చిత్తూరు జిల్లా: ప్రస్తుత రోజుల్లో ఇంటికో బండి (ద్విచక్ర వాహనం). కాదు..కాదు.. వ్యక్తికో బండి అవసరం. లేకుంటే ఏ పనీ గడవదు. ఇలాంటి పరిస్థితుల్లో జనం ఎగబడి బండ్లు కొంటున్నారు. ఈ తరుణంలో పలు షోరూమ్ నిర్వాహకులు, ఫైనాన్స్ సిబ్బంది కొనుగోలుదారులను పిండేస్తున్నారు. పలు రకాల చార్జీల పేరుతో దోచుకుంటున్నారు. అమాయక ప్రజలు కొనుగోలులో తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్క బండి కొంటే రూ.12 వేల వరకు అదనమని, ఇది తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తోంది. జిల్లాలో ద్విచక్ర వాహనాల అమ్మకాలకు సంబంధించి 125పైగా షోరూంలున్నాయి. వీటిలో చాలావరకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. చట్టాలను చుట్టంగా మార్చుకుని ప్రజలను అడ్డగోలుగా మోసం చేస్తున్నాయి. ప్రశ్నించేవారు లేక దోపిడీ పర్వానికి తెరలేపాయి. బండి కొనాలని వస్తే.. వారిని నిలువుగా దోచుకుంటున్నాయి.
కొటేషన్ పేరుతో కొట్టేస్తున్నారు
షోరూంకు వెళితే..అక్కడున్న సిబ్బంది పరుగెత్తుకుని వచ్చి బండి కొంటారా.. అని కూర్చోబెడుతారు. ఏ బండి కావాలి...క్యాషా..లేదంటే..ఫైనాన్సా అని అడుగుతారు. బండి చూడమంటారు. బండి పూర్తి ధర, నంబర్ ప్లేట్ ధరతో ఓ తెల్లకాగితంపై రాసి ఇస్తారు. 70 నుంచి 80 శాతం మంది ప్రజలు వాళ్లు చెప్పిన ధర ప్రకారం బండి కొనుగోలు చేసుకుని వెళ్లిపోతున్నారు. 20 నుంచి 30 శాతం మంది పూర్తి కొటేషన్ అడుగుతున్నారు. ఈ పూర్తి కొటేషన్‌లో కొనుగోలుదారులు పలు షోరూం నిర్వాహకుల దోపిడీని పసిగడుతున్నారు.
రూ.12 వేలు ఎక్స్‌ట్రా
ఒక ద్విచక్ర వాహనం కొంటే పలు షోరూం నిర్వాహకులు రూ.12వేల వరకు అదనంగా గంజేస్తున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు. ఎక్స్‌ట్రా ఫిటింగ్, బీమా, డీలర్ ఇన్సెంటీవ్, రిజిస్ట్రేషన్ ఫీజు, పీడీఐ, పిట్టింగ్ చార్జ్, నంబర్‌ప్లేట్, ట్యాక్స్ ఇలా ప్రతి చెల్లింపుల్లో తేడాలు కనిపిస్తున్నాయి. నిర్ణేత ధరపై అదనంగా రూ.1000 నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తున్నారు. అలాగే బండిపై రూ.4 వేల నుంచి రూ.6 వేలకు బండ బాదుడు బాదుతున్నారు. బండిని ఫైనాన్స్ ద్వారా కొంటే ప్రాసెసింగ్ ఫీజు రూ.1000 నుంచి రూ.1,500 వరకు, డ్యాకుమెంట్ ఫీజు రూ.800 నుంచి రూ.1000 వరకు ఇచ్చుకోవాల్సి వస్తోంది.
అలాగే బండి ఫైనాన్స్ చేతికొస్తే షోరూం నిర్వాహకులకు రూ.4,200, షోరూం మేనేజర్‌కు రూ.1000, ఫెనాన్స్ ఎగ్జిక్యూటీవ్‌కు రూ.300 వేలు వసూలు అయ్యేలా చూసుకుంటున్నారని వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ అదనాన్ని కొనుగోలుదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. అమాయక ప్రజలు వస్తే.. మరింత బాదుడు బాదుతున్నారని మండిపడుతున్నారు. ఇక జిల్లాతో పోలి్చతే.. తిరుపతి, తమిళనాడులోని వేలూరు, పళ్లిపట్టు, పరదారామి, కాట్పాడిలలో ద్విచక్రవాహన ధరలు తక్కువగా ఉంటున్నాయని బాధితులు చెబుతున్నారు.
పట్టించుకోరా!
ప్రతి షోరూంలోను బండి కొనుగోలుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసేలా ధరల పట్టిక ఉండాలి. ఏయే బండి ధర ఎంత? రిజిస్ట్రేషన్ ఫీజు (తాత్కలిక రిజి్రస్టేషన్ ఫీజు, శాశ్వత రిజి్రస్టేషన్ ఫీజు, కార్డు ఫీజు), ట్యాక్స్ ఎంత?, బీమా ఎంత? అనే అవివరాలను ఆపట్టికలో పొందుపరచాలి. కానీ ఆపట్టిక ఎక్కడ కనిపించడం లేదు. దీనిని పట్టించుకోనే వారు లేక పలు షోరూం నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ధరల పట్టిక ఉండాలని పలుమార్లు రవాణాశాఖ అధికారులు హెచ్చరించినా తీరు మారడం లేదు. షోకాజ్ నోటీసులిచ్చినా ధరల పట్టిక కనిపించడం లేదు. ఇక పర్యవేక్షణ బాధ్యతలు తుడిచి పెట్టుకుపోవడంతో పలు షో రూం నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. ప్రజలను నిలువునా దోపిడీ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. దోపిడీకి అడ్డుకట్ట వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.


