అమెరికా కొరివితో తల గోక్కుందామా? | India Crucial negotiations on trade agreements with the US | Sakshi
Sakshi News home page

అమెరికా కొరివితో తల గోక్కుందామా?

Jul 26 2025 4:06 AM | Updated on Jul 26 2025 4:06 AM

India Crucial negotiations on trade agreements with the US

అమెరికాతో కుదుర్చుకొనే వాణిజ్య ఒప్పందాలపై కీలకమైన చర్చలు జరపడానికి భారత విదేశీ వాణిజ్య శాఖకు చెందిన ఓబృందం అమెరికాలో పర్యటించి ఇటీవలనే స్వదేశం చేరుకొంది. అమెరికా కొన్ని నిర్దిష్ట మైన చర్యల్ని ప్రతిపాదిస్తోంది. ప్రధానంగా ఎగుమతులు, దిగుమతులపై భారత్‌ విధి స్తున్న అన్ని రకాల ఆంక్షల్ని ఎత్తివేయాలని పట్టుబడుతున్నది. అమెరికా సూచనలను, పెంచుతున్న ఒత్తిళ్లను ఇప్పటివరకూ భారత్‌ అంగీకరించకపోవటం ఊరట కలిగించేదే. కాగా, ఆగస్ట్‌ మొదటి వారంలోనే తుది నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యత భారత్‌ ముందుంది. 

అమెరికా ఒత్తిడి మేరకు వ్యవసాయ, పాడి పరిశ్రమ రంగాలను ‘ఓపెన్‌ అప్‌’ చేసినట్లయితే... భారత్‌ నుంచి ఎగుమతుల మాట అటుంచి, అమెరికా నుంచి అన్ని రకాల వ్యవసాయ, పాల ఉత్పత్తులు భారత మార్కెట్లను ముంచెత్తుతాయి. ప్రారంభంలో మెట్రోలు, తర్వాత దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలలో అమెరికా పండ్లు, కూరగాయలు... చివరకు ఆకుకూరలు, పూలు దర్శన మిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ముందు స్వేచ్ఛ, అటుపై సంకెళ్లు
1990 ముందువరకు ‘జనరల్‌ అగ్రిమెంట్‌ ఫర్‌ ట్రేడ్‌ అంటే టారిఫ్‌ (గాట్‌) వ్యవస్థ అధ్యక్షుడు ఆర్థర్‌ డంకెల్‌ ప్రతిపాదించినఅంతర్జాతీయ స్వేచ్ఛా వాణిజ్య సమాజంలో భారత్‌ భాగస్వామి కాలేదు. కానీ, 1991లో పీవీ నరసింహారావు ప్రధాని అయ్యాకదేశంలో మొదలైన ఆర్థిక సంస్కరణల పర్వంలో భారత్‌ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) భాగస్వామి అయింది. దీనివల్ల్ల మన వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరిగి మంచి ధర లొస్తాయనీ, నాసిరకం స్వదేశీ వస్తువులకు బదులుగా మేలు రకం విదేశీ వస్తువులు కారుచౌకగా అందుబాటులోకి వస్తాయనీ పాలకులు ఊదరగొట్టారు. 

బహుళజాతి సంస్థల ఉత్పత్తులు మనతో పాటు కొన్ని వర్ధమాన దేశాల్లో కొంత మేర చౌకగా లభించిన మాట నిజం. అయితే, దానివల్ల స్వదేశీ సంస్థలు శీఘ్రగతిన తమ ప్రాభ వాన్ని కోల్పోయాయి. అనేకం మూతబడ్డాయి. మరికొన్నింటిని బహుళజాతి సంస్థలే హస్తగతం చేసుకొన్నాయి. మోన్‌శాంటో వంటి బహుళజాతి సంస్థలు దేశీయ విత్తన రంగాన్ని గుప్పిట్లో పెట్టుకునే అవకాశం ఏర్పడింది.

ఇప్పుడు అమెరికాతో కుదుర్చుకొనే వాణిజ్య ఒప్పందంలో వ్యవ సాయం, పాల ఉత్పత్తులు కూడా భాగమైతే... దేశీయ రైతాంగంకుదేలవడం తథ్యం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన ‘డెడ్‌ లైన్‌’ను లెక్క చేయకుండా భారత్‌ కచ్చితమైన వైఖరిని తీసుకోవా లనీ, లేదంటే అమెరికా వలలో ఇండోనేషియా చిక్కుకొన్నట్లుఅవుతుందనీ ‘గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనిషియేటివ్‌ (జిటిఆర్‌ఐ)’ ఇప్పటికే హెచ్చరించింది. ట్రంప్‌ వ్యక్తిగతంగా ఫోన్లు చేసి ఇండో నేషియా, కంబోడియా దేశాధినేతల్ని అమెరికా ఒప్పందాలకు అను కూలంగా సంతకాలు చేయించారని.. అటువంటి పరిస్థితి భారత్‌ తెచ్చు కోరాదని పలువురు వాణిజ్య నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇండోనేషియాలో ఏం జరిగింది?
అమెరికాతో ఇండోనేషియా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ప్రకారం, అమెరికా నుంచి వచ్చే అన్ని రకాల వస్తువులపై ఆ దేశంలో ప్రస్తుతం విధిస్తున్న సుంకాల్లో 99 శాతం కోతపడింది. దాంతో ఇండో నేషియా పారిశ్రామిక, సాంకేతిక, వ్యవసాయ ఉత్పత్తుల రంగాలపై అమెరికా గుత్తాధిపత్యం వహించే పరిస్థితి ఏర్పడింది. మరోవిధంగా చెప్పాలంటే... దాదాపు సున్నా సుంకాల కారణంగా ఇండోనేషియా మార్కెట్లను అమెరికా ఉత్పత్తులు ముంచెత్తుతాయి. 

అందువల్ల ఇండో నేషియాలో స్వదేశీ పరిశ్రమలకు గిరాకీ లేక మూతపడతాయి. అక్కడి వ్యవసాయదారులు ఇకపై వ్యవసాయం విరమించుకోవాల్సిందే. అయితే ట్రంప్‌ దయతలచి ఇండోనేషియా నుంచి వచ్చే ఉత్పత్తులపై తమ దేశంలో ప్రస్తుతం విధిస్తున్న 40% సుంకాలను 19%కు తగ్గించారు. అంటే, ఇండోనేషియాలోని అన్ని రకాల ఉత్పత్తి రంగాలు... అమెరికా ఎగుమతుల మీదనే ఆధారపడాలి. ఏదో సామెత చెప్పి నట్లు, చెయ్యోడిని వదిలి కాలోడిని పట్టుకొన్న చందంగా ఉంది.

ప్రపంచంలోనే భారత్‌ వ్యవసాయ మార్కెట్‌ పెద్దది. ప్రస్తుతం దేశంలో 3,323 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలు పండుతుండగా, అందులో దేశీయ అవసరాలకు సుమారు 280 లక్షల మెట్రిక్‌ టన్నులు ఖర్చవుతున్నట్లు అంచనా. సగటున ఏటా 45 నుంచి 50 బిలియన్ల డాలర్ల ఆహారోత్పత్తులను భారత్‌ ఎగుమతి చేస్తోంది.

29 బిలియన్ల డాలర్ల మేర దిగుమతి చేసుకుంటోంది. ఇందులో పప్పుదినుసులు, వంటనూనెలు, పండ్లు, కూరగాయలు అధికం. దశాబ్దంగా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు పెరుగుతున్నాయి. దానివల్ల వ్యవసాయ వాణిజ్య మిగులు క్రమేపీ తగ్గుతోంది. పప్పు ధాన్యాలు, వంటనూనె గింజల ఉత్పత్తికి ప్రోత్సాహకాలు తగ్గిస్తూ... దిగుమతులపై విధించిన సుంకాలను గణనీయంగా తగ్గించడంతో కొందరు వ్యాపారస్తులు విదేశాల నుండి కారుచౌకగా వీటిని దిగుమతి చేసుకొంటూ దేశీయ రైతాంగం పొట్టకొడుతున్నారు. ఫలితంగా, రైతులు వీటి సాగును విరమించుకొంటున్నారు, లేదా తగ్గించుకొంటున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాల స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 50% క్షీణించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

అమెరికాతో వ్యవసాయ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే... భారత్‌లోకి అమెరికా ఉత్పత్తులు మాత్రమే వస్తాయన్న గ్యారంటీ  లేదు. చైనా లేదా మరికొన్ని దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసు కొని, వాటినే భారత్‌కు ఎగుమతి చేసే అవకాశం ఉందని వాణిజ్య నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే పరిస్థితి మరింత దుర్భరం అవుతుంది.

భారత్‌ ఎగుమతి మార్కెట్లపై అమెరికా కన్ను
భారత్‌ ఎగుమతి మార్కెట్లను సైతం అమెరికా దెబ్బకొట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా, జపాన్ పై విధించిన 25 శాతం దిగుమతి సుంకాన్ని 15 శాతానికి తగ్గించారు. దానివల్ల జపాన్‌ ఇప్ప టివరకు భారత్‌ నుంచి దిగుమతి చేసుకొంటున్న బియ్యాన్ని కాదని, అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడానికి మొగ్గుచూపుతోంది.ఈ నేపథ్యంలోనే వాణిజ్య ఒప్పందాలలో వ్యవసాయ, పాల ఉత్పత్తి రంగాలను పూర్తిగా మినహాయించాలని ‘ఇండియన్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ ఫార్మర్స్‌ మూమెంట్‌ (ఐసీసీఎఫ్‌ఎం)’ కేంద్రా నికి విజ్ఞప్తి చేసింది. 

అమెరికా తన దేశీయ రైతాంగానికి ఏటా సగటున వ్యవసాయ బడ్జెట్‌లో 1.5 ట్రిలియన్‌ డాలర్ల మేర సబ్సిడీలుఅందిస్తూ, వాటిని విదేశీ మార్కెట్లలో లాభసాటిగా అమ్ముకోవడం ద్వారా సబ్సిడీల మొత్తానికి పదింతలు లాభాల్ని ఆర్జిస్తోంది. ఇటువంటి సూత్రాలను అన్ని రంగాలలో అమలు చేస్తున్న అమెరికాతో భారత్‌ సరైన ప్రాతిపదిక లేకుండా ఒప్పందం కుదుర్చుకోవడంఅంటే కొరివితో తల గోక్కోవడమే.

ప్రస్తుతం 70 కోట్ల మంది భారతీయులు బతుకు తెరువు కోసం వ్యవసాయ రంగం మీదనే ఆధారపడుతున్నారు. దేశ ప్రజలకు ఆహార భద్రత అందిస్తూ, గ్రామీణ ప్రాంత అభివృద్ధికి, స్థిరమైన ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తున్న వ్యవసాయ, పాడి రంగాలకుసంబంధించి తీసుకొనే ప్రతి నిర్ణయమూ జాతి ప్రయోజనాల కోణంలో ఉండాలి.

-వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు,కేంద్ర మాజీ కేంద్రమంత్రి
-డా‘‘ ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement