
విశ్లేషణ
ఆన్‌లైన్ గేమింగ్ ప్రోత్సాహక–క్రమబద్ధీ కరణ బిల్లు (2025)కు పార్లమెంట్ ఉభయ సభలు ఇటీవల ఆమోదం తెలిపాయి. రియల్ మనీ గేమింగ్ (ఆర్‌ఎంజీ)ని నిషేధిస్తూ, ఇ–క్రీడలను, సోషల్ గేమ్‌లను ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యం. నగదు పెట్టి ఆడే గేమ్స్ ఆర్‌ఎంజీ కిందకు వస్తాయి. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వర్చ్యువల్ ఆస్తుల మార్గాలలో ఆడేవి కూడా అదే కోవలోకి వస్తాయి.
ఆర్‌ఎంజీ సామాజిక, ఆర్థిక, మానసిక పరంగా ప్రజారోగ్యానికి హాని కలిగిస్తోందని దాన్ని నిషేధించడానికి గల కారణాలలో పేర్కొ న్నారు. ముఖ్యంగా యువత ఆర్థికంగా బడుగు వర్గాలకు చెందిన వారు వాటి బారినపడుతున్నారని తెలిపారు.
పెరుగుతున్న రంగంపై దెబ్బ
ఊహించినట్లుగానే, ఈ బిల్లుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బిల్లు పర్యవసానాలపై ఆదుర్దా సహజంగానే ఆర్‌ఎంజీ ఆటగాళ్ళు, ఉద్యోగులు, ప్లాట్ ఫారమ్ స్థాపకులు, ఈ పరిశ్రమలోని ఇన్వెస్టర్ల నుంచి వ్యక్తమైంది. పన్ను రూపంలో రాబడులున్నా, విదేశీ ఇన్వెస్ట్‌మెంట్ల రూపంలో నిధులు తరలి వస్తున్నా... బేరీజు వేసి చూసినపుడు ప్రజాప్రయోజనాలే ముఖ్యమనిపించాయని ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.
ప్రభుత్వం చెబుతున్న కారణాల్లో కొన్ని లొసుగులున్నాయి. ఈ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఇంచుమించుగా సున్నా. ఇప్పుడిప్పుడే పెట్టుబడులను ఆకర్షిస్తున్న రంగంపైన ప్రభుత్వం విరుచుకుపడటం వింత గొలుపుతోంది. పైగా, ఈ బిల్లుపై చర్చ జరగకుండానే లోక్‌సభ ఆమోదం తెలుపడం గమనార్హం.
ఈ బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపవలసిందని కొందరు రాజ్య సభ సభ్యులు కోరారు. కానీ, అసలు సమస్య మరెక్కడో ఉంది. భారతదేశంలో విధాన నిర్ణయాలు సాధారణంగా రెండు విధాలుగా రూపొందుతున్నాయి. ఒకటి– రాజకీయ నాయకులు వారి నియో జక వర్గాల్లోని ప్రజల అభిప్రాయాలను విని బిల్లులు రూపుదిద్దుకునే టట్లు చేయడం. రెండు – మీడియా కథనాలు. ఇది రెండు సమస్య లను సృష్టిస్తోంది.
కాసేపు మిమ్మల్నే ప్రజా ప్రతినిధిగా ఊహించుకోండి. మీ వద్దకు శుభవార్తలు మోసుకొచ్చే పౌరులు అరుదు. ఉద్యోగం, ఆసుపత్రిలో పడక కేటాయింపు, లేదా తీసుకున్న రుణంలో కొంత రాయితీ ఇవ్వాలని కోరడం వంటి పనులతో వస్తారు. డిజిటల్ సేవలలోని సానుకూల కోణాలను వారి నుంచి వినే అవకాశం తక్కువ. ఉద్యోగాల కల్పన, ఉత్పాదకత, లేదా సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యాన్ని పెంపొందించడానికి సంబంధించిన అంశాలను వారు ప్రస్తావించరు.
సమస్య లోతులు పట్టించుకోకుండా...
కోర్టుల మాదిరిగానే, చట్టసభ సభ్యులు కూడా కష్టనష్టాలు, విషాద ఘటనలపైనే ఎక్కువ శ్రద్ధ పెడతారు. ఆర్‌ఎంజీ వల్ల అప్పుల్లో కూరుకుపోయినవారి, ఆత్మహత్యలు చేసుకున్నవారి కథనాలే వారి దృష్టికి వస్తాయి. అయితే, అటువంటి సమస్యలకు మూలాలు ఇంకా లోతున ఉంటాయి. అలా దెబ్బతిన్నవారిలో చాలా మంది నియమ నిబంధలన్నింటినీ తుంగలో తొక్కే విదేశీ ఆపరేటర్ల చేతిలో బాధితులు.
మూకుమ్మడిగా అన్నింటినీ నిషేధించడం వల్ల ఇక్కడ ఒనగూడగల ప్రయోజనం స్వల్పం. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్లు మళ్ళీ తెరపైకి వస్తారు. నిషేధించిన ఇతర కార్యకలాపాల విషయంలో మాదిరిగానే, ఈ రంగంలో కూడా అనధికారిక, నియంత్రణ లేని మార్కెట్ కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి.
ఆర్‌ఎంజీ వ్యసనం సమస్యను పరిష్కరించేందుకు యాక్సెస్ కంట్రోల్స్ అమలు చేయవచ్చు. తనకు తాను బయటకొచ్చేసే టూల్స్ ప్రవేశపెట్టవచ్చు. అనుమానాస్పద నడతను కనిపెట్టే సదుపాయం కల్పించుకోవచ్చు. రిఫరెల్ హెల్ప్‌లైన్స్‌ను తప్పనిసరి చేయవచ్చు. సకల భారతీయ ఆర్‌ఎంజీ స్టార్టప్‌లను తుడిచిపెట్టేసే బదులు, నిబంధనలను ఖాతరు చేయని సంస్థలపై జరిమానా విధించవచ్చు.
వసూళ్లు కురిపిస్తున్నా...
వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా వచ్చే రాబడులు, ఉపాధి కల్పన సామర్థ్యం అనే రెండు కోణాల నుంచి కూడా ఈ వ్యవహారాన్ని పరిశీలించవచ్చు. విధానాన్ని పన్ను రాబడులు నిర్దేశించకూడదని ప్రభుత్వం చెబుతోంది. ఆదర్శనీయమే! కానీ, ఆన్‌లైన్ గేమింగ్‌కు కొత్త జీఎస్టీ విధానాన్ని వర్తింపజేసినప్పటి నుంచి (2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు) ఆరు నెలల్లో వసూళ్ళ స్థాయి, వృద్ధి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి.
వసూళ్ళు 412% ఎదుగుదలను చూపుతూ రూ. 1,349 కోట్ల నుంచి రూ. 6,909 కోట్లకు పెరి గాయి. ఇవి 2024–25లో 200% పైగా వృద్ధి చెంది రూ. 20,000 కోట్లకు పెరిగాయి. మొత్తంమీది జీఎస్టీ రాబడులలోని 10% వృద్ధితో పోల్చుకుంటే, ఇది ఎంత ఎక్కువ ఉందో చూడవచ్చు. పొగాకు ఉత్పత్తుల ‘పాపపు’ పరిశ్రమ నుంచి ఎంత జీఎస్టీ లభిస్తోందో,అంత మొత్తమూ ఆర్‌ఎంజీ నుంచి కూడా లభిస్తోంది.
ఆన్‌లైన్ గేమ్‌ల వల్ల ఏర్పడుతున్న ఉద్యోగాల సంఖ్య చిన్నదే అయినా గణనీయమైనదే! ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపుగా రెండు లక్షల మందికి ఉపాధి లభిస్తోందని అంచనా. అలాగే ఈ పరిశ్రమకు చెందిన ఒక్కో ఉద్యోగి ద్వారా చేకూరుతున్న ప్రత్యక్ష పన్నులు సుమారు రూ. 10 లక్షల వరకు ఉన్నట్లు మా అంచనా. పొగాకు పరిశ్రమలోని వారి వల్ల ఒక్కొక్కరి నుంచి సుమారు రూ. 1,70,000 మాత్రమే సమకూరుతున్నాయి.
జాతీయ రాజధాని ప్రాంతంలో వీధి కుక్కలను బంధించవల సిందని సుప్రీం కోర్టు ఇటీవల జారీ చేసిన ఆదేశాన్నే చూడండి. వీధి కుక్కలు కరిచినవారి ఫిర్యాదులు, మీడియా కథనాలు, పిటిషన్లపైనే అది ఎక్కువ ఆధారపడినట్లు కనిపించింది. కుక్క కాటుతో రేబిస్ వల్ల మరణిస్తున్న వారి కంటే, దేశంలో పిడుగుపాటు వల్ల మరణి స్తున్న వారి సంఖ్య ఎక్కువ.
పైగా ప్రభుత్వ ఆరోగ్య సదుపాయ కేంద్రాలు చాలా వాటిలో రేబిస్ టీకాల కొరత ఉంది. సమస్యలకు మూలకారణాలను వెతికే బదులు, లక్షణాలను చూసి స్పందించే ధోరణిని ప్రభుత్వం ఇక ముందు కూడా కొనసాగించవచ్చు. సమా జంలోని విభిన్న అవసరాలు, ఆకాంక్షలపై స్పందించే విధంగా భారత్ విధానాలను రూపొందించుకోవాలంటే... ముందుగా అది ‘వినే విధానాన్ని’ సవరించుకోవాలి.
వివాన్ శరణ్
వ్యాసకర్త విధాన నిపుణుడు, ‘వాంక్డ్! ఇండియా ఇన్ సెర్చ్ ఆఫ్ యాన్ ఎకనామిక్ ఐడియాలజీ’ పుస్తక రచయిత
(‘ద మింట్’ సౌజన్యంతో)