
నిబంధనలు, నియంత్రణలనేవి కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేలా ఉండాలే తప్ప అణగదొక్కేలా ఉండకూడదని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. వాటిని అణగదొక్కే పరిస్థితి ఉంటే ఇంకో దగ్గరెక్కడో ఆవిష్కరణలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. నియంత్రణలనేవి సంస్థ ప్రాతిపదికగా కాకుండా కార్యకలాపాల ప్రాతిపదికన ఉండాలని సుబ్రహ్మణ్యం గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.
‘ఒకవేళ నేను బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తుంటే, నన్ను బ్యాంకరుగా పరిగణించి, దానికి తగ్గ నిబంధనలు వర్తింపచేయాలి. అదే ఏదైనా ఫండ్‌ను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే, బ్యాంకరుగా కాకుండా ఫండ్ డిస్ట్రిబ్యూటరు నిబంధనలను వర్తింపచేయాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఈ తరహా విధానంపై ఆర్థిక శాఖ, నియంత్రణ సంస్థలు లోతుగా చర్చిస్తున్నట్లు వివరించారు. మరోవైపు, జీఎస్‌టీ 2.0 తర్వాత, దీపావళికన్నా ముందే మరో విడత సంస్కరణలను ప్రకటించే అవకాశం ఉందని సుబ్రహ్మణ్యం చెప్పారు. నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గౌబా సారథ్యంలోని కమిటీ ఇప్పటికే వీటికి సంబంధించిన నివేదికల తొలి సెట్‌ను సమర్పించినట్లు పేర్కొన్నారు.
పొరుగుదేశాలతో పటిష్ట సంబంధాలు ఉండాలి..
చైనాతో పాటు ఇతర పొరుగు దేశాలతో భారత్‌కి పటిష్టమైన వాణిజ్య సంబంధాలు ఉండాలని సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. మొత్తం యూరోపియన్ యూనియన్ వాణిజ్యంలో 50 శాతం భాగం.. అంతర్గతంగా ఆయా దేశాల మధ్యే జరుగుతుందని ఆయన చెప్పారు. భారత్ విషయానికొస్తే బంగ్లాదేశ్ 6వ అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగాను, టాప్ 10లో నేపాల్ ఉండేదని తెలిపారు. చైనా పెట్టుబడులపై ఆంక్షలు ఎత్తివేస్తారా అనే ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకపోయినప్పటికీ, భారత్‌కి ఆ దేశం కీలక సరఫరాదారని సుబ్రహ్మణ్యం చెప్పారు. 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని విస్మరించజాలమని పేర్కొన్నారు. అలాంటి దేశానికి మరింతగా విక్రయించలేకపోతే అర్థరహితమైన విషయం అవుతుందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: కేంద్రం చెంతకు పంచాయితీ!