
సావరిన్ క్రెడిట్ రేటింగ్‌తో బూస్ట్
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో డీలా
యూఎస్, ఉక్రెయిన్, రష్యాపై కన్ను
ఈ వారం మార్కెట్లపై అంచనాలు
స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దీపావళికల్లా వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)లో భారీ సంస్కరణలకు తెరతీయనున్నట్లు ప్రకటించడం దేశీయంగా సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోపక్క గత వారం ఎస్‌అండ్‌పీ రెండు దశాబ్దాల తదుపరి దేశ సావరిన్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడం ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు తెలియజేశారు. అయితే ఉక్రెయిన్, తదితర అంశాలపై ట్రంప్, పుతిన్ సమావేశం ఎటూ తేల్చకపోవడంతో అంతర్లీనంగా అనిశ్చితి సైతం కనిపించనున్నట్లు విశ్లేషించారు. వివరాలు చూద్దాం...
రానున్న దీపావళికల్లా జీఎస్‌టీలో శ్లాబులను, రేట్లను కనిష్టానికి సవరించనున్నట్లు ప్రధాని మోడీ పేర్కొనడంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్ లభించనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. గత 8 ఏళ్లుగా అమలు చేస్తున్న జీఎస్‌టీలో భారీ సంస్కరణలను తీసుకురానున్నట్లు ప్రధాని తెలియజేశారు. జీఎస్‌టీ నిబంధనల అమలు, పన్ను ఎగవేతలు, వివాదాలు ముసురుగొనడం వంటి సవాళ్లకు చెక్ పెట్టే బాటలో శ్లాబులను, రేట్లను తగ్గించనున్నట్లు సంకేతమిచ్చారు.
దీంతో స్టాక్ మార్కెట్లో సెంటిమెంటు బలపడే వీలున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. సరైన సమయంలో జీఎస్‌టీ 2.0కు తెరతీయనుండటంతో దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ లభించనున్నట్లు ఈవై ఇండియా ట్యాక్స్ పార్ట్‌నర్ సౌరభ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రపంచవ్యాప్త వాణిజ్య ఆందోళనల మధ్య ఇవి కేవలం విధానపరమైన మార్పులు కాదని, అత్యంత ఆవశ్యకమైన నిర్మాణాత్మక సంస్కరణలని పేర్కొన్నారు. జీఎస్‌టీలో సంస్కరణల కారణంగా వర్కింగ్ క్యాపిటల్ సమస్యలు పరిష్కారంకావడంతోపాటు.. పోటీ ప్రపంచంలో ఎగుమతులకు దన్ను లభించనున్నట్లు వివరించారు.
జెలెన్‌స్కీతో ట్రంప్ భేటీ కీలకం..
కొన్ని నెలలుగా రష్యా– ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధ పరిస్థితులకు చెక్ పెట్టే బాటలో గత వారాంతాన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ సమావేశమైన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమైంది. అయితే సమావేశ వివరాలు వెల్లడికానప్పటికీ.. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీతో ట్రంప్ భేటీపై మార్కెట్లు దృష్టిపెట్టనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్‌పై 25 శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు తెలియజేశారు. అయితే ముందు ప్రకటించినట్లు ఈ నెల 27నుంచి కొత్త టారిఫ్‌లు అమలుకాకపోవచ్చని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ అభిప్రాయపడ్డారు. ఇది మార్కెట్లలో సానుకూలతకు దోహదపడే వీలున్నట్లు అంచనా వేశారు.
ఫెడ్ మినిట్స్
ఈ వారం యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ గత పాలసీ సమీక్షా నిర్ణయాల వివరాలు(మినిట్స్) వెల్లడికానున్నాయి. ఫండ్స్ రేట్లను 4.25–4.5 శాతంగా కొనసాగించేందుకే ఫెడ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరోపక్క చైనా కేంద్ర బ్యాంకు 1–5 ఏళ్ల కాలావధి రుణాలపై వడ్డీ రేట్లను ప్రకటించనుంది. ఇవికాకుండా యూఎస్ హౌసింగ్ గణాంకాలు తదితరాలు వెలువడనున్నాయి. దేశీయంగా హెచ్‌ఎస్‌బీసీ తయారీ, సరీ్వసుల పీఎంఐ ఇండెక్స్‌లను ప్రకటించనున్నారు. వీటితోపాటు.. దేశీ స్టాక్స్‌లో విదేశీ ఇన్వెస్టర్ల తీరు, డాలరు మారకం, ముడిచమురు ధరలు వంటి అంశాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు. వెరసి కన్సాలిడేషన్ బాటలో సాగుతున్న మార్కెట్లు ఈ వారం ఆటుపోట్ల మధ్య కదిలే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.
రేటింగ్ ఎఫెక్ట్
గత వారం రేటింగ్ దిగ్గజం ఎస్‌అండ్‌పీ సుమారు 18 ఏళ్ల తరువాత దేశ సావరిన్ క్రెడిట్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసింది. స్థిరత్వంతోకూడిన ఔట్‌లుక్‌తో బీబీబీ రేటింగ్‌ను ప్రకటించింది. పటిష్ట ఆర్థిక పురోభివృద్ధి, ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వ కట్టుబాటు, ద్రవ్యోల్బణ అదుపునకు ఆర్‌బీఐ అనుసరిస్తున్న సానుకూల పరపతి విధానాలు ఇందుకు పరిగణనలోకి తీసుకున్నట్లు ఎస్‌అండ్‌పీ వివరించింది. వెరసి ఇన్వెస్టర్లకు జోష్ లభించనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు.
గత వారమిలా..
నాలుగు రోజులకే పరిమితమైన గత వారం(11–14) ట్రేడింగ్‌లో ఎట్టకేలకు 6 వారాల వరుస నష్టాలకు చెక్ పడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 740 పాయింట్లు(0.9 శాతం) పుంజుకుని 80,598 వద్ద నిలిచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 268 పాయింట్లు(1.1 శాతం) ఎగసి 24,631 వద్ద ముగిసింది. అయితే బీఎస్‌ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం, స్మాల్ క్యాప్ 0.6 శాతం చొప్పున క్షీణించాయి.
సాంకేతికంగా చూస్తే..
ఆరు వారాల తదుపరి మార్కెట్లు గత వారం సానుకూలంగా ముగిసినప్పటికీ నష్టాల నుంచి బయటపడిన సంకేతాలు పూర్తిగా వెలువడనట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా మరో రెండు వారాలు కన్సాలిడేషన్ కొనసాగవచ్చని అంచనా వేశారు. వీరి విశ్లేషణ ప్రకారం ఈ వారం మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి సాంకేతికంగా తొలుత 24,450 పాయింట్ల వద్ద బలమైన మద్దతు లభించవచ్చు. ఇలాకాకుండా 24,700ను దాటి బలపడితే.. 24,800 వద్ద, 25,000 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. అమ్మకాలు అధికమై 24,450 దిగువకు చేరితే 24,000 సమీపానికి చేరే అవకాశముంది.
ఎఫ్‌పీఐల అమ్మకాల స్పీడ్
ఈ నెలలో రూ. 21,000 కోట్లు వెనక్కి
ఇటీవల దేశీ స్టాక్స్‌లో నిరవధిక విక్రయాలకు పాల్పడుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ నెలలో ఇప్పటివరకూ(1–14) రూ. 21,000 కోట్ల పెట్టుబడులను నికరంగా వెనక్కి తీసుకున్నారు. యూఎస్ వాణిజ్య సుంకాల భారం, తొలి త్రైమాసిక ఫలితాల నిరుత్సాహం, రూపాయి బలహీనత ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఈ కేలండర్ ఏడాదిలో ఇప్పటివరకూ దేశీ ఈక్విటీల నుంచి రూ. 1.16 లక్షల కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం జూలైలోనూ ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 17,741 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. మార్చి– జూన్‌మధ్య కాలంలో రూ. 38,673 కోట్లు ఇన్వెస్ట్ చేశారు!
– సాక్షి, బిజినెస్ డెస్క్