
విశ్లేషణ
రోజుకో కొత్త ఏఐ టూల్ అందుబాటులోకి వస్తున్న కాల మిది. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, తయారీ రంగం... ఇలా అన్ని చోట్లా కృత్రిమ మేధ విస్తరిస్తోంది కూడా. అయితే... నిత్యజీవితంలోకి చొచ్చుకొచ్చేస్తున్న కృత్రిమ మేధ, ఆధునిక సాంకేతికత మన ఆలోచనా శక్తిపై చూపుతున్న ప్రభావం ఏంటి? వీటిపై ఆధారపడుతూ మనం మెదళ్లతో ఆలోచించడం తగ్గించేస్తున్నామా? తార్కికత, జ్ఞాపకశక్తి, హేతుబద్ధత వంటి మన మేధోశక్తులను టెక్నాలజీ కోసం చేజేతులా వదులుకుంటున్నామా?
టెక్నాలజీ ప్రభావం మనపై ఎలా ఉంటుందో సులువుగా అర్థం చేసుకోవాలంటే... మొబైల్ అప్లికేషన్ల వాడకాన్ని గమనించండి. సోషల్ మీడియాలో రెండు, మూడు నిమిషాలుండే షార్ట్ వీడియోలు, రీల్స్‌కు కొన్ని కోట్ల మంది బానిసలైపోయారంటే అతిశయోక్తి కాదు. గంటల కొద్దీ పొట్టి వీడియోలు చూస్తూండటం తెలిసిందే. ఈ వ్యసనంలో మన మెదడుకు పనేమీ లేదు. చకచక కనిపిస్తున్న సమాచారాన్ని స్వీకరించడం మినహా.
అయితే ఇలా చేయడం వల్ల మన మెదడు చాలా వేగంగా వినోదం అనే అనుభూతిని పొందుతుంది. ఇలా రోజూ గంటల తరబడి చూడటం అల వాటైన తర్వాత మన ఏకాగ్రత దెబ్బతింటుంది. డిజిటల్ డివైసెస్ స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడిపితే మన మెదడులోని నాడీ మార్గా(న్యూరల్ పాథ్‌వే)లలో మార్పులు జరుగుతాయని ఇప్పటికే జరిగిన కొన్ని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
డిజిటల్ టూల్స్ జ్ఞాపకశక్తితో పని లేకుండా చేయ డమే కాకుండా... సంక్లిష్టమైన పనులను కూడా సులు వుగా అర్థమయ్యేలా చేయడం ద్వారా ఆలోచించే అవ సరం లేకుండా చేస్తాయి. ఇంకో మాటలో, నేర్చుకునేందుకు నేరుగా అవకాశం కల్పించకుండా విషయా లను అరటిపండు ఒలిచినట్టు ఒలిచి పెడతాయన్న మాట.
అయితే ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్ డిజైన్ బాగా ఉంటే మనకు మేలే జరుగుతుంది. ఆటో కంప్లీట్, డిజిటల్ కాలిక్యులేటర్లు, వ్యాకరణాన్ని సరిచేసే టూల్స్ వంటివి మన పనిని సులువు చేయడంతోపాటు ఈ పనులపై పెట్టాల్సిన శ్రమను తగ్గిస్తాయి. ఇంటర్నెట్, డిజిటల్ టూల్స్‌ను తగిన రీతిలో వాడుకుంటే మన మెదడు సమాచారాన్ని మరింత సమర్థంగా ప్రాసెస్ చేయగలదు. అవసరమైన విషయాలను జ్ఞాపకాల పొరల్లోంచి మెరుగ్గా అందివ్వగలదు. తద్వారా మన మేధాశక్తి మెరుగవుతుంది.
ఇంటర్నెట్ ద్వారా మన మేధకు ఎదురయ్యే సవాళ్లూ ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా అతిగా సమాచారం అందడం వల్ల మెదడు దేనిని గ్రహించాలో తెలియక ఒత్తిడికి గురవుతుంది. ఫలితంగా నేర్చుకునే సామర్థ్యం తగ్గుతోంది. అధిక సమచారం మన నిర్ణయ సామర్థ్యంపై ప్రభావం చూపుతుందనీ, మేధపై ఒత్తిడిని పెంచుతుందనీ... ఫలితంగా నేర్చుకున్నది మనకు గుర్తుండే అవకాశాలు తగ్గిపోతాయనీ ఇప్పటికే జరిగిన పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
తగిన రీతిలో మన మెదడును వాడుకోకపోతే కాలక్రమంలో దీని నిర్మాణంలోనూ తేడాలొస్తాయి. అయితే టెక్నాలజీ నేరుగా మెదడు కుంచించుకు పోయేలా చేస్తుంది అనేందుకు ప్రస్తుతానికి స్పష్టమైన రుజువుల్లేవు. మన మెదడులోని న్యూరాన్లు అవసరా నికీ, కొత్త పరిస్థితులకూ, టూల్స్‌కూ తగ్గట్టుగా తమని తాము మార్చుకోగలవు. తగిన విధంగా వాడుకోక పోవడం వల్ల మెదడు చేసే కొన్ని పనుల సామర్థ్యం తగ్గవచ్చునేమో కానీ... టెక్నాలజీ ద్వారా కొన్నింటిని పెంచుకోవచ్చు కూడా. వీడియో గేమ్‌లను ఉదాహ రణగా తీసుకుంటే... వీటితోప్రాదేశిక తార్కికత (స్పేషి యల్ రీజనింగ్), మల్టీటాస్కింగ్ సామర్థ్యాలు పెరుగు తాయని పరిశోధనలు చెబుతున్నాయి.
అధిగమించడమెలా?
డిజిటల్ టెక్నాలజీల ద్వారా వస్తున్న మేధో సంబంధిత సమస్యలను అధిగమించేందుకు: సోషల్ మీడియా బ్రౌజింగ్ లేదా ఇతర డిజిటల్ అలవాట్లను రోజులో నిర్దిష్ట సమయానికి పరిమితం చేయాలి. వారంలో ఒక రోజు స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్‌లో షార్ట్స్, రీల్స్‌ను చూడకుండా నియంత్రించుకోవాలి. ఏకాగ్రతను, వాస్తవికంలో ఉండేట్టు చేసే ‘మైండ్‌ఫుల్ నెస్ టెక్నిక్‌లను ఉపయోగించాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మన మేధాశక్తికి బలం చేకూరుస్తుందనీ, జ్ఞాపకశక్తిని పెంచడంతోపాటు ఇతర లాభాలు చేకూరుస్తుందనీ పరిశోధనలు చెబు తున్నాయి. పుస్తకాలు చదవడం మన ఏకాగ్రతను పెంచేందుకు మంచి మార్గం. ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ‘డిజిటల్ డీటాక్స్’ను మొదలు పెట్టాలి.
సోషల్ మీడియా, డిజిటల్ కంటెంట్‌ను నిర్దిష్ట సమయం పాటు దూరంగా ఉండే ఈ డిజిటల్ డీటాక్స్ వల్ల టెక్నాలజీపై ఆధారపడే అల వాటు తగ్గుతుంది. అలాగే ప్రకృతికి దగ్గరగా జీవించడం, కళల పట్ల అభిరుచిని పెంచుకోవడం వంటివి సత్ఫలితాలను ఇస్తాయి. రోజూ తగినంత సమయం నిద్రపోవడం కూడా మన జ్ఞాపకశక్తి బలపడేందుకు, మేధోశక్తి పెరిగేందుకు దోహదపడుతుంది. ఈ పద్ధ తులు అన్నింటినీ పాటించడం ద్వారా టెక్నాలజీ సవాళ్లను అధిగమించవచ్చు.
బి.టి. గోవిందరెడ్డి
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్