
విశ్వ గురు
ధన్యవాదాలు.
నేను చెప్పగలిగినవి, అత్యంత ఉపయోగకరమైనవి, ఏవైనా ఉంటే చెప్పవలసిందని నాకు సుమారు ఐదు నుంచి ఆరు నిమిషాల సమయం ఇచ్చారు. వీలైనంత ప్రయత్నిస్తాను. ఏవైనా మూడు అంశాలకు పరిమితం కావలసిందని కూడా నాకు సూచించారు. నేను నాలుగు అంశాలు చెప్పాలనుకుంటున్నాను. అవి చాలా ముఖ్యమైన అంశాలని నేను భావిస్తున్నాను. వాటిలో కొన్ని ఇంతకు ముందు మీరు విన్నవి కూడా కావచ్చు. కానీ, వాటి గురించి మళ్ళీ చెప్పు కోవడంలో తప్పు లేదు.
కష్టపడి పనిచేయాలి!
మొదటిది – కృషి చేయడం! మీరు ఒక పనిని ఎంత బాగా చేయాలనుకుంటున్నారో, దాని కోసం అంతగా కృషి చేయాలి. మీరు ఒక కంపెనీని నెలకొల్పదలిస్తే, దానికి సంబంధించి మీరు ఇంకా ఎక్కువ పాటుపడాలి. ఎంతగా అంటారా... నేను, నా సోదరుడు కలసి మొదటి కంపెనీని ప్రారంభించినపుడు, అపార్ట్‌మెంట్ తీసుకోవడానికి బదులు, ఒక చిన్న ఆఫీసును అద్దెకు తీసుకున్నాం.
అక్కడే సోఫాలో పడుకునేవాళ్ళం. స్నానాలు, నిత్యకృత్యాలు వై.ఎం.సి.ఏ.లో కానిచ్చేసే వాళ్ళం. ఎంత కష్టపడ్డామంటే, ఒకటే కంప్యూటర్ ఉండేది. పగటి పూట వెబ్‌సైట్‌కి వాడుకునేవాళ్ళం. కోడింగ్ పని నేను రాత్రిపూట చేసేవాడిని. వారంలో 7 రోజులూ, మొత్తం సమయాన్ని దానికే వెచ్చించేవాళ్ళం.
నా సంగతి తెలుసుగా! నాకో గర్ల్ ఫ్రెండ్ ఉండేది. నాతో ఉండటం కోసం, ఆమె కూడా ఆఫీసులోనే పడుకునేది. కనుక కష్ట పడాలి. మెలకువగా ఉన్నంతసేపూ పని చేస్తూనే ఉండాలి. అదే నేను చెప్పదలచుకుంది. ముఖ్యంగా మీరు ఏదైనా కంపెనీ ప్రారంభించాలంటే శ్రమించక తప్పదు. ఏమీ లేదు. చిన్న లెక్కే. ఎవరన్నా వారి సంస్థ కోసం వారానికి 50 గంటలు పని చేస్తున్నారనుకుందాం. మీరు 100 గంటలు పని చేయాలి. ఫలితంగా,రెండింతల పని పూర్తవుతుంది. తర్వాత కాలంలో, ఆ ఇతర కంపెనీలలా పనిచేసినా ఫరవాలేదు.
గొప్ప బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలి!
రెండవ సంగతి. మీరు ఏదైనా కంపెనీ ప్రారంభిస్తున్నా లేదా ఏదైనా కంపెనీలో చేరదలచుకున్నా కూడా ప్రజ్ఞావంతుల సాహ చర్యం లభించేటట్లు చూసుకోండి. పెట్టదలచుకుంటే ప్రతిభా వంతులతో కంపెనీ పెట్టండి లేదా మీరు గౌరవించే ప్రతిభావంతులున్న కంపెనీలో చేరండి. కంపెనీ అంటే ఏమిటి? ఒక వస్తువును తయారు చేసేందుకు లేదా ఒక సేవను అందించేందుకు కొంతమంది ఒకచోట చేరి, కలసికట్టుగా పనిచేయడం.
అంతేనా? ఒక బృందంలోనివారి శక్తియుక్తులు, కష్టపడి పనిచేసే తత్త్వం, సరైన దిశలో సమన్వయంతో, సమష్టిగా దృష్టి కేంద్రీకరించి పని చేయడాన్ని బట్టి ఆ కంపెనీ విజయం ఆధారపడి ఉంటుంది. అందుకని, కంపెనీని నెలకొల్పదలిస్తే, గొప్ప వ్యక్తులందరినీ ఒక చోట చేర్చేందుకు ఏం చేయాలో అంతా చేయండి.
పూర్తిగా మీ పని మీదే దృష్టి పెట్టాలి!
హంగు ఆర్భాటాలకన్నా శ్రేష్ఠతపై దృష్టి పెట్టడం మూడవ అంశం. చాలా కంపెనీలు ఈ విషయంలో గందరగోళంగా ఉంటాయి. వస్తువును మెరుగుపరచడానికి, వాస్తవానికి ఏ విధంగానూ తోడ్పని అంశాలపై అవి పెద్ద మొత్తంలో ద్రవ్యాన్ని వెచ్చి స్తూంటాయి. మేం ‘టెస్లా’లో ఎన్నడూ అడ్వర్టయిజింగ్ కోసం ఖర్చు పెట్టింది లేదు. కారును వీలైనంత గొప్పదిగా తీర్చిదిద్దేందుకు డిజైన్, తయారీ, పరిశోధన–అభివృద్ధి విభాగాలపైనే మొత్తం డబ్బు వెచ్చించాం. పయనించాల్సింది ఆ మార్గంలోనేనని అనుకుంటున్నా.
ఆ మాటకొస్తే ఏ కంపెనీ విషయంలోనైనా సరే, ‘‘మనం చేస్తున్న ప్రయత్నాలు ప్రజల ఆశలను ప్రతిఫలిస్తున్నాయా? వాటి వల్ల మెరుగైన ఉత్పత్తి ఒనగూడుతోందా? సేవలు సమకూరుతు న్నాయా?’’ అని నిరంతరం ఆలోచిస్తూనే ఉండండి. లేదని భావిస్తే, ఆ ప్రయత్నాలకు అంతటితో స్వస్తి పలకండి.
ట్రెండ్స్‌ను ఫాలో కావొద్దు!
చివరగా చెప్పదలచుకున్నది ఏమంటే, గొర్రెదాటు మనస్తత్త్వం వద్దు. వర్తమాన ధోరణిని పరిశీలించాల్సిందే. కానీ, దాన్ని గుడ్డిగా అనుసరించ కూడదు. భౌతిక శాస్త్ర దృక్పథంతో చూడటం అన్నమాట. పోల్చి చూసి ఒక నిర్ణయానికి రావడం కన్నా, ఆ వస్తువుల మూలాల్లోకి వెళ్ళాలి. అత్యంత మౌలిక సత్యాలను తెలుసుకునేందుకు ఎంతవరకు అన్వేషించగలరో అంతవరకు అన్వేషించండి. తార్కికతను అక్కడ నుంచి వర్తింప జేయండి.
ఒక వస్తువును సృష్టించడంలో లేదా ఏదైనా ఒక పని చేయడంలో ప్రయోజనం ఏమైనా ఉందా లేక మిగిలిన వాళ్ళందరూ చేస్తున్నారు కనుక మనమూ అదే పనిచేస్తున్నామా అని తెలుసుకునేందుకు అదే సరైన మార్గం. ఆ విధంగా ఆలోచించడం కష్టం. అన్నింటి విషయంలోనూ అలాగే ఆలోచించలేం. దానికి చాలా కృషి చేయాలి. ఒప్పుకుంటాను. కానీ, మీరు ఏదైనా కొత్తది చేయదలచుకున్నప్పుడు, అదే ఉత్తమ మార్గం. అది అంతరాత్మ ప్రబోధాలకు వ్యతిరేకమైన అంశాలను అర్థం చేసుకునేందుకు భౌతికశాస్త్రం అభివృద్ధి చేసిన చట్రం. క్వాంటమ్ మెకానిక్స్ లాగా అది చాలా చాలా శక్తిమంతమైన పద్ధతి.
రిస్క్ తీసుకోవాలి!
అదీ సంగతి. ఇంకొక్కటి చెప్పదలచుకున్నాను. మీరు రిస్క్ తీసుకోవడాన్ని నేను ప్రోత్సహిస్తాను. అందుకు ఇదే సరైన సమయం. మీకు పిల్లాజెల్లా లేరు. బరువు బాధ్యతలు లేవు. మీలో కొందరికి బరువు బాధ్యతలు ఉంటే ఉండవచ్చు. బహుశా పిల్లలు మాత్రం ఉండి ఉండరు. వయసు పెరుగుతున్న కొద్దీ బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి.
మీకో కుటుంబం ఏర్పడ్డాక, రిస్కులు తీసుకోవడం ప్రారంభిస్తే, మీతోపాటు మీ కుటుంబంలోని వారు కూడా ఆ రిస్కులను స్వీకరిస్తున్నట్లు లెక్క. ఫలిస్తాయో లేదో తెలియని వాటిని ప్రయత్నించి చూడటం కష్టమవుతుంది. కనుక, సాహసించేందుకు ఇదే తగిన సమయం. బరువు బాధ్యతలు మీద పడకముందే, తెగించండి. ఏమైతే అదవుతుంది అనుకోండి.
ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ఈ విషయంలో మీ భుజం తట్టేందుకు నేను రెడీ. చేసిన పనికి చింతించాల్సిన అవసరం
ఉండదు. థ్యాంక్యూ. నా మాటలు మీకేమైనా ఉపయోగపడతాయో లేదో నాకు తెలియదు. మంచి విషయాలే మాట్లాడుకున్నాం అనుకుంటా!