
ఈ నెల 3–4న సమావేశం
పన్ను సంస్కరణలపై చర్చ
నేడు మార్కెట్లకు జీడీపీ జోష్
ఆటో రంగ విక్రయాలు కీలకం
ఈ వారం మార్కెట్లపై అంచనా
కొద్ది రోజులుగా అటు దేశీ స్టాక్ మార్కెట్లకు, ఇటు పరిశ్రమ వర్గాలకు కీలకంగా మారిన వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) సంస్కరణలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టారు. మంగళ,
బుధ వారాల్లో జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంకానుంది. మరోపక్క విశ్లేషకుల అంచనాలను మించుతూ 2025 ఏప్రిల్–జూన్‌లో దేశ ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం ఎగసింది. దీంతో నేడు మార్కెట్లు కొంతమేర బలపడే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం..
గత వారాంతాన వెలువడిన స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) గణాంకాలు పలువురు విశ్లేషకులను ఆశ్చర్యపరిచాయి. ఆర్థిక వృద్ధి 6.5 శాతం అంచనాలను మించుతూ ఏకంగా 7.8 శాతం బలపడింది. దీంతో దేశీయంగా సెంటిమెంటుకు జోష్‌రానున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. అయితే యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ విధించిన అదనపు(25 శాతం) టారిఫ్‌లు సైతం అమల్లోకిరావడంతో గత వారం స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. విదేశీ ప్రతికూలతలున్నప్పటికీ ప్రభుత్వ వ్యయాలు, పాలసీ విధానాలు వంటి అంశాలు సానుకూలతకు దోహదం చేయవచ్చని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు.
చర్చలు షురూ
జీడీపీ జోరుకుతోడు జీఎస్‌టీ సంస్కరణల ప్రతిపాదనలపై పరిశ్రమవర్గాల్లో భారీ ఆశలు నెలకొన్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్‌వీపీ అజిత్ మిశ్రా తెలియజేశారు. జీఎస్‌టీ కౌన్సిల్ 2, 3 తేదీలలో నిర్వహించనున్న సమావేశాలలో పన్ను సంస్కరణల ప్రతిపాదనలపై చర్చించనుంది. దీంతో వస్తు, సేవల పన్ను సంస్కరణల అమలుపై అంచనాలు అధికమైనట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. పన్ను రేట్లను భారీగా కుదించడంసహా శ్లాబులను తగ్గించేందుకు చేసిన ప్రతిపాదనలపై కౌన్సిల్ చర్చించనుంది.
పలు గణాంకాలు
ఈ వారం దేశీయంగా ఆగస్ట్ నెలకు వాహన విక్రయ గణాంకాలు వెలువడనున్నాయి. గత నెల హెచ్‌ఎస్‌బీసీ తయారీ, సర్వీసు రంగ పీఎంఐ ఇండెక్సుల తీరు సైతం వెల్లడికానుంది. శుక్రవారం(12న) ఆగస్ట్ రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు వెల్లడికానున్నాయి. జూలైలో సీపీఐ 1.55 శాతానికి నీరసించింది. విదేశీ అంశాలకు వస్తే గత నెలకు చైనా తయారీ, సర్వీసుల రంగ వివరాలు తెలియనున్నాయి. గత నెలకు వ్యవసాయేతర రంగాలలో ఉపాధి కల్పన, నిరుద్యోగ గణాంకాలను యూఎస్ విడుదల చేయనుంది. వెరసి దేశ, విదేశీ గణాంకాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు కీలకంగా నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ అభిప్రాయపడ్డారు.
ఇతర అంశాలు
ఇటీవల కొద్ది రోజులుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే మొగ్గు చూపుతున్నారు. దీంతో మార్కెట్లపై ఒత్తిడి పడుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడటం ప్రతికూలంగా పరిణమించనున్నట్లు అభిప్రాయపడ్డారు. గత వారం డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ 88ను దాటి చరిత్రాత్మక కనిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. ఇవేకాకుండా ముడిచమురు ధరల కదలికలకూ ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు.
గత వారమిలా
వినాయక చవితి పండుగ సందర్భంగా నాలుగు రోజులకే పరిమితమైన ట్రేడింగ్‌లో దేశీ స్టాక్ మార్కెట్లు క్షీణపథంలో సాగాయి. గత వారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ నికరంగా 1,497 పాయింట్లు(1.8 శాతం) కోల్పోయింది. 79,810 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 443 పాయింట్లు(1.8 శాతం) క్షీణించి 24,427 వద్ద స్థిరపడింది. ఈ బాటలో బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ మరింత అధికంగా 2.7 శాతంపైగా పతనమయ్యాయి.
సాంకేతికంగా
విదేశీ ఇన్వెస్టర్ల నిరంతర అమ్మకాలు, యూఎస్ ప్రెసిడెంట్ విధించిన అదనపు సుంకాలు అమల్లోకిరావడం, రూపాయి సరికొత్త కనిష్టాన్ని చవిచూడటం తదితర ప్రతికూలతలు ఇటీవల సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టీకి 24,300 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభించవచ్చు. ఆపై 24,100, 24,000 స్థాయిలో సపోర్ట్ కనిపించవచ్చు. ఒకవేళ నిఫ్టీ బలాన్ని పుంజుకుంటే 25,000 పాయింట్లను తాకవచ్చు. తదుపరి 25,250 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. సెన్సెక్స్ 79,150, 79,000 పాయింట్లవరకూ క్షీణించవచ్చు. ఆ స్థాయిలో బౌన్స్‌అయితే 82,000 వరకూ పుంజుకునే వీలుంది.
ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలు
రూ. 35,000 కోట్లు వెనక్కి
గత 6 నెలల్లో అత్యధికం
గత నెల(ఆగస్ట్)లో ఎఫ్‌పీఐలు భారీ అమ్మకాలకు తెరతీశారు. దేశీ స్టాక్స్ నుంచి అత్యధిక శాతం పెట్టుబడులు వెనక్కి తీసుకునేందుకే ప్రాధాన్యమిచ్చారు. వెరసి ఆగస్ట్‌లో నికరంగా రూ. 34,993 కోట్ల (సుమారు 4 బిలియన్ డాలర్లు) విలువైన స్టాక్స్ విక్రయించారు. ఇది గత ఆరు నెలల్లోనే అత్యధికంకాగా.. జూలై అమ్మకాల (రూ.17,741 కోట్లు)తో పోలిస్తే రెట్టింపుకావడం గమనార్హం! దీంతో డిపాజిటరీ గణాంకాల ప్రకారం 2025 కేలండర్ ఏడాదిలో దేశీ స్టాక్స్ నుంచి మొత్తం రూ. 1.3 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నట్లయ్యింది. ఇంతక్రితం ఎఫ్‌పీఐలు 2025 ఫిబ్రవరిలో మాత్రమే ఈ స్థాయిలో అంటే రూ.34,574 కోట్ల స్టాక్స్ విక్రయించారు. ఇందుకు దేశ, విదేశీ అంశాలు కారణమవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దేశీయంగా కొన్ని రంగాలలో క్యూ1 ఫలితాలు నిరాశపరచడం, యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అదనపు టారిఫ్‌ల విధింపు వంటి అంశాలను ప్రస్తావించారు.
– సాక్షి, బిజినెస్ డెస్క్