వృద్ధి అవకాశాలు పటిష్టం | Finance Ministry projects robust growth in FY26 | Sakshi
Sakshi News home page

వృద్ధి అవకాశాలు పటిష్టం

Oct 28 2025 6:27 AM | Updated on Oct 28 2025 6:27 AM

Finance Ministry projects robust growth in FY26

అంతర్జాతీయంగా అనిశ్చితులున్నా సరే 

ఆర్థిక శాఖ సమీక్షా నివేదిక వెల్లడి 

వినియోగం బలంగా ఉంటుందన్న అంచనా

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నప్పటికీ దేశీ ఆర్థిక వృద్ధి మూలాలు 2025–26 ఆర్థిక సంవత్సరానికి బలంగానే ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సమీక్షా నివేదిక వెల్లడించింది. మెరుగైన వర్షపాతం, ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిలో ఉండడం, వడ్డీ రేట్లు తగ్గించడం, జీఎస్‌టీ సంస్కరణల సానుకూల ఫలితంతో దేశీ డిమాండ్‌ బలంగా ఉంటుందని పేర్కొంది. ‘‘అంతర్జాతీయంగా ఆర్థిక, వాణిజ్య అనిశ్చుతులు నెలకొన్నాయి. 

అయినప్పటికీ 2025–26 క్యూ2లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. ఆగస్ట్‌లో భారత ఉత్పత్తులపై అమెరికా అధిక టారిఫ్‌లు విధించిన తరుణంలోనూ ఈ స్థాయి పనితీరు చెప్పుకోతగినది’’అని ఆర్థిక శాఖ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. సరఫరాకు సంబంధించి కీలక కొలమానాలు మెరుగైన వృద్ధిని సూచిస్తున్నాయని.. జీఎస్‌టీ సంస్కరణలకు, పండుగల సెంటిమెంట్‌ తోడై వినియోగం మెరుగుపడుతుందని తెలిపింది. 

2025–26పై భారత వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్‌ 6.6 శాతానికి, ఆర్‌బీఐ 6.8 శాతానికి పెంచడాన్ని గుర్తు చేసింది. ముఖ్యంగా జీఎస్‌టీ రేట్ల క్రమబద్దీకరణతో ధరలు నియంత్రణల్లోనే ఉంటాయంటూ (ద్రవ్యోల్బణం), ఇది వినియోగ డిమాండ్‌కు ఊతమిస్తుందని అభిప్రాయపడింది. ధరలు తగ్గడం వల్ల వినియోగదారులకు, వ్యాపార సంస్థలకూ ప్రయోజనం లభిస్తుందని, పెట్టుబడులు పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేయడం తెలిసిందే. అంచనాలకు మించి పనితీరు నమోదైంది. 

బలంగా సేవల ఎగుమతులు.. 
దేశ ఎగుమతులు బలంగా కొనసాగుతుండడాన్ని సైతం ఆర్థిక శాఖ తన సమీక్షలో ప్రస్తావించింది. బలమైన సేవల ఎగుమతులు వస్తు వాణిజ్య లోటును కొంత వరకు భర్తీ చేస్తున్నట్టు తెలిపింది. ఒకవైపు అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. మరోవైపు సెప్టెంబర్‌ నెలకు సంబంధించి ఎగుమతుల డేటాను పరిశీలిస్తే.. మరిన్ని దేశాలకు వైవిధ్యం అవుతుండడం కనిపిస్తోందని పేర్కొంది. 

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స్థూలంగా పెరగడం పెట్టుబడులకు భారత్‌ ఆకర్షణీయమైన కేంద్రంగా మారుతుండడాన్ని సూచిస్తున్నట్టు తెలిపింది. ఖరీఫ్‌ సీజన్‌లో రికార్డు స్థాయిలో పప్పు, ధాన్యాల సాగును ప్రస్తావించింది. అసాధారణ వతావరణ పరిస్థితుల్లో నూనె గింజల సాగు, మరికొన్ని పంటలపై ప్రభావం పడినప్పటికీ మొత్తం మీద ఆహారోత్పత్తి సానుకూలంగానే ఉన్నట్టు తెలిపింది. బ్యాంకుల రుణ వృద్ధి మోస్తరు స్థాయికి దిగొచి్చనప్పటికీ మొత్తం మీద వాణిజ్య రంగానికి నిధుల లభ్యత పరిస్థితులు మెరగుపడినట్టు పేర్కొంది. పరిశ్రమల్లో బలమైన పనితీరు సైతం ఆర్థిక వృద్ధికి మద్దతుగా 
నిలుస్తుందని పేర్కొంది.   
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement