
పహెల్‌గామ్‌లో 26 మంది సాధారణ పౌరుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదుల దాడి వెనుక ఉన్నది ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్‌ఎఫ్) అని అమెరికా ప్రకటించింది. టీఆర్‌ఎఫ్‌ను విదేశీ ఉగ్రసంస్థగా, గ్లోబల్ టెర్రరిస్ట్‌గా తాము పరిగణిస్తున్నట్టు అమెరికా ప్రకటిస్తూ... అది లష్కరే తోయిబా సోదర సంస్థ అనీ, దాని మరో రూపమే టీఆర్‌ఎఫ్ అనీ, లష్కరే తోయిబా కనుసన్నల్లో విదేశాలలో పరోక్ష యుద్ధం చేసే సంస్థ అనీ యూఎస్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ‘ఈ చర్య... పహెల్‌గామ్ దాడికి తగిన న్యాయం చెయ్యడంలో అధ్యక్షుడు ట్రంప్ నిబద్ధతను వెల్లడిస్తోంది’ అని ఆ శాఖ వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇవాళ అమెరికా టీఆర్‌ఎఫ్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌గా ప్రకటించడం అంటే... ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు భారత్ చేస్తున్న విజ్ఞప్తులకు అంతర్జాతీయ ఆమోదం, సహకారం లభించడానికి మార్గం సుగమం అయ్యిందని అర్థం.
మన దేశం ఐక్యరాజ్యసమితి భద్రతాసమితి 1267 తీర్మానాన్ని అనుసరించి టీఆర్‌ఎఫ్‌ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా గుర్తించేలా చేయడానికీ, తద్వారా దానిపై ఆంక్షలు అమలు జరిపేలా చూడటానికీ అమెరికా ప్రకటనను ఉపయోగించుకోవచ్చు.
దీంతో టీఆర్‌ఎఫ్ ఆగడాలకు కొంతవరకు అడ్డుకట్టపడే అవకాశం ఉంది. దానికి అందే నిధులు తగ్గిపోతాయి. ఇటీవలి కాలంలో భారత్‌కు లభించిన అతి పెద్ద దౌత్య విజయంగా నిపుణులు ఈ నిషేధాన్ని అభివర్ణిస్తున్నారు.
అయితే తమ మనుగడకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఉగ్రవాద సంస్థలు పేర్లు మార్చుకుని తమ కార్యకలాపాలను యథాతథంగా నిర్వహించడం కొత్తకాదు. భావ సారూప్యం కలిగిన వివిధ రకాల వ్యక్తుల సహకారం రహస్యంగా అందుతున్నంత కాలం ఉగ్రసంస్థలను అంతమొందించడం సాధ్యం కాదు.
ఈ మధ్యనే రాయచోటిలో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో కొందరు వ్యక్తులను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చెయ్యడం మనం చూశాం. వాళ్లు దశాబ్దాలుగా అదే ఊర్లో నివసిస్తున్నారు. వ్యాపారాలు చేస్తున్నారు. పైకి మామూలుగానే కనిపిస్తున్నారు. కానీ వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు నిర్ఘాంతపోయే రీతిలో అక్కడ పేలుడు పదార్థాలు, తీవ్రవాద సాహిత్యం, తుపాకులు దొరికాయి.
ఇటువంటివాళ్లను గుర్తించటం అంత తేలికేమీ కాదు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా నిషేధం ఉన్నంత మాత్రాన, అమెరికా ఇవాళ కొత్తగా ఆ సంస్థను గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌గా ప్రకటించినంతమాత్రాన అలాంటి కార్యకలాపాలు రాత్రికి రాత్రే ఆగిపోతాయి అనుకోవటం ఒట్టి భ్రమ.
మరొక గమనార్హమైన సంగతేమిటంటే అమెరికాను నమ్మదగిన దేశంగా భావించలేకపోవడం. ముఖ్యంగా ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఎప్పుడు మాట మారుస్తుందో చెప్పలేం. యూఎస్ ఎయిడ్ (యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్) సంస్థ భారతదేశంలో ప్రభుత్వాలను అస్థిరపరచడానికీ, తప్పుడు కథనాలను వ్యాపింపజేసేందుకు మీడియా సంస్థలను ప్రోత్సహించడానికీ నిధులను వెచ్చించిందనే సమాచారం ఉండనే ఉంది.
అంతేకాదు, యూఎస్ ఎయిడ్ సంస్థ, నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఆర్థిక విభాగం ఫతా–ఎ–ఇన్సానియత్ (ఎఫ్‌ఈఐ)కు నిధులు సమకూర్చిందన్న సంగతి కూడా ఆ మధ్య వెలుగు చూసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో టీచర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కోసం యూఎస్ ఎయిడ్ సంస్థ 7.5 కోట్ల డాలర్లను ఖర్చుచేస్తోంది.
ఈ నిధుల్లో ఎక్కువ భాగం వివిధ మార్గాల్లో లష్కరే తోయిబాకి చేరుతున్నాయనేదీ ఒక విమర్శ. పహెల్‌గామ్ దాడి తర్వాత అమెరికా స్పందించాల్సినంత తీవ్రంగా స్పందించకపోవడం, ఆ తర్వాత కొన్ని రోజులకే పాక్ అత్యున్నత సైనికాధికారిని అధ్యక్ష భవనానికి విందుకు ఆహ్వానించి పొగడ్తలతో ముంచెత్తడం వంటి పరిణామాలను గమనించినప్పుడు అమెరికాను నమ్మవచ్చా అనే ప్రశ్న తలెత్తక మానదు.
– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి
యూట్యూబర్