ఉద్యోగాలు పోతాయేమో అని ఉద్యోగులు భయపడుతున్న వేళ.. ప్రముఖ ఐటీ కంపెనీ చర్య వారిలో మరింత ఆందోళన కలిగిస్తోంది. కాగ్నిజెంట్ కంపెనీ ఉద్యోగులు తమ ల్యాప్‌టాప్‌లలో ఎంతసేపు యాక్టివ్‌గా ఉంటున్నారు, పని సమయంలో వారు ఏ అప్లికేషన్‌లు లేదా వెబ్‌సైట్‌లను ఉపయోగిస్తారో ట్రాక్ చేయడానికి సిద్ధమైంది. దీనికోసం సంస్థ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రోహ్యాన్స్ వంటి వర్క్‌ఫోర్స్ మేనేజ్‌మెంట్ సాధనాలను ఉపయోగించనున్నట్లు, దీనికోసం ఎంపిక చేసిన ఎగ్జిక్యూటివ్‌లకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించినట్లు సమాచారం.
కొత్త టెక్నాలజీ మాడ్యూల్.. మౌస్, కీబోర్డ్ కార్యకలాపాలను రికార్డ్ చేస్తుంది. తద్వారా ఎంప్లాయిస్ ఎంతసేపు పనిచేయకుండా ఉన్నారో ఇట్టే తెలిసిపోతుంది. 5 నిమిషాలు పనిచేయకుండా ఉంటే.. అలాంటి ఉద్యోగిని 'ఐడిల్' అని ట్యాగ్ చేయనున్నట్లు, ల్యాప్‌టాప్ 15 నిమిషాల పాటు పనిచేయకుండా ఉంటే.. ఉద్యోగి సిస్టమ్ నుంచి దూరంగా ఉండి, ఇతర పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు గురిస్తారు. ప్రస్తుతం దీనిని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
పనితీరును ర్యాంక్ చేయడానికి కాదు
ఈ కొత్త విధానం.. డేటా ప్రక్రియ దశలను అర్థం చేసుకోవడానికి, వినియోగాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించబడిందని కంపెనీ ఉద్యోగులకు తెలిపింది. ఇది వ్యక్తిగత పనితీరును ర్యాంక్ చేయడానికి లేదా రేట్ చేయడానికి కాదని వెల్లడించింది. కానీ వర్క్ ఫ్రమ్ చేస్తున్న ఉద్యోగులపై నిఘా పెట్టడానికే ఇలాంటి కొత్త విధానాలను అమలు చేస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. ఇది ఉద్యోగులలో ఒత్తిడిని పెంచుతుందని అంటున్నారు.
వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది!
కాగ్నిజెంట్ చర్య వల్ల ఉద్యోగుల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇబ్బదుల్లో పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులపై నమ్మకం లేనప్పుడే కంపెనీలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి. ల్యాప్‌టాప్ కదలికలను బట్టి ఉద్యోగి పనితీరును అంచనా వేయడం ఎంత వరకు కరెక్ట్ అని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇది కంపెనీ - ఉద్యోగుల మధ్య ఉన్న సంబంధాన్ని దెబ్బ తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: నా దృష్టిలో అది నిజమైన డబ్బు: మిగతాదంతా ఫేక్..


