అమెరికాలో ఓ కెనడియన్ ఏకంగా పైలట్ అవతారం ఎత్తాడు. విమానయాన సంస్థలను బురిడీ కొట్టించి వందలాది సార్లు ఉచితంగా ప్రయాణించాడు. అయితే ఎట్టకేలకు అతడి పాపం పండింది. దీంతో అతడు ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
కెనడాకు చెందిన 33 ఏళ్ల డల్లాస్ పోకోర్నిక్ గతంలో ఎయిర్ కెనడాలో ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేశాడు. తన అనుభవాన్ని మోసం చేయటానికి అతడు వాడుకున్నాడు. నకిలీ ఐడీ కార్డు సృష్టించి పైలట్‌గా చలామణి అవుతున్నాడు. విమానాల్లో పైలట్లు లేదా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారుల కోసం జంప్ సీట్' (కాక్‌పిట్‌లో ఉండే అదనపు సీటు) ఉంటుంది.
అయితే డల్లాస్ తన ఐడీ కార్డు చూపిస్తూ ఆ జంప్ సీట్ కోసం అభ్యర్ధించేవాడు. ఇలా అతడు గత నాలుగేళ్లుగా మూడు వేర్వేరు ఎయిర్‌లైన్స్‌లో వందలాది సార్లు ఉచితంగా ప్రయాణించాడు. అయితే ప్రతీసారి అతడు ఉచితంగా ప్రయాణించడంతో అధికారులు నిఘా పెట్టారు. దీంతో అతడు దొరికిపోయాడు. అతడిపై హవాయి ఫెడరల్ కోర్టు వైర్ ఫ్రాడ్(ఉద్దేశపూర్వకంగా ఇతరలను మోసం చేయడం) ఆరోపణలకు సంబంధించిన అభియోగాలు మోపింది. డల్లాస్‌ను పనామాలో అదుపులోకి తీసుకున్నారు.


