
ద్రవ్యోల్బణం, విదేశీ పెట్టుబడులపై కన్ను
ప్రపంచ మార్కెట్ల పరిస్థితులకూ ప్రాధాన్యం
ఈ వారం దేశీ మార్కెట్ల ట్రెండ్‌పై అంచనాలు
ప్రధానంగా దేశ, విదేశీ ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు కీలకంగా నిలవనున్నాయి. వీటికితోడు జీఎస్‌టీ సంస్కరణల ప్రభావం, యూఎస్‌తో వాణిజ్య పరిస్థితులు తదితరాలు సైతం ప్రభావం చూపనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. యూఎస్ అదనపు టారిఫ్‌ల అమలు ప్రతికూల ప్రభావాన్ని చూపగా.. జీఎస్‌టీ సంస్కరణలు జోష్ నివ్వడంతో గత వారం ఆటుపోట్ల మధ్య మార్కెట్లు 1 శాతంపైగా బలపడ్డాయి. వివరాలు చూద్దాం..
వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) సంస్కరణలకు గత వారం తెరతీయడంతో పలు రంగాలకు లబ్ది చేకూరనున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. దీంతో ఇటీవల మందగించిన ఆటో రంగంతోపాటు.. ఎఫ్‌ఎంసీజీ, ఆతిథ్యం, వినియోగ, ఫుట్‌వేర్ తదితర రంగాలు పుంజుకోనున్నట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫలితంగా దేశీ స్టాక్ మార్కెట్లకు సైతం జోష్ వచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. ఈ వారం దేశ, విదేశీ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్నాయి. ఆగస్ట్ నెలకు వినియోగ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) వివరాలు శుక్రవారం(12న) వెలువడనున్నాయి. జూలైలో రిటైల్ ధరల రేటు(సీపీఐ) వరుసగా 9వ నెలలోనూ వెనకడుగు వేసింది. 2.1 శాతం నుంచి 1.55 శాతానికి తగ్గింది.
చైనా వాణిజ్య మిగులు..
ఆగస్ట్ నెలకు చైనా వాణిజ్య గణాంకాలు నేడు(8న) వెల్లడికానున్నాయి. జూలై చైనా వాణిజ్య మిగులు 98.24 బిలియన్ డాలర్లను తాకింది. దిగుమతులను మించుతూ ఎగుమతులు భారీగా పెరిగిపోవడం మిగులుకు దారి చూపే సంగతి తెలిసిందే. ఇక ఆగస్ట్ సీపీఐ వివరాలు బుధవారం(10న) వెలువడనున్నాయి. జూలైలో సీపీఐ 0.1 శాతం పెరిగింది.
ఇతర అంశాలు
యూఎస్ వాణిజ్య టారిఫ్‌లు, ప్రపంచ స్టాక్ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు, విదేశీ ఇన్వెస్టర్ల తీరు, ముడిచమురు ధరలు, ఆరు ప్రపంచ కరెన్సీలతో మారకంలో డాలరు కదలికలు వంటి అంశాలు సైతం దేశీయంగా సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ నిపుణులు వివరించారు. యూఎస్ గణాంకాలకుతోడు భారత్‌తో వాణిజ్య టారిఫ్‌లపై వార్తలు ఇన్వెస్టర్లను ప్రభావితం చేయనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్‌వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. అయితే ఇన్వెస్టర్లు వినియోగ ఆధారిత, పెట్టుబడి వ్యయాలకు సంబంధించిన రంగాలవైపు దృష్టిసారించే వీలున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ తెలియజేశారు.
మార్కెట్లలో అప్రమత్తత కనిపించనున్నట్లు పేర్కొన్నారు. అటు యూఎస్ టారిఫ్‌ల అమలు, ఇటు జీఎస్‌టీ సంస్కరణల నేపథ్యంలో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు కీలకంగా నిలవనున్నట్లు మార్టస్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా అభిప్రాయపడ్డారు. కాగా.. ఈ వారం ద్రవ్యోల్బణ గణాంకాలేకాకుండా ఈసీబీ వడ్డీ పాలసీ సమీక్ష, జపాన్ రెండో త్రైమాసిక(ఏప్రిల్–జూన్) జీడీపీ వివరాలు వెల్లడికానున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా వెల్లడించారు.
యూఎస్ నిరుద్యోగిత
యూఎస్ నిరుద్యోగ గణాంకాలు ఆగస్ట్ చివరి వారంలో 8,000 పెరిగి 2,37,000కు చేరాయి. వెరసి నిరుద్యోగ లబ్ది దరఖాస్తులు జూన్ తదుపరి అధికంగా నమోదయ్యాయి. గత నెలలో ప్రయివేట్ రంగ ఉపాధి 54,000 పుంజుకోగా.. జూలైలో వాణిజ్య లోటు దాదాపు 33 శాతం పెరిగి 78 బిలియన్ డాలర్లను దాటింది. జూలైలో కోవిడ్–19 తదుపరి గరిష్టస్థాయిలో నిరుద్యోగిత నమోదైంది. ట్రంప్ వాణిజ్య టారిఫ్‌లు, తదితర అంశాలు ఉపాధిని దెబ్బతీసినట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. దీంతో ఫెడరల్ రిజర్వ్ ఈ నెల 16–17 తేదీలలో చేపట్టనున్న పాలసీ సమీక్షలో వడ్డీ రేట్ల కోతకు మొగ్గు చూపవచ్చన్న అంచనాలు బలపడ్డాయి. ఈ బాటలో ఆగస్ట్ నెలకు యూఎస్ ఉత్పత్తిదారుల ధరల ఇండెక్స్ 10న వెల్లడికానుంది. జూలైలో ఇది 0.9% బలపడింది. గత నెల ద్రవ్యోల్బణ వివరాలు 11న వెల్లడికానున్నాయి. జూలైలో కీలక ద్రవ్యోల్బణం వార్షికంగా 2.7% పెరిగింది.
గత వారమిలా..
ప్రధానంగా జీఎస్‌టీ సంస్కరణలు ఆకట్టుకోవడంతో గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ను సాధించాయి. దీంతో యూఎస్ ప్రెసిండెట్ ట్రంప్ విధించిన 25 శాతం అదనపు సుంకాలు సైతం అమల్లోకి వచి్చన ప్రతికూల వార్తలను అధిగమిస్తూ మార్కెట్లు నికరంగా లాభపడ్డాయి. గత వారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 901 పాయింట్లు(1.1 శాతం) బలపడి 80,711 వద్ద నిలిచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 314 పాయింట్లు(1.3 శాతం) ఎగసి 24,741 వద్ద స్థిరపడింది. అయితే బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు నామమాత్రంగానే లాభపడటం గమనార్హం!
– సాక్షి, బిజినెస్ డెస్క్