
విదేశీ ఇన్వెస్టర్ల తాజా అమ్మకాల ప్రభావం
ప్రపంచ మార్కెట్ల ప్రతికూలతలు కూడా..
సెన్సెక్స్ 297 పాయింట్లు, నిఫ్టీ 82 పాయింట్లు డౌన్
ముంబై: ఆసియా, యూరప్ మార్కెట్ల బలహీన ధోరణికి తోడు విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ అమ్మకాల బాట పట్టడంతో దేశీ మార్కెట్లు రెండో రోజూ ‘బేర్’మన్నాయి. మెటల్స్‌తో పాటు కొన్ని వాహన, ఫార్మా షేర్లు సూచీలను వెనక్కిలాగాయి. ముందురోజు అమెరికా మార్కెట్ల బౌన్స్‌బ్యాక్, చైనాతో టారిఫ్ వార్ విషయంలో ట్రంప్ కాస్త శాంతించేలా చేసిన వ్యాఖ్యలతో మన మార్కెట్లలో ట్రేడింగ్ సానుకూలంగానే మొదలైంది.
సెన్సెక్స్ ఒక దశలో 82,573 పాయింట్ల గరిష్టాన్ని తాకినప్పటికీ.. ఆ జోరు ఎంతో సేపు నిలవలేదు. ఇంట్రాడేలో 545 పాయింట్లు కోల్పోయి 81,781 కనిష్టాన్ని కూడా తాకింది. చివర్లో కాస్త కోలుకుని 297 పాయింట్ల నష్టంతో 82,030 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా తీవ్ర ఒడిదుడుకుల మధ్య 82 పాయింట్లు పడి 25,146 వద్ద క్లోజైంది. బీఎస్‌ఈలోని అన్ని రంగాల సూచీలూ నష్టపోయాయి. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.95 శాతం, మిడ్‌క్యాప్ సూచీ 0.74 శాతం చొప్పన క్షీణించాయి.
జీవితకాల కనిష్టానికి రూపాయి
డాలర్ మారకంలో రూపాయి విలువ 13 పైసలు బలహీనపడి జీవిత కాల కనిష్టం 88.81 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్‌లోని ప్రతికూలతలు, అమెరికా కరెన్సీ బలపడటం రూపాయి కోతకు కారణమయ్యాయి.