
దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా.. ఇండియన్ మార్కెట్లో తన థార్ (Mahindra Thar) ఎస్యూవీ లాంచ్ చేసినప్పటి నుంచి 3 లక్షలకు పైగా అమ్మకాలను నమోదు చేసింది. దీంతో ఈ ఆఫ్ రోడర్ సరికొత్త అమ్మకాల మైలురాయిని చేరుకుంది.
భారతదేశంలో మహీంద్రా థార్ అక్టోబర్ 2020లో ప్రారంభమైంది. అప్పటి నుంచి కేవలం ఐదు సంవత్సరాలలో మూడు లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. ఇందులో థార్ రాక్స్ సేల్స్ కూడా ఉన్నాయి. దీనిని (థార్ రాక్స్) కంపెనీ సెప్టెంబర్ 2024లో లాంచ్ చేసింది.
2026 ఆర్థిక సంవత్సరం మొదటి 5 నెలల్లో జరిగిన మొత్తం థార్ అమ్మకాలలో.. థార్ రాక్స్ 68 శాతం వాటా కలిగి ఉంది. దీన్నిబట్టి చూస్తే.. దేశీయ విఫణిలో థార్ రాక్స్ అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ కారు ధర కొత్త జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత రూ. 1.35 లక్షలు తగ్గింది. ఇది అమ్మకాలను మరింత పెంచే అవకాశం ఉంది.
మహీంద్రా థార్ ధరలు రూ. 10.32 లక్షల నుంచి ప్రారంభమై.. రూ. 16.61 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. అదే సమయంలో, మహీంద్రా థార్ రాక్స్ ధరలు రూ. 12.25 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. ఈ కార్లు భద్రతలో కూడా మంచి స్కోరింగ్ పొందడంతో.. ఎక్కువ మంది వీటిని కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు.