ఉన్నత విద్యకు డిజిటల్‌ వేగం | Prof Balakista Reddy write on Importance of Digital Education | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్యకు డిజిటల్‌ వేగం

Jul 26 2025 2:15 PM | Updated on Jul 26 2025 2:15 PM

Prof Balakista Reddy write on Importance of Digital Education

అభిప్రాయం

భారత దేశ ఉన్నత విద్యకు ఓ విశిష్టత ఉంది. సవాళ్ళ మధ్యే పురోగతి సాధించడం దీని ప్రత్యేకత. దశాబ్ద కాలంలోనే ఉన్నత విద్యా సంస్థలు గణనీయంగా పెరిగాయి. 2013లో 651 యూనివర్సిటీలు ఉంటే, 2022 నాటికి 1,100కు చేరాయి. ఇదే కాలంలో కాలేజీల సంఖ్య 31,324 నుంచి 45 వేలకు పెరిగింది. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఇప్పుడు 4.14 కోట్లు దాటారు. ఇందులో మహిళల వాటా 49 శాతం. అయితే, మార్కెట్‌ అవసరాలకు తగ్గ నైపుణ్యం విద్యార్థుల్లో లేకపోవడం వారి ఉపాధి అవకాశాలను తగ్గిస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య మౌలిక వసతులలో ఉన్న భారీ అంతరం మరో ప్రధాన సమస్య. టెక్నాలజీలో అధ్యాపకుల కొరత, పరిశోధనా రంగంలో తగిన నాణ్యత లేక పోవడం వంటివి కూడా ఆలోచించించాల్సిన సమస్యలే. అయితే డిజిటల్‌ టెక్నాలజీ ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తోంది.

మారిన విద్యాస్వరూపం 
కోవిడ్‌ తర్వాత ఉన్నత విద్య స్వరూపమే మారిపోయింది. డిజిటల్‌ బోధన అనివార్యంగా తెరపైకి వచ్చింది. ఇంటర్నెట్‌ అనుసంధానం, రిమోట్‌ లెర్నింగ్‌ సర్వసాధారణమైంది. కృత్రిమ మేధ, వర్చువల్‌ రియాలిటీ, వెబ్‌ ఆధారిత బోధనలే ఇక భవిష్యత్‌ను శాసిస్తాయనడం అతిశయోక్తి కాదు. అయితే, డిజిటల్‌ విద్యకు మౌలిక సదుపాయాలే కీలకం. సరైన అధ్యా పక వర్గమే ఆయువు పట్టు. బోధకులు, విద్యార్థులు ఇరువురిలో డిజిటల్‌ నైపుణ్యాలు ఉండి తీరాలి. ‘డిజిటల్‌ సాధనాల ద్వారా విద్యను బలోపేతం చేయాలి’ అన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు సాంకేతికత ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, వర్చువల్‌ రియాలిటీ, లెర్నింగ్‌ ఎనలిటిక్స్‌ ఇక మీదట విద్యారంగ పురోగతికి అదనపు సాధనాలుగా మారబోతున్నాయి.

కోవిడ్‌ మహమ్మారి వచ్చేనాటికి (2019) కంప్యూటర్, ఇతర డిజిటల్‌ డివైస్‌ల గురించి విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రాథమిక అవగాహన మాత్రమే ఉండేది. కోవిడ్‌ తర్వాత విద్యారంగంలో వీటి ప్రాధాన్యం అనూహ్యంగా పెరిగింది. తరగతి బోధనలో టచ్‌ స్క్రీన్లు, ప్రొజెక్టర్లు, ఆన్‌లైన్‌ నోట్‌బుక్స్, వాట్సాప్‌ మెసేజ్‌లు అంతర్భాగమయ్యాయి. జ్ఞాన సముపార్జనను టెక్నాలజీ (Technology) మరింత సులభతరం చేసింది. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ రంగ ప్రవేశం తర్వాత సరికొత్త బోధనా పద్ధతుల వైపు వెళ్ళాల్సి వస్తోంది.

సాంకేతిక పునాదులు
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు అందరికీ నాణ్యమైన విద్యను అందించడంపైనే దృష్టి పెట్టాయి. ఐఐటీల స్థాపన తర్వాత టెక్నాలజీతో కూడిన విద్యలో మార్పులు జరిగాయి. మౌలిక వసతుల కల్పన అవసరమైంది. ఈ కాలంలోనే శిక్షణా ప్రయోగశాలలు, గ్రంథాలయాలు అందుబాటులోకి వచ్చాయి. పరిశోధనలూ ఊపిరి పోసుకున్నాయి. ఇవన్నీ విద్యా వ్యవస్థ ఆధునీకరణకు తోడ్పడ్డాయి. 1970–80ల మధ్య యూనివర్సిటీలు ఆడియో విజువల్‌ సాధనాల వైపు వెళ్ళాయి. క్లాస్‌ రూముల్లోకి డిజిటల్‌ బోధన ప్రవేశించేలా వేగం పెరిగింది. 2009 తర్వాత హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడం, మార్పుల వేగాన్ని మరింత పెంచింది.

ఇదే కాలంలో ప్రైవేటు వర్సిటీలు, ఇంజనీరింగ్‌ కాలేజీలూ పెరిగాయి. కంప్యూటర్‌ ఆధారిత బోధనా పద్ధతులు వచ్చాయి. డిజిటల్‌ అవగాహనతో కూడిన బోధనా విధానాలు అనివార్య మయ్యాయి. 2017లో ‘స్వయం’ ప్లాట్‌ఫామ్‌ సరికొత్త విప్లవాన్ని సృష్టించింది. ఆన్‌లైన్‌ కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్, సులభతరమైన మూల్యాంకన పద్ధతులు, డిజిటల్‌ లైబ్రరీలు విద్యా వనరులను పెంచాయి.

సాంకేతికత ఉన్నత విద్యలో మార్పులు తెచ్చినా... ఇది గ్రామీణ ప్రాంతాలకు ఇప్పటికీ అంతగా వెళ్ళలేదనే చెప్పాలి. డిజిటల్‌ మౌలిక వసతుల కొరత కనిపిస్తోంది. వర్చువల్‌ ప్రయోగశాలలు పల్లెపల్లెకూ చేరాలి. ఆన్‌లైన్‌ లోనే ప్రయోగాలు నిర్వహించే కాలమిది. భౌతిక ప్రయోగశాలలు లేని ప్రాంతాల్లో ఇది మంచి మార్పు తెస్తుంది. ఈ దిశగా వేగంగా అడుగులు పడాలి. ఇవన్నీ పరిశోధన రంగానికి కొత్త బలాన్ని ఇస్తాయి. ‘నేషనల్‌ అకడమిక్‌ డిపాజిటరీ’ ఆవిష్కరణతో విద్యార్థి అన్ని సర్టిఫికెట్లు డిజిటల్‌ రూపంలో భద్రంగా ఉంటాయి. ‘బ్లాక్‌చైన్‌’ సాంకేతికత ద్వారా డేటాను భద్రంగా ఉంచుతున్నారు. ఆన్‌లైన్‌  నివేదికలు, డిజిటల్‌ పాఠ్య సామగ్రి, వ్యవస్థీకృత విద్యా విధానాల వేగం మరింత పెంచేందుకు కృషి జరగాలి.

చ‌ద‌వండి: అమెరికి కొరివితో త‌ల గోక్కుందామా?

కోవిడ్‌ తర్వాత ఊహాతీతంగా వెబ్‌నార్లు, సెమినార్లు, వర్క్‌షాపులు సర్వసాధారణం అయ్యాయి. ఆన్‌లైన్‌ వ్యవస్థకు అధ్యాపకులూ అనుసంధానం అవ్వాల్సి వచ్చింది. వాళ్ళూ కొత్త పరికరాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. డిజిటల్‌ స్క్రీన్‌ ద్వారా విద్యార్థులను ఆకర్షించే మార్గాలను అన్వేషించడం అనివార్యమైంది. కంప్యూటింగ్, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ కలిస్తే అది ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అవుతుంది. ఈ తరహా టెక్నాలజీ విద్యా పరిమితిని విస్తృతం చేసింది. ఇక్కడి నుంచే ప్రపంచంలోని ప్రఖ్యాత విద్యాలయాల్లోని అధ్యాపకుల పాఠాలు వినవచ్చు. ఎక్కడి నుంచైనా డిజిటల్‌ సర్టిఫికెట్లు పొందే వెసులుబాటు వచ్చింది.

సమస్యపై దృష్టి పెట్టాల్సిందే!
గ్రామీణ పేదలకు డిజిటల్‌ విద్య ఇప్పటికీ సవాల్‌గానే ఉంది. ఇంటర్నెట్‌ లేని పల్లెలు; స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు లేని పేద విద్యార్థులు ఇప్పటికీ ఉన్నారు. ఆన్‌లైన్‌ తరగతుల్లో పాల్గొనడం వారికి సాధ్యం కాదు. ఈ వెనుకబాటుతనం పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న అసమానతలను మరింత పెంచే ప్రమాదం ఉంది. సాంకేతిక విప్లవంలో గ్రామీణ ప్రాంతాలనూ భాగస్వాములను చేయడానికి అవసర మైన చర్యలపై దృష్టి పెట్టాలి. ఆ ప్రాంతాలకు వనరులు సమకూర్చడంలో ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాలి. నిజానికి స్వయం ప్లాట్‌ఫామ్‌... పాఠశాల నుంచి పీజీ స్థాయి వరకూ ఉచిత ఆన్‌లైన్‌  కోర్సులు అందిస్తోంది. ఈ సేవలను అందుకునే స్థితికి అందరూ రావాలి. ఇంటర్నెట్‌ అందుబాటులో లేని విద్యార్థులకు 32 టీవీ చానళ్ళ ద్వారా పాఠాలు అందిస్తున్నారు. అయితే, డిజిటల్‌ విద్యను మరింత చేరువ చేస్తేనే వీరికి ఉపయోగం. అత్యున్నత ప్రమాణాలతో విద్య అందించడం అప్పుడే సాధ్యమవుతుంది.

- ప్రొఫెస‌ర్‌ వి. బాలకిష్టారెడ్డి
తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement