
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి వర్ధంతి నేడు
స్మరణ
మన సారథి మన సచివుడు
మన వియ్యము మన సఖుండు
మన బాంధవుడున్
మన విభుడు గురుడు దేవర
మనలను దిగనాడి చనియె మనుజాధీశా!
శ్రీకృష్ణ పరమాత్ముడు ఇహం వీడి పరమ పదం చేరుకున్నపుడు అర్జునుడి ఆవేదన అది. కానీ, ఆధునిక యుగంలో ఓ పరమా ప్తుడు హఠాత్తుగా నవ్వుతూ అంతర్థానమ య్యాడని కోట్లాది మంది అల్లల్లాడిపోవడం ఆశ్చర్యం, అపూర్వం.
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు అందర్నీ కలవాలని చిరు దరహాసంతో బయలుదేరి మేఘాల మధ్య, వర్షంలో పావురాల గుట్ట వద్ద ప్రపంచాన్ని వదిలిన వేళ కోట్ల మంది నిర్ఘాంతపోయారు. నమ్మలేదు, నిజంకాదు అనుకున్నారు. తెల్లటి దుస్తుల్లో చెరగని చిరు నవ్వుతో శత్రువుకైనా వరమిచ్చే ఆ మహర్షి అలా ఎలా వెళ్ళిపోతాడని ఏడ్చారు. ప్రసార మాధ్యమాలను నమ్మక ఆ ప్రాంతానికి పరు గెట్టారు. దేవుణ్ణి నిందించారు.
తెలుగు రాష్ట్రాలలో మూడు రోజుల పాటు ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగలేదు. కన్నీటి వరదలో ఆకలి కొట్టుకుపోయింది. చరిత్రలో ఎందరో చక్రవర్తులు, తత్త్వవేత్తలు మరణించినపుడు కూడా ఇంతటి విషాదాన్ని, ప్రజా ప్రతిస్పందాశ్రు సంద్రాన్ని చూడ లేదు అన్నది వాస్తవం.
వైఎస్ మరణవార్త విని కొండంత ఆ దుఃఖాన్ని గుండెల్లో మోయలేక, ఆ భారంతో బాధతో ఏడు వంద లకు పైగా గుండెలు కొండెక్కాయి. నమ్మలేని విషయం ఇది. కళ్ళ ముందు సత్యం ఇది. ‘నీవు లేని వేళ మాకీ బ్రతుకేల, నీ వెంటే వస్తాం, ఏ లోకంలో ఉన్నా నీ పరిపాలనలోనే ఉంటాం’ అంటూ కదిలిపోవడం ఏమనాలి!
కారణ జన్ముడు
మనతో, మన మధ్య తిరిగిన ఓ మనిషి, ఓ నాయకుడు ఇంత ఆదరం పొందటం నిజంగా చరిత్ర. భగవంతుడిని అనేక రూపాలలో కొలుస్తాం. అలా ఆ రాజన్నకు జనం గుండెల్లో గుడి కట్టడం; అన్నగా, నాన్నగా, బంధువుగా, హితుడిగా, గురువుగా, దేవరగా కొలవడం అసాధ్యమైన సాధ్యం. ఆయనకిచ్చారు హృదయ నైవేద్యం. ఆ రూపు నేటికీ ఆరాధ్యం. ఆ మూర్తి, ఆ వ్యక్తిత్వపు అయస్కాంత స్ఫూర్తి ఇంకా పచ్చగా, పచ్చిగా వుంది. ప్రజల హృద యాల్లో పలవరిస్తూ ఉంది, పలకరిస్తూనే ఉంది.
ఇంతగా ఇంకా ఆ దరహాసపు చంద్రకాంతి మనలో ఉందంటే– ఆయన చేసిన సేవ, శత్రువును సైతం క్షమించే గుణం, కపటం లేని దార్శనికత, మోసం లేని రాజకీయం, కొందరివాడుగా కాక అందరి వాడుగా మారిన నైజం, పాలకుడే సేవకుడుగా మారిన రూపం, దుస్తులంత తెల్లని మనసు, చిరునవ్వంత అందమైన చిత్తం, ఆదరణ వేళ అమ్మతనం, కరుణించే ఔదార్యం, ఎముక లేని దాతృత్వం...
ఇంకా ఇంకా ఇంకా ఎన్నో, ఎన్నెన్నో!
కారణ జన్ముడు, రణ జన్ముడు, అనురాగ హృదయ రుణ అరుణ జన్ముడు రాజశేఖరరెడ్డి. దైవం, ఈ లోకాన్ని మార్చాలని మానుషరూప దైవంగా ఆయనను ఇలకు పంపి, మరింత కాలం మనుగడ సాగిస్తే ఆయన ముందు తనని మరచిపోతారేమోనని హఠాత్తుగా ఆయన శ్వాస వాయువును తన వాయులీనం చేసు కున్నాడు. ఈర‡్ష్యతో సర్వేశుడు చేసిన చర్య ఆయన మరణం అని అందరి హృదయ వచనం.
ఎందుకు ఆయన పట్ల అంత ప్రేమ? రూపాయి డాక్టరు అయి నందుకా? సామాజిక సేవకై రాజకీయ వైద్యుడైనందుకా? సమ్మో హపు చిరునవ్వుతో సామాన్యులను పలకరించినందుకా? నాగలి మోసేవాడి భుజం నొప్పి తెలిసినందుకా? కార్మికుల ఘర్మజల మర్మం ఎరిగినందుకా? పేదలను ప్రేమించినందుకా? రాళ్ళ భూమిని నీళ్ళతో తడిపినందుకా? ఒక్క మనిషిలో ఎన్ని రూపాలు, ఎన్ని భిన్న స్వరూపాలు!
చరిత్ర చూసిన ఘోర విషాదం, ఉప్పొంగిన అశ్రు సముద్రం, ఉలిక్కిపడిన శూన్యపు గగనం.... ఆ రోజు తలవటానికి కూడా ఇష్ట పడని సెప్టెంబరు... అయినవాళ్ళు పోతేనే అతి త్వరగా మరిచి పోయే ఈ రోజుల్లో ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా ఆ రోజును, ఆ మనిషిని, ఆ మనసును తలచుకుని కన్నీరు పెడుతున్నారంటే... ఎంత అదృష్టవంతుడు రాజశేఖరరెడ్డి! ఆయన లేని మనం ఎంత దురదృష్టవంతులం!!
జన హృదిలో... పూజ గదిలో...
ఆత్మీయుల ఫొటోలను ఇంటి గోడలకు తగిలించుకుంటాం. కానీ కొన్ని లక్షల కుటుంబాలు ఆయన ఫొటోను దేవుని గదిలో, దేవుడి పటాల పక్కన ఉంచి పూజించడం చూస్తున్నాం. ఎదలోని దేవుడు, ఎదురైన దేవుడు ఇంటిపూజలో ఉండాలి అని ‘రాజన్న’ను ‘రామన్న’ను చేసి కొలవడం కేవలం ఆయనకే దక్కిన గౌరవం. ఆనంద ఆత్మార్పణం ఆకాశదేశం నుంచి అందుకుంటున్నవాడు ఆ రాజశేఖరరెడ్డి.
నాయకుల విగ్రహాలు ఆ యా పట్టణాలలో అరుదుగా వెలు స్తాయి. కానీ ఊరు ఊరునా ప్రజలు వై.ఎస్. విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నారు. ‘అన్నా! నీవు అడుగు పెడితే నీతో పాటు మేఘాలు వస్తాయి, వర్షాలు మా పంట పొలాల్ని పలకరిస్తాయి, పంటతో మా ఇంట పండగే తెస్తాయి’ అని ప్రతి రైతు గుండె చెమ్మ చేసుకునేది ఆయన గురించే!
‘పేదరికంలో పుట్టిన మేము ఈ రోజు ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నామంటే, ఇలా విదేశాలకు వచ్చామంటే, మా కుటుంబ ఆర్థిక స్థితి బాగైందంటే అది ఆ ‘సామాజిక వైద్యుడు’ పెట్టిన భిక్ష. ఆయన అందించిన ఫీజు రీయింబర్సుమెంటు ఆర్థిక సాయంతోనే మా స్థితీ, గతీ మారింది’ అని చెబుతుంటే ఎవరన్నారు రాజన్న లేడని! ఇన్ని కోట్ల గుండెలు ఆయన్ని తలుస్తూ ఉంటే, పిలుస్తూ ఉంటే ఎక్కడికి పోతాడు? మనలోనే, మనతోనే, మన ఆత్మగా ఉంటాడు.
స్వార్థంతో కొందరు జీవిస్తారు. సమాజం కోసం మహాత్ములు జీవితాన్ని అర్పిస్తారు. నిరంతరం మనుషుల కోసం, పేదవాడి పెదవి మీద చిరునవ్వు చూడటం కోసం, బతుకు పోరులో బడుగు వర్గాల వారిని గెలిపించడం కోసం తపన పడ్డాడు, ఆలోచనగా అడుగులు వేశాడు రాజశేఖరరెడ్డి. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఆయన పాలన అనితర సాధ్యం. దేశానికి ఒక ఉదాహరణ అనడం అతిశయోక్తి కాదు. రామరాజ్యం, రాజన్న రాజ్యం అని పోల్చుకోని పేదవాడు లేడు ఈ రోజు.
శత్రువులను ఆయుధాలతో కాక చిరునవ్వుల విరివిల్లులతో గెలుస్తూ అభిమానాన్ని పొందాడు. ఆయన వెంట హర్షంతో వర్షం నడిచి వచ్చింది. నీటి కరువుకు నిత్య నిలయమైన అనంతపురం లాంటి జిల్లాను వరదలు పలకరించాయి. ఆయన హయాంలో ఒక్క రైతు కూడా ఆవేదనతో ఆత్మహత్య చేసుకోలేదు.
నీళ్ళతో పాటు ఉచిత కరెంటు కూడా ఇచ్చి, కర్షకుడి కంట కన్నీరు రాకుండా కాపాడుకున్నాడు. నదుల నీరు వృథాగా సముద్రంలో కలవకూడ దని, ఆ జలబలాన్ని రైతుకు అందించాలని, భూములు తడిపి, వారి కుటుంబాల కన్నీళ్ళు తుడిచిన సత్యపథుడు, అపర భగీరథుడు వై.ఎస్.
ఉద్యోగుల అలజడులు లేవు. విద్యార్థుల ఉద్యమాలు లేవు. హింసావాదుల్ని అహింసా మార్గానికి తీసుకువచ్చి సంస్కరించాలని సంస్కారంతో నక్సలైట్లతో చర్చలు జరిపాడు. ఎవ్వరూ ఊహించని ‘ఆరోగ్య శ్రీ’ని పేదలకు వరంగా అందించి, కార్పొరేట్ వైద్యాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గరకు తెచ్చిన మహా ప్రాణదాత. ఆయన పుణ్యమా అని ఎందరి ఇళ్ళల్లో దీపాలు వెలిగాయో!
ఆయన వేగం, సాధిస్తున్న సంక్షేమం, ప్రజలలో ఆయన పట్ల ఉన్న ఆరాధనం చూసి శాసన సభలో ప్రతిపక్షాలు అల్లాడి పోయాయి. ఏం అనాలో, ఎలా తిట్టాలో అర్థం కాలేదు వారికి.
చంద్రబాబు ప్రయత్నం చేసి, ఆయన చతురత, చమత్కారం, హాస్యం, దృఢచిత్తం ముందు నవ్వుల పాలయ్యాడు. నలిగి కూర్చు న్నాడు. ఆయనను తిట్టాలనుకున్న ప్రతి నోరూ మూతబడిపోయింది... తెరిస్తే అప్రయత్నంగా ఆయనను పొగడకుండా ఉండ లేమనే భయంతో! ఆయనలోని మానవత్వ విరాడ్రూప విజృంభణ చూసి ప్రపంచమే చేతులు జోడించింది.
శ్రీవారిని భక్తుల చెంతకు చేర్చాడు!
హిందువులకు, హైందవ ధర్మానికి, ధర్మ పరిరక్షణకు ఆయన చేసిన సేవ, పనులు మరే నాయకుడూ, మరే ముఖ్యమంత్రీ చేయలేదు అన్నది వాస్తవం. కళ్ళు మూసుకుని అసత్యాలు ప్రచారం చేసే వాళ్లు సైతం అంతరంగంలో అంగీకరించిన సత్యం. పసుపు ఎంత పూసినా పాడవని అగ్నికణం.
ఈ రోజు సమస్త ప్రపంచం తిరుమల శ్రీవారి ఆలయ విశే షాలను, ఉత్సవాలను చూస్తున్న ‘శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్’ ఆయన ఆలోచన. ఆయన రూపకల్పన. అన్య మతాల వారికి తి.తి. దేవ స్థానంలో ఉద్యోగాలు ఇవ్వకూడదు అని ప్రభుత్వ ఉత్తర్వులు (జి.ఓ.) ఇచ్చింది ఆయనే!
‘కల్యాణమస్తు’ పేరుతో, శ్రీవారి మూలమూర్తి పాదాలు తాకిన తాళిబొట్లతో 36 వేల మందికి రాష్ట్రవ్యాప్తంగా తి.తి.దే. వివాహాలు జరిపించడానికి కర్త ఆయన. భగవంతుడు అందరివాడని దళిత వాడలకు గోవిందుడిని ‘దళిత గోవిందం’ పేరుతో తీసుకువెళ్ళిన సాహసి.
ప్రపంచంలోని ప్రతి గ్రామంలో శ్రీనివాస కల్యాణాలు జరగాలని శ్రీకారం చుట్టినవాడు, తిరుపతిలో వేద విశ్వవిద్యాల యాన్ని స్థాపించినవాడు, స్వామివారిని కల్యాణ రథాలపై ఆసీనుల్ని చేసి రాష్ట్రం నలుమూలలకీ తీసుకువెళ్ళినవాడు, తిరుమల మాడ వీధులలో పాదరక్షలు ధరించడం నిషేధించినవాడు, శ్రీవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా లడ్డు ప్రసాదాన్ని అందించి నవాడు, ఉచిత పుస్తక ప్రసాదం ఇచ్చినవాడు, అన్నమయ్య జన్మ గ్రామమైన తాళ్ళపాక వద్ద 103 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని ఆవిష్కరించినవాడు ఆ శ్రీరాజ హృదయుడే!
తిరుమలలో ప్రతి పున్నమికీ గరుడసేవ, నిత్యం ఆగని అకుంఠిత హరినామ సంకీర్తనం, అంతర్జాతీయ అన్నమయ్య ఉత్సవాలు, గోవుకు సర్వోన్నత స్థానమిచ్చిన వందే గోమాతం, చంటి బిడ్డల జంటలకు శ్రీవారి తక్షణ దర్శనం, సవ్యాఖ్యాన భారత భాగవతాల ముద్రణ.... ఇలా రోజూ ఓ నూతన కార్యక్రమంతో భక్తులకు శ్రీవారి దర్శనం సులభతరం చేశాడు. శ్రీవారిని భక్తుల ముంగిళ్ళకు తీసుకెళ్ళాడు.
తిరుమలలో కనీవిని ఎరుగని రీతిలో 75 మంది పవిత్ర పీఠాధిపతులతో ‘సనాతన ధర్మ ప్రచార సదస్సులు’ నిర్వహించి ధర్మ శంఖారావాన్ని నలుదిక్కులా వినిపించాడు. హైందవ ధర్మాన్ని నాలుగు పాదాలతో నడిపిన అపర నారాయణుడు ఆయన అంటే అది సర్వ సమ్మతం. తి.తి.దేవస్థానం అప్పటి అధ్యక్షుడిగా ఈ కార్య భారాన్ని నా చేత చేయించి, నన్ను అదృష్టజీవిగా మార్చినవాడు. వైభవమంతా చూశాను. భక్తుల పారవశ్యాన్ని దర్శించాను అంటే అది ఆయన చల్లని దీవెన, నా మీద ఆయనకున్న ప్రేమ.
ఆయన పరిపాలనలో కవులు, కళాకారులు, రచయితలతో సాంస్కృతిక రంగం ఎంత గొప్పగా వెలిగిందో! తిరుపతిలో నాలుగు సంవత్సరాల తెలుగు భాషా బ్రహ్మోత్సవాల వైభవానికి ఆయన సూత్రధారి. శంకరంబాడి సుందరాచార్య, శ్రీకృష్ణదేవరాయలు,ఎం.ఎస్. సుబ్బులక్ష్మి వంటి మహామహుల విగ్రహాలు ఆవిష్కరించింది ఆయనే!
అన్ని రంగాలనూ అభివృద్ధి చేసి, ప్రజలను చల్లగా చూసిన ఆ అయిదేళ్ళూ ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయల పాలనను గుర్తుకు తెచ్చింది, మరిపించింది అని ఎందరో పెద్దలు అన్నారు, అంటు న్నారు. ఆ స్వర్ణయుగ సూత్రధారిని నిత్యం ప్రజలు స్మరించుకుంటూనే ఉన్నారు.
అంతటి మహానాయకుడు, మహానుభావుడు, మహర్షి నాకు హితుడు, సన్నిహితుడు, స్నేహితుడు, గురువు, దైవం కావడం నా పూర్వజన్మ పుణ్యఫలం. ఏ ముహూర్తం కలిపిందో, ఏ తల్లి చల్లని దీవెన ఫలించిందో వైఎస్ ప్రేమ నాకు దక్కింది. ‘కర్ణా’ అని పిలిస్తే కరిగి పోయేవాడిని. అండగా ఆయన కైదండ నా భుజం మీద వేసి నడిపిస్తే విశ్వ విజేతను అయ్యేవాడిని. ఆయన ఆప్యాయతకు మాటరాక మూగబోయేవాడిని. ఆ చిరునవ్వు నన్ను వెలిగించేది. ఆ చూపు నాకు వెలుగిచ్చేది. అది తీరని రుణం, తీర్చలేని రుణం.
పాతికేళ్ళకు పైగా ఉన్న బంధాన్ని, అనుబంధాన్ని నిత్యం ఎదలో స్మరించుకుంటూ, భారమైన కాలంలో, జీవం లేని జీవితం గడుపుతూ, ఆ చల్లని ధవళ దరహాసాన్ని స్మరిస్తూ, జ్ఞాపకాలను దోసిలిలో పట్టుకుని, కలంలో కన్నీళ్ళు నింపుకుని, కడలి అంత ప్రేమను కాసిన్ని అక్షరాలుగా మార్చి అందిస్తున్నా.
రాముడు అవతారం చాలించినా హనుమంతుడు ఉన్నాడు ఆ భక్తిని చాటడం కోసం, వారసుడిని సేవించడం కోసం. వై.ఎస్. ఆశయాలు చాటడానికి, సాధించడానికి ఆయన వారసుని సేవకు ఆ ‘నా దేవుని’ ఆదేశంతో నేను అందుకే కార్యోన్ముఖుణ్ణి. రక్తాశ్రువులతో...
భూమన కరుణాకర రెడ్డి
వ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్