
బంగారం ధరలపై సామాన్యుల బెంబేలు
టారిఫ్ వార్.. భౌగోళిక,రాజకీయ ఉద్రిక్తతలతో రేటు పైపైకి
సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్ల దాహం కూడా కారణమే.. ధరలకు మరింత ఆజ్యం పోస్తున్న రూపాయి పతనం
ఈ ఏడాది ఇప్పటికే 67 శాతం పైగా ఎగసిన పుత్తడి.. రేసు గుర్రంలా వెండి.. ఏడాదిలో డ‘బుల్’బాజా..
శుభకార్యాల నేపథ్యంలో దేశీయంగా కొనుగోళ్ల డిమాండ్
త్వరలో తులం పసిడి రూ.2 లక్షలకు చేరుతుందన్న అంచనాలు
కాకినాడకు చెందిన శ్రీనివాస్ వచ్చే ఏడాది తన కుమార్తె పెళ్లి కోసం అప్పోసప్పో చేసి బంగారం కొందామనుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో రేటు దాదాపు రూ.78,000 స్థాయిలో ఉండగా గోల్డ్ షాప్‌నకు వెళ్లి కూడా కాస్త తగ్గితే కొందామనుకొని వెనక్కి వచ్చేశాడు. అంతే అక్కడి నుంచి కనకం పూనకం వచ్చినట్లు పెరుగుతూనే ఉంది. దీంతో చేసేదేమీ లేక ఈమధ్యే రూ.1,20,000 రేటుతో మూడు తులాలు కొన్నాడు. విచిత్రమేంటంటే ఆర్నెల్ల క్రితం అదే సొమ్ముకు అయిదు తులాలు వచ్చేది! అరెరే ఎంత తప్పు చేశానే.. అంటూ ఇప్పుడు ఆవేదన చెందుతున్నాడు.
ఇక హైదరాబాద్‌వాసి నగేష్ కష్టాలు వేరు. వచ్చే నెలలో బాగా దగ్గరి బంధువుల ఇంట్లో పెళ్లి ఉంది. రెండేళ్ల క్రితం కుమారుడి పెళ్లిలో వారు తులం గోల్డ్ చైన్ చదివించారు. అప్పుడు రేటు 60,000. ఇప్పుడు పెళ్లిలో వాళ్లు పెట్టినంతైనా తిరిగి చదివించాలి.. లేదంటే పరువు పోతుంది. కొనాలంటే రూ.1.3 లక్షల పైమాటే. దీంతో రేటు తగ్గుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నాడు. పుత్తడి మాత్రం తగ్గేదేలే అంటూ పరుగులు తీస్తుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.
సాక్షి, బిజినెస్‌డెస్క్: సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో బంగారం ఇప్పుడు పెద్ద గుదిబండగా మారిందనేందుకు ఇవి కేవలం మచ్చుకు మాత్రమే. నాన్‌స్టాప్ ర్యాలీతో పసిడి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏడాది క్రితం రూ.78,000 స్థాయిలో ఉన్న 10 గ్రాముల (తులం) బంగారం రేటు తాజాగా రూ.1.3 లక్షలకు చేరి ‘నగ’ధగలాడిపోతోంది. రోజుకో కొత్త శిఖరాలకు దూసుకెళ్తోంది. ఇన్వెస్టర్లకు ఇది కనకవర్షం కురిపిస్తున్నప్పటికీ... తులమో పలమో కొందామనుకునే సామాన్యులకు మాత్రం దిక్కుతోచని పరిస్థితి.
ఈ ఏడాది ఇప్పటిదాకా దేశీయంగా పసిడి ధర 67 శాతం ఎగబాకింది. బంగారం రేటు రెండేళ్లలో రెట్టింపైతే... వెండి ఏడాదిలోపే డ‘బుల్‘ర్యాలీ చేయడం గమనార్హం. ఈ ఏడాది ఆరంభంలో కేజీ వెండి ధర రూ.89,000 కాగా, ఇప్పుడు ఏకంగా రూ.1.85 లక్షలకు చేరింది. అంటే ఏకంగా 107 శాతం ఎగబాకిందన్న మాట! ఇదిలా ఉంటే, మరో మూడు నెలల పాటు పెళ్లిళ్ల బాజా మోగనుండటం... కొనుగోలుదారుల్లో గుబులు పుట్టిస్తోంది. ధరాభారంతో వివాహాలు, ఇతర శుభకార్యాల ఖర్చుల తడిసిమోపెడవుతాయంటూ ఆందోళన చెందుతున్నారు.
‘మధ్యతరగతి కుటుంబాలకు బంగారం అందని ద్రాక్షలా మారింది. ఈ ఏడాది పసిడి రేటు అమాంతం లక్ష రూపాయలను దాటేయడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. కూతురు పెళ్లి కోసం నాలుగు తులాల బంగారం పెడదామనుకుంటే ఇప్పుడున్న రేటుతో తులంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది’అని కాజీపేటకు చెందిన మనమ్మ తన గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పటికే బస్సు మిస్సయ్యామన్న ఆత్రుత... ఇంకెంత పెరిగిపోతుందోనన్న ఆందోళన ఇప్పుడు సర్వత్రా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
పెట్టుపోతలు... గుదిబండ
గృహ ప్రవేశాలు, వోణీ పంక్షన్లు, బారసాలలు ఇలా ఏ శుభకార్యమైన ఎంతో కొంత బంగారం, వెండి గిఫ్టుల వంటి పెట్టుపోతలు కామన్. గోల్డ్, సిల్వర్ జోడు గుర్రాల్లా దూసుకుపోతుండటంతో చాలా వరకు పంక్షన్లలో ఇప్పుడు వీటి ఊసే ఎత్తలేని పరిస్థితి. పావు తులం కొనాలన్నా కనీసం రూ. 35 వేలకు తక్కువ అవ్వడం లేదు. దీంతో చాలా మంది ఐదు.. పది.. పాతిక వేలు చదివించి ‘మమ‘అనిపించుకుంటున్నారు. గతంలో తమ బంధువులు పెట్టినంతగా చదివించకపోతే నలుగురిలో మాట వస్తుందన్న భయం ఒకపక్క,.. పోనీ పెడదామంటే ఆర్థికంగా ఇబ్బంది మరోపక్క మధ్యతరగతి కుటుంబాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
‘మా పెద్ద అమ్మాయికి దగ్గరి బంధువులు బంగారం, వెండి వస్తువులను చదివించారు. ఇప్పుడు వారి ఇళ్లలో ఫంక్షన్ అయితే అంతే బంగారం, వెండి ఆభరణాలను చేయించలేకపోతున్నాం. అందుకే వారు పెట్టిన వస్తువులకు ఖరీదు చేసి నగదును కట్నంగా చదివిస్తున్నాం‘అని హనుమకొండకు చెందిన కత్తుల కవిత వాపోయారు. ఇదిలా ఉంటే, చిన్నాచితకా బంగారం షాపులపైగా రేటు ప్రభావం తీవ్రంగా ఉంది. ధర అమాంతం పెరిగిపోవడంతో కొనుగోళ్లు పడిపోయాయని, బిజినెస్ అంతగా నడవడం లేదని గోల్డ్ షాపుల వాళ్లు గగ్గోలు పెడుతున్నారు.
గోల్డెన్ ర్యాలీ ఎందుకంటే...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలుపెట్టిన టారిఫ్ వార్‌తో ప్రంపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి మరింత పెరిగిపోయింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి తోడు పశ్చిమాసియాలో భగ్గుమన్న ఉద్రిక్తతలతో అప్పటికే ఎగబాకిన రేట్లకు వాణిజ్య యుద్ధం మరింత ఆజ్యం పోసింది. దీంతో సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు అందరూ పరుగులు తీస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయంగా ఔన్స్ 2,600 డాలర్లు ఉండగా.. అంతకంతకూ పెరుగుతూ తాజాగా 4,190 డాలర్ల ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకింది. అంటే 10 నెలల్లో 61 శాతం జంప్ చేసింది.
తాజాగా అమెరికా–చైనా మధ్య టారిఫ్ యుద్ధం మరింత తీవ్రం కావడంతో బంగారం భగభగలాడిపోతోంది. మరోపక్క, గత కొన్నేళ్లుగా పసిడి ఉత్పత్తి మందగించి.. భూగర్భ నిల్వలు అడుగంటుతున్నాయి. ఆభరణాల డిమాండ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రపంచ దేశాలు డాలర్లలో వాణిజ్యానికి క్రమంగా చెల్లు చెప్పడంతో పాటు తమ విదేశీ కరెన్సీ నిల్వల్లో డాలర్ నిధులను తగ్గించుకుంటున్నాయి. ఫలితంగా డీ–డాలరైజేషన్ జోరందుకుంది. ఆర్థిక అనిశ్చితి, యుద్ధ భయాలతో పాటు కరెన్సీ క్షీణతకు విరుగుడుగా బంగారం నిల్వలను సెంట్రల్ బ్యాంకులు పెంచుకుంటూ పోతున్నాయి.
గత పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు సగటున ఏటా 800 టన్నులు కొనడం గమనార్హం. మన ఆర్‌బీఐ వద్ద కూడా పసిడి నిల్వలు 880 టన్నులకు ఎగబాకాయి. ఇలా సరఫరా మందగించి.. డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడమే గోల్డెన్ రన్‌కు ప్రధాన కారణం. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు అనిశ్చితుల్లో ఆదుకునే సురక్షిత సాధనాల్లోకి, ముఖ్యంగా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లోకి తమ పెట్టుబడులను తరలిస్తున్నారు.
సెపె్టంబర్ చివరి నాటికి ప్రపంచ గోల్డ్ ఈటీఎఫ్‌ల విలువ 472 బిలియన్ డాలర్లకు ఎగబాకడం పెట్టుబడుల జోరుకు నిదర్శనం. మరోపక్క, వడ్డీరేట్లను తగ్గించాలంటూ ట్రంప్ పోరు పెడుతుండటంతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల కోతకు సై అంది. ఏడాది కాలంలో ఫెడ్ రేటును 1 శాతం పైగా తగ్గించే అవకాశం ఉండటం కూడా బంగార ధరలకు మరింత బూస్ట్ ఇస్తోంది.
రూపాయి వాత!
అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒకవైపు మోతమోగిస్తుండటే.. దేశీయంగా అంతకుమించి రూపాయి వాత పెడుతోంది. డాలరుతో రూపాయి విలువ అంతకంతకూ బక్కచిక్కుతూ పసిడి ధరను దేశీయంగా మరింత ఎగదోస్తోంది. మూడేళ్ల క్రితం డాలరుతో రూపాయి మారకం విలువ 80 వద్ద ఉండగా... ఇప్పుడు ఏకంగా 88.82 ఆల్‌టైమ్ కనిష్టాలకు జారిపోయింది. అంటే రూపాయి పతనం దెబ్బకు మనం మరో రూ.10,000 అధనంగా చెల్లించుకోవాల్సి వస్తోందన్నమాట!
ఈ పరుగు ఎందాకా..?
ట్రంప్ అధికారంలో ఉన్నంత కాలం ఆర్థిక అనిశ్చితులకు తెరపడే సూచనలు కనిపించడం లేదు. టారిఫ్ వార్‌కు తోడు ఏ రోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనన్న భయాలు అటు మార్కెట్లతో పాటు ఇన్వెస్టర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల కోతను కొనసాగిస్తే.. డాలరు మరింత బలహీన పడే అవకాశాలున్నాయని, ఇది బంగారం మరింత పెరిగేందుకు దోహదం చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. గోల్డ్‌మన్ శాక్స్ వచ్చే ఏడాది చివరికి గోల్డ్ అంచనాలను ఇప్పుడున్న 4,300 డాలర్ల నుంచి ఏకంగా 4,900 డాలర్లకు పెంచింది.
బ్యాంక్ ఆఫ్ అమెరికా 2026 అంచనా 5,000 డాలర్లు. దీని ప్రకారం చూస్తే, మన దగ్గర రేటు రూ.1.75 లక్షలను తాకొచ్చు. ఇక జెఫరీస్ ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్ హెడ్ క్రిస్టోఫర్ ఉడ్ సైతం బంగారం ధరలు ఇక్కడి నుంచి మరింత పెరగొచ్చని అభిప్రాయపడ్డారు. రానున్న కాలంలో ఔన్స్ 6,600 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేశారు అంటే మన దగ్గర అక్షరాలా రూ.2–2.5 లక్షలకు దూసుకుపోయే అవకాశం ఉంది. రూపాయి గనుక ఇంకా బక్కచిక్కితే పసిడి ధర మరింత కాంతులీనడం ఖాయమంటున్నారు విశ్లేషకులు!
వస్తువులకు బదులు నగదు ఇస్తున్నాం..
నాలుగేళ్ల క్రితం పెద్ద అమ్మాయి పెళ్లి చేశాం. పది తులాల బంగారం, ఇతరత్రా ఖర్చులన్నీ కలిపి రూ.30 లక్షల వరకు అయ్యాయి. నాలుగు రోజుల క్రితం చిన్న అమ్మాయి పెళ్ళి చేశాం. పెద్ద అమ్మాయికి పెట్టినట్లుగా నగలు చేయించలేకపోయాం. నాలుగేళ్ల క్రితం 10 గ్రాముల బంగారం రూ.50 వేలు. ఇప్పుడు రూ.1.20 లక్షలు అయ్యింది. మా ఆదాయం మాత్రం అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది. వెండి కూడా అలాగే పెరిగింది. పెద్ద అమ్మాయికి దగ్గరి బంధువులు బంగారం, వెండి వస్తువులను చదివించారు. ఇప్పుడు వారి ఇళ్లలో ఫంక్షన్ అయితే అంతే బంగారం, వెండి ఆభరణాలను చేయించలేకపోతున్నాం. అందుకే వారు పెట్టిన వస్తువులకు ఖరీదు చేసి నగదును కట్నంగా చదివిస్తున్నాం.
– కత్తుల కవిత, హనుమకొండ
ఇమిటేషన్ జ్యువెలరీ వాడాల్సి వస్తోంది..
మధ్యతరగతి కుటుంబాలకు అందని ద్రాక్షలాగా బంగారం మారిపోయింది. ఈ ఏడాది పసిడి రేటు అమాంతం లక్ష రూపాయలను దాటేయడంతో సామాన్యులం బంగారం కొనలేని పరిస్థితి నెలకొంది. కూతురు పెళ్లి కోసం నాలుగు తులాల బంగారం పెడదామనుకుంటే ఇప్పుడున్న బంగారం రేటుతో తులంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. రూ. 50–60 వేల మధ్యలో బంగారం రేటు ఉంటే పెళ్లిళ్లకు కొనగలుగుతాం. వెండిదీ అదే పరిస్థితి కావడంతో, ఇమిటేషన్ జ్యువెలరీపై ఆధారపడాల్సి వస్తోంది.
– మనమ్మ,, కాజీపేట
ధరాభారంతో ఆందోళన...
బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ఆందోళనగా ఉంది. నాలుగేళ్ల క్రితం మా ఇంట్లో ఫంక్షన్ చేసినప్పుడు మా దగ్గరి బంధువులు బంగారు, వెండి ఆభరణాలు పెట్టారు. ప్రస్తుతం మా బంధువులకు చెందిన వివాహ శుభకార్యాలు ఉన్నాయి. మా ఫంక్షన్‌కు వారు పెట్టిన విధంగా మేము పెట్టాలంటే ప్రస్తుతం వెండి, బంగారం ధర రెట్టింపు అయింది. మధ్యతరగతి కుటుంబమైన మేము పెట్టుపోతల విషయంలో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. మాకు వారు పెట్టినంతగా మేము ఇవ్వకుంటే నలుగురిలో మాట వస్తుంది. పెడదామంటే ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది.
– కొలిపాక సునీత, స్టేషన్‌ఘన్పూర్, జనగామ జిల్లా
సామాన్యులు కొనలేని పరిస్థితి...
ఈ మధ్య కాలంలో బంగారం రేటు పెరుగుదల అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ధరలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే సామాన్యులకు ఇక అందని ద్రాక్షే. త్వరలో కూతురు వివాహం చేయాలనుకుంటున్నాము. రేట్లు ఇంకా పెరుగుతాయనే ఆలోచనతో ఇప్పుడే నగలు కొనేస్తున్నాము.
– నంద్యాల సరిత, నల్లగొండ
రేట్లు బెంబేలెత్తిస్తున్నాయి
పసిడి ధరలు చూస్తుంటే బెంబెలెత్తుతోంది త్వరలో చెల్లి వివాహం ఉంది. వివాహంలో అధిక ఖర్చు బంగారానిదే. రేటు భారీగా పెరిగిపోవడం వల్ల కాస్తోకూస్తో కొని సరిపెట్టుకుంటున్నాం. భవిష్యత్లో ధరలు తగ్గితే అప్పుడు మళ్లీ కొంటాం. మధ్య తరగతి కుటుంబాలు ప్రత్యామ్నాయ ఆభరణాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోంది.
– అనిల్ రెడ్డి, అన్నెపర్తి, నల్లగొండ
నగల వర్తకుల కామెంట్స్
బిజినెస్ పడిపోయింది..
గత కొంత కాలంగా బంగారం రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. 2022లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల రేటు రూ.52 వేల స్థాయిలో ఉండగా.. ఇప్పుడది రూ.1.3 లక్షల పైకి ఎగసింది. దీంతో పుత్తడి కొనాలంటే ప్రజల్లో ఆందోళన నెలకొంది. వెండి కూడా రికార్డు స్థాయిలో కేజీ రూ.1.8 లక్షలకు చేరింది. దీంతో బంగారం కొనే వారి సంఖ్య తగ్గిపోతోంది. షాపుల్లో గిరాకీ సరిగ్గా ఉండడం లేదు.
– చొక్కారపు వెంకన్న,, గోల్డ్ షాపు యజమాని, నల్లగొండ
రేటెంతైనా కొనేస్తున్నారు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభావంతో పసిడి పరుగులు తీస్తోంది. దీంతో ఇప్పుడంతా ఇన్వెస్టింగ్ కోణంలోకి మళ్లారు. పెళ్లిళ్లు, పండుగ సీజన్‌తో సంబంధం లేకుండా చేతిలో డబ్బు ఉంటే రేటు ఎంతైనా సరే కొనేస్తున్నారు. స్టాక్ ఎంత తెచ్చినా అమ్ముడైపోతోంది. 2028 నాటికి పసిడి రూ. 2.5 లక్షలు, వెండి కేజీ ధర రూ. 5 లక్షలకు చేరొచ్చని అంచనాలున్నాయి. కానీ ఈ పరుగులు చూస్తుంటే అంతకన్నా ముందే ఈ లక్ష్యాన్ని చేరొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం భారీగా పెరిగినందున కాస్త విరామం తీసుకోవచ్చు. అయితే ఒకవేళ తగ్గినా అది 15 శాతం వరకే పరిమితం కావొచ్చు. అంతకు మించి పడదని భావిస్తున్నాం.
– ముకేశ్ సురానా, డైరెక్టర్, ఆదిత్యనాథ్ జ్యువెలర్స్