
2025 ఆసియా కప్.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు కింద భారత యువ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మకు 'హవల్ హెచ్9' అనే లగ్జరీ కారు గిఫ్ట్‌గా లభించింది. ఈ కారు ధర సుమారు రూ. 33 లక్షలు అని సమాచారం. క్రికెటర్లు గిఫ్ట్‌గా స్వీకరించే కార్లు, ఇతర విలాసవంతమైన వస్తువులు పూర్తిగా పన్ను రహితం కాదు. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. వాటి విలువపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కథనంలో క్రికెటర్లు గిఫ్ట్‌గా అందుకునే కార్లపై ఎంత పన్ను చెల్లించాలి.. నియమాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం.
భారతదేశంలోని క్రికెటర్లు తరచుగా విలాసవంతమైన గిఫ్ట్స్ అందుకుంటారు. టోర్నమెంట్ గెలిచినప్పుడు లేదా అత్యుత్తమ ప్రదర్శన కనపరిచినప్పుడు కంపెనీలు, బ్రాండ్లు లేదా పారిశ్రామికవేత్తలు వారికి కార్లు, బైక్‌లు లేదా ఇతర విలాసవంతమైన వస్తువులను గిఫ్ట్‌గా ఇస్తారు. చాలా మంది ఈ గిఫ్ట్స్ పూర్తిగా ఉచితం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఆదాయపు పన్ను నియమాలు వీటికి కూడా వర్తిస్తాయి.
ఆదాయపు పన్ను చట్టం, 1961 నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఒక వస్తువును గిఫ్ట్‌గా స్వీకరిస్తే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే దగ్గరి బంధువు నుంచి.. అంటే వారి తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి లేదా తోబుట్టువుల నుంచి గిఫ్ట్ తీసుకుంటే, దానిపై పన్ను విధించబడదు. కానీ.. అదే గిఫ్ట్ కంపెనీ, బ్రాండ్, వ్యాపారవేత్త నుంచి వస్తే దానిపై పన్ను విధించబడుతుంది.
ఇదీ చదవండి: నాలుగు నిమిషాల మీటింగ్: ఉద్యోగం నుంచి తీసేశారు!
ఇక ట్యాక్స్ విషయానికి వస్తే.. చాలా మంది క్రికెటర్లు ఎక్కువగా సంపాదిస్తారు. కాబట్టి వీరు అత్యధిక పన్ను పరిధి(30 శాతం)లోకి వస్తారు. ఇది కాకుండా సెస్ కూడా యాడ్ అవుతుంది. మొత్తంగా 31.2 శాతం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. కాబట్టి వీరు తీసుకునే గిఫ్ట్‌కు అదే పన్ను విధించబడుతుంది. ఉదాహరణకు, ఒక క్రికెటర్ రూ. 20 లక్షల విలువైన కారును గిఫ్ట్‌గా అందుకుంటే, అతను ఆ గిఫ్ట్‌పై సుమారు రూ. 6 లక్షల కంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే అభిషేక్ శర్మ.. హవల్ హెచ్9 కారుకు రూ. 9 లక్షల కంటే ఎక్కువ ట్యాక్స్ చెల్లిచాలి.