పండుగనాటికి రైతుల ఖాతాల్లో నగదు జమ
వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ అమలు చేయాలని సీఎం ఆదేశం.. దీంతో గత సీజన్ తరహాలో 145.73 లక్షల ఎకరాలకు ఇచ్చే అవకాశం
యాసంగిలో రైతన్నకు పెట్టుబడి సాయం అందేలా ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరంలో రాష్ట్రంలోని రైతులకు రేవంత్‌రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పబోతోంది. యాసంగి సీజన్‌కు సంబంధించిన ‘రైతు భరోసా’ మొత్తాన్ని సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం... యాసంగి సీజన్ కింద రైతులకు ఇచ్చే రైతు భరోసా కోసం వ్యవసాయ, ఆర్థిక శాఖలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. డిసెంబర్‌లో ముగిసిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఆశించిన మేర విజయాలు సాధించగా, కొత్త సంవత్సరం ప్రథమార్థంలో జిల్లా, మండల పరిషత్, మునిసిపల్ ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు యాసంగి రైతు భరోసాను ‘పెట్టుబడి సాయం’కింద ముందుగానే అందజేయడం ద్వారా ప్రభుత్వం పట్ల సానుకూలత పెరుగుతుందని అంచనా వేసిన సీఎం రేవంత్‌రెడ్డి అందుకనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేసినట్లు సమాచారం.ఇప్పటి వరకు రైతు భరోసా ఇచ్చినట్లుగానే ఎలాంటి కోతలు లేకుండా వ్యవసాయయోగ్యమైన భూములన్నింటికీ ‘రైతుభరోసా’అమలు చేయాలని ఆయన ఆదేశించినట్లు తెలిసింది.
కోటిన్నర ఎకరాలకు అందించే అవకాశం
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ‘రైతు బంధు’పథకాన్ని రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ‘రైతు భరోసా’గా మార్చి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రెండు విడతలుగా రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ. 6వేల చొప్పున జమ చేసింది. 2024–25 యాసంగి సీజన్‌లో ఆలస్యంగా రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసినప్పటికీ, మొన్నటి వానకాలం సీజన్‌లో మాత్రం సరైన సమయంలోనే రైతు భరోసా అందించింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా రైతులకు పెట్టుబడికి అందేలా సంక్రాంతి నాటికే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. కాగా గత వానకాలం సీజన్‌లో 69.40 లక్షల మంది రైతులకు సంబంధించిన 145.73 లక్షల ఎకరాలకు రైతు భరోసా మొత్తాన్ని ప్రభుత్వం అందజేసింది. ఇందుకోసం వెచ్చించిన మొత్తం రూ. 8,744.13 కోట్లు. ఈసారి కూడా దాదాపు అంతే మొత్తంలోగానీ, ఆ సీజన్‌లో మిస్సయిన ఇతర రైతులందరికీ కలిపి రూ.150 లక్షల (కోటిన్నర) ఎకరాలకు గాని అందించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
సాగు భూములకే రైతు భరోసా అంటూ... శాటిలైట్ సర్వే
2024 యాసంగిలో రైతు భరోసా విధి విధానాలు ప్రకటించిన ప్రభుత్వం సాగు యోగ్యమైన భూములన్నింటికీ ఈ పథకాన్ని వర్తింప జేయనున్నట్లు తెలిపారు. తదనుగుణంగానే ఒక్కో సీజన్‌కు రూ. 9వేల కోట్ల వరకు వెచ్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అంగీకారం తెలిపారు. అయితే ఈసారి యాసంగిలో సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. ఇందుకోసం సాగు విస్తీర్ణాన్ని లెక్కకట్టేందుకు శాటిలైట్ సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ప్రయోగాత్మకంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని భూముల్లో సర్వే చేశారు కూడా. జిల్లాల్లో ఏఈవోలు సాగు భూముల సర్వే చేస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతికి సాగు చేసే భూముల ఇప్పటికిప్పుడు లెక్కలు రావు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 13 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు కాగా, కాగా గత సంవత్సరం యాసంగిలో 79.54 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అయితే ఈసారి సాగుతో సంబంధం లేకుండా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతుభరోసా అందించాలని భావిస్తున్న నేపథ్యంలో సంక్రాంతి కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.


