వారానికి 72 గంటల పని మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో ఈ వ్యాఖ్యలు చేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తిని కొందమంది సమర్ధించారు. మరికొందరు విమర్శించారు. అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ నిలవాలంటే.. 996 నియమం చాలా అవసరం అని ఆయన మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏమిటీ 996 రూల్?
చైనాలో పాటిస్తున్న 9-9-6 నియమాన్ని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 996 ఫార్ములా ప్రకారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పని, వారానికి 6 రోజులను సూచిస్తుంది. అంటే రోజుకు 12 గంటలు.. 6 రోజులు చేయాలన్నమాట. ఇలా మొత్తానికి వారానికి 72 గంటలు పనిచేయాలన్నమాట.
చైనాలోని చాలా కంపెనీలు ఈ నియమాన్ని పాటిస్తున్నాయి. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. కొన్ని సంస్థలు ఈ నియమాన్ని రద్దు చేసినప్పటికీ.. ఇంకొన్ని అమలు చేస్తూనే ఉన్నాయి. కాగా చైనా ప్రభుత్వం కూడా దీనిని క్రమంగా నియంత్రించడానికి తగిన చర్యలను తీసుకుంటోంది. అలాంటి ఈ విధానాన్ని నారాయణమూర్తి ప్రస్తావించడం.. కొంత మందిలో ఆగ్రహాన్ని కలిగిస్తోంది.
ప్రపంచ దేశాలతో మన దేశం పోటీ పడాలంటే.. తప్పకుండా యువత మరింత నిబద్దతతో పనిచేయాలి. భారత్ వృద్ధి రేటు 6.57 శాతం. దీని కంటే ఆరు రెట్లు పెద్ద ఆర్ధిక వ్యవస్థ కలిగిన చైనాతో మనం పోటీ పడాలంటే.. పనిగంటలు పెంచాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారానికి 100 గంటలు పనిచేస్తారని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు అన్నారు. పేదలకు అవకాశాలు కల్పించడానికి యువత కష్టపడి, తెలివిగా పనిచేయడానికి ఇది ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు.
నెటిజన్ల రియాక్షన్
నారాయణమూర్తి వ్యాఖ్యలపై చాలామంది నెటిజన్లు స్పందించారు. ఒకరు చైనా స్థాయి జీతాలు, మౌలిక సదుపాయాలు & జీవన వ్యయం ఇవ్వండి, తర్వాత మనం మాట్లాడుకుందాం అని అన్నారు. భారతదేశానికి 72 గంటల వారాలు అవసరం లేదు. అద్దె, కిరాణా సామాగ్రి, పాఠశాల ఫీజులు & పెట్రోల్‌కు సరిపోయే జీతాలు భారతదేశానికి అవసరం. ప్రజలు ఇప్పటికే కష్టాల్లో ఉన్నారని మరొక నెటిజన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: టెక్ కంపెనీ కొత్త చర్య.. భయపడుతున్న ఐటీ ఉద్యోగులు!
యూరప్ దేశంలో 10-5-5 విధానం నడుస్తోంది. దీని గురించి మీకు తెలుసా అంటూ.. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు పని, వారానికి 5 రోజులు మాత్రమే. ఈ దేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వారాంతాల్లో సంతోషంగా జీవితం గడుపుతారు అని ఇంకొక యూజర్ అన్నారు. ఇలా ఒక్కొక్కరు.. ఒక్కోలా నారాయణమూర్తి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.
🚨 "There is a saying in China, 9, 9, 6. You know what it means? 9 am to 9 pm, 6 days a week. And that is 72 hours work-week, " said Narayana Murthy. pic.twitter.com/FCeNFynG1F
— Indian Tech & Infra (@IndianTechGuide) November 17, 2025


