
అభిప్రాయం
ఇప్పుడు ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తున్నదనటంలో అతిశయోక్తి లేదు. ఈ పరిణామం ఈ నెల 6వ తేదీన చోటుచేసుకుంది. ఆ రోజున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై సుంకాలను మరొక 25 శాతం పెంచి, మొత్తం 50 శాతానికి చేర్చారు. దానితో మోదీ ప్రభుత్వం ఒత్తిడికి గురై రష్యన్ చమురు కొనుగోళ్ళను ఆపటంతో పాటు, వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చలో తమ ప్రతిపాదనలకు అంగీకరించగలదన్నది ట్రంప్ ఎత్తుగడ. అనూహ్యమైన రీతిలో ప్రధాని మోదీ అదేరోజు రాత్రి ఎదురుదాడి ప్రారంభించారు.
ప్రపంచం కోసం నిలబడగలమా?
ట్రంప్ చర్యలను చైనా, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, కెనడా, జపాన్, దక్షిణాఫ్రికా, రష్యా వంటివి మొదటి నుంచి పూర్తిగానో, పాక్షికంగానో వ్యతిరేకిస్తుండటంలో విశేషం లేదు. వీటన్నింటికి భిన్నంగా పెద్ద దేశాలలో ఇండియా ఒక్కటే మొదటి నుంచి అమెరికాతో మెత్తగా వ్యవహరిస్తూ వచ్చింది. ఒక పెద్ద వర్ధమాన దేశం అయి ఉండి, ‘బ్రిక్స్’లో ప్రధాన పాత్ర వహిస్తూ, ట్రంప్ చర్యల కారణంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తున్నా, ప్రతిఘటించకపోవటంపై అంతటా విమర్శలు వినిపించాయి. అటువంటి స్థితిలో మోదీ చేసిన ప్రసంగం, అందులోని భాష, తనలో కనిపించిన దృఢమైన వైఖరి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడిక ఆయన భారతదేశం కోసమే గాక, తక్కిన ప్రపంచంతో కూడా కలిసి నిలబడవచ్చుననే ఆశాభావాలు వినవస్తున్నాయి.
అదే సమయంలో, ఇల్లలకగానే పండుగ కాదనే పెద్దల హెచ్చరికను గుర్తుంచుకోవలసి ఉంటుంది. వీటికి స్వల్పకాలిక, మధ్యకాలిక ప్రభావాలు అనేకం ఉంటాయి. అవి వాస్తవంగా భూకంపానికి దారితీయగలవు. స్లో మోషన్‌లో ఆర్థిక ప్రపంచ యుద్ధాన్ని సృష్టించగలవు. మన ప్రపంచం నిజమైన అర్థంలో రాజకీయంగా, ఆర్థికంగా, ప్రజాస్వామికంగా మారాలంటే, చిరకాలపు అధిపత్య శక్తుల భూమి కింద అటువంటి భూకంపం రావటం అవసరం.
కొండ చరియలలో కింది వైపున కేవలం ఒక రాయి కదలికలో మొత్తం చరియలే కూలినట్లు, చరిత్రలో ఒకోసారి చిన్న ఘటనలు పెనుమార్పులకు దారి తీస్తుంటాయి. క్రమంగా బలహీనపడుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థను, భౌగోళిక ఆధిపత్యాన్ని తిరిగి శక్తిమంతం చేయదలచిన ట్రంప్, అమెరికన్ కొండచరియలో ఒకొక్క రాయినే తనకు తెలియకుండానే తోసివేస్తున్నారు. ఇప్పుడు ఇండియా రూపంలో ఒక ముఖ్యమైన రాయి తొలగిపోతున్నదనుకోవాలా?
ఇండియా దృఢ వైఖరి
నిజంగానా, లేక ఇది తొందరపాటు మాటా అన్నది ప్రశ్న. ఒకవైపు అమెరికా నాయకత్వాన ఒక శక్తిమంతమైన కూటమి ఉంది. అది బలహీన పడుతున్న మాట నిజమేగాని అవసాన దశకేమీ చేరలేదు. మరొకవైపు భారత్‌తో కూడిన ‘బ్రిక్స్’ దేశాలు నానాటికీ బలపడుతున్నాయి. ఇది తమ ఆధిపత్యానికి ఎంత ప్రమాదకరం కాగలదో అర్థమైనందువల్లనే ట్రంప్ ‘బ్రిక్స్’పై కత్తిగట్టారు. ఆయన వేర్వేరు దేశాలపై వేర్వేరుగా ప్రకటిస్తున్న ట్యారిఫ్‌లను, వేర్వేరు పద్ధతులలో సాగిస్తున్న చర్చలను గమనిస్తే, ‘బ్రిక్స్’ దేశాల పట్ల ‘విభజించి పాలించే’ వ్యూహాన్ని అనుసరిస్తున్నటు స్పష్టమవుతుంది.
చర్చలోకి వెళితే, మోదీ నాయకత్వాన భారతదేశానికి అమెరికాతో అవసరాలున్నాయి, పేచీలు కూడా ఉన్నాయి. గతకాలపు చిన్నచిన్న పేచీలను అటుంచి ఇప్పుడు ట్యారిఫ్‌లతో, వాణిజ్య ఒప్పందంలోని ప్రతిపాదనలతో పెద్ద పేచీ తలెత్తింది. ఒకవైపు భారతదేశం స్వతంత్ర శక్తిగా గతం కన్నా బలపడుతూ తన భవిష్యత్తు పట్ల దృష్టి మారుతుండటం, మరొకవైపు అమెరికా క్రమంగా బలహీనపడుతూ ఏకధ్రువ ప్రపంచ స్థితి మారుతుండటం గమనించవలసిన కొత్త పరిణామాలు.
ఇటువంటిది ఏర్పడినపుడు, వ్యూహాత్మకంగా అగ్రరాజ్యం ఎంతో వివేకంగా, చతురతతో వ్యవహరించాలి. ట్రంప్ నాయకత్వాన అమెరికా అవివేకపు వ్యూహాన్ని అనుసరిస్తున్నందున, ఇండియా వంటి మిత్రదేశంతోనూ సంబంధాలు చెదిరిపోతున్నాయి. అట్లా జరగకుండా ఉండేందుకు మోదీ మొదట గట్టి ప్రయత్నమే చేశారు. కానీ, ఏమి చేసైనా సరే తన ‘మాగా’ లక్ష్యాలను సాధించాలనే ఒత్తిడుల మధ్య అమెరికా అధ్యక్షుడు– యూరప్, కెనడా, జపాన్, మెక్సికో వంటి ఇతర మిత్ర దేశాలకు వలెనే ఇండియాను కూడా దారికి తెచ్చుకోగలనని నమ్మారు.
వాటికీ,భారత్‌కూ మధ్యగల వ్యత్యాసాలను గ్రహించలేకపోయారు. దానితో, ఇంధనం అయితేనేమి, వ్యవసాయ రంగం అయితేనేమి... దేశ ప్రయోజనాల కోసం మోదీ ప్రభుత్వం నిలబడక తప్పలేదు. వాస్తవానికి వ్యవసాయ రంగం విషయమై, గాట్ – డబ్ల్యూటీవో చర్చల దశలో ఇండియా ఇతర వర్ధమాన దేశాలతో కలిసి గట్టిగానే నిలబడింది. అదే ఇపుడు కూడా జరుగుతున్నది. పాఠాలు నేర్చుకోనిది అమెరికా కూటమే!
ఆర్థిక భూకంపం రానుందా?
ఇంతవరకు బాగున్నది. రాగల కాలపు పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. ట్రంప్ తన ధోరణిని మార్చుకుని అంతా సుఖాంతం కావచ్చునా? భారతదేశంతో తగినంత రాజీ పడవచ్చునా? ట్రంప్ స్వభావమేమిటో ఈ సరికి బోధపడింది గనుక ఆయనను నమ్మలేమని ప్రధాని మోదీ తన స్వతంత్ర వైఖరిని కొనసాగించగలరా? మొన్నటి 6వ తేదీ తర్వాత వడివడిగా రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలాతో సంప్రతింపులు జరిపి, పుతిన్‌ను ఆహ్వానించి, చైనాలో జరగనున్న షాంఘై సహకార సంస్థ సమావేశాలకు వెళ్ళనున్నట్లు ప్రకటించి, అక్కడ జిన్‌పింగ్‌తో సమావేశం జరగవచ్చుననే సంకేతాలు పంపినందున, ఇవన్నీ మునుముందు బ్రిక్స్ వేదికగా కొత్త మార్గాన్ని మరింత దృఢంగా అనుసరించగలమనే సూచనలు కావచ్చునా? అటువంటిది గనుక అయితే, ఆగస్టు 6 నాటి భూ ప్రకంపనలు రాగల కాలపు భూకంపానికి నాంది అవుతాయి. అట్లా జరగాలన్నదే వర్ధమాన ప్రపంచపు కోరిక కావచ్చు కూడా! కానీ అది తేలిక కాదు. ట్రంప్ ప్రతీకారాన్ని తట్టుకునేందుకు సైతం సిద్ధపడవలసి ఉంటుంది.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు