
ఆటో, ఎలక్ట్రానిక్స్ జోరు
వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) తగ్గింపుతో పండగ సీజన్లో అమ్మకాలకు బూస్ట్ ఇచ్చినట్లయింది. ఈసారి నవరాత్రుల్లో దశాబ్దకాలంలోనే అత్యధికంగా విక్రయాలు నమోదయ్యాయి. వాహనాలు, కన్జూమర్ ఎల్రక్టానిక్స్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గతేడాది నవరాత్రులతో పోలిస్తే మారుతీ సుజుకీ సేల్స్ రెట్టింపయ్యాయి. 3.5 లక్షల బుకింగ్స్ నమోదయ్యాయి. నవరాత్రుల్లో తొలి ఎనిమిది రోజుల్లో కంపెనీ 1.65 లక్షల వాహనాలను డెలివరీ చేసింది.
మారుతీ సుజుకీ గతేడాది ఇదే వ్యవధిలో సుమారు 85,000 వాహనాలను విక్రయించింది. మహీంద్రా అండ్ మహీంద్రా వాహనాల అమ్మకాలు 60 శాతం పెరిగాయి. క్రెటా, వెన్యూలాంటి మోడల్స్‌కి డిమాండ్ నెలకొనడంతో హ్యుందాయ్ వాహన విక్రయాల్లో ఎస్‌యూవీల వాటా దాదాపు 72 శాతంగా నమోదైంది. టాటా మోటర్స్ 50,000కు పైగా వాహనాలను విక్రయించింది. ఆ్రల్టోజ్, పంచ్, నెక్సాన్, టియాగోలాంటి మోడల్స్‌కి డిమాండ్ నెలకొంది. ఇక ద్విచక్ర వాహనాల సంస్థ హీరో మోటోకార్ప్ షోరూంలను సందర్శించే వారి సంఖ్య రెట్టింపు కాగా, బజాజ్ ఆటో విక్రయాలు సైతం గణనీయంగా పెరిగాయి.
ఎల్‌జీ, హయర్ రెండంకెల స్థాయి వృద్ధి..
కన్జూమర్ ఎల్రక్టానిక్స్ విభాగంలో ఎల్‌జీ, హయర్, గోద్రెజ్ అప్లయెన్సెస్ మొదలైన సంస్థల విక్రయాలు రెండంకెల స్థాయిలో పెరిగాయి. హయర్ అమ్మకాలు 85 శాతం ఎగిశాయి. 65 అంగుళాల టీవీలను రోజుకు 300–350 మేర విక్రయించింది. రూ. 2.5 లక్షల పైగా ఉండే 85 అంగుళాలు, 100 అంగుళాల టీవీలకు సంబంధించి దీపావళి స్టాక్ దాదాపుగా అమ్ముడైపోయింది. అతిపెద్ద రిటైల్ సంస్థ రిలయన్స్ రిటైల్ విక్రయాలు 20–25 శాతం పెరిగాయి. పెద్ద స్క్రీన్ టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ఫ్యాషన్ మొదలైన విభాగాల్లో భారీగా అమ్మకాలు నమోదయ్యాయి. విజయ్ సేల్స్ విక్రయాలు కూడా 20 శాతం పెరిగాయి.
ఇదీ చదవండి: తయారీ రంగంలో వృద్ధికి వ్యూహాలు