యాభై శాతం హద్దు తొలగేనా? | The countrys politics is once again revolving around the BCs | Sakshi
Sakshi News home page

యాభై శాతం హద్దు తొలగేనా?

Aug 9 2025 3:45 AM | Updated on Aug 9 2025 3:45 AM

The countrys politics is once again revolving around the BCs

దేశ రాజకీయం మళ్ళీ బీసీల చుట్టూ తిరుగుతున్నది. ఇందుకు తెలంగాణ ఒక వేదికగా మారింది. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పంచాయతీ రాజ్‌ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం స్థానాలను కేటాయించాలని నిర్ణ యించి శాసన పరమైన చర్యలు చేపట్టింది. దీనిని పార్లమెంటు చేత ఆమోదింపజేసి రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్పించేలా కేంద్రంపై ఒత్తిడి కల్పించ డానికి సన్నాహాలు మొదలుపెట్టింది. తమిళనాడులో చాలా కాలం కిందటే 69 శాతం కోటా అమల్లోకి వచ్చింది. అంతే కాకుండా కేసులు వేయకుండా న్యాయ సమీక్షకు అతీతం చేస్తున్న రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్లో ఈ కోటాను తమిళనాడు ప్రభుత్వం చేర్పించుకున్నది. 

తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చినా...
రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి, లక్షణానికి విరుద్ధంగా ఉండే చట్టాలను తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చినా వాటిని సమీక్షించే అధి కారం తనకున్నదని సుప్రీంకోర్టు ప్రకటించి ఉంది. తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తున్నట్టు పంచాయతీల్లో బీసీలకు 42 శాతం కోటా బిల్లును పార్లమెంటు ఆమోదించడం గానీ, అది 9వ షెడ్యూ ల్‌లో చేర్చడం గానీ సులభ సాధ్యమైనవి కావు. కాంగ్రెస్‌ ఖాతాలోకి వెళ్లే పనులను బీజేపీ ఎందుకు చేస్తుంది? పని కాకపోతే బీజేపీ బీసీలకు వ్యతిరేకి అని ప్రచారం చేయవచ్చన్నది కాంగ్రెస్‌ ఎత్తుగడ. 

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కోటా కల్పిస్తే సుప్రీం కోర్టు మొత్తం రిజర్వేషన్లపై విధించిన 50 శాతం హద్దును అది మీరిపోతుంది. ఇలా హద్దు మీరిన రిజర్వేషన్లను కోర్టులు చాలా సార్లు రద్దు చేశాయి. తాజాగా మహారాష్ట్రలో మరాఠాలకు కేటాయించిన 16 శాతం రిజర్వేషన్లు వివాదాస్పదమయ్యాయి. దీనితో మహా రాష్ట్రలో రిజర్వేషన్లు 50 శాతం హద్దును దాటిపోతున్నాయంటూ బొంబాయి హైకోర్టును కొందరు ఆశ్రయించగా అది వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాను 16 నుంచి 12 శాతానికి, విద్యాసంస్థల్లో13 శాతానికి తగ్గించివేసింది. దీని మీద సుప్రీం కోర్టు స్టే ఇచ్చి, ఇప్పుడు విచారణ జరుపుతోంది. 

1931 నాటి లెక్కలతో...
విచిత్రమేమిటంటే ఇదే కాంగ్రెస్‌ పార్టీ 1980–90 మధ్య పదేళ్ల పాటు మండల్‌ కమిషన్‌ నివేదికను అమలుపరచకుండా ఆటకెక్కించింది. 1990లో వి.పి.సింగ్‌ ప్రధానిగా ఈ నివేదికను పాక్షికంగా అమలుచేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లను ఆచరణలోకి తెచ్చారు. తిరిగి 2006లో మన్మోహన్‌ సింగ్‌ నాయక త్వంలోని యూపీఏ ప్రభుత్వం కేంద్ర విద్యా సంస్థలలోనూ బీసీలకు 27 శాతం కోటాను అమలు చేసింది. 1979లో మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం నియమించిన బి.పి. మండల్‌ కమిషన్‌ 1931 కులగణన ప్రకారం దేశ జనాభాలో ఇతర వెనుకబడిన తరగతులవారు 52 శాతం ఉంటారని నిర్ధారించి, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించ కుండా ఉండేందుకు వారికి 27 శాతం కోటాను సిఫారసు చేసింది. 

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో కుల గణన జరిపిస్తామని రాహుల్‌ గాంధీ ప్రకటించారు. మోదీ ప్రభుత్వం ఈ విషయంలో తన చిరకాల వ్యతిరేకతకు తెర దించి, త్వరలో జరగబోతున్న దేశ జనాభా గణనలో భాగంగా కులాలవారీ గణనను చేపట్టడానికి అంగీకరించింది. ఇందుకు కారణం లేక పోలేదు. ఇంతవరకూ కేవలం ధనిక, మధ్యతరగతి వర్గాల పార్టీగా మాత్రమే ఉన్న బీజేపీ వైపు ఇప్పుడు పేదలు, అణగారిన వర్గాలు కూడా గణనీయంగా మళ్ళినట్టు భావిస్తున్నారు.

రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని 1992 నవంబర్‌ 16న సుప్రీం కోర్టు  తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం విధించింది. ఇంద్ర సాహనీ కేసు లేదా మండల్‌ కమిషన్‌ కేసుగా ప్రసి ద్ధమైన వ్యాజ్యంలో ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పు దేశంలో రిజ ర్వేషన్లపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయాలను ప్రకటించింది. కులం ప్రాతిపదిక వెనుకబాటుతనాన్ని ఈ తీర్పు గుర్తించింది. అంటే సామాజిక న్యాయ అవసరం రాజ్యాంగ విహితమైనదని చెప్పింది. అదే సమయంలో పరిమితులను విధించింది. 50 శాతం హద్దు, బీసీలలో మీగడ వర్గం, లేదా ముందుబడిన వర్గాన్ని (క్రీమీ లేయ ర్‌ను) గుర్తించి కోటా నుంచి దూరం చేయడం, పదోన్నతులలో రిజర్వేషన్లు ఉండరాదనడం ఈ కోవలోకి వస్తాయి. 

కేంద్రం తలుచుకుంటే...
పదోన్నతులలో రిజర్వేషన్లను సుప్రీం కోర్టు రద్దు చేసినా 1995లో 77వ రాజ్యాంగ సవరణ ద్వారా 16(4ఎ)ను చేర్చి ఎస్సీ, ఎస్టీల విషయంలో వాటికి తిరిగి ప్రాణం పోశారు. వాస్తవానికి రాజ్యాంగం 340, 341, 342 అధికరణాలు బీసీ, ఎస్సీ, ఎస్టీల పరి స్థితులను మెరుగుపరచడానికి, వారి యెడల సానుకూల వివక్షను ఉద్దేశించి చేర్చినవి. అయితే సుప్రీం కోర్టు 50 శాతం పరిమితి ఉల్లంఘన రాజ్యాంగం 14వ అధికరణం హామీ ఇస్తున్న సమానత్వ సూత్రానికి విరుద్ధమని ప్రకటించింది. అత్యంత ప్రత్యేక పరిస్థితు లలో 50 శాతానికి మించి రిజర్వేషన్లను కేటాయించవచ్చని సైతం ఈ తీర్పు చెప్పింది. కానీ కోర్టులు ప్రధానంగా 50 శాతం హద్దును అమలు పరచడమే కర్తవ్యంగా తీర్పులు వెలువరిస్తున్నాయి. 

కేంద్రం తలచుకుంటే 50 శాతం హద్దును ప్రభావరహితం చేయడం కష్టమేమీ కాదు. విద్యకు, హక్కులకు సుదూరంగా విసిరి వేసిన ప్రజలను పైకి తేవడానికి ఉద్దేశించిన అధికరణాలురాజ్యాంగం ప్రసాదించినవి కాగా, 50 శాతం హద్దు సుప్రీం కోర్టు విధించినది. నిజానికి రాజ్యాంగం కేవలం సాంఘికంగా, విద్యా పరంగా వెనుకబడిన వర్గాలకే విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇచ్చింది. ఇందులో ఆర్థిక వెనుకబాటుతనం ప్రస్తావనే లేదు. అయినా మోదీ ప్రభుత్వం 103 రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థిక బలహీన (ఈడబ్ల్యూఎస్‌) వర్గాలకు 10% రిజర్వేషన్లను కల్పించింది. 

ఇది 50 శాతం పరిమితిని దాటిపోడమే కదా! రాజ్య సభలో పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఈ విషయాన్నే ప్రశ్నించగా, సామాజిక న్యాయ శాఖ మంత్రి విచిత్రమైన సమాధానంతో సమర్థించుకున్నారు. ఇంద్ర సాహనీ కేసులో సుప్రీం కోర్టు విధించిన 50 శాతం హద్దు సామాజి కంగా విద్యాపరంగా (ఎస్‌.ఇ.బి.సి.) వెనుకబడిన వర్గాలకు మాత్రమే వర్తిస్తుందని, ఆర్థిక బలహీన వర్గాలకిచ్చిన 10 శాతం రిజర్వేషన్లకు, దానికి సంబంధం లేదని చెప్పారు. ఇటువంటి ద్వంద్వ ప్రమాణాలు రాజకీయ అవకాశవాదాన్నే రుజువు చేస్తాయి. అందుకే ‘మేమెంద రమో మాకు అంత కోటా’ అనే నినాదం రోజు రోజుకీ పుంజుకుంటు న్నది. అందుకోసం మరొక రాజ్యాంగ సవరణ ద్వారా 50 శాతం హద్దును కూడా రద్దు చేయడమే ఏకైక మార్గంగా తోస్తున్నది.

-వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు
-జి. శ్రీరామమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement