
రెండు రోజుల వరుస నష్టాల అనంతరం దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ప్రపంచ ఆశావాదం, ముడి చమురు ధరల తగ్గుదల కారణంగా భారతీయ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ పుంజుకుని లాభాలలో స్థిరపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 575.45 పాయింట్లు లేదా 0.70 శాతం పెరిగి 82,605.43 వద్ద స్థిరపడింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 178.05 పాయింట్లు లేదా 0.71 శాతం ఎగిసి 25,323.55 వద్ద ముగిసింది.
బీఎస్ఈలో బజాజ్ ట్విన్స్, ట్రెంట్, ఏషియన్ పెయింట్స్, ఎటర్నల్ (జొమాటో) టాప్ గెయినర్స్ లో ఉండగా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ రియాల్టీ 3.04 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 1.67 శాతం, నిఫ్టీ మెటల్ 1 శాతం లాభపడ్డాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 వరుసగా 1.11 శాతం, 0.82 శాతం లాభపడ్డాయి.