
బంగారం @ రూ. 1.30 లక్షలు
మరో రూ. 2,850 అప్
వెండి రూ. 1,85,000
న్యూఢిల్లీ: పండుగ సీజన్ సందర్భంగా కొనుగోళ్లు వెల్లువెత్తడంతో పసిడి మరో కొత్త మైలురాయి దాటింది. మంగళవారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పుత్తడి ధర మరో రూ. 2,850 పెరిగి ఏకంగా రూ. 1.30 లక్షలను అధిగమించింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,30,800కి చేరింది. ఇక 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర కూడా అంతే పెరిగి రూ. 1,30,200కి చేరింది. మరోవైపు, వెండి సైతం కేజీకి రూ. 6,000 ఎగిసి సరికొత్త జీవిత కాల గరిష్టమైన రూ. 1,85,000ని తాకింది.
పండుగ, పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా జ్యుయలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ గణనీయంగా పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 12 పైసలు క్షీణించి 88.80కి పడిపోవడం వంటి అంశాలు పసిడి పెరుగుదలకు కారణమని ట్రేడర్లు తెలిపారు.
అటు ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజీలో (ఎంసీఎక్స్) డిసెంబర్ కాంట్రాక్టు రూ. 2,301 పెరిగి రూ. 1,26,930కి చేరింది. ఫిబ్రవరి కాంట్రాక్టు సైతం రూ. 2,450 ఎగిసి రూ. 1,28,220 రికార్డు స్థాయిని తాకింది. పుత్తడికి దీటుగా వెండి డిసెంబర్ కాంట్రాక్టు కూడా కేజీకి రూ. 8,055 పెరిగి రూ. 1,62,700 స్థాయిని తాకింది. అంతర్జాతీయంగా కామెక్స్‌లో గోల్డ్ రేటు ఔన్సుకి (31.1 గ్రాములు) 1% పెరిగి ఆల్‌టైమ్ గరిష్టమైన 4,190 డాలర్లను తాకింది.
భౌగోళిక–రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు, రేట్ల కోత అంచనాలు, ఈటీఎఫ్‌లలో పెట్టుబడుల ప్రవాహం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్ల కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం ధర 60% పెరిగి కీలకమైన 4,100 డాలర్ల మార్కును దాటిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్విసెస్ అనలిస్ట్ మానవ్ మోదీ చెప్పారు. అంతర్జాతీయంగా సరఫరా కొరత వల్ల వెండి ఔన్సు ధర కూడా 52 డాలర్లను దాటిందన్నారు. వెండి ధర దేశీయంగా రూ.1,94,639కి, అంతర్జాతీయంగా 59.89 డాలర్లకు పెరగవచ్చని ఎమ్‌కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్విసెస్ రీసెర్చ్ అనలిస్ట్ రియా సింగ్ తెలిపారు.