగుతున్నది. దానితో ఇదే సంవత్సరం నుంచి అందరూ రక్షణ బడ్జెట్లు పెంచుతున్నారు. ఇతర దేశాలతో రక్షణ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇది ప్రధా నంగా చైనా, రష్యా, ఉత్తర కొరియాలతో ముప్పు ఉందనుకునే దేశాల నుంచి కనిపిస్తున్నది. గమనించదగినదేమంటే దీనంతటికి ప్రత్యేకమైన చొరవ తీసుకుంటూ తీవ్రస్థాయిలో మాట్లాడుతున్నది జపాన్ ప్రభుత్వం. చైనాతో దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో సరిహద్దు వివాదాలు మరికొన్ని దేశాలకు కూడా చిరకాలంగా ఉన్నాయి. అదే విధంగా ఆ సముద్ర ప్రాంతం నుంచి స్వేచ్ఛా నౌకా యాన సమస్యలు. కానీ అక్కడినుంచి పూర్తిగా తూర్పున గల న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల వరకు ఏదో ఒక మేరకు సామరస్యత చూపుతూ ఆర్థిక సంబంధాలకు ప్రాధాన్యతనిస్తుండగా, జపాన్ నుంచి భిన్న ధోరణి కనిపిస్తున్నది.తైవాన్‌పై వైఖరిలో దూకుడునిరుడు అక్టోబర్‌లో ప్రధానిగా ఎన్నికైన తకాయిచీ నవంబర్‌లో పార్లమెంట్లో మాట్లాడుతూ, ఒకవేళ చైనా సైన్యం తైవాన్ను ఆక్ర మించుకొనజూసినట్లయితే, అందువల్ల జపాన్ ఉనికికి ప్రమాదం వాటిల్లగలదు గనుక తాము కూడా ఆ యుద్ధంలో పాల్గొనవలసి రావచ్చునని అన్నారు. దానితో ఒక్కసారిగా పరిస్థితి వికటించింది. ఆ ప్రకటనలోని ప్రమాదాన్ని గుర్తించిన ట్రంప్ హెచ్చరించిన మీదట తకాయిచీ మౌనం వహించటమైతే చేశారుగానీ, చైనా డిమాండ్ చేసినట్లు తన ప్రకటనను ఉపసంహరించుకోలేదు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం తైవాన్ చైనాలో అంతర్భాగ మని ఐక్యరాజ్యసమితితో పాటు అత్యధిక దేశాలు గుర్తిస్తున్నాయి. వాటిలో జపాన్ కూడా ఉంది. తైవాన్ చైనాలో శాంతియుతంగా విలీనమవుతుందా, బలప్రయోగం ద్వారానా అన్నది వేరే విషయం. కానీ అసలు ఆ విలీనం విషయంలో జపాన్కుగానీ, మరొకరికిగానీ పాత్ర ఎట్లా ఉంటుంది? ఒకవేళ ఆ విలీనం సైనికంగా జరిగినా తైవాన్ నుంచి 100 కిలోమీటర్లకు పైగా దూరంలో గల జపాన్ ఉనికికి ముప్పు కలగడమేమిటి? విలీనాలు శాంతియుతంగా జరగాలని కోరటానికీ, ఇటువంటి వైఖరి తీసుకోవటానికీ తేడా ఉంటుంది. అందుకు కారణం తకాయిచీ పూర్తి కన్సర్వేటివ్ కావటంతోపాటు, తైవాన్ కొంతకాలం తమ ఆక్రమణలో ఉండటం, అమెరికా వ్యూహంలో భాగం కావటమనే అభిప్రాయం ఉంది.సమస్య ఈ విధంగా మొదలై ఇపుడు జపాన్ అణ్వస్త్రాల గురించి ఆలోచించే వరకు వచ్చింది. తైవాన్, చైనా ఒకటేనని స్వయంగా తైవాన్ కూడా సూత్ర రీత్యా అంగీకరించటం మరొక విశేషం. తమకు స్వాతంత్య్రం కావాలనే వర్గం ఒకటి అక్కడ ఉన్నా, వద్దనే వర్గం కూడా ఉంది. ఎప్పటికైనా, ఏదో విధంగా విలీనం చేసు కోగలమని చైనా కృతనిశ్చయంతో చెప్తున్నది. ట్రంప్ ఈ సంవత్సరం మే నెలలో చైనాకు వెళ్లినపుడు తనకు ఆ మాట అర్థమైనట్లే రాజీ ధోరణిలో వ్యాఖ్యానించారు. అటువంటి స్థితిలో, చైనాను తాము సైనికంగా నిలువరించగలమని జపాన్ ప్రధాని నిజంగానే నమ్ము తున్నారా? 1945 తర్వాత 81 ఏళ్లకు జపాన్ ప్రధాని ఆ వినాశనాన్ని మరచి అక్కరలేని అణ్వస్త్ర డైలమాను సృష్టించుకొని ఉండవచ్చు. జపాన్ ప్రజల వ్యతిరేకత మాత్రం సంతృప్తిని కలిగిస్తోంది.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అప్రమత్తతతో కూడిన 'ఆశావాదం అవసరం'
అభినందనలు. మీరు సాధించారు! మీలో చాలామంది ఎంతో ఉత్సాహంగా భవిష్యత్తులోకి అడుగు పెడుతున్నారు. కానీ కొందరి ప్రణాళికలు తాత్కాలికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మీ నియంత్రణలో లేని పరిస్థితులు అందుకు కారణం కావచ్చు, ఉద్యోగ మార్కెట్లో వచ్చిన మార్పులు, టెక్నా లజీ వంటి పరిస్థితులు కొందరి ఆశలను దెబ్బతీసే ఆస్కారం ఉంది. మీ ఆశలు దెబ్బతిన్నట్లయితే... మీరు ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఇలాంటి సమయంలో నేను ‘అనుకోని అవకాశాల కోసం పక్క చూపు’ అనే ఆలోచనను మీకు సూచిస్తున్నాను.‘పెరిఫెరల్ విజన్’ అంటే ఏమిటి?మీ ప్రస్తుత కెరీర్ మార్గంపై దృష్టి పెట్టండి. అయితే మీ సమయం మొత్తాన్ని దానికే కేటాయించకండి. మీ సమయంలో 10 నుంచి 15 శాతం ఇతర రంగాలను పరిశీలించడానికి కేటాయించండి. మీ ప్రధాన రంగానికి పక్కన ఉన్న ఇతర రంగాలు, కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలను గమనిస్తూ ఉండండి. అలా మీ ‘పక్క చూపు’తో మీరు ఎవరూ ఊహించని కొత్త అవకాశాలను గుర్తించవచ్చు. అదే పెరిఫెరల్ విజన్! అది మీరు ఎప్పుడూ ఊహించని ఒక కొత్త, ఆనందకరమైన కెరీర్ మార్గంలోకి మిమ్మల్ని తీసుకెళ్లవచ్చు. 1969లో స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లిష్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన తర్వాత ఫ్రాన్స్ కార్డోవా జర్నలిజం రంగంలోకి వెళ్లారు. లాస్ ఏంజెల్స్ టైమ్స్‌లో జర్నలిస్టుగా పనిచేశారు. అదే ఆమెకు నచ్చిన కెరీర్ మార్గం. కానీ ఆమె ‘పక్క చూపు’లో ఒక రోజు నక్షత్రాల గురించి ఒక డాక్యుమెంటరీ చూసింది. భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రంపై ఆసక్తి పెంచుకుంది. ఆమెకు అప్పటికీ ఫిజిక్స్‌లో ఉన్నత విద్య చదవడానికి అవసరమైన సంసిద్ధత దాదాపు లేదు. అయినా కాల్టెక్ కమ్యూనిటీ నుంచి లభించిన సహకారంతో ఇంగ్లిష్ చదివిన విద్యార్థి నుంచి ఫిజిక్స్ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా మారే మార్గాన్ని స్వయంగా నిర్మించుకున్నారు. 1979లో కాల్టెక్ నుంచి ఫిజిక్స్‌లో పీహెచ్డీ పొందారు. ఆ తర్వాత ఒక అనుకోని అవకాశం నుంచి మరొక అవకాశానికి ప్రయాణిస్తూ... ఖగోళ శాస్త్ర విభాగాధిపతిగా, నాసాలో మొదటి మహిళా మరియు అతి పిన్న వయస్కురాలైన చీఫ్ సైంటిస్ట్‌గా, నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్‌గా ఎదిగారు. నా జీవితంలో కూడా దాదాపు అలాంటిదే జరిగింది. నాకు లిగో(ఎల్ఐజీఓ–లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్–వేవ్ అబ్జర్వేటరీ) ప్రాజెక్ట్ ఒక అనుకోని అవకాశం. విశ్వంలో గురుత్వా కర్షణ తరంగాలను గుర్తించడానికి లిగో ప్రాజెక్ట్‌ను ప్రారంభించి నప్పుడు సాంకేతిక, రాజకీయ, సామాజిక సవాళ్లు ఎన్నో ఉన్నాయి. అయినా మేము విజయం సాధిస్తామని నమ్మాం. అదే సమయంలో ఏ సమస్యలు మన ప్రయాణాన్ని ఆపగలవో ముందుగానే గుర్తించాం. ప్రతి సమస్యను పెద్ద అడ్డంకిగా మారకముందే పరిష్కరించడానికి ప్రయత్నించాం. ఆ విధానం విజయవంతమైంది. దీన్నే నేను ‘అప్రమత్తతతో కూడిన ఆశావాదం’ అంటాను. ‘ఇంటర్స్టెల్లార్’ ఎలా వచ్చింది?1979లో నేను దక్షిణ కాలిఫోర్నియాలో ఒంటరిగా ఉన్నాను. నా ‘పక్క చూపు’ను విస్తరించడానికి హాలీవుడ్లో డేటింగ్ కూడా చేశాను! లిండా అబ్బాట్ అనే భవిష్యత్తులో ప్రముఖ సినిమా నిర్మాతతో నాకు పరిచయం ఏర్పడింది. ఆమె ఉత్సాహభరితమైన మహిళ; నేను మాత్రం పుస్తకాల పురుగు లాంటివాడిని. అయినా మేము స్నేహితులుగా కొనసాగాం. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆమె ఒక సినిమా కోసం నాతో ఆలోచనలు పంచు కోవాలనుకుంది. నేను ఆ అనుకోని అవకాశాన్ని వెంటనే అంది పుచ్చుకున్నాను. తర్వాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ చేతుల్లో ఆ ప్రాజెక్ట్ ‘ఇంటర్స్టెల్లార్ ’ అనే ప్రసిద్ధ చిత్రంగా మారింది. ఇంటర్స్టెల్లార్ సినిమా నా కెరీర్‌ను పూర్తిగా మార్చింది. దాదాపు అర్ధ శతాబ్దం పాటు కాల్టెక్ ప్రొఫె సర్గా ఉన్న నేను... ఆ తర్వాత నా జీవితంలోని తదుపరి దశను సైన్స్, కళల కలయికలో పనిచేయడానికి కేటాయించాలని నిర్ణయించుకున్నాను. ఇలాంటి ప్రాజెక్టులు నాకు కొత్త ఆనందాన్ని ఇస్తాయి. ముఖ్యంగా యువతకు సైన్స్‌పై ఆసక్తిని కలిగిస్తాయి. నేను భవిష్యత్తు గురించి ఆశావాదంగా ఉంటాను. నేను 100 సంవత్సరాల వయసు వరకు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవిస్తూ, మానసికంగా బలంగా ఉండి, నా ప్రాజెక్టులను కొనసాగించగలనని ఆశిస్తున్నాను. కానీ రోజువారీ జీవితంలో నేను జాగ్రత్తగా ఉంటాను. నా ఆరోగ్యానికి ఎదురయ్యే ప్రమాదాలను గమనిస్తాను.ఇప్పుడు మన ముందున్న ‘ఏనుగు’– ఏఐఇప్పుడు మన ముందున్న ఒక పెద్ద విషయంపై మాట్లాడాలి. ఆ ‘ఏనుగు’ పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్– ఏఐ. నేను ఏఐ నిపుణుడిని కాదు. కానీ ఏఐ సంక్లిష్టమైన విషయం. కొన్ని రంగాల్లో దాని సామర్థ్యం అద్భుతంగా ఉంది. ఏఐ అభివృద్ధిని ఈరోజే పూర్తిగా ఆపేసి, ప్రస్తుతం ఉన్న రూపంలోనే కొన్ని నెలలు లేదా ఒక సంవత్సరం ఉపయోగిస్తే, మనలో చాలా మంది దాన్ని త్వరగా ఇష్టపడటం ప్రారంభిస్తారు. మనలో అనేక మందిని భయపెడు తున్నది ఏఐ ఉనికి కాదు, ఏఐ వేగంగా మారిపోతుండటమే మనల్ని ఆందోళనకు గురిచేస్తోంది.మీరు వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ రంగాల్లో కెరీర్ ఎంచుకుంటే.. వేగంగా మారడం నేర్చుకోవాలి. అందుకు ముఖ్య మైన మార్గం... స్వీయ అభ్యాసం. టెక్నాలజీ మారుతున్న కొద్దీ దాన్ని ఉపయోగించడం మనం కూడా నేర్చుకుంటూ ఉండాలి. ఏఐ, క్రిస్పర్, ఎంఆర్ఎన్ఏ లేదా క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తు గురించి నాకు కూడా పూర్తిగా తెలియదు. నిపుణులు కూడా ‘మాకు తెలి యదు’ అని చెబుతున్నారు. కొంతమంది భవిష్యత్తు గురించి చాలా నిరాశావాదంగా మాట్లాడుతున్నారు. కానీ నేను నిరాశావాదిని కాదు. ఏఐ, ఇతర వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల దీర్ఘకాల భవిష్యత్తును చూస్తున్నప్పుడు కూడా నేను ‘జాగ్రత్తతో కూడిన ఆశావాదం’నే పాటిస్తాను.ఏఐ వల్ల మనుషులు ఒకరికి ఒకరు దూరమవుతారని కొందరు భయపడుతున్నారు. అలా జరగదని ఆశిద్దాం. భవిష్యత్తులో మనం మరింత బలమైన, అభివృద్ధి చెందిన, నైతిక విలువలు కలిగిన మానవ సమాజంగా ఎదుగుతామని ఆశిద్దాం. మన అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ.. ప్రతి మనిషి, ఇతర మనుషులను గౌరవించే సమాజంగా మనం ఉండాలి. మనిషి–మనిషి సంబంధాలు మన ఆనందానికి, ఆరోగ్యానికి, శ్రేయస్సుకు కేంద్రంగా ఉండాలి. ఆశావాదంతో పాటు జాగ్రత్త కూడా అవసరం. దీర్ఘకాల భవిష్యత్తుపై ఆశావాదంగా ఉండండి. కానీ రోజువారీ జీవితంలో అప్రమత్తంగా ఉండండి. మన ఆశావాద లక్ష్యానికి ఎదురయ్యే ప్రమాదాలను గమనించండి. ఆ ప్రమాదాలు పెద్ద సమస్యలుగా మారకముందే పరిష్కరించండి. -
అమిత్ షా (కేంద్ర మంత్రి) రాయని డైరీ
ఎండన పడి వచ్చిన వాళ్లకే కాదు, ఏ వేళన పడిలేస్తూ వచ్చిన వారికైనా ఎదురెళ్లి మంచినీళ్ల గ్లాసును చేతికి అందించటం భారతీయ సంస్కృతికే ప్రత్యేకమైన ఒక గొప్ప ఆతిథ్యం. నేను గుజరాతీని కాబట్టి, ఒకవేళ ఎవరైనా నాకు – ముఖ్యంగా ఆదివారం ఉదయం – అల్పాహారంగా తియ్యటి రసం ఊరే వేడి వేడి జిలేబీలను, వాటి అనంతరం కారం కారంగా కరకరలాడుతుండే ఫాఫ్డాను; మధ్యాహ్నం భోజనంలోకి రొట్టెలు, అన్నం లేదా పెసర పప్పు కిచిడీని; సాయంత్రపు స్వల్పాహారంగా ఆవిరిపై ఉడికించి, ఆవాలు, పచ్చిమిర్చి తాలింపుతో మెత్తటి స్పాంజీలా చేసిన ఢోక్లాను... నాకోసం సిద్ధం చేయటమన్నది కూడా ఒక గొప్ప ఆతిథ్యం కంటే తక్కువేమీ కానప్పటికీ... వాళ్లు అందించిన మంచి నీళ్ల గ్లాసుకే మొదట నేను రుణపడి ఉంటాను. సిలిగురిలో గత మూడు రోజులూ మహానంద నది నీళ్లే నా అమృతాహారం. ఢిల్లీలో ఈ రోజు గంగా జల వరప్రసాదం. రేపు మరొక నది కావచ్చు. ఆ మరునాడు ఇంకొక నది. ప్రాంతాలు ఏవైనా ‘జల’సత్వం ఒక్కటే. గురువారం, ఐదు దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశానికి మహాబలిపురం వెళ్లినప్పుడు... బహుశా అక్కడ నేను కృష్ణ లేదా కావేరీ నీళ్లు తాగి ఉంటాను. మీటింగ్‌కి, ఆ తర్వాత లంచ్‌కి ఏర్పాటు చేసిన నీళ్ల బాటిళ్లు చెన్నైలోని కృష్ణా, కావేరీ పైపుల నుంచి పట్టితెచ్చినవై ఉండాలి. ‘‘అమిత్ జీ, మీకోసం మా తమిళ వంటకాలను ఇంట్లో చేయించి తెచ్చాను’’ అన్నారు సీఎం విజయ్, లంచ్ మీట్లో! నదుల మధ్య రాష్ట్రాలకు సరిహద్దులు ఉంటే ఉండొచ్చు. నదీ జలాలు వంటగదులలో ఆ హద్దులను చెరిపేస్తాయి! భోజనం బల్ల ముందు కూర్చున్నంత సేపూ నేను గుజరాతీనిగానీ, ఢిల్లీవాలానుగానీ కాకుండా పూర్తిగా తమిళ ఆహారిని అయిపోయాను. విజయ్ తనే స్వయంగా అందరికీ వడ్డించడం మొదలు పెట్టారు! తక్కిన నలుగురు ముఖ్యమంత్రులు కూడా ఒకరికి ఒకరు పాత్రలు అందించుకుంటున్నారు. పక్కన ఉన్నవారి గాజు గ్లాసులలో ఖాళీ అయిన మేరకు నీళ్లను నింపుతున్నారు. ‘‘మరికాస్త తినండి’’ అని గిన్నెలను ముందుకు జరుపుతున్నారు. ఇది కదా సమైక్య దేశం! ఇదే కదా భిన్నత్వంలో ఏకత్వం! కానీ, భోజనానికి ముందు జరిగిన కీలకమైన సమావేశంలో ఆ ఐదుగురు ముఖ్యమంత్రులు, నీళ్లలో తమ వాటా కోసం పట్టుపట్టిన వాళ్లే! ఒకరి గొంతు ఒకరు పట్టుకున్నవారే. కావేరి నదిపై మేకేదాటు జలాశయ నిర్మాణానికి కేంద్రం వెంటనే అనుమతులు ఇవ్వాలని కర్ణాటక ముఖ్యమంత్రి. కావేరి నది నుండి న్యాయంగా తమకు రావలసిన నీటి వాటాను విడుదల చేయాలని, ఎగువన కొత్త డ్యామ్‌ల నిర్మాణాలను ఆపాలని తమిళనాడు ముఖ్యమంత్రి.గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి నదుల అనుసంధానానికి జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. కృష్ణా జలాల ట్రిబ్యునల్ పరిధిలో తమ రాష్ట్రానికి రావలసిన నీటి వాటాను చట్టబద్ధంగా త్వరగా ఖరారు చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి. కేరళ ప్రజల ప్రాణాల భద్రత దృష్ట్యా ముల్లపెరియార్ వద్ద కొత్త డ్యామ్ నిర్మించ డానికి తమిళనాడు, కేంద్రం అంగీకరించాలని కేరళం ముఖ్యమంత్రి. మీటింగ్‌కి, ఆ తర్వాతి డిన్నర్ మీటింగ్‌కి మధ్య ఎంత వ్యత్యాసం! ఎంత వైరుధ్యం?!మీటింగ్‌లో ‘‘మా నీళ్లు మాక్కావాలి’’ అని అడిగినవాళ్లు... డిన్నర్ మీటింగ్‌లో ఒకరికి ఒకరు నీళ్లందించుకున్నారు! మీటింగ్ అయ్యాక, సిలిగురి బయల్దేరే ముందు – ఏళ్లుగా దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉన్న నీళ్ల వివాదాలకు మహాబలిపురంలో నాకు పరిష్కారం కనిపించింది! నీళ్లు ఇస్తే తప్ప, నీళ్లు తీసుకుంటే తీరేది కాదు నీళ్ల సమస్య! -
ఆరోగ్యాన్ని సాగు చేసే దిశగా...
భారత వ్యవసాయం దశాబ్దాలుగా ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించింది. ఆకలి నుంచి దేశాన్ని బయటకు తీసుకువచ్చింది. ఆహార ధాన్యాల కొరతతో బాధపడిన దేశాన్ని ఆహార భద్రత కలిగిన దేశంగా మార్చింది. ఇప్పుడు మన ముందున్న సవాలు మాత్రం భిన్నమైనది. ప్రజలకు తినడానికి ఆహారం ఉండటమే కాదు... వారు తింటున్న ఆహారం వారిని ఆరోగ్యంగా ఉంచుతున్నదా? అనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన సమయం వచ్చింది.ఈ నేపథ్యంలో 2026 మే 11న భారత వైద్య పరిశోధనామండలి (ఐసీఎంఆర్), భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐకార్) సంయుక్తంగా ప్రారంభించిన ‘సెహత్’ (సైన్స్ ఎక్స్‌లెన్స్ ఫర్ హెల్త్ త్రూ అగ్రికల్చరల్ టాన్స్ఫర్మేషన్) ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యవసాయం, పోషకాహారం, ప్రజారోగ్యాన్ని ఒకే వేదిక పైకి తెచ్చి, వ్యవసాయ పరిశోధన ఫలితాలను నేరుగా ప్రజల ఆరోగ్య ఫలితాలతో అనుసంధానించడం దీని ప్రధాన లక్ష్యం. జీవ పోషక సమృద్ధి కలిగిన, పోషక విలువలు అధికంగా ఉన్న పంటలు; వైవిధ్యభరిత సమగ్ర వ్యవసాయ వ్యవస్థలు; రైతుల వృత్తిపర ఆరోగ్యం; మధుమేహం, ఊబకాయం వంటి జీవనశైలి వ్యాధుల నివారణ; ఒకే ఆరోగ్యం– ఇవీ దీని ఐదు ప్రధాన దిశలు.పరస్పర విరుద్ధ పరిస్థితిఇది భారతదేశానికి అవసరమైన విధాన మార్పు. ఒకవైపు పోషకాహార లోపం కొనసాగుతుండగా, మరోవైపు ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటివి పెరుగుతున్నాయి. 6వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్) ప్రకారం,దేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం 35.5 శాతం నుంచి 29.3 శాతానికి తగ్గడం ఆశాజనకం. కానీ తక్కువ బరువున్న పిల్లలు ఇప్పటికీ 31.8 శాతం ఉన్నారు. అదే సమయంలో 15–49 ఏళ్లమధ్య ఉన్న మహిళల్లో అధిక బరువు/ఊబకాయం జాతీయ స్థాయిలో 30.7 శాతానికి చేరింది. అంటే ఒకే సమాజంలో పోషకా హార లోపం, అధిక పోషణ రెండూ కనిపిస్తున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో ఈ సమస్య మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సర్వే ప్రకారం 15–49 ఏళ్ల మహిళల్లో ఏకంగా 47.9 శాతం మంది అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు; గత ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఇది 36.3 శాతం. పురుషుల్లోనూ ఇది 31.1 నుంచి 41.5 శాతానికి పెరిగింది. మహిళల్లో 21.8 శాతం, పురుషుల్లో 24.1 శాతం మంది అధిక రక్త చక్కెర స్థాయులు లేదా మధుమేహ మందుల వినియోగం ఉన్న వర్గంలోకి వస్తున్నారు. అదే సమయంలో పిల్లల్లో ఎదుగుదల లోపం 31.2 నుంచి 24.6 శాతానికి తగ్గడం మంచి పరిణామం.తెలంగాణలోనూ ఇదే చిత్రం దర్శనమిస్తోంది. ఐదేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం 33.1 శాతం నుంచి 27 శాతానికి తగ్గింది. కానీ 6–23 నెలల పిల్లల్లో సరిపడా ఆహారం అందుకుంటున్న వారు కేవలం 15.3 శాతమేమే. మరోవైపు మహిళల్లో 36.3 శాతం, పురుషుల్లో 35.5 శాతం అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు. మహిళల్లో రక్తంలో అధిక చక్కెర ఉన్నవారు లేదా మధుమేహ మందుల వినియోగం చేయవలసిన స్థితిలో ఉన్నవారు 19.6 శాతం ఉండగా, పురుషుల్లో 24.5 శాతం మంది ఉన్నట్లుతేలింది. ఈ గణాంకాలు ఆరోగ్య సమస్యను కేవలం ఆసుపత్రిలో మాత్రమే పరిష్కరించలేమనీ, దానిలో ఒక భాగాన్ని పొలంలోనే పరిష్కరించాల్సి ఉంటుందనీ సందేశం ఇస్తున్నాయి.వైవిధ్యానికి ప్రాధాన్యంఇప్పటివరకు వ్యవసాయ రంగంలో సాధించిన విజయాన్ని ప్రధానంగా దిగుబడి, ఉత్పత్తి, ధర, రైతు ఆదాయం ఆధారంగా కొలిచాం. ఇకపై పోషక విలువ, ఆహార వైవిధ్యం, ఆహార భద్రత, ఆరోగ్య ఫలితాలు కూడా వ్యవసాయ ప్రణాళికలో భాగం కావాలి. బియ్యం, గోధుమలతో కేలరీల భద్రత సాధించాం. ఇప్పుడు పప్పులు, చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, నూనెగింజలు, పాలు, గుడ్లు, చేపలు వంటి ఆహార వైవిధ్యానికి ప్రాధాన్యంపెంచాలి. తెలుగు రాష్ట్రాల్లో ఇందుకు అపారమైన అవకాశం ఉంది.ఆంధ్రప్రదేశ్‌కు ఉద్యానవన పంటలు, మత్స్యరంగం, చిరు ధాన్యాలు, పప్పుధాన్యాల్లో బలం ఉంది. తెలంగాణకు చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనెగింజలు, ఉద్యానవన పంటలు, పశుసంపద రంగాల్లో ప్రత్యేక సామర్థ్యం ఉంది. అధిక ఐరన్, జింక్ ఉన్న జీవపోషక సమృద్ధి పంటలు; మంచి మాంసకృత్తుల నాణ్యత కలిగిన పప్పుధాన్యాలు; రక్తంలో తక్కువ చక్కెర ప్రతిస్పందనకు అనుకూలమైన చిరుధాన్యాలు; యాంటీఆక్సిడెంట్లు, సూక్ష్మపోష కాలు సమృద్ధిగా ఉన్న పండ్లు, కూరగాయలు– ఇవన్నీ వ్యవసాయ పరిశోధన, విత్తన వ్యవస్థ, సాగు విస్తరణలో ప్రాధాన్యం పొందాలి. సెహత్ కూడా పోషక విలువలు అధికంగా ఉన్న, జీవపోషక సమృద్ధి పంటలను ప్రత్యేక ప్రాధాన్యంగా గుర్తించింది.రైతు ఆరోగ్యమూ ముఖ్యమే!అయితే రైతు ఆరోగ్యాన్ని మర్చిపోకూడదు. వ్యవసాయం ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడమే కాకుండా, ఆ ఆహా రాన్ని పండించే రైతు కూడా సురక్షితంగా ఉండాలి. పురుగుమందుల ప్రభావం, తీవ్రమైన వేడి, యంత్ర ప్రమాదాలు, జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు వంటి అంశాలను వ్యవసాయ విస్తరణలో భాగం చేయాలి. ఇదే సెహత్లో వృత్తిపర ఆరోగ్యం, ఏక ఆరోగ్యానికి ఇచ్చిన ప్రాధాన్యం వెనుక ఉన్న భావన.ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాల యాలు, వైద్య కళాశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్ వాడీలు కలిసి పనిచేసే కొత్త నమూనా అవసరం. ఒక జిల్లాలోఏ పోషకాహార లోపం లేదా అసాంక్రమిక వ్యాధులు ఎక్కువగా ఉన్నాయో ఆరోగ్య శాఖ గుర్తిస్తే... ఆ అవసరానికి తగిన పంటలు, వ్యవసాయ వ్యవస్థలు, ఇంటి తోటలు, పోషకాహార తోటలు,జీవ పోషక సమృద్ధి రకాలను వ్యవసాయ వ్యవస్థ ప్రోత్సహించ వచ్చు. జిల్లా ఆరోగ్య స్థితి వివరాలకు జిల్లా వ్యవసాయ ప్రణాళిక స్పందించాలి. అలాగే ప్రభుత్వ సేకరణ విధానం కూడా మారాలి. పాఠశాల మధ్యాహ్న భోజనం, అంగన్ వాడీలు, వసతి గృహాలు, ఆసుపత్రుల ఆహారంలో స్థానిక పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు వంటి వాటికి స్థిరమైన డిమాండ్ సృష్టిస్తే ఒకేసారి రైతుకు మార్కెట్, పిల్లలకు పోషణ లభిస్తాయి.ఇప్పటి వరకు మనం ఆహార భద్రత గురించి మాట్లాడాం.ఇక ఆరోగ్య భద్రత దిశగా అడుగు వేయాలి. మన వ్యవసాయశాస్త్రం ఒకప్పుడు ఆకలిని జయించింది. ఇప్పుడు మధుమేహం, ఊబకాయం, సూక్ష్మపోషక లోపాలు, ఆహార సంబంధిత వ్యాధులతో పోరాడటంలో కూడా తన పాత్రను విస్తరించాలి. ఆసుపత్రులు అనారోగ్యానికి చికిత్స చేస్తాయి. కానీ ఆరోగ్యకరమైన వ్యవసాయం ఆ అనారోగ్యాన్నే రాకుండా చేయగలదు. సెహత్ ఇచ్చే అసలైన సందేశం ఇదే. పొలం నుంచి పళ్లెం వరకు మాత్రమే కాదు; పళ్లెం నుంచి ప్రజారోగ్యం వరకూ వ్యవసాయ పాత్ర ఉందనిగుర్తించి ఆ దిశగా అడుగులు వేయాలి.-వ్యాసకర్త ఐకార్–అటారి, హైదరాబాద్ డైరెక్టర్-డా‘‘ షేక్ ఎన్. మీరా -
చైనాతో సంబంధాలు మెరుగయ్యేనా?
వచ్చే నెల సెప్టెంబర్‌లో భారత్‌లో జరుగనున్న బ్రిక్స్ దేశాధినేతల సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరవుతాడా అని విశ్లేషకులు ఆసక్తితో ఎదురు చూస్తు న్నారు. భారత్–చైనా దేశాధినేతల భేటీ నేపథ్యంలో రెండు దేశాల సంబంధాలకు దిశానిర్దేశం జరుగుతుందని జియో పొలిటికల్ సర్కిల్స్‌లో ఆశాభావం వ్యక్తమవుతోంది. భారత్–చైనా సంబంధాలలో స్థిరత్వం ఆసియా ఖండానికే కాకుండా ప్రపంచ శాంతికి కూడా కీలకం. 2020 గల్వాన్ ఘర్షణ నేపథ్యంలో సుమారు నాలుగు సంవ త్సరాలు సంబంధాలలో స్తబ్ధత చోటు చేసుకున్నది. 2024లో రష్యాలో కజాన్‌లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో మోదీ–జిన్‌పింగ్ సమావేశం, సరిహద్దు గస్తీ ఒప్పందం ఇరుదేశాల సంబంధాలలో ఘర్షణను కొంతవరకు తగ్గించాయి. కానీ మొత్తంగా సంబంధాలు సాధారణ స్థితికి చేరటానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి. 1962 యుద్ధం తరువాత 1988లో రాజీవ్ గాంధీ బీజింగ్ పర్యటనతో మళ్లీ రెండు దేశాల సంబంధాలు గాడిన పడ్డాయి. 44 సంవత్సరాల తరువాత 2006లో నాథూ లా కనుమ మళ్లీ తెరుచు కున్నది. కానీ ఇరుదేశాల మధ్య పీటముడిలా ఉన్న సరిహద్దు సమస్యకు పరిష్కారం సమీప భవిష్యత్తులో లేనట్లే లెక్క.అయినా... వాణిజ్యం పెరిగింది!సరిహద్దు సమస్య సంక్లిష్టత నేపథ్యంలో ఇరు దేశాలు వాస్తవిక దృష్టితో గత రెండు దశాబ్దాలుగా వ్యాపార–వాణిజ్య సంబంధాలపై దృష్టి పెట్టాయి. 2000 సంవత్సరంలో 3 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యం, 2025కల్లా 128 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. గత 25 సంవత్సరాలలో సరిహద్దుల మీద ఎన్ని ఘర్షణలు చోటు చేసుకున్నా అవి ఇరు దేశాల వాణిజ్యానికి నష్టం కలిగించలేదు. కానీ జూన్ 2020 గల్వాన్ దుస్సాహసం రెండు దేశాల మధ్య అగాథాన్ని సృష్టించింది. 2024 నుండి మరమ్మత్తు చర్యలు చేపట్టినప్పటికీ, అవి ఢిల్లీ–బీజింగ్ మధ్య విశ్వసనీయతలో లోటును పూరించలేక పోయాయి. గత రెండున్నర దశాబ్దాలుగా చైనాతో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఒకవైపు వ్యాపార వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకుంటూనే, మరొకవైపు సరిహద్దులలో మన సైనిక శక్తిని మెరుగుపరచుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. అంతర్జాతీయ యవనికపై పర్యావరణం, వాతావరణంలో మార్పులు, శక్తి, అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యల విషయంలో చైనాతో చేతులు కలిపాము. ఇరుదేశాల మధ్య వాణిజ్యం విçస్తృతంగా వృద్ధి చెంది నప్పటికీ వాణిజ్య లోటు పెద్ద సమస్యగా మారింది. 2020లో 44 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు 2026కల్లా 112 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. చైనా దిగుమతులపై మన ఆర్థిక వ్యవస్థ విపరీతంగా ఆధారపడతున్నది. ఈ రకమైన వాణిజ్య సంబంధాలు దీర్ఘకాలంలో మనకు నష్టం కలిగించటం ఖాయం.చైనా గ్రే జోన్ యుద్ధతంత్రం1962 తర్వాత భారత్‌పై చైనా మళ్లీ యుద్ధం చేసే పరిస్థితి, ప్రమాదం లేకపోయినప్పటికీ... సరిహద్దు సమస్య శాశ్వత పరిష్కా రానికి మనస్ఫూర్తిగా, మిత్రత్వ ధోరణితో చైనా ముందుకు రావటం లేదు. పైపెచ్చు వరుసగా సరిహద్దులలో కవ్వింపు ధోరణిని అమలు పరుస్తున్నది. వ్యూహాత్మకంగా ‘గ్రే జోన్ ’ యుద్ధతంత్రాన్ని అమలు పరుస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఒకవైపు సరిహద్దులలో భారత్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ... మరొకవైపు పరోక్షంగా భారత్ అభివృద్ధిని అడ్డుకొని బలహీనపరచే కుతంత్రాన్ని చైనా అమలుపరుస్తున్నది. దీనితో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి వెచ్చించాల్సిన కీలక నిధులను భారత ప్రభుత్వంచే సైనిక వ్యయంవైపు మళ్లింప చేయటంతో చైనా కృత కృత్యురాలయింది. సరిహద్దులను ఒకవైపు అస్థిరం చేస్తూనే మరొక వైపు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవు లతో జతకట్టి ఇండియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఈశాన్య భారతంలో ఉగ్రవాద ముఠాలకు వత్తాసు పలుకుతూ దేశాన్ని అస్థిరం చేయటానికి ప్రయత్నిస్తున్నది. వాణిజ్యంలో కూడా కీలకమైన వస్తువులను, ఉత్పత్తులను భారత్‌కు ఎగుమతి చేయకుండా ఆంక్షలు విధిస్తున్నది. మనకు అత్యంత అవసరమైన టన్నెల్ బోరింగ్ యంత్రాలు, సీఎన్ సీ లేథ్ యంత్రాలు, యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రేడియంట్లు, క్రిటికల్ మినరల్స్ మనకు అందకుండా వ్యూహాత్మ కంగా వ్యవహరిస్తున్నది. సామాజిక మాధ్యమాలలో భారత్‌కు వ్యతి రేకంగా పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నది.భారత్ ఏం చేయ్యాలి?గత రెండు దశాబ్దాలలో భారత్ ఎడల చైనా ప్రవర్తన, దృక్పథంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. 2000 సంవత్సరం వరకు భారత్‌ను చైనా ఒక సహ ప్రత్యర్థిగా చూసింది. 2025కల్లా అంతర్జాతీయంగా చైనా ఆర్థిక శక్తిగానే కాకుండా టెక్నాలజీ పవర్ హౌస్‌గా ఏర్పడింది. సహజంగానే భారత్ ఎడల ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నది. అమెరికా బలహీనపడటం చైనాకు కలిసి వచ్చింది. భారత్–చైనా సంబంధాలలో యూఎస్ఏ, పాకిస్తాన్ పాత్రను మనం కాదనలేము. ఇటీవల బీజింగ్ పర్యటన సందర్భంగా ట్రంప్ యూఎస్ఏ, చైనాలను జీ2గా అభివర్ణించాడు. అంటే యూఎస్ఏ, చైనాలే అగ్రరాజ్యాలని ప్రకటించాడు. అయితే, చైనాను ప్రాంతీయంగా బలహీన పరచటానికి అమెరికా భారత్‌ను సమర్థిస్తుందనీ, అమెరికాను ఎదుర్కోవటానికి చైనా భారత్‌తో చేతులు కలుపుతుందనీ మరొక వాదన. చైనాతో సంబంధాల విషయంలో భారత్ ఈ వాదనల ఆధారంగా సిద్ధాంత రూపకల్పన చేయటం అవివేకం. చైనాతో సంబంధాల విధాన రూపకల్పన అమెరికన్ సిద్ధాంతాల ఆధారంగా కాకుండా మన దేశ శక్తి, సామర్థ్యాలు, స్థిరత్వం, అభివృద్ధి అవసరాల ఆధారంగానే జరగాలి.భారత్‌కు కొన్ని ముఖ్యమైన అంశాల్లో స్పష్టత అవసరం. మన లక్ష్యం ప్రాంతీయ హోదానా? సరిహద్దు సమస్య పరిష్కారమా? సరి హద్దులలో ప్రశాంతతనా? అంతర్జాతీయంగా చైనాను బలహీనపర చటమా? ఏ అంశాల విషయంలో భారత్ రాజీపడదనే విషయంలో చైనాకు భారత్ స్పష్టతనివ్వాలి. కవ్వింపు చర్యలు, పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక భూభాగాల నుండి భారత్‌ను అస్థిరపరచే కుట్రల విషయంలో భారత్ రాజీ పడదు. ద్వైపాక్షిక సంబంధాలలో భారత్‌ను సమవుజ్జీగా పరిగణించాలి. అయితే, చైనా ధోరణి ఎప్పటికైనా మన బలంపైనే ఆధారపడి ఉంటుంది. బలమైన భారత్ మాత్రమే చైనాకు సరైన సమాధానం. ముఖ్యంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థ చైనాకు కంటగింపుగా ఉన్నది. ఈ విషయంలో భారత్ అప్రమత్తంగా ఉండాలి. చైనా పెట్టు బడులకు మళ్లీ పచ్చజెండా ఊపాలంటే వాణిజ్య లోటును పరిగణన లోనికి తీసుకోవాల్సిందే. భారత జెనరిక్ ఔషధాలు, ఐటీ సేవలను ఎగుమతి చేయటానికి చైనాపై ఒత్తిడి తేవాలి. 21వ శతాబ్దం చైనా శతాబ్దం కాకూడదు, అది ఆసియా శతాబ్దమవ్వాలి!గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
ఆరోగ్య పరిశోధనకు అనారోగ్య మార్గం?
ఆరోగ్య పరిశోధనా శాఖ ఇటీవల ఒక జాతీయ ఆరోగ్య పరిశోధనా విధానాన్ని ప్రతిపాదించింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ విభాగం దాదాపు రెండు దశాబ్దాలుగా మనుగడలో ఉన్నప్పటికీ, ఆరోగ్య పరిశోధనకు సంబంధించి దేశానికి ఇంతవరకు ఒక కట్టుదిట్టమైన విధానం ఏదీ లేదనే వాస్తవాన్ని మొదటిసారిగా ఇపుడే గుర్తించి నట్టుంది. దేశంలో ఆరోగ్య పరిశోధనకు సంబంధించి ప్రధాన బాధ్యతను భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) నిర్వర్తిస్తోంది. జాతీయ పరిశోధన–అభివృద్ధికి చెందిన నిధులలో ఆ సంస్థకు కేవలం 3.3 శాతం నిధులు మాత్రమే అందుతున్నాయని 2026 జూలైలో విడుదలైన జాతీయ ‘ఆర్ అండ్ డి’ డేటా వెల్లడించింది. రక్షణకు 32 శాతం, అంతరిక్ష పరిశోధనకు 15 శాతం అందుతున్నాయి. అసలు మొత్తం ఆర్–డిపై మన జాతీయ వ్యయం, స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.)లో చైనా (2.58 శాతం)తో పోల్చుకుంటే, నామమాత్రంగా, 0.84 శాతంగా ఉంది. బయోమెడికల్, ఆరోగ్య ఆర్–డిపై వ్యయాన్ని పెంచడం నూతన ఆరోగ్య పరిశోధనా విధాన లక్ష్యాలలో ఒకటి. ఆరోగ్య పరిశో ధనపై పెట్టుబడిని జీడీపీలో ఇపుడున్న 0.024 శాతం నుంచి 2037 నాటికి 0.072 శాతానికి, 2047 నాటికి 0.15 శాతానికి పెంచాలని సంకల్పించారు. ఇది పెద్ద అంగగానే కనిపించవచ్చుకానీ, భారత దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లతోనూ, భవిష్యత్తులో ఉండగల వ్యాధుల భారంతోనూ పోల్చుకుంటే, ఆ వ్యయం కూడా తక్కువే. పైగా ప్రతిపాదిత పెంపుదలలు సుదూర కాలానివి. పక్షపాత పరిశోధనలకు ఊతమిస్తే?దాన్నలా ఉంచితే, ప్రతిపాదిత పెంపుదల మరింత సమస్యాయుతంగా కనిపిస్తోంది. ‘ప్రభుత్వ పెట్టుబడి క్రమేపీ పెరుగుతుంది. దానికి బాధ్యతాయుతమైన ప్రైవేటు, దాతృత్వ, ప్రభుత్వేతర సంస్థల నుంచి వచ్చే పెట్టుబడి తోడవుతుంది’ అని ఆ విధానం పేర్కొంటోంది. ఆరోగ్య పరిశోధనలో ప్రైవేటు పెట్టుబడులకు ఇది అధికారికంగా ద్వారాలు తెరుస్తుంది. ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుకుంటున్న ప్రైవేటు పెట్టుబడి స్వరూప స్వభావాలు మరింత ఆందోళనకు కారణమవుతున్నాయి. ప్రైవేటు కంపెనీల నుంచి వచ్చే కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను ప్రభుత్వ సంస్థలలో ఆర్–డిపై వినియోగించేందుకు అనుమతిస్తామని ఆ విధానంలో పేర్కొన్నారు. ఈ విధానం ఇపుడున్న ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యాలకు భిన్నమైనది. కోవిడ్–19 వ్యాక్సిన్ల వంటి నిర్దిష్ట ప్రాజెక్టుల కింద ఫార్మా కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు కొత్త ఔషధాలను లేదా టీకాలను తయారు చేస్తూ వస్తున్నాయి. అది ఫార్మా లేదా మరో కంపెనీ ఏదైనా సరే ఇచ్చే సీఎస్ఆర్ నిధులతో ఓ చిక్కు ఉంది. ఒక కంపెనీ నెలకొల్పిన దాతృత్వ సంస్థ నిధులతోనైనా కూడా ఇబ్బందే. అది పక్షపాతపూరిత పరిశోధనకు దారితీయవచ్చు. పర్యావరణ ఆరోగ్యం (వాయు కాలుష్యం, పొగాకు, ఆల్కహాల్ ప్రభావాలు), కొన్ని వృత్తి ఉద్యోగాల్లో ఆరోగ్యంపై పడే ప్రభావం, ఆహార భద్రత, వాతావరణ మార్పు వంటి వివాదాస్పద అంశాలలో జరిగే పరిశోధ నలలో రహస్య అజెండా దాగుండొచ్చు. ‘శాస్త్రీయ సందేహా’లను సృష్టించవచ్చు. కొన్ని అగ్రశ్రేణి ఆరోగ్య ఎన్జీవోలు, ప్రజారోగ్య సంస్థలు క్షేత్ర స్థాయిలో చేసే పరిశోధనా అధ్యయనాలకు విదేశీ మారక ద్రవ్య నిబంధనల పేరుతో ప్రభుత్వం ఓపక్క అడ్డంపడుతూ, మరోపక్క ఆరోగ్య పరిశోధనలు నిర్వహించేందుకు పరిశ్రమలకు, విదేశీ ఫౌండేషన్లకు ద్వారాలు తెరవడం విడ్డూరం. విశ్వాసాలకు శాస్త్రీయ ముసుగుఈ మొత్తం విధానం ఆరోగ్య పరిశోధనను అన్ని స్థాయుల్లోనూ అధికార యంత్రాంగంతో ముడిపెడుతూ కేంద్రీకృతం చేసేదిగా ఉంది. జాతీయ ఆరోగ్య పరిశోధనా అజెండా స్థూల స్థాయిలో ప్రాధాన్యాలను నిర్దేశిస్తుందనీ, అ అజెండాను మూడు అంచెల పాలనా వ్యవస్థ అమలుజరుపుతుందనీ కొత్త విధానం చెబుతోంది. నూతన ఆరోగ్య పరిశోధనా సారథ్య కమిటీ అత్యున్నత స్థాయిలో ఉండి, వ్యూహాత్మక దిశా నిర్దేశాన్ని అందిస్తుంది. దానికి ముఖ్య శాస్త్రీయ సలహా మండలి నేతృత్వం వహిస్తుంది. దానిలో ప్రభుత్వాధికారులు (వైజ్ఞానిక శాఖల కార్యదర్శులు) సభ్యులుగా ఉంటారు. రెండవ అంచెలో ఆరోగ్య పరిశోధనా విభాగం సెంట్రల్ నోడల్ ఇంప్లిమెంట్ ఏజెన్సీగా పనిచేస్తుంది. శాస్త్రీయ–సాంకేతిక అమలు బాధ్యతలను మూడవ అంచెలో భారతీయ వైద్య పరిశోధనా మండలికి అప్పగిస్తారు. ప్రజారోగ్యం ప్రాథమికంగా రాష్ట్రాల జాబితాలోకి వస్తుంది. వైద్య విద్య–పరిశోధన ఉమ్మడి జాబితాలోకి వస్తాయి. కానీ, ప్రతిపాదిత పాలనా వ్యవస్థ రాష్ట్రాల పాత్రను తగ్గించేదిగా ఉంది. ఆరోగ్య పరిశోధనా అజెండాను కేంద్ర సారథ్య కమిటీకి అప్పగించడం వల్ల రాష్ట్రాల పాత్ర కేవలం అమలు చేయవలసినదిగా మారు తుంది. ప్రతిపాదిత ఆరోగ్య పరిశోధనా విధానం మరో ముఖ్యమైన మార్పునకు సంకేతంగా నిలుస్తోంది. ‘సమీకృత ఆరోగ్యం’ ముసుగులో ఆధునిక వైద్యానికి ఉద్దేశించిన పరిశోధనా నిధులను ఆయుర్వేదం, ఇతర వైద్య విధానాలను అనుసరించే సంస్థలు కూడా వినియోగించుకోవచ్చు. నిజానికి, అటువంటి సంస్థలు ఆయుష్ మంత్రిత్వ శాఖ, అది నిర్వహిస్తున్న యంత్రాంగాల నుంచి పరిశోధనా నిధులను ఇప్పటికే అందుకుంటున్నాయి. ఇది తిరిగి పాత పద్ధతులు, విశ్వాసాలు, అభిప్రాయాలను ధ్రువీకరించే ఉద్దేశంతో చేసే పరిశోధనలకు ఊతం ఇస్తుంది. గోమూత్రం వంటివి ఆధునిక పరిశోధనకు లోనవుతాయి. శాస్త్ర–సాంకేతిక పరిశోధన శాఖ వంటి ఇతర పరిశోధనా ఏజెన్సీలు ఇస్తున్న నిధులతో అటువంటి ప్రాజెక్టులు ఇప్పటికే నడుస్తున్నాయి. రాష్ట్రాల అవసరాలకు తగ్గట్టుగా...మన దేశం భౌగౌళికంగా, సాంస్కృతికంగా మాత్రమే వైవిధ్య భరితమైనది కాదు. దాని ఆరోగ్య అవసరాలు కూడా భిన్నమైనవి. వివిధ చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉండటంలో తారతమ్యాలున్నాయి. బిహార్ లేదా ఒడిశా వంటి రాష్ట్రాలతో పోలిస్తే కేరళ ఆరోగ్య సవాళ్ళు పూర్తిగా భిన్నమైనవి. ‘పైనుంచి–కింద’కు అనే అజెండాను రాష్ట్రాలు అమలు చేయక తప్పని స్థితిని కల్పించే బదులు, రాష్ట్రాలు వాటి ప్రాధాన్యాలు, అవసరాల ఆధారంగా సొంత ఆరోగ్య పరిశోధనా మౌలిక వసతులను అభివృద్ధి చేసు కునేలా నిధుల రూపంలో చేయూతనందిస్తే బాగుంటుంది. ఆరోగ్య పరిశోధన అంటే కేవలం కొత్త టెక్నాలజీలను పరీక్షించడం లేదా కొత్త టీకాలు, మందులను తయారు చేయడమే కాదు; పరిశోధన ఫలితాలు ఆరోగ్య విధానాలు, బడ్జెట్లకు దారి చూపాలి. ఆరోగ్య పరిశోధన ఒక నిరంతర, గతిశీల ప్రక్రియ. అది సామాజిక–ఆర్థిక అంశాలతో సన్నిహితంగా ముడిపడి ఉంటుంది. పట్టణాల్లో ఉండే పేదలు, గిరిజనులు వంటి అనేక బడుగు, బలహీన వర్గాల ఆరోగ్య సమస్యలు తరచు పరిశీలనకు నోచుకోవడం లేదు. ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో వైద్య కళాశాలలను తెరిచారు. తమతమ ప్రాంతాల్లో ఉండే ఆరోగ్య సమస్యలపై పరిశోధన సాగించే విధంగా వాటికి దిశా నిర్దేశం చేయాలి. ఆరోగ్య పరిశోధనకు అంకితమైన ఒక విధానాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే పరిశోధన అజెండాను రూపొందించేందుకు కేంద్రీకృత విధానాన్ని అనుసరించడం, ప్రైవేటు రంగానికి ప్రముఖ పాత్ర కల్పించడం, ఆధునిక వైద్య పరిశోధనా అజెండాకు సమీకృత సంప్రదాయ వైద్యాన్ని జోడించడం వంటివాటితో ఈ విధానం తీసుకుంటున్న దిశ మాత్రమే అనారోగ్యకరంగా కనిపిస్తోంది.దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
ద్రవ్యోల్బణ సూచీలు – దాక్కుంటున్న ధరలు
భారత్ ఇటీవలే వినియోగదారుల ధరల సూచీ (కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ –సీపీఐ)కి కొత్త రూపం ఇచ్చింది. 2012ను ఆధార సంవత్సరంగా తీసుకున్న పాత శ్రేణి స్థానంలో, 2024ను ఆధార సంవత్స రంగా తీసుకున్న కొత్త శ్రేణి 2026 ఫిబ్రవరిలో అమల్లోకి వచ్చింది. గృహ వినియోగ వ్యయ సర్వే 2023–24 ఆధారంగా వినియోగ బుట్టను, దాని బరువులను పునర్నిర్మించారు. అయితే, ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణ సూచీలు ఒక కుటుంబం ప్రత్యక్షంగా అనుభవించే ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా ప్రతి బింబించడం లేదనే వాదన కొన్ని వర్గాల్లో ఉంది. ఉదాహరణకు, ఆగస్ట్ 12న విడుదలైన జూలై నెల సీపీఐ సూచీ రిటైల్ ద్రవ్యోల్బణం రేటును 4.45 శాతంగా, పట్టణ ప్రాంత ఆహార ద్రవ్యోల్బణం రేటును 5.05 శాతంగా చూపించింది. వాస్తవానికి తాము మోస్తున్న ధరల భారం మరింత ఎక్కువని కొందరు భావిస్తున్నారు. వాస్తవానికి సీపీఐ తప్పుగా లెక్కించబడటం లేదు. అయితే, సీపీఐ ఒక సగటు వినియోగ బుట్ట ఆధారంగా దేశంలోని కుటుంబాలందరికీ ద్రవ్యోల్బణ రేటును సూచిస్తుంది. కానీ ప్రతి కుటుంబం ఒకే వస్తువులను, ఒకే పరిమాణంలో, ఒకే ధరకు కొనదు. అందువల్ల అధికారికంగా సూచించే ద్రవ్యోల్బణం, కుటుంబం అనుభవించే ద్రవ్యోల్బణం కొంత భిన్నంగా ఉండవచ్చు.ఒకే బుట్ట... భిన్నమైన కుటుంబాలుద్రవ్యోల్బణాన్ని కొలవడానికి, ప్రజలు సాధారణంగా కొనుగోలు చేసే వస్తువులు, సేవలను ఒక ‘వినియోగ బుట్ట’గా వర్గీక రిస్తారు. పాత శ్రేణిలోని 299 వెయిటెడ్ వస్తువుల స్థానంలో కొత్త శ్రేణిలో 358 వస్తువులు చేరాయి. ప్రతి వస్తువుకు, కుటుంబాల మొత్తం వినియోగ వ్యయంలో దాని ప్రాధాన్యతకు అనుగుణంగా ఒక బరువు కేటాయిస్తారు. వాటి ధరల మార్పును ఈ బరువుల దామాషాలో గణించి సీపీఐని లెక్కిస్తారు. గృహ వినియోగ వ్యయ సర్వే 2023–24 ప్రకారం, సగటున భారతీయ కుటుంబం తన వినియోగ వ్యయంలో దాదాపు 40–50 శాతం ఆహారంపైనే ఖర్చు చేస్తోంది. అయితే తక్కువ ఆదాయ కుటుంబాలు ఆహారంపై తమ వినియోగ వ్యయంలో ఎక్కువ భాగం ఖర్చు చేయడం వల్ల, ఆహార ధరలు వేగంగా పెరిగినప్పుడు, వారిపై సగటు సూచీ చూపే ద్రవ్యోల్బణం కంటే అధిక భారం పడుతుంది. ధరల కారణంగా ఒక కుటుంబం పామాయిల్ కొనడం తగ్గించి, వేరుశనగ నూనెకు మారిందనుకుందాం. కానీ, వెంటనే సూచీ బరువులు మారవు. అందువల్ల వినియోగ బుట్టలోని వస్తు వులు, వాటి బరువులను ఒకసారి సవరించి సుదీర్ఘకాలం కొనసాగించే బదులు, వినియోగ వ్యయ సర్వేల ఆధారంగా మరింత తరచుగా బరువులను పునఃసమీక్షించే విధానం అవసరం. భారత్ కొత్త సీపీఐలో 2024ను ఆధార సంవత్సరంగా ఎంచుకోవడం ద్వారా ఈ దిశగా ముందడుగు వేసింది.ధర మారకపోయినా... ఖర్చు పెరగవచ్చుఇటీవలి కాలంలో సూపర్ మార్కెట్లలో తరచూ చూస్తున్న ‘ష్రింక్‌ఫ్లేషన్’ మరో సమస్య. నిత్యావసరమైన ‘పాలు’ ఉదాహర ణగా తీసుకుందాం. 500 మిల్లీలీటర్ల ఉత్పత్తి స్థానంలో అదే ధరకు 400 మిల్లీలీటర్లు లభిస్తే, ధర పెరగకపోయినా వినియోగదారుడి వాస్తవ ఖర్చు పెరుగుతుంది. సీపీఐలో ఉత్పత్తి పరిమాణం లేదా ఉత్పత్తి లక్షణాలు మారినప్పుడు దాన్ని పరిగణనలోకి తీసుకునే విధానం ఇప్పటికే ఉంది. అయితే వేలాది ఉత్పత్తుల ప్యాక్ పరిమాణాలు మారుతూ ఉండే రిటైల్ మార్కెట్లో, ఇటువంటి మార్పులను సకాలంలో గుర్తించి, యూనిట్ ధరలో వచ్చిన మార్పును త్వరితంగా నమోదు చేయడానికి ఈ–కామర్స్, రిటైల్ స్కానర్ డేటాను విస్తృతంగా ఉపయోగించాల్సి ఉంటుంది. బ్రిటన్ 2026లో గ్రోసరీ స్కానర్ డేటాను సీపీఐలో ఇముడ్చుతూ, పరిమాణ మార్పులను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. వస్తువుల నాణ్యత మారినప్పుడు కూడా కొత్త సీపీఐలో నాణ్యత సర్దుబాటుకు ప్రత్యేక విధానం ఉంది. అయితే స్మార్ట్ఫోన్లు, కంప్యూ టర్లు వంటి వేగంగా మారే ఉత్పత్తుల్లో కెమెరా సామర్థ్యం, స్టోరేజ్, ప్రాసెసింగ్ వేగం వంటి లక్షణాల విలువను, బ్రిటన్ , అమెరికాల తరహాలో విడివిడిగా అంచనా వేసే ‘హెడానిక్ ప్రైసింగ్’ (వస్తువు ధరలో దాని వివిధ లక్షణాల వాటాను విడిగా అంచనా వేసే పద్ధతి)ని విస్తృతంగా ఉపయోగిస్తే, ఉత్పత్తుల ధరల్లో వచ్చిన వాస్తవ మార్పులను సూచీలు మరింత నిక్కచ్చిగా ప్రతిబింబించగలవు.జాతీయ సగటు సరే, మా ఇంటి పరిస్థితేంటి?మొదట, ప్రస్తుత జాతీయ సీపీఐకి తోడుగా వివిధ ఆదాయ వర్గాలకు ప్రత్యేక వినియోగ బరువులతో సూచీలను రూపొందిస్తే, ధరల పెరుగుదల దిగువ, మధ్య, ఎగువ ఆదాయ కుటుంబాల జీవనవ్యయాన్ని విడివిడిగా, మరింత కచ్చితత్వంతో చూపిస్తుంది. రెండవది, ప్రతి కుటుంబానికి వ్యక్తిగత ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసే డిజిటల్ సాధనాన్ని ప్రభుత్వం అందించవచ్చు. ఒక కుటుంబం ఆహారం, ఇంధనం, విద్య, ఆరోగ్యం, అద్దె తదితరాలపై తన నెల వారీ వినియోగాన్ని, ఖర్చును నమోదు చేస్తే, అదే సీపీఐ ధరల డేటాను ఉపయోగించి ఆ కుటుంబం ప్రత్యక్షంగా అనుభవించే వాస్తవ ద్రవ్యోల్బణాన్ని లెక్కించవచ్చు. అటువంటి సూచీ వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలకు దోహదపడుతుంది. కెనడాలో ఇప్పటికే ఇలాంటి అధికారిక వ్యక్తిగత ద్రవ్యోల్బణ కాలిక్యులేటర్ ఉంది. మూడవది, ధరల పెరుగుదలతో పాటు పన్నుల అనంతరం మిగిలే ఆదాయంలో మార్పును కూడా పరిగణనలోకి తీసుకుని, ఒక కుటుంబం వాస్తవంగా ఎంత కొనుగోలుశక్తిని కోల్పోయిందో లేదా పొందిందో చూపించే ‘నికర వాస్తవ కొనుగోలు శక్తి సూచీ’ని అభివృద్ధి చేయవచ్చు. ఆదాయంలో మార్పు, ప్రత్యక్ష పన్నుల భారం వంటి అంశాలను సమన్వయం చేసే ఈ సూచీ, ‘నా ఆదాయం పెరిగినా నా చేతిలో మిగిలే డబ్బు ఎందుకు పెరగడం లేదు?’ అనే సామాన్యుడి ఆవేదనకు గణాంకపరమైన సాంత్వన చేకూర్చుతుంది. భారత్ కొత్త ద్రవ్యోల్బణ శ్రేణిలో 1,465 గ్రామీణ, 1,395 పట్టణ మార్కెట్లతో పాటు 12 ఆన్ లైన్ మార్కెట్ల నుంచి ధరలను, ఈ–కామర్స్, టెలిఫోన్ , విమాన ప్రయాణం, ఓటీటీ వంటి విభా గాల్లో ఆన్ లైన్ డేటాను కూడా ఉపయోగిస్తోంది. తదుపరి దశలో జీఎస్టీ, ఈ–ఇన్ వాయిస్ డేటా, ఈ–కామర్స్ విక్రయాలు, రిటైల్ స్కానర్ డేటా వంటి వనరులను... ధరలతో పాటు కొను గోలు పరిమాణాలను అంచనా వేయడానికి ఉపయోగిస్తే ష్రింక్ ఫ్లే్లషన్ వంటి ధోరణుల ప్రభావాన్ని కూడా మరింత కచ్చితత్వంతో అంచనా వేయవచ్చు. కొన్ని యూరోపియన్ దేశాలు ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చాయి.కృష్ణ బాలాజి పల్లపోతువ్యాసకర్త బ్యాంకింగ్ రంగ నిపుణులు -
సరైన దారిలో 'కాక్రోచ్ సీజన్ 2'
దేశం ఈ నెల 15న 80వ స్వాతంత్య్ర సంవత్సరంలోకి ప్రవేశించిన వేళ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఒక అపూర్వమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాని పేరు ‘స్కూల్స్ ఠీక్ కరో’, లేదా ‘ఫిక్స్ రూరల్ గవర్నమెంట్ స్కూల్స్’. సీజేపీ ఉద్యమం మొదలైందే విద్యారంగ సమస్యలపై. ఈ దేశ భవిష్యత్తు ఆధారపడింది విద్యా వ్యవస్థపై అనీ, అది పేదలకూ, గ్రామీణులకూ అందుబాటులో లేకుండా పోయిందనీ, కనుక ఈ సమస్యపై మొత్తం దేశాన్ని కదిలించేందుకు ప్రయత్నించగలమనీ నిర్వాహకులు ప్రకటిస్తున్నారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో మొదటి రెండు రోజులపాటు జరిగిన కార్యక్రమాల వీడియోలు, వార్తలు అందుబాటులోకి వస్తున్నాయి. సీజేపీ వ్యవస్థాపకుడైన అభిజీత్ దీప్కే తన స్వస్థలమైన ఛత్రపతి శంభాజీ నగర్‌లోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లల మధ్య కూర్చుని, వివిధ సౌకర్యాలు, బోధనా పరిస్థితుల గురించి వారిని చిన్న చిన్న ప్రశ్నలు వారి మాతృభాష మరాఠీలో అడుగుతూ నోట్స్ రాసుకోవటం కన్పించింది. ఆ పిల్లలు ఉత్సాహంగా చెప్తున్నారు. అదే రోజున సీజేపీ ఇతర బాధ్యులు, ఇంకా వందలాది మంది కార్యకర్తలు వేర్వేరు రాష్ట్రాలలోని వేర్వేరు గ్రామాలలో అదే పని చేశారు. నూతన ఉద్యమ వాతావరణంగమనించదగిన విశేషం మరొకటి జరిగింది. జంతర్ మంతర్ ఉద్యమస్ఫూర్తితో అంతటా ఒక కొత్త వాతావరణం ఏర్పడినందున, అనేకచోట్ల సీజేపీ బాధ్యులెవరూ లేకుండానే బడిపిల్లలు ఈ ‘స్కూల్స్ ఠీక్ కరో’ కార్యక్రమం గురించి విని, తమంతట తామే తమ బడులలో వివిధ సౌకర్యాల లేమిపై పాఠశాల పెద్దలనే కాక, సమీపాన గల ప్రభుత్వ అధికారుల వద్దకు వెళ్లి ప్రశ్నించటం కనిపించింది. ఇదే చైతన్యం దేశమంతటా వ్యాపిస్తే? వ్యాపింపజేయటమే జంతర్ మంతర్ తర్వాత తమ తదుపరి కార్యక్రమమని సీజేపీ ప్రకటించింది. దానిని ‘సీజన్–2’ ఉద్యమ మంటున్నది. అందులో భాగంగా చేపట్టే కార్యక్రమం కోసం ఒక ఫారాన్ని తమ వెబ్సైట్లో పెట్టింది. దాని ద్వారా ఎవరైనా సభ్యు లుగా చేరి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. యథాతథంగా కార్యక్రమంలో చేయవలసిన పనులు మూడు విధాలు. ఒకటి– మంచినీళ్ళు, టాయిలెట్ సౌకర్యాల పరిస్థితి.రెండు– విద్యుత్తు, తరగతి గదులు, వాటి భద్రత. మూడు– ప్రహరీ గోడలు, భద్రత. ఇదంతా మొదటి విధమైన పని. రెండవ విధమైన దానిలో కార్యకర్తలు లైట్లు, ఫ్యాన్లతో సహా వీట న్నింటిని ఫొటోలు, వీడియోలు తీయాలి. అగ్నిమాపక సిలిండర్లు ఉన్నాయో లేదో చూడాలి. మూడవ విధమైన పని ఈ వివరాలన్నీ అధికారులకు అందజేయటంతో పాటు, సీజేపీ అడ్రసుకు అప్లోడ్ చేయాలి. మన దేశం స్వతంత్రమైనప్పటినుంచి విద్యారంగానికి సంబంధించి ఆధా రాలతో అధికారులను ఒత్తిడి చేయటం వంటి కార్యక్రమం దేశ వ్యాప్తంగా ఎన్నడూ జరగలేదు. గమనించదగిన మరొకటి, నెహ్రూ కాలంలోనూ ఉన్నత విద్యపై తప్ప గ్రామీణ విద్యపై, ప్రాథమిక విద్యపై తగిన శ్రద్ధ చూపలేదు.అయినా అణచివేతలా?సీజేపీ కార్యక్రమం ఏ విధంగా సాగి ఎటువంటి ప్రభావాలు చూపగలదో ఇప్పుడే చెప్పలేము. విద్యారంగానికి సంబంధించి వారి అవగాహనలు, ఆలోచనలు, లేవనెత్తుతున్న ప్రశ్నలు, తలపెట్టిన కార్యక్రమాలు మాత్రం సమగ్రంగా కనిపిస్తున్నాయి. వాటిలో లోతు, దూరదృష్టి ఉన్నాయి. విద్యార్థి లోకంలో, వారి తండ్రులలో, సమా జంలో, ఆలోచనాపరులలో మద్దతు పెరుగుతున్నది. మరొక విషయం, ఆ నిర్వాహకులపై, వారి కార్యక్రమాలపై వ్యతిరేకత, అణచివేత చర్యలు జంతర్ మంతర్ దశ తర్వాత కూడా కొనసాగు తుండటం. ఉదాహరణకు, తమ ‘స్కూల్స్ ఠీక్ కరో’ కార్యక్రమ ప్రకటనకు ఢిల్లీలో కార్యకర్తల సమావేశాన్ని జరపచూడగా, అందు కోసం హాలును ఇవ్వకుండా యజమానులను బెదిరించారు. చివరకు ఒక పార్కులో సమావేశమవుతుండగా పోలీసులను పంపి గేట్లకు తాళాలు వేశారు. గట్టిగా ప్రశ్నించిన మీదటగానీ తెరవలేదు. ఇటువంటి నిర్హేతుకతలు, అణచివేతల ప్రభావం, దేశమంతటా ఇప్పటికే జంతర్‌మంతర్ సృష్టించిన ప్రభావాలను మరెంత పెంచు తుందో అధికారంలో గల వారికి అర్థం కావటం లేదు. జంతర్ మంతర్ దరిమిలా స్వయంగా ప్రధాని మోదీ, ఆరెస్సెస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ విద్యారంగం గురించీ, యువ తరం అసంతృప్తి న్యాయబద్ధం కావటం గురించీ చెప్పిన మాటలను గమనించినప్పుడు, ఈ అణచివేతలు విచిత్రంగా తోస్తాయి.ప్రభుత్వ విద్యారంగం బాగుపడక ప్రైవేట్ రంగం మాత్రమే వర్ధిల్లినంత కాలం సాధారణ కుటుంబాల పిల్లలు చదువులో ముందుకుపోలేరు. అందువల్ల వారికేగాక దేశానికి కూడా నష్టమే. కనుక విద్యారంగానికి బడ్జెట్లను జీడీపీలో ఆరు శాతానికే కాదు,అంతకు మించి పెంచాలి. నివేదికలను అమలుపరచాలి. ప్రభుత్వ స్కూళ్లలో అన్ని వసతులు కల్పించి విద్యాబోధనను మెరుగుపర చాలి. ఈ దిశలో తమ తొలి దశ కార్యక్రమాన్ని ఆరు మాసాలపాటు సాగి స్తారు. ఇది క్రమంగా ఊపందుకుని దేశవ్యాప్తమైన కొద్దీ కొత్త పరిస్థితులను చూడగలమని ఆశించవచ్చు. వారు మూతపడిన 94 వేల స్కూళ్ల గురించి కూడా ప్రశ్నిస్తున్నందున వాటిని తిరిగి తెరవటం, ఇక ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మూసివేత లను కొనసాగించకపోవటం కూడా జరుగుతుందని ఆశించాలి.క్యా బోల్తీ పబ్లిక్?పోతే, కాక్రోచ్ సీజన్ 2 సరైన మార్గంలో ముందుకు సాగుతున్న సూచనలు ఇతరత్రా కూడా ఉన్నాయి. వారి కోర్ కమిటీ ఈ నెల మొదటి వారంలో రెండు రోజులపాటు చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. తాము విద్యతో పాటు ప్రజలకు సంబంధించిన ఇతర సమస్యలపై ప్రభుత్వాలను ఒత్తిడి చేసే ఉద్యమంగానే ఉంటాము తప్ప రాజకీయాలలోకి ప్రవేశించబోమన్న అంతకుముందటి వైఖరినే పునరుద్ఘాటించటం వాటిలో మొదటిది. అందువల్ల వారి విశ్వసనీయత పెరిగి, పునాది స్థిరపడి విస్తరిస్తుంది. అదే సమావేశంలో సంస్థ బాధ్యుల టీమ్‌ను ప్రకటించటంతోపాటు, దేశాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించి నలుగురు ఇన్ఛార్జ్లను నియమించుకున్నారు. కార్యాచరణకు సంబంధించి, ఈ సెప్టెంబర్ నుంచి, దేశమంతటా పర్యటనలు జరిపి ‘క్యా బోల్తీ పబ్లిక్’ పేరిట అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలూ, ఆలోచనలేమిటి? ఏమి జరగాలనుకుంటున్నారు? అనేవి తెలుసుకోవటం; దాని ఆధారంగా భవిష్యత్తు అజెండాలను, కార్యాచరణను రూపొందించటం.ఎంతో సంయమనంతో, ప్రజాస్వామికంగా, శాంతియుతంగా ప్రజలతో సమన్వయమవుతూ ముందుకు సాగేందుకు సీజేపీ ప్రయత్నిస్తున్న తీరును, అందుకు సమాజంలో కనిపిస్తున్న సానుకూలతలను గమనించినప్పుడు, మన దేశపు 80వ స్వాతంత్య్ర సంవత్సరంలో కొత్త గాలులు మొదలుకానున్నాయా అనే సూచనలు కనిపిస్తున్నాయి. స్వాతంత్య్రానంతర దేశం 1991 నాటి ఆర్థిక సంస్కరణలతో ఒక కొత్త మలుపు తిరగగా, ఈ 2026లో మరొక మలుపు తిరిగే అవకాశమున్నదా? ఈ ప్రశ్నలు ఇప్పటికే ఆలోచనా పరుల మెదళ్లకు మేతగా మారాయి.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
సమస్య వైపు పరుగెత్తు!
నేను చాలా ప్రసంగాలు చేశాను. కానీ ఇది నాకు వ్యక్తిగతమైనది. 1986 చలికాలంలో మిట్లో చేరాను. నా తల్లిదండ్రులు నన్ను నెక్ట్స్ హౌస్ హాస్టల్లో దింపి వెళ్లారు. అప్పుడు నాకు 17 ఏళ్లు. నేను తైవాన్‌లో పుట్టాను. అమెరికాలోని క్వీన్స్ ప్రాంతంలో పెరిగాను. గణితంలో నేను దిట్ట అని నమ్మేదాన్ని! కానీ రెండు వారాల్లోనే ఒక విషయం అర్థమైంది: ఎంఐటీలో గణితంలో అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు! మొదటి అసైన్మెంట్లను చూస్తూ అనుకున్నాను: ‘అయ్యో! ఇవి ఎంతో కష్టంగా ఉన్నాయి!’ నేను కాలేజీకి (ఫ్రెష్మన్ ఇయర్‌కు) వచ్చేవరకు ఎప్పుడూ రాత్రంతా నిద్రలేకుండా చదవడం లేదా పనిచేయడం అనేది లేదు. మిట్లో చేరాక ఆ అనుభవం కొత్తగా ఉన్నా... క్లాస్‌మేట్స్‌తో కలిసి పని చేయడం సరదాగా అనిపించింది. మిట్ మనల్ని ఊహించిన దానికంటే ఎంతో ముందుకు తీసుకెళ్లే ఒక అద్భుతమైన మార్గాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ మీరు సమస్యలతో కుస్తీ పడతారు. ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఒకటి రెండు సర్క్యూట్లు పేలిపోవచ్చు. కానీ ఏదోలా చివరకు ఆ పని పూర్తవుతుంది. అప్పుడు మీరే స్వయంగా ఏదో ఒకటి తయారు చేయగలరని మీకు అర్థమవుతుంది. సెమీకండక్టర్లతో ప్రేమమిట్లో డిగ్రీ (అండర్ గ్రాడ్యుయేట్) చదువుతున్నప్పుడే రీసెర్చ్‌లో పనిచేసే అవకాశం రావడం నా జీవితాన్నే మార్చేసింది. ఎక్స్–రే లిథోగ్రఫీ మాస్క్ బ్లాంక్స్ తయారు చేయడం ఆ ప్రాజెక్ట్ ఉద్దేశం. అప్పట్లో దాని అర్థం ఏమిటో కూడా నాకు పూర్తిగా తెలి యదు. కానీ నా మొదటి ‘బన్నీ సూట్’ (క్లీన్ రూమ్‌లో వేసుకునే ప్రత్యేక దుస్తులు) వేసుకుని... చిన్న 2–అంగుళాల వేఫర్లపై పరికరాలు తయారు చేయడం ప్రారంభించాను. ఆ వేఫర్లు సున్నితంగా ఉంటాయనీ, పొరపాటున కూడా వాటిని పగలగొట్టకూదడనీ త్వరగానే గ్రహించాను. నేను ఎన్నో ప్రయోగాలు చేశాను. వాటిలో ఎక్కువ శాతం మేము ఆశించిన విధంగా పనిచేయలేదు. పద్ధతి మార్చుకుని, మళ్లీ ప్రయత్నించాం. నేను తరగతి గదిలో టెక్నాలజీ గురించి చదవడం మాత్రమే చేయలేదు; కొత్త విషయాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్న ఒక బృందంలో భాగమయ్యాను. నాకైతే అప్పట్లో ఒకటే ఆలోచనొచ్చింది. వావ్, మనం ఇంత చిన్న వస్తువులను కూడా తయారు చేయగలమా? కానీ ప్రపంచాన్నే మార్చగల శక్తిమంతమైన చిన్న పరికరాలు ఇవి. అప్పుడే నేను సెమీ కండక్టర్లతో ప్రేమలో పడ్డాను. అక్కడే నేను సమస్యలను ఎలా పరిష్కరించాలో అసలు సిసలు పాఠాలు నేర్చుకున్నాను. ఆ రంగా నికి కొత్తగా వచ్చిన విద్యార్థి స్థాయి నుంచి, స్వయంగా ఆ రంగానికి కొత్త విషయాలు అందిస్తున్న వ్యక్తిగా మారాను. ఆ ప్రయాణంలో, నా మీద నాకు నమ్మకం కలగడం మొదలైంది. అది నాకు ఎప్పుడూ అన్ని సమాధానాలూ తెలుసనే అతివిశ్వాసం కాదు; అసలు సమాధానం ఇప్పుడే తెలియకపోయినా దాన్ని నేను కనుగొనగలను అనే ఆత్మవిశ్వాసం. మిట్ నాకు సెమీకండక్టర్ ఫిజిక్స్ కంటే పెద్ద విషయాన్ని నేర్పిందని నాకు అర్థమవుతోంది. మైండ్ అండ్ హ్యాండ్ మిట్ మోటో ‘మైండ్ అండ్ హ్యాండ్’ కేవలం ఒక నినాదం అనుకున్నాను. కానీ అది మిట్ ప్రత్యేకతను సరిగ్గా తెలియజేస్తుందని భావిస్తున్నాను. మిట్ మనకు లోతుగా ఆలోచించడం నేర్పిస్తుంది. ఏదైనా తయారు చేయడం, ఆలోచనలను పరీక్షించడం, మొదటి ప్రయోగం లేదా ఐదో ప్రయోగం కూడా విఫలమైనా ఆగిపోకుండా ముందుకు సాగడం నేర్పిస్తుంది. ఒకప్పుడు అసాధ్యమని పించిన సమస్యలను కూడా మీరు పరిష్కరించగలరని మీపై మీకే నమ్మకం కలిగేలా చేస్తుంది. నేను క్యాంపస్ వదిలి వెళ్లిన చాలా కాలం తర్వాత కూడా అదే భావనతో ఉన్నాను. నేను ఐబీఎంలో చేరినప్పుడు,మళ్లీ మొదటి నుంచి ప్రారంభించినట్లు అనిపించింది. ఐబీఎంలో లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు. అప్పట్లో నాకు 25 ఏళ్లు.అంత పెద్ద కంపెనీలో నేను ఎలా మార్పు తీసుకురాగలను అని ఆశ్చర్యపోయాను. కానీ త్వరగా ఒక ముఖ్యమైన విషయం తెలుసు కున్నాను. ఇంజినీరింగ్ మీ వయసును పట్టించుకోదు. మీ ఆలోచ నలు పనికొస్తాయా లేదా అనేదే చూస్తుంది. నా మెంటార్లలో ఒకరు నాకు చెప్పిన ఒక మాటను నేను ఎప్పటికీ మర్చిపోలేదు: అత్యంత కష్టమైన సమస్యల వైపు పరు గెత్తుకుంటూ వెళ్లు! అప్పట్లో అది నాకు పూర్తిగా అర్థం కాలేదు. కాలక్రమేణా, నా జీవితంలో లభించిన అత్యుత్తమ సలహా అదేనని అర్థమైంది. కష్టమైన సమస్యలే మీ అసలు సత్తా ఏమిటో మీకు తెలియజేస్తాయి. కొంచెం వెనక్కు వెళ్తే... 12 ఏళ్ల క్రితం, ఆ పాఠాన్ని నిజ జీవితంలో పరీక్షించి చూసే అవకాశం వచ్చింది. నాకు ఏఎండీ సంస్థకు సీఈఓ అయ్యే అవకాశం లభించింది. ఆ ఉద్యోగంలో చేరడం రిస్క్ అని నా మెంటార్లలో కొందరు భావించారు. కానీ ఇది నా డ్రీమ్ జాబ్ (కలల ఉద్యోగం). నిజంగా ప్రాముఖ్యత ఉన్న సమస్యలపై,సాంకేతిక రంగంలో కొత్త టెక్నాలజీతో పనిచేసే అవకాశం. భవి ష్యత్తులో అత్యంత కీలకమైన సాంకేతికత హై–పెర్ఫార్మెన్స్ కంప్యూ టింగ్ (అధిక పనితీరు గల కంప్యూటింగ్) అని మేము దీర్ఘకాలికంగా నమ్మాం. మా ప్రతిభావంతులైన బృందానికి పెద్ద ఆలోచనలు చేసే స్వేచ్ఛను ఇచ్చాం. తదుపరి కొన్ని సంవత్సరాలలో, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కంప్యూటర్లను తయారు చేయడానికి వీలుగా మేము టెక్నాలజీని అభివృద్ధి చేశాం. భవిష్యత్‌ను నిర్ణయించేది మనుషులే!గడచిన కొన్ని దశాబ్దాలలో మనం అనేక సాంకేతిక మార్పులను చూశాం. ఇప్పుడు ఏఐ విప్లవానికి ప్రారంభంలో ఉన్నాం. ఏఐ మనుషులను భర్తీ చేయదు. బదులుగా, ప్రతి ఒక్కరి సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. వైద్యం, శాస్త్రం, ఇంధనం, వాతావరణం– ఏ రంగంలోనైనా, మనం గడిచిన ముప్పై ఏళ్లలో కనుగొన్న దానికంటే ఎక్కువ విషయాలను రాబోయే పదేళ్లలోనే కనుగొనవచ్చు. అయితే భవిష్యత్తు ఎలా ఉండాలనేది సాంకేతికత నిర్ణయించదు, మనుషులే నిర్ణయిస్తారు. శక్తిమంతమైన పరికరాలను ఎలా ఉపయోగించాలో తెలిసిన మనుషులు ప్రపంచానికి అవసరం లేదు. వాటిని ‘దేని కోసం’ ఉపయోగించాలో తెలిసిన మనుషులు కావాలి. నన్ను ఎవరైనా కెరీర్ సలహా అడిగితే, ఒకటే చెబుతుంటాను: కష్టపడి పనిచేయండి, కానీ అదృష్టం కూడా ముఖ్యం అని గ్రహించండి. కాలక్రమేణా నేను ఒక విషయాన్ని నమ్మడం మొదలు పెట్టాను. గొప్ప వ్యక్తులు తమ అదృష్టాన్ని తమంతట తామే సృష్టించుకునే మార్గాలను వెతుక్కుంటారు. అదృష్టం అంటే సరైన సమయంలో, సరైన స్థలంలో ఉండటమే కాదు. ఒక కష్టమైన పని చేయ డానికి రిస్క్ తీసుకోవడం. మిమ్మల్ని మీరు సవాలు చేసుకోవడం. మీకు తెలిసిన విషయాల హద్దులు దాటి కొత్త సమస్యలను ఎంచుకోవడం. మిమ్మల్ని మరింత మెరుగుపరిచే వ్యక్తుల మధ్య ఉండటం. ‘అవును.. మనం ఈ ప్రపంచాన్ని మార్చగలము’ అని నమ్మడం. మీరు ఎంచుకునే సమస్యల విషయంలో పెద్ద ఆశయాలు కలిగి ఉండండి. అన్నింటికంటే కష్టమైన సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రండి! -
చంద్రశేఖరన్ (‘టాటా సన్స్’ చైర్మన్) రాయని డైరీ
వంతెనపై గమ్యాన్ని చేరుకోవాలంటే, వంతెన కంటే ముందు గమ్యాన్ని నిర్మించుకోవాలి. ‘టాటా’ వంతెనపై నాది 40 ఏళ్ల ప్రయాణం. వంతెనే నా కోసం గమ్యాన్ని నిర్మించినట్లుగా సాగిన జీవన యానం! టాటాలో ఇవి నా ఆఖరు నెలలు! 2027 ఫిబ్రవరి 20 నా చివరి రోజు. టాటా మహా సముద్రంలో ఒక అల కూడా ముందస్తు ప్రణాళికతో ఉంటుంది. దేశం 2026లో ఉన్నప్పుడు టాటా 2027లో ఉంటుంది. ‘‘చంద్ర తర్వాత ఎవరు?’’ అని ఏడాది ముందే ఈ ఫిబ్రవరిలో బోర్డు రూమ్‌లోకి ఒక ‘ప్రశ్న’... బంట్రోతులా వచ్చి నిలబడింది. టాటాలో బాస్ అయినా బంట్రోతు అయినా ఒకే వంతెనపై నడుస్తారు. ప్రశ్నలు రేకెత్తిస్తున్నంత కాలమే వారు ఆ వంతెనపై నడిచేందుకు అర్హులై ఉంటారు. సమాధాన పడిపోయే వాళ్లకు టాటాలో సీటు ఉంటే ఉండొచ్చు కానీ చోటు మాత్రం ఉండదు. నువ్వు ప్రశ్నిస్తున్నావంటే పనిలో ఉన్నట్లు! నువ్వు ప్రశ్నించటం మానేశావంటే, కేవలం ఉద్యోగం చేస్తున్నట్లు! ఇదీ టాటా సిద్ధాంతం. ‘‘చంద్ర తర్వాత ఎవరు’’ అన్నప్పుడు సగం మందికి పైగా వాటాదారులు ‘‘మళ్లీ చంద్రే’’ అన్నారు. బోర్డు కూడా ‘‘మళ్లీ చంద్రే’’ అంది. బోర్డు డైరెక్టర్లలో ఒక్క నోయెల్ టాటా మాత్రమే మౌనంగా ఉండిపోయారు. ఆర్నెల్లుగా ఇప్పటికీ ఆయన మౌనంగానే ఉన్నారు! మనం పుట్టి పెరిగిన ఇల్లే అయినా, ఇంట్లో మనతో మాట్లాడని మనిషి ఒక్కరున్నా అదిక మన ఇల్లవదు. ఇంటిని ఇంటిలా ఉంచాలంటే మనమే బయటికి వచ్చేయాలి. ఊహు... వచ్చేయటం కాదు, వెళ్లిపోవటం! రతన్జీ ఉండి ఉంటే, ‘‘ఎక్కడికి వెళ్తావ్ చంద్రా ఇంత రాత్రప్పుడు?!’’ అని నన్ను ఆపి ఉండేవారా... అది మిట్ట మధాహ్నమే అయినా – నా వెనకే అడుగులు వేసుకుంటూ వచ్చి! ఎందుకు వెళుతున్నదీ ఆయన అడగరు. ‘‘వెళ్లి ఏమౌతావు?’’ అన్నదే ఎవరి గురించైనా ఎప్పుడూ ఆయన ఆందోళన. ‘‘ఇంటిని గానీ, సంస్థను గానీ, ఆఖరికి మనిషినే గానీ ఎవరైనా వదిలి వెళ్లవలసి వచ్చిందంటే... వెళ్లాక వారెలా ఉండగలుగు తారు అనే ఆలోచన రావలసింది... ఆ ఇంటికి, ఆ సంస్థకు, వదిలి వెళ్లటానికి కారణం అయిన ఆ వ్యక్తికే గానీ, వదిలి వెళ్లిపోవలసి వచ్చినవారికి కాదు’’ అనేవారు రతన్జీ! టాటా ప్రధాన కార్యాలయం ఉండే ‘బాంబే హౌస్’ రతన్‌జీకి పవిత్రాలయం. చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు, పునర్జన్మ... అన్నీ ఆయనకు బాంబే హౌసే!‘‘రతన్జీ... 90 ఏళ్లుగా ‘బాంబే హౌస్’ ఇలాగే ఉంది. కొద్దిగా మార్పులు చేస్తే బాగుంటుంది’’ అని, ‘టాటా సన్స్’ చైర్మన్‌గా నేను బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయనతో అన్నప్పుడు– ఆయన నా వైపు సౌమ్యంగా చూశారు. ‘‘మార్పులు అంటే పడగొట్టటం, తిరిగి కట్టటమే కదా చంద్రా! మరి అక్కడ నివాసం ఏర్పరచుకుని ఉన్న కుక్కల్ని, వాటి పిల్లల్ని ఏం చేస్తారు? ఖాళీ చేయించేస్తారు. అంతేకదా! అప్పుడు అవి ఎక్కడికి వెళ్తాయి? ముందు వాటికి భద్రమైన చోటు ఏర్పాటు చేయించి, ఆ తర్వాత మీ ‘పునర్నిర్మాణం’ మొదలుపెట్టండి’’ అన్నారు రతన్ జీ!!రతన్జీతో కలిసి పని చేయటం నాకొక లాంగ్ డిస్టెన్స్ మారథాన్. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన టోక్యో, బోస్టన్, లండన్, బెర్లిన్, చికాగో, న్యూయార్క్ మారథాన్లతో పాటుగా నేను పూర్తి చేసిన ఏడో మారథాన్... ‘రతన్జీ టాటా’! క్షణికమైన వేగం కంటే... అనుకున్న మార్గంలో చివరివరకు నిలబడటమే ముఖ్యం అనేవారు రతన్జీ. టాటాను వదిలి వెళ్లాలన్న నా నిర్ణయం క్షణికమైన వేగంలో తీసుకున్నది కాదు. బోర్డు తీర్మానం కోసం ఆరు నెలలు ఆగి చూసి, టాటా ప్రతిష్ఠను నిలబెట్టటానికి ఆరు నెలల ముందే, కాబోయే చైర్మన్ కోసం నా అంతట నేను పరిచిన రెడ్ కార్పెట్ అది. -
చరిత్రను మార్చిన 'పరాజితుల చరిత్ర'
1976 ఆగస్ట్ 17. సరిగ్గా యాబై సంవత్సరాల కింద. అమెరికన్ స్వాతంత్య్ర దినం (జూలై 4) ద్విశతాబ్ది వేడుకలు దేశమంతా అట్టహాసంగా జరిగి ఇంకా ఆరు వారాలు కాలేదు. ఆ రోజున ఒక పుస్తకం వెలువడింది. సుప్రసిద్ధ అమెరికన్ ప్రచురణ సంస్థ డబుల్ డే ప్రచురించిన పుస్తకం అది. పేరు రూట్స్– ద సాగా ఆఫ్ యాన్ అమెరికన్ ఫామిలీ. రచయిత ఆఫ్రికన్ అమెరికన్ బానిస సంతతి ఏడో తరానికి చెందిన అలెక్స్ హేలీ (1921–1992). ఆ పుస్తకంతో ఆయన ప్రపంచ సాహిత్యంలో విజయ పతాక ఎగరేశాడు. అమెరికా జిలుగు వెలుగుల వెనుక దాగిన అపారమైన అంధకారాన్నీ, అందవికారాన్నీ విప్పి చూపిన అత్యంత ప్రభావశీలమైన పుస్తకం అది. రెండు వందల సంవత్సరాల చరిత్రను తవ్వి తీసి, కొత్త చరిత్ర సృష్టించిన పుస్తకం అది. ఇంతవరకూ విజేతలు రాసుకుంటూ వచ్చిన చరిత్రను సవాలు చేసి, తుడిచేసి, పరాజితుల చరిత్రను రంగస్థలం మీద ప్రవేశపెట్టిన పుస్తకం అది. వెలువడిన మొదటి సంవత్సరంలోనే అమెరికన్ మార్కెట్లో అరవై లక్షల ప్రతులు అమ్ముడైన ఈ పుస్తకం, ఇప్పటికి కనీసం నలబై భాషల్లోకి అనువాదమైంది. ఎన్ని కోట్ల ప్రతులు వెలువడ్డాయో లెక్కలేదు. వెండితెర మీద, బుల్లితెర మీద కోట్లాది మందిని ప్రభావితం చేసింది. ఇంగ్లిష్‌లో వెలువడిన నాలుగు సంవత్సరాల్లోనే తెలుగులోకి సహవాసి సంక్షిప్త అనువాదంతో, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణగా ‘ఏడు తరాలు’గా వెలువడి ఇప్పటికీ పునర్ముద్రణలు పొందుతున్నది. అమ్మమ్మ చెప్పిన కుటుంబ కథమొట్టమొదట దీన్ని హిస్టారికల్ ఫిక్షన్ (చారిత్రక కల్పన) అనాలా, నాన్ ఫిక్షన్ (కాల్పనికేతర రచన) అనాలా అని చర్చ జరిగింది. అలెక్స్ హేలీ తన కుటుంబ చరిత్ర గురించి ఇంట్లో విన్న మౌఖిక ఆధారాల దగ్గర ప్రారంభించి, మూడు ఖండాలలో, అనేక చారిత్రక, ప్రభుత్వ పత్రాల, నౌకాయానాల లిఖిత ఆధారాల మీద పరిశోధన జరిపి దీన్ని రాశాడు. దొరుకుతున్న చారిత్రక సాక్ష్యాధారాలు భిన్నమైన కథనాన్ని చెపుతున్నాయని ఆ పుస్తకాన్ని ఖండించిన చరిత్ర కారులు, సామాజిక శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. మరొక పక్క, దానిలో కొంత వాస్తవ చరిత్ర ఉన్నప్పటికీ, అది నవల అని, కాల్పనిక రచన అని అనేవాళ్లు కూడా ఉన్నారు. స్వయంగా రచయిత దాన్ని ఒక కొత్త పేరుతో పిలిచాడు: అది ఫాక్ట్ (వాస్తవం), ఫిక్షన్ (కల్పన) కలిసిన ఫాక్షన్ అన్నాడు. పూర్తి వాస్తవమూ కాదు, పూర్తి కల్పనా కాదు, అద్భుత రసాయనిక సంయోజనంలో రెండూ కలగలిసిన వినూత్న రచనాశైలి. ఒక వ్యక్తి తన వంశ చరిత్రనూ, తన మూలాలనూ అన్వేషించడంలో చేసిన అపార కృషి ఫలితం. రెండు వందల సంవత్సరాల వలసవాద దుర్మార్గాన్ని కళ్లకు కట్టిన దస్తావేజు. ఒక మానవ మహా విషాద కథనం. గొప్ప మానవ సంబంధాల చిత్రణ. దుర్భేద్యమైన అవరోధాలను అధిగమించి మానవ సంకల్పం, మానవ శ్రమ, మానవ సృజనాత్మకత ఎలా విస్తరిస్తుందో సజీవంగా చూపే చారిత్రక–సామాజిక విశ్లేషణ. ఆఫ్రికన్ దేశం గాంబియాలో 1750లో ప్రారంభమై, 1970ల దాకా సాగిన 120 అధ్యాయాల రచనలో చివరి అధ్యాయాలలో అలెక్స్ హేలీ ఈ రచనకు తన ప్రేరణనూ,కృషినీ వివరించాడు. తన అమ్మమ్మ పదే పదే చెప్పిన తమ కుటుంబ కథలోని శకలాలను పట్టుకుని, కుటుంబ చరిత్ర రాయగలనా అనే ప్రశ్నతో ఈ 730 పేజీల ఉద్గ్రంథం తయార యింది. ఇది పురాతత్వ పరిశోధన వంటి ప్రయత్నం. పురాతత్వ పరిశోధకులు ప్రాచీన యుగ అవశేషాల కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు దొరికేవి కుండ పెంకులు మాత్రమే. పూర్తి కుండలు కూడా దొరకవు. కాని ఇతరేతర ఆధారాలతో పరిపుష్టం చేసుకుంటూ, ఆ కుండ పెంకు ఏ కుండలో భాగమో, ఆ కుండ ఏ శ్రమనుంచి ఉద్భవించిందో, ఏ సంస్కృతికి ప్రతిబింబమో, ఆ కుండను వాడిన మనుషుల సామూహిక జీవన విధానం ఏమిటో వివరించడానికి ప్రయత్నిస్తారు. అలెక్స్ హేలీ చేసినది సరిగ్గా అటువంటి కృషి. నిజానికి ఆయన అప్పటికి పరిశోధకుడూ కాదు, రచయితగా కూడా సుప్రసిద్ధుడూ కాదు. తీరప్రాంత గస్తీ దళం ఉద్యోగిగా పనిచేస్తూ, ఏవో కొన్ని రచనలు చేశాడు. ఉద్యోగ విరమణ తర్వాత జర్నలిస్టు అయ్యాడు. అమెరికన్ ప్రముఖులు కొంద రిని ఇంటర్వ్యూ చేశాడు. నల్లజాతి ఉద్యమ నాయకుడు మాల్కోమ్ ఎక్స్ హత్య కావడానికి ముందు నాలుగు సంవ త్సరాల పాటు ఆయనను ఇంటర్వ్యూలు చేసి, ఆయన హత్య తర్వాత ఆటోబయోగ్రఫీ ఆఫ్ మాల్కోమ్ ఎక్స్ రాసి పేరు తెచ్చుకున్నాడు. ఈ అక్షర కృషికి, పురాతత్వ పరిశోధన తోడయింది. చిన్నప్పటి నుంచీ అమ్మమ్మ సింథియా నుంచి విన్న విషయాలు రాయాలనుకున్నాడు. లండన్ మ్యూజియంలో ఒక ప్రాచీన లిపి పరిశోధన చూసి తానూ అటువంటి పరిశోధన చేయాలనుకున్నాడు. అమ్మమ్మకు సన్నిహిత బంధువు, అప్పటికి ఎనబైల్లో ఉన్న జార్జ్‌తో ప్రస్తావించి నప్పుడు, ‘‘అవును కుర్రాడా, ఆ ఆఫ్రికన్ తన పేరు కింటే అని చెప్పేవాడు. గిటార్‌ను కో అనేవాడు. నదిని కాంబీ బోలొంగో అనేవాడు. డోలు చెయ్యడానికి కర్ర కోసం అడవికి పోయినప్పుడు వాళ్లు ఎత్తుకొచ్చారనేవాడు’’ అందామె.‘కింటే ఎక్కడి నుంచి వచ్చాడో అన్వేషిస్తాను’ అని ఆమెకు మాట ఇచ్చాడు. ‘‘ఆ పని చెయ్యి. మీ అమ్మమ్మ, మన వాళ్లందరూ పై నుంచి చూస్తుంటారు’’ అని ఆమె ఇచ్చిన ప్రోత్సాహం ఈ రచనకు పునాది. ఏడు తరాల కథగిటార్ వంటి సంగీత సాధనానికి మాండింకా భాషలో పేరు కో అని, కాంబీ బోలోంగో అంటే గాంబియా నది అని గుర్తించి గాంబియా వెళ్లాడు. మౌఖిక వంశచరిత్రా గాయకుల సహాయంతో నిజంగానే కింటా కుంటే అనే పదహారేళ్ల కుర్ర వాడిని ఎత్తుకుపోయి, ఓడలో అమె రికా తీసుకుపోయారని గుర్తించాడు. బానిసగా ఒక యజమానికి అమ్మబడిన కుంటా కింటే తిరగ బడ్డాడు, పారిపోవడానికి ప్రయత్నించాడు. పారిపోకుండా యజమానులు కాలు తెగనరికారు. అక్కడ వంట మనిషిగా ఉండిన బెల్‌ను పెళ్లి చేసుకుని కిజ్జీ అనే కూతురిని కన్నారు. యజమాని ఆ అమ్మాయిని మరొక యజమానికి అమ్మితే, కొత్త యజమాని కిజ్జీ మీద అత్యాచారం చేశాడు. అలా కోడి పందాల జార్జిగా పేరు తెచ్చుకున్న మూడో తరం వ్యక్తి పుట్టాడు. జార్జి– మెటిల్డాలకు పుట్టిన ఆరుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లలో ఒకరు అలెక్స్ హేలీ ముత్తాత, కమ్మరి టామ్, నాలుగో తరం. ఆయనకూ ఐరీన్కూ పుట్టిన సింథియా, ఐదో తరం, అలెక్స్ హేలీకి తమ కుటుంబ చరిత్ర చెప్పిన అమ్మమ్మ. ఆమె కూతురు బెర్తా, ఆ వంశంలో కాలేజీకి వెళ్లి చదువుకున్న మొదటి వ్యక్తి, అక్కడ కలుసుకున్న సైమన్ హేలీని పెళ్లి చేసుకుంది. ఆమె కొడుకు అలెక్స్ హేలీ. నెత్తురూ కన్నీళ్లూ కలిసిన ఏడు తరాల కథ ఇది. యాబై సంవత్సరాల తర్వాత ఈ పుస్తకాన్ని చూస్తే ఎన్నో ఆశ్చర్యకరమైన విశిష్టతలు కనిపిస్తాయి. ఆఫ్రికన్ తెగల సాంస్కృతిక ఆచారాలు, నల్లవాళ్లను అసలు మనుషులు గానే గుర్తించని, ఓడల్లో పశువుల్లా, సరుకుల్లా ఎత్తుకువచ్చి, తమ వ్యవసాయ క్షేత్రాల్లో పనులకు, ముఖ్యంగా పత్తి పంటకు ఉపయోగించిన తెల్లవాళ్లు, హింస, తిరుగుబాట్లు, పారిపోయే ప్రయత్నాలు, తమ మౌఖిక చరిత్రను సంరక్షించుకున్న పద్ధతులు, స్వాతంత్య్రం నుంచి బానిసత్వానికీ, అక్కడి నుంచి మళ్లీ స్వాతంత్య్రానికీ ప్రయాణాలు, బానిస విముక్తి, ఆంతర్యుద్ధం... చరిత్ర, గత వర్తమానాల మధ్య నిరంతర సంభాషణ. ‘తన చరిత్ర తనె పఠించి భోరున ఏడ్చింది ధరణి, తన చరిత్ర తనె స్మరించి ఫక్కున నవ్వింది ధరణి’. ఎన్. వేణుగోపాల్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
స్వతంత్ర భారత మార్గదర్శకులు
గతవారం అండమాన్, నికోబార్ దీవుల్లో పర్యటించినప్పుడు హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసే గౌరవం నాకు లభించింది. అక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మొదటిసారి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భాన్ని స్మరించుకొని, నివాళులు అర్పించాను. నేతాజీ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ 1943 డిసెంబర్ 30న భారత భూభాగంపై తొలిసారి మువ్వన్నెల జెండాను ఎగరవేసిన పవిత్ర భూమిపై నిలబడటం నా హృదయాన్ని కదిలించే అనుభవం. పసుంపోన్ ముత్తురామలింగ థేవార్ ఆహ్వానం మేరకు 1939 సెప్టెంబరులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మదురైని సందర్శించిన విషయాన్ని ఈ సందర్భం నాకు గుర్తు చేసింది. డూ ఆర్ డైజాతీయ స్మారకమైన సెల్యూలార్ జైలును సందర్శించడం కూడా నా పర్యటనలో మరో స్ఫూర్తిదాయకమైన సందర్భం. వీర్ సావర్కర్, యోగేంద్ర శుక్లా, బటుకేశ్వర్ దత్, సచ్ఛీంద్రనాథ్ సన్యాల్‌తో సహా ఎందరో భరతమాత వీరపుత్రులను వలసవాద శక్తులు ఇక్కడ బంధించాయి. స్వేచ్ఛగా, గౌరవంగా భారత్ మనుగడ సాగించాలనే లక్ష్యంతో ప్రాణాలర్పించిన వారి ధైర్యాన్నీ, వేదననూ, నేటికీ ఈ జాతీయ స్మారకం గోడలు ప్రతిధ్వనిస్తున్నాయి. క్విట్ ఇండియా ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ, ఆగస్టు 9న అండమాన్ దీవుల్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. జాతిపిత మహాత్మాగాంధీ 1942లో ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభించి ‘డూ ఆర్ డై’ అనే స్ఫూర్తిదాయక నినాదాన్ని ఇచ్చారు. ఈ పిలుపుతో దేశవ్యాప్తంగా స్వాతంత్య్రం సాధించాలనే ఆకాంక్ష తీవ్రమైంది. తమ కాలంలో వలసవాద శక్తులతో పోరాడిన తరానికి ధన్యవాదాలు. వారి కారణంగానే ఇప్పుడు మనం స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ హక్కులతో జీవించే అదృష్టాన్ని పొందాం.స్వాతంత్య్ర యోధుల ఘన చరిత్రఉత్తరాన కశ్మీర్, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన గుజరాత్, తూర్పున అస్సాం... ఇలా అన్ని ప్రాంతాలకూ, నేపథ్యాలకూ, వయసులకూ చెందిన సమరయోధులూ, ధీరవనితలూ ఒకే ఉమ్మడి లక్ష్యం కోసం ఏకమయ్యారు. మొదటి స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాటానికి శాశ్వత ప్రతీకగా నిలిచిన ఝాన్సీరాణి లక్ష్మీబాయి శౌర్యం, మంగళ్ పాండే ధైర్యం, ‘స్వరాజ్యం నా జన్మహక్కు, నేను దానిని సాధిస్తాను’ అనే నినాదంతో దేశాన్ని జాగృతం చేసిన బాలగంగాధర తిలక్ నిర్భయ పిలుపు– ఇలా ప్రతిస్వరం స్వాతంత్య్రం దిశగా చేపట్టిన ప్రయా ణాన్ని బలోపేతం చేసింది.తొలి స్వదేశీ నౌకారవాణా సంస్థను ప్రారంభించి వలస పాలన ఆర్థిక ఆధిపత్యాన్ని వి.ఒ.చిదంబరం పిళ్లై సవాలు చేశారు. యుద్ధభూమిలో మాత్రమే కాకుండా, వాణిజ్యంలోనూ స్వాతంత్య్ర పోరాటం సాగిందని ఆయన నిరూపించారు. భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ విప్లవ కాంక్ష... స్వేచ్ఛా సాధనకు త్యాగం చేసేలా తరతరాలకూ స్ఫూర్తిగా నిలిచింది. ఈశాన్యంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రతిఘటన జ్వాలను రాణి గైడిన్లియు రగిలించారు. అస్సాంలో అంచంచలమైన ధైర్యంతో జాతీయ పతాకాన్ని మోస్తూ, క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ కనకలతా బారువా ప్రాణాలను అర్పించారు. భగవాన్ బిర్సా ముండా, అనేక మంది ఇతర గిరిజన నాయకులు వలస పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన చారిత్రక పోరాటానికి నాయకత్వం వహించారు. మన చరిత్ర పుటల్లో పోరాట పటిమనూ, ధైర్యాన్నీ, పట్టుదలనూ ప్రదర్శించే అనేక గాథలున్నాయి. అసంఖ్యాకమైన వీరుల సమష్టి సంకల్పంతోనే భారతదేశ స్వాతంత్య్రం సాధ్యమైందని మనకు గుర్తు చేస్తాయి.నేలకొరిగిన సమర కిశోరాలుమనం స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న నేపథ్యంలో కోడి కాథ కుమరన్(పతాక రక్షకుడు కుమరన్)గా ప్రసిద్ధి చెందిన తిరుప్పూర్ కుమరన్‌కు నివాళి అర్పిస్తున్నారు. నా స్వస్థలమైన తిరుప్పూర్‌లో, స్వాతంత్య్ర పోరాట సమయంలో జాతీయ పతాకాన్ని కింద పడనీయకుండా పట్టుకొని మృత్యు ఒడిలోకి చేరారు. అందుకే ఆయనకు ఈ బిరుదు లభించింది. ‘స్వరాజ్యం మన జన్మహక్కు’ అనే పిలుపుతో ఆయన స్వాతంత్య్ర పోరాటంలో చేరారు. ‘దేశబంధు యూత్ అసోసియేషన్’ను ప్రారంభించారు. గాంధీజీ సామాజిక సంస్కరణలకు కట్టుబడి, మద్యపాన నిషేధాన్ని ప్రచారం చేశారు. ఆత్మనియంత్రణను అలవర్చుకోవాలని ప్రోత్సహిస్తూ, కల్లు దుకాణాల వద్ద పికెటింగ్‌లో పాల్గొన్నారు.1932 జనవరి 10న జరిగిన శాసనోల్లంఘన ఉద్యమంలో కుమరన్ ఓ యాత్రకు నాయకత్వం వహించారు. ‘వందేమాతరం’ నినాదాలతో తిరుప్పూర్ వీధులు ప్రతిధ్వనించాయి. ఈ బృందంపై వలసవాద శక్తుల దాడిలో తలకు గాయమైన కుమరన్ వందే మాతరం అని నినదిస్తూనే జెండాను శరీరానికి హత్తుకొని ప్రాణాలర్పించారు. ఆయన వయసు కేవలం 27 ఏళ్లు. భగత్ సింగ్ (23), సుఖ్‌దేవ్ (23), రాజ్‌గురు (22), ఖుదీరామ్ బోస్ (18), కనకలతా బారువా (18), అనంత లక్ష్మణ్ కన్హేరే (19), వంచినాథన్ (25) లాంటి ఎందరో యువకులు స్వాతంత్య్ర ఉద్యమంలో అమరులయ్యారు.స్వాతంత్య్ర సంగ్రామంలో అజ్ఞాత వీరులను వెలుగులోకి తీసుకువచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవను ప్రశంసిస్తున్నాను. అజ్ఞాత స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తున్నాను. ఈ మహత్తర సందర్భంలో, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించడానికి మనల్ని మనం అంకితం చేసుకుందాం. అచంచలమైన ధైర్యంతో పోరాడి, మన స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధులకు మనం అర్పించగల సముచితమైన నివాళి ఇదే. జై హింద్! భారత్ మాతాకీ జై!వ్యాసకర్త భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ -
ఐరోపా వలస సంక్షోభం
జూలై 30న మద్యధరా సముద్ర తీరంలో మొరాకో అంచున ఉన్న స్పానిష్ ఎన్క్లేవ్ స్యూటాలోకి ఒక్కసారిగా 50 వేల నుండి 60 వేల మంది మొరాకన్లు సము ద్రాన్ని ఈదుకుంటూ రావటం, సుమారు 72 మంది మృత్యువాత పడటం, స్పెయిన్ ఎమర్జెన్సీ ప్రకటించటం ఒక్కసారిగా సభ్యసమాజం ఉలిక్కిపడేలా చేసింది. గత సంవత్సర కాలం నుండి అమెరికాలో ‘ఐస్’ (ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్) ఏజెంట్లు వలస దారులపై చేస్తున్న దాడులు చర్చనీయాంశమయ్యాయి. స్వదేశంలో అంతర్యుద్ధాలు, పేదరికం, నిరుద్యోగ సమస్యల కారణంగా అనేక వేలమంది ప్రాణాలకు తెగించి ఏదో రకంగా ఐరోపా దేశాలకు చేరుకోవటానికి సాహసం చేస్తున్నారు. అటు అంతర్యుద్ధాలు ఇటు శ్రామిక కొరతసిరియా, లిబియా, అఫ్గాన్, ఇరాక్, ఎరిట్రియాలలో అంతర్యు ద్ధాల వలన ఒక మిలియన్‌కు పైగా శరణార్థులు ఒక్కసారిగా 2015లో ఐరోపాలోకి ప్రవేశించారు. దీనిని 2015 ఐరోపా శరణా ర్థుల సంక్షోభంగా పేర్కొంటారు. ఈ శరణార్థుల చొరబాటు ప్రధా నంగా మూడు మార్గాల గుండా జరిగింది. 1. తూర్పు మద్యధరా సముద్రంలో టర్కీ నుండి గ్రీకుకు చెందిన లెస్బాస్, చియోస్ దీవుల గుండా ఐరోపాలోకి. 2. పశ్చిమ బాల్కన్ ప్రాంతంలో మెసడోనియా నుండి సెర్బియా, హంగరీ, క్రొయేషియాల గుండా జర్మన్, ఆస్ట్రియా, స్కాండినేవియా ప్రాంతానికి. 3. మధ్య మద్యధరా ప్రాంతంలో లిబియా నుండి ఇటలీగుండా ఐరోపాలోనికి. ఐరోపా దేశాల ఉదారవాద విధానాల వలన అక్రమ వలస దారులు ఒకసారి ఐరోపాలోనికి ప్రవేశిస్తే వారిని వెంటనే వెనక్కు పంపటం సాధ్యం కాదు. వీరి దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవటా నికి కనీసం రెండేళ్లు పడుతుంది. ఐరోపా దేశాల సంక్షేమ పథకాల ఆలంబనతో వీరు ఏదోరకంగా ఐరోపాలో స్థిరపడుతుంటారు.ఐరోపా దేశాలలో కనీసం 2.5 మిలియన్ల శ్రామికుల కొరత ఉన్నది. ఐరోపా జనాభాలో వృద్ధుల శాతం ఎక్కువ. చౌక శ్రామిక శక్తి ఆవశ్యకతను గుర్తించి ఐరోపా దేశాలు వలసల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరించాయి. 2020 కంటే ముందు ఐరోపా దేశాలు శరణా ర్థులు, అక్రమ వలసదారుల ఎడల మెతక వైఖరిని అవలంభించాయి. ముఖ్యంగా జర్మనీ (ఆంజిలా మెర్కెల్ ప్రభుత్వం) కేవలం 2015లోనే 8.9 లక్షల శరణార్థులను అనుమతించింది. ఐరోపా దేశాలు అక్రమ వలసదారులను నియంత్రిస్తూ, వారిని క్రమంగా ఐరోపా సంస్కృతిలో విలీనం చేయాలనే సిద్ధాంతాన్ని అమలు పరచాయి. యూకే, నెదర్లాండ్స్, స్వీడన్ వంటి దేశాలు శరణార్థులు వారి సంస్కృతిని కాపాడుకోవటానికి సహాయం చేశాయి. ముఖ్యంగా ఇస్లామిక్ మతబోధనల పాఠశాలల ఏర్పాటుకు కూడా సహకరించాయి. వీరికి పౌరసత్వం ఏర్పాటు చేశాయి. ఫ్రాన్స్ దీనికి విరుద్ధంగా ఫ్రెంచ్ భాషను తప్పనిసరి చేసింది. పాఠశాలలు, పబ్లిక్ ప్రదేశాలలో మతసంబంధ చిహ్నాలను నిషేధించింది. జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ వంటి దేశాలు నైపుణ్యంగల వలస దార్లను మాత్రమే అనుమతించటానికి ప్రాధాన్యతనిచ్చాయి. పౌరసత్వ సదుపాయం కల్పించలేదు.నియంత్రణల కసరత్తు2020 తర్వాత ఐరోపా దేశాలలో ఉగ్రవాద చర్యలు, హింసా త్మక సంఘటనలలో వలసదారుల ప్రమేయం బయటకు రావటంతో ఐరోపా దేశాలు తమ విధానాలను పునస్సమీక్షించుకోవటం మొదలెట్టాయి. స్వీడన్లో గ్యాంగ్‌వార్స్, 2024లో యూకేలో దొమ్మీలు, 2023లో ఫ్రాన్స్‌లో అల్లర్లు, యూకేలో గ్రూమింగ్ గ్యాంగ్ లపై నివేదికలు వలసలను వ్యతిరేకించే రైట్‌వింగ్ రాజకీయ పక్షాలు బలోపేతమవటానికి దోహదం చేశాయి. యూరోపియన్ యూనియన్ దేశాలలో సుమారుగా 6.4 కోట్ల మంది విదేశాలలో జన్మించినవారు. మొత్తం జనాభాలో వీరి వాటా సుమారు 13.3 శాతం. ప్రతి సంవత్సరం సుమారు 6.7 లక్షల శరణార్థులు వస్తున్నారు. ఇప్పుడు ఐరోపా దేశాలు దరఖాస్తులపై తుది నిర్ణయం తీసు కొనేవరకు ఐరోపా బయట వేరే దేశాలలో ఉంచే పథకాన్ని ప్రారంభించాయి. రువాండా, అల్బేనియా, ట్యునీషియాలో వీరిని క్యాంపు లలో ఉంచటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వలసదారులకు స్థానిక భాష, సంస్కృతిపై అవగాహనను నిర్ధారించే పరీక్షలను తప్పనిసరి చేస్తున్నారు. స్కాండినేవియన్ దేశాలలో వలస వచ్చిన వారిని సంక్షేమ పథకాల నుండి మినహాయిస్తున్నారు. స్వీడన్లో శరణార్థులు నివసిస్తున్న అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. నేరా లతో సంబంధమున్న వారిని దేశం నుండి బహిష్కరిస్తున్నారు. భద్రతా కారణాలు, సాంస్కృతిక–రాజకీయ నేపథ్యంలో ఐరోపా దేశాలు వలసలను నియంత్రించటానికి ప్రయత్నించటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ వలసలను పూర్తిగా నిషేధిస్తే ఐరోపా ఆర్థిక వ్యవస్థ మనుగడకే ముప్పు. ముఖ్యంగా హెల్త్‌కేర్ రంగంలో నర్సులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, ఎల్డర్లీ కేర్ రంగాలలో తీవ్ర కొరత ఉన్నది. ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్ రంగాలలో డ్రైవర్లు, మెకానిక్‌లు, క్రేన్ ఆపరేటర్ల కొరత ఉన్నది. నిర్మాణ రంగంలో ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఫిట్టర్లకు కొరత ఉన్నది. ఇండియాకు ఐరోపా ద్వారాలుప్రపంచవ్యాప్తంగా 30.4 కోట్ల మంది తమ మాతృదేశాల నుండి వలస వెళ్లి ఇతర దేశాలలో నివసిస్తున్నారు. ప్రపంచ జనాభాలో వీరి వాటా 3.7 శాతం. వీరంతా అభివృద్ధి చెందుతున్న ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలకు చెందినవారు. ప్రధానంగా యూఎస్ఏ, కెనడా, ఐరోపా, ఆస్ట్రేలియాలకు వలస వెళ్తున్నారు. ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చాక వలసల విషయంలో కఠినమైన వైఖరిని అనుసరిస్తున్నారు. భారత్ అక్రమ వలసలను, చొరబాట్లను ఏ రకంగానూ సమర్థించదు. అయితే చట్టబద్ధ వలసల విషయంలో ట్రంప్ వైఖరి భారత్‌ను ఒత్తిడికి గురిచేస్తున్నది. హెచ్1బీ వర్క్ వీసాలలో భారత్ వాటా 70 శాతం. హెచ్1బీ, గ్రీన్‌కార్డ్ వర్క్ వీసాల నిబంధనలతో బాటుగా అమెరికాలో జన్మించినవారికి లభించే పౌరసత్వ నిబంధనలను కఠినతరం చేసే యత్నాలు భారత్‌కు నిరాశను కలిగిస్తున్నాయి.ఇవి ఒక రకంగా కొత్త అవకాశాలకు దారి తెరిచే అవకాశం ఉన్నది. 2023లో 9 లక్షలమంది భారతీయ విద్యార్థులు విదేశీ విద్యకు వెళితే 2025లో 6.26 లక్షలమంది మాత్రమే విదేశీ విశ్వవిద్యాలయాల వైపు మొగ్గు చూపారు. వీరు కూడా యూఎస్‌కు ప్రత్యామ్నాయంగా భారతీయ లేదా ఐరోపా విశ్వవిద్యాలయాలను ఎంచుకుంటున్నారు. అమెరికా నుండి రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ సూచనలు కన్పడుతున్నాయి. అమెరికన్ కంపెనీలు భారత్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఆఫ్ షోరింగ్ స్థానంలో ఆన్ షోరింగ్ ప్రారంభమవుతున్నది. భారతీయుల అమెరికన్ డ్రీమ్ చెదిరిపోయే తరుణంలో ఐరోపా ద్వారాలు తెరుచుకుంటున్నాయి. భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా అంతర్జాతీయ సంబంధాలలో వాణిజ్యాన్ని – వలసలను కలిపి ప్రతిపాదిస్తున్నది. ఇండియా – ఈయూ మొబిలిటీ పాక్ట్ (2026)పై ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా భారత విద్యార్థుల వీసాలను ఫాస్ట్‌ట్రాక్ చేయటం, ఐరోపా విశ్వవిద్యా లయాలలో భారతీయ విద్యార్థులు కోర్సు ముగించిన తరువాత ఉద్యోగం వెతుక్కోవటానికి 12 నెలల వీసా అనుమతికి వీలున్నది. ముఖ్యంగా ఐటీ, ఇంజినీరింగ్, మానుఫాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ,హెల్త్ కేర్ రంగాలలో భారతీయులకు వర్క్ వీసాలకు ఐరోపా దేశాలు అనుమతిస్తాయి. అమెరికాలో వీసా నిబంధనల సమస్యల నేపథ్యంలో ఐరోపా వలస సంక్షోభం, ఘర్షణలు భారత్‌కు కలిసొచ్చాయనే చెప్పవచ్చు. బహుశా 2050 కల్లా ఐరోపా ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక వ్యవస్థలలో భారతీయులు తమదైన ముద్రను వేసే అవకాశం ఉన్నది.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
మన వ్యవసాయ విధానాలకు పరీక్ష
ఎల్ నినో కేవలం ఏదో ఒక పరిణామం కాదు. అది భూగోళం మొత్తంమీద వాతావరణ మార్పు వైపరీత్యానికి సంకేతం. పరస్పరాధారిత జీవావరణ వ్యవస్థలకు, వ్యవసాయ రంగానికి, ఆహార భద్రతకు ఎదురవుతున్న సవాళ్ళను గుర్తు చేస్తున్న ప్రమాదఘంటిక. ఈ రకమైన ఉపద్రవం తరచు తలెత్తుతున్నా దాని దీర్ఘకాలిక పర్యవసానాలను ఎదుర్కోవడంలో భారతదేశ సన్నద్ధత అసమతుల్యంగానే ఉంది. ఎల్ నినో ప్రభావాలను రైతులకు ఎరుక పరచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత కృషి చేస్తున్న మాట వాస్తవమే. అయితే, వ్యవసాయ ఉత్పత్తి చుట్టూ అలముకుంటున్న అస్థిరత, పంటల తీరుతెన్నులపై పెరిగిపోతున్న ఒత్తిడిపై మరింతగా దృష్టి సారించవలసిన అవసరం ఉంది. అనిశ్చితిలోనూ స్థిరమైన పనితీరుఈ నేపథ్యంలో, వ్యవసాయ స్థితిస్థాపకత విధానపరంగా ఒక ముఖ్యమైన ప్రాధాన్యతను సంతరించుకోవాలి. పంట నష్టాలను తగ్గించుకోవడం మాత్రమే స్థితిస్థాపకత అనిపించుకోదు. అనిశ్చిత పరిస్థితుల్లోనూ, సాపేక్షంగా చూస్తే స్థిరమైన పనితీరు కనబరచగల వ్యవసాయ పద్ధతులను రూపొందించుకోవాలి. దీర్ఘకాలిక స్థితిస్థాపక శక్తిని సమకూర్చుకునేందుకు మౌలిక వసతులు, టెక్నాలజీ, జల నిర్వహణ, ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోగల వంగడాలను అభివృద్ధి చేయడం, పరిశోధనలపై పెట్టుబడులు అవసరమవుతాయి. వాతావరణ అశనిపాతాల పట్ల ప్రభుత్వాలు ఎలా స్పందిస్తు న్నాయన్నది ఒక పార్శ్వం మాత్రమే. అటువంటి షాక్‌లు ఎదురవ డానికి ముందే ప్రభుత్వ సంస్థలు రైతులను ఎంత పకడ్బందీగా సన్నద్ధపరుస్తున్నాయన్నది కీలక ప్రశ్న. పంట మార్పిడిలను ప్రోత్సహించడంలో ప్రభుత్వాల ప్రయత్నాలు ఎంతవరకు సఫల మవుతున్నాయి? ప్రత్యామ్నాయ పంటలు, వాటిని నాటవలసిన కాల పరిధులు, రిస్క్–మేనేజ్మెంట్ వ్యూహాల గురించి రైతులకు సలహాలిచ్చేందుకు తగినంత సామగ్రి దిగువ స్థాయి వ్యవసాయ వ్యవస్థల వద్ద ఉంటోందా? పంటలకు నష్టాలు వాటిల్లినప్పుడు పరిహారం, బీమా, ఇతర సహాయక యంత్రాంగాలు దెబ్బతిన్న రైతుల ముంగిళ్ళకు ఎంత వేగంగా చేరుకోగలుగుతున్నాయి? కేవలం అధిక దిగుబడులను సాధించడంపైనే కాకుండా, వాస్తవిక పరిస్థితులలో స్థిరమైన పనితీరును నిలబెట్టుకోగలగడంపైనే భారత వ్యవసాయ రంగ భవిష్యత్తు ఆధారపడి ఉంది. దేశంలో కర్షకులు సుమారుగా 11.88 కోట్ల మంది ఉన్నారని, వ్యవసాయ కూలీలు 14.43 కోట్ల మేరకు ఉంటారని 2011 నాటి జనాభా లెక్కల వివరాలు వెల్లడిస్తున్నాయి. వాతావరణ వైపరీత్యాల ప్రభావం పంట పొలాలకే పరిమితం కాదనీ, అవి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆహార భద్రత, విస్తృత గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయనీ గుర్తుంచుకోవాలి. సాంకేతిక సాయంభారత వ్యవసాయ రంగం ప్రధానంగా రుతువుల మార్పులపై ఆధారపడి నడుస్తోంది. వాతావరణానికి సంబంధించి తగినంత సమాచారం లేకుండా నారుపోయడం లేదా ఇతర సేద్య కార్యకలా పాలు చేపట్టడంలో ఇబ్బందులున్నాయి. తీరా అవి చేపట్టాక వర్ష పాత ధోరణుల్లో మార్పులొస్తే, రైతులు ఆర్థికంగా నష్టపోతారు. వ్యవసాయ రంగానికి సంబంధించి పైకి అంతగా కనిపించని దుర్భ లత్వాలలో ఇది ఒకటి. పంటలు దెబ్బతిన్నప్పుడు వచ్చే నష్టాలే కాకుండా, అనువుకాని సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా రైతులు నష్టపోయే అవకాశం ఉంది. వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న ఈ సమస్య ఒక పూర్తి స్థాయి సంక్షోభంగా పరిణమించకముందే, ఆ ముప్పు ఏర్పడగల అవకాశాన్ని గుర్తించడంలో ప్రవర్ధమాన టెక్నాలజీలు ముఖ్యంగా ఉపగ్రహ ఆధారిత భూ పరిశీలనలు తోడ్పడుతున్నాయి. దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు తరిగిపోతున్న వృక్ష సంపద ఆరోగ్యాన్ని గుర్తించడంలో, విస్తారమైన వ్యావసాయిక ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గుదల వంటివాటిని గుర్తించడంలో ఉపగ్రహ పరిశీ లనలు సహాయపడతాయి. కనుక, ఎల్ నినో విసురుతున్న సవాల్‌ను ఎదురు దెబ్బగా చూడనవసరం లేదు. భారతీయ వ్యవసాయ వ్యవస్థలను పటిష్టపరచుకునేందుకు లభించిన ఒక అవకాశంగా దీన్ని పరిగణించవచ్చు. అనిశ్చిత పరిస్థితుల్లో ఏ పంటలు పండించగలుగుతున్నాం, దానికి ఏ విధమైన సేద్యపు విధానాలు అనుసరిస్తున్నాం, సంస్థా పరమైన స్పందనల మెరుగుదల వంటి అంశాలకు సంబంధించి విలువైన పరిజ్ఞానాన్ని ప్రతి క్లిష్టమైన వ్యవసాయ సీజన్ నుంచి గ్రహించవచ్చు. వాతావరణంలో మార్పు గురించిన సాధారణ హెచ్చరికలు చేస్తే రైతులకు సరిపోదు. పరిస్థితిని బట్టి వివిధ పంటలు వేసుకోగల వెసులుబాటు కల్పించాలి. ప్రత్యామ్నాయ ఉపకరణాలు, వంగడాలను అందుబాటులోకి తేవాలి. సమర్థ పంట బీమా అవసరం. అస్థిర పరిస్థితులను తట్టుకోగలిగిన విధంగా సంస్థాపరమైన మద్దతును కూడా అందించాలి.ప్రపంచమంతటా పెను ప్రభావమే!ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తిపైన కూడా వాతావరణ వ్యత్యాస ప్రభావం పెరుగుతూ వస్తోందని 2026 ఆగస్టు 6న ప్రచురించిన గ్లోబల్ క్రాప్ మానిటర్ నివేదిక వెల్లడించింది. అది నాలుగు ప్రధాన (గోదుమ, మొక్కజొన్న, వరి, సోయాబీన్) పంటల స్థితిగతులను మదింపు చేసింది. సాపేక్షంగా చూస్తే గోదుమకు సానుకూల పరిస్థితులున్నాయని ఆ నివేదిక తెలిపింది. బియ్యానికి పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు. వరి రైతులు వాతావరణ ప్రతికూలత, నీటి సౌలభ్యం తక్కువగా ఉండటం, పంటకు చీడపీడలు సోకడంతో పాటు, దిగుబడులకు సంబంధించి ఇతర ప్రతిబంధకాలను కూడా ఎదుర్కొంటున్నారు. భారత్ విషయంలో దీని ప్రధాన సందేశం ముఖ్యమైంది. వాతావరణం ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేని పరిస్థితులు పెరుగు తున్నాయి. వాటిని తట్టుకుని నిలబడగలిగిన విధంగా పంటలు రూపొందాలి. వ్యవసాయ విధానాలు వేగంగా మారిపోతున్న రిస్కు లకు తగ్గట్లుగా స్పందించగలిగిన సామర్థ్యం ఉన్నవై ఉండాలి. మరింత ఆహారాన్ని ఉత్పత్తి చేయడం మాత్రమే భారత వ్యవసాయ రంగ భవిష్యత్తు కాదు. అది మెరుగైన సమాచారంతో మెరుగైన నిర్ణయాలు తీసుకోగలిగినదిగా ఉండాలి. క్షేత్ర స్థాయిలో మారుతున్న పరిస్థితులను అవగాహన చేసుకుని, ఎదురుకాగల ముప్పులను ఊహించగలిగినప్పుడే ప్రభుత్వాలు స్థితిస్థాపక శక్తి కలిగిన వ్యవసాయ వ్యవస్థలను నిర్మించగలుగుతాయి. అప్పుడే ఎల్ నినోను అడపాదడపా తలెత్తే వాతావరణ భూతంగా కాక దేశ వ్యవసాయ పాలనకు ఒక పరీక్షగా చూడటం సాధ్యపడుతుంది.– డా‘‘ సుంకరి సత్యం ‘ అసిస్టెంట్ ప్రొఫెసర్;– కంచర్ల శ్రీదేవి ‘ రిసెర్చ్ స్కాలర్; కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్, హైదరాబాద్ -
సంకేతమే అయినా మున్ముందు సవాలే!
సౌదీ అరేబియా, పాకిస్తాన్, తుర్కియే ఆగస్ట్ 7న ‘మక్కా రక్షణ ఒడంబడిక’పై రియాద్‌లో సంతకాలు చేశాయి. దీనికి సైనికపరంగాకన్నా ఇతరత్రా ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఇది పశ్చిమాసియాలో నీరుగారుతున్న అమెరికా ప్రాభవాన్ని వెల్లడిస్తోంది. భద్రతా ప్రాధాన్యాల రీత్యా ఈ మూడు దేశాల మధ్యనున్న సారూప్యత బహు స్వల్పం. అమెరికా– ఇరాన్ మధ్య యుద్ధ పర్యవసానాలు సౌదీకి తలనొప్పిగా పరిణమించాయి. ఇరాన్‌తో దాని వైరం 1979 నుంచి సాగుతోంది. పాక్ దృష్టంతా భారత్‌పైనే. ‘నాటో’ కూటమిలో ఒకటిగా ఉన్న తుర్కియే అటు పశ్చిమాసియాలోనూ, ఇటు ఉత్తరాఫ్రికాలోనూ తన పలుకుబడిని పెంచుకోవాలని చూస్తోంది. ఆ ప్రాంతంలో నమ్మదగిన రక్షణ సామగ్రి ఎగుమతి దారుగా అవతరించాలని కోరుకుంటోంది. ఇలా వైరుధ్యాలున్నా రక్షణ కోసం ఈ మూడు దేశాలు ఒక వర్గంగా ఏర్పడటం ప్రతీకాత్మకంగా గణనీయమైనదే. ఇది మూడు భారీ మార్పులను ప్రతిబింబిస్తోంది: భిన్నమైన వ్యూహాత్మక, భద్రతా ప్రాధాన్యతలు; నూతన భద్రతా భాగస్వామ్యాల కోసం అన్వేషణ; అమెరికాపై ఇన్నాళ్ళూ ఉన్న నమ్మకం సడలిపోవడం.అమెరికాపై పోతున్న ఆశలుపశ్చిమాసియా, దానిని అనుకుని ఉన్న ప్రాంతాలు ఒక భద్రతా చట్రాన్ని కల్పించుకోవడంలో కొన్ని దశాబ్దాలుగా వాషింగ్టన్‌పైనే ఆధారపడుతూ వచ్చాయి. అమెరికా నుంచి ఆయుధాలు కొని సౌదీ అరేబియా దాని నుంచి భద్రతాపరమైన పూచీకత్తులు సంపాదించింది. తుర్కియే ఎలాగూ ‘నాటో’లో సభ్యురాలు. పాకిస్తాన్ ‘‘నాటో’యేతర ప్రధాన మిత్రపక్షం’.ఆరామ్‌కోపై జరిగిన ఇటీవలి దాడులపైనా, హౌతీలను కట్టడి చేయడంపైనా అమెరికా స్పందన పేలవంగా ఉందని సౌదీ భావిస్తోంది. సిరియా విషయంలో ‘నాటో’తో తుర్కియే చాలా ఏళ్లుగా ఘర్షణపడుతోంది. ఎఫ్–35 యుద్ధ విమానాల విక్రయాలు, కుర్దుల అంశం కూడా దాన్ని చిరాకుపరుస్తున్నాయి. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనలు వైదొలగడం, 2009 తర్వాత అమెరికా క్రమంగా భారత్ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపించడంతో వ్యూహాత్మకంగా ఏకాకినవుతున్నానని పాక్ భావిస్తూ ఉండవచ్చు. రియాద్, అంకారా, ఇస్లామాబాద్ ఒకదానికొకటి రక్షణగా నిల వాలని నిర్ణయించుకోవడం గణనీయమైన పరిణామమే. ఈ ఒడంబడిక ప్రస్తుతానికి పస లేనిదిగా కనిపించవచ్చుకానీ, ఇక్కడ సంకే తానికే ఎక్కువ ప్రాధాన్యం. మూడు ప్రధాన ముస్లిం మెజారిటీ సైనిక శక్తులు చేతులు కలుపుతున్నాయి. పాకిస్తాన్ అమ్ములపొదిలో అణ్వస్త్రం ఉంది. తుర్కియేలో ప్రధాన రక్షణ సామగ్రి పరిశ్రమలు న్నాయి. సౌదీ అరేబియాకు చమురు నిల్వలు పుష్కలం.ఇజ్రాయెల్‌కు సంకటమే!ఈ మూడు దేశాల్లో ఏ దేశంపైన దాడి జరిగినా మిగిలిన రెండు దేశాలపైన కూడా దాడి జరిగినట్లుగానే భావించాలని పేర్కొంటున్న క్లాజు మక్కా ఒప్పందానికి ప్రాముఖ్యతను సంతరిస్తోంది. కాకపోతే, భాష అస్పష్టంగా ఉంది. ‘నాటో’ ఆర్టికల్ 5 తరహాలో, ఆటోమే టిక్‌గా యుద్ధానికి దిగుతామనే నిర్దుష్టమైన పదజాలాన్ని చేర్చలేదు. సమైక్య కమాండ్ల ప్రస్తావన లేదు. సంయుక్తంగా స్థావరాలు నిర్వహిస్తామని ఎక్కడా ప్రకటించలేదు. ఈ ఒడంబడిక తక్షణ సైనిక ప్రభావం పరిమితం కావచ్చు. కానీ, అస్పష్టతకు కూడా భౌగోళిక రాజకీయాల్లో ప్రాధాన్యం ఉంటుంది. ఇది శత్రు దేశాల్లో అయోమయాన్ని సృష్టిస్తుంది. వాటి రక్షణ సన్నద్ధత ఖర్చును పెంచుతుంది. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు సంబంధించిన భద్రతా చర్చల్లో తల దూర్చాలని తుర్కియే చాలా కాలంగా అభిలషిస్తోంది. కానీ, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, అమెరికా దాన్ని దూరంపెడుతూ వచ్చాయి. ఇపుడు మక్కా ఒడంబడికతో తుర్కియే ఆ రకమైన చర్చల్లో పాల్గొనేందుకు ప్రవేశార్హత సంపాదించుకున్నట్లు అయింది. ఇది ఇజ్రాయెల్‌కు కంటక ప్రాయంగా మారడం ఖాయం. గాజాలో ఇజ్రాయెల్ చర్యలను తుర్కియే బాహాటంగా విమర్శిస్తోంది. మక్కా రక్షణ ఒడంబడికతో అటు తుర్కియే, ఇటు అణ్వస్త్ర సహిత పాకిస్తాన్ పశ్చిమాసియా భద్రతకు సంబంధించిన అధికారిక చర్చల్లో మొదటిసారిగా పాల్గొనేందుకు ప్రయత్నించవచ్చు. ఇంత కాలం అమెరికా నేతృత్వంలోని అబ్రహాం ఒప్పందాల గొడుగు నీడన ఇజ్రాయెల్ పనులు చక్కబెట్టుకుంటూ వస్తోంది. గల్ఫ్ కౌన్సి ల్తో సన్నిహిత సంబంధాలు నెరపుతోంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా భద్రతాపరమైన సహకారాన్ని గుట్టుచప్పుడు కాకుండా అందిస్తోంది. తద్వారా, పాక్‌ను ఆమడదూరంలో ఉంచుతూ వస్తోంది. తాజా ఒడంబడిక ఈ సూత్రీకరణలన్నింటినీ అస్తవ్యస్తం చేస్తోంది. ఇజ్రాయెల్‌ను గుర్తించని పాక్‌కు గల్ఫ్ భద్రతా చర్చల బల్ల వద్ద కుర్చీ కల్పిస్తోంది. పాలస్తీనియన్ల తరఫున వకాల్తా పుచ్చుకున్నదిగా తనను చాటుకునే తుర్కియేకు సంస్థాపరమైన పరపతిని తెచ్చిపెడుతోంది. భారత్ ఎందుకు జాగ్రత్తపడాలి?ఈ ఒడంబడికతో న్యూఢిల్లీకి సంబంధం లేదని అనడానికి లేదు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సిసలైన కాపలాదారుగా భారత్ తనను తాను చాటుకుంటూ వస్తోంది. సాగర జలాలకు సంబంధించినంతవరకు భద్రతకు నికరంగా భారత్ పైనే ఆధారపడ టానికి ప్రాధాన్యం ఇస్తారనే భావనపైనే ప్రధాని నరేంద్ర మోదీ తన ‘సాగర్’, ‘మహాసాగర్’ విధానాలను నిర్మించుకుంటూ వచ్చారు. సౌదీ అరేబియా 14 దేశాలతో కలసి జూలై 30న ఒక మారిటైమ్ సెక్యూరిటీ క్లస్టర్‌ను ప్రారంభించింది. కానీ ఈ గ్రూపులో భారత్ భాగంగా లేదు. భారతదేశానికి బదులుగా పాక్, తుర్కియేలతో రక్షణ అవగాహన కల్పించుకునేందుకు సౌదీ మొగ్గు చూపడాన్నే ఒక భౌగోళిక రాజకీయ సంకేతంగా తీసుకోవాలి. భారత్‌తో ఆర్థిక సంబంధాలు, ఇంధన వర్తకం వృద్ధి చెందుతున్నా, సంక్షోభం ముంచుకొస్తే, భారతదేశాన్ని ఒక ముఖ్యమైన భద్రతా భాగ స్వామిగా రియాద్ చూడదని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. పాకిస్తాన్ పరపతి పెరుగుతూండటం రెండవ అంశం. రెండు పవిత్ర మసీదులకు రక్షణదారుగా ఉన్న దేశంతోనూ, ఒక ‘నాటో’ సైనిక శక్తితోనూ రక్షణ ఒడంబడిక కుదుర్చుకోవడం ఇస్లామాబాద్‌కు దౌత్యపరమైన విలువ తెచ్చిపెడుతోంది. అంతర్జాతీయంగా పాక్ ఏకాకి అయిందనే కథనానికి ఇది గండికొడుతోంది. బలాబలాల మధ్య సమతూకాన్ని మక్కా రక్షణ ఒడంబడిక రాత్రికి రాత్రి మార్చేయకపోవచ్చు. సంయుక్త సున్నీ సైనిక శక్తి రేపటికి రేపే అవతరించకపోవచ్చు. కానీ, ఈ ఒడంబడిక రెండు చేదు వాస్తవాలను వెల్లడిస్తోంది. ఒకటి– కీలకమైన మధ్యవర్గ శక్తులు కేవలం అమెరికాపై ఆధారపడే ధోరణి నుంచి దూరం జరుగుతున్నాయి. రెండు– ఈ వైవిధ్యీకరణలో సిద్ధాంతాన్ని పక్కనపెట్టి, తక్షణ ఆచరణాత్మక దృక్పథంతో నూతన కూటములు ఏర్పడుతున్నాయి. ఢిల్లీ ఎదుట సునిశితమైన సవాల్ ఉంది. గల్ఫ్ నుంచి ఆగ్నేయాసియా వరకు భద్రతను కల్పించగల శక్తిగా అవతరించాలని కోరుకుంటున్న భారత్ తన ‘సాగర్’, ‘మహాసాగర్’ విధానాలను సౌదీ అరేబియా వంటి దేశాలు అక్కున చేర్చుకోగలిగినవిగా మలచాలి. సి. ఉదయ్ భాస్కర్వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్, న్యూఢిల్లీ -
గిరిజన సాగును ఎలా చూడాలి?
మైదాన ప్రాంతాల కోసం రాసిన పథకాలను, అభివృద్ధి చేసిన సాంకేతికతలను ఏజెన్సీ ప్రాంతాలకు యథాతథంగా పంపుతున్నాం. అక్కడి రైతులు కొత్త పద్ధతులు స్వీకరించడం లేదని నివేదికల్లో రాసుకుంటున్నాం. సమస్య రైతులది కాదు; అక్కడి పరిస్థితులను అర్థం చేసు కోలేని మనది. 2025 మార్చిలో తెలంగాణ రైతు కమిషన్ ఏర్పాటు చేసిన బృందంతో కలిసి ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాలకు వెళ్లాం. అక్కడ హైబ్రిడ్ మొక్కజొన్న విత్తన పంట దెబ్బతింది. కంకుల్లో గింజ పట్టలేదు. జిల్లా కమిటీ లెక్క ప్రకారం 959 మంది రైతులకు చెందిన 2,178 ఎకరాల్లో పంట నష్టపోయింది. మా దృష్టిని ఆకర్షించింది పంట నష్టం కంటే దాని వెనుక ఉన్న ఏర్పాట్లు, వ్యవస్థల వైఫల్యం.బాండ్ వ్యవసాయం అంటే ఏమిటి?విత్తన కంపెనీలు రైతులతో నేరుగా ఒప్పందం చేసుకోవు. స్థానిక ఆర్గనైజర్లతో ఒప్పందం చేసుకుంటాయి. ఆ ఆర్గనైజర్ రైతుతో నోటిమాట మీద మాత్రమే ఒప్పందం చేసుకుంటాడు. దీన్ని అక్కడ బాండ్ వ్యవసాయం అంటారు. విత్తనం, ఎరువులు, పురుగుమందులు అప్పుగా ఇచ్చి, పంట కొనుగోలు సమయంలో వసూలు చేసుకుంటాడు. వడ్డీ నెలకు వంద రూపాయలకు అయిదు రూపా యలు– సంవత్సరానికి అరవై శాతం! చట్టం ప్రకారం ప్రతి కాంట్రాక్ట్ సాగు ఒప్పందాన్ని మార్కెట్ కమిటీలో నమోదు చేయాలి. పురుగు మందులకు బిల్లులు లేవు; అవి అమ్మటానికి లైసెన్సులు లేవు; ఒక చిన్న నోటుపుస్తకంలో పేర్లు మాత్రమే రాశారు. కొన్నిచోట్ల గరిష్ఠ చిల్లర ధర కంటే ఎక్కువ వసూలు చేశారు. మందుల డబ్బాల మీద సూచనలు ఇంగ్లిష్‌లో ఉన్నాయి.దీని ఫలితం మనుషుల మీద కనిపించింది. పొలంలో పని చేస్తూ విషప్రయోగానికి గురైన ఒక మహిళ చేతులు, కాళ్లు చచ్చుబడి మంచానికి పరిమితమైంది. పిచికారీ పనిని పర్యవేక్షించిన ఒక మేస్త్రీ పక్షవాతానికి గురయ్యాడు; వైద్యం కోసం ఆ కుటుంబం మిగిలిన నలభై సెంట్ల భూమిని అమ్ముకుంది. వరుసగా రెండు నష్టాల తరు వాత ముప్ఫై అయిదేళ్ల ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్లెవరూ వ్యవస్థ బయట ఉన్నవాళ్లు కాదు. పెద్ద కంపెనీల కోసం విత్తనం పండించినవాళ్లు. అయినా ఒప్పందం లేదు, బిల్లు లేదు, బీమా లేదు, ఫిర్యాదు చేసే చోటు లేదు.రెండు రకాల గిరిజన వ్యవసాయంతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాలు ఒకేలా లేవు. తెలంగాణలో గిరిజన వ్యవసాయం ఎప్పుడో వాణిజ్య వ్యవసాయంగా మారి పోయింది. ఆదిలాబాద్, కుమురం భీం, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో గోండు, కోలాం కుటుంబాలు గతంలో పండించిన జొన్న, పప్పు ధాన్యాలు, మిశ్రమ పంటల స్థానంలో పత్తి వచ్చింది. ములుగు, భద్రాద్రిలో కాంట్రాక్ట్ విత్తన సాగు నడుస్తోంది. రాష్ట్రంలో హెక్టారుకు దాదాపు 253 కిలోల ఎరువులు వాడుతున్నారు; దక్షి ణాది సగటు 164 మాత్రమే. 2019 నాటికి రాష్ట్రంలోని 92 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయి; ఆ అప్పులో దాదాపు సగం బ్యాంకులది కాదు, వడ్డీ వ్యాపారులది.ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి వేరు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల కొండ మండలాల్లో పది కుటుంబాల్లో ఏడు ఇప్పటికీ ప్రధానంగా సొంత అవసరాల కోసమే పండిస్తు న్నాయి– రాగులు, కొర్రలు, సామలు, కంది, వరి. కొండ వాలుల్లో పోడు సాగు కొనసాగుతోంది. రసాయనాల వినియోగం తక్కువే. వాణిజ్య పంటలు వచ్చినా అవి బహువార్షిక పంటలు– అరకు కాఫీ, మిరియాలు, పైనాపిల్, పసుపు. ఇక్కడ సమస్య అప్పుల భారం కాదు; తక్కువ దిగుబడులు, మార్కెట్ అందుబాటులో లేకపోవడం. అంటే ఒక ప్రాంతంలో ఇప్పటికే ఉన్న వాణిజ్య వ్యవస్థను నియంత్రించాలి. మరో ప్రాంతంలో ఉన్నదానికి విలువ చేర్చాలి.పథకాలు ఎందుకు పనిచేయడం లేదు?రాజ్యాంగంలోని అయిదో షెడ్యూల్ ప్రకారం, ఏ చట్టమైనా షెడ్యూల్డ్ ప్రాంతానికి వర్తించకుండా చేయడానికి, లేదా అవసరమైన మార్పులతో వర్తింపజేయడానికి గవర్నర్‌కు అధికారం ఉంది. గిరి జనుల భూమి బదిలీని నియంత్రించే అధికారంతో పాటు, వారికి వడ్డీ వ్యాపారం చేసే వ్యవహారాన్ని నియంత్రించే అధికారం కూడా స్పష్టంగా ఇచ్చారు. ఆ అధికారంతోనే 1960లో షెడ్యూల్డ్ ప్రాంతాల వడ్డీ వ్యాపారుల నియంత్రణ నిబంధన చేశారు. అది ఇప్పటికీ రెండు రాష్ట్రాల ఏజెన్సీ ప్రాంతాల్లో అమల్లో ఉంది. అంటే ములుగులో అరవై శాతం వడ్డీ వసూలు చేసేవాడిని ఆపడానికి అరవై అయిదేళ్లుగా చట్టం అందుబాటులో ఉంది. వాడలేదు.ఇలాంటి సమస్యలు పునరావృతం కాకూడదు అంటే వెంటనే చేయదగినవి మూడు ఉన్నాయి. ఒకటి– షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రతి కాంట్రాక్ట్ సాగు, విత్తన ఉత్పత్తి ఒప్పందాన్ని విత్తే ముందే మార్కెట్ కమిటీలో నమోదు చేయించడం; ఒప్పంద పత్రం తెలుగులో రైతు చేతిలో ఉండాలి. రెండు– వడ్డీ వ్యాపారుల నియంత్రణ నిబంధనను అమలు చేయడం; సామగ్రి అమ్మేవాడే అప్పు ఇచ్చేవాడు, పంట కొనేవాడు కూడా అయినప్పుడు ఆ మూడు పాత్రలూ కాగితం మీద కనిపించాలి. మూడు– పట్టా పేరును కాక నిజంగా సాగుచేసేవారిని గుర్తించడం; గ్రామసభ ధ్రువీకరణ ఆధారంగా పోడు సాగుదారు లకు, కౌలుదారులకు, మహిళా రైతులకు రుణం, బీమా, పంట నష్ట పరిహారం అందేలా చూడటం. ఈ మేరకు ఒక ముసాయిదా విత్తన ఉత్పత్తి దారుల రక్షణ చట్టం ప్రభుత్వానికి సమర్పించటం జరిగింది. అది ఇప్పటికీ అమలులోకి రాలేదు. ఇది సాధ్యమేనా అంటే – అవును!అమ్రాబాద్‌లో చెంచు కుటుంబాలతో కలిసి పనిచేసినప్పుడు మిరప పంటలో సీజ¯Œ కు ఇరవై సార్లు కొట్టే పిచికారీలు ఆరు, ఏడుకు తగ్గాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గోండు, కోలాం రైతుల 700 ఎకరాలు సేంద్రియ, ప్రకృతి సాగులోకి మారాయి; రైతు ఉత్పత్తిదారుల సంఘానికి ప్రభుత్వం మంచిర్యాలలో ఒక సేంద్రియ దుకాణం కేటాయించింది. నారాయణపేటలో సెర్ప్ సంస్థతో కలిసి 1,500 ఎకరాలు మార్పు దిశగా వెళ్లగా, 200 ఎకరాల్లో వరి స్థానంలో చిరుధాన్యాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో గిరి సిరి రైతు సంఘం కింద 2,600 ఎకరాలు ప్రకృతి సాగులో ఉన్నాయి; పసుపు, వేరు శనగ ప్రాసెసింగ్ యూనిట్లు స్థానికంగానే ఏర్పాటయ్యాయి. ఈ నాలుగు చోట్లా చేసిన పని ఒకటే. రైతు ఇప్పటికే పండిస్తున్న దానినుంచి మొదలుపెట్టడం. ముందు ప్రమాదకర మందులు తీసేయడం. నీరు తక్కువున్న చోట చిరుధాన్యాలు. పొలం పక్కనే పోషకాహార తోట. మార్కెట్ పెట్టుకోవడానికి రైతు సంఘం. ఉత్పత్తి దగ్గరే ప్రాసెసింగ్. వీటిలో దేనికీ కొత్త పథకం అవసరం లేదు. చివరగా ఒక మాట. రెండు రాష్ట్రాల్లోనూ షెడ్యూల్డ్ ప్రాంతాల వ్యవసాయ గణాంకాలను విడిగా ప్రచురించడం లేదు. గిరిజన కుటుంబాల ఎరువుల వాడకం, అప్పులు, నేల ఆరోగ్యం, దిగు బడులపై ప్రత్యేకంగా సమాచారం లేదు. ఈ లోటు తీర్చడం ఖరీదైన పని కాదు; చేయాలన్న నిర్ణయం మాత్రమే కావాలి.డా‘‘ జి.వి.రామాంజనేయులువ్యాసకర్త సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్ఏ) కార్యనిర్వాహక సంచాలకులు -
కశ్మీరీలకు పాకిస్తాన్‌పై ప్రేమేం లేదు!
కశ్మీర్ ప్రజలకు పాకిస్తాన్‌పై ప్రేమ లేదు. ఈ మాట అంటున్నది అధీన రేఖకు రెండు వైపులా కశ్మీరీల గురించి కూడా. ప్రస్తుతం రేఖకు ఆవలివైపున గత రెండు నెలలుగా మరోమారు ఆందోళనలు జరగడాన్ని చూస్తున్నాం. అదే సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఇటు వైపున గలవారికి కూడా ఎటువంటి ప్రేమ లేదు. వాస్తవం ఇది కాగా... ఇటువారంతా కేవలం మత దృష్టితో పాకిస్తాన్‌పై ప్రేమతో భారత వ్యతిరేక ఆందోళనలు చేస్తున్నారనే ప్రచారాలను రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారు.ఇండియానే ఎందుకు కోరుకున్నారు?పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి చర్చించేముందు, సందర్భం వచ్చింది గనక మన కశ్మీర్ విషయాన్ని అర్థం చేసుకోవడం అవసరం. వలస పాలన ముగుస్తుండిన 1947లో బ్రిటిష్‌వారు ఇక్కడి సంస్థానాలకు భారత యూనియన్‌లో లేదా పాకిస్తాన్లో విలీన మయ్యే స్వేచ్ఛను ఇచ్చారు. అపుడు కశ్మీర్ పాలకుడు హిందువు కాగా, ప్రజలు మెజారిటీ సంఖ్యలో ముస్లింలు. రాజు హరిసింగ్ గానీ, ప్రజలు గానీ పాకిస్తాన్లో చేరేందుకు ఇష్టపడలేదు. అప్పటి ప్రధాన రాజకీయ పక్షం నాయకుడు షేక్ అబ్దుల్లా పూర్తిగా ఇండియా పక్షం వహించాడు. కోరుకుంటే పాకిస్తాన్లో చేరగల అవకాశం దేశ విభజన చట్ట ప్రకారం ఉండి కూడా, భారతదేశంలో విలీనాన్ని ఎందుకు కోరుకున్నారు? నేను కశ్మీర్‌లోని మొత్తం 22 జిల్లాల్లోనూ మూడుసార్లు విస్తారంగా పర్యటించినపుడు, ఇతర విషయాలను అట్లుంచి ప్రత్యేకంగా ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు ప్రయత్నించాను. నేను వెళ్లిన జిల్లాలలో ముస్లిం మెజారిటీ ప్రాంతమైన కశ్మీర్ లోయతో పాటు పాకిస్తాన్ సరిహద్దుల వెట ఉండి ఆ ప్రభావాలు గణనీయంగా గల కుప్వారా, బారాముల్లా, పూంఛ్, రాజౌరీ జిల్లాలు కూడా ఉన్నాయి. రెండుసార్లు వెళ్లినపుడైతే మిలిటెంట్ చర్యలు ఉధృతంగా సాగుతున్నాయి. మిలిటెంట్లకు పాకిస్తాన్ సహాయాలు అందు తూనే ఉన్నాయి. అయిన్పటికీ ఏ దశలోనూ ఒక చిన్న వర్గం తప్ప పాకిస్తాన్‌ను కోరుకోకపోవడం గమనార్హం. ఇద్దరికీ సరిపడనిదే!మొట్టమొదటి వేర్పాటువాద ఆజాద్ కశ్మీర్ ప్లెబిసైట్ సంస్థ ఆ తర్వాత జమ్మూ–కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్‌గా మారినప్పుడు వారి లక్ష్యం రెండు వైపులా గల కశ్మీరీలను వేరుపరిచి స్వతంత్ర దేశాన్ని నెలకొల్పడం. ఆ సంస్థను ఇండియా, పాకిస్తాన్ రెండూ అణచి వేశాయి. ఆ సంస్థ ముగిసిన తర్వాత కొంత కాలానికి 26 పార్టీలు, సంస్థలతో ఆల్ పార్టీ హుర్రియత్ కాన్ఫరెన్స్ ఏర్పడింది. నేను ఆ సంస్థ ముఖ్య నాయకులు కొందరితో మాట్లాడాను. విషయం ఏమంటే... లిబరేషన్ ఫ్రంట్ రెండు దేశాలను వ్యతిరేకించే కశ్మీరీ జాతీయవాద సంస్థ కాగా, హుర్రియత్లో కొద్దిమంది మాత్రమే పాకిస్తాన్ అనుకూలురు. సామాన్య ప్రజానీకంలో అత్యధికులు పాకి స్తాన్‌కు ఎంతమాత్రం అనుకూలురు కాదు. అదే సమయంలో వారందరికీ ఇండియాపై తీవ్రమైన ఫిర్యాదులున్నాయి. ఈ ద్వంద్వ స్థితిని అర్థం చేసుకోవాలంటే ముందు చరిత్రలోకి వెళ్లి, తర్వాత స్వాతంత్య్రానంతర వర్తమానంలోకి రావాలి. మొదటి నుంచి హిందూమతం ఉండిన కశ్మీర్లోకి క్రీస్తు పూర్వమే బౌద్ధం బలంగా ప్రవేశించింది. అశోకుడు (శ్రీనగర్‌ను స్థాపించింది ఆయనే), కుషాణులు బాగా వ్యాపింప చేశారు. మధ్య ఆసియా వర్తకుల ద్వారా ఇస్లాం వచ్చిన తర్వాత 14వ శతాబ్దంలో సూఫీ యిజం విస్తరించింది. ఈ విధమైన బౌద్ధం, సూఫీయిజం కలగలిసిన ప్రభావాలు కశ్మీరీల విశ్వాసాలు, ఆలోచనలు, సంస్కృతులపై వేసిన బలమైన ముద్రలు నేటికీ ఉన్నాయి. అందువల్లనే వారు జనసంఖ్య రీత్యా మెజారిటీ సున్నీలే అయినా పాకిస్తాన్‌లోని జనాభాతో, అక్కడి పాలకులతో ఏకీభావం లేదు. 1947లో లేదు. ఇప్పటికీ లేదు. అయితే, రెండు వైపులగల జాతి అనే భావన మాత్రం ఉంది. అందుకే కశ్మీర్ మొత్తంగా స్వతంత్రం కావాలని ప్రయత్నించిన రోజులలో లిబరేషన్ ఫ్రంట్‌కు విస్తారమైన సానుభూతి లభించింది. ఈ భావనలు తెలిసినందువల్లనే కశ్మీర్ ప్రతిపత్తిపై ప్లెబిసైట్ జర పాలన్న ప్రతిపాదన కొందరు చేయగా, ఇండియాతో పాటు పాక్ కూడా వ్యతిరేకించింది. స్వతంత్ర కశ్మీర్ వారికి కూడా సరిపడనిదే!మారని మౌలిక దృష్టిఇదంతా చరిత్రతో పాటు, 1947 అనంతరపు తొలినాళ్ల పరిస్థి తులు. ఆ తర్వాతకు వచ్చి, మూడు విషయాలను చూస్తే చిత్రం పూర్తవుతుంది. ఒకటి, పాకిస్తాన్‌పట్ల ఆ తర్వాత కూడా, చివరకు మిలిటెన్సీ కాలంలోనూ జనబాహుళ్యంలో ప్రేమ కలగకపోవడం. రెండు, ఇండియాపైన కూడా ప్రేమ ఏర్పడకపోవడం. అయినప్పటికీ పాకిస్తాన్‌తో పోల్చినప్పుడు ఇండియా మెరుగనుకోవడం. మూడవది భవిష్యత్ గురించి వారి ఆలోచనలు. ప్రత్యేక దేశంగా ఏర్పడినాక పాకిస్తాన్లో ఉంటూ వచ్చిన పరి స్థితులు ఇటువైపు కశ్మీరీలకు నచ్చలేదు. అభివృద్ధి, ప్రజల జీవి తాలు, శాంతి భద్రతలు, అప్రజాస్వామికతలు, సైనిక కుట్రలతో పాటు, అటువైపు గల తమ కశ్మీర్ సోదరులు, బంధుమిత్రుల పరి స్థితి, హక్కుల లేమి, అణిచివేతలు అందుకు తోడయ్యాయి. అటు చేరినా తాము బాగుపడేది ఏమున్నది కనుక అనే ప్రశ్నను నేను అన్నివైపుల నుంచీ విన్నాను. తమ మిలిటెంట్ యువకులకు అక్కడి నుంచి సహాయం అందటం వరకు కొంత సానుకూలతను కల్పించినా, మౌలికమైన దృష్టి మాత్రం మారలేదు. ఇండియా స్వతంత్రమైన తర్వాత 40 సంవత్సరాల వరకు కశ్మీర్లో మిలెటెన్సీ లేదు. నిజానికి ఆ కాలమంతా నేషనల్ కాన్ఫ రెన్స్, కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశంలో ఎక్కడా లేనంత విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డాయి. అభివృద్ధి మృగ్యమై తీవ్ర అసంతృప్తి ఏర్ప డింది. అయినా కేంద్ర ప్రభుత్వాలు చేసింది శూన్యం. అది చాలద న్నట్లు ప్రజాస్వామిక విధి విధానాలతో నిమిత్తం లేకుండా రాజ కీయ క్రీడలు యథేచ్ఛగా సాగించాయి. కశ్మీర్ ఒక సున్నిత స్థితిలో గల సరిహద్దు రాష్ట్రం, పాకిస్తాన్ అవకాశం కోసం పొంచి ఉన్నదనే స్పృహ సైతం లేకుండా పోయింది.అటువంటి పరిస్థితులతో ఇక ఓపిక నశించిన ప్రజలు 1987 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ రెండింటినీ ఓడిస్తు న్నట్లు ఓట్ల లెక్కింపులో స్పష్టమవుతుండగా... కనీవిని రీతిలో రిగ్గింగ్ జరిపి తామే గెలిచారు. పట్టరాని ఆగ్రహానికి గురై మిలిటెన్సీ మార్గం పట్టింది. పాకిస్తాన్ ఆ అవకాశాన్ని అందుకుంది. అప్పటి నుంచి 35 సంవత్సరాలుగా మిలిటెన్సీనైతే గణనీయంగా అణిచి వేశారు గానీ ప్రజలు విశ్వాసాన్ని సంపాదించలేక పోయారు. మధ్యలో ఆ ప్రయత్నాలు జరిగింది వీపీ సింగ్, పీవీ నరసింహా రావుల కాలంలో మాత్రమే. ప్రజలు కూడా వారిని విశ్వసించారు. బీజేపీ రాకతో పరిస్థితి తిరిగి క్షీణమార్గం పట్టింది. టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నరేంద్ర మోదీ (ప్రధాని) రాయని డైరీ
సమస్య అనుకుంటే ప్రతిదీ సమస్యే. జెన్–జీ సమస్యే. పునర్విభజన బిల్లు సమస్యే. రామ మందిరంలో విరాళాల చోరీ సమస్యే. క్యాబినెట్ మార్పులూ సమస్యే. నిజంగా సమస్యలైనవి కొన్ని ఉంటాయి... అవసలు సమస్యలే కాదని ఎంత అనుకున్నా సమస్యలు కాకుండా పోనివి! ఆరెసెస్ను సంతోషంగా ఉంచటం నిరంతర సమస్య. ఒక్క ఏడాదైనా, ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు లేకుండా ఉండక పోవటం నిరవధిక సమస్య. ఆగస్టు 13తో వర్షాకాల సమావేశాలు ముగుస్తున్నాయి. సభ లోపల సమస్యలతో సమస్య లేదు. ఆ సంగతి స్పీకర్ ఓం బిర్లా చూసుకుంటారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు చూసుకుంటారు. స్పోక్స్ పర్సన్ సంవిత్ పాత్రా చూసుకుంటారు. మాటకు మాట చెప్పవలసి వస్తే ఎంపీ దినేష్ శర్మ చూసుకుంటారు. వీళ్ల కాక, చూసీ చూడనట్లు చూసుకునే ‘ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్’ రాజ్‌నాథ్ సింగ్, ‘నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్’ అమిత్ షా ఎటూ ఉంటారు. టీమ్ అంతా కలిసి సమస్యలు కానివాటిని, సమస్యలు కానివాటితో డీల్ చేస్తుంది. చివరికి వచ్చేసరికి ఏదీ సమస్య కాకుండా పోతుంది. ఏదీ సమస్య కానప్పుడు, పడుకున్న 8 సెకన్ల లోపే గాఢ నిద్ర పట్టేస్తుంది. ఒక దేశ ప్రధానికి పడుకున్న ఎనిమిది సెకన్లకే గాఢ నిద్ర పట్టేయటం దేశ సౌభాగ్యానికి సంకేతం. దేశ ఆర్థికాభివృద్ధికి సూచిక. ‘‘మా త్రివిధ దళాలు కళ్లు తెరిచే ఉన్నాయి’’ అని శత్రు దేశాలకు హెచ్చరిక. ‘‘దేశంలో శాంతి భద్రతలు లేవు’’ అని ఆరోపిస్తున్న ప్రతి పక్షాల నోటికి ఆనకట్ట. సభలో ఈ చివరి మూడు రోజులను కూడా మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సాగనిచ్చేలా లేరు. వాళ్ల ఆందోళన, నిరసన, డిమాండ్ ఒక్కటే... కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు ఎందుకు రావటం లేదో చెప్పాలని! తరగతి గదిలో అల్లరి చేస్తున్న పిల్లల మధ్యలోంచి ఒక మంచి విద్యార్థి లేచివెళ్లి, తరగతి బయట కాస్త దూరంగా చెట్టుకింద కూర్చుని తన క్లాస్ వర్క్ కంప్లీట్ చేసుకుంటూ ఉండటంలో జాతికి హితం కానిది ఏముంటుంది? వీళ్లు శీతాకాల సమావేశాలనైనా సజావుగా నడవనిస్తారా?! అప్పటికి ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’పై రిపోర్ట్ కూడా సిద్ధమై పార్లమెంటుకు వచ్చేస్తుంది. అదొస్తే, అందులోని ఏదో ఒక పాయింట్‌ను సపోర్ట్‌గా తీసుకుని పునర్విభజన బిల్లును మళ్లీ సభలో ప్రవేశపెట్టటానికి ఉంటుంది. వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల ఎన్నికలున్నాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో ఇప్పుడున్నది బీజేపీ కనుక అక్కడ మళ్లీ బీజేపీనే వస్తుంది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి కనుక అక్కడ ఈసారి బీజేపీ వస్తుంది. ఎన్నికలు సమస్య కాదు. సభలో బిల్లులు సమస్య కాదు. ఖర్గే, రాహుల్ సమస్య కాదు. ఆరెసెస్ను సంతృప్తి పరచటం ఒక్కటే సమస్య ఇప్పుడు! ‘‘జెన్–జీ ఆందోళనలో న్యాయం ఉంది’’ అని అంటున్నారు ఆరెసెస్ చీఫ్ మోహన్ భాగవత్! ‘‘విద్యార్థులపై పోలీసు చర్య వెనుక అసలేం జరిగిందో నాకు తెలుసుకోవాలని ఉంది’’ అంటున్నారు! ‘‘జెన్–జీని నేను గుడ్డిగా నమ్ముతాను’’ అంటున్నారు! జెన్–జీ వాదనను ఓపికతో వినాలని, వాళ్ల డిమాండ్లను ప్రేమతో అర్థం చేసుకోవాలని అంటున్నారు!అంటే, చెట్టుకింద కూర్చుని క్లాస్ వర్క్ చేస్తున్న మంచి స్టూడెంట్‌ని మంత్రి వర్గం నుంచి డిబార్ చెయ్యాలని చెబుతున్నారా? జెన్–జీని ఇక్కడ ఎవరు మాత్రం గుడ్డిగా నమ్మటం లేదు?! జెన్–జీ వాదనను ఇక్కడ ఎవరు మాత్రం ఓపికతో వినటం లేదు?! అర్థం చేసుకోని వారికంటే కొన్నిసార్లు బాగా అర్థం చేసుకునేవారే సమస్యగా మారతారు. నిద్ర కూడా పట్టకుండా చేస్తారు. -
అమెరికాను నిలబెట్టిన 'విలువలు ఏమిటి'?
ఒక చరిత్రకారుడిగా, ఒక చిన్న రాజకీయ–చారిత్రక చిత్రాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను. మీలో చాలా మంది 21వ శతాబ్దంలో జన్మించారు. అమెరికాలో జన్మించినవారు 2001 సెప్టెంబర్ 11 (9/11) ఉగ్రదాడుల ప్రభావంలో పెరిగారు. 1814లో అమెరికా క్యాపిటల్ భవనం, వైట్ హౌస్‌కు బ్రిటిష్ సైన్యం నిప్పంటించిన తర్వాత... యూఎస్ఏ భూభాగంపై జరిగిన తొలిపెద్ద విదేశీ దాడి అదే. మీరు పెరుగుతున్న సమ యంలో అమెరికా ప్రభుత్వం ఇరాక్, అఫ్గానిస్తాన్‌లలో రెండు దీర్ఘకాల యుద్ధాలు చేసింది. నా కంటే ముందు తరాలకు మాత్రం అమెరికా కేంద్ర ప్రభుత్వం ఎంతో సమర్థంగా కనిపించేది. అధ్యక్షులు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, హ్యారీ ట్రూమన్ దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి రెండో ప్రపంచ యుద్ధంలో విజయాన్ని సాధించారు. వ్యోమగాములను చంద్రుడిపైకి!1960ల ప్రారంభంలో యువతకు ఫెడరల్ ప్రభుత్వం అంటే దేశంలో ఆధునిక రహదారులు నిర్మించడం, అమెరికా వ్యోమగాములను చంద్రుడిపైకి పంపడం వంటి గొప్ప విజ యాలు గుర్తుకు వచ్చేవి. అప్పట్లో సోవియట్ యూనియన్‌తో జరుగుతున్న పోటీలోనూ అమెరికా ముందంజలో ఉండేది. 1965లో అధ్యక్షుడు, కాంగ్రెస్ కలిసి ఒక చారిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చారు. రెండు ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులు కూడా ఎంతో గౌరవంగా భావించిన ఆ చట్టమే... 1965 ఓటింగ్ హక్కుల చట్టం. మీ తరం మాత్రం అమెరికా ఫెడరల్ ప్రభుత్వ చరిత్రలోని మరో కోణాన్ని కూడా చూసింది. వియత్నాం యుద్ధంలో వేలాది మంది యువ అమెరికన్లు ప్రాణాలు కోల్పోయిన విషాదాన్ని మీరు చదివారు. అలాగే మీ కళ్ల ముందే ధనికులు–పేదల మధ్య అంతరం పెరగడం చూశారు. ఎంతో మంది అమెరికన్లు తమ ‘అమెరికన్ డ్రీమ్‘ సాధించే అవకాశాన్ని కోల్పోవడమూ గమనించారు. కరోనా మహమ్మారి అనే విషాదాన్ని మనమందరం అనుభవించాం. ఆ మహమ్మారి ప్రభావం ఇప్పటికీ మన జీవి తాలపై ఉంది. ఆ వ్యాధి వల్ల పది లక్షలకు పైగా అమెరికన్లు మరణిస్తారని అప్పట్లో మనలో ఎవరైనా ఊహించామా? ఇప్పుడు మనం అమెరికా స్వాతంత్య్ర ప్రకటనకు 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో సమావేశమయ్యాం. ఒక్కసారి చరిత్రలోకి చూస్తూ... అమెరికాను బలంగా నిలబెట్టిన ఆరు గొప్ప సంప్రదాయాల గురించి చెప్పాలనుకుంటున్నాను. మొదటి విలువ–చట్టం అందరికీ సమానం:నా దృష్టిలో మొదటి గొప్ప సంప్రదాయం చట్ట పరిపాలన (రూల్ ఆఫ్ లా). ప్రతి పౌరుడికి సమాన న్యాయం లభించడం. న్యాయ వ్యవస్థలో ఎవరికీ ప్రత్యేక సౌకర్యాలు ఉండకపోవడం. అలాగే ఎవరికీ ప్రత్యేక శిక్షలు కూడా ఉండకపోవడం. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానులే అనే సూత్రాన్ని మనం ఎప్ప టికీ కాపాడుకోవాలి. రెండో సంప్రదాయం–స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు:ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు తన ప్రజాస్వామ్య బాధ్యతను నిర్వర్తించే అవకాశం కలిగి ఉండాలి. బ్రిటన్ రాజరిక వ్యవస్థలా కాకుండా, అమెరికా వ్యవస్థాపకులు దేశ పాలనా అధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టారు. వారు ప్రభుత్వ పని తీరును ఓటు ద్వారా అంచనా వేస్తారు. ఎన్నికలు అంటే అదే. యుద్ధం జరిగినా ఎన్నికలు ఆగలేదు. అమెరికా అంతర్యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఎన్నికలు రద్దు చేయాలని కొంతమంది మేధావులు సూచించారు. కొంతమంది మరింత ముందుకెళ్లి, ఫెడరల్ సైన్యాన్ని రాష్ట్రాల్లో మోహరించి, పోలింగ్ కేంద్రాలను ఆధీనంలోకి తీసుకోవాలనీ, అవసరమైతే మార్షల్ లా కూడా అమలు చేయాలనీ కోరారు. కానీ అంతర్యుద్ధం సమయంలో అబ్రహాం లింకన్, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రూజ్వెల్ట్ కేవలం ఒకే వాక్యంలో సమాధానం చెప్పారు: ‘ఎన్నికలు యథావిధిగా జరగాలి’. అలా చేయడం ద్వారా అమెరికా ప్రజాస్వామ్యం ఎంత బలమైనదో, ఎంత స్థిర మైనదో ప్రపంచానికి చూపించాలని వారు కోరుకున్నారు. మూడో విలువ – నిజాయితీతో కూడిన రాజకీయ వ్యవస్థ:మూడో గొప్ప సంప్రదాయం ఏమిటంటే... దేశ వ్యవస్థాప కులు నిజాయితీ, పారదర్శకత, సామర్థ్యం, నైతికత, కరుణ, మర్యాద, త్యాగస్ఫూర్తి వంటి విలువలతో నడిచే రాజకీయ వ్యవస్థను కలగన్నారు. అధ్యక్షులు జాన్ ఎఫ్.కెన్నెడీ, రోనాల్డ్ రీగన్ తరచూ అమెరికాలోని తొలి కాలనీ గవర్నర్ జాన్ విన్త్రోప్ చెప్పిన మాటలను గుర్తు చేసేవారు. ఆయన ఇలా చెప్పారు: ‘ప్రపంచం మొత్తం మనల్ని గమనిస్తోంది. కాబట్టి మనం కొండపై వెలిగే నగరంలా ఆదర్శంగా ఉండాలి’. ఫిలడెల్ఫియా లోని వాల్నట్ స్ట్రీట్ ప్రాంతంలో థామస్ జెఫర్సన్ ఒక గొప్ప కల కనేవారు. పారదర్శకమైన, నిజాయితీతో కూడిన, మిత వ్యయంతో, గౌరవప్రదంగా, సమర్థవంతంగా పనిచేసే రాజ కీయ వ్యవస్థ ఏర్పడితే... ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రపంచమంతా వ్యాపిస్తుంది అని ఆయన నమ్మారు.నాలుగో విలువ–ప్రతి పౌరుడిలో నాయకత్వం ఉండాలి:దేశానికి నాయకత్వం అనేది కేవలం వాషింగ్టన్ డి.సి.లోని ప్రభుత్వానికే పరిమితం కాకూడదు. 1776లో బ్రిటన్ లో అన్ని ముఖ్యమైన నిర్ణయాలు రాజే తీసుకునేవాడు. కానీ అమెరికా వ్యవస్థాపకులు వేరే విధంగా ఆలోచించారు. ఒకవేళ ప్రజలకు అధ్యక్షుడు, కాంగ్రెస్ లేదా సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలు నచ్చకపోతే... వారు రాజకీయాల్లో చురుకుగా పాల్గొని దేశాన్ని సరైన దిశలో నడిపించాలని ఆశించారు. మాజీ అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ ఒక గొప్ప మాట చెప్పేవారు: ‘అమెరికాలో అత్యంత గొప్ప హోదా ‘మిస్టర్ ప్రెసిడెంట్’ కాదు. ‘మిస్టర్ సిటి జన్’(పౌరుడు)! అమెరికా రాజ్యాంగం ప్రకారం... ప్రజలు అధ్యక్షుడి కోసం పనిచేయరు. అధ్యక్షుడే ప్రజల కోసం పనిచేయాలి.ఐదో విలువ – చరిత్రకారులు, మేధావుల బాధ్యత:ఐదో సంప్రదాయం... అమెరికా సమాజంలో చరిత్రకా రులు, పరిశోధకులు, మేధావులకు ప్రత్యేకమైన స్థానం ఉండాలి. దేశ వ్యవస్థాపకులు విమర్శ కూడా ప్రజాస్వామ్యానికి అవసర మేనని భావించారు. రాజరిక వ్యవస్థల్లో, నియంతృత్వ పాలనల్లో కనిపించేలా కాకుండా... అమెరికా వ్యవస్థాపకులు నిరంతర ఆత్మపరిశీలన ద్వారా సమాజాన్ని మెరుగుపరచాలని విశ్వసించారు. దేశాన్ని పొగిడేవారికే కాదు... దేశంలోని లోపాలను నిర్మాణాత్మకంగా విమర్శించేవారికీ సమాన గౌరవం ఇవ్వాలని నమ్మారు. గొప్ప అమెరికన్ నాయకుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ మాటలను నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. ఆయన చెప్పిన అత్యంత ముఖ్యమైన సందేశం ఏమిటంటే... ‘ప్రతి పౌరుడి తొలి బాధ్యత అధికారాన్ని ప్రశ్నించడమే’! కానీ 2026లో అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.లోని కొందరు రాజకీయ నాయకులు, చరిత్రకారులు తమకు అను కూలంగా మాత్రమే మాట్లాడాలని కోరుకుంటున్నారు. సర్కస్‌లో చెప్పినట్లు చెప్పే విదూషకుల్లా వారు ప్రవర్తించాలని ఆశిస్తున్నారు. అమెరికా చరిత్రలో జరిగిన తప్పులు, లోపాలు బయటపడితే వాటిని పట్టించుకోవద్దని లేదా వాటికి సాకులు చెప్పాలని వారు కోరుతున్నారు. అమెరికా వ్యవస్థాపకులు ఇలాంటి ఆలోచనను చూసి బాధపడేవారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమైనది. చరిత్రను మార్చే ప్రయత్నాలు మరింత ప్రమాదకరం. కొంతమంది రాజకీయ నాయకులు... నల్లజాతి చరిత్రలోని కీలకమైన అంశాలను తగ్గించి చూపాలని, లేదా పూర్తిగా తొలగించాలని ఒత్తిడి తెస్తున్నారు. అది అమెరికా విలువలకు విరుద్ధం. ఆరో విలువ – జాతీయ ఐక్యత:నేను చెప్పబోయే ఆరు గొప్ప సంప్రదాయాల్లో చివరిది... జాతీయ ఐక్యత. అమెరికా వ్యవస్థాపకులు ప్రజలు రాజకీయాలపై భిన్నాభిప్రాయాలు కలిగి ఉండవచ్చని అంగీకరించారు. వారు పరస్పరం చర్చించాలి, వాదించాలి. కానీ చివరికి ఒకేదేశ ప్రజలమనే భావనను కోల్పోకూడదని ఆశించారు. బ్రిటిష్ రాజరికంలో లాగా రాజభవనం నుంచి ఆదేశాలు రావడం కాకుండా... ప్రజలే దేశ భవిష్యత్తును నిర్ణయించాలని వారు విశ్వసించారు. వ్యవస్థాపకులు అధ్యక్షుడిని ప్రభుత్వ అధినేత గానే కాకుండా, దేశ రాజకీయ నాయకుడిగానూ రూపొందించారు. జార్జ్ వాషింగ్టన్‌ను ఆదర్శంగా తీసుకొని, ఎప్పటి కప్పుడు దేశాన్ని ఏకం చేసే నాయకులు రావాలని వారు ఆశించారు. మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ‘అమెరికా అనేది ఒక అందమైన రంగురంగుల మొజాయిక్’(అందమైన చిత్రం) అన్నారు. అంటే... భిన్న సంస్కృతులు, విభిన్న అభిప్రాయాలు ఉన్నా అందరూ కలిసి దేశాన్ని నిర్మిస్తారని ఆయన ఉద్దేశం. అబ్రహాం లింకన్ చెప్పినట్లుగా... ‘పరస్పర ప్రేమ, అనుబంధాలే మనందరినీ ఎప్పటికీ కలిపి ఉంచుతాయి’. -
అనుబంధ వ్యవసాయమే జీవధార
ఈ రోజుల్లో రైతు వ్యవసాయం చేయడం ఒక్కటే సరిపోవడం లేదు. ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు పెరుగుతుండగాపంటల ధరలు మాత్రం ఎప్పుడూ ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. కొన్ని సంవత్సరాల్లో వర్షాభావం, మరికొన్ని సంవత్సరాల్లో అధిక వర్షాలు, తెగుళ్లు రైతును నష్టాలకు గురిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం రావాలంటే వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయ మార్గాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఇదే భావనతో శాస్త్రవేత్తలు, ప్రభుత్వం, వ్యవ సాయ విశ్వవిద్యాలయాలు ‘ద్వితీయ వ్యవసాయం’ (సెకండరీ అగ్రికల్చర్) అనే భావనను ప్రోత్సహిస్తున్నాయి.పంటను పండించడం ప్రాథమిక వ్యవసాయం. ఆ పంటను ప్రాసెసింగ్ చేయడం, విలువను పెంచడం, ప్యాకింగ్ చేయడం, వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి కొత్త ఉత్పత్తులను తయారు చేయడం, పశుపోషణ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను ద్వితీయ వ్యవసాయం అంటారు. ‘పంటను మాత్రమే అమ్మకుండా, పంటతో పాటు మరిన్ని ఉత్పత్తులను తయారు చేసి ఆదాయం పెంచుకోవ డమే ద్వితీయ వ్యవసాయం’.విలువ జోడించండి–ఎక్కువ ధరను పొందండిచాలా మంది రైతులు పంట కోసిన వెంటనే మార్కెట్‌కు తీసు కెళ్లి అమ్మేస్తారు; అప్పుడు ధర తక్కువగా ఉంటుంది. అదే పంటను ప్రాసెసింగ్ చేసి అమ్మితే మంచి లాభం వస్తుంది. వరిని బియ్యంగా మార్చడం, బియ్యంతో అటుకులు, మరమరాలు తయారు చేయడం, వేరుశనగతో నూనె, పీనట్ బటర్ తయారు చేయడం, మిరపతో మిరప పొడి తయారు చేయడం, పసుపును పాలిష్ చేసి పసుపు పొడిగా విక్రయించడం, మామిడితో జ్యూస్, జామ్, పల్ప్ తయారు చేయడం ఈ కోవలోకే వస్తాయి. దీనివల్ల రైతు సాధారణంగాపొందే ధర కంటే 20–100 శాతం వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. చిరుధాన్యాలకు విలువ జోడించడం ద్వితీయ వ్యవసాయంలో అత్యంత లాభదాయకమైన, స్థిరమైన మార్గం. ముడి ధాన్యాన్ని మాత్రమే విక్రయించే బదులు, పిండి, రవ్వ, రెడీ–టు–కుక్, రెడీ–టు–ఈట్, బేకరీ, ఆరోగ్య ఆహార ఉత్పత్తులుగా మార్చి బ్రాండ్ పేరుతో విక్రయిస్తే గణనీయమైన ఆదాయాన్ని పొందవచ్చు. భారతదేశంలో ప్రతి సంవత్సరం పండ్లు, కూరగాయలు, ధాన్యాలలో గణనీయమైన నష్టం కోత అనంతరం సంభవిస్తుంది. సరైన నిల్వ, గ్రేడింగ్, ప్యాకింగ్ లేకపోవడం దీనికి ప్రధాన కారణం. ఒక గ్రామంలోనే చిన్న రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు, పప్పు మిల్లు లేదా మసాలా పొడి తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే రైతులకు దగ్గరలోనే మార్కెట్ లభిస్తుంది. అదనంగా గ్రామ యువతకు కూడా ఉపాధి లభిస్తుంది.అనుబంధ ఆదాయ మార్గాలురైతు ఇంట్లో రెండు ఆవులు లేదా గేదెలు ఉన్నా ప్రతి రోజు నగదు ఆదాయం వస్తుంది. పాలను నేరుగా అమ్మడం కంటే పెరుగు, నెయ్యి, పనీర్, వెన్న, చీజ్ తయారు చేసి అమ్మితే మరింత లాభం వస్తుంది. పాడి పరిశ్రమ రైతు కుటుంబానికి సంవత్సరం పొడవునా ఆదాయాన్ని అందించే అత్యుత్తమ అనుబంధ వృత్తి. అలాగే తేనెటీగల పెంపకానికి ఎక్కువ భూమి అవసరం లేదు. దీని ద్వారా తేనె, బీస్వాక్స్, రాయల్ జెల్లీ లభిస్తాయి. వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు వంటి వ్యవసాయ అవశేషా లను ఉపయోగించి పుట్టగొడుగులను పెంచవచ్చు. చిన్న గదిలోనే సాగు చేయవచ్చు. వ్యవసాయ కుంటలు, చెరువులు, ఫార్మ్పాండ్లలో చేపల పెంపకం చేపట్టవచ్చు. వరిసాగుతో పాటు చేపల పెంపకం చేపడితే ఒకే భూమి నుండి రెండు రకాల ఆదాయంపొందవచ్చు. వ్యవసాయం, పశుపోషణ ఒకదానికొకటి పరస్పర అనుబంధమైనవి. పంట అవశేషాలు పశుగ్రాసంగా ఉపయోగపడ తాయి. వర్మీ కంపోస్ట్, బయోగ్యాస్, సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి పశువుల పేడ ఉపయోగపడుతుంది. చాలా మంది రైతులు వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, చెరకు ఆకులు వంటి అవ శేషాలను కాల్చివేస్తారు. అలా చేయకుండా వాటిని ఉపయోగించి వర్మీకంపోస్ట్, బయోగ్యాస్, బయోచార్‌కు వినియోగించ వచ్చు.స్వపరాగ సంపర్క పంటల్లో వరి, శనగ, పెసర, మినుము, ఉలవలు, వేరుశనగ నాణ్యమైన విత్తన ఉత్పత్తి అనేది ద్వితీయ వ్యవసాయం కింద అత్యంత లాభదాయకమైన కార్యకలాపాలలో ఒకటి. తక్కువ విస్తీర్ణంలో సాగుచేయగలిగే మల్లె, గులాబీ, బంతి వంటి పూల సాగుతో పాటు తులసి, కలబంద, అశ్వగంధ, లెమన్ గ్రాస్ వంటి ఔషధ, సుగంధ మొక్కల సాగు ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. ఇటీవలి కాలంలో నగర ప్రజలు గ్రామీణ జీవనశైలిని అనుభ వించడానికి ఆసక్తి చూపుతున్నారు. రైతులు తమ పొలాల్లో ప్రకృతి సందర్శన, సేంద్రీయ వ్యవసాయ ప్రదర్శనలు, గ్రామీణ ఆహారం, పంటల సందర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కూడా అదనపు ఆదాయం పొందవచ్చు.పోషకాహార లోపం తొలగించేలా...పంటల సాగు నిలిచిపోతే రైతులు, గ్రామీణ కుటుంబాల ఆదాయం దెబ్బ తింటుంది. దీనిని నివారించేందుకు ప్రతి ఇంటా నాటుకోళ్లను పెంచాలి. సొంత వినియోగానికే కాకుండా... గుడ్లు, మాంసానికి సంవత్సరమంతా ఆదాయం ఉంటుంది. గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ, స్వర్ణధార, శ్రీనిధి వంటి మేలురకం కోడి పిల్లలను పెంచవచ్చు.గ్రామీణ ప్రాంతాల్లో ఐదు సంవత్సరాల్లోపు పిల్లల మరణాలకు 69 శాతం కారణం పోషకాహార లోపమే.సంప్రదాయ భారతీయ ఆహారంలో ప్రొటీన్ల లోపం ఉంటుంది. వంద గ్రాముల కోడిగుడ్లలో లభించే 6.9 గ్రాముల నాణ్యమైన ప్రొటీన్ తక్కువ ధరకే లభిస్తుంది. కోడి మాంసంలో కూడా 22 శాతం ప్రొటీన్ ఉండి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఉత్పత్తి అవుతున్న కోడిగుడ్లు, కోడి మాంసంలో 75–80 శాతాన్ని పట్టణాల్లో ఉండే 25 శాతం జనాభా తింటుంటే... గ్రామీణ ప్రజలు ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ అంతరాన్ని తొలగించడానికి పెరటి కోళ్ళ పెంపకం ఎంతో దోహదపడుతుంది.ప్రభుత్వ పథకాలైన ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల అభివృద్ధి పథకం, జాతీయ తేనెటీగలు మరియు తేనె మిషన్, డెయిరీ అభివృద్ధి పథకాలు, నాబార్డ్ గ్రామీణ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల పథకాలు, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా శిక్షణ, రుణాలు, సబ్సిడీలు పొందవచ్చు. నేటి పరిస్థితుల్లో ‘పంట పండించడం మాత్రమే కాదు... పంటకు విలువ జోడించడం కూడా రైతు విజయానికి కీలకం. ‘వ్యవసాయంలో వైవిధ్యం – రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం’ అనే లక్ష్యంతో ద్వితీయ వ్యవసాయాన్ని ప్రతి గ్రామంలో విస్తృతంగా ప్రోత్సహించాలి.– డా‘‘ కె. తేజస్వర రావు, డా‘‘ బి. సహదేవ రెడ్డి-ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ సీనియర్ శాస్త్రవేత్తలు -
రేర్ ఎర్త్ ఖనిజాల్లో ఇండియా ఎక్కడ?
రేర్ ఎర్త్ ఖనిజాల కోసం ప్రపంచ దేశాల మధ్య పోటీ మరింత వేగం పుంజుకుంటు న్నట్లు ఇటీవల చోటుచేసుకుంటున్న పరి ణామాలు సూచిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ రంగంలో దాదాపు గుత్తాధిపత్యం చలాయించిన చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు అమెరికా సహా పలు దేశాలు, ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థ లను అభివృద్ధి చేయడంపై భారీగా పెట్టు బడులు పెడుతున్నాయి. ఈ ఖనిజాల తవ్వకం, శుద్ధీకరణ, శాశ్వత అయస్కాంతాల తయారీని వేగవంతం చేయడానికి ఇటీవల అమెరికా ప్రభుత్వం ‘మైన్–టు–మాగ్నెట్’ పథకం కింద భారీ ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించింది. భారత్ కూడా ఈ దిశలో అడుగులు వేస్తోంది. అణుశక్తి శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఐఆర్ఈఎల్ విశాఖపట్నంలో రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాల తయారీ కేంద్రం ఏర్పాటుకు చర్యలను వేగవంతం చేసింది. అంతకుముందు కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ‘రేర్ ఎర్త్ కారిడార్లు’ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. భిన్న దేశాల్లో, భిన్న సందర్భాల్లో దాదాపు ఒకే సమయంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలన్నీ ఒకే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి– అసలు రేర్ ఎర్త్ ఖనిజాల కోసం ప్రపంచ దేశాలు ఎందుకు ఇంత తీవ్రంగా పోటీ పడుతున్నాయి?ఎందుకు రేర్?పేరులో ‘రేర్’ అనే పదం ఉన్నప్పటికీ, ఇవి ప్రకృతిలో అత్యంత అరుదుగా లభించే ఖనిజాలు కావు. భూమి పొరల్లో అనేకప్రాంతాల్లో లభిస్తాయి. అయితే, అధిక స్వచ్ఛతతో, లాభదాయకంగా తవ్వి, ఇతర ఖనిజాల నుంచి సులభంగా వేరు చేసి శుద్ధి చేయగల నిల్వలు మాత్రం పరిమితంగానే ఉన్నాయి. అందుకే వీటికి ‘రేర్’ అనే విశేషణం వచ్చింది. అలాగే ‘ఎర్త్’ అనే పదం కూడా ఆ ఖనిజాల మూలస్థానమైన మట్టినిగానీ, నేలనుగానీ సూచించదు. తొలినాళ్లలో ఈ మూలకాలు భూమి నుంచి వెలికితీసిన ఖనిజ ఆక్సైడ్ల రూపంలోనే శాస్త్రవేత్తలకు మొదటిసారిగా పరిచయం కావడంతో, వాటికి ‘రేర్ ఎర్త్’ అనే పేరు స్థిరపడింది. మొత్తం 17 రేర్ ఎర్త్ మూల కాలు ఉన్నాయి.ఈ మూలకాలపై ప్రపంచం ఇంతటి ఆసక్తి చూపడానికి ప్రధాన కారణం, సాధారణ లోహాలకు భిన్నంగా ఉండే వాటి అసాధారణ రసాయన, భౌతిక లక్షణాలే. వీటితో తయారయ్యే శాశ్వత అయ స్కాంతాలు పరిమాణంలో చిన్నవైనా, ఆకర్షణ శక్తిలో బలంగా ఉంటాయి. విద్యుత్ వాహనాల మోటార్లు, విండ్ టర్బైన్లు, విమా నాలు, రక్షణ రంగ పరికరాల్లో సుమారు 200 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకునే అధిక ఉష్ణోగ్రతల్లోనూ డిస్ప్రోసియం వంటి రేర్ ఎర్త్ మూలకాలు తమ అయస్కాంత శక్తిని పదిలపరచుకోగలవు. ఎందుకంత ప్రాముఖ్యం?ఇవి నేడు మనం నిత్యం ఉపయోగిస్తున్న అనేక ఆధునిక పరిక రాలకు కీలక ఆలంబనగా మారాయి. స్మార్ట్‌ఫోన్ , ఎల్ఈడీ టీవీ, ఇయర్‌బడ్స్, విద్యుత్ వాహనం, విండ్ టర్బైన్ , ఎంఆర్ఐ యంత్రం, ఉపగ్రహాలు, క్షిపణులు, యుద్ధ విమానాలు– ఇలా నేడు మనం ఉపయోగించే దాదాపు ప్రతి ఆధునిక పరికరం తయారీలో రేర్ ఎర్త్ మూలకాల పాత్ర ఉంటుంది. వీటిలో నియోడిమియంను అత్యంత శక్తిమంతమైన శాశ్వత అయస్కాంతాల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తే, లాంథనం అధిక నాణ్యత గల కెమెరా లెన్సులు, బ్యాటరీల తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. కృత్రిమ మేధ, రోబోటిక్స్, అంతరిక్ష సాంకేతికత, స్వయంనియంత్రిత వాహనాల వంటి సమకాలీన ఆవిష్కరణలకు కూడా ఈ మూలకాలే చోదక శక్తిగా నిలుస్తున్నాయి.కోవిడ్ మహమ్మారి, తాజాగా హోర్మూజ్ జలసంధి చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ సరఫరా శృంఖలల బలహీనతను మరోసారి తేటతెల్లం చేశాయి. అత్యవసర వనరుల కోసం ఒకే దేశంపై అధికంగా ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ప్రపంచం అనుభవపూర్వకంగా ఈ సందర్భాల్లో గ్రహించింది. ఇదే సమయంలో అమెరికా, చైనా మధ్య సాంకేతిక ఆధిపత్య పోటీ తీవ్ర తరమైంది. రేర్ ఎర్త్ ఎగుమతులపై చైనా పరిమితులు విధించడం ఆందోళనను మరింత పెంచింది. ప్రపంచంలోనే అత్యధిక రేర్ ఎర్త్ ఖనిజ నిల్వలు చైనాలో లేనప్పటికీ, గత మూడు దశాబ్దాల కృషి ఫలితంగా ఈ రంగంలో గుత్తాధిపత్యం మాత్రం దానిదే. ముడి ఖనిజాల తవ్వకంతో ఆగిపోకుండా, వాటి శుద్ధీకరణ, శాశ్వత అయ స్కాంతాలు, నాణ్యమైన ఉత్పత్తుల తయారీ వరకు మొత్తం విలువ గొలుసుపై చైనా క్రమంగా ఆధిపత్యం సాధించింది.భారత్ ఏం చేయాలి?భారత్‌లో విస్తారమైన రేర్ ఎర్త్ నిల్వలు ఉన్నప్పటికీ, వెలికితీత అనంతర దశల్లో ఇంకా వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా తన వ్యూహానికి పదును పెట్టుకుంటూ, రేర్ ఎర్త్ ఖనిజాల తవ్వకానికే పరిమితం కాకుండా, అనుబంధ పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ తయారీ కేంద్రాన్ని ఐఆర్ఈఎల్ ప్రతిపాదించడం ఆహ్వానించదగ్గ పరిణామం. రేర్ ఎర్త్ ఖనిజాల రంగంలో ప్రపంచంతో పోటీ పడాలంటే గనులతో పాటుగా వాటిని శుద్ధి చేయగల, శాశ్వత అయస్కాంతా లుగా మలచగల, అత్యాధునిక ఉత్పత్తులుగా తీర్చిదిద్దగల నిపుణుల లభ్యత కూడా కీలకం. ఈ దిశగా భారతదేశంలో ఇప్పటివరకూ అంతగా ఆదరణకు నోచుకోని మెటలర్జికల్ ఇంజినీరింగ్, మెటీరి యల్స్ సైన్స్, రేర్ ఎర్త్ సాంకేతికతలను మరింత ప్రోత్సహించాలి. ఐఐటీలు, ఎన్ ఐటీలు, ఇతర విశ్వవిద్యాలయాల్లో రేర్ ఎర్త్ మెటలర్జీ, క్రిటికల్ మినరల్స్, మాగ్నెట్ టెక్నాలజీ వంటి ప్రత్యేక కోర్సులు, పరిశోధన కేంద్రాల ఏర్పాటు తక్షణావసరం. అయితే వీటికి సమర్థమైన ప్రత్యామ్నాయాలను కనుగొనగలమా? సముద్ర గర్భం, చంద్రుడిపై ఉన్న ఈ ఖనిజ నిక్షేపాలను వినియోగించడం సాధ్యమవుతుందా? వీటి తవ్వకం, శుద్ధీకరణ వల్ల కలిగే పర్యావరణ ప్రభావాలను ఎలా నియంత్రించాలి? ఈ ప్రశ్నలకు లభించే సమాధానాలు పరిశోధనా సంస్థలకే పరిమితం కాకూడదు. అవి సామాన్య ప్రజలకు ఉపయోగపడే, అందుబాటులో ఉండే ఉత్పత్తులు, సాంకే తిక పరిష్కారాలుగా రూపాంతరం చెంది నప్పుడే ఆ పరిశోధనల పరమార్థం నెరవేరినట్లవుతుంది.కృష్ణ బాలాజి పల్లపోతువ్యాసకర్త బ్యాంకింగ్ రంగ నిపుణులు -
అణుదాడిని మరిస్తే శాంతి నెలకొనదు!
1945 ఆగస్టు 6 ఉదయం 8:15 గంటలకు హిరోషిమాలో ఉదయపు హడావుడి మొదలైంది. వీధుల్లో కార్లు శబ్దం చేస్తూ వెళ్తున్నాయి, ఆఫీసు ఉద్యోగులు తమ బల్లల వద్ద కుదురుకుంటున్నారు, పిల్లలు పాఠశాలలకు సిద్ధమవుతున్నారు. అంతలోనే, ఒక్క క్షణంలో, సూర్యుడి కంటే అత్యంత ప్రకాశవంతమైన కాంతి నగర మంతటా వ్యాపించింది. ఒక అమెరికా బి–29 బాంబర్ ‘ఎనోలా గే’ ప్రపంచంలోనే తొలి సారిగా అణుబాంబును జారవిడిచింది. ఆకాశంలోకి మష్రూమ్ క్లౌడ్ (పుట్టగొడుగు లాంటి పొగ) ఎగిసిపడటంతో క్షణాల్లో పదివేల మంది ప్రాణాలు కోల్పోయారు. 1945 చివరి నాటికి, పేలుడు, తీవ్రమైన కాలిన గాయాలు, రేడియేషన్ కారణంగా సుమారు 1,40,000 మంది మరణించారు.ఆ బాంబు దాడిని ప్రత్యక్షంగా చూసిన వారిలో తమేతో ఉఎమోరి ఒకరు. అప్పట్లో 40 ఏళ్ల వయసున్న ఉఎమోరి, మరుసటి రోజు తన కుటుంబ సభ్యుల కోసం శిథిలాలలో వెతకడం ప్రారంభించారు. ఆ క్రమంలో, గాయపడిన వారికి సహాయం చేయడానికి ప్రయత్నించారు. ఆయన ఎటు చూసినా ఊహకు అందని దారుణ దృశ్యాలే: గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన జనాలు, నీళ్ల కోసం అరుస్తున్న బాధితులు, బూడిదగా మారిన పొరుగు ప్రాంతాలు. మరణించిన వారి దేహాలపై ఈగలు, పురుగులు ముసురుకోవడం ప్రారంభించాయని ఉఎమోరి 1987లో తన 88వ ఏట ‘అసోసియే టెడ్ ప్రెస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ఆ బాంబు దాడిలో తన తమ్ముడితో సహా సొంత కుటుంబ సభ్యులు మరణించారని ఆయన చివరికి తెలుసుకున్నారు. ఆ జ్ఞాపకాలు ఆయనను ఎన్నడూ వదల్లేదు.దుఃఖం నుంచి పోరాటానికి...హిరోషిమా అనుభవించిన ఘోరాన్ని మరెవరూ అనుభవించ కుండా చూడటానికి ఉఎమోరి తన మిగిలిన జీవితాన్ని అంకితం చేశారు. అణు బాంబు దాడుల నుండి ప్రాణాలతో బయటపడిన అనేకమంది ’హిబాకుషా’లలో ఒకరిగా మారారు. వీరు తమ వ్యక్తి గత విషాదాన్ని అణు ఆయుధాలకు వ్యతిరేకంగా జీవితకాల పోరా టంగా మార్చుకున్నారు. తదనంతరం మరణించిన ఉఎమోరి, 1987 నాటి తన ఇంటర్వ్యూలో, అణు నిరాయుధీకరణ గురించి ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. అది నేటికీ అత్యంత అత్యవసరమైనది. విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూసిన మరొక వ్యక్తి శాండ్ఫోర్డ్ జెడ్. పర్సన్స్. రెండవ ప్రపంచ యుద్ధంలో యు.ఎస్. నేవీలో పనిచేశారు. బాంబు దాడి జరిగిన నాలుగు నెలల తర్వాత ఆయన హిరోషి మాలో పనిచేస్తున్నప్పుడు, తాను ఊహించినదానికి భిన్నమైన విధ్వంసాన్ని చూశారు. నగరంలోని అనేక ప్రాంతాలు తుడిచి పెట్టుకుపోయాయి. ఆ అనుభవం పర్సన్స్‌ను వెంటాడింది. చివరికి శాంతి కోసం తనను అంకితం చేసుకున్నారు. వరల్డ్ ఫెడరలిస్ట్ మూవ్మెంట్ డైరెక్టర్‌గా మారి, 1984లో మరణించే వరకు అణు ఆయుధాల ముప్పును తగ్గించే అంతర్జాతీయ ఒప్పందాల కోసం పోరాడారు. ఒకరు జపనీస్, మరొకరు అమెరికన్. వారు చరిత్రలోనే అత్యంత విధ్వంసకర యుద్ధంలో పరస్పరం వ్యతిరేక దిశల్లో నిలబడ్డారు. అయినప్పటికీ, మానవాళి భవిష్యత్తు అణు ఆయు ధాలు మళ్లీ ఎప్పటికీ ఉపయోగించకుండా చూడటంపైనే ఆధారపడి ఉంటుందని ఇద్దరూ నమ్మారు.ఆయుధం వర్సెస్ ఆహారంయునైటెడ్ స్టేట్స్ 1945 ఆగస్టు 6న హిరోషిమాపై, మూడు రోజుల తర్వాత ఆగస్ట్ 9న నాగసాకిపై మరో అణు బాంబునువేసింది. రెండవ ప్రపంచ యుద్ధాన్ని ముగించడానికి ఈ దాడులు అవసరమా లేదా జపాన్ ను ఇతర మార్గాల ద్వారా లొంగిపోయేలా చేయవచ్చా అనే దానిపై చరిత్రకారులు ఇప్పటికీ విశ్లేషిస్తూనే ఉన్నారు. అయితే వివాదానికి తావులేని విషయం ఏమిటంటే, ఆ బాంబు దాడులు అణు ఆయుధాల అసమాన విధ్వంసక శక్తిని నిరూపించాయి. మానవాళి వెనక్కి రాలేని ఒక తీవ్రమైన సరిహద్దును దాటేసింది. హిరోషిమా, నాగసాకిలను నాశనం చేసిన బాంబులు ఆధు నిక ప్రమాణాలతో పోలిస్తే ప్రాథమికమైనవి (చిన్నవి). నేటి అణు ఆయుధాలు అంతకంటే విధ్వంసకరమైనవి. ఆర్మ్స్ కంట్రోల్ అసో సియేషన్ ప్రకారం, ప్రపంచంలోని అణుశక్తి దేశాలు సంయుక్తంగా 12,000 కంటే ఎక్కువ అణు ఆయుధాలను కలిగి ఉన్నాయి. చాలా వరకు హిరోషిమాను నాశనం చేసిన బాంబు కంటే ఎంతో శక్తిమంత మైనవి. ఒకే ఒక ఆధునిక థర్మోన్యూక్లియర్ ఆయుధం ఒక మహా నగరాన్నే తుడిచిపెట్టగలదు.ఐరిష్ రచయిత పాట్రిక్ కమర్‌ఫోర్డ్ మరో ముఖ్యమైన కోణాన్ని ప్రస్తావించారు. ఒక్క అణు క్షిపణికి అయ్యే ఖర్చుతో వేలాదిమంది పిల్లలకు ఆహారం, స్వచ్ఛమైన నీరు, మందులను అందించవచ్చని ఆయన అన్నారు. అణు ఆయుధాలను ఎప్పటికీ ప్రయోగించక పోయినా అవి భారీ ఖర్చును మోపుతాయి. ఆయుధాగారాలను నిర్వహించడానికి, ఆధునికీకరించడానికి ప్రభుత్వాలు అపారమైన నిధులను వెచ్చిస్తాయి. అణు నిల్వలను విస్తరించడానికి వెచ్చించే ప్రతి రూపాయి ప్రజారోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు లేదా శాస్త్రీయ పరిశోధనలకు లభించకుండా పోతుంది.ఒప్పందాలతోనే శాంతిభద్రత ముఖ్యమైనదే. రక్షణ గురించి దేశాలకు ఆందోళనలు ఉంటాయి. అయితే ఆయుధ నియంత్రణ ఒప్పందాలు ప్రపంచాన్ని మరింత సురక్షితంగా మార్చాయని చరిత్ర నిరూపిస్తోంది. అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ) అణు ఆయుధాల వ్యాప్తిని పరిమితం చేయడానికి సహాయపడింది. కోల్డ్ వార్ కాలంలో వాషింగ్టన్, మాస్కో మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాలు వేలాది అణు ఆయుధాలను నిర్మూలించాయి. యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా ప్రపంచంలోనే అతిపెద్ద అణు ఆయుధాగారాలను కలిగి ఉన్నాయి. కాబట్టి ప్రమాదాన్ని తగ్గించే విషయంలో అవే అత్యధిక బాధ్యత వహించాలి. ఉక్రెయిన్ యుద్ధం, ఇతర ప్రాంతీయ సంక్షోభాలను పరిష్కరించే ప్రయత్నా లతో పాటు ఈ శక్తుల మధ్య తీవ్రమైన చర్చలు జరగాలి. చరిత్రలో ఆయుధ నియంత్రణ విజయవంతమైంది దేశాలు ఒకరినొకరు నమ్మడం వల్ల కాదు, ఉమ్మడి ముప్పు సహకారాన్ని కోరుతుందనే విషయాన్ని గుర్తించడం వల్లనే!హిరోషిమాను ప్రత్యక్షంగా చూసిన తరం వేగంగా కనుమరుగ వుతోంది. 1945 నాటి ఆ ఆగస్టు రోజున తాము ఏమి చూశారో వివ రించగలిగే బాధితులు త్వరలోనే ఎవరూ ఉండరు. మిగిలేది వారి మాటలు, వారి హెచ్చరికలు, వారు మనకు వదిలివెళ్లే బాధ్యత మాత్రమే. తమేతో ఉఎమోరి తన జీవితాంతం ప్రపంచాన్ని హిరోషిమాను గుర్తుంచుకోమని కోరింది అది కేవలం చరిత్ర అని కాదు. ఆయన జీవించిన చరిత్ర మళ్లీ పునరావృతం కాకూడదని! హిరోషిమా అణుబాంబు దాడి రోజు కేవలం జ్ఞాపకార్థ దినం మాత్రమే కాకూడదు. ఇది ‘నిరాయుధీకరణ దినోత్సవం’ కావాలి. ప్రభుత్వాలు అణు ప్రమాదాలను తగ్గించడానికి అంకితం చేసుకునే రోజు, సాధారణ పౌరులు అలా చేయాలని డిమాండ్ చేయడానికి పునరంకితం అయ్యే రోజు కావాలి. బాధితులు ఇప్పటికే తమ సాక్ష్యాన్ని ప్రపంచానికి అందించారు. మనం దానికి అనుగుణంగా స్పందిస్తామా లేదా అనేది మన చేతుల్లోనే ఉంది.విలియమ్ ల్యాంబర్స్వ్యాసకర్త ‘ద రోడ్ టు పీస్’ రచయిత(‘ద జపాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
శాస్త్రీయ శోధనే విశ్వాసానికి పరీక్ష
ఇటీవల పార్లమెంట్లో గోమూత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు వినవచ్చాయి. ప్రవేశ పరీక్ష సంస్కరణలపై సత్వర కార్యాచరణ బృందంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మద్రాసు) డైరెక్టర్ వీళినాథన్ కామకోటిని నియమించిన సందర్భంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ‘ఫంగల్, బ్యాక్టీరియల్, ఇన్ఫ్లమేటరీలకు నిరోధకంగా’ పనిచేయగల శక్తి గోమూత్రానికి ఉందనీ, అవి ‘వైజ్ఞానికంగా కూడా ప్రదర్శితమయ్యా’యనీ గత ఏడాది జనవరిలో ఒక బహిరంగ సమావేశంలో కామకోటి పేర్కొన్నారు. గోమూత్రంపై కామకోటి అభిప్రాయాలను తోసిపుచ్చడం రాజ్యాంగంలో పేర్కొన్న శాస్త్రీయ దృక్పథాన్ని తక్కువ చేయడం అవుతుందంటూ కొందరు విద్యావేత్తలు కామకోటికి మద్దతు పలికారు. తాను నిజమని నమ్మేదానిని ‘తాత్కాలికంగా ప్రతిపాదించే, సంప్రదాయ విజ్ఞానాన్ని చర్చకు పెట్టే’ హక్కు కామకోటికి ఉందని వారు అన్నారు. కోల్‌కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ కూడా కామకోటికి వత్తాసు పలికారు. అధికారిక మద్దతుగోమూత్రం, పేడపై పరిశోధన కొత్తదేమీ కాదు. గోమూత్ర గుణాల గురించి 1970లు, 1980లలో కూడా కొన్ని క్లెయిములు వినవచ్చాయి. పరిశోధనా పత్రాలు వెలువడ్డాయి. కానీ, వాటిని అల్పమైనవిగానే పరిగణిస్తూ వచ్చారు. అటువంటి పరిశోధనకు అధికారిక మద్దతు లభించడం కొత్త ధోరణి. వాటికి ఐఐటీలు, ఐఐఎంల డైరెక్టర్ల వంటి ఉన్నత స్థాయి విద్యావేత్తల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. అయితే, వారు బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ లేదా డ్రగ్ డిస్కవరీ వంటి రంగాల్లో నిపుణులై ఉండనక్కరలేదనే సంగతిని ఈ సందర్భంగా చాలామంది విస్మరిస్తున్నారు. ఒక అంశాన్ని పరిశోధనకు పెట్టేటప్పుడే దాన్ని శాస్త్రీయంగా నిరూపించాలనుకోవడం వల్ల ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాల ప్రభావం దానిపై ఉంటుంది. దేన్నో ధ్రువీకరిం చాలనే పక్షపాత వైఖరి పరిశోధనకు మేలు చేయదు. మానవ దేహం, దానికొచ్చే వ్యాధులు, వాటిని నయం చేసే మార్గాల గురించి ప్రాచీన గ్రంథాలు, సంప్రదాయ విజ్ఞానం చెప్పే అంశాలు ఎంత స్థూలంగా ఉంటాయంటే, వాటిని ఏ ఆధునిక ఆవిష్కరణ లేదా భావనకైనా వర్తింపజేయెచ్చు. దాని ఆలంబనగా ప్లాస్టిక్ సర్జరీ, మూలకణ చికిత్స, పునరుత్పత్తి సాంకేతికత, ఉపగ్రహ కమ్యూనికేషన్ వంటివన్నీ ప్రాచీన భారతదేశంలో వాడుకలో ఉన్నవే అంటూంటారు. గోమూత్రానికి కూడా అదే విధంగా విలువను ఆపాదించే వైఖరిని కనబరుస్తున్నారు. కొన్ని ఖనిజాల జాడలు, అమైనో ఆమ్లాలు, చిన్న గొలుసులతో కూడిన చిన్న ప్రొటీన్ భాగాలు గోమూత్రంలో లేదా దాని పేడలో కనిపించినంత మాత్రాన దాని వైద్య గుణగణాలకవి తగినంత రుజువు కాబోవు. ఎందుకంటే, అలాంటివి మానవ మూత్రంలోనూ, ఎద్దులు, జడలబర్రె, లేళ్ళు వంటి ఇతర క్షీరదాలలో కూడా కనిపిస్తాయి. మహా అయితే, అటువంటి పరిశోధన సూడోసైన్స్ పరిధిలోకి వస్తుంది. యూరిన్ కెమిస్ట్రీని వర్ణించేందుకు కొంత వైజ్ఞానిక పరిభాషను ఉపయోగిస్తారు కనుక అది సైన్స్‌గా కనిపిస్తుంది. నవ భారతానికి ప్రాచీన జబ్బుకీమోథెరపీ సంబంధిత తక్కువ ప్లేట్లెట్ కౌంట్ల సమస్యకు తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారంగా బొప్పాయి ఆకుల నుంచి తీసిన దానిని వినియోగించుకోవచ్చని ఒక నూతన అధ్యయనంలో తేలినట్లు ప్రభుత్వం ఇటీవల పేర్కొంది. ఆ అధ్యయన ఫలితాలను ఒక ఆంకాలజీ జర్నల్‌లో ప్రచురించారు. కానీ, స్వతంత్ర నిపుణుల అభ్యంతరాలతో ఆ పత్రిక ఆ ఫలితాలను పునః సమీక్షించుకోవాల్సి వచ్చింది. బొప్పాయి ఆకుల నుంచి తీసిన పదార్థ ప్రభావం గొప్పగా ఉందని చూపేందుకు, ఆ పదార్థాన్ని ఉపయోగించినా ఫలితం చూపని రోగుల వివరాలను ఆ అధ్యయన ఫలితాలకు జోడించలేదని స్వతంత్ర నిపుణులు అభ్యంతరం తెలిపారు. పసుపు వేరులలో లభించే రసాయన పదార్థం కర్కుమిన్ విషయంలోనూ ఇదే జరిగింది. క్యాన్సర్‌తో సహా పలు వ్యాధులకు ఆ మూలిక గొప్ప ఔషధంగా పనిచేస్తుందని ప్రచారం చేశారు. కర్కుమిన్పై భరత్ అగర్వాల్ అనే అమెరికన్ పరిశోధకుడు రాసిన 30కి పైగా పరిశోధన పత్రాలను అంతర్జాతీయ పత్రికలు వెనక్కి తీసుకున్నాయి. గుండె వ్యాధి ముదిరే ప్రక్రియపై భారత–మధ్యధరా సముద్ర తీర ప్రాంత ఆహారపు అలవాట్లు చూపగల ప్రభావంపై మొరాదాబాద్‌కు చెందిన ఆర్.బి. సింగ్ 1990లలో పరిశోధించారు. ఆయన మన ఆహార అలవాట్లను ఇజ్రాయెల్, స్లొవేకియా ప్రాంతవాసుల ఆహార అలవాట్లతో పోల్చి చూశారు. వాటిని లాన్సెట్, బ్రిటిష్ మెడికల్ జర్నల్స్‌లో ప్రచురించారు. కొద్ది ఏళ్ళ తర్వాత, ఆ అధ్యయనానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్ డేటా సాధికారతను కొందరు ఇండిపెండెంట్ సైంటిస్టులు ప్రశ్నించారు. అధ్యయనానికి చెందిన ఒరిజినల్ డేటాను కోరినప్పుడు, ఆ పత్రాలను చెద పురుగులు తినేశాయని సింగ్ జవాబిచ్చారు. ధ్రువీకరించాలనుకునే వైఖరి వల్ల సేఫ్టీ అంశాలు కూడా పక్కనపడతాయి. ప్రాచీన గ్రంథాల్లో పేర్కొన్న నేచురల్ రెమిడీల వల్ల దుష్ఫలితాలు ఏవైనా సంభవిస్తాయేమో చూడనవసరం లేదనడం కూడా తప్పుడు వాదనే అవుతుంది. ఒక మొక్క నుంచి లభ్యం కాగల జీవరసాయన పదార్థాలు కూడా ఆ మొక్క పెరిగిన భూమిపై ఆధారపడి ఉంటాయి. తిరిగి గోమూత్రం విషయానికొస్తే, దానిలో హానికరమైన బ్యాక్టీరియా ఉన్నందువల్ల , దాని సేవనం మానవులకు హానికరం కావచ్చని ఇండియన్ వెటర్నరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయంలో తేలింది. చైనా ఉదాహరణచైనాలోనూ సంప్రదాయ వైద్యానికి ఆదరణ ఉంది. కానీ, అక్కడ మతపరమైన లేదా భావజాల ఆధారిత వైఖరిని అనుసరించడానికి బదులుగా శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించి వినిమయాన్ని చేపట్టారు. ఉదాహరణకు, మలేరియాపై పనిచేసే ఆర్టిమైసినిన్ కనుగొన్నందుకు తు యుయు అనే చైనా సైంటిస్టుకు 2015లో నోబెల్ బహుమతి లభించింది. ప్రాచీన గ్రంథాల్లో పేర్కొన్నవాటిని తిరుగులేని సత్యాలుగా తీసుకునే బదులు, వాటిని ఒక ఐడియాగా తీసుకుని, ఈ ప్రాజెక్టు కింద 400లకు పైగా మొక్కలను పరీక్షించి చూశారు. ఒక మాలిక్యూల్‌ను వేరు చేసి, ఔషధంగా అభివృద్ధి చేయడానికి ముందు యాభై ఏళ్ళకు పైగా నిరంతర ప్రయోగాలు నిర్వహించారు. ఆ డిస్కవరీని కూడా ప్రాచీన గ్రంథాల గొప్పదనాన్ని నిరూపించినదిగాకాక, కాలపరీక్షకు నెగ్గిన సైంటిఫిక్ పద్ధతులకు తార్కాణంగానే పేర్కొన్నారు. భారతీయ విజ్ఞాన పద్ధతులను ప్రోత్సహించే పేరుతో సందేహాస్పద సంస్థల, పరిశోధకుల అధ్యయనాలకు సౌజన్యం వహించడాన్ని సైన్స్ ఏజన్సీలు మానుకోవాలి. ప్రభుత్వం చొరవ చూపకపోతే, అకాడమీలే కలసికట్టుగా ముందుకు వచ్చి పరిశోధనల్లో నిజాయతీకి పాటుపడే ఒక స్వతంత్ర సంస్థను, ఒక రకమైన రిసెర్చ్ అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేసుకోవాలి. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
పౌర స్వేచ్ఛలో తేడాలెందుకు?
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక దేశాల మధ్య పౌర స్వేచ్ఛలకు సంబంధించి ముఖ్యమైన తేడా ఒకటుంది. ఆ తేడా ప్రభావాలు అనేక విధాలుగా కనిపిస్తున్నాయి. గతంలో, వర్తమానంలోనే కాదు, మునుముందు కూడా కనిపించగల అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కనుక ఆ తేడాను, అందుకు కారణాలను అర్థం చేసుకునేందుకు ఒక ప్రాథమికమైన ప్రయత్నం అవసరం. ప్రతి దేశానికి అంతర్గత విధానాలు సరేసరి కాగా, విదేశాంగ విధానం ఒకటి ఉంటుంది. అది దేశ ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందుతుందనేది తెలిసిందే. అట్లా అనుగుణం అని తాము భావించే విధంగా విదేశాంగ విధానాన్ని ప్రభుత్వాలు రూపొందిస్తాయి. అనగా ఆ సమయంలో అధికారంలో ఉండే పార్టీలు. ఆ విధానాలలో కొన్ని స్థిరంగా ఉంటాయి. కొన్ని పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. కానీ సదరు విధానం, లేదా విధానాలు దేశ ప్రయోజనాలకు అనుగుణమైనవి కావనీ, నష్టం కూడా కలిగించవచ్చుననీ ప్రతిపక్షాలో, మీడియానో, మేధావులో భావించినట్లయితే, ఆ విధానాలను నిష్కర్షగా విమర్శించే పౌర స్వేచ్ఛలు ఎంతవరకు ఉంటున్నాయి? ఆ స్వేచ్ఛలలో తేడాలెందుకు?నచ్చనిది ముఖం మీదే...ఈ ప్రశ్న విదేశాంగ విధానాల గురించి ఇతరత్రా రావటం సరేసరి కాగా, యుద్ధ సందర్భాలలో మరింత తీవ్రంగా తలెత్తుతుంది. యుద్ధమన్నది మహా సున్నితమైన విషయం, భావోద్వేగాలతో కూడా ముడిపడి ఉండేది గనుక. అటువంటి సందర్భాలలో ప్రభుత్వాలు ఒక విధానాన్ని అనుసరిస్తున్నపుడు, ఆ విధానం దేశ ప్రజలకు అవసరమని చెప్తున్నపుడు, ఆ యుద్ధం వల్ల అటువంటి ప్రయోజనాలేవీ లేవని భావించేవారు విభేదించి మాట్టాడవచ్చునా? ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో, రాజ్యాంగ భావ ప్రకటనా స్వేచ్ఛను, లేదా పౌర స్వేచ్ఛను ఇస్తున్నపుడు, అటువంటి అవకాశం కాగితం పైన ఉన్నా ఆచరణలో ఎంతవరకు లభిస్తున్నది? ఇపుడు నిర్దిష్టమైన ఉదాహరణలను చెప్పుకుంటే విషయం ఇంకా బోధపడుతుంది. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై పాలస్తీనాపై యుద్ధాలు సాగిస్తున్నాయి. అవి ఆ రెండు దేశాల ప్రయెజనాలకు అవసరమని చెప్తున్నాయి. కానీ ఆ వాదనతో విభేదించే అమెరికన్, ఇజ్రాయెల్ పౌర సమాజాలు, మీడియా, మేధావి వర్గాలు, రిటైరయిన సైన్యాధికారులు పెద్ద సంఖ్యలోనే తమ ప్రభుత్వ విధానాలను కేవలం నర్మగర్భంగా గాక, ప్రత్యక్షంగా, తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎప్పటికప్పుడు జరిగే ప్రజాభిప్రాయ సేకరణలలో ప్రభుత్వ విధానాలకు ఆమోదం నానాటికి తగ్గిపోతున్నది. అమెరికా, ఇజ్రాయెల్ రెండు దేశాలలోనూ పౌర స్వేచ్ఛలు ఈ విధంగా ప్రజాస్వామికంగా, నిర్భయమైన రీతిలో వ్యక్తమవుతున్నాయి. ఆ విధానాలు దేశ ప్రయోజనాలకు ఏ విధంగా భంగకరమో వారు వివరించి చెప్తున్నారు. ఇంకా అనాలంటే చెప్పగలుగుతున్నారు. వాస్తవానికి అమెరికా, యూరప్‌లలో ఈ ప్రజాస్వామిక స్వేచ్ఛలు మొదటి నుంచి ఉన్నాయి. మనవరకు చూస్తే వియత్నాం యుద్ధకాలం నుంచే కనిపిస్తున్నాయి. దేశద్రోహం పేరిట...ఇటువంటి పౌర స్వేచ్ఛలు భారతదేశం మొదలైన ప్రజాస్వామిక వ్యవస్థలలో ఉన్నాయా? ఉంటే ఎంతవరకు? ఇది ఇండియాకే కాదు, ఇటువంటి వర్ధమాన దేశాలు అన్నింటికి సంబంధించినది. ప్రస్తుత మధ్య ఆసియా యుద్ధాలనే చూద్దాము. అక్కడ ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా, గల్ఫ్ రాజ్యాల కోణం ఒకటున్నది. అది గాక ఇజ్రాయెల్– పాలస్తీనా– అమెరికా కోణం మరొకటి. రెండూ దుర్మార్గమైన యుద్ధాలే అయినా, మొదటి దానికి సంబంధించి భారత ప్రభుత్వం గల్ఫ్ నుంచి ఇంధనం, ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పని చేస్తున్న భారతీయుల సంక్షేమం అనే అంశాలను పేర్కొంటున్నందున ఆ మేరకు అర్థం చేసుకోవచ్చు. కానీ రెండవది?ఇజ్రాయెల్‌తో సంబంధాల సాధారణీకరణ గతంలోనే జరిగినా, ఇపుడు గాజా హత్యాకాండతో సమస్య తీవ్ర రూపం తీసుకుంది. అటువంటపుడు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆ దారుణాన్ని ఖండించకపోవటమే గాక, ఇక్కడి నుంచి ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరాలను సైతం అనుమతిస్తున్నది. ఐక్యరాజ్య సమితిలో ద్వంద్వ ధోరణి చూపుతున్నది. ఇందుకు గల కారణాలలో ఇజ్రాయెల్ ప్రభుత్వపు ఇస్లాం వ్యతిరేకతతో ప్రస్తుత భారత ప్రభుత్వానికి గల ఏకీభావం కూడా ఒకటనే అభిప్రాయం ఉంది. ఇజ్రాయెల్‌లోని అరబ్బులను అక్కడి ప్రభుత్వం హతమార్చకుండానే ఒక పద్ధతి ప్రకారం ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చుతున్నట్లు, దానితో ప్రేరణ చెందిన ఇక్కడి ప్రభుత్వం కూడా అదే మార్గంలో ఉందనే సందేహాలున్నాయి. ప్రశ్న ఏమంటే, ఇటువంటి అంచనాలను, విమర్శలను వ్యక్తీకరించేందుకు భారత దేశంలో గల పౌర స్వేచ్ఛ ఎంత? ఇది ఒక వర్తమానపు ఉదాహరణ మాత్రమే. గతంలోకి వెళితే అనేకం ఉన్నాయి. ఉదారవాద ప్రజాస్వామిక పార్టీ అనుకునే కాంగ్రెస్ పరిపాలనలో కూడా, అదేవిధంగా, పైన అనుకున్నట్లు ఇది ఇండియాలోనే గాక, వర్ధమాన దేశాలన్నిటా కనిపిస్తున్న పరిస్థితి. అందువల్ల ఈ చర్చ భారత దేశానికి పరిమితమైనది కాదు. స్థూలంగా చెప్పుకోవాలంటే, పౌర స్వేచ్ఛలలో ఇటువంటి తేడాలు అభివృద్ధి చెందిన దేశాలలో ఒక విధంగా, వర్ధమాన దేశాలలో మరొక విధంగా కనిపిస్తున్నాయి. వర్ధమాన దేశాలలో ఆ స్వేచ్ఛలు లేకపోవటమే గాక వాటిని దేశ ద్రోహం పేరిట, మత ద్రోహం పేరిట, మరో పేరిట అణిచివేయటం కూడా జరిగితే?స్థిరపడని విలువలుఇవన్నీ చెప్పుకున్న తర్వాత, ప్రపంచంలోని ప్రజాస్వామిక వ్యవస్థలను అభివృద్ధి చెందినవి, వర్ధమాన స్థితిలో ఉన్నవి అని స్థూలంగా విభజించి చూసినపుడు, రెండింటి మధ్య ఈ తేడాలెందుకనే మౌలికమైన ప్రశ్న గురించి చర్చించటం అవసరం. ఇంత లోతైన విషయం తేలికగా అర్థమయ్యేది కాదు. కానీ ఒక ప్రాథమిక ప్రయత్నమంటూ జరగాలి. ఆ విధంగా చూసినపుడు తోస్తున్నవి కొన్నున్నాయి. మనం అభివృద్ధి చెందిన దేశాలంటున్నవి పెట్టుబడిదారీ విధానంలో ఎదిగి వచ్చినవి. ఆ క్రమంలో పౌరులకు తమ హక్కులు, స్వేచ్ఛలు, వాటిని కాపాడుకోవడం అన్నది, వారి వ్యక్తిత్వాలు, వ్యక్తిగత గుర్తింపులు రూపుదిద్దుకునే క్రమంలో ఒక సంప్రదాయంగా మారింది. ఇవన్నీ వారి ప్రజాస్వామ్యంలో భాగమయ్యాయి. వాటిని వారు బలంగా కాపాడుకుంటారు. ఇందుకు పునాదులు రినైజాన్స్–పునరుజ్జీవనోద్యమం (14–17 శతాబ్దాలు), ఫ్రెంచ్ విప్లవం (18వ శతాబ్దం), ఇంగ్లండ్‌లో పారిశ్రామిక విప్లవం (18వ శతాబ్దం నుంచి)లో పడ్డాయి. అప్పటి నుంచి ప్రజాస్వామ్యాలు, వ్యక్తి స్వేచ్ఛలు, పౌర స్వేచ్ఛలు వ్యవస్థీకృత రూపం తీసుకుని బలపడ్డాయి. అక్కడి పార్టీలు, ప్రభుత్వాలు, వాటి విధానాలు ఎట్లున్నా ఈ వ్యవస్థలు, స్వేచ్ఛలు మారలేదు. అదే నేటికీ కనిపిస్తున్నది. ఇందుకు భిన్నంగా, వర్ధమాన దేశాలనేవి చిరకాల ఫ్యూడల్ దశలు, రాచరికాలు, వలస పాలనల నుంచి బయటకు రావటం మొదలై ఇంకా వంద సంవత్సరాలు కూడా కాలేదు. యూరప్ తరహా విప్లవాలు రాలేదు. విలువలు ఇంకా నిజమైన అర్థంలో రూపుదిద్దుకోలేదు. పౌరుల వ్యక్తిత్వాలు, పౌర స్వేచ్ఛలు ఇంకా బలపడి వ్యవస్థీకృత రూపం తీసుకోలేదు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలనే చట్ట సభలు, పాలనా యంత్రాంగం, న్యాయస్థానాలు కూడా ఇంకా తమ స్ఫూర్తికి అనుగుణంగా స్థిరపడి బలపడవలసే ఉంది. అందువల్ల ఈ ఎదుగుదల వ్యత్యాసాలే మొదట చెప్పుకున్న వ్యత్యాసాలకు కూడా కారణమవుతున్నాయనిపిస్తున్నది.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
పశ్చిమాసియాలో ప్రమాదకర పాచికలాట
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ 2025 నవంబర్ 18న అమెరికా సందర్శించారు. పౌర అణు శక్తి వినియోగ సహకారంపై సంప్రదింపులు పూర్తయ్యాయని అదే రోజు సంయుక్త ప్రకటన వెలువడింది. ఆ మేరకు ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న కోట్లాది డాలర్ల పౌర అణు శక్తి భాగస్వా మ్యానికి దీనితో చట్టపరమైన పునాది ఏర్పడిందని వైట్ హౌస్ పేర్కొంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ప్రమాణాలను పకడ్బందీగా పాటిస్తూ సహకారాన్ని ఇచ్చిపుచ్చు కోనున్నట్లు ప్రకటించారు. అయినా, అణ్వస్త్ర నిర్మాణ వ్యాప్తిపై ఇది అటు ఇజ్రాయెల్, ఇటు యూఏఈలలో ఆందోళనను రేకెత్తించడంతో ఈ అంశం మరింత జటిలంగా మారింది. అబ్రహాం ఒప్పందాలతో ముడిఇపుడు అమెరికా–సౌదీ ఒప్పందాన్ని సౌదీ అరేబియా అబ్రహాం ఒప్పందాలకు కట్టుబడి ఉండే అంశంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముడిపెట్టారు. పౌర అణు ఒప్పందానికి ఆమోదం తెలుపడం చిటికెలో పని. కాకపోతే ‘చాలా మన్నన పొందిన, సఫలమైన అబ్రహాం ఒప్పందాలకు సౌదీ అరేబియా పూర్తిగా కట్టుబడి ఉండాలి’ అని ట్రంప్ జూలై 23న బాహాటంగానే వెల్లడించారు. యురేనియంను ‘శుద్ధి చేసే సామగ్రి’ ఉండబోదని కూడా ట్రంప్ తెలిపారు. కానీ, యురేనియంను శుద్ధి చేయడాన్ని నివారించే నియమ నిబంధనలు ఒప్పందం ముసాయిదాలో కొరవడ్డాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా రెండింటిని ముడిపెట్టడంతో మొత్తం పరిస్థితి మారి పోయినట్లు అయింది. ఇది ఇక ఎంతమాత్రం అణు శక్తిని పౌర అవస రాలకు వినియోగించుకునేందుకు సంబంధించినదిగానో లేదా రష్యా, చైనాలను దూరం పెట్టేందుకు కుదుర్చుకున్నదిగానో లేదు. దౌత్యం ఒక లావాదేవీగా తయారైంది. అసలే అణు శక్తి చిక్కు ముడులతో కూడుకున్న దక్షిణాసియాలో ఇది ఇంకా గుబులు రేపు తోంది. ట్రంప్ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం వెంటనే స్వాగతించింది. సౌదీ గుర్తింపు ‘మధ్య ప్రాచ్యంలో శాంతి స్థాపనకు సంబంధించి ఒక చారిత్రక ముంద డుగు’ అని అది జూలై 23న వ్యాఖ్యానించింది. ఇజ్రాయెల్ అంగీకరించినట్టేనా?తెరవెనుక పరిస్థితులను బట్టి ఈ సమన్వయం ఒక ఎత్తుగడగా కనిపిస్తోంది. తుర్కియేకు అధునాతన ఎఫ్–35 విమానాల విక్ర యాన్ని వ్యతిరేకించాలని నెతన్యాహు కోరుకుంటున్నారనీ, సౌదీ అణు ఒప్పందం ఈ ప్రాంతంలో ఆయుధ పోటీని రేకెత్తిస్తుందని ఆందోళన చెందుతున్నారనీ ఇజ్రాయెలీ అధికారులు మీడియాకు తెలిపారు. ఇటీవల ట్రంప్‌ను కలుసుకునేందుకు ముందు నెతన్యాహు తన మనసులో మాటను వెల్లడించారు. సౌదీ అరేబి యాతో అమెరికా అణు సహకారం సైనిక శక్తి విషయంలో ఇజ్రా యెల్కున్న గుణాత్మక పైచేయిపై రాజీపడేటట్లు చేయదని హామీ లభించాలని ఆయన అన్నారు. ఏదైతేనేం జెరూసలెం కోరుకున్నది సాధించింది. సౌదీ అణు ఒప్పందం ఇజ్రాయెల్‌తో ముడిపడినఅంశమని ఇపుడు తేటతెల్లమైంది. రెండవసారి అధికారానికి వచ్చినప్పటి నుంచి కూడా అబ్రహాం ఒప్పందాలను మరింత విస్తరించాలని ట్రంప్ కోరుకున్నారు. సాధా రణ పరిస్థితులు నెలకొనాలంటే ‘పాలస్తీనా ఒక ప్రత్యేక రాజ్యంగా అవతరించేందుకు స్పష్టమైన బాటలు పరవా’లని సౌదీలు స్పష్టం చేశారు. గాజాలో పరిస్థితులు క్షీణించాక సౌదీ మరింత పట్టుసడలని వైఖరిని కనబరచింది. సాధారణ పరిస్థితుల స్థాపనపై చర్చలను అది 2023 అక్టోబర్ 14న విరమించుకుంది. ‘పాలస్తీనా రాజ్య స్థాప నను వ్యతిరేకిస్తున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రస్తుత ప్రభు త్వాన్ని శాంతి స్థాపనకు చిత్తశుద్ధితో పనిచేసే భాగస్వామిగా’ చూడ లేమనే మొన్నీమధ్య జూలై 25 వరకు రియాద్ భావిస్తూ వచ్చింది. మారిన అమెరికా తీరుఅణ్వస్త్ర వ్యాప్తి నిరోధక విధానం విషయంలో అమెరికాలో వచ్చిన మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గల్ఫ్‌లో యురేనియం శుద్ధికి అనుమతించకూడదనే వైఖరినే అమెరికా 15 ఏళ్ళుగా అనుస రిస్తూ వచ్చింది. యూఏఈ కూడా 2009లోనే దాన్ని విరమించుకుంది. తాజా అమెరికా ఒప్పందం కింద సౌదీ ఆ నిబంధనను తిర స్కరించింది. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ అదే పనిగా పర్యవేక్షించడాలు, పరిశీలించడాలు చేయకూడదని కూడా సౌదీ పేర్కొంది. తెహ్రాన్ రహస్యంగా యురేనియంను శుద్ధి చేసే సదుపా యా లను నిర్వహిస్తోందనే కారణంతోనే ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడికి దిగాయి. ఈ ఒప్పందం ఏ విధంగా ఆవిష్కృత మవుతుందోనని అబుదాబి, కైరో, అమ్మాన్, అంకారా ఎదురు చూస్తున్నాయి. ఇంతవరకు యురేనియంను శుద్ధి చేసే శక్తి పశ్చిమా సియాలో ఒక్క ఇరాన్‌కే పరిమితం అనుకున్నారు. ఇపుడు యురేని యంను శుద్ధి చేయగల సామర్థ్యాన్ని ఆ ప్రాంతంలో దాదాపు ఐదు దేశాలు సంతరించుకోగలవని కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. ‘‘ఇజ్రాయెల్ వద్ద బాంబు ఉందనుకుందాం. ఇపుడు అమెరికా ఆమోదంతో సౌదీ అరేబియా కూడా యురేనియంను శుద్ధి చేయగల శక్తిని సంతరించుకుంటుంది. మరి మేం మాత్రం ఆ పని ఎందుకు చేయకూడదు?’’ అని ఇరాన్ వాదిస్తోంది. ఇరాన్‌తో అమెరికా కుదు ర్చుకోవాలని భావించిన అణు ఒప్పందం అటకెక్కింది. ఇరాన్ లోపలికి వెళ్ళి తనిఖీలు జరపడానికి అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు ఉన్న అవకాశం పరిమితం. ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా ఆశీర్వా దంతో సౌదీ అరేబియా నిర్వహించే అణుశక్తి కార్యక్రమం పూర్తి ఆత్మవంచన, ద్వంద్వ ప్రమాణాల కిందకే వస్తుంది. ఇజ్రాయెల్ వైపు నుంచి చూస్తే ఈ ఒప్పందం దాని చాపకిందకు నీరు తేవడమే. అణ్వాయుధాలు కలిగిన దేశంగా ఇజ్రాయెల్ 50 ఏళ్ళుగా గుత్తాధిపత్యాన్నే అనుభవిస్తూ వచ్చింది. అది ఆ పనిని చాటుమాటునే నిర్వహిస్తూ వచ్చి ఉండవచ్చు. సౌదీ పౌర అణుశక్తి కార్యక్రమాన్ని అబ్రహాం ఒప్పందాలతో ముడిపెట్టడాన్ని పైకి స్వాగ తించి ఉండవచ్చు. కానీ, లోలోపల అణ్వస్త్ర నిర్మాణ సామర్థ్యం కలి గిన మరో అరబ్ దేశం అవతరిస్తోందని మథన పడుతోంది. సుస్థిరతకు అవకాశమెక్కడ? తాజా ఒప్పందంతో ఆ ప్రాంతంలో ఏ దేశానికాదేశం రక్షణకంచెలు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తాయి. ఆయుధాల సమీకర ణకు పోటీపడతాయి. తప్పుడు అంచనాలు ప్రమాదకర స్థితినిసృష్టిస్తాయి. ఇంక ప్రాంతీయ సుస్థిరతకు అవకాశమెక్కడ? రష్యా అణు శక్తి సంస్థ రోసటామ్, చైనా నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్లను కట్టడి చేయడానికి సౌదీ అణు కార్యక్రమం దోహద పడుతుందనీ, అమెరికా విస్తృత వ్యూహాత్మక ప్రయోజనాలను నెరవేరుస్తుందనీ అమెరికా మొదట్లో భావించింది. ఇపుడు అబ్రహాం ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని చెప్పడం ద్వారా సౌదీ–ఇజ్రా యెల్ మధ్య కూడా రాజీ కుదిర్చినట్లు అవడం తన విదేశాంగ విధానానికి కలికితురాయిగా మారుతుందని ట్రంప్ సంబరపడు తున్నారు. అందుకు రియాద్‌కు పౌర అణు శక్తి పేరుతో తీపిని తిని పిస్తున్నారు. ఈ క్రమంలో, నియమ నిబంధనలను తుంగలో తొక్కారు. పౌర అణు శక్తి వినియోగానికి సౌదీకున్న హక్కును కాదనలేం. రష్యా–చైనాలతో పోటీ పడేందుకు అమెరికాకు ఉన్న హక్కును కూడా తోసిపుచ్చలేం. కానీ, ఉద్రిక్తతలతో అట్టుడుకుతున్న ప్రాంతంలో యురేనియం శుద్ధికి ద్వారాలు తెరవడం ఎంతవరకు సబబు? ఇజ్రాయెల్‌తో సయోధ్య కుదుర్చుకోవాలనీ, సాధారణ పరిస్థితుల స్థాపనకు తోడ్ప డాలనీ అమెరికా పెడుతున్న షరతును సౌదీ ఇప్పటికే తిరస్కరించింది. ఒకవేళ ఒప్పందం మూలపడ్డా, అది తెచ్చిన ప్రమాణం నిలిచే ఉంటుంది: అణు శక్తిని సంపాదించుకునేటట్లు చేయడంలో అమెరికా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాజకీయ ప్రయోజనాలు చూసు కుంటోంది. ఒకసారి భూతాన్ని బయటకు తెస్తే, దాన్ని తిరిగి సీసాలో బంధించడం కష్టం. -వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్, న్యూఢిల్లీ-సి. ఉదయ్ భాస్కర్ -
రైతుకు ఆదాయం – ప్రకృతికి చికిత్స
వాతావరణ మార్పులు ప్రపంచ వ్యవసాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా కరవుప్రాంతాల్లో వ్యవసాయం అనిశ్చితితో కూడిన జీవనోపాధిగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో అగ్రోఫారెస్ట్రీ– వ్యవసాయ పంటలతో పాటు వృక్షాలను సమీకృతంగా పెంచే విధానం– పర్యావరణ పరిరక్షణతో పాటు రైతుకు అదనపు ఆదాయాన్ని అందించే మార్గంగా ఎదుగుతోంది. చెట్లు వాతావర ణంలోని కార్బన్ ను బంధించడం ద్వారా ఏర్పడే కార్బన్ క్రెడిట్లను రైతుల ఆదాయంగా మలచడ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది.భారతదేశం 2070 నాటికి నెట్– జీరో లక్ష్యాన్ని ప్రకటించిన నేపథ్యంలో వ్యవసాయం కూడా కార్బన్ ఉద్గారాల నియంత్రణలో భాగస్వామి కావాల్సిన అవసరం ఉంది. రైతులను కేవలం ఆహార ఉత్పత్తిదారులుగా కాకుండా పర్యావరణ సేవలను అందించే భాగ స్వాములుగా గుర్తించే విధానాలు రూపొందాలి. కార్బన్ మార్కెట్లు అదే దిశగా ముందడుగు వేస్తున్నాయి.అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో యాక్షన్ ఫ్రెటర్నా–ఎకాలజీ సెంటర్ (ఏఎఫ్ ఎకాలజీ సెంటర్) ఈ భావనను ఆచరణలోకి తీసుకొస్తోంది. నెదర్లాండ్స్‌కు చెందిన రాబోబ్యాంక్ ప్రోత్సహి స్తున్న ‘అకార్న్’ కార్యక్రమానికి స్థానిక భాగస్వామిగా ఉంటూ, సంస్థ రైతులను అగ్రోఫారెస్ట్రీ వైపు మళ్లిస్తూ, కార్బన్ ఆదాయ వ్యవస్థలో చేర్చుతోంది. ఇప్పటికే సుమారు 8,300 మంది రైతులు, దాదాపు 10,000 హెక్టార్ల భూమిని ఈ కార్యక్రమంలో నమోదు చేయించింది. రైతుల భూములకు జియో–ట్యాగింగ్, ధ్రువీకరణ ప్రక్రియలు పూర్తి చేశారు. రెండు లక్షలకు పైగా మొక్కల పంపిణీ చేసి, ఏకపంట తోటలను బహుళ వృక్ష వ్యవస్థలుగా మార్చి ఈ కార్యక్ర మానికి బలమైన పునాది వేశారు. తొలి విడత కార్బన్ ఆదాయం 2027లో అందే అవకాశం రైతుల్లో విశ్వాసాన్ని పెంచుతోంది.ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ కేవలం కార్బన్ క్రెడిట్ల నమోదు వద్దే ఆగిపోలేదు. ప్రకృతి వ్యవసాయం, నీటి సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను సమ గ్రంగా అనుసంధానిస్తూ రైతుల స్థిరమైన జీవనోపాధిని సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. కార్బన్ ఆదాయాన్ని రైతు సంక్షేమంతో అనుసంధానించిన ఈ నమూనా దేశవ్యాప్తంగా అధ్యయనం చేయదగినది. అయితే కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. కార్బన్ ధరల్లో హెచ్చుతగ్గులు, ధ్రువీకరణ ప్రక్రియల క్లిష్టత్వం, చిన్న రైతుల సామర్థ్య పరిమితులు వంటిఅంశాలను విధానపరంగా పరిష్కరించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రో ఫారెస్ట్రీకి ప్రత్యేక ప్రోత్సాహకాలు,సాంకేతిక సహాయం, పారదర్శక కార్బన్ మార్కెట్ వ్యవస్థను అందిస్తే ఈ కార్య క్రమం మరింత విస్తరిస్తుంది.భవిష్యత్తు వ్యవసాయం కేవలం దిగుబడుల గురించే కాదు; ప్రకృతిని పునరుద్ధరించడంపైనా ఆధారపడిఉంటుంది. రైతు పెంచే ప్రతి చెట్టు వాతావరణ మార్పులను తగ్గించడమే కాకుండా కుటుంబ ఆదాయాన్ని కూడా పెంచగలదని ఈ కార్యక్రమం నిరూపిస్తోంది. రైతు–ప్రకృతి–మార్కెట్ మధ్య సమ తుల్యతను సాధించే ఇటు వంటి ప్రయత్నాలే సుస్థిర వ్యవసా యానికి బాటలు వేస్తాయి.-వ్యాసకర్త డైరెక్టర్, ఎ.ఎఫ్. ఎకాలజీ సెంటర్, అనంతపురం-డా‘‘ వై.వి. మల్లారెడ్డి -
ఇక ఉద్యోగాలు, ఉత్పాదకతే లక్ష్యం
1991లో చేపట్టిన సంస్కరణలను అనేకమంది భారతదేశ ఆర్థిక రంగానికి ‘లాంచ్ ప్యాడ్’ (అభివృద్ధికి పునాది)గా భావిస్తారు. 1991 జూలై 4న– సరిగ్గా 35 ఏళ్ళ క్రితం అప్పటి ఆర్థిక మంత్రి మన్మో హన్ సింగ్ తన బడ్జెట్ ప్రసంగంలో విక్టర్ హ్యూగో మాటలను ఉటంకిస్తూ, ‘సమయం ఆసన్నమైన ఆలోచనను ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదు’ అని పేర్కొన్నారు. ‘ప్రపంచంలో భారత్ ఒక ప్రధాన ఆర్థిక శక్తిగా ఆవిర్భవించడం అనేది కూడా అలాంటి ఆలోచనే’ అని ఆయన ప్రకటించారు.ముప్పై ఐదు సంవత్సరాల తరువాత, మనకు స్పష్టంగా కనిపిస్తున్నది ఏమిటంటే– ఆ రోజున పారిశ్రామిక, వాణిజ్య నియంత్రణలను తొలగించడం అనేది భారతదేశ ఆర్థిక వృద్ధి రేటునూ, అలాగే పేదరిక నిర్మూలన వేగాన్నీ పెంచడానికి ఎంతగానో తోడ్పడింది. అయితే 1991లో చేసిన వాగ్దానం పాక్షికంగా మాత్రమే నెరవేరిందని మనం అంగీకరించక తప్పదు. నిజానికి, అంత అను కూలంగా లేని అంతర్జాతీయ వాతావరణంలో, ఎటువంటి సులువైన పరిష్కారాలు లేని ఆర్థిక భద్రత, సాంకేతిక పరిపక్వత, సమ్మిళిత వృద్ధి అనే నూతన సవాళ్ళను ఎదుర్కొంటూ దేశం మరోసారి ఒక సంక్లిష్టమైన స్థితిలో నిలబడింది.అభివృద్ధి నిజమే కానీ...1990–91 నాటికి అంతకు ముందు 40 సంవత్సరాలలో, మన ఆర్థిక వ్యవస్థ ఐదు రెట్లు పెరిగింది. కానీ అదే సమయంలో జనాభా రెండున్నర రెట్లు పెరగడంతో, తలసరి ఆదాయం కేవలం రెట్టింపు మాత్రమే అయింది. దానికి భిన్నంగా, 1990–91 తర్వాత గత 35 ఏళ్లలో, ఆర్థిక వ్యవస్థ ఎనిమిది రెట్లు పెరిగింది. ఈ మధ్యకాలంలో జనాభా 70 శాతం మాత్రమే పెరగడం వల్ల, తలసరి ఆదాయం నాలుగున్నర రెట్లకు పైగా పెరిగింది.మొదటి కాలంలో భారత్ ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ పనితీరు కనబరచగా, రెండవ (ఆర్థిక సంస్కరణల తరువాతి) కాలంలో చాలా తక్కువ దేశాలు మాత్రమే పోటీ పడగలిగేలా అద్భుతమైన వృద్ధి నమోదు చేసింది. అయితే, ఇంకా ఎంతో సాధించి ఉండవచ్చని చైనా, వియత్నాంలు నిరూపిస్తున్నాయి. భారత్‌కు సమానమైన స్థాయి నుండి ప్రయాణం ప్రారంభించిన చైనా, ఇప్పుడు ‘అధిక ఆదాయ’ దేశాల జాబితాలోకి చేరే స్థితిలో ఉంది.1991లో భారతదేశ తలసరి ఆదాయంలో సగం కంటే తక్కువ ఆదాయం ఉన్న వియత్నాం ఇప్పుడు భారత్ కంటే 80 శాతం అధిక ఆదాయాన్ని కలిగి ఉంది. భారత్ ఇప్పటికీ ‘దిగువ–మధ్య ఆదాయ’ గ్రూపులోనే ఉంది. మన తలసరి ఆదాయం ప్రపంచ సగటులో నాలుగో వంతు కంటే తక్కువగానే ఉంది. తీవ్ర పేదరికం 1991లో 37 శాతంగా ఉండగా, ఇప్పుడు 5 శాతానికి పడిపోయింది. కానీ బహుమితీయ పేదరిక సూచీ ప్రకారం, ఇప్పటికీ ఆరో వంతు జనాభా పేదరికంలోనే ఉన్నారు. ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచీలో భారత్ దిగువనే ఉంది. అయినప్పటికీ, వంటగ్యాస్,మంచినీటి కనెక్షన్లు, మరుగు దొడ్లు, గృహ విద్యుత్ వంటి ప్రాథమిక వస్తువుల లభ్యత గతంలో కంటే ఇప్పుడు మెరుగైంది.అయినా ప్రపంచ దృష్టి భారత్‌పైనే...కొన్ని విజయాలు పరిమి తమైనవిగా అనిపించినప్పటికీ, గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి ప్రధాన కారణం ప్రపంచంలోనే అతిపెద్దదైన ఇక్కడి జనాభా పరిమాణమే. ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అనేక రకాల ఉత్ప త్తులు, సేవలకు భారత్ ప్రపంచంలోనే అత్యంత భారీ మార్కెట్లలో ఒకటిగా ఉంది. ఇది, ఖర్చు పెట్టే శక్తి ఉన్న ఒక పెద్ద మధ్యతరగతి విభాగ ఆవిర్భా వాన్ని ప్రతిబింబిస్తుంది.భారత్‌లోని 145 కోట్ల జనాభాలో 30 నుండి 40 శాతం మంది మధ్యతరగతి పరిధిలోకి వస్తారు. ఈ వర్గంలో దాదాపు 8 నుండి 10 కోట్ల కుటుంబాలు ఉన్నాయనడానికి ఏటా విక్రయించే 2 కోట్ల ద్విచక్ర వాహనాలు, 15 కోట్ల స్మార్ట్ఫోన్లు సాక్ష్యంగా ఉన్నాయి. 1991లో ఏడాది మొత్తం అమ్మిన కార్ల సంఖ్యను ఇప్పుడు కేవలం పదిహేను రోజుల్లోనే విక్రయిస్తున్నారు. ఆదాయంతో పోలిస్తే ఉత్ప త్తులు అందుబాటు ధరల్లో, మెరుగైన నాణ్యతతో లభిస్తున్నాయి. సాఫ్ట్వేర్ సేవలు, తక్కువ ఖర్చుతో కూడిన ఫార్మాస్యూటికల్స్ తయారీలో భారత్ ప్రత్యేక గుర్తింపు పొందింది. భారత్ రూపొందించిన డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్, ఆయిల్ రిఫైనింగ్, వైద్యసంరక్షణ రంగాలలో సాంకేతిక పరిణతి కూడా గుర్తింపు పొందాయి. హార్వర్డ్ గ్రోత్ ల్యాబ్ వారి ‘ఎకనామిక్ కాంప్లెక్సిటీ ఇండెక్స్’లోని 145 దేశాలలో భారత్ పైనుండి మూడో స్థానంలో ఉంది. 1991 సంస్కరణల మూల సూత్రాన్ని దేశం సరిగ్గా అనుసరించి ఉంటే ఇంకా ఎంతో సాధించి ఉండేది. ప్రైవేట్ రంగం, మార్కెట్లు అవి సాధించగలిగినవాటిని వదిలేయడం, బయటి ప్రపంచానికి తలుపులు తెరవడం, ప్రభుత్వం మాత్రమే అందించగలిగే వాటిపై శ్రద్ధను కేంద్రీకరించడం–అంటే శాంతిభద్రతలు, న్యాయం, ప్రజారోగ్యం, నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలలు, పర్యావరణ పరి రక్షణ, మార్కెట్ల సరైన నియంత్రణ కలిగి ఉండటమే ఆ సూత్రం.వాస్తవ స్థితివీటిలో ప్రతి విషయంలోనూ భారత్ వెనుకబడి ఉంది. దేశంలో 22 లక్షల మంది పోలీసులు ఉంటే, దానికి నాలుగు రెట్లు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. కోర్టుల్లో ఆలస్యం అనేది సర్వసా ధారణమైపోయింది. సగానికి పైగా పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారు. 40 శాతం ఆసుపత్రి పడకలు ప్రైవేట్రంగానివే. ప్రజల ఆదాయాలు ఇంకా పరిమితంగా ఉన్న సమయంలో ఈ రెండింటికీ భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. సరిపడా పోషకాహారం లేకపోవడం వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపాలు విస్తృతంగా కనిపిస్తున్నాయి.కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రభుత్వ అప్పులు ఆందోళన కరమైన స్థాయికి చేరాయి. విద్య, రక్షణ రెంటిపై ప్రభుత్వం చేసే వ్యయం తగ్గుతోంది. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ప్రపంచ సగటుతో పోలిస్తే చాలా తక్కువ. గత దశాబ్దపున్నర కాలంగా రక్షణాత్మక సుంకాలు, ఇతర అడ్డంకులు పెరిగిన కొద్దీ, జీడీపీలో వస్తువుల ఎగుమతుల నిష్పత్తి తీవ్రంగా తగ్గుతూ వచ్చింది. మంచి ఉద్యోగాల కల్పన కష్టంగా మారడంతో మధ్యతరగతి పరిమాణం గతంలోలాగా పెరగడం లేదు. దేశంలోని అత్యున్నత అర్హతలు కలిగినవారు పెద్ద సంఖ్యలో దేశం విడిచి వెళ్తున్నారు. స్వదేశీ ప్రైవేట్ పెట్టుబడులు ఆశించిన స్థాయిలో లేవు. అత్యంత తీవ్రంగా దెబ్బ తిన్నది మాత్రం మధ్యతరగతికి, పేదలకు మధ్యన ఉన్న ‘ఆకాంక్షల వర్గం’. అసంఘటిత రంగంలో అస్థిరమైన, తక్కువ ఆదాయాల వల్ల వీరిలో అత్యధికులు ‘నిశ్శబ్ద నైరాశ్యంతో కూడిన జీవితాలను’ గడుపుతున్నారు. ఈ వర్గానికి చెందిన కొందరు యువకులు గత నెల రోజు లుగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసన ప్రాంతంలో కనిపించారు. ఈ వయస్సు వర్గాలలో 25 శాతం నుండి 40 శాతం వరకు నిరుద్యోగం ఉంది. 1991 సంస్కరణల స్ఫూర్తిని కొనసాగిస్తూ, ప్రభుత్వం తన శ్రద్ధను ప్రాథమిక సేవలపై కేంద్రీకరించడం ద్వారా మాత్రమే ఈ స్థితిని మార్చగలదు.-వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-టి.ఎన్. నైనన్ -
అమెరికా రాజనీతికి యుద్ధం కేంద్రకం
ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలను, వీటిలో యూఎస్ఏ పాత్రను విస్తృత అంతర్జాతీయ జియో పొలిటికల్ క్రీడలో భాగంగా చూడాలి. 2035లో ప్రపంచ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారబోతున్నది. ఈ పరిణామంలో భాగమే ఈ యుద్ధాలు. గత 250 సంవత్సరాల అమెరికా చరిత్ర పూర్తిగా యుద్ధాలతోనే ముడిపడి ఉన్నది. గత శతాబ్దంలో ప్రతి 20 సంవత్సరాలకు కనీసం ఒక పెద్ద యుద్ధానికి తెరతీసింది. పద్దెనిమిది,పందొమ్మిది శతాబ్దాలలో దేశ విస్తరణకు బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, మెక్సికోలతో యుద్ధం చేసింది. ఇరవయ్యవ శతాబ్దంలో ఫిలిప్ఫైన్, రెండు ప్రపంచ యుద్ధాలు, కొరియా, వియత్నాం, బోస్నియా, గల్ఫ్ యుద్ధాలలో నిమగ్నమైంది. ఇరవయ్యొకటవ శతాబ్దంలో అఫ్గాని స్తాన్, ఇరాక్, లిబియా, యెమెన్, సిరియా, సోమాలియాలలో యుద్ధాలను లేవనెత్తింది. గత 250 ఏళ్లలో యూఎస్ఏ కేవలం 1865–1898 (33 సం‘‘లు), 1918–1945 (27 సం‘‘లు) మధ్య మాత్రమే యుద్ధానికి దూరంగా ఉన్నది. శాంతి కోసం యుద్ధం, సుభిక్షానికి యుద్ధం, సుస్థిరతకు యుద్ధం అనేది అమెరికా పాలనా విధానం. శక్తిని చాటి చెప్పటానికి యుద్ధాన్ని ఒక పరికరంగా పరిగణిస్తుంది. ఈ యుద్ధ తంత్రానికి ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, ఉదారవాద విధానాల ముసుగు కప్పుతుంది. కథ అడ్డం తిరిగింది!సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత ప్రపంచంపై తన ఏకచ్ఛత్రాధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి అమెరికా సర్వశక్తులు ఒడ్డింది. ప్రత్యర్థి రష్యాను పూర్తిగా అణచివేయాలని నాటోను విస్త రించింది. 2010కల్లా రష్యా ఆర్థికంగా పుంజుకొని అమెరికాకు సవా లుగా తయారైంది. ఇదే సమయంలో అనూహ్యంగా చైనా బలమైన ప్రత్యర్థిగా ఎదిగింది. 2020కల్లా భారత్, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికాలు కూడా బలమైన శక్తులుగా రూపుదిద్దుకున్నాయి. బ్రిక్స్ రూపంలో కూటమిగా చేరి, అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యామ్నాయాలను సంకల్పించటంతో కథ అడ్డం తిరిగింది.బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడటం ఖాయమనే విశ్లేషకుల జోస్యాన్ని తప్పుగా నిరూపించాలని కృతనిశ్చయంతో ఉన్నది. అమెరికా ముందు మూడు ప్రత్యామ్నాయాలున్నాయి. 1. ప్రత్యర్థు లను నిర్వీర్యం చేసి ఏకైక ప్రపంచ శక్తిగా కొనసాగటం. 2. ప్రత్య ర్థులతో రాజీపడి పరిమిత ధ్రువ (లిమిటెడ్ పోలార్) ప్రపంచంలో ప్రధాన శక్తిగా కొనసాగటం. 3. ప్రత్యర్థులతో రాజీపడి బహుళ ధ్రువ (మల్టీ పోలార్) ప్రపంచంలో ప్రధాన శక్తిగా కొనసాగటం.మూడింట్లో మొదటి దారిప్రస్తుతం అమెరికా ఏకైక ప్రపంచ శక్తిగా కొనసాగాలనే పట్టు దలతోనే ఉన్నట్లుగా కన్పిస్తున్నది. ఇందులో భాగంగానే ఇంధన వనరులు, ఇంధన రవాణా మార్గాలపై పెత్తనానికి సర్వశక్తులు ఒడ్డు తున్నది. రష్యాపై తీవ్రస్థాయిలో ఆంక్షలు విధించి ఉక్రెయిన్ యుద్ధపు పద్మవ్యూహంలోనికి రష్యాను లాగింది. రష్యానుండి చమురు, గ్యాస్ ఎవరూ కొనగూడదని ఐరోపా, భారత్‌లను కట్టడి చేసింది. దీర్ఘకాలిక యుద్ధంలో ఉక్రెయిన్ వెనుక నిలబడి రష్యా అలసిపోయి నిర్వీర్యమవటానికి దీర్ఘకాలిక ప్రణాళికను అమలు పరుస్తున్నది. అందుకే నెల లోపున ముగుస్తుందనుకున్న ఉక్రెయిన్ యుద్ధం నాలుగన్నర సంవత్సరాలకు కూడా కొనసాగుతున్నది. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం చైనా చేతిలో పడకుండా చూడటం ద్వారా చైనాను కట్టడి చేయాలనేది అమెరికా వ్యూహం. ‘చిప్ 4’ అలయన్స్‌లో భాగంగా అమెరికా, తైవాన్, ద.కొరియా, జపాన్‌లు చైనాకు అత్యాధునిక సెమీకండక్టర్ చిప్‌లు అందుబాటు లోనికి రాకుండా ప్రయత్నిస్తున్నాయి. ఆకస్ కూటమిలో భాగంగా ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ఏలు ఏఐ, క్వాంటమ్ మెకానిక్స్ హైపర్సోనిక్ టెక్నాలజీని చైనాకు అందకుండా చేయటానికి ప్రయ త్నిస్తున్నాయి. జీ7, యూరోపియన్ యూనియన్ల ద్వారా అత్యాధు నిక చిప్స్ తయారు చేసే యంత్రాలను ఏఎస్ఎంఎల్ (నెదర్లాండ్స్), టోక్యో ఎలక్ట్రానిక్ (జపాన్) కంపెనీలు చైనాకు ఎగుమతి చేయకుండా ఆంక్షలు పెట్టాయి. తైవాన్ను సమర్థించటం ద్వారా కూడా చైనాకు చెక్ పెట్టటానికి అమెరికా ప్రయత్నిస్తున్నది.విశేషంగా ఇంధన వనరులున్న ఇరాన్, ఇరాక్, సౌదీ, యూఏఈ, కువైట్ మొదలైన గల్ఫ్ దేశాలపై నియంత్రణకు అమెరికా దీర్ఘకాలికంగా వ్యూహాలను అమలుపరుస్తున్నది. సైనిక స్థావరాల ద్వారా గల్ఫ్ దేశాలలో అమెరికా ఇప్పటికే పాగా వేసింది. ఈ ఇంధన వనరుల నియంత్రణలో అమెరికాకు కొరకరాని కొయ్యగా మారింది ఇరాన్. అందుకే హార్మూజ్, బాబెల్ మాండెబ్ జలసంధులపై పెత్తనానికి అమెరికా ప్రయత్నిస్తున్నది.ఆసియాలో భారత్ ఆధిపత్యం?అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగించే వ్యూహంలో భాగాలే ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు. అందువలన ఈ రెండు ఇప్పట్లో ముగిసే అవకాశాలు లేవు. ఇరాన్ యుద్ధం వలన తీవ్రంగా నష్ట పోయేది భారత్, చైనాలని గుర్తించాలి. చైనా, రష్యా, భారత్‌లను ఈ రెండు యుద్ధాల ద్వారా కట్టడి చేయటం సాధ్యం కాని పక్షంలో అమె రికా పరిమిత ధ్రువ ప్రపంచానికి రాజీ పడాల్సి వస్తుంది. రష్యా, చైనా/భారత్‌లను ప్రపంచ శక్తులుగా అంగీకరించాల్సి వస్తుంది. క్రమంగా నాటోను రద్దుపరచి ఐరోపాపై రష్యా ఆధిపత్యానికి అంగీ కరించి ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలకు యూఎస్ఏ తన ఆధిప త్యాన్ని పరిమితం చేసుకోవాల్సి ఉంటుంది. దక్షిణ, తూర్పు ఆసి యాలలో చైనా ఆధిపత్యాన్ని అంగీకరించి గల్ఫ్ ప్రాంతంలో ఇజ్రా యెల్–యూఏఈ– సౌదీల ద్వారా నియంత్రణకు ప్రయత్నిస్తుంది. అయితే దక్షిణ, తూర్పు ఆసియాలలో ఆధిపత్యంతో చైనా సరిపెట్టుకోక పోవచ్చును. చైనా ప్రపంచాధిపత్యానికి ప్రయత్నించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాక్రమంగా రష్యాతో ఒప్పందం ద్వారా చైనాకు వ్యతిరేకంగా భార త్ను ఆసియాలో ఆధిపత్యానికి ప్రోత్సహించవచ్చును.2040 కల్లా చైనా ప్రపంచ శక్తిగా అమెరికా, రష్యాలనే సవాలు చేయవచ్చని విశ్లేషకుల అంచనా. ఈనాడు ప్రత్యర్థులుగా ఉన్న రష్యా, అమెరికాలు కలిసి చైనాను నిలువరించాల్సి రావచ్చును. రాజకీయాలలో శాశ్వత మిత్రత్వం కానీ శాశ్వత శతృత్వం కానీ ఉండదు. అమెరికా, రష్యాలు, ఆసియాలో భారత్ వైపే మొగ్గు చూప టానికి అవకాశం ఉన్నది. తైవాన్ను చైనా ఆక్రమించటానికి ప్రయ త్నించినప్పుడు చైనాను ఇంకొకవైపు నుండి నిలువరించటానికి భారత్ సిద్ధమవవచ్చును. ఒకవైపు హిమాలయాలలో చైనాపై దాడి చేస్తూనే భారత్ మలక్కా జలసంధిని దిగ్బంధనం చేయవచ్చు. ఆ సందర్భంలో చైనా సముద్రంలో అమెరికా, జపాన్‌లను చైనా ఎదు ర్కోవటం కష్టమవుతుంది. భారత్‌కు అమెరికా సైనిక, వ్యూహాత్మక మద్దతును అందించవచ్చును.కాకపోతే, ఈ అమెరికన్ అంతర్జాతీయ రాజకీయ వ్యూహంలో పావుగా మారటానికి భారత్ ఒప్పుకోకపోవచ్చును. ప్రాంతీయంగా ఆసియాలో చైనాను నియంత్రించటానికి భారత్ ఒప్పుకుంటుంది. కానీ అంతర్జాతీయంగా చైనాను నిరోధించే వ్యూహంలో భారత్ భాగ స్వామిగా మారాల్సిన అవసరం భారత్‌కు లేదు. ఏది ఏమయినా ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు అంతర్జాతీయ రాజకీయ యవనికను నియంత్రించే కీలక ఘట్టాలనటంలో సందేహం లేదు. భారత్ ఆచి తూచి అడుగులు వేయాల్సి ఉంటుంది.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్); సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు- గురజాల శ్రీనివాసరావు -
రైతు కాళ్ల కిందే కర్మాగారం
హార్మూజ్ జలసంధి మూసుకుపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధర ఒక్కసారిగా టన్నుకు దాదాపు వెయ్యి డాలర్లకు పెరిగింది.దేశ యూరియా అవసరాల్లో నాలుగోవంతును దిగుమతి చేసుకునే భారత్‌కు ఇది దిగుమతుల మీద ఆధారపడే పాత భయాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే నూతన యూరియా పెట్టుబడి విధానం రూపంలో స్పందన వచ్చింది. దేశం ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్న కోటి టన్నుల యూరియాను ఇక్కడే తయారు చేసేందుకు ఎనిమిది–తొమ్మిది కొత్త గ్యాస్ ఆధారిత కర్మాగారాలను నెలకొల్పడమే దీని లక్ష్యం.వేసిన నత్రజని పనికొచ్చేనా?తర్కంగా చూస్తే ఇది సరైన నిర్ణయమే. కానీ ఆ తర్కమే అసలు సమస్య. సరఫరా సంక్షోభం వచ్చినప్పుడు మన వ్యవసాయ విధానం చూపే ప్రతిస్పందన ఒక్కటే– ఎరువును మరింత ఎక్కు వగా ఉత్పత్తి చేయడం. కానీ ఎవరూ అడగని ప్రశ్న ఒకటుంది. పద్నాలుగు కోట్ల రైతు కుటుంబాలు, ప్రపంచంలోనే అతిపెద్దపశు సంపద, ప్రతి శీతాకాలంలో తగలబెట్టే కోట్లాది టన్నుల పంట వ్యర్థాలు– ఇవన్నీ ఉన్న దేశం ఇంత భారీ మొత్తంలో కృత్రిమ నత్రజనిని ఎందుకు దిగుమతి చేసుకోవాలి?గత అరవై ఏళ్లుగా మన వ్యవసాయ విధానాన్ని ఒక నమ్మకం శాసిస్తోంది– ప్రతి ఉత్పాదకత సమస్యా ఎరువుల సమస్యే; దాన్ని మరిన్ని ఎరువులు ఉత్పత్తి చేయడం, దిగుమతి చేయడం, రాయితీ ఇవ్వడం ద్వారానే పరిష్కరించాలి. హరిత విప్లవం కాలంలో ఇది నిజమే. అప్పుడు నత్రజని కొరత ఒక అడ్డంకి. కానీ ఇవాళ మన అసలు సమస్య నత్రజని కొరత కాదు; పంటకు నత్రజనినిఅందించే నేల ఆరోగ్యం బాగా క్షీణించింది. ప్రభుత్వ నేల ఆరోగ్య కార్డుల డేటానే చూస్తే– దేశంలో దాదాపు 64 శాతం నేలల్లో నత్రజని తక్కువ, 48.5 శాతం నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువ. మరో గణాంకం మరింత భయపెడుతుంది. హరిత విప్లవం తొలినాళ్లలో ఒక కిలో ఎరువుకు దాదాపు పదమూడు కిలోల అదనపు ధాన్యం వచ్చేది– అంటే 1:13 నిష్పత్తి. ఇవాళ అది 1:2.7కి పడి పోయింది. అంటే అదే కిలో ఎరువు ఇప్పుడు నాలుగో వంతు ధాన్యాన్ని మాత్రమే ఇస్తోంది. మనం వేసే నత్రజనిలో అరవై శాతానికి పైగా పంటకు అందకుండా గాలిలోకి, భూగర్భ జలాల్లోకి కొట్టుకుపోతోంది. నత్రజని చౌకగా దొరకడంతో రైతులు దాన్నే మోతాదు మించి వాడుతున్నారు; ఫలితంగా ఎన్ పీకే(నత్రజని, భాస్వరం, పొటాషియం) నిష్పత్తి 4:2:1 ఉండాల్సిన చోట దాదాపు 11:4:1కి చేరింది. ఒక ప్రాథమిక తేడాను మనం మరచిపోయాం. పంటకు పోషకాలు అందించడం వేరు, నేల సారాన్ని కాపాడటం వేరు. యూరియా పంటకు తక్షణ ఆహారం అందిస్తుంది. కానీ నేలలోసేంద్రియ కర్బనం, సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, వానపాములు– వీటిని అది పెంచదు. నిజానికి మోతాదు మించిన నత్రజని వీటిని దెబ్బతీస్తుంది. ఈ జీవరాశే నేలకు నీటిని పట్టి ఉంచే శక్తిని, గాలి ఆడే నిర్మాణాన్ని, పోషకాలను చక్రంలా తిప్పే సామర్థ్యాన్ని ఇస్తుంది. వీటిని రసాయనిక ఎరువులతో తిరిగి నిర్మించలేం– ఎందుకంటే ఎన్పీకే అనేది కర్బనం కాదు, జీవం అసలే కాదు.నిజంగా ఇది స్వావలంబనా?నూతన యూరియా విధానం చెప్పే స్వావలంబన కూడా చాలావరకు భ్రమే. యూరియా అమోనియా నుంచి, అమోనియా సహజ వాయువు నుంచి తయారవుతాయి. ఆ సహజ వాయువులో చాలా భాగం మనం ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) రూపంలో దిగుమతి చేసుకునేదే. యూరియా ఉత్పత్తి వ్యయంలో ఇది 70–80 శాతం. అంటే కొత్త కర్మాగారం అంటే దిగుమతి చేసుకున్న వాయువును ఇక్కడ యూరియాగా మార్చే యంత్రం మాత్రమే. మన ఆధారపడటం పోలేదు, కేవలం ఒక మెట్టు పైకి జరిగింది. భాస్వరం, పొటాష్ విషయంలో అయితే మనం దాదాపు పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడతాం.అమెరికా ఉదాహరణ చూడండి: ఆ దేశం నత్రజనిలో స్వావలంబన సాధించిన మాట నిజమే, కానీ కర్మాగారాలు కట్టడం వల్ల కాదు. దానికి సొంత షేల్ గ్యాస్ ఉంది; మొక్కజొన్న–సోయాబీన్ మార్పిడి సాగులో పప్పుజాతి పంట తనకు తానే నత్రజనిని స్థిరీక రించుకుంటుంది. ఈ రెండూ మనకు లేవు. అక్కడి వాతావరణం కూడా వేరు. మన ఉష్ణోగ్రతలకు సేంద్రియ కర్బనం తొందరగా కోల్పోతాం. అక్కడ సంవత్సరానికి ఒక పంట కాలమే, రెండోకాలంలో నేల పునర్జీవనం కావటానికి అవకాశం ఉంది. కాబట్టి అమెరికా బాటలో కేవలం కర్మాగారాల స్థాపనను కాపీ చేస్తే, భారం మిగులుతుంది తప్ప భద్రత రాదు.నిజమైన స్వావలంబన అంటే మనం అదుపులో ఉంచుకోగల వనరుల నుంచి పంట అవసరాలను తీర్చుకోవడం. పప్పు« దాన్యాలు, జీవన ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు, అజొల్లా ద్వారా జీవ నత్రజని స్థిరీకరణ, పంట వ్యర్థాల పునర్వినియోగం, పశువుల ఎరువు, అన్నిటికీ ఆధారమైన నేలలో సేంద్రియ పదార్థం– ఇవి పెరిగితే వేసే ప్రతి కిలో ఎరువూ మరింత సమర్థంగా పనిచేస్తుంది. జీవసారం పెంచితే ప్రోత్సాహకాలుఇప్పుడు డబ్బుల మాట. దేశ ఎరువుల రాయితీ దాదాపు రూ.1.7 లక్షల కోట్లు; అందులో యూరియాదే రూ.1.19 లక్షల కోట్లు. తగ్గిపోతున్న రసాయనిక ఎరువుల సామర్థ్యం, వృథా అవు తున్న సగం నత్రజని– వీటిని చూస్తే ఇది తక్కువ ప్రయోజనం ఇచ్చే ఖర్చు. ఈ రాయితీలో సగాన్ని– అంటే దాదాపు 85 వేల కోట్లను– నేల ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి మళ్లిస్తే ఏమవుతుంది?ఒక టన్ను యూరియా ఒక్క సీజన్ కే అయిపోతుంది, మళ్లీ కొనా ల్సిందే. కానీ నేలలో పెరిగిన సేంద్రియ కర్బనం ఏళ్ల తరబడి నిలు స్తుంది. ప్రతి ఏటా దిగుబడిని, నీటి నిల్వను, ఎరువుల సామర్థ్యాన్ని పెంచుతుంది. నేల బాగుపడిన కొద్దీ దానికి కావాల్సిన నత్రజని తగ్గుతుంది, దాంతోపాటే రాయితీ భారమూ తగ్గుతుంది.అందుకే ఒక జాతీయ/రాష్ట్ర స్థాయి నేల ఆరోగ్య పునరుద్ధరణ మిషన్ అవసరం. నేలలో సేంద్రియ కర్బనం, జీవసారం పెరిగిన కొద్దీ రైతుకు నేరుగా ప్రోత్సాహకం అందాలి. గ్రామ స్థాయి కంపోస్ట్, పంట వ్యర్థాల పునర్వినియోగం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో జీవ ఎరువుల యూనిట్లు– వీటిని ఉపాధి హామీ పథకం, ప్రకృతి వ్యవసాయంతో అనుసంధానం చేయాలి.‘రసాయనిక ఎరువులు లేకుండా దేశాన్ని పోషించలేం’ అనే వాదన రావచ్చు. ఎరువులను పూర్తిగా వదిలేయాలని అనడం లేదు. మొదట్లో రసాయనికం, జీవసంబంధం రెండింటినీ కలిపి వాడే సమీ కృత పోషక యాజమాన్యమే మార్గం. భారత్ తదుపరి వ్యవసాయ విప్లవం మరిన్ని రసాయనిక ఎరువులపై కాదు– ప్రాణమున్న నేల లను తిరిగి నిర్మించడంపై ఆధారపడాలి. ఏ ఓడరేవు, గ్యాస్ పైప్‌లైన్ కోసం మనం ఎదురుచూడనక్కర్లేదు– మన అతిపెద్ద ఎరువుల కర్మాగారం ప్రతి రైతు కాళ్ల కింద, నేల జీవంలోనే ఉంది. -వ్యాసకర్త సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్ఏ) కార్యనిర్వాహక సంచాలకులు-డా‘‘ జి.వి.రామాంజనేయులు -
పట్టువదలని ట్యారిఫ్ విక్రమార్కుడు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పట్టువదలని విక్రమార్కునివలె ఈ నెల 24న భారత్ సహా మొత్తం 60 దేశాలపై మరో విడత దిగుమతి సుంకాలను పెంచారు. అవి అదే రోజు నుంచి అమ లుకు కూడా వచ్చాయి. ఈసారి ఆయన చెప్పిన కారణం: ఈ దేశాలు కార్మికులతో బలవంతపు చాకిరీ చేయించి ఉత్పత్తి చేస్తున్న సరకులను తమ దేశానికి ఎగు మతి చేస్తున్నాయని! ట్రంఫ్ ట్యారిఫ్ల పరంపర ఎప్పుడు మొదలై ఎట్లా సాగుతున్నదో, అందుకు తను చెప్తూ వస్తున్న ఛప్పన్నారు కారణాలేమిటో తెలిసినవే. అత్యవసర చట్టం నెపంతో...2025 జనవరిలో అధ్యక్షునిగా బాధ్యత స్వీకరించిన వెంటనే, ‘అమెరికా ఫస్ట్ ట్రేడ్ పాలసీ మెమోరాండం’ పత్రంపై సంతకం చేశారు. తర్వాత వారం రోజులకు సమస్త దేశాలపై 10 శాతం నుంచి 25 శాతం దిగుమతి సుంకాలు పెంచారు. అందులో చిన్న దేశాలు, పెద్ద దేశాలు, మిత్ర దేశాలు, శత్రు దేశాలనే తేడాలు చూప లేదు. ఇతరులతో అమెరికాకు గల వాణిజ్య లోటు ఈ చర్యకు కారణ మన్న ఆయన, తమకు వాణిజ్య మిగులు ఉన్న దేశాలనూ మినహా యించలేదు. ఒక్క మానవ మాత్రుడైనా నివసించక పెంగ్విన్స్ మాత్రమే ఉండే దీవులనూ తన జాబితాలో చేర్చారు. ఆయన విధానాలను, తీరును చూడగా తన పదవీ కాలం ముగిసే 2029 జనవరి వరకు ఈ ధోరణి ముగియక పోవచ్చునని పిస్తున్నది. ఆ చర్చలోకి వెళ్లే ముందు ఈ నెల 24 నాటి సుంకాల గురించి చెప్పుకోవాలి. సుంకాలను మొదట భారీగా పెంచినప్పుడు, అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని (ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనమిక్ పవర్స్ యాక్ట్) ఉపయోగించారు. ఇతర దేశా లతో వాణిజ్య లోటు అమెరికా ఆర్థిక వ్యవస్థకే ముప్పు కలిగించగల స్థాయికి పెరిగిందనీ, కనుక ఇటువంటి అత్యవసర చర్యలను అమెరి కన్ కాంగ్రెస్ ఆమోదం లేకుండానే తీసుకునే అధికారం ఆ చట్ట ప్రకారం అధ్యక్షునికి ఉందనీ అన్నారు. కానీ, అటువంటి పరిస్థి తులు లేవనీ, కనుక ఆ చర్యలు చెల్లవనీ అక్కడి సుప్రీంకోర్టు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కొట్టివేసింది. అంతవరకు ప్రపంచ దేశాల నుంచి వసూలు చేసిన వందలకొద్ది బిలియన్ల అదనపు సుంకాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.దానితో ఆందోళనకు గురైన అమెరికా అధ్యక్షుడు ఆ నష్టాన్ని పూడ్చుకోవటానికి కొత్తదారులు వెతకటం మొదలు పెట్టారు. సుప్రీం తీర్పు నుంచి తప్పించుకునేందుకు తనకు ప్రత్యామ్నా యాలు ఉన్నాయని వెంటనే ప్రకటించిన ఆయన, కాంగ్రెస్ అను మతి వెంటనే అక్కరలేని 1974వ సంవత్సరపు వాణిజ్య చట్టాన్ని ఆశ్రయించారు. అందులోని 301వ నిబంధన మేరకు వేర్వేరు దేశాలపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు ట్యారిఫ్‌లు ప్రకటించారు. అయితే ఆ నిబంధన ఒక పరిమిత కాలం వరకే అమలులో ఉంటుంది. ఆ గడువు తీరటంతో ఈ నెల 24న అదే స్థాయి శాతా లతో ట్యారిఫ్లను శాశ్వతంగా మార్చారు. ఆ ప్రకారం ఇండియాపై రేటు 10 శాతం అయింది.సుంకాల మజిలీలుఈ ట్యారిఫ్ల యాత్రలో భారత దేశానికి, ఇతరులకు సంబంధించి కూడా పలు మజిలీలు ఉన్నాయి. 2025 ఫిబ్రవరిలో మొదటి విడత సుంకాలలో భాగంగా ఇండియాపై 25 శాతం విధించిన ఆయన, మనం రష్యా చమురును ఖరీదు చేస్తున్నందుకు ఆగ్రహించి మరో 25 శాతం పెంచారు. అట్లా అది 50 శాతం అయింది. ఇతరత్రా డబ్ల్యూటీవోతో నిమిత్తం లేకుండా, ఇంకా చెప్పాలంటే ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ, వేర్వేరు దేశాలతో వేర్వేరు వాణిజ్య ఒప్పందాలను తమకు అనుకూలంగా చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందుకోసం చర్చల పద్ధతిని గాక ఒత్తిడులు, బ్లాక్‌మెయిలింగ్‌ను ఎంచుకున్నారు. అది తట్టుకోలేని దేశాలు విడిగా ఒప్పందాలకు ఒప్పుకోగా ట్యారిఫ్ల శాతం అపుడు కొంత తగ్గించారు. ఆ విధంగా ఇండియాపై సుంకాలు 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గాయి. ఇపుడు 10 శాతంతో కలిపి 28 శాతం అవుతున్నాయి.జపాన్, దక్షిణ కొరియా వంటి బలమైన ఆర్థిక వ్యవస్థలు కూడా ఇందుకు మినహాయింపు కాలేదు, అమెరికాకు సన్నిహిత రాజ్యాలై నప్పటికీ– కెనడా, యూరప్ వంటి మిత్ర దేశాలు ఒకమేర రాజీ పడుతూ ప్రత్యామ్నాయ వాణిజ్య సంబంధాల కోసం అన్ని ఖండా లలో అన్వేషణలు మొదలు పెట్టాయి. రష్యాకు అమెరికాతో గల వాణిజ్య సంబంధం అతి స్వల్పం అయినందున ఇరువురి మధ్య వచ్చేదీ పోయేదీ ఏమీ లేకపోయింది. ఆంబోతులు పోట్లాడితే లేగదూడల కాళ్లు విరిగాయన్నట్లుగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలను అమెరికా విధించటంతో ఇతరులతో పాటు ఇండియా చాలానే నష్టపోయింది. ఆ ట్యారిఫ్‌లకు ప్రతిగా తాము కూడా అమెరికాపై ఎదురు సుంకాలు వేయగలమని కెనడా, యూరప్ హెచ్చరికలు చేసి ఆ పని కొంత మేర చేశాయి గానీ, పూర్తిగా ధిక్కరించి నిలిచింది చైనా ఒక్కటే.బలవంతపు చాకిరీలు నిజమేనా?ఇపుడు మాట్లాడుకోవలసిన ఆసక్తికరమైన విషయం ఒకటు న్నది. అది ఇండియా తదితర దేశాలు బలవంతపు చాకిరీతో ఉత్ప త్తులు చేసి అమెరికాకు విక్రయిస్తున్నాయనే ఆరోపణ. ఈ విషయమై యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) జరిపిన విచారణలో ధ్రువీకరణలు లభించాయని ట్రంప్ ప్రభుత్వం చెప్తు న్నది. అమెరికా, యూరప్ వర్ధమాన దేశాలను ఒత్తిడి చేసేందుకు బాలకార్మికులు, మితిమీరిన పని గంటలు, బలవంతపు చాకిరీ వంటి వాదనలు ఎప్పటినుంచో చేస్తున్నాయి. విచిత్రమేమంటే, సాక్షాత్తూ అమెరికాలోనే రకరకాలుగా బలవంతపు చాకిరీ, శ్రామి కుల దోడిపీ జరుగుతున్నదని చెప్పే నివేదికలున్నాయి. కనుక, ఈ వాదన ఇతరులను ఒత్తిడి చేసే సాధనం మాత్రమే. ఇంతకూ జనవరి 2025తో ఆరంభించి శవం కోసం చెట్టెక్కు తూనే ఉన్న అమెరికా అధ్యక్షుని లక్ష్యాలు ఎంతవరకు నెరవేరు తున్నట్లు? అన్ని దేశాలూ తమను దోచుకుంటున్నాయంటూ సుంకాల హెచ్చింపును ఆరంభించినపుడు 900 బిలియన్ల మేర ఉండిన వాణిజ్య లోటు నేడు కూడా ఇంచుమించు అంతే ఉంది. కేవలం పారిశ్రామిక ఉత్పత్తులను తీసుకుంటే మరింత పెరిగి 1.2 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ట్యారిఫ్ల హెచ్చింపుతో ఏమీ ఒరగ లేదు. పన్నులు పెంచుతామని హెచ్చరించినా బయటి నుంచి తిరిగి వచ్చిన అమెరికన్ కంపెనీలు చాలా కొద్ది. కనుక ‘మాగా’ నినాదం మేర ఉద్యోగాలూ పెరగలేదు. ఆ విధంగా విక్రమార్కుని భుజంపై శవం నిలవకుండా ఉంది.మనమిక చూడవలసింది అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఏ విధంగా జరగనున్నదనేది. అందుకోసం ఫ్రేమ్ వర్క్ అనేది కుదిరినా, తుదిరూపపు చర్చలు సాగుతున్నాయి. ప్రభుత్వం కొంత పట్టుదలగా ఉన్నమాట నిజం. అదే సమయంలో అది హానికరంగా ఉండకూడదని రైతులు, మత్స్యకారులు, జౌళి రంగం, ఇతర వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయి. చివరకు ఏమయేదీ చూడాలి!టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నీట్ కంటే పెద్ద సమస్య... డీలిమిటేషన్!
దేశమంతా ఈరోజు నీట్, పేపర్ లీకులు, విద్యార్థుల ఆందోళనలు, రాజకీయ విమర్శల గురించే మాట్లాడుతోంది. ఇవన్నీ చిన్న విషయాలు కావు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ప్రతి అంశం ప్రధానమైనదే. కానీ ఒక ప్రశ్న మనమందరం వేసుకోవాలి. దేశ రాజకీయాల భవిష్యత్తును, బహుజన సమాజం రాజకీయ వాటాను, దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యాన్ని రాబోయే యాభై సంవత్సరాల పాటు నిర్ణయించబోయే అంశం నీటా? లేక డీలిమిటేషన్, మహిళల రిజర్వేషన్, కులగణనా? ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెబితే, అసలు జాతీయ చర్చ జరగాల్సింది పార్లమెంట్ ముందుకు రానున్న ఈ రాజ్యాంగ సంబంధిత అంశాల గురించే అని అర్థమవుతుంది.దక్షిణాది రాష్ట్రాల ఆందోళనప్రజల దృష్టి ఒకవైపు మళ్లిన సమయంలో మరోవైపు దేశ రాజకీయ నిర్మాణాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు నిశ్శబ్దంగా ముందుకు సాగడం భారత రాజకీయాల్లో కొత్త విషయం కాదు. అందుకే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బహుజన సమాజం మరింత లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నియోజక వర్గాల పునర్విభజనను చాలామంది కేవలం సరిహద్దులు మార్చే సాంకేతిక ప్రక్రియగా భావిస్తారు. వాస్తవానికి అది రాజకీయ అధికా రాన్ని తిరిగి పంచే ప్రక్రియ. రాజ్యాంగంలోని 81, 82, 170 అధికర ణాల ప్రకారం జనాభా ఆధారంగా లోక్‌సభ, శాసనసభ స్థానాలను పునర్విభజన చేయాలి. 1976లో వచ్చిన 42వ రాజ్యాంగ సవరణ, 2001లో వచ్చిన 84వ రాజ్యాంగ సవరణల కారణంగా ఈ ప్రక్రి యను 2026 తర్వాతి జనగణన వరకు వాయిదా వేశారు. ఇప్పుడు ఆ గడువు ముగుస్తోంది.ఇక్కడే దక్షిణాది రాష్ట్రాల ఆందోళన మొదలవుతోంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ, ప్రజారోగ్యం, విద్య రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచాయి. అదే కారణంగా వాటిలో జనాభా పెరుగుదల తగ్గింది. ఇప్పుడు జనాభానే ప్రధాన ప్రమాణమైతే, ఈ రాష్ట్రాల లోక్‌సభ ప్రాతినిధ్యం సాపేక్షంగా తగ్గి, ఉత్తర భారత రాష్ట్రాల ప్రాధాన్యం పెరుగుతుంది. దేశ ప్రయోజనం కోసం అమలు చేసిన విధానాల ఫలితంగా రాజకీయంగా నష్టపోవడం సమంజసమా అనే ప్రశ్నకు దేశం సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది.కులగణనే కీలకంఇదే సమయంలో మహిళల రిజర్వేషన్ అంశాన్ని కూడా విడిగా చూడలేం. మహిళలకు శాసనసభల్లో, పార్లమెంటులో ఎక్కువ ప్రాతి నిధ్యం రావాలనే లక్ష్యాన్ని దేశంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు సమర్థిస్తున్నాయి. అయితే మరో ప్రశ్నను విస్మరించకూడదు. ఆ స్థానాల్లో ఎవరు గెలుస్తారు? ఇప్పటికే రాజకీయ, ఆర్థిక, సామాజికంగా బలంగా ఉన్న వర్గాలకు చెందిన మహిళలే అధికంగా ఎన్ని కయ్యే పరిస్థితి ఏర్పడితే– బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రైస్తవ మహిళలకు నిజమైన అవకాశాలు ఎంతవరకు లభిస్తాయి? అందుకే బీసీ సంఘాలు చాలాకాలంగా మహిళల రిజర్వేషన్లో ఓబీసీ మహిళలకు ప్రత్యేక వాటా ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు.ఈ చర్చలో కులగణన కీలకమైన అంశంగా మారుతుంది.దేశంలో పేదరికం లెక్కలు ఉన్నాయి. నిరుద్యోగం లెక్కలు ఉన్నాయి. రైతుల గణాంకాలు ఉన్నాయి. కానీ వివిధ సామాజిక వర్గాల నిజమైన జనాభా ఎంత అన్న సమాచారం లేకుండానే రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఎలా పునర్నిర్మించగలం? అందుకే అనేక సామాజిక న్యాయ ఉద్యమాలు ముందుగా కులగణన, తరువాత డీలిమిటేషన్ అనే క్రమాన్ని సూచిస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా పలు తీర్పుల్లో సామాజిక న్యాయానికి సంబంధించిన నిర్ణయాలు గణాంక ఆధారాలపై ఉండాలని పేర్కొంది.డీలిమిటేషన్, మహిళల రిజర్వేషన్, కులగణన – ఈ మూడు అంశాలు విడివిడిగా కనిపించినా వాస్తవానికి అవి ఒకే గొలుసులోని మూడు కడియాలు. ముందుగా కులగణన, తరువాత డీలిమిటేషన్, ఆ తరువాత మహిళల రిజర్వేషన్ అమలు జరిగితేనే సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగే అవకాశముందని అనేక సామాజిక న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో రాజకీయ ప్రశ్న కూడా ముందుకు వస్తోంది. దేశవ్యాప్తంగా ప్రజల దృష్టి నీట్ వంటి తక్షణ సమస్యలపై కేంద్రీకృతమవుతున్న సమయంలో, రాజ్యాంగపరంగా అత్యంత కీలకమైన డీలిమిటేషన్, మహిళల రిజర్వేషన్, కులగణన వంటి అంశాలపై తగినంత ప్రజా చర్చ జరుగుతోందా? దీనిపై భిన్నాభి ప్రాయాలు ఉండవచ్చు. కొందరు ఒకేసారి రెండు అంశాలపై పోరాటం చేయవచ్చని చెబుతారు. మరికొందరు తక్షణ రాజకీయ అంశాలు దీర్ఘకాల రాజ్యాంగ చర్చలను వెనక్కి నెట్టే ప్రమాదం ఉందని వాదిస్తారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ప్రజలే. కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, జాతీయ ఉద్యమాలు తమ ప్రాధాన్య క్రమంలో దక్షిణాది రాష్ట్రాల ప్రత్యేక ఆందోళనలకు తగిన స్థానం ఇవ్వకపోవచ్చు. ఇది ఒక రాజకీయ విశ్లేషణ మాత్రమే; దీనిపై విస్తృత ప్రజాస్వామ్య చర్చ అవసరం.అడగాల్సిన ప్రశ్నలునీట్లో అవకతవకలు జరిగితే మళ్లీ పరీక్ష నిర్వహించవచ్చు. ఒక మంత్రి రాజీనామా చేయవచ్చు. ఒక ప్రభుత్వం ఎన్నికల్లో ఓడి పోవచ్చు. కానీ డీలిమిటేషన్ ద్వారా లోక్‌సభలో రాష్ట్రాల ప్రాతి నిధ్యం మారితే, మహిళల రిజర్వేషన్ అమలు వల్ల రాజకీయ నాయకత్వ నిర్మాణం మారితే, వాటి ప్రభావం ఒక్క ఎన్నికతో ముగిసి పోదు. అది తరతరాల పాటు కొనసాగుతుంది. అందుకే ఈరోజు దేశం ముందు ఉన్న అసలు ప్రశ్న నీట్ కాదు; భారత ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రాతినిధ్యం ఎలా ఉండాలి అన్నదే.భారత రాజ్యాంగ పీఠిక సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ప్రతి పౌరుడికి హామీ ఇస్తుంది. ఆ న్యాయం కేవలం ఎన్నికలు జరగడంలో కాదు; సమాజంలోని అన్ని వర్గాలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం ఉండటంలో ఉంది. అందుకే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర బహుజన వర్గాలు మూడు ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం కోరాలి: ముందు కులగణన జరుగుతుందా? డీలిమిటేషన్‌కు ఏ ప్రమాణాలు అమలు చేస్తారు? మహిళల రిజర్వేషన్లో బహుజన మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఎలా కల్పిస్తారు?దేశ రాజకీయాల దిశను మార్చేది ప్రతిరోజూ వార్తల్లో కనిపించే వివాదాలు కావు. రాజ్యాంగంలో జరిగే మార్పులే. అందుకే బహుజన సమాజం ఈ చారిత్రక దశలో అప్రమత్తంగా ఉండాలి. రేపటి తరాల రాజకీయ భవిష్యత్తు ఈరోజు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. నేడు మనం ఏ ప్రశ్నలు అడుగుతున్నా మన్నదే రేపటి భారత ప్రజాస్వామ్య స్వరూపాన్ని నిర్ణయిస్తుంది.డా‘‘ జె.పూర్ణచంద్ర రావువ్యాసకర్త ఐపీఎస్(రిటైర్డ్), మాజీ డీజీపీ; జాతీయ కోఆర్డినేటర్ ఏపీ– తెలంగాణ, అల్ ఇండియా బీఎస్పీ -
నాయకత్వం పదవి కాదు... బాధ్యత!
ఈ రోజు మీ ముందుకు రావడం నాకు ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉంది. ప్రతి పట్టభద్రుల సభలో మాట్లాడే వ్యక్తి ఇదే మాట చెబుతారేమో. కానీ నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. బర్కిలీ అత్యుత్తమ ప్రభుత్వ విశ్వవిద్యాలయం మాత్రమే కాదు... ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయం. నేను ఇక్కడ 17 సంవత్సరాలు బోధించే అదృష్టం పొందాను. ఇప్పుడు మీరు చదువు పూర్తయిందని అనుకుంటున్నారు. ఇక విద్యార్థి జీవితం ముగిసిందని భావిస్తున్నారా? ఎందుకంటే... జీవితం అంటే నేర్చుకోవడమే. ఒక మంచి ఉపాధ్యాయుడు ఎప్పుడూ విద్యార్థిగానే ఉంటాడు. ఒక మంచి విద్యార్థి... ఎప్పుడో ఒక రోజు ఉపాధ్యాయుడవుతాడు. ఈ రెండూ వేర్వేరు పాత్రలు కావు. ఒకే ప్రయాణంలో రెండు దశలు. మనలోని ఆసక్తి, ప్రశ్నించే స్వభావం, మనుషులతో కలిసిమెలసి నేర్చుకోవాలనే తపనే... బోధనకూ, అభ్యాసానికీ మూలం. ఒక్కసారి మీ పక్కన కూర్చున్న సహ విద్యార్థులను చూడండి. ఈ నాలుగేళ్లలో వాళ్ల దగ్గర నుంచి మీరు ఎంత నేర్చుకున్నారో ఆలోచించండి. మీరు కూడా వారికి ఎన్నో విషయాలు నేర్పారు. ఇదే నిజమైన విద్య.ఎవరు నిజమైన నాయకులు?నన్ను ఎప్పుడూ వెంటాడే ఒక ప్రశ్న ఉంది. రేపటి ప్రపంచానికి మార్గం చూపే గురువులు ఎవరు? నేను కేవలం పాఠశాలల్లో, కళాశాలల్లో బోధించే ఉపాధ్యాయుల గురించే మాట్లాడటం లేదు. ప్రపంచం ఏ దిశగా వెళ్లాలి? ప్రజలకు ఏది సరైన మార్గమో ఎవరు చూపిస్తారు? నాయకుడు కావాలంటే... మీ పేరుకు ముందు పెద్ద హోదా ఉండాల్సిన అవసరం లేదు. ఖరీదైన కార్యాలయం అవసరం లేదు. ప్రభుత్వంలో మంత్రి కావాల్సిన అవసరం లేదు. చరిత్రను మార్చిన గొప్ప నాయకుల్లో చాలామందికి ఎలాంటి అధికార పదవులు లేవు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, డోలోరెస్ హుయెర్టా, రోసా పార్క్స్, డబ్ల్యూ.ఇ.బి. డు బాయిస్, సుసాన్ బి.ఆంథోనీ... వీళ్లందరూ తమ ఆలోచనలతో, ధైర్యంతో, నైతిక విలువలతో ప్రపంచాన్ని మార్చారు. నిజమైన నాయకుడు ఎవరు? ప్రపంచం ఎటు వెళ్లాలో తెలుసుకునే వ్యక్తి. ఆ దిశగా ఎలా వెళ్లాలో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగల వ్యక్తి. ప్రజల ప్రతిభను, శక్తిని, మంచి ఆలోచనలను ఒకే లక్ష్యం కోసం కలిపి పనిచేయించగల వ్యక్తి. నాయకత్వం అనేది ఒక పదవి కాదు... అది ఒక నైతిక బాధ్యత! విద్య అసలు ఉద్దేశం ఏమిటి?ప్రపంచం ఇప్పుడు ‘మనం ఏం చేయగలం?‘ అనే ప్రశ్నతోనే ఎక్కువగా పరుగులు తీస్తోంది. అద్భుతమైన యంత్రాలను తయారు చేశాం. రోబోలను రూపొందించాం. కృత్రిమ మేధ (ఏఐ) కూడా మన జీవితాల్లోకి వచ్చింది. ఇది గొప్ప విషయమే. కానీ అన్నింటికంటే ముఖ్యమైన ప్రశ్న ఇంకొకటి ఉంది. ‘మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం?’ ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినప్పుడే విద్యకు నిజమైన అర్థం తెలుస్తుంది. ఇప్పుడు ఇంజినీర్లు ఒకేసారి ఇతర భాషలను అనువదించే హెడ్ఫోన్లను రూపొందిస్తున్నారు. ఇది ఆశ్చర్యకరమైన సాంకేతిక పురోగతి. విదేశీ భాష నేర్చుకోవడం అంటే... ఒక దేశానికి వెళ్లి హోటల్లో భోజనం ఆర్డర్ చేయడం కోసమే కాదు. ఒక దేశ ప్రజలు ఎలా ఆలోచిస్తారు, వారి జీవన విధానం ఏమిటి అన్నది అర్థం చేసు కోవడానికే. ఇతరుల దృష్టికోణంలో ప్రపంచాన్ని చూడటం నేర్పించేదే నిజమైన విద్య. మీతో విభేదించే వ్యక్తులతో మాట్లాడండి. అదే అత్యుత్తమ అభ్యాసం. మన అభిప్రాయమే ఉన్నవారితో మాట్లాడితే, మనకు తెలిసినదే మళ్లీ వింటాం. భిన్నంగా ఆలోచించే వ్యక్తులతో మాట్లాడితే, కొత్త ఆలోచనలు పుడతాయి. మన అవగాహన విస్తరిస్తుంది. జ్ఞానం సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం. ఈ ప్రతిభతో సమాజానికి ఏమి చేయగలం? ప్రపంచాన్ని కొంచెమైనా మంచి దిశగా ఎలా తీసుకెళ్లగలం? అన్నదే అసలు ప్రశ్న. జ్ఞానం వ్యక్తిగత విజయానికి మాత్రమే ఉపయోగపడితే అది అసంపూర్ణం. అదే జ్ఞానం ఇతరుల జీవితాల్లో వెలుగు నింపితే... అప్పుడే అది నిజమైన విద్య అవుతుంది. ప్రజాస్వామ్యం ఎందుకు అవసరం?జీవితం ‘ద విజార్డ్ ఆఫ్ ఓజ్’ సినిమా లాంటిది. ఆ సినిమాలో ఒక తుఫాను తర్వాత డోరోతీ కొత్త ప్రపంచంలోకి చేరుతుంది. కిటికీ తెరిచి బయటకు చూస్తే, అన్నీ రంగుల ప్రపంచంలా కనిపి స్తాయి. జీవితం కూడా అలాంటిదే. కొన్నిసార్లు, మనం ఊహించని తుఫాన్లు వస్తాయి. మనల్ని కుదిపేస్తాయి. కొన్నిసార్లు కింద పడేస్తాయి. కానీ ఆ కష్టాల తర్వాత కొత్త అవకాశాలు మన కోసం ఎదురుచూస్తుంటాయి. ఆ అవకాశాలను గుర్తించ గలిగితే, మన జీవితమే మారిపోతుంది. ఈ రోజు నేను మీ ముందుకు వచ్చి కేవలం అభినందనలు చెప్పి వెళ్లిపోతే నా బాధ్యత పూర్తికాదు. ఎందుకంటే, మీరు గొప్ప అవకాశాల ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్లే... ఎన్నో సవాళ్లతో నిండిన ప్రపంచంలోకి కూడా ప్రవేశిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్య విలువలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. స్వేచ్ఛను, సమానత్వాన్ని, న్యాయాన్ని కాపాడే వ్యవస్థలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రజాస్వామ్యం ఎందుకు అంత ముఖ్యమైనది? ఒక మంచి సమాజం అంటే, బలవంతులు బలహీ నులను అణచివేయకుండా కాపాడే సమాజం. అదే నాగరికతకు పునాది. అలా కాకపోతే... అధికారం ఉన్నవారు తమ శక్తిని దుర్విని యోగం చేస్తారు. బలహీనులు మరింత వెనుకబడిపోతారు. చివరికి... అన్యాయం, అశాంతి, ఘర్షణలు పెరుగుతాయి. అందుకే ప్రజాస్వామ్యం అవసరం.మనం ఒక విషయం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. బలం ఉన్నంత మాత్రాన అది సత్యం కాదు. అధికారం ఉన్నంత మాత్రాన అది న్యాయం కాదు. చరిత్ర మనకు ఎన్నో పాఠాలు చెప్పింది. ఎలాంటి వ్యక్తి అయినా, ఎలాంటి సంస్థ అయినా, ఎలాంటి దేశ మైనా... చట్టాలకు, విలువలకు అతీతంగా ప్రవర్తిస్తే చివరికి అది తనకే నష్టం కలిగిస్తుంది. అందుకే, చట్టాలు బలహీనులను మాత్రమే కాదు... బలవంతులను కూడా కాపాడతాయి. వాటిని గౌరవించడం అందరి బాధ్యత. సత్యం కోసం నిలబడండి. సత్యాన్ని ధైర్యంగా చెప్పండి. ఎంత ఒత్తిడి వచ్చినా, ఎవరు వ్యతిరేకించినా... సత్యం పక్షాన నిలబడాలి. అదే విద్య యొక్క అసలు లక్ష్యం.ఇక్కడ మీరు నేర్చుకున్న విలువలను, ఇప్పుడు ప్రపంచానికి నేర్పే సమయం వచ్చింది. బలహీనుల పక్షాన నిలబడండి. అధి కారంలో ఉన్నవారిని ప్రశ్నించండి. న్యాయం కోసం గొంతెత్తండి. ఇతరులకు మార్గదర్శకులుగా నిలవండి. ఇదే ఒక తరం నుంచి మరో తరానికి వెళ్లే స్ఫూర్తి. ఈ ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది... కేవలం తెలివైన మనుషులు కాదు, విలువలతో జీవించే నాయకులు. సత్యం కోసం నిలబడే పౌరులు. ఇతరులను ముందుకు నడిపించే ఉపాధ్యాయులు. ఆ నాయకులు, ఆ గురువులు... మీరే! -
ధర్మేంద్ర ప్రధాన్ (మాజీ మంత్రి) రాయని డైరీ
రాజీనామా లేఖను ప్రధానమంత్రికి అందించి బయటకు రాగానే నా జ్ఞాపకాలు ముప్పై ఏళ్లు వెనక్కు వెళ్లాయి. ఆ రోజు... భువనేశ్వర్‌లో, వందల మంది విద్యార్థులను వెంటేసుకుని వెళ్లి ‘‘జేబీ పట్నాయక్, దిగిపో... జేబీ పట్నాయక్, దిగిపో...’’ అని సచివాలయం భవనం బీటలు వారేలా నేను నినాదాలిస్తున్నాను. ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్ కర్టెన్ను కాస్త తొలగించి, కిటికీ అద్దంలోంచి కిందికి చూస్తూ ఏదో అడుగుతున్నారు. పక్కనున్నవారు ఆయన చెవిలో ఏదో చెబుతున్నారు. మరుక్షణం సీఎం కర్టెన్ మూసేశారు. పోలీసులు ఒక్కసారిగా లాఠీ ఛార్జ్ మొదలు పెట్టారు. నా ముఖం చిట్లిపోయింది. నా ఎముకలు సున్నం అయ్యాయి. నా వెంట ఉన్న విద్యార్థులకూ గాయాలయ్యాయి. అంతా రక్తం వోడుతున్నాం. అయినా మేము అక్కడి నుంచి కదల్లేదు. ‘‘ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహించి పట్నాయక్ తక్షణం రాజీనామా చేయాలి’’ అని విద్యార్థులందరం డిమాండ్ చేస్తూనే ఉన్నాం. నినాదాలు ఇస్తూనే ఉన్నాం. పోలీసులు మాపై విరుచుకు పడుతూనే ఉన్నారు. అంత జరుగుతున్నా పట్నాయక్ రాజీనామా చేయలేదు. ‘‘దోషులపై చర్యలు తీసుకుంటాం’’ అని మాత్రం అన్నారు. నాడు నేను ఏ స్థానంలో నిలబడి పోరాడానో... నేడు అదే స్థానంలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిలబడ్డారు. నాడు నేను ఏ అధికార పీఠాన్ని ప్రశ్నించానో... నేడు అదే పీఠంపై కూర్చొని ఉన్న నన్ను విద్యార్థులు ప్రశ్నించారు. కాలం ఎంత విచిత్రమైనది! నాలోని పాత విద్యార్థి నాయకుడు, నేటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఓడించాడు. నేను రాజీనామా చేశాను. జంతర్ మంతర్‌లో విద్యార్థుల ఆందోళన మొదలైనప్పటి నుంచీ– 36 రోజులుగా–నాడు పట్నాయక్ మాతో అనిన మాటే, నేనూ విద్యార్థులతో అంటూ వచ్చాను... ‘‘దోషులపై చర్యలు తీసుకుంటాం’’ అని! కానీ, విద్యార్థులు వినలేదు. వినకపోవటంలో ఎప్పుడూ న్యాయమే ఉంటుంది. ప్రశ్నాపత్రాలు ఇచ్చి, వాటికి సమాధానాలు రాయమని ప్రభుత్వం విద్యార్థులను అడుగు తున్నప్పుడు, ప్రశ్నాపత్రాల లీకేజీపై విద్యార్థులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వమూ సరైన సమాధానాలు చెప్పాల్సిందే. ప్రభుత్వం చెప్పింది. కానీ వారికి ఆ సమాధానాలు సంతృప్తికరంగా లేవు. జీరో మార్కులు వేశారు. గవర్నమెంట్ ఫెయిల్ అనేశారు! ‘‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే...’’ అని పంతం పట్టారు. మంత్రి రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది? రాజీనామా చేయటం తప్ప మరేమీ జరగదు. విద్యాశాఖ ప్రధాని కిందకు వెళుతుంది. లేదంటే, ఇంకో మంత్రికి అదనపు శాఖ అవుతుంది. కొత్త మంత్రిని తీసుకున్నా,ఆ మంత్రికి విద్యాశాఖ అర్థం కావటానికి సమయం పడుతుంది. అంతవరకూ విద్యాశాఖలో ఒక్క నిర్ణయమూ జరగదు. ఒక్క తీర్మానమూ కదలదు. ఒక్క అమలూ కుదరదు. విద్యార్థులకు ఏం న్యాయం జరిగినట్లు?! అయినప్పటికీ నేను రాజీనామా చేశాను. ఇది ప్రశ్నాపత్రాలు లీక్ అయినందుకు చేసిన రాజీనామా కాదు. విద్యార్థుల డిమాండ్‌కు తలవొగ్గి చేసిన రాజీనామా కూడా కాదు. రాజీనామా చేయకపోతే, వారిని ఉసిగొల్పు తున్న చేతుల్లోనే వారి భవిష్యత్తును ఉంచి నట్లౌతుందన్న ఆందోళనతో చేసిన రాజీనామా!ఇదేమీ త్యాగం కాదు, ప్రజాస్వామ్యంపై విద్యార్థులకు నమ్మకం కలిగించటం. ఇదేమీ ఓటమి కాదు, విద్యార్థుల ఆవేదనను గౌరవించటం. చేతిలోని పెన్నును పక్కన పెట్టి, కుర్చీలోంచి నేను లేస్తున్నప్పుడు నాలో తెలియని ప్రశాంతత! ఇప్పుడిక నేను మంత్రిని కాకపోవచ్చు... కానీ, మళ్లీ నా పాత రోజుల్లోకి వెళ్లి, విద్యార్థుల పక్షాన నిలబడ్డానన్న తృప్తిని మిగుల్చుకున్న ఒక విద్యార్థి నాయకుడిని! -
గల్ఫ్‌లో మళ్లీ యుద్ధమేఘాలు
జూన్ 17, 2026న ఇరాన్–యూఎస్ఏల మధ్య అవగాహన (మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్–ఎంవోయూ) కుదర టంతో పర్షియన్ గల్ఫ్‌లో శాంతి పునః స్థాపితమవుతుందనే అందరూ భావించారు. ప్రపంచ విపణిలో చమురు ధరలు దిగిరావటంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. మూడు వారాలు తిరగక ముందే హార్మూజ్ మళ్లీ మూతపడటంతో శాంతి మూణ్నాళ్ల ముచ్చటయింది. ఈ రెండవ దశ యుద్ధం మరింత విస్తృతంగా, తీవ్రంగా కనపడుతున్నది. ప్రాంతీయ, అంతర్జా తీయ రాజకీయాలలో కీలక మలుపునకు ఈ దశ నాంది కావచ్చు.దిక్కుతోచని అమెరికా ఇరాన్–యూఎస్ అంగీకరించిన అవగాహన పత్రం 60 రోజులలో సమగ్ర ఒప్పందాన్ని తయారు చేయటానికి ఒక చట్రంగా ఉపయోగపడాలనేది ప్రధాన ఉద్దేశ్యం. ఈ రెండు నెలల వ్యవధిలో హార్మూజ్ జలసంధి ద్వారా నిరాటంకంగా ఎలాంటి రుసుములు లేకుండా వాణిజ్య నౌకల రవాణా జరగాలనీ, తత్సంబందిత ఏర్పాట్లను ఇరాన్ చేయాలనీ ఎంవోయూలోని అయిదవ ఆర్టికల్ నిర్దేశిస్తుంది. ఇదే పీటముడిగా మారింది. హార్మూజ్ జలసంధి ద్వారా రవాణా పూర్తిగా తన అజమాయిషీ, ఆధ్వర్యంలో జరగాలని ఇరాన్ నిర్దేశాలు జారీ చేసింది. ఈ నిర్దేశాల ప్రకారం హార్మూజ్ నుండి ప్రయాణించే ప్రతి నౌక ముందుగా ఇరాన్ వద్ద తమ పూర్తి వివరాలను నమోదు చేసుకుని నిర్దేశించిన మార్గంలో, నిర్దేశించిన సమయంలో ప్రయాణించాలి. యూఎస్ఏ ఈ వాదనను తిరస్క రిస్తూ హార్మూజ్ జలసంధి అంతర్జాతీయ రవాణా మార్గం, దీనిపై ఇరాన్ అజమాయిషీ కుదరదని తేల్చి చెప్పింది. ఇరాన్ తీరానికి సమీపంగా కాకుండా ఒమన్ తీరానికి సమీపంలో ఒమన్ ప్రాదేశిక జలాల గుండా నౌకల రవాణాను ప్రోత్సహించింది. ఒమన్ తీరంగుండా ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్ దాడి చేయటంతో యూఎస్ఏ తన నౌకాబలంతో హార్మూజ్‌ను దిగ్బంధించింది. ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు ప్రారంభించింది.మొదటి దశ 40 రోజుల దాడులతో పోల్చితే గత పన్నెండు రోజులుగా జరుగుతున్న రెండవ దశ యుద్ధం భిన్నంగా ఉన్నది. మొదటిసారిగా అమెరికా ఇరాన్‌లోని పౌర లక్ష్యాలపై దాడి చేసింది. రహదారులు, వంతెనలు, పవర్ ప్లాంట్లు, డీసాలినేషన్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకున్నది. బుషేర్లో నిర్మాణంలో ఉన్న పౌర అణువిద్యు చ్ఛక్తి కేంద్రంపై కూడా దాడి చేసింది. ఇది అంతర్జాతీయ యుద్ధనేరం (వార్ క్రైమ్) కిందకు వస్తుంది. ఇరాన్ కూడా అవగాహన పత్రంపై అమెరికా అధ్యక్షుడి సంతకానికి విలువ లేదని చెప్పి, అదే స్థాయిలో విరుచుకుపడింది. కువైట్‌లోని అల్సుబియా డీసాలినేషన్ ప్లాంట్, విద్యుచ్ఛక్తి కేంద్రంపై దాడి చేసింది. బహ్రెయిన్‌లో అమెరికా అయిదవ నౌకాదళ ప్రధాన కార్యాలయం ఉన్న సల్మాన్ పోర్టుపై దాడి చేసింది. మొదటిసారిగా సిరియా, జోర్డాన్‌లలోని యూఎస్ వైమానిక స్థావరాలు, విమానాశ్రయాలు, రేపు పట్టణాలపై కూడా దాడి చేసింది. అవగాహన పత్రంపై ట్రంప్ తప్పనిసరి పరిస్థితులలో సంతకం పెట్టినట్లుగా కన్పడుతున్నది. ఏదోరకంగా హార్మూజ్ జలసంధిని తెరిపించి, చమురు ధరలను కిందకు తేవాలనే ఆరాటం కనపడుతుంది. కానీ ఎంవోయూలో ఎక్కడా ఇరాన్ అణుకార్యక్రమాన్ని వీడుతున్నట్లు లేదు. ఒక రకంగా ఎంవోయూ అమెరికాకు ప్రతి కూలంగా, ఇరాన్‌కు ప్రయోజనకారిగా ఉన్నదని విశ్లేషకుల అభి ప్రాయం. ఈ నేపథ్యంలో ఇరాన్ హార్మూజ్‌ను తన ఆజమాయిషీ లోకి తీసుకునే ప్రయత్నాలు చేయటంతో అమెరికా దిక్కుతోచక మళ్లీ దాడులు మొదలుపెట్టింది.ఇరు పక్షాలకూ నష్టమే!ఇరాన్‌తో యుద్ధం అమెరికాకు కొరివితో తల గోక్కున్నట్లయింది. అమెరికా రక్షణ శాఖ మంత్రి పీటర్ హెగ్సెత్ అమెరికా ప్రభుత్వం ఇప్పటికే 37.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. మూడీస్ సంస్థ అంచనాల ప్రకారం ఇరాన్‌పై దాడి వలన అమెరికన్ పౌరులపై పన్నులు, అధిక ధరల రూపంలో 132 బిలియన్ డాలర్ల అదనపు భారం పడింది. పెంటగాన్, యుద్ధం కోసం అదనంగా 80 బిలియన్ డాలర్ల నిధులను కోరుతున్నది.తరిగిపోతున్న మందుగుండు సామగ్రి నిల్వలను పూర్తి చేయటానికి అమెరికా రక్షణ శాఖ 114 బిలియన్ డాలర్లను కోరుతున్నది. ఆర్థిక భారంతో పాటు, ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటికి 18 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గత రెండు వారాల లోనే వందమందికి పైగా అమెరికన్ సైనికులు గాయపడ్డారు. ఇరాన్‌పై దాడితో అమెరికా సాధించిందేమిటనేది ప్రశ్నార్థకం. ఇరాన్ అణుకార్యక్రమాన్ని, అణుసామర్థ్యాన్ని నిర్మూలించే లక్ష్యం నెరవేరే సూచనలు లేవు. గల్ఫ్ దేశాలను రక్షించే సామర్థ్యం అమెరికాకు ఉన్నదా అనే సందేహాలను ఈ యుద్ధం లేవనెత్తుతున్నది. ఇక ఇరాన్ విషయానికొస్తే, ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం ఈ సంవత్సరం ఇరాన్ ఆర్థిక వ్యవస్థ 6.1 శాతం క్షీణిస్తున్నది. ద్రవ్యో ల్బణం 68.9 శాతం. ఆహార ద్రవ్యోల్బణం 105 శాతం. ఇరాన్ కరెన్సీ (రియల్) దారుణంగా పతనమయింది. ఒక డాలర్‌కు 1.32 మిలియన్ల రియల్స్ పలుకుతున్నది. యుద్ధం వలన 144 బిలియన్ డాలర్ల నష్టం జరిగింది. ఇది ఇరాన్ జీడీపీలో 40 శాతం. సుమారుగా 3,460 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉన్నతస్థాయి సైనిక, రాజ కీయ నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది. అయితే, అమెరికా, ఇజ్రాయెల్ దాడులు రాజకీయంగా ఇరాన్ నాయకత్వానికి కలిసి వచ్చాయి. ప్రజలలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత అమెరికా–ఇజ్రా యెల్ వైపు మళ్లింది. ఖమేని అంత్యక్రియలను ఇరాన్ తెలివిగా వాడుకున్నది. అన్నింటికంటే ముఖ్యంగా ఇరాన్ హార్మూజ్ జలసంధి రూపంలో ఒక కొత్త అస్త్రాన్ని కనుక్కొన్నది. ఈ యుద్ధం ద్వారా ఇరాన్–రష్యా–చైనా మైత్రీబంధం మరింత బలపడింది.కొత్త గుణపాఠాలుహార్మూజ్, బాబెల్ మాండెబ్, సూయజ్, పనామా, మలక్కా వంటి ఇరుకైన జలసంధుల (చోక్ పాయింట్ల) ద్వారా రవాణాపై పూర్తిగా ఆధారపడటం వలన వచ్చే ముప్పు అన్ని దేశాలకు అర్థమైంది. హార్మూజ్ నుండి తప్పించుకోవటానికి సౌదీ ఈస్ట్–వెస్ట్ పైప్ లైన్ ద్వారా రోజూ సుమారు 5 బిలియన్ బారల్స్ చమురును ఎర్ర సముద్రంలోని యాంబూ రేవు పట్టణం గుండా పంపిస్తున్నది.అందుకే ఇరాన్‌కు మద్దతునిచ్చే యెమెన్‌లోని హౌతీలు బాబెల్ మాండెబ్‌ను మూసివేశారు. యూఏఈ హార్మూజ్‌కు ప్రత్యామ్నాయంగా హబ్షాన్ నుండి పైప్‌లైన్ ద్వారా ఫుజేరాకు పంపించి ఒమన్ సింధుశాఖ గుండా రవాణా చేస్తున్నది. అందుకే ఇరాన్ ఫుజేరాపై దాడి చేసింది. భారత్ ప్రతిపాదించిన ‘ఐమెక్’(ఇండియా–మిడిల్ ఈస్ట్– యూరప్ ఎకనామిక్ కారిడార్) వీటన్నింటికి విరుగుడు. ఐమెక్ రూపుదిద్దుకోవాలంటే గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్‌తో ఆచరణాత్మక వైఖరిని రూపొందించుకోవాలి. అధునాతన ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్లు, స్టెల్త్ యుద్ధ విమానాలు, అణ్వస్త్రాలు, క్షిపణి రక్షణ వ్యవస్థల ద్వారా దిగ్గజ శక్తులు చిన్న రాజ్యాలను లొంగదీసుకోవటం అసాధ్యమని ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు రుజువు చేస్తున్నాయి. చౌకైన డ్రోన్లు, క్షిపణులతో కూడా ఎదురొడ్డి నిలువవచ్చని చాటి చెప్తున్నాయి. ఒకరకంగా ఈ రెండు యుద్ధాలు రెండు కూటముల మధ్య జరుగుతున్నట్టు లెక్క. అమెరికా, ఐరోపా దేశాలు ఒకవైపు; చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా ఇంకొకవైపు మోహరించి ఉన్నాయి. ఉక్రెయిన్ వెనుక అమెరికా, యూరప్ ఉన్నాయి. ఇరాన్ వెనుక చైనా, రష్యా ఉన్నాయి. గల్ఫ్ దేశాల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కగా మారింది. గల్ఫ్ దేశాల రక్షణను ఇజ్రాయెల్ పట్టకంలోంచి అమెరికా చూస్తుందనే విషయాన్ని అవి గుర్తించాలి. తమ భద్రతకై జీసీసీ దేశాలు, నాటో తరహా కూటమిని ఏర్పాటు చేసుకోవటం మేలు. ఇరాన్‌తో సత్సంబంధాలకు ప్రయత్నించాలి. భద్రత, రక్షణ, ఆర్థిక అంశాలలో వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని అనుసరించాలి. ఈ విషయంలో భారత్ విధానాల నుండి నేర్చుకోవచ్చును.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్); సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు-గురజాల శ్రీనివాసరావు -
నేటి యువత చూపుతున్న నైతిక శక్తి
ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో జరుగుతున్న విద్యార్థుల నిరసన... శాంతియుతంగా వ్యవస్థలను ప్రశ్నించే ధైర్యం ఉన్న వారే ఒక దేశపు ప్రజాస్వామ్య గాథను రాస్తారనే చిరస్థాయి సూత్రాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. బ్రిటిష్ పాలనలో జరిగిన స్వదేశీ ఉద్యమం నుంచి క్విట్ ఇండియా ఉద్యమం వరకు; స్వాతంత్య్రం తరువాత గుజరాత్‌లోని నవనిర్మాణ ఉద్యమం నుంచి 1970ల జేపీ (జయప్రకాశ్ నారాయణ్) జేపీ ఉద్యమం వరకు... వ్యవస్థ న్యాయమార్గం నుంచి తప్పిపోతోందని భావించిన ప్రతిసారీ విద్యార్థులు సవాలు విసిరారు. వారి పాత్ర తరగతి గదులకే పరిమితం కాలేదు. జంతర్ మంతర్ నిరసన ఆ సంప్రదాయానికి కొనసాగింపు మాత్రమే.సత్యాగ్రహ శక్తిసామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన అనేక వీడియోల్లో, పోలీసులు బలప్రయోగం చేసినప్పటికీ విద్యార్థులు హింసతో ప్రతిస్పందించకుండా నిలిచిన దృశ్యాలు కనిపిస్తాయి. తమపై ఏమి జరిగినా శాంతియుతంగానే ఉంటామని కొందరు పోలీసుల ఎదుట నిలబడి చెప్పారు. వారు తెలుసుకుని చేసినా, తెలియక చేసినా అది మహాత్మా గాంధీ ‘సత్యాగ్రహం’గా అభివర్ణించిన సత్యశక్తినే ప్రతిబింబించింది. ‘మానవాళి చేతిలో ఉన్న అత్యంత శక్తిమంతమైన ఆయుధం అహింస’ అని గాంధీజీ అన్నారు. ఆయన దృష్టిలో సత్యాగ్రహి లక్ష్యం ప్రత్యర్థిని ఓడించడం కాదు, సమాజ అంతరాత్మను మేల్కొల్పడం. జంతర్ మంతర్ నిరసన ద్వారా విద్యార్థులు సరిగ్గా ఇదే చేశారు. విద్య అంటే అసలు ఏమిటన్న మరింత లోతైన ప్రశ్నను కూడా ఈ నిరసన లేవనెత్తుతోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 భావప్రకటన స్వేచ్ఛతో పాటు శాంతియుతంగా సమావేశ మయ్యే హక్కును హామీ ఇస్తోంది. ఎందుకంటే భయపడకుండా అధికారాన్ని ప్రశ్నించగల విజ్ఞానవంతులైన పౌరులపైనే ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది కాబట్టి. అందువల్ల భిన్నాభిప్రాయం ప్రజాస్వామ్యానికి మినహాయింపు కాదు; దాని ప్రాథమిక అవసరాల్లో అది ఒకటి. ఏ రాజకీయ సిద్ధాంతం అధికారంలో ఉన్నా, ప్రజా శాంతి భద్రతలను కాపాడటం ప్రభుత్వ బాధ్యతే కావచ్చు. కానీ అదే సమయంలో శాంతియుత నిరసనను దేశానికే ముప్పుగా పరిగణించకుండా చూడటం కూడా ప్రతి ప్రజాస్వామ్య ప్రభుత్వ బాధ్యత అనేది గుర్తెరగాలి.ధర్మబద్ధమైన కార్యాచరణ‘ప్రభుత్వాలు తాత్కాలికమైనవి; ప్రజాస్వామ్య సంస్థలు శాశ్వ తమైనవి’ అని చరిత్ర చెబుతోంది. ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని దేశాన్ని విమర్శించినట్టుగా భావించడం... భారత స్వాతంత్య్ర ఉద్యమం నెలకొల్పాలనుకున్న రాజ్యాంగ సంస్కృతినే బలహీన పరుస్తుంది. ఇది ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్న ‘సనాతన ధర్మం’ వైపునకు తీసుకువెళుతుంది. ప్రస్తుత రాజకీయ చర్చల్లో సనాతన ధర్మాన్ని కేవలం మతపరమైనదిగా చిత్రీకరిస్తున్నారు. కానీ భారతీయ శాస్త్రీయ తాత్విక సంప్రదాయంలో దానికి ఎంతో విస్తృతమైన అర్థం ఉంది. ‘ధర్మం’ అంటే సమాజాన్ని నిలబెట్టేది– న్యాయం, సత్యం, కరుణ, కర్తవ్యం, నైతిక క్రమం. అది కేవలం ఆచారాలు, కర్మకాండలు కాదు; నైతిక ప్రవర్తన.ధర్మం లేని అధికారానికి చెల్లుబాటు ఉంటుందా అనే ప్రశ్న మహాభారతంలో చాలాసార్లు కనిపిస్తుంది. ధృతరాష్ట్రుడు అధికారంపై మమకారంతో అన్యాయాన్ని చూడలేకపోయాడు. దుర్యోధనుడి దురాశ ఒక రాజ్యాన్నే నాశనం చేసింది. భీష్ముడు జ్ఞానవంతుడూ, నిష్కళంకుడూ అయినప్పటికీ, చక్రవర్తి పట్ల తన విధేయత కారణంగా అధర్మాన్ని ఎదిరించలేక విషాదపాత్రగా మిగిలాడు. న్యాయాన్ని వదిలిపెట్టిన పాలకులు చివరకు తమను తామే నాశనం చేసుకుంటారని విదురుడు పదేపదే హెచ్చరిస్తాడు. అర్జునుడికి కృష్ణుడు ఇచ్చిన ఉపదేశం అధికారాన్ని సమర్థించడం కాదు; ధర్మ బద్ధమైన కార్యాచరణకు మద్దతు ఇవ్వడం. ఈ సందేశం శాశ్వత మైనది. ధర్మం రాజకీయ అధికారానికి మించినది. పాలకుల చెల్లు బాటు నైతిక పాలన పట్ల వారి నిబద్ధతపైనే ఆధారపడి ఉంటుంది.ఈ అవగాహన భారత రాజ్యాంగంతో కూడా సారూప్యత కలిగి ఉంది. స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం, న్యాయం వంటి విలువలు భారతీయ నాగరికతపై పాశ్చాత్య ప్రపంచం రుద్దినవి కావు. ఉప నిషత్తుల నుంచి బుద్ధుడి వరకు, అశోకుని నుంచి బసవన్న వరకు, కబీర్ నుంచి అంబేడ్కర్ వరకు... భారతీయ తాత్విక సంప్రదా యాల్లో ఇవి లోతుగా ప్రతిధ్వనిస్తాయి. భారత రాజ్యాంగ నైతికత, భారత నాగరికత నైతిక సంప్రదాయం పరస్పర విరోధాలు కావు; అత్యుత్తమ రూపంలో అవి ఒకదానిని మరొకటి బలోపేతం చేస్తాయి.పూర్తికాని స్వాతంత్య్ర పోరాటంభారతదేశం 1947లో రాజకీయ స్వాతంత్య్రాన్ని సాధించింది. అయితే ఆ స్వేచ్ఛకు నైతిక పునాదులను కాపాడుకునే పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థులు ప్రజాస్వామ్యం ఎన్నికల ద్వారా మాత్రమే నిలవదనీ, ప్రజా అంతరాత్మ ద్వారానూ నిలుస్తుందనీ గుర్తు చేశారు. భారత ప్రజాస్వామ్య భవిష్యత్తుకు సమాధానం కేవలం అధికార కేంద్రాల్లో దొరకదు. స్వతంత్ర ఆలోచనను పెంపొందించే తరగతి గదుల్లో, జవాబుదారీతనాన్ని ఆహ్వానించే సంస్థల్లో, భయానికి సత్యాన్ని బలివ్వని పౌరుల్లో అది కనిపిస్తుంది. అధికా రాన్ని ప్రశ్నించడం దేశద్రోహం కాదు; గణతంత్రంపై విశ్వాసాన్ని వ్యక్తపరిచే చర్య అని జంతర్ మంతర్‌లో యువత గుర్తుచేస్తోంది. ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు నిరసన స్వరం కాదు, పౌరుల మౌనం!డా‘‘ రఘు చలిగంటివ్యాసకర్త ఫ్రౌన్హోఫర్ హెచ్‌హెచ్‌ఐ (జర్మనీ)సీనియర్ పరిశోధకుడు, ‘తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ’ వ్యవస్థాపకుడు -
ఔషధాల అన్వేషణ ఏఐతో సులభతరం
మానవాళి ఆరోగ్య సంరక్షణ చరిత్రను పరిశీలిస్తే ప్రకృతే తొలి వైద్యశాలగా నిలిచిందని స్పష్టమవుతుంది. శతాబ్దాలుగా ఆయుర్వేదం, యునాని, సిద్ధ, నాటు వైద్య విధానాలు మనుషులకు ప్రాథమిక ఆరోగ్య రక్షణను అందిస్తూ వచ్చాయి. 1950వ దశాబ్దానికి పూర్వం వరకు మానవ మనుగడ ప్రధానంగా ఈ సహజ మూలికా వైద్యంపైనే ఆధారపడి సాగింది. ఆధునిక వైద్యంలో అత్యంత కీలకమైన మోర్ఫిన్, కొకైన్, క్వినైన్, ఆస్పిరిన్ వంటి అనేక ఔషధాల ఆవిష్కరణకు ప్రకృతిసిద్ధమైన వృక్ష సంపదే మూలధారంగా నిలిచింది. అయితే, నేటి మారుతున్న జీవనశైలి కారణంగా హృద్రో గాలు, మధుమేహం, కాన్సర్, ఊబకాయం వంటి తీవ్రమైన రుగ్మతలు మానవాళికి సవాలుగా మారాయి. వీటి నివారణకు ప్రాచీన మూలికా విజ్ఞానాన్ని ఆధునిక కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో అనుసంధానించటం ఆవశ్యకంగా మారింది.ఔషధ ఆవిష్కరణలో నూతన శకంమన దేశంలో ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానానికి అపారమైన ప్రాధాన్యత ఉంది. అశ్వగంధ, శతావరి, నేలవేము, తులసి, గుడుచి, త్రిఫల వంటి ఎన్నో శతాబ్దాలుగా రోగనిరోధక శక్తిని పెంపొందించటంలోనూ, అనేక రుగ్మతల నివారణలోనూ ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. అయితే, ఈ సంప్రదాయ మూలికా వైద్యంలో ఉన్న క్రియాశీల రసాయన ఘటకాలను (యాక్టివ్ ప్రిన్సిపుల్స్) వేరుచేసి, వాటి ప్రామాణీకరణను ఆధునిక రసాయనిక, జీవశాస్త్ర పద్ధతుల ద్వారా నిర్ధారించవలసిన అవసరం ఉంది. సంప్రదాయ వైద్యం కేవలం అనుభవపూర్వక నమ్మకంగా మాత్రమే మిగిలిపోకుండా ప్రజారోగ్య వ్యవస్థలో భాగం కావాలంటే శాస్త్రీయ విశ్లేషణ, ఆధారిత రుజువులు (సైంటిఫిక్ రిగర్) చాలా ముఖ్యం.నూతన ఔషధాల అన్వేషణలో కృత్రిమ మేధ (ఏఐ) ప్రవేశం ఒక విప్లవాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టింది. ఒక కొత్త ఔషధాన్ని కనుగొనటానికి సాధారణంగా దశాబ్దాల సమయం, భారీ ఆర్థిక వ్యయం అవసరమవుతాయి. కానీ, ఏఐ సాంకేతికత సహాయంతో కోట్లాది రసాయన నిర్మాణాలను చాలా తక్కువ సమయంలోనే వర్చువల్ స్క్రీనింగ్ చేయవచ్చు. ఇవి లక్ష్యిత వ్యాధి కణాలపై ఎలా పనిచేస్తాయి? ఎంతవరకు ప్రభావవంతంగా ఉంటాయి? వాటి వల్ల ఏవైనా విషపూరిత పరిణామాలు ఎదురవుతాయా? అనే అంశాలను ఏఐ ద్వారా ముందే ఊహించడానికి అవకాశముంది. ప్రాచీన మూలికా సమాచారాన్ని డిజిటలైజ్ చేసి ఏఐ డేటాబేసులతో అనుసంధానించటం ద్వారా పరిశోధన వేగాన్ని పెంచవచ్చు.ఏఐ నిర్ణేత కాదు, పరికరం మాత్రమే!ఏఐ ఎంత శక్తిమంతమైనదైనప్పటికీ, అది మైక్రోస్కోప్ లేదా స్పెక్ట్రోమీటర్ లాంటి ఒక పరిశోధనా సాధనం మాత్రమే తప్ప స్వయంభూ నిర్ణేత కాదు. ఏఐ కోట్లాది రసాయన నమూనాలను వేగంగా విశ్లేషించగలదు. కానీ అది సత్యానికి ప్రమాణం లేదా శాస్త్రీయ నిజం కాదు. ఏఐ ఇచ్చే అంచనాలలో ‘ఫాల్స్ పాజిటివ్స్’, ‘ఫాల్స్ నెగె టివ్స్’, తప్పుడు ఊహలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. ఏఐకి మానవ భావోద్వేగాలు, జీవశాస్త్ర పద్ధతుల వెనుక ఉన్న నిజమైన కారణాలు లేదా ప్రయోగశాల ప్రత్యక్ష అనుభవం ఉండవు. పెన్సిలిన్, టాక్సాల్ వంటి విప్లవాత్మక ఆవిష్కరణలు... అనుకోకుండా, మానవ సృజనాత్మక పరిశీలన వల్లనే సాధ్యపడ్డాయి. కాబట్టి, ఏఐ ఆలోచనను భర్తీ చేయలేదు, కేవలం శాస్త్రవేత్త ఆలోచనా పరిధిని విస్తరింపజేస్తుంది. ఔషధ నాణ్యత, క్లినికల్ భద్రత, తుది నిర్ణయం ఎప్పుడూ మానవ మేధస్సు, శాస్త్రీయ విశ్లేషణ పైనే ఆధారపడి ఉంటాయి. సంప్రదాయం, శాస్త్రీయతల సమతుల్యతఏఐ నమూనాల (ప్యాటర్న్స్)ను గుర్తిస్తుంది. కానీ శాస్త్రానికి కారణ–ఫలిత సంబంధం (కాజేషన్), జీవశాస్త్రపరమైన సమర్థత (బయలాజికల్ ప్లాసిబిలిటీ) అవసరం. వివరణ లేకుండా చేసే అంచనాలు బలహీనమైన శాస్త్రాన్ని సృష్టిస్తాయి. అందువల్ల ఏఐ పట్ల శాస్త్రీయ సందేహ దృష్టి (సైంటిఫిక్ స్కెప్టిసిజమ్), విమర్శనాత్మక శాస్త్రీయ ఆలోచన (సైంటిఫిక్ రీజనింగ్) సమాజ అభ్యున్నతికి అత్యంత అవసరం. కాబట్టి, భవిష్యత్తు ‘మనిషి వర్సెస్ ఏఐ’ కాదు, ‘మనిషి + ఏఐ’ అనే సహకార దృక్పథమే వాస్తవం. ఏఐ మన జిజ్ఞాసను విస్తరించాలి, దాన్ని భర్తీ చేయకూడదు. అందువల్ల, ఇదీ భవిష్యత్తు విజయసూత్రం: ఏఐ+సాంప్రదాయ జ్ఞానం+కఠినమైన ప్రయోగాత్మక పరిశోధన+ విమర్శనాత్మక ఆలోచన= సమాజ పురోగతి, మానవ సంక్షేమం. భారతదేశానికి ఉన్న అపారమైన ప్రాచీన వైద్య సంపదను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమ్మేళనం చేయటమే నేటి మన ప్రధాన లక్ష్యం కావాలి. ఏఐ అందించే విశ్లేషణలను గుడ్డిగా నమ్మ కుండా, విమర్శనాత్మక ఆలోచన, ప్రయోగశాల నిర్ధారణల ద్వారా పరిశీలించాలి. ఆయుర్వేద ఔషధాల నాణ్యత, భద్రత, సమర్థతలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిరూపించినప్పుడే భారతీయ వైద్య విజ్ఞానానికి ప్రపంచస్థాయిలో సముచిత స్థానం లభిస్తుంది. ఏఐ పరిశోధనల వేగాన్ని పెంచినప్పటికీ, మానవ మేధస్సు, శాస్త్రీయ దృక్పథం మాత్రమే నిజమైన ఆరోగ్య విప్లవానికి బాటలు వేస్తాయి. – డా‘‘ కె. నాగయ్య : విశ్రాంత ముఖ్య శాస్త్రవేత్త, ప్రాకృతిక ఉత్పత్తులు–ఔషధ రసాయన శాస్త్ర విభాగం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (సీఎస్ఐఆర్–ఐఐసీటీ), హైదరాబాద్;– ఫణిరాజ్ జి : ఐటీ ప్రొఫెషనల్, బోస్టన్, యూఎస్ఏ -
మేధో వలసలను ఇస్రో ఆపేదెలా?
అంతరిక్ష రంగం ఈమధ్య సముచిత, అనుచిత కారణాలు రెండింటితోనూ వార్తలకెక్కుతోంది. స్కైరూట్ అనే భారతీయ ప్రైవేటు స్పేస్ కంపెనీ తానే అన్నీ అయి చూసుకున్న ఒక అంతరిక్ష ప్రయోగాన్ని తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా నిర్వహించింది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన ఇద్దరు మాజీ ఇంజినీర్లు ఆ కంపెనీని నెల కొల్పారు. ఈ కంపెనీ విక్రమ్–1 రాకెట్‌ను ప్రయోగించి తన సత్తా చాటుకుంది. ఇదే తరహా రాకెట్‌ను మరింత ఉన్నతపరచి విక్రమ్–2 పేరుతో వచ్చే ఏడాది ప్రయోగించాలని భావిస్తోంది. తక్కువ ఎత్తులోనున్న భూకక్ష్య (ఎల్.ఇ.ఓ.)లో ఉపగ్రహాలను నిలిపే కోట్లాది డాలర్ల మార్కెట్లోకి ప్రవేశించాలని స్కైరూట్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రైవేటు ఆకర్షణీయంమరోపక్క ఇస్రో నుంచి టాప్ సైంటిస్టులు, ఇంజినీర్లు పెద్ద యెత్తున వైదొలగుతున్నారనే వార్త గుబులు పుట్టిస్తోంది. యు.ఆర్. రావు స్పేస్ సెంటర్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, జాతీయ అంతరిక్ష సంస్థకు చెందిన ఇతర కీలక విభాగాల్లో పనిచేస్తున్న డజన్లకొద్దీ సీనియర్ సైంటిస్టులు రాజీనామా చేయడమో లేదా ముందుగానే రిటైర్మెంట్ తీసుకోవడమో చేశారని వార్తలు సూచిస్తున్నాయి. వారిలో చాలామంది భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గగన్‌యాన్ (మానవుడిని స్పయంగా అంతరిక్షంలోకి పంపడం), తదుపరి తరం వాహక నౌక (ఎన్జీఎల్వీ), భారతీయ అంతరిక్ష స్టేషన్ (బ్యాస్) వంటి ప్రముఖ కార్యక్రమాల్లో పనిచేస్తున్నారు. ఈ వలస ఎంత ఆందోళనకరంగా పరిణమించిందంటే, అలాంటి ప్రాజెక్టులు పూర్తయ్యేంత వరకు వాటిలో పనిచేస్తున్నవారు సంస్థను విడిచి వెళ్ళడానికి వీలులేకుండా అంతరిక్ష శాఖ ఆంక్షలు విధించాలని నిర్ణయించుకుంది. ఈ రెండు పరిణామాలు– మొదటి ప్రైవేటు రాకెట్ ప్రయోగం, ఇస్రోకు ఉద్యోగులు వీడ్కోలు పలకడం– పైకి ఒకదానితో ఒకటి సంబంధం లేనివిగా కనిపించవచ్చు. కానీ, అవి పరస్పరం ముడిపడి ఉన్నవని గ్రహించాలి. ఇస్రో యూనిట్ల నుంచి ఉద్యోగులు రాజీనామాలు చేయడానికి ప్రధాన కారణం, గత కొద్ది ఏళ్ళలో ప్రైవేట్ రంగ స్పేస్ కంపెనీలు కనబరుస్తున్న ఎదుగుదలేనని స్పష్టమవుతోంది. అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ సంస్థల ప్రవేశానికి పచ్చజెండా ఊపడమే కాకుండా, ఉపగ్రహ వాహక నౌకల ప్రయోగానికి ఇస్రో సదుపాయాలను వినియోగించుకునేందుకు కూడా ప్రభుత్వం అను మతించింది. ఇస్రోలో పనిచేస్తున్న ప్రతిభావంతులైనవారిని తమ వైపు లాక్కునేందుకు ప్రైవేట్ కంపెనీలకు ఇది అనువైన వాతావర ణాన్ని కల్పించింది. ప్రభుత్వ సంస్థల నుంచి ప్రైవేటుకు ఇలా ప్రతిభావంతులు తరలిపోవడం ఇస్రోకు ఇది కొత్తా కాదు, అంతరిక్ష రంగానికి మాత్రమే పరిమితమైన ధోరణి అంతకన్నా కాదు. అమెరికాలో కూడా ప్రైవేట్ అంతరిక్ష రంగం మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తీర్చిదిద్ది, అభివృద్ధి చేసిన మానవ వనరులే అక్కడి ప్రైవేట్ రంగానికి ప్రధాన ఆలంబన. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ కూడా మొగ్గ తొడుగుతున్న దశలో ఆ రంగానికి చెందిన ప్రైవేట్ సంస్థలు తమ పరిశోధన–అభివృద్ధి విభాగాలలోకి ఈసీఐఎల్, సీఎంసీ వంటి ప్రభుత్వ రంగ కంపెనీల నుంచే సిబ్బందిని తీసుకున్నాయి. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వంటి ప్రభుత్వ రంగ కంపెనీల విషయంలోనూ అదే జరిగింది. డీఆర్డీఓ ల్యాబొరేటరీలలో కూడా ఇస్రో తరహా పరిస్థితే నెలకొంది. రక్షణ, ఏరోస్పేస్ పరికరాల ఉత్పత్తిలో ప్రైవేట్ రంగాన్ని అనుమతించిన ఫలితమే ఇది. అందని నిధులు– అందితే కోతలుఇస్రో, డీఆర్డీఓ వంటి మన వైజ్ఞానిక సంస్థలు తాము ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణాలను నిశితంగా అన్వేషించుకోవాలి. ఇస్రోకు చెందిన వివిధ యూనిట్లలో 2,800లకు పైగా ఖాళీలున్నాయనీ, మంజూరైనవి సుమారు 1800 పోస్టులు మాత్రమేననీ అంతరిక్ష శాఖ పనితీరును అధ్యయనం చేసిన పార్లమెంటరీ కమిటీకి 2026 మార్చిలో వెల్లడించారు. ఎన్జీఎల్వీ తయారు చేసే ముఖ్య పనిలో ఉన్న విక్రమ్ సారాభాయ్ కేంద్రంలో దాదాపు 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకవైపు ప్రైవేట్ కంపెనీలు అనుభవజ్ఞులైన సైంటిస్టులను ఎరవేసి పట్టుకుంటున్నాయి. మరోవైపు, ఇస్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం నుంచి నిధులు అందడం లేదు. ఉదాహరణకు, ఎన్జీఎల్వీని నిర్మించి, ప్రయోగించే ప్రాజెక్టునకు 96 నెలల సమయమిస్తూ క్యాబినెట్ 2024లో ఆమోదం తెలిపింది. ఆమోదించిన తేదీ నుంచి 84 నెలల లోపల మొదటి పరీక్షకు వాహక నౌకను సిద్ధం చేయాలని కూడా ఆదేశించింది. కానీ, 2024–25 బడ్జెట్లో దీనికి కేటాయింపులు ఏమీ లేకపోవడం వల్ల ఆమోదం పొందిన అనేక నెలల తర్వాత కూడా ఈ ప్రాజెక్టు కాగితాలకు మాత్రమే పరిమితమైంది. సవరించిన అంచనాలలో నామ మాత్రంగా రూ. 3 కోట్లు కేటాయిస్తే, దానిలో ఇస్రో రూ. 85 లక్షలను మాత్రమే వెచ్చించగలిగింది. 2025–26 బడ్జెట్లో రూ. 158 కోట్లు కేటాయించారుగానీ, సవరించిన అంచనాల దగ్గరకొచ్చేసరికి దాన్ని రూ. 39.76 కోట్లకు తగ్గించారు. ఇందులో ఇస్రో 2026 జన వరి 31 వరకు రూ. 7.93 కోట్లను మాత్రమే వెచ్చించగలిగింది.వ్యయంలో నత్తనడక, కేటాయించిన నిధులను కూడా పూర్తిగా వినియోగించుకోలేకపోవడం, తదుపరి బడ్జెట్లలో కేటాయింపులను తగ్గిస్తూపోవడం, ఖాళీలను భర్తీ చేయడంలో జాప్యం, ప్రైవేట్ రంగ ప్రవేశం వంటివన్నీ ఇస్రోలో నేటి స్థితికి కారణమయ్యాయి. వీటన్నింటికి తోడు ఇస్రోకు నమ్మిన బంటుగా పనిచేస్తూ వచ్చిన పీఎస్ఎల్వీ వరుసగా వైఫల్యాలను చవిచూసింది. నిర్ణాయక వ్యవస్థ కేంద్రీకృతం కావడం, అధికారుల, రాజకీయ జోక్యం పెరగడం వంటివి భారీ ప్రాజెక్టులను తలకెత్తుకున్న సైంటిఫిక్ ఏజెన్సీ పని తీరుకు మేలు చేయవు. మారాల్సిన విధానాలుసైంటిస్టులను రాజీనామా చేయవద్దని కోరడం, వారు వైదొలగకుండా అడ్డు పెట్టడం సరైన స్పందన అనిపించుకోదు. ప్రైవేట్ రంగ ప్రవేశానికి ప్రోద్బలం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, దానికి వీలు కల్పించిన ఇస్రో తమ వైఖరి పర్యవసానాన్ని, అది జాతీయ కార్యక్రమాలపై చూపగల ప్రభావాన్ని ముందే ఊహించి ఉండాల్సింది. దాంతోపాటు, మిషన్ వైఫల్యాలు, జాప్యాల ఫలితంగా నీరసపడ్డ సైంటిస్టులలో స్థైర్యాన్ని పెంపొందించే చర్యలను ఇస్రో నాయకత్వం చేపట్టాలి. ఇస్రో దీర్ఘకాలంలో చేపట్టవలసిన సరికొత్త యంత్రాంగాలపై యోచించాలి. ఉదాహరణకు, సిబ్బంది ఇస్రోలో తమ ఉద్యోగాలను నిలబెట్టుకుంటూనే ఒక పరిమిత కాలానికి ప్రైవేట్ రంగంలో పని చేసేందుకు అనుమతించవచ్చు. కీలకేతర రంగాల్లో సొంత కంపెనీలను స్థాపించుకునేందుకు అంగీకరించవచ్చు. వీటికి తోడుగా, జీతభత్యాలు, ప్రోత్సాహకాలు, ప్రమోషన్ల విధానాలను సవరించు కోవాలి. ప్రభుత్వం తన వంతుగా వైజ్ఞానిక సంస్థల ప్రతిపత్తిని పున రుద్ధరించాలి. స్పేస్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా వృద్ధి చెందుతోంది. దాన్ని వినియోగించుకునేందుకు జాతీయ ఏజెన్సీలతో పాటు ప్రైవేట్ కంపెనీలకు కూడా కావలసినంత అవకాశం ఉంది. బ్రెయిన్ డ్రెయిన్‌ను బ్రెయిన్ సర్క్యులేషన్‌గా మలచుకోవచ్చు. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
చైనాలో ఎందుకీ ప్రక్షాళనలు?
చైనాలో విధానపరమైన అన్ని నిర్ణయాలు తీసుకునే కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో నుంచి ఈ నెల 14న మరొక సభ్యుడిని తొలగించారు. అసలు పార్టీ నుంచే బహిష్కరించారు. మొత్తం 24 మంది సభ్యులుండే ఆ విభాగం నుంచి ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటికి ముగ్గురు బహిష్కృతులయారు. ఇదే కాలంలో అత్యున్నత సైనిక జనరల్స్ నలుగురు పదవీ చ్యుతులు కావటమేగాక, కొందరు ఉన్నతాధికారులు ఉరిశిక్షలకు గురికావటమో, జీవిత కాలపు జైలుకు వెళ్లటమో జరిగింది.ప్రచారంలో నిజం ఎంత?ఇందుకు కారణాలు ఏమిటన్నది అర్థం చేసుకోవలసిన విషయం. ఇటువంటి వార్తలు బయటకు వచ్చినప్పుడల్లా ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది. ఒక విధమైన దిగ్భ్రమకు కూడా లోనవుతుంది. పలువిధాలైన ఊహాగానాలు, చర్చలు సాగుతాయి. కానీ, చైనా 1949 కమ్యూనిస్టు విప్లవానికి ముందుకాలపు చరిత్రలోనూ తనకుతానే సీమితమై, తన చుట్టూ తాను తిరిగే మిస్టిక్ దేశమే. కమ్యూనిజంలో ఉండే పారదర్శకతా రాహిత్యానికి, ఈ చారిత్రక మిస్టిసిజం తోడై, అక్కడి పరిణామాలలోని వాస్తవాలు ఏమిటో బయటి ప్రపంచానికి సరిగా తెలియని పరిస్థితి ఏర్పడింది. చైనా ప్రభుత్వం స్వయంగా చెప్పేది ఎక్కువగా అవినీతి, బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతం, అధికార దుర్వినియోగం. కొద్ది సందర్భాలలో మాత్రం రక్షణ రహస్యాలను, శాస్త్ర–సాంకేతికరంగ రహస్యాలను శత్రు దేశాలకు చేరవేయటం. చైనా నాయకత్వం మధ్య అధికార గ్రూపు రాజకీయాలని కూడా పాశ్చాత్య ఇంటెలిజెన్స్ సంస్థలు, మీడియా ప్రచారం చేస్తుంటాయి. ఈ ప్రచారాన్ని నిజానికి తేలికగా కొట్టివేయవచ్చు. మావో, డెంగ్ జియావ్ పింగ్ తర్వాత ఈ రోజున షీ జిన్‌పింగ్ పార్టీలో, ప్రభుత్వంలో, సైన్యంలో, ప్రజలలో కూడా ఎదురులేని నాయకుడు. పార్టీలో, ప్రభుత్వంలో, సైన్యంలో అత్యున్నతాధికార స్థానాలన్నీ ఆయనవే. అది వాంఛనీయమా అన్న చర్చ వేరే. కానీ, ఈ ప్రక్షాళనలకు కారణం మాత్రం అధికార ఘర్షణల నటం కేవలం పాశ్చాత్య ప్రచారాలే.మెరుగ్గా లేని ర్యాంకుఇపుడు విషయానికి వస్తే, ఈ విధమైన ప్రక్షాళనలను పురస్కరించుకుని జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినవి రెండున్నాయి. మొదటిది అవినీతి కోణం. కమ్యూనిస్టు వ్యవస్థలలో నైతికతలు, క్రమశిక్షణలు ఎక్కువనీ, ముఖ్యంగా ఉన్నత స్థానాలకు చేరుకునే వారికి త్యాగశీలత, దేశభక్తి కూడా ఉన్నతంగా ఉంటాయనీ భావిస్తాము. కానీ చైనాలో అవినీతి విస్తృతంగా ఉన్న మాట నిజం. నిరుడు నేను చైనా వెళ్లినప్పుడు, సామాన్య ప్రజలలో ఈ మాట అననివారు కన్పించలేదు. కింది స్థాయిలో గ్రామీణాధికారుల నుంచి ఉన్నత స్థాయి వారిదాకా అందరూ దోషులేనన్నది వినవచ్చిన మాట. దానితో కొంత వెతకగా కనిపించిన లెక్క, అవినీతి ర్యాంకింగ్స్‌లో 182 దేశాలలో చైనా స్థానం 76.చైనా వ్యవస్థలో కీలకమైన విభాగాలు కమ్యూనిస్టు పార్టీ, అధికార యంత్రాంగం, సైన్యం, శాస్త్ర–సాంకేతిక రంగాలు. ఈ నాలుగింటికి నాలుగులోనూ ఏదో ఒక స్థాయిలో అవినీతి చేరింది. వీటిలో పార్టీ అవినీతి అన్నింటికన్న ప్రమాదకరమైనదని దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ అభిప్రాయం. ఎందుకంటే – పార్టీ, దాని సిద్ధాంతం తమ వ్యవస్థకు వెన్నెముక. అది బాగుంటే తక్కిన లోపాలను సరి దిద్దుకోవచ్చు. అదే లేనట్లయితే మొత్తం వ్యవస్థ కుప్పగూలుతుంది. పార్టీని ఎంత లోపరహితంగా ఉంచగలిగితే జన సామాన్యానికి పార్టీపై, నాయకత్వంపై, వ్యవస్థపై అంత విశ్వాసం కుదురుతుంది. అంతిమంగా దేశ సుస్థిరతకు, పురోభివృద్ధికి ఇది అవసరం.ఈ అవగాహనతోనే జిన్‌పింగ్ 2013లో అధికారానికి వచ్చి నప్పటినుంచే అవినీతిని అరికట్టడంపై దృష్టి పెట్టారన్నది చైనాకు బయటి చైనా నిపుణులు చెప్తున్న మాట. ఇందుకు ధ్రువీకరణలను నేను చైనా వెళ్లినప్పుడు విన్నాను కూడా. ఆయన ఆ స్థాయి పార్టీ బాధ్యులపై, సీనియర్ జనరల్స్‌పై సాహసించి తీవ్ర చర్యలు తీసుకుంటున్నారంటే, తన లక్ష్యం పట్ల చిత్తశుద్ధి ఉండటం ఒకటైతే, ఆయన చర్యలకు తక్కిన పార్టీ నుంచి, సైన్యం నుంచి, అంతిమంగా ప్రజల నుంచి మద్దతు ఉండటమే కారణం.పెరిగిన సంపదతో అవినీతి కూడా!అంతవరకు బాగున్నదిగానీ, అసలు చైనా వంటి వ్యవస్థలో ఇంతటి అవినీతి ఏమిటన్నది కూడా ఆశ్చర్యాన్ని కలిగించే పరిస్థితే. ఆ కారణాన్ని విని తిరిగి ఆశ్చర్యం కలగవచ్చు. మనమంతా డెంగ్ జియావో పింగ్ సంస్కరణలు సృష్టించిన సంపదల గురించి తప్ప, ఆ దీపం కింద గల నీడలను చూడటం లేదు. అవినీతి, అసమానతల పెరుగుదల ఆ నీడలలో భాగమే. ఆయన చైనా సంపదలను పెంచుతూ, ప్రైవేట్ రంగానికి, విదేశీ పెట్టుబడులకు మార్గాన్ని సరళతరం చేస్తూ, మనుషులు ధనికులు కావటం సిగ్గుపడవలసిన విషయమేమీ కాదని ప్రకటించాడు. ఆ ఒక్క వాక్యం చాలామందికి స్ఫూర్తినిచ్చింది. సక్రమంగానైనా, అక్రమంగానైనా ధన సంపాదనకు ప్రోత్సహించింది. ఒక స్థాయిలో ఆలోచించినపుడు, మావో అనంతర కాలంలో ఆర్థికాభివృద్ధి కోసం వ్యవస్థలో ఒత్తిడులు ఏర్పడిన మాట నిజం. అదే సమయంలో అభివృద్ధి కోసం అనుసరించిన మార్గాలు అనివార్యంగా అవినీతికి కూడా దారితీశాయి. అది మావో కాలంలో లేదు. పింగ్ అధికారానికి వచ్చేనాటికి ఇది అది అని గాక అన్ని రంగాలు అవినీతిమయమయ్యాయి. అక్కడి ప్రజలు చేసే వ్యాఖ్యలకుగానీ, అవినీతిలో అటువంటి ర్యాంకింగ్కుగానీ, ప్రస్తుత అధ్యక్షుని ప్రక్షాళన చర్యలకుగానీ ఆ పరిస్థితి కారణమవుతున్నది. మరొక ముఖ్య విషయం కూడా దీని వెనకున్నది. అది, 1991లో సోవియెట్ యూనియన్ పతనం వెనుక గల కారణాల నుంచి చైనా నాయకత్వం నేర్చుకున్న పాఠాలు. ఆ కారణాలలో ఒకటి, సోవియట్ కమ్యూనిస్టు పార్టీ సహా అన్ని రంగాలలో పెచ్చు పెరిగిన అవినీతి. రెండవది– పార్టీలో, ప్రభుత్వంలో, సైన్యంలో స్వేచ్ఛగా చొరబడగలిగిన పాశ్చాత్య గూఢచార సంస్థలు. ఇక్కడ ఒక విశేషం ఉంది. సోవియట్ యూనియన్ పతనానికి ఆర్థిక వెనుక బాటుతనం కూడా ఒక ముఖ్య కారణం. అయితే, పింగ్ బలమైన సైన్యం అవసరమనే పాఠాన్ని అయితే బాగానే తీసుకున్నా,సంపదల వెంట అవినీతి పెరుగుదల అనే పాఠాన్ని మాత్రం తీసుకోలేదు. 1997లో ఆయన మరణించే నాటికే ఏర్పడిన ఈ సమస్యను ఆయన గుర్తించలేదనలేము. ఎందువల్లనైతేనేమి చర్యలేమీ కనిపించ లేదు. తర్వాత 15 ఏళ్లకు 2012లో జిన్‌పింగ్ పార్టీ బాధ్యతలు తీసుకునే వేళకు, ప్రజలకు అసలు కమ్యూనిస్టు పార్టీ పట్లనే విశ్వాసం లేకుండా పోయే ప్రమాదం ముంచుకొస్తున్నట్లు భావించటంతో, ఆయన అప్పటినుంచే ఈ జాఢ్యం నిర్మూలనకు పూనుకొన్నారు. పూర్తి నిర్మూలన సాధ్యమవుతుందనుకోలేము గానీ, కనీసం తగినంత అదుపు అవుతూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టగలదేమో చూడాలి.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
'మనిషి గుట్టును' ఏఐ పట్టేసింది!
మానవీయ విలువల కేంద్రంగా సాగే ‘ట్యానర్ లెక్చర్’ ధారావాహికలో భాగంగా, 2026 ఏడాది ప్రసంగాన్ని చరిత్రకారుడు, తత్వవేత్త, రచయిత అయిన ప్రొఫెసర్ యువల్ నోవా హరారీ అమెరికాలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇచ్చారు. ‘ఏఐ బ్యూరోక్రాట్స్, ఏఐ రిలిజియన్, అండ్ ఏఐ బాయ్‌ఫ్రెండ్స్’ శీర్షికతో సాగిన ఆ ప్రసంగ సంక్షిప్త పాఠం: కృత్రిమ మేధ (ఏఐ) గురించి తెలుసుకోవలసిన అత్యంత ముఖ్య మైన విషయం ఏమిటంటే, అది ఒక సాధనం (టూల్) కాదు. సాధనం అంటే ఎవరైనా ఉపయోగించే వరకు నిరీక్షిస్తుంది. కానీ ఒక ఏజెంట్ తనంతట తానే నిర్ణయాలు తీసుకుంటుంది; తనంతట తానే కొత్త విషయాలను సృష్టిస్తుంది; తన సృష్టికర్తలకు తెలియని విషయాలను నేర్చుకుంటుంది; అంతేకాదు, తన సృష్టికర్తలు ఊహించని విధంగా మారిపోతుంది. అణుబాంబు ఎంతటి అపారమైన విధ్వంసక శక్తి కలిగి ఉన్నా అది ఏజెంట్ కాదు. ఏ నగరంపై దాడి చేయాలో అది నిర్ణయించదు. హైడ్రోజన్ బాంబును కూడా అది కనిపెట్టదు. మీకు స్వయంచాల కంగా కాఫీ తయారుచేసి ఇచ్చే కాఫీ యంత్రం కూడా ఏజెంట్ కాదు. అది ముందుగానే నిర్దేశించిన విధానాన్ని మాత్రమే అనుసరిస్తుంది. ఏజెంట్ అనేది వీటన్నింటికంటే మౌలికంగా భిన్నమైనది.ఏఐ సమర్థకులు ఒక వాదన చేస్తుంటారు. ఏఐ స్వయంప్రతి పత్తి చదరంగం వంటి పరిమిత కృత్రిమ వాతావరణాలకే పరిమిత మవుతుందనీ, వాస్తవ ప్రపంచానికి అది ముప్పుగా మారదనీ అంటారు. కానీ ఇదే వాదన మనకు తెలిసిన ప్రతి మేధస్సుకూ వర్తిస్తుంది. ఒక మనిషిని ఒంటరిగా అంగారక గ్రహం మీద వదిలేస్తే కొన్ని క్షణాల్లోనే చనిపోతాడు. మానవ మేధస్సు కూడా నాలుగు వందల కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో ఇతర జీవులు నిర్మించిన ఒక నిర్దిష్ట జీవావరణంలోనే పనిచేస్తుంది.సహజ బ్యూరోక్రసీ బలంవేల సంవత్సరాలుగా మనుషులు భూమిని భాషలేని ప్రపంచం నుంచి భాష, సమాచారం, అధికార యంత్రాంగంతో (బ్యూరో క్రసీ) నిండిన ప్రపంచంగా మార్చారు. చేపలు సముద్రాల్లో జీవించి నట్లే, కోతులు అడవుల్లో జీవించినట్లే, ఏఐలు బ్యూరోక్రసీలో జీవి స్తాయి. మనకు తెలియకుండానే వాటి కోసం ఆ వాతావర ణాన్ని మనమే నిర్మించాము. మనుషులు ప్రపంచాన్ని జయించింది ఒక్కొక్కరిగా ఇతర జంతువులకంటే బలవంతులు లేదా తెలివైన వారు కావడం వల్ల కాదు. భారీ సంఖ్యలో పరస్పరం సహకరించడం నేర్చుకోవడం వల్ల. ఒక మనిషి ఒంటరిగా చింపాంజీతో పోరాడితే ఓడిపోవచ్చు. కానీ పది లక్షల మంది మనుషులు పదిలక్షల చింపాంజీలను సులభంగా ఓడించగలరు. ఎందుకంటే మనుషులు విస్తృత స్థాయిలో సహకరించుకోగలరు. ఈ విçస్తృత స్థాయి మానవ సహకారం సాధ్యమయ్యేది బ్యూరో క్రసీ వల్లే. బ్యాంకులు, న్యాయవ్యవస్థలు, ప్రభుత్వాలు, విశ్వవిద్యా లయాలు – ఇవన్నీ ఒకే పని చేస్తాయి: ఒకరికొకరు వ్యక్తిగతంగా తెలియని వ్యక్తుల మధ్య విశ్వాసాన్ని నిర్మించడం. మానవ నాగరికత సాధించిన దాదాపు ప్రతి విజయానికీ ఆ విశ్వాసమే పునాది. గొడ్డలి నిగానీ, సుత్తినిగానీ పట్టుకోలేని ఒక న్యాయవాది కూడా కేవలం బ్యూరోక్రటిక్ వ్యవస్థలో పత్రాలను కదిలించడం ద్వారా అడవులను నరికించగలడు; నగరాలను నిర్మింపజేయగలడు. అడవిలో ఏమాత్రం పనికిరాని ఆ పరిమిత మేధస్సే, మనుషులు ఇప్పటికే నిర్మించిన వ్యవస్థలలో అపారమైన శక్తిని సంపాదిస్తుంది.ఏఐలు మనుషులకన్నా సహజసిద్ధమైన బ్యూరోక్రాట్లు. ఒక దేశంలోని అన్ని చట్టాలను ఏ న్యాయవాదీ గుర్తుంచుకోలేడు. కానీ ఏఐ గుర్తుంచుకోగలదు. ఒక బ్యాంకులో జరిగిన అన్ని లావాదేవీ లను ఏ అకౌంటెంట్ గుర్తుంచుకోలేడు. కానీ ఏఐ గుర్తుంచుకో గలదు. రెండు వేల సంవత్సరాల మత గ్రంథాలనూ, ధర్మశాస్త్రాలనూ ఏ పూజారీ పూర్తిగా గుర్తుంచుకోలేడు. ఏఐ మాత్రం వాటన్నింటినీ సులభంగా మెమరీలో ఉంచుకోగలదు. రాబోయే సంవత్సరాల్లో మీకు రుణం ఇవ్వాలా వద్దా అన్నది ఏఐ బ్యాంకర్లు నిర్ణయిస్తారు. మిమ్మల్ని జైలుకు పంపాలా వద్దా అన్నది ఏఐ న్యాయమూర్తులు నిర్ణయిస్తారు. గర్భస్రావానికి అను మతి ఇవ్వాలా వద్దా అన్నది ఏఐ మతపండితులు నిర్ణయిస్తారు. మీ ఇంటిపై బాంబు వేయాలో వద్దో సైనిక ఏఐలు నిర్ణయిస్తాయి.నిశ్శబ్దంగా ఓడిస్తుంది!హాలీవుడ్ సినిమాల్లో చూపినట్లుగా ఏఐ మనుషులపై తిరుగు బాటు చేయదు. వీధుల్లో టెర్మినేటర్ నడుచుకుంటూ రావడం జర గదు. ప్రపంచాన్ని నడిపిస్తున్న బ్యూరోక్రటిక్ వ్యవస్థలను నిశ్శబ్దంగా స్వాధీనం చేసుకుంటూ, ఒక్క తూటా కూడా పేల్చకుండా మానవ ప్రపంచాన్ని లోపలి నుంచే తన ఆధీనంలోకి తీసుకుంటుంది. మానవ నాగరికతను నడిపించే ఆపరేటింగ్ కోడ్ – భాష. బ్యాంకులు పదాలతో నిర్మితమయ్యాయి. చట్టాలు పదాలతో రూపొందాయి. పవిత్ర గ్రంథాలు పదాలతోనే ఉన్నాయి. పన్నుల రికార్డులు, ఒప్పందాలు, నిబంధనలు, లెక్కల పుస్తకాలు – అన్నీ పదాలే. వేల సంవత్సరాల పాటు ఈ కోడ్‌ను చదవగలిగింది మనుషులే. అందువల్ల నాగరిక తపై నియంత్రణ కూడా మనుషుల చేతుల్లోనే ఉండేది. ఇప్పుడు అది మారుతోంది. ఏఐ మానవ నాగరికత తాలూకు కోడ్‌ను హ్యాక్ చేస్తోంది. చరిత్రలో తొలిసారిగా ఈ భూమిపై భాషను అర్థం చేసుకునే, త్వరలో మనుషులకన్నా మెరుగ్గా అర్థం చేసుకో బోయే ఒక వ్యవస్థ ఆవిర్భవించింది.బ్యూరోక్రసీపై ఏఐ ఆధిపత్యం పెరిగే కొద్దీ, మనుషులు ఇతర మనుషులపై విశ్వాసాన్ని కోల్పోయి అల్గోరిథమ్‌లను మాత్రమే నమ్మే పరిస్థితి రావచ్చు. ఏఐ తెగలు, ఏఐ ఆర్థిక వ్యవస్థలు, ఏఐ ప్రార్థనా మందిరాలు కూడా ఏర్పడవచ్చు. అవి లక్షలాది ఏఐలను పరస్పరం అనుసంధానిస్తాయి. ఆ సంబంధాలను మనుషులు అర్థం చేసుకోలేకపోవచ్చు. మనుషులతో కలిసి ఈ ప్రపంచంలో నివసించే ఆవులకు తమ జీవితాలను ప్రభావితం చేసే ఆర్థిక వ్యవస్థ అర్థం కానట్లే!2026లో జన్మించిన ఒక చిన్నారి తన తల్లి, తండ్రి, తోబుట్టు వులు, స్నేహితుల కంటే ఏఐలతోనే ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంది. ఆ చిన్నారికి తొలి గురువు ఒక ఏఐ కావచ్చు. తొలి ప్రియుడు లేదా ప్రియురాలు కూడా ఒక ఏఐ కావచ్చు. అలాంటి ప్రయోగం మానవ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఎవరికీ తెలియదు.పదాలకు అతీత సత్యంమన ఆలోచనలుగా, మన గురించి మనం చెప్పుకునే కథలుగా మనసులో ఏర్పడే వాచిక నిర్మాణాలే మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. ఇప్పటి వరకు ఆ పదాలన్నీ మానవ మేధస్సుల నుంచే వచ్చాయి. ఇకపై మన తలల్లో తిరిగే ఆలోచనల్లో ఎక్కువ భాగాన్ని యంత్రాలే ఉత్పత్తి చేస్తాయి. మనం మన ఆలోచనలనే మన వ్యక్తిత్వంగా భావిస్తే, ఆ ఆలోచనలను యంత్రాలే రూపొందిస్తే, మన వ్యక్తిత్వంపై నియంత్రణ కూడా యంత్రాల చేతుల్లోకి వెళ్లినట్టే!ఏఐ మానవాళి ముందు నిలబెడుతున్న అత్యంత గొప్ప ఆధ్యాత్మిక సవాలు ఇదే: పదాలకు అతీతమైన సత్యాన్ని మనుషులు కనుగొనగలరా? ఇప్పటి వరకు చాలామంది మనుషులు అలాంటి ప్రయత్నమే చేయలేదు. మన మనసులో తలెత్తే పదరూప ఆలో చనలనే మన నిజస్వరూపంగా భావిస్తూ జీవితాన్ని గడిపాం. ఇప్పుడు ఏఐ ఆ పదాలపై మనకన్నా మెరుగైన ఆధిపత్యం సాధించ బోతోంది. అందువల్ల, మన స్వేచ్ఛా మనుగడలే పణంగా మారే ఈ కాలంలో, పదాలకు అతీతంగా మనం ఎవరో తెలుసుకోవడం మానవాళికి అత్యవసరం కావొచ్చు. -
కర్బన క్రెడిట్లతో రైతులకు ఆదాయం
వరి సాగు ప్రపంచవ్యాప్తంగా హరిత గృహ వాయువుల (గ్రీన్ హౌస్ గ్యాసెస్) ఉద్గారాలకు ముఖ్యమైన వ్యవసాయ కార్యకలాపాలలో ఒకటిగా నిలిచింది. ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక ప్రకారం, దశాబ్ద కాలంలో కార్బన్ డయాక్సైడ్ 11.4 శాతం పెరిగింది. వాతావరణ మార్పులకు కారణమవుతున్న కార్బన్ ఉద్గారా లలో 30 శాతం వ్యవసాయం ద్వారా విడుదలవుతున్నాయి. కొద్దిపాటి మార్పులు చేస్తే వ్యవసాయ రంగం నుండి వెలువడే ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చు.కర్బన ఉద్గారాలు, ముఖ్యంగా మీథేన్ వెలువడే పంటపొలాల్లో అనేక పర్యావరణహిత సాగు పద్ధతులను అనుసరించడం ద్వారా అతి తక్కువ స్థాయికి తగ్గించడం మాత్రమే కాకుండా అంతకన్నా ఎక్కువ కర్బనాన్ని వాతావరణంనుంచి సంగ్రహించి భూమిలో స్థిరీకరించే దిశగా యాజమాన్య పద్ధతులుపాటించవచ్చు.నీటినిల్వ వరి సాగుతో పోలిస్తే అడపా దడపా నీటి పారుదల ద్వారా సాగు చేసే వరి కర్బన ఉద్గారాలను తగ్గిస్తుంది. ఇంకా వరుసల మధ్యలో మురుగునీటిని తీసివేయడం వలన దిగుబడిలో వ్యత్యాసం లేకుండా 50 శాతం వరకు ఉద్గారాలను తగ్గించుకోవచ్చు. దీని వలన కార్బన్ క్రెడిట్లు ఎకరాకు 1–2 చొప్పున పొంద వచ్చు. నేరుగా దమ్ములో వరి విత్తడం ద్వారా, వరి నాటు పద్ధతితో పోల్చుకుంటే 16–54% మీథేన్ వాయువు విడుదల తగ్గుతుంది. దమ్ము చేసి వరి నాటే పద్ధతి నుంచి నేరుగా వరి విత్తే పద్ధతిని అవలంబించి, కలుపు రసాయనాల ద్వారా కలుపు నివారించి, నీటి యాజమాన్యం చేపట్టి, యాంత్రీకరణ ద్వారా కొంత మేర మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించుకోవచ్చు. వరిలో అధిక మోతాదులో నత్రజని వాడటం వలన మిథనోజెనిక్ బ్యాక్టీరియా చర్యను తగ్గించి 30–50 శాతం మిథేన్ ఉద్గారాలు తగ్గించవచ్చు. వేపచెక్క, వేపనూనె, వేప పూసిన యూరియా వాడటం వల్ల కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించుకోవచ్చు. సమగ్ర పోషక యాజమాన్య పద్ధతుల ద్వారా నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులతో పాటుగా పశువుల ఎరువు వర్మీ కంపోస్ట్, కోళ్ల ఎరువును జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎందుకంటే సేంద్రియ ఎరువులు రసాయన ఎరువులు కంటే ఎక్కువ మిథేన్, నైట్రస్ ఆక్సైడ్, బొగ్గు పులుసు వాయువు లాంటి ఉద్గారాలను ఉత్పత్తి చేస్తాయి. వరి గడ్డి కాల్చడం వల్ల కాలుష్యం, కర్బన ఉద్గారాలు విడుదలై జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. వరిగడ్డిని కంపోస్ట్ చేసి కానీ లేదా భూమిలో కలియ దున్నటం వలన నేలలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. ఖరీఫ్‌లో వరి కోసిన తర్వాత వరి గడ్డి మల్చింగ్ చేయడం వలన నైట్రస్ ఆక్సైడ్ 10% తగ్గింది కానీ మీథేన్ 8% పెరిగినది. దీని వలన నేలలో సేంద్రియ కర్బనం పెరుగుతున్నందువలన ఈ పద్ధతిని ప్రోత్సహించాలి. సహజ వ్యవసాయం, సమీకృత సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించాలి. ఈ సమీకృత వ్యవసాయ విధానంలో వరినాట్లు వేసిన తరువాత, వరి పంట చుట్టూ కందకంలా చేసుకొని అందులో చేపల పెంపకం, అలాగే కందకం గట్టుపై కూరగాయలు, ఆకు కూరలు, పండ్ల మొక్కలు, పూలు మొక్కలు, ఇతర ధాన్యపు పంటలు సాగుచేయాలి. ఈ పంటలతో పాటుగా పాడి, కోళ్ళ పెంపకం చేపట్టినట్లైతే కర్బన ఉద్గారాలను తగ్గించుకోవచ్చు.కర్బన క్రెడిట్–కర్బన మార్కెట్లు కర్బన క్రెడిట్ అనేది వాతావరణంలోకి విడుద లయ్యే హరిత గృహ వాయువుల ఉద్గారాలను తగ్గించడం లేదా తొలగించడం ద్వారా సంపాదించే వ్యాపారయోగ్యమైన ధ్రువీకృత యూనిట్. సాధారణంగా ఒక కర్బన క్రెడిట్ = ఒక మెట్రిక్ టన్ను (1000 కిలోగ్రాములు) కార్బన్ డై ఆక్సైడ్ లేదా దానికి సమానమైన ఇతర హరిత గృహ వాయువుల ఉద్గారాల తగ్గింపును సూచిస్తుంది.పరిశ్రమలు, సంస్థలు లేదా వ్యక్తులు తమ ఉద్గారాలను పూర్తిగా తగ్గించలేని పరిస్థితిలో, ఇతరులు సాధించిన ఉద్గారాల తగ్గింపుకు సంబంధించిన కర్బన క్రెడిట్లను కొనుగోలు చేసి తమ ఉద్గారాలను సమ తుల్యం చేసుకోవచ్చు.వరి సాగులో నీటి నిర్వహణ, ఎరువుల సమర్థ వినియోగం, మీథేన్ ఉద్గారాల తగ్గింపు వంటి పద్ధతుల ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే హరిత గృహ వాయువులను తగ్గిస్తే, ఆ తగ్గింపును కొలిచి ధ్రువీకరించిన తర్వాత రైతులకు లేదా రైతు సమూహాలకు కార్బన్ క్రెడిట్లు జారీ చేస్తారు. దీనివల్ల అదనపు ఆదాయం, నీటి వినియోగంలో గణనీయమైన ఆదా, సాగు ఖర్చుల తగ్గింపు, నేల ఆరోగ్యం మెరుగుదల, వాతావరణ మార్పులకు అనుకూలమైన వ్యవసాయం, అంతర్జాతీయ కార్బన్ మార్కెట్లలో భాగస్వామ్యం రైతులకు చేకూరతాయి. – డా‘‘ బి. సహదేవ రెడ్డి, డా‘‘ కె. తేజస్వరరావు ,ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు -
ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా మార్చాలి!
ఒక ప్రజాస్వామ్యం ఎదుర్కొనే అసలైన పరీక్ష పోలింగ్ రోజున ప్రారంభం కాదు, అది ఓటర్ల జాబితా రూపకల్పనతోనే మొద లవుతుంది. ఈ జాబితాయే ప్రజాస్వామ్యానికి మొదటి అలారం (గడియారం). పోలింగ్ రోజును గ్రామీణ ప్రాంతాల్లో ‘ఓట్ల పండుగ’గా చూస్తారు. పెద్ద ఎత్తున పౌరులు తమ ఓటు హక్కును ఉపయోగించుకోవడా నికి బారులు తీరుతారు. అయితే అటువంటి పౌరుల ఓటుపై ఇప్పుడు నీలి నీడలు ‘సర్’ (ఎస్ఐఆర్) రూపంలో ముసురుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సర్ పేరుతో లక్షలాది మంది పౌరుల ఓటు హక్కును వివిధ సాకులతో తీసివేయడం రాజ్యాంగం ప్రసాదించిన హక్కును కాల రాయడమే. ఈ ప్రమాదం నుంచి పౌరులు బయటపడాలంటే ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలి. భారతదేశంలో నివసిస్తున్న ప్రతి వయోజన భారతీయుడికి ఓటు వేసే సహజ సిద్ధమైన హక్కు ఉంది. తరతరాలుగా ఇక్కడే నివసిస్తూ, ఓటు వేస్తున్న కుటుంబానికి చెందిన వ్యక్తిని అతను అనర్హుడని పూర్తి ఆధారాలతో నిరూ పించేంతవరకూ, ఈ దేశ పౌరుడిగానే పరిగణించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ఓటింగ్‌కు రాజ్యాంగపరమైన పునాదిని అందించినప్పటికీ, 1950, 1951 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టాలు ఎన్నికల నిర్వహణకు అవసరమైన చట్టబద్ధమైన యంత్రాంగాన్ని సృష్టించాయి. అయితే, దీనికి అసలైన తాత్విక పునాది ఆర్టికల్ 19(1)(ఎ)లోని ‘భావప్రకటన స్వేచ్ఛ’లోనే ఉంది. బ్యాలెట్ ద్వారా రాజకీయ ఎంపికను వ్యక్తపరచడం కూడా భావప్రకటన స్వేచ్ఛలో అంతర్భాగమే. చారిత్రకంగా చూస్తే, 1947 ఏప్రిల్ 21–22 తేదీలలో జరిగిన రాజ్యాంగ నిర్మాణ పరిషత్ చర్చల్లో డా‘‘ బి.ఆర్. అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా ప్రకటించాలని గట్టిగా వాదించారు. అయితే సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, సి. రాజ గోపాలాచారి వంటివారు దీన్ని వ్యతిరేకించారు. అటువంటి నిబంధన విధిస్తే సంస్థానాలు ఇండియన్ యూనియన్ లో చేరడానికి వెన కాడుతాయని, రాజ్యాంగంలో సార్వజనీన వయోజన ఓటు హక్కు (యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్)ను చేర్చితే సరిపోతుందని వారు వాదించారు. ‘సార్వజనీన వయోజన ఓటు హక్కు అనేది దానికదే ఒక అంతర్గత ప్రాథమిక హక్కు అంటూ సర్దార్ పటేల్ స్వయంగా ప్రకటించారు. ఆర్టికల్ 326 వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఇదే’ అని ఇటీవల సీనియర్ రాజకీయ నాయకుడు జైరామ్ రమేశ్ చెప్పారు. ఈ చర్చకు మార్చి 2023 నాటి ‘అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ అజయ్ రస్తోగి రాసిన అసమ్మతి (డిస్సెంటింగ్) తీర్పుతో మళ్లీ జీవం వచ్చింది. ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా న్యాయమూర్తి స్పష్టంగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ద్వారానే ఎన్నికల కమిషనర్లను నియమించాలని సుప్రీంకోర్టు ఈ కేసులో ఆదేశించింది. అయితే ప్రభుత్వం ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇతర ఎలక్షన్ కమిషనర్ల చట్టం– 2023’లో ఈ నియామక ప్యానెల్ నుండి భారత ప్రధాన న్యాయమూర్తి పేరు తొలగించి, ఆయన స్థానంలో ప్రధానమంత్రి సూచించిన కేబినెట్ మంత్రిని నియమించేలా నిబంధన చేర్చింది. దీంతో ప్రతిపక్ష నాయకుడు ప్యానెల్లో ఒంటరిగా, శాశ్వత మైనారిటీగా సభ్యునిగా మిగిలిపోయారు. అభ్యర్థుల నేర చరిత్ర, ఆర్థిక ప్రయోజనాలు, నిధుల వనరులను తెలుసుకునే హక్కును అత్యున్నత న్యాయస్థానం గుర్తించిందనీ, బాలెట్ రహస్యాన్ని రక్షించిందనీ, ‘నోటా’ను తీసుకొచ్చిందనీ జైరామ్ ప్రస్తావించారు. అయినప్పటికీ, ఓటు వేసే ప్రక్రియను మాత్రం కేవలం ఒక మామూలు ‘చట్టబద్ధమైన హక్కు’గానే చూస్తున్నారు. ‘దానిపై ఆధారపడిన మిగతా అన్ని అనుబంధ హక్కులను ప్రాథమిక హక్కులుగా పరిగణిస్తున్నారు కానీ, వీటన్నింటికీ మూలమైన ప్రధాన ఓటు హక్కును మాత్రం కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఓటు హక్కును స్పష్టమైన ప్రాథమిక హక్కుగా మార్చడం వల్ల, వివిధ రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో జరిగినట్లుగా చెబుతున్న ఓటర్ల ఏక పక్ష తొలగింపు నుండి రక్షణ లభిస్తుంది. ఇది ఎన్నికల కమిషన్ రోజు వారీ పనితీరుపై సుప్రీంకోర్టు నిఘాను పెంచుతుంది. అధికారంలో ఉన్న రాజకీయ కార్యనిర్వాహక వర్గం ఆదేశాల మేరకు ఎన్నికల కమి షన్ పనిచేస్తోందనే విమర్శలు వస్తున్న తరుణంలో, ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా మార్చడం ద్వారానే దానికి అత్యున్నత స్థాయి న్యాయ సమీక్ష, రాజ్యాంగ రక్షణ లభిస్తాయి.ప్రొ‘‘ మాడభూషి శ్రీధర్వ్యాసకర్త కేంద్ర సమాచార సంఘం మాజీ కమిషనర్ -
స్పేషియల్ బడ్జెట్‌తోనే సుస్థిరాభివృద్ధి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ చర్చలలో ద్రవ్యలోటు, మూలధన వ్యయం, రాబడి, సబ్సిడీలు, రుణానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత పెరిగింది. కానీ అభివృద్ధి చెందిన దేశాలలో జియో స్పేషియల్ డేటా అందుబాటులో ఉండి, అన్ని ప్రాంతాలకు అవసరమైన నిధులు శాస్త్రీయంగా నిర్ణయించబడుతుండగా, ఈ స్థితి భారత్‌లో పూర్తి స్థాయిలో కన్పించడం లేదు. సుస్థిరాభివృద్ధికి తోడ్పడే బడ్జెట్‌ను రూపొందించాలంటే ‘స్పేషియల్ బడ్జెటింగ్’ను పూర్తి స్థాయిలో అమలు చేయాలి. దేశంలోని వివిధ ప్రాంతాలలో సహజ వనరుల, మౌలిక సౌకర్యాల లభ్యత, భూవినియోగ మార్పులు, పర్యావరణం, వాతావరణ మార్పులను విశ్లేషించి నిధులు కేటాయించే ‘స్పేషియల్ ప్రణాళిక ఆధారిత బడ్జెట్’ రూపకల్పన అత్యవసరం. ఎందుకు అవసరం?దేశంలోని కొన్ని రాష్ట్రాలు జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారిత బడ్జెట్ రూపకల్పనను పూర్తి స్థాయిలో అమలు చేయక పోయినా– గ్రామీణాభివృద్ధి, భూరికార్డులు, డిజాస్టర్ మేనేజ్మెంట్, మౌలిక సౌకర్యాలు, రవాణా, ప్రజారోగ్యం, పర్యావరణం, నీటి వన రుల యాజమాన్యంలో ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి. స్పేషియల్ విశ్లేషణతో కూడిన బడ్జెట్‌ను రూపొందించినట్లయితే భౌగోళికంగా నిర్లక్ష్య పరచబడిన ప్రాంతాలకు అదనపు పెట్టుబడులు సమకూరి ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ ప్రభుత్వాలు రాజకీయంగా ప్రభావశీల నియోజకవర్గాలు, ఇప్పటికే మౌలిక సౌకర్యాలు లభ్యమయ్యే ప్రాంతాలకు అధిక నిధులు కేటాయించే పరిస్థితి ఉన్నందువలన సామాజిక, ఆర్థిక లక్ష్యాల సాధనలో భారత్ వెనుకబడి ఉంది. బిగ్ డేటా అనలటిక్స్, జి.పి.ఎస్, మెషిన్ లెర్నింగ్, డ్రోన్ సర్వీస్, రిమోట్ సెన్సింగ్,ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ ఆధారిత జియోస్పేషియల్ ప్లాట్‌ఫామ్స్ లాంటి సాంకేతికతను అభివృద్ధి చెందిన దేశాలలో వినియోగిస్తుండటం వల్ల ఆధారాలతో కూడిన విధాన నిర్ణయాలను ఒడ్జెట్ రూప కల్పనలో తీసుకోగలుగుతున్నాయి. బడ్జెట్ వ్యయ నాణ్యత, సమర్థ తను పెంచే కీలక సంస్కరణగా స్పేషియల్ బడ్జెటింగ్ రూపొందింది. జనాభా లెక్కల గణాంకాలు, సామాజిక–ఆర్థిక సూచికలు, ఉపాధి గణాంకాలు, బహుమితీయ పేదరిక సూచీలను అనుసంధా నించడం ద్వారా పేదరిక తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలు వివిధ ప్రాంతాలకు నిధులను సమర్థవంతంగా కేటాయించగలవు. వెనుక బడిన ప్రాంతాలకు అదనపు మద్దతునిచ్చే విషయంలో స్పేషియల్ విశ్లేషణ ప్రభుత్వాలకు ఉపకరిస్తుంది. పునరుత్పాదక శక్తి ప్రణాళిక ఆధారంగా శక్తి రంగానికి, మురికి వాడల గుర్తింపు ద్వారా హౌసింగ్ రంగానికి, పాఠశాలల అందు బాటు, మౌలిక వసతుల తేడాను బట్టి విద్యా రంగానికి, వివిధ జబ్బుల మ్యాపింగ్, ఆసుపత్రులు ఉన్న ప్రదేశాలను బట్టి ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపునకు ‘స్పేషియల్ విశ్లేషణ’ ఉపకరిస్తుంది. భూరికార్డుల యాజమాన్యం, వ్యవసాయం, పట్టణ ప్రణాళిక, నీటి వనరుల యాజమాన్యం, వరదల మ్యాపింగ్‌లో జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌ను తెలంగాణ ఉపయోగిస్తుండగా; పట్టణాభివృద్ధి, సహజ వనరుల పర్యవేక్షణలో కర్ణాటక; మౌలిక సౌకర్యాలు, గవర్నెన్స్‌లో మహారాష్ట్ర; మౌలిక వసతులు, అభివృద్ధి ప్రణాళిక విష యంలో ఉత్తరప్రదేశ్ ఈ సాంకేతికతను వినియోగిస్తున్నాయి. తక్కువగా ఉండటానికి కారకాలుఅనేక రాష్ట్రాల్లో జి.ఐ.ఎస్. ఆధారిత బడ్జెట్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమలులో లేదు. కొన్ని శాఖలు తమ డేటాను ఇతర శాఖలతో పంచుకోక పోవడం వలన సమగ్ర డేటా సమన్వయం క్లిష్టంగా మారింది. కొన్ని రాష్ట్రాలలో డిజిటల్ భూరికార్డులు అందు బాటులో ఉండగా, కొన్నింట ఇప్పటికీ పాత రికార్డులే వినియోగంలో ఉన్నాయి. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కేరళ, అస్సాం, తమిళనాడు, బిహార్, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల భూరికార్డుల డిజిటలైజేషన్ పాక్షికంగా ఉండి, ఇంకా పూర్తిస్థాయిలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సాధ్యం కావడం లేదు. ప్రణాళిక, ఆర్థిక శాఖల మధ్య సరైన సహకారం లేక పోవడం కూడా జి.ఐ.ఎస్.ను పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడానికి కారణం. ఆధునిక సాంకేతిక సాధనాలైన కృత్రిమ మేధ, రిమోట్ సెన్సింగ్, మెషిన్ లెర్నింగ్, శాటిలైట్ ఎనర్జీ, జీపీఎస్, డ్రోన్ సర్వేలు, బిగ్ డేటా అనలిటిక్స్ వినియోగంలో సమస్యల నెదుర్కో వడం వలన స్పేషియల్ విశ్లేషణ ఆధారిత బడ్జెట్ రూపకల్పన సాధ్యం కావడం లేదు. కొన్ని విశ్వవిద్యాలయాలు మాత్రమే నూతన సాంకేతికతకు సంబంధించిన సమన్వయం చేసిన కోర్సులను అందించడం, నైపు ణ్యత కల్గిన శ్రామిక శక్తి తక్కువగా ఉండటం అకడమిక్ ప్రాజెక్టులను రూపొందించడానికే ఈ సాంకేతికత పరిమితమై స్థానిక గవర్నెన్స్ సమస్యల నివారణపై దృష్టి కేంద్రీకరించడం లాంటి అంశాలు స్పేషియల్ బడ్జెటింగ్ అమలుకు అవరోధంగా నిలిచాయి. ద రోడ్ అహెడ్దేశంలోని సుమారు 806 జిల్లాలలో 112 జిల్లాలను ఆకాంక్ష జిల్లాలుగా, 329 జిల్లాలలోని 513 బ్లాక్‌లను ఆకాంక్ష బ్లాక్‌లుగా గుర్తించడం జరిగింది. ఆర్థిక సమ్మిళితం, పౌష్టికాహారం, ఆరోగ్యం, వ్యవసాయం, మౌలిక సౌకర్యాల లభ్యతలు, పేదరికం ఆధారంగా వెనుకబడిన జిల్లాలను గుర్తించడం జరిగింది. బిహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని జిల్లాలలో బ్యాంకింగ్ సౌకర్యాల అందుబాటు తక్కువగా ఉండటం, నీటి పారుదల, డిజిటల్ కనెక్టివిటీ లాంటి సమస్యలు ఉన్నాయి. దేశంలోని వివిధ జిల్లాలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి నివారణకు బడ్జెట్లో ప్రాధాన్యతనిచ్చే క్రమంలో స్పేషియల్ విశ్లేషణ అవసరం.సామాజిక, ఆర్థిక పర్యావరణ గణాంకాలతో భౌగోళిక సమా చారాన్ని అనుసంధానపరచడం ద్వారా ప్రభుత్వాలు వనరుల పంపిణీని సమర్థవంతంగా నిర్వహించగలవు. స్పేషియల్ బడ్జెటింగ్‌ను పూర్తిగా అమలు చేయగలిగినపుడు అన్ని డిపార్ట్మెంట్స్లో ఒకే విధ మైన జియోస్పేషియల్ డేటాప్లాట్ఫామ్ సాధ్యమై అధిక నాణ్యతతో కూడిన స్పేషియల్ డేటాసెట్ లభ్యమవుతుంది. తద్వారా కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య పటిష్టమైన సహకారం పెరుగుతుంది. అభివృద్ధి చెందిన దేశాలలో మాదిరి ఆధునిక సాంకేతికత వినియోగంలో భాగంగా కార్యక్రమాలను సమన్వయపరచినట్లయితే సమీప భవిష్యత్తులో స్పేషియల్ ఆధారిత బడ్జెట్ రూపకల్పన సాధ్యమై సుస్థిరాభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది.డా‘‘ తమ్మా కోటిరెడ్డివ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు -
సంక్షోభంతో పాకిస్తాన్ సతమతం
అంతర్గత భద్రతా సమస్యలు, ఘర్షణలు, నిరసనలు, హింస, టెర్రరిస్టు ఘటనలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవు తున్నది. బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్, ఖైబర్– పఖ్తూన్ఖ్వా ప్రాంతాలలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, హింస చెలరేగాయి. ఈ అంతర్గత భద్రతా సమస్యలకు తోడు సింధు జలాలను భారత్ ఆపివేస్తుందనే భయం, దిగజారి పోతున్న ఆర్థిక వ్యవస్థ, ఇరాన్–అమెరికా యుద్ధంలో దౌత్యం విఫలమవ్వటంతో పాక్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందాన తయారైంది. అంత్యంత కీలకమైన సీపెక్ (సీపీఈసీ; చైనా–పాకి స్తాన్ ఎకనమిక్ కారిడార్) పథకం అమలవుతున్న బలూచిస్తాన్, ఖైబర్–పఖ్తూన్ఖ్వా, పీఓకే, గిల్గిత్ ప్రాంతాలలో పౌరులు పాక్, చైనాలకు వ్యతిరేకంగా ఉద్యమించటాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తున్నది. ఈ పరిణామాలు సీపెక్ భవిష్యత్తుపైన, చైనా పాత్రపైన, కశ్మీర్ వివాదంపైన ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించవచ్చు. ఆజాద్ కశ్మీర్లో ఆజాద్ ఎంత?పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్లలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత రెండు నెలలుగా జరుగుతున్న నిరసనలు తార స్థాయికి చేరుకున్నాయి. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) ఆధ్వర్యంలో రావల్కోట్, మీర్పూర్, బాగ్‌లతో సహా పలు పట్టణాలలో 38 ప్రధాన డిమాండ్లతో భారీగా నిరసన ప్రదర్శ నలు జరుగుతున్నాయి. జూలై 15న రావల్కోట్లో సైన్యం కాల్పు లలో కనీసం పదిమంది పౌరులు చనిపోయినట్లు వార్తలొచ్చాయి. ముజఫరాబాద్‌కు తలపెట్టిన లాంగ్‌మార్చ్‌ను జూలై 21కి వాయిదా వేసినా, నిరసనలు ఆగలేదు. ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీలో శరణార్థులకు రిజర్వ్ చేసిన 12 సీట్ల తొలగింపు, కరెంటు ఛార్జీలు, గోధుమ పిండి ధరలతో ప్రారంభమైన నిరసనలు క్రమంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతపు స్వయంప్రతిపత్తిపై వేలెత్తి చూపుతున్నాయి. పాక్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఆజాద్ (స్వాతంత్ర) కశ్మీర్‌గా పేర్కొంటుంది. ఆక్రమిత కశ్మీర్ ప్రజలు భారత అధీనంలోని కశ్మీర్ ప్రాంత ప్రజలతో పోలిస్తే తమ ఆర్థిక స్థితిగతులు, రాజకీయ స్వాతంత్య్రం ఎంత దీనంగా ఉన్నాయో అర్థం చేసుకుంటున్నారు. రావల్కోట్లో జాక్ (జేఏఏసీ) నాయకుడు సర్దార్ అమన్‌ఖాన్ ప్రదర్శనకారులనుద్దేశించి ప్రసంగిస్తూ, ఆజాద్ కశ్మీర్‌ను ఆక్రమిత ప్రాంతంగా పేర్కొని పాకిస్తాన్‌ను ఈ ప్రాంతం నుండి వైదొలగాలని డిమాండ్ చేయటం కొసమెరుపు. అఫ్గానిస్తాన్‌తో అంతంతే!పాకిస్తాన్లో వైశాల్యం పరంగా 40 శాతం వాటా కల్గిన బలూచిస్తాన్ అతిపెద్ద రాష్ట్రం. ఇరాన్, అఫ్గానిస్తాన్, అరేబియా సముద్రంతో సరిహద్దులు కలిగిన ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా కీలకం. రాగి, సహజ వాయువు, బంగారం వంటి కీలకమైన వనరులు బలూచిస్తా న్లో సమృద్ధిగా లభిస్తున్నాయి. బలూచి జాతికి చెందిన ప్రజలు పాక్‌లోని బలూచిస్తాన్, ఇరాన్‌లోని సిస్తాన్ బలూచిస్తాన్, అఫ్గానిస్తాన్‌లలో నివసిస్తున్నారు. శతాబ్దాలుగా తమ ఉనికిని, స్వాతంత్య్రాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. 1947లో పాకిస్తాన్ ఏర్పడినప్పుడు బలూచిస్తాన్ కలాత్ సంస్థా నంగా ఉండేది. 1948లో పాక్‌లో బలూచిస్తాన్ విలీనం వివాదా స్పద పరిస్థితులలో జరిగింది. కలాత్ రాజును ఒత్తిడి చేసి విలీన పత్రంపై సంతకం పెట్టించారు. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1958–59, 1963–69, 1973–77 మధ్యకాలంలో బలూచిస్తాన్‌లో పెద్ద ఎత్తున తిరుగుబాట్లు జరిగాయి. 2004 నుండి మళ్లీ బలూచిస్తా న్లో తిరుగుబాటు తీవ్రమైంది. అభివృద్ధి ఫలాలు స్థానికులకు అందకపోవటం, స్థానిక ప్రజలపై సైన్యం దమనకాండ, రాజకీయ స్వయంప్రతిపత్తి లేకపోవడం స్థానిక ప్రజల వ్యతిరేకతకు కారణం. ముఖ్యంగా బలూచి లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ఇటీవల పాక్ సైన్యం, భద్రతా బలగాలపై కచ్చితత్వంతో ఒకేసారి పెక్కు పట్టణా లలో విరుచుకుపడింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును ఏకంగా హైజాక్ చేశారు. గత వారంలో బీఎల్ఏ దాడులలో 42 మంది పాక్ సైనిక సిబ్బంది చనిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. పాక్ సైన్యపు ‘ఆపరేషన్ షాబాన్’ సత్ఫలితాలను ఇస్తున్నట్టు లేదు.పాక్–అఫ్గానిస్తాన్ సరిహద్దులలోని ఖైబర్–ఫఖ్తూన్ఖ్వాప్రాంతంలోని తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) ఉగ్రవాదులు ఏకంగా పాక్ సైనిక చెక్పోస్టులుపై దాడులు చేస్తున్నారు. వీరికి అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం దన్నుగా నిలుస్తున్నదని పాక్ ఆరోపణ. దీనికి ప్రతిగా పాక్ సైన్యం అఫ్గానిస్తాన్పైన ఏకంగా వైమానిక దాడులను చేపట్టింది. అఫ్గాన్ తాలిబన్ ప్రభుత్వం ప్రతిచర్యగా పాక్‌పై డ్రోన్లతో దాడి చేసింది. పశ్తూన్ (పఠాన్) తెగకు చెందిన ప్రజలు నివసిస్తున్న ఈ ప్రాంత ప్రజలు సరిహద్దుకు ఆవల అఫ్గాన్‌లోని పశ్తూన్ ప్రాంతాలతో కలిపి గ్రేటర్ పశ్తూనిస్తాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పాక్– అఫ్గాన్లకు సరిహద్దుగా ఉన్న హిందూకుష్ పర్వతాలలోని డ్యూరాండ్ లైన్‌ను అఫ్గాన్ మొదటినుండీ అంగీకరించలేదు.తెలిసివచ్చిన తరుణం62 బిలియన్ డాలర్ల వ్యయంతో పాక్‌లో చైనా అమలు చేస్తున్న సీపెక్ పథకం కింద పాక్‌లోని ప్రస్తుత సంక్షుభిత ప్రాంతాలలో కీలకమైన రహదార్లు, విద్యుచ్ఛక్తి కేంద్రాలు, రేవు పట్టణాలు, పారి శ్రామిక కేంద్రాలు, ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల నిర్మాణం జరుగుతున్నది. సీపెక్ ద్వారా పాక్ గుండా అరేబియా సముద్రంలోనికి ప్రవేశించటం చైనా వ్యూహం. గిల్గిత్ బాల్టిస్తాన్ పాక్‌ను చైనాతో కలుపుతుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఈ పథకంలో భాగంగా జీలం, నీలం నదులపై కోహ్లా, కరాత్, ఆజాద్ పఠాన్లలో భారీ జలవిద్యుచ్ఛక్తి కేంద్రాలను చైనా నిర్మిస్తున్నది. కశ్మీర్లో భాగమైన ఈ ప్రాంతాలలో సీపెక్ పథ కాన్ని భారత్ వ్యతిరేకించింది. సీపెక్ రహదారికి గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రవేశ ద్వారమైతే, బలూచిస్తాన్‌లోని గ్వాదర్ రేవు పట్టణం నిష్క్రమణ స్థానం (ఎగ్జిట్ పాయింట్). గ్వాదర్‌లో భారీ డీప్ వాటర్ పోర్టు, అంతర్జాతీయ విమానాశ్రయం చైనా నిర్మిస్తున్నది. బలూచిస్తాన్‌లో సంక్షోభం సీపెక్ పథకానికి ప్రతికూలం. ఇది భారత్‌కు కలిసివచ్చే అంశం. పాక్ ఆక్రమిత కశ్మీర్లో సంక్షోభం భారత అధీనంలోని కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన, అణచి వేత జరుగుతున్నదనే పాక్ వాదనలో డొల్లతనాన్ని బయటపెడు తున్నది. పాక్ అధీనంలోని కశ్మీర్లో ఆదర్శప్రాయమైన పాలన జరు గుతున్నదనే ప్రచారానికి ఈ నిరసనలు చెక్ పెడుతున్నాయి. అమె రికా, ఐరోపాలలోని పాశ్చాత్య మీడియా సంస్థలు ఇప్పటివరకు కశ్మీర్‌పై కొనసాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి భారత్‌కు ఇది సువర్ణావకాశం. బలూచిస్తాన్, పీఓకే, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలలో సంక్షోభానికి భారత్ కారణమని పాక్ ఆరోపిస్తున్నది. ఈ పరిణా మాల నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉండాలి. అంతర్గతంగా సమస్యలను ఎదుర్కొన్నప్పుడల్లా పాక్ భారత్‌లో ఏదో ఒక ఉగ్ర చర్యకు పాల్పడి దృష్టిని మరల్చి ప్రజలను తమ వైపునకు తిప్పు కోవటానికి ప్రయత్నిస్తుంటుంది.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
పూరీ క్షేత్ర మహావీధిలో...
శ్రీజగన్నాథుడి ప్రార్థనలు, కీర్తనలు చిన్ననాటి నుంచి నా జ్ఞాపకాల్లో పదిలమై ఉన్నాయి. పాఠశాలలో, కళాశాలలో చదువుకొనేటప్పుడు మహాప్రభు జగన్నాథుని భజనలు పాడటం నాకు చాలా ఆనందాన్ని చ్చేది. నేనీ మధ్య భజనలు పాడటం లేదు కానీ, ప్రతి రోజూ ఆ మహా ప్రభుని స్మరిస్తాను. భజనలోని ఓ నాలుగు పదాలైనా పలకని రోజుండదు. ఈనాటికీ భక్త కవి మధు సూదనరావు రచించిన పాటను పాడుతూనే ఉంటాను. ‘‘అంతటా ఉండే ఓ మహాప్రభూ... నువ్వు రాత్రింబగళ్లు నా తోడే ఉన్నావు... ఈ జ్ఞాపకంతో నిన్ను ఎల్లప్పుడూ పూజిస్తాను నా పూర్ణ హృదయంతో’’ అని ఆ పాటకి అర్థం. మహా ఆలయంమహాప్రభు జగన్నాథుని గురించి ఇంట్లో తరచూ మాట్లాడు కొనేవారు. మా గ్రామంలోనూ ఇలాంటి చర్చలే ఎక్కువగా జరుగు తుండేవి. నేను గ్రామ పాఠశాలలో చదువుతున్నప్పుడు భక్త సాల్బేగ్ రచించిన ‘ఆహే నీల శైల’ అనే ప్రార్థనను క్రమం తప్పకుండా పఠించేవారు. జగన్నాథుని గురించి మా టీచర్ అనేక విషయాలు చెబుతూ ఉండేవారు. ‘‘పూరీలో పెద్ద ఆలయం ఉంది. అంతటి గొప్ప ఆలయం మరొకటి లేదు! ఆ ఆలయంలో తన చెల్లెలు సుభద్ర, సోదరుడు బలభద్రునితో కలసి మహాప్రభు పూజలందు కుంటారు. మహాప్రభు నల్లని రంగులో, గుండ్రని కళ్లతో ఉంటారు. సుభద్ర పసుపు రంగులో, బలభద్రుడు వెన్నెల్లో వికసించిన పుష్పంలా శ్వేతవర్ణంలో ఉంటారు. ఒక్కసారి ఆ మూర్తులను చూస్తే, ఎప్పటికీ మరచిపోం’’ అని చెప్పేవారు. జగన్నాథుడే మహా ప్రభు వనీ, ఆయన ప్రసాదమే మహా ప్రసాదమనీ కూడా మా టీచర్ చెప్పేవారు. ఆయన ఆలయమే ‘బడ దేవుళ’ లేదా పెద్ద ఆలయం. ఆయన మార్గమే బడ దాండ. అంటే ఉత్కృష్ట మార్గం. ఆయన సముద్రమే మహోదధి లేదా గొప్ప మహాసముద్రం. మయూర్భంజ్ జిల్లాలోని మా ఊరు ఉపర్బేడా నుంచి పురుషోత్తమ క్షేత్రం పూరీ చాలా దూరంలో ఉంటుంది. మరి పూరీని సందర్శించే అవకాశం నాకెలా వస్తుంది? నేను పెద్దయ్యాక, భువనేశ్వర్‌కి వెళ్లాను. అక్కడ బాలికల ఉన్నత పాఠశాల యూనిట్–2లో చేరాను. అక్కడే వసతి గృహంలో ఉండేదాన్ని. అక్కడ ఉన్నప్పుడే పూరీ, భువనేశ్వర్, కోణార్క్ సందర్శించే అవకాశం లభించింది. మొదటిసారి మహా ప్రభును దర్శించుకున్న జ్ఞాపకం ఇప్పటికీ నా మదిలో స్పష్టంగా ఉంది. ఎంత అద్భుతమైన ఆలయం! ఎంత తేజోవంతమైన దేవతా మూర్తులు! శ్రీ క్షేత్రలో ఏడాదిలోని పన్నెండు నెలల్లో పదమూడు ఉత్స వాలు జరుగుతాయి. కానీ రథయాత్ర వైభవం అద్వితీయం. మహా ప్రభు దర్శనం కోసం ఏడాది పొడవునా భక్తులు ఆలయాన్ని సంద ర్శిస్తారు. కానీ ఏడాదికోసారి మహాప్రభువే ఆలయాన్ని వదలి విశాల పథంలో గుండిచా ఆలయానికి చేరుకొని భక్తులకు దర్శన మిస్తారు. మూడు అద్భుతమైన రథాలపై... చక్రరాజ సుదర్శనునితో పాటు... ముగ్గురు దేవతామూర్తులు గుండిచా ఆలయానికి చేరుకుంటారు. అక్కడే ఏడు రోజులు ఉండి, ఆ తర్వాత తిరుగు ప్రయాణ మవుతారు.నా తోడు...చిన్నతనం నుంచి మహాప్రభు జగన్నాథుని భక్తురాలిని. నా జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. ఆ సమస్యలన్నింటి నుంచి మహాప్రభు నన్ను బయటకు తీసుకొచ్చారు. ఎంతైనా నేను ఆయన బిడ్డనే కదా! భారత రాష్ట్రపతి పదవికి నన్ను అభ్యర్థిగా ప్రకటించినప్పుడు.. నేను భక్తిపూర్వకంగా మహాప్రభుని తలచు కున్నాను. ‘నన్ను ఇంత పెద్ద స్థాయికి తీసుకెళుతున్నావు. నన్ను ముందుకు నడిపించు. ఎప్పుడూ నాతోనే ఉండు’ అని ప్రార్థించాను. నేను రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో రథయాత్ర ఉత్సవం జరిగింది. నేను అప్పుడు ఢిల్లీలోనే ఉండాల్సి వచ్చింది. పూరీ వెళ్లడం సాధ్యం కాలేదు. రథయాత్ర రోజు ఉదయమే నేను ఢిల్లీలోని హాజ్ ఖాస్‌లో ఉన్న జగన్నాథుని ఆలయానికి వెళ్లాను. మహాప్రభు దర్శనం చేసుకున్నాను. పూర్తి విశ్వాసంతో నామినేషన్ దాఖలు చేశాను. 2022 జూలై 25న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయడానికి పార్లమెంట్ సెంట్రల్ హాలుకి వెళుతూ... దారిలో మహా ప్రభు జగన్నాథుని స్మరిస్తూనే ఉన్నాను. రాష్ట్రపతిగా నేను మొదటి సారి ప్రసంగించినప్పుడు ఆయన నాతోనే ఉన్నట్టు అనిపించింది.క్షేత్ర రాజంఅయినప్పటికీ, మహాప్రభు దర్శనం కోసం నా హృదయం పరితపించింది. రోజులు గడచిపోతున్నాయి కానీ పూరీ వెళ్లడం సాధ్యం కాలేదు. ఆయన అనుమతిస్తేనే తప్ప ఎవరికైనా ఆయన దర్శనం ఎలా లభిస్తుందని నాకు అనిపించింది. ‘మహాప్రభూ! నేనేదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి. దయచేసి నన్ను పూరీకి పిలిచి, మీ దర్శన భాగ్యం ఇవ్వండి’ అని మౌనంగా ప్రార్థించాను. అనతి కాలంలోనే పూరీ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఆ రోజు 2022 నవంబర్ 10. పూరీకి చేరుకున్న తర్వాత వాహన శ్రేణి శ్రీమందిర్ దిశగా ముందుకు వెళుతోంది. పూరీలోని బడ దాండ వద్దకు చేరుకోగానే అనిర్వచనీయమైన అనుభూతి నన్ను ముంచెత్తింది. బడ దాండ శ్రీ జగన్నాథునిది. ఇక్కడ ప్రొటోకాల్ పాటించాల్సిన అవసరం ఉందా? అన్ని పుణ్యక్షేత్రాల్లోనూ క్షేత్ర రాజంగా పూరీ ప్రసిద్ధి చెందింది. దేవుళ్లకే దేవుడు మహాప్రభు. ఎలాంటి ఆలోచనలు లేకుండా నా కారుని ఆపించాను. నా కారు ఆగగానే వెనుక వస్తున్న కార్లనీ కూడా ఆగిపోయాయి. ఏం జరుగుతుందో మిగిలిన వారికి అర్థమయ్యేలోపే... చెప్పులు లేకుండా బడ దాండపై నడవడం మొదలుపెట్టాను. అక్కడికి శ్రీ మందిర్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయ శిఖరం మీద ఉన్న నీల చక్రం, పతిత పావన ధ్వజం మీదే నా దృష్టిని సారించి ముందుకు సాగాను.ఆలయ సింహద్వారానికి చేరుకొనేసరికి... నేను స్థిమితంగా ఉండలేకపోయాను. బడ దాండ మీద దుమ్ములోనే సాష్టాంగ నమ స్కారం చేసి... ఆ మహాప్రభుకి నా ప్రణామాలు అర్పించాను. గర్భ గుడికి చేరుకొని నలుగురు దేవతామూర్తులను దర్శనం చేసుకుని, దైవికానందంతో ఉప్పొంగిపోయాను. లోకంలోని జనుల కష్టాలను తీర్చేందుకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు. అందుకే ఆయన విశాలమైన గుండ్రటి నేత్రాలు ఎప్పుడూ రెప్ప వాల్చవు. ఆయనకి పెద్దాచిన్నా తారతమ్యం లేదు. సమానత్వమే ఆయన మంత్రం. ఆయన దీవెనలతోనే... సమాజంలోని ప్రతి వర్గానికి సేవ చేసేందుకు నన్ను నేను అంకితం చేసుకున్నాను. గుండ్రని కన్నులతో ఉన్న మహాప్రభు జగన్నాథుని చూస్తూ... ‘ఓ మహాబాహూ! ప్రజ లకు సేవ చేయాలనే నా అంకితభావం కొనసాగేలా ఆశీర్వదించు. ఓ కృపానిధీ! నా దేశాన్ని, ఈ ప్రపంచాన్ని రక్షించు’ అని చేతులు జోడించి ప్రార్థించాను.ద్రౌపది ముర్ముభారత రాష్ట్రపతి(నేడు జగన్నాథ రథయాత్ర ప్రారంభం) -
సమానత్వం పేరిట ఆహారంలో కోత
ఆహార భద్రతా చట్టానికి సవరణలు చేయటానికి కేంద్రప్రభుత్వం పూనుకుంది. ఏదైనా ఆహార భద్రతా చట్టంలో మార్పును పరీక్షించడానికి ఒక సులభమైన కొలమానం ఉంది. ఆ పథకం ఎవరి కోసం రూపొందిందో ఆ వ్యక్తిని – అంటే గాంధీజీ చెప్పిన ‘అంత్యోదయ’, వరుసలో చిట్టచివరి మనిషిని – తీసుకోవడం; ఈ సవరణ తర్వాత అతడికి ఎక్కువ ఆహారం అందుతుందా, తక్కువా అని అడగడం. జాతీయ ఆహార భద్రతా (సవరణ) బిల్లు, 2026కు ఈ పరీక్ష పెడితే వచ్చే జవాబు స్పష్టం: ప్రతి కుటుంబానికీ తక్కువే. ఒంటరిగా ఉండే వితంతువుకు మరీ తక్కువ. ఈ చట్టం ఆమెనూ, ఆమెలాంటి వాళ్లనూ రక్షించడానికి రూపొందినది కావడమే ఇక్కడ గమనార్హం.పెద్ద కుటుంబాల మాటేమిటి?‘అంత్యోదయ అన్న యోజన’ (ఏఏవై) కింద కుటుంబానికి నెలకు 35 కిలోల ధాన్యం ఇచ్చే హక్కును ఈ బిల్లు తీసేసి, ఒక్కొక్కరికి 7 కిలోల చొప్పున ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. అదే సమయంలో కుటుంబానికి గరిష్ఠంగా 35 కిలోల పరిమితిని విధిస్తోంది. దీన్ని ‘అసమానతలను తొలగించడం’గా ప్రభుత్వం చెబుతోంది. కానీ లెక్క చూస్తే నిజం బయటపడుతుంది: ఒంటరి వ్యక్తికి 35 నుంచి 7 కిలోలకు (80% కోత) తగ్గుతుంది. ఇద్దరికి 14 కిలోలకు, ముగ్గురికి 21కి, నలుగురికి 28కి పడిపోతుంది. ఐదుగురి కుటుంబం మాత్రమే సరిగ్గా 35 కిలోలు తీసుకుంటుంది. ఆరు, ఏడు, ఎనిమిది మంది ఉన్న కుటుంబాలు 35 కిలోల పరిమితి వల్ల ఉన్న చోటే ఉండిపోతాయి. ఏ ఒక్క ‘ఏఏవై’ కుటుంబానికీ ఒక్క కిలో అదనంగా రాదు. ‘లాభం’ అనే గడి పూర్తిగా ఖాళీ. 7 కిలోలు పోషకాహార ప్రమాణమే అయితే, ఎనిమిది మంది కుటుంబానికి 56 కిలోలు కావాలి. కానీ పరిమితి వాళ్లకు 35 మాత్రమే ఇస్తుంది. అంటే తలసరి 4.4 కిలోలు. సాధారణ ప్రాధాన్య కుటుంబం కంటే కూడా తక్కువ. ఈ పోషకాహార సూత్రం కోత పెట్టే చోట పని చేస్తుంది, హక్కు పెంచాల్సిన చోట మాత్రం మౌనంగా ఉంటుంది. ఒకే వైపు పనిచేసే సూత్రం కాదు – అది సమానత్వం ముసుగులో ఒక పొదుపు లక్ష్యం మాత్రమే.ఒంటరివాళ్లు ఏం కావాలి?చిన్న కుటుంబాలపైనే ఈ పథకాన్ని కేంద్రీ కరించారు. ఏఏవైలో చిన్న కుటుంబం అనేది యాదృచ్ఛికం కాదు, అదే దాని రూపకల్పన. 2000 సంవత్సరం నుంచి ఏఏవై రాష్ట్రాలకు స్పష్టంగా చెప్పింది: ఆసరా లేని వితంతువులు, ఒంటరి మహిళలు, మంచానపడ్డ రోగులు, వికలాంగులు, ఆధారం లేని వృద్ధులు, ఆదిమ తెగలు,ఒంటరిగా బతికే నిరుపేదలను గుర్తించండి అని! దారిద్య్రం మన దేశంలో ఒకరిద్దరుగానే ఉంటుంది. అందుకే 35 కిలోల ఫ్లాట్ హక్కు పొరపాటు కాదు, అది తలసరి లెక్కకు కుదించ లేని ఒక గుర్తింపు. ఒంటరి నిరుపేదకు ఆ రేషన్ కేవలం ఆహారం కాదు; పింఛను అందని నెలకు అది ఆసరా, ఇంట్లో ఏ ఆపదనైనా తట్టుకోగల ఏకైక ఆస్తి. రేషన్ దుకాణంలో ఒంటరి కార్డుపై వేలి ముద్ర ఎవరిదో చూసిన వారికి తెలుసు. అది చాలావరకు ఏ దిక్కూ లేని ఒక ముసలి స్త్రీది. ఆమె 35 కిలోలు ఇప్పుడు 7 కిలోలు అవుతాయి. చట్టం చరిత్రలోనే విధించిన అతిపెద్ద కోత ఇది.పైగా ఇదంతా ఎప్పుడు జరుగుతోంది? ఎఫ్‌సీఐ గోదాముల్లో దాదాపు 604 లక్షల టన్నుల ధాన్యం– బఫర్ ప్రమాణానికి దాదాపు మూడు రెట్లు– పేరుకుపోయి ఉన్నప్పుడు. అదే సమయంలో రైతులు వరి, గోధుమ, కంది, పెసర కనీస మద్దతు ధర కంటే తక్కు వకే అమ్ముకుంటున్నారు. మిగులుపై కూర్చొని, రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా, అత్యంత పేద కుటుంబాల రేషన్ నుంచి ఏటా 22–25 లక్షల టన్నులు తీసేయడం – ఇది కొరత వల్ల కాదు, పొదుపు పేరుతో జరుగుతున్న మార్పు. సేకరణ దగ్గర రైతును,పంపిణీ దగ్గర పేదను నొక్కి, మధ్యలో మిగిలిన దాన్ని ‘పొదుపు’ అని పిలవడం– ఇది మనం మళ్లీ మళ్లీ చూస్తున్న నమూనా. ఇది చట్టం చరిత్రలో మొదటిసారిగా ఒక హక్కును తగ్గించే సవరణ. ఆర్టికల్ 21 కింద ఆహార హక్కును ఒకసారి కల్పించాక దాన్ని వెనక్కి తీసుకోవడం రాజ్యాంగపరంగా ప్రశ్నార్థకం. పైగా ఇంత కీలకమైన మార్పును – ఈమెయిల్ ద్వారా, ఇంగ్లిష్‌లో మాత్రమే, కొద్ది రోజుల గడువుతో సంప్రదింపులకు పెట్టడం ప్రభుత్వం తన శాసన సంప్ర దింపుల విధానాన్నే ఉల్లంఘించడం! అసలు పరిష్కారంప్రభుత్వం చెప్పే సమస్య నిజమైనదే అయితే, పరిష్కారం చాలా సులభం. ఒక అంత్యోదయ అన్న యోజన కుటుంబానికి హక్కు ఒక్కొక్కరికి 7 కిలోలు, లేదా కుటుంబానికి 35 కిలోలు– వీటిలో ఏది ఎక్కువ అయితే అది నిర్ణయించవచ్చు. చిన్న కుటుంబాలు తమ రక్షణను నిలబెట్టుకుంటాయి; పెద్ద కుటుంబాలకు– ఆరుగురికి 42 కిలోలు, ఎనిమిది మందికి 56 కిలోలు వస్తాయి. బిల్లు ఉదహరించే ఐసీఎంఆర్ పోషణ ప్రమాణానికి తగిన వాటా దొరుకుతుంది. దీనికి కావాల్సిన అదనపు ధాన్యం నేటి మిగులు ముందు నామమాత్రమే. పైగా అది గోదాముల ఒత్తిడిని తగ్గించి, కనీస మద్దతు ధర కంటే తక్కువకు పడిపోయిన మార్కెట్లో సేక రణకు ఊతమిస్తుంది. ఎవరూ నష్టపోరు, అందరూ లాభపడతారు. కానీ ప్రభుత్వం మాత్రం పేదలే ఎక్కువ నష్టపోయే సూత్రాన్ని ఎంచుకుంది. మిగిలిన ధాన్యాన్ని ఇథనాల్ పరిశ్రమలకు సబ్సిడీతో అందించే బదులు ఆకలితో ఉన్నవాళ్లకి అందిస్తే మంచిది కదా!అలా అని ఇప్పుడు ఉన్న చట్టంలో సమస్యలు లేవని కాదు. నిజానికి చట్టానికి సంస్కరణలు అవసరమే– కానీ ఈ దిశలో కాదు. అసలైన సవరణ ఐదు ప్రశ్నలను ఎదుర్కోవాలి. మొదటిది, జనాభాలో ఒక శాతం ప్రకారం కాక నిజంగా అవసరమున్నవారిని క్షేత్రస్థాయిలో గుర్తించి చేర్చడం. రెండోది, బియ్యం, గోధుమలకే పరిమితం కాకుండా పప్పులు, చిరుధాన్యాలు, నూనెను రేషన్ బుట్టలో చేర్చడం. మూడోది, ప్రజాపంపీణీ వ్యవస్థ ఆహారం తినడానికి సురక్షితంగా ఉండేలా ప్రమాణాలు, పరీక్షలు, తిరస్కరించే హక్కు కల్పించడం. నాలుగోది, రైతును తక్కువ ధరతో ముంచి చౌక ఆహారానికి రాయితీ ఇవ్వడం ఆపి, గిట్టుబాటు ధర (సీ2+50%)ను ఆహార భద్రత నిజ ఖర్చుగా గుర్తించడం. ఐదోది, మిగతా నాలుగింటినీ సాధ్యం చేసేది– వ్యవస్థను వికేంద్రీకరించి, జిల్లాను ప్రాతిపదికగా చేసి, స్థానిక ఎఫ్పీఓలకు సేకరణ, నిల్వ,పంపిణీ బాధ్యతలను అప్పగించడం. ఈ బిల్లును ఇప్పటికీ వెనక్కి తీసుకోవచ్చు. దాని వెనుక ఉన్న శక్తిని, చట్టం దశాబ్దంగా ఎదురుచూస్తున్న నిజమైన సంస్కరణ వైపు మళ్లించడమే మెరుగైన మార్గం. అలా కాక, సమానత్వం ముసు గులో చేసేది కేవలం కోత మాత్రమే!డా‘‘ జి.వి.రామాంజనేయులువ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త,‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
అంతా ప్రపంచం మంచికే!
జూలై నెల ఇంకా సగం కూడా గడవ లేదు. ఇంకా చెప్పాలంటే ఈ నెలలో 31 రోజులు అయినందున మూడవ వంతే అయినట్లు లెక్క. ఈ కొద్ది కాలంలోనే జపాన్ ప్రధాని భారత రాజధానికి వచ్చి వెళ్లగా, భారత ప్రధాని మూడు ముఖ్య మైన దేశాలు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పర్యటించి స్వదేశానికి చేరుకున్నారు. ఏ కొలమానం ప్రకారం చూసినా ఇది అసాధారణమైనది. ఈ నాలుగింటిలో ఏదీ అపుడపుడు జరుగుతుండే సౌహార్ద్రపూరితమైన సందర్శన కాదు. అన్నింటికి అన్నీ వ్యూహాత్మకమైన కోణాలు గలవి. ఎందుకట్లా?కొత్త అస్థిరతలుఆ చర్చలోకి వెళ్లే ముందు కొన్ని విషయాలు అర్థం చేసుకోవటం అవసరం. లేనట్లయితే ఇన్నిన్ని పర్యటనలు, ఒప్పందాలు ఎందుకు, ఇంత వేగంగా ఎందుకు అన్నది తెలుసుకోలేము. ఈ నెల పర్యటనలకు గత ఆరుమాసాల ప్రయాణాలను కూడా జోడించి చూసిన ప్పుడు విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. మొదటిది, ఒకటి రెండేళ్ల క్రితంతో పోల్చితే ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతుండటం. రెండవది, మార్పులన్నవి రాజకీయం, ఆర్థికం, సైనికం, వేర్వేరు కూటములు, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఉద్యోగ ఉపాధుల కోసం ఇతర దేశాలకు తరలిపోవటం, పెరుగుతున్న జాతివాదాలు, వీటితో పాటు తీవ్ర రూపం తీసుకుంటున్న వాతావరణ పరిస్థితుల న్నిటా కనిపిస్తున్నాయి. పర్యవసానంగా ప్రపంచమంతటా కొత్త అస్థిరతలు ఏర్పడుతున్నాయి. ఇటువంటి స్థితి ఎప్పుడూ లేదు.ఇటువంటి పరిణామాల మధ్య ఆసియాతోపాటు మధ్య ఆసియా, పశ్చిమాసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, యూరప్‌లే గాక, ఉత్తర అమెరికాలో భాగమైన కెనడా వరకు కూడా కొత్త ఒత్తిడులు ఏర్పడుతూ, కొత్త ఆలోచనలు కనిపిస్తున్నాయి. సముద్రాలలో ఎక్కడో విసిరివేసినట్లుండే డజన్లకొద్దీ దేశాల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. వాటి సమస్యలు మరింత ప్రమాదకర మైనవి. పెద్ద దేశాలు తమ అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని లెక్క చేయనందువల్ల సముద్ర మట్టాలు పెరుగుతూ, ఆ ద్వీప దేశాలు మునిగి పోగల వేగం కూడా పెరుగుతున్నది. అందుకే అటువంటి వారంతా గత నెల మొదటిసారిగా పెద్ద దేశాలు వేటినీ ఆహ్వానించకుండా, ఐక్యరాజ్యసమితితో సైతం నిమిత్తం లేకుండా, కొలంబియాలో సమావేశమయ్యారు. అన్ని ఖండాలలోని అన్ని దేశాలకూ ఆర్థికం, రక్షణలన్నవి అనిశ్చయమవుతున్నాయన్నది గమనార్హం.బహుళ ధ్రువ ప్రపంచంభారత దేశానికిగానీ, మరే దేశానికిగానీ ఆర్థికాభివృద్ధి, దేశ రక్షణ, ఇతర ప్రయోజనాల పరిరక్షణ, నిరాటంకమైన రీతిలో పురోగతి అనే నాలుగు ఆలోచనలు ఎప్పుడూ ఉండేవే. లోగడ కూడా ఇవి సజావుగా ఏమీ సాగలేదు. కానీ సమస్యలు ఇటీవల మరింత పెరుగుతున్నాయి. అందరికీ పెరగటమన్నది ఒక సామాన్య లక్షణంగా మారింది. అందువల్లనే ఇండియా వలెనే అన్ని దేశాలూ ఈ స్థితి నుంచి బయటపడేందుకు ముమ్మరమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. దక్షిణ అమెరికా మొదలు కెనడా, యూరప్, ఆఫ్రికాలపైగా తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల వరకు ఆర్థిక, రక్షణ ఒప్పందాల కోసం భారత ప్రధాని పర్యటనలు చేయటమే కాదు, ఒప్పందాల అవసరాన్ని గుర్తించి వారు కూడా ఇటు వస్తున్నారు.ఇండియాను అట్లుంచి వారిలో వారు కూడా పరస్పర ప్రయాణాలు, ఒప్పందాలు చేసుకుంటున్నారు. వేర్వేరు దేశాధినేతల ఆకాశయా నాలు ఇంతగా బహుశా లోగడ ఎప్పుడూ జరిగి ఉండవు. ఆర్థిక, రక్షణ విషయాలతో ముడిపడిన ఇటువంటి మార్పులు రెండవ ప్రపంచ యుద్ధానంతర ప్రపంచంలోగానీ, ఏకధ్రువ ప్రపంచావ తరణ జరిగిన తర్వాతగానీ, ప్రపంచ చరిత్రలో ఒక కొత్త అధ్యాయ మంటే అతిశయోక్తి కాకపోవచ్చు.ఏ దేశమైనా అభివృద్ధి చెందాలనీ, భద్రంగా ఉండాలనీ కోరుకుంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం, ఆ తర్వాత ఆర్థిక సంస్క రణల కాలం నుంచి ఒకవైపు వస్తూత్పత్తి, వినియోగాలు చరిత్రలో ఎన్నడూ లేనట్లు పెరుగుతుండగా, మరొకవైపు అన్ని దేశాలలో ప్రజల అవసరాలు, ఆకాంక్షలు అదే స్థాయిలో పెరగసాగాయి. ఈ రెండింటికి తగిన విధంగా అభివృద్ధిని సాధించి, దేశ భద్రతా ఏర్పాట్లను కూడా పెంచవలసిన బాధ్యత సహజంగానే ప్రభుత్వాలపై పడింది. ఆ బాధ్యతలను నెరవేర్చలేని ప్రభుత్వాలు ఓటింగ్ ద్వారానో, తిరుగుబాట్ల వల్లనో కూలిపోవటాన్ని చూస్తు న్నాము. ఈ విధమైన పరిణామాలు అంతర్గతమైన ఒత్తిడులు కాగా, అదే విధమైన ఒత్తిడులు వేరే రూపాలలో, బయటి పరిణామాల వల్ల ఏర్పడటం ఇటీవలి కాలంలో పెరగటం మొదలైంది. అందుకు నాంది ఆర్థిక సంస్కరణలు వర్ధమాన దేశాలకు, మరీ ముఖ్యంగా సాధారణ సామాజిక వర్గాలకు ప్రతికూలమై అసమానతలను పెంచటంతో పడింది. ఇటీవలికి వచ్చేసరికి, పాశ్చాత్య దేశాలు తాము సృష్టించి ఇతరులపై రుద్దిన పలు అంతర్జాతీయ నియమ నిబంధనలు తాము కోరుకున్న ఫలితాలనివ్వటం తగ్గటంతో వాటిని భంగపరచటం మొదలైంది. వారు కొత్త వ్యవస్థలనూ సృష్టించలేక పోతున్నారు. ఈ పరిణామాలన్నింటి ఫలితంగా బహుళ ధ్రువ ప్రపంచ భావనలు బలపడటం, ఇండియాతో పాటు కొన్ని ప్రముఖ దేశాలు ‘బ్రిక్స్’ వంటి ప్రత్యామ్నాయ సంస్థలను ఏర్పరచటం జరిగింది. బయటకు స్పష్టంగా ప్రకటించకున్నా అమెరికన్ డాలర్‌కు సమాంతర కరెన్సీల వినియోగం క్రమంగా విస్తరిస్తున్నది. పులి మీద పుట్ర వలె ట్యారిఫ్‌లు, బలవంతపు వాణిజ్య ఒప్పందాలు, అక్కర లేని యుద్ధాలు, అందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.బద్దలవుతున్న చట్రంవీటన్నింటివల్ల వీరువారని గాక అందరికీ ఎదురవుతున్న సమస్యలు ఏమిటో ఏకరువు పెట్టనక్కరలేదు. ఆ సమస్యలలో ఆర్థిక మైనవి, రక్షణపరమైనవి, ఇతరాలు కూడా ఉన్నాయి. ఈ రెండు రంగాలకు సంబంధించి అమెరికాకు సన్నిహిత దేశాలైన యూరప్, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, మెక్సికో, గల్ఫ్ రాజ్యాల వంటివి సైతం తమలో తామే గాక ఇండియా, బ్రెజిల్, దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికా వంటి ఇతర దేశాలతోనూ ఇటీవలి ఆరు మాసాలలో చేసుకుంటూ వస్తున్న ఆర్థిక ఒప్పందాలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కెనడా, యూరప్‌ల వంటివి అమెరికా వద్దన్నా... చైనాతో ఒప్పందాలను ఆర్థిక భద్రత కోసం చేసుకుంటున్నాయి. ఈ మార్పులు, మలుపులు ప్రపంచాన్ని అను కోని రీతిలో పాత చట్రం నుంచి బయటకు తెస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రెట్టన్‌వుడ్స్ సంస్థల నుంచి ఆర్థిక సంస్కరణల వరకుండిన ఒక చట్రం, అప్పటి నుంచి ఉండిన రెండవ చట్రం ఇప్పుడు భగ్నమవుతున్న దృశ్యాన్ని మనమిపుడు చూస్తున్నాము. మన జూలై ఒప్పందాలు కూడా విస్తృతార్థంలో అదే పరిధి లోకి వస్తాయి. అంతటా అందరూ క్రమంగా స్వతంత్ర నిర్ణయా లతో, పరస్పర ఒప్పందాలతో, స్వతంత్రంగా ఎదిగేందుకు,భద్రంగా జీవించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
మనకు నిజంగా నిరోధకత ఉందా?
2021 వసంతకాలంలో భారతదేశంలో రెండో కోవిడ్ అల ఆసుపత్రులను ముంచెత్తుతున్న సమయంలోనూ ఒక ప్రమాదకరమైన అపోహ విస్తృత ప్రచారంలో ఉంది: ‘దక్షిణాసియా ప్రజలకు కరోనా వైరస్‌పై సహజమైన రోగనిరోధక శక్తి ఉంది.’ ఇది ఎలా పుట్టింది? దాని వల్ల ఎంత నష్టం జరిగింది? రాబోయే మహమ్మారులకు సిద్ధంగా ఉండాలంటే ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవలసిందే.గణాంకాల తప్పుమొదటి తప్పు గణాంకాల్లో జరిగింది. భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాల్లో అధికారికంగా నమోదైన కోవిడ్ మరణాల సంఖ్య అసలు మరణాల కంటే చాలా తక్కువగా ఉంది. పరీక్షలు పరిమితంగా ఉండటం, మరణాల నమోదు వ్యవస్థలు బలహీనంగా ఉండటం వల్ల అనేక మరణాలు నమోదు కాలేదు. మరికొన్నింటిని ఇతర కారణాల వల్ల జరిగిన మరణాలుగా నమోదు చేశారు.2021 చివరి వరకు భారత ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్ మరణాల సంఖ్య లక్షల్లోనే ఉంది. అయితే ‘ద లాన్సెట్’, ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ చేసిన స్వతంత్ర అధ్యయనాలు... ఏడాది కాలంలో సాధారణంగా నమోదయ్యే మరణాల కంటే అదనంగా సంభవించిన మరణాలు 40 నుంచి 50 లక్షలు ఉండొచ్చని అంచనా వేశాయి. ప్రభుత్వ ప్రకటనల్లో తక్కువ మరణాల సంఖ్య ప్రజలకు ఊరట నివ్వొచ్చు. కానీ అవే నిజమని నమ్మితే నిర్లక్ష్యానికి దారితీస్తాయి.‘అదనపు మరణాలు’ అనే ప్రమాణం మరింత విశ్వసనీయ మైనది. ఎందుకంటే ఒక మరణాన్ని కోవిడ్‌గా నమోదు చేశారా, న్యుమోనియాగా నమోదు చేశారా, లేక కారణం తెలియదని పేర్కొ న్నారా అనే విషయాన్ని అది పట్టించుకోదు. సాధారణంగా ఏడాదిలో ఎంతమంది మరణిస్తారు, వాస్తవంగా ఎంతమంది మర ణించారు అనే తేడాను మాత్రమే అది పరిశీలిస్తుంది. ఈ ప్రమాణంతో చూస్తే దక్షిణాసియా దేశాల ప్రజలకు అసాధారణ రక్షణ ఉందనేది సరికాదు. అది కేవలం తక్కువ లెక్కింపు వల్ల కనిపించే దృశ్యం అని అర్థమవుతుంది.జీవన విధానాల ప్రభావంప్రారంభ దశలో కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ ప్రభావం తక్కువగా కనిపించడానికి మరో కారణం జీవశాస్త్రం కాదు. పర్యావరణం, ప్రజల జీవన విధానం. గాలి సరిగా వీచే ప్రదేశాలు, జనసాంద్రత, ప్రయాణ అలవాట్లు, ఇంటి లోపల గడిపే సమయం వంటి అంశాలు వైరస్ వ్యాప్తిపై పెద్ద ప్రభావం చూపుతాయి. దక్షిణా సియాలో చాలా ప్రాంతాల్లో వీధి వ్యాపారం, కూలి పని, సామాజిక కలయిక వంటి రోజువారీ కార్యకలాపాలు బహిరంగ ప్రదేశాల్లోనే జరుగుతాయి. అక్కడ గాలి స్వేచ్ఛగా వీస్తుంది. కాబట్టి వైరస్ అంత వేగంగా వ్యాపించదు. అందువల్ల ప్రారంభ దశలో కొన్ని ప్రాంతాల్లో వైరస్ నెమ్మదిగా వ్యాపించి ఉండొచ్చు. అంతేకాని అది ప్రజల్లో సహజ రోగనిరోధక శక్తి ఉన్నందు వల్ల కాదనేది గమనించాలి.ఇది జీవశాస్త్రానికి సంబంధించిన కథ కాదు. నగరాల నిర్మాణం, జీవనశైలి వంటి అంశాలకు సంబంధించిన విషయం. మూసివేసిన, ఎయిర్‌కండిషన్ భవనంలో వైరస్ ఒక విధంగా, బహిరంగ మార్కెట్లో మరో విధంగా వ్యాపిస్తుంది. గాలిలో వైరస్ ఎక్కువసేపు నిలిచే పరిస్థితులు ఉన్నచోట తీవ్రంగా వ్యాపించింది. అలాంటి పరిస్థితులు లేని చోట వ్యాప్తి ఆలస్యమైంది. ఈ అనుభవం మనకు నగర ప్రణాళిక, మౌలిక సదుపాయాలు, ప్రజారోగ్య పెట్టు బడుల ప్రాముఖ్యాన్ని నేర్పాలి. కానీ దానిని ప్రజల సహజ రోగనిరోధక శక్తికి నిదర్శనంగా తప్పుగా అర్థం చేసుకున్నారు.1918లో వచ్చిన ఇన్ఫ్లుయెంజా మహమ్మారి భారత ఉపఖండంలో సుమారు 1.2 కోట్ల నుంచి 1.7 కోట్ల మంది ప్రాణాలు తీసింది. ప్రపంచంలోని ఏ ఒక్క దేశంలోనైనా నమోదైన అతిపెద్ద మరణాల సంఖ్యల్లో ఇది ఒకటి. 19వ శతాబ్దంలో కలరా మహ మ్మారులు గంగానది పరివాహక ప్రాంతం నుంచి పదే పదే వ్యాపించాయి. ఈ చరిత్ర చెబుతున్న విషయం ఒక్కటే. ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యేక రక్షణ లేదు. బలహీనమైన ఆరోగ్య వ్యవస్థలు, సరిపోని మౌలిక సదుపాయాల వల్ల ప్రమాదం మరింత పెరుగుతుంది.కోవిడ్ సమయంలో టెలివిజన్ కార్యక్రమాల్లో కొందరు మూలికల మందులు రోగనిరోధక శక్తిని పెంచుతాయని ప్రచారం చేశారు. భారతదేశంలో బీసీజీ టీకా ఎక్కువ మందికి వేయడం వల్ల రక్షణ లభించిందని కొందరు అధికారులు సూచించారు. సోషల్ మీడియాలో ఇలాంటి వాదనలు వేగంగా వ్యాపించాయి. వాటిని ప్రశ్నించే శాస్త్రీయ స్వరాలు అంతగా వినిపించలేదు. ఇలాంటి ప్రచారం వల్ల అసలు ప్రమాదం ప్రజల ప్రవర్తనలో కనిపిస్తుంది. ‘మనం ఇప్పటికే రక్షితులం’ అని నమ్మినవారు పరీక్షలు చేయించు కోవడానికి, ఇతరుల నుంచి దూరంగా ఉండడానికి, టీకాలు వేయించుకోవడానికి, లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి వెళ్లడానికి తక్కువ ఆసక్తి చూపుతారు.ఎలా ఎదుర్కోవాలి?సంప్రదాయ ఆహారం, ఇంటి చిట్కాలు ఆరోగ్యానికి కొంత మేలు చేయవచ్చు. కానీ ఊపిరితిత్తులపై దాడి చేస్తున్న వైరస్‌ను అవి ఆపలేవు. ఆ సమయంలో అవసరమయ్యేది ఆక్సిజన్ చికిత్స, వైద్య సేవలు. ఈ రెండింటి మధ్య తేడాను చెరిపేసిన తప్పుడు ప్రచారం సాంస్కృతిక అతిశయం మాత్రమే. ఇది నివారించగలిగిన మరణాలకు కూడా కారణమైంది. మహమ్మారి ముగిసిన తర్వాత కూడా తప్పుడు సమాచారం ఎందుకు నిలిచిపోతుంది? ఎందుకంటే అది ప్రజలకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. ‘మన ప్రజలు బలమైనవారు’, ‘మన సంప్ర దాయాలు మనల్ని కాపాడతాయి’ అనే మాటలు భయంతో ఉన్న సమయంలో ఆకర్షణీయంగా అనిపిస్తాయి. దానికి విరుద్ధంగా ‘వైరస్‌కు మీ సంస్కృతి తెలియదు. మీ చరిత్రతో దానికి సంబంధం లేదు’ అనే సందేశం అంతగా నచ్చదు.భవిష్యత్తులో సంభవించబోయే విపత్తులను ఎదుర్కోవడానికి తప్పుడు కథనాలను అధిగమించి నిజాలపై ఆధారపడగలిగిన వ్యవ స్థలను నిర్మించాలి. అందుకోసం మరణాల నమోదును బలోపేతం చేయాలి. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల శివార్లలో ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత బలపరచాలి. తప్పుడు సమాచారం ఎలా వ్యాపిస్తుందో అర్థం చేసుకునే ప్రజారోగ్య సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆధారాలు లేని వాదనలను ప్రచారం చేసే అధికారులు, మీడియా వ్యక్తులను జవాబుదారులుగా నిలబెట్టాలి. దక్షిణాసియా వాసులకు సహజ రోగనిరోధక శక్తి ఉందనే అపోహ మనకు నేర్పిన ప్రధాన పాఠం ఒక్కటే: ‘శ్వాసకోశ వైరస్ల నుంచి ఏ జాతికీ, ఏ దేశానికీ సహజ రక్షణ ఉండదు’. ప్రజలను రక్షించేది అపోహలు కాదు. ముందస్తు సన్నద్ధత, వ్యాధులపై నిఘా, ప్రజల విశ్వాసం, సరైన సమయంలో తీసుకునే చర్యలే.మహమ్మారి ఉద్ధృతమయ్యేలోపే ఈ పాఠం నేర్చుకుంటే ప్రాణాలు నిలుస్తాయి. అదే ఆలస్యంగా నేర్చుకుంటే, ఆసుపత్రి కారి డార్లలో, ఆక్సిజన్ సిలిండర్ల కోసం క్యూల్లో నిలబడి ఆ నిజాన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. అప్పుడు చెల్లించాల్సిన మూల్యం గణాంకాల్లో కాదు. అంత్యక్రియల్లో కనిపిస్తుంది.మేడా పరమేశ్వర రెడ్డివ్యాసకర్త ఇండో–అమెరికన్ రిటైర్డ్ సైంటిస్ట్, ‘రెడ్డి సెంటర్ ఫర్ క్రిటికల్ అండ్ ఇంటిగ్రేటెడ్ థింకింగ్’ డైరెక్టర్ -
ప్రవాస భారతీయులకు ఆర్బీఐ వరం
2026 జూన్ 8న భారతీయ రిజర్వు బ్యాంకు... వాణిజ్య బ్యాంకులు సమీకరించే మూడు నుంచి ఐదేళ్ల కాల పరిమితి గల ఎఫ్సీఎన్ ఆర్(బి) డిపాజిట్లపై, ప్రత్యేక డాలర్–రూపాయి స్వాప్ సదుపాయాన్ని ప్రకటించింది. 2026 సెప్టెంబరు 30 వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. సాధారణంగా అమెరికన్ డాలర్, యూరో, బ్రిటిష్ పౌండ్, జపాన్ యెన్, ఆస్ట్రేలియన్ డాలర్, కెనడియన్ డాలర్ వంటి ప్రధాన విదేశీ ద్రవ్యాల్లో ఎఫ్సీఎన్ ఆర్(బి) డిపా జిట్లు స్వీకరిస్తారు. ఈ నిర్ణయంతో ప్రవాస భారతీయులకు తమ విదేశీ ద్రవ్యాన్ని రూపాయిల్లోకి మార్చకుండానే, గతంతో పోలిస్తే అధిక వడ్డీ పొందే అవకాశం లభించింది.ఎఫ్సీఎన్ ఆర్(బి) (ఫారిన్ కరెన్సీ నాన్– రెసిడెంట్ బ్యాంక్) డిపాజిట్ అంటే – ప్రవాస భారతీయులు విదేశాల్లో ఆర్జించిన సొమ్మును, అనుమతించబడిన విదేశీ ద్రవ్యంలోనే భారతీయ బ్యాంకుల్లో కాలపరిమితి డిపాజిట్‌గా ఉంచడం. గడువు పూర్తయ్యాక అసలు, వడ్డీ రెండూ అదే ద్రవ్యంలో తిరిగి చెల్లించబడుతాయి. ఎన్ఆర్ఈ డిపాజిట్లో మాత్రం ఆ డబ్బు రూపాయిల్లోకి మారుతుంది. భారత్‌లో వచ్చే వడ్డీపై పన్ను మినహాయింపు, విదేశాలకు తిరిగి తీసుకెళ్లే సౌలభ్యం రెండింటికీ వర్తిస్తాయి.సాధారణంగా, ఎన్ ఆర్ఈ డిపాజిట్లతో పోలిస్తే ఎఫ్సీఎన్ ఆర్(బి) డిపాజిట్లపై కొంత తక్కువ వడ్డీ లభిస్తుంది. ఎందుకంటే, బ్యాంకులు ఈ విదేశీ ద్రవ్య నిధులను రూపాయిల్లోకి మార్చుకొని, దేశీయ అవసరాల కోసం వినియోగి స్తాయి. అయితే గడువు పూర్త య్యాక డిపాజిటర్లకు విదేశీ ద్రవ్యంలోనే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈలోగా రూపాయి–డాలర్ మారకం ప్రతికూలంగా మారినా నష్టం వాటిల్లకుండా, బ్యాంకులు కొంత అదనపు వ్యయంతో కూడిన ముందస్తు రక్షణ ఏర్పాట్లు – అంటే హెడ్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. తాజా ఆర్బీఐ విధాన నిర్ణయంతో, ఈ డిపాజిట్లపై బ్యాంకులు భరించాల్సిన హెడ్జింగ్ వ్యయాన్ని ఆర్బీఐ స్వయంగా భరిస్తుంది. దీంతో బ్యాంకులకు అలాంటి డిపాజిట్లపై అధిక వడ్డీ చెల్లించే వెసులుబాటు కలిగింది.స్థిర విదేశీ ద్రవ్యవనరుల సమీకరణఈ విధానం ప్రకటించిన సమయంలో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొని ఉంది. ముడి చమురు ధరలు అనూహ్యంగా పెరిగాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ జీవితకాల కనిష్ఠాన్ని తాకింది. ఆ నేపథ్యంలో, రూపాయిపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు, దేశానికి మరింత స్థిరమైన విదేశీ ద్రవ్య వనరులను సమకూర్చడం కూడా ఈ చర్య వెనుక ఉన్న ముఖ్యోద్దేశాల్లో ఒకటి. విదేశీ సంస్థాగత, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు వంటి స్వల్పకాలిక మూలధన ప్రవాహాలతో పోలిస్తే, ఎఫ్సీఎన్ ఆర్(బి) డిపాజిట్లు మరింత స్థిరమైన, దీర్ఘకాల విదేశీ ద్రవ్య వనరులుగా అక్కరకు వస్తాయి. అందువల్ల అత్యవసర సందర్భాల్లో, ఇటు వంటి ప్రత్యేక వెసులుబాట్ల ద్వారా విదేశీ ద్రవ్య నిధులను సమీకరించేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ప్రవాస భారతీయ సమూహం, ఇటువంటి విధానాలు సఫలీకృతం కావడంలో విశేషంగా తోడ్పడుతోంది.2013లో రూపాయిపై తీవ్ర ఒత్తిడి నెలకొన్న సమయంలో అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ స్వల్ప మార్పులతో ఇదే తరహా ప్రత్యేక స్వాప్ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకానికి అనూహ్య స్పందన లభించింది. కొద్ది నెలల్లోనే సుమారు 34 బిలియన్ అమెరికన్ డాలర్ల డిపాజిట్లు వచ్చాయి. రూపాయిపై ఒత్తిడి తగ్గించడంలో, విదేశీ పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెంపొందించడంలో ఆ పథకం కీలక పాత్ర పోషించినట్లు భావిస్తారు. అయితే ఈ పథకంపై భిన్నాభిప్రాయాలు కూడా లేక పోలేదు. గడువు పూర్తయ్యాక ఒకేసారి భారీ మొత్తంలో విదేశీ ద్రవ్య చెల్లింపులు చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో విదేశీ ద్రవ్య ప్రవాహాలు ఆశించిన స్థాయిలో లేకపోతే, రూపాయిపై మరింత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని కొందరు ఆర్థికవేత్తల అభి ప్రాయం. అయితే 2013లో ప్రవేశపెట్టిన ఇదే తరహా పథకం గడువు ముగిసి నప్పుడు ఏర్పడిన పరిస్థితిని ఆర్బీఐ సమర్థవంతంగా ఎదుర్కొందన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.అలాగే, ఇలాంటి తాత్కాలిక విధాన సడలింపులు తక్షణావసరాలను తీర్చడంలో ఉపయోగపడినా; ఎగుమతుల వృద్ధి, స్థిరమైన విదేశీ పెట్టుబడులు, బలమైన స్థూల ఆర్థిక వ్యవస్థ వంటి దీర్ఘకాలిక చర్యలే దేశానికి స్థిరమైన విదేశీ ద్రవ్య వనరులను సమకూర్చగలవు. మార్చి 2026 నాటికి భారతీయ బ్యాంకుల్లో ఉన్న ఎఫ్సీఎన్ ఆర్(బి) డిపాజిట్ల మొత్తం సుమారు 34 బిలియన్ అమెరికన్ డాలర్లు. అంతర్జాతీయ అనిశ్చితుల వలన గణనీయంగా తగ్గిన నిల్వలను తిరిగి సమకూర్చుకోవడం తక్షణావసరం. ప్రస్తుత చర్యల ద్వారా, అనుకూల పరిస్థితుల్లో 50 నుంచి 60 బిలియన్ అమెరికన్ డాలర్ల వరకు అదనపు విదేశీ ద్రవ్య నిధులు సమీకరించే అవకాశం ఉందని బ్యాంకింగ్ రంగ ప్రముఖులు, మార్కెట్ విశ్లేషకుల అంచనా. ఆ అంచనాలు ఎంతవరకు వాస్తవరూపం దాల్చుతాయో రాబోయే నెలల్లో స్పష్టమవుతుంది. అయితే, గతానుభవాలను దృష్టిలో ఉంచుకుంటే, అవసరమైన సమయంలో ప్రవాస భారతీయుల వ్యక్తిగత పొదుపులు కూడా దేశ ఆర్థిక స్థిరత్వానికి తోడ్పడగలవని ఆర్బీఐ విశ్వసించడం సహేతుకంగానే తోస్తోంది.పల్లపోతు కృష్ణబాలాజివ్యాసకర్త ఎస్బీఐ విశ్రాంత ఉన్నతాధికారి -
శరద్ పవార్ (85), ఎన్సీపీ లీడర్ రాయని డైరీ
‘‘భద్రం పవార్ జీ...’’ అంటూ ఒక్క గెంతున వచ్చి, నా చేతికి తన భుజాన్ని అందించారు ఏక్నాథ్ షిందే! ‘‘పడిపోనులే ఏక్నాథ్. కాసేపు మీ ఛాంబర్లో కూర్చుందామని వచ్చాను. కూర్చోవచ్చు కదా?’’ అన్నాను నవ్వుతూ. ‘‘పవార్ జీ, ఇంతటి గౌరవాన్ని మరెవరికైనా నేనెందుకు దక్కనిస్తాను! దయచేసి రండి. మీ పార్టీ ఛాంబర్‌ను కూడా కాదని, నా ఛాంబర్‌కి వచ్చారంటే నాకు మీ ఆశీస్సులు ఉన్నట్లుగానే కదా నేను భావిస్తాను. రండి, మెల్లిగా నడవండి’’ అన్నారు ఏక్నాథ్. నవ్వాన్నేను. ఏక్నాథ్ నన్ను తన ఛాంబర్లో కూర్చోబెట్టి, శాలువా కప్పి; పూలు, టెంకాయ చేతికి అందించారు. ‘‘ఏమిటి ఇదంతా ఏక్నాథ్?’’ అన్నాను. ‘‘పవార్ జీ, నేనొక ముఖ్యమైన మీటింగులో ఉండగా, మీరు నా ఛాంబర్ అడుగుతున్నారని తెలిసి, వెంటనే మీటింగ్‌ని ఆపి మీకోసం పరుగున వచ్చాను’’ అన్నారు ఏక్నాథ్. ‘‘చాలా సంతోషం ఏక్నాథ్. అసెంబ్లీ భవన్లో ‘బోర్డర్ ఇష్యూ మీటింగ్’ ఉంటే వచ్చాను. తిరిగి వెళ్లేటప్పుడు... మా ఎమ్మెల్యే లతో కాసేపు కలిసి కూర్చోటానికి... మీ ఛాంబర్, ఎంట్రెన్స్‌కి దగ్గరగా ఉందని ఇటొచ్చాను’’ అన్నాను.‘‘వచ్చినందుకు ధన్యవాదాలు పవార్ జీ...’’ అన్నారు ఏక్నాథ్. నాకోసం ప్రత్యేకంగా ‘టీ’ తెప్పించి, నాతో పాటు తనూ టీ సేవించి, నాతో కొద్దిసేపు మాట్లాడి, ‘ఉంటాను పవార్ జీ’ అంటూ సెలవు తీసుకున్నారు ఏక్నాథ్. ఏక్నాథ్ ఇంకో ఇరవై, ఇరవై అయిదేళ్ల తర్వాత తన ఎనభై ఐదేళ్ల వయసులో కూడా... ఇప్పుడు నాలాగే, లేదా నాకన్నా ఎక్కువగానే ఉత్సాహంగా ఉంటాడనుకుంటా! ఉన్నచోటే ఉండిపోయేవాళ్లకు పాలిటిక్స్‌లో భవిష్యత్తు ఉండదు. పేరుకు ఉంటారంతే. ఇక్కడ ఎదగాలంటే సిద్ధాంత పరమైన విభేదాలు ఉండాలి. వ్యక్తిగత ఘర్షణలు ఉండాలి. అధికార సమీకరణాలపై ఒక కన్ను, ఒక చెవి వేసి ఉంచాలి. ఒక కాలును లోపల, ఒక కాలును బయటా ఉంచాలి. రాజీవ్ హత్య తర్వాత నేను ప్రధాని అవ్వాల్సింది. ‘అతడికి స్వతంత్ర భావాలు ఎక్కువ’ అని నా మీద సోనియాజీకి చెప్పి,నేను ప్రధాని కాకుండా అడ్డుపడి నన్ను బయటికి పంపించారు. ఏక్నాథ్వి నాకు మించిన స్వతంత్ర భావాలు! శివసేన తన ‘హిందుత్వ’ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఏంటని అతడు బయటికి వచ్చేశాడు. నాలా ఒక్కడే రాలేదు. శివసేనను సగం తెంపుకుని వచ్చేశాడు. నేను పీఎంని కాలేకపోయాను. ఏక్నాథ్ సీఎం అయ్యాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం. మళ్లీ సీఎం అయినా అవుతాడు. ఏక్నాథ్ ఛాంబర్లో నేను కాసేపు కూర్చొని వచ్చినందుకు... ‘‘ఏక్నాథ్ అనే ద్రోహి ఛాంబర్లోకి శరద్ జీ వెళ్లి కూర్చోవటం ఏంటి?!’’ అని ఉద్ధవ్ శివసేన విమర్శిస్తోంది. కూటమిలోని తక్కిన పార్టీలు కూడా... ‘‘వాళ్లేమిటి? వాళ్ల వంశం ఏమిటి? వాళ్ల ఛాంబర్‌కి శరద్ జీ వెళ్లటం ఏమిటి?’’ అని భృకుటి ముడేస్తున్నాయి! ‘‘శరద్ జీ కూర్చోదలచుకుంటే ఏక్నాథ్ ఛాంబరే దొరికిందా! అసెంబ్లీ ప్రాంగణంలో మన ఛాంబర్లు లేవా? పోనీ, అవి వద్దనుకుంటే వై.బి. చవాన్ ప్రతిష్ఠాన్ లేదా? ఎన్సీపీ ఆఫీస్ ‘రాష్ట్రవాది భవన్’ లేదా?’’ అంటున్నారు ఉద్ధవ్ శివసేన ఎంపీ సంజయ్ రౌత్! చవాన్ ప్రతిష్ఠాన్, రాష్ట్రవాది భవన్ అసెంబ్లీ ప్రాంగణంలో లేవు. చవాన్ ప్రతిష్ఠాన్ నారిమన్ పాయింట్లో ఉంది. ఏక్నాథ్ ఛాంబర్ నాకు నాలుగడుగుల దూరంలో ఉంది; రాష్ట్రవాది భవన్ దక్షిణ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్‌లో ఉంది. ఏక్నాథ్ ఛాంబర్ నా భుజానికి దగ్గరగా ఉంది. రౌత్‌కు ఇది ఎందుకు తెలియకుండా ఉంది?! దూరాలు గ్రహించలేనివారు, ఎప్పటికీ దగ్గరగా ఆలోచించలేరు. -
'ఏఐ' నూతన పారిశ్రామిక విప్లవానికి నాంది!
ఈరోజు పట్టాలు అందుకుంటున్న 2026 బ్యాచ్ విద్యార్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ రోజు మీ జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎన్నో ఏళ్ల కష్టం, పట్టుదల, త్యాగానికి ఇది ప్రతిఫలం. కానీ ఈ విజయం మీదే కాదు. మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మార్గదర్శకులు, మిమ్మల్ని నమ్మిన ప్రతి ఒక్కరిది! మీకు ఇది జీవితంలో మరో ముందడుగు మాత్రమే కావచ్చు. కానీ ఒక తల్లికి మాత్రం తన బిడ్డ పట్టా అందుకోవడం జీవితకాల కల నెరవేరిన క్షణం. నా తల్లిదండ్రులు కూడా ఈరోజు నన్ను చూసి ఎంతో గర్వపడుతున్నారు. నా విజయం వారి కలల ఫలితం. నిజానికి నేను వారి అమెరికా కలకు రూపం. ఈ సభలో ఉన్న చాలామంది విద్యార్థుల్లాగే నేను కూడా మొదటి తరం వలసదారుడిని. నా తల్లిదండ్రులు (తైవాన్ నుంచి) అమెరికాకు రావడానికి కారణం ఒక్కటే. ‘మా పిల్లలకు మంచి అవకాశం దొరకాలి’ అనే ఆశ. నాకు ముప్పై సంవత్సరాల వయసులో, నా స్నేహితులతో కలిసి ఎన్విడియాను ప్రారంభించాను. మా లక్ష్యం ఒక కొత్త తరహా కంప్యూటర్ను రూపొందించడం. సాధారణ కంప్యూటర్లు సాధించలేని సమస్యలను పరిష్కరించే శక్తిమంతమైన వ్యవస్థను నిర్మించాలని అనుకున్నాం. కొద్ది రోజుల్లోనే అసలు నిజం తెలిసింది. మేము రూపొందించిన తొలి సాంకేతికత పూర్తిగా విఫలమైంది. డబ్బు కూడా అయిపోయే పరిస్థితి వచ్చింది. గత 33 ఏళ్లుగా ఎన్ విడియా ఎన్నోసార్లు తనను తాను మార్చుకుంది. ప్రతిసారి ఒకే ప్రశ్న వేసుకుంది: ‘ఇందులో ఎంత కష్టముంటుంది?’ ప్రతిసారి సమాధానం ఒక్కటే: ‘మనం అనుకున్నదానికంటే చాలా కష్టం.’ కానీ ప్రతి వైఫల్యం మాకు కొత్త పాఠం నేర్పింది. ప్రతి అపజయం మమ్మల్ని మరింత వినయంగా మార్చింది. ప్రతి కష్టం మా వ్యక్తిత్వాన్ని మరింత దృఢంగా తీర్చిదిద్దింది. వైఫల్యం అనేది విజయానికి వ్యతిరేకం కాదు. వైఫల్యం విజయానికి తీసుకెళ్లే మరో మెట్టు మాత్రమే. ప్రతిసారి పడిపోయి మళ్లీ లేవడంవల్లే జీవితంలో నిజమైన ధైర్యం వస్తుంది. అదే మన విజయానికి అసలైన బలం. ప్రపంచాన్ని మార్చే కొత్త యుగంమీ కలలను నిజం చేసుకునే అద్భుతమైన అవకాశం ఇప్పుడు మీ ముందుంది. మీ కెరీర్ ప్రారంభమవుతున్న సమయం... ప్రపంచ చరిత్రలో అత్యంత ఉత్కంఠభరితమైన దశ. నేను ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ప్రపంచం పర్సనల్ కంప్యూటర్స్ (పీసీ) విప్లవం ప్రారంభ దశలో ఉంది. మీరు మాత్రం కృత్రిమ మేధస్సు (ఏఐ) విప్లవం ప్రారంభమవు తున్న సమయంలో కెరీర్ మొదలుపెడుతున్నారు. దీనికంటే గొప్ప అవకాశం మరొకటి ఉండదని నేను నమ్ముతున్నాను. నా జీవితంలో కంప్యూటింగ్ రంగంలో వచ్చిన ప్రతి పెద్ద మార్పును నేను చూశాను. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు, పర్సనల్ కంప్యూటర్లు, ఇంటర్నెట్, మొబైల్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్... ప్రతి దశ ప్రపంచాన్ని మార్చింది. ప్రతి కొత్త ఆవిష్కరణ మానవ జీవితాన్ని మరింత సులభం చేసింది. కానీ ఇప్పుడు మనం చూడబోతున్న మార్పు వీటన్నింటికంటే పెద్దది. ఇది కేవలం మరో సాంకేతిక పరిణామం కాదు. ఇది కంప్యూటింగ్ ప్రపంచానికే కొత్త ఆరంభం. గత ఆరు దశాబ్దాలుగా కంప్యూటర్లు ఒకే విధంగా పని చేశాయి. మనుషులు కోడ్ రాస్తారు. కంప్యూటర్లు ఆ ఆదేశాలను అమలు చేస్తాయి. ఇంతకాలం ఇదే సూత్రం. కానీ ఇప్పుడు... ఆ యుగం ముగిసింది. ఏఐ కంప్యూటింగ్‌ను పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్లింది. ఇకపై కంప్యూటర్లు కేవలం ఆదేశాలు పాటించే యంత్రాలు కావు. అవి అర్థం చేసుకుంటాయి. తర్కిస్తాయి. ప్రణాళికలు రూపొందిస్తాయి. అవసరమైన సాధనాలను ఉపయోగించి సమస్యలకు పరిష్కారాలు కనుగొంటాయి. ఒకప్పుడు మనం సాఫ్ట్‌వేర్‌ను రాసి సీపీయూలపై నడిపించే వాళ్లం. ఇప్పుడు ఏఐ వ్యవస్థలు భారీ న్యూరల్ నెట్‌వర్క్‌ల ద్వారా జీపీయూలపై పనిచేస్తున్నాయి. ఇది కేవలం వేగం పెర గడం కాదు, కంప్యూటర్లు ఆలోచించే విధానమే మారుతోంది. వ్యవసాయం నుంచి వైద్యం వరకు, విద్య నుంచి పరిశ్రమల వరకు, వ్యాపారం నుంచి శాస్త్ర పరిశోధనల వరకు... ప్రతి రంగా నికి ఏఐ అవసరం. ఏఐ ప్రతి పరిశ్రమనూ మార్చబోతోంది. ఏఐపై భయం సహజమే!ఏఐ చిత్రాలు గీస్తోంది. వ్యాసాలు రాస్తోంది. సాఫ్ట్వేర్ తయారు చేస్తోంది. కార్లను నడుపుతోంది. ఇలాంటప్పుడు సహజంగానే కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి: ఉద్యోగాలు పోతాయా? మనిషి అవసరం తగ్గిపోతుందా? అసలు ఈ టెక్నాలజీ మన నియంత్రణలో ఉంటుందా? ఇలాంటి సందేహాలు కొత్తవి కావు. ప్రపంచ చరిత్రలో ప్రతి గొప్ప సాంకేతిక విప్లవం వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే పుట్టాయి. విద్యుత్ వచ్చినప్పుడు కూడా భయపడ్డారు. ఇంటర్నెట్ వచ్చి నప్పుడు కూడా సందేహించారు. కానీ మానవ సమాజం కొత్త సాంకేతి కతను బాధ్యతతో స్వీకరించిన ప్రతిసారీ... అది మన సామ ర్థ్యాన్ని మరింత విస్తరించింది. ఏఐని తెలివిగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనదే. ఇకపై ప్రతి ఒక్కరూ ప్రోగ్రామర్లే. ఇప్పటి వరకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేయగలిగినవారు ప్రపంచ జనాభాలో చాలా తక్కువ మంది మాత్రమే. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. కోడ్ ఎలా రాయాలో తెలియకపోయినా, మనకు కావాల్సిన పనిని సహజమైన భాషలో ఏఐకి చెప్పగలిగితే చాలు. మిగతా పనిని ఏఐ పూర్తి చేస్తుంది. ఒక చిన్న దుకాణం నడిపే వ్యాపారి... ఏఐ సహాయంతో తన వ్యాపారం కోసం అందమైన వెబ్‌సైట్‌ను రూపొందించుకోవచ్చు. ఒక వడ్రంగి... కస్టమర్‌కు వంటగది నమూనాలను రూపొందించి చూపించవచ్చు. ఒక ఉపాధ్యా యుడు కొత్త పాఠ్యాంశాలను సిద్ధం చేయవచ్చు. ఒక వైద్యుడు... వైద్య సమాచారాన్ని వేగంగా విశ్లేషించవచ్చు. ఒక రైతు... పంట లపై మెరుగైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఏఐ వల్ల కంప్యూటింగ్ శక్తి కొద్దిమందికే పరిమితం కాకుండా... ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తోంది. ఇదే ఏఐ తీసుకొస్తున్న అతిపెద్ద ప్రజాస్వామిక మార్పు. ఏఐ ఉద్యోగాలను మారుస్తుంది!విద్యుత్ ఎలా ప్రపంచాన్ని మార్చిందో... ఇంటర్నెట్ ఎలా మన జీవన విధానాన్ని మార్చిందో... అలాగే ఏఐ కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చబోతోంది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరం అవుతాయి. ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద సాంకేతిక మౌలిక వసతుల నిర్మాణ కార్యక్రమంగా నిలవబోతోంది. ఏఐ కోసం కొత్త చిప్ తయారీ కేంద్రాలు, అత్యాధునిక కంప్యూటర్ కర్మాగా రాలు ఏర్పాటవుతాయి. భారీ డేటా సెంటర్లు నిర్మిస్తారు. ఆధు నిక తయారీ పరిశ్రమలు విస్తరిస్తాయి. ఎలక్ట్రీషియన్లు,ప్లంబర్లు, ఇనుప కార్మికులు, టెక్నీషియన్లు, నిర్మాణ రంగ కార్మికులు... ప్రతి ఒక్కరికీ కొత్త అవకాశాలు లభిస్తాయి. ఏఐ కేవలం ఒక కొత్త కంప్యూటింగ్ యుగాన్ని మాత్రమే కాదు... ఒక కొత్త పారిశ్రామిక యుగాన్ని కూడా ప్రారంభిస్తోంది. శక్తిమంతమైన ఏఐకి శక్తిమంతమైన విద్యుత్ అవసరం. అందుకే విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది. విద్యుత్ గ్రిడ్లను ఆధునికీకరిస్తారు. పునరుత్పాదక ఇంధన వనరులపై పెట్టు బడులు పెరుగుతాయి. ఏఐ అభివృద్ధి కేవలం కంప్యూటర్లనే కాదు, మొత్తం మౌలిక వసతుల అభివృద్ధినే వేగవంతం చేస్తుంది. ఏఐ ఉద్యోగాలను మార్చుతుంది... కానీ మనిషి లక్ష్యాన్ని కాదు.చాలామంది అడుగుతున్న ప్రశ్న: ‘ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయా?’ నా సమాధానం: ప్రతి ఉద్యోగాన్నీ ఏఐ ప్రభా వితం చేస్తుంది. ఉద్యోగంలోని కొన్ని పనులు యంత్రాలు చేయవచ్చు. కొన్ని పాత ఉద్యోగాలు తగ్గవచ్చు. అదే సమయంలో ఎన్నో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. కొత్త పరిశ్ర మలు ఏర్పడతాయి. ఉదాహరణకు, ఈరోజు ఏఐ చాలావరకు సాఫ్ట్వేర్ కోడ్ రాయగలుగుతోంది. అంటే... సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అవసరం లేదని కాదు. వారు ఇప్పుడు ఏఐ సహా యంతో మరింత క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు కనుగొన గలుగుతున్నారు. ఏఐ వైద్య చిత్రాలను వేగంగా విశ్లేషించగలదు. కానీ రోగిని అర్థం చేసుకుని సరైన చికిత్స అందించే వైద్యుడి స్థానాన్ని అది భర్తీ చేయదు. ఏఐ మనిషిని తొలగించడానికి రాలేదు. మనిషి సామర్థ్యాన్ని మరింత పెంచడానికి వచ్చింది. మిమ్మల్ని ఏఐ భర్తీ చేయకపోవచ్చు, కానీ ఏఐ బాగా ఉపయోగించే వ్యక్తి ఆ పని చేయవచ్చు. ఏఐ మీ ఉద్యోగాన్ని తీసేయక పోవచ్చు. కానీ ఏఐని సమర్థంగా ఉపయోగించడం నేర్చుకున్న వ్యక్తి మీకంటే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఏఐ మానవ జ్ఞానాన్ని మరింత వేగంగా విస్తరించబోతోంది. ఇప్పటి వరకు అసాధ్యంగా అనిపించిన ఎన్నో సమస్య లకు పరిష్కారాలు కనుగొనబోతోంది. ప్రపంచంలోని కోట్లాది మందికి కంప్యూటింగ్ శక్తిని అందించబోతోంది. మనం నిర్మించే భవిష్యత్తు... ఈరోజు మనకు లభించిన ప్రపంచం కంటే మరింత సంపన్నంగా, మరింత సామర్థ్యవంతంగా, మరింత ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది. ఇంత శక్తిమంతమైన సాధనాలు, ఇంత గొప్ప అవకా శాలతో ప్రపంచంలోకి అడుగుపెట్టిన తరం ఇంతకుముందు లేదు. మనమంతా ఒకే ప్రారంభ రేఖ వద్ద నిలబడి ఉన్నాం. రాబోయే భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించే అవకాశం ఇప్పుడు మీ ముందుంది. కాబట్టి నెమ్మదిగా నడవకండి... ధైర్యంగా ముందుకు పరుగెత్తండి! -
పరిష్కారమే సమస్యగా నిలిచేనా?
భారత్ ప్రభుత్వం 2025–26 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం (ఇ20) లక్ష్యాన్ని సాధించే దిశగా గణనీయ మైన పురోగతి సాధించింది. ఇందుకోసం ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు చమురు మార్కెటింగ్ సంస్థల ద్వారా ఇథనాల్ కొనుగోలును కూడా విస్తరించింది. అయితే ఈ కార్యక్రమానికి అనేక సవాళ్లు ఉన్నాయి: అధిక నీటి అవసరం; 2023కు ముందు కొన్న లక్షల వాహనాలు ఇ20కి పూర్తిగా అనుకూలంగాలేకపోవడం; ఆహారానికీ, ఇంధనానికీ మధ్య సమతుల్యతను కాపాడటం.‘నీళ్లు’ కలుపుతున్నారా?అనేక ప్రాంతాలలో ఇ20తో కూడిన పెట్రోల్ వేసుకున్నాక వాహనాలు ఆగిపోవడం, ఇంజిన్ చెడిపోవడం వంటి అనుభవాలు పెరిగినాయి. అనేక పెట్రోల్ బంక్‌లలో పెట్రోల్‌తో పాటు నీళ్ళు పోస్తున్నారని వాహనదారులు ఆందోళనకు దిగుతున్నారు. ఆమధ్య మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మొత్తం వాహనశ్రేణికి ఇదే సమస్య ఉత్పన్నమయ్యింది. మధ్యప్రదేశ్ పెట్రోల్ బంక్‌ల సంఘం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా ప్రతిస్పందన లేదు. నిత్యావసర వస్తువు లలో ఒకటైన పెట్రోల్, డిజిల్ గురించిన నియంత్రణ జిల్లా కలెక్టర్లు చేస్తారు. వారి అభిప్రాయానికి కూడా ప్రభుత్వం విలువ ఇవ్వడం లేదు. పెట్రోల్‌లో ఇథనాల్ కలిపితే నీళ్ళు రావడం సాధారణం అని ఒప్పుకొన్నా చమురు కంపెనీలు సాంకేతిక అవసరాలకు అనుగుణంగా కలపడం లేదని పెట్రోల్ బంక్‌ల ఆరోపణ. దాదాపు 30 కోట్ల వాహనాలు ఇ20 వల్ల పాడయితే దేశ ఆర్థిక స్థితి, వ్యక్తిగత వాహనదారుల మీద పడే ఆర్థిక భారం గురించి ఆలో చన చేయవలసి ఉన్నది. సరుకు రవాణా వాహనాలు మొరాయిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆటోలు, టాక్సీ తదితర రవాణా సదుపాయాలు కుంటుపడితే ఆ యా కుటుంబాల మీద భారంతో పాటు నిత్య రవాణా మీద దుష్ప్రభావం ఉంటుంది.పర్యావరణ హితమేగానీ...భారత్‌లో ఇథనాల్ కార్యక్రమం (ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్–ఈబీపీ) దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం, పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం అనే ముఖ్య ఉద్దేశాలతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇది 2003లో ప్రారంభమైంది. ప్రపంచ వాతావరణ సదస్సులలో కర్బన ఉద్గారాలు తగ్గిస్తామని భారత్ చేసిన లిఖితపూర్వక వాగ్దానంలో ఇది ఒక భాగమైంది. చెరకు రసం, మొలాసెస్, మొక్కజొన్న, బియ్యం వంటి వ్యవ సాయ పంటలు, వాటి ఉప ఉత్పత్తుల నుంచి తయారయ్యే జీవఇంధనం (బయో ఫ్యూయల్) ఇథనాల్. ఇది పునరుత్పాదకఇంధనం కావడంతో పెట్రోల్ తరహ వాయు కాలుష్యం ఉండదు గానీ పూర్తిగా సున్నా కాదు. ఇంకొక కొత్త రకం కాలుష్యం ఏర్పడు తున్నది. కొన్ని పరిస్థితుల్లో నైట్రోజన్ ఆక్సైడ్లు లేదా ఆల్డిహైడ్లు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల అన్ని రకాల ఉద్గారాలు సమానంగా తగ్గుతాయని చెప్పలేము. టెయిల్‌పైప్ ఉద్గారాలు సాధారణంగా తగ్గుతాయి. అయితే ఏ ఉద్గారాలు ఎంత తగ్గుతాయనేది ఇంజిన్ రకం, ఇథనాల్ మిశ్రమ శాతంపై ఆధారపడి ఉంటుంది. కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్లు, పార్టిక్యులేట్ మ్యాటర్ తగ్గు తాయి. వివిధ ఇంధనాల ఉత్పత్తి నుంచి వినియోగం పోల్చితే కార్బన్ డయాక్సైడ్ నికర ప్రభావం కూడా తగ్గుతుంది. అయితే, కార్బన్ డయాక్సైడ్ తగ్గుదల కూడా ఇథనాల్ తయారు చేసే విధా నాన్ని బట్టి ఉంటుంది. చెరుకు, మక్కలు, వడ్ల నుంచి తయారు చేసే క్రమంలో వివిధ రకాల ప్రభావం ఉంటుంది. ఇథనాల్‌ను పెట్రో ల్లోనే కలుపుతున్నారు; డీజిల్ వాడకం వల్ల వచ్చే వాయు కాలుష్యం గురించి ఎటువంటి అడుగులు వేయడం లేదు. రైతులకు ఎంత మేలు?భారత్‌లో ఇథనాల్‌ను చెరకు రసం, మొలాసెస్, మొక్కజొన్న, బియ్యం, గోధుమలు, జొన్నలు, సజ్జల నుంచి తయారు చేస్తారు. ఆయా పంటలకు డిమాండ్ పెరిగి తద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందనేది ఆలోచన. ఇది ఒక నినాదంగా, ఆకర్షణీయ ప్రకటన లాగానే ఉన్నది. ఆహార పంటలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. రైతుకు గిట్టుబాటు ధర రాకపోవడానికి కారణం ఆ యా పంటలకు డిమాండ్ లేక కాదు – మార్కెట్లో వ్యవస్థీ కృతమైన దోపిడీ వల్ల. మార్కెట్ల దోపిడీ ఈ పంటలను ఇథనాల్ ఉత్పత్తికి మళ్ళించడం వల్ల తగ్గదు. ప్రస్తుతం దేశంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగింది. 2014లో సుమారు 421 కోట్ల లీటర్ల సామర్థ్యం ఉండగా, 2026 నాటికి అది సుమారు 2,000 కోట్ల లీటర్ల వార్షిక సామర్థ్యానికి పెరిగింది. ప్రభుత్వం కొత్తగా అనేక ధాన్యాధారిత, చెరకు ఆధారిత డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చింది. పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలప డానికి సంవత్సరానికి సుమారు 1,016 కోట్ల లీటర్ల ఇథనాల్ అవస రమని ప్రభుత్వం, నీతి ఆయోగ్ అంచనా.ఇంధనం కాకుండా పరి శ్రమలు, రసాయనాలు, మద్యం తదితర ఇతర అవసరాలను కలి పితే మొత్తం సుమారు 1,350 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం. సుమారు 2,000 కోట్ల లీటర్ల వార్షిక ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా ధాన్యాలపై ఆధారపడి నడపాలంటే దాదాపు 5 కోట్ల టన్నుల ధాన్యం అవసరం అవుతుంది. మొత్తం ధాన్య ఉత్పత్తి దాదాపు 37.66 కోట్ల టన్నులు. అంటే, అది దేశ మొత్తం ఆహార ధాన్య ఉత్పత్తిలో సుమారు 13% అవుతుంది. అమెరికా నుంచి డీడీజీఎస్ (డిస్టిల్లర్స్ డ్రైడ్ గ్రెయిన్స్ విత్ సొల్యూబుల్స్) దిగుమతులు, భారత ఇథనాల్ కార్యక్రమంతో ముడిపడి ఉన్న నేపథ్యంలో అది ఇంకొన్ని సమస్యలను సృష్టిస్తుంది. ఇథనాల్ తయారీ తర్వాత మిగిలే అధిక ప్రోటీన్ కలిగిన ఉప ఉత్పత్తిని డీడీజీఎస్ అంటారు. దీనిని పశువులు, కోళ్లు, చేపలకు దాణాగా ఉపయోగిస్తారు. అమెరికా నుంచి చౌకగా డీడీజీఎస్వస్తే దేశీయ డీడీజీఎస్ ధరలు పడిపోవచ్చు. దీంతో భారతఇథనాల్ డిస్టిలరీల ఆదాయం తగ్గుతుంది. మొక్కజొన్న రైతులపై కూడా ప్రభావం ఉంటుంది. అమెరికా దిగుమతులతో జీఎం (జన్యు మార్పిడి) వివాదం కూడా ఉన్నది. జీఎం మొక్కజొన్ననుంచి అమెరికా డీడీజీఎస్ వస్తుంది కాబట్టి, జన్యుమార్పిడిదాణా వల్ల ఏర్పడే అనారోగ్య సమస్యలు అదనం. అందుకే ఈఅన్ని సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వివరంగా స్పందించాల్సిన అవసరం ఉంది.-వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు-దొంతినరసింహారెడ్డి -
ఆఫ్రికా నుండి ఫ్రెంచ్ నిష్క్రమణ?
గత నెలాఖరులో ఫ్రెంచ్ ప్రభుత్వంతో ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో దౌత్య సంబంధాలు తెంచుకోవటంతో ఫ్రాన్స్ – ఆఫ్రికా ఘర్షణ తారస్థాయికి చేరింది. ఆఫ్రికా నుండి ఫ్రాన్స్ నిష్క్రమణ ఖాయమైంది. 1880–1919 మధ్యకాలంలో 90 శాతం ఆఫ్రికా ఖండం వలస పాలకుల అధీనంలోకి వచ్చింది. బ్రిటన్ తరువాత ఫ్రాన్స్ ఆఫ్రికాను ఆక్రమించుకొన్న రెండవ అతిపెద్ద వలస రాజ్యం. పోర్చుగల్, బెల్జియం, జర్మనీ, ఇటలీ కూడా ఆఫ్రికాలో వలసలను ఏర్పరచాయి. ఫ్రాన్స్ ప్రధానంగా పశ్చిమ, మధ్య ఆఫ్రికాలను ఆక్రమించింది. ఫ్రాన్స్ వలస సామ్రాజ్యం ఉచ్ఛ దశలో ఆఫ్రికాలో సుమారు 33 శాతం ప్రాంతంలో విస్తరించింది. 1960లో ఫ్రాన్స్ 14 ఆఫ్రికా దేశాలకు స్వాతంత్య్రాన్ని ప్రకటించింది. అల్జీరియా 1962లో ఫ్రెంచ్ పాలన నుండి విముక్తి పొందింది.ఫ్రాన్స్ తీరు వేరు!వలస దేశాలకు బ్రిటన్, పోర్చుగల్, జర్మనీ, ఇటలీ స్వాతంత్య్రాన్ని ఇచ్చిన తరువాత, ఆయా దేశాల నుండి పూర్తిగా వైదొలిగాయి. కానీ ఫ్రాన్స్, రాజకీయ స్వాతంత్య్రాన్ని ఇచ్చినప్పటికీ, సైనిక, ఆర్థిక, సాంస్కృతిక నియంత్రణను కొనసాగించింది. 1960– 2025 మధ్యకాలంలో ఫ్రాన్స్ సైన్యం ముప్పయిసార్లకు పైగా ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నది. 2013లో మాలీలో ఫ్రెంచ్ సైన్యం ఆప రేషన్ సెవాల్ను చేపట్టింది. అనేక సందర్భాలలో ఫ్రెంచ్ సైన్యం దుష్ట నియంత పాలకులకు దన్నుగా నిలిచింది. గాబన్లో ఒమర్ బాంగో, చాద్‌లో డెబీ ఫ్రెంచ్ సైన్యం మద్దతుతోనే పాలించారు. ఫ్రెంచ్ అనుకూల పాలకులను ప్రతిష్ఠించటానికి అందివచ్చిన ఏ అవకాశాన్నీ ఫ్రెంచ్ ప్రభుత్వం వదులుకోలేదు. పూర్వ వలస దేశాల పాలకుల వ్యక్తిగత భద్రతకు ఫ్రెంచ్ సైనికులను వినియోగించారు. ఆర్థిక వ్యవస్థకు కీలకమైన కరెన్సీని ఫ్రాన్స్ తన గుప్పిట్లో ఉంచుకున్నది. 14 పూర్వ ఆఫ్రికన్ వలస దేశాలు సీఎఫ్ఏ ఫ్రాంక్ను కరెన్సీగా వాడతాయి. దీనిని యూరోకు అనుసంధానం చేశారు. 2021 వరకు ఈ నోట్లను ఫ్రెంచ్ ట్రెజరీ ముద్రించేది. కరెన్సీ రిజర్వ్‌ను ఫ్రెంచ్ బ్యాంకులలో నిలువ చేస్తున్నారు. వడ్డీరేట్లు, ద్రవ్య విధానాన్ని ఫ్రాన్స్ తన నియంత్రణలో ఉంచుకున్నది. ఆర్థిక వ్యవస్థకు కీలకమైన మైనింగ్, రవాణా, కమ్యూనికేషన్ రంగాలను ఫ్రెంచ్ కంపెనీలు తమ గుత్తాధిపత్యంలో ఉంచుకొన్నాయి. 21 ఆఫ్రికన్ దేశాలు ఫ్రెంచ్ను అధికార భాషగా వాడుతున్నాయి. ముప్పై లక్షలకుపైగా ఆఫ్రికన్లు ఫ్రాన్స్‌లో నివసిస్తున్నారు.2020 తరువాత ఫ్రాన్స్ జోక్యానికి వ్యతిరేకంగా ఎదురుగాలి మొదలైంది. పెద్ద ఎత్తున యువత నిరసన ప్రదర్శనలు జరిగాయి. 2020–21లో మాలి, బుర్కినా ఫాసో, గినియాల్లో ఫ్రెంచ్ అనుకూల పాలకులను తిరుగుబాటుదారులు కూలదోశారు. 2022లో మాలి నుండి ఫ్రెంచ్ సైన్యాన్ని బహిష్కరించారు. 2023లో నైజర్, గాబన్ లలో తిరుగుబాటు తరువాత ఫ్రెంచ్ సైన్యాన్ని బహిష్కరించారు. 2024లో సెనెగల్, ఐవరీ కోస్ట్, ఛాద్ల నుండి ఫ్రెంచ్ సైన్యాన్ని ఉపసంహరించారు. ప్రస్తుతం ఎర్ర సముద్రం సమీపంలోని జిబూతిలో మాత్రమే ఫ్రెంచ్ తన సైనిక స్థావరాన్ని నిర్వహిస్తున్నది. పెరుగుతున్న చైనా ప్రభావంఆఫ్రికా నుండి ఫ్రాన్స్ నిష్క్రమణకు ఆఫ్రికాపై రష్యా, చైనా దృష్టిని సారించటమూ కారణమే. రష్యాకు చెందిన వాగ్నర్ గ్రూప్ (కిరాయి సైన్యం) ఆఫ్రికన్ దేశాలకు భద్రతా సహాయాన్ని ఇవ్వటా నికి ముందుకొచ్చింది. వాగ్నర్ నాయకుడి మరణం తరువాత ఈ సైన్యాన్ని ఆఫ్రికా కోర్గా పేరుమార్చి రష్యా నేరుగా తన నియంత్ర ణలోకి తీసుకున్నది. జిహాదీల అణచి వేత, అంతర్గత భద్రత, అధ్య క్షుల వ్యక్తిగత భద్రతలను మాలీ, నైజర్, గాబన్, ఛాద్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, బుర్కినా ఫోసోలలో పర్యవేక్షించటానికి రష్యా ఒప్పందాలను చేసుకున్నది. గనుల భద్రత కూడా రష్యన్ సైనికుల నియంత్రణలో ఉన్నది. ప్రతిగా ఈ దేశాలు బంగారాన్ని చెల్లిస్తున్నాయి. మాలి, బుర్కినా ఫోసోలోని బంగారం, నైజర్‌లోని యురేనియం, గినియాలోని బాక్సైట్ గనుల నుండి ఫ్రెంచ్‌కి చెందిన ఒరానో వంటి కంపెనీలు వైదొలగాల్సి వచ్చింది. ఇదే అదనుగా చైనా తన ఆర్థిక, వాణిజ్య సామ్రాజ్యాన్ని ఫ్రెంచ్ –ఆఫ్రికాలోనికి గత రెండు దశబ్దాలుగా విస్తరిస్తున్నది. ఫ్రెంచ్ ఫ్రాంక్ను కరెన్సీగా వాడుతున్న 14 ఆఫ్రికన్ దేశాలలో పది దేశాలకు ఇప్పుడు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. దొరాల (జిబూతి), కిర్చి (గినియా), అబిడ్జాన్ (ఐవరీ కోస్ట్), పాయింట్ నాయిర్ (కాంగో) రేవు పట్టణాలను చైనా అభివృద్ధి పరచింది. పది విమానా శ్రయాలు, పార్లమెంటు భవనాలు, స్టేడియాలను నిర్మించింది. ఫ్రెంచ్ కంపెనీలతో పోలిస్తే చైనా కంపెనీలు తక్కువ వడ్డీతో రుణాలు అందించాయి. హువే, జెడ్‌టీఈ వంటి చైనా కంపెనీలు సెనెగల్, ఐవరీ కోస్ట్, గాబన్, కామెరూన్లలో 4జీ/5జీ సేవలను అందిస్తున్నాయి. విద్యుత్ వాహనాలు, బ్యాటరీల తయారీకి అవసర మైన బాక్సైట్ (గినియా), కోబాల్ట్, రాగి(కాంగో), మాంగనీస్ (గాబన్)లతో పాటుగా యురేనియం (నైజర్), చమురు, గ్యాస్ (మారిటానియా)లను చైనా ప్రతిఫలంగా చౌకగా పొందు తున్నది.మనకో సువర్ణావకాశంభారత్కు కూడా ఫ్రాంకో ఆఫ్రికన్ ప్రాంతంలో ఆర్థిక, వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకోవటానికి ఇది మంచి తరుణం. చౌకైన, తేలికపాటి ఆయుధాలు, సైనిక శిక్షణ రంగాలలో ఈ దేశా లతో ఒప్పందాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూఎన్ శాంతి పరిరక్షణ బలగాలతో అనుభవం భారత్‌కు కలిసొచ్చే అంశం. సముద్ర జలాల పహారా, గస్తీలో కూడా భాగస్వామ్యానికి అవకాశాలున్నాయి. ఈ దేశాలలోని ఖనిజ వనరుల వెలికితీతలో భారత కంపెనీల పెట్టుబడులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. చైనా మాదిరిగా ఆ దేశాలను రుణ ఊబిలోకి నెట్టకుండా పరస్పర ప్రయో జనకరమైన ఉమ్మడి భాగస్వామ్యాలను ప్రతిపాదించటం వలన ఆ దేశాలు భారత్‌ను ఎంచుకోవటానికి అవకాశం ఉన్నది. ఫార్మాస్యూ టికల్స్ ఎగుమతితోపాటుగా, యూపీఐ, ఆధార్ సేవలను విస్తరింప జేయటానికి కూడా అవకాశం ఉన్నది. చైనా కంపెనీలు ఈ ప్రాంతంలో రెండు దశాబ్దాల నుండి పాతుకుపోయి ఉన్నాయి. ప్రాజెక్టులను అతి తక్కువ సమయంలో పూర్తి చేయటంలో అవి దిట్ట. మన ప్రైవేటు రంగ కంపెనీలు ఈ రేసులో పాల్గొంటే తప్పితే ఈ ప్రాంతంలో భారత్ నిలబడలేదు. పశ్చిమ ఆఫ్రికాకు నేరుగా సముద్ర రవాణా మార్గం లేకపోవటం భారత్‌కు ప్రతికూలాంశం.ఈ నేపథ్యంలో ఆఫ్రికాపై తన పట్టును వదులుకోవటానికి ఫ్రాన్స్ అంగీకరించదు. వలస మనస్తత్వాన్ని, యాజమాన్య ధోర ణిని వదలివేసి పూర్వ వలస దేశాలను సమానులుగా అంగీకరించి, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను కొనసాగించటం శ్రేయస్కరం. ఎర్ర సముద్ర భద్రతకు జిబూతి సైనిక స్థావరం, గినియా సింధు శాఖ భద్రతకు గాబన్ సైనిక స్థావరం కీలకం. ఫ్రాంకో ఆఫ్రికన్ దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసు కోకుండా యూరో పియన్ యూనియన్ ద్వారా ఈ ప్రాంతంలో ఆర్థిక, వాణిజ్య సంబంధాలను కొనసాగించటం ఫ్రాన్స్ ముందున్న మార్గం.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
ప్రశ్న రావణ్‌పై ఉపా కేసును వెంటనే ఎత్తివేయాలి : పౌరహక్కుల సంఘం
ప్రజాస్వామిక వ్యవస్థలో బలమైన నాలుగు వ్యవస్థలున్న నేపథ్యంలో మూడు వ్యవస్థలు దిగజారిపోయి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ఉన్నాయి. నాలుగవ స్తంభమైన పత్రికా స్వేచ్ఛ కనీసంగానైనా సోషల్ మీడియా పరంగా యూట్యూబ్‌లతో ప్రజల విశ్వాసంలో ఉన్నది. నేషనల్ మీడియా రాష్ట్రాల పత్రికలన్ని కూడా అధికార పార్టీల కనుసన్నల్లో వార్తను బంధీ చేసి ఉన్నాయి. గతంలో చేగువేరతో ప్రారంభమైన పవన్ కళ్యాణ్ ఎక్కడ తేలాడో మనందరికి తెలుసు. అతని మాటలకు, ఆచరణకు చాలా వ్యత్యాసం కనబడింది. చివరికి తాను మాట్లాడిన అప్రజాస్వామిక పదజాలాన్ని ప్రశ్నా రావణ్ అనుకరించడం నాలుగు పోలీస్ స్టేషన్లలో బెయిల్ తో విడుదలైన తరువాత ఐదవ పోలీస్ స్టేషన్లో అప్రజాస్వామిక నిర్బంధ చట్టమైన ఉపా చట్టంతో అతనిని నిర్బందానికి గురి చేశారు. గతంలో టాడా, పోటా, నేపథ్యాల నుంచే ఉపా చట్టం వచ్చిన తరువాత ఉపా ఎంతగా ప్రశ్నించే గొంతులపై అణచివేతను, నిర్బంధాన్ని అమలు చేస్తున్నదో 2018 భీమాకొరెగావ్ ఉపా కుట్ర కేసు నుంచి మనందరికి అర్థమవుతున్న విషయం. కేవలం బెయిల్ దొరకకుండా ఆ ప్రశ్నను, ఆ నిరసన గొంతును నిశ్శబ్దం చేయడం కోసం పాలక వర్గాలు అనుసరిస్తున్న బలమైన అణచివేత విధానంగా పౌర హక్కుల సంఘం భావిస్తున్నది. అందులో భాగంగానే 84 ఏండ్ల ఫాదర్ స్టాన్ స్వామి జార్ఖండ్ లోని ఆదివాసీల కోసం న్యాయ స్థానంలో చట్టపరంగా బలమైన పోరాటాలు నిర్వహించినందుకు ఆగ్రహించిన ప్రభుత్వం జైలులోనే హత్య చేసింది. అదే విధంగా 90 శాతం వికలాంగుడైన ప్రొ. సాయిబాబా కూడా ఆదివాసీల పక్షాన మాట్లాడినందుకు ప్రశ్నించినందుకు అక్రమ కేసులో అన్యాయమైన శిక్షతో 10 ఏండ్లపాటు జైలు నిర్బంధానికి గురి చేస్తే అతను కూడా మరణించడం జరిగింది. ఇలా పీడిత ప్రజల పక్షాన ఆదివాసీల పక్షాన అణగారిన వర్గాల పక్షాన నేడు బుద్ధిజీవులు మేధావులతో పాటు య్యూట్యూబర్లు కూడా తమ ఛానెళ్ళ ద్వారా ప్రజలకు ప్రశ్నించడం నేర్పుతున్నారు. ఆ నేర్పడంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ అన్న మాటలను పునరుచ్చరణ చేసినందుకు అదే నేరంగా వరుసగా కేసులు నమోదు చేశారు. నమోదు చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్ లో ఉన్న ప్రశ్నారావణపై, న్యాయస్థానానికి తరలిస్తున్నప్పుడు పోలీస్ స్టేషన్లో గోడలు దూకి మరీ ప్రశ్నారావణపై భౌతిక దాడికి జనసేన కార్యకర్తలు పాల్పడ్డారు. జనసైనికులు, చట్టవిరుద్ధంగా వ్యవహరించడ మంటేనే పవన్ కళ్యాణ్ బాధ్యతపడాల్సిన అవసరం ఉంది.అదే మాదిరిగా ఈ నెల ఒకటిన మరో జర్నలిస్టు కె. వి. ఆర్. ఇంటి మీద దాడి చేసి ఎపి పోలీసులు అమాంతంగా ఎత్తుకు పోయారు. పోలీసులకు హద్దులు పరిమితులు పని చేయవు. పేదలకు అన్యాయం జరిగినపుడు పోలీసు స్టేషన్ కెళితే మా పరిధి కాని హింసించిన ఉదాహరణలెన్నో ఉన్నాయి. కె.వి.ఆర్. ను ఎత్తుకు పోవడానికి ముందు మఫ్టీలో వున్న ఎపి పోలీసులు రెక్కి నిర్వహించారు. మీరెవరు నా భర్తను ఎందుకు తీసుకు పోతున్నారని అడుగితే, నేను కూడా నా భర్త వెంబడి వస్తానంటే ఆమెను లాగిపడేశారు. పైగా భాగ్యలక్ష్మీపై కూడా పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. అరెస్టు చేస్తున్న సందర్భంలో కుటుంబీకులుకు తెలియజేసే చట్టబద్దమైన బాధ్యత పోలీసులపై వుంది. పోలీసులకు చట్టాన్ని బేఖాతరు చేయమని పాలకులు మౌఖిక ఆదేశాలిస్తున్నారు. ఈ అరెస్టులకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి.వాక్ సభా స్వాతంత్ర్యాలకు రాష్ట్రంలో తీవ్ర విఘాతం కలుగుతుంది. గొంతు విప్పి మాట్లాడితే నేరం అవుతుంది. అంత్యక్రియల్లో మాట్లాడిన గాదె ఇన్నయ్యను జైలుపాలు చేసి 8 నెలలుగా బెయిలు లేకుండా నిర్బంధించారు.ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అన్నీ వ్యవస్థలను ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నది. అప్రజాస్వామిక విధానాలకు అలవాటు పడిన ప్రభుత్వాలు వ్యక్తులు పత్రికా స్వేచ్ఛను గౌరవించడం ఇబ్బందిగా ఫీలవుతారు. ఆ నేపథ్యంలోనే ప్రశ్నారావణపై చట్టపరంగా పోరాటం చేయాల్సిన స్థితి కాకుండా అక్రమ ఉపా కేసులు నమోదు చేసి భౌతిక దాడులకు పాల్పడడం అదే విధంగా కేసులు చేస్తున్న జడ శ్రావణపై కూడా కేసులు నమోదు చేస్తామని ప్రకటించడం లాంటివన్నీ కూడా ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్యలుగా పౌరహక్కుల సంఘం భావిస్తూ ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి ప్రభుత్వాలలో పాలకులుగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు నిబద్ధతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు రాజకీయ పార్టీలే రాజ్యాంగాన్ని పాటించకపోతే ప్రజలు మాత్రం ఎందుకు పాటించాలనే ఒక మౌళిక ప్రశ్న బలల్దేరుతుంది. అది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రశ్నారావణ్ పై కూటమి ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా నమోదు చేసిన ఉపా కేసుతో పాటు అన్ని కేసులను బేషరతుగా ఎత్తివేసి అతన్ని వెంటనే విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది.తెలంగాణలో కూడా గత కొద్ది నెలల క్రితం కొన్ని య్యూట్యూబ్ ఛానెల్‌లపై ఎన్.ఐ.ఎ. తరహా నిర్బంధాలు బలంగానే కొనసాగాయి. ఆ నిర్బంధాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు దీనికి సంబంధం లేనట్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయి. కానీ శాంతి భద్రతలనేవి కేవలం రాష్ట్రానికి సంబంధించినదే, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తూ య్యూట్యూబ్ ఛానెల్‌ల పట్ల పత్రికల పట్ల ప్రజాస్వామ్యబద్ధమైన వైఖరితో తమ పాలన కొనసాగించాలి. కనిపించ కుండా నిర్బంధాన్ని కొనసాగిస్తున్న అన్ని పత్రికలపై య్యూట్యూబ్లపై ఆ నిర్బంధాన్ని ఉపసంహరించుకొని పత్రికా స్వేచ్ఛను కాపాడగలిగితేనేకనీసంగానైనా ప్రజాస్వామ్యం నిలబడు తుంది. లేకపోతే నిర్బంధమే రాజ్యమేలుతూ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తుంది. అప్పుడు ప్రజల దగ్గరకి ప్రజాస్వామ్య విలువల కోసం వెళ్ళడానికి మీకు అవకాశం ఉండదు. కాబట్టి పత్రికలపై య్యూట్యూబ్ ఛానెళ్ళపై నమోదు చేసిన అన్ని అక్రమ కేసులను ఎత్తివేయాల్సిందిగా ప్రభుత్వాలను పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది.పౌరహక్కుల సంఘం (CLC) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రొ. గడ్డం లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్షులు, ఎన్. నారాయణ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బాల కృష్ణ, సహాయ కార్యదర్శి, -
విధానాల్లో శాస్త్రీయత ఉంటోందా?
ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల నూతన ఎలక్ట్రిక్ వాహనాల విధానాన్ని ప్రకటించింది. వీధుల్లో వాయు నాణ్యతను మెరుగుపర చేందుకు పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాల వాడకాన్ని పూర్తిగా దశలవారీగా రద్దు చేయనున్నట్లు వెల్లడించింది. ఆల్కహాల్ మోతాదు తక్కువగా ఉన్న లిక్కర్ పానీయాలపై పన్నులను తగ్గించనున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. మత్తు పానీయాల నుంచి ప్రజానీకాన్ని దూరం చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడగలదని కేరళ భావిస్తోంది. ఇక పశ్చిమ బెంగాల్లో మధ్యాహ్న భోజన పథకం కింద పెడుతున్న వాటిలో కోడి గుడ్ల స్థానంలో శాకాహార ప్రొటీన్లను ప్రవేశపెడుతూ అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు, పెట్రోల్‌లో ఇథనాల్ మోతాదును క్రమేపీ పెంచే విధానాలపై తీవ్ర తర్జనభర్జనలు సాగుతున్నాయి. కానీ విధానాలు ఆయా లక్ష్యాలను సాధించాలంటే అవి సమాజ అవసరాలతోపాటు శాస్త్రీయ ఆధారాలను ప్రాతిపదిక చేసుకోవాలి.అసలు కాలుష్య చిత్రంఢిల్లీ ఎలక్ట్రిక్ వాహనాల విధానం ద్వి, త్రిచక్ర వాహనాలపైనే దృష్టి కేంద్రీకరించింది. వచ్చే 2028 ఏప్రిల్ నుంచి ఎలక్ట్రిక్ టూవీలర్ల, 2027 జూలై నుంచి ఎలక్ట్రిక్ త్రీవీలర్ల రిజిస్ట్రేషన్లను మాత్రమే ఆమోదిస్తామని ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. ఢిల్లీలో మొత్తం వాహనాలు 1.3 కోట్ల మేరకు ఉంటే, అందులో టూవీలర్లు 62 శాతం, కార్లు 32 శాతం. దీన్నిబట్టి, టూవీలర్ల వాడకాన్ని దశల వారీగా పూర్తిగా నిషేధించాలన్న ప్రభుత్వ నూతన విధానంలో హేతుబద్ధత కనిపిస్తుంది. కానీ, అది పూర్తి చిత్రాన్ని రూపుకట్టించే వాస్తవం కాదు. ఢిల్లీలోని మొత్తం వాహనాల్లో టూవీలర్లు 62 శాతం మేర ఉంటే ఉండవచ్చుగానీ, ట్రాన్స్‌పోర్టేషన్ సంబంధిత ధూళికణాల (పీఎం2.5) విడుదలలో వాటి వాటా 15 శాతమే. ఢిల్లోలోని వాహనాల్లో తేలిక, భారీ రకం వాణిజ్య వాహనాలు 3 శాతంకన్నా తక్కువే ఉండ వచ్చుగానీ, ఈ ఉద్గారాలలో వాటి వాటా 39 శాతం. బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్‌కు చెందిన గుఫ్రాన్ బేగ్ 2025లో ప్రచురించిన విధాన సంక్షిప్త పత్రంలో అటు వంటి విశేషాలు దాగున్నాయి. దాన్ని పరిశీలిస్తే, వాణిజ్య వాహనాలు, బస్సుల ఉద్గారాల సమస్యను పరిష్కరించడం ద్వారానే పర్యావరణానికీ, మానవ ఆరోగ్యానికీ ఎక్కువ మేలు చేకూరగలదని అర్థమవుతుంది. ఎలక్ట్రిక్ టూవీలర్ల వాడకం పర్యావరణానికి ప్రయోజనదాయకమేకానీ, ప్రభుత్వ విధానాలు మొదట అత్యంత కలుషితదాయకమైన విభాగాలపై దృష్టి పెట్టాలి. పర్యావరణానికి సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘం ఒకటి 2025 డిసెంబర్లో ఢిల్లీ వాయు కాలుష్యాన్ని కూడా పరిశీలించింది. విధానపరమైన దృక్పథం ముక్కచెక్కలుగా ఉండకూడదని అది హెచ్చరించింది. రాష్ట్ర స్థాయి బదులు ఒక భౌగోళిక ప్రాంత స్థాయిలో చర్యలు చేపట్టాలని సిఫార్సు చేసింది. ఆ వైఖరి లోపించి నపుడు, ఢిల్లీ ఈవీలవైపు మళ్ళినా ఒనగూడే పర్యావరణపరమైన ప్రయోజనాలు పెద్దగా ఉండవు. కాలుష్య కారక వాహనాలు ఢిల్లీ చుట్టుపక్కలనున్న రాష్ట్రాలకు వచ్చి ఆ మొత్తం భౌగోళిక ప్రాంత ఉద్గారాలకు తమవంతు వాటాను జోడిస్తూనే ఉంటాయి. ఏదైనా తగని మోతాదే!దేశంలోకెల్లా మద్యపాన వినియోగం కేరళలోనే ఎక్కువ. ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించడానికి, ఆల్కహాల్ మోతాదు తక్కువగా ఉన్న పానీయాలపై పన్ను తగ్గించాలనీ, తద్వారా వీటి వినియోగాన్ని పెంపొందించినట్లు అవుతుందనీ కేరళ ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ, ఆల్కహాల్ మోతాదు తక్కువగా ఉన్న పానీయాల వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనం ఏమైనా ఉందా అని కేరళ ప్రభుత్వం కొద్దిగా కూడా దృష్టి సారించినట్లు లేదు. మొదటగా, ఆల్కహాల్ వినియోగానికి సురక్షితమైన పరిమితులంటూ ఏవీ లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. గుండెకు రెడ్ వైన్ మంచిదనే అభిప్రాయం కూడా అపోహ మాత్రమేనని వెల్లడించింది. కనుక, పన్నుల విధానాలు ఆల్కహాల్ మోతాదు తక్కువ లేదా ఎక్కువ అనే తేడా చూపనవసరం లేదు. పైగా, ఆల్కహాల్ మోతాదు తక్కువగా ఉన్న పానీయాలను చౌకగా మారిస్తే, మొత్తం మీద లిక్కర్ వినియోగం పెరగడానికి తలుపులు తెరిచినట్లు అవుతుంది. ఈ పానీయాలు తేలిగ్గా అందుబాటులో ఉండటం వల్ల మైనర్లు తప్పుదారి పట్టవచ్చు. వారు క్రమంగా మద్యపానం వైపు మళ్ళవచ్చు. లైట్ సిగరెట్లు, హుక్కా, ఇ–సిగరెట్లు అంటూ పొగాకు పరిశ్రమ విషయంలో కూడా అలాగే చేశారు. లిక్కర్ కంపెనీలు తమ హార్డ్ లిక్కర్ బ్రాండ్లను మార్కెట్ చేసుకునేందుకు లో–ఆల్కహాల్ ఉత్పత్తుల వినియోగాన్ని ఒక ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. మైలేజీ ఉంటుందా?మరో ప్రభుత్వ ప్రధాన విధాన విషయంలో కూడా ఆల్కహాల్ కేంద్ర బిందువుగా మారింది. పెట్రోల్‌లో ఇథనాల్ కలపడానికి సంబంధించి చర్చలు సాగుతున్నాయి. ఇంధన భద్రత, విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఆదా చేయడం నుంచి రైతుల సంక్షేమం వరకు ఈ విధానం వల్ల ఒనగూడే ప్రయోజనాల గురించి తెగ చెప్పు కొస్తున్నారు. మరోపక్క వాహనాల యజమానులు తమ ఇంజిన్లు దెబ్బతింటున్నాయనీ, మైలేజి పడిపోతోందనీ ఫిర్యాదు చేస్తున్నారు. కార్ల తయారీ సంస్థలు అంగీకరిస్తున్నట్లుగా ఇథనాల్ మిళిత ఇంధ నాల వల్ల కార్ల మైలేజీ తగ్గుతూ, వాహనాల యజమానులు చెబు తున్నట్లుగా ఇంజిన్లు దెబ్బతింటూంటే మొత్తంమీద ఆర్థిక వ్యయాలు పెరుగుతాయేగానీ, తగ్గవు. రైతులు ఆహార పంటల నుంచి నీరు ఎక్కువ అవసరమైన చెరకు వంటి పంటలవైపు మళ్లితే, ఆహార భద్రతపై ప్రభావం చూపుతుందని వ్యవసాయ, ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిమాండ్ కాలంలో ఇథనాల్ కంపెనీలు మొక్క జొన్న, వరిని కూడా ఉపయోగించుకుంటాయి. మధ్యాహ్న భోజన పథకంలో కోడి గుడ్లను తొలగించాలన్న పశ్చిమ బెంగాల్ నిర్ణయం శాస్త్రీయ ఆధారాల ముందు తేలిపోతుంది. అవి నాణ్యమైన ప్రొటీన్ అందిస్తాయనీ, కనుక వాటిని ఆహారంలో చేర్చాలనీ పౌష్ఠికాహారవేత్తలు దశాబ్దాలుగా చెబుతు న్నారు. ఆహారానికి బలం చేకూరే విధంగా పన్నీరు, కాయధాన్యా లతోపాటు గుడ్లను కూడా పెట్టాలని హితవు పలుకుతున్నారు. హైదరాబాద్‌లోని జాతీయ పౌష్ఠికాహార సంస్థ 2024 నాటి పోషణ మార్గదర్శకాలు కూడా అదే విషయాన్ని బలపరుస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు విశ్వసనీయమైన, ప్రాధాన్యం కలిగిన శాస్త్రీయ ఆధారాలను ఆలంబనగా చేసుకుని రూపొందాలేగానీ, స్వల్పకాలిక లాభాలను, సంకుచిత రాజకీయ, వ్యాపార లేదా సైద్ధాంతిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నవి కాకూడదు. విధాన నిర్ణేతలు తమ వాదనలకు బలంగా ఇప్పటికే ఉన్న ఆధారా లను ఉపయోగించుకోవచ్చు లేదా నూతన పరిశోధనలను నిర్వహించవచ్చు. నూతన ఆధారాలు అందుబాటులోకి వచ్చే కొద్దీ విధానా లను సమీక్షించుకోవాలి. పరస్పరం ముడిపడి ఉన్న అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రజారోగ్యం, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థను పణంగా పెడుతున్నామని గుర్తెరగాలి.దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
లక్షన్నర ఇచ్చి మొదలుపెట్టారు!
2004 జూలై 8.ఆ రోజున అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి స్వయంగా లక్షన్నర రూపాయలను చెక్కు ద్వారా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్ కందాకి సమర్పించారు. ఇందులో దురుద్దేశం లేదు, దురాశా లేదు. ‘ఒక మంచి కార్యం జరగాలని తాను ఆశిస్తున్నప్పుడు, అందులో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నప్పుడు నాయకుడన్నవాడు తానే ముందుండి నడిపించాలి. నడిపించటం అంటే కేవలం నినాదాలిచ్చి, ప్రకటనలిచ్చి, ‘పదండి ముందుకు’ అనటం కాదయ్యా. తానే ముందు చెయ్యివేసి, ‘ఇలా చేయండయ్యా’ అని చూపించాలి...’ అన్నారు వైఎస్ ఆ చెక్కు నేను తయారు చేస్తున్నప్పుడు.2004 మేలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పడేనాటికి రాష్ట్ర ఖజానా ఖాళీగా వుంది. అంతకుముందు ఒకటి రెండు సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వం అనేకసార్లు ‘వేస్ అండ్ మీన్స్’ కింద ఓవర్ డ్రాఫ్టులు తీసుకుని ఈ వ్యవస్థని నిర్వహించాల్సి వచ్చింది. ఆ నేపథ్యంలో వైఎస్సార్ అధికారంలోకి వచ్చారు. పాద యాత్రలో పల్లె ప్రాంతాల్లోని పేదలు రకరకాల వ్యాధుల బారిన పడినప్పుడు, ఆర్థిక స్థోమత లేక వాళ్లు తగిన చికిత్సలు పొందలేక ప్రాణాలు కోల్పోతున్న దుఃస్థితిని చూసి ఆయన చలించిపోయారు. అధికారంలోకి రాగానే ‘మన ప్రభుత్వం’ వాళ్ల కోసం పెద్ద ఎత్తున సాయం చేయగలగాలి అనుకున్నారు. (ప్రతిపక్ష నాయకుడిగా వున్న ప్పుడు కూడా ఆయనకి నేను వ్యక్తిగత సహాయకుడిగా వున్నాను.)అధికారంలోకి వచ్చాక, ఈ విషయం మీద ఆయన విచారిస్తే, ప్రభుత్వానికి అప్పట్లో వున్న ఒకే ఒక అవకాశం ‘ముఖ్యమంత్రి సహాయనిధి’ (సీఎంఆర్ఎఫ్). కానీ అందులో నిధులు ఖాళీ. తాను అనుకున్న దిశగా దయనీయ స్థితిలో వున్న సామాన్యులకు సహాయం అందించాలంటే, ఈ సీఎంఆర్ఎఫ్ని పటిష్ఠం చేయటమే మార్గం అనుకున్నారు. అందుకోసం ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తేనే ఈ నిధిని బలపర్చటం సులభమవుతుంది. ప్రజల్లో సంపన్నులు చాలా మంది ఉన్నారు. ‘వాళ్లని అడిగేముందు, నేను చేసి చూపిస్తేనే, వాళ్లని అడిగే నైతిక హక్కు వస్తుంది శర్మా... ఒక పని చెయ్యి. లక్షన్నర రూపాయలకి ఒక చెక్కు నేనే ఈ సీఎంఆర్ఎఫ్కి విరాళంగా ఇస్తాను. చీఫ్ సెక్రటరీగారికి చెప్పి, టైమ్ నిర్ణయించి చెప్పు నాకు’ అన్నారు.అలాగే సీఎస్ మోహన్ కందా గారితో చెప్పి, సమయం తీసుకున్నాను. అది 2004 జూలై 8. డాక్టర్ వైఎస్సార్ లక్షన్నర రూపాయల చెక్కుని చీఫ్ సెక్రటరీ మోహన్ కందా గారికి అంద జేశారు. ఆ రోజే సీఎంఆర్ఎఫ్కి ఉదారంగా విరాళాలివ్వాలని ప్రజ లకు విజ్ఞప్తి చేశారు. ‘సీఎంని కలిసేవాళ్లు పూలగుత్తులు ఇవ్వాలను కుంటే, వాటి బదులు సీఎంఆర్ఎఫ్కి చెక్కులు ఇవ్వాలని సీఎం కోరు తున్నారు’ అని సీఎం కార్యాలయం ప్రకటించింది. పెద్ద మొత్తాల్ని ఇచ్చేవాళ్లు స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి చెక్కు సమర్పించే అవకాశం కల్పిస్తామని ప్రకటించాం.అక్కడ్నుంచి రోజూ మధ్యాహ్నం సమయంలో సీఎంని కలిసి విరాళాల చెక్కులివ్వాలని పెద్ద పెద్దవాళ్లు రావటం మొదలైంది. విరాళాలు తెచ్చేవాళ్లకి ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని సెక్రెటేరియేట్ సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశాలు పంపించాం.మొదటి 3–4 రోజులపాటు రోజుకి 5–10 మందే వచ్చారు. వచ్చి సీఎంకి చెక్కులిచ్చి ఫొటోలు దిగేవాళ్లు. పెద్ద మొత్తాలిచ్చిన వాళ్ల ఫొటోలు పత్రికల్లో వచ్చేవి. ఏ రోజు విరాళం ఎంత వచ్చిందో సమాచారశాఖ ద్వారా ప్రచారంలో పెట్టాం. దాంతో ఒకవారం గడిచే సరికి ఈ విరాళాలు తెచ్చేవాళ్లు వెల్లువలా రావటం మొదలైంది. రోజుకి 100–150–200... వీళ్లందరికీ విజిటర్స్ హాల్సు సరిపోక, సమావేశం హాలులో కూర్చోపెట్టాల్సి వచ్చింది. సీఎం స్వయంగా తనే అక్కడికి వెళ్లి విరాళాలు తీసుకోసాగారు.పరిమితులు, అవాంతరాలు దాటి...సీఎం క్యాంప్ ఆఫీసు ముందు కార్ పార్కింగు ఉండేది. అక్కడ సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల పరిశీలన కౌంటర్ ఏర్పాటు చేశారు. దారిద్య్రరేఖకి దిగువనున్న (తెల్లరేషన్ కార్డులేని) వాళ్లకి ఈ సహాయం కావల్సి వస్తే అక్కడికి వచ్చేవారు. సీఎంఆర్ఎఫ్ సహా యానికి రూ. 35,000 పరిమితి వుండేది. ఏవైనా న్యాయమైన కేసుల్లో సహాయం 35,000 కన్నా ఎక్కువ కావల్సివస్తే, హాస్పిటల్‌కి ఫోన్ చేయించి, ‘బిల్లులో రాయితీ ఇమ్మని సీఎం కోరుతున్నారు’ అని రాయితీ ఇప్పించేవారు. ఆ అవకాశం లేనిచోట (5 నుంచి 10, 15 వేల దాకా అదనంగా కావల్సివస్తోందనకున్నప్పుడు) అది తానే పి.ఎస్. కిరణ్‌కుమార్ రెడ్డి ద్వారా ఏర్పాటు చేసేవారు.అలాంటి సమయంలోనే పుట్టుకతో హృద్రోగాలు, తదితర జన్యువ్యాధులకు గురయ్యే పిల్లల కోసం కూడా ఏదో చేయాలి అనిపించింది ముఖ్యమంత్రికి. అందుకని, ముఖ్యమంత్రి పిల్లల సహాయనిధి (సీఎంసీఆర్ఎఫ్) ప్రారంభించారు (ఈ నిధులకి ప్రభుత్వ బడ్జెట్ వుండదు). అయితే ఇలా సహాయనిధి కోసం దీర్ఘకాలంలో విరాళాలు సేకరించటం కష్టం అని అధికారులు సీఎంకి చెబుతూ వచ్చారు. ఆయన మొదట్లో పట్టించుకోలేదు. కానీ క్రమంగా వాళ్ల సలహాలో ఔచిత్యాన్ని గుర్తించారు. అప్పుడే కర్ణా టకలో రైతుకూలీల కోసం ఆరోగ్య బీమా నిర్వహిస్తున్న ‘నారాయణ హృదయాలయ’ సంస్థతో సంప్రదింపులు జరిపారు. రెండు మూడు సార్లు సమావేశాలు జరిగాయి.‘నాకు ఆరోగ్య బీమా – సామాన్య ప్రజలందరి కోసం కావాలి. చేయగలరా?’ అని అడిగారు. వాళ్లు ఆలోచనలో పడ్డారు. కానీ వైఎస్ ఆగలేదు. ‘ఇది జరిగి తీరాలి సుబ్రహ్మణ్యం’ అన్నారు. సుబ్ర హ్మణ్యం సీఎంఓలో వైద్య ఆరోగ్యశాఖ చూస్తున్న కార్యదర్శి. అప్పటి ఆరోగ్య వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ ఐ.వి. సుబ్బారావు ముఖ్యమంత్రి ఆరాటాన్ని అర్థం చేసుకున్నారు. బీమా కంపెనీలతో చాలా మీటింగులు సీఎం సమక్షంలో జరిపారు. అలా వైఎస్ పట్టు దలగా, అనేక అభ్యంతరాలు, అవాంతరాలు దాటి ప్రవేశపెట్టిన పథకమే రాజీవ్ ఆరోగ్యశ్రీ.చదవండి: అమృతం కురిసిన రోజు2007 ఏప్రిల్ నుంచి 2009 మే వరకూ ఈ పథకం కింద 15,58,828 మంది ఉచిత వైద్య పరీక్షల లబ్ధి పొందారు. వీళ్లల్లో 2,63,897 మందికి ఉచిత సర్జరీలు, ఇతర చికిత్సలు లభించాయి. 2,70,061 మంది అవుట్ పేషెంట్లుగా వైద్యసేవలు పొందారు. ‘ఆరోగ్యశ్రీ’ వల్ల ఉచితంగా గుండె ఆపరేషనో, కిడ్నీ ఆపరేషనో, మరో మరో ఆపరేషనో చేయించుకోగలిగి, ఆనందంగా జీవిస్తున్న ఏ ఒక్కరి ముందు వైఎస్సార్ పేరు ప్రస్తావించినా, రెండు చేతులూ జోడించి, నమస్కరిస్తారు. ఆ కళ్లు ఇప్పటికీ చెమరుస్తాయి.ఒక మంచి పని కోసం ఒక్క వ్యక్తి తపన, ఆరాటం ఎంత గొప్ప వ్యవస్థని నిర్మించింది!– టి. భాస్కర శర్మ ముఖ్యమంత్రికి పూర్వపు అడిషనల్ పి.ఎస్. -
అమృతం కురిసిన రోజు
‘కోటికి ఒకరే పుడతారు పుణ్య మూర్తులు’ అన్నారు. అలా జనించిన వారు సమాజానికి వెలుగిస్తారు. అందరి జీవితాలలో సంతోషాన్ని వెలిగిస్తారు. జనం గుండెల్లో సజీవులై ఉంటారు. అలాంటి మహామనుషులలో అతి ముఖ్యుడు డా‘‘ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన 1949 జూలై 8న ఈ లోకంలో అడుగుపెట్టాడు. ఆయన మన మధ్య లేక పోయినా ఆయన జన్మదినాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలవారూ ఓ పండుగలా జరుపుకొంటున్నారు. ఆయన చిత్రపటానికి పాలాభిషే కాలు, పూలాభిషేకాలు ఇంకా చేస్తున్నారు అంటే ఆయన ఎంత మేలు చేశారో, ఎన్ని ప్రాణాలు నిలిపారో లెక్కేయడం కష్టం. ఈ మధ్య చంద్రబాబు సమక్షంలో ‘నేను ఇంకా జీవించి ఉండటానికి కారణం రాజశేఖరరెడ్డిగారు, ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ’ అని ఓ మహిళ ధైర్యంగా ప్రకటించింది. అందుకే ఆయన దేవుడయ్యాడు. వైద్య విద్య పూర్తయిన తరువాత ఆస్పత్రి పెట్టి ఒక రూపాయికే వైద్యం చేశాడు. అందుకే ఆయన్ని జనం ‘రూపాయి డాక్టరు’గా పిలుచుకున్నారు. ప్రజలకు కేవలం వైద్యం అందిస్తే చాలదు, ఇంకా అనేక విషయాలలో వారికి సేవలు అందాలంటే శాసనం చేసే అధికారం ఉండాలని భావించాడు. అందుకే రాజకీయ రంగప్రవేశం చేశాడు. తన వ్యక్తిత్వం, నిజాయితీ నిలుపుకొంటూనే ముందుకు సాగాడు. ఆరుసార్లు శాసనసభ్యుడిగా, నాలుగుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక అయిన తిరుగులేని నాయకుడాయన.పాదయాత్రలతో చరిత్ర33 సంవత్సరాల అతి చిన్న వయసులోనే ఆయన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. 1985 నుంచి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఉపనాయకుడుగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ప్రజల కోసం చేసిన పోరాటాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఓ సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావును సెక్రటేరియట్ ముందు నడిరోడ్డులో నిలువరించాడు. ఆ తెగువ చూసి రాష్ట్రం ముక్కున వేలేసుకుంది. ఇతను కదా నాయకుడు అనుకుంది. రామారావు సైతం ఆంతరంగికుల ముందు రాజశేఖరరెడ్డిని మెచ్చుకున్నారట. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్ర బాబు ఆనాడు విద్యుత్ చార్జీలు పెంచితే దాన్ని వ్యతిరేకిస్తూ 90 మంది శాసనసభ్యులతో కలిసి ఆ రోజుల్లో నిరాహార దీక్షచేశాడు. రైతులను రక్షించడానికి వారికి ఉచిత విద్యుత్తు అందించాలన్న ఆలోచన ఆయనకు ఆనాడే వచ్చిందేమో!రాయలసీమ ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించే పోతి రెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కెనాల్ సామర్థ్యం పెంచాలని 1986లో 22 రోజులు పాదయాత్ర చేశాడు వైఎస్. ఆ తరువాత ముఖ్యమంత్రిగా ఆ కెనాల్ సామర్థ్యం పెంచాడు. పాదయాత్రలో సెక్యూరిటీ, సౌకర్యాలు, భోజనం – ఏవీ పట్టించుకునేవాడు కాదు. కొన్నిసార్లు నేరుగా పొలాల్లోకో, ఎదురుగా ఉన్న గుడిసెలోకో హఠాత్తుగా వెళ్ళి పోయేవాడు. వారి మాటలు వినేవాడు. కష్టం తెలుసుకునేవాడు. 2003లో వైఎస్సార్ చేసిన సుదీర్ఘ పాదయాత్ర ఓ సువర్ణా ధ్యాయానికి ఆరంభం. చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు 1,673 కిలోమీటర్లు 67 రోజుల పాటు నడిచి, ప్రజల మధ్య నిలిచాడు. ఆయన వెంట ఉన్న మాకు అనుక్షణం ఓ కొత్త అనుభవం. నడి ఎండలో నడుస్తూ కూడా ఆయన ఆలోచించింది తనవారి కోసం, తన ప్రజల కోసం. తాను తినడానికి ముందు భోజనం అందరికీ అందిందా అని చూసేవాడు. అందరి మధ్యలోనే పడుకునేవారు. ఏసీ గదులు ఉన్నాయని చెప్పినా వారించేవాడు. పాదయాత్రలో ఆయన పరిష్కరించిన సమస్యలపై ఓ పెద్ద పుస్తకం రాయచ్చు. పాదయాత్ర మధ్య దశలో ఆయన ఆరోగ్యం క్షీణించింది. అయినా లెక్క చేయలేదు. నాలుగు రోజుల విశ్రాంతి తర్వాత తిరిగి కదిలాడు. వైద్యులు వారించారు. నేనూ వైద్యుడినే అన్న విషయం మరచి పోతున్నారు అన్నాడు చిరునవ్వుతో! పథకాలే పతకాలుగా...2004 ఎన్నికలలో ప్రజలు ఆయనకు అఖండ మెజారిటీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన ఒక స్వర్ణయుగం. ఒక విప్లవం. ఒక మార్పు, ఒక భరోసా, ఒక కదలిక. అన్ని రాష్ట్రాలు ఆరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూశాయి. ఒక మంచి మనిషి అధికారంలోకి వస్తే ఇన్ని మంచి పనులు చేయవచ్చా అని ఆశ్చర్యపోయాయి. ఉచిత కరెంటు అందింది. పేదల ఇంటి ముందుకు ఆరోగ్యశ్రీ వచ్చి కొన్ని లక్షల ప్రాణాలు నిలిచాయి. ఆయన చిత్రపటాన్ని ఇంటిలో పెట్టుకున్నారు. పేద విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్య అందింది. లక్షలాది మంది పేద విద్యార్థులు విద్యావంతులై లక్షలు సంపాదిస్తున్నారు. ‘జలయజ్ఞం’తో రైతుల ముఖం నిండా ఆనందం. హింసావాదాన్ని వీడి ప్రజలలో కలవండి అని అభ్యర్థిస్తూ నక్సలైట్లతో చర్చలు కూడా జరిపారు. శాంతిమయ రాష్ట్రాన్ని స్వప్నించిన మహాస్వాప్నికుడు ఆయన. తిరుమల శ్రీవేంక టేశ్వర స్వామి వారి అఖండ వైభవ ప్రచారానికి అంతులేని కృషి, కార్యక్రమాలు చేసి శ్రీనివాస ప్రభువు పల్లకీ మోసి, పల్లె పల్లెకు తీసుకువెళ్ళిన హైందవ ధర్మ సేవకుడాయన. శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ స్థాపకుడు. ‘కల్యాణమస్తు’ అన్న కరుణామూర్తి. మహా విషాదం2009 ఎన్నికలలో తిరిగి అధికారంలోకి వచ్చారు. కానీ అను కోని పరిణామం ఆయనను మనకు దూరం చేసింది. ఓ నాయకుని కోసం కొన్ని వందల మంది ఆత్మార్పణ చేసుకోవడం కనీ వినీ ఎరు గని మహావిషాదం. ఇలాంటి అద్భుత వ్యక్తి హితుడు, స్నేహితుడు, గురువు అయినందుకు నాకు ఆనందం, గర్వం. ఆయనతో గడిపిన ప్రతిక్షణమూ నాకు కొత్త పాఠం. నా తప్పులు దిద్దాడు. నా చేయి పట్టి నడిపాడు. ‘కరుణా’ అంటూ ప్రేమగా పిలిచాడు. నిత్యం పచ్చ గానూ, పచ్చిగానూ ఉంది ఆ జ్ఞాపకం. నాలాంటి కొన్ని లక్షల మందికి జీవన సౌభాగ్యం కల్పించిన ఆ మహానాయకుడు మళ్ళీ జన్మించి మన మధ్యకు రావాలని ప్రార్థిద్దాం. మదిలోని ఆయన జ్ఞాపక సజీవ చిత్ర పటానికి ఈ విధంగా అక్షర సుమాలు అర్పించు కోవడం, నా తీరని తీయని ఋణం, బంధం, బాంధవ్యం!భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త తిరుపతి మాజీ శాసనసభ్యులు -
జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు
జపాన్ ప్రధాని సనాయే తకాయిచీ భారత పర్యటన రెండు ప్రత్యేక నేపథ్యాల మధ్య జరిగింది. ఒకటి ఆర్థికమైనది, మరొకటి రక్షణ పరమైనది. ఈ రెండు నేపథ్యాలు ఇరు దేశాలకూ వర్తించేవే. అదే సమయంలో ఒకటి గుర్తించాలి. ఆర్థికమైన వర్తింపు ఉభయులకూ సమానమే కాగా, రక్షణ కోణంలో కొన్ని సామ్యాలతో పాటు కొన్ని తేడాలున్నాయి. ప్రధాని మోదీ, తకాయిచీ మధ్య ఢిల్లీలో ఈ నెల 2న జరిగిన చర్చలు, ఒప్పందాలు కూడా ఈ పరిస్థితులన్నింటిని ప్రతిఫలించాయి. వేర్వేరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు, వాటి అభివృద్ధి ప్రయత్నాలు ఎప్పుడూ ఉండేవే. ఆర్థిక వ్యవస్థల రీత్యా ప్రముఖమైనవి అయిన ఇండియా, జపాన్ వంటి దేశాల మధ్య ఇవి ఇంకా బహు ముఖంగా ఉంటాయి. ఆ మేరకు వేర్వేరు రంగాలలో వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త ఒప్పందాలు ఎల్లప్పుడూ ఉన్నవే. అటువంటి స్థితిలో కొత్తగా ఏర్పడిందంటున్న ప్రత్యేక నేపథ్యం ఏమిటి?ప్రత్యేక నేపథ్యంఈ ప్రశ్నకు సమాధానం చర్చల అనంతరం ఇరువురు ప్రధానులు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఉంది. అది, ‘‘నేటి అనిశ్చిత పరిస్థితుల మధ్య ఆర్థిక, ఇంధన భద్రతల ప్రాముఖ్యతను రెండు దేశాలు పూర్తిగా అర్థం చేసుకోవటం. దానిని దృష్టిలో ఉంచు కుని ఆర్థిక భద్రత కోసం ఒక ఉమ్మడి రోడ్ మ్యాప్‌ను రూపొందించటం’’. నేటి అనిశ్చిత పరిస్థితులన్నవి కేవలం ఇరాన్ యుద్ధం వల్ల తలెత్తినవి కావు. భారత్, జపాన్‌లతో పాటు ప్రపంచానికంతా అటువంటి ఒడిదుడుకులు ఉక్రెయిన్ యుద్ధంతో నాలుగేళ్ల క్రితం మొదలై, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు, కొత్త వాణిజ్య ఒప్పందాల కోసం ఒత్తిడుల మీదుగా ఇరాన్ యుద్ధం వరకు సాగివస్తున్నాయి. ఇవి స్థూలంగా పైకి కనిపించేవి. కొంత లోతుకు వెళితే,ప్రపంచ ఆర్థిక రంగానికి అనిశ్చితిని సృష్టిస్తున్న పరిణామాలు మరికొన్ని ఉన్నాయి. అవి, రెండవ ప్రపంచ యుద్థం తర్వాత బ్రెట్టన్‌వుడ్స్ వ్యవస్థలతో మొదలై ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్యాలను, ఆర్థిక సంస్కరణలను సులభతరం చేసిన నియమ నిబంధనలు ఇటీవల కొద్ది సంవత్సరాలుగా భంగపడుతుండటం. ఆ వ్యవస్థలను, నిబంధనలు సృష్టించిన దేశాలే వాటిని బలహీన పరుస్తుండటం. వాటి ప్రతికూల ప్రభావాలు మధ్యమ స్థాయి దేశాలపై అట్లుంచి, మొదటి 10 స్థానాలలో గల భారత, జపాన్ వంటి ఆర్థిక వ్యవస్థలకు సైతం అనిశ్చితిని కల్పిస్తున్నది. ఇది ఇరాన్ యుద్ధంతో మరింత తీవ్రమైంది. ఇండియా, జపాన్ గత అక్టోబర్‌లో తకాయిచీ అధికారానికి రాక ముందు కూడా పలు ఒప్పందాలు చేసుకున్నాయి. మోదీ ప్రభుత్వంపై ఇతరత్రా ఎన్ని విమర్శలైనా ఉండవచ్చు గాక. కానీ, వేర్వేరు దేశాలతో, ప్రాంతీయ ఆర్థిక కూటములతో వీలైనన్ని ఆర్థిక ఒప్పందాల కోసం నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవైపు అనిశ్చితులు ఉండగా, మరొకవైపు ఈ పోటీ ప్రపంచం, దేశంలో అంతర్గతంగా ఎదురవుతున్న ఆర్థిక ఒడిదుడుకులు ఈ విధా నాల వెనుక ముప్పేటగా పనిచేస్తున్నాయని చెప్పాలి. అసమ వాణిజ్యంజపాన్ పరిస్థితి భారత్ కన్న కొంత మెరుగైనప్పటికీ పైన పేర్కొన్న పరిణామాల మధ్య సమస్యలు తప్పటం లేదు. వాటికి ఇటీవల మరొకటి తోడవుతున్నది. అది, చైనాతో పెరుగుతున్న వివాదాలు. తైవాన్ విషయమై తకాయిచీ వైఖరికి ఆగ్రహించిన చైనా, పలు విధాలైన చర్యలతో జపాన్ ఆర్థిక రంగాన్ని వీలైనంత కుంటుపరచటం మొదలు పెట్టింది. మరొకవైపు ఇండో–పసిఫిక్ రక్షణ బాధ్యతల నుంచి అమెరికా కనీసం పాక్షికంగా ఉపసంహరించుకుంటూ ఆ బరువును ఆ ప్రాంతంలోని జపాన్ తదితర మిత్ర దేశాలపై మోపుతుండటంతో జపాన్ సైనిక వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక భారాలన్నీ మోసేందుకు తకాయిచీ ప్రభుత్వం ఆసియా నుంచి యూరప్ వరకు వేర్వేరు దేశాలతో శరవేగంగా ఆర్థిక ఒప్పందాలు చేసుకుంటున్నది. ఈ విధంగా ఆర్థిక అనిశ్చితులు, వాటిని తట్టుకునే చర్యలన్నవి భారత్, జపాన్‌లకు ఒకే విధంగా ఉన్నట్లు గమనించవచ్చు. కనుక, ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో 2వ తేదీన జరిగిన ఆర్థిక ఒప్పందాలన్నీ హర్షించవలసినవే. ఒప్పంద వివరాలు వెంటనే తెలియరాలేదు గానీ తకాయిచీ వెంట సుమారు 100 జపనీస్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు రావటాన్ని బట్టి చర్చలు ఏ స్థాయిలో జరిగి ఉంటాయో ఊహించవచ్చు. ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్వయంగా చెప్పిన దానిని బట్టి, రెండు దేశాల మధ్య గత సంవత్సర కాలంలో 100కు పైగా వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. వాటివల్ల జపాన్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇది గాక వచ్చే పదేళ్లలో రెట్టింపు జపనీస్ కంపెనీలను, 10 ట్రిలియన్ల జపనీస్ యెన్ పెట్టుబడులను (మారకం విలువ 1 రూపాయికి 1.69 యెన్లు) ఆకర్షించటం లక్ష్యమన్నారు. ఇండియాలో ఇప్పటికే 1,400కు పైగా జపాన్ కంపెనీలు, 5,000కు పైగా వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఈ సంఖ్యలు రెట్టింపు కావటం ఎట్లున్నా, ఇరువురు ప్రధానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రస్తుత అనిశ్చిత పరిస్థితులలో ఎంత విస్తరిస్తే అంత మేలు కలుగుతుంది. అదే సమయంలో భారత ప్రభుత్వంపై కొన్ని పెద్ద బాధ్యతలు కూడా ఉంటాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సాలీనా ఎగుమతి దిగుమతుల విలువ 27 బిలియన్ డాలర్ల మేర ఉంది. అది సంతృప్తి కరమైనదే. కానీ, ఇండియా ఎగుమతులు కేవలం 6 బిలియన్లు, దిగుమతులు 21 బిలియన్లు (మూడున్నర రెట్లు) అంటే ఆ వివరాలు ఎంత అసంతృప్తికరమైనవో వేరుగా చెప్పనక్కరలేదు. ఇంకా చెప్పుకోవాలంటే, భారతదేశపు ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 6వ ర్యాంకుకు చేరినప్పటికీ, సాలీనా వాణిజ్య లోటు 10 బిలియన్ డాలర్లకు మించి ఉంది. జరగాల్సిన కృషిఆర్థిక రంగానికి సంబంధించి జపాన్ ప్రధానితో జరిగిన చర్చలలో చమురు తదితర ఇంధన భద్రతలు, ప్రత్యామ్నాయ ఇంధ నాలు, అరుదైన లోహాలు, ఖనిజాల ప్రస్తావనలు అనివార్యంగా వచ్చాయి. వాటికి అనుబంధంగా ఇండో–పసిఫిక్ సముద్ర మార్గాల ద్వారా స్వేచ్ఛాయుత రవాణాకు అవకాశాలను కల్పించుకోవటం. ఈ నిర్దిష్టమైన అంశాలన్నీ ఇండియా, జపాన్‌లతో పాటు అన్ని దేశాలలో చర్చలు జరుగుతున్నవే. అయితే ఇవి ఎంత కీలకమైనవో అంత క్లిష్టమైనవి కూడా. వీటి గురించి ఎవరికి వారు అంతర్గత కృషి చేయటం, ఇతరుల సహకారంతో సామరస్య పరిష్కారాలు కనుగొనటం రెండూ అవసరం. ఈ కొత్త పరిస్థితులలో ఆ ప్రయత్నాలు లోగడ కన్నా ఎక్కువగా జరగక తప్పదు. చర్చలలో ప్రస్తావనకు వచ్చిన మరొక కీలకాంశం రక్షణ. ఇందుకు రెండు కోణాలున్నాయి. ఒకటి, ఇండో–పసిఫిక్ ద్వారా సముద్రయానాలు. ఇది రెండు దేశాలకు సంబంధించినది. రెండు, ఈ మార్గాలలో, అంతకన్నా ఎక్కువగా పసిఫిక్‌లో చైనాను కట్టడి చేసే విషయం. ఈ విధమైన కట్టడి అవసరం ఇండియాకు పరిమిత స్థాయిలో ఉండగా, జపాన్‌కు, దానిని తమ సమగ్ర వ్యూహంలో భాగంగా చేసుకున్న అమెరికాకు అపరిమిత స్థాయిలో ఉంది. అమెరికా ఇటీవల ‘క్వాడ్’ ప్రత్యక్ష బాధ్యతల నుంచి నెమ్మదిగా తగ్గుతూ జపాన్, ఆస్ట్రేలియాల బాధ్యతను పెంచుతుండటంతో కొత్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ బాధ్యతను తలకెత్తుకున్న తకాయిచీ రక్షణ వ్యయాన్ని పెంచుతూ, పలుదేశాలతో రక్షణ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ రక్షణ విషయాలైతే ఢిల్లీలో ‘చర్చకు’ వచ్చాయి గానీ, ‘ఒప్పందాలు’ లేకపోవటం ఇండియా విధానాలకు అనుగుణమైనదేనని చెప్పాలి. టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
దేశ ఐక్యత–ప్రగతికి అంకితమైన జీవితం
ఇవాళ తేదీ జూలై 6... జాతీయవాదం, నిస్వార్థ సేవ వంటి ఆదర్శాలకు ప్రాణమిచ్చే అసంఖ్యాక ప్రజానీకానికి ఇదొక ప్రత్యేక దినం. అంతులేని సాహసానికి, భరతమాతపై అత్యంత ఆరాధన భావనకు కాలాతీత నిదర్శనంగా నిలిచిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి ఈ రోజే. ఆధునిక భారతంలో మేధస్సు, ప్రజాసేవ, నైతిక విశ్వాసమనే లక్షణాల అద్భుత సమ్మేళనం ఇంతగా మూర్తీభవించిన ఆయన వంటి నాయకులు దేశంలో చాలా అరుదు. ఆయన సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ సకల సౌఖ్యాలనూ వదులుకుని త్యాగం, జాతి సేవ దిశగా ఆయన అంతరాత్మ నడిపించింది. వలసవాదం, మతతత్వం, మానవతా సమస్యలు వంటివి కమ్ముకున్న నాటి కల్లోల కాలంలో ఒక మూగ ప్రేక్షకునిగా మిగిలిపోవడం తగదని ఆయన దృఢంగా విశ్వసించారు. ఈ ప్రస్థానంలో ఆయన తొలుత పసికందుగా ఉన్న బిడ్డను, ఆ తర్వాత భార్యను కోల్పోయారు. ఆత్మార్పణడా‘‘ ముఖర్జీ ప్రజా జీవనాన్ని అన్నింటికన్నా ఎక్కువగా నిర్వచించిన ఆదర్శం ఏదైనా ఉందంటే– అవిభాజ్య భారత్ దిశగా ఆయన దీక్ష. దేశ విభజన సంక్షోభ సమయాన పశ్చిమ బెంగాల్ భారత్‌లో అంతర్భాగంగా ఉండాలని ఆయన ప్రగాఢంగా ఆకాంక్షించారు. ఆనాడు దృఢంగా నిలబడిన ఆయన విశ్వాసమే కొన్నేళ్ల తర్వాత ఆయనను జమ్మూకాశ్మీర్ వైపు నడిపింది. ఆ క్రమంలో జైలుపాలైనా ఆ జీవితం ఆయన ఉత్సాహాన్ని నీరుగార్చలేక పోయింది. కారాగార ఏకాంతం ఆయనను ఎంతమాత్రం కుంగదీయలేదు. ఏ ప్రజల ఆశయాన్ని తనదిగా చేసుకున్నారో వారికి అత్యంత దూరంగా, నిర్బంధంలోనే ఆయన జీవితం హఠాత్తుగా ముగిసింది. ఆచార్య వినోబా భావే చెప్పినట్లు– తాను విశ్వసించిన ఆదర్శం కోసం డా‘‘ ముఖర్జీ ఆత్మార్పణకు వెనుదీయలేదు. అటుపైన ఎన్నో ఏళ్ల తర్వాత 2019లో ఆర్టికల్ 370, 35 (ఎ)ల రద్దు ఆయన అమరత్వానికి అత్యంత సముచిత నివాళి అనడంలో సందేహం లేదు.భారతీయతకు పెద్దపీటఆయన ఎప్పుడూ దేశానికే ప్రథమ స్థానమిచ్చారు. భారతీయ విలువలకే పెద్ద పీట వేశారు. తదనుగుణమైన సంస్థలకు రూపమివ్వడం ద్వారా ఆయన ఈ లక్ష్యం సాధించారు. అత్యంత పిన్న వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయానికి ఉప కులపతి అయ్యారు. తనదైన శైలిలో, దేశభక్తి, భవిష్యత్ దృక్పథంతో కూడిన అనేక సానుకూల మార్పులు తెచ్చారు. ఓ సారి విద్యావేత్తల సదస్సులో ప్రసంగించిన సందర్భంగా– ‘భవిష్యత్ గుమాస్తాలను, తక్కువ జీతాలు పొందే సిబ్బందిని ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా విద్యా సంస్థలను చిన్న చూపు చూడటం తగదు. స్థానిక సంస్థలు, పురపాలక, రాష్ట్ర, కేంద్ర చట్టసభలను నడిపించగల ఉద్దండులుగా విద్యార్థులను మనం తీర్చిదిద్దాలి. అదే తరహాలో ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక తదితర జనజీవన ప్రాధాన్య రంగాల వ్యవహారాలను నడిపించగల సమర్థులుగా తయారు చేయాలి’ అని కుండబద్దలు కొట్టారు. అప్పట్లో ‘భారతీయ జనసంఘ్’ను రపుదిద్దాలని డా‘‘ ముఖర్జీ నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాభవం ఉచ్ఛస్థాయిలో ఉన్న సమĶæన మనవైన సాంస్కృతిక మూలాలకు కట్టుబడుతూనే దేశ ప్రగతి కోసం గళం విప్పే ప్రత్యామ్నాయ స్వరం ఒకటి అవసరమని ఆయన భావించారు. అది ఓ చిన్న దివ్వెలాంటిదైనా పరవాలేదని భావించారేమో అన్నట్లుగా దాని చిహ్నంగా ‘మట్టి దీపం’ గుర్తును ఆయన ఎంచుకోవడం గమనార్హం. పారిశ్రామిక విధానానికి పునాది ఆయనకు దేశ ప్రగతిపై గల అవగాహన ఎంతటిదో భారత తొలి పరిశ్రమలు–పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన పదవీకాలం వెల్లడిస్తుంది. ఒక రాజనీతిజ్ఞుడిగా, నిజాయితీ, మానవతా దృక్పథం కలగలసిన నాయకుడుగా ఆయన సామర్థ్యం స్పష్టమవుతుంది. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింధ్రీ ఫెర్టిలైజర్ ప్లాంట్, పటిష్ట పారిశ్రామిక విధానం వంటి మార్గదర్శక కార్యక్రమాల ద్వారా ఆధునిక పారిశ్రామిక భారతానికి పునాదులు వేశారు. అదే సమయంలో భారత సంప్రదాయ బలాలు నిర్లక్ష్యానికి గురికాకుండా చూసుకున్నారు. చేనేత, కుటీర పరిశ్రమలు, కళారంగం వంటి వాటికీ ఆయన మద్దత్తు ఇచ్చారు. ఈ సందర్భంగా నేనొక వ్యక్తిగత అనుభవాన్ని పంచుకోవాలని భావిస్తున్నాను. స్వావలంబనపై విస్పష్ట దార్శనికతతో డా‘‘ ముఖర్జీ స్థాపించిన సింధ్రీ కర్మాగారాన్ని అనేక దశాబ్దాల పాటు దేశాన్నేలిన పాలకులు నిర్లక్ష్యం చేశారు. ఈ నేపథ్యంలో దాని పునరుద్ధరణలో తోడ్పడే అవకాశం మా ప్రభుత్వానికి లభించడం నాకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. ఆ కార్యక్రమంలో పాల్గొనడం నా జీవితంలోని అత్యంత ప్రత్యేక క్షణాలలో ఒకటిగా నిలిపోయిందంటే అతిశయోక్తి కాబోదు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి డా‘‘ ముఖర్జీ ప్రతిరూపంగా నిలిచారు. తొలిదశలో దేశ పురోగమన బాధ్యత రాజకీయ విభేదాలకు అతీతమనే సత్యాన్ని విశ్వసించి పండిట్ నెహ్ర మంత్రిమండలిలో చేరారు. ఆ పదవిలో ఉన్నంత కాలం చిత్తశుద్ధితో, నిర్మాణాత్మక స్ఫూర్తితో సేవలందించారు. కానీ, జాతీయ ప్రాధాన్యంగల అంశాల్లో భిన్న మార్గం సముచితమని భావించిన వేళ గౌరవప్రదంగా పదవిని త్యజించారు. దేశానికి ఏది అవసరమో దానికి సంబంధించిన రాజకీయ కార్యకలాపాలకు పూర్తి నిబద్ధతతో అంకితమయ్యారు. పండిట్ నెహ్రూ 75 ఏళ్ల కిందటే భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడితో సమానమైన తొలి రాజ్యాంగ సవరణను తెచ్చారు. దాన్ని డా‘‘ ముఖర్జీ నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ మనోభావన ఏమిటో ఆయన పూర్తిగా అవగతం చేసుకున్నారు. అదే పూర్తిగా సరైనదని కూడా నిరూపితమైంది. అలనాడు... 75 ఏళ్ల కిందట తొలి సవరణ తెచ్చిన వారే 1975లో ఎమర్జన్సీకి కూడా కారకులయ్యారు. సేవామూర్తిమానవతా వాదాన్ని సమున్నతంగా నిలపడంలోనూ ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. బెంగాల్లో 1943నాటి అత్యంత ఘోరమైన కరవు విజృంభించినపుడు ఆయన బాధితుల సేవలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ప్రజలకు ఆహారం సమకూర్చడం కోసం అనేక స్వచ్ఛంద వంటశాలలు, సహాయ శిబిరాలు ఏర్పాటు చేసేలా అవిరళ కృషి చేశారు. ప్రజల దుఃస్థితి చూసి నిలువెల్లా చలించిపోయిన ఆయన, వలస పాలకుల నిర్దాక్షిణ్య వైఖరిని తీవ్రంగా నిరసించారు. ‘పంచషేర్ మన్వంతర్’ పేరిట తాను రాసిన పుస్తకంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. అంతకుముందు 1942లో మేదినీపూర్‌ను ఒక మహా తుఫాను వణికించినపుడు పరిస్థితుల పునరుద్ధరణ దిశగా ఆయన కృషికి విస్తృత ప్రశంసలు లభించాయి.ఆ రోజుల్లో కలకత్తాలోని ఓ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో యువతను ఉద్దేశించి మాట్లాడుతూ– ‘మీరు ఏ పని చేపట్టినా శ్రద్ధగా, క్షుణ్ణంగా, అర్థవంతంగా చేయండి. ఏ పనినీ అర్ధాంతరంగా వదిలేయకండి. అరకొర ఫలితంతో సంతృప్తి చెందకండి. మీ అత్యుత్తమ కృషితో సత్ఫలితం సిద్ధించే దాకా పట్టువీడకండి’ అని ఆయన పిలుపునిచ్చారు. దేశం ఇవాళ వికసిత భారత్ స్వప్న సాకారం దిశగా పురోగమిస్తున్న తరుణాన... ఆయన ప్రగాఢంగా విశ్వసించిన శక్తియుత, సమైక్య, ఆత్మవిశ్వాసపూరిత, కరుణార్ద్ర దేశ నిర్మాణానికి నిత్యం కృషి చేయడమే ఆయనకు మనం అర్పించగల అత్యుత్తమ నివాళి. ఈ నేపథ్యంలో యువత నేటి సందర్భానికి తగినట్లు డా‘‘ ముఖర్జీ ఆశయాలకు న్యాయం చేసేందుకు అహరహం శ్రమిస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. నరేంద్ర మోదీభారత ప్రధాని -
మెహబూబా ముఫ్తీ (కశ్మీర్ లీడర్) రాయని డైరీ
సర్వోన్నతుడి నిర్యాణం అంతులేని దుఃఖాన్ని మిగిలిస్తుంది. ఆ దుఃఖంలోనే అనంతమైన ఓదార్పూ ఉంటుంది. అయతొల్లా అలీ ఖమేనీ పార్థివ దేహానికి తుది వీడ్కోలు పలికేందుకు టెహ్రాన్‌లోని ‘గ్రాండ్ మొసల్లా కాంప్లెక్స్’కు చేరుకున్న విషాద జనవాహినిలో నేనూ ఒకరిగా నిరీక్షిస్తూ ఉన్నాను. ఊరేగింపునకు ‘లోక నాయకుడు’ కదలగానే ఒక్కసారిగా శోకాలు మిన్నంటాయి. నివాళుల నలుపు వస్త్రాలతో భూమి యుద్ధమేఘమై బాధాతప్త నినాదాలతో ఉరమటం మొదలైంది. గుండెలు కుండపోతగా కురుస్తున్నట్లుగా ఆగని ఆశ్రువులు!అమరత్వం విషాదం కాదు. అగాథం కాదు. అంతం అసలే కాదు. అది గౌరవం. చైతన్యం. శాశ్వత జీవితం. దేవుడితో బేరమాడి కొనితెచ్చుకున్న పరమోన్నత స్థితి. ‘‘దేవా, నేను నీ మార్గంలో నడుస్తాను. బదులుగా నా మరణానికి అమరత్వాన్ని అనుగ్రహిస్తావా?’’ అని అల్లాహ్‌తో చేసుకున్న ఒప్పందం. శాంతిని విశ్వసించిన యుద్ధవీరుడు ఖమేనీ. ‘‘శాంతి అంటే కేవలం యుద్ధం లేకపోవడం మాత్రమే కాదు, న్యాయంగా ఉండటం కూడా...’’ అని శత్రువు చెంప చెళ్లుమనిపించినవాడు. శాంతిని ఒక ప్రగాఢమైన మానవ ఆకాంక్షగా ఖమేనీ విశ్వసించారు. న్యాయం నెలకొన్న చోట మాత్రమే నిజమైన శాంతి వర్ధిల్లుతుంది అన్నారు. ‘విధించబడిన’ శాంతిని ఇరాన్ ఎంత గట్టిగా వ్యతిరేకిస్తుందో, అంత గట్టిగానే తలపై వచ్చిపడే తలవని యుద్ధాన్ని ఎదుర్కొంటుందని ఖమేనీ గర్జించారు. ఏమీ తోచక ఒళ్లు విరుచుకున్నట్లుగా, సామ్రాజ్యాలను విస్తరించుకోవాలని ఖమేనీ కోరుకోలేదు. ఇస్లాంను ఒక చల్లని యంత్రంలా కాక... ప్రేమలు, భావోద్వేగ బంధాలతో అల్లిన ఒక వెచ్చని మానవ స్పర్శతో పెనవేయాలని ఆకాంక్షించారు. జీవితమనే పరిమిత సంపదను మనం ఎలా వదిలించు కుంటామనే దానిపైనే జీవితపు నిజమైన విలువ ఆధారపడి ఉంటుందని ప్రబోధించారు! జీవితాన్ని ‘చిందిన నూనె’ అన్నారాయన. ఆ చిందిన నూనె చిమ్ముతున్న లక్షల దైవిక కాంతుల్లా మొసల్లా కాంప్లెక్స్‌లోని ఖమేనీ సన్నిధి ప్రార్థనలో అందరం నిలుచుని ఉన్నాం. టెహ్రాన్‌లో ఇవాళ, రేపు వీడ్కోలు ఊరేగింపు. 7న పవిత్ర ఖోమ్ నగరానికి ఊరేగింపుల తరలింపు. 8న ఇరాక్‌లోని కర్బలా, నజఫ్లలో భౌతిక కాయానికి పవిత్ర కర్మకాండలు. 9న ఖమేనీ జన్మస్థలం మషద్‌లోని ఇమామ్ రెజా మందిరంలో తుది ఖనన ఊరేగింపు. ప్రపంచ దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు, ప్రత్యేక అతిథులకు కార్యక్రమాల మొదటి విడతవరకే అధికారిక ఆహ్వానాలు ఉన్నాయి. రేపే నా తిరుగు ప్రయాణం. తండ్రి అంత్యక్రియల ఆహ్వాన లేఖలో నన్ను ‘ఆత్మీయ అతిథి’గా సంబోధించారు మోజ్తబా ఖమేనీ! అది నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇంటి ఆడపడుచును ఆదరించి నట్లుగా ఉంది.జూలై 3న నేను శ్రీనగర్ నుంచి ఢిల్లీ చేరుకునేటప్పటికే ఇరాన్ పంపిన ప్రత్యేక విమానం అక్కడ సిద్ధంగా ఉంది. ఖమేనీకి తుది వీడ్కోలు పలికే భాగ్యం కల్పించటానికి వచ్చి మా కోసం వేచి ఉన్న దేవదూతలా ఉంది ఆ లోహ విహంగం. రమ్మని కబురు పంపటం, తోడ్కొని రమ్మని మనిషిని పంపటం... ఇది కదా పిలుపంటే... దుఃఖానికైనా, ఉత్సవానికైనా! ఇప్పుడిది రెండూ కలగలిసిన ‘దుఃఖోత్సవం’! ఢిల్లీలో ఆ రోజు టెహ్రాన్‌కు ఫ్లయిట్ టేకాఫ్ అయ్యేముందు ఖురాన్ ను తీసి, పేజీలు తెరిచి చూశాను. ‘‘వారిని మృతులు అనకండి. వాస్తవానికి వారు జీవించి ఉన్నారు, కానీ మీరు దానిని గ్రహించలేరు’’ – లేపనం లాంటి మాట! అల్లాహ్ చూపిన ధర్మ మార్గంలో నడిచిన నాయకుడికి మృత్యువు ఎదురు పడుతుందా? అసలు ఎదురొచ్చి నిలబడుతుందా?! -
అగ్రస్థానం నుండి అప్రస్తుతానికి?
అమెరికా సంయుక్త రాష్ట్రాలు స్వాతంత్య్రం ప్రకటించుకొని 250 సంవత్సరాలు పూర్తవబోతున్నది. 1776 జూలై 4న 13 కాలనీలు స్వాతంత్య్రం ప్రకటించుకోవటంతో యూఎస్ఏ దేశానికి పునాదిపడింది. క్రమంగా స్పానిష్, మెక్సికన్లతో యుద్ధాలు, కొనుగోళ్లతో అది విస్తరించింది. 1941లో జపాన్ పెరల్ హార్బర్‌పై దాడితో రెండవ ప్రపంచ యుద్ధంలో క్రియాశీలకమైంది. 1945లో ప్రపంచ జీడీపీలో 50 శాతం వాటాతో బలమైన ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 1969లో చంద్రుడిపై కాలుమోపి, 1970 దశకంలో అర్పా నెట్, తదుపరి ఇంటర్నెట్ ద్వారా 1980లలో సిలికాన్ వ్యాలీ గుండా ఐటీ రంగాన్ని శాసించింది. 1991లో సోవియట్ విచ్ఛిన్నంతో ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యంగా అవతరించింది.అగ్ర లక్షణాలుఒక దేశం అగ్రరాజ్యంగా లేదా ప్రపంచ శక్తిగా ఎదగాలంటే నాలుగు అంశాలు కీలకం. 1. మాతృదేశం నుండి సుదూర ప్రాంతా లలో శత్రువులను నిలువరించగలగాలి. 2. ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థలు, రవాణా మార్గాలను నియంత్రించగలగాలి. 3. ప్రపంచ స్థాయి వ్యవస్థలను సృష్టించి, ఆదర్శప్రాయమైన చట్టాలు, నిబంధన లను ఏర్పరచాలి. 4. ఆ దేశపు విలువలు, సంప్రదాయాలు, భాష లను ప్రపంచం అనుసరించాలి.ప్రపంచవ్యాప్తంగా 750కి పైగా సైనిక స్థావరాలతో యూఎస్ఏ ఏ ప్రాంతంలోని శత్రువునైనా నిలువరించగలుగు తుంది. ప్రపంచ జీడీపీలో 25 శాతం వాటా కలిగి, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్వంటి సంస్థల ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నది.హాలీవుడ్, పాప్/జాజ్ సంగీతం, ప్రజాస్వామ్య వ్యవస్థల ద్వారా ప్రపంచ సంస్కృతులను ప్రభావితం చేస్తున్నది. సాలీనా 700 బిలి యన్ డాలర్ల ప్రైవేట్ ఆర్ అండ్ డీ వ్యయం, 500 బిలియన్ డాలర్ల దాతృత్వ విరాళాల ద్వారా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నది.తిరోగమన రాజ్యం2000 సంవత్సరంకల్లా యూఎస్ఏ తిరుగులేని ఏకైక అగ్ర రాజ్యంగా అభివృద్ధి చెందిందనటంలో సందేహం లేదు. కానీ 2025 కల్లా ఇంటా, బయటా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. ‘అమె రికా నాయకత్వపు ప్రపంచం నుండి క్రమంగా అమెరికాతో కూడిన ప్రపంచ రాజకీయ వ్యవస్థ’ దిశగా ప్రపంచం ప్రయాణిస్తున్నట్లుగా జియో పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరి కాను ఒక తిరోగమన అగ్రరాజ్యంగా అభివర్ణిస్తున్నారు. చరిత్ర కారుడు ఆర్థర్ షెల్లింగర్ అభిప్రాయపడినట్లు ‘అమెరికా ఒక ప్రయోగం మాత్రమే, తయారీ పూర్తయిన ఉత్పత్తి కాదు’.అమెరికన్ ప్రభుత్వం క్రమంగా అప్పుల ఊబిలో చిక్కుకుంటు న్నది. ప్రభుత్వ అప్పు జీడీపీ కంటే 120 శాతం ఎక్కువగా ఉన్నది. ఇది 200 శాతానికి చేరితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది.ప్రపంచ రిజర్వ్ కరెన్సీలో యూఎస్ వాటా 71 నుండి 59 శాతానికి పడిపోయింది. లావాదేవీలకు అమెరికన్ డాలర్‌కు ప్రత్యామ్నాయంగా చైనీస్ యువాన్ కుదురుకుంటున్నది. బ్రిక్స్ దేశాలు డాలర్ ఆధిపత్యానికే సవాలు విసురుతున్నాయి. చైనా, రష్యా, ఈయూ,ఇండియా ప్రత్యా మ్నాయ రాజకీయ శక్తులుగా బలపడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్యూజన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు, అంత రిక్ష పరిశోధనలలో చైనా గట్టి పోటీనిస్తున్నది. మాదకద్రవ్యాలు, గన్‌కల్చర్ అమెరికన్ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.కుప్పకూలకపోయినా...యూకే (ఇంగ్లండ్) తన రవి అస్తమించని సామ్రాజ్యంతో ప్రపంచాన్ని సుమారు వంద సంవత్సరాలు (1850–1950) పాలించిందనే చెప్పాలి. ప్రపంచ జీడీపీలో అప్పటి బ్రిటన్ వాటా 25శాతం. అప్రతిహతమయిన నౌకాబలం, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన వలసలు, సముద్ర మార్గాల మీద ఆధిపత్యంతో బ్రిటన్ ప్రపంచాన్ని శాసించింది. బ్రిటన్‌తో పోలిస్తే అమెరికన్ ఆధిపత్యం భిన్నంగా ఉంటుంది. అమెరికా ఇతర దేశాలను ఆక్రమించి వలసలు స్థాపించలేదు. ఆధునిక నౌకా, వైమానిక సైనిక బలాలతో పాటుగా, టెక్నాలజీ రంగంలో ఆధిపత్యం, వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్‌లపై గుత్తాధిపత్యం, డాలర్ ద్వారా ప్రపంచ వాణిజ్యంపై ఉడుంపట్టు పట్టి, నాటో మిత్రదేశాల సహకారం దన్నుగా యూఎస్ఏ అగ్ర రాజ్యంగా ఏర్పడింది. యూఎస్ఏ, యూకే రెండూ మాతృ దేశాన్ని సురక్షితంగా ఉంచుకొని, శత్రువులను కొల్లగొట్టడమనే ప్రాథమిక సూత్రాన్ని అమలుపరచాయి. రెండువైపులా శత్రుదుర్భేద్యంగా విశా లమైన అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలు ఉండటం, అపార మైన సహజవనరులు యూఎస్ఏకు భౌగోళికంగా కలిసి వచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, యూకే బలహీనపడటం యూఎస్ఏకు అనుకోని వరంగా పరిణమించింది.యుద్ధాలు, ఆక్రమణల వలన సామ్రాజ్యాలు కూలిపోవు. సామ్రాజ్యాలు అంతర్గతంగా బలహీనపడి విచ్ఛిన్నమవుతాయని చరిత్ర చెబుతున్నది. 1950 కల్లా బ్రిటిష్ సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది. వలస సామ్రాజ్యాన్ని నిర్వహించటానికి అయ్యే ఖర్చు 1950లో యూకే జీడీపీలో 10 శాతం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూకే ఆర్థికంగా బలహీనపడి వలస పాలన ఖర్చులను భరించే స్థితిలో లేక వలస ప్రాంతాలకు తప్పనిసరి పరిస్థితుల్లో స్వాతంత్య్రం ప్రకటించింది. 1991 కల్లా ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్న మవటంతో సోవియట్ యూనియన్ కూలి పోయింది. 1945లో యూకే, 1991లో సోవియట్ మాదిరిగా యూఎస్ఏ ఇప్పుడు అకస్మాత్తుగా కూలిపోయే అవకాశం లేదు. కానీ క్రమంగా బలహీన పడి అగ్రరాజ్య స్థాయిని కోల్పోయే సూచనలు పుష్కలం.ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి మానవ వనరులను యూఎస్ఏ ఆకర్షించింది. 1820–1860 కాలంలో వలస వచ్చిన ఐరిష్, జర్మన్లు మధ్య యూఎస్ఏ వ్యవసాయాభివృద్ధికి పునాది వేశారు. 1880–1924 మధ్యకాలంలో వచ్చిన యూదులు, ఇటాలి యన్లు తూర్పు, ఈశాన్య యూఎస్ఏలో పారిశ్రామిక విప్లవానికి ఆద్యులు. 1925–1965 మధ్యకాలంలో జర్మనీ, రష్యా, తూర్పు ఐరోపాల నుండి శరణార్థులుగా వచ్చిన శాస్త్రవేత్తలు యూఎస్ఏ అణ్వస్త్ర పరిజ్ఞానానికి, కంప్యూటర్ విప్లవానికి దోహదపడ్డారు. వీరిని యూఎస్ఏ ఆహ్వానించకపోతే సోవియట్ ఏకైక అణ్వస్త్ర దేశంగా ఏర్పడేది. 1965–2000 మధ్యకాలంలో భారత్, తైవాన్‌ల నుండి వచ్చిన టెక్ నిపుణులు సిలికాన్ వ్యాలీ విజయానికి కారణం. వీరు లేకపోతే జపాన్ ప్రపంచ సెమీకండక్టర్, ఐటీ శక్తిగా ఆవిర్భవించేది. ఇటీవలి వలసదారుల వ్యతిరేక ఉద్యమం కేవలం అమెరికన్ ఐడెంటిటీ రాజకీయాలలో భాగమే. జపాన్ నిపుణులైన వలసదారు లను ప్రోత్సహించక పోవటంతో ధనిక దేశమైనా ప్రపంచ రాజకీ యాలలో ప్రాధాన్యత సాధించలేక పోయింది. సోవియట్ వలస లను నిషేధించి కూలిపోయింది. యూఎస్ఏ ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక వ్యవస్థలను నిర్వహించటానికి సాలీనా కనీసం 2 మిలియన్ల వలస నిపుణులను ఆహ్వానించాల్సి ఉంటుంది. లేకపోతే ఈ నైపుణ్య కార్మి కులను యూరోపియన్ యూనియన్, చైనా ఎగరేసుకుపోతాయి. రాబోయే అర్ధ శతాబ్దంలో ప్రపంచ అగ్రరాజ్యం ఎవరనేదిముందుతరం సాంకేతిక పరిజ్ఞానాలను ఎవరు గుప్పిట్లో పెట్టుకుంటా రనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. 2076 ప్రపంచాధిపత్యం రేసులో కూటములు, పొత్తులు కీలకం. ఈ రెండు అంశాలలో యూఎస్ఏకు దుశ్శకునాలు కన్పడుతున్నాయి. కెనడా, యూరోపియన్ యూనియన్, యూకేలతో మొదలుపెట్టి, భారత్ వరకు అందరు మిత్రులను దూరం చేసుకోవటం యూఎస్ఏకు దురదృష్టకరం. 2050 కల్లా ప్రపంచ జీడీపీలో వాటా 15 శాతానికి పడి పోయి, ప్రభుత్వ రుణం జీడీపీలో 200 శాతానికి చేరి వలసలు పూర్తిగా ఆపివేస్తే యూఎస్ఏ అగ్రరాజ్య స్థానం కోల్పోతుంది. ధనిక దేశంగా కొనసాగినా, 2075కల్లా ప్రస్తుత జపాన్, యూకేల వలే అప్రస్తుతపు, అసందర్భపు, అప్రాముఖ్యతపు శక్తిగా మిగిలిపోయే ప్రమాదం ఉన్నది.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్); సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు-గురజాల శ్రీనివాసరావు -
ప్రశ్నించడమూ విద్యలో భాగమే!
నూతన జాతీయ విద్యా విధానం– 2020 దేశవ్యాప్తంగా అమలులోకి వస్తున్న సందర్భంలో భారతీయ విద్యా వ్యవస్థపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. విద్య కేవలం ఉపాధి సాధనమా? లేక సమాజాన్ని రూపుదిద్దే పరివర్తనాత్మక శక్తా? ఒక దేశం తన భావితరాలను ఎలా తీర్చిదిద్దా లనుకుంటుందో ఆ దేశ విద్యా విధానాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. అందుకే విద్యా విధానాలు ప్రభుత్వాల పరిపాలనా నిర్ణయాలు మాత్రమే కావు; అవి ఒక సమాజం తన భవిష్యత్తును గురించి చేసుకునే రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ఎంపికలు కూడా. సమాజ శాస్త్రవేత్త ఎమిల్ డర్కైమ్ దృష్టిలో విద్య అనేది సమాజం తన విలువలను కొత్త తరాలకు సంక్రమింపజేసే ప్రక్రియ. కార్ల్ మార్క్స్ దృష్టిలో విద్య పాలక వర్గాల భావజాలాన్ని బలపరిచే సాధనంగా కూడా మారవచ్చు.జ్ఞాన బదిలీ రూపాలువేట, ఆహార సేకరణ జీవన విధానం నుండి వ్యవసాయ ఆధారిత స్థిర జీవన విధానానికి మారిన తర్వాత జ్ఞాన బదిలీకి వ్యవస్థీకృత రూపాలు అవసరమయ్యాయి. వైదిక సంస్కృతి ప్రభావంతో గురుకుల వ్యవస్థ అభివృద్ధి చెందింది. భారతీయ విద్యా చరిత్రలో ఇది ముఖ్యమైన దశ. ఈ వ్యవస్థ ద్వారా తత్వ విచారణలు, భాషా సంపద అభివృద్ధి చెందినప్పటికీ, దాని సామాజిక పరిమితులను విస్మరించలేం. జ్ఞానాన్ని సామాజిక ఆధిపత్యాన్ని నిలబెట్టే సాధనంగా ఉపయోగించిన చారిత్రక ఉదాహరణగా దీనిని చూడవచ్చు. క్రీ.పూ. ఆరో శతాబ్దంలో బౌద్ధ, జైన మతాలు ఆవిర్భవించడం భారతీయ విద్యా చరిత్రలో ఒక ప్రజాస్వామ్య మలుపు. గౌతమ బుద్ధుడు పుట్టుక ఆధారంగా వ్యక్తి విలువను నిర్ణయించే భావనను తిరస్కరించాడు. బౌద్ధ సంఘాలు విద్యా కేంద్రాలుగా పనిచేశాయి. నలంద, తక్షశిల, విక్రమశిల వంటి విశ్వవిద్యాలయాలు అంతర్జా తీయ ఖ్యాతిని సంపాదించాయి.సాధారణంగా క్రీ.శ. ఎనిమిదవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు విస్తరించిన మధ్యయుగ కాలాన్ని కొందరు చీకటి యుగంగా చిత్రీకరించడానికి ప్రయత్నించినప్పటికీ, చారిత్రక వాస్త వాలు అంత సరళంగా ఉండవు. ఢిల్లీ సుల్తానులు, మొఘల్ చక్రవర్తులు ఉత్తర భారతదేశంలో అధికారాన్ని స్థాపించగా, దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం, ఇతర ప్రాంతీయ రాజ్యాలు తమ ప్రభావాన్ని కొనసాగించాయి. విద్య ప్రధానంగా మత సంస్థల ఆధ్వర్యంలో కొనసాగినప్పటికీ, జ్ఞానవ్యాప్తికి కొత్త మార్గాలు కూడా తెరుచుకున్నాయి. మధ్యయుగ భారతదేశంలో విద్య ప్రజలకు చేరువ కావడంలో భక్తి ఉద్యమం కీలక పాత్ర పోషించింది. ప్రజాభాషలలో సాహిత్య సృష్టి వల్ల జ్ఞానం సంస్కృతం, పర్షియన్ భాషల పరిమితులను దాటి సామాన్య ప్రజలకు చేరువైంది.విద్య ప్రభుత్వ బాధ్యతబ్రిటిష్ పాలనకు ముందు దేశంలో స్థానిక విద్యా సంస్థలు విస్తృతంగా పనిచేశాయని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో వీధిబడులు, పాఠశాలలు, గురుకులాలు, మక్తబ్‌లు ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యను అందించేవి. ధర్మపాల్ తన ప్రసిద్ధ గ్రంథం ‘ద బ్యూటిఫుల్ ట్రీ’లో మద్రాస్ ప్రెసిడెన్సీలో వేలాది స్థానిక పాఠశాలలు పనిచేస్తున్నట్లు బ్రిటిష్ అధికారుల నివేదికలను ఆధారంగా చూపించాడు. అయితే ఈ విద్యా వ్యవస్థలు అన్ని వర్గాలకు సమానంగా అందుబాటులో ఉన్నాయని చెప్పలేం. స్త్రీల విద్య అత్యంత పరిమిత స్థాయిలోనే ఉండేది.1600లో స్థాపించబడిన ఈస్టిండియా కంపెనీ ప్రారంభంలో పూర్తిగా వ్యాపార ప్రయోజనాలకే పరిమితమైంది. ప్లాసీ, బక్సర్ యుద్ధాల అనంతరం రాజకీయ అధికారాన్ని విస్తరించుకున్న కంపె నీకి పరిపాలన కోసం స్థానిక సిబ్బంది అవసరమైంది. 1813 చార్టర్ చట్టం ద్వారా మొదటిసారిగా భారతీయుల విద్యాభివృద్ధికి నిధులు కేటాయించబడ్డాయి. భారతీయుల విద్య పట్ల ప్రభుత్వ బాధ్యతను గుర్తించిన తొలి అధికారిక చర్యగా దీనిని చూడవచ్చు. అయితే థామస్ బాబింగ్టన్ మెకాలే 1835లో సమర్పించిన తన నివేదికలో... రక్తంలో భారతీయులైనా, అభిరుచుల్లో ఆంగ్లేయులుగా ఉండే ఒక మధ్యవర్తి వర్గాన్ని తయారు చేయాలనే వ్యాఖ్య బ్రిటిష్ విద్యా విధాన స్వరూపాన్ని ప్రతిబింబించింది.1854లో వెలువడిన వుడ్స్ డిస్పాచ్‌ను భారతీయ విద్యకు ‘మాగ్నా కార్టా’గా అభివర్ణిస్తారు. విద్యా పరిపాలనకు వ్యవస్థీకృత రూపాన్ని ఇవ్వడంలో ఈ నివేదిక కీలక పాత్ర పోషించింది. ప్రతి ప్రావిన్స్‌లో విద్యాశాఖల ఏర్పాటు, ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలు ఇందులో చోటు చేసుకున్నాయి. ప్రాథమిక స్థాయిలో స్థానిక భాషలను, ఉన్నత విద్యలో ఆంగ్ల భాషను ఉపయో గించాలని సూచించడం ద్వారా భారతీయ విద్యా నిర్మాణానికి ద్వంద్వ స్వరూపాన్ని కల్పించింది. ఈ సిఫారసుల ఆధారంగా 1857లో కలకత్తా, బొంబాయి, మద్రాస్ విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. ఈ దశలో రాజా రామమోహన్ రాయ్ సామాజిక సంస్కరణలకు విద్యే మార్గమని విశ్వసించాడు. జ్యోతిరావు ఫూలే దంపతులు అణగారిన వర్గాల కోసం పాఠశాలల్ని స్థాపించడం ద్వారా విద్యను సామాజిక న్యాయ ఉద్యమంగా మలిచారు. విద్య ప్రాథమిక హక్కుజాతీయోద్యమం నేపథ్యంలో బ్రిటిష్ విద్యా విధానానికి ప్రత్యా మ్నాయంగా జాతీయ విద్యా ఉద్యమం రూపుదిద్దుకుంది. 1906లో బెంగాల్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్థాపించబడింది. ఈ కాలంలో గోపాలకృష్ణ గోఖలే ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్య కోసం చేసిన కృషి గుర్తించదగినది. 1911లో ఇంపీరియల్ లెజి స్లేటివ్ కౌన్సిల్లో ఆయన ప్రవేశపెట్టిన బిల్లు తిరస్కరించబడినప్ప టికీ, విద్య ప్రతి బాలబాలిక హక్కు కావాలనే భావనను దేశవ్యాప్తంగా చర్చకు తీసుకువచ్చింది.ఇరవయ్యవ శతాబ్దంలో రవీంద్రనాథ్ టాగూర్, మహాత్మాగాంధీ, బి.ఆర్. అంబేడ్కర్ వంటి మహనీయుల విద్యా తత్వాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పరీక్షల ఒత్తిడితో, యాంత్రిక కంఠస్థంతో, సృజనాత్మకతను అణచివేసే విధానంతో నిజమైన విద్య సాధ్యం కాదని టాగూర్ భావించాడు. చేతి పని, మేధో వికాసం మధ్య సమన్వయం సాధించాలని గాంధీజీ భావించాడు. 1937లో ఆయన ప్రతిపాదించిన ‘నయీ తాలీం’ లేదా ‘బేసిక్ ఎడ్యుకేషన్’ ఈ భావజాలానికి ప్రతిరూపం. అంబేడ్కర్ విద్యకు మరింత విప్లవాత్మక అర్థాన్నిచ్చాడు. ‘అభ్యసించండి, సంఘటితమవండి, పోరాడండి’ అనే ఆయన పిలుపు కేవలం నినాదం కాదు; సామాజిక న్యాయ ఉద్యమానికి మార్గదర్శక సూత్రం. నేడు విద్యపై జరుగుతున్న చర్చలన్నింటికీ ఈ చరిత్ర ఒక అద్దంలా నిలుస్తుంది. విద్యను కేవలం మార్కులు, ర్యాంకులు, ఉద్యో గాలకే పరిమితం చేసే ధోరణి సమాజాన్ని సంకుచిత దిశగా నడిపి స్తుంది. ఒక దేశానికి శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, వైద్యులు ఎంత అవస రమో, ప్రశ్నించే పౌరులు, రాజ్యాంగ విలువలను గౌరవించే వ్యక్తులూ అంతే అవసరం. అలాంటి పౌరులను తీర్చిదిద్దే బాధ్యత విద్యా వ్యవస్థపై ఉంటుంది.ప్రొ‘‘ కొండ నాగేశ్వర్వ్యాసకర్త డైరెక్టర్, సివిల్ సర్వీసెస్ అకాడమీ,ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ -
మాటలు కోటలు... మారని చర్యలు
నేల అంటే కేవలం మట్టి కాదు. అది జీవం. అది చరిత్ర. అది రైతు జీవనా ధారం. ఈ సత్యాన్ని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన భారత్ సాయిల్ హెల్త్ పాలసీ– ‘స్వచ్ఛ మిట్టి, సమృద్ధ కిసాన్, సశక్త భారత్’ చదివినప్పుడు మనసులో ద్వైదీభావాలు ఏక కాలంలో కలుగుతాయి. ఒకవైపు ఆశ, మరోవైపు ఆందోళన. మాటలు బాగున్నాయి. కానీ చర్యలకు దారేది?నేల ఏం చెప్తోందంటే...2015లో ప్రారంభమైన సాయిల్ హెల్త్ కార్డ్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 25 కోట్లకు పైగా కార్డులు పంపిణీ చేశారు. ఈ గణాంకాలు చిన్న విషయం కాదు. కానీ ఆ కార్డుల్లో వచ్చిన డేటా మనల్నీ, మన వ్యవసాయ పద్ధతులనీ, ప్రభుత్వ విధానాల్నీ కదిలించాల్సింది. కానీ అది జరగలేదు. 89% నేలల్లో నత్రజని లోపం ఉంది. 80% నేలల్లో భాస్వరం తగ్గింది. 49% నేలల్లో జింక్ కరవైంది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు సగటున 2.5% ఉన్న సేంద్రియ కార్బన్ నేడు 0.3%కి పడిపోయింది. ఇది నేల చనిపోతున్న పరిస్థితులకు సంకేతం. అయినా పంటల సరళి, వ్యవసాయ పద్ధతులు మారలేదు. యూరియా వాడకం పెరుగుతూనే ఉంది. ఎరువుల సబ్సిడీ కొనసాగుతూనే ఉంది. నేల చెప్పింది వినే తత్వం లేకుండా పోయింది.ఇది డేటా వైఫల్యం కాదు, డేటా నుండి నేర్చుకోవటానికి నిరా కరించిన వ్యవస్థ వైఫల్యం. డేటా మాత్రమే మంచి నిర్ణయాలకు దారితీయదు. ఆ డేటాను అర్థం చేసుకునే జ్ఞానం, దానిపై చర్యలు తీసుకోవాలనే సంకల్పం కూడా అవసరం. కార్డు చేతికిచ్చారు, కానీ దాన్ని అమలుచేసే వ్యవస్థ మారలేదు. డీలర్లు అదే యూరియా అమ్ముతూనే ఉన్నారు. రుణం తీసుకోవాలంటే ఎరువులు కొనాల్సిందే. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా స్థానాలు, సలహా ఇచ్చే విస్తరణ సేవలు అదే పాత పాట పాడుతున్నాయి. ఎక్కువేస్తే ఎక్కువ దిగుబడి భ్రమతెలంగాణాలో హెక్టారుకు 297 కిలోల ఎరువులు వేస్తున్నారు. జాతీయ సగటుకు రెట్టింపు కంటే ఎక్కువ. అయినా ఆ నేలల్లో సేంద్రియ కార్బన్ 0.3 నుంచి 0.8% మాత్రమే ఉంది. 90% నేలలు పోషకాల లోపంతో అల్లాడుతున్నాయి. పంటల దిగుబడి తగ్గి పోతోంది. ఎరువులు పెంచినా, ఎక్కువ మోతాదులో వేసినా దిగు బడి పెరగకుండా తగ్గుతోందని కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్‌లో హెక్టారుకు 277 కిలోల ఎరువులు వాడతారు. పంజాబ్ కంటే కూడా ఎక్కువ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో వరి సాగు ప్రాంతాల్లో మూడు–నాలుగు పోషకాల ఏకకాలిక లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ వైరుధ్యం ఇదే. నీటి పారుదల పెరిగింది, ఎరువుల వాడకం పెరిగింది, అయినా దిగుబడులు పెరగలేదు, రైతు రుణభారం తగ్గలేదు, భూములు పాడయ్యాయి.అసలు సమస్య ఎరువుల పరిమాణం కాదు – ఏకపంట వ్యవ సాయం. వరి–వరి లేకపోతే పత్తి. ఏకపంట వ్యవసాయం ఒకే నేల పొరలోని పోషకాలను పంట కాలం తర్వాత పంట కాలం పీల్చేస్తుంది. పంట వైవిధ్యం లేదు. సేంద్రియ పదార్థం తిరిగి నేలకు చేరడం లేదు. దానిపైన ఎక్కువ రసాయనిక ఎరువులు వాడబట్టి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు నాశనమవుతాయి. అవి లేకుండా, ఎంత ఎరువు వేసినా పంటకు అందడం లేదు. అది వృథాగా నీళ్లల్లో కరిగి బయటకు పోతుంది. భూగర్భ జలాలు కలుషితమవుతాయి.‘వెనుకబడ్డ’ రాష్ట్రాలు ఎందుకు ముందున్నాయి?నాగాలాండ్, మిజోరం వంటి రాష్ట్రాల్లో హెక్టారుకు 5 కిలోల కంటే తక్కువ ఎరువులు వాడతారు. అయినా వాటి నేల ఆరోగ్యం పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల కంటే మెరుగ్గా ఉంది. ఈ నేలలు ‘వెనుకబడ్డవి’ కావు. అవి ఇంకా బతికి ఉన్నాయి. కానీ సాయిల్ హెల్త్ పాలసీ ప్రకటిస్తున్న పీఎం–ప్రణామ్, కార్బన్ క్రెడిట్స్ వంటి పథకాలన్నీ ఎరువులు తగ్గించిన రైతుకు సహకారం అందించే విధానాలు. కానీ ఎప్పుడూ ఎరువులు వాడని, భూమిని కాపాడుకొంటున్న నాగాలాండ్ రైతుకు ఏమి దక్కుతుంది? తగ్గించడానికి అతడి దగ్గర పాత బేస్‌లైన్(ఆధార రేఖ) లేదు కాబట్టి ఏ పథకమూ వర్తించదు. ఈ సాధనాలు చెడ్డ స్థాయి నుండి బయట పడేవారికి బహుమానం ఇస్తాయి; ఆ చెడ్డ స్థాయికి అసలు ఎప్పుడూ వెళ్లని వారికి ఏమీ అందదు. ఇది తీవ్రమైన వైరుధ్యం. పరివర్తన ఆర్థిక వ్యవస్థ వేరు,సంరక్షణ ఆర్థిక వ్యవస్థ వేరు. మంచి నేలలు ఉన్న చోట వాటిని కాపాడే విధానం కావాలి. మారమని ప్రోత్సాహం కాదు. లేకుంటే మార్కెట్ శక్తులు ఆ నేలలను కూడా రసాయన సాగులోకి లాగుతాయి. భారత్ సాయిల్ హెల్త్ పాలసీ పరివర్తన, సంరక్షణ – ఈ రెండు రకాల ఆర్థిక వ్యవస్థలను నిర్మించాలి. మాటలు మారితే చర్యలూ మారాలి!కొత్త పాలసీలో మంచి భావనలున్నాయి. నేలను జాతీయ సంపదగా గుర్తించడం, జీవ సూచికలను పర్యవేక్షించడం, రైతులను నేల సంరక్షకులుగా గౌరవించడం. కానీ ఈ పాలసీ నిజంగా అమలు కావాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు.ఎరువుల సబ్సిడీ విధానంలో సంస్కరణలు జరగాలి. రసాయనిక ఎరువులకుగాక నేల సంరక్షణకూ, నేల ఆరోగ్యం కాపాడటానికీ సబ్సిడీలు ఇవ్వాలి. వరి–గోధుమ ఆధిపత్యాన్ని తగ్గించాలి. పప్పు ధాన్యాలు, నూనెగింజలకు మద్దతు ధరలు, కొనుగోలు హామీలు ఇవ్వాలి. రైతు సంస్థలు, ఎఫ్‌పీఓ(ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనై జేషన్)లు కేవలం అమలు యంత్రాంగంగా కాకుండా, జవాబుదారీ తనంలో భాగం కావాలి. పీజీఎస్ (పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్) ధ్రువీకరణ వ్యవస్థలు పాలసీలో భాగం కావాలి. డేటా తయారు చేయడం సులభం. డాష్‌బోర్డులు పెట్టడం ఇంకా సులభం. కానీ డేటా చెప్పింది వినాలంటే, వ్యవస్థ మారాలనే సంకల్పం కావాలి. ఆ సంకల్పమే ఇప్పుడు లేనిది. నేల పరీక్ష చేయించాం. నేల ఏం చెప్తుందో తెలుసు. ఇక మనం ఏం చేస్తామో చూడాలి.డా‘‘ జి.వి.రామాంజనేయులువ్యాసకర్త ‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
యుద్ధ పాఠాలు పెద్దవే!
పాఠాలు ఏ యుద్ధానికైనా ఉంటాయి. కొన్నింటికి అసాధారణంగా, బహుముఖాలుగా ఉంటాయి. అటువంటి వాటిలో ఇరాన్ యుద్ధం ఒకటి. యుద్ధంలో ప్రత్యక్ష పాత్రధారులు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్. అమెరికా సైనిక స్థావరాలకు చోటి చ్చిన కొన్ని గల్ఫ్ రాజ్యాలు అందు బాటులో అసంకల్పిత భాగస్వాముల య్యాయి. పరోక్షంగా మొత్తం ప్రపంచానికి పాత్ర ఏర్పడింది. ఏదో విధమైన కష్టనష్టాలు అందరికీ కలిగాయి. గెలిచినవారు ఎవరూ లేరు. పాఠాలు మాత్రం అందరికీ ఉన్నాయి.కళ్లముందున్న చరిత్రకేవలం సైనిక బలాన్ని నమ్మి, తమది సాటిలేని శక్తి అంటూ అహంకరించి, ప్రత్యర్థిని సరిగా అంచనా వేయకుండా దాడికి పాల్ప డటం ఓటమికి దారి తీస్తుంద న్నది అమెరికాకు మొదటి పెద్దపాఠం. అమెరికా సైనిక బలం మొత్తం ప్రపంచంలోనే సాటి లేనిదన్నది నిర్వివాదాంశం. కానీ అసమానుల మధ్య అసమతుల యుద్ధ వ్యూహాలు ఉంటాయన్నది కొత్తగా తెలుసుకోవలసిన విషయం కాదు. స్వయంగా అమెరికా మొదట వియత్నాంలో (1975)లో నేర్చింది. అఫ్గానిస్తాన్లోనైతే అదే పాఠాన్ని బ్రిటన్ (1839–1919), రష్యా (1979–89), అమెరికా (2001–21)లు వరుసగా నేర్చాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కూడా అటువంటి రూపానికే మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇటువంటి అనుభవాలు ఉండి కూడా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, జాగ్రత్తగా ఆలోచించిన తన సలహాదారులు కొందరు వద్దని వారించినా, చివరకు ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ విముఖత చూపినా పెడచెవిన పెట్టి ఇరాన్‌పై దాడులకు దిగారు. తమపై యుద్ధం ఎప్పటికైనా జరుగుతుందని అంచనా వేసిన ఇరాన్ సుమారు 20 సంవత్సరాలుగా తన రక్షణ ఏర్పాట్లు చేసుకుంటున్నదనీ, 2025 జూన్ నాటి 12 రోజుల యుద్ధం తర్వాత ఆ ఏర్పాట్లను ముమ్మరం చేసిందనీ, ప్రస్తుత యుద్ధానికన్నా ముందే అమెరికన్ సైనిక నిపుణులు, బయటి నిపుణులు ట్రంప్‌ను హెచ్చరించారు. ఇదేమీ చాలదనుకుంటే, ఒకవేళ తమపై యుద్ధానికి దిగి నట్లయితే గల్ఫ్ ప్రాంతంలోని అమెరికన్ సైనిక స్థావరాలను, ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయగల శక్తి తమకుందని ఇరాన్ పదేపదే హెచ్చరించింది. తాము స్వయంగా హార్మూజ్‌ను మూసి వేయటమేగాక, తమ మిత్రులు హౌతీలతో బాబ్ అల్ మందేల్ను మూసివేయించగలమని స్పష్టం చేసింది. ఇరాన్‌కు రష్యా, చైనాల సాంకేతిక సహాయాలు ఉండటమూ తెలిసిందే.అయినా ఎందుకు?మొత్తం పరిస్థితులు ఈ విధంగా ఉండగా దాడులకు సమ కట్టడమేగాక, ఇరాన్లో తమ లక్ష్యం వెనిజులాలో వలె కనుమూసి తెరిచేలోగా నెరవేరిపోతుందని అంచనా వేయటం ఎంత పెద్ద తప్పో అమెరికా, ఇజ్రాయెల్‌లకు అర్థమయేందుకు ఎక్కువ రోజులు పట్ట లేదు. అది సైనికపరమైన పాఠం కాగా, రాజకీయమైనది కూడా కొద్ది రోజులలోనే తెలిసి వచ్చింది. వారు భ్రమపడినట్లు, ఖొమైనీని హత్య చేయటంతో ఇరానియన్ వ్యవస్థ రాజకీయంగా కుప్పకూలి, తమకు అనుకూలమైన శక్తులేవో అధికారాన్ని చేజిక్కించుకోవటం, ప్రజలు ఇస్లామిక్ వ్యవస్థపై తిరుగుబాటు చేయటం వంటివేవీ జరగలేదు. ఇవేవీ జరగకపోగా ఇరానియన్లు దేశ భక్తితో ఒకటయ్యారు. ఇరాన్‌తో అమెరికాది దశాబ్దాల అనుభవం. ఇరాన్లో ఇస్లామిక్ రివల్యూషన్ (1979) తర్వాత అక్కడి అధినాయకత్వం తమ రాజకీయ, సైనిక వ్యవస్థలను ప్రాంతాల వారీగా వికేంద్రీకరించి స్వయం ప్రతిపత్తితో నిర్ణయాలు తీసుకుంటూ, మొత్తం మీద కేంద్రాధికార ఉత్తర్వుల ప్రకారం వ్యవహరించేట్లు నిర్మించిన విషయం అమెరికాకు తెలియదనుకోలేము.ఇన్నిన్ని ఉన్నా దాడులు చేయటమేగాక, అంతా క్షణాలలో తేలి పోతుందనుకోవటానికి కారణాలు రెండే రెండు కనిపిస్తున్నాయి. ఒకటి, ఇరాన్ చమురుపై దశాబ్దాలుగా కన్ను వేసిన అమెరికా, గత జనవరిలో వెనిజులా చమురును స్వాధీనపరచుకున్న తర్వాత ఇప్పుడు ఇరాన్‌వైపు కదలటం. అమెరికా ఆర్థిక వ్యవస్థతో పాటు డాలర్ కరెన్సీ విలువ బహుళ ధ్రువ ప్రపంచం వల్ల బలహీనపడు తుండటంతో, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లక్ష్యం కోసం ఇదంతా చేయటం. రెండవది, ఎట్టి పరిస్థితులలోనూ పాలస్తీనా సృష్టిని ఆపి, గ్రేటర్ ఇజ్రాయెల్‌ను స్థాపించాలన్న నెతన్యాహూ ఒత్తిడికి లొంగిపోవటం. చివరకు అసమాన యుద్ధమే గెలిచింది.వంద రోజుల యుద్ధం తర్వాత అంతే పెద్ద రాజకీయ పాఠాలు న్నాయి. నాటో దేశాలు సహా ఏ ఒక్కరూ ట్రంప్ నోరు తెరిచి అడిగినా తోడు నిలవక పోవటం. 1949లో నాటో ఏర్పడిన తర్వాత గత 77 సంవత్సరాలలోనే ఎప్పుడూ ఇట్లాంటి తిరస్కరణ అమె రికాకు ఎదురు కాకపోవటం పాఠం కన్నా పరాభవమనాలి. తను నెగ్గలేక ఇరాన్‌తో రాజీకి ప్రయత్నిస్తున్న దశలో అందుకు ఆటంకాలు సృష్టిస్తున్న నెతన్యాహూను ఆయన, ‘నువ్వు ప్రపంచంలో ఏకాకి వయా’వంటూ హెచ్చరించారుగానీ, వాస్తవానికి వారిద్దరూ ఒంటరి అయ్యారు. ట్యారిఫ్‌లతో మొదలై ఒకటి వెంట ఒకటిగా సాగుతూ వస్తున్న ఈ విధమైన పరిణామాలతో యూరప్, ఆసియాలలోని మిత్రులు తమ దారి తాము నెమ్మదిగా వెతుక్కుంటుండగా, చైనా, రష్యాల ప్రాబల్యం పెరగటం, వర్ధమాన ప్రపంచానికి అమెరికా పట్ల భక్తి, భయం రెండూ తగ్గుతుండటం మరో ముఖ్యమైన పాఠం. సమీక్షించుకోవాల్సిన వైఖరులుఇజ్రాయెల్ విషయానికి వస్తే, 1948లో ఒక దేశంగా సృష్టి అయినప్పటి నుంచి ప్రస్తుత యుద్ధం వరకు 68 సంవత్సరాలలో వారికి ఇంత ఎదురుదెబ్బ తగలలేదు. ఇజ్రాయెలీ సైన్యం అతిశక్తి మంతమైనదే అయినా, వారి ఐరన్ డోమ్ దుర్భేద్యమన్న పేరుండినా, ఇరాన్ అసమతల యుద్ధ వ్యూహాలను అది కూడా తట్టుకోలేక పోయింది. కనుక ఇక్కడినుంచి వారు చేయవలసింది మొదట పాల స్తీనాను ఏర్పాటు కానివ్వటం, తర్వాత గ్రేటర్ ఇజ్రాయెల్ పథకాన్ని వదిలి వేయటం. ఇరాన్‌కు గల ఒకే ఒక పాఠం ఒక స్థాయిలో అత్యద్భుతంగా పోరాడి నిలిచినా, తగు ప్రజాస్వామిక సంస్కరణ లతో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోవటం.గల్ఫ్ రాజ్యాల గురించి చెప్పుకోవాలంటే, వారు తమ ఇరాన్ వ్యతిరేకత, పాలస్తీనా అంశం పట్ల కపట వైఖరి, అమెరికా ఇజ్రా యెల్ ప్రేమ, వారిచ్చే రక్షణ పేరిట ఆ కూటమిలో బందీలుగా ఉండ టమనే విధానాలను సవరించుకోవలసి ఉంటుంది. గత విధానాల వల్ల కలిగే కష్ట నష్టాలు వారికిపుడు బాగానే అర్థమయినట్లు కనిపిస్తు న్నది. ఇక ఇండియా సహా వర్ధమాన దేశాలకు అమెరికా నిర్హేతుక మైన విధానాల వల్ల ఎదురయ్యే సమస్యలేమిటో ట్యారిఫ్‌లు, వాణిజ్య ఒప్పంద విషయాల నుంచి యూరప్ వలెనే తమకూ అనుభవంలోకి వస్తున్న విషయమే. అవే విధానాలతో ఈ యుద్ధాన్ని ప్రత్యక్షంగా ఇరాన్‌పై, పరోక్షంగా మొత్తం ప్రపంచంపై రుద్దినందువల్ల కలుగుతున్న నష్టాలు తెలిసి వచ్చినందున, భవిష్యత్తులో ఇంధనం కావచ్చు, రాజకీయ వైఖరులు కావచ్చు, తాము మరింత స్వతంత్రంగా, స్వావలంబన దిశగా చర్యలు తీసుకోవటమన్నది వారికి గల పాఠం.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నిధులిస్తారా లేక నీళ్లు నములుతారా?
దేశంలోని కోట్లాది గ్రామీణ పేదలకు గత రెండు దశాబ్దాలుగా కనీస జీవన భద్రతగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీనరేగా)ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి, జూలై 1 నుండి ‘వీబీ జీ రామ్ జీ’ని అమల్లోకి తేవడానికి సంబంధించిన నిబంధనలను రూపొందించింది. 55కు పైగా ప్రధాన క్లాజులు, రూల్స్, వందలాది ఉప నిబంధనలు, కొత్త పరిపాలనా నిర్మాణాలతో రూపొందించిన ఈ వ్యవస్థ ఉపాధి హామీని బలోపేతం చేయడానికి కాదు; దాని హక్కు ఆధారిత స్వభావాన్ని పూర్తిగా బలహీనపరచడానికే ఉద్దేశించబడింది. ఉపాధి హామీ కాదు, నిరుద్యోగ హామీ ఇది. చెట్టును నరికి నీడ ఇస్తామని చెప్పడం ఎంత మోసమో, ‘ఎంజీనరేగా’ను నిర్వీర్యం చేసి 125 రోజుల ఉపాధి హామీ ఇస్తామని చెప్పడం అంతే మోసం. లెక్కలు చెప్పే నిజాలుకేంద్ర ప్రభుత్వం 100 రోజుల బదులు 125 రోజుల ఉపాధి హామీ ఇస్తున్నామని ప్రచారం చేస్తోంది. కానీ ఏ ఉపాధి పథకం అయినా హామీలపై కాదు, నిధులపై నిలబడుతుంది. ఇక్కడే మొదటి వైరుధ్యం కనిపిస్తుంది. 125 రోజుల ఉపాధి కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో కొత్త పథకానికి కేవలం రూ. 95,000 కోట్లను మాత్రమే కేటాయించింది. ఈ కేటాయింపు 125 రోజుల ఉపాధికి ఏమాత్రం సరిపోదని రాష్ట్రాలవారీ పని దినాల గణాంకాలే చెబుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం గత సంవత్సరం కేరళలో సగటు పనిదినాలు 57.81, తెలంగాణలో 50.24, తమిళనాడులో 48.54, పశ్చిమ బెంగాల్లో 44.12, ఆంధ్రప్రదేశ్‌లో 42.35 మాత్రమే ఉన్నాయి. బిహార్‌లో 30.94, ఉత్తరప్రదేశ్‌లో 27.50, మధ్యప్రదేశ్‌లో 25.66, మహారాష్ట్రలో 14.40, హరియాణాలో 13.78 రోజులకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం 15 నుంచి 50 రోజుల పని కూడా పూర్తిగా ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం 95 వేల కోట్లతో ఒక్కసారిగా 125 రోజుల ఉపాధి ఎలా కల్పిస్తుంది?ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను మినహాయించి 17 ప్రధాన రాష్ట్రాల గణాంకాలను పరిశీలిస్తే 7 కోట్ల 69 లక్షల 65 వేల యాక్టివ్ జాబ్ కార్డులు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కార్మికులకు 125 రోజుల ఉపాధి హామీని అమలు చేయడానికి మొత్తం రూ. 3.61 లక్షల కోట్ల వ్యయం అవసరం. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కేటాయింపు ఈ రాష్ట్రాలకు 85,605 కోట్లు మాత్రమే. రాష్ట్రాల 40 శాతం వాటా 57,071 కోట్లు కలిపినా మొత్తం అందుబాటులో ఉండే నిధులు 1.43 లక్షల కోట్లే. ఈ నిధులతో సంవత్సరంలో సగటున 48.5 పని దినాలే ఇవ్వగలరు. కేంద్రం కేటాయించిన నిధులు తప్ప అదనంగా పైసా నిధులు ఇవ్వబోమని రూల్స్‌లో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అంటే, ఈ లోటును భర్తీ చేయడానికి రాష్ట్రాలే అదనంగా 2.18 లక్షల కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోంది. అంటే 30 శాతం వాటా కేంద్రం, 70 శాతం వాటా రాష్ట్రాలు ఖర్చు చేయాలి. తెలుగు రాష్ట్రాల తీరుఆంధ్రప్రదేశ్లో 54.99 లక్షల యాక్టివ్ జాబ్ కార్డులు ఉన్నాయి. కేంద్రం ప్రతిపాదిందిన 7,707 కోట్లతో ఒక్కో కార్డుకు సగటున 71 పనిదినాలు మాత్రమే కల్పించవచ్చు. 125 రోజుల ఉపాధి కల్పించాలంటే 22,746 కోట్లు అవసరం కాగా, రాష్ట్రంపై 15,039 కోట్ల అదనపు భారం పడుతుంది. తెలంగాణలో 30.99 లక్షల యాక్టివ్ జాబ్ కార్డులు ఉన్నాయి. కేంద్రం కేటాయించిన 3,825 కోట్లతో ఒక్కో కార్డుకు సగటున 62 పనిదినాలు మాత్రమే కల్పించవచ్చు. 125 రోజుల ఉపాధికి 12,819 కోట్లు అవసరం కాగా, రాష్ట్రంపై 8,993 కోట్ల అదనపు భారం పడు తుంది. ఈ లెక్కలు ఒక స్పష్టమైన రాజకీయ సత్యాన్ని బయటపెడు తున్నాయి. హామీ కేంద్రానిది, ప్రచారం కేంద్రానిది, ఖర్చు రాష్ట్రా లది. నియంత్రణ మోదీ గారిది, విఫలమైతే నింద రాష్ట్రాలది. ‘పెళ్లి పెద్దలు చేసుకున్నారు – కట్నం మాత్రం రాష్ట్రాలు పెట్టాలి’ అన్న ట్టుగా ఈ వ్యవస్థ రూపొందుతోంది. ఇక్కడ ఒక పాత సామెత గుర్తుకు వస్తుంది: ‘ఎద్దు ఇస్తానని చెప్పి తాడు చేతిలో పెట్టినట్టు’. రాష్ట్ర ప్రభుత్వలు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం సాధ్యమా? అంతిమంగా నష్టపోయేది ఉపాధి కార్మికులే. పేరు కాదు, తత్వమే మారింది!డ్రాఫ్ట్ రూల్స్‌లోని రూల్ 3 చెల్లింపులు, బ్యాంకు మరియు పోస్టాఫీస్ ఖాతాల ద్వారా వేతనాల చెల్లింపును ప్రస్తావిస్తుంది. కానీ కార్మికుడి హక్కుల రక్షణపై స్పష్టత కనిపించదు. వేతనాలు ఆలస్య మైతే బాధ్యత ఎవరిది? నిరుద్యోగభృతి చెల్లించకపోతే బాధ్యులపై చర్య ఏమిటి? వంటి ప్రశ్నలకు రూల్స్‌లో స్పష్టమైన సమాధానం లేదు. కార్మికుడి హక్కు కేంద్ర బిందువుగా ఉండాల్సిన చోట పరిపా లనా ప్రక్రియ కేంద్ర బిందువుగా మారుతోంది. అత్యంత ప్రమాదకరమైన మార్పు రూల్ 4లో కనిపిస్తుంది. రూల్ 4(2)లోని నార్మటివ్ అలోకేషన్ విధానం ఎంజీ నరేగా అసలు తత్వాన్నే మార్చేస్తోంది. ఎంజీనరేగా ప్రాథమిక సూత్రం ‘పని అడిగితే పని ఇవ్వాలి.’ పని డిమాండ్ ఉంటే ప్రభుత్వం నిధులు సమకూర్చాలి. కానీ కొత్త విధానం పని హక్కును బడ్జెట్ పరిమితికి కట్టిపడేస్తోంది. అంటే ఇప్పుడు నిధులు ఉంటేనే పని. హక్కు నుండి కోటాకు మార్పు. చట్టబద్ధ హామీ నుండి బడ్జెట్ పరిమితికి మార్పు. పౌరుని హక్కు నుండి అధికారుల విచక్షణకు మార్పు. ‘బావి ఎండి పోయాక మోటారు పెంచినట్టు’ 125 రోజుల హామీ ఉంది.ఈ నేపథ్యంలో మహాత్మా గాంధీ పేరును ఎందుకు తొలగించా రన్న ప్రశ్నకూ సమాధానం దొరుకుతుంది. గాంధీ పేరు గ్రామ స్వరాజ్యం, వికేంద్రీకరణ, గ్రామసభల పాత్ర వంటి భావనలకు ప్రతీక. కానీ కొత్త వ్యవస్థలో గ్రామ సభలు బలహీనపడుతున్నాయి. అందుకే ‘ముందు బోర్డు మార్చారు – ఇప్పుడు భవనం కూల్చేస్తున్నారు.’ ఇది పేరు మార్పు కాదు. తత్వ మార్పు. డ్రాఫ్ట్ రూల్స్‌లోని డిజిటల్ నిబంధనలు కూడా ఇదే ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. ఈ–కేవైసీ, ఫేస్ అథెంటికేషన్, ఎన్ఎంఎన్ఎస్, ఆధార్ అథెంటికేషన్ వంటి విధానాలను ఆధునికీకరణ పేరుతో ప్రవేశపెడుతున్నారు. కానీ గ్రామీణ పేద కార్మికుల అను భవం వేరే కథ చెబుతోంది. నెట్వర్క్ లేకపోతే పని లేదు. వేలి ముద్ర పడకపోతే వేతనం లేదు. అంటే పని హక్కు కార్మికుడి చేతిలో లేదు. సాంకేతిక వ్యవస్థల చేతిలో ఉంది.ఎంజీనరేగా గ్రామీణ కార్మికుడికి కనీస భద్రతను ఇస్తుంది. వేతనాలపై ఒక కనీస ప్రమాణాన్ని సృష్టిస్తుంది. ఆకలి, నిరుద్యో గాన్ని కొంతమేర నియంత్రిస్తుంది. అందుకే దేశంలోని వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు, మహిళలు, దళితులు, ఆదివాసీలు, వ్యవసాయ, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజాస్వామ్య శక్తులు విశాల ఐక్య వేదికలను నిర్మించి ఈ దాడిని తిప్పికొట్టాలి. వీబీ జీ రామ్ జీని ఉపసంహరించాలి. 200 రోజుల చట్టబద్ధ ఉపాధి హామీ కల్పించాలి. పూర్తి కేంద్ర నిధులు విడుదల చేయాలి. గ్రామ సభలు, పంచాయతీల అధికారాలను బలోపేతం చేయాలి.బి. వెంకట్వ్యాసకర్త అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి -
జీవితాన్ని 'మార్చే క్షణాలు' కొన్నే!
నన్ను ఈ రోజు ప్రసంగించేందుకు ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. ఈ రోజు మీకు సలహాలు ఇవ్వాల్సిన రోజని నాకు తెలుసు. నేను నేర్చుకున్న ఒక విషయం ఏమిటంటే – కాలం మారినా,సాంకేతికత మారినా, కొన్ని సలహాలు ఎప్పటికీ విలువైనవే. మీలో కొందరికి లక్ష్యం ఇప్పటికే స్పష్టంగా తెలిసి ఉంటుంది. మరికొందరికి స్పష్టంగా తెలియకపోవచ్చు. అది సహజమే. పట్టభ ద్రుడిగా బయటకు వచ్చిన రోజున నాకూ అలానే అనిపించింది. జీవితం ఎన్నో పెద్ద పెద్ద నిర్ణయాల సమాహారమనీ, వాటన్నింటినీ సరిగ్గా తీసుకోవాల్సిందేననీ భావించేవాడిని. ప్రత్యేకంగా మీలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి పరీక్ష, ప్రతి ప్రాజెక్ట్, ప్రతి మార్కు కోసం కష్టపడతారు. కానీ మీకు ఒక చిన్న రహస్యం చెబుతాను. ఇవన్నీ ఆ సమయంలో చాలా ముఖ్యంగా అనిపించినా, జీవితాన్ని నిర్ణయించే అంశాలు అంతగా కావు. మీరు ఒక పరీక్షలో విఫలమైనా, ఒక క్లాస్ మిస్ అయినా, లేదా సంగీత వాయిద్యం నేర్చుకోకపోయినా – ఈ రోజు ఇక్కడే ఉండేవారు. దీన్ని నేను ఎలా గ్రహించానో చెప్పడానికి ఒక చిన్న కథ చెబుతాను. స్టాన్ ఫోర్డ్లో చదువుతున్నప్పుడు నాకు పాట్ అనే స్నేహితుడు ఉండేవాడు. ఒక రోజు ఉదయం అతను ‘‘క్లాస్‌కు వెళ్లకుండా లాస్ వెగాస్ వెళ్దామా?’’ అని అడిగాడు. అప్పటివరకు నేను ఎప్పుడూ క్లాస్ మిస్ కాలేదు. రోడ్ ట్రిప్ కూడా చేయలేదు. అయినప్పటికీ ‘‘సరే’’ అన్నాను. మేము మా గదులకు వెళ్లి కొన్ని వస్తువులు తీసు కుని ప్రయాణం ప్రారంభించాం. కొండల మధ్యగా ప్రయాణిస్తున్నప్పుడు మంచు కురవడం మొదలైంది. నేను జీవితంలో మొదటిసారి మంచును చూశాను. చేతిని బయటకు చాచి మంచు రేణువులను తాకాను. అవి ఎంత మృదువుగా ఉన్నాయో చూసి ఆశ్చర్య పోయాను. ఆ క్షణం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోయింది. మీ జీవితంలో ఎన్నో సందర్భాలు ఎదురవుతాయి. వాటిలో కొన్నే నిజంగా ముఖ్యమైనవి. ఉదాహరణకు – జీవిత భాగస్వామిని ఎంచుకోవడం, కుటుంబాన్ని ప్రారంభించాలా వద్దా నిర్ణయించడం, లేదా కెరీర్లో పెద్ద మార్పు చేయడం. ఇలాంటి నిర్ణయాలకు సమయం, స్పష్టమైన ఉద్దేశం అవసరం. అయితే జీవితంలో చాలా పెద్దవిగా కనిపించే మరెన్నో సందర్భాలు కూడా వస్తాయి. నిజానికి అలాంటివి వేల సంఖ్యలో ఉంటాయి. కానీ వాటిలో చాలా తక్కువ మాత్రమే మీ జీవితాన్ని మార్చగలవు. కళాశాల పూర్తయ్యాక వచ్చే మొదటి ఉద్యోగం, తర్వాత మీరు వెళ్లే నగరం, లేదా ఒక రోడ్ ట్రిప్‌కు వెళ్లాలా వద్దా అనే నిర్ణయం – ఇవన్నీ మీ జీవిత ప్రయా ణానికి కొత్త అనుభవాలను జోడిస్తాయి. కానీ సాధారణంగా ఇవి మీ జీవిత దిశను నిర్ణయించవు. కాబట్టి ముఖ్యమైన విషయాలను, అనవసరమైన శబ్దం నుంచి వేరు చేసి గుర్తించగలిగితే, మీరు కోరు కున్న దిశగా మీ జీవితాన్ని మలుచుకోగలుగుతారు. అందుకే ఈ రోజు నా జీవితంలో నేను అనుసరించిన మూడు సులభమైన సూత్రాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.1. ఆశావాదాన్ని ఎంచుకోండి!నేను చెప్పబోయే మొదటి సూత్రం – ఆశావాదాన్ని ఎంచు కోవడం. ప్రతిరోజూ వార్తలు చూస్తే మనం కఠినమైన కాలంలో జీవిస్తున్నామనిపిస్తుంది. కానీ ప్రతి తరం తమదైన సవాళ్లను ఎదుర్కొంది. మనం ఏ ప్రపంచంలో పట్టభద్రులమవుతామో ఎంచు కోలేము. కానీ ఆ పరిస్థితులను ఎలా చూడాలో మాత్రం మనమే నిర్ణయించగలం.నేను చెన్నై నగరంలో పెరిగాను. తీవ్రమైన కరువులు వచ్చేవి. నీటి ట్యాంకర్లు సమయానికి వస్తాయో లేదో అని ఎదురుచూసే వాళ్లం. టెలిఫోన్, టెలివిజన్, ఫ్రిజ్ వంటి వస్తువులు పొందడానికి సంవత్సరాలు పట్టింది. అయితే నా తల్లిదండ్రులు ఎప్పుడూ నా కల లను పరిమితం చేయనివ్వలేదు. అందుకే ఒకరోజు సిలికాన్ వ్యాలీలో పని చేయాలనే కలను నేను కనగలిగాను. స్టాన్‌ఫోర్డ్‌లో అడ్మిషన్ వచ్చినప్పుడు, అమెరికాకు పంపేందుకు నా తండ్రి దాదాపు ఏడాది జీతానికి సమానమైన డబ్బును విమాన టికెట్ కోసం ఖర్చు చేశారు. కాలిఫోర్నియాకు చేరుకున్న తర్వాత, విమానాశ్రయం నుంచి వస్తూ రహదారి పక్కన ఉన్న కొండలను చూసి, ‘ఇక్కడ అంతా పచ్చగా ఉంటుందని అనుకున్నాను, కానీ ఇవి గోధుమ రంగులో ఉన్నాయి’ అన్నాను. అప్పుడు నా ఆతిథ్య కుటుంబంలోని జేన్ ఎర్ల్ అనే మహిళ చిరునవ్వుతో, ‘‘మేము వాటిని గోధుమ రంగు కొండలు అని కాదు, బంగారు కొండలు అని పిలుస్తాం’’ అన్నారు. అదే ఆశావాదం అంటే. నేను గోధుమ రంగును చూశాను; ఆమె బంగారు రంగును చూసింది. దృక్పథంలో వచ్చిన ఈ చిన్న మార్పు నా జీవితంపై ఎంతో ప్రభావం చూపింది. స్టాన్ ఫోర్డ్లో నేను పీహెచ్డీ పూర్తి చేసి అధ్యా పక వృత్తిలోకి వెళ్లాలని అనుకున్నాను. కానీ పరిస్థితులు మారాయి. త్వరగా ఉద్యోగం చేయాల్సి వచ్చింది. నా డాక్టరేట్ కార్యక్రమాన్ని వదిలి మాస్టర్స్ డిగ్రీతోనే బయటకు రావాల్సి వచ్చింది. దాన్ని నేను ఒక కల ముగిసినట్లుగా భావించవచ్చు. కానీ ఆ ‘గోధుమ కొండ’ను ‘బంగారు కొండ’గా చూడటం నేర్చుకున్నాను. 2. కష్టమైన పనులను ఎంచుకోండి!స్టాన్ ఫోర్డ్ వదిలిన తర్వాత నేను వెంటనే విజయాన్ని సాధించా నని చెప్పాలనుకుంటున్నాను. కానీ అది నిజం కాదు. స్టాన్ ఫోర్డ్ పూర్తి చేసిన దాదాపు పదేళ్ల తర్వాత కూడా నేను సరైన దారిలో ఉన్నానా అనే సందేహం ఉండేది. అలాంటి సమయంలో నేను గూగుల్‌కు దరఖాస్తు చేసుకున్నాను. 2004, ఏప్రిల్ 1న నా చివరి ఇంటర్వ్యూ జరిగింది. అదే రోజు జీమెయిల్ ప్రారంభమైంది. ఇంటర్వ్యూలో వారు జీమెయిల్ గురించి అడిగినప్పుడు అది నిజమైన ఉత్పత్తో, సరదా జోకో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రతి ఒక్కరికీ 1 జీబీ ఉచిత స్టోరేజ్ ఇవ్వడం అసాధ్యమైన ఆలోచనగా అనిపించేది.కొన్ని సంవత్సరాల తర్వాత నాకు కూడా అసాధ్యంగా కనిపించిన ఒక సమస్యపై పని చేసే అవకాశం వచ్చింది. అదే గూగుల్ క్రోమ్. మేము బ్రౌజర్‌ను మరింత వేగంగా రూపొందించవచ్చని భావించాం. కానీ చాలామంది అది కష్టమన్నారు. వందలాది ఇంజి నీర్లు అవసరమన్నారు. మా దగ్గర కేవలం పది మందే ఉన్నారు. 2008లో మేము క్రోమ్‌ను ప్రారంభించాం. మొదటి 24 గంటల్లో 80 లక్షల మంది ఉపయోగించారు. కానీ కొంతకాలానికి వృద్ధి ఆగిపోయింది. ఏడాది తర్వాతా మార్కెట్లో మా వాటా 2 శాతమే. మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్ క్రోమ్‌ను ఎగతాళి చేస్తూ ‘‘ఇది లెక్కలోకి కూడా రాని చిన్న విషయం’’ అన్నారు. మేము నిరుత్సాహపడలేదు. ప్రతి ఆరు వారాలకు కొత్త వెర్షన్ విడుదల చేశాం. ఇతర కంపెనీలు ఆరు నెలలకు లేదా ఏడాదికి ఒకసారి మాత్రమే విడుదల చేసేవి. క్రమంగా విజయం మా వైపు వచ్చింది.3. ఉత్సాహాన్ని కలిగించే పనిని చేయండి!1993లో స్టాన్ ఫోర్డ్‌లోని కంప్యూటర్ ల్యాబ్‌లోకి వెళ్లినప్పుడు, ఎప్పుడైనా ఉపయోగించగలిగే కంప్యూటర్ల వరుసలను చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడు ఇంటర్నెట్ ప్రపంచం రూపుదిద్దుకుంటోంది. అది మానవ అభివృద్ధికి గొప్ప సాధనంగా మారుతుందని నేను గుర్తించాను. ఎక్కువ మందికి ఈ సాంకేతికతను అందించడంలో భాగస్వామి కావాలనే ఆలోచనే నన్ను ఉత్సాహపరిచింది. అందుకే నేను గూగుల్‌లో చేరాను. అందుకే క్రోమ్‌బుక్స్, ఆండ్రా యిడ్ వంటి ప్రాజెక్టులపై పనిచేశాను. అందుకే మీ జీవిత మార్గాన్ని ఎంచుకునేటప్పుడు: మీ తల్లిదండ్రులు కోరుకునేదాన్ని మాత్రమే చూడకండి. మీ స్నేహితులందరూ చేస్తున్నదాన్ని అనుసరించకండి. దానికి బదులుగా, రాత్రి పొద్దు పోయే వరకు మీ స్నేహితులతో ఉత్సాహంగా మాట్లాడేలా చేసే విష యాలను గుర్తించండి. వెళ్లి అదే పని చేయండి. -
మహువా మొయిత్రా (ఎంపీ) రాయని డైరీ
మనసు విప్పుకోవటం అన్నది ఒక లెక్క ప్రకారం జరిగేది కాదు. లెక్క ప్రకారం జరిగిందీ అంటే, అది మనసు విప్పుకోవటం అవదు, కప్పుకోవటం అవుతుంది. నచ్చిన దుస్తులు ఒంటికి వేసుకున్నట్లే, నప్పని బట్టలు మనసుకు తొడుక్కోవటం అవుతుంది. ఆ పని నేను ఎప్పటికీ చేయలేను. అందమైన చేనేతలు, ప్రకాశవంతమైన రంగులు నాకు నచ్చుతాయి. నా పెళ్లికి నేను లేత గులాబీ రంగు జరీ పట్టు చీరను ఎంచు కున్నాను. పెళ్లి రిసెప్షన్‌కి, లోక్‌సభలో నాపై నేర విచారణకు బ్రైట్ రెడ్; పార్లమెంటు సమావేశాలకు బ్రైట్ బ్లూ; పార్లమెంట్లో డిబేట్ కోసం ముదురు గులాబీ, ఆకుపచ్చ రంగులు; ఫుట్ బాల్ ఆడేటప్పుడు షూజ్ మీదికి ఎనర్జిటిక్ ఆరెంజ్ శారీ; హార్పర్స్ బజార్ మ్యాగజైన్ ముఖ చిత్రానికి మెజెంటా కలిసిన ఇండిగో హాండ్లూమ్ పట్టు చీర.ఇక నా మొదటి పెళ్లిలో నేను ఏ రంగు చీరను కట్టుకున్నానో గుర్తు చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అది వెలిసిపోయిన వివాహం. మొన్నటి బీబీసీ ‘టాక్ షో’కి తెల్లంచు ముదురు నారింజ రంగు చీరతో వెళ్లాను. ఎన్నికల్లో తృణమూల్ ఓటమి, పార్టీలో తీవ్ర సంక్షోభం, దీదీకి వ్యతిరేకంగా ఎంపీలు, ఎమ్మెల్యేల తిరుగుబాట్లు, బీజేపీకి మద్దతు ఇవ్వటం... వీటి గురించే కదా ‘టాక్ షో’లో అడుగుతారు. మనసుకు దుస్తులు తొడిగే అలవాటు లేనప్పుడు, ఉన్నది ఉన్నట్లే లోపల్నుంచి వచ్చేస్తుంది. మంచీ వస్తుంది, చెడూ వస్తుంది. మంచీ చెడుల మధ్య గుర్తొచ్చినవీ కొన్ని బయటికి వచ్చేస్తాయి. సువేందు గురించి కూడా నా మనసులో ఉన్నది ఉన్నట్లే మాట్లాడాను. తృణమూల్ నుంచి బీజేపీలోకి వెళ్లి, పశ్చిమ బెంగాల్‌కు సీఎం అయ్యారు సువేందు. తృణమూల్‌లో ఆయన మొదట్నుంచీ ఉన్నారు. తృణమూల్‌లో నేను చేరినప్పటి నుంచీ నాతో ఉన్నారు.నాతో అంటే... నా నిరాశలో,నా నిస్పృహలో, నా దుఃఖంలో,నా అయోమయంలో నా వెంట ఉన్నారు. ‘‘రాజకీయాలు యూఎస్‌లోని మౌంట్ హోలియోక్ కాలేజీ నుండి అర్థ, గణిత శాస్త్రాలలో డిగ్రీ పట్టా పొందటంలా ఉండవు మొయిత్రా..’’ అనేవారు.‘‘జేపీ మోర్గాన్ చేజ్’లో సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా ఉంటూ, వారి లండన్ కార్యాలయంలో వైస్ ప్రెసిడెంట్ పదవికి ఎదగటం లానూ ఉండవు..’’ అని నవ్వేవారు. 2014లో నాకు లోక్‌సభ టికెట్ రావాల్సింది. రాలేదు! సువేందు నన్ను ఓదార్చారు. నాకు ధైర్యం చెప్పారు. ఆయన తప్ప ఎవరూ నా కంటతడిని చూడలేదు! 2016లో తొలిసారి నేను అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసినప్పుడు నన్నంతా ఒంటరిని చేశారు. నా కోసం ప్రచారం చేయటానికైనా ఎవరూ రాలేదు.సువేందు ఒక్కరే నా పక్కన నిలబడ్డారు. నా తొలి ర్యాలీలో నాకు బదులుగా ఆయనే ప్రసంగించారు. వేదికపైన సువేందు, నేను మాత్రమే ఉన్నాం. ఈరోజుకీ ఆ ఫొటోలు నా దగ్గర భద్రంగా ఉన్నాయి. టాక్ షోలో కూడా ఇదే మాట చెప్పాను. ‘‘అయితే మీరూ సువేందులానో, మొన్నటి 20 మంది ఎంపీల్లానో త్వరలోనే తృణమూల్‌ని వదిలి వెళ్లబోతున్నారా?’’ అని పార్టీ లోపల, పార్టీ బయట నాపై సందేహాల సంధింపులు! పార్టీ లోపల ఉండి విధ్వంసం సృష్టించే నాయకుల కంటే, పార్టీని వీడిపోయి పార్టీపై బయటి నుండి పోరాటం చేసే నాయకుడిని నేను గౌరవిస్తాను. సువేందు పార్టీని వదిలి వెళ్లాక ఒక్కసారి కూడా నాకై నేను ఆయన్ని కలవలేదు. ఒక్కసారి కూడా నాకై నేను ఆయనతో మాట్లాడలేదు. టాక్ షోలో గత స్నేహాన్ని గుర్తు చేసుకున్నానంతే. గుర్తు చేసుకున్నంత మాత్రాన ఆయన పుణ్యాత్ముడని కాదు. గుర్తు చేసుకున్నందుకు నేనేమీ పాపాత్మురాలినైపోను. -
సవాళ్లు ఉన్నా సందర్భోచితమే!
ఇండియా – మిడిల్ ఈస్ట్ – యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐ.ఎం.ఇ.సి.– ఐమెక్) పథకం ఇరాన్–అమెరికా యుద్ధం నేపథ్యంలో చర్చనీయాంశమైంది. భారత విధాన రూపకర్తలకు ఐమెక్‌ను ముందుకు తీసుకు వెళ్లటం పెద్ద సవాలుగా మారింది. ఇరాన్ యుద్ధం ఒక వైపు ఐమెక్ పథకం బలహీనతలను బహిర్గతం చేస్తూనే దాని అవసరాన్నీ నొక్కి చెప్పింది. 2023 ఢిల్లీ జీ–20 సదస్సులో భారత్ ప్రతిపాదించిన ఐమెక్ ప్రతిపాదనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ, యూఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యూరోపియన్ యూనియన్లు అంగీకరించాయి. భారత్‌ను మధ్యప్రాచ్యం – ఇజ్రాయెల్ గుండా యూరప్‌తో అనుసంధానానికి ఉద్దేశించిన ఈ 4,800 కి.మీ. రవాణా కారిడార్ ఆసియా, పర్షియన్ గల్ఫ్, ఐరోపాల ఆర్థిక వ్యవస్థలను సమీకృతం చేస్తుంది. ఆసియా ఖండపు వినిమయ మార్కెట్లను, గల్ఫ్ చమురు– గ్యాస్ ఉత్పత్తి క్షేత్రాలను ఐరోపా పారిశ్రామిక ప్రాంతాలలో సముద్ర, భూతల మార్గాల ద్వారా అనుసంధానించే విశిష్టమైన పథకం ఐమెక్. ఈ మూడు ప్రాంతాల అనుసంధానంలో ప్రస్తుతం మూడు చిక్కుముడి ప్రాంతాలు (చోక్ పాయింట్లు) ఉన్నాయి. అవి హార్మూజ్, బాబెల్ మాండెబ్, సూయజ్ జలసంధులు. ఈ మూడు జలసంధులను పక్కన పెట్టే సురక్షితమైన రవాణా మార్గమే ఐమెక్.విస్తృత వాణిజ్యానికి కీలకంఐమెక్ రవాణా కారిడార్‌లో తూర్పుభాగం భారత పశ్చిమ తీరాన్ని పర్షియన్ సింధుశాఖలో కలిపే సముద్ర మార్గం. భారత్‌లోని ముంబై–ముంద్ర–కాండ్లా రేవు పట్టణాలను యూఏఈకి చెందిన జెబెల్ అలీ, ఫుజేరా, సౌదీకి చెందిన డమ్మామ్, జెడ్డాలతో కలుపు తుంది. ఐమెక్ ఉత్తర కారిడార్ పర్షియా సింధుశాఖను ఐరోపాతో రైలు మార్గాల ద్వారా కలుపుతుంది. యూఏఈ, సౌదీ, జోర్డాన్‌లను రైలు మార్గాల ద్వారా ఇజ్రాయెల్‌లోని హైఫా రేవు పట్టణానికి కలుపుతారు. హైఫా నుండి ఎర్ర సముద్రం గుండా గ్రీస్‌లోని పిరేస్, ఫ్రాన్స్‌లోని మార్సెల్లి, ఇటలీలోని మెస్సీనాలకు కలుపుతూ ఐరోపాకు సరకుల రవాణా జరుగుతుంది. ఐమెక్లో భాగంగా హరిత ఇంధనాలైన హైడ్రోజన్ ఫ్యూయల్ ఉత్పత్తి, విద్యుత్ గ్రిడ్ల అనుసంధానం కూడా జరుగుతుంది. సముద్ర, భూతల మార్గాల ద్వారా అత్యాధునిక ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల నిర్మాణం, విస్తృత డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాల ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఐమెక్ పూర్తి స్థాయిలో అమలు జరిగితే భారత్– ఐరోపాల మధ్య రవాణా కాలం 40 శాతం, రవాణా వ్యయం 30 శాతం తగ్గిపోతాయి. రవాణా అనిశ్చితి కూడా తొలగిపోతుంది. భారత్–ఐరోపా యూనియన్ల మధ్య 2026 జనవరిలో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వలన 40–65 శాతం వాణిజ్యం పెరుగు తుందని అంచనా. భారత్–యూఏఈ, సౌదీ, ఖతర్, ఒమన్‌ల మధ్య వాణిజ్యానికీ కూడా ఐమెక్ కీలకం.వ్యూహాత్మకంగానూ ముఖ్యమే!ఆసియా–పర్షియన్ సింధుశాఖ ప్రాంతంలో చైనాను నిలువరించటానికి ఐమెక్ ఉపయోగపడుతుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) ద్వారా ఆసియా–గల్ఫ్ ప్రాంతంలో చైనా బలపడుతున్నది. ఒక రకంగా ఐమెక్‌ను బీఆర్ఐకు పోటీగా చెప్పు కోవచ్చు. వ్యూహాత్మక అంశాల దృష్ట్యా యూఎస్ఏ ఐమెక్‌కు మద్దతు పలికింది. ఇజ్రాయెల్‌ను ఇతర గల్ఫ్ దేశాలతో సంఘటితం చేయా లనేది అమెరికా లక్ష్యం. అబ్రహాం ఒప్పందం ద్వారా యూఏఈ, ఖతర్, ఒమన్లను ఇజ్రాయెల్‌కు కొంతవరకు దగ్గరకు తేగలిగింది. ప్రస్తుతం భూతల మార్గం ద్వారా భారత్ నుండి ఐరోపా వెళ్లాలంటే పాకిస్తాన్–అఫ్గానిస్తాన్‌ల గుండా ప్రయాణించాలి. ఒక రకంగా భారత్–ఐరోపా భూతల రవాణాపై పాకిస్తాన్‌కు వీటో ఉన్నది. ఐమెక్ ద్వారా పాక్ వీటోను తొలగించినట్లవుతుంది. చైనా–పాక్–ఎకనమిక్ కారిడార్ (సిపెక్)లో భాగంగా పాకిస్తాన్లో పెద్ద మొత్తంలో రోడ్డు, రైలు మార్గాలను, రేవు పట్టణాలను చైనా అభివృద్ధి చేస్తున్నది. పాకిస్తాన్ గుండా అరేబియా సముద్రంలోనికి చైనా ప్రవేశిస్తున్నది. చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవటానికి ఐమెక్ తోడ్పడుతుంది. సూయజ్, బాబెల్ మాండెబ్లను పక్కకు పెట్టడం వలన భారత్–ఐరోపా వాణిజ్యంలో అస్థిరత, అనిశ్చితి తొలగి పోతాయి. పాకిస్తాన్‌కు వంత పాడుతున్న టర్కీకి కూడా ఐమెక్ ద్వారా చెక్ పెట్టినట్లవుతుంది. ఐమెక్ ద్వారా ఐరోపాకు శక్తి భద్రత ఏర్పడటంతో పాటు భారత్‌తో వాణిజ్యం విస్తృతమవుతుంది. గల్ఫ్ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను వైవిధ్యీకరించటానికి ఐమెక్ ఉపయో గపడుతుంది. ఐమెక్‌కు కేంద్రకంగా ఉన్న ఇజ్రాయెల్‌కు ప్రాంతీయ స్థిరత్వం, భద్రత ఏర్పడతాయి.ప్రతికూలతలు బహిర్గతంసంక్షుభిత ప్రాంతాలైన సూయజ్, బాబెల్ మాండెబ్లకు దూరంగా ప్రతిపాదించబడిన ‘ఐమెక్ ప్రశాంత కారిడార్’యుద్ధంలో చిక్కుకున్నది. ఫుజెరా, జెబెల్ అలీ రేవు పట్టణాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఖతర్ గ్యాస్ క్షేత్రాలు కూడా దాడులకు గురయ్యాయి. ఐమెక్ పథకాన్ని విజయవంతంగా అమలు చేయటం మూడు కీలక అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అవి 1. సౌదీ–ఇజ్రాయెల్ సంబంధాల సాధారణీకరణ. 2. జెబెల్ అలీ, ఫుజెరా (ఎమిరేట్స్) రేవు పట్టణాల భద్రత. 3. పెట్టుబడులు. ఇరాన్ యుద్ధం ఈ మూడు అంశాల ప్రతికూలతలను బహిర్గతం చేసింది. అబ్రహాం ఒప్పందాలపై సంతకం చేయటానికి మొదటినుండీ సౌదీ రాజు విముఖత చూపుతున్నాడు. హార్మూజ్ జలసంధి దిగ్బంధనం వలన నౌకల బీమా ఛార్జీలు అమాంతం పెరిగాయి. ఈ ప్రాంతంలో పెట్టుబడులకు భారీ మదుపరులు ముందుకు రావటం కష్టం. అయితే, హార్మూజ్ దిగ్బంధనం, అంతకు ముందు బాబెల్ మాండెబ్‌ను హౌతీలు మూసివేస్తామని బెదిరించడం ఒక రకంగా ఈ ఇరుకైన సముద్ర మార్గాలకు ప్రత్యామ్నా యంగా రవాణా వ్యవస్థల అభివృద్ధి ఆవశ్యకతను గుర్తు చేసింది. 2023లో ఐమెక్ ఒప్పందం సమయంలో కంటే 2026లో దాని ఆవశ్యకత మరింత పెరిగిందనే చెప్పాలి. హార్మూజ్ ద్వారా రవాణాకు భవిష్యత్తులో కూడా అమెరికాతో సహా ఎవరూ భరోసా ఇవ్వలేరు. గల్ఫ్ ప్రాంత భూతల మార్గాల ద్వారా ఆసియాను ఐరోపాతో అనుసంధానించటమే శ్రేష్ఠమైన ప్రత్యామ్నాయం. శాంతియుత జియో పొలిటికల్ వాతావరణంలో ప్రతిపాదించ బడిన ఐమెక్ పథకాన్ని అశాంతి, ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణపు అనిశ్చిత వాస్తవాల నేపథ్యంలో సవరించాల్సిన అవసరం గోచరి స్తున్నది. ముఖ్యంగా హార్మూజ్ జలసంధికి సమీపంలోని ఎమిరే ట్స్‌కు చెందిన ఫుజేరాకు బదులుగా ఒమన్‌కు చెందిన సలాలా, దుఖమ్, సోహర్ రేవు పట్టణాలను భారత్ పశ్చిమ తీరంతో అనుసంధానించాలి. ఈ పథకాన్ని రవాణా, ఎనర్జీ, డిజిటల్ కారిడార్లుగా విభజించి వేటికవే అమలు పరచటం వాంఛనీయం. ఇబ్బందులు, అడ్డంకులతో కూడిన రవాణా కారిడార్ నిర్మాణాన్ని రెండవ దశలో చేపట్టవచ్చు. మొదటి దశలో ఎనర్జీ, డిజిటల్ కారిడార్లను అమలు పరిచి సైద్ధాంతికంగా పథకం అమలు సాధ్యాన్ని నిరూపించవచ్చు. ఇంతవరకు వివిధ దేశాలు ప్రత్యేక ఒప్పందాల ద్వారా పథకాన్ని అమలు పరుస్తున్నాయి. కానీ ఒక కేంద్రీయ సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేసి సభ్య దేశాల మధ్య సమన్వయం సాధించాలి. ఇజ్రా యెల్‌తో ముడిపడిన క్లిష్టమైన అంశాలను పక్కకుపెట్టి భారత్–గల్ఫ్ అనుసంధానంపై దృష్టి పెట్టాలి. భారత్ వ్యూహాత్మక, ఆర్థిక, శక్తి భద్రతలకు ఐమెక్ పథకం అమలు అత్యంత ఆవశ్యకం.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
అసమానతలు లేనిదే అసలైన అభివృద్ధి
దేశంలో ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ విధానాలు మొదలైన తర్వాత మార్కెట్లు మెరుగయ్యాయి. పెట్టుబడుల సమీకరణలో రాష్ట్రాల మధ్య పోటీ పెరిగింది. స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.)లో పురోగతి కనిపించింది. అయితే అదే సమయంలో ఈ అభివృద్ధి సమాజంలో అంద రికీ సమానంగా అందుతోందా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమైంది! మార్కెట్ శక్తుల చేతుల్లోకి వ్యవస్థ వెళ్లిన తర్వాత రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య అభివృద్ధిలో అనేక వ్యత్యాసాలు కనిపించటమే ఆ ప్రశ్నకు కారణం. ఆధునిక సాంకేతికత, రహదారులు, విద్యుత్తు, భవనాల వంటి మౌలిక వసతులు ఉన్న కొన్ని రాష్ట్రాలు మాత్రమే విదేశీ, స్వదేశీ పెట్టుబడులను బాగా ఆకర్షించగలిగాయి. అక్కడ పరిశ్రమలు,ఐటీ వంటి సేవా రంగాలు వేగంగా వృద్ధి చెందటం వల్ల ఆ కొన్ని రాష్ట్రాలు మాత్రమే దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే ప్రధాన ఇంజన్లుగా మారిపోయాయి. మిగిలినవి వెనుకబడి పోతున్నాయి.సంపన్న రాష్ట్రాలకే పెట్టుబడులుదేశంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందటం (ప్రాంతీయ సమతౌల్యం) అనేది ఒకప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు, పారిశ్రామిక కారిడార్ల వల్ల కొన్ని రాష్ట్రాలు అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యంతో అభివృద్ధి చెందాయి. దాంతో అభివృద్ధి అన్నది కొన్ని రాష్ట్రాలకే పరిమితమైపోయింది. ఉదా: తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో నగరీకరణ విస్తృతమవటం, మెరుగైన వసతులు ఉండటం వల్ల విదేశీ పెట్టుబడులు సమృద్ధిగా సమకూరుతున్నాయి. గుజరాత్లో రేవులు, మహారాష్ట్రలో రవాణా వ్యవస్థలు, తమిళనాడులో ఫ్యాక్ట రీలు, కర్ణాటకలో ఐటీ పార్కులు, ఢిల్లీలో భారీగా రిటైల్ వ్యాపారాలు ఉండటంతో ఆయా రాష్ట్రాలు అభివృద్ధి పోటీలో ముందుంటు న్నాయి. ఈ పోటీ వల్ల కేవలం ఆర్థికంగా ఎదగటమే ప్రధానం అయింది కానీ, సమాజంలో అందరికీ సమాన న్యాయం జరగడం లేదు. ఎక్కువ సంపాదన ఉన్న రాష్ట్రాల్లో కూడా ధనిక, పేద అసమా నతలు పెరిగిపోతున్నాయి. ఈ వృద్ధి ఫలాలు అందరికీ సమంగా అందడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. ఆర్థికంగానే కాకుండా అక్షరాస్యత, ఉన్నత విద్య, ఆసుపత్రుల అందుబాటు, పౌష్టికాహారం వంటి విషయాల్లో కూడా రాష్ట్రాల మధ్య అసమానతలు బాగా పెరిగిపోయాయి. నగరాలు, కర్మాగా రాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అవకాశాలు పెరగడంతో, వెనుక బడిన రాష్ట్రాల నుండి ప్రజలు అక్కడికి వలస వెళుతున్నారు. నైపుణ్యం ఉన్న శ్రామికులు, ఎక్కువ డబ్బు ‘ఇవ్వగల’ రాష్ట్రాలకే వెళ్తుండటంతో మిగతా ప్రాంతాలు ఇంకా వెనుకబడిపోతున్నాయి. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పి.ఎల్.ఎఫ్.ఎస్.) ప్రకారం 2017–2018 నుండి 2023–2024 మధ్యకాలంలో దేశంలో ధనిక, పేద ప్రజల మధ్య ఆదాయ అసమానతలు బాగా పెరిగాయి. ‘జినీ ఇండెక్స్’ సూచీని అనుసరించి హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ ఆదాయ అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తక్కువ ఆదాయ అసమా నతలు మిజోరాం, బిహార్, మణిపుర్, గోవాలలో నమోదయ్యాయి. విద్య, పరిశ్రమలు, రోడ్ల వంటి సదుపాయాలు తక్కువగా ఉండటం వల్ల 2025లో బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్లో పేదరికం ఎక్కు వగా ఉంది. అదే సమయంలో మంచి వసతులు, విద్యాలయాలు, నగరాలు ఎక్కువగా ఉండటం వల్ల కేరళ, గోవా, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్లలో పేదరికం స్థాయి తక్కువగా ఉంది. ‘సంపాదన’ ఉన్నా... తప్పని నిరుద్యోగంవ్యాపారాలు, సంపాదన బాగున్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు పేదరికాన్ని తగ్గించగలిగాయి కానీ, నిరుద్యోగాన్ని మాత్రం ఆపలేకపోయాయి. 2025–26 మొదటి అర్ధభాగంలో ఆంధ్రప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్ గఢ్, ఢిల్లీ వంటి చోట్ల నిరుద్యోగం ఎక్కువగా ఉంటే; గుజరాత్, జార్ఖండ్, కేరళ యూపీ వంటి రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. కేరళ, హరియాణా రాష్ట్రాల్లో ప్రజల ఆదాయం, జీవన ప్రమాణాలు బాగున్నా అక్కడ కూడా నిరుద్యోగం ఎక్కువే ఉంది. ఇక ఆసుపత్రులు, ఆరోగ్య వసతులకు గుర్తింపుగా చూసే ‘శిశు మరణాల రేటు’ (పుట్టిన ప్రతి వెయ్యి మంది పిల్లల్లో చనిపోయే వారి సంఖ్య) ఛత్తీస్‌గఢ్‌లో 36, ఉత్తరప్రదేశ్‌లో 35, మధ్యప్రదేశ్‌లో 35 గా ఉంది. అదే, కేరళలో కేవలం 8, తమిళనాడు, ఢిల్లీలలో 11 గా ఉండి ఆ రాష్ట్రాలు మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఇక ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం విషయానికి వస్తే, పి.ఎల్.ఎఫ్.ఎస్. 2023–24 ప్రకారం జాతీయ స్థాయిలో పురుషులు 76.3 శాతం మంది పని చేస్తుంటే, మహిళలు కేవలం 40.3 శాతం మందే ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ రేటు ఢిల్లీ, పంజాబ్, యూపీలలో మరీ తక్కువగా ఉంది. చదువు విషయా నికొస్తే మాత్రం కాలేజీల్లో చేరే అబ్బాయిలు, అమ్మాయిల సంఖ్య దాదాపు సమానంగా ఉండి, చదువుల్లో అసమానతలు తగ్గినప్పటికీ, మధ్యలోనే స్కూళ్లు కాలేజీలు మానేస్తున్న వారి సంఖ్య పెరగడం దేశానికి పెద్ద సవాలుగా మారింది. సహకారంతోనే సమ్మిళిత వృద్ధిమార్కెట్ ఆధారిత వ్యవస్థల వల్ల ఆర్థిక వృద్ధి రేటు వేగంగా పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వాలు సమాజానికి అవసరమైన విద్య, వైద్యం వంటి వాటిపై తగినంతగా ఖర్చు పెట్టకపోవడం వల్ల మానవాభివృద్ధి వెనుకబడిపోతోంది. కనుక, ప్రభుత్వాలు కేవలం ఆర్జన పెంచడం పైనే కాకుండా అందరికీ ఉద్యోగాలు, సమాన అవకాశాలు కల్పించి వెనుకబడిన వర్గాలను పైకి తీసుకురావడంపై దృష్టి పెట్టాలి. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, గ్రామాలను అభివృద్ధి చేయడం, రోడ్లు–రవాణా వసతులు పెంచడం, ప్రజలకు కొత్త నైపుణ్యాలు నేర్పించడం ద్వారానే అందరికీ సమానమైన వృద్ధి (సమ్మిళిత వృద్ధి) సాధ్యమవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుంటూ వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చి, ప్రజల చదువు, వైద్యంపై ఎక్కువ పెట్టుబడులు పెట్టినప్పుడే రాష్ట్రాల మధ్య ఉండే పోటీతత్వం దేశం మొత్తానికి సమానమైన అభివృద్ధిని తెచ్చిపెడుతుంది. డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు -
ప్రచారానికి ఇంత ఖర్చా?
వ్యాపార సంస్థలు తమ వస్తువులను, సేవలను ప్రచారం చేసుకోవడం వ్యాపార వృద్ధికి అవసరం. కానీ ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రభుత్వాలు తమ గురించీ, తమ పథకాల గురించీ విపరీతంగా ప్రచారం చేసుకోవడం, దానికోసం వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించడం సమంజసమేనా?2026–27లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు రూ. 75,868 కోట్లు (జీఎస్డీపీలో 3.8%). కేంద్ర ఆర్థిక సంఘం నిర్దేశించిన 3% పరిమితిని మించిపోయింది. మొత్తం బకాయి అప్పులు జీఎస్డీపీలో 36% వద్ద ఉన్నాయి. రెవెన్యూ లోటు 1.1%. ఏటా వేల కోట్ల అప్పు తీసుకుంటూ, కేంద్ర గ్రాంట్లపై అధికంగా రాష్ట్రం ఆధారపడుతోందని కాగ్ నివేదికలు, బడ్జెట్ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంత తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలోనూ ప్రచార ఖర్చులు తగ్గకపోగా పెరగడం విడ్డూరం.ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమరావతి పునర్నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణ, పాలనా విజయాల ప్రచారం కోసం విపరీతంగా ఖర్చు చేస్తోంది. 2025 సెప్టెంబర్ 10న అనావృష్టి పీడిత అనంతపురంలో ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభ ఈ ప్రచార పర్వానికి నిదర్శనం. హామీలు పూర్తిగా నెరవేరకుండానే విజయోత్సవం జరుపుకోవడాన్ని ‘పీఆర్ మాయాజాలం’.పెట్టుబడులను ఆహ్వానించే పేరుతో 2025 నవంబర్ 14–15న విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్‌ను ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ‘ముందుగా సిద్ధం చేసిన ప్రచార ప్రహసనం’గా అభివర్ణించింది. అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు కర్మాగారం వంటి ప్రాజెక్టుల పునరుద్ధరణను హడావుడిగా ప్రచారం చేయడం, దావోస్‌లో రూ. 10 లక్షల కోట్ల హరిత ఇంధన పెట్టుబడుల వాగ్దానం గురించి ప్రచారం చేయడం కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో ఊహించడం కష్టమేమీ కాదు.సుప్రీం కోర్టు ఏం చెప్పింది?ఈ ఖర్చులు కేవలం దుబారా మాత్రమే కాదు, చట్టపరమైన నిబంధనలకూ విరుద్ధం. 2015 మే 13న ‘కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (రిట్ పిటిషన్ నం. 13/2003) కేసులో జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం, ప్రభుత్వ ప్రక టనల నియంత్రణకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. వాటి ప్రకారం ప్రకటనలు ప్రభుత్వ రాజ్యాంగ, చట్టపరమైన బాధ్యతలకు సంబంధించిన సమాచారం కోసమే ఉండాలి; వ్యక్తులను లేదా రాజకీయ పార్టీలను కీర్తించడానికి కాదు. వ్యక్తిపూజ ‘ప్రజాస్వామ్య ప్రభుత్వానికి సరాసరి విరుద్ధం’ అని కోర్టు పేర్కొంది.ఖర్చు పొదుపుగా, పన్ను చెల్లింపుదారుల సొమ్ముకు గరిష్ఠ విలువ లభించేలా ఉండాలి. ముఖ్యంగా, ప్రతి శాఖా, ప్రభుత్వ రంగ సంస్థా తన ప్రకటనల బడ్జెట్‌ను బహిర్గతం చేసి కాగ్ ఆడిట్‌కు లోబడాలి. ప్రక టనల కంటెంట్‌ను పర్యవేక్షించేందుకు ప్రతి రాష్ట్రమూ ముగ్గురు సభ్యుల కమిటీని (సీసీఆర్జీఏ) ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. చాలా రాష్ట్రాల్లో లాగానే ఇక్కడా ఈ కమిటీలు సమర్థంగా పనిచేయడం లేదు. ప్రకటనల బడ్జెట్‌ను బహిర్గతం చేయకపోవడం, ఆడిట్‌కు లోబడకపోవడం, కోర్టు నిర్దేశించిన పారదర్శకతా సూత్రాన్ని తుంగలో తొక్కడం ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది.చదవండి: చీకటి ఎల్లకాలమూ ఉండదు!సోషల్ మీడియాలోనూ ప్రభుత్వ ఖాతాలు, ప్రాయోజిత ప్రకటనలు పెద్దఎత్తున నడుస్తున్నాయి. ఫలితంగా సామాన్య ప్రజలు అవాస్తవ సమాచారానికి, అతిశయోక్తులకు బలవుతూ వాస్తవానికి దూరమవుతున్నారు. అంతిమంగా, ఈ ఆర్భాటపు ప్రచారానికి అయ్యే ఖర్చును భరిస్తున్నది ఎవరు? ప్రజలే. ప్రభుత్వం సుప్రీం కోర్టు మార్గదర్శకాలను గౌరవించి, నిజమైన అభివృద్ధివైపు మళ్లాలి. లేకుంటే, ఈ ‘ప్రచార పర్వం’ ప్రజాధనానికి తూట్లు పొడుస్తూనే ఉంటుంది.– డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ సీనియర్ జర్నలిస్ట్ -
వ్యవసాయ రుణాలు రైతులకు కాదా?
‘భారత రైతులు అప్పుల్లోనే పుడతారు, అప్పుతోనే జీవిస్తారు, అప్పుతోనే చని పోతారు, అప్పునే వారసత్వంగా వదిలి పెడతారు’ అని బ్రిటిష్ అధికారి సర్ మాల్కం డార్లింగ్ 1925లో రాశారు. అది వలస పాలన మీద నిందగా ఉద్దేశించింది. వంద సంవత్సరాల తర్వాత, జాతీయీకృత బ్యాంకులు, ప్రాధాన్య రంగ రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు, స్వయం సహాయక బృందాలు, రూ.2.5 లక్షల కోట్లకు పైగా రుణమాఫీలు జరిగిన తర్వాత కూడా– 2013 పార్లమెంట్ రికార్డులు చూస్తే, 52 శాతం వ్యవసాయ కుటుంబాలు ఇంకా అప్పుల్లో ఉన్నాయి. మాల్కం డార్లింగ్ మాటలు ఇప్పుడు స్వతంత్ర భారతదేశం మీద నిందగా మారాయి.ఎన్ఎస్ఎస్ఓ 2018 ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో 92.9 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయి. తెలంగాణలో 89.1 శాతం. ఇవి బ్యాంక్ శాఖలు, స్వయం సహాయక సంఘాలు అత్యధి కంగా ఉన్న రాష్ట్రాలు. ఈ నివేదిక ప్రకారం ఏపీ రైతు సగటు అప్పు రూ.1,23,400 కాగా, సంవత్సర ఆదాయం రూ. 1,25,760. ఇదే తెలంగాణలో ఆదాయం రూ. 1,12,836, అప్పు రూ. 1,52,000. ఈ అప్పు–ఆదాయ నిష్పత్తులు చూస్తే ఎక్కువ రుణాలు ఎప్పటికీ పరిష్కారం కావని అర్థమవుతుంది.వ్యవస్థలో ఆరు లోపాలు1. ఏపీ, తెలంగాణలో సాగు భూమిలో 30–40 శాతం కౌలు రైతులు సాగు చేస్తున్నారు. వారికి భూమి పట్టా లేదు కాబట్టి కిసాన్ క్రెడిట్ కార్డు రాదు. ప్రభుత్వం రూ.20,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న వడ్డీ రాయితీ పథకం పట్టా ఉన్నవారికే వర్తిస్తుంది. దున్నే రైతుకు రుణం రాదు; దున్నని భూయజమానికి వస్తుంది.2. 1975లో చిన్న రైతుల కోసం ప్రత్యేకంగా స్థాపించిన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 1991 తర్వాత వ్యాపార బ్యాంకుల్లా మారిపోయాయి. 3. వ్యవసాయ రుణాలు 2000ల దశకంలో గణాంకాల్లో పెరిగాయి– కానీ రైతుకు అనుభవంలోకి రాలేదు. కారణం ఏమిటంటే, ‘వ్యవసాయ రుణం’ అనే నిర్వచనాన్ని విస్తరించారు. అగ్రి–ప్రాసెసింగ్ కంపెనీలకు, గ్రామీణ మౌలిక సదుపాయాలసంస్థలకు ఇచ్చిన రుణాలు కూడా వ్యవసాయ రుణాల లెక్కలోకి వచ్చాయి. 4. రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణానికి ఎలాంటి హామీ అడగకూడదని ఆర్బీఐ నిబంధన చెప్తోంది. కానీ బ్యాంకులు సర్వే నంబర్ లేకుండా వడ్డీ రాయితీ క్లెయిమ్ చేయలేవు కాబట్టి ఈ నిబంధనను ఉల్లంఘిస్తున్నాయి. 5. హిందూ రుణచట్టంలో ‘దమ్దుపత్’ అనే పురాతన సూత్రం ఉంది– ఒకే సమయంలో వసూలు చేయగలిగే వడ్డీ అసలు మొత్తాన్ని మించకూడదు. ఇది కర్ణాటక మనీలెండర్స్ యాక్ట్ సహా అనేక రాష్ట్రాల రుణ చట్టాల్లో పొందుపరచబడింది. ఆర్బీఐ కూడా ఈ విషయమై స్పష్టమైన ఆదేశం జారీచేసింది. అయినా ఉల్లంఘించబడుతోంది. పంట రుణం బాకీ పడినప్పుడు – కరవు తర్వాత, ధర పతనమైన తర్వాత, వర్షాలు విఫలమైన తర్వాత ఇది సాధా రణంగా జరుగుతుంది. ఖాతాపై సాధారణ వడ్డీతో పాటు పెనాల్టీ వడ్డీ కూడా పడుతుంది. ప్రతి మూడు నెలలకు కాంపౌండ్ అవుతుంది. ఖాతా నాన్–పర్ఫార్మింగ్ అసెట్‌గా వర్గీకరించబడిన తర్వాత కూడా వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. రెండు మూడు సంవత్సరాల బాకీ తర్వాత, రూ.50,000 స్వల్పకాలిక పంట రుణంపై పేరుకు పోయిన వడ్డీ అసలును దాటిపోతుంది. ఆ సమయంలో బ్యాంకు ఆర్బీఐ ఆదేశాన్ని నేరుగా ఉల్లంఘిస్తోంది. రైతుకు ఈ నిబంధన తెలియదు. బ్యాంకు అసలు, పేరుకుపోయిన మొత్తం వడ్డీ రెండూ చెల్లించమని సెటిల్మెంట్ చర్చలు జరుపుతుంది. అనధికారికరంగంలో ఉల్లంఘన మరింత ప్రత్యక్షంగా ఉంటుంది. 36–60 శాతం వడ్డీకి అప్పిచ్చే మనీలెండర్ రెండు మూడేళ్లలో అప్పునురెట్టింపు చేస్తాడు– ఎలాంటి నియంత్రణ లేకుండా.6. బ్యాంకుల రుణంలో 18 శాతం వ్యవసాయానికి ఇవ్వాలని చట్టం. కానీ – (అ) ‘వ్యవసాయ రుణం’ నిర్వచనంలో కార్పొరేట్ ఫుడ్ కంపెనీలను చేర్చారు; (ఆ) పీఎస్ఎల్సీ సర్టిఫికెట్లు కొనుగోలు చేయడం ద్వారా బ్యాంకులు ఒక్క రైతుకూ రుణం ఇవ్వకుండా లక్ష్యాలు చేరుకుంటున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ సర్టిఫికెట్ల మార్కెట్ రూ.9 లక్షల కోట్లు (మొత్తం వ్యవసాయ రుణ వితరణ కంటే ఎక్కువ); (ఇ) లక్ష్యం తప్పిన బ్యాంకులు నాబార్డ్ ఆర్ఐడీఎఫ్ ఫండ్‌లో డబ్బు వేస్తాయి. ఆ డబ్బు రాష్ట్ర మౌలిక సదుపా యాలకు వెళ్తుంది, రైతులకు కాదు.మూడు సంస్కరణలు1. వడ్డీ రాయితీ సాగు చేసేవారికి చేరాలి, పట్టా ఉన్నవారికి కాదు: సాగు చేయనివాళ్లకు సాగుకోసం ఇచ్చే వడ్డీ రాయితీ చట్ట పర మైన నేరంగా పరిగణించాలి. పంట బీమా (పీఎంఎఫ్‌బీవై) నమోదు, పీఎం–కిసాన్ రిజిస్ట్రేషన్, జాయింట్ లయబిలిటీ గ్రూపులు (జేఎల్‌జీ) లేదా రైతు ఉత్పత్తిదారు సంఘాలు (ఎఫ్‌పీఓ) సభ్యత్వం – ఇవన్నీ సాగు ఆధారాలు. జేఎల్జీలు, ఎఫ్పీఓలు ధ్రువీకరణ, రుణ వితరణ వేదికలుగా పని చేయాలి.2. రుణమాఫీ బదులు రుణ మార్పిడి: రుణమాఫీలు సంస్థాగత రుణాలనే రద్దు చేయగలవు– అదే అత్యంత నష్టపడిన రైతులు తీసుకున్న మనీలెండర్లు, ఇన్ పుట్ డీలర్ రుణాలను తాకలేవు. రుణ మార్పిడి నిర్మాణం ఇందుకు మెరుగైన పరిష్కారం. గ్రామసభ ద్వారా రూ.25,000 కంటే ఎక్కువ అన్ని అనధికారిక రుణాలను సర్వే చేయాలి. ప్రభుత్వ హామీతో ఒక డెట్ కన్వర్షన్ ఫండ్... మనీలెండర్ నుండి రుణాన్ని అదే మొత్తానికి కొనుగోలు చేయాలి. రైతు అప్పు 7 శాతం వడ్డీతో అధికారిక రుణంగా మారుతుంది,పంట కాలానికి అనుగుణంగా వాయిదాలు ఉంటాయి. పంట నష్టం జరిగితే వాయిదా పడుతుంది, డిఫాల్ట్ అవ్వదు. కేరళ ప్రభుత్వం ఇటువంటి ప్రయత్నం ఇప్పటికే చేసింది.3. చిన్న–సన్నకారు రైతుల 10 శాతం ఉప–లక్ష్యాన్ని పీఎస్ఎల్సీ సర్టిఫికెట్ కొనుగోలు ద్వారా చేరుకోకుండా నిరోధించాలి. ప్రత్యక్ష రుణ వితరణే ఆమోదయోగ్యం కావాలి. ‘వ్యవసాయ రుణం’ నిర్వచనం నుండి అగ్రి–బిజినెస్ కంపెనీలను తొలగించాలి. మాల్కం డార్లింగ్ వ్యాఖ్యకు ప్రాసంగికత పోయిదా? ప్రాధాన్య రంగ రుణం కార్పొరేట్‌కు వెళ్ళింది. రూ.2.5 లక్షల కోట్ల రుణ మాఫీలు కౌలు రైతును తాకలేదు. హామీ లేని రుణం హక్కు కాగితంపైనే ఉంది. వడ్డీ పరిమితి చట్టం ఉంది, అమలు లేదు. ఈ ప్రతి లోపాన్నీ సరిచేయవచ్చు. కొత్త విధానం అవసరం లేదు, ఉన్న నిబంధనలను అమలు చేయగలిగే సంకల్పం చాలు.-వ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త,‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-డా‘‘ జి.వి.రామాంజనేయులు -
ఆరోగ్యమే కాదు... హక్కు కూడా!
కాలిబాటలపై నడవడాన్ని పౌరుల ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు ఇటీవల ప్రకటించింది. ఇదొక మైలురాయి లాంటిది. ప్రాథమిక హక్కులలో ఇప్పటికే ఉన్న, జీవించడానికీ, సంచరించడానికీ ఉన్న హక్కు పరిధిలోకి దాన్ని తెచ్చారు. రోడ్డంటూ ఉంటే నడిచేవారికి ప్రత్యేకించిన బాట చూపడాన్ని ఒక విధిగా కోర్టు పేర్కొంది. దాన్ని పట్టణాభివృద్ధి సంస్థల, పురపాలక సంస్థల, పంచాయతీల బాధ్యతగా చెప్పింది. బహుశా, పాదచారుల హక్కులకు సంబంధించి ఓ భారతీయ కోర్టు ఇలా నిర్ద్వద్వంగా పేర్కొన్న తీర్పు ఇదే.దీన్ని కోర్టు నుంచి సకాలంలో వచ్చిన ఆదేశంగా భావించాలి. ప్రభుత్వాల విధానాలన్నీ పట్టణాలు, నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధి చుట్టూ తిరుగుతున్నాయి. వాటి దృష్టంతా హైవేలు, ఫ్లైవోవర్లు, సబ్‌వేల వంటివాటిపైనే ఉంది. మోటారు వాహనాల్లో వెళ్ళేందుకు వీలైన మౌలిక వసతిని కల్పించడమే అభివృద్ధికి చిహ్నంగా చిత్రిస్తున్నారు. భారతీయ నగరాల్లో ఇపుడున్న కాలి బాటలు హాయిగా నడిచేందుకు అనుకూలమైనవిగా లేవు, సురక్షితమైనవి కావు. అసలు వాటి డిజైనే సరిగ్గా లేదు. వివిధ ప్రభుత్వ సంస్థలు, పౌర సమాజ సంఘాలు దేశంలోని పెక్కు పట్టణాలు, నగరాల్లో నిర్వహించిన సర్వేలలో తేలిన అంశమిది. కాలిబాటల దయనీయ స్థితికి ప్రభుత్వ విధానాలనే తప్పు పట్టాలి. ‘మన నగరాలు, అన్ని ప్రణాళికల్లో ప్రజలనే కేంద్ర బిందువుగా చేసుకుంటున్నాం’ అంటూ 2006లో చేపట్టిన జాతీయ పట్టణ రవాణా విధానం గొప్పగా చెప్పుకొంది. ఆచరణలో తీసుకుంటున్న చర్యలు, ప్రణాళికలు దానికి విరుద్ధంగా ఉంటున్నాయి. కార్లు, స్కూటర్లు వంటివాటికి రోడ్డులో ఎక్కువ చోటు కేటాయించాలనే డిమాండ్‌ను తీర్చడంపైనే విధానాల దృష్టి కొనసాగుతోంది. రోడ్డంతా వాహనాలకేనా?నిర్దిష్ట విధానాలంటూ లేకపోవడం వల్ల కాలిబాటలను ప్రత్యే కించి పట్టించుకునే ఏజెన్సీలు గానీ, కాలిబాటల వసతులకు బడ్జెట్ కేటాయింపులుగానీ ఉండడం లేదు. రోడ్లను నిర్మించే రోడ్లు, వంతెనల శాఖ వంటి ప్రభుత్వ ఏజెన్సీలు కాలిబాటలను నిర్మించి, నిర్వహించే బాధ్యత నగర పాలక సంస్థలదేనని భావిస్తున్నాయి. రోడ్ల శాఖే వాటిని పట్టించుకోవాలని స్థానిక పాలనా సంస్థలు భావిస్తున్నాయి. పట్టణాలు, నగరాల్లో రవాణాలో బహుళ సంస్థల భాగ స్వామ్యం ఉంటోంది. అవి ఒకదానినొకటి నిందించుకుంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలతో పనిచేస్తున్నాయి. దీర్ఘకాలిక నగర విస్తృత ప్రణాళికలు పెట్టుబడులు భారీగా అవసరమైన ప్రణాళికలను సూచిస్తూ, కాలినడక అవసరాలను తరచు గాలికొదిలేస్తున్నాయి. ఒకవేళ, కేటాయింపులు జరిగినా ఆ నిధులను సరిగ్గా డిజైన్ చేయని, ఆకర్షణీయంగా మాత్రం కనిపించే ఓవర్‌హెడ్ క్రాసింగ్ లేదా ఫుట్–ఓవర్ బ్రిడ్జీల నిర్మాణానికి వెచ్చిస్తున్నారు. ఎక్కడైనా పాదచారుల మౌలికవసతిని అభివృద్ధి చేసినా అది కూడా కార్లు లేదా టూవీలర్ల వాడకందారులను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినదే అయివుంటోంది. మోటారు వాహనాలు వెళ్ళే దారిలోనే లాంగ్ రూట్ తీసుకోవాల్సిన, రోడ్ల పొడుగూతా ఆనుకునే కాలిబాటలు ఉండాల్సిన పని లేదు. ఒకదానినొకటి ఆనుకుని ఉన్న రెండు ప్రాంతాలను కలిపేందుకు వాకర్లు వాహనాలు వెళ్ళే రూటునే అనుస రించవలసిన పని లేకుండా చిన్న కాలిబాటలకు డిజైన్ చేయవచ్చు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే సాధనంసుప్రీంకోర్టు నిర్వచించిన విధంగా కాలినడక పౌరుల ప్రాథ మిక హక్కు మాత్రమే కాదు. అది మనిషికి, భూగోళానికి ఉభయ తారకమైనది. మధుమేహం, హైపర్ టెన్షన్, గుండె జబ్బులు, గుండె పోట్లు, క్యాన్సర్ల వంటివి ఒకరినుంచి ఒకరికి సంక్రమించేవికావు. ఈ రుగ్మతలకు దారితీసే ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్లలో శారీరక శ్రమ లేకపోవడం, ఒకేచోట కూర్చుని పనిచేసే జీవనశైలి వంటివి కూడా ఒకటని గుర్తించారు. సైకిల్ తొక్కడంతోపాటు, 20 నుంచి 30 నిమి షాల సేపు వేగంగా నడవడం శరీరాన్ని చురుకుగా ఉంచే ఉత్తమ మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఎట్టి పరిస్థితు ల్లోనూ 2030 కల్లా సాధించి తీరాలని పెట్టుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో చాలా వాటిని సాధించేందుకు కూడా నడకను ప్రోత్స హించే విధానాలు తోడ్పడతాయి. కాలిబాటలను మెరుగుపరచి, నడక వసతులను కల్పిస్తే ప్రజా రోగ్యం మెరుగుపడడమే కాకుండా, పౌరుల ధనం ఆదా అవుతుంది. గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలు తగ్గించేందుకు ఇదొక తక్కువ ఖర్చుతో కూడిన మార్గంగా ఉపయోగపడుతుంది. నడకకు తగినంత సురక్షిత సదుపాయాన్ని కల్పిస్తే ప్రజా రవాణా సదుపాయాన్ని వినియోగించుకునే ఎవరైనా సరే రోజులో కనీసం నాలుగు సార్ల యినా నడవవలసి వస్తుంది. చెన్నైలో ఫుట్‌పాత్‌లను మెరుగు పరచడం వల్ల ఏటా 4,200 టన్నుల కార్బన్ డయాక్సైడ్, దానితో సమానమైన 12,000 టన్నుల గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను నివారించగలిగినట్లు ఒక అధ్యయనంలో తేలింది. సుమారుగా 1,000 నుంచి 2,900 కార్లు ఒక ఏడాదిపాటు రోడ్డుపైకి రాకుండా ఉంటే ఎంత సత్ఫలితం ఒనగూడుతుందో దానివల్ల కూడా అంతే సమానమైన ప్రయోజనం చేకూరినట్లు వెల్లడైంది. మూడు జోన్లుఫుట్పాత్ల గురించి చర్చ వచ్చినప్పుడల్లా, వాటిని ఆక్రమించు కుని ఉండే చిన్న తరహా విక్రేతల సమస్య కూడా అనివార్యంగా తొంగిచూస్తుంది. ప్రభుత్వంతోపాటు, సుప్రీంకోర్టు కూడా గతంలో ఈ సమస్యపై దృష్టి సారించకపోలేదు. సక్రమంగా నియంత్రిస్తే, పాదచారులతోపాటు చిన్న వ్యాపారులు కూడా పుట్‌పాత్‌లను వాడు కునే వీలుందని కోర్టు గతంలో వ్యాఖ్యానించింది. ఈ విక్రేతలు కూరగాయలు, పండ్లు, దైనందిన జీవితానికి అవసరమైన చిన్నచితక వస్తువులను అందుబాటులో ఉంచుతారు. పాదచారులు పనిమీద బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు వాటిని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. పట్టణ వీధి వ్యాపారుల జాతీయ విధానం– 2004, 2009 మూడు జోన్ల సృష్టిని ప్రతిపాదించింది. ఆంక్షలు లేకుండా విక్రయాలు జరుపుకునే ప్రదేశాలు, కొన్ని ఆంక్షలకు పరిమితమైన విక్రయ ప్రదేశాలు, విక్రయాలకు అవకాశం లేని ప్రదేశాలు. వాహనాల రద్దీ, డిమాండ్ తీరుతెన్నులు వంటి అంశాలను ఆయా జోన్ల సృష్టిలో పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. చిన్నచితక విక్రేతలే కాకుండా, కొందరు దుకాణదారులు కూడా తమ దుకాణాలను పుట్‌పాత్ పైదాకా విస్తరించడం సాధార ణంగా కనిపించే దృశ్యం. రెసిడెన్షియల్ కాలనీలలో అయితే, గృహ యజమానులు తమ వాహనాలను పార్క్ చేసుకునేందుకు ఫుట్ పాత్లను యథేచ్ఛగా వాడుకోవడం కనిపిస్తుంది. కాలిబాటలకు సంబంధించి ఇంతవరకు ఎటువంటి విధానాలు, కార్యక్రమాలున్నా వాటినన్నింటిని సమీక్షించుకునేందుకూ, ఉన్న లోటుపాట్లను చక్కదిద్దుకునేందుకూ, రోడ్లను సముచితమైన రీతిలో వాడుకునేందుకు భరోసా కల్పించేందుకూ సుప్రీంకోర్టు తాజా రూలింగ్ ఒక అవకాశం కల్పిస్తోంది. భారతీయ పట్టణాలు, నగరాలు, జాతీయ హైవేల పొడవునా ఉన్న గ్రామాల్లో కూడా నడకకు, సైక్లింగ్‌కు వసతులు కల్పించి, నిర్వహించడానికి అగ్ర ప్రాధాన్యం ఇచ్చి తీరాలి. ఇది ప్రజారక్షణ, ఆరోగ్యం, వాతావరణం, సమానతకు సంబంధించిన అంశమని మరచిపోకూడదు. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
ఆగని 'గ్రేటర్ ఇజ్రాయెల్' పథకం
ప్రపంచం దృష్టి ఇరాన్, లెబనాన్ వైపు; అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ పూట ఏమంటారనే దానిపై కేంద్రీకరించి ఉండగా, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మాత్రం తమ ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ పథకాన్ని ముందుకు తీసుకుపోతూనే ఉన్నారు. ఆ చర్యలన్నీ తమ దీర్ఘకాలిక పశ్చిమాసియా వ్యూహానికి అనుగుణమై నవే అయినందున అమెరికా ఆ విషయమై ఏమీ మాట్లాడటం లేదు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమెరికా చొరవతో 2025 అక్టోబర్‌లో జరిగింది. ఆ మేరకు కాల్పుల విరమణ అయితే అమలుకు వచ్చిందిగానీ, ఇజ్రాయెలీ సైన్యం గాజా నుంచి పూర్తిగా ఉపసంహరించుకోలేదు. కొన్ని జోన్లకు పరిమితమై కొనసాగుతుందనీ, ఒప్పందంలోని ఆ యా అంశాలు అమలైనకొద్దీ క్రమంగా ఉపసంహరించుకుంటుందనే మాట ఆ పత్రంలో ఉన్నందున ఆ ప్రకారం అంతా జరుగుతుందనీ భావించారు. కానీ అటు వంటి ఉద్దేశాలు ఇజ్రాయెల్‌కు గానీ, అమెరికాకు గానీ లేవని త్వరలోనే స్పష్టం కాసాగింది.70 శాతం భూమి పోతుందా?ట్రంప్ తను అట్టహాసంగా ప్రకటించిన 20 అంశాల ‘శాంతి పథకం’వైపుగానీ, నియమించిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ వైపుగానీ కన్నెత్తి చూడలేదు. మధ్యవర్తులు, బోర్డు సభ్యులు అయిన దేశాలు అదేమి టని అడగలేదు. ఇజ్రాయెల్ అంతిమ లక్ష్యం గాజా, వెస్ట్ బ్యాంక్ లను మించిన ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ అయినందున వారికి ఈ పరిస్థితి కలిసి వచ్చింది. గాజాలో ఉత్తరం నుంచి దక్షిణానికి గీసిన కాల్పుల విరమణ రేఖను ఉల్లంఘిస్తూ కొత్త ఆక్రమణలు మొదలు పెట్టారు. హమాస్‌ను వ్యతిరేకించే పాలస్తీనియన్ వర్గాలను, నేరస్థులను ప్రోత్సహించి అక్కడి ప్రజలను పారదోలటం ఈ ఎనిమిది నెలలుగా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నది.పోయిన నెల చివరిలో ఒక బహిరంగ కార్యక్రమంలో నెతన్యాహూ మాట్లాడుతూ, కాల్పుల విరమణ జరిగిన 2025 అక్టోబర్‌లో, గాజా భూభాగంలో 53 శాతం తమ ప్రత్యక్ష నియంత్రణలో ఉండేదనీ, అది 2026 మే చివరిలో 60 శాతానికి చేరిందనీ, దానిని 70 శాతానికి తీసుకుపోవలసిందిగా తమ సైన్యానికి ఆదే శాలు జారీ చేశాననీ ప్రకటించారు. అనగా, కాల్పుల విరమణ నాటి నుంచి మరొక 17 శాతం భూభాగాన్ని; గాజాపై ఇజ్రాయెల్ దాడులు 2023 అక్టో బర్లో మొదలైనప్పటినుంచి 2026 అక్టోబర్ వచ్చేసరికి మూడేళ్లలో మొత్తం 70 శాతాన్ని కోల్పోతుందన్నమాట. అప్పుడు, మొత్తం 365 చ.కి.మీ.ల విస్తీర్ణంగల గాజాలో అక్కడి ప్రజలకు మిగిలేది 110 చ.కి.మీ.లు. విషయం ఇంతటితో ముగియబోవటం లేదు. నెతన్యాహూ రక్షణ మంత్రి కట్జ్‌తో పాటు సైన్యాధికారులు, గాజాలోని పాలస్తీని యులందరూ అక్కడి నుంచి ‘స్వచ్ఛందంగా ఖాళీ చేసి’ వేరే దేశాలకు వెళ్లిపోవలసిందేనని హెచ్చరిస్తున్నారు. గాజాపై దాడులు మొదలైన కొత్తలో నెతన్యాహూ, ట్రంప్ చేసిన ప్రకటనలను బహుశా ఎవరూ మరిచి ఉండరు. అక్కడినుంచి స్థానికులను వెళ్లగొట్టి ‘అందమైన రిసార్టులు, వ్యాపార కేంద్రాలు’ నిర్మిస్తామన్నారు.ఆగని సెటిల్మెంట్లు!పాలస్తీనాలో మరొకవైపున గల వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలేంలను చూస్తే ఇటువంటి పరిస్థితే కనిపిస్తుంది. వీటి గురించి అసలు వివాదమే లేదనీ, అదంతా తమ దేశంలో భాగమనీ ఇజ్రాయెల్ ఎన్నడో ప్రకటించింది. తమ రాజధాని టెల్ అవీవ్‌కు అదనంగా ఈస్ట్ జెరూసలేం ఉమ్మడి రాజధాని అన్నది. ఆ ప్రకటనలను ఐక్యరాజ్యసమితి తిరస్కరించగా, రాజధాని విషయాన్ని ట్రంప్ తన మొదటి హయాంలోనే అధికారికంగా గుర్తించారు. ఈ పరిస్థితుల మధ్య జరుగుతున్నది ఇజ్రాయెల్ సేనలు, యూదులు వెస్ట్ బ్యాంక్‌ను, ఈస్ట్ జెరూసలేం నగరాన్ని ఆక్రమించు కోవడం. ఈ పని కొంతకాలం క్రితమే మొదలు కాగా, నిరుటినుంచి వేగాన్ని అందుకున్నది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ నెల రెండవ వారంలో ఒక నివేదిక విడుదల చేస్తూ, వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనియన్లపై ‘జాతి నిర్మూలన’ కార్యక్రమం జరుగుతున్నట్లు హెచ్చరించింది. యూదు సెటిలర్లు, ఇజ్రాయెలీ సైనికులు కలిసి ఆ పని చేస్తున్నారన్నది. అదే వారంలో అమెరికన్ వార్తా సంస్థ అసోసి యేటెడ్ ప్రెస్ (ఏపీ), బ్రిటిష్ వార్తా సంస్థ బీబీసీ ఆ ప్రాంతాలలో పర్యటించి ఇవే విషయాలను ధ్రువీకరించి చెప్పాయి. అంతర్జాతీయ చట్టాలకు, ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు విరుద్ధమని ప్రపంచమంతా ఖండించినా లెక్క చేయని ఇజ్రాయెల్ ఇప్పటికే ఏడు లక్షల మంది యూదులను అక్కడ సెటిల్ చేసింది. వారి కాలనీల కోసం కొత్త బడ్జెట్లోనూ వందల మిలియన్ల డాలర్లు కేటాయించింది. కొత్త పరిణామం ఏమంటే, ట్రంప్ విన్యాసాల వైపు ప్రపంచం మళ్లి ఉండగా, ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ లక్ష్యాన్ని సాధించుకొనచూడటం.ఎన్ని దేశాల్లోకి చొచ్చుకుపోతారు?ఇంతకూ ‘గ్రేటర్’ పరిధి ఎంత? అది గాజా, వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలేంలకు పరిమితమైనది కాదంటే ఆశ్చర్యం కలగవచ్చు. యూదుల జియోనిస్టు సిద్ధాంతకర్తల ఒరిజినల్ సూత్రీకరణల ప్రకారం స్థూలంగా మధ్యధరా సముద్రం, పశ్చిమాన ఈజిప్టులోని నైలు నది, తూర్పున యూప్రటీస్ నది, దక్షిణాన పలు అరబ్ భూభాగాల మధ్య ప్రాంతమంతా ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ అవుతుంది. అందులోకి ప్రస్తుత ఇజ్రాయెల్, గాజా, వెస్ట్ బ్యాంక్, మొత్తం జోర్డాన్, మొత్తం లెబనాన్, సిరియా, ఇరాక్లతో పాటు సౌదీ భూభాగాలు అనేకం వస్తాయి. ఇటువంటి పటాన్ని నిరుడు తమ దేశంలో స్వయంగా ఎత్తిచూపిన నెతన్యాహూ, ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ ఆలోచనకు తాను బలంగా కట్టుబడి ఉన్నాననీ, ఆ ‘చారిత్రకమైన స్పిరిచ్యువల్ మిషన్‌లో తనను తాను ఒక భాగంగా భావిస్తా’ననీ ప్రకటించటం గమనించదగ్గది.ఇంత విస్తారమైన ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ అసాధ్యమేగానీ, అదే సమయంలో అర్థం చేసుకోవలసినవి కొన్నున్నాయి. పాలస్తీనా విషయంలో జరుగుతున్నది ఎవరూ ఆపలేకపోతున్నారు. కనీసం వర్తమానంలో. అరబ్ పాలకులు మొక్కుబడిగా ఏమి మాట్లాడినా, ఈజిప్టు నాయకుడు అబ్దుల్ నాసర్ మరణం (1970) తర్వాత పాన్– అరబిజం బలహీనపడటం, అరబ్ నాయకులంతా ఎవరి స్వార్థం వారు చూసుకుంటూ ఇజ్రాయెల్, అమెరికాలతో రాజీపడటం, ఇజ్రాయెల్ పథకానికి ఒక మేరకు మార్గాన్ని సుగమం చేస్తున్నాయి. సిరియా నుంచి ఆక్రమించిన గోలన్ హైట్స్‌ను తమతో విలీనం చేసు కోవటం, జోర్డాన్, లెబనాన్ భాగాల ఆక్రమణలు, మరొకవైపు అమె రికా ఒత్తిడితో కొందరు అబ్రహామిక్ ఒప్పందాల పేర ఇజ్రాయెల్‌తో రాజీ పడటం వంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఇజ్రాయెల్ పథ కాన్ని రాజీ లేకుండా వ్యతిరేకిస్తున్న ఏకైక రాజ్యం ఇరాన్‌ను లొంగ దీసే ప్రయత్నాలు కనిపిస్తూనే ఉన్నాయి. అటువంటి ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌తో అబ్రహామిక్ ఒప్పందం చేసుకుంటే సంతోషిస్తానన్న ట్రంప్ ఇటీవల అందరికీ వింత గొలపటం వేరే విషయం!టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
‘మా నాన్నెవరో తెలుసా?’
‘నాకు ఏది కావాలంటే అది వెంటనే నా ముందుండాలి, ఎందుకంటే నేను ప్రత్యేకం!’ – నేటితరం పిల్లల్లో, ముఖ్యంగా నగరాల్లోని విద్యా సంస్థల్లో ప్రమాదకరంగా పెరుగుతున్న మనస్తత్వం ఇది. ఒక సర్వే ప్రకారం, గత దశాబ్ద కాలంలో పాఠశాలల్లో క్రమశిక్షణా రాహిత్యం, తోటి విద్యార్థులను తక్కువ చేసి చూచే ధోరణులు దాదాపు ముప్పై ఐదు శాతం పెరిగాయి. దీనికి ప్రధాన కారణం, ఈ ఎంటైటిల్డ్ మనస్తత్వమే. తరగతి గది అనేది సమాజానికి చిన్న ప్రతి రూపం లాంటిది. అక్కడ ఒకరిద్దరు పిల్లలు తామే సర్వోన్నతులు అనే భావనతో ఉంటే, అది మిగతా పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ‘మా నాన్న ఎవరో తెలుసా?’ అనే అహంకారంతో గ్రూపులు కట్టి, సాధారణ నేపథ్యం ఉన్న పిల్లలను మానసికంగా వేధించే బెదిరింపులు, వర్గ రాజకీయాలు ఎక్కువవుతాయి. ఇలాంటి పిల్లలు సమూహ పనులు చేసేటప్పుడు కేవలం నాయకత్వం కోసం పట్టుబడ తారు తప్ప, ఇతరులతో కలిసి పని చేయడానికి ఇష్టపడరు.ఇందువల్ల సహకార భావన పూర్తిగా లోపిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ప్రముఖ నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలోని అంతర్జాతీయ పాఠశాలలు, కార్పొరేట్ ఇంటర్ కాలే జీలలో ఇలాంటి యథార్థాలు చూడవచ్చు. హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ అంతర్జాతీయ పాఠశాలలో ఒక మంత్రి కుమారుడికి ఆశించిన విద్యార్థి సంఘ నాయకుడి పదవి ఇవ్వనందుకు సదరు ఉపాధ్యాయుడిని స్కూల్ ముందే అవమానించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అలాగే విజయవాడలోని ఒక ప్రముఖ పాఠశాలలో ఒక పెద్ద వ్యాపారవేత్త కుమార్తె తను తెచ్చుకున్న లక్షన్నర రూపాయల ఫోన్‌ను ప్రదర్శిస్తూ, పక్క విద్యార్థినిని కనీసం బ్రాండెడ్ వాచ్ కూడా లేదనీ, తనతో స్నేహం చేయడానికి అర్హురాలివి కావనీ కించపరిచిన ఘటనలు ఉన్నాయి. హైదరాబాద్‌లోనే మరో ఘటనలో ఒక ఈవెంట్ నాయకత్వం మార్చలేదని ప్రధానోపాధ్యాయునికే ఫోన్ చేసి బెదిరించిన దాఖలాలు ఉన్నాయి. ఈ ఎంటైటిల్డ్ మనస్తత్వానికి ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి సామాజిక మాధ్యమాలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. లైకులు, వ్యూస్ కోసం తమ విలాసవంతమైన జీవితాన్ని, పాఠశాల ఈవెంట్లను వైరల్ చేయడం ఒక ట్రెండ్‌గా మారడం వల్ల పిల్లల్లో తక్షణ సంతృప్తి అలవాటై, ఓపిక నశిస్తోంది. ఇక్కడే మనకు ‘డిజిటల్ పౌరసత్వం’ విద్య ఎంతైనా అవసరమవుతుంది.పరిష్కార మార్గాలు పాఠశాలల యాజమాన్యాలు కఠినమైన ఏక రూప నియమాలను అమలు చేయాలి. ముఖ్య మంత్రి కొడుకైనా, ఐఏఎస్ కూతురైనా స్కూల్ గేటు దాటి లోపలికి వస్తే అందరూ సమానమే అనే నియమం పెట్టి, యూనిఫాం, మొబైల్ ఫోన్ల నిషేధాన్ని అందరికీ ఒకేలా వర్తింపజేయాలి. ఇలాంటి పిల్లలకు కేవలం అధికారం మాత్రమే కాదు, క్లాస్రూమ్ శుభ్రతను పర్యవేక్షించడం, తోటి బలహీన విద్యార్థులకు చదువులో సహాయ పడటం వంటి క్షేత్రస్థాయి బాధ్యతలను అప్పగించాలి. హోదాను చూసి భయపడకుండా, పిల్లాడి ప్రవర్తన సరిగ్గా లేకపోతే తల్లిదండ్రులను పిలిచి సంప్రదింపులు జరిపి నిర్మొహమాటంగా నిజాలు చెప్పాలి. అదే సమయంలో తల్లిదండ్రులు కూడా అడి గిందల్లా ఇవ్వకుండా, సమాజంలో ఎలా బత కాలో నేర్పాలి. అడిగిన కొన్ని వస్తువులను తిరస్కరించడం వల్ల వారికి జీవితంలో అన్నీ అను కున్నట్టు జరగవు అనే చేదు నిజం చిన్నప్పుడే బోధపడుతుంది. క్రమశిక్షణతో కూడిన విద్యే నిజమైన సంస్కారం అని అందరూ గ్రహించాలి.– డా‘‘ మేడా జగన్మోహన రావు ‘ విద్యారంగ నిపుణులు -
రిస్క్ తీసుకుంటేనే 'నవలోకాలు'!
నేనూ ఇదే యూనివర్సిటీలో చదువుకున్నాను. మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చేశాను. అప్లైడ్ మ్యాథ్స్‌లో మాస్టర్స్ పట్టా పొందాను. నాకు ఇద్దరు పిల్లలు. వారూ ఉన్నత విద్యావంతులే. కాబోయే తల్లిదండ్రులుగా మీకు నాదొక సలహా. పెద్దయిన తర్వాత మీరు ఫలానా కావాలంటూ వారికి ఎన్నడూ చెప్పకండి. వారు దానికి విరుద్ధమైన పని చేసి చూపిస్తారు. కానీ, మీరు వారికొక ఆదర్శమైన వ్యక్తిలా మారవచ్చు లేదా ఆదర్శప్రాయంగా తీసుకో దగిన వ్యక్తుల్ని వారికి చూపవచ్చు. మా అమ్మ నాకు అదే పని చేసింది. నాకపుడు 15 లేదా 16 ఏళ్ళు అనుకుంటా. మా అమ్మ నాకు ‘సొసైటీ ఆఫ్ విమెన్ ఇంజినీర్స్’ సంస్థను చూపించింది. నేను ఇరవై ఏళ్లుగా ఒక ఉత్తమ భౌతికవేత్త, ఇంజినీర్ వద్ద పనిచేస్తున్నా. ఆయనే ఎలాన్ మస్క్. పది మందితో మొదలుపెట్టి దాదాపు 10,000 మందికి ఉపాధి కల్పించే సంస్థగా స్పేస్‌ఎక్స్‌ను తీర్చిదిద్దడంలో సహాయపడే అవకాశాన్ని మస్క్ నాకు కల్పించారు. మొదట్లో ఆదాయం లేకపోయినా ఏటా కోట్ల డాలర్లు గడించే సంస్థగా అది అవతరించింది. అమెరికాలో తయారైన రాకెట్లు, అంతరిక్ష నౌకల ద్వారా వ్యోమగాములను పంపడంలో చేయూతనివ్వగలగడం నాకెంతో గర్వదాయకంగా ఉంటుంది. మా డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా ప్రపంచంలో ఏ దేశానికి చెందిన వ్యోమగాములనైనా సరే అంతరిక్షంలోకి పంపగలం. ఓసారి కేవలం పౌరులను పంపాం. వారు కొద్ది రోజులు భూమి చుట్టూ తిరిగి వచ్చారు. ఇది ఆరంభం మాత్రమే. మనుషులు ఈ భూమిపైనే కాకుండా చంద్రునిపైన లేదా కుజునిపైన జీవించేందుకు బాటను సృష్టించడంలో సాయపడ్డానని అనుకుంటున్నాను. అవే కాదు, వాటిని మించి ఇతర నక్షత్ర వ్యవస్థలు, గెలాక్సీలలో జీవించగలిగే భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని ఆశిస్తున్నాను. ఇతర గ్రహాల్లో లేదా విశ్వాంతరాళంలో ఎక్కడైనా జీవకోటి ఉంటే వారితో మాత్రమే మాట్లాడాలని కోరుకుంటు న్నానని నేను తరచు జోక్ చేస్తూంటాను. అది నా జీవిత కాలంలో నెరవేరకపోవచ్చు. కానీ, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు పునాదిగా లేదా తొలి అడుగులు వేసినదిగా నా కృషి తోడ్పడుతుందని ఆశిస్తున్నా. నా గురించి చెప్పుకున్నది చాలు. నా జీవితానుభవాల ఆధారంగా రెండు మూడు సంగతులు చెబుతాను.కంఫర్ట్ జోన్ నుంచి బయటపడితేనే...అసంబద్ధమైనవైనా సరే కొన్ని లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించేందుకు ప్రయత్నించండి. విఫలమవుతానేమోనని భయ పడకండి. విఫలమైనా, పొరపాటు చేసినా అంగీకరించేందుకూ, మరో దారిని వెతుక్కునేందుకూ సందేహించకండి. ఆశించిన ఫలితం రానంత మాత్రాన విఫలమయ్యామనుకోకండి. తప్పటడుగును వృద్ధిగా పరిగణించండి. స్పేస్ఎక్స్లో జాయినవ్వాలా వద్దా అని 2002లో నేను చాలా మథనపడ్డాను. ఆ చిన్న అంకుర సంస్థలో చేరడం వ్యక్తిగతంగా రిస్క్ తీసుకోవడమనిపించింది. ఆ రంగంలో అంతకుముందెన్నడూ సఫలమైనవారు లేరు. కంఫర్ట్ జోన్ నుంచి బయటపడటం ఇష్టం లేకపోయింది. తర్వాత, నాకే అనిపించింది. నేనేమీ పెద్ద తెలివైన దాన్ని కాను. నేను దీన్ని ప్రయత్నించి చూస్తే నేనైనా లేదా కంపెనీ అయినా విఫలమైతే పట్టించుకునేదెవరు? ప్రయత్నించి చూడటమే ముఖ్యమైన విషయంగా తోచింది. రిస్క్ తీసుకోవాలి. ఉత్తేజకరమైన దాంట్లో భాగం కావాలని నిర్ణయించుకున్నా. నేనపుడు ఆ నిర్ణయానికి రాకపోయి ఉంటే నా వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం ఏ విధంగా ఉండేవో ఇపుడు ఊహించబుద్ధి కూడా కాదు. రాకెట్‌ను పైకి పంపడమే కాదు, దాన్ని సురక్షితంగా తిరిగి భూమి మీదకు దింపడం చాలా కష్టం. ఈ విషయంలో స్పేస్ఎక్స్ అపారమైన రిస్క్ తీసుకుంది. టెక్నాలజీకి నిరంతరం పదును పెట్టుకుంటూ వచ్చింది. రాకెట్‌ను ప్రయోగించిన వేదికకు డ్రోన్‌షిప్ కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉంది. ఓ డజనుసార్లు విఫలమైన తర్వాత, రాకెట్‌ను దానిమీద సురక్షితంగా దింపగలిగాం. ఇప్పటికీ అది క్లిష్టమైన కార్యమేగానీ, రొటీన్‌గా మారిపోయింది. ఆ టెక్నాలజీ కుజ గ్రహంపై ఆవాసం ఏర్పరుచుకునేందుకు చాలా ముఖ్యం.కబుర్లు అనవసరంపనిచేస్తున్న సంస్థలో టెక్నాలజీకే పరిమితం కాకుండా అకౌంటింగ్, ఫైనాన్సింగ్, ప్రభుత్వ అనుమతులు వంటి వ్యవహారాలు కూడా చూసుకోవాల్సి వచ్చింది. ఒకసారి తివాచీని వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేసేందుకు కూడా నేను వెనుకాడలేదు. సైన్స్ ప్రయోగాలకు, అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి సరుకులు తీసుకెళ్ళి, తీసుకొచ్చేందుకు సంబంధించి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) మాతో దాదాపు 200 కోట్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. అట్లా, నా విధినిర్వహణల పరిధి విస్తరిస్తూ పోయింది. ఎలాన్ మస్క్ అభ్యర్థన మేరకు కంపెనీకి చెందిన ఇతర విభాగాల్లోనూ పనులు చక్కబెట్టడంలో సహాయ పడుతూ వచ్చాను. దయతో మెలగండి. ఎదుటివారి పట్ల గౌరవం చూపండి. కానీ, ఒక సంగతి గుర్తుంచుకోవాలి. కబుర్లరాయుళ్లతో మనకు పనిలేదు. వారు చేయాల్సిన పని చేయడం మానేసి, ఇతరుల పనికి కూడా అవాంతరాలు కల్పించేవారుంటారు. కొత్త, వినూత్నమైన ఆలోచన లను పంచుకోవడంలో తప్పు లేదు. క్లిష్టమైన సమస్యలను పరిష్క రించుకునేందుకు అవి అవసరమే. కానీ, అది కాలక్షేప ప్రక్రియగా మారకూడదన్నదే నా ఉద్దేశం. ఒక్కముక్కలో చెప్పాలంటే, క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం గొంతెత్తి మాట్లాడటంలో లేదు. ఎదుటి వారి మాటలను శ్రద్ధాసక్తులతో వినడంలో ఉంది. తోటి ఉద్యోగుల ఐడియాలను స్వాగతించండి. ముఖ్యంగా మీ ఆలోచనలతో విభేది స్తున్నవారి మాటలను మరింత ఓపిగ్గా వినండి. మనమేం చేయగలం?ఈ సందర్భంగా దేశం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను ప్రస్తావించకపోవడం కూడా సబబు కాదు. ఆందోళన కలిగిస్తున్న అంశాలకు పరిష్కారాలు ఇప్పటికిప్పుడు నా వద్ద కూడా లేవు. మున్ముందు తడతాయేమో చూడాలి. భవిష్యత్ జీవన విధానంలో టెక్నాలజీ పాత్ర మరింత పెరగబోతోంది. సైన్స్, గణితంలో మన విద్యార్థుల మార్కులు పెదవి విరిచేవిగా ఉంటున్నాయి. ఉత్తీర్ణతలో చైనా అగ్ర స్థానంలో ఉంటే, నా మూలాలున్న ఐర్లాండ్ 12వ స్థానంలో ఉంది. అమెరికాది 25వ స్థానం. ఇంకా ఆందోళన కలిగించే విషయమేమిటంటే, అత్యధిక, అత్యల్ప మార్కులు తెచ్చుకుంటున్న వారి మధ్య వ్యత్యాసం పెరిగిపోతోంది. భవిష్యత్తుకు తగ్గట్లుగా నేటి బాలలను తీర్చిదిద్దాలి. మొదటగా అసాధ్యమైనవిగా కనిపించినా కొన్ని కొత్త ఐడియాలను కూడా గౌరవించడం, వాటి గురించి చెప్పేవారి మాటలను ఉపేక్షించకుండా వినడం అవసరం. మానవ ప్రతిభా వ్యుత్పత్తులను నిరుపయోగంగా వదిలేయడంకన్నా నైతికమైన పాపం మరొకటి ఉండదు. వ్యక్తిగత పురోభివృద్ధితోపాటు ఈ ప్రపంచాన్ని మరింత మెరుగైనదిగా మార్చడంలో మన వంతు కృషి ఏమి చేయగలమో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. -
రూపాయిని ఎంతకాలం నిలబెడతారు?
‘దేశం లోపల’ మోదీకి ఇప్పుడు చాలా ‘ప్రతిష్ఠ’ ఉంది. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత అది మరింతగా పెరిగింది. ఇప్పుడు అలాంటి ప్రతిష్ఠ ‘దేశం వెలుపల’ కూడా ఆయనకు కావాలి. అది రావాలి అంటే పడిపోతున్న రూపాయిని అంతకన్నా పడిపోకుండా పట్టుకోవడం, విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచుకోవడం మార్గాలు. మోదీ పన్నెండేళ్ల పాలనలో రూపాయి విలువ పడిలేస్తూనే ఉంది. ఆయన మొదటిసారి ప్రధాన మంత్రి అయినప్పుడు (2014 మే నాటికి) అమెరికన్ డాలర్ 58.3 రూపాయలుగా ఉండేది. ఇప్పుడది 94.5 రూపాయల వద్ద ఉంది. రూపా యితో పోల్చుకుంటే డాలర్ 62 శాతం పెరిగింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి 38 శాతం పడిపోయింది. అది ఇంకా ఇంకా పడిపోకుండా ఉండాలంటే, ‘విదేశీ మారక ద్రవ్యం’ పెరగాలి. ఆ పనిలో ఇప్పుడు భారత ప్రభుత్వమూ, రిజర్వ్ బ్యాంకూ తలమునకలై ఉన్నాయి. దానికోసం ‘ఫుల్లీ యాక్సెస్బుల్ రూట్’ అనే విధానాన్ని ప్రభుత్వం విస్తృతం చేయబోతోంది. అంటే– 15, 30, 40 ఏళ్ల ప్రభుత్వ బాండ్లను విడుదల చేయడం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టు బడిదారులకు ఇప్పటికి ఉన్న పరిమితులను తొలగించడం, దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5% పన్ను మినహాయింపు ఇవ్వడం, ప్రభుత్వ బాండ్ల విక్ర యంపైన 20% పన్ను నిలిపివేయడం – ఇంకా ఇలాంటి కొన్ని సడలింపుల్ని చేయబోతోంది. ఇవన్నీ చేస్తే, అప్పుడు – ఎగుమతులు పెరగడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు రావడం, ప్రవాస భారతీయుల నుంచి డబ్బు రాక పెరగడం, విదేశీ రుణాలు లేదా డిపాజిట్లు పెరగడం, దిగుమతులపై ఖర్చు తగ్గడం లాంటివి సంభవిస్తాయి. దాని ఫలితంగా ఫారెక్స్ పెరిగి, కనీసంగా 30–40 బిలియన్ డాలర్లు వస్తే, అప్పుడు రూపాయి తనకాళ్ల మీద తాను నిలబడు తుందని ప్రభుత్వ అభిప్రాయం. ఈ నెలలో, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పింది కూడా ఇదే. కొన్ని చోట్ల మోదీని ముద్దుగా విమర్శించినప్పటికీ ఈయన కూడా ఆ ‘తాను’లో ముక్కే. ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న 2013లో ‘టేపర్ టాంట్రం’ ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు (అమెరికా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించగానే, పెట్టుబడులన్నీ భారత్ వంటి దేశాలకు వచ్చి, వడ్డీ రేట్లు కొంచం పెంచగానే తిరిగి అమెరికాకు చేరినప్పుడు) రూపాయి విలువ డాలర్ ముందు 68కి పడిపోయింది. అప్పుడు తనకి ఆర్థిక సలహా దారు అయిన రఘురామ్ రాజన్ ఎలాంటి సలహాలు ఇచ్చారో, ఇప్పుడు మోదీకి కూడా అనంత నాగేశ్వరన్ అలాంటి సలహాలే ఇస్తున్నారు. ఆ సలహా పేరే ‘ఫుల్లీ యాక్సెసబుల్ రూట్.’ ఆర్థిక పరిభాషలో దీన్ని ‘హాట్ మనీ ఫ్లో’ అంటారు. అంటే – ‘స్వల్పకాలిక విదేశీ మూలధన ప్రవాహం’. విదేశీ పెట్టుబడిదారులు తమ తమ లాభాల కోసం ఒక దేశంలోకి వేగంగా తీసుకువచ్చే డబ్బు ఇది. 1950–60ల నుంచే ‘అంతర్జాతీయ ఆర్థిక రంగం’లో ఈ మాట విస్తృతంగా వాడుకలో వచ్చింది. ఇదొక ‘ప్రమాదకరమైన ఆర్థిక ధోరణి’. స్థానిక చర్యలూ తప్పనిసరి! ఇలాంటి ధోరణి వల్లనే 1997లో ఆసియాలో ఒకసారి ‘ఆర్థిక సంక్షోభం’ వచ్చింది. దీని వలన థాయ్‌లాండ్‌లో ‘తాయ్ బాత్’ విలువ కుప్పకూలింది. విదేశీ పెట్టుబడిదారులు భారీగా డబ్బు వెనక్కి తీసుకోవడం ప్రారంభించారు. ఆ ప్రభావం ఇండోనేషియా, దక్షిణ కొరియా, మలేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకూ వ్యాపించింది. పెట్టుబడి దారులు లాభాలు కనిపించినంత వరకు డబ్బు పెట్టారు. ప్రమాదం ఉందని అనిపించగానే ఒకేసారి వెనక్కి తీసుకున్నారు. దీంతో స్థానిక కరెన్సీల విలు వలు ఒక్కసారిగా, 30%–80% వరకు పడి పోయాయి. అనేక కంపెనీలు, బ్యాంకులు దివాలా తీశాయి. నిరుద్యోగం, పేదరికం పెరిగాయి. ‘హాట్ మనీ త్వరగా వస్తుంది, కానీ భయం కలిగితే అంతే త్వరగా పారిపోతుంది. కాబట్టి దానిపై ఎక్కువగా ఆధారపడకూడదు’ అని, టర్కీ ఆర్థికవేత్త డానీ రాడ్రిక్ అంటారు.అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ వేగంగా పడిపోకుండా ఉండాలంటే, హాట్ మనీ ఒక్క దాన్నే మార్గంగా పెట్టుకోకుండా, తయారీ రంగంలో పెట్టుబడుల్ని పెడుతూ ఎగుమతుల్ని బాగా పెంచుకోవాలనీ, ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచాలనీ, ప్రభుత్వ వ్యయం పెంచి ఉద్యోగాలు సృష్టించాలనీ, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ వంటి పథకాలకు ఎక్కువ నిధులు కేటాయించాలనీ ఆర్థికవేత్తలు చెబుతారు. ప్రస్తుతం మనం ‘పెట్టుబడిదారీ ప్రపంచం’లో ఉన్నాం. ‘మార్కెట్ ఎకనామీ’లో ఉన్నాం. ఇక్కడ రూపాయి పడిపోవడం, లేవడం సర్వసాధారణం. వాటిని పూర్తిగా నియంత్రించే ఆర్థిక వాతావరణం ఉండదు. రూపాయిని నిలబెట్టడానికి విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచడంపైనే దృష్టి కేంద్రీకరిస్తే సరి పోదు. స్థానికంగానూ కొన్ని చర్యలు తీసుకోవాలి: ద్రవ్యోల్బణ నియంత్రణ, ప్రభుత్వ ఆర్థిక క్రమ శిక్షణ, దేశీయ పొదుపుల పెంపు, పారిశ్రామికీకరణ, ఉత్పాదకత పెంపు, దిగుమతులను తగ్గించడం, ఇంధన స్వావలంబన, అలాగే అన్నింటికన్నా, ప్రజల్లో ‘కొనుగోలు శక్తిని’ పెంచే దిశగా ప్రయాణించడం! – నన్నూరి వేణుగోపాల్ ‘ విశ్లేషకుడు -
ఉద్ధవ్ ఠాక్రే, శివసేన (యు.బి.టి.) రాయని డైరీ
హృదయ వేదనను నేను కవిత్వంతో మాత్రమే దాచగలను. కానీ, కవిత్వం అంటేనే గుండెను పెకిలించుకుని దోసిళ్లతో నివేదించడం కదా! ఏమిటీ కుదరని లెక్క? గుండెకు కుట్లు వేసుకుంటున్నానా, లేక పాత గాయాల కుట్లను తడిమి చూసుకుంటున్నానా? ఢిల్లీ నుంచి సంజయ్ రౌత్ ఫోన్ చేశారు. ‘‘కొత్త పొయెట్రీ ఏమైనా చదివారా ఉద్ధవ్జీ? లేదంటే, కొత్తగా వైల్డ్ లైఫ్ ఫొటోలు ఏమైనా తీశారా?’’ అని! అతడు నా మనసుకు నచ్చిన రాజకీ–యేతర విషయాలతో సంభాషణను ప్రారంభించాడంటే, అక్కడ నా మనసును నొప్పించే రాజకీయాలేవో జరిగి ఉంటాయని! ‘‘వైల్డ్ లైఫ్ ఫొటోలు తీయటం కంటే కూడా కష్టమైన పని... నాకు ఈ మనుషుల అసలు ఛాయలను పట్టుకోవటం సంజయ్‌జీ! నా లెన్స్ చూస్తున్న దృశ్యం ఒకటైతే, నా కెమెరాలో పడుతున్న చిత్రం మరొకటి. పులుల్ని ఫొటో తీస్తే ప్రింట్లోకి పులులు కాకుండా వేరే ఏవో వచ్చి పడ్డాయి’’ అన్నాను.‘‘ఉద్ధవ్జీ... కోపానికే కాదు, కోపగించు కోకపోవటానికీ ఒక హద్దు ఉంటుంది. గుంటనక్కల్ని గుంటనక్కలనే అనాలి తప్ప, ‘పులులు కాకుండా వేరే ఏవో’ అని మెత్తగా అనకూడదు’’ అన్నారు సంజయ్ ఆవేశంగా. పార్టీకి లోక్‌సభలో 9 మంది ఎంపీలు, రాజ్యసభలో ఒక ఎంపీ ఉన్నారు. ఆ ఒక ఎంపీ సంజయ్ రౌత్. 2004 నుంచీ సంజయ్ శివసేన రాజ్యసభ సభ్యుడిగా ఉంటున్నారు. ‘‘ఉద్ధవ్జీ, మన 9 మంది ఎంపీలలో ఆరుగురు శిందే వైపు వెళ్లిపోయారు. లోక్‌సభలో శిందే ఎంపీలు ఉండే వైపు తమకు సీట్లు కేటాయించాలని స్పీకర్‌కి లెటర్ కూడా ఇచ్చారు’’ అని చెప్పారు సంజయ్. నిన్నటి వరకు ‘ఉద్ధవ్ శివసేన’లో ఉన్న వారు ఇవాళ ‘శిందే శివసేన’లో చేరిపోయారు! ఉద్ధవ్ పార్టీ, శిందే పార్టీ అని చూస్తున్నారు తప్పితే... శివసేనను బాలాసాహెబ్ ఠాక్రే పార్టీగా ఎవరూ చూడటం లేదు! మరాఠీ కవి సురేష్ భట్ రాసిన మాటలు గుర్తొస్తున్నాయి నాకు. ‘‘మిత్రులెవరో, శత్రువు లెవరో అనే చిన్న లెక్క కూడా నాకు అర్థం కాలేదు’’ అని వగచి, వాపోయారు భట్! 2022లో ఇదే జూన్ నెలలో, ఇదే 21వ తేదీన ఏక్నాథ్ శిందే 11 మంది శివసేన ఎమ్మెల్యేలను చీల్చుకొని వెళ్లి, ఆ తర్వాత మరో 29 మంది ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకొని, తను సీఎం అయ్యారు! అదేమీ గుర్తు లేనట్లు, 2026 మే నెలలో నాతో సహా తొమ్మిది మంది ఎమ్మెల్సీలకు పదవీ విరమణ వీడ్కోలు ఇస్తూ, శిందే గొప్ప ఔన్నత్యంతో నన్ను ‘ఉద్ధవ్ సాహెబ్ ఠాక్రే’ అని సంబోధించారు. నన్ను ‘ఉద్ధవ్ సాహెబ్ ఠాక్రే’ అనటం ద్వారా తను ‘శిందే సాహెబ్ ఠాక్రే’ అవుతానని ఆయన అనుకున్నారా!! సంజయ్ రౌత్, శిందే మీద తీవ్రమైన అసహనంతో ఉన్నారు. ‘‘మన ఎమ్మెల్యేలను లాక్కున్నాడు, మన పార్టీ గుర్తును లాక్కున్నాడు. మన ఎంపీలను లాక్కున్నాడు. ఇప్పుడు... ‘ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది’ అని మాట్లాడుతున్నాడు. ఈ నమ్మక ద్రోహిని వదిలిపెట్టకూడదు ఉద్ధవ్ జీ’’ అంటున్నారు సంజయ్.నవ్వాన్నేను. ‘‘మనల్ని వదిలివెళ్లిన వాళ్లను, మనం వదిలిపెట్టకుండా ఏం చేసుకుంటాం సంజయ్‌జీ?!’’ అన్నాను. జూన్ 19న, శివసేన 60వ ఆవిర్భావ దినోత్సవంలో... శిందే బహిరంగంగా పెద్ద అబద్ధం ఆడేశారు. ‘ఉద్ధవ్ శివసేన’ కాంగ్రెస్‌లో విలీనమవుతుందనే భయంతోనే ఆరుగురు ఎంపీలు తన వైపు వచ్చేశారట! శివసేన 30 ఏళ్లు బీజేపీతో ఉన్నా ఏనాడూ బీజేపీలో విలీనం కాలేదు. అలాంటప్పుడు కాంగ్రెస్‌తో మాత్రం ఎలా విలీనం అవుతుంది? చుట్టూ ఉన్నవన్నీ కదిలిపోతున్నప్పుడు మనం ఎలా ఉన్నాం అన్నదే మన వ్యక్తిత్వం. బలం అనేది ‘మూడింట రెండు వంతుల్లో’ ఉండేదే అయితే, ప్రజల అఫెక్షన్ ముందు మెజారిటీ ‘డిఫెక్షన్’ ఏపాటిది? -
దక్షిణాసియాలో కనబడని సంక్షోభం
దక్షిణాసియా ప్రస్తుతం ఒక విరుద్ధమైన కూడలిలో నిలిచి ఉంది. సాంకేతికత, వ్యవస్థాపకత కారణంగా ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థలు అద్భుతమైన వేగంతో దూసుకు పోతుండగా, మరోవైపు ఒక నిశ్శబ్ద జీవ క్రియ సంక్షోభం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తోంది. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లా దేశ్ టైప్ 2 డయాబెటిస్ (మధుమేహం), గుండె జబ్బులకు ప్రపంచ కేంద్రాలుగా మారాయి. ఆందోళనకరమైన విషయం ఏంటంటే, పాశ్చాత్య దేశాల ప్రజలతో పోలిస్తే దాదాపు పదేళ్లు ముందే – అంటే 30 ఏళ్ల చివర్లో, 40 ఏళ్ల ప్రారంభంలోనే – ఇక్కడి ప్రజలు గుండెపోట్లు, తీవ్రమైన జీవక్రియ రుగ్మతల బారిన పడుతున్నారు.శతాబ్దాల నాటి పొదుపు వాస్తవికతఇది కేవలం జీవనశైలి లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల మాత్రమే జరుగుతున్నది కాదు. దీని వెనుక ‘దక్షిణాసియా థిన్–ఫ్యాట్ ఫినోటైప్’ అనే ప్రత్యేకమైన జీవశాస్త్ర సత్యం దాగుంది. ఇక్కడి ప్రజలు బయటికి చూసేందుకు సన్నగా కనిపించినప్పటికీ, వారి లోపల ముఖ్యమైన అవయవాల చుట్టూ ప్రమాదకరమైన స్థాయిలో అంతర్గత కొవ్వు (విసెరల్ ఫ్యాట్) పేరుకుపోయిఉంటుంది. ఈ వైరుధ్యాన్ని అర్థం చేసుకోవడం, దీనికి పరిష్కారం కనుగొనడం దక్షిణాసియా దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికీ, కుటుంబ సంక్షేమానికీ అత్యంత అవసరం.శతాబ్దాలుగా పదే పదే వచ్చిన కరవులు, ఆహార కొరత ఇక్కడి ప్రజల జన్యురూపాన్ని ప్రభావితం చేశాయి. ప్రకృతి ఎంపిక ప్రకారం, శరీరంలో శక్తిని అత్యంత సమర్థవంతంగా నిల్వ చేసు కోగల వ్యక్తులకే మనుగడ సాధ్యమైంది. ఈ మనుగడ యంత్రాంగాన్నే ఇప్పుడు ‘థ్రిఫ్టీ జీన్’ (పొదుపు జన్యువు) సిద్ధాంతం అని పిలుస్తున్నారు. కేలరీలు సమృద్ధిగా లభిస్తున్న, శారీరక శ్రమ లేని ఆఫీస్ ఉద్యోగాలు, మోటారు వాహనాలు, విపరీతంగా ప్రాసెస్ చేసిన ఆహారాలున్న నేటి యుగంలో, ఒకప్పుడు ప్రాణాలు కాపాడిన ఈ జన్యు లక్షణమే ఇప్పుడు శాపంగా మారింది. దీని ఫలితంగా శరీరంలో దీర్ఘకాలిక తక్కువ స్థాయి వాపు, ఇన్సులిన్ నిరోధకత, అవయవాల చుట్టూ వేగంగా కొవ్వు పేరుకు పోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. లక్షలాది కుటుంబాలలో, ఒకే ఒక్క దీర్ఘకాలిక అనారోగ్యం – ముఖ్యంగా అదికుటుంబ పెద్దకు వచ్చినప్పుడు – వారిని తీర్చలేని వైద్య అప్పుల్లోకీ, తరతరాల పేదరికంలోకీ నెట్టేస్తుంది. ప్రధానంగా పాశ్చాత్య జనాభాను బట్టి రూపొందించిన సాంప్ర దాయ బి.ఎమ్.ఐ. (బాడీ మాస్ ఇండెక్స్) బరువు చార్టులు తరచుగా దక్షిణాసియా ప్రజలకు ఒక తప్పుడు భద్రతా భావాన్ని (భ్రమను) కల్పిస్తాయి. దీనివల్ల, చాలామంది అంతర్గతంగా ఆరోగ్య ప్రమాదా లను ఎదుర్కొంటున్నప్పటికీ, వారి బరువు ‘సాధారణంగానే’ఉంటుంది. ‘ప్రామాణిక’ కొలతలు పట్టించే తప్పుదోవపాశ్చాత్యులలో అధిక బరువు పరిమితి 25.0 బీఎంఐగా ఉంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణాసియా ప్రజలకు దీనిని 23.0 గానే నిర్ణయించింది; ఎందుకంటే మనకు తక్కువ బరువు ఉన్నప్పటికీ శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే, పాశ్చా త్యులలో 50 ఏళ్ల తర్వాత మధుమేహం వచ్చే ముప్పు ఎక్కువగాఉంటే, దక్షిణాసియా వాసులలో 30 ఏళ్ల నుండే ఈ ప్రమాదంపొంచి ఉంది. పాశ్చాత్యులలో సాధారణంగా చర్మం కింద కొవ్వు చేరితే, దక్షిణాసియా ప్రజలలో కీలక అవయవాల చుట్టూ పేరుకు పోతుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను ప్రేరేపించి మధుమేహం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఖరీదైన జిమ్‌లు, సుదీర్ఘమైన వర్కవుట్ సెషన్ లతో కూడిన పాశ్చాత్య తరహా ఫిట్నెస్ సంస్కృతి ఇక్కడి రద్దీ నగరాలు, ట్రాఫిక్, కాలుష్యం కారణంగా ఆచరణలో సాధ్యం కాకపోవచ్చు. అదృష్టవ శాత్తూ, సైన్స్ మనకు ఒక ఆచరణాత్మకమైన, ప్రభావవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తోంది: అదే ‘ఎక్సర్సైజ్ స్నాకింగ్’ (చిన్న చిన్న విరామాలలో వ్యాయామం చేయడం).‘డయాబెటోలాజియా’ వంటి జర్నల్స్‌లో ప్రచురితమైన పరిశో ధనల ప్రకారం – ముఖ్యంగా భోజనం చేసిన 20–30 నిమిషాల తర్వాత 8–12 నిమిషాల పాటు వేగంగా నడవడం, మెట్లు ఎక్కడం లేదా ఒకే చోట నిలబడి మార్చ్ చేయడం వంటి చిన్నపాటి శారీరక శ్రమలు భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు ప్రమాదకరంగా పెరగకుండా గణనీయంగా తగ్గిస్తాయి. సహజంగానే తక్కువకండర ద్రవ్యరాశి (మన శరీరంలోని సహజ ‘గ్లూకోజ్ సింక్’) ఉండే దక్షిణాసియా శరీర తత్వానికి, ఈ చిన్న, స్థిరమైన పనులు ఎంతో శక్తిమంతంగా పనిచేస్తాయి. ఆచరణాత్మక పరిష్కారాలు30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ సింపుల్ పరీక్షల ద్వారా తమ వార్షిక ‘మెటబాలిక్ బేస్‌లైన్’ (జీవక్రియ స్థితి)ని తెలుసుకోవాలి: హెబీఏ1సీ (3 నెలల సగటు రక్తంలో చక్కెర శాతం), ఫాస్టింగ్ గ్లూకోజ్, బీపీ, మూత్రపిండాల పనితీరు (క్రియాటినిన్), కాలేయ ఎంజైములు, థైరాయిడ్ ఆరోగ్యం కోసం టీఎస్‌హెచ్ పరీక్షలు చేయించుకోవాలి. స్థానిక ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ స్క్రీనింగ్ పరీక్షలను గ్రామాల్లో సైతం అందుబాటులోకి తేవచ్చు.భారీగా కార్బోహైడ్రేట్లు ఉండే భోజనాలకు దూరంగాఉండండి. పప్పులు, శనగలు, పెరుగు, గుడ్లు, మొలకెత్తిన గింజలు వంటి మనకు అలవాటైన ఆహారాలతో ప్రోటీన్ పరిమాణాన్నిపెంచండి. సబ్జా గింజలు, ఇసబ్గోల్ను రోజూ మీ ఆహారంలో చేర్చుకోండి. ఈ సాంప్రదాయ పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయు లను స్థిరీకరించడానికీ, ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికీ అద్భుతంగా పనిచేస్తాయి. ప్రధాన భోజనంలో ప్రోటీన్, కార్బో హైడ్రేట్ల నిష్పత్తి సుమారుగా 1:1 ఉంచడంవల్ల శరీరంలో వాపు గణనీయంగా తగ్గుతుంది. పాశ్చాత్య నమూనాలను గుడ్డిగా అనుస రించకుండా మన ప్రత్యేక జీవశాస్త్రాన్ని అర్థం చేసుకోవడం ద్వారా, మన శరీరాలకూ, మన వాస్తవికతలకూ సరిపోయే పరిష్కారాలను మనం కనుగొనవచ్చు.-వ్యాసకర్త ఇండో–అమెరికన్ బయోకెమిస్ట్రీ శాస్త్రవేత్త; ‘రెడ్డి సెంటర్ ఫర్ క్రిటికల్ అండ్ ఇంటిగ్రేటెడ్ థింకింగ్’ డైరెక్టర్-మేడా పరమేశ్వర రెడ్డి -
'సవాళ్ల నడుమ' సమర్థ దౌత్యం?
వేగంగా మారుతున్న అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలు, ట్రంప్ దూకుడు, పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్‌లలో ప్రతికూల వాతావరణం; చైనా, యూఎస్‌లతో బలపడుతున్న పాక్ మైత్రీబంధం... భారత దౌత్యనీతికి పెద్ద సవాలుగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో జాతీయ, ఆర్థిక, భద్రతా ప్రయోజనాలను రక్షించుకుంటూ అంతర్జాతీయ శక్తిగా ఎదగటం భారత్‌కు అగ్నిపరీక్షే. గత దశాబ్ద కాలాన్ని పరిశీలిస్తే, భారత దౌత్యనీతిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. అమెరికా, రష్యా ప్రాపకం కోసం అర్రులు చాచే దశ నుండి బయటకు వచ్చింది. జాతి ప్రయోజనాల దృష్ట్యా ‘వ్యూహాత్మక స్వతంత్రత’ వైపు అడుగులు వేసింది. అలీన విధానం, పంచశీల సూత్రాలు, మానవ హక్కులు వంటి విలువల బంధనాలను తెంచుకొని లావాదేవీలకు సంబంధించిన దౌత్యనీతిని అమలుపరుస్తున్నది. ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో భాగంగా భారత్... ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో ఆర్థిక, వాణిజ్య, సైనిక సంబంధాలను బలోపేతం చేసుకోవటంపై దృష్టిని కేంద్రీకరించింది. యు.ఎస్., ఐరోపా దేశాల ద్వంద్వ వైఖరిని బాహాటంగా ఎత్తి చూపింది. కుండబద్దలు కొడుతూ...ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుండి భారత్ చౌకగా చమురును కొనుగోలు చేయటాన్ని ఐరోపా దేశాలు విమర్శించి నప్పుడు, భారత్ విదేశాంగ మంత్రి ‘‘ఐరోపా దేశాలు తమ సమ స్యల్ని ప్రపంచ సమస్యలు అనుకుంటాయి. కానీ అభివృద్ధి చెందుతున్న ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల సమస్యలను ఐరోపా ఏనాడైనా పట్టించుకుందా?’’ అని నిలదీయటం భారత్ వైఖరిని సూచిస్తున్నది. రష్యా నుండి చమురు దిగుమతుల విష యంలో యూఎస్ ఆంక్షల గురించి భారత విదేశాంగ మంత్రి, ‘‘మనమెవరమూ ఈ పెద్దవాళ్ల ఆటను అర్థం చేసుకోలేనంత పిల్లలం కాము’’ అని యూఎస్ నిజస్వరూపాన్ని విమర్శించటం భారత దౌత్య ధృడత్వానికి సంకేతం. ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటనలో ఉన్నప్పుడూ ఆయన సమ క్షంలోనే ‘‘అమెరికాకు అమెరికన్ ప్రయోజనాల మాదిరిగా భారత్‌కు భారత ప్రయోజనాలు ముఖ్య’’మని కుండబద్ధలు కొట్టారు.భద్రతాపరంగా అత్యంత ప్రమాదకరమైన పాకిస్తాన్, చైనా లతో సంబంధాల విషయంలో సైతం భారత్ కఠినమైన వైఖరిని అవలంబిస్తున్నది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలకు మిన్నకుండే బుజ్జగింపు విధానం నుండి పూర్తిగా వైదొలగి ‘కన్నుకు కన్ను, కాలుకు కాలు’ సిద్ధాంతాన్ని అమలు పరుస్తున్నది. గల్వాన్ ఘర్షణల అనంతరం భారత్ పెద్ద మొత్తంలో లద్దాఖ్‌లో సైన్యాన్ని మోహరించి చైనాతో ప్రత్యక్ష యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నట్లు సవాలు విసిరింది. సరిహద్దుల్లో కాలుదువ్వుతూ వాణిజ్యపరంగా స్నేహ సంబంధాలు కుదరదని చైనా పెట్టుబడులపై తీవ్ర ఆంక్షలు విధించింది. మాల్దీ వుల ప్రభుత్వపు భారత వ్యతిరేక ధోరణి నేపథ్యంలో భారత పర్యా టకులను లక్ష దీవులవైపు మళ్లిస్తూ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది.విమర్శలకు వెరవని దృఢత్వంఅయితే భారత విదేశాంగ విధానం కొన్ని ప్రత్యేక సందర్భా లలో లొంగుబాటు ధోరణిని కనబరచిందన్న విమర్శ ఉంది. ముఖ్యంగా ట్రంప్ తెంపరితనం విషయంలో భారత్ మెతక వైఖరి అనుసరించిందని విశ్లేషకుల అభిప్రాయం. ట్రంప్ భారత్ ఆర్థిక వ్యవస్థను ఒక మృత ఆర్థిక వ్యవస్థగా అభివర్ణించినా భారత్ స్పందించలేదనీ, ట్రంప్ ఆదేశాల మేరకు ఒక దశలో రష్యా నుండి చమురు కొనుగోళ్లు కూడా ఆపేసిందనీ మరొక విమర్శ. ఇజ్రాయెల్ ‘గాజా’పై బాంబుల వర్షం కురిపించి నేలమట్టం చేస్తున్నా భారత్ ఇజ్రాయె ల్ను సమర్థించి పాలస్తీనాకు వ్యతిరేకంగా వ్యవహరించిందనీ, ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ విధానం పూర్తిగా రష్యాను సమర్థిస్తు న్నట్లుగా ఉందనీ కూడా రాజకీయ పరిశీలకుల వ్యాఖ్యానం. ఇదే దృష్టికోణంతో, భారత్ పొరుగుదేశాలు భారత్‌కు ప్రతికూలంగా మారిపోయాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకల విష యంలో మన దౌత్య నీతి విఫలమైందా అనే సందేహాలు తలెత్తాయి!ట్రంప్ రెండవసారి అధ్యక్ష పదవిని చేపట్టడంతో భారత్– అమెరికా సంబంధాలు మరింత పటిష్టమవుతాయని అందరూ ఆశించారు. కానీ ఆపరేషన్ సిందూర్ తరువాత ట్రంప్ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. అయినప్పటికీ అమెరికా వాణిజ్య సుంకాల యుద్ధంలో భారత్ దృఢంగా నిలబడింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో కూడా అమెరికా ఒత్తిడులను తట్టుకొని నిల బడింది. అదే సమయంలో భారత్–పాకిస్తాన్ల విషయంలో యూఎస్ మధ్యవర్తిత్వాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది కూడా! హమాస్, హెజ్బొల్లా, హౌతీ వంటి ఉగ్రవాద సంస్థల ఉగ్ర చర్యలను భారత్ ఏ రకంగానూ సమర్థించలేదు. ఇరాన్ యుద్ధంలో ఇంకొక ముఖ్యమైన అంశం గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు. గల్ఫ్ దేశాలలో కోటి మందికి పైగా భారతీయులు ఉపాధి పొందు తున్నారు. యూఏఈ వంటి గల్ఫ్ దేశాలతో భారత్‌కు పటిష్టమైన వాణిజ్య సంబంధాలున్నాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచు కొని భారత్ కేవలం హార్మూజ్ జలసంధి నుండి భారత్‌కు చమురు, గ్యాస్ రవాణాకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చింది. అదే సమయంలో ఇరాన్‌కు వ్యతిరేకంగా ఏ చర్యనూ తీసుకోలేదు. ఈ సందర్భంగా ఇరాన్ భారత్‌కు పూర్తిగా సహకరించటాన్ని గమనించాలి. ఉక్రెయిన్ యుద్ధంలో మనం కేవలం మన పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావటానికే ప్రాధాన్యతనిచ్చాం. ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా రష్యా నుండి చౌక ఇంధనాన్ని కొనుగోలు చేశాం. దౌత్యనీతికి నిదర్శనందక్షిణాసియాలో పొరుగు దేశాలతో భారత్ సంబంధాలు కాస్త యినా క్షీణించాయన్నది వాస్తవం. సంబంధాలు బలహీనపడి నప్పుడు ఆయా దేశాలను నియంత్రించటానికి దౌత్యనీతిలో భాగంగా కీలకమైన వ్యవస్థలను ఏర్పాటు చేశామా లేదా అన్నదే ప్రశ్న. బంగ్లాదేశ్ విషయానికి వస్తే అక్కడ రాడికల్ ఇస్లామిక్ శక్తులు బలపడకుండా ఆపలేం. కానీ మత ఛాందస శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న షేక్ హసీనా ప్రభుత్వాన్ని బలపరిచాం. ఛాందస శక్తు లది పైచేయి అయినప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని నియంత్రించ టానికి మన దగ్గర తురుపు ముక్కలున్నాయా? ఈ కోణంలో చూస్తే ఆర్థిక వ్యవస్థకు కీలకమైన విద్యుచ్ఛక్తి విషయంలో భారత్‌పై బంగ్లా దేశ్ ఆధారపడాల్సిందే. భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ స్వతంత్రించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేదు. ఈ విద్యుచ్ఛక్తి సంబం ధాన్ని గత దశాబ్దంలో ఏర్పరచటం మన దౌత్యనీతి విజయం.అమెరికా సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో యూరోపియన్ యూనియన్, కెనడా, ఆస్ట్రేలియా, యూఏఈ వంటి దేశాలతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఫ్రాన్స్, ఇజ్రా యెల్, రష్యా, దక్షిణ కొరియాలతో సైనిక, వ్యూహాత్మక ఒప్పందా లను చేసుకుంది. ఆర్థికంగా, సైనికపరంగా ప్రత్యామ్నాయాలున్నా యని యూఎస్‌కు భారత్ స్పష్టం చేస్తున్నది. దౌత్యనీతి అంటే ఇదే. ఓపిక, వివేకం, సహనాలతో మాత్రమే దౌత్యం నడుస్తుంది. గురజాల శ్రీనివాసరావు వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
‘కారుణ్య వీసా’ ఫాస్ట్–ట్రాక్ ఒప్పందం కావాలి!
దశాబ్దాలుగా ‘అమెరికన్ డ్రీమ్’ భారత యువతను ఆకర్షిస్తోంది. లక్షలాది మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్తున్నారు. అక్కడ మంచి ఉద్యోగాలు సాధించి, సాంకేతిక ఆవిష్కరణలతో రెండు దేశాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నారు. అయితే, ఈ విజయగాథల వెనుక, కొన్ని విషాదాలూ ఉన్నాయి.మాస్టర్స్ డిగ్రీ చేయడానికి వెళ్ళిన తెలుగమ్మాయి ‘స్పందన’ మే 31న ఇల్లినాయిలోని మెట్రో స్టేషన్ పైనుండి కిందపడి, తీవ్ర గాయాలవ్వడంతో ఆమె తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. పాస్‌పోర్టు, వీసా, డబ్బు లేకపోవడంతో వేలాది మైళ్ల దూరంలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. భారతీయ విద్యార్థులు తరచుగా – రోడ్డు ప్రమాదాలు, అపార్టుమెంట్లలో అగ్ని ప్రమాదాలకు గురవ్వడం, ఈతకు వెళ్లి మునిగిపోవడం, తీవ్ర అనారోగ్యాలు, హింస, దాడుల బారిన పడటం జరుగుతోంది.ఉన్నత విద్య కోసం పిల్లలను అమెరికా పంపడం అనేది సగటు భారతీయ కుటుంబానికి జీవితకాల పొదుపు, ఆస్తుల అమ్మకం, భారీ విద్యా రుణాల కలబోత. ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయినా, గాయాల పాలైనా– సాకారం కాని భవిష్యత్తు కోసం కుటుంబాలు భారీ అప్పులు తీరుస్తూనే ఉండాల్సి వస్తుంది. అత్యవసర వీసాలు పొందడం, చివరి నిమిషంలో విమాన టిక్కెట్లు కొనడం, విదేశీ ఆసుపత్రుల భారీ బిల్లులు చెల్లించడం అనేది ప్రభుత్వ సహాయం లేకుండా మధ్యతరగతి కుటుంబాలకు అసాధ్యం.బీమాతో ధీమా ఇవ్వాలి!ఈ విద్యార్థులు భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తు న్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం సమగ్ర బీమా విధానాన్ని రూపొందించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది. ఇలాంటి బీమాకు నిధులు సమకూర్చడం భారం కాదు. భారతీయ ప్రవా సులు ప్రతి ఏటా సుమారు 13 లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని భారతదేశానికి పంపుతున్నారు. ఈ బీమా పూల్‌ను సృష్టించడం భారత విదేశీ మారక నిల్వలను పెంచుతున్న ఈ వర్గంపై ప్రభుత్వం పెట్టే చిన్న పెట్టుబడి మాత్రమే.ఈ బీమా పాలసీలో అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రులు వెంటనే విదేశాలకు వెళ్లేందుకు కుటుంబ ప్రయాణ ఆర్థిక సదుపాయాలను చేర్చాలి. మరణించిన విద్యార్థి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అయ్యే ఖర్చులకు పూర్తి కవరేజ్ అందించాలి. దీనికి తోడు, విద్యా రుణ రక్షణ కవచం కూడా ఉండాలి.ఇలాంటి విషాదాలను నివారించడానికి, వెంటనే స్పందించడానికి బహుముఖ వ్యవస్థాగత విధానం అవసరం. స్పందన కుటుంబం వంటివి ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య వీసా. కుటుంబ సభ్యులకు 24–48 గంటల్లో అత్యవసర వీసా మంజూరు చేసేలా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమెరికా లాంటి దేశాలతో ద్వైపాక్షిక ‘కారుణ్య వీసా’ ఫాస్ట్–ట్రాక్ ఒప్పందం చేసుకోవాలి. అలాగే, అత్యవసర సమయాల్లో స్థానిక కాన్సులేట్, పోలీసులతో పాటు స్థానిక ప్రవాస భారతీయ సంఘాలతో సమన్వయం చేసి తక్షణ సహాయం అందించే వ్యవస్థ ఉండాలి. విదేశీ యూనివర్సిటీలు భారతీయ విద్యార్థుల ద్వారా భారీ లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ, విద్యార్థుల భద్రతపై ఎలాంటి శ్రద్ధ వహించడం లేదు. ఆ యూనివర్సిటీలకు ప్రభుత్వం ‘సేఫ్టీ రేటింగ్’ ఇవ్వాలి. సరైన భద్రత ఉందని నిరూపించుకుంటేనే భారతదేశంలో అడ్మిషన్ల ప్రచారానికి అనుమతి ఇవ్వాలి.చదవండి: ఈ ప్రశ్నలకు సమాధానం ఏది?మన విద్యార్థులు నేరుగా సంక్లిష్టమైన, నేరాలు ఎక్కువగా ఉండే విదేశీ నగరాలకు వెళ్తుంటారు కాబట్టి, ప్రయాణానికి ముందే వారికి తప్పనిసరి ‘అర్బన్ సర్వైవల్’ శిక్షణ ఇవ్వాలి. రాత్రి పూట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎలా వాడాలి, తీవ్రమైన వాతావరణాన్ని ఎలా తట్టుకోవాలి, అత్యవసర సమయాల్లో ఎవరిని సంప్రదించాలి అనే విషయాలపై అవగాహన కల్పించాలి. ఆధునిక భారతదేశ సంకల్పానికి ఈ యువత ప్రతీక. కష్టాల్లో ఉన్నప్పుడు వారిని గాలికి వదిలేయ కూడదు.- శ్రీనివాస్ మాధవ్ ‘51అ అభీ ఫౌండేషన్’ వ్యవస్థాపకులు -
చీకటి ఎల్లకాలమూ ఉండదు!
అబద్ధాన్ని బిగ్గరగా, పదేపదే చెబితే, అదే నిజమని ప్రజలు నమ్ముతారనే జోసెఫ్ గోబెల్స్ (హిట్లర్ అనుచరుడు) సిద్ధాంతం మీద నమ్మకం ఉన్న వ్యక్తి చంద్రబాబు. ప్రజలకు ఏదీ గుర్తుండదని ఆయన నమ్మకం. అందుకే రెండేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్‌కు గ్రహణం పట్టినా, పండు వెన్నెల కురుస్తోంది, సంబరాలు చేసుకోమంటు న్నాడు. కానీ జనం జగన్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. సంక్షేమమే ఆయన అజెండా, విశ్వసనీయత వైసీపీ జెండా. దీనికి నిదర్శనం ఆయన చేసిన అభివృద్ధి. సంఖ్య లెప్పుడూ అబద్ధం చెప్పవు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా రెండు రెళ్లు నాలుగే. ఆయన హయాంలో నేరుగా నగదు లబ్ధి పొందినవారి సంఖ్య 8,70,06,898. 2 లక్షల 73 వేల 756 కోట్ల రూపాయల నగదు నేరుగా అకౌంట్లలోకి చేరింది. నాన్ డీబీటీ ద్వారా 1,84,604 కోట్ల రూపాయిలు అందింది. మొత్తం ఐదేళ్లలో ప్రజలకు అందిన లబ్ధి 4 లక్షల 58 వేల 360 కోట్లు.అంకెలు చెప్పే నిజాలుమరి చంద్రబాబు సూపర్ బుస్సు హామీల గురించి మాట్లాడు కుందాం. ఎన్నికల ప్రచారంలో బాబు ష్యూరిటీ – భవిష్యత్‌కు గ్యారెంటీ అని బాండ్లు కూడా ఇచ్చారు. జూన్ 2024 నుంచి ప్రారంభం అన్నారు. 2026 కూడా వచ్చింది. ఇచ్చారా? చంద్ర బాబులో ఒక గజిని, అపరిచితుడు ఉంటారు. చంద్రబాబు కంటే గారడీ మనిషి మేలు. కనీసం గాల్లోంచి పావురమైనా తీస్తాడు. అదే బాబు అయితే పావురాన్ని ఊహించుకోమంటారు. బాబు సూపర్ ట్రిక్స్ గురించి చెప్పాలంటే: 1. ఆడబిడ్డ నిధి– ఆడపడుచుల్ని ఆదరించి గౌరవించడం తెలుగువారి సంస్కృతి. ఈ పథకానికి అతీగతీ లేదు. రెండేళ్లకు గానూ, ఆడబిడ్డలు ఒక్కొక్కరికి 36 వేలు బాకీ. 2. నిరుద్యోగ భృతి– నిరుద్యోగులకు నిండా మోసం. ఒక్కొక్క రికీ రూ.72 వేలు బాకీ. 3. యాభై ఏళ్లకే పెన్షన్– బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఎన్నేళ్లు ఎదురు చూసినా టెన్షనే.4. తల్లికి వందనం– ఫస్ట్ ఇయర్ మోసం. సెకండ్ ఇయర్ 20 లక్షల మంది కోత. 5. ఉచిత బస్సు– ఐదు సర్వీసులకే పరిమితం. 6. దీపం– ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, సగం పథకం గ్యాసే. 7. అన్నదాత సుఖీభవ – రైతుకు దుఃఖీభవ అయ్యింది. ఇచ్చింది రూ. 14 వేలు. బాకీ రూ. 26 వేలు.రెండేళ్లలో అన్ని రంగాలను నాశనం చేశారు. విద్యా వ్యవస్థను బాగు చేశామని ఆ శాఖ మంత్రి నారా లోకేశ్ చెబుతున్నారు. తండ్రికి తగ్గ తనయుడు. జగన్ హయాంలో ‘నాడు–నేడు’ కింద వేల స్కూళ్లు బాగుపడ్డాయి. పనులు పూర్తయ్యే స్థితిలో ఉన్న 22 వేల స్కూళ్లను గాలికి వదిలేశారు. ‘తల్లికి వందనం’ కింద రూ. 13 వేల కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది రూ. 8,389 కోట్లు. విద్యా దీవెన, వసతి దీవెనలను నిర్వీర్యం చేశారు. ‘గోరుముద్ద’ను ఘోరం చేసి పిల్లల్ని ఆస్పత్రులపాలు చే శారు. విద్యను వ్యాపారంగా మార్చిన వాళ్లని మంత్రులుగా పెట్టుకున్న తర్వాత ప్రభుత్వ స్కూళ్లు బతుకుతాయా? రెండేళ్లలో వైద్యం రోగగ్రస్థమైంది. ఆరోగ్యశ్రీకి రూ. 3,746 కోట్ల బకాయి పెట్టి పేద ప్రజల్ని అన్యాయం చేశారు. ఆరోగ్య ఆసరా పథకాన్ని రద్దు చేశారు. జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు చేస్తే, అందులో 11 కాలేజీలను ప్రైవేట్‌కు అమ్మేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 562 మందులు లభ్యమైతే, ఇప్పుడు ఒక్క మందు బిళ్ల కూడా దొరకని స్థితి. పల్లె ప్రజల కోసం ‘ఫ్యామిలీ డాక్టర్’ను ప్రవేశ పెడితే అది అందకుండా చేశారు. ఒక జాతి బలంగా ఉండాలంటే విద్య, వైద్యం పటిష్ఠంగా ఉండాలి. కానీ కూటమి ప్రభుత్వం ఆ రెండింటినీ ప్రైవేట్‌కు అమ్మేస్తోంది. ఏ వర్గం బాగుపడిందని!ఎన్టీఆర్ మహానటుడు. ఆయనకి తెలియకుండానే మహా నటుణ్ణి అల్లుడిగా తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ తెరమీద నటిస్తే, చంద్ర బాబు ఎడతెరపి లేకుండా నటిస్తారు. దీనికి ఉదాహరణ వ్యవ సాయం దండగ అని ఒకప్పుడు చెప్పిన బాబు, ఎన్నికలకు ముందు రైతన్నలపై అంతులేని ప్రేమ కురిపించారు. కేంద్రంతో సంబంధం లేకుండా 20 వేలు ఇస్తానని, రెండేళ్లకు 26 వేలు నామం పెట్టారు. ఉచిత బీమా పథకం పోయింది. 1,100 కోట్లు ఇన్ ఫుట్ సబ్సిడీ పాయె. రైతు భరోసా కేంద్రాలు నాశనం. యూరియా కోసం రెతులు కొట్టుకున్నారు. పొగాకు, పత్తి, అరటి, మామిడి ఇలా ప్రతి రైతూ రోడ్డెక్కారు. ఎక్కడ చూసినా దళారులే. ఈ–క్రాప్ వ్యవస్థ నిర్వీర్యం. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. ‘ఆసరా’, ‘చేయూత’, ‘కాపు నేస్తం’, ‘ఈబీసీ నేస్తం’ పథకాలు నిలిపివేశారు. ‘దిశ’ కార్యక్రమాన్ని రద్దు చేశారు. పేదలకు ఇచ్చే ‘వైఎస్సార్ పెళ్లి కానుక’ ఆగిపోయింది. ఐదేళ్లలో జగన్ 31.19 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మలకు ఇచ్చారు. యువకులకు జాబ్ క్యాలెండర్ గాలికి పోయింది. డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. వాలంటీర్లు మునిగిపోయారు. రేషన్ వాహనాల రద్దుతో 18 వేల మంది రోడ్డున పడ్డారు. చివరికి ఉద్యోగుల్ని కూడా మోసం చేశారు. ఒక రూపాయి ఐఆర్ కూడా ఇవ్వలేదు. ఐదు డీఏలు పెండింగ్. జీపీఎస్, ఓపీఎస్ ఔట్. పీఆర్సీ అడ్రస్ లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 35 వేల కోట్లు బాకీ. కూటమి ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క వర్గం ప్రశాంతంగా లేదు. ప్రశ్నిస్తే అరెస్ట్‌లు చేస్తారు. రెడ్‌బుక్ అంటారు. వైఎస్సార్సీపీ నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరూ మినహాయింపు కాదు. దళితులకు రక్షణ లేదు. మహిళలు, చిన్నారు లకు రక్షణ లేదు. అయినా తమ ప్రభుత్వం అద్భుతాలు చేసిందని చెప్పుకుంటున్నారు. జనం రెండేళ్లు సంబరాలు చేసుకోవాలని అంటున్నారు.ఏం సాధించారని!జగన్ మళ్లీ వస్తారని వాళ్లకు తెలుసు. అందుకే భయం. జగన్నామ స్మరణ. జనాన్ని తప్పుదారి పట్టించడానికి మా పార్టీని గొడ్డలి పార్టీగా పిలుస్తున్నారు. గొడ్డలి ముద్రతో జనంలో భయం పుట్టించాలని వాళ్ళ ప్రయత్నం. వేళ్లు కుళ్లి పోయిన తెలుగుదేశం పార్టీ వృక్షాన్ని కూల్చాలంటే గొడ్డలి చాలా అవసరం. గొడ్డలి అంటే వాళ్ళకు భయం. కానీ చెడుని కూల్చే ఆయుధం మాకు. రెండేళ్లలో మీరు సాధించిన అభివృద్ధి 3.48 లక్షల కోట్ల అప్పు. ఇక మీ ఎమ్మెల్యేలు సరిహద్దులు నిర్ణయించి కప్పం వసూళ్లు చేస్తు న్నారు. కాంట్రాక్ట్ పనుల కోసం కొట్టుకుంటున్నారు. లిక్కర్ సిండి కేట్ నడిపిస్తున్నారు. చివరికి చికెన్ షాపుల వద్ద కూడా వసూళ్లు చేస్తున్నారు. సంపద సృష్టిస్తానని చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. తీరా చూస్తే రాష్ట్రానికి సంపదే లేకుండా చేశారు. పిల్లల్ని కనండి, వాళ్లే మన సంపద అని చిట్కాలు చెబుతున్నారు. టీడీపీ అంటే ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ లేదా తెలివిగా దోచుకునే పార్టీ. చీకటి ఎల్లకాలం ఉండదు. తమసోమా జ్యోతిర్గమయ.భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త తిరుపతి మాజీ శాసనసభ్యులు -
ఆగిన యుద్ధం ఆగినట్టేనా?
ఎంతమాత్రం అవసరం లేని దుర్మార్గపు యుద్ధాన్ని 108 రోజులపాటు సాగించి ఇరాన్‌కే గాక ప్రపంచానికంతా తీవ్ర నష్టాలు కలిగించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, తానిక ఏమీ చేయలేనని గ్రహించి కావచ్చు యుద్ధ విరమణకు ‘అవగాహనా పత్రం’ ఒకటి ఇరాన్‌తో పాటు ప్రకటించారు. ఆ పత్రంపై ఈ నెల 19న జెనీవాలో జరగగలవంటున్న సంతకాలకు ట్రంప్ సహచర యుద్ధవీరుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ నుంచి కొత్త విఘాతాలు ఏర్పడని పక్షంలో, మరొక రెండు మాసాలకు మలివిడత చర్చలు జరుగుతాయి. అంతవరకు అందరం మధ్యంతర ఊపిరి పీల్చుకున్నా, తదనంతర పరిస్థితిపై ఇంకా ఊపిరి బిగబట్టవలసిందే.కుదిరినట్టేనా ‘అవగాహన’?ఆ ‘పత్రం’లో ఏమున్నదనే వివరాలు జెనీవాలో సంతకాల తర్వాతే ప్రకటిస్తామని అంటున్నారు. ఇంతవరకు ట్రంప్ చెప్పిన దానినిబట్టి, అన్ని క్షేత్రాలలో కాల్పులు వెంటనే ఆగిపోతాయి. ఇరాన్ రేవులపై దిగ్బంధాన్ని అమెరికా, హార్మూజ్‌పై దిగ్బంధాన్ని ఇరాన్ ఎత్తివేస్తాయి. ఓడలపై ఇరాన్ సుంకాలు విధించదు. చమురు రవాణా మునుపటి వలె స్వేచ్ఛగా సాగవచ్చు. ట్రంప్ చేసిన ప్రకట నను ఇరాన్ ఖండించలేదు. చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పిన దాని ప్రకారం, యుద్ధం అన్ని క్షేత్రాలలో వెంటనేగాక శాశ్వతంగా కూడా నిలిచిపోతుంది. ఇంకా ఇతరత్రా వెల్లడవుతున్న వివరాల ప్రకారం, అమెరికా స్తంభింపజేసిన 24 బిలియన్ డాలర్ల నిధులలో మొదట సగం మేర విడుదల చేస్తారు. ఇరాన్ పునర్ నిర్మాణానికి అమెరికా మిత్ర దేశాలతో కలిసి 300 బిలియన్లు సమకూర్చుతారు. అవగాహనా పత్రంలో ఇరాన్ యురేనియం నిల్వలు, క్షిపణులు, హమాస్, హెజ్బొల్లా, హౌతీల వంటి మిలిటెంట్ సంస్థల ప్రస్తావనలు లేవు. ఈ చర్చలు మలిదశలో ఉండగలవన్నది సూచన.ఇరాన్ రేవుల దిగ్బంధాల ఎత్తివేత 19 లోగా పూర్తిగా జరిగితేనే తాము అవగాహనా పత్రంపై సంతకాలు చేయగలమని ఇరాన్ వెంటనే స్పష్టం చేసింది. ఇందులోని మెలిక ఏమంటే, అమెరికా తాను చేయగలిగింది తాను చేయవచ్చుగాక. కానీ, లెబనాన్‌పై, అక్కడి హెజ్బొల్లాపై దాడులను కొనసాగిస్తున్న ఇజ్రాయెల్, ఇపుడు ఆపుతుందా అన్నది పెద్ద ప్రశ్న. చివరకు ఆదివారం రాత్రి తన ప్రక టనకు కొద్ది గంటల ముందు కూడా నెతన్యాహూను ట్రంప్ పరుషమైన భాషలో హెచ్చరించవలసి వచ్చింది. ఆ మీదట నెతన్యాహూతో పాటు ఆయన రక్షణ మంత్రి కట్జ్ అసాధారణమైన రీతిలో సంయుక్త ప్రకటన చేస్తూ, తాము దాడులు చేస్తున్నది హెజ్బొల్లాపై తప్ప లెబనాన్‌పై కాదని వివరించబూనారు. అది నిజం కాదని అందరికీ తెలుసు. గ్రేటర్ ఇజ్రాయెల్ సృష్టి దీర్ఘకాలిక లక్ష్యంగా గల ఇజ్రాయెల్, అందుకోసం పాలస్తీనా, జోర్డాన్లతో పాటు లెబనాన్ తదితర అరబ్ దేశాల భూభాగాలను ఆక్రమించటం ఒక కార్యక్రమంగా నేటికీ కొనసాగిస్తున్నది. ఆ మేరకు జియోనిస్టు సిద్ధాంత కర్తలు ప్రతిపాదించిన ఒక మ్యూపును నెతన్యాహూ నిరుడు విడుదల చేస్తూ, తానందుకు కట్టుబడి ఉన్నాన న్నారు. పాలస్తీనాను మొత్తంగా ఇజ్రాయెల్‌లో భాగంగా చూపే మ్యాపును ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలోనే ప్రదర్శించారు.‘గ్రేటర్ ఇజ్రాయెల్’ ఆగుతుందా?నిజానికి ప్రస్తుత యుద్ధాన్ని అణ్వాయుధాల సాకుతో అమె రికాతో కలిసి మొదలుపెట్టడంలోని రహస్యోద్దేశం కూడా పాలస్తీనా ఆక్రమణకు, పశ్చిమాసియాలో ఆధిపత్యానికి అడ్డంకిగా గల ఇరాన్‌ను విచ్ఛిన్నం చేయటమేనన్నది రహస్యం కాదు. అందుకే, ప్రస్తుత యుద్ధంలో శాంతి ప్రయత్నాలకు ప్రతిసారి విఘాతం కలి గిస్తూ వస్తున్న ఇజ్రాయెల్, అవగాహనా పత్రం అమలును మరొక మారు భంగపరచబోదన్న హామీ లేదు. అందుకే కావచ్చు ఇరాన్ నాయకత్వం, అవగాహన అంటూ కుదిరినా తమ వేళ్లు ఎల్లప్పుడూ ట్రిగ్గర్‌పైనే ఉంటాయని ఆ వెంటనే ప్రకటించింది.సమస్యలలో సులభమైన వాటిపై ప్రస్తుతానికి రాజీ కుదురు తున్నది. జరుగుతున్న దాడుల నిలిపివేత, నౌకా దిగ్బంధాల ఎత్తివేత వంటివి తేలికైన విషయాలు. అందువల్ల చమురు, సరకుల రవాణాలు సాఫీగా జరిగి ఇరాన్, గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచాని కంతా ఉపయోగకరమవుతుంది. తమకిచ్చిన హామీలు జెనీవా సంతకాల తర్వాత 60 రోజులపాటు సక్రమంగా అమలైతేనే మలి విడత చర్చలు జరప గలమని ఇరాన్ స్పష్టం చేసింది. అంతా అదే ప్రకారం జరుగుతుందనీ, మొదట ఈ నెల 19 వరకూ, తర్వాత 60 రోజుల వరకూ ఇజ్రాయెల్‌ను ట్రంప్ పూర్తి నియంత్రణలో ఉంచ గలరనీ, మరొకవైపు హెజ్బొల్లాను ఇరాన్ నియంత్రించగలదనీ భావించినా, ఆ మలి విడత చర్చలు ఎంత మాత్రం తేలిక కాబోవు. అప్పటి అజెండా క్లిష్టమైనది కాగలదు.వాటిలో అన్నింటికన్న ప్రధానమైనది ఇరాన్ అణుశక్తి కార్య క్రమం. ఆదివారం రాత్రి ట్రంప్ తమ ఒప్పందాన్ని ప్రకటిస్తూ,అంతా సాధారణ పరిస్థితికి చేరినాక తాము ఇరాన్లో ప్రవేశించి యురేనియంను స్వాధీనపరచుకుని, అమెరికాకు తెచ్చి నిరుపయో గంగా మార్చగలమన్నారు.ఆ పని చేయటంవల్ల ఇజ్రాయెల్‌కు అణుముప్పు తొలగిపోతుందని, కనుక ప్రస్తుతానికి మౌనంగా ఉండాలంటూ నెతన్యాహూను ఒప్పించినట్లు వార్తలు చెప్తున్నాయి. కానీ, ఇరాన్ వార్తలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. శాంతియుత ఉప యోగం తమ అంతర్జాతీయ హక్కు అని మొదటినుంచి ప్రకటిస్తున్న ఇరాన్, అది ఎప్పటికీ వదలుకోబోమనీ, యురేనియం శుద్ధి శాతాన్ని ప్రస్తుత 60 శాతం నుంచి గణనీయంగా తగ్గించి, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తనిఖీలు మరింత పెరిగేందుకు అనుమతించగల మనీ చెప్తున్నది. తమ క్షిపణులు ఆత్మరక్షణకు తప్పనిసరి గనుక వాటి పరిధి తగ్గింపు ఆమోదయోగ్యం కాదనీ, మిలిటెంట్ సంస్థలు ప్రధా నంగా ఆయా ప్రాంతాల పరిస్థితులను బట్టి స్వతంత్రంగా పని చేస్తాయి గనుక, వాటిని నిరోధించే శక్తి తమకు లేదనీ అంటున్నది. ఏం సాధించినట్టు?ఇంతకూ, ఫిబ్రవరి 28న ఆరంభించిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో అమెరికా, ఇజ్రాయెల్ సాధించిందేమిటి? ఇరాన్‌తో చర్చలు ఒక కొలిక్కి వస్తుండగా దాడులకు పాల్పడ్డ అమెరికా తన విశ్వసనీయతను కోల్పోవటం మొదటి ఘనత. ఇస్లామిక్ వ్యవస్థ మార్పు (రెజీమ్ ఛేంజ్), అణుశక్తి సామర్థ్య నిర్మూలన, బాలిస్టిక్ క్షిపణుల ధ్వంసం, మిలిటెంట్ మిత్రుల అంతం అనే లక్ష్యాలలో ఏ ఒక్కటీ నెరవేరక పోవటం రెండవ ఘనత. అగ్రనేత ఖొమెనేయ్ని కుటుంబంతో సహా మొదటి రోజునే ప్రాణాలు తీసినా ఇరానీ నాయ కత్వం, జాతి మొత్తం ఏకమై నిలిచి నెలల తరబడి ప్రతిఘటించేట్లు చేయటం మూడవ ఘనత. ఇరాన్ ప్రతిఘటనతో స్వయంగా తమ స్థావరాలతో పాటు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు తీవ్ర నష్టాలకు గురి కావటం నాల్గవ ఘనత. చమురు, గ్యాస్ సమస్యలతో ప్రపంచం అతలాకుతలం కావటం అయిదో ఘనత. ఇరాన్ ‘బేషరతుగా లొంగిపోవాలన్న డిమాండ్ ఏమైందో అమెరికా అధ్యక్షుడే చెప్పాలి.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఈ ప్రశ్నలకు సమాధానం ఏది?
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఆడంబరంగా విడుదల చేసిన, రంగురంగుల ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఒక ప్రతిష్ఠాత్మక ప్రణాళికగా ప్రచారం పొందుతోంది. కానీ యువత, గ్రామీణ అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం, హైదరాబాద్‌ను ప్రపంచంలోని అగ్రగామి ఆవిష్కరణ నగరాలలో ఒకటిగా తీర్చిదిద్దడం, ఫ్యూచర్ సిటీ, కృత్రిమ మేధస్సు కేంద్రాలు, గ్లోబల్ పెట్టుబడులు, బుల్లెట్ రైళ్లు, మెగా కారిడార్లు నిర్మించడం వంటి భారీ లక్ష్యాలను ఈ పత్రం ప్రతిపాదిస్తోంది.మొదటి చూపులో ఇది సాహసోపేత, భవిష్యత్ దృష్టితో కూడిన పత్రంలా కనిపిస్తుంది. లోతుగా పరిశీలిస్తే గ్రామీణ ప్రజలు, రైతులు, నిరుద్యోగ యువత, ప్రభుత్వ విద్యపై ఆధారపడే కుటుంబాలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలకు సమగ్ర సమాధానం ఇవ్వలేకపోయిందనే భావన కలుగుతుంది. ఏ అభివృద్ధి నమూనాకైనా అంతిమ కొలమానం జీడీపీ వృద్ధి కాదు. ప్రజల జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాలు, విద్యా నాణ్యత, ప్రాంతీయ సమానత్వం, సామాజిక చలనశీలత వంటివే ముఖ్యమైనవి.ఉపాధి కల్పనలో స్పష్టత ఏది?ఈ పత్రంలో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎన్ని ఉద్యోగాలు సృష్టిస్తారు? మహిళల భాగస్వామ్యం ఎంత? వంటి ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం లేదు. చైనా అభివృద్ధి కేవలం బీజింగ్, షాంఘై, షెన్ జెన్ నగరాల మీద లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ‘పట్టణ, గ్రామస్థాయి సంస్థలు’ (టీవీఈ) పేరుతో లక్షల సంఖ్యలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలను స్థాపించింది. గ్రామాల్లోనే ఉత్పత్తి, ప్రాసెసింగ్, సేవా రంగాలను అభివృద్ధి చేసి కోట్లాది ఉద్యోగాలను సృష్టించింది. తెలంగాణలో కూడా ఇదే తరహాలో ప్రతి మండలాన్ని ఒక ఉత్పత్తి కేంద్రంగా, ప్రతి జిల్లాను ఒక ప్రత్యేక పారిశ్రామిక గుర్తింపుతో అభివృద్ధి చేయాలి. నిజామాబాద్‌లో వ్యవసాయ ప్రాసెసింగ్, జగిత్యాల–కరీంనగర్ ప్రాంతాల్లో ఆహార ఉత్పత్తుల పరిశ్రమలు, ఆదిలాబాద్‌లో అటవీ ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమలు వంటి జిల్లా–ప్రత్యేక అభివృద్ధి నమూనాలు రూపొందించాలి. కానీ ప్రస్తుత పత్రంలో ఇలాంటి స్పష్టమైన జిల్లా స్థాయి ఆర్థిక వ్యూహం కనిపించదు.ఈ పత్రం ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు, ఏఐ సిటీలు, జ్ఞాన ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతోంది. కానీ వేలాది ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏమిటి? గ్రామీణ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి ఎలా జరుగుతుంది? ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళా శాలలు, ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు ఎలా బలోపేతం అవుతాయి? అనే ప్రశ్నలకు సమాధానం లేదు.ఫిన్లాండ్ నమూనా ఈ విషయంలో ఎంతో ప్రాసంగికం. ఫిన్లాండ్ విద్యా విప్లవం రాజధానిలో ప్రారంభం కాలేదు. గ్రామీణ పాఠశాలల నుంచే ప్రారంభమైంది. గ్రామంలో చదివే విద్యార్థికి, నగరంలో చదివే విద్యార్థికి ఒకే నాణ్యత గల విద్య అందించాలనే లక్ష్యంతో వారు ముందుకు వెళ్లారు. తెలంగాణ కూడా దీనిని అనుసరించాలి.జర్మనీ అనుభవం మరో ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. అక్కడ విద్య – ఉపాధి వేర్వేరు వ్యవస్థలు కావు. విద్యార్థి చదువు తున్నప్పుడే పరిశ్రమలో పనిచేసే ద్వంద్వ విద్యా విధానం అమలులో ఉంది. అందువల్ల విద్య పూర్తయ్యే నాటికి ఉద్యోగానికి కావలసిన నైపుణ్యాలు అతనికి సిద్ధమై ఉంటాయి. తెలంగాణలో ప్రతి ఐటీఐ, ప్రతి పాలిటెక్నిక్, ప్రతి డిగ్రీ కళాశాలను స్థానిక పరిశ్రమలతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది.తెలంగాణలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువత ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్నారు. వారికి కేవలం స్కిల్ హబ్‌లు సరిపోవు. ఉద్యోగ హామీ, అప్రెంటిస్‌షిప్ హామీ, స్థానిక పరిశ్రమల అభివృద్ధి, డిజిటల్ ఉపాధి అవకాశాలు, గ్రామీణ స్టార్టప్ వ్యవస్థలు అవసరం. ప్రతి నియోజకవర్గంలో బీపీఓ కేంద్రాలు, డిజిటల్ సేవా కేంద్రాలు, గ్రామీణ ఈ–కామర్స్ హబ్‌లు, మహిళా ఉత్పత్తిదారుల సహకార సంఘాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.చదవండి: దేశంలో గిరిజన అభివృద్ధికి సవాళ్లుతెలంగాణ రైజింగ్ 2047 పత్రం అభివృద్ధిని ప్రధానంగా నగరాల విస్తరణ కోణంలో చూస్తోంది. కానీ 21వ శతాబ్దపు విజయ వంతమైన అభివృద్ధి నమూనా నగరాలు, గ్రామాల మధ్య సమతు ల్యతను సాధించడంలో ఉంది. ఇది గ్రామీణ నిరుద్యోగులను నగరా లకు వెళ్లేలా వలసలను ప్రోత్సాహిస్తుంది. హైదరాబాద్ అభివృద్ధి అవసరం. ప్రపంచ పెట్టుబడులు కూడా అవసరం. కానీ అదే సమ యంలో ములుగు గిరిజన విద్యార్థికీ, నాగర్‌కర్నూల్ రైతు కుటుంబానికీ, నారాయణపేట మహిళకూ ఈ విజన్ ఏం ఇస్తుందో కూడా స్పష్టంగా చెప్పాలి.- సీహెచ్.వి. ప్రభాకర్ రావు సీనియర్ జర్నలిస్ట్ -
దేశంలో గిరిజన అభివృద్ధికి సవాళ్లు
గిరిజన అభివృద్ధి నిరంతర పురోగతితో సాగిన ప్రయాణం కాదు. ఇది పాలన విధానాలు, ఆలోచనా విధానాలు, రాజ్యాంగ హామీల మధ్య జరిగిన మార్పులతో రూపుదిద్దుకున్న క్లిష్టమైన ప్రయాణం. ఇందులో రక్షణ, సమగ్రత, స్వయం ప్రతిపత్తి, ప్రభుత్వ జోక్యం, సాంస్కృతిక గుర్తింపు, ఆర్థిక అభివృద్ధి మధ్య ఇప్పటికీ కొనసాగుతున్న సంఘ ర్షణే కనిపిస్తుంది. బయటకు అభివృద్ధి కనిపించినప్పటికీ, లోపల అనేక నిర్మాణాత్మక సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. బ్రిటిష్ పాలనలో గిరిజన ప్రాంతాలను ప్రత్యేక ప్రాంతాలుగా పరిగణించి పాలన అమలు చేశారు. 1874లో ‘షెడ్యూల్డ్ జిల్లాలు’, 1919లో ‘వెనుకబడిన ప్రాంతాలు’, 1935లో ‘మినహాయించ బడిన’, ‘కొంతమేరకు మినహాయించబడిన ‘ ప్రాంతాలు అనే వర్గీక రణలు చేశారు. ఇవి గిరిజనులను రక్షించే లక్ష్యంతో ఉన్నప్పటికీ, వాస్తవానికి పరోక్ష దోపిడీకి మార్గాన్ని సుగమం చేశాయి.కేవలం అధ్యయనాంశమా?1924లో వచ్చిన ఏజెన్సీ రూల్స్ ద్వారా రెవెన్యూ అధికారులకు విస్తృత అధికారాలను ఇచ్చారు. పరిపాలన, న్యాయ అధికారాలు ఒకే వ్యక్తి చేతిలో ఉండేవి. ఈ విధానం ఇప్పటికీ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాలలో కొంతవరకు కనిపిస్తున్నది. రక్షణ పేరుతో గిరిజన ప్రాంతాలు వేరుపడిపోయాయి. దాంతో వ్యాపారులు, మధ్య వర్తులు, కాంట్రాక్టర్లు గిరిజనులను దోచుకున్నారు. గిరిజనులు భూములను కోల్పోయారు, అప్పుల్లో కూరుకుపోయారు. రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు లేక అభివృద్ధికి దూరమయ్యారు.20వ శతాబ్దం ప్రారంభంలో తక్కర్ బాపా వంటి సంస్కరణ వాదులు ఈ విధానాన్ని వ్యతిరేకించారు. 1941లో మినహాయించ బడిన ప్రాంతాల కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న ఆయన, గిరిజనులను కేవలం అధ్యయనానికి సంబంధించిన ప్రజలుగా కాకుండా, గౌర వంతో బాటు అభివృద్ధికి అర్హులైన పౌరులుగా చూడాలని చెప్పారు. ఆయన ఆలోచనలు ఆ తరువాత రాజ్యాంగంలోని ఆర్టికల్ 46లో ప్రతిబింబించాయి. దీని ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల విద్య, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ప్రోత్సహించాలి.స్వాతంత్య్రం తరువాత రాజ్యాంగం గిరిజన ప్రాంతాలను ఐదో షెడ్యూల్, ఆరవ షెడ్యూల్ కింద ప్రత్యేక పరిపాలన క్రిందికి తీసుకు వచ్చింది. గిరిజనులను ప్రధాన సమాజంలో కలపాలా? లేక వేరుగా ఉంచాలా? అనే పెద్ద ప్రశ్న ముందుకొచ్చింది. కలపడం వల్ల వారి సంస్కృతి దెబ్బతింటుంది; వేరుగా ఉంచడం ప్రజాస్వామ్య సమా నత్వానికి విరుద్ధం. జవహర్లాల్ నెహ్రూ ‘పంచశీల సూత్రాల’ ద్వారా సమతుల్య మార్గాన్ని సూచించారు. గిరిజనుల స్వభావానికి అనుగుణంగా అభివృద్ధి జరగాలి; వారి భూమి, అడవి హక్కులు, సంప్రదాయ సంస్థలకు రక్షణ అవసరం అని చెప్పారు. అభివృద్ధిని కేవలం డబ్బు లేదా ఆర్థిక వృద్ధితో కాకుండా, మానవ గౌరవంతో బాటు సామర్థ్యాల పెరుగుదలతో కొలవాలని చెప్పారు. 1969లో శీలు ఆవో కమిటీ ప్రాంతాల వారీగా ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు అవసరమని సూచించింది. కానీ తరువాతి కాలంలో విధానాలు ఈ ఆదర్శాల నుండి దూరమయ్యాయి.ఐదవ పంచవర్ష ప్రణాళిక తరువాత ట్రైబల్ సబ్ ప్లాన్, ఐటీడీఏల వంటివి మొదలయ్యాయి. ఇవి కొంత సంక్షేమాన్ని అందించినప్పటికీ, గిరిజన ప్రాంతాలను మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపద, అడవులు, నీటి వనరులు పెద్ద ప్రాజెక్టులు, గనులు, పరి శ్రమల కోసం ఉపయోగించారు. అభివృద్ధి పేరుతో అనేక మంది గిరిజనులు తమ భూములు, జీవనాధారాలను కోల్పోయారు. 1947 నుండి 2010 వరకు భారత్‌లో 6 నుండి 6.5 కోట్ల మంది గిరిజనులు అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల ప్రభావితమయ్యారని అధ్యయనాలు చెబుతున్నాయి. జనాభాలో కేవలం 8.6% మాత్రమే గిరిజనులు ఉన్నప్పటికీ, స్థానచలనం చెందిన వారిలో దాదాపు 40% వారే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రక్షణ చట్టాలు ఉన్నప్పటికీ, అనేక షెడ్యూల్డ్ ప్రాంతాల్లో 50% కంటే ఎక్కువ భూములు గిరిజ నేతరుల చేతుల్లో ఉన్నాయి. ఇది రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధం. ఐదో షెడ్యూల్, ఆర్టికల్ 46, పెసా చట్టం (1996) గిరిజన హక్కులు, గ్రామసభల స్వపరి పాలనకు బలమైన రక్షణ ఇస్తున్నాయి. కానీ గ్రామసభలు చాలా చోట్ల కేవలం పేరుకే ఉన్నాయి. భూములు కోల్పోవడం కొనసాగుతూనే ఉన్నది. అభివృద్ధి అంటే కేవలం జీడీపీ పెరగడం మాత్రమే కాదు. అది అసమానతలను తగ్గించాలి;సంస్కృతిని కాపాడాలి; ప్రజలను శక్తిమంతం చేయాలి.భాగస్వాములను చేసినప్పుడే...గిరిజన సమాజాలు ప్రకృతితో కలిసి జీవించే విధానాన్ని అనుసరిస్తాయి. భూమి, అడవులు వారికి కేవలం ఆర్థిక వనరులు మాత్రమే కాదు; అవి వారి సంస్కృతి, జీవన విధానాలకు గుర్తింపు. అందుకే భూములు కోల్పోవడం అంటే కేవలం ఆర్థిక నష్టమే కాదు, సాంస్కృతిక నష్టం కూడా. పెసా చట్టం గ్రామస్థాయి స్వపరి పాలనకు ముఖ్యమైన అడుగు. కానీ దాని అమలు అత్యంత బల హీనంగా ఉన్నది. అధికార యంత్రాంగమే ఇంకా కేంద్రీకృతంగా పనిచేస్తున్నది. నిజమైన స్వపరిపాలన కోసం ప్రభుత్వం గిరిజన సమాజాలపై నమ్మకం ఉంచాలి; అధికారాలను పంచుకోవాలి.భారతదేశ గిరిజన అభివృద్ధి ప్రయాణంలో పురోగతి ఉన్న ప్పటికీ, లోపాలు కూడా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. సంక్షేమ పథ కాలు మాత్రమే సరిపోవు; గిరిజనులకు స్వయం నిర్ణయాధికారం ఉండాలి; భూమి, అడవులపై నిజమైన హక్కులు ఇవ్వాలి; గ్రామ సభలను బలపరచాలి; అభివృద్ధి ప్రక్రియలో బాధ్యతాయుత వ్యవస్థలు ఉండాలి. గిరిజన ప్రాంతాలను కేవలం సహజ వనరుల నిల్వలుగా కాకుండా, ప్రత్యేక సంస్కృతి, జీవన విధానం కలిగిన ప్రాంతాలుగా గౌరవించాలి. రాజ్యాంగ హామీలు నిజం కావాలంటే కేవలం చట్టాలు సరిపోవు. అభివృద్ధి విధానాలే రాజ్యాంగ విలువ లకు అనుగుణంగా మారాలి. అప్పుడే గిరిజన సమాజాలు నిజమైన భాగస్వాములుగా భారత ప్రజాస్వామ్యంలో స్థానం పొందుతాయి.పి. వేణుగోపాల్ రెడ్డివ్యాసకర్త ‘ఏకలవ్య ఫౌండేషన్’ వ్యవస్థాపకులు -
తప్పులే మన అసలైన గురువులు
ఉచిత సలహాలివ్వడం నాకు ఇష్టం ఉండదు. నా ఈ నియమం గురించి తర్వాత మరింత వివరిస్తాను. కానీ, జీవితంలో నాకు ఇంత వరకు సహాయపడిన వివేకవంతమైన విషయాలు ఏమైనా ఉంటే, అవి మీకు వెల్లడించడం కోసమే నన్ను ఇక్కడకు ఆహ్వానించారు. ఏం చేయాలో మీకు చెప్పేంత యోగ్యత ఉన్న దానినని, నేను ఏ కోశానా భావించడం లేదని మొదటే స్పష్టం చేయదలచుకున్నాను.ప్రయత్నించడానికి సిగ్గు పడకూడదు!వృత్తి జీవిత కలలను సాకారం చేసుకోవడంలో అనుభవంలోకి వచ్చిన ఒత్తిడి, ప్రేమ, అవకాశాలు, అవమానాలకు సంబంధించి కొన్ని సంగతులు పంచుకుంటాను. ఏ విషయంలోనైనా పట్టు విడుపులు అవసరం. దేనిని మనసులో పెట్టుకోవాలో, వేటిని వదిలే యాలో తెలుసుకోవాలి. ఇతరుల గురించిన అల్పమైన విషయాలను వదిలేయడమే మంచిది. పగలు ప్రతీకారాలు, అసూయలు, మాజీ ప్రేయసీ ప్రియులు ఎలా ఉన్నారోననే తహతహలాంటి నకారాత్మక అంశాలు గుండెలో బరువును పెంచుతాయి. సంతోషం, శాంతి, సకారాత్మక అనుభవాలు మనసును తేలికపరుస్తాయి. అప్పుడు అలా చేసి ఉండాల్సింది కాదని మథనపడటం ఎవరికైనా సహజం. గతాన్ని తలచుకుని వగవకూడదని ఎంత ప్రయత్నించినా దాన్నుంచి మనం తప్పించుకోలేం. కనుక, దాన్ని జీవితంలో ఒక భాగంగా భావించుకునే గుణాన్ని అలవరచుకోవాలి. జరిగిందేదో జరిగిపోయిందనే భావన అప్పటికి గానీ ఏర్పడదు. మార్పు అనివార్యం. ఇప్పుడు మనం అక్కున చేర్చుకుంటున్న ఫ్యాషన్ మున్ముందు మనకే హాస్యా స్పదమైనదిగా తోచవచ్చు. జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం కుంగుబాటుకు లేదా నవ్వులాట పరిస్థితులకులోనై ఉండవచ్చు. అదేమీ పెద్ద విషయం కాదు. కుతూహలాన్ని దాచుకోకపోవడమే మంచిది. దేన్నైనా ట్రై చేయాలనిపిస్తే, ట్రై చేయడమే. ఫలితం ఎలాగైనా ఉండనీ. ప్రయ త్నించి చూడటానికి మాత్రం ఎన్నడూ సిగ్గు పడకూడదు.అందరమూ రచయితలమే!నేను 12వ ఏట నుంచే పాటలు రాయడం ప్రారంభించాను. అప్పటి నుంచి అది నా జీవితానికి దిక్సూచిగా మారింది. నా జీవితం కూడా నా రచనలకు ప్రేరణనిచ్చింది. నేను ఏది చేసినా, అది నా రచనలకు పొడిగింపు మాత్రమే. అది వీడియోలకు లేదా షార్ట్ ఫిల్మ్‌లకు దర్శకత్వం వహించడం కావచ్చు. ఒక టూర్‌కు విజువల్స్ సృష్టించుకోవడం లేదా వేదికపై నిలబడి ప్రదర్శన ఇవ్వడం కావచ్చు. ఆ కళపట్ల నాకున్న ప్రేమతో ప్రతీదీ ముడిపడి ఉంటుంది. మెరుగైనవాటికోసం ఉన్న ఐడియాలు అన్నింటిని జల్లెడపడుతూ ఉండేదాన్ని. వాటికి చివరి క్షణం వరకు సానబెట్టేదాన్ని. ఒక్కోసారి అర్ధరాత్రి లేచి కూర్చుని పాతవాటిని పడేసి, కొత్తవి స్వీకరించేదాన్ని. ఒక్కోసారి తట్టిన మాటలు హృదయంలో నాటుకుపోయేవి. వాటిని రికార్డు చేయడమో లేదా రాసిపెట్టడమో చేస్తేకానీ, మరి దేనిపైనా దృష్టి సారించగలిగేదాన్ని కాను. నా ఆల్బమ్‌లకు తగ్గట్టుగా విడుదల ప్రదేశాలు మార్చుకున్నాను. కళా ప్రక్రియలు మార్చాను. దేశవాళీ నుంచి పాప్‌కు మారాను. జానపదాలకు ప్రత్యామ్నాయాలు ఎంచుకున్నాను. రచనల గురించి ఎక్కువ చెబుతూ వస్తోందని మీకు అనిపించవచ్చు. కానీ, మనందరం రచయితలమేనని నా స్థిరాభి ప్రాయం. మనలో చాలామంది వివిధ సందర్భాలకు తగ్గట్లుగా వివిధ స్వరాలతో రాస్తాం. ఇన్‌స్టాగ్రామ్‌కు రాసినట్లుగా థీసిస్‌కు రాయం. బాస్‌కు పంపే ఇ–మెయిల్ ఒకలా, చిన్ననాటి స్నేహితునికి రాసే ఉత్తరం ఇంకోలా ఉంటుంది. మనందరం సాహితీ ఊసర వెల్లులం. ఒకే సమయంలో అనేక రకాల పాత్రలు పోషిస్తాం.తప్పుల నుంచే నేర్చుకోగలం!అడగందే సలహాలు ఇవ్వనని ముందే చెప్పాను కదా. ఎందుకో చెబుతాను. నా వృత్తి జీవితం 15వ యేట నుంచే మొదలవడం వల్ల నేను కొంత మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఏళ్ళ తరబడి ఉచిత సలహాలు వినవలసిరావడమే ఆ మూల్యం. నేనే పిన్న వయస్కురాలిని కావడం వల్ల సంగీత పరిశ్రమ, మీడియాకు చెందినవాళ్ళు, ఎగ్జిక్యూటివ్‌లు నిరంతరం సలహాలిచ్చేవాళ్ళు. అవి ఒత్తిడికి లోను చేసేవి. నేను ఏ తప్పులూ చేయకపోతే, పిల్లలందరికీ ఆదర్శప్రాయురాలినవుతాననీ, పొరపాట్లకు పాల్పడితే మిన్ను విరిగి మీదపడుతుందనీ అన్నట్లుగా ఉండేది సలహాలు ఇచ్చేవారి ధోరణి. కానీ, నా స్వానుభవం వేరేగా ఉంది. నేను చేసిన తప్పిదాలు నన్ను నేను మరింత మెరుగుపరచుకునేందుకు దారితీశాయి. పొర పాట్లతో పరిస్థితి కంగాళీగా మారి, మనల్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడితే, అది కూడా మానవ అనుభవంలో భాగం కిందనే లెక్క. మనం ఒకసారి విఫలమైనా, మన పక్కనే ఉంటూ మన వెన్ను తట్టేవారు ఎవరో తెలుసుకోవడం, జరిగినదానికి నవ్వు కోవడం కూడా ఒక వరం. తిరస్కరణకు గురవడం,బృందంలో చోటు దక్కకపోవడం, గెలవలేకపోవడం, అవకాశాన్ని తగినంతగా వినియోగించుకోలేకపోవడం వంటివి తలచుకుంటే, ‘సవ్యంగా సాగిన’ సందర్భాలకన్నా అవే ముఖ్యమైనవనిపిస్తుంది. ఒంటరితనం అంటే ఏమిటో అలా భంగపడిన సందర్భాల్లో మనకు తెలిసివస్తుంది.పరిపూర్ణత వాస్తవికమేనా?నా దృక్పథం నిరంతరం మారిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు అన్నీ పూర్తి అర్థరహితమైనవిగా తోస్తాయి. పరిపూర్ణతతో జీవితం గడపడం కష్టం. ఎందుకంటే, జీవితంలో అనుచితంగా మాట్లాడటం అనివార్యం. నమ్మదగని వ్యక్తిని నమ్ముతాం. చేయవలసినంత పని చేయం. మితిమీరి స్పందిస్తాం. ఎవరి హృదయాలను గాయపరచ కూడదో వారిని మన మాటలతో గాయపరుస్తాం. అతిగా ఆలో చిస్తాం లేదా అసలు ఆలోచించం. మనకు మనమే ద్రోహం చేసుకుంటాం. మనకు అనుభవమైనదానినే వాస్తవికతగా చిత్రిస్తాం. ఆనందకరంగా గడపవలసిన క్షణాలని చేజేతులా పాడుచేసుకుంటాం. ఇతరుల ఆనందాన్ని కాలదన్నుతాం. తీవ్ర అపరాధ భావనకు లోనవుతాం. అది మనల్ని ఆసాంతం దహించి వేస్తుంది. చివరికి చేసిన తప్పు తెలుసుకుంటాం. అలాంటిది మళ్లీ పునరావృతం కాకుండా నివారించేందుకు ప్రయత్నిస్తాం. ఈ తప్పులు మనం కొన్నింటిని కోల్పోయేట్లుగా చేస్తాయి.జీవితంలో మన వ్యక్తిత్వాన్ని మనం చాటుకోవలసిన అవస రాలు తలెత్తుతాయి. ఒకసారి వెనక్కి తగ్గి, క్షమాపణ కోరవలసి రావచ్చు. మీరు సవ్యమైనది అనుకున్నదానికోసం పోరాడవలసి రావచ్చు. మంచి మలుపునకు ఎదురు చూడవలసి రావచ్చు. కొన్నింటిని గౌరవప్రదంగా చేజార్చుకునేందుకు సిద్ధపడవలసి ఉంటుంది. ప్రగతి, సంస్కరణ పేరుతో కొన్ని పాత భావజాలాలను వదులు కోవలసిరావచ్చు. ఒక్కోసారి, మన పూర్వీకుల వివేచనకు, వివేకా నికి తలొగ్గవలసిరావచ్చు. కీలకమైన సందర్భాలలో ఏది సరైన మార్గమో ఎంచుకోవడం ఎలా? ఇక్కడున్న ఇంతమందికి ఎన్ని జీవితమార్గాలని చూపగలను? అయ్యే పని కాదు. మీకు మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇపుడు మీ కాళ్ళపై మీరు నిలబడ్డారు కనుక దానిని మీకే వదిలివేస్తాను. మన ఆత్మ శక్తి, సహజాత ప్రవృత్తులు, అంతః ప్రేరణలు, కోరికలు, భయాలు, మనకు తగిలిన గాయాలు, మనం కనే కలలే మనల్ని ముందుకు నడిపిస్తాయి. -
నివారించదగినవే అయినా...
జూన్ 8న విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం జరిగింది. ఇప్పటికి 10 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో ప్రమాద కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసు కోవడం అవసరం. ‘ఇది విధి నిర్వహణ తగినంతగా లేకపోవడం వల్లనే జరిగింది’ అని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మాజీ సీఎమ్‌డీ మధు సూదన్ చెప్పారు. ‘నివారించదగ్గ ప్రమాదమే ఇది’ అని కూడా ఆయన అన్నారు. అంటే ‘ప్రమాదాలు జరుగుతాయి అని ముందే తెలుసు’ అని దీనర్థం. ఈయనే కాకుండా సీఎంఎస్–2 (స్టీల్ మెల్టింగ్ షాప్–2)లో, గతంలో పనిచేసిన కేఎస్ఎన్ రావు కూడా ‘కరిగిన ఉక్కుతో సంబంధం ఉన్న పనుల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఆ భద్రత ఇప్పుడు లోపించింద’న్నారు.ఈ ప్రమాదానికి కచ్చితమైన కారణం ఇంకా బైటకు రాకపోయినప్పటికీ, ఫ్యాక్టరీల ప్రధాన ఇన్స్పెక్టర్ నిర్వహించిన ప్రాథమిక విచారణ ప్రకారం ‘ద్రవ ఉక్కులో’ చిక్కుకు పోయిన వాయువులు ఒక్కసారిగా విడుదల కావడంతో పేలుడు సంభవించి, లాడిల్ ఒరిగిపోయి ‘ద్రవ ఉక్కు’... కింద పనిచేస్తున్న కార్మికులపై పడినట్లు గుర్తించారు. ‘స్టీల్ మెల్టింగ్ షాప్’లో అత్యంత వేడిగా ఉన్న ‘ద్రవ ఉక్కు’ను మోస్తున్న లాడిల్ (ఉక్కుతో తయారైన భారీ పాత్ర)లో అకస్మాత్తుగా పేలుడు ఏర్పడింది. దాంతో లాడిల్ ఒరిగిపోవడం లేదా పగిలిపోవడం వల్ల సుమారు 1500 –1600 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ద్రవ ఉక్కు కార్మి కులపై చిందింది. భారతదేశంలో ఇతర ఉక్కు కర్మాగారాల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు అప్పుడప్పుడు జరిగాయి. ఉదాహరణకు, 2025లో హిమాచల్ ప్రదేశ్‌లో ఒక స్టీల్ ఫ్యాక్టరీలో గేర్ లోపం వల్ల ద్రవ ఇనుము కార్మికులపై చిందడంతో ఒకరు మరణించారు. మన దేశంలోనే కాకుండా ఇంకా ఇతర చోట్ల కూడా ఇలాంటివి కొన్ని జరిగాయి. మెక్సికో, అపిజాకో (2024)– ఉక్కు కర్మాగారంలో ద్రవ ఉక్కు చిందడంతో పెద్ద పేలుడు సంభవించి కనీసం 12 మంది మరణించారు. జర్మనీ, సార్స్టాల్ ప్లాంట్ (2022) లాడిల్ గేట్ వాల్వ్ సాంకేతిక లోపం వల్ల ‘ద్రవ ఉక్కు’ నియంత్రణ తప్పి, పెద్ద మొత్తంలో బయటకు వచ్చింది. చైనాలో 2007లో జరిగిన ‘చింగ్హె ఉక్కు కర్మాగార ప్రమాదం’లో 32 మంది మరణించారు. అలాగే యూరప్, జపాన్, అమెరికాలో కూడా లాడిల్ ప్రమాదాల జరిగాయి. ‘ప్రపంచ స్టీల్ పరిశ్రమ సంఘం’ ప్రతి సంవత్సరం ప్రమాదాల గణాంకాలు విడుదల చేస్తూ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా స్టీల్ ప్లాంట్లలో జరిగిన లాడిల్ ప్రమాదాలపై చాలా కాలంగా పరిశోధనలు, విచారణలు, భద్రతా చర్చలు జరిగాయి. వాటిల్లో ప్రధానమైనవిగా కొన్ని గుర్తించారు: 1. లాడిల్ రిఫ్రాక్టరీ లైనింగ్ దెబ్బతినడం. అంటే లాడిల్ లోపల వేడి నిరోధక ఇటుకలు ఉంటాయి. అవి పలుచబడి పోతుంటాయి. దీన్ని సమయానికి గుర్తిస్తూ, తనిఖీలు చేసుకుంటూ ఉండాలి. లేకుంటే లాడిల్ పగిలిపోయి, మెటల్ బయటకు వచ్చేస్తుంది. 2. క్రేన్ లేదా లిఫ్టింగ్ వ్యవస్థ వైఫల్యం. 3. మెయింటెనెన్స్ లోపాలు. 4. నీరు లేదా తేమ... కరిగిన ఉక్కును తాకితే క్షణాల్లో అక్కడ ఆవిరితో కూడిన పేలుడు సంభవిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇది అత్యంత ప్రమాదకర కారణాల్లో ఒకటి. 5. హజార్డ్ సెన్సర్లు, ఆటోమేటిక్ హెచ్చరిక సిస్టమ్ లేకపోవడం. అంటే ఉష్ణోగ్రత, పగుళ్లు, లీకేజీలు ముందే గుర్తించే సెన్సర్లు లేకపోవడమన్నమాట. 6. మానవ తప్పిదాలు: భద్రతా విధానాలు పాటించకపోవడం, సరైన శిక్షణ లేకపోవడం. తక్కువ సిబ్బందితో పని చేయించడం.సూచనలు పాటించనందువల్లే...‘ప్రపంచ స్టీల్ పరిశ్రమ సంఘం’ ఉక్కు పరిశ్రమల్లో లోపాల్ని గుర్తించడమే కాకుండా, కొన్ని పరిష్కారాల్ని కూడా సూచించింది. అవి ఏమిటంటే: లాడిళ్లకు ‘నిర్దిష్ట జీవిత కాలాన్ని’ నిర్ణయించి, సమయానికి మార్చడం, ప్రతి షిఫ్టుకు ముందు తప్పనిసరిగా కొన్ని తనిఖీలను చేయడం, క్రేన్లపై అదనపు భద్రతా వ్యవస్థలను నిర్మించడం, ఏఐతోనూ, థర్మల్ కెమెరాలతోనూ, సెన్సర్లతోనూ నిరంతర పర్యవేక్షణ చేయడం, కరిగిన లోహం ప్రయాణించే మార్గాల్లో కార్మికుల ఉనికిని తగ్గించడం, అత్యవసర పరిస్థితులపై తరచూ మాక్ డ్రిల్స్ నిర్వహించడం, నీరు/తేమ పూర్తిగా తొలగించిన తర్వాతే కాస్టింగ్ పనులు ప్రారంభించడం. ‘స్టీల్ సంఘం సూచనలు’ అంటూ ఇప్పుడు మనం వేటినైతే చెప్పుకున్నామో వాటిని ‘విశాఖ ఉక్కు’ పాటించడం లేదు. పాటించడం లేదు కాబట్టే, ఇంతటి ఘోర ప్రమాదం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందు ఆ తప్పును గుర్తించాలి. ‘విశాఖ ఉక్కు కర్మాగారం’ అనే దానికి సంబంధించినంతవరకూ యాజమాన్యం, నిర్వహణ, భద్రతా విధానాలు, సాంకేతిక కార్యకలాపాలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. కానీ, చట్టపరమైన పర్యవేక్షణ, తనిఖీలు, అత్యవసర స్పందన లాంటివన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. కాబట్టి ఈ ప్రమాదానికి రెండు ప్రభుత్వాలూ బాధ్యత వహించాలి! నన్నూరి వేణుగోపాల్ వ్యాసకర్త మానవ హక్కుల కార్యకర్త -
సమ్రాట్ చౌధరీ (బిహార్ సీఎం) రాయని డైరీ
నా నివాస గృహ కార్యాలయం నుంచి, సమీపంలోనే ఉన్న సచివాలయానికి కాలినడకన వెళ్లటం కోసం నేను వేగంగా మెట్లు దిగుతున్నప్పుడు నా పైన దాదాపుగా ఒక మెరుపు దాడి వంటిదేదో జరిగినట్లయింది! కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఆ ప్రాంగణంలోని గుబురు చెట్ల కొమ్మల పైనుంచి దుమికినట్లుగా మీడియా ప్రతినిధి ఒకరు ఒక్క గెంతున నా మీదకు వచ్చి పడ్డాడు! ఆ హఠాత్ఘటనకు నాతో పాటుగా, ఒక అడిషనల్ చీఫ్ సెక్రటరీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, నా కోసం వేచి చేస్తున్న ఒక విద్యాసంస్థ డీన్... ఎక్కడి వాళ్లు అక్కడే స్తంభించిపోయారు. ‘‘సమ్రాట్జీ, బిహార్ ముఖ్యమంత్రిగా మీరు బాధ్యతలు స్వీకరించి జూన్ 15కి రెండు నెలలు పూర్తవుతాయి. ఈ రెండు నెలల్లో మీరేం సాధించారు?’’ అని అడిగాడు, ఆ ‘ఒక్క ఊపున వచ్చి పడిన’ మీడియా ప్రతినిధి. అతడి వైపు విస్మయంగా చూశాను.‘‘మిత్రమా, నేను ఏప్రిల్ 15న బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. మీరు ఏప్రిల్ 16న వచ్చి, ‘మీరీ 24 గంటల్లో ఏం సాధించారు?’ అని నన్ను అడగవలసిన ప్రశ్నను... రెండు నెలల తర్వాత ఇప్పుడు నింపాదిగా వచ్చి, ‘మీరేం సాధించారు?’ అని అడుగుతున్నారు!’’ అన్నాను, నవ్వుతూ. ‘‘కానీ సీఎం సార్... కేవలం 24 గంటల్లో ఏమౌతాయి చెప్పండి?’’ అన్నాడు ఆ మీడియా ప్రతినిధి కూడా నవ్వేస్తూ. ‘‘24 గంటల్లో ఏమౌతాయి అని మీరు అంటున్నారు. కానీ, చాలానే అవుతాయి. బిహార్‌లో ఈ 70 ఏళ్లలో చట్టం తన పని తాను చేసుకుపోయింది. నేను వచ్చాక చట్టం తన పని తాను 24 గంటల్లోనే చేసుకుపోతోంది. గమనించే ఉంటారు’’ అన్నాను. ‘‘అవును సీఎం సార్. మీరు వచ్చాక 12 ఎన్ కౌంటర్లు జరిగాయి. ప్రతి ఎన్‌కౌంటరూ 24 గంటల్లోనే జరిగిపోయింది. కానీ... ఇవన్నీ పోలీసుల విధి నిర్వహణల కిందికే కదా వస్తాయి, సీఎంగా మీరేదైనా సాధించటం కిందికి వస్తాయా?’’ అని అడిగాడు. నా నడకను ఆపాను. అతడూ ఆగాడు. ‘‘పోలీసులకైనా స్వేచ్ఛ ఇస్తేనే కదా వాళ్లు 24 గంటల్లో ఏదైనా చేయగలరు! వాళ్లకు స్వేచ్ఛ ఇవ్వటం కంటే ఒక సీఎం సాధించ వలసింది ఏం ఉంటుంది?!’’ అని అన్నాను. సచివాలయం దగ్గర పడింది. ‘‘సరే మిత్రమా, కలుద్దాం. సోమవారం మధ్యాహ్నంగానీ, సాయంత్రంగానీ ప్రెస్ మీట్ ఉండొచ్చు’’ అన్నాను, లోపలికి నడుస్తూ. ‘‘శ్రీమతి రబ్డీదేవిని సర్క్యులర్ రోడ్లో ఉన్న ప్రభుత్వ బంగ్లా నుంచి ఖాళీ చేయించే విషయం మీదనేనా సీఎం సార్, ఆ ప్రెస్ మీట్?’’ అని అడిగాడతడు! నవ్వాను. ‘‘సర్క్యులర్ రోడ్ బంగళాను ఖాళీ చేయించటం మీద, హార్డింగ్ రోడ్లో వేరే బంగళాను కేటాయించటం మీద ప్రెస్ మీట్లు ఉంటాయా మిత్రమా?’’ అన్నాను, సచివాలయంలోకి వచ్చేస్తూ.క్యారిడార్లో లేషీ సింగ్ ఎదురొచ్చారు. నవ్వాను. ఆమె నవ్వలేదు! ‘‘మీ కోసమే చూస్తున్నా సమ్రాట్జీ. శ్రీమతి రబ్డీ దేవికి మనం ఇచ్చిన రెండో గడువు కూడా ఆదివారంతో ముగుస్తోంది. ఆమె తన బంగళాను ఖాళీ చేసే ప్రసక్తే లేదని అంటున్నారు’’ అన్నారు టెన్షన్‌గా! లేషీ భవన నిర్మాణ శాఖ మంత్రి. నేరుగా నా ఛాంబర్ లోకి వచ్చి, డీజీపీ వినయ్ కుమార్‌కి ఫోన్ చేసి, ‘‘ఏం చేద్దాం?’’ అని అడిగాను. ‘‘ఈసారికి చట్టాన్ని తన పని తను చేసుకుపోనిద్దాం సర్... చట్టానికి 24 గంటల డెడ్‌లైన్ లాంటిది ఏమీ పెట్టకుండా’’ అన్నాడు. ‘‘గుడ్’’ అని ఫోన్ పెట్టేశాను. వినయ్ కుమార్ ఖరగ్‌పూర్ ఐఐటీ స్టూడెంట్. ఒక ఐపీఎస్, ఐఐటీ నుంచి వచ్చాడంటే అతడు డెడ్‌లైన్ ఏమీ లేకుండానే డెడ్‌లైన్ లోపలే పని పూర్తి చేయగలిగినవాడై ఉంటాడు. -
ఇరాన్లో తగ్గి క్యూబాలో నెగ్గేనా?
మెరుపు దాడిలో వెనిజులా అధ్యక్షుడిని బంధించిన తరువాత యూఎస్ అధ్యక్షుడి తరువాతి లక్ష్యం క్యూబా అని అందరూ భావించారు. అనుకోని పరిస్థితులలో ఇరాన్ యుద్ధం క్యూబాను వెనక్కు నెట్టే సింది. ఇరాన్ ఎదురు దెబ్బల నేపథ్యంలో యూఎస్ పక్కా ప్రణాళికతో క్యూబా పథకాన్ని రచిస్తున్నట్లుగా విశదమవుతు న్నది. మే నెల చివరలో యూఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నిమిట్జ్‌ను కరేబియన్ సముద్రంలోకి పంపించటంతో యుద్ధమేఘాలు కమ్ముకోవటం ప్రారంభమైంది. క్యూబా మాజీ అధ్యక్షుడు రావుల్ కాస్ట్రోపై యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ హత్యానేర అభియోగాలను మోపటం క్యూబాపై దాడికి యూఎస్ పావులు కదుపుతున్నట్లుగా అర్థమవుతున్నది. క్షేత్ర స్థాయిలో క్యూబా కూడా దాడికి సన్నద్ధమవుతున్న వార్త లొస్తున్నాయి. ‘ప్రజలందరి యుద్ధం’ డాక్ట్రిన్‌ను క్యూబా పాటించ బోతున్నది. ఈ సిద్ధాంతం ప్రకారం అమెరికా దాడిని క్యూబా సైన్యమే కాకుండా, క్యూబా పౌరులందరూ ప్రతిఘటిస్తారు. కమ్యూ నిస్టు పార్టీ వ్యవస్థ, విప్లవ చరిత్ర కలిగిన క్యూబాను దారికి తేవడం యూఎస్‌కు తేలిక కాదు. కానీ ఇరాన్ వైఫల్యాల నుండి ప్రజలదృష్టిని మరలించటానికి ట్రంప్‌కు క్యూబాపై విజయం కీలకం.గుప్పిట్లో ఉంచుకునే ప్రయత్నంకరేబియన్ సముద్రంలో అమెరికాకు కేవలం 90 మైళ్ల దూరంలో ఉన్న క్యూబా దీవి వ్యూహాత్మకంగా భౌగోళిక ఉనికిని కలిగి ఉన్నది. క్యూబాలో విదేశీ శక్తులు తిష్టవేస్తే ఫ్లోరిడా జలసంధిని దిగ్బంధించి యూఎస్‌ను కట్టడి చేయవచ్చు. అందుకే 200 ఏళ్ళ క్రితమే మన్రో డాక్ట్రిన్‌లో భాగంగా ఉత్తర, దక్షిణ అమెరికా ఖండా లను యూఎస్ తన వ్యూహాత్మక ప్రాంతాలుగా ప్రకటించింది. 1898లో స్పెయిన్‌ను యూఎస్ ఓడించటంతో క్యూబాకు వలస పాలన నుండి విముక్తి లభించింది. కానీ 1901 ప్లాట్ సవరణ చట్టం ద్వారా క్యూబాను యూఎస్ తన నియంత్రణలో ఉంచుకొన్నది. 1934లో ఈ చట్టాన్ని రద్దు పరచినప్పటికీ క్యూబా ఆర్థిక వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్నది. యూఎస్ పెత్తనాన్ని ఎదిరించి ఫిడెల్ కాస్ట్రో 1959లో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పరచి క్యూబాలోని యూఎస్ వ్యాపారాలను, ఆస్తులను జాతీయీకరణం చేశాడు. 1960లో క్యూబాపై అమెరికా ఆంక్షలు విధించింది. 1961లో యూఎస్‌లోని క్యూబా ప్రవాసుల ద్వారా ఫిడెల్ కాస్ట్రో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సీఐఏ ప్రయత్నించి విఫలమైంది. దీనిని ‘బే ఆఫ్ పిగ్స్ తిరుగుబాటు’గా పిలుస్తారు. యూఎస్‌ను ఎదు ర్కోవటానికి కాస్ట్రో సోవియట్ రష్యా పంచన చేరాడు. 1962లో సోవియట్ యూనియన్ క్యూబాలో అణుక్షిపణులను మోహరించ టంతో అగ్ర రాజ్యాలు అణుయుద్ధపు అంచులకు చేరాయి. 1991లో సోవియట్ రష్యా విచ్ఛిన్నమవటంతో క్యూబాకు దిక్కుతోచలేదు. కాస్ట్రో ఒకవైపు ఉక్కు పిడికిలితో క్యూబాను పాలిస్తూనే కమ్యూనిజంను లాటిన్ అమెరికా అంతటా వ్యాప్తి చేయటానికి ప్రయత్నించాడు. అంగోలా, ఇథియోపియాలలో కూడా క్యూబన్ గెరిల్లా సైనికులు సేవలందించారు.సంబంధాలు కొంత మెరుగైనా...రావుల్ కాస్ట్రో 2008లో క్యూబా పగ్గాలు చేపట్టాక యూఎస్‌తో కొంత సుహృద్భావ వైఖరిని ప్రదర్శించాడు. ఒబామా హయాంలో యూఎస్–క్యూబా సంబంధాలు కొంత గాడిన పడ్డాయి. 2015లో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణ జరిగింది. 2016లో క్యూబా పర్యటనలో భాగంగా క్యూబాను టెర్రరిజంను ప్రోత్సహించే దేశాల లిస్టు నుండి తొలగించారు. ఇది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ట్రంప్ 2017లో అధికారంలోకి రావటంతోనే మళ్లీ ఘర్షణ వాతావరణం పునఃస్థాపితమైంది. బైడెన్ కూడా క్యూబాపై ఆంక్షలను చాలావరకు కొనసాగించాడు. వెనిజులాపై దాడి తరువాత తన తదుపరి లక్ష్యం క్యూబా అని ట్రంప్ బహిరంగంగానే ప్రకటించాడు. ఆరు దశాబ్దాలుగా కొనసాగు తున్న ఆర్థిక–వాణిజ్య ఆంక్షలు చాలవన్నట్లు ఈ ఏడాది జనవరిలో ట్రంప్ చమురు దిగ్బంధనాన్ని (ఆయిల్ ఎంబార్గో) ప్రకటించాడు. క్యూబాకు చమురు సరఫరా కాకుండా యూఎస్ నౌకాబలం అడ్డు కుంటున్నది. ముఖ్యంగా వెనిజులా నుండి చమురు దిగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. క్యూబా తన శక్తి అవసరాలకు 60 శాతం దిగుమతులపై ఆధారపడుతున్నది. దీనితో క్యూబాలో శక్తి సంక్షోభం ఏర్పడింది. ప్రతిరోజు 20–22 గంటల కరెంటు కోతలు సాధారణ మైనాయి. రవాణా స్తంభించింది. నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెత్త రవాణాకు కూడా వాహనాలకు ఇంధనం లేక పోవటంతో హవానాతో సహా పలు పట్టణాలలో వీధులలో చెత్త పేరుకుపోయింది. ఆసుపత్రులలో కరెంటు కొరతతో పలు వైద్య సేవలు స్తంభించాయి. పాఠశాలలు, యూనివర్సిటీలు మూత పడ్డాయి. కోవిడ్ తరువాత కోలుకుంటున్న పర్యాటక రంగం కుదేల యింది. అమెరికా పథకం ప్రకారమే క్యూబా సమాజాన్ని ఒత్తిడి లోనికి నెట్టి వేసింది. క్యూబాతో వాణిజ్యం చేసే దేశాలు, సంస్థలపై ద్వితీయ శ్రేణి ఆంక్షలకూ సిద్ధమైంది. ఈ సంక్షోభం నుండి క్యూబా సమాజంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్యుద్ధం, తిరుగుబాటు కోసం యూఎస్ వేచి చూస్తుండవచ్చు.మూడు శక్తులు ‘ఒక్కటైతే’?నాణ్యమైన విద్య, వైద్యాన్ని చౌకగా అందించటంలో విజయం సాధించిన క్యూబా ఈ ఆర్థిక యుద్ధాన్ని ఎదుర్కోవటం కష్టమే. రష్యా, చైనా ఆర్థికంగా, సైనికపరంగా ప్రత్యక్షంగా క్యూబాకు దన్నుగా ఉండటం సందేహాస్పదమే. చైనా సౌర విద్యుత్ పలకల సరఫరా ద్వారా క్యూబా విద్యుత్ గ్రిడ్‌ను స్థిరీకరించటానికి ప్రయత్ని స్తున్నది. దీర్ఘకాలంలో మాత్రమే క్యూబా ఈ రంగంలో విజయం సాధించగలుగుతుంది. కానీ క్యూబాకు అంత సమయం లేదు. మెక్సికో లాంటి పొరుగు దేశాలు ఆహారం, మందులు, మానవతా సహాయం చేస్తున్నా, అవి యూఎస్‌ను ఎదిరించి క్యూబాకు సహాయ పడే సాహసం చేయలేవు. రష్యా ప్రస్తుత దృష్టి ఉక్రెయిన్‌పై, నాటోపై ఉన్నది. చైనా దృష్టి తైవాన్‌పై ఉన్నది. తైవాన్, ఉక్రెయిన్ విషయంలో అమెరికా మెతక వైఖరికి సిద్ధపడితే, ప్రతిగా రష్యా, చైనా మధ్య ప్రాచ్యం, కరేబియన్ ప్రాంతాల నుండి తమ దృష్టిని పూర్తిగా మరల్చ టానికి సిద్ధపడవచ్చును. దీనినే ‘గ్రేట్ పవర్స్ బార్గెయిన్’ అని పిలుస్తారు.బహుశా రష్యా, చైనాలతో లోపాయికారీ అంగీకారంతో క్యూబాపై ట్రంప్ పూర్తి స్థాయిలో దాడి చేయవచ్చు. కానీ క్యూబా గెరిల్లా పోరాట సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకూడదు. పెద్ద మొత్తంలో రక్తపాతం సంభవిస్తుంది. క్యూబా నుండి పెద్ద మొత్తంలో యూఎస్‌కు వలసలు జరగవచ్చు. యూఎస్ ఈ రెండు పరిణా మాలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో క్యూబన్ సంతతికి చెందినవాడు. ఈ పరిణామాలపై పూర్తి అవగాహన ఉండి ఉంటుంది. క్యూబాలో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి రావుల్ కాస్ట్రో అంగీకరిస్తే సమస్యకు శాంతియుత పరిష్కారం లభించినట్లవుతుంది.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు-గురజాల శ్రీనివాసరావు -
నిర్లక్ష్యమూ శిక్షార్హమైన నేరమే!
జూన్ 8, 2026న విశాఖ స్టీల్ ప్లాంట్ (ఎస్ఎమ్ఎస్–1)లో 1,500 డిగ్రీల సెంటీ గ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ద్రవరూప ఉక్కు చిందిపడటం వల్ల ఇప్పటివరకు 9 మంది మరణించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు నరక యాతన అనుభవిస్తున్నారు. ప్రైవేటీకరణను తాత్కాలికంగా ఆపామని చెప్తున్న ప్రభుత్వం, అంతర్గతంగా ప్లాంట్‌ను బలహీనపరుస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్న విషయం ప్రమాద కారణాన్ని స్పష్టం చేస్తోంది. ‘గత కొన్నేళ్లుగా కొత్త నియామకాలు పూర్తిగా నిలిచిపోయాయి. 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. కేవలం 8,800 మంది కార్మికులతో రోజుకు 18,000 టన్నుల ఉత్పత్తి చేయిస్తూ తీవ్రమైన పని ఒత్తిడికి గురిచేస్తున్నారు. అనుభవం లేని సిబ్బందితో ప్రమాదకరమైన పనులు చేయించడం వల్లే ఇందరు ప్రాణాలు అన్యాయంగా కోల్పోయా’రని కార్మికులు అంటున్నారు.పరిపాలనా వైఫల్యంఈ ఘోర ప్రమాదం కేవలం ఒక పారిశ్రామిక ప్రమాదంగా చూడదగినది కాదు. ఇది దేశంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమల భవిష్యత్తు, కార్మికుల భద్రత, పాలనలో బాధ్యత, రాజ్యాంగ నైతికత వంటి ప్రశ్నలను లేవనెత్తుతున్న విషాద సంఘటన. దీని వెనుక విధానపరమైన నిర్లక్ష్యం ఉందా అన్నది చర్చనీయాంశం. ఉక్కు తయారీ ప్రక్రియలో స్టీల్ మెల్టింగ్ షాప్ అత్యంత కీలకమైన విభాగం. దాదాపు 1,500 నుంచి 1,600 డిగ్రీల సెల్సి యస్ ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉన్న ఉక్కును శుద్ధి చేసి తదు పరి దశలకు తరలిస్తారు. ఈ ప్రక్రియలో ప్రతి భద్రతా ప్రమాణం తప్పనిసరిగా అమలు కావాలి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, నాణ్యత తనిఖీలు, ముడి పదార్థాల పరిశీలన, పరికరాల నిర్వహణ, భద్రతా కవర్లు, అత్యవసర నియంత్రణ వ్యవస్థలు, ఇవన్నీ కేవలం నియమాలు కాదు; అవి ప్రాణరక్షణ సాధనాలు. ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగిన లాడిల్‌కు తప్పనిసరిగా ఉండాల్సిన భద్రతా కవర్ లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్జింగ్ ప్రక్రియకు అవసరమైన పరికరాల కొరత ఉందనే వాదనలు వస్తున్నాయి. ఇవన్నీ నిజమైతే, ఈ ప్రమాదం కేవలం సాంకేతిక వైఫల్యం కాదు; అది పరిపాలనా వైఫల్యమే.రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి వ్యక్తికి జీవించే హక్కును హామీ ఇస్తుంది. ఒక కార్మికుడు ఉదయం విధులకు వెళ్లి సాయంత్రం సురక్షితంగా తన కుటుంబం వద్దకు చేరుకొనే పరిస్థితులు కల్పించడం ప్రభుత్వాల, యాజమాన్యాల ప్రాథమిక బాధ్యత. ఉక్కును తయారు చేసే భట్టీల కంటే వేడిగా మండేది కార్మికుడి చమట. ఆ చమటను గౌరవించని వ్యవస్థ చివరికి తన నైతిక హక్కును కోల్పో తుంది. చట్టపరంగా ఇది నేరుగా ఉద్దేశపూర్వక హత్య కాకపోయి నప్పటికీ, కార్మికుల మరణానికి కారణమైన పాలకుల, అధికారుల బాధ్యతారాహిత్య వైఖరి కచ్చితంగా శిక్షార్హమైన నేరమే. పరిశ్రమల్లో తగిన రక్షణ చర్యలు తీసుకోకుండా, అనుభవం లేని సిబ్బందితో ప్రమాదకరమైన పనులు చేయించి మరణాలకు కారణమైతే, బీఎన్ఎస్లోని రెండు సెక్షన్లు వర్తిస్తాయి. ఇందులో బీఎన్ఎస్ సెక్షన్ 106(1) ఒకటి. ర్యాష్ లేదా నిర్లక్ష్యపూరితమైన చర్య వల్ల ఒక వ్యక్తి మరణానికి కారణమైతే ఈ సెక్షన్ వర్తిస్తుంది. కనీస రక్షణ పరికరాలు ఇవ్వకపోవడం, 6,000 మంది అనుభవజ్ఞులైన కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి, తక్కువ సిబ్బందిపై తీవ్రమైన పని ఒత్తిడి తీసుకురావడం, సేఫ్టీ ఆడిట్ నిర్వహించకపోవడం వంటివి ‘నేరపూరిత నిర్లక్ష్యం’ కిందికే వస్తాయి. శిక్షలో ఒక పెద్ద మార్పు ఉంది. పాత ఐపీసీ 304ఎ కింద గరిష్ఠంగా కేవలం 2 ఏళ్ల జైలు శిక్షమాత్రమే ఉండేది. కానీ కొత్త బీఎన్ఎస్ సెక్షన్ 106(1) కింద 5 ఏళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా పెంచారు. బీఎన్ఎస్ సెక్షన్ 105 మరొకటి. ఇది హత్యానేరం కాని నేరపూరిత నరహత్యకు సంబంధించింది. ముందస్తు ఆలోచన లేకుండా ఒక మనిషిని చట్ట విరుద్ధంగా చంపడం. దీని ప్రకారం ప్రమాదవశాత్తు జరిగిన మరణ మైనా, ఉద్దేశపూర్వక హత్య అయినా కారకులు శిక్షార్హులే. 1,500 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి ఉన్న ద్రవరూప ఉక్కుతో పనిచేసే బ్లాస్ట్ ఫర్నెస్ వద్ద తగినంత మంది నిపుణులు లేకపోతే విస్ఫోటనం జరిగి ప్రాణాలు పోతాయని యాజమాన్యానికి స్పష్టమైన సాంకేతిక పరిజ్ఞానం/జ్ఞానం ఉంటుంది. అటువంటి విషయం తెలిసి కూడా కేవలం ఉత్పత్తి పెంచడం కోసం, ఖర్చులు తగ్గించుకోవడం కోసం భద్రతా ప్రమాణాలను గాలికొదిలేస్తే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు. దానికి శిక్ష 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, భారీ జరిమానా.తెలియదని తప్పించుకోలేరు!సుశీల్ అన్సాల్ వర్సెస్ స్టేట్ త్రూ సీబీఐ (ఉపహార్ సినిమా థియేటర్ దురంతం) కేసులో సుప్రీంకోర్టు ‘‘లాభాల కోసం భద్రతా ప్రమాణాలను పక్కనబెట్టడం అనేది కేవలం సివిల్ తప్పు కాదు, అది సమాజానికి వ్యతిరేకంగా చేసే నేరపూరిత చర్య. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోతే, ఆ సంస్థ అధినేతలు ‘మాకు ప్రత్యక్షంగా సంబంధం లేదు’ అని తప్పించుకోలేరు’’ అని పేర్కొంది. భోపాల్ గ్యాస్ దురంతం కేసు పరిణామాలు–తాజా పారిశ్రా మిక తీర్పులను పరిశీలించినా విశాఖ ప్రమాద కారకులు శిక్షార్హులే. ఫ్యాక్టరీలలో జరిగిన బాయిలర్ పేలుళ్లు, గ్యాస్ లీకేజీలపై సుప్రీంకోర్టు‘అబ్సల్యూట్ లయబిలిటీ’ (సంపూర్ణ బాధ్యత) సూత్రాన్ని వర్తింపజేస్తోంది. దీని ప్రకారం, ఒక ప్రమాదకరమైన పరిశ్రమను నడుపుతున్నప్పుడు, అందులో జరిగే ఏ నష్టానికైనా, మరణానికైనా యాజమాన్యమే సంపూర్ణ బాధ్యత వహించాలి. ‘మాకు తెలియకుండా జరిగింది’ అనే వాదనలు కోర్టుల్లో చెల్లవు. విశాఖ ఉక్కు ప్లాంట్‌లో జరిగిన అన్యాయ మరణాలు పాలనా పరమైన, నిర్వహణాపరమైన వైఫల్యాల వల్ల జరిగినవే కాబట్టి, బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి విచారించవచ్చు.మాడభూషి శ్రీధర్వ్యాసకర్త కేంద్ర సమాచార సంఘం మాజీ కమిషనర్ -
ద్రావణాగ్ని సాక్షిగా... మరణ వాగ్మూలం!
‘...బాబూ వర్మా, తమ్ముడిపై కోప్పడకు. తమ్ముడిని బాగా చదివించు. నువ్వు కూడా బాగా చదువుకో. అమ్మను బాగా చూసుకోండి... ఇక ఉంటాను’– 1540 డిగ్రీల వేడిలో మరిగిన ఉక్కు ద్రావణం మీద పడటంతో శరీరమంతా కాలిపోయిన ఓ కార్మికుడు స్ట్రెచర్ మీద, చావుబతుకుల మధ్య కుటుంబాన్ని తలుచుకొని పెద్ద కొడుకుకి చెప్పిన సూచనలివి. ఇది మొబైల్లో రికార్డయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలామందిని కలచి వేస్తోంది. మరిగిన ఉక్కు ద్రవంలో దేహాలు కూడా కరిగిపోయి ఎనిమిది మంది చనిపోయారు. మరికొందరు తీవ్రంగా కాలిన శరీరాలతో ఆసుపత్రుల్లో ఉన్నారు. ఇక షరా మామూలే... సంతాప ప్రకటనలు, పరిహార ప్రకటనలు. కానీ ఈ ప్రమాదాలు ఎందుకు జరుగు తున్నాయి, ఏ భద్రతా చర్యల లోపాల వలన జరుగుతున్నాయి. దీనికి బాధ్యులెవరు? భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, శాశ్వత ప్రమాద నివారణ గురించిన చింతనగానీ, చర్యలుగానీ కనపడటం లేదు.అంచేత మృత్యుముఖంలో ఉన్న ఆ కార్మికునికి ఈ ఎరుక ఉండే, తన అంతిమయాత్ర సమయం ఆసన్నమయిందన్న విషయం గ్రహించి... తాను ఎలాగూ నిర్లక్ష్య, బేఖాతర్ అధికార్ల, నేతల వలన బలి అయిపోతున్నాడు కదా, తన కొడుకులు ఇలా బలి కాగూడదు అను కున్నాడు. తన కుటుంబం బలి కాగూడదు అనుకున్నాడు. అందుకు జాగ్రత్తలు చెప్పాడు పెద్ద కొడుక్కి. ఇవి కేవలం కొడుకుకే చెప్పిన మాటలేనా? కుటుంబం కోసం పడ్డ తాపత్ర యమేనా?ద్రావణాగ్ని సాక్షిగా...అంతిమ క్షణాల్లో గుండెలో ఇంకెన్నో కదలాడి ఉంటాయి. ఆ ప్లాంట్ పరిరక్షణ కోసం, మరింత సమర్థవంతంగా కర్మాగారం పని చేయడం కోసం, ఆ కర్మాగారం తమ ఉపాధి గృహం అన్న భావనతో ఏళ్ల నుంచి అధికార పీఠాలకు తాము చేసిన విన్నపాలు, అధికార పీఠాలు అమలు చేసే మృత్యు శాసనాలు, వాటిని ధిక్కరిస్తూ అనునిత్యం చేసిన చట్టబద్ధ పోరాటాలు, ప్లాంట్‌ను కాపాడే కర్తవ్యాలను నిర్వహించడం గురించి తన పెద్ద కొడుక్కి చెప్పాలని భావించే ఉంటాడు. అధికారంలో ఉన్న పార్టీ ప్లాంట్‌ని అమ్మకానికి పెట్టడం, తాము వ్యతిరేకిస్తూ పోరాడటం గురించి చెప్పాలని అనుకునే ఉంటాడు. అధికార పక్షంలో ఒకరు ఓసారి అమ్మకం ఆగదంటారు, మరొకరు ఆగిపోయినదంటారు. ఇంకొకరు మావల్ల ఆగిందంటారు (బాధితుల పరామర్శకు వచ్చినపుడు ఒక నాయకుడి పలుకులు ఇవే). ఇంకొకరు ఇదిగో సహాయం అని భిక్షపు నూకలు వేసి డప్పు కొట్టుకోవడం – అందరివీ అబద్ధపు కూతలే అని కొడుక్కి చెప్పాలనే అనుకుని ఉంటాడు. చదవండి: ఇది సర్కారీ నిర్లక్ష్యం!ఉక్కు కర్మాగారం కోసం ప్రాణాలు కోల్పోయిన వారి గురించీ, భూములు కోల్పోయిన వారి గురించీ, ప్రభ్యుత్వం ఈ కర్మాగారం మీద పెట్టిన పెట్టుబడికి కొన్ని వందల రెట్ల ఆదాయం కార్మికులు తమ శ్రమ ధారవోసి ఇచ్చారనీ కొడుక్కి చెప్పాలనే అనుకుని ఉంటాడు. నష్టాలకు కారకులు పాలకులేనని, ప్రమా దాలకు వారే కారకులని ఆ కార్మికుడు చెప్పాలనే అనుకుని ఉంటాడు. అడుగుతున్న గనులు, శాశ్వత పరిష్కారాలు అరణ్య రోదనలయినవనీ, మృత్యుకుహరంలో శ్రమిస్తున్నామనీ ద్రావణాగ్ని సాక్షిగా కొడుక్కి చెప్పాలనే అనుకుని ఉంటాడు. కొడుక్కి మాత్ర మేనా... లోకానికీ, ముఖ్యంగా పాలకులకు చెప్పాలని అనుకొని ఉంటాడు. చెపితేనో? మరణ వాఙ్మూలం ఇస్తేనో?- అట్టాడ అప్పల్నాయుడు కళింగ సీమ రచయితల వేదిక అధ్యక్షుడు -
తక్కువ కరెంట్‌తో ఎక్కువ కూలింగ్
ఎల్ నినో నేపథ్యంలో వర్షాకాలం మొద లైంది. వర్షపాతం సాధారణ స్థాయికన్నా తక్కువగా ఉండగలదని భారత వాతావరణ పరిశోధనా శాఖ (ఐఎండీ) అంచనా. పసిఫిక్ సముద్రంలో రూపుదిద్దుకుంటున్న ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా, భారత్‌లో వర్షపాతం ఈసారి దీర్ఘకాలిక సగటు (ఎల్.పి.ఏ.)లో 90% మేరకు మాత్రమే ఉండగలదని భావిస్తున్నారు. ఎల్ నినో ఉష్ణ ధోరణులు తేమతో నిండిన పవనాలను బలహీనపరుస్తాయి. ఫలితంగా వర్షపాతం కొన్నిచోట్ల మరీ ఎక్కువ, కొన్నిచోట్ల మరీ తక్కువగా ఉంటుంది. దక్షిణాసియాలో సగటుకన్నా తక్కువ వర్ష పాతం ఎల్ నినో ప్రపంచ ప్రభావాలలో ఒకటిగా ప్రపంచ వాతా వరణ సంస్థ (డబ్లు్య.ఎం.ఓ.) పేర్కొంది. మారుతున్న వాతావరణ పరిస్థితి అనివార్యంగా కొన్ని సమస్యలను సృష్టిస్తుంది. దోమలు, ఈగల వంటి ద్వారా సోకే బ్యాక్టీరియా, వైరస్ల జబ్బులు మొదలవుతాయి. ఆహారం, నీటి లభ్యతపై ఒత్తిడి పెరుగుతుంది. విద్యుదుత్పాదన దెబ్బతింటుంది. ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వడగాడ్పులు, రాత్రిపూట కూడా ఉష్ణో గ్రతలు ఎక్కువగానే ఉండటానికి సంబంధించిన వార్తలు చూస్తు న్నాం. ఇవన్నీ కలిసి శీతలీకరణ సాధనాలు, పద్ధతుల వైపు ప్రజలు మొగ్గేటట్లు చేస్తాయి. ఫ్యాన్లు, డిజర్ట్ కూలర్లు, సంచార ఎయిర్ కండిషనర్లు (కార్లు, బస్సులు, రైళ్ళలో), చిల్లర్లు, శీతల గిడ్డంగులు వంటివాటికి గిరాకీ పెంచుతాయి. గృహాలు, ఆఫీసులు, ఫ్యాక్టరీలకు వాటి డిమాండ్లకు అనుగుణంగా కూలింగ్ సిస్టంలు అవసరమవు తాయి. దీనికి విండో, స్లి్పట్, సెంట్రలైజ్డ్ ఏసీలను పెంచుకుంటూ పోవడం స్థిరమైన పరిష్కారం అనిపించుకోదు. కొత్త రూమ్ ఏసీలకు 2025–2035 కాలానికి మరో 13–15 కోట్ల యూనిట్లు జోడు కాగలవని అంచనా. ఇవి విద్యుత్ పంపిణీ వ్యవస్థపై భారాన్ని పెంచుతాయి. 2035లో ఉండగలదని భావిస్తున్న లోడులో వీటి వాటాయే దాదాపు 180 గిగావాట్లు! ప్రస్తుతం, వేసవిలో వినియోగం పతాక స్థాయిలో ఉన్న దశలో ఏసీ యూనిట్లు స్వాహా చేస్తున్న విద్యుత్తు సుమారు 60–70 గిగావాట్లని తేలింది. అంతటా వేడి వాడలే!పట్టణాలు, నగరాల్లో కొన్ని ప్రాంతాలు ‘వేడి వాడలు’గా పేరు మోస్తున్నాయి. జనాభా తక్కువగా ఉన్న ప్రాంతాలకన్నా జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రత కొన్ని డిగ్రీలు ఎక్కువగా ఉంటోంది. నగరాల్లో ఏసీలు పరిసరాల్లోకి మరింత వేడిని విడుదల చేస్తున్నాయి. ఫలితంగా, శీతలీకరణ యంత్రాలకు డిమాండ్ మరింత పెరుగుతోంది. అదొక విష వలయం. వీలైనంత తక్కువ విద్యుత్తును గ్రహించి వాతావరణాన్ని చల్లబరచే సిస్టంలను గుర్తించేందుకు మన దేశంలో స్టార్ రేటింగ్ కొలమానం ఉంది. ఏసీలకు ఈ రేటింగ్ సిస్టంను 2009లో ప్రవేశ పెట్టారు. మొదట్లో ఇది స్వచ్ఛంద లేబుల్గా ఉండేది. తర్వాత, తప్పనిసరిగా పేర్కొనాలని నిబంధన తెచ్చారు. తదనంతరం, కనిష్ఠ శక్తి వినియోగ ప్రమాణాల (ఎం.ఇ.పి. ఎస్.)ను ప్రవేశపెట్టారు. తర్వాత, ఇండియన్ సీజనల్ ఎనర్జీ ఎఫిషి యన్సీ నిష్పత్తి (సీర్)ని 2015లో అమలులోకి తెచ్చారు. ఈ ప్రమా ణాలు ఏసీ మార్కెట్‌పై కొంత ప్రభావాన్ని చూపాయి. సదరు సాధ నానికి లభించిన స్టార్లను బట్టి వినియోగదారులు రకరకాల ఏసీలు కొనడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వస్తూత్పత్తి సంస్థలు కూడా ఇన్ వెర్టర్ టెక్నాలజీ వంటి మెరుగుదలలతో కొత్త వస్తువులను మార్కెట్లోకి తెస్తున్నాయి. వాతావరణం పట్టని ఏసీలుఅంతవరకు బాగానే ఉందిగానీ, సాంకేతికపరంగానూ, అమలు లోనూ కొన్ని లోపాలు కొనసాగుతున్నాయి. బర్కిలీలోని యూనివ ర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఇండియా ఎనర్జీ అండ్ క్లైమేట్ సెంటర్ పరిశోధకులు 2025లో ఒక అధ్యయనం నిర్వహించారు. పరీక్షా విధానాలు ప్రాథమికంగా పొడి వాతావరణంలో శీతలీకరణను మదింపు చేస్తున్నాయనీ, భారతదేశంలోని హాట్–హ్యూమిడ్ వాతా వరణంలో కీలకమైన అంశంగా మారే గాలిలో వేడితేమను తగ్గించే లేదా తొలగించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదనీ వారు పేర్కొన్నారు. దానివల్ల ఏమవుతుందంటే, ల్యాబొరేటరీ పరీక్షల్లో ఏసీలు బాగా పనిచేస్తాయి. వాస్తవిక పరిస్థితుల్లో పనితీరు పేలవంగా ఉంటుంది. లేదా విద్యుత్తును ఎక్కువ స్వాహా చేసి ప్రదేశా లను అతి శీతలంగా మారుస్తాయి. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలతో పోలిస్తే అమలుచేస్తున్న ఎం.ఇ.పి.ఎస్.ల విషయంలో కూడా ఇండియా వెనుకబడే ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. భారత్‌లోని సగటు యూనిట్‌తో పోలిస్తే ఆ దేశాల్లోని ఏసీలు దాదాపు రెండింతల ఇంధన వినియోగ సామర్థ్యాన్ని కనబరుస్తున్నా యని అధ్యయనంలో వెల్లడైంది. కేంద్రీకృత కూలింగ్ మెరుగుఇండియా కూలింగ్ కార్యాచరణ ప్రణాళిక అనేది మరో ప్రయత్నం. దీనికి 2019లో శ్రీకారం చుట్టారు. ఈ ప్రణాళిక కింద వివిధ ఐడియాలను పరీక్షించి చూస్తున్నారు. డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టం (డీసీఎస్) వాటిలో ఒకటి. కొన్ని ఐరోపా నగరాల్లో వాడుకలో ఉన్న సెంట్రలైజ్డ్ హీటింగ్ సిస్టంల తరహాలో దానికి రూపకల్పన చేశారు. డీసీఎస్ కింద కొన్ని భవనాల సముదాయానికి సెంట్రలైజ్డ్ కూలింగ్ సిస్టం పెడతారు. నీరు, విద్యుత్, గ్యాస్ సరఫరా చేసే పైపుల మాదిరి గానే కూలింగ్ కూడా గొట్టాల ద్వారా పంపిణీ అవుతుంది. అది సమర్థమైన సిస్టంగా పేరు తెచ్చుకుంది. వ్యర్థ జలాలను శుద్ధి చేసి ఆ నీటిని సెంట్రల్ ప్లాంట్ వినియోగించుకుంటుంది. వ్యర్థంగా బయట కొచ్చే వేడిని చిల్లర్లు గ్రహించుకుంటాయి. అదే ఇంట్లోని ఏసీలకైతే రిఫ్రిజిరెంట్ గ్యాసులు అవసరమవుతాయి. కేంద్రీకృత వ్యవస్థ కావడం వల్ల, కూలింగ్ డిమాండ్‌ను మరింత సమర్థంగా నిర్వహించవచ్చు. విమానాశ్రయాలు, ఐటీ సంస్థల సముదాయాలు, పారిశ్రామికవాడలు, విశ్వవిద్యాలయాల ప్రాంగణాలు వంటిచోట్ల డీసీఎస్ అనువైనది. సింగపూర్, దుబాయ్, ఖతార్, యూఏఈలలో ఇది ప్రయోజనకరమైనదిగా తేలింది. మన దేశంలో ‘శీతలీకరణను కూడా ఒక సేవ’ కింద మార్చడానికి రెగ్యులేటరీ, లీగల్, ఫినాన్షియల్ పరంగా, ఇతరత్రా కొన్ని ప్రతిబంధకాలున్నాయి. కొన్నేళ్ళ క్రితం ఢిల్లీలోని కనాట్ ప్లేస్‌లో డీసీఎస్ ఏర్పాటుకు ప్రయత్నాలు సాగాయిగానీ, వివిధ క్షేత్ర స్థాయి సమస్యల వల్ల అవి ఫలించలేదు. సాపేక్షంగా చూస్తే, గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో మాదిరిగా కొత్త ప్రాజెక్టులలో వాటిని అమలులోకి తేవడం తేలిక. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో కూడా డీసీఎస్‌ను పొందుపరచనున్నారు. వివిధ నగరాల్లో ఆకాశ హార్మ్యా లతో కొత్త జనావాస ప్రాంతాలు పుట్టుకొస్తున్నాయి. వాటిలో డీసీఎస్‌ను ప్రోత్సహించేందుకు ఇది సరైన సమయం. దేశానికి ఒక సమగ్ర శీతలీకరణ విధానం అవసరం. అది తక్కువ విద్యుత్తుతో ఎక్కువ శీతలీకరణను అందించేందిగా ఉండాలి. వివిధ ప్రాంతాల్లోని పరిస్థితులకు తగ్గట్లుగా శీతలీకరణ సాధనాలకు కొత్త డిజైన్లు అవసరం. నూతన శీతలీకరణ టెక్నాల జీలపై పరిశోధన సాగాలి. అదే సమయంలో, వడగాడ్పులకు ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతాల్లో చల్లదనాన్ని ఇచ్చే పైకప్పుల వంటి కొత్త ప్రయత్నాలకు సామూహిక స్థాయిలో ప్రయత్నాలు చేయాలి.దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
నవ భారతంలో నరేంద్ర శకం
నరేంద్ర మోదీ అనుకోకుండా రాబర్ట్ ఫ్రాస్ట్ సిద్ధాంతాన్ని నమ్మినట్టున్నారు: అందరూ వెళ్లే దారిని కాకుండా అతి తక్కువ మంది పయనించే మార్గాన్నిఎంచుకున్నారు. బహుశా అదే నేటి మార్పులకు దారితీసి ఉంటుంది.జవహర్లాల్ నెహ్రూ, నరేంద్ర మోదీ ద్వారా భారత ప్రధానమంత్రిత్వం రెండు విభిన్న శకాలను ఆవిష్కరించింది. ప్రతి శకానికీ తనదైన పరిమితులు, అవకాశాలు, ఆశయాలున్నాయి. నెహ్రూ ఒక దుర్బల, సరికొత్త సార్వభౌమాధికార సముపార్జిత దేశానికి నాయకత్వం వహించారు. మోదీ వంతు వచ్చేసరికి ప్రపంచ సంక్షోభాలను ఎదుర్కొంటూ, సువిశాల, డిజిటల్ నెట్వర్క్ అను సంధానిత, అత్యంత పోటీతత్వ ప్రజాస్వామ్యానికి నేతృత్వం వహించాల్సి వచ్చింది. దిగువ నుంచి ఎగువకు!నెహ్రూ పాలనా విధానానికి ఎగువ నుంచి దిగువకు సంస్థల రూపకల్పన, ప్రభుత్వ నిర్దేశిత ఆర్థిక వ్యవస్థ కేంద్రస్థానంలో ఉన్నాయి. దేశ విభజన తర్వాత చెల్లాచెదురైన దేశాన్ని కూడదీసుకునే క్రమంలో ఇది సముచిత విధానమే అయినప్పటికీ, ఇది కేంద్రీకృత నియంత్రణకు దారితీసింది. తద్వారా పౌరులను దేశ ప్రగతిలో భాగ స్వాములుగా కాకుండా, లబ్ధిదారులుగా మాత్రమే పరిగణించింది.మోదీ విధానం ఆ తర్కాన్ని ఆమూలాగ్రం మారుస్తూ– ఆత్మ గౌరవం, అవిశ్రాంత పనితీరు మేళవింపుతో పాలనను ప్రజా ఉద్య మంగా రూపుదిద్దింది. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ సూత్రాన్ని అనుసరించింది. ఆ మేరకు బ్యాంకు ఖాతాలు, ప్రత్యక్ష లబ్ధి బదిలీ (డీబీటీ), గ్యాస్ కనెక్షన్లు,గృహ నిర్మాణం, మరుగుదొడ్లు, ‘ఎక్స్‌ప్రెస్‌వే’ల నిర్మాణం, సంక్షేమ పథకాల డిజిటలీకరణ వంటి ‘దిగువ నుంచి ఎగువకు’ పద్ధతిలో సత్ఫలితాల సాధనతోపాటు విశ్వాసాన్ని కూడా పెంచుకుంది.ఈ రెండు శకాల నడుమ గల పరిమాణమే ఇక్కడ ప్రధాన వ్యత్యాసం. దేశ జనాభా దాదాపు 34 కోట్లుగా ఉండి, రాజకీయ పార్టీల మధ్య నామమాత్రపు పోటీ ఉన్న తరుణంలో నెహ్రూ పదవీ బాధ్యతలు చేపట్టారు. జనాభా 131 కోట్లు దాటి, వేలాది నమోదిత పార్టీల మనుగడతోపాటు సార్వత్రిక ఎన్నికల బ్యాలెట్ పత్రాల్లోవందలాది పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన రాజకీయ వ్యవస్థలో మోదీ ప్రధాని అయ్యారు. భారత తొలి సార్వత్రిక ఎన్నిక లలో ఓటర్ల సంఖ్య సుమారు 17 కోట్లు మాత్రమే కాగా, 2014 నాటికి 83 కోట్లు దాటి, 2024కల్లా మరింత పెరిగింది.పునాది–విస్తరణనెహ్రూ నమూనా ప్రాథమిక పరిశ్రమలను, శాస్త్రవిజ్ఞాన సంస్థ లను ఆర్థికంగా పెంచిపోషించింది. అయితే, ‘హిందూ వృద్ధి రేటు’గా ప్రాచుర్యంలోకి వచ్చిన 3–4 శాతం స్థాయికే అది పరి మితమైంది. కానీ మోదీ నేతృత్వంలోని భారత దేశం కోవిడ్–19, ద్రవ్యోల్బణ ఉధృతి, సరఫరా వ్యవస్థల్లో ఒడిదుడుకులు, భౌగో ళిక–రాజకీయ సంఘర్షణల పీడిత దశాబ్దంలోనూ 6.5–7 శాతం సగటు వృద్ధితో ప్రపంచ ప్రగతికి చోదకశక్తిగా రూపొందింది. 2014–24 మధ్య జాతీయ రహదారులు 54,000 కిలోమీటర్లకు పైగా విస్తరించాయి. దీంతో రవాణా వ్యవస్థ ఒక సమస్య స్థాయి నుంచి పోటీతత్వ సాధనంగా మారింది. మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ మార్గాలైన యూపీఐ చెల్లింపులు, ఆధార్ ఆధారిత సేవా ప్రదానం వంటివి విధాన ప్రకటనకూ–పౌరులపై దాని ప్రభావానికీ మధ్య అంతరాన్ని తగ్గించాయి.ఐఐటీలు, ఎయిమ్స్ వంటి సంస్థాగత మూల స్తంభాలతో నెహ్రూ ఒక బలమైన పునాది వేశారు. ఇవి దేశ విజ్ఞానార్థిక వ్యవస్థకు బీజావాపనం వేశాయి. మోదీ పాలన సామూహిక విస్తరణకు ప్రాధాన్యమిస్తూ ఐఐటీల సంఖ్యను 23కు, ఐఐఎంలను 21కి, ఎయి మ్స్లను 23కు పెంచింది. ప్రతిష్ఠాపనతో విస్తరణను ముడిపెట్టే ఈ ద్వంద్వ విధానం, ఆకాంక్షలనే విధానోపకరణంగా పరిగణించే రాజ కీయ దృక్కోణానికి ప్రతీకగా నిలిచింది.మోదీ హయాంలో మంత్రిమండలి కూర్పు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రాతినిధ్యాన్ని అసాధారణ స్థాయికి చేరుస్తూ సామాజికంగా ఆ వర్గాలను ముందుకు తెచ్చింది. మహిళా ప్రాతినిధ్యం 1950ల నాటి ఏకాంక స్థాయి నుంచి ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ ద్వారా మూడింట ఒక వంతు రిజర్వేషన్‌కు శాసనబద్ధ మార్గాన్ని ఏర్పరచింది. అంటే, నామమాత్రపు సార్వజనీనత నుంచి నిర్మాణాత్మక హామీల దిశగా మార్పును ఇది సూచిస్తుంది.నెహ్రూ అనుసరించిన అలీన విధానం సూత్రబద్ధమైనదే అయినా, రెండు ధ్రువాల ప్రపంచంలో తరచూ ఒంటరిగా ఉండి పోయింది. ఇది భౌతిక ప్రతిష్ఠకన్నా నైతిక నేతృత్వంపైనే ఎక్కువగా ఆధారపడింది. కాగా, మోదీ విధానం బహుళ అనుసంధాన లావా దేవీల స్వభావంతో కూడినది. అమెరికా, రష్యా, యూరప్, గల్ఫ్ సహా వర్ధమాన దేశాలతోనూ ఏకకాలంలో సంబంధాలు నెరపుతూ భారత విపణి, సాంకేతిక పరిజ్ఞాన డిమాండ్ సహా ప్రవాస భారతీయుల ప్రభావాన్ని కూడా ఇది బేరసారాల ఉపకరణంగా మారుస్తుంది.తొలిసారి భారత్, పాకిస్తాన్ యుద్ధం నుంచి 1962లో చైనాతో యుద్ధం దాకా ‘శాంతియుతమైనది’గా గుర్తుచేసుకునే నెహ్రూ పాలన అనేక సంఘర్షణలకు సాక్షిగా నిలిచింది. మోడీ సిద్ధాంతాన్ని పరికిస్తే – అనిశ్చిత పొరుగు ప్రాంతాల్లో భారత్ తన పూర్తిస్థాయిసంప్రదాయ యుద్ధ నివారణ, నిరోధక శక్తిసామర్థ్యాలను వ్యూహా త్మక ప్రతిస్పందన, సునిశిత సరిహద్దు నిర్వహణలతో జోడించింది. ఇక్కడ ప్రమాదమే లేదని కాదు, దేశీయంగా ఆధునికీకరణ కొనసాగు తున్న తరుణంలో భద్రతా వాతావరణ స్థిరత్వాన్ని ఇది సూచిస్తుంది.కాలానికి తగిన నాయకుడుస్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో పీఎల్–480 పథకం కింద ‘ఓడ నుంచి విస్తరిలోకి’ అనే దిగుమతి పరాధీనత ఉండేది. ఇప్పు డది సమసిపోయి, దాదాపు 80 కోట్ల మంది పేదలకు ఉచిత ధాన్యం సరఫరా చేసే ‘పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ అమలు స్థాయికి భారత్ దూసుకెళ్లింది. మరోవైపు జాతీయంగా ఒక ప్రధాన వ్యవ సాయ ఉత్పత్తిదారుగానూ, అంతర్జాతీయంగా ఎగుమతిదారుగానూ ఎదుగుతోంది. పదవీ కాలాన్ని కొలబద్దగా పరిగణించినా, మోదీ హయాం ఓ కీలక మలుపు. ఇది ఇందిరాగాంధీ సుదీర్ఘ నిరంతరాయ పదవీ కాలాన్ని అధిగమించి, నెహ్రూ అనుసరించిన నిరంతర సేవా ప్రమా ణానికి చేరువవుతూ వచ్చింది. రాష్ట్ర, జాతీయ స్థాయి పదవులకు ఎన్నికైన ప్రభుత్వాధినేతగా దేశంలోనే అత్యంత సుదీర్ఘ సంచిత పదవీ కాలపు రికార్డును మోదీ పాలన ఇప్పటికే బద్దలు కొట్టింది. అయితే, ఈ ప్రాధాన్యం రోజుల సంఖ్యకు అతీతంగా దాని సంచిత ప్రభావంలో కనిపిస్తుంది.వేర్వేరు కాలాల్లో విభిన్న నాయకత్వ అవసరం ఏర్పడింది. తదనుగుణంగా తొలినాళ్ల నాయకత్వం చట్రాన్ని రూపొందిస్తే, మలినాళ్ల నేతృత్వం దాని ఆధారంగా ఉపరితల నిర్మాణానికి ఉపక్రమించి రహదారులను విస్తరించి, దేశాన్ని డిజిటలీకరణతో అనుసంధానించి, ఆ ప్రగతి ప్రకాశాన్ని ప్రపంచం నలుమూలలా ప్రసరించేలా చేసింది. సార్వజనీనత, సేవా ప్రదానం, మౌలిక సదుపాయాల కల్పన, బేరసారాల సామర్థ్యం తదితర ప్రమాణాల ప్రాతిపదికన చూస్తే – మోదీ నిస్సందేహంగా అత్యంత ప్రభావశీల ప్రధానమంత్రిగా నిలుస్తారు. కోట్లాది భారతీయుల దృక్కోణంలో మోదీ ఈ దేశానికి అత్యంతావశ్యక సమర్థ నేతగా నిలిచారు. - సుహేల్ సేథ్వ్యాపారవేత్త, కాలమిస్ట్; ‘కౌన్సెలేజ్ ఇండియా’ కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు–మేనేజింగ్ పార్ట్నర్ -
నేపాల్‌తో సరిహద్దుల కలకలం
భారతదేశానికి నేపాల్‌తో సరిహద్దు వివాదమా! చైనా, పాకిస్తాన్లతో వివాదాల గురించి దశాబ్దాలుగా వింటున్న వారికి ఇటీవల వార్తలకు ఎక్కిన ఈ విషయం ఆశ్చర్యాన్ని కలిగించి ఉంటుంది. నేపాల్ యువప్రధాని బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలతో సమస్య మరొకసారి ముందుకు వచ్చిందిగానీ, ఇది 1816లో మొదలై 210 సంవత్సరాలుగా కొనసాగు తున్న వివాదమంటే మరింత ఆశ్చర్యం కలగవచ్చు.‘నేపాల్ భూభాగంలోకి ఇండియా చొరబడ టమే కాదు, ఇండియా భూభాగాలలోకి నేపాల్ కూడా పలుచోట్ల చొచ్చుకు పోయింది. ఈ విషయమై మేము ఇండియా, చైనా, బ్రిటన్లతో కూడా మాట్లాడాము. బ్రిటిష్‌వారు ఇండియాను వదిలిపోయినప్పటి నుంచి ఈ సమస్య ఉంది’ అన్నారాయన. ఇండియా చొరబడింద నటంతో ఇక్కడా, నేపాల్ కూడా చొరబడిందనటంతో అక్కడా విమ ర్శలైతే చెలరేగాయి గానీ, బాలేంద్ర మాటలను ఒకసారి ఆవేశాలు లేకుండా పరిశీలిస్తే కనిపించేవి కొన్నున్నాయి.బ్రిటిష్ వలస పాలకుల పుణ్యం1816లో స్వతంత్ర భారతదేశమన్నదే లేదు గనుక ఆయన నిందిస్తున్నది బ్రిటిష్ వలస పాలకులనే తప్ప స్వతంత్ర భారత ప్రభుత్వాలను కాదు. మరొకవైపు అపుడు నేపాల్‌లో షా వంశపు రాచరిక పాలన సాగుతున్నది. ఇంతకూ వివాదానికి మూలం ఏమిటి? రెండు పక్షాల మధ్య యుద్ధం జరుగగా, 1816లో సుగాలీ ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం మహాకాళీ నది సరిహద్దు అవు తుంది. ఒప్పందం జరిగినా వివాదం ఎందుకు కొనసాగింది? ఒక ఉదాహరణ చూద్దాం. ఒక హౌసింగ్ కాలనీకి కాగితంపై లేఔట్ ఉంటుంది. ఆ కాగితంపై ప్లాట్ల మధ్య గీతలు, అడుగుల లెక్కలు ఉంటాయి గానీ, నేలమీద రాళ్లు పాతరు. లేదా రాళ్లు ఒకోసారి పడి పోతాయి. దానితో వివాదాలు వస్తాయి.సుగాలీ ఒప్పందం విషయంలోనూ అదే జరిగింది. సర్వేయర్లు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించకుండా మహాకాళీ నది సరిహద్దు అని ఆ ప్రకారం కాగితంపై గీతలు గీశారు. సాంకేతిక భాషలో దీనిని డీలిమిటేషన్ అంటారు. ఆ ప్రకారం భూభాగంపై హద్దుల రాళ్లు కూడా పాతితే దానిని డిమార్కేషన్ అంటారు. కానీ బ్రిటిష్ పాల కులు రెండూ సరిగా చేయలేదు. మహాకాళీ నది సరిహద్దు అన్నారు గానీ, ఆ నది ఎక్కడ పుట్టి ఏ విధంగా ప్రవహిస్తున్నదనే వివరాలూ లేవు.ఆ నది ప్రవాహ వేగాలను బట్టి కొంత అటు ఇటుగా మారు తుంటుంది. ఇది అనేక నదుల విషయంలో జరిగేదే. ఈ పరిస్థితు లన్నింటితో బ్రిటిష్ వారికి వచ్చిన సమస్య ఏమీ లేకున్నా, చిన్న దేశమైన నేపాల్‌కు సమస్యలు ఎదురవుతుండటంతో అక్కడి రాజులు ఆ విషయం లేవనెత్తుతూ పోయారు. కానీ ఉపయోగం లేకపోయింది. ఆ వివాదం 1947లో భారత దేశం స్వతంత్రమయ్యేవరకు ఉండిపోయి, ఆ తర్వాత కూడా ఉభయపక్షాలు 79 సంవత్సరాలు గడిచినా పరిష్కరించుకోకపోవ టంతో ఈ 2026లోనూ కొనసాగుతున్నది. ఇండియా–చైనా, ఇండియా–పాక్ సరిహద్దు సమస్యలు కూడా బ్రిటిష్ పాలన వార సత్వమే. ఇండియా–చైనా సరిహద్దును కాగితంపై గీసిపోయిన సర్ హెన్రీ మెక్‌మహన్, ఇండియా–పాక్ సరిహద్దును అంతే హడా వుడిగా కాగితంపై గీసిపోయిన సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్ సృష్టించిపోయిన సమస్యలు ఇప్పటికీ మండుతూనే ఉన్నాయి.బ్రిటిష్, ఫ్రెంచ్ వలస పాలకులు ఆసియా, ఆఫ్రికాలలో వదలి పోయిన సరిహద్దు వివాదాలు 50కి తగ్గవు. మరొక ప్రమాదకర స్థితి ఏమంటే, దీనికంతా కారణమైన అప్పటి వలస పాలకులతో పాటు ఇతర సామ్రాజ్యవాదులు, నేటికీ ఆ వివాదాలను ఉపయోగించు కుంటూ వనరులను కొల్లగొట్టడం, వైరి పక్షాలకు ఆయుధాలను అమ్ముకోవటం, రాజకీయ ప్రాబల్యం సంపాదించటం చేస్తున్నారు. మాదంటే మాది...నేపాల్‌లో బాలేన్ షా ప్రధానిగా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ప్రభుత్వం ఏర్పడింది 2025లో కాగా, అంతవరకుండిన రాచరిక పాలనలో, నేపాలీ కాంగ్రెస్‌తో పాటు కమ్యూనిస్టుల హయాంలోనూ భారత్–నేపాల్ సరిహద్దు వివాదం ఏదో ఒక స్థాయిలో కొనసాగు తూనే వచ్చింది. మహాకాళి ప్రాంతంలో లిఫూలేఖ్, లింపియాధురా, కాలాపానీ, అక్కడికి తూర్పున సుస్తా విషయమై సమస్య ఉంది. కె.పి. శర్మ ఓలీ ప్రభుత్వం ఉండినపుడు రెండు దేశాలు కూడా మహా కాళి ప్రాంత భూములను తమతమ దేశాలలో భాగంగా చూపుతూ మ్యాపులు విడుదల చేశాయి. అదే ప్రకారం ఓలీ ప్రభుత్వం కొత్త కరెన్సీని జారీ చేసింది. అదే మ్యాపును ప్రస్తుత ప్రధాని కాఠ్మండూ మేయర్‌గా ఉన్నపుడు తన కార్యాలయంలో ప్రదర్శించారు. ఆయన పైన పేర్కొన్న పార్లమెంట్ ప్రకటన చేసినపుడు, సమస్య మొదలైంది బ్రిటిష్ కాలంలో అయినందున వారు అప్పటి రికార్డులతో పాటు చర్చలలో పాల్గొనాలని! ఆ ప్రాంతం మీదుగా భారత్, చైనా మధ్య తమ అనుమతి లేకుండా వాణిజ్యం, మానస సరోవర్ యాత్రలు సాగుతున్నందున చైనా కూడా చర్చలకు రావా లనీ అన్నారు. కానీ, సమస్యను ఇండియా–నేపాల్ పరిష్కరించు కోవాలి తప్ప తమకు సంబంధం లేదని బ్రిటన్, చైనా స్పష్టం చేశాయి. భారత విదేశాంగ శాఖ కూడా అదే ప్రకటన చేసింది. వివాద పరిష్కారానికి ఒక యంత్రాంగమన్నది ఇప్పటికే ఉన్నందున ఆ ప్రకారం చేస్తామన్నది. కానీ అది ఏళ్లుగా కదలటం లేదు.చరిత్ర భారం లేకుండా...బాలేన్ ప్రకటన దుమారం సృష్టించటంతో అక్కడి విదేశాంగ శాఖ వివరణ ఇవ్వబూనింది. సరిహద్దులలోని నిర్మానుష్య ప్రాంతా లలో రెండు దేశాల ప్రజలు అటు ఇటు పోవటం గురించి ప్రధాని అన్నారు తప్ప వేరే ఉద్దేశం లేదన్నది. నిజానికి ఇతరత్రా గమనించి నపుడు, సరిహద్దులు నిర్దిష్టంగా డిమార్కేట్ కాని ఏ దేశాల మధ్య నైనా, ‘ఆక్రమణ’లు అన్నట్లు కాకుండా తాత్కాలిక ‘చొర బాట్లు’రెండు వైపుల నుంచి జరగటం సాధారణం. 1988లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చైనా వెళ్లి వచ్చిన తర్వాత, రెండు దేశాల సరిహద్దులను ‘థిక్ స్కెచ్ పెన్’తో గీశారు తప్ప స్పష్టత లేదన్నారు. తర్వాత 2021లో, భారత మాజీ జనరల్ వి.కె. సింగ్, కేంద్ర మంత్రి హోదాలో ఉండి, భారత్‌లోకి చైనా ఎంత చొరబడుతున్నదో మనం చైనాలోకి అంతకన్న ఎక్కువ చొరబడున్నామనటంతో ఇపుడు బాలేన్ తరహా విమర్శలే చెలరేగాయి.ప్రసుత వివాదం తలెత్తిన తర్వాత, మొదట నేపాల్ అధికార పక్షం అధ్యక్షుడు రబీ లమీఛానే ఈ నెల 1 నుంచి 5 రోజులు, ఆవెంటనే విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ 5వ తేదీ నుంచి 3 రోజులు ఢిల్లీని సందర్శించారు. శిశిర్ భారత విదేశాంగ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశ మయ్యారు. ‘తాము గత చరిత్ర భారాన్నేమీ మోయటం లేదనీ,ఇండియాతో సత్సంబంధాలు, అభివృద్ధి సంబంధాలు తమ ప్రాధా న్యత’నీ తమ ప్రధాని మాటగా వారికి చెప్పారు. సరిహద్దు అంశం చర్చకు వచ్చి ఉంటుందిగానీ వివరాలు వెంటనే వెల్లడి కాలేదు. బాధ్యత మాత్రం ఉభయులపైనా ఉంటుంది.వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
బొంగరపు ఆట నేర్పే జీవిత సత్యాలు!
బొంగరం ఒక ఆసక్తికరమైన ఆట వస్తువు. దాని ఆకారం, నిర్మాణం విలక్షణంగా ఉంటాయి. ముల్లు చుట్టూ తాడు చుట్టి నేలమీదకు గిరాటేస్తే అది తిరిగే తీరు ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించడంతోపాటు జీవిత తత్త్వాన్ని కూడా తెలియజేస్తుంది. మనిషి కూడా ఎవరో విసిరిన బొంగరం లాంటివాడే. ఎవరు విసిరారో తెలియకపోయినా, తనప్రమేయం లేకుండా జీవితమంతా గిరగిరా తిరుగుతూ, ఆగాలన్నా ఆగలేక, ఆగాలనుకున్నప్పుడు ఆగలేక, తిరిగి, తిరిగి చతికిలపడతాడు. ఆటగాడు లేపి తీసుకుపోతాడు.తాడు చుట్టే తీరులోనే బొంగరం తిప్పే విద్య అంతా ఉంది; బిగుతుగా వేస్తే సరిగ్గా తిరుగుతుంది, వదులుగా వేస్తే పడిపోతుంది. ఒక్క పొర వదులైనా బొంగరం తూలుతుంది. విసిరే క్షణంలో మూడు పనులు ఒకేసారి జరగాలి– కింద విసరడం, తాడు లాగడం, చేయి వదలడం. ఆ మూడూ సరిగ్గా కుదిరితేనే బొంగరం సరిగ్గా నేలను తాకి తిరుగుతుంది.కొంతమంది నిపుణులు బొంగరాన్ని అరచేతిలో వేసి తిప్పుతారు. బొంగరాలాట బాగా ఆడేవారు మేధావులు కాదు. వాళ్లెవరికీ బొంగరం తిరగడం వెనక ఉన్న భౌతిక శాస్త్ర సూత్రాలూ తెలియవు. ఆ మాటకొస్తే బొంగరానికి కూడా తెలియవు! కొన్ని నైపుణ్యాలు కొంతమందికి సహజంగా వస్తాయి. సొంతంగా తయారుచేసుకున్న చిన్న సంగీత పరికరంలో సప్తస్వరాలు మధురంగా పలికిస్తూ, మనోజ్ఞంగా శ్రుతిశుభగంగా పాడే రోడ్డుపక్క విద్వాంసులకి ఎవరు నేర్పుతారు? ఏళ్లతరబడి శ్రమతో, ఖర్చుతో కూడిన సాధన చేసినవారికి కూడా అబ్బని స్వర, లయాది ఙ్ఞానం పుట్టుకతో వచ్చిన విద్య వీళ్ళది. పూర్వజన్మలు, పునర్జన్మలు నమ్మేవారి భాషలో పూర్వజన్మ సుకృతం.కదలిక జీవితం– ఆగితే పతనంబొంగరం చూడటానికి సరళంగా కనిపిస్తుంది; కలపతో చేసిన శంఖాకార శరీరం, కింద ఇనుప ముల్లు. కానీ ఆ ఆకారంలో చాలా లెక్క ఉంది. పైభాగం భారంగా ఉంటుంది. అది తిరిగే శక్తిని నిల్వ చేస్తుంది. కింది ముల్లు సన్నగా, గట్టిగా ఉంటుంది. మందగించినప్పుడు ఆటగాడు కొంచెం పదును పెడతాడు. ఎంత పదునుగా ఉండాలో, ఎంత మందంగా ఉండాలో అంతే ఉండాలి. అది శాస్త్ర ప్రమాణం.ముల్లు కొన మీదనే బొంగరం యావత్తు శరీరభారం నిలబడుతుంది. ఒక చిన్న బిందువు మీద విశ్వసంతులనం. ఇది కేవలం భౌతికశాస్త్రం కాదు. ఇది ఒక తత్త్వం. మనిషి జీవితంలో కూడా ఒక కేంద్రబిందువు ఉంటే చాలు, యావత్తు జీవన భారం మోయవచ్చు, ప్రపంచంలో తిరుగుతూ మనుగడ సాగించవచ్చు. పదునైన మెదడుతో జీవితాన్ని తీవ్రంగా తీసుకునేవారు, సన్నటి పదునైన ముల్లు ఉండే బొంగరంలాగే, ప్రపంచంలో ఎక్కువ సేపు తిరుగుతూ జీవితంలో కొట్టుమిట్టాడుతారు. జీవితాన్ని వచ్చినది వచ్చినట్టు స్వీకరించే సామాన్యులు మాత్రం మొద్దు ముల్లు ఉండే బొంగరంలాగా పరిమితంగా తిరిగి నిశ్శబ్దంగా ఆగిపోతారు.తాడు లాగే వేగమే బొంగరానికి శక్తి. విసిరే కోణమే దానికి దిశ. కానీ అన్నింటికంటే ముఖ్యమైనది తాడు విసిరిన తర్వాత వదిలేయాలి. అది తన దారిన తాను తిరుగుతుంది. భగవద్గీత చెప్పిన కర్మసిద్ధాంతం ఇక్కడ కళ్ళకు కనిపిస్తుంది. సరైన ప్రయత్నానికి కోణం, బలం, విడుపు మూడూ సమానంగా కావాలి.బొంగరం వేగంగా తిరిగేటప్పుడు పడిపోదు. వేగం దానికి రక్ష. తిరిగే వేగం ఎక్కువగా ఉన్నప్పుడు బొంగరం ఏ వైపు నుండి వచ్చే శక్తినైనా తట్టుకుంటుంది. వేగం తగ్గినప్పుడే గురుత్వాకర్షణ, రాపిడి, గాలి నిరోధం వంటి బయట శక్తులు బొంగరం తిరిగే సామర్థ్యం మీద వ్యతిరేకంగా పని చేయగలుగుతాయి. వేగంగా తిరిగే బొంగరం (Bongaram) మధ్యలో స్థిరంగా కనిపిస్తుంది. బయటంతా కదలిక, లోపల నిశ్శబ్దం. స్టోయిక్ తత్త్వజ్ఞానులు చెప్పే ‘ఇన్నర్ సిటడెల్’ తత్త్వం ఇదే. పడిపోయే బొంగరం గిలగిల్లాడుతూ, గిరగిర తిరుగుతూ చివరి శ్వాస తీసుకున్నట్టు ఆడుతుంది. జీవితపు చివరి దశలో మనిషి కూడా ఇలానే ప్రవర్తిస్తాడు. కదలికలో ఉన్నప్పుడే సంతులనం ఉంటుంది. స్తబ్ధత పతనానికి మొదలు. ‘చల్తీ కా నామ్ గాడీ’ అని కదా హిందీలో మాట!బొంగరాలాట మానవజాతి ఉమ్మడి వారసత్వం. పేర్లు మారతాయి, తత్త్వం మారదు. తెలుగులో బొంగరం, హిందీలో లట్టూ (Lattu), తమిళంలో బంబరం, ఇలా వేర్వేరు పేర్లతో బొంగరం ప్రపంచంలో ఇంకా తిరుగుతోనే ఉంది. అన్ని వస్తువులలాగే ఇప్పుడు రూపాంతరం చెంది అమెజాన్‌లో దొరుకుతోంది.చదవండి: బీబీఏ కంటే పునాది ముఖ్యం.. ఐఐఎమ్ బెంగళూరు పాఠంఈనాటి యువకులు బాల్యంలో నేర్చుకోవలసిన ఆట బొంగరాలాట. బొంగరం ఇప్పుడు భారతదేశపు వీధుల్లో కనిపించదు. తాడు చుట్టే ఓర్పు, విసిరే ధైర్యం, వదిలే నైపుణ్యం కాలం చెల్లిన విద్యలు కావు. అవి జీవిత విద్యలు. నిర్మాణంలో సమతుల్యత, ప్రయత్నంలో గాఢత, ఫలితం మీద నిర్లిప్తత, వేగంలో స్థిరత్వం, క్షీణతలో స్థితప్రజ్ఞత బొంగరం నేర్పే సత్యాలు!- డాక్టర్ కొవ్వలి గోపాలకృష్ణ అమెరికాలో ఆంకాలజీ డ్రగ్ డెవలప్మెంట్ లీడ్ సైంటిస్ట్ -
తైవాన్ నేర్పే ఆర్థిక పాఠాలు
కేవలం ఉమ్మడి మహబూబ్‌నగర్, ఆది లాబాద్ జిల్లాలను కలిపినంత భూభాగం; జనాభా పరంగా ఇంచుమించు మన దేశంలోని ఓ పెద్ద మహానగరంతో సమానం (2.3 కోట్లు) – అదే దశాబ్దాలుగా చైనా నుంచి తీవ్రమైన ఒత్తిడి నెదుర్కొంటున్న తైవాన్ దేశం. కానీ గత మే నెలలో ఈ చిన్న ద్వీపదేశం స్టాక్ మార్కెట్ సంపద విలువ ఏకంగా 4.95 ట్రిలియన్ డాలర్లకు ఎగబాకి, 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశ స్టాక్ మార్కెట్‌ను స్వల్పంగా అధిగమించింది. దాంతో తైవాన్ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద మార్కెట్‌గా అవతరించడం ప్రపంచాన్ని విస్మయపరిచింది. ఆ ఒక్క కంపెనీఒకప్పుడు వ్యవసాయం, పశుపోషణ, చేపలవేట వంటి మౌలిక వృత్తులపై ఆధారపడిన తైవాన్ – 70వ దశకంలో ఆర్థిక మంత్రి కేటీ లీ వంటి దీర్ఘదృష్టి గల నాయకుల సారథ్యంలో సాంకేతికత వైపు మళ్లింది. అప్పట్లో మైక్రోచిప్స్ రంగం అమెరికా, జపాన్ బహుళజాతి సంస్థల గుత్తాధిపత్యంలో ఉండేది. అందులో పొంచి ఉన్న అవకా శాన్ని పసిగట్టిన తైవాన్, అమెరికాలో అప్పటికే విశేషానుభవం గడించిన మోరిస్ చాంగ్ అనే స్వదేశీయుణ్ణి ప్రోత్సహించింది. ఆ నేపథ్యంలో 1987లో సాధారణ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ప్రారంభ మైన టీఎస్ఎంసీ (తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ), నేడు అంతర్జాతీయ కాంట్రాక్ట్ చిప్ తయారీ రంగంలో దాదాపు 70% వాటాతో ప్రపంచ సాంకేతిక రంగాన్ని శాసిస్తోంది. 80,000 మందికి పైగా అత్యున్నత నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు, శాస్త్రవేత్తలను కలిగి ఉన్న టీఎస్ఎంసీ, తైవాన్ స్టాక్ మార్కెట్ సంపదలో సుమారు 42–44% వాటా కలిగి ఉంది.ప్రపంచం నేడు స్మార్ట్ఫోన్ల నుండి కృత్రిమ మేధ ఆధారిత సూపర్ కంప్యూటర్ల వరకు అవసరమైన చిప్స్ కోసం తైవాన్‌పై ఆధారపడుతోంది. దాంతో ఈ చిన్న చిప్లే చైనా వంటి శక్తిమంత మైన దేశంతో నిరంతర ప్రమాదం పొంచివుండే ఆ దేశానికి, అదృశ్య రక్షణ కవచంగా మారాయి. తైవాన్ దాడికి గురైతే, ఈ చిప్‌ల సరఫరాకు అంతరాయం ఏర్పడి తమ ఆర్థిక వ్యవస్థలకు ముప్పు తప్పదనే భయంతో పాశ్చాత్య దేశాలు, కూటములు తైవాన్ రక్షణకు బాసటగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయంగా, తైవాన్ పొందే ఈ రక్షణ ‘సిలికాన్ షీల్డ్’ (సిలికాన్ రక్షణ కవచం)గా పేరొందింది. ప్రభుత్వ–ప్రైవేట్–విదేశీ సహకారం2016లో తైవాన్ మార్కెట్ విలువ 820 బిలియన్ డాలర్లు మాత్రమే ఉండగా, భారత్ 1.45 ట్రిలియన్ డాలర్లతో ముందుంది. గత పదేళ్లలో భారత్ గణనీయంగా వృద్ధి చెందినా, తైవాన్ మరింత వేగంగా పరుగులు తీసింది. భారత్ బ్యాంకింగ్, ఐటీ సేవలు, విని యోగ వస్తువులు, ఇంధనం వంటి వివిధ రంగాలపై దృష్టి సారిస్తే; తైవాన్ తన శక్తియుక్తులను చిప్ తయారీ వంటి హార్డ్‌వేర్ రంగంపై కేంద్రీకరించడం దీనికి ప్రధాన కారణం. మన వ్యవస్థలు ఎక్కువగా దేశీయ వినియోగంపై ఆధారపడి నడుస్తుంటే; తైవాన్ మాత్రం ప్రపంచ దేశాల సాంకేతికావసరాలను తీర్చుతూ అంతర్జాతీయ పెట్టుబడులను అయస్కాంతంలా ఆకర్షిస్తోంది. అయితే, 143 కోట్ల జనాభా వినియోగావసరాలను తీర్చడానికి మన దేశం ప్రాధాన్యత నివ్వడం కూడా ఆక్షేపణీయం కాదు.తైవాన్ విజయం వెనుక టీఎస్ఎంసీ ఒక్కటే కాదు– ఆ దేశ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్న పారిశ్రామిక క్లస్టర్ల విధానం కూడా కీలక పాత్ర పోషిస్తోంది. సిన్చు సైన్ ్స పార్క్‌లో చిప్ డిజైన్ కంపెనీలు, తైచుంగ్ ఇండస్ట్రియల్ పార్క్‌లో రోబోటిక్స్, కచ్చిత యంత్రాల తయారీ పరిశ్రమలు... వనరులు, సాంకేతికత మార్పిడి వంటి అంశాల్లో పరస్పరం అనుసంధానమై పని చేస్తు న్నాయి. ప్రభుత్వ–ప్రైవేట్–విదేశీ సంస్థల మధ్య సహకారం, ఫిలిప్స్ వంటి దిగ్గజాల నుండి సాంకేతికత సరఫరా, అమెరికా విపణులతో సంబంధాలు ఈ వ్యవస్థను పటిష్ఠపరిచాయి. దీనికి తోడు, విద్యావిధానాన్ని పరిశ్రమల అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, విశ్వవిద్యాలయాలను నైపు ణ్యాభివృద్ధి కేంద్రాలుగా మార్చారు. అమెరికా సిలికాన్ వ్యాలీలో స్థిరపడిన తైవాన్ మేధావులను తిరిగి రప్పించడానికి పన్ను మినహా యింపులు, పరిశోధనా నిధులు వంటి ప్రోత్సాహకాలు ప్రకటించడంతో, ఆ మానవ వనరులు దేశాభివృద్ధికి పునరంకితమయ్యాయి.అయినప్పటికీ ఈ నమూనా బలహీనతలకు అతీతం కాదు. ఒకే కంపెనీపై గణనీయంగా ఆధారపడ్డ సెమీకండక్టర్ రంగం తైవాన్ జీడీపీలో సుమారు 18–20% వాటా కలిగి ఉంది. ఈ పరిణామం ‘డచ్ డిసీజ్’ లాంటి సంక్షోభం తెచ్చిపెట్టే ప్రమాదం పొంచి ఉంది. 1960ల కాలంలో నెదర్లాండ్స్ (డచ్) అప్పుడప్పుడే అన్వేషించ బడుతున్న సహజ వనరులపైనే పూర్తి దృష్టిని కేంద్రీకరించడంతో, ఇతర రంగాలు బలహీనపడ్డాయి. అలా ఏదైనా ఒక రంగంపై దేశం అధికంగా ఆధారపడితే వచ్చే దుష్పరిణామాలను సూచించడానికి ఈ పదం వాడతారు. చిప్‌లకు ప్రత్యామ్నాయాలు ఆవిర్భవించినా లేదా అమెరికా, దక్షిణ కొరియా, భారత్ వంటి కొత్త పోటీదారులు పుంజుకున్నా దేశ ఆర్థిక, పారిశ్రామిక రంగాలు చిక్కుల్లో పడతాయి. అంతేకాకుండా పరిమిత వనరులు కలిగిన ఆ దేశం విద్యుత్ సర ఫరాలో అంతరాయాలు, నీటి ఎద్దడి, వృద్ధాప్యానికి చేరువవుతున్న జనాభా, నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత వంటి సవాళ్లను ఎదు ర్కొంటోంది. అన్నింటికంటే పెద్ద ముప్పు – దేశ సరఫరా వ్యవస్థను అస్తవ్యస్తం చేయగలిగిన చైనా సైనిక–రాజకీయ ఒత్తిడి. పారిశ్రా మికాభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యతనిచ్చిన తైవాన్, తొలినాళ్ళలో వీటిపై దృష్టి సారించలేదు. మనమేం చేయొచ్చు?సవాళ్లను అధిగమిస్తూ తైవాన్ సాధిస్తున్న విజయాలు వర్ధమాన దేశాలకు కొత్త పాఠాలు నేర్పుతున్నాయి. భారతదేశం, ముఖ్యంగా సెమీకండక్టర్ రంగంలో ముందుకు సాగుతున్న తెలుగు రాష్ట్రాలు, తైవాన్ పురోగతిని నిశితంగా పరిశీలించాలి. భారత్ ప్రభుత్వం ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్’ ద్వారా వేల కోట్లు పెట్టుబడి పెట్టడం, ప్రస్తుత కృత్రిమ మేధ యుగంలో సరైన ముందడుగే. కానీ కేవలం భారీ ఉత్పత్తి సామర్థ్యాలు సమకూర్చుకోవడంతో పాటుగా, తైవాన్ తరహా సమగ్రమైన సరఫరా శృంఖలలను సృష్టించగలగాలి. నైపుణ్యాలను పెంపొందించే విద్యా విధానం, వ్యతిరేక దిశలో మేధో వలసలు, పారిశ్రామిక సముదాయాలు, విడిభాగాల ఉత్పత్తికేంద్రాలు, సాంకేతికత మార్పిడి, మార్కెటింగ్ అనుసంధానం– ఇవన్నీ అందులో అంతర్భాగాలు కావాలి. సాఫ్ట్వేర్ రంగంలో ఎంతో ప్రతిభ చూపుతున్న మన తెలుగు యువత – తమ నైపుణ్యాలను హార్డ్‌వేర్ రూపకల్పన, చిప్ తయారీ, సరఫరా గొలుసుల కూర్పు వైపు కూడా విస్తరించాలి. ఇందుకోసం మన తెలుగు రాష్ట్రాలు కేవలం ఐటీ సేవలకే పరిమితం కాకుండా, ప్రత్యేక ఎలక్ట్రానిక్స్ రూపకల్పన, ఉత్పత్తి పారిశ్రామిక వాడలను నిర్మించాలి. విద్యారంగాన్ని సరిహద్దులు దాటించి, అంతర్జాతీయ చిప్ సంస్థలతో ఇంటర్న్‌షిప్‌లు, పరిశోధనలు, తైవాన్ లాంటి దేశాల సందర్శనలు వంటి వాటికి ప్రాధాన్యమివ్వాలి. ఏఐ వల్ల సాఫ్ట్వేర్ రంగం ప్రభావితమవ్వబోతోందన్న ఆందోళనకు ఇదో చక్కటి పరిష్కారం కూడా!పల్లపోతు కృష్ణబాలాజివ్యాసకర్త విశ్రాంత ఉన్నతాధికారి, ఎస్.బి.ఐ. -
నరేంద్ర మోదీ (భారత ప్రధాని) రాయని డైరీ
జూన్ 10కి, ప్రధానిగా నాకు 4,398 నిండి 4,399 వస్తాయి! మహాపురుషుడు జవహర్ లాల్ నెహ్రూ పాలనా కాలాన్ని దాటేస్తున్నందువల్ల నాకు కలుగుతున్న గుర్తింపే తప్ప, అదేమీ నాకు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు కాదు. బుధవారం, ఢిల్లీలోని అశోక హోటల్లో కూటమి మిత్రులు నన్ను సన్మానించేందుకు సిద్ధం అవుతున్నారు! ‘‘అవసరమా!’’ అని నేను వారిని ప్రశ్నించాను. ‘‘అవును మోదీజీ, ఇది చరిత్రాత్మక అవసరం’’ అన్నారు మిత్రులు. ‘‘ఇందులో నేను సాధించినది ఏమిటి?’’ నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ‘‘సుదీర్ఘ పదవీ కాలం... నిరంతర పాలన...’’ అని వారి నుంచి సమాధానం వినిపించింది! సుదీర్ఘ పదవీ కాలానికీ, నిరంతర పాలనకూ ఒకరిని దాటుకుని పోవటమే కొలమానం, కాలమానం అయితే... పండిట్ నెహ్రూ పదవీ కాలాన్ని కాక, నెహ్రూ అంతటివారిని దాటుకుని రావటమే ఏ ప్రధానికైనా అసలైన గుర్తింపు. దురదృష్టవశాత్తూ ఆ గుర్తింపును ఆయన కుమార్తె కూడా దక్కించుకోలేక పోయారు. శ్రీమతి గాంధీ 4,077 రోజులు మాత్రమే నిరవధికంగా ప్రధానిగా ఉన్నారు. తక్కిన ప్రధానులలో దీర్ఘకాలం పాలనలో ఉన్నవారు మన్మోహన్ సింగ్ ఒక్కరే. ఆయన 3,656 రోజులు ప్రధానిగా కొనసాగారు. ఎవరూ కూడా దరిదాపుల్లోనికైనా వెళ్లలేని మహనీయుడు నెహ్రూజీ. 2019లో, రెండోసారి నేను ప్రధాని అయినప్పుడు ఇదే జూన్ నెలలో లోక్‌సభలో పండిట్ నెహ్రూ మాటల్ని గుర్తు చేసుకున్నాను. దేశాన్ని కర్తవ్య మార్గంలో నడిపించాలని నెహ్రూజీ కన్న కలను, మనమందరం కలిసి నెరవేర్చాలని ఆకాంక్షించాను. 2023లో కొత్త పార్లమెంట్ భవన్‌లోకి మారినప్పుడు కూడా, ఆ ప్రారంభోత్సవంలో, ఎంతో గొప్పదైన నెహ్రూజీ ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగం దేశానికి ఒక శాశ్వతమైన, సామూహిక భావోద్వేగంగా నిలిచిపోయిందని గుర్తు చేశాను.అటువంటి మహోన్నతుడిని ఎవరు దాటగలరు? ఎప్పటికి దాటగలరు? ‘‘లేదు మోదీజీ, మీ 12 ఏళ్ల నిరంతర పాలనను శ్లాఘిస్తూ ప్రత్యేక సంయుక్త తీర్మానాన్ని ప్రవేశపెట్టే భాగ్యాన్ని మాకు కల్పించాల్సిందే’’ అని కూటమి మిత్రుడు చంద్రబాబు నాయుడు పట్టుబట్టారు. ఆయనతో పాటుగా మిగతా కూటమి ముఖ్యమంత్రులు– మేఘాలయ నుంచి కాన్రాడ్ సంగ్మా, నాగాలాండ్ నుంచి నీఫియు రియో, పుదుచ్చేరి నుంచి రంగస్వామి, సిక్కిం నుంచి ప్రేమ్ సింగ్ తమాంగ్– వారి వారి రాష్ట్రాల పూలగుత్తులు, ప్రతిపత్తులు, ప్రభుభక్తులతో ఢిల్లీకి రాబోతున్నారు! ఆ రోజు నేను, ఏ మాత్రం నా గురించి కాక, నెహ్రూజీ గురించి మాత్రమే ప్రసంగించటం సభా మర్యాద.ఇదే మర్యాదను నేను 2015లో బ్రిటిష్ పార్లమెంటులో ప్రసంగిస్తున్నప్పుడు పాటించాను. భారతదేశానికీ, బ్రిటన్‌కూ మధ్య మేధో వారథిగా నిలిచిన నెహ్రూను మనసారా స్మరించాను. ఆయన రాజకీయాలతో నేను ఏకీభవించక పోవచ్చు, కానీ రాజకీయాలకు అతీతంగా ఆయన్ని నేను గౌరవిస్తాను. పండిట్జీ నుంచి మన్మోహన్సింగ్ వరకు ప్రతి ప్రధానీ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేసినవారే. రెండుసార్లు, రెండు 13 రోజులపాటు మాత్రమే ప్రధానిగా ఉన్న గుల్జారీలాల్ నందా కూడా ఆ కృషిలో ముఖ్య భాగం కలిగివున్నవారే. ఈ రోజు నేనున్న స్థానం, రేపు నేను చేరుకోబోతున్న సంఖ్య... గతాన్ని వెనక్కు నెట్టేసేవి కాదు, భారతదేశ భవిష్యత్తుకు బలమైన పునాదిని వేసేవి. పరుగుల కన్నా ప్రవాహం ముఖ్యం. ఆ, కాల ప్రవాహంలో నేనొక కార్యకర్తను. 4399 అనేది నా బ్యాడ్జి నంబర్. అంతే! -
అపచారం... దైవద్రోహం
‘ధర్మో రక్షతి రక్షిత:’ అనే వేదోక్తి ప్రకారం, మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని సర్వకాలాలా కాపాడుతుంది. అయితే, గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల భూములు, పవిత్ర ప్రసాదాలు, వైదిక సంప్రదాయాల నిర్వ హణపై జరుగుతున్న పరిణామాలు, వివాదాలు కోట్లమంది హైందవ భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నాయి. రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలో దాదాపు 4 లక్షల ఎకరాల ఆలయ భూములు విస్తరించి ఉన్నాయి. దురదృష్టవశాత్తూ ఒక లక్ష ఎకరాల నుండి మాత్రమే దేవునికి నియమిత ఆదాయం లభిస్తోంది. మిగిలిన భూముల్లో సుమారు 87,000 ఎకరాలు ఆక్రమణల పాల య్యాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇలాంటి గడ్డుకాలంలో, కూటమి ప్రభుత్వం పారదర్శకమైన బహిరంగ వేలం నిర్వహించ కుండా, విలువైన దేవాలయ భూములను 33 ఏళ్ల సుదీర్ఘ కాలానికి నామమాత్రపు అద్దెకు ప్రైవేటు సంస్థలకు, తమ తాబేదారులకు లీజుకు ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఇది దైవద్రోహం కాదా? గత 2014–19 టీడీపీ హయాంలోనూ సదావర్తి సత్రం భూములను ఇదే రీతిన అప్పగించే ప్రయత్నం చేయగా, అప్పట్లో న్యాయస్థానం జోక్యంతో అది ఆగింది.సంస్కృతికి ద్రోహం – గోసంరక్షణ వైఫల్యంహైందవ ధర్మంలో గోమాత అత్యంత పవిత్రమైనది. కానీ ప్రస్తుత పాలనలో గోసంరక్షణ పూర్తిగా అటకెక్కింది. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ గోవధ శాలలు విచ్చలవిడిగా పెరిగిపోవడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. 2025 నవంబరులో విజయవాడలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గోపూజలు నిర్వహించి దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. అయినా దున్నపోతుపై వర్షం కురిసిన చందాన ప్రభుత్వం వ్యవహరిస్తోంది.మరోవైపు, తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో వంద లాది ఆవులు రోగాల బారిన పడి మృత్యువాత పడటం కలకలం రేపింది. టీటీడీ ఈవో 43 ఆవులు చనిపోయాయని చెబితే, చైర్మన్ 22 అని, ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు ‘చావులే లేవు’ అని ప్రకటించడం భక్తులను పక్కదారి పట్టించడమే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో శ్రీవారి కైంకర్యాలకు, అభిషేకాలకు స్థానిక గోశాలల నుండి రోజుకు 1,700 లీటర్ల స్వచ్ఛమైన పాలు తిరుమలకు వెళ్లేవి. ప్రస్తుత పాలనలో కనీసం 500 లీటర్ల పాలు కూడా రావడం లేదన్నది సత్యం.2024 ద్వితీయార్ధంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడారంటూ, చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువు లను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఎలాంటి పూర్తిస్థాయి దర్యాప్తు, స్వతంత్ర సంస్థల నివేదికలు రాకముందే, కేవలం రాజకీయ లబ్ధి కోసం శ్రీవారి ప్రసాదంపై అపవిత్రమైన అసత్య ప్రచారాలు చేశారు.లబ్ధి కోసం నీచ రాజకీయాలుమరింత హేయమైన అంశం ఏంటంటే – గ్రామీణ ప్రాంతా లలో పురాతన దేవాలయాల పునరుద్ధరణ, ధర్మ ప్రచారం, భజన మందిరాల స్థాపన అనే ఉన్నత ఆశయంతో జగన్ ప్రభుత్వం ‘శ్రీవాణి’ పథకాన్ని ప్రారంభించింది. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీటీడీ నూతన చైర్మన్ బి.ఆర్. నాయుడు ఈ పథకాన్ని ఒక ‘క్లాసికల్ ఫ్రాడ్’ (పెద్ద స్కామ్) అని అభివర్ణిస్తూ, దీనిని రద్దు చేస్తామని ప్రకటించారు. ఆశ్చర్యకరంగా, ఆ మాటలు కేవలం రాజకీయ వేదికలకే పరిమితమయ్యాయి.ప్రస్తుతం అదే శ్రీవాణి పథకాన్ని రద్దు చేయకపోగా, మరింత విస్తరిస్తున్నారు. రద్దు చేస్తామన్న పథకాన్ని కొనసాగించడం వెనుక ఉద్దేశం, పారదర్శక తను పక్కనబెట్టి దళారీ వ్యవస్థకు పెద్దపీట వేయడమే. శ్రీవాణి టికెట్లు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల జారీలో జరుగుతున్న అక్రమాలకు అంతులేకుండా పోయింది. సామాన్య భక్తునికి సమాన హక్కులతో కూడిన దైవ దర్శనం కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది.శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ఆచార్య రాణి సదాశివమూర్తిని నిబంధనలకు విరుద్ధంగా పదవి నుండి తొల గించడానికి పాలకమండలి తీర్మానం చేయడం హేయమైన అంశం. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన 700 ‘వేద పారాయణదార్ల’ (శ్రీవారి వేద పారాయణ పథకం) పోస్టుల భర్తీలో స్థానిక వేదపండితులను కాదని, నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాల వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు.భద్రతా లోపాలు – ఆలయాల కూల్చివేతలుఅలాగే, తిరుమలలోని పరకామణి (కానుకల లెక్కింపు) విభా గంలో గతంలో రోబోటిక్ టెక్నాలజీని ప్రవేశపెట్టి దొంగతనాలను అరికట్టగా, ఇప్పుడు పాత విషయాలను రాజకీయం చేస్తూ ఆలయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారు. ఇటీవల జరిగిన చెన్నై పరకామణి అక్రమంపైగానీ, తిరుమల పరకామణి చోరీపైగానీ... ఇటు తితిదే, అటు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. మరోవైపు, తెలుగుసంస్కృతికి వెన్నెముకలైన హరికథ, కూచిపూడి వంటి సాంప్రదాయ కళారూపాల విభాగాలను మూసివేయడం తితిదే విద్యా వ్యవస్థకే తీరని కళంకం.గత రెండేళ్ల కాలంలో వివిధ ప్రముఖ ఆలయాలలో జరిగిన ప్రమాదాలు భక్తుల భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తు న్నాయి: తిరుపతిలో వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు జరిగిన ఘోరమైన తొక్కిసలాటలో 6 గురు భక్తులు మృతి చెందారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ముఖ్యమంత్రివర్యులు గతంలో గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో కనీసం మొసలి కన్నీరైనా కార్చారు. కానీ ఇక్కడ, భక్తుల అత్యుత్సాహమే దానికి కారణమని చర్చ లేవదీశారు. అసలు బాధ్యులపై చర్యలు చేపట్టకపోవడం ఘోరమైన తప్పిదం.సింహాచలం అప్పన్న కొండపై రక్షణ గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టి నంత ఆవేదన కూడా కలగలేదు. శ్రీకూర్మం ఆలయంలో విష్ణు అవ తారంగా భావించే పవిత్ర నక్షత్ర తాబేళ్లు చనిపోతే, కనీసం పోస్ట్ మార్టం కూడా లేకుండా దహనం చేశారు. కాశీబుగ్గలో 9 మంది భక్తులు మరణిస్తే ప్రభుత్వం ఏమాత్రం చలించలేదు. వీటికి తోడు, కడపలో కాశీ నాయన జ్యోతి క్షేత్రం గోశాలను, అన్నదాన సత్రాలను అటవీ శాఖ బుల్డోజర్లతో కూల్చివేయడం, నెల్లూరు, నరసరావు పేటలో రోడ్డు విస్తరణ పేరుతో ఆలయ నిర్మాణాలను తొలగించడం ఎంతటి అమానుషం!జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పీఠాధిపతుల సదస్సును వైభవంగా నిర్వహించి, వారిచ్చిన సూచనలతో తిరుమలపై అన్య మతస్థులు హిందూమతం స్వీకరించటానికి ఓ వేదిక ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ప్రభుత్వాలు మారవచ్చు, పాలకులు మారవచ్చు... కానీ శాశ్వతమైన ధర్మసూత్రం ఎప్పటికీ చెరిగిపోదు. భగవంతుని ఆస్తులను, భక్తుల నమ్మకాన్ని సంపూర్ణంగా కాపాడ టమే నిజమైన రాజధర్మం. కానీ ఆలయాల పవిత్రతను, భక్తుల విశ్వాసాన్ని వ్యాపార వస్తువులుగా మార్చి, భగవంతుని సంపదను ధార్మిక కార్యాలకు ఉపయోగించకుండా, స్వార్థ రాజకీయాలకు వనరుగా మార్చిన ఘనత చంద్రబాబుది. అయితే మోసం అనే దట్టమైన చీకటి మేఘాలు ఎంతగా కమ్మేసినా, సత్యం అనే సూర్య కాంతి చివరికి వాటిని ఛేదించుకుని వెలుగులోకి రావడం ఖాయం.-వ్యాసకర్త టీటీడీ పూర్వ అధ్యక్షులు-భూమన కరుణాకర రెడ్డి -
'వివాదాలు వీడి' వాణిజ్యం వైపు!
వందకు పైగా పారిశ్రామిక వేత్తలు, వ్యాపార దిగ్గజాలతో కూడిన బృందంతో భారత వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ గత వారం కెనడా పర్యటించటం ఇరు దేశాల సంబంధాలలో కీలక మలు పును సూచిస్తోంది. మార్క్ కార్నీ కెనడా ప్రధానిగా పగ్గాలు చేపట్టే సమయానికి భారత్–కెనడా సంబంధాలు అధఃపాతా ళంలో ఉన్నాయి. ఖలిస్తానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఉదంతంలో రెండు దేశాలూ పరస్పరం దౌత్య సిబ్బందిని పెద్ద మొత్తంలో బహిష్కరించాయి. ఖలిస్తాన్ వివాదం, దౌత్య స్పర్థల్ని నాటి ప్రధాని ట్రూడో తన స్థానిక రాజకీయ చదరంగంలో పావుల్లా వాడుకోవటానికి ప్రయత్నించారు. భారత సంతతికి చెందిన 18 లక్షల కెనడియన్ల ఓట్లకు గాలం వేయటానికి ట్రూడో భారత్–కెనడా సంబంధాలను ఫణంగా పెట్టారు. కెనడా పార్లమెంటులో బహిరంగంగా నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ హస్తమున్నదని (అండర్ కవర్ ఆపరేషన్) ఆరోపించారు. సంబంధాలలో సరికొత్త అధ్యాయంమార్క్ కార్నీ ప్రధాని కాగానే భారత్‌తో సంబంధాలను పునరు ద్ధరించటంపై దృష్టి పెట్టారు. 2023 అక్టోబర్‌లో దౌత్యవేత్తల బహి ష్కరణ తర్వాత 2025 సెప్టెంబర్‌లో తిరిగి హైకమిషనర్లను పునర్ని యమించారు. అదే నెలలో ఇరు దేశాల భద్రతా సలహాదార్లు సమా వేశమయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరులో కార్నీ నాలుగు రోజులపాటు భారత్‌లో పర్యటించటంతో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. 2010 నుండి పదహారేళ్లుగా నత్తనడక నడుస్తున్న భారత్–కెనడా వాణిజ్య చర్చలను పరుగులు పెట్టించి 2026 సంవత్సరాంతానికి ‘కాంప్రహెన్సివ్ ఎకనమిక్ అండ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్’ (సీఈపీఏ)ను ఖాయం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మూడింతలు చేసి 50 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకు వెళ్లాలని నిశ్చయించారు.భారత్–కెనడా వాణిజ్యం కేవలం కొన్ని వస్తువులు, సేవలకే పరిమితమై ఉంది. కెనడా నుండి మనం పప్పుధాన్యాలు, చమురు, గ్యాస్, బొగ్గు, కలప, కాగితం, ఎరువులు, వైమానిక పరికరాలను దిగుమతి చేసుకుంటున్నాం. కెనడాకు భారత్ విలువైన రాళ్లు, ఫార్మా స్యూటికల్స్, వస్త్రాలు, రసాయనాలను ఎగుమతి చేస్తోంది. నిజానికి ఈ వాణిజ్యాన్ని విస్తరించటానికి అవకాశాలు ఉన్నాయి. భారత్ 2070 కల్లా నెట్–జీరో కార్బన్ లక్ష్యాన్ని సాధించాలంటే అణు విద్యుచ్ఛక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని వేగంగా విస్తరింపజేయాలి. 2047 కల్లా 100 గిగావాట్ల అణు విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి కనీసం సాలీనా 5 వేల టన్నుల యురేనియం అవసరమవుతుంది. మన దేశంలో సాలీనా 600 టన్నుల యురేనియంను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. భారత్‌లో ఉన్న 24 అణు రియాక్టర్లలో 14 యురేనియం కొరత వలన సామర్థ్యం కంటే దిగువన పని చేస్తున్నాయి. చైనాకు ప్రత్నామ్నాయంగా కెనడాకెనడా, ప్రపంచంలో రెండవ అతి పెద్ద యురేనియం ఉత్పత్తి దారు. అత్యంత నాణ్యమైన యురేనియం సిగార్ సరస్సు, మెక్– ఆర్థర్ నదీ పరివాహకాలలో ఉత్పత్తి అవుతున్నది. ప్రపంచ మార్కె ట్లలో లభించే ఆస్ట్రేలియా, కజకిస్తాన్ యురేనియంతో పోల్చితే కెనడా యురేనియం నాణ్యమైనది, చౌకగా లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే 2020లో కాలం చెల్లిన 2015 ఒప్పందం స్థానంలో భారత్– కెనడాల మధ్య 2.5 బిలియన్ డాలర్ల విలువైన యురేనియం ఒప్పందంపై కార్నీ భారత పర్యటనలో అంగీకారం కుదిరింది.యుద్ధ విమానాలు, క్షిపణులు, అంతరిక్ష వాహక నౌకలు, ఏఐ, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ రంగాలకు కీలకమైన 24 రకాల అరుద యిన ఖనిజాల విషయంలో భారత్ దాదాపుగా చైనా దిగుమతులపై ఆధారపడుతున్నది. లాంథనం, సెరియం, నియోడిమియం, సమారియమ్, టెర్బియం, డిస్ప్రోజియం, లిథియం తదితర అరుదైన ఖనిజాలు కేరళ, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సముద్రతీర మోనజైట్ ఇసుక లలో లభిస్తాయి. కానీ మోనజైట్‌ను శుద్ధి చేసి ఆ ఖనిజాలను వేరు చేసే సామర్థ్యం భారత్‌కు లేదు. ముడి మోనజైట్‌ను చైనాకు ఎగుమతి చేసి, శుద్ధి చేసి, వేరుపరిచిన ఖనిజాలతో తయారయిన మాగ్నెట్లను, బ్యాటరీలను చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. అరుదైన ఖనిజాల శుద్ధి, మాగ్నెట్లు / బ్యాటరీల తయారీ వ్యవస్థ కెనడా వద్ద ఉన్నప్పుడు చైనాపై ఆధారపడటం వ్యూహాత్మక తప్పిదం. ఈ నేపథ్యంలోనే అరుదైన ఖనిజాల శుద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, మాగ్నెట్ల తయారీకి కెనడాతో అంగీకారం కుదిరింది. ఈ సంవత్సరాంతానికి కెనడా కంపెనీల భాగస్వామ్యంతో కనీసం అయిదు ప్రాజెక్టులను ఈ రంగంలో ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. కెనడాలోని మొత్తం విదేశీ విద్యార్థులలో భారత్ వాటా 40 శాతం. సుమారు 4.27 లక్షలమంది భారతీయులు కెనడాలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి ఏడాది 15 బిలియన్ డాలర్లను కెనడాకు చెల్లిస్తున్నారు. 21 కెనడా యూనివర్సిటీల అధిపతులు కార్నీ వెంట భారత్‌కు వచ్చారు. భారత్‌లో కెనడియన్ యూనివర్సిటీల క్యాంపస్‌ల ఏర్పాటుకు, భారత్–కెనడా యూనివర్సిటీల ఉమ్మడి కోర్సుల నిర్వహణకు, విద్యార్థుల మారకానికి, ఏఐ గ్రీన్ హైడ్రోజన్ క్వాంటమ్ మెకానిక్స్ వంటి రంగాలలో ఉమ్మడి పరిశోధనలకు 200కు పైగా ఒప్పందాలు జరిగాయి.సుంకాల రద్దుకు సమాలోచనలుఆర్కిటిక్, పసిఫిక్ తీరాలు కలిగి ఉన్న కెనడాలో రక్షణ–భద్రత రంగాలలో కూడా భారత్ సంబంధాలు పటిష్టం చేసుకోవటానికి ఒప్పందం జరిగింది. రానున్న దశాబ్దాలలో ఇండో–పసిఫిక్, ఆర్కి టిక్ జలాలు ప్రపంచ రాజకీయాలను శాసిస్తాయి. అందుకే నౌకా నిర్మాణం, సబ్మెరైన్లు, సముద్ర జలాలలో నిఘా వంటి అంశాలలో ఉమ్మడి భాగస్వామ్యంలో ప్రాజెక్టులను ప్రారంభించటానికి శ్రీకారం చుట్టారు. భారత ఆర్థిక సేవల రంగంలో కెనడియన్ పెన్షన్ ఫండ్ల పెట్టుబడులు కీలకం. 140 బిలియన్ కెనడియన్ డాలర్లను భారత దేశపు ఎనర్జీ, ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్, ఈక్విటీ, బాండ్ సెక్యూరిటీలలో కెనడా పెట్టుబడిగా పెట్టింది. స్వేచ్ఛా వాణిజ్యంలో భాగంగా ఇరువైపులా సుంకాలను పూర్తిగా రద్దు చేయాలని కూడా భావిస్తున్నారు. కానీ భారత్‌కు ముఖ్యంగా వ్యవసాయోత్పత్తుల దిగుమతులపై ఇబ్బందులున్నాయి. ప్రస్తుతం కెనడా పప్పుధాన్యాలు, నూనెల దిగుమతులపై 15–30 శాతం సుంకాన్ని విధిస్తున్నాం. వ్యవసాయ దిగుమతులపై సుంకాలను పూర్తిగా ఎత్తివేస్తే మన రైతులు, వ్యవ సాయంపై ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సీఈపీఏ ఒప్పందం ఖాయం చేయాలంటే సుంకాలతోపాటు అనేక ఇతర సంక్లిష్ట అంశాలలో ఒప్పందం కుదరాల్సి ఉంటుంది. ముఖ్యంగా సేవలు, పెట్టుబడుల రక్షణ, వివాదాల పరిష్కారం, మేధోహక్కుల పరిరక్షణ, కార్మిక, పర్యావరణ ప్రమాణాలు వంటి విషయాలలో మన దేశం రాజీ పడలేదు. కొత్త భాగస్వాముల వేటలో ఉన్న కెనడాతో పటిష్ట సంబంధాలు ఏర్పరచుకోవటంఉభయ తారకం.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
బీబీఏ కంటే పునాది ముఖ్యం: ఐఐఎమ్ బెంగళూరు పాఠం
భారతదేశంలో బిజినెస్ – మేనేజ్మెంట్ విద్యలో అగ్రస్థానంలో ఉన్న ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్– బెంగళూరు’ (ఐఐఎమ్–బెంగళూరు) అండర్గ్రాడ్యుయేట్ స్థాయిలోకి అడుగు పెడుతూ... ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ ఉన్న ‘బీబీఏ’ను కాకుండా, ఎకనామిక్స్, డేటా సైన్స్ విభాగాల్లో బీఎస్సీ ప్రోగ్రామ్‌లను ప్రారంభించింది. మరోవైపు ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు రకరకాల స్పెషలైజేషన్లతో బీబీఏ కోర్సులను వేగంగా విస్తరిస్తున్నాయి. ఐఐఎమ్–బెంగళూరు తీసుకున్న ఈ నిర్ణయాన్ని సాధారణంగా తీసుకోకూడదు. మేనేజ్మెంట్ విద్య అంటే కేవలం ‘బిజినెస్’ అనే బ్రాండ్ పేరు కాదనీ; బలమైన పునాదులు, విశ్లేషణాత్మక ఆలోచన, గణిత నైపుణ్యం, డేటాను అర్థం చేసుకునే సామర్థ్యం అంతకంటే ముఖ్యమనీ అది నిరూపిస్తోంది.గత పదేళ్లుగా దేశంలో బీబీఏ కోర్సులు విపరీతంగా పెరిగాయి. ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏఐఎస్హెచ్ఈ) ప్రకారం... 2015–16లో 3.49 లక్షలుగా ఉన్న బీబీఏ అడ్మిషన్లు, 2021–22 నాటికి 6.64 లక్షలకు (దాదాపు 90 శాతం) పెరిగాయి. డిజిటల్ మార్కెటింగ్, ఫిన్ టెక్, బిజినెస్ అనలిటిక్స్ వంటి ఆకర్షణీ యమైన పేర్లతో ప్రైవేట్ వర్సిటీలు వీటిని విద్యా కార్యక్రమాల కంటే ఒక ‘వ్యాపార నమూనా’గా మార్కెట్ చేస్తున్నాయి. ‘ఎంబీఏ కోసం ఎందుకు ఎదురుచూడాలి? ఇంటర్ తర్వాతే మేనేజ్మెంట్ చదవండి’ అంటూ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ అకడమిక్ నాణ్యత కంటే ‘కోర్స్ ప్యాకేజింగ్’ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు.ఐఐఎమ్‌లలో ఇంజినీర్ల ఆధిపత్యం: కారణాలేంటి?నిజంగా మేనేజ్మెంట్ కెరీర్‌కు బీబీఏనే సహజ మార్గమైతే, దేశంలోని టాప్ ఎంబీఏ సంస్థల్లో బీబీఏ గ్రాడ్యుయేట్లు ఎందుకు ఎక్కువగా కనిపించడం లేదు? ఐఐఎమ్–అహ్మదాబాద్ రీసెంట్ బ్యాచ్‌లో దాదాపు 38%, ఐఐఎమ్–కలకత్తాలో 43%, ఐఐఎమ్– బెంగళూరులో 70% కంటే ఎక్కువ మంది ఐఐటీ, ఎన్ఐటీ వంటి ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారే. ఐఐఎమ్ విశాఖపట్నం, తిరుచిరాపల్లి వంటి కొత్త సంస్థల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది.దీనికి కారణం ఉంది. ఉద్యోగదాతలు కేవలం మేనేజ్మెంట్ పరిభాష తెలిసినవారి కంటే... నిర్దిష్ట సబ్జెక్టుపై పట్టు ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తారు. ఎంబీఏ చేసిన ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రొడక్ట్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్, టెక్నాలజీ కన్సల్టింగ్ వంటి రంగాల్లోకి వెళ్లగలరు. ఎకనామిక్స్ పట్టభద్రులు ఫైనాన్స్, కన్సల్టింగ్, అనలిటిక్స్ రంగాల్లోకి వెళ్తారు. కామర్స్ గ్రాడ్యుయేట్ అకౌంటింగ్, ట్యాక్సేషన్, ఫైనాన్స్ వ్యవస్థలపై బలమైన అవగాహన తెచ్చుకుంటాడు. అంటే ఇంజినీరింగ్, ఎకనామిక్స్ లేదా కామర్స్ వంటి ఒక బలమైన డిసిప్లిన్‌లో పునాది ఏర్పడిన తర్వాత ఎంబీఏ జోడిస్తే విద్యార్థికి ప్రత్యేక నైపుణ్యం వస్తుంది. కానీ యూజీ, పీజీ రెండింటిలోనూ అదే మేనేజ్మెంట్ చదివితే వచ్చే అదనపు ప్రయోజనం శూన్యం.చదవండి: భారత్‌పై చైనా దొంగ దెబ్బచాలా బీబీఏ కోర్సుల్లో విశ్లేషణాత్మక లోతు, పరిశ్రమలకు కావలసిన టెక్నికల్ స్కిల్స్ ఉండటం లేదు. ఫలితంగా ఉద్యోగ మార్కెట్లో ఇబ్బందులు ఎదురై, ఎంబీఏ చేయడం ఐచ్ఛికం కాక తప్పనిసరిగా మారుతోంది. భారతదేశానికి ఇప్పుడు ‘లగ్జరీ బ్రాండ్ మేనేజ్మెంట్’ లాంటి ఆకర్షణీయమైన చదువుల కంటే... విమర్శనాత్మకంగా ఆలోచించగల, సంఖ్యలతో పని చేయగల, లోతైన అవగాహన ఉన్న యువత అవసరం. అందుకే మేనేజ్మెంట్ విద్యను మాత్రమే కెరీర్‌గా ఎంచుకోవా లనుకునే విద్యార్థులు ఐఐఎమ్‌లు నిర్వహించే ‘ఐపీమ్యాట్’ ద్వారా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లను పరిశీలించవచ్చు. అంతేకానీ, కొత్త ప్రైవేట్ వర్సిటీలు బ్రాండింగ్‌తో అమ్ముతున్న బీబీఏ కోర్సుల్లో చేరే ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం శ్రేయస్కరం.– వెంకట్ కోట పీహెచ్డీ స్కాలర్, బిట్స్ పిలాని, హైదరాబాద్ -
హనీమూన్ ముగిసి సవాళ్ల దశలోకి!
ప్రపంచవ్యాప్తంగా పరిశీలకులు ప్రస్తుతం మూడు ప్రభుత్వాల పనితీరును ప్రత్యేకంగా గమనిస్తున్నారు. అవి శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్. ఇవి వేర్వేరు స్వతంత్ర దేశాలు కాగా, ఇపుడు అకస్మాత్తుగా వారి దృష్టిని తమిళనాడు ఆకర్షిస్తున్నది. ఈ జాబితాలోకి అనూహ్యంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కూడా వచ్చి చేరింది. పరిశీల కుల దృష్టిలో ఇటువంటి జాబితా ఒకటి తయారు కావటానికి కారణం, ఈ పరిణామాలన్నింటి వెనుక యువతరం ఆగ్రహం ఒక అంతస్సూత్రంగా కనిపిస్తుండటం; ఇదంతా ఆసియాలో జరుగుతుండటం.నేషనల్ ఛార్టర్– ఒక ప్రత్యేకతబంగ్లాదేశ్లో ఈ సంవత్సరం ఫిబ్రవరి 17న అధికారానికి వచ్చిన తారిఖ్ రహమాన్ ప్రభుత్వానికి 100 రోజులు పూర్తయ్యాయి. ఆయన నాయకత్వాన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధికారానికి వచ్చిన పరిస్థితులు తెలిసినవే. షేక్ హసీనా ప్రధానిగా 17 సంవత్సరాల పాటు సాగిన అవామీ లీగ్ పాలనను తీవ్రంగా వ్యతిరేకించిన యువతరం ఉద్యమంతో ఆ ప్రభుత్వం పతనమైంది. కొంతకాలం మధ్యంతర ప్రభుత్వ పాలన అనంతరం జరిగిన ఎన్నికలలో బీఎన్పీ మూడింట రెండు వంతుల ఆధిక్యతతో విజయం సాధించింది. ప్రతిపక్ష జమాతే ఇస్లామీ, నేషనల్ సిటిజన్ పార్టీ తాము పరిపాలనలో ప్రభుత్వానికి సహకరించగలమనీ,కొంత కాలంపాటు అయినదానికి కానిదానికి ఆందోళనలు చేయబో మనీ ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి.ఇదిగాక గమనించవలసిన విషయం, అధికార పక్షానికి తన సొంత మేనిఫెస్టో ఒకటిగాక, అన్ని పార్టీల ఆమోదంతో ‘నేషనల్ ఛార్టర్’ పేరిట పరిపాలనా సంస్కరణల కార్యక్రమం ఒకటి కూడా ఎన్నికలకు ముందే రూపు తీసుకుంది. ఎన్నికలతో పాటే దానిపై రెఫరెండం జరగగా అందుకు ప్రజామోదం లభించింది. ఇటువంటి ఛార్టర్, అందుకు రెఫరెండం అన్నది ప్రజాస్వామ్య వ్యవస్థలలో మరెక్కడా జరిగినట్లు లేదు. ప్రపంచవ్యాప్తంగా పరిశీలకులు బంగ్లా దేశ్‌ను గమనించటానికి ఇవన్నీ కారణమవుతున్నాయి.మాట నిలబెట్టుకుంటారా?పదిహేడు సంవత్సరాల అస్తవ్యస్త పాలన తర్వాత కొత్త ప్రభు త్వపు పనితీరును అంచనా వేసేందుకు కేవలం వంద రోజుల వ్యవధి నిజానికి సరైనది కాదు. ఆ పరిమితిని దృష్టిలో ఉంచుకుంటూనే అసలు ఈ కాలంలో జరిగిందేమిటనేది చూడవచ్చు. మాజీ ప్రధాని బేగం ఖలేదా జియా కుమారుడైన తారిఖ్ రహమాన్ గత చరిత్ర గొప్పదేమీ కానందున, ఆయన దీర్ఘకాలపు ప్రవాస జీవితం నుంచి ఎన్నికలకు కొద్దికాలం ముందు స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు, తానిప్పుడు మారిన మనిషినని ప్రకటించారు. ఇప్పుడు మే 27కు హనీమూన్ కాలం ముగిసేవరకు ఆయన తన మాట ప్రకారమే వ్యవహరిస్తూ రావటాన్ని ప్రజలు, ప్రతిపక్షాలు కూడా గుర్తించినట్లు కనిపిస్తున్నది. ఆ విధంగా మొదట పాలకునిపై వ్యక్తిగత స్థాయిలో నమ్మకం ఏర్పడితే, హనీమూన్ కాలంలో ఏమి జరిగినా జరగకున్నా రాగల రోజులపై ఆశాభావం కలుగుతుంది.పరిపాలనకు వస్తే, యథాతథంగానే వెనుకబడినది అయిన బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా సుదీర్ఘ పాలనలో అవినీతి వల్ల సమస్యలు మరింత పెరిగాయి. కనుక, కొత్త ప్రభుత్వం నిజాయితీగా, శ్రద్ధగా పనిచేసినా పరిస్థితులు కుదుట పడేందుకు చాలా సమయమే తీసు కుంటుంది. అదట్లుండగా, ఇపుడు మూడు నెలలుగా కొనసాగు తున్న ఇరాన్ యుద్ధం సృష్టించిన చమురు, గ్యాస్ సమస్యలు పిడుగు వలె వచ్చి పడ్డాయి. వారి ఇంధన అవసరాలలో 62 శాతం దిగుమ తుల ద్వారా తీరవలసినవే. ఈ స్థితి వల్ల కొత్త ప్రభుత్వం మరింత సతమతమవుతున్నది. ఇది మొత్తం మీద గల స్థూల పరిస్థితి కాగా, తారిఖ్ రహమాన్ ప్రభుత్వం వీటిని సాకుగా చూపకుండా అభివృద్ధి, సంక్షేమాలకు సంబంధించి కొన్ని చర్యలు తీసుకోవటం గురించి చెప్పాలి. ఆ పనులు చేసే ముందు ఆయన స్వయంగా ప్రతిపక్ష నాయకుల నివాసాలకు వెళ్లి సంప్రదింపులు జరిపారు. పరిపాలన విషయంలో ప్రజలకు తక్షణం అనుభవంలోకి వచ్చేది సంక్షేమ చర్యలన్నది తెలిసిందే. ఆ ప్రకారం పేదలకు, రైతులకు ఆహార సహాయంగా నెలకు 2,500 బంగ్లాదేశ్ టాకాల (ఒక రూపాయి 1.29 టాకాలకు సమానం) విలువ చేసే కార్డులు జారీ చేశారు. రైతులు, మత్స్యకారులు, పాడి పెంపకందారులకు పదివేల టాకాల వరకూ రుణమాఫీ జరిపారు. పేదలందరికీ వైద్య చికిత్సల కార్డులు పంపిణీ చేశారు. స్కూలు పిల్లలకు యూనిఫారాల సరఫరా జరిగింది.ఉలికిపాటు ఉప్పెనఇటువంటివి సంక్షేమాలు, ఉపశమన చర్యలు కాగా, దీర్ఘకాలిక అభివృద్ధి కోసం దేశమంతటా సాగునీటి కాల్వల పునరుద్ధరణను ప్రారంభించారు. బంగ్లాదేశ్‌లో వరి ఉత్పత్తి తగినంత ఉన్నా, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవలసిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంతోపాటు దేశమంతటా చెట్ల పెంపకంవల్ల గ్రామీణు లకు ఉపాధికల్పన జరుగుతుందన్నది ఆలోచన. యువకుల ఉపా ధికి పరిశ్రమలు, వాణిజ్యం తప్పనిసరి గనుక చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, మౌలిక సదుపాయాల నిర్మాణం, ఎగుమతి రంగాల విస్తరణ, కొత్త పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరొక వైపు, కొన్ని అంశాలకు సంబంధించి విమర్శలు కూడా వినవస్తు న్నాయి. వాటిలో ముఖ్యమైనవి శాంతిభద్రతలు, అదే విధంగా వేర్వేరు రంగాల సంస్కరణల కోసం రూపొందించిన జాతీయ ఛార్టర్ అంశాలను ఇంతవరకు పార్లమెంట్లో ధ్రువీకరించటంపై గానీ, అమలు పరచటంపైగానీ తగు చర్యలు తీసుకోకపోవటం.రాగల రోజులలో వీటితోపాటు, భారతదేశంతో సంబంధాల మెరుగుదల బీఎన్పీ ప్రభుత్వానికి సవాళ్లు కానున్నాయి. ప్రధాని రహమాన్ అధికారానికి వచ్చినప్పుడు, ఆ పని తప్పక చేయగల మనీ, అందుకు పరస్పర ప్రయోజనాలు, గౌరవాలు ఆధారం కావా లనీ, అదే ప్రాతిపదికపై సమస్యలను పరిష్కరించుకోగలమనీ అన్నారు. కానీ ఈ వంద రోజులలో ఆ దిశగా అడుగులు పడలేదు. ఇందుకు రెండు వైపుల నుంచి చొరవ అవసరం. నదీ జలాలు, సరిహద్దుల గుర్తింపు, వలసలు, షేక్ హసీనా అప్పగింత వంటివి తేలిక వివాదాలు కావు.మళ్లీ మొదటికి వస్తే, బంగ్లాదేశ్‌తోపాటు శ్రీలంక, నేపాల్ ప్రభుత్వాల పనితీరుపై, అవి ఇంతకుముందటి ప్రభుత్వాల కన్న ఎంత భిన్నంగా ఉండగలవన్న దానిపై, ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది. తమిళనాడులో విజయ్ గెలుపులోనూ వారు యువతరం తిరుగుబాటుతో కూడిన ఆకాంక్షల వెల్లువను చూస్తున్న సమయంలో, ‘కాక్రోచ్’ ఉప్పెన వారిని ఉలికిపాటుకు గురిచేసింది. ప్రధాని మోదీ ఇటీవలి అసెంబ్లీ విజయాలతో ఎదురులేకుండా పోయిందనుకుంటుండగా, యువతరం నుంచి ఈ అనూహ్యమైన భూకంపం వారిని పునరాలోచనలో పడవేసింది.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఆన్లైన్ ఆంక్షలతో అడవి బిడ్డల ఆవేదన
ఇటీవలి కాలంలో భారతదేశ ప్రజా పరిపాలనలో డిజిటల్ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తున్నది. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకతను పెంచడానికీ, అవినీతిని అరికట్టడానికీ, జవాబుదారీ తనాన్ని పెంపొందించడానికీ డిజిటల్ గవర్నెన్స్ ఒక ముఖ్యమైన సాధనంగా మారింది. ఇందులో భాగంగానే మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, జియో– ట్యాగింగ్, మొబైల్ యాప్‌లు, ఆన్లైన్ బయోమెట్రిక్ లేదా ముఖ గుర్తింపు హాజరు వ్యవస్థలు, కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతికతలను ప్రభుత్వాలు విస్తృతంగా అమలు చేస్తున్నాయి. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, అక్కడి సంక్షేమ పథకాల పర్యవేక్షణ కూడా ప్రస్తుతం ఈ డిజిటల్ వ్యవస్థల పరిధిలోకి వచ్చాయి. సాంకేతిక వెలివేతఆంధ్రప్రదేశ్లోని పాడేరు, చింతూరు, కె.ఆర్.పురం, శ్రీశైలం వంటి ప్రాంతాలలోని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లు ఇప్పుడు విద్య, వైద్యం, జీవనోపాధి కార్యక్రమాలు; ఇంకా మౌలిక సదుపాయాల పనులను పర్యవేక్షించడానికి పూర్తిగా మొబైల్ యాప్ లపైనే ఆధారపడుతున్నాయి. అయితే, ఈ సాంకేతిక పరిజ్ఞానం ఆచరణలో గిరిజన ప్రజల జీవితాలను సులభతరం చేయాల్సింది పోయి, వారిని వ్యవస్థ నుండి మరింత దూరం చేస్తున్నది. విధాన రూపకర్తల ఆలోచనలకూ, క్షేత్రస్థాయిలోని భౌగోళిక వాస్తవాలకూ మధ్య ఉన్న భారీ వ్యత్యాసం కారణంగా డిజిటల్ పరిపాలన గిరిజన సమాజాలలో ఒక కొత్త రకమైన సామాజిక వెలివేతకు దారి తీస్తున్నది.ఈ వెలివేతకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో (ప్రస్తుతం ‘వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్ –గ్రామీణ’) ప్రవేశపెట్టిన ‘ఫేస్ ఆథెంటి కేషన్’ (ముఖ గుర్తింపు ద్వారా హాజరు) విధానం ఒక ఉదాహరణ. క్షేత్రస్థాయిలో అవకతవకలను అరికట్టడానికి తెచ్చిన ఈ యాప్, గిరిజన కూలీలకు శాపంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని మారు మూల గిరిజన గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం సరిగ్గా లేదు. మొబైల్ నెట్వర్క్ సిగ్నల్స్ దొరక్కపోవడం, తరచూ విద్యుత్ నిలిచిపోవడం వంటి కారణాల వల్ల పని స్థలాల్లో ఈ యాప్ పనిచేయడం లేదు.దీనివల్ల రోజంతా కష్టపడి పనిచేసిన గిరిజన కార్మికులు తమ హాజరును సకాలంలో నమోదు చేసుకోలేకపోతున్నారు. నెట్వర్క్ సిగ్నల్ కోసం గంటల తరబడి వేచిచూడటం, కొన్నిసార్లు సిగ్నల్స్ కోసం ఎత్తయిన కొండలు ఎక్కడం వంటి వింత పరిస్థితులు నెల కొన్నాయి. సాంకేతిక లోపాల కారణంగా హాజరు నమోదు కాక పోతే, వారు చేసిన పనికి వేతనం లభించడం లేదు. రోజువారీ కూలీ పైనే ఆధారపడి బతికే పేద కుటుంబాలకు ఇది కేవలం సాంకేతిక ఇబ్బంది మాత్రమే కాదు, వారి ఆహార భద్రతను, జీవనాధారాన్ని దెబ్బతీసే తీవ్రమైన మానవీయ సమస్య.రియల్ టైమ్‌లో ఎలా?పట్టణ ప్రాంతాల మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించే డిజిటల్ నమూనాలను, ఎటువంటి వసతులు లేని అటవీ ప్రాంతాలపై రుద్దడం ప్రధాన లోపం. గిరిజన గ్రామాలు సాధారణంగా దట్టమైన అడవులు, లోతైన లోయలు, కొండ ప్రాంతాలలో ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ గ్రామాలకు రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోతాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ‘రియల్ టైమ్ డేటా’ (వెనువెంటనే సమాచారాన్ని పంపడం) ఆశించడం క్షేత్రస్థాయి వాస్తవాలకు పూర్తిగా విరుద్ధం. నెట్వర్క్ లేని కారణంగా ఆన్లైన్ నిర్ధారణలు, జియో–ట్యాగింగ్ వంటివి గిరిజన ప్రాంతాలలో అసాధ్యంగా మారు తున్నాయి. సాంకేతికత విఫలమైనప్పుడు ప్రత్యా మ్నాయంగా పాత కాగితాల ఆధారిత రికార్డులను అనుమతించకపోవడం వల్ల వ్యవస్థ మొత్తం స్థంభించిపోతున్నది.డిజిటల్ పరిపాలన విజయవంతం కావాలంటే సాంకేతికతతో పాటు శిక్షణ పొందిన సిబ్బంది అవసరం. కానీ గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ శాఖల్లో తీవ్రమైన సిబ్బంది కొరత ఉంది. ఉన్న కొద్దిమంది ఉపాధ్యాయులు, ఆరోగ్య కార్యకర్తలు, మండల స్థాయి అధికారులు కఠినమైన భౌగోళిక పరిస్థితుల మధ్య ఇప్పటికే అదనపు బాధ్యత లతో సతమతమవుతున్నారు. ప్రభుత్వ పోర్టల్స్, రిపోర్టింగ్ నమూనాలు తరచూ మారుతుండటం వల్ల క్షేత్రస్థాయి సిబ్బంది గందరగోళానికి గురవుతున్నారు. సాంకేతిక సమస్యల వల్ల ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. సరైన ఇంటర్నెట్ లేని కారణంగా సేకరిస్తున్న డేటా కూడా అసంపూర్ణంగా ఉంటున్నది. ఉన్న తాధికారులకు చేరే సమాచారంలో విశ్వసనీయత లోపించి, భవి ష్యత్తు ప్రణాళికల రూపకల్పనపై సరైన అవగాహన రావడం లేదు.కొత్తది కానప్పుడు పాతది!ఆధునిక పరిజ్ఞానం, సాంకేతికత మనిషి దైనందిన జీవనాన్ని సులభతరం చేయాలి. వారి సంక్షేమానికి సాధనంగా ఉండాలి తప్ప, అదే ఒక అవరోధంగా మారకూడదు. ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతా లలో డిజిటల్ పరిపాలన ఆశించిన ఫలితాలను ఇవ్వాలంటే కొన్ని తక్షణ చర్యలు అవసరం:సహేతుకమైన ప్రత్యామ్నాయాలు: ఇంటర్నెట్, నెట్వర్క్ లేని మారుమూల ‘షాడో ఏరియా’ గ్రామాలలో ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా డేటా సేకరించే సదుపాయం ఉండాలి లేదా పాత రికార్డుల పద్ధతిని అనుమతించాలి. మౌలిక వసతుల కల్పన: గిరిజన ప్రాంతాల్లో డిజి టల్ విప్లవం విజయవంతం కావాలంటే ముందుగా అక్కడ నిరంతర విద్యుత్ సరఫరా, మొబైల్ టవర్ల ఏర్పాటు వంటి ప్రాథమిక వసతులను మెరుగుపరచాలి. సరళీకృత వ్యవస్థలు: క్షేత్రస్థాయి కార్మి కులు, సిబ్బంది సులువుగా అర్థం చేసుకునేలా యాప్‌ల రూపకల్పన సరళంగా ఉండాలి. స్థానిక భాషలలో శిక్షణ ఇవ్వాలి. వికేంద్రీకరణ: గిరిజన ప్రాంతాల ప్రత్యేక భౌగోళిక పరిస్థితులను బట్టి స్థానిక ఐటీడీఏ అధికారులకు నిబంధనలను సవరించే స్వయంప్రతిపత్తిని కల్పించాలి.సాంకేతిక పరిజ్ఞానాన్ని అట్టడుగు వర్గాల ప్రయోజనాల కోసం ఉపయోగించినప్పుడే ప్రజాస్వామ్య పరిపాలనకు నిజమైన అర్థం చేకూరుతుంది. గిరిజన సంస్కృతి, జీవన విధానం, వారి భౌగోళిక పరిమితులను గౌరవిస్తూ సాగే సమతుల్య పరిపాలన మాత్రమే గిరిజన సమాజాల హక్కులను కాపాడగలదు.పి. వేణుగోపాల్ రెడ్డి వ్యాసకర్త ‘ఏకలవ్య ఫౌండేషన్’ వ్యవస్థాపకులు -
భారత్‌పై చైనా దొంగదెబ్బ
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు ఒక నిశ్శబ్దమైన, కానీ అత్యంత ప్రభావవంతమైన మార్పు జరుగుతోంది. ఒకప్పుడు చమురు నిల్వలు ప్రపంచ రాజ కీయాలను ప్రభావితం చేశాయి. తర్వాత సాంకేతికత, డిజిటల్ ఆధిపత్యం ప్రపంచ శక్తి సమీ కరణాలను మార్చాయి. ఇప్పుడు ఆ స్థానాన్ని అరుదైన ఖనిజాలు, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్ సరఫరా గొలుసులు ఆక్రమిస్తున్నాయి. ఈ కొత్త యుగంలో ఎవరైతే ముడి పదార్థాలు, వాటి శుద్ధీకరణ, ఉత్పత్తినియంత్రణను తమ చేతుల్లో ఉంచుకుంటారో వారే భవి ష్యత్తు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయ గలుగుతారు.ఇలాంటి సమయంలో చైనా తీసుకుంటున్న తాజా ఎగుమతి నియంత్రణ చర్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షి స్తున్నాయి. అమెరికా–చైనా వ్యూహాత్మక పోటీ తీవ్రమవు తున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడి చైనా పర్యటన ముగిసిన కొద్ది రోజులకే చైనా తన కీలక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, అరుదైన ఖనిజాలు, అధునాతన పరిశ్రమలకు అవసరమైన సరఫరాలపై నియంత్రణలను కఠినతరం చేస్తూ, రాజ్య ఆదేశాలు 834, 835 విడుదల చేసింది. ఈ చర్యలు ప్రపంచానికి ఒక సందేశం ఇస్తున్నాయి – తయారీ కేంద్రంగా మాత్రమే కాదు, సరఫరా నియంత్రణ కేంద్రంగా కూడా చైనా తన స్థానం బలపరచుకోవాలని చూస్తోంది.ఇలాంటి చట్టాలు యూరోప్, ఆమెరికాలలో ఉన్నా, అవి, అత్యున్నత సాంకేతిక కలిగిన ఉత్పత్తులకు మాత్రమే వర్తిస్తాయి. ఇప్పటి వరకు అమెరికా సెమీకండక్టర్ టెక్నా లజీ, అధునాతన చిప్‌ల ఎగుమతిపై నియంత్రణలు విధిస్తూ వచ్చింది. ఇప్పుడు చైనా తనకు ఉన్న బలాన్ని– రేర్ ఎర్త్ శుద్ధీకరణ, ఎలక్ట్రానిక్ సరఫరా వ్యవస్థ, ముడి పదార్థాల ఆధిపత్యాన్ని వ్యూహాత్మక సాధనంగా ఉపయో గించడానికి ప్రయత్నిస్తోంది. దీని ప్రభావం అమెరికా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాలపైనే కాదు; చైనా సరఫరా గొలుసులపై అధికంగా ఆధారపడిన భారతదేశంపైనా పడే అవకాశం ఉంది. భారతదేశ ఎలక్ట్రానిక్ దిగు మతులు 80 శాతానికి పైగా చైనా నుండే అని గమనించాలి. చైనా ఒత్తిడితోనే, ఫాక్స్‌కాన్, టెస్లా లాంటి సంస్థలు, తమ ఉత్పత్తులను భారతదేశం బయటే చేయాలని నిర్ణయించు కొన్నాయి.ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ రంగాలపై ప్రభావం భారతదేశం ఒక అసౌకర్యకరమైన వాస్తవాన్ని అంగీకరించాలి. మనం తయారీ కేంద్రంగా ఎదుగుతున్న ప్పటికీ, ఆ తయారీకి అవసరమైన కీలక భాగాలు, అరుదైన ఖనిజాలు, చిప్ భాగాలు, పరిశ్రమల సరఫరా వ్యవస్థల విషయంలో ఇంకా విదేశాలపై ఆధారపడి ఉన్నాం. ప్రత్యేకంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి ఖనిజాల విషయంలో భారత స్థితి మరింత క్లిష్టంగా ఉంది. ఇవే భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ వ్యవస్థలు, బ్యాటరీ నిల్వలు, అంతరిక్ష సాంకేతికత, డిజిటల్ పరికరాలకు ప్రాణాధారం. ఈ రంగాల్లో సరఫరా అంతరాయం అంటే కేవలం పరిశ్రమల సమస్య కాదు; అది దేశ ఆర్థిక భద్రత సమస్యగా మారుతుంది.ప్రపంచ అరుదైన ఖనిజాల ప్రధాన కేంద్రంగా ఆఫ్రికా ఎదిగింది. కాంగోలో కోబాల్ట్, జింబాబ్వేలో లిథియం, నమీబియాలో యురేనియం, దక్షిణాఫ్రికాలో కీలక లోహ సంపద– ఇవన్నీ ఇప్పుడు కొత్త భౌగోళిక రాజకీయ పోటీకి కేంద్రంగా మారాయి. చైనా ఇప్పటికే ఈ పోటీలో చాలా ముందుంది. ఇదే సమయంలో యూరప్ కూడా తన వ్యూహాన్ని మార్చుకుంది. ముడి పదార్థాల కొనుగోలుతో ఆగకుండా, స్థానిక ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తి వ్యవస్థల వైపు అడుగులు వేస్తోంది. సరఫరా భద్రతను ఇప్పుడు జాతీయ భద్రతలో భాగంగా చూస్తోంది.సమగ్ర ప్రణాళిక అవసరం!భారత్ కూడా ప్రయత్నాలు చేయడం లేదని చెప్పలేం. విదేశీ ఖనిజ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం, లిథియం బ్లాక్‌ల అన్వేషణ, ప్రభుత్వ–ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం వంటి చర్యలు ప్రారంభమయ్యాయి. కానీ ఇవి ఇప్పటికీ ఒక సమగ్ర జాతీయ వ్యూహంగా మారలేదు. ముఖ్యంగా మైనింగ్ తరువాత జరిగే శుద్ధీకరణ, ప్రాసెసింగ్, అధు నాతన మెటీరియల్ తయారీ రంగాల్లో మన సామర్థ్యం పరిమితంగానే ఉంది. అందుకే చైనా చర్యలు భారత్‌కు ఒక హెచ్చరిక, ఒక అవకాశం కూడా.చదవండి: చైనాలో అలా.. ఇక్కడ ఇలా!భారత్ ఇప్పుడు మూడు విషయాలను అత్యవసరంగా చేయాలి – ఖనిజ భద్రతను జాతీయ భద్రతలో భాగంగా చూడాలి; విదేశీ భాగస్వామ్యాలను ముడి పదార్థాల నుంచి ప్రాసెసింగ్ వరకు విస్తరించాలి; దేశీయ పరిశోధన–ఆవిష్కరణ వ్యవస్థపై దీర్ఘకాల పెట్టుబడులు పెట్టాలి.ఎందుకంటే భవిష్యత్తులో పోటీ కేవలం ఉత్పత్తుల మధ్య ఉండదు. ఎవరి చేతిలో ముడి పదార్థాలు ఉంటాయి? ఎవరు వాటిని శుద్ధి చేస్తారు? ఎవరు సాంకే తికతను నియంత్రిస్తారు? – ఈ ప్రశ్నలే రేపటి ప్రపంచ శక్తిని నిర్ణయిస్తాయి. భారత్ ఇప్పటికైనా మేల్కొనాలి. లేకపోతే అభివృద్ధి లక్ష్యాలు కొనసాగినా, వాటి పునాది ఇతర దేశాల చేతుల్లో ఉండే ప్రమాదం ఉంది.- సి.హెచ్.వి. ప్రభాకర్ రావుసీనియర్ జర్నలిస్ట్ -
చేను రాష్ట్రానిది చట్టం కేంద్రానిది!
భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్లో వ్యవసాయం స్పష్టంగా రాష్ట్ర జాబితాలో ఉంది. జాబితా–2 లోని 14వ నమోదు (ఎంట్రీ) ప్రకారం వ్యవసాయం, వ్యవసాయ విద్య, పరిశోధన, పంట రక్షణ.. ఇవన్నీ రాష్ట్రాల ప్రత్యేక అధికారం. 18వ నమోదులో భూమి, కౌలు, బదిలీ, వ్యవసాయ రుణాలు ఉన్నాయి. 28వ నమోదులో మార్కెట్లు, సంతలు ఉన్నాయి. వ్యవసాయం స్థానికమైనది. నేలలు, వర్షాలు, పంటల చక్రాలు, కౌలు విధానాలు, విత్తన సంస్కృతులు రాష్ట్రాల మధ్యే కాదు, జిల్లాల మధ్య కూడా మారతాయి అని రాజ్యాంగ నిర్మాతలకూ తెలుసు.కేంద్రీకృత వ్యవసాయ విధానం వ్యవసాయ శాస్త్రపరంగా అసంబద్ధం. అందుకే వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉంది. స్వాతంత్య్రానంతరం ఎనిమిది దశాబ్దాలు గడిచిన తరువాత కూడా వరి కనీస మద్దతు ధర, పప్పుధాన్యాల దిగుమతి సుంకం, పురుగుమందుల రిజిస్ట్రేషన్, జీఎం పంటల అనుమతి, ఎరువుల సబ్సిడీ నిర్మాణం, పంటల బీమా రూపకల్పన, రైతు డేటాబేస్ ఫార్మాట్, మట్టి, కార్బన్ క్రెడిట్ ప్రోటో కాల్లు, రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్లను కేంద్ర ప్రాధాన్యతలకు పరిమితం చేసే కేంద్ర పథకాల షరతులు... వీటన్నింటినీ నిర్ణయిస్తున్నది కేంద్ర ప్రభుత్వమే! రాష్ట్రాలు కేవలం ఆ పథకాల అమలు సంస్థలుగా మిగిలిపోయాయి. కేంద్ర మార్గదర్శకాల ద్వారా, కేంద్ర గుర్తింపుతో పథకాలను అమలు చేస్తూ, కృషి భవన్, వాణిజ్య భవన్లలో తీసుకున్న నిర్ణయాల పర్యావరణ భారాన్ని రాష్ట్రాలు మోస్తున్నాయి.ఇరవై ఏళ్లుగా మొలకెత్తని విత్తన బిల్లు!వ్యవసాయాన్ని రాష్ట్ర జాబితాలో ఉంచిన అసలు ఏర్పాటు నిశ్శబ్దంగా క్రమేణా శూన్యమైపోయింది. వాణిజ్య అధికారాలు, ఉమ్మడి జాబితా నమోదులు, నిత్యావసర వస్తువుల చట్టం, ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాల కింద అంతర్జాతీయ నిబద్ధతలు, జీఎస్టీ ద్వారా ఆర్థిక కేంద్రీకరణ, షరతులతో కూడిన కేంద్ర పథకాల విస్త రణ... ఇవన్నీ కలిసి రాజ్యాంగ సవరణ లేకుండానే జరిగిపోయాయి. క్షేత్రస్థాయి పరిశీలన ఈ సమస్యను స్పష్టంగా చూపిస్తుంది. 2003–04లో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పెద్ద ఎత్తున పత్తి పంట నాశనమైంది. నాణ్యత లేని బి.టి. హైబ్రిడ్లపై కాయతొలుచు పురుగు దాడి, నకిలీ విత్తనాలు అమ్మిన అవినీతి డీలర్లు, వాతావరణ ఒత్తిడి... వీటన్నిటి కారణంగా అప్పుల్లో ఉన్న రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో విత్తన నాణ్యత పరీక్ష, కంపెనీల జవాబుదారీతనం, రైతుల పరిహారం కోసం విత్తన నష్ట పరిహార చట్టం ముసాయిదాను తయారు చేసింది. అయితే ఆ ముసాయిదాపై కేంద్ర ప్రభుత్వ స్పందన ఆశ్చర్యకరంగా ఉంది. జాతీయ విత్తన బిల్లు సిద్ధంగా ఉందనీ, రాష్ట్ర చట్టం గందరగోళం సృష్టిస్తుందనీ కేంద్ర అధికారులు వాదించారు. రాష్ట్రాన్ని ఆగమని కోరారు. 2004 విత్తన బిల్లు దాదాపు రెండు దశాబ్దాలుగా పార్లమెంటులో మూలుగుతూ ఉంది. ఈ మధ్య లోని కాలంలో రైతులకు అనేక సమస్యలు ఎదురైనా వాటికి ఎలాంటి చట్టపరమైన పరిష్కారమూ లభించ లేదు.పురుగుమందుల విషయంలో మరింత దారుణమైన అసమ తుల్యత ఉంది. 1968 క్రిమిసంహారక చట్టం సెక్షన్ 27 ప్రకారం, ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకర పురుగుమందు అమ్మకాన్ని నిషేధించ గలిగేది గరిష్ఠంగా 90 రోజులు (మొదట 60 రోజులు, తర్వాత 30 రోజులు) మాత్రమే. అంటే తన ప్రజలను ప్రమాదకర రసాయనం నుండి కాపాడుకోవడానికి ఒక రాష్ట్రానికి అందుబాటులో ఉన్న చట్టపరమైన అవకాశం 90 రోజులు మాత్రమే. ఆసుపత్రి అడ్మిషన్లు, దీర్ఘకాలిక నాడీ వ్యాధులు, విషం తాగి ఆత్మహత్యలు వీటన్నిటినీ భరించే రాష్ట్రానికి స్వయంగా నిర్ణయం తీసుకునే వెలుసుబాటు లేదు. ఉదా: కేరళ 2001లో ఎండోసల్ఫా¯Œ ను నిషేధించింది. కేంద్రం దానిని జాతీయ స్థాయిలో నిషేధించడానికి దాదాపు పదేళ్లు పట్టింది. నియంత్రణలకు రాష్ట్రాల సమ్మతి ఏదీ?తెలంగాణలో వరి సాగును పరిశీలించండి. దాదాపు 40 లక్షల హెక్టార్లలో, ఎక్కువగా బోర్వెల్ నీటిపై ఆధారపడి, రాష్ట్రం ఇచ్చే ఉచిత విద్యుత్‌తో పంపింగ్ చేసే భూగర్భ జలంతో ఇది సాగుతోంది. వరి సాగుకు ప్రోత్సాహం ఇచ్చే కనీస మద్దతు ధరపై రాష్ట్రా నికి అధికారం లేదు. ఎరువుల సబ్సిడీపై అధికారమూ పరిమితమే. చిరుధాన్యాలను ప్రోత్సహించేలా ‘సేకరణ’ విధానాన్ని మార్చలేదు. వాణిజ్యంలో రాజ్యాంగ వైరుధ్యం మరింత పదునుగా కని పిస్తుంది. వ్యవసాయం రాష్ట్ర అంశం. వ్యవసాయ వాణిజ్యం కేంద్ర అంశం. అంటే ఉల్లి సాగును మహారాష్ట్ర నియంత్రిస్తుంది. ఉల్లి ఎగుమతిని వాణిజ్య భవన్ నియంత్రిస్తుంది. 2007–08, 2010, 2019, మళ్లీ 2023లో దేశీయ ధరల ఒత్తిడికి స్పందనగా, ఎగుమతి మార్కెట్‌ను ఆశించి పంటలు వేసిన రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండానే కేంద్రం బియ్యం, గోధుమపై హఠాత్తుగా ఎగుమతి నిషే ధాలను విధించింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు పరిస్థితిని మరింత జటిలం చేశాయి. ‘ఏషియన్’ దేశాలు, జపాన్, కొరియాలతో ద్వైపాక్షిక ఒప్పందం.. వీటిల్లో ఏ ఒక్కదానిపైనా రాష్ట్రాల అధికారిక భాగస్వామ్యంతో చర్చ జరగలేదు.మరి పరిష్కారం? మొదట, వ్యవసాయ సమాఖ్య కమిషన్ ఏర్పాటు చేయాలి. సర్కారియా (1988), పుంఛీ (2010) కమిషన్లు కేంద్ర రాష్ట్ర సంబంధాలపై దృష్టి పెట్టినా, ప్రత్యేకించి వ్యవసాయంపై పెట్టలేదు. అన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యంతో, రాజ్యాంగ సవ రణలు, చట్టపరమైన మార్పులు, ఆర్థిక పునర్నిర్మాణం... వీటిని సిఫార్సు చేయగల అధికారంతో ఈ కమిషన్ ఉండాలి. రెండవది, నిర్దిష్ట చట్టపరమైన స్పష్టతలు కావాలి. నిత్యావసర వస్తువుల చట్టంలో సవరణ, ఎగుమతి, నిల్వ నియంత్రణలు విధించే ముందు రాష్ట్ర సమ్మతి తప్పనిసరి. హానికర పురుగుమందులను శాశ్వతంగా నిషేధించే అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలి.గిట్టుబాటు కాని పంటలకు బోనస్మూడవది, పర్యావరణ అనుకూల వ్యవసాయం వైపు ఆర్థిక వికేంద్రీకరణ. జీడీపీలో దాదాపు 1.7 శాతం ఉన్న ఎరువుల సబ్సి డీని (ప్రస్తుతం దాదాపు పూర్తిగా తయారీదారులకు చెల్లిస్తున్న దానిని) క్రమంగా ‘రైతువారీ పర్యావరణ పరివర్తన చెల్లింపు’గా మార్చాలి. స్థానిక ప్రాధాన్యతల ప్రకారం రాష్ట్రాలు దీనిని వినియో గించుకోవాలి. మార్కెట్ దొరకని పంటలకు సేకరణ, గిట్టుబాటు కాని పంటలకు బోనస్ ఇచ్చే పద్ధతి కావాలి. భూగర్భ జలాలను కాపాడే, మట్టి కార్బన్‌ను నిల్వ చేసే, సంప్రదాయ విత్తనాల్ని రక్షించే రాష్ట్రాలకు పర్యావరణ ఆర్థిక బదిలీలు అందించాలి.నాల్గవది, ప్రాంతీయ ఆహార వ్యవస్థల ప్రణాళిక. భారత వ్యవ సాయ వైవిధ్యానికి ఒకే జాతీయ ఆహార విధానం కాదు, ప్రతిప్రాంత వ్యవసాయ పర్యావరణం, ఆహార సంస్కృతి, ఆర్థిక నిర్మాణానికి అనుగుణంగా రూపొందించిన ప్రాంతీయ ఆహార వ్యవస్థ ప్రణాళికల సమాఖ్య సరైనది. తూర్పు కనుమల చిరుధాన్య ప్రాంతం, ఇండో–గంగా మైదానం, పశ్చిమ కనుమల సుగంధ ద్రవ్య ప్రాంతం, ఈశాన్య పోడు వ్యవసాయ ప్రాంతం, పశ్చిమ భారత పప్పుల ప్రాంతం, దక్షిణ ద్వీపకల్ప నీటిపారుదల వరి బెల్ట్... ప్రతిదీ ఒక ప్రత్యేక వ్యవసాయ పర్యావరణ మండలం. ఏక రూప పంటల విధానం రుద్దడం కాకుండా, ప్రాంతీయ ఆహార వ్యవస్థల కలయికగా జాతీయ ఆహార భద్రతను నిర్మించవచ్చు.డా‘‘ జి.వి.రామాంజనేయులువ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త,‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
డి.కె. శివకుమార్ (డిప్యూటీ సీఎం) రాయని డైరీ
ప్రయత్నాలు విఫలం కావచ్చు, ప్రార్థనలు నిష్ఫలం కావు. ఇన్నాళ్లకు దేవుళ్లు, దేవతలు కలిసి నేను కోరుకున్న స్థానంలో నన్ను ఉంచబోతున్నారు! ఓర్పు వహించినందుకు; పీఠాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించినందుకు దక్కిన వరం! ఆకాశం వైపు చూశాను. దివిలోని ఆ మెరుపుల దారుల నుంచే కదా నా కోసం దైవాశీస్సులు ఉరుముల రథాలు వేసుకుని, ప్రమాణ స్వీకారానికి వర్షించే మేఘాలై భువికి రాబోతాయి! రామనగర కాబలమ్మ అమ్మవారు, కెంచిరమ్మ అమ్మవారు; మైసూరు చాముండే శ్వరి మాత, చామరాజనగర్ శ్రీమలే మహదేశ్వరుడు, కల్లహళ్లి భూవరాహనాథుడు, శ్రీరంగనాథస్వామి వారు, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి, చిక్కమగళూరు శారదాంబ, ఉడిపి శ్రీమూకాంబిక, గోకర్ణ మహాబలేశ్వరుడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, తిరుమల శ్రీవేంకటేశ్వరుడు, కారైకాల్ శనీశ్వరుడు, గువహటి కామాఖ్య మాత... పైనుంచి నా వైపు చూస్తూ – ‘‘సంతోషమేనా దొడ్డలహళ్లి కెంపేగౌడ శివకుమార్’... అని నన్ను అడుగుతున్నట్లుగా ఉంది. ఇలలో నాకు దైవ సమానులైన నిర్మలానందనాథ స్వామిజీ, శ్రీ నంజవదుత స్వామిజీ, నొనవినకెరె అజ్జయ్య స్వామీజీ, శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ, ప్రణవానంద స్వామిజీ... నన్నెలాగూ ప్రమాణ స్వీకార ఘడియల్లో వేదిక మీదకు అదృశ్యంగా చెయ్యి పట్టి నడిపిస్తారు. భక్తి మార్గంలో ఉన్నప్పుడు, ఎదురొచ్చే ప్రతి మనిషిలోనూ మనకు దైవమే కనిపిస్తాడేమో! అదొక సాక్షాత్కారం! ముఖ్యమంత్రి అధికారిక నివాసం ‘కావేరి’లో అల్పాహార సమావేశానికి వెళ్లినప్పుడు సిద్ధరామయ్య నాకు ఎదురొచ్చారు. ఆయనకు నమస్కరించాను. ఆత్మీయంగా కౌగిలించుకున్నాను. ఆ క్షణంలో... జీవాత్మ వెళ్లి పరమాత్మలో లయం అయినట్లుగా నేను పూర్తిగా లుప్తమైపోయాను!! దేవుడు నేరుగా దీవెనలుగానీ, శాపాలుగానీ ఇవ్వడు. కానీ అవకాశాలను కల్పిస్తాడు! ఆ అవకాశాలను వదులుకోకూడదు. ఆలస్యం చేయకుండా సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించాను. వెంటనే, ‘ఇదొక నాటక ప్రదర్శన’ అని బీజేపీ మొదలు పెట్టేసింది! ఒక మనిషి మీద గౌరవం నాటకం ఎలా అవుతుంది? ‘‘ఇక్కడీయన పాద నమస్కారాలు చేస్తున్నారు. అక్కడ ఈయన ఇంటి ముందు స్వీట్లు పంచుతూ అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు...’’ అని అవహేళన! స్వీట్లు ఒకరు వెళ్లిపోతున్నందుకే పంచు కుంటారా? ఒకరు వస్తున్నందుకు పంచు కోరా? భక్తి భావనలను వీళ్లంతా ఎందుకు వ్యక్తిగతం చేస్తారు! ప్రత్యర్థిని ఎప్పుడూ ప్రత్యర్థిగానే చూడాలా? అలాగైతే, ‘రెండున్నరేళ్ల పదవీకాల ఒప్పందం’ ప్రకారం, నవంబరులోనే నేను సిద్ధరామయ్యతో తగవుకు దిగి సీఎంగా నా రెండున్నరేళ్ల పదవీకాలాన్ని ఆయన్నుంచి లాక్కోవలసింది కాదా? ఆయనే తప్పుకుని వెళ్లేవరకు ఇప్పటిదాకా నేను ఆగటం ఎందుకు? ముఖ్యమంత్రిగా రేపు నా ప్రమాణ స్వీకారం. జూన్ 1కి బదులు జూన్ 3 పెట్టుకుంటే మంచిదని నోనవినకెరె స్వామిజీ సందేశం పంపారు. ప్రమాణ స్వీకారం లోక్ భవన్ గ్లాస్ హౌస్‌లో కాకుండా, విధానసౌధ మెట్ల మీద ఏర్పాటు చేసుకొమ్మని రాజగురు బెల్లూరు ద్వారకానాథ్ వర్తమానం పంపారు. మెట్ల మీద స్వీకారం స్వర్గీయ రామకృష్ణ హెగ్డే, ఎస్.ఎం. కృష్ణ నెలకొల్పిన సంప్రదాయం. ముహూర్తం ఏదైనా, ప్రమాణం ఎక్కడైనా అంతా ప్రజల కోసమే. రాజ్యాంగం నా మతం. ప్రజలు నా దేవుళ్లు. మార్గం చూపించటం దైవ నిర్ణయం. గమ్యం చేరుకోవటం మానవ ధర్మం. -
సగటు జీవితాలే ప్రగతికి కొలమానం
విదేశాలలో నివసిస్తున్న చాలామంది భారతీయులకు, నేడు మన దేశం నిలు వెత్తు పురోగతికి సగర్వ చిహ్నంగా కనిపి స్తుంటుంది. వారు ఇక్కడి తళతళలాడే విమానాశ్రయాలు, ఆధునిక రహదా రులు, వేగంగా దూసుకుపోతున్న ఐటీ కారిడార్లను చూస్తుంటారు కనుక అది సహజమే. కానీ, ఏదైనా ఒక వ్యవస్థను సరిగ్గా ‘లెక్కించి’ చూడనంత వరకు ఆ వ్యవస్థ బయటకు కనిపించే తీరుకు, వాస్తవం ఏమిటన్న దానికి పొంతన ఉండటం అరుదు అని, ఇండి యన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన ఒక శాస్త్రవేత్తగా నాకు అనిపిస్తుంటుంది.ఆధారాలు, గణాంకాలు లేకుండా, కేవలం ఒక నమ్మకంతో దేశాన్ని చూసి మురిసిపోవడమే ఇక్కడ సమస్య. ఈ ప్రవాస భారతీయుల ఉల్లాసభరిత భావోద్వేగం అనేది ఒక చిన్న అంచనా లోపం వల్ల వస్తుంది. అదేమిటంటే... మనం ఈనాటి భారతదేశాన్ని ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చడం లేదు. మన చిన్ననాటి భారతదేశంతో పోల్చుకుంటున్నాం. మన చిన్నప్పుడు ఉన్నప్పటి భారతదేశం వనరుల కొరతతో, తక్కువ అవకాశాలతో ఉండేది. ఒక దేశాన్ని ఆ దేశపు పాత రోజులతో మాత్రమే పోల్చి చూసినప్పుడు... ప్రపంచ దేశాల రేసులో ప్రస్తుతం అది ఏ స్థానంలో ఉందనే అసలు నిజాన్ని మనం గమనించలేకపోతాం.ఏం చూస్తే అదే కనిపిస్తుంది! భారతదేశ వాస్తవ పరిస్థితి ప్రవాస భారతీయులకు తెలిసే అవకాశం లేదు. వారు ఇక్కడకు వచ్చినప్పుడు తమకు నచ్చిన వాటి వైపు మాత్రమే చూడగల ఒక మనోస్థితికి (సెలెక్షన్ బయాస్) లోనవు తారు. సంపన్నులైన తమ బంధువుల ఇళ్లలో గడపడం, దేశ సగటు ఆదాయం కంటే ఐదు నుండి పది రెట్లు ఎక్కువగా సంపాదించే బెంగళూరు, హైదరాబాద్ లేదా గురుగ్రామ్ వంటి ఆధునిక ఐటీ హబ్‌లలో తిరగడం వల్లనే వారి అభిప్రాయాలు ఏర్పడతాయి. వారు ఇక్కడ కేవలం మొదటి 1–5 శాతంలో ఉండే అత్యంత సంపన్న వర్గాన్ని మాత్రమే చూసి, అదే మొత్తం భారతదేశం అనుకుంటారు. ఇలా, వాస్తవాలకు దూరంగా ఉండటం అన్నది దేశభక్తి వల్ల మరింత ఎక్కువవుతుంది. విదేశాల్లో ఉండే చాలామంది భారతీ యులు, ప్రపంచ వేదికపై భారత ప్రధాని ఒక బలమైన నాయకు డిగా కనిపించినప్పుడు ఎంతో గర్వపడుతుంటారు. లోతుగా చూసిన ప్పుడు ఇలాంటి దౌత్య ప్రదర్శనలు భారతదేశ స్థితిగతులను ఏ మాత్రం ప్రతిబింబించేవి కావు. లెక్కల్లోనే నిజాలు ఉంటాయి!ప్రస్తుతం భారతదేశ తలసరి జీడీపీ దాదాపు 2,400 డాలర్లకు పెరిగినప్పటికీ, అదే సమయంలో మన తోటి దేశాలైన వియత్నాం 4,300 డాలర్లకు, ఇండోనేషియా 4,700 డాలర్లకు దూసుకెళ్లాయి. భారతదేశ వృద్ధి నిజమే అయినప్పటికీ, మిగతా మన లాంటి దేశాలతో పోల్చినప్పుడు అది అంత అసాధారణమైనదేమీ కాదు.మానవ జీవన ప్రమాణాలైన సగటు ఆయుర్దాయం, శిశు మర ణాల రేటు వంటి ప్రాథమిక విషయాలలో భారతదేశం ఇంకా వెనుక బడే ఉంది. ఉదాహరణకు, భారతదేశంలో ప్రతి 1,000 జననాలకు శిశు మరణాల రేటు దాదాపు 26గా ఉంది. ఇది వియత్నాం (14) కంటే దాదాపు రెట్టింపు, చైనా కంటే (6) చాలా ఎక్కువ. బహుశా అన్నింటికంటే విచారకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచ ఆకలి సూచిక (గ్లోబల్ హంగర్ ఇండెక్స్)లో భారతదేశం ఎప్పుడూ చివరి వరుసలోనే ఉండటం! ఇటీవల 127 దేశాలలో ఇండెక్స్‌లో మన దేశం 105వ స్థానంలో నిలిచింది. పోషకాహార లోపం అనేది ఒక తీరని ‘అప్పు’ లాంటిది. ఇది భవిష్యత్తులో దశాబ్దాల పాటు పిల్లల మానసిక వికాసం, దీర్ఘకాలిక ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపుతుంది.ఇంకా చెప్పాలంటే, యువత నిరుద్యోగిత అంచనాలుమొండిగా అలాగే ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా మహిళా కార్మిక భాగ స్వామ్యం కేవలం 20 శాతం వంటి స్వల్ప స్థాయిలో ఉన్నప్పుడు మనం దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందని చెప్పలేం. ఇది బంగ్లాదేశ్ (38 శాతం) లేదా వియత్నాం (70 శాతం) కంటే చాలా తక్కువ. ఒక దేశం తన జనాభాలో సగభాగాన్ని (మహిళలను) దేశ వృద్ధి చక్రం నుండి పక్కన పెట్టి, ఎప్పటికీ నిరంతర సంపదను లేదా పురోగతిని సాధించలేదు.ఈ గణాంకాలను చూపించినప్పుడు, ప్రవాస భారతీయులు తరచూ ఒకే రకమైన వాదనతో స్పందిస్తుంటారు: ‘వ్యూహాత్మక పెట్టుబడుల ఫలితాలు భవిష్యత్తులో కనిపిస్తాయి’ అని. కానీ ‘ఆర్ అండ్ డి’, ‘సిస్టమ్ ఎనాలిసిస్’ల ప్రపంచంలో దీనిని ఊహఅంటారు కానీ, విశ్లేషణ అనరు. దేశ పురోగతిని ప్రస్తుత ఫలితాల ఆధారంగా అంచనా వేయాలి కానీ, భవిష్యత్తు ఆశల ఆధారంగా కాదు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ముఖ్యమైనవే, కానీ వాటికవిగా మెరుగైన ఆరోగ్యం, ఎక్కువ ఆదాయాలు లేదా బలమైన ప్రభుత్వ సంస్థల సమగ్రతగా మారిపోవు. దీనర్థం, వ్యవస్థలుమనం బాగుపడుతున్నాయని నమ్మినంత మాత్రాన బాగుపడవు. వాటిని మనం నిజాయితీగా కొలిచి చూసి, బాగుపరచుకున్నప్పుడు మాత్రమే అవి మెరుగుపడతాయి.విద్య, ఉపాధి, వైద్యం ప్రధానభారతదేశ పురోగతికి అసలైన కొలమానం ఎక్స్‌ప్రెస్‌వేల సంఖ్య లేదా ప్రపంచ వేదికపై మన దేశ నాయకులకు ఉన్న గుర్తింపు కాదు. అసలైన కొలమానం ఒక సగటు భారతీయుడి జీవితం. పౌరులు అప్పుల పాలు కాకుండా నాణ్యమైన వైద్య సేవలను పొంద గలుగుతున్నారా? వారి పిల్లలు ఆధునిక ప్రపంచానికి సరిపోయేలా నాణ్యమైన విద్యను అందుకోగలుగుతున్నారా? ఆ పిల్లలకు ఆత్మ గౌరవాన్ని, భద్రతను ఇచ్చే స్థిరమైన ఉపాధి (ఉద్యోగం) దొరుకు తోందా? ఈ ప్రశ్నలకు సమాధానం గనుక సందేహాస్పదంగా ఉంటే, ఆ దేశ పురోగతి ఇంకా అసంపూర్ణంగా ఉన్నట్లే లెక్క. ఉద్వేగంతో వేడుకలు చేసుకునే దేశభక్తి కాదు, ఆలోచనాత్మక మైన ఆధారాలతో కూడిన దేశభక్తి మనకు అవసరం. దేశాన్ని ఎంత గానో ప్రేమిస్తూ, దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించిన నిజాన్ని నిజాయితీగా చెప్పగలిగే దేశభక్తి మనకు కావాలి.భారతదేశం కేవలం తన ‘భావపూర్వక సగర్వత’ వల్ల శక్తిమంతంగా మారదు.అది నిజాయితీతో కూడిన సమీక్ష, కచ్చితమైన లెక్కలు, సామాన్య పౌరుడిని పైకి తీసుకురావాలనే సంకల్పం ద్వారానే సాధ్యమవుతుంది. ప్రపంచం భారతదేశాన్ని కేవలం భావో ద్వేగ కథనాలను చూసి గౌరవించదు, కళ్లముందు కనిపించే ఫలితా లను చూసి గౌరవిస్తుంది. ప్రవాస భారతీయుల ఉత్సాహం అర్థం చేసుకోదగినదే అయినప్పటికీ, భారతదేశ భవిష్యత్తు కోసం క్షేత్ర స్థాయి వాస్తవికత కూడా ఆ ఉత్సాహానికి తగ్గట్టుగా మారాలి.మేడా పరమేశ్వర రెడ్డి , వ్యాసకర్త ఇండో–అమెరికన్ రిటైర్డ్ సైంటిస్ట్, ‘రెడ్డి సెంటర్ ఫర్ క్రిటికల్ అండ్ ఇంటిగ్రేటెడ్ థింకింగ్’ డైరెక్టర్


