
ప్రముఖ నటుడు, పారిశ్రామికవేత్త వివేక్ ఒబెరాయ్ సంపద ఫోర్బ్స్ ఇండియా ప్రకారం దాదాపు రూ.1,200 కోట్లుగా ఉంది. ‘సాథియా’, ‘మస్తీ’, ‘రక్తచరిత్ర’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు సినిమాల్లో తక్కువగానే కనిపిస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ వెళ్లి ఫుల్ టైమ్ ఆంత్రప్రెన్యూర్‌గా మారారు. తన వ్యాపార ప్రయాణం ఏదో ఫ్యాన్సీ కార్పొరేట్ ఆఫీసుల్లోనో లేదా ప్రముఖ బిజినెస్ స్కూల్స్‌లోనో మొదలవలేదు. తన కాలేజీ బయట వీధుల్లో పాన్‌డబ్బా నడుపుతున్న ఒక చిరు దుకాణాదారుడి నుంచి మొదలైందని చెప్పారు. ఇటీవల ఒబెరాయ్ ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు పంచుకున్నారు.
‘మా కాలేజీ బయట పాన్‌డబ్బా, బీడీ స్టాల్ నడుపుతున్న సదా అనే వ్యక్తి నుంచి ఎన్నో వ్యాపార మెలకువలు నేర్చుకున్నాను. సదా నుంచి కేవలం లాభనష్టాల గురించి మాత్రమే కాదు.. డబ్బు నిర్వహణ, చిన్న తరహా పెట్టుబడులు, ఆర్థిక సహకారం..వంటి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. అది మైక్రోఫైనాన్సింగ్‌కు సంబంధించి ఓ డాల్ఫిన్ వెర్షన్’ అన్నారు. వివేక్ తన పదహారో ఏట స్టాక్ మార్కెట్‌లో పోర్ట్‌ఫోలియోను నిర్మించుకున్నారు. ఎక్కువగా కమోడిటీ ట్రేడింగ్ చేసేవారని చెప్పారు. 19 ఏళ్ల వయసులోనే ఒక టెక్ స్టార్టప్‌ను ప్రారంభించారు. 22 సంవత్సరాల వయసులో మంచి లాభంతో దాన్ని ఓ బహుళజాతి సంస్థకు విక్రయించినట్లు తెలిపారు.
వ్యూహాత్మక పెట్టుబడులు
ముంబయిలోని మిథిబాయి కాలేజీ నుంచి కామర్స్ గ్రాడ్యుయేషన్‌లో పట్టా పొందిన వివేక్ ఒబెరాయ్ ప్రస్తుతం తన వద్ద ఉన్న సంపదను రెండు భాగాలు విభజించినట్లు గతంలో చెప్పారు. 60 శాతం సంపదను స్థిరంగా ఆదాయం సమకూర్చే విభాగాల్లో పెట్టుబడి పెట్టినట్లు పేర్కొన్నారు. మరో 40 శాతం సంపదను ప్రైవేట్ ఈక్విటీ, రియల్‌ఎస్టేట్‌లో పెట్టుబడి పెడుతున్నట్లు, ఆకర్షణీయ స్టార్టప్‌ల్లో వెంచర్ క్యాపిటలిస్ట్‌గా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాలంలో మంచి రాబడులు రావాలంటే భవిష్యత్తుపై స్పష్టమైన అంచనాలతో ప్రయోగాత్మక పెట్టుబడులు పెట్టాలని చెబుతున్నారు.
రియల్ ఎస్టేట్: వివేక్ ఒబెరాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో దృష్టి సారించి కర్మ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను స్థాపించారు.
డైమండ్ బిజినెస్: దేశవ్యాప్తంగా 18 స్టోర్లతో సోలిటారియో అనే డైమండ్ కంపెనీని స్థాపించారు.
ఈవెంట్ మేనేజ్‌మెంట్: వివేక్ ‘మెగా ఎంటర్‌టైన్‌మెంట్’ అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని స్థాపించారు.
ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్: సుమారు రూ.3,400 కోట్ల (సుమారు 400 మిలియన్ డాలర్లు) విలువైన ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ స్టార్టప్‌ను ప్రారంభించారు.
ఫ్యామిలీ కార్యాలయం: ‘ఒబెరాయ్ ఫ్యామిలీ ఆఫీస్’ ద్వారా పెట్టుబడులను మేనేజ్ చేస్తున్నారు.