
1న వడ్డీ రేట్లపై నిర్ణయం
నేడు(29న) ఐఐపీ గణాంకాలు
30న ఎఫ్‌అండ్‌వో ముగింపు
ఫార్మాపై టారిఫ్‌ల ఎఫెక్ట్
2న మార్కెట్లకు సెలవు
ఈ వారం ట్రెండ్‌పై అంచనాలు
దేశీ స్టాక్ మార్కెట్లపై ఈ వారం పలు అంశాలు ప్రభావం చూపనున్నాయి. దేశీయంగా రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) పాలసీ సమీక్షను చేపట్టనుంది. ఆగస్ట్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు వెలువడనున్నాయి. ఇవికాకుండా యూఎస్ టారిఫ్‌లు, వీటిపై భారత్‌తో చర్చలు తదితర అంశాలు ఈ వారం ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. విజయదశమి, మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గురువారం(2న) మార్కెట్లకు సెలవుకావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. వివరాలు చూద్దాం..
హెచ్1బీ వీసా ఫీజు పెంపుతోపాటు.. గత వారం ఫార్మా ప్రొడక్టులపై తాజాగా టారిఫ్‌లు విధించినప్పటికీ యూఎస్‌తో భారత్ చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారత్ దిగుమతులపై విధించిన అదనపు టారిఫ్‌ల తొలగింపునకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు బలహీనపడ్డాయి. అయితే ఈ వారం ఇతర పలు అంశాల ఆధారంగా మార్కెట్లు స్పందించనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
నేడు(29న) ఆర్‌బీఐ పరిపతి సమావేశం ప్రారంభంకానుంది. బుధవారం( అక్టోబర్ 1న) వడ్డీ రేట్లపై నిర్ణయాలు వెలువడనున్నాయి. ఆగస్ట్‌లో నిర్వహించిన సమావేశంలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 5.5 శాతంవద్దే కొనసాగించేందుకు ఆర్‌బీఐ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) నిర్ణయించింది. జూన్‌లో 0.5 శాతం రేపోను తగ్గించినప్పటికీ ఈసారి యథాతథ పాలసీ అమలు లేదా 0.25 శాతం కోతకు వీలున్నట్లు ఆరి్థకవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఎఫ్‌అండ్‌వో ముగింపు
స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ గడువు ముగింపును ప్రతీ నెల చివరి గురువారం నుంచి మంగళవారానికి మార్చడంతో 30న సెప్టెంబర్ సిరీస్ ముగియనుంది. దీంతో మార్కెట్లలో హెచ్చుతగ్గులకు వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. మరోపక్క బీఎస్‌ఈ సైతం మంగళవారం నుంచి గురువారానికి ఎఫ్‌అండ్‌వో ముగింపు గడువును సవరించిన సంగతి తెలిసిందే. యూఎస్ టారిఫ్‌లు, వీటిపై చర్చలు, ఆర్‌బీఐ నిర్ణయాలు తదితర అంశాలన్నీ సెంటిమెంటుపై ప్రభావం చూపనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్‌వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. మరోపక్క ఆటో, వైట్‌గూడ్స్ తదితరాలపై పండుగల అమ్మకాల ప్రభావం, ఐఐపీ గణాంకాలపై సైతం ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలియజేశారు.
యాక్సెంచర్ దెబ్బ
ఓపక్క ఐటీ దిగ్గజం యాక్సెంచర్ నిరుత్సాహకర ఔట్‌లుక్‌ను ప్రకటించగా, మరోవైపు హెచ్1బీ వీసా వ్యయభరితంకానుండటంతో దేశీ ఐటీ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశమున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ అభిప్రాయపడ్డారు. యూఎస్ తాజా టారిఫ్‌లు సెంటిమెంటును దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. లార్జ్‌క్యాప్స్‌తో పోలిస్తే గత వారం మిడ్, స్మాల్ క్యాప్స్ భారీగా క్షీణించినట్లు తెలియజేశారు. ఈ ప్రభావం మార్కెట్లపై మరోసారి కనిపించవచ్చని అంచనా వేశారు.
ఇతర అంశాలు
ఆగస్ట్‌లో ఐఐపీ గణాంకాలు నేడు వెలువడనున్నాయి. జూలైలో పారిశ్రామికోత్పత్తి 3.5 శాతం పుంజుకుంది. అంతకుముందు నెలలో నమోదైన 1.5 శాతంతో పోలిస్తే భారీగా బలపడింది. సెపె్టంబర్ నెలకు హెచ్‌ఎస్‌బీసీ తయారీ పీఎంఐ అక్టోబర్ 1న విడుదలకానుంది. ఆగస్ట్‌లో ఈ ఇండెక్స్ 59.3గా నమోదైంది. విదేశీ అంశాలలో చైనా తయారీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీల ద్రవ్యోల్బణం, ఆ్రస్టేలియా వడ్డీ రేట్ల సమీక్షసహా సెపె్టంబర్‌లో యూఎస్ నిరుద్యోగ రేటు గణాంకాలు వెల్లడికానున్నాయి. ఈ అంశాలకూ ఈ వారం ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
గత వారమిలా
వరుసగా ఆరు రోజులపాటు మార్కెట్లు క్షీణ పథంలో సాగడంతో సెంటిమెంటు బలహీనపడింది. దీంతో గత వారం సెన్సెక్స్ 2,200 పాయింట్లు(2.66 శాతం) పతనమై 80,426 వద్ద ముగిసింది. నిఫ్టీ 672 పాయింట్లు(2.65 శాతం) క్షీణించి 24,655 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ 2 శాతం చొప్పున
నీరసించాయి.
రూపాయి క్షీణత
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు, డాలరుతో మారకంలో రూపాయి భారీ క్షీణత, యూఎస్ వాణిజ్య టారిఫ్‌ల కారణంగా గత వారం మార్కెట్లు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశి్చత పరిస్థితులు కొనసాగుతుండటంతో రక్షణాత్మక పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ పుంజుకోగా.. ఈక్విటీలు క్షీణిస్తున్నట్లు తెలియజేశారు. టారిఫ్‌లపై యూఎస్‌తో ప్రభుత్వ చర్చలు, ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు వంటి అంశాలు స్వల్ప కాలానికి మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు.
– సాక్షి, బిజినెస్ డెస్క్