
విశ్లేషణ
ఇరుదేశాల మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు కాల్పుల విరమణ ఒప్పందంతో కొంతలో కొంత చల్లబడినప్పటికీ, దక్షిణాసియా అభివృద్ధికి శాశ్వత శాంతి నెలకొనాల్సి ఉంది. దీనికి కావాల్సిన రాజకీయ నాయకత్వ కొరత ఉందన్నది కాదన లేని నిజం. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుండి ఉత్పన్నమయ్యే సీమాంతర ఉగ్రవాద దాడులపై తాను ఎలా స్పందిస్తాను అనే అంశాన్ని భారతదేశం సరికొత్తగా నిర్వచించింది. సింపుల్‌గా చెప్పాలంటే భారత్ తిరిగి దాడి చేస్తుంది. దీని ప్రకారమే భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని వివిధ లక్ష్యాలను గురి చూసి కొట్టి తన పనిని పూర్తి చేసింది.
పహెల్‌గామ్‌లో జరిగిన దారుణమైన, విషాదకరమైన, మత తత్వ ఉగ్రవాద దాడులకు ప్రతిస్పందనగా, భారతదేశం పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను మాత్రమే కాకుండా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై కూడా దాడి చేసింది. పాకిస్తాన్‌పై ఒత్తిడి తేవడానికి అవసరమైన వరుస చర్యలను చేపట్టడం ద్వారా భారత్ ముందడుగువేసింది. దీనిపై రాజకీయ పరంగా దేశంలో విస్తృత స్థాయిలో ఐక్యత ఏర్పడింది.
కొత్త యుగానికి నాంది పలకాలి!
అయితే, భారతదేశమైనా, పాకిస్తాన్ అయినా తమను తాము తీవ్రంగా గాయపరచుకోకుండా పూర్తి స్థాయి సైనిక యుద్ధాన్ని చేపట్టలేవని, చేపట్టినా దాన్ని కొనసాగించలేవని అన్ని పక్షాలకూ స్పష్టంగా తెలిసిపోయి ఉండాలి. ఇరుదేశాల మధ్య యుద్ధంలో ఓడిపోయిన వారు వాస్తవానికి– భారత్, పాక్ ప్రజలే! ఒక పక్షాన్ని మరొక పక్షం అనుమానించిన ప్రతిసారీ ఈ రెండు దేశాలూ పరస్పర దాడులకు పాల్పడతాయనే అభిప్రాయం ఇప్పుడు స్థిరపడింది.
తన భూభాగంలో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై జరిగిన దాడిలో 25 మంది మరణించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, పహెల్‌గామ్ ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ కార ణాన్ని వివరించింది. అంతర్జాతీయ సమాజం ప్రతిస్పందనలను పరి శీలిస్తే కొన్ని దేశాలు మాత్రమే ఒక పక్షం కథనాన్ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నాయి. సంఘటనలపై భారతీయ కథనానికి ఎక్కువ మంది మద్దతుదారులు ఉన్నప్పటికీ, పాకిస్తాన్ కూడా తనదైన మద్దతుదారులను కూడగట్టింది.
రెండు దేశాల ముందు ఉన్న సవాలు, నిజానికి భారత ఉపఖండం అంతటా ఇప్పుడు ఉన్న సవాలు – గత శతాబ్దంలో ఉనికిలోకి వచ్చిన అనేక దేశాలు కూడా ప్రాంతీయ, దేశీయ శాంతికి, అభివృద్ధికి చెందిన కొత్త యుగానికి నాంది పలికే నాయకత్వాన్ని కనుగొనడమే! విచార కరంగా, దక్షిణాసియాలో అలాంటి రాజకీయ నాయకత్వ కొరత ఉంది. వలసవాదం నుండి విముక్తి పొందినప్పటి నుండి ఈ ప్రాంతం స్వీయ చరిత్ర, భౌగోళిక పరిస్థితులు, గత చరిత్రలతో అంతర్గత పోరాటాల కారణంగా వెనుకబడి ఉంది.
పొరుగు సంబంధాలు కీలకం
దక్షిణాసియా విషాదం ఏమిటంటే, ఈ ప్రాంతంలోని పలు దేశాలలో చాలా మందికి తమ బండిని ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకు తీసుకెళ్లవచ్చుననీ, పొరుగువారితో సంబంధాలను మెరుగు పర్చుకోకుండానే అభివృద్ధిని కొనసాగించవచ్చుననీ నమ్మకం ఉంది. గత పావు శతాబ్దంలో భారతదేశపు విశ్వసనీయ ఆర్థిక పనితీరు, తన పొరుగువారితో ప్రబలంగా ఉన్న వివాదాలను పరిష్కరించకుండానే ఎదగడాన్ని భారత్ కొనసాగించగలదని చాలా మంది నమ్మేలా చేసింది. కొంతవరకు, అది సాధ్యమైంది. అయితే, భారతదేశం దీర్ఘకా లిక యుద్ధంలోకి లాగబడితే అది కూడా ఆర్థికంగా దెబ్బతింటుంది.
చెలరేగిన ఘర్షణ వాతావరణపు దుమ్ము కాస్తా అణిగి, ‘యుద్ధం పొగమంచు’ నుండి బయటపడిన తర్వాత, రెండు దేశాలలోని రాజకీయ నాయకత్వం ప్రాంతీయ భద్రత అంటే ఏమిటో సుదీర్ఘంగా పరిశీలించాలి. స్థిరమైన ఆర్థిక అభివృద్ధి కోసం ప్రాంతీయ వాతావ రణాన్ని తప్పకుండా నిర్వచించాలి. భూభాగం గురించిన నిరంతర వివాదాల ద్వారా ఎవరి ప్రయోజనాలు నెరవేరుతాయి? ప్రతి దేశంలోనూ, ప్రాంతం అంతటా మతపరమైన ప్రాంతీయ విభజనల నుండి ఎవరు ప్రయోజనం పొందుతారు?
సరిహద్దుకు ఇరువైపులా గొప్ప వ్యూహకర్తల జ్ఞానం ఉన్నప్పటికీ, నేడు ఏ పక్షమూ ప్రాంతీయ శాంతి, భద్రత కోసం కొత్త చట్రాన్ని నిర్వచించలేకపోయింది. ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2000–2007 కాలంలో చివరిసారిగా ఒక ప్రయత్నం జరిగింది. పాకిస్తాన్ అధ్య క్షుడు పర్వేజ్ ముషారఫ్ కొంతకాలం వారి చొరవతో ముందుకు సాగారు. కానీ ఆయన త్వరలోనే పదవీచ్యుతుడయ్యారు. అప్పటి నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం శాంతి భద్రతలకు సంబంధించి ‘మన్మోహన్ – ముషారఫ్’ ఫార్ములాను తిరస్కరించింది.
ఈ రోజు ఆ ఫార్ములా గురించి ప్రస్తావిస్తే ఎగతాళి చేస్తున్నారు. అయినా సరే... దీనిని తప్పక ప్రస్తావించాలి. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి సిద్ధంగా ఉంది. జపాన్‌ను అధిగమించింది. స్వదేశంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, భారత వృద్ధి ప్రక్రియలో లోపాలు ఉన్నప్పటికీ, భారతదేశం అభివృద్ధి చెందడం కొనసాగించడానికీ, ప్రపంచాన్ని అనుకూలమైన నిబంధనలతో నిమగ్నం చేయడానికీ తప్పక అవకాశం ఉంది.
నియంత్రణ రేఖే సరిహద్దు
భారతదేశం తన సొంత పొరుగు ప్రాంతాన్ని సురక్షితం చేసుకోకుండా అలా చేయగలదని భావించడం చాలా మంది సమకాలీన విశ్లేషకులు, వ్యూహకర్తల ఊహ మాత్రమే! భారత్ పొరుగు దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక భారతదేశానికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే, వారు భారత్ నుండి ఎటువంటి ప్రయో జనాలనూ పొందకపోతే ఈ వృద్ధి వ్యయాలు పెరుగుతాయి. మోదీ ప్రభుత్వం పాటించిన గత దశాబ్దపు భారత విధానం ఏమిటంటే, కష్టాల్లో ఉన్న పొరుగువారిపై భారీ ఖర్చులను విధించడమే. ఇది స్వల్పకాలిక ప్రయోజనాలను అందించవచ్చు కానీ దాని పర్యవస నాలు భారత్ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మేము పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని భారత్ ప్రదర్శించే రాజకీయ ధైర్యం, కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడం గురించిన పాకిస్తాన్ వాక్చాతుర్యానికి చెల్లిపోతుంది. కానీ రెండూ ఎప్పటికీ జరగవు! సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్, మన్మో హన్–ముషారఫ్ ఫార్ములా ముఖ్య ఉద్దేశ్యం అదే! అన్ని ప్రధాన శక్తులు – అమెరికా, రష్యా, చైనా – నియంత్రణ రేఖ వాస్తవానికి అంతర్జాతీయ సరిహద్దు అనే ఆలోచనను సమర్థించాయి. నేడు రెండు దేశాలలోని ప్రముఖులు అలాంటి పరిష్కారాన్ని తిరస్కరిస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో వాస్తవికత నుండి తప్పించుకునే అవకాశం లేదనీ, ఈ వాస్తవికత అందరికీ పెనుభారంగా మారవచ్చనీ ఇరువైపులా ఉన్న వాస్తవికవాదులకు తెలుసు.
సంజయ బారు
వ్యాసకర్త సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ వ్యవస్థాపకుడు,
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు