
రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలు.. ప్రపంచం కోసం కలిసి కట్టుగా ముందుకు సాగాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేయగా.. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మోదీ తన ఎక్స్ ఖాతాలో(Modi Diwali Reply To Trump) ఓ ట్వీట్ చేశారు.
దీపావళి సందర్భంగా భారత ప్రధాని మోదీతో మాట్లాడినట్లు ట్రంప్(Trump Diwali Wishes) చెప్పిన సంగతి తెలిసిందే. ప్రపంచ వాణిజ్యం సహా పలు అంశాలు తమ మధ్య చర్చకు వచ్చినట్లు చెప్పారాయన. ఈ క్రమంలో థ్యాంక్యూ చెబుతూ మోదీ బుధవారం ఉదయం ఓ ట్వీట్ చేశారు.
వెలుగుల పండుగ పూట(Diwali).. ఈ రెండు ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచానికి ఆశాకిరణాలు ప్రసరింపజేస్తూ ముందుకు సాగాలి. ముఖ్యంగా.. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలి అని మోదీ ట్వీట్ చేశారు.
Thank you, President Trump, for your phone call and warm Diwali greetings. On this festival of lights, may our two great democracies continue to illuminate the world with hope and stand united against terrorism in all its forms.@realDonaldTrump @POTUS
— Narendra Modi (@narendramodi) October 22, 2025
పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ ఈ ఏడాది మే మొదటి వారంలో ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఆ సమయంలో ఇరు దేశాల ఉద్రిక్తతలను తానే ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించుకుంటూ వస్తున్నారు. అయితే కాల్పుల విరమణలో ఆయన ప్రమేయాన్ని భారత్ మాత్రం ఖండిస్తూ వస్తోంది.
మరోవైపు.. పాక్ మాత్రం ట్రంప్ చెప్పిందే నిజమని, ఆయన చొరవతోనే యుద్ధం ఆగిందని, అందుకే ఆయన్ని నోబెల్ శాంతి బహుమతికి నామినేటె్ చేశామని అంటోంది. ఈ క్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘గాజా శాంతి సదస్సు’లో ప్రసంగిస్తూ ట్రంప్ భజనకు దిగగా.. ఆ దేశ ప్రజలే ఆ వ్యవహారాన్ని భరించలేక సోషల్ మీడియాలో ట్రోల్ చేసి పడేశారు.
ఇంకోవైపు,.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్‌ను ఉద్దేశిస్తూ రష్యా చమురు కొనుగోళ్ల చేసే ప్రకటనల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మంగళవారం (స్థానిక కాలమానం ప్రకారం) వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు నిర్వహించారు. ఇందులో ట్రంప్‌తో సహా కీలక అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారతీయ- అమెరికన్లకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
‘భారతదేశ ప్రజలకు మా దీపావళి శుభాకాంక్షలు. భారతీయులంటే నాకు చాలా ఇష్‌టం. ఇరుదేశాల మధ్య కొన్ని ముఖ్యమమైన ఒప్పందాల కోసం పని చేస్తున్నాం. రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనబోదని వ్యాఖ్యానించారు. నేను ఈ రోజు మీ ప్రధానితో మాట్లాడాను. మా మధ్య గొప్ప సంభాషణ జరిగింది. అనేక విషయాల గురించి మేం మాట్లాడుకున్నాం. వాణిజ్యం గురించి చాలాసేపు చర్చించాం. ఆయనకు దానిపై చాలా ఆసక్తి ఉంది. పాకిస్థాన్‌తో ఘర్షణలు వద్దనే విషయంపై మేము కొంతకాలం క్రితం మాట్లాడాం. వాణిజ్యం ద్వారానే అది సాధ్యమైందనుకుంటున్నా’ అని ట్రంప్ పేర్కొనడం గమనార్హం.
ఇప్పటిదాకా.. రష్యా చమురు కొనుగోళ్లను భారత్ (India) నిలిపివేసిందని, నిలిపివేయబోతోందని, నిలిపివేయకపోతే భారీ సుంకాలు తప్పవంటూ ట్రంప్ రోజుకో స్టేట్‌మెంట్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడేమో.. భారత్ పెద్ద మొత్తంలో చమురు (Russian Oil) కొనబోదంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇదీ చదవండి: దీపావళికి ఏఐతో విషెస్.. మండిపడ్డ హిందువులు