
తైవానీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్ తమిళనాడులో రూ.15,000 కోట్ల తాజా పెట్టుబడిని ప్రకటించింది. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌తో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీగా ఉద్యోగ కల్పన జరగనుందని కంపెనీ తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 14,000 ఉద్యోగాలు లభిస్తాయని సంస్థ అంచనా వేస్తుంది.
ఫాక్స్‌కాన్ చేయబోయే పెట్టుబడి విలువ ఆధారిత ఎలక్ట్రానిక్స్ తయారీ, ఆర్ అండ్ డీ ఇంటిగ్రేషన్, ఏఐ నేతృత్వంలోని అధునాతన టెక్ కార్యకలాపాలు, బ్యాటరీ టెక్నాలజీలు వంటి అత్యాధునిక రంగాలపై కేంద్రీకృతమై ఉంటుందని కంపెనీ తెలిపింది. వీటిపై దృష్టి పెట్టడం ద్వారా కంపెనీ ఉత్పాదకత, ఆవిష్కరణల్లో ముందంజలో ఉండాలని చూస్తోంది.
ఆమోదాలు వేగవంతం చేయడానికి..
ఈ పెట్టుబడి ప్రకటనలో అత్యంత ముఖ్యమైన అంశం ‘గైడెన్స్ తమిళనాడు’. ఇది భారతదేశంలోని మొదటి ఫాక్స్‌కాన్ డెస్క్ అవుతుంది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, ఫాస్ట్ ట్రాక్ ఆమోదాలను వేగవంతం చేయడానికి, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులను సమన్వయం చేయడానికి ఈ డెస్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. తమిళనాడు పరిశ్రమల శాఖ ఈ ప్రాజెక్ట్‌కు పూర్తి మద్దతు ఇస్తుంది. సింగిల్ విండో ఫెసిలిటేషన్ ద్వారా ఆమోదాలను వేగవంతం చేస్తుంది. టాలెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు, ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేషన్ మెకానిజమ్‌ల ద్వారా మానవ వనరుల అవసరాలను తీర్చడంలో కూడా ప్రభుత్వం సహకరిస్తుంది. ఫాక్స్‌కాన్ కంపెనీ ఇండియాలో యాపిల్ ఉత్పత్తులు తయారు చేస్తోంది.
ఇదీ చదవండి: ముందుంది మొసళ్ల పండుగ! ఈరోజు కేజీ వెండి రూ.2 లక్షలు!