కెరియర్‌లో బిజీగా ఉన్న వృత్తి నిపుణులకు ఇంటి నిర్వహణ ఒక పెద్ద సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో సమర్థవంతమైన ఇంటి నిర్వహణ కోసం కొత్తగా ‘హోం మేనేజర్లు’ (Home Managers) రంగంలోకి దిగుతున్నారు. ఇది కేవలం ఇంటి పనులకే పరిమితం కాకుండా ఆధునిక పని సంస్కృతి (Work Culture) అవసరాలకు అనుగుణంగా మారుతున్న ముఖ్యమైన ఉద్యోగంగా అవతరిస్తుంది.
డిమాండ్ పెరగడానికి కారణాలు..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది వృత్తి నిపుణులు తమ వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కాపాడుకోవడానికి కష్టపడుతున్నారు. గంటల తరబడి పనిచేయడం, కార్పొరేట్ సంస్థల ఒత్తిడి కారణంగా ఇంటిని నిర్వహించడానికి సమయం కేటాయించలేకపోతున్నారు. ఈ కారణాల వల్లే తమ ఇంటి బాధ్యతలను నిర్వహించడానికి, సమయాన్ని ఆదా చేసుకోవడానికి ప్రొఫెషనల్ సహాయం తీసుకోవడానికి వెనుకాడడం లేదు.
ఇటీవల గ్రేల్యాబ్స్ ఏఐ స్టార్టప్ సహ-వ్యవస్థాపకుడు, ఐఐటీ గ్రాడ్యుయేట్ అమన్ గోయెల్, ఆయన భార్య హర్షితా శ్రీవాస్తవ నెలకు రూ.1 లక్ష వేతనంతో హోం మేనేజర్‌ను నియమించుకున్నట్లు చెప్పారు. పెరుగుతున్న స్టార్టప్ డిమాండ్ల మధ్య తమ వ్యక్తిగత జీవితాన్ని, ఇంటి నిర్వహణను సమతుల్యం చేసుకోవడం కష్టమైందని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ ఇంటి బాధ్యతలను నిర్వహించడానికి ఒక ప్రొఫెషనల్‌ను నియమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.
గోయెల్ తన ఎక్స్ పోస్ట్‌లో ఈమేరకు వివరాలు వెల్లడించారు. ‘నేను ఒక హోమ్ మేనేజర్‌ను నియమించాను. ఆమె ఫుడ్ ప్లానింగ్, వార్డ్‌రోబ్‌లు, మరమ్మతులు, నిర్వహణ, కిరాణా సామాగ్రి, లాండ్రీ వంటి ప్రతి విషయాన్ని చూసుకుంటారు. ప్రాథమికంగా ఆమె ఇంటి సహాయకులు. మాకు విలువైన సమయాన్ని ఆదా చేస్తారు’ అని పేర్కొన్నారు.
హోం మేనేజర్లు ఏం చేస్తారు?
హోం మేనేజర్లు ఇంట్లో అన్ని పనులను నిర్వహిస్తారు.
భోజన ప్రణాళిక, కిరాణా సామాగ్రి జాబితా తయారు చేయడం, వాటిని కొనుగోలు చేయించడం.
ఇంటి మరమ్మతులు, నిర్వహణ పనులు, వస్తువుల రిపేర్లు, అపాయింట్‌మెంట్లను సమన్వయం చేయడం.
వంట మనిషి, క్లీనింగ్ స్టాఫ్, గార్డెనర్ వంటి ఇంటి సహాయకులందరి పనులను పర్యవేక్షించడం, వారికి ఆదేశాలివ్వడం.
వార్డ్‌రోబ్ నిర్వహణ, లాండ్రీ పర్యవేక్షణ, బిల్లుల చెల్లింపులు వంటి వ్యక్తిగత పనులను చూసుకోవడం.
సంక్షిప్తంగా హోం మేనేజర్ అనే వ్యక్తి ఇంటి వ్యవహారాలన్నింటికీ ఒక చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌లా పనిచేస్తారు.
ఎంతో మేలు..
వృత్తి నిపుణులు తమ పనిపై దృష్టి పెట్టడానికి, వారి వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడానికి ఈ మేనేజర్లు తమ సమయాన్ని ఆదా చేస్తారు. దీనివల్ల పనిలో ఉత్పాదకత పెరుగుతుంది. ఇంటి పనులు, నిర్వహణ గురించి నిరంతరంగా ఆలోచించాల్సిన మానసిక భారం తగ్గుతుంది. ఇది మొత్తం కుటుంబానికి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పనులన్నీ ఇతరులు చూసుకోవడం వల్ల ఆదా అయిన సమయాన్ని కుటుంబ సభ్యులు తమ భాగస్వామి/ పిల్లలతో గడపడానికి లేదా వ్యక్తిగత అభిరుచుల కోసం కేటాయించడానికి వీలవుతుంది.
ఇదీ చదవండి: గిఫ్ట్ సిటీకి ఎందుకంత క్రేజ్..


