
భారతదేశంలో ప్రతి సంవత్సరం పండుగ సీజన్‌లో వాహన విక్రయాలు కొంత పెరుగుతాయి. అయితే ఈ సారి మాత్రం వెహికల్ సేల్స్ ఊహకందని రీతిలో గణనీయంగా పెరిగాయి. దీనికి కారణం మోదీ ప్రభుత్వం అమలుచేసిన జీఎస్టీ 2.0 అని తెలుస్తోంది. కొత్త జీఎస్టీ సంస్కరణల కారణంగా.. కార్లు, బైకులు ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో సేల్స్ భారీగా పెరిగాయి.
ఆటోమొబైల్ రంగం
ఏ రంగం ఎలా ఉన్నా.. ఆటోమొబైల్ రంగానికి మాత్రం పండుగ సీజన్ బాగా కలిసొచ్చింది. మారుతి సుజుకి నవరాత్రి అమ్మకాలు.. గత సంవత్సరం కంటే రెట్టింపు అయ్యాయి. నవరాత్రి మొదటి ఎనిమిది రోజుల్లో 1.65 లక్షల వాహనాలను కంపెనీ డెలివరీ చేసింది. మొదటి రోజు 30,000 కార్లను డెలివరీ చేసి అమ్మకాల్లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. సంస్థ మొత్తం బుకింగ్‌లు 1.50 లక్షలుగా నివేదించింది. ఈ సంఖ్య రెండు లక్షలకు చేరుకుంటుందని కంపెనీ భావిస్తోంది. గత ఏడాది ఇదే సమయంలో సంస్థ 85,000 వాహనాలను విక్రయించింది. దీన్నిబట్టి చూస్తే.. మారుతి సుజుకి సేల్స్ ఏ స్థాయిలో పెరిగాయో స్పష్టంగా అర్థమవుతోంది.
ఇక దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఫెస్టివల్ సీజన్‌లో 60 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ ఎక్స్‌యూవీ700, స్కార్పియో ఎన్ వంటి కార్లను ఎక్కువ సంఖ్యలో విక్రయించింది. ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, టియాగో వంటి మోడళ్లకు డిమాండ్ పెరగడంతో టాటా మోటార్స్ 50,000 వాహనాలను విక్రయించింది. హ్యుందాయ్ క్రెటా, వెన్యూలకు డిమాండ్ పెరగడంతో..ఈ ఎస్‌యూవీల వాటా మొత్తం అమ్మకాలలో 72 శాతానికి పైగా పెరిగింది.
ఇక టూ వీలర్స్ విషయానికి వస్తే.. హీరో మోటోకార్ప్ ముందు వరుసలో నిలిచింది. అంటే ఈ బ్రాండ్ అమ్మకాలు భారీగా పెరిగాయి. కంపెనీ షోరూమ్‌ల వద్ద రద్దీ ఈ నవరాత్రిలో రెట్టింపు అయ్యింది. కమ్యూటర్ విభాగంలోని బైకుల సేల్స్ గణనీయంగా పెరిగాయి. బజాజ్ ఆటో కూడా బలమైన అమ్మకాలను నమోదు చేసింది.
ఎలక్ట్రానిక్స్ రంగం
ఆటోమొబైల్ రంగం పక్కన పెడితే.. ఎలక్ట్రానిక్స్ రంగం కూడా మంచి పురోగతిని సాధించింది. హైయర్ అమ్మకాలు 85 శాతం పెరిగాయి. ఈ కంపెనీ తన దీపావళి స్టాక్ అయిన.. 85 ఇంచెస్, 100 ఇంచెస్ టీవీలను దాదాపుగా విక్రయించేసింది. అంతే కాకుండా ఈ సంస్థ రోజుకు 300-350 యూనిట్ల 65 ఇంచెస్ టీవీలను సేల్ చేసింది.
ఇదీ చదవండి: గిఫ్ట్‌గా రూ.33 లక్షల కారు: అభిషేక్ శర్మపై పడే ట్యాక్స్ ఎంత?
భారతదేశంలోని అతిపెద్ద రిటైలర్ అయిన రిలయన్స్ రిటైల్ అమ్మకాలు.. గత సంవత్సరం నవరాత్రి కంటే 20-25 శాతం పెరిగాయి. పెద్ద స్క్రీన్ టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, ఫ్యాషన్ వంటి సేల్స్ అమాంతం పెరిగాయి. ఇదే సమయంలో ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ 'విజయ్ సేల్స్' అమ్మకాలు 20 శాతం కంటే ఎక్కువ వృద్ధి చెందాయి.