అక్టోబర్‌లో 11.8 శాతం తగ్గుదల
34.38 బిలియన్ డాలర్లకు పరిమితం
భారీగా పసిడి దిగుమతులు
41.68 బిలియన్ డాలర్లకు వాణిజ్య లోటు
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌లు మన దేశ ఎగుమతులపై అక్టోబర్‌లో చెప్పుకోతగ్గ ప్రభావమే చూపించాయి. వస్తు ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 11.8 శాతం తక్కువగా 34.38 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇదే నెలలో దిగుమతులు 16.63 శాతం అధికమై 76.06 బిలియన్ డాలర్లకు చేరాయి.
దీంతో వాణిజ్య లోటు 41.68 బిలియన్ డాలర్లుగా నమోదైంది. భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్‌లను అమలు చేస్తుండడం తెలిసిందే. సేవల ఎగుమతులు 38.52 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో సేవల ఎగుమతులు 34.41 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం.
→ బంగారం దిగుమతులు 200 శాతం అధికమై 14.72 బిలియన్ డాలర్లకు చేరాయి. 2024 అక్టోబర్‌లో పసిడి దిగుమతుల విలువ 4.92 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు చూసినా బంగారం దిగుమతులు 21.44 శాతం పెరిగి 41.23 బివలియన్ డాలర్లకు చేరాయి.
→ వెండి దిగుమతులు ఏకంగా 529 శాతం పెరిగి 2.71 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
→ చమురు దిగుమతులు మాత్రం 14.8 బిలియన్ డాలర్లకు తగ్గాయి. 2024 అక్టోబర్‌లో చమురు దిగుమతులు 18.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే చమురు దిగుమతుల స్థాయికి బంగారం దిగుమమతులు చేరినట్టు తెలుస్తోంది.
→ ఇంజనీరింగ్ ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాభరణాలు, అపారెల్స్, టెక్స్‌టైల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, ప్లాస్టిక్ గూడ్స్ ఎగుమతులు చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గాయి. ఇక చేతి ఉత్పత్తులు, కార్పెట్, లెదర్, ఐరన్‌ఓర్, టీ, రైస్, పొగాకు, దినుసుల ఎగుమతులు మరింత క్షీణించాయి.
→ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ కాలంలో ఎగుమతులు 254.25 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 0.63 శాతం ఎక్కువ. ఇదే కాలంలో దిగుమతులు 6.37 శాతం పెరిగి 451.08 బిలియన్ డాలర్లకు చేరాయి. తొలి ఆరు నెలల్లో వస్తు వాణిజ్య లోటు 196.82 బిలియన్ డాలర్లుగా ఉంది.
మొత్తం దిగుమతుల్లో 5 శాతం
బంగారం దిగుమతుల విలువ మొత్తం ఎగుమతుల్లో 5 శాతంగా ఉండడం గమనార్హం. అయితే, పసిడి దిగుమతులు భారీగా పెరగడానికి పండుగల సమయంలో డిమాండ్ కారణమని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేజ్ అగర్వాల్ పేర్కొన్నారు. బంగారం దిగుమతుల్లో 40 శాతం స్విట్జర్లాండ్ నుంచి రాగా, యూఏఈ నుంచి 16 శాతం, దక్షిణాఫ్రికా నుంచి 10 శాతం చొప్పున దిగుమతైంది.


