
ఐటీ పరిశ్రమకు సవాళ్లు– షేర్లు డీలా
ఆటో, ఎఫ్‌ఎంసీజీ వైట్‌గూడ్స్ జోష్
ఫెడ్ చైర్మన్ ప్రసంగంపై ఇన్వెస్టర్ల దృష్టి
మార్కెట్ల ట్రెండ్‌పై నిపుణుల అంచనా
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను పలు అంశాలు ప్రభావితం చేయనున్నాయి. వారాంతాన యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజును ఎకాఎకిన లక్ష డాలర్ల(రూ. 88 లక్షలు)కు పెంచేయడం, గత వారం 0.25 శాతం వడ్డీ రేట్లను తగ్గించిన యూఎస్ ఫెడ్ చైర్మన్ పావెల్ భవిష్యత్ విధానాలపై ప్రసంగించనుండటం వంటి అంశాలు ప్రధానంగా సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం..
దేశీయంగా స్టాక్ మార్కెట్లకు ఈ వారం కీలకంగా నిలవనుంది. గత వారం జూలై తదుపరి ప్రధాన ఇండెక్సులు బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గరిష్టాలకు చేరాయి. అయితే ఇకపై వీటి పరుగును దేశ, విదేశీ అంశాలు ప్రభావితం చేయనున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. దేశీయంగా ఈ(సెపె్టంబర్) నెలకు హెచ్‌ఎస్‌బీసీ కాంపోజిట్, తయారీ, సర్వీసుల పీఎంఐ ఫ్లాష్ అంచనాలు వెలువడనున్నాయి.
ఇక గత వారాంతాన ఉన్నట్టుండి యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజును 3,000–5,000 డాలర్ల నుంచి ఏకంగా 1,00,000 డాలర్లకు పెంచేయడం ఐటీ పరిశ్రమలో సంచలనానికి తెరతీసింది. దీంతో యూఎస్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన దేశీ ఐటీ దిగ్గజాల షేర్లు(ఏడీఆర్‌లు) అమ్మకాలతో డీలాపడ్డాయి. ఈ ప్రభావం నేడు(సోమవారం) కనిపించే వీలున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీనికితోడు ఐటీ పరిశ్రమలో కొన్నేళ్లుగా పెరిగిపోయిన ఆన్‌సైట్ సర్వీసులపై ఈ ప్రభావం పడవచ్చని అభిప్రాయపడ్డారు.
పరిస్థితులు ఇలాగే కొనసాగితే తిరిగి ఆఫ్‌షోర్ విధానానికి ప్రాధాన్యత పెరగవచ్చని అంచనా వేశారు. 285 బిలియన్ డాలర్ల విలువైన దేశీ ఐటీ పరిశ్రమలో ఆన్‌షోర్ ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ పేర్కొంది. ఇప్పటికే ఎగుమతి ఆధారిత రంగాలు ట్రంప్ విధించిన అదనపు టారిఫ్‌లతో డీలాపడినట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్‌వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. హెచ్1బీ వీసాల జారీలో భారత నిపుణుల వాటా 70 శాతంకాగా.. దేశీ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోకు సెగ తగిలే వీలున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేష్ గౌర్ వివరించారు.
జీఎస్‌టీ దన్ను
నేటి నుంచి వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) సంస్కరణలు అమల్లోకిరానుండటంతో ఆటోమొబైల్, వైట్‌గూడ్స్, ఎఫ్‌ఎంసీజీసహా పలు రంగాలలోని కంపెనీలకు జోష్ లభించనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. కొనుగోళ్లు పెరిగి వ్యవస్థలో డిమాండ్ బలపడే వీలున్నట్లు అంచనా వేశాయి. ఇది పెట్టుబడులకు, ఉద్యోగాలకు ప్రోత్సాహాన్నిచ్చే వీలున్నట్లు అభిప్రాయపడ్డాయి.
ప్రధానంగా జీఎస్‌టీని రెండు శ్లాబులు 5 శాతం, 18 శాతంగా క్రమబదీ్ధకరించడంతో పట్టణ ప్రాంతాలలోనూ డిమాండ్ ఊపందుకోనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. 40 శాతం శ్లాబులోకి మరికొన్ని ప్రొడక్టులను చేర్చినప్పటికీ జీవిత, ఆరోగ్య బీమాపై జీఎస్‌టీని రద్దు చేయడం, 375 వస్తువులపై జీఎస్‌టీ తగ్గింపు వినియోగానికి దారి చూపనున్నట్లు తెలియజేశారు. కాగా.. వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన ఈ నెల 22 నుంచి యూఎస్‌తో వాణిజ్య టారిఫ్‌లపై చర్చలు ప్రారంభంకానున్నట్లు దేశీ ప్రభుత్వం వారాంతాన వెల్లడించింది.
ఇతర అంశాలు
కొద్ది నెలలుగా సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లోనూ మరిన్ని కంపెనీలు ఐపీవో ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు క్యూ కట్టనున్నట్లు పీఎల్ క్యాపిటల్ అడ్వయిజరీ హెడ్ విక్రమ్ కసట్ పేర్కొన్నారు. ఇక దేశీ మార్కెట్లలో ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరు తదితర అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు వివరించారు.
గత వారమిలా
గత వారం మార్కెట్లు వరుసగా మూడోసారి లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ నికరంగా 722 పాయింట్లు(0.9 శాతం) బలపడి 82,626 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 213 పాయింట్లు(0.85 శాతం) పుంజుకుని 25,327 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 1.5–2 శాతం చొప్పున ఎగశాయి.
సాంకేతికంగా గత వారం
అంచనాలనకు అనుగుణంగా మార్కెట్లు బ్రేకవుట్ బాటలో సాగాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 25,350 సమీపంలో ముగిసింది. అయితే ఈ వారం నిఫ్టీకి 25,500 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చు. ఆపై ఇటీవలి గరిష్టం 25,669 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చు. ఒకవేళ బలహీనపడితే తొలుత 25,000 పాయింట్ల వద్ద మద్దతుకు వీలుంది. తదుపరి 24,650 వద్ద మరోసారి సపోర్ట్ లభించవచ్చు.
వెనకడుగులోనే ఎఫ్‌పీఐలు
ఈ నెలలో రూ. 7,945 కోట్ల అమ్మకాలు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఫలితంగా ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ. 7,945 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. ఆగస్ట్‌లో రూ. 34,990 కోట్లు, జూలైలో రూ. 17,700 కోట్లు విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. దీంతో ఈ కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటివరకూ రూ. 1.38 లక్షల కోట్ల పెట్టుబడులను నికరంగా వెనక్కి తీసుకున్నారు. టారిఫ్‌లు, యుద్ధాలు తదితర ప్రపంచ అనిశి్చతులు ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే గత వారం యూఎస్ ఫెడ్ 0.25 శాతం వడ్డీ రేటు కోత పెట్టడంతో ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 900 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.
– సాక్షి, బిజినెస్ డెస్క్