
అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ తన స్వరాన్ని గట్టిగా వినిపించాలి. పొరుగు దేశానికి భూగోళం, చరిత్ర, అర్థశాస్త్రాలకు సంబంధించిన దిమ్మతిరిగే గుణపాఠాలు చెప్పాలి. పక్క దేశం హింస, నేరం, రక్తపాతాలను తనకు ఎగుమతి చేస్తూ ఉంటే ఏ దేశం కూడా మౌనంగా చూస్తూ ఉండి పోలేదు.
మొదటగా పాకిస్తాన్‌ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాలి. ఆ దెబ్బ దాని ఆర్థిక నవనాడులూ కుంగిపోయేలా ఉండాలి. దేశ ఆర్థిక వ్యవస్థే టెర్రర్ నెట్‌వర్క్‌కు వెన్నెముక లాంటిది. పాకిస్తాన్ పెంచి పోషించే టెర్రరిస్టులకూ ఇది వర్తిస్తుంది. యూరోపియన్ యూనియన్ పాక్‌తో సహా కొన్ని దేశాలకు వాణిజ్య రంగంలో ప్రత్యేక ప్రాధాన్య హోదా కల్పించింది. అలాగే, టెర్రరిజాన్ని ప్రోత్సహించే దేశాలను శిక్షించడానికి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) ఉంది.
అలాంటి దేశాలను గుర్తించి ‘గ్రే లిస్ట్’ అనే జాబితా తయారు చేస్తుంది. ఇందులో చేర్చిన దేశాలకు ఆర్థిక సాయం నిలిపి వేస్తారు. పాక్‌ను గ్రే లిçస్టులో చేర్చేలా ఒత్తిడి చేసి దానికి వాణిజ్య రాయితీలు అందకుండా చేయాలి. అసలైన పీడ మరొకటి ఉంది. దీన్ని వదిలించడా నికి యూఎన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ ఆఫీస్ (యూఎన్‌ఓడీసీ) నివేదికలను ఉపయోగించుకోవాలి. ఈ సంస్థ అధ్యయనం ప్రకారం, హెరాయిన్ తయారీకి అవసరమైన ముడి సరుకు (ఓపియం)లో 90 శాతం అఫ్గానిస్తాన్ నుంచి సరఫరా అవుతోంది.
పాక్ సైనిక గూఢచారి వ్యవస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజన్స్ (ఐఎస్‌ఐ) ఈ ఓపీయంను దిగుమతి చేసుకుని దాన్నుంచి హెరాయిన్ తయారు చేయిస్తోంది. ఈ మాదక ద్రవ్యాన్ని దొంగచాటుగా మత్తుబానిసలకు సరఫరా చేసి సంపాదించి నెత్తుటి సొమ్ము ఆర్జిస్తోంది. దీంతో టెర్రరిస్టు లను పెంచి పోషిస్తోంది. ఇండియా ముందుగా ఈ మాదకద్రవ్య చీకటి సామ్రాజ్యాన్ని సర్వ శక్తులూ ఒడ్డి ఛిన్నాభిన్నం చేయాలి. అప్పుడే ఐఎస్‌ఐ టెర్రర్ రాకాసి ఊపిరాడక చస్తుంది.
పాక్‌ను నలుదిక్కులా చిక్కుల్లో పడేయాలి. ఒక వంక డ్యురాండ్ లైన్ సరిహద్దులో అఫ్గానిస్తాన్‌తో చారిత్రక వైరం నడుస్తోంది. ఒకప్పుడు తనే పెంచిన తాలిబన్ బిడ్డలు ఇప్పుడు దానికి చుక్కలు చూపిస్తున్నారు. ఇండియా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అఫ్గానిస్తాన్‌తో సంబంధాలు పెంచుకోవాలి.
నమ్మకమైన తృతీయ పక్షాల సహకారంతో తాలిబన్ వర్గాలను దువ్వాలి. ఈ సమస్య మీద పాక్‌లో చీలికలు పెంచాలి. ఐఎస్‌ఐ మద్దతు పొందు తున్న హక్కానీ నెట్‌వర్క్‌ను ఏకాకిని చెయ్యాలి. తద్వారా పాక్ బీజం వేసిన మహావృక్షం దాని మీదే విరిగి పడేట్లు చెయ్యాలి. బలూచిస్తాన్ లోనూ ఇరాన్ సహకారంతో ఇదే విధంగా వ్యవహారం నడపాలి.
ప్రపంచ వేదిక మీద పాకిస్తాన్ నిజరూపం బయట పెట్టాలి. తీవ్రవాద మూలాలను తుదముట్టించేందుకు ఐరాస భద్రతా మండలి తీర్మానాల (1267, 1373) కింద పాక్‌ను దోషిగా నిలబెట్టాలి. ఈ దిశగా మనం మరింత గట్టిగా ప్రయత్నించాలి. ఇండియా, పాకిస్తాన్‌లలో ఉన్న ఐరాస మిలటరీ అబ్జర్వర్ గ్రూపునకు ఇంటి దారి చూపెట్టాలి.
స్వదేశంలోనూ పాకిస్తాన్ క్రూరత్వానికి హద్దు ల్లేకుండా పోయాయి. హజారాలు, అహ్మదీయులు వంటి జాతులు, కులాల వారి పరిస్థితి మెడ మీద కత్తిలా ఉంది. ఏకపక్ష నిర్బంధాలతో మగ్గిపోతున్నారు. పహల్‌గామ్ ఊచ కోతకు ముందు, తర్వాత కూడా వీరంతా ఇండియాతో భుజం భుజం కలిపి పనిచేస్తున్నారు. ఈ వర్గాలకూ అలాగే చైనాలోని ఉయిగర్లకూ మనం నైతికపరంగా, దౌత్యపరంగా ఆపన్నహస్తం అందించాలి.
పాకిస్తాన్, టర్కీ, మలేసియాల దుష్టత్రయం అపవిత్ర కూటమిగా ఏర్పడటంతో మనకు ప్రమాదం పెరిగింది. ఈ దేశాలు ఉమ్మా (ముస్లిం ప్రపంచం) రక్షకులుగా చెప్పుకుంటూ ఒకప్పుడు ఆర్మేనియాలో సాగించిన మారణహోమం, గ్రీకులు, అస్సిరియా ప్రజలపై జరిపిన హింసాకాండలు వీటి రక్త చరిత్రకు ఆనవాళ్లు. ఇప్పుడివి కశ్మీరు ప్రజల మీద తెగబడే సాహసం చేస్తున్నాయి.
ఇలా ఉండగా, సౌదీ అరేబియా దాని మిత్రదేశాలు ఇండియాకు వ్యూహాత్మక, సాంస్కృతిక భాగస్వాములుగా ఆవిర్భవించాయి. మనం కూడలిలో తటస్థంగా నిలబడితే కుదరదు. చొరవ తీసుకోవాలి. వాషింగ్టన్‌లో హాలోకాస్ట్ మ్యూజియం, యెరెవన్‌లో ఆర్మేనియన్ జినోసైడ్ మ్యూజి యంలు నిర్మించినట్లు... ఇండియా ఇప్పటికైనా కళ్లు తెరిచి శ్రీనగర్‌లో టెర్రర్ మ్యూజియం ఏర్పాటు చేయాలి. జిహాద్ పేరిట దశాబ్దాల తరబడిగా పాకిస్తాన్ సాగిస్తున్న ఊచకోత లకు అది సజీవ స్మారకంగా నిలవాలి.
పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్–బాల్టిస్తాన్‌లలో నినదించే అసమ్మతి స్వరాలతో ఇండియా గొంతు కలపాలి. పంజాబీ ఆధిపత్య పాక్ సైనికాధికారులు వెంటాడి తరిమికొట్టిన ఇతర ప్రాంతాల వారికి ప్రవాస ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకునేందుకు మనం సహాయం చేయాలి. 1950లలో టిబెట్ ప్రవాస ప్రభుత్వం ఏర్పాటుకు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పునాది వేయగలిగినప్పుడు, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయన అడుగుజాడల్లో ఎందుకు నడవలేదు? తప్పకుండా నడవగలదు.
చివరగా ఇండియా డిజిటల్ యోధులను రంగంలోకి దించి తీరాలి. మనం మానవ మేధలో అగ్రగణ్యులం. అలాగే సాంకేతిక మేధలో అంతకంటే అత్యుత్తమ స్థానంలో ఉంటాం. డిజిటల్ స్ట్రయిక్స్ చేయాల్సిన అవసరం కూడా ఇప్పుడుంది. బుల్లెట్ పేల్చకుండానే శత్రు దేశ మౌలిక సదు పాయాలను నిర్వీర్వం చేయగలం. మిలిటరీ రహస్యాలు లీక్ చేయగలం. వ్యతిరేక కథనాలను తిప్పికొట్టగలం. డిజిటల్ యుద్ధం నేటి ఆధునిక తంత్రం. టెర్రరిజం సరిహద్దులను దాటినప్పుడు, దాని పర్యవసానాలూ అలాగే ప్రయాణించాలి.
మనుగడ, ఆధిపత్యం కోసం జరుగుతున్న దీర్ఘకాలిక చదరంగ క్రీడ ఇది! ఇండియా ఈ ఆటలో మూడు ఎత్తులు ముందుగా ఆలోచించి తీరాలి. మనం డిఫెన్స్ మాత్రమే ఆడితే కుదరదు. నివ్వెరపోయేలా సాహసోపేతమైన మరిన్ని త్రివిధ దళాల దాడులకు రూపకల్పన చేయాలి. ఇన్నాళ్ళూ మన సహనాన్ని నిష్క్రియాపరత్వంగా పాకిస్తాన్ పొరబ డుతూ వచ్చింది. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరమూ మనం బహుముఖ వ్యూహాలతో దూకుడు చూపాలి. మార్పు తరంగాలను అలా చూస్తూ ఉండిపోయే వారిపట్ల చరిత్ర ఎప్పుడూ కనికరం చూపించదు. తుపాను మీద స్వారీ చేస్తూ తీరరేఖను మార్చగలిగే వారికే అది ప్రతిఫలం చేకూర్చుతుంది!
– అభిషేక్ మను సింఘ్వీ, పార్లమెంట్ సభ్యులు
– ఆకాశ్ కుమార్ సింగ్, జేఎన్‌యూ జాతీయ భద్రతా అధ్యయనాల ప్రత్యేక కేంద్రంలో పీహెచ్‌డీ స్కాలర్