
కామెంట్
మన ప్రజాస్వామ్యం ఎన్నో విధాలుగా మనకు గర్వకారణం. అందుకు విరుద్ధంగా భావించడానికి కూడా అన్ని విధాలుగా ఆస్కారం ఉంది. మన వైఫల్యాల జాబితా చిన్నదేం కాదు. గత వారమే ఈ జాబితాలో మరో భయానక వాస్తవం చోటు చేసుకుంది. మన సమష్టి మనస్సాక్షిపై దీని ప్రభావం సంవత్సరాల తరబడి అలా ఉండిపోతుంది. ఇది అంత తేలిగ్గా మానే గాయం కాదు. ఈ అపరాధ భావన మనల్ని మున్ముందు కూడా వేధిస్తూనే ఉంటుంది. దీన్నుంచి బయటపడేందుకు మనం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అంత కష్టపడగలమా? అసలు అలా కష్టపడేందుకు మనం సిద్ధంగా ఉన్నామా? ఇది మరీ ముఖ్యమైన ప్రశ్న.
పన్నెండు మంది(ఇందులో ఒకరు ఇప్పటికే మరణించారు) సాటి పౌరులు వారు. న్యాయం పొందడానికి మీకూ నాకూ ఎంత హక్కు ఉందో... వారికీ అంతే ఉంది. కానీ ఏం జరిగింది? నేరం చేశా రంటూ అభియోగాలు ఎదుర్కొన్నారు. దోషులుగా తొలుత ‘నిరూ పణ’ జరిగింది. 19 సంవత్సరాలు జైల్లో గడిపారు. నిర్దోషులు అయ్యుండీ ‘శిక్ష’ అనుభవించారు. మనం వారిని పట్టించుకోలేదు. వారి దుఃస్థితిని మర్చిపోయాం. వారి ఖర్మకు వారిని వదిలేశాం. నిన్న మొన్న హైకోర్టు తీర్పు వచ్చేవరకూ ఇదే జరిగింది.
చెదిరిన భ్రమలు
ఎట్టకేలకు బాంబే హైకోర్టు తీర్పు వెలువడింది. అప్పుడు గానీ వారు జైలు నుంచి విడుదల కాలేదు. ఇది మనకు సిగ్గుచేటు. ‘‘నిందితుల మీద మోపిన కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైంది. నిందితులు నేరం చేశారని నమ్మడం కష్టం.’’ మనం తలలు దించుకోడానికి ఈ ఒక్క మాట చాలదా? (ఈ తీర్పు మీద ప్రస్తుతానికి సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా, విడుదలైనవారిని తిరిగిజైలుకు రప్పించబోమని వ్యాఖ్యానించింది.)
హైకోర్టు తీర్పు అక్కడే ఆగిపోలేదు. వారిపై మోపిన అభియోగాల నిరూపణ సవ్యంగా, సక్రమంగా జరిగిందని మనం అనుకున్నాం. న్యాయం పట్ల మనం ఎంతో నమ్మకం ఉంచాం. అయితే, మన భ్రమలను ఈ తీర్పు పటాపంచలు చేసింది. ‘‘కేసును మోసపూరితంగా క్లోజ్ చేయడం వల్ల ప్రజల విశ్వాసం దెబ్బ తిన్నది.’’
సరే, ఇప్పుడు మనం ఏం చేయగలం? ఈ పన్నెండు మందికి ఎలా ఊరట కలిగించగలం? అసలు ఈ పని మన వల్ల అవుతుందా? వారు జీవితంలో రెండు దశాబ్దాలు కోల్పోయారు. వాటిని ఎప్పటికీ తిరిగి ఇవ్వలేం. ఇరవై ఏళ్ల పాటు వారిని తల్లితండ్రులకు, పిల్లలకు, కుటుంబానికి, మిత్రులకు దూరం చేశాం. కోల్పోయిన ఆ జీవితం ఎప్పటికైనా తిరిగొస్తుందా? దీనికి ప్రాయశ్చిత్తం ఉంటుందా? నాకు తెలియదు. కానీ మనం ఏదైనా చేయాలి.
క్షమాపణ చెప్పకూడదా?
చేతులు ముడుచుకుని కూర్చోకూడదు. ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి. కాబట్టి ముందుగా మనం క్షమాపణ చెప్పాలి. ఆ క్షమాపణ లోతైనదిగా ఉండాలి. బేషరతుగా చెప్పాలి. దాన్ని బాహాటంగా ప్రకటించాలి. ఇక్కడ మనం అంటే... ఎవరు? అభియోగాలు మోపి, తప్పుడు సాక్ష్యాలతో వారిని ఇరికించిన పోలీసులా? కేసును అన్యాయంగా 20 ఏళ్లు నడిపించిన న్యాయవ్యవస్థ కూడానా? విచారణ ఆరంభ దశలోనే 9 ఏళ్లు గడచిపోయాయి.
తర్వాత హైకోర్టు స్థాయిలో వాద ప్రతివాదాలు వినకుండానే, ఈ కేసు మరో 9 సంవత్సరాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలా పడి ఉంది. గత ఏడాదే కేసులో కదలిక వచ్చింది. వారి సహ పౌరులమైన మనం సైతం పశ్చాత్తాపంతో క్షమాపణలు చెప్పాల్సిన వారిలో ఉంటామా? ఉంటే, ఆ మనం– అంటే మీరు, నేను, ఈ విశాల సమాజం– తరఫున మాట్లాడే వారెవరు? కచ్చితంగా ప్రభుత్వమే కదా? మనం అనుకుంటున్నట్లు ప్రభుత్వంలోని వారు మనకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే, వారి మీదే ఈ బాధ్యత ఉంటుంది.
అయితే, క్షమాపణ సరిపోతుందా? ఇప్పటి వరకూ అనుభవించిన క్షోభను పూర్తిగా తొలగించలేక పోయినా, ఈ చర్య ఆ 12 మంది బాధను కొంతైనా తగ్గిస్తుంది. ఇంకా ఏం చేయగలం? నాతో ప్రతి ఒక్కరూ ఏకీభవిస్తారో లేదో చెప్పలేను కానీ, దీనిపై నాకంటూ స్పష్టంగా ఒక అభిప్రాయం ఉంది. దాన్ని మీతో పంచుకుంటాను. ఏకీభవించాలో లేదో మీరో నిర్ణయించుకోండి. కానీ, ముందు నా అభిప్రాయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి.
కొత్త జీవితానికి ఆర్థిక పరిహారం
ఇతరత్రా ఎలా ఉన్నా ఆర్థికంగా అన్నా ఇబ్బందులు లేకుండా వారు తమ శేష జీవితం సుఖంగా గడిపేలా చూడటం మన బాధ్యత. కాబట్టి ఆ మేరకు వారికి ఆర్థిక పరిహారం అందించాలి. ఇది సరిపోతుందని కాదు. మనం అండగా ఉన్నామని చెప్పడానికైనా ఈ సుహృద్భావ చర్య తోడ్పడుతుంది. సంతోషంగా కొత్త జీవితంలోకి అడుగు పెట్టేందుకు వారికి ఒక అవకాశం ఇద్దాం. బతుకు పుస్తకంలో ఒక పేజీ తిప్పడానికి సరికొత్త అధ్యాయం ప్రారంభించడానికి మనం సహాయపడదాం.
అలా చేస్తామా? మనకు, మన విలువలకు ఇదొక పరీక్ష. వ్యవస్థల కర్కశత్వానికి గురై నలిగిపోయిన సాటి పౌరుల పట్లమనం నిబద్ధతతో ఉండాలి. వారి గురించి ఆందోళన చెందాలి. సమైక్య సమాజంగా, ఒక దేశంగా కొనసాగాలంటే మనం ఇప్పుడే స్పందించాలి. లేనట్లయితే, దెబ్బతింటాం. అద్దంలో చూసుకునే మన ముఖం మన ఒక్కరిదే కాదు, సమష్టిగా మన అందరిదీ! ఆ ప్రతిబింబం ఆహ్లాదకరంగా, భరోసా ఇచ్చేదిగా ఉండాలి. మరోలా కాకుండా అది అలానే ఉండటం మన మీదే ఆధారపడి ఉంది.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్