
విశ్లేషణ
క్రమం తప్పకుండా జరుగుతున్న భారీ ఉగ్ర వాద దాడులు భారత్, పాకిస్తాన్ సంబంధాలను ఘోరంగా దెబ్బతీశాయి. సాధారణంగా, ప్రతి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పదవీకాలంలో కనీసం ఒక్కసారైనా ఇలాంటి దాడులు జరుగుతాయి. ఎక్కువకాలం సైనిక నాయకత్వ స్థానంలో ఉన్న వ్యక్తి, పౌర అధికారంపై మరింతగా నియంత్రణ సాధించాల్సిన అవసరం ఉందని భావించినప్పుడు లేదా అతని బలగాలు దేశంలో గౌరవాన్ని కోల్పోతున్నప్పుడు ఉగ్రవాద దాడులు చోటు చేసుకుంటాయి.
భారతదేశం నుండి సైనిక ముప్పు ఉందన్న ప్రచారం కంటే పాకిస్తాన్ ప్రజలను మరేదీ కలిపి ఉంచదు. పైగా వరదలు, కరవులు, ఉగ్రవాద ఘటనలతో సహా పాకిస్తాన్ లో జరిగే ప్రతిదానికీ భారతదేశంపైనే నిందలు మోపుతూ వస్తారు.
భారతదేశం మన పాకిస్తాన్‌ను నాలుగు ముక్కలు చేయాలని చూస్తోందనీ, దాన్ని రక్షించే ఏౖకైక శక్తి పాక్ సైన్యమే అనీ పాక్ ప్రజలకు తొలి నుంచీ నేర్పించారు. భారత్ సహన పరిమితిని దాటిన ప్రతి ఉగ్రవాద ఘటన తర్వాత, పాకిస్తాన్ సాధారణ వ్యాఖ్యలను పునరావృతం చేస్తుంటుంది. వారి మంత్రులు దీనిని భారతదేశం ప్రారంభించిన ‘తప్పుడు’ ఆపరేషన్ అని, లేదంటే ఇది కశ్మీర్ ‘స్వాతంత్య్ర సమరయోధుల’ పని అని గావుకేకలు పెడతారు.
తమ గడ్డపైనే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నామనే ఆరోపణను వారు నిరంతరం తిరస్కరిస్తారు. పైగా ఉగ్రవాదానికి అత్యంత ప్రభావి తమైన దేశం తమదే అని వాపోతుంటారు. అయితే దాదాపు ప్రతి ప్రపంచ స్థాయి ఉగ్రవాద ఘటనకూ పాకిస్తాన్‌తో సంబంధం ఉందనీ, ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాదులలో అత్యధికులు పాక్‌లోనే ఆశ్రయం పొందారనీ ప్రపంచానికి తెలుసు.
ఎన్నని సహిస్తాం?
కథ పునరావృతమవుతుంది. పైగా విసుగు పుట్టిస్తుంది. బహిరంగ అంతర్జాతీయ దర్యాప్తునకు పాక్ వైపు నుంచి ఎప్పుడూ హామీ ఉంటుంది, కానీ ఈ ప్రతిపాదనను ఎవరూ నమ్మరు. ముంబై ఉగ్ర దాడి సూత్రధారులలో ఒకరైన తహవ్వుర్ రానాను అమెరికా ఇటీవలే భారతదేశానికి అప్పగించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కూడా ముంబై ఉగ్రవాద దాడులపై ఇంకా దర్యాప్తు చేయవలసి వస్తోంది. ఉగ్రవాద నాయకులపై పాకిస్తాన్ ఎప్పటికీ చర్య తీసు కోదు. ఎందుకంటే వారే పాక్ ప్రధాన ఆస్తులు.
పహల్‌గామ్ ఉగ్ర దాడిపై దర్యాప్తు కూడా దశాబ్దాలుగా నిగూఢంగా ఉండిపోతుంది. దావూద్ ఇబ్రహీమ్ ఉనికిని అది ఎల్లప్పుడూ ఖండిస్తూ వచ్చింది. అయినప్పటికీ ప్రతి ప్రపంచ సంస్థకూ పాకిస్తాన్ లో అతని బహుళ నివాసాల గురించి తెలుసు. దీనికి విరుద్ధంగా, ప్రతీకారం తీర్చు కుంటామని ఇండియా బెదిరిస్తే, వారు అకస్మాత్తుగా తమ భూ భాగంపై ఉగ్రవాద కార్యకలాపాలలో భారతదేశ ప్రమేయం ఉందని ఇష్టారాజ్యంగా అబద్ధాలాడతారు.
ప్రజల మద్దతు పొందాలనే ఆశతో, సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడంపై భారతదేశాన్ని పాక్ బెదిరించడం ప్రారంభించింది. దాని ఆనకట్టలు భారతీయ రక్తంతో నిండిపోతా యని రెచ్చ గొట్టేంత వరకు వెళ్ళింది. చరిత్ర గమనిస్తే, భారత ప్రభు త్వాలు రావల్పిండిని నియంత్రించడంపై ప్రపంచ మద్దతు కోరుతూ పాకిస్తాన్ ఉగ్రవాద దాడులపై తీవ్ర విమర్శ చేస్తూ వచ్చాయి. కానీ అది ఎప్పుడూ పని చేయలేదు. దీనికి విరుద్ధంగా, తరచుగా విరామాలతో కూడిన ఉగ్రవాద దాడులకు పాక్ తలుపులు తీసింది.
2001 అక్టోబర్‌లో జమ్మూ–కశ్మీర్ శాసనసభపై దాడి, ఆ తర్వాత అదే సంవత్సరం డిసెంబర్‌లో పార్లమెంటుపై దాడి, 2002 సెప్టెంబర్‌లో అక్షరధామ్‌పై దాడి, 2003 ఆగస్టులో ముంబై బాంబు దాడులు, ఆ తర్వాత 2005 అక్టోబర్‌లో ఢిల్లీలో బహుళ బాంబు దాడులు, 2006 జూలైలో ముంబై రైలు దాడులు, 2008 నవంబర్‌లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడి కొన్ని ఉదాహరణలు.
బాలాకోట్‌పై జరిగిన దాడి తర్వాత మాత్రమే భారత్ సందేశం అంతటా వినిపించింది. కానీ సరిహద్దులు దాటి భారత్ చేసిన బాలాకోట్ సర్జికల్ దాడి కూడా పాకిస్తాన్‌ను నిరోధించడంలో విఫలమైంది. ఎందుకంటే భారత్ దాడిలో సంభవించిన ప్రాణనష్టాన్ని పాక్ దాచగలిగింది. కారణం... హతమార్చబడిన వారు ఉగ్రవాదులు!
పెద్ద మార్పు ఉండదు!
సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేసిన ప్రభావం ఇస్లామాబాద్‌కు బాగా తెలుసు. వారి నాయకత్వాన్ని అది భయ పెట్టింది. కానీ, ఇది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని చెప్పడం తప్ప వారికి వేరే పరిష్కారం లేదు. భారతదేశం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని వారు ఇక ఒప్పించలేరు. రెండు దేశాల మధ్య సంబంధాలు శాంతియుతంగా ఉండాలనే ముందస్తు షరతు పైనే ఈ ఒప్పందంపై సంతకం చేశారనేది వాస్తవం.
మరోవైపున అఫ్గానిస్తాన్‌కు భారతదేశం సన్నిహితం కావడం పాకిస్తాన్‌లో ఆందోళనలను మరింత పెంచింది. ముఖ్యంగా పాకిస్తాన్ తన బలగాలను భారత సరిహద్దుకు తరలించినప్పుడల్లా బలోచ్ లిబరేషన్ ఆర్మీ, తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్తాన్ ఈ అంతరాన్ని బాగా ఉపయోగించు కుంటాయి. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంట పాకి స్తాన్ తన సైన్యాన్ని మోహరించి ఉంచినంత కాలం, వారి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
అయితే భారత్ ఎదుర్కొంటున్న సమస్య ఏమిటంటే, అది ఏ సైనిక చర్య తీసుకున్నా, పెద్దగా మార్పు ఉండదు. పాక్‌లో కొత్త ఆర్మీ చీఫ్ వచ్చి తనవంతుగా ఏదైనా చేయాలని భావించే వరకు, పాకిస్తాన్ ఉగ్రవాదానికి తక్కువ స్థాయిలో మద్దతు ఇస్తూనే ఉంటుంది. తర్వాత, మరొక ఘటన జరుగుతుంది. కథ పునరావృతమవుతూ ఉంటుంది.
పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదం నుండి భారతదేశాన్ని రక్షించడానికి ఏకైక పరిష్కారం దాని బాల్కనైజేషన్ మాత్రమే (అంటే ఒక దేశం లేదా ప్రాంతాన్ని బహుళ చిన్న, శత్రు యూనిట్లుగా విభజించే ప్రక్రియ). దీని కోసం, పాకిస్తాన్ నుండి స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సమూహాలకు భారతదేశం తన మద్దతును ఇవ్వాలి.
హర్ష కక్కడ్
వ్యాసకర్త భారత సైన్యంలో రిటైర్డ్ మేజర్ జనరల్
(‘ద స్టేట్స్‌మన్’ సౌజన్యంతో)