
యూఎస్ టారిఫ్‌ల అమలు కీలకం
జీఎస్‌టీ సంస్కరణలకూ ప్రాధాన్యత
ఈ వారం ట్రేడింగ్ 4 రోజులకే పరిమితం
స్టాక్ మార్కెట్ల ట్రెండ్‌పై నిపుణుల అంచనాలు
వినాయక చవితి సందర్భంగా బుధవారం దేశీ స్టాక్ మార్కెట్లకు సెలవుకావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసిక జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి. మరోపక్క యూఎస్ ప్రెసిడెంట్ ప్రకటించిన అదనపు టారిఫ్‌లు అమలుకానుండగా.. కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ సంస్కరణలపై దృష్టి పెట్టడం ద్వారా ఇటీవల పలు రంగాలతోపాటు.. స్టాక్ మార్కెట్లకు జోష్‌నిచి్చంది. వివరాలు చూద్దాం...
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్(క్యూ1) కాలానికి దేశ ఆర్థిక వృద్ధి గణాంకాలు శుక్రవారం(29న) వెలువడనున్నాయి. రష్యా చమురు కొనుగోళ్లను వ్యతిరేకిస్తూ యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ భారత్‌పై విధించిన 25 శాతం అదనపు సుంకాలకు బుధవారం(27) నుంచి తెరలేవనుంది. జాక్సన్ హోల్ వద్ద యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వార్షికంగా నిర్వహించే సదస్సు సందర్భంగా గత వారాంతాన ప్రస్తుత చైర్మన్ జెరోమీ పావెల్ వడ్డీ రేట్ల కోతకు వీలున్నదంటూ సంకేతాలిచ్చారు. బుధవారం గణేశ్ చతుర్ధి సందర్భంగా స్టాక్ మార్కెట్లు పనిచేయవు. దీంతో 4 రోజులకే పరిమితమైన ట్రేడింగ్‌లో ఈ వారం మార్కెట్ల సరళిపై విశ్లేషకులు పలు అంశాలు ప్రభావం చూపనున్నట్లు ప్రస్తావిస్తున్నారు.
జీడీపీపై అంచనాలు
ఈ ఏడాది క్యూ1లో దేశ ఆర్థిక వ్యవస్థ 6.7 శాతం వృద్ధి చూపగలదని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వ వ్యయాలు పెరగడం, గ్రామీణ డిమాండ్ పుంజుకోవడం, సర్వీసుల రంగం పటిష్ట పురోగతి వంటి అంశాలు సహకరించనున్నట్లు భావిస్తున్నారు. గతేడాది(2024–25) చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో దేశ జీడీపీ 7.4 శాతం బలపడింది. ఈ బాటలో జూలై పారిశ్రామికోత్పత్తి ఇండెక్స్(ఐఐపీ) వివరాలు గురువారం(28న) వెల్లడికానున్నాయి.
జూన్‌లో ఐఐపీ 2024 ఆగస్ట్ తదుపరి కనిష్టంగా 1.5 శాతం పుంజుకుంది. జీడీజీ, ఐఐపీ గణాంకాలు బలపడితే.. మార్కెట్లు మరింత పుంజుకునే వీలున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్‌వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. జీఎస్‌టీ శ్లాబులతోపాటు.. రేట్లను భారీగా తగ్గించనున్న వార్తలతో పలు రంగాలకు హుషారొచి్చనట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. వెరసి జీఎస్‌టీ సంస్కరణలపై అంచనాలు గత వారం దేశీ స్టాక్ మార్కెట్లకు బలాన్నిచి్చనట్లు పేర్కొన్నారు.
విదేశీ అంశాలు
యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్.. కొద్ది రోజులుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య సయోధ్యకు ప్రయతి్నస్తున్న నేపథ్యంలో భారత్‌పై విధించిన 25 శాతం అదనపు టారిఫ్‌ల అమలు వాయిదా పడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఇదికాకుండా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడ్ చైర్మన్ పావెల్ భవిష్యత్‌లో వడ్డీ రేట్ల కోత సంకేతాలు ఇవ్వడం సెంటిమెంటుకు బలాన్నివ్వనున్నట్లు తెలియజేశారు.
ఇది ఇటీవల దేశీ స్టాక్స్‌లో నిరంతర విక్రయాలకు పాల్పడుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు)ను యూటర్న్ తీసుకునేలా ప్రోత్సహించవచ్చని అభిప్రాయపడ్డారు. ఇక యూఎస్ హౌసింగ్ విక్రయాలు, ఫ్యాక్టరీ ఆర్డర్లు తదతర గణాంకాలు సైతం ఈ వారం వెలువడనున్నాయి. ఈ అంశాలన్నిటినీ ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. ఫెడ్ వడ్డీ రేట్ల సంకేతాలతో గత వారాంతాన యూఎస్ మార్కెట్లు 2 శాతంవరకూ బలపడటాన్ని ఈ సందర్భంగా జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ ప్రస్తావించారు.
డౌన్‌ట్రెండ్‌కు
చెక్.. ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్ వేస్తూ గత వారం చివర్లో భారీ అమ్మకాలు తలెత్తాయి. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లు నికరంగా 1 శాతం లాభంతో ముగిశాయి. అయితే గత వారం ఆరు వారాల నష్టాలకు చెక్ పడింది. కాగా.. ఈ వారం పలు దేశ, విదేశీ అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ కదలికలపై సాంకేతిక అంశాలతో ఇలా విశ్లేషించారు. వీటి ప్రకారం మార్కెట్లలో డౌన్‌ట్రెండ్‌కు కొంతమేర చెక్ పడింది.
అంతేకాకుండా ట్రెండ్ రివర్సల్(బుల్లి‹Ù)కు సంకేతాలు అందుతున్నాయి. ఎఫ్‌పీఐలు అమ్మకాలను వీడి కొనుగోళ్ల టర్న్ తీసుకుంటే మరింత బలపడే వీలుంది. వెరసి మార్కెట్లు బలహీనపడితే సెన్సెక్స్ 80,800–80,700 పాయింట్ల వద్ద మద్దతు తీసుకోవచ్చు. ఒకవేళ పుంజుకుంటే 82,200 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. తదుపరి 83,600–83,700 పాయింట్లవరకూ బలపడే వీలుంది. నిఫ్టీకి 24,600 పాయింట్ల తొలి సపోర్ట్ లభించవచ్చు. 24,500 వద్ద మరోసారి మద్దతు కనిపించవచ్చు. బలపడితే.. తొలుత 25,200 పాయింట్ల వద్ద, ఆపై 25,500 వద్ద రెసిస్టెన్స్‌కు వీలుంది.
– సాక్షి, బిజినెస్ డెస్క్