2024–25లో 8,76,646 మంది విమానయానం
మొత్తం 50,563 సర్వీసులతో దేశ, విదేశాలకు...
ప్రత్యేక విమానం.. వ్యాపార దిగ్గజాలు, రాజకీయ నాయకులు, ప్రముఖ సినీ తారలు, క్రీడాకారుల ప్రయాణ సంబంధ వార్తల్లో తరచూ వినే పదం. ప్రైవేట్ జెట్స్‌లో ప్రయాణం వీరికే పరిమితం కాలేదు. వ్యాపారులు, అధిక ఆదాయ వర్గాల సౌలభ్యం కోసం క్యాబ్ బుక్ చేసుకున్నట్టుగా చార్టర్డ్ విమానాల్లో (Charter flights) భారతీయ నగరాలతోపాటు విదేశాలూ విహరిస్తున్నారు. తమ వాళ్లను ప్రత్యేక విమానంలో తీసుకెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ఎల్లప్పుడూ గుర్తుండేలా చేస్తున్న సంపన్నుల సంఖ్యా పెరుగుతోంది. ఇక చార్జీలంటారా.. ‘ప్రత్యేకం’ కదా. ఆ మాత్రం ఉంటుంది మరి.
ఇండిగో (Indigo), ఎయిర్ ఇండియా వంటి షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్స్ నిర్దేశించిన సమయం, రూట్లలో సేవలు అందిస్తాయి. మనతోపాటు ఇతర ప్రయాణికులూ విమానంలో ఉంటారు. విమానాలు రద్దు, ఆలస్యం అవుతున్న సందర్భాలూ కోకొల్లలు. నాన్ షెడ్యూల్డ్ సర్వీసులు ఇందుకు భిన్నం. విమానం మొత్తాన్ని బుక్ చేసుకున్న కస్టమర్ తనకు అనుకూల సమయానికి బయల్దేరవచ్చు. పెద్ద కంపెనీల బిజినెస్ మీటింగ్స్, పెళ్లిళ్ల సీజన్‌లో వీటికి డిమాండ్ ఎక్కువ. విమానం అందుబాటులో ఉండి, వాతావరణం అనుకూలించి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అనుమతి ఉంటే చాలు.. జస్ట్ 4 గంటల్లో చార్టర్ టేకాఫ్ అవుతుందని ప్రైవేట్ విమానయాన రంగంలో ప్రముఖ అగ్రిగేటర్ ‘జెట్ సెట్ గో’ చెబుతోంది.
రెండు దశాబ్దాల్లో..
నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్ పర్మిట్ హోల్డర్స్ 2025 సెప్టెంబర్ నాటికి భారత్‌లో 133 మంది ఉన్నారు. వీరి వద్ద 455 ఎయిర్‌క్రాఫ్ట్స్ (విమానాలు+హెలికాప్టర్లు) ఉన్నాయి. రెండు దశాబ్దాల క్రితం 156 ఎయిర్‌క్రాఫ్ట్స్‌తో 44 కంపెనీలు ఈ రంగంలో ఉన్నాయి. 20 ఏళ్లలో ఆపరేటర్లు మూడురెట్లు, ఎయిర్‌క్రాఫ్ట్స్ దాదాపు మూడింతలకు చేరుకున్నాయంటే.. ప్రైవేట్ జెట్స్‌కు మన దేశంలో ఉన్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. 412 విమానాలు, హెలికాప్టర్లతో 2012లో అత్యధికంగా 147 మంది ఆపరేటర్లు ఉండేవారు.
హైదరాబాద్ (Hyderabad) కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న 7 కంపెనీల వద్ద 11 ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉన్నాయి. నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్ పర్మిట్ హోల్డర్స్ వద్ద ఉన్న విమానాల్లో గరిష్టంగా 37 మంది ప్రయాణించవచ్చు. షెడ్యూల్డ్ కమర్షియల్ ఎయిర్‌లైన్స్ సైతం చార్టర్డ్ సర్వీసులను అందిస్తున్నాయి. షెడ్యూల్డ్, నాన్–షెడ్యూల్డ్ ఆపరేటర్లు గత ఆర్థిక సంవత్సరంలో 50,563 ప్రత్యేక సర్వీసులతో మొత్తం 8,76,646 మందిని దేశ, విదేశాల్లోని గమ్యస్థానాలకు చేర్చాయి.
చార్టర్స్ రకాలు
ప్రైవేట్ చార్టర్: ఒక సమూహం లేదా వ్యక్తి కోసం మొత్తం విమానాన్నిఅద్దెకు తీసుకోవడం.
పబ్లిక్ చార్టర్: ట్రావెల్ కంపెనీలు చార్టర్స్‌లో వ్యక్తిగత సీట్లను విక్రయిస్తాయి.
నిర్దిష్ట టూర్ ప్యాకేజీలతో పర్యాటక గమ్యస్థానాలకు ఈ సర్వీసులు నడుపుతాయి.
కార్గో చార్టర్: సరుకు రవాణా కోసం ప్రత్యేక ప్రైవేట్ విమానాలు.

తేడా ఏమిటంటే..
షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్: కేటాయించిన సమయంలో నిర్దేశిత విమానాశ్రయాలకు ప్రయాణిస్తాయి. ప్రామాణిక సౌకర్యాలు ఉంటాయి.
ఎవరైనా సీటు బుక్ చేసుకోవచ్చు.
నాన్ షెడ్యూల్డ్ ఫ్లైట్: సౌకర్యవంతమైన సమయం, అనుకూలమైన సేవలు ఉంటాయి. పూర్తిగా ప్రైవేట్. వరంగల్ వంటి చిన్న విమానాశ్రయాలకూ వెళ్లవచ్చు.
- నూగూరి మహేందర్


